9, జూన్ 2022, గురువారం

జీవన మంజూష జూన్ 2022

నేస్తం,

         మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది సమస్య. ఇది ఎందుకు, ఎలా వస్తుందన్న దానికి మూలాలు వెదకడంలో మనం సఫలీకృతులు కాలేకపోతున్నాం. మానవ జీవితాలను తరచి చూస్తుంటే ఆశ,కోరికలు కొన్ని సమస్యలకు కారణాలు. మరికొన్నింటికి అహంకారం, ఈర్ష్య, అసూయలు ముఖ్య కారణాలౌతున్నాయి. పూర్వం మన పెద్దలు మనకు వారసత్వంగా ఇచ్చిన అనుబంధాలను, ఆప్యాయతలను నేడు మనం డబ్బు మోహంలో పడి, వారిచ్చిన జీవితపు విలువలకు తిలోదకాలిచ్చేసాం. మనమన్న ద్విపదాలను మరచి నేనన్న ఏక పదమే ముద్దని మన పిల్లలకు అదే నూరిపోస్తున్నాం. ఎన్ని ప్రకృతి విలయాలు ఎన్ని పాఠాలు నేర్పినా మన బుద్ధిని మార్చుకోలేక పోతున్నాం. ఎందుకింతగా మానవ విలువలు దిగజారి పోతున్నాయి?

            మూగ జీవాలు ప్రాణాపాయ స్థితిలో వుంటే పట్టించుకోం. కనీసం సాటి మనిషి కష్టంలో మాట సాయానికి కూడా మనం పనికిరావడం లేదంటే తప్పు ఎవరిది? మానవత్వం లేకుండా పోతున్న మనిషిదా? మనిషితనానికి విలువనివ్వని సమాజానిదా? వ్యామోహాల మాయలో కొట్టుమిట్టాడుతున్న మనిషి మోహాల నుండి బయటబడి అసలైన జీవితపు విలువలు తెలుసుకునే అవకాశం ఉందా! తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యన దూరం, ఒకే గూటిలో మసలే భార్యాభర్తల మధ్యన అడ్డుగోడలు, దగ్గరితనాన్ని మరచిపోతున్న బంధుగణం. ఇలా చెప్పకుంటూ పోతుంటే సవాలక్ష సమస్యలు కుటుంబాల్లో. సమస్యల్లేని మనిషీ లేడు, సమస్యల్లేని కుటుంబాలు లేవు. ఇక సమాజమంటారా! మనందరం కలిస్తేనే సమాజం. సమాజం సక్రమంగా నడవడానికి మనం ఏర్పరచుకున్నదే వ్యవస్థ. వ్యవస్థ సక్రమంగా నడవడానికి కొన్ని కట్టుబాట్లు. దిద్దుబాట్లు అవసరం

               బంధం మనది అనుకుంటేనే బాధ్యతలు గుర్తుంటాయి. అది బంధమయినా సరే. బంధానికి మనం విలువ ఇస్తేనే, దాని ఫలితాన్ని పరిపూర్ణంగా అనుభవించ గలుగుతాం. నిజాయితీ ఇద్దరి మధ్యనా ఉండాలి. ఇప్పటి అంతర్జాల అనుబంధాల మూలంగా ఎన్నో కుటుంబాలు కకావికలం అయిపోతున్నాయి. ఎదుటివారిని అక్షేపించే ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. బంధాన్ని మోసగించడమంటే మనల్ని మనం మోసం చేసుకోవడమే. మనకి అహంకారముంటే ఎదుటివారికి ఆత్మాభిమానముంటుంది. ఏదొక రోజు ఆత్మాభిమానానికి మనం సమాధానం చెప్పవలసిందే. ఎందుకంటే మనది కర్మభూమి. మన కర్మలను జాగ్రత్తగా మనకు అప్పజెప్పే వాడు పైవాడు. వాడు విశ్వంలోనే చేయి తిరిగిన రాతగాడు. మన లెక్కలు బాగా తెలిసిన వాడు కూడానూ. అవహేళనలకు, అరాచకాలకు చరమగీతం తప్పక రాస్తాడు

            మనం అనుకుంటాం మనం చాలా తెలివి గల వాళ్ళమని. కాని మన తెలివితేటలు ఇంట్లో వారిని మభ్య పెట్టడానికి మాత్రమే పనికివస్తాయి. అది కూడా వాళ్ళకు నిజమేంటో తెలిసినా మన అతితెలివిని మనసులో అసహ్యించుకుంటూ, పైకి మనం చెప్పేదే నిజమని నమ్మినట్టు మనకు కనిపిస్తారు. మనది చాలా గొప్ప ఆటని, గెలిచామని మనమనుకుంటే, అసలు గెలుపేంటో రేపటి రేజున పైవాడు చూపిస్తాడు. కుటుంబాన్ని మోసం చేయడం గెలుపు కాదు. కుటుంబ ప్రేమను గెలవడం గెలుపని తెలుసుకున్న రోజు నిజమైన గెలుపు ఆనందం తెలుస్తుంది


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner