2, ఫిబ్రవరి 2023, గురువారం

జీవన మంజూష పిబ్రవరి23

నేస్తం,

          బంధాలు మనకు తెలియకుండానే ఏర్పడిపోతాయి. బంధం అనుబంధంగా మారాలంటేనే పెట్టిపుట్టాలి. మనం మారాలన్నా, మనల్ని మనం మార్చుకోవాలన్నా అంత తొందరగా ఇష్టపడం. మార్పు మంచికైనా, చెడుకైనా కావచ్చు. అది అనుబంధం మీద మనకున్న మమకారాన్ని బట్టి వుంటుంది. దీనికి వయసుతో పని వుండదు. అర్థం చేసుకునే మనసుంటే చాలు. అప్పుడు బంధం అనుబంధంగా రూపాంతరం చెందడంలో తేడా మనకు స్పష్టంగా తెలుస్తుంది

            మనిషి మనుగడకు బంధాలు, అనుబంధాలు ప్రాణాధారమే, కాని ఇప్పటి పరిస్థితులలో డబ్బే అన్నింటికీ ముడి సరుకుగా మారిపోతోంది. మానవ సంబంధాలన్ని ఆర్థిక అనుబంధాలుగా మారిపోయాయనడం సబబే. మనిషి, మాటా, నడవడి వగైరా వగైరాలన్నీ మన అవసరాలకు అనువుగా మార్చేసుకుని ఆధునిక అనుబంధాలను మన తరువాతి తరాలకు ఆర్థిక అనుబంధాలుగా అప్పజెబుతున్నామనడంలో నిజమెంతో మన అందరికి తెలుసు.

              ఒకప్పటి సంతోషాలు, సంబరాలు ఇప్పుడు అంతర్జాల అనుబంధాలకు మారిపోయాయి. మంచైనా, చెడైనా వాట్సప్, వీడియో కాల్ ద్వారానే పిలుపులు , పలకరింతలుగా మారిపోయాయి. విజ్ఞానం మనిషిని అందలాలు ఎక్కించడం ఏమోకాని, విపరీత పరిణామాలకు దారి తీస్తోందిప్పుడు. మాటా మంచి అన్ని వాట్సప్, సెల్ ఫోన్లు లేదా ఇతర మాధ్యమాల ద్వారానే.జరుగుతున్నాయి. ముఖతః అన్నది అగమ్యగోచరమే అయిపోతుంది రానురానూ.

                మారుతున్న కాలంతో మనమూ మారక తప్పదని సరిపెట్టుకుంటూ బతికేయడమే అవుతోందిప్పుడు. మనుష్యుల మధ్యన అనుబంధమయినా ధన సంబంధమే అని ఒప్పుకోక తప్పని పరిస్థితి. మారుతున్న మానవ మేథస్సు రకంగా తరువాతి తరాల తలరాతలను మార్చుతుందన్నది ప్రశ్నార్థకమే. అనుబంధాలను వదిలించుకుంటూ కాదు కాదు విదిలించుకుంటూ అంతరిక్షానికి పయనించడమే మన పురోగతి అనుకుంటే..నిజమే! మనమూ పురోగతిలోనే పయనిస్తున్నామని సంతోషించేద్దాం..!!



0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner