19, జనవరి 2023, గురువారం

రంగుల కల ముందు మాటలు..!!

    మనలో చాలామంది ప్రతిరోజు ఎన్నో ప్రదేశాలకు వెళుతుంటారు. ఎన్నో దృశ్యాలను చూస్తుంటారు. కాని అందరు చూసినది చూసినట్టుగా అక్షరీకరించలేరు. డాక్టర్ ఘంటా విజయ్ కుమార్ గారు తన థాయ్ లాండ్, మలేషియా పర్యటనను "రంగుల కల" గా ఓ జర్నలిస్ట్ డైరీ అనే టాగ్ లైన్ తో పుస్తక రూపంలో మన ముందుకు తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే జీవితం చాలా చిన్నది. బంధాలు, బాధ్యతలతోనే మూడు వంతుల జీవితం గడిచిపోతుంది. ఉన్న కొద్ది సమయంలో మన కోసం అంటూ గడిపేది ఇలాంటి యాత్రా సందర్శనాల్లోనే.
       భార్యా వియెాగపు విషాదాన్ని తనలోనే దాచుకుని ఒకింత వేదనతోనే తన విదేశీ పర్యటనను మొదలుపెట్టినా మనకు మాత్రం చక్కని యాత్రా సందర్శనాన్ని అందించారు. రంగుల కల నిజంగానే ఆయా ప్రదేశాల చరిత్రలో దాగిన విభిన్న దృక్కోణాలను మనకు అందించింది. సంస్కృతీ సంప్రదాయాలతోపాటుగా అక్కడి భౌగోళిక, ఆర్థిక అంశాలను చాలా సూక్ష్మంగా పరీశీలించారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అక్కడి సమాజ పరిస్థితులనే కాకుండా చూడడానికి వచ్చిన విదేశీ పర్యాటకులను, వారి మనోభావాలను కూడా వివరించారు. కుల, మత ఆచారాలను, స్త్రీలపైనున్న వివక్షను, వ్యవస్థలోని లోపాలను తన మనసుకు అనిపించిన భావాన్ని నిజాయితీగా రాశారు. మన దేశం గురించి అక్కడి వారి అభిప్రాయాలను యథాతథంగా అక్షరబద్దం చేసారు.
         తాను ఆస్వాదించిన ప్రతి చిన్న సంఘటనను చక్కని అలతి పదాలతో మనమూ చూసిన అనుభూతిని పంచడమంటే అదీ ఆ ప్రదేశాల గురించి కూలంకషంగా చెప్పడమంటే మాటలు కాదు. స్వతహాగా భావుకులైన విజయ్ కుమార్ గారు ఓ కవితలో అక్కడి ఆకలి బతుకులు, కరెన్సీ నోట్ల పాశాలు మన కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు.
ఒక్కమాటలో చెప్పాలంటే " రంగుల కల " వేవేల వర్ణాలను తనలో పొదుపుకున్న చీకటి వెలుగుల మనసు చిత్రం.
      చూడకపోయినా చూసిన అనుభూతిని, ఆస్వాదనను అందించిన రచన. డాక్టర్ ఘంటా విజయ్ కుమార్ గారు మలేషియా నేషనల్ డీమ్డ్ యూనివర్శిటీ, కాలిఫోర్నియా టర్కెల్ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న శుభ సందర్భంగా ఆ యాత్రా విశేషాలను మనదందరికి తన మనో నేత్రంతో చూపించినందుకు హృదయపూర్వక శుభాభినందనలు. ఆత్మీయంగా నాతో నాలుగు మాటలు రాయించినందుకు కృతజ్ఞతలు.

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner