5, ఏప్రిల్ 2016, మంగళవారం

మనసు - మెదడు....!!

మనసు - మెదడు ఈ రెండిటికి ఉన్నఅవినాభావ సంబంధం వాటితో ముడి పడి ఉన్న వాళ్ళకే తెలుస్తుందేమో... అందరికి ఉంటాయి ఇవి రెండు కాని మనసు పడే తపన కాని బాధ కాని మెదడుకి చేరితే ఆ మెదడులో జరిగే మార్పులు కనిపెట్టడం గొప్ప గొప్ప వైద్యులకు కూడా సాద్యం కాదని నిరూపితం అవుతోంది...
ఒక మనిషిని మానసికంగా హింసిస్తే దానికి పర్యవసానం మెదడులో జరిగే ఎన్నో మార్పులు అవి ఏ న్యాయస్థానాలకు దొరకని సాక్ష్యాలు.. గత మూడు సంవత్సరాలుగా నేను ఒక పేషెంట్ గా వెళుతున్నాను.. అక్కడ ఎందఱో ఎన్నో వైవిధ్యమైన సమస్యలతో బాధ పడుతున్నారు ఒక్కొక్కరిది ఒక్కో కథ పుట్టుకలో కొందరికి... మధ్యలో సమస్యలతో కొందరికి.. చడువుకునే పిల్లలు... చిన్న పిల్లలు .. ఇలా ఒకటనేమి లేదు వచ్చాక ఇక జీవితాంతము తప్పని మందులు..
మనసు ప్రభావం మెదడు పై చాలా ఉంటుంది అనడానికి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి... పెద్ద పెద్ద చదువులు చదివిన వైద్యులకు తెలియదా ఏమిటి ఆ చిన్న సంగతి..? మానసిక నిపుణులు ఎంతో మందితో మాట్లాడి ఉంటారు కదా వారికి తెలియదా ఈ సంగతి.. న్యాయ వ్యవస్థలో మార్పు తీసుకువస్తే ఎంతోమంది పిచ్చివాళ్ళు కాకుండా బయట పడతారు... మన చట్టంలో ఉన్న లోపాలను వాడుకుని చేసే మోసాలు అందరికి తెలియనివి కావు .. అయినా మనకెందుకులే అని ఎవరికి వారు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటున్నారు...

మనసు చనిపోతే మెదడు చనిపోతుంది ... ఇది నిజం .... దయచేసి మనసుని చంపకండి ... మీకు లేకపోతే పర్వాలేదు ఎదుటివాళ్ళ మనసుని చంపే హక్కుని మాత్రం రాజ్యాంగం మీకు ఇవ్వలేదని గుర్తు చేసుకోండి ... ఎదుటివాళ్ళు మీకన్నా చిన్న వాళ్ళు కావచ్చు .. పెద్ద వాళ్ళు కావచ్చు ... ఎవరైనా కావచ్చు ... వాళ్ళ మనసు మీద అధికారం మీకు లేదు ... భారతీయ మేధావులు ఈ ఒక్క విషయం ఆలోచించండి ... ఎందరినో కాపాడిన వారౌతారు ...

ఇంకొక చిన్న విషయం మనం చనిపోయాక మన శరీరం మీద మనకు హక్కు లేక  పోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది ... మన శరీరాన్ని మనకు నచ్చిన విధంగా చేయడానికి కూడా బోలెడు పర్మిషన్లు అడుగుతున్నారు .. ఇదేమైనా న్యాయమా అండి ... కన్నా వారికి హక్కు ఉండటం సహజం .. అంతే కాని ఇంకాఎవరికీ హక్కు ఉండటానికి వీలు లేదు ... అది చనిపోయిన వారి కోరిక ప్రకారమే జరగాలి...

నేను నా పార్ధివ శరీరాన్ని రీసెర్చ్ కోసం ఇవ్వదల్చుకున్నాను .... దీనిలో వేరే మార్పు లేదు ... 

1, ఏప్రిల్ 2016, శుక్రవారం

ఘనీభవించిన మనసు...!!

ఏ రాతిరి రాసిన రాగమో
ఏ  వెన్నెల విసిరిన వేదనో
ఇలా చేరి గతాన్ని మరచిన జ్ఞాపకమైంది

కాసారం కాని కలగా నిలిచి  
సాక్షాత్కారం కాలేని వరమై మిగిలి
నిషిద్దాక్షరమై మది ముంగిట ఉండి పోయింది

మూసిన కనుల ముందర
మురిపించిన మనసు కోరిక తారాడిన తావి
వెదుకలేక వేసారిన ఈ జన్మ అలసింది

రాహుకేతువులు  రెప్పపాటున కబళించి
వామపాదంతో కదం తొక్కుతూ
జీవితాన్ని రాబందుల్లా ఏలుతున్నారు

గుండె గురుతులు గుచ్చుతున్నా
ఇంకిన నెత్తుటి రంగులో అగుపగుతూనే
తడి ఆరడం లేదు ఈ ఘనీభవించిన మది చిత్రాలు...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner