29, అక్టోబర్ 2016, శనివారం

గెలుపు తలుపు తెరవాలని...!!

వాస్తవాలెందుకో ఉలికి పడుతున్నాయి
గతపు ఆనవాళ్ళు గుర్తుకొచ్చాయేమో

జ్ఞాపకాలు పలకరిస్తూనే ఉన్నాయి
భవితకు  బాసటగా  నిలుస్తామంటూ

ఆఖరి శ్వాస ఆయాస పడుతోంది
అలసట తీర్చుకుంటున్న జీవితాన్ని చూస్తూ

అడ్డుపడే అంతరాల అంతఃకలహాల నడుమ
మది మౌనంగా సంభాషిస్తోంది 

గుప్పెడు గుండెలో దాగిన ఆత్మీయత
గువ్వలా ముడుచుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది

అనుకోని అనునయాలు అభయమిస్తున్నాయి
అలవాటుగా మారిన అనుబంధాలకు

భారమైన బతుకులు బావురుమంటున్నాయి
కాసిన్ని ఓదార్పులు కరువై

కాలాన్ని కాసేపు బంధించాలని ఉంది
కొన్ని క్షణాలయినా గెలుపు తలుపు తెరవాలని...!!

మణి మాలికలు..!!

1. రెప్పలవెనుకే దాచుకున్నా..
తడియారని స్వప్నాలను...!!

2. రెప్పలవెనుకే దాచుకున్నా..
మదిలోని మౌనాలను ...!! 

3. రెప్పలవెనుకే దాచుకున్నా..
    నాతో నీవున్న క్షణాల కాలాన్ని ...!!

25, అక్టోబర్ 2016, మంగళవారం

నేలరాలిన రాచిలుక...!!

పలకరించని పిలుపులు చేరువలో 
కలవరింతలు కలలుగా మదిలో
గాయపడిన గుండె జ్ఞాపకాలలో
చెమరింతల చేవ్రాలుల ఓదార్పులలో
కలతపడే కన్నుల కబుర్లలో
ఊసులకందని ఉహల రెక్కలలో
నింగికెగిరే చుక్కల పయనంలో
ఆశల హార్మ్యాలను అందుకునే యత్నంలో
బంధనాలకు తల ఒగ్గి నేలరాలిన రాచిలుక...!!

22, అక్టోబర్ 2016, శనివారం

నాంది పలికే రోజు రావాలి....!!

నేస్తం...
          చాలా నెలల తరువాత మన పలకరింపులు మళ్ళీ . చెప్పాల్సిన కబుర్లు చాలానే ఉన్నా అలవాటు తప్పింది కదా అక్షరాలూ అందడం లేదు. ఓ జీవితం మళ్ళి కొత్తగా మొదలైనట్లుగా ఉంది. కాలంనాడెప్పుడో వేమన గారు చెప్పినట్లు " తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా" అని ఎంతసేపు ఎదుటి వారి తప్పులు ఎంచడమే పనిగా పెట్టుకుంటే చివరికి మనం కూడా ఆ తప్పుల్లోనే కొట్టుకుపోతామని అనుకోవడం లేదు. మానసికమైన హింస చాలా ప్రమాదకరం కానీ దానికి సాక్ష్యాలు ఉండవు, శిక్షలు ఉండవు. నమ్మి వఛ్చిన వారిని నట్టేట ముంచి సమాజంలో సాధుజీవుల్లా చాలామంది నటించేస్తున్నారు. కొత్తగా వచ్చి చేరిన స్నేహాలు, పలకరింపులు, పరామర్శలు ... వీటిలో తలమునకలౌతు తనను కావాలని వచ్చిన బంధాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మహానుభావులెందరో ఈనాడు. తమ సుఖం చూసుకుంటారు కానీ అన్ని అమర్చిపెట్టే తోడును కనీసం తిన్నావా అని పలకరించడం చేతకాని ప్రబుద్ధులు.. గారాల పిలుపులతో నయగారాలు ఒలికిస్తూ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా కబుర్లు.
నడవడి, వ్యక్తిత్వం అనేవి మనిషికి పెట్టని ఆభరణాలు. అవి లేని నాడు మనకు సొమ్ము ఎంత ఉన్నా విలువ లేనట్లే. నలుగురిలో గౌరవం మనకు ఉందిలే అనుకుంటే సరిపోదు. ఎదుటివారు మనకు ఇవ్వాలి కానీ మనకి మనం గొప్ప అనుకుంటే ఎలా...! పరిచయాలు సుగంధాన్ని పరిమళింపజేయాలి కానీ దుర్గంధాన్ని వ్యాపింపజేయకూడదు. పర వ్యాపకాల కోసం కేటాయించే సమయంలో కాస్త మన కోసం బతికేవారి కోసం కూడా వెచ్చిస్తే కొద్దిపాటి సంతోషాన్ని కుటుంబంలో నింపగలిగినవారు అవుతారు. ఎన్నో జీవితాలు పడుతున్న మానసిక వేదనకు కారణం ఈ అంతర్జాల మాయాజాలం అవుతోందనడానికి సాక్ష్యాలు మనకు తెలిసినా దానిని నివారించలేని దౌర్భాగ్యంలో ఉన్నాం ఈరోజు. నిజాలు తెలిసినా నిలదీయలేని అసహాయత, ధైర్యం చేసి అడిగితే తమ తప్పులను ఎదుటివారికి అంటగట్టి వయసు, విజ్ఞత మరచి నోటికి వచ్చినట్లు నానా మాటలు అనే పెద్దమనుష్యులు ఈ సమాజంలో కోకొల్లలుగా ఉన్నారు. మన సంతోషం కోసం ఎదుటివారి జీవితాల్లో చీకటి నింపేంత హీన స్థితికి దిగజారే మనస్థత్వాలను వదలి అందరు బావుండాలి అన్న ఆలోచనకు నాంది పలికే రోజు రావాలి....!!

20, అక్టోబర్ 2016, గురువారం

మరబొమ్మ....!!

రెప్పచాటు స్వప్నాల
ఎదురుతెన్నులు రేయింబవళ్ళు
నిదురోయే కనుపాపల
అలికిడిలో జీవించాలని

కలత పడే కనులకు
కన్నీటి నేస్తాల పలకరింతలతో
ఘడియకో ఘనమైన గతానికి
జ్ఞాపకాల ఆలంబనలు

తడబడుతూ  పడిలేస్తూ 
అమాయకత్వపు అడుగుజాడలు
అడ్డదిడ్డంగా అడ్డుపడుతున్నా
ఆశల తీరాలకై పరుగులు

ముగ్ధంగా ముడుచుకున్న
మల్లెమొగ్గ విచ్ఛుకోవాలంటూ
తపన పడే పరిణామ క్రమానికి
యాంత్రికత చేరికైతే.. మిగిలేది మరబొమ్మే....!!

19, అక్టోబర్ 2016, బుధవారం

ఆడపిల్లను...!!

నాకంటూ.. 
ఓ ఉనికి లేదు
గాలివాటుకు కొట్టుకుపోయే
పరమాణువుని..

నేనెవరో..
తెలియని ఈ ప్రపంచంలోనికి
రావాలన్న ఆతృతతో
తహ తహలాడుతున్న జీవాన్ని..

ఎప్పటికప్పుడు..
వాయిదాలేస్తున్న వైనాన్ని చూస్తూ
నిస్సహాయంగా రోధిస్తున్న
అల్ప ప్రాణాన్ని..

నేనే..  
సృష్టి  చైతన్యానికి మూలమైనా
అనుక్షణం చిదిమివేయబడుతున్న
చిన్నారిని..

అందరితో..
ఆత్మీయతను పంచుకోవాలని
తపన పడుతూ అక్షరాలకే
పరిమితమైన ఆడపిల్లను...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner