31, అక్టోబర్ 2018, బుధవారం

ఏక్ తారలు...!!

1.   మనసును చదవడం నేర్చుకున్నా_భాషలకతీతంగా ఉండాలని...!!

2.  మదిని తాకిన భావనలే_అక్షరాలకు చేరికవుతూ....!!

3.  పరిపూర్ణం పరిహాసమాడుతోంది_అల్ప సంతోషాలనందిస్తున్న విధిని చూస్తూ...!!

4.    కాలం రాల్చిన కలలు_జ్ఞాపకాల క్రీనీడలుగా...!!

5.   పొరపాటేమి లేదు_గ్రహపాటంతే ఈ జీవితం...!!

6.  ఎన్ని యుగాల నిరీక్షణకైనా సిద్దమే_క్షణాల నీ సమక్షం కొరకు...!!

7.   అక్షరాయుధం చాలు_గెలుపు సోపానమధిరోహించడానికి...!!

8.  ఓ క్షణం చాలదూ_యుగాల కాల నిరీక్షణకు తెర దించడానికి....!!

9.  మనసైన మమకారమది_గుప్పెడు గుండెెలో పదిలపర్చుకున్నానందుకే...!!

10.  పగటిదెంత దొడ్డ మనసో_రాతిరికి సగభాగమీయడానికి...!!

11.    భ్రమ కాదు వాస్తవమే_అద్దం చూపింది నీలోని నన్నే..!!

12.   భావాలను మౌనం ఆవహించింది_మనసాక్షరాలపై కినుక వహించి...!!

13.   ఓటమి విజయమిది_నీ గెలుపులో నన్ను  చూసుకుంటూ...!!

14.   నెమలీక నెయ్యం నాకు వద్దు_చేయందించే చెలిమి చాలు...!!

15.   మౌనం మాటాడుతునే ఉంది_మనసు తెలుపుతూ...!!

16.  ఛీత్కారాలకు తావెక్కడ_చెలిమి చేరువయ్యాక...!!

17.   అక్షరాలకూ అతిశయమే_భావాలను అందంగా అల్లుకుంటున్నందుకు...!!

18.   ఆద్యమైనది అంకురమే_తెర మరుగున ఉన్నా ఉనికి పరిచితమే...!!

19.  హాలాహలమూ అమృతమే_మధనాలన్నీ మధురాలై చేరితే...!!

20.   శాశ్వత ముద్రలే కొన్ని_సైకత రేణువులైనా చెదరక...!!

21.  ఆత్మీయతల నెలవే ఆ చెలిమిది_చిరాకు పరాకులకు చోటులేదక్కడ...!!

22.  ప్రతి కవితా పదాల సంపదే_కతల వెతల సమాహారమై అలరిస్తూ...!!

23.  వెతలకు వెలితినిచ్చింది_ఆత్మీయమైన అక్షరాల చెలిమి...!!

24.  కంటికెగసిన మింటిధార_మనసు మర్మమును దాయనేర్చునా...!!

25.   దాగని కన్నీళ్ళే ఇవి_మనసును చలువ పందిళ్లుగా మార్చుతూ....!!

26.   చేవ్రాలు చెరగకుంది_గతజన్మ బంధాన్ని తలపిస్తూ....!!

27.   నవ్వులన్నీ నువ్వున్న క్షణాలవే_అది గతమైనా వాస్తవమైనా....!!

28.   మనదైనదే జీవితం_ మనసు నవ్వులన్నీ జీవాన్ని నింపుకున్న క్షణాల్లో....!!

29.  చెదిరిపోని అనుబంధమిది_అపురూపమైన జ్ఞాపకంగా పదిలమై...!!

30.   మాసిపోదు జ్ఞాపకమెప్పుడూ_
గతమైనా వాస్తవమై వెన్నాడుతునే.... !!

29, అక్టోబర్ 2018, సోమవారం

అమరావతి రాజధాని...!!

నేస్తం,         
మాటలదేముంది అందరం చెప్తాం వినేవారుంటే. చేతలలో తెలుస్తుంది ఎవరి సత్తా ఏంటో. నిన్న కాసేపు తుళ్ళూరు వెళ్ళి అక్కడ జరుగుతున్న పనులను చూస్తుంటే అనిపించింది. అవరోధాలను అధిగమిస్తూ, ఒక్కో ఇటుక పేర్చుకుంటూ నిరంతరాయంగా సాగిపోయే మనిషికి దృడ సంకల్పముంటే చాలు వయస్సుతో పనిలేదని. పాలక పక్షం ఏం చేస్తోంది, ప్రతి పక్షం ఏం చేస్తోందని ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఆలోచించి అధికారం ఎవరికివ్వాలో నిర్ణయించండి. ఓ తప్పు నిర్ణయం ఆంధ్రప్రదేశ్ భవితకు అడ్డుకాకూడదని, తరతరాల మన చరితను చరిత్ర పుటల్లో నిలిపే దిశగా ఉండాలని, మహాకవి శ్రీ శ్రీ అన్నట్టుగా నవ్యాంధ్ర నిర్మాణానికి ఒక్క సమిధనైన చాలు అని అనుకుంటూ, రాజకీయాలు, వ్యక్తిగతానికి విలువనీయకుండా ప్రతి ఒక్కరూ మన ఆంధ్రప్రదేశ్ అనుకుని చూడండి.... సాయం చేయకున్నా పర్లేదు స్వప్రయెాజనాలకు అడ్డంకిగా మారకుండా భారతములో శకుని పాత్రను పోషించకుండా ఉండండి చాలు. వసుదైక కుటుంబం మనదౌతుంది. 

28, అక్టోబర్ 2018, ఆదివారం

యాంత్రికత....!!

యాదికే రాకున్నాయి
ఎనకటి గురుతులన్నీ

ఎదను తాకుతాయి
ఏ పొద్దు పొడుపునో

పరాకు మీదుంటుంది
మారాము చేసేటి మది

తొంగి చూస్తుంటాయి
ఆశలను నింపుకున్న కళ్ళన్నీ

యాంత్రికతను నింపుకుంది
యంత్రాల పాలబడిన బతుకు

యదార్థాన్ని కాదనలేని సాక్ష్యమిది
ఏకాకుల్లా మిగిలిపోతున్న ఎన్నో జీవితాలకు...!!

27, అక్టోబర్ 2018, శనివారం

రెప్ప కింది ఉప్పెన...!!

                              మనసు తడి అక్షరాల్లో చేరితే అదే ఈ రెప్ప కింది ఉప్పెన...!! 
           అంతర్జాలంలో అందరికి సుపరిచితులు, ప్రభుత్వోద్యోగిగా, తల్లిగా తన బాధ్యతలను నెరవేరుస్తూ సాహితీ రంగంలో తనదైన శైలితో చక్కని కవితలు రాస్తున్న శ్రీమతి విజయలక్ష్మి మార రెప్ప కింది ఉప్పెన కవితా సంపుటి సమీక్షలో ఇంటి బాధ్యతలతో సతమయ్యే ఇల్లాలి ప్రేమెప్పుడూ ఒంటరేనంటారు నా ప్రేమెప్పుడూ ఒంటరే అన్న కవితలో. అమ్మ కవితలో పిల్లలకు దూరమైనా ఆ జ్ఞాపకాల్లో బతికే అమ్మ ప్రేమను చూపించారు. ఎన్ని కష్టాలెదురైనా ఓటమికి వెరవని గులాబీ జీవితాన్ని మనకు ఆదర్శంగా చూపించారు. రాలిన హృదయం, మరణ మృదంగమది కవితల్లో ఓ స్త్రీ జీవితంలోని కొన్ని కోణాలను, వాస్తవంలో అవాస్తవాన్ని, వేదన తీర్చలేని మరణము చిన్న చూపే చూసిందంటారు. ముక్కుపుడక అందాల మెరుపునూ, యువత కర్తవ్యాన్ని వినిపిస్తారు. రెండవ నెలవంక అంటూ సరి కొత్తగా ప్రేమను, ఆరాధనను హృద్యంగా చెప్తారు. ఐకమత్యంలో డబ్బు కోసం కోల్పోతున్న విలువలను, స్త్రీ మనసు కవితలో కొన్ని క్షణాలు సమయాన్ని కేటాయిస్తే స్త్రీ ప్రేమ అర్ధమౌతుందంటారు. అంతరంగంలో అవ్యక్తమైన ప్రేమను, " నా ఈ శ్వాసని నీకై ఈ గాలిలోనే ఒదిలేస్తున్నా ఒక్కమారు నీవు శ్వాచించినా చాలు" నా జన్మ ధన్యమేనంటారు. బంగారు బాల్యం, అనాధ బిడ్డ, అల్లరి ఆత్మీయతలు, అమ్మ ప్రేమ వంటి కవితలు మన అందరి జ్ఞాపకాలను తడుముతాయి అనడంలో ఎట్టి సందేహమూ లేదు. పంజరంలో రామచిలుక, అతివ జీవితాలను సరిపోల్చుతారు. ధూమపానం, తాగుడు మానండి అంటూ మానడం వలన కలిగే లాభాలను చెప్తారు. ఈ కవితా సంపుటి పేరైన రెప్ప కింది ఉప్పెన కవితలో అవనిపై అతివ తిప్పలు, ముప్పులు, కష్టాలు, కన్నీళ్లు ఇలా అన్ని ఏకరువు పెడుతూ శిథిలమౌతున్న స్త్రీ హృదయాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. మోడువారిన మానుతో అభిసారికను పోల్చడం బావుంది. బాధ్యతలను గుర్తు చేస్తూ మొక్కల్ని పెంచమంటూ, మనసు బాసలు వినిపిస్తూ, బాల్యమెంత మధురమంటూ ఆ వెంటనే పిండంగా ఉండగానే చేస్తున్న హత్యలను ఘాటుగా నిరసిస్తారు. కల్లలైన కలలను కనబడనీయక నటించేస్తున్నామంటారు జీవన కావ్యంలో. ఒంటరి అనామికలో దగా పడిన స్త్రీ కోరికలు, ఆవేదన చెప్తూ ఆమెపై సంఘపు కట్టుబాట్లపై విసుర్లు విసురుతారు. ఆత్మాలింగన ఆరాధనను రాధామాధవీయంలో చూపిస్తారు. చీడపురుగుల కామాంధుల మగతనపు మృగత్వాన్ని మృగాలు కవితలో కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. కన్నీటి  మేఘం,అనుకోని అతిథి, వసుధ ఘోష వంటి కవితలు ఆత్మీయతకు అలమటించే మనసులను తెలుపుతాయి. యముడికీ చేదే అన్న కవిత చదువుతుంటే మనసు కలుక్కుమనక మానదు. ప్రేమైక సమాజాన్ని, మధుర  కావ్యాలను, కన్నీటి చెలిమితో పరిచయం చేస్తూ ఎంత ధనం పోసినా కొనలేని ఆయువుకి ఆరడుగుల నేల చాలంటారు తాత్వికంగా. ధన్య జీవి ఎలా కాగలరో చెప్తారు తనదైన మాటల్లో. రైతు ఘాటు ఘోషలో కనీస గిట్టుబాటు ధర గిట్టని రైతుల కష్టాన్ని, తన ఆనందాలనన్నింటిని త్యాగం చేసి సంతోషాన్ని మాత్రమే మనకు పరిచయం చేసేది నాన్నేనంటారు. ధైర్యం - బలం అంటూ విజయాన్ని పొందమంటారు. నిజంగానే రోటి పచ్చడి రుచిని మన అందరితో ఆస్వాదింపజేస్తారు రోటి పచ్చడి కవితతో. రాణివాసపు చిలక, లిల్లీ - లొల్లి కవితలు బాధని కూడా సున్నితంగా చెప్తాయి. స్త్రీ గురించి చెప్తూ హెచ్చరిక జారీ చేస్తారు. తూర్పు పడమర కవిత అందమైన ఆరాధనకు ప్రతీకగా నిలిచింది. నా నీవే..నీ నేనే, ఆవిరైన ప్రాయం, శాసించు ప్రియా కవితలు ఎదురుచూపుల విరహాన్ని, ప్రేమ బంధాన్ని తెలుపుతాయి. విశ్వజనీనమైంది అమ్మ ప్రేమ అంటారు అమ్మ అమ్మే కవితలో. ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే మహిళను ఓ మహిళా ఉద్యోగిలో, ఎవరు లేక బోసిబోయిన ఇప్పటి ఊరుని, అప్పుడు పంచిన జ్ఞాపకాలను నా ఊరు కవితలో తలచుకుంటారు. తొలిపొ(ము)ద్దు మలి జీవితంలోనూ వేకువపొద్దే ఆ జ్ఞాపకమంటారు. మట్టి గాజుల అందాలను, గడిచిన ప్రేమలో గతించిన జ్ఞాపకాల్లో గువ్వలా ఒదగనీమంటారు. తోలి ఉషస్సు, శిలా శాసనం, జలతారు కన్య, సొగసు చూడ తరమా, జీవన వాసంతం, మది ఆలాపన, వలపు రాగం, అజంతా అందం, అశ్రు ధారలు వంటి కవితల్లో చక్కని ప్రేమ భావుకత, విరహం, నిరీక్షణ కనిపిస్తుంది. మనసు జాబు కవితలో ఆర్దతతో నిండిన ఆరాధన, పొదరిల్లు కవితలో అందమైన ఉహలజల్లు, నిరీక్షణ, విరహ జ్వాలలు, శశి కిరణం, జన్మ జన్మల బంధం, రంగుల ఫక్కీలు, రాలినా మధురమే,నీవే వంటి కవితల్లో ఆర్తితో కూడిన ప్రేమ, ఆరాధనా, ఆత్మీయ సన్నిహితమైన అనుబంధం కనిపిస్తుంది. చినుకుకై ఎదురుచూసే రైతు బిడ్డల ఎదురుచూపు రైతు ఆవేదనలో వినిపిస్తారు. ఊహాలోకం, సిగ్గులొలికేనా, తెల్ల గులాబీలు, మేని పరవశం, నాలో నీవో..నీలో నేనో.. , మారాణి, తుంటరి ఊహ, మేలిమి ముత్యం, రంగుల ప్రపంచం, రాయినైతిని, విధి, ఉంటావ్, బంధం, జాజుల గె(తె)లుపు, వర్ణనకందని అందం, క(చ)లవ్ భామా కవితలన్నింటిలో చక్కని భావుకత్వంతో నిండిన ప్రేమానురాగాలు, అందమైన ఊహాలోకపు వర్ణనలు మనకు కనిపిస్తాయి. వేదనకు వీడ్కోలిస్తూ సాగిపొమ్మంటారు వేదన కవితలో. మరణించినా జీవిచడం ఎలానో చెప్తారు, మా మగజాతి సలాంలు అంటూ స్త్రీ ఔన్నత్యానికి గులామంటారు. నయన సోయగానికి స్వాగతమంటూ  మది భావాన్ని కన్నీటి మంచు పూలతో అక్షరాల్లో నింపుతారు. చెలిని వర్ణిస్తూ అద్భుత ప్రేమను చూపుతారు. రాలుతున్న పండుటాకునే కవిత ఇప్పటి వాస్తవ కథనాన్ని, బిడ్డలు వదిలెళ్లిన తల్లిదండ్రుల మనసును చూపిస్తుంది. శిలా ఫలకం నీ నామం కవిత మనసులోని అవ్యాజ్యమైన ప్రేమను చూపించడంలో సఫలమైనట్లు తోస్తుంది.
              రెప్ప కింది ఉప్పెన కవితా సంపుటిలో కవితలు ప్రేమ, విరహం, వేదన, ఊహలు, వర్ణనలు, ఎదురుచూపులు, అనుబంధాలు, ఆవేశాలు, నివేదనలు, నిట్టూర్పులు, నిరాశలు వంటివి కనిపిస్తున్నా జేవితాన్ని బాల్యం మొదలు వృద్ధాప్యం వరకు అన్ని కోణాల్లో చూసిన మనసుల అనుభూతులను మనకు అందిస్తాయి అనడంలో ఏ విధమైన అనుమానమూ లేదు. చక్కని భావాలతో గుండె లోతులను తడిమిన ఈ రెప్ప కింది ఉప్పెన కవితా సంపుటి కవయిత్రి విజయలక్ష్మి మారకు హృదయపూర్వక అభినందనలు.

అపురూపం పుస్తక సమీక్ష...!!

          అపురూపమైన అనుబంధాలకు అక్షర రూపమే ఈ అపురూపం...!!

         డాక్టర్ లక్ష్మీ రాఘవ "నా వాళ్ళు", "అనుబంధాల టెక్నాలజీ" అనే రెండు పుస్తకాల ద్వారా చాలామందికి సుపరిచితులే. మన చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలే మనకు ఈ కథల్లో కనిపిస్తుంటాయి. అందుకే ఇవి సహజంగా అనిపిస్తూ మన మనసులోని మాటల్లా మన చుట్టూనే తిరుగుతుంటాయి.
        అపురూపం కథాసంపుటిలోని ప్రతి కథా సున్నితమైన మానవ సంబంధాల చుట్టూ అల్లుకున్న సంఘటనలే. మొదటి కథ అపురూపంలో పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చే కొన్ని అరుదైన జ్ఞాపకాల గుర్తుల విలువలను గుర్తించని కొందరికి ఈ కథ చెంపపెట్టు. పెద్దలు ఇచ్చిన వస్తువులను దాచుకోవడంలోని సంతోషం ఎన్ని కోట్లు పెట్టినా రాదని కొందరు మనసులేని మనుష్యులకు ఎప్పటికి తెలియనిపిస్తుంది. మన సంతోషాన్ని ఆకలి విలువ తెలిసిన వాళ్ళతో, అనుబంధాలకు దూరమైన వాళ్ళతో పంచుకోవడంలోని తృప్తిని ఆచరణ పూర్వకంగా తెలిపిన కథ ఇలా చేస్తే. మంచిని నమ్ముకుంటే మంచే జరుగుతుంది. దైవ సాయం ఎదో ఒక రూపంలో అందుతుందని, అప్పటికప్పుడు జరిగిన నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న సామాన్యుల కష్టాన్ని చెప్పిన కథ సర్జికల్ సాయం. మూగజీవికి మమతానురాగాలుంటాయని, కాస్త ముద్ద పెడితే విశ్వాసంగా ఉండటమే కాకుండా, తమ ప్రాణాలను కూడా లెక్క చేయక మనల్ని కాపాడతాయని, మనకు లేని మానవత్వాన్ని రాజు అనే కుక్క ద్వారా మూగ మనసుని తన మాటల్లో ప్రేమతో మనముందుంచారు. మార్పూ మనసూ కథలో మంచికైనా చెడుకైనా వచ్చిన మార్పుని ఆహ్వానిస్తూ జీవితంలో సర్దుకుపోవడం, మార్పు మంచికే అని ముందుకు సాగిపోవడమే కానీ దీనిలో చిన్నా పెద్ద అని మినహాయింపు లేదంటారు. సాయం కథలో నోట్ల రద్దుతో సామాన్యుల ఇక్కట్లు, సమాజంలో మంచి మార్పు కోసమని మన వంతు సాయమని సరిపెట్టుకోమంటారు. కొత్తగా వచ్చిన కోడలు తన కొడుకుని తనకు కాకుండా చేస్తుందన్న భయంతో కోడలు చూపించే ఆప్యాయతను కూడా తప్పుగా అనుకునే సగటు అత్తగారి మనస్తత్వాన్ని, బంధాలను, బాంధవ్యాలను తన దృష్టితో మనందరికి చూపించారు. అనుకోకుండా జరిగిన నష్టాన్ని జీవితంలో కోల్పోయిన కొన్ని విలువైన వాటిని తిరిగి పొందలేక పోయినా ధైర్యంగా తండ్రి, కూతురు అంగవైకల్యాన్ని సవాలు చేస్తూ బ్రతకడాన్ని ఆసరా కథలో హృద్యంగా చెప్తారు. అత్తాకోడలు, కూతురుల మధ్య అనుబంధాన్ని, బాధ్యతలను అద్భుతంగా చూపిన కథ ఏది బాధ్యత? అందమైన అబద్దం ఎంతటి ఆహ్లాదాన్నిస్తుందో సంతోషం కథ చెప్తుంది. ఒకరికి ఒకరైన భార్యాభర్తలు వారి ఆప్యాయతలు, అనుకోకుండా ఒకరు అనారోగ్యం పాలైతే మరొకరి మానసిక స్థితిని కళ్ళకు కట్టినట్టుగా చూపించి "మిథునం" ని గుర్తుచేస్తూ గుండె అలిసింది కథను చెప్తారు. పరాయి దేశాల్లో మన జీవితాలను, దైనందిన జీవన చర్యల్లో మనం ఏం కోల్పోతున్నామో ఈ క్లాత్ లైన్స్ కథ చెప్తుంది. ఆపదలోనున్న వారికి సాయపడే బంగారం వంటి మనసు ముందు ఏ ఆభరణాలు, ఐశ్వర్యం సరి తూగవని ఈ బంగారం కథ చెప్తుంది.
      శారీరక వైకల్యం కన్నా మానసిక వైకల్యం దౌర్భల్యమైనదని, ప్రభుత్వ పథకాలుగా కాకుండా మానవత్వంతో ఆప్యాయతలను అందించి, ఆదరించమని వేదిక కథలో చెప్పించడం చాలా బావుంది. "మనం" అన్న మాటను మరచి "నా" అన్న చట్రంలో మునిగిపోయి, తన వంతు వచ్చాక కాని చేసిన తప్పు గుర్తుకురాని ఎందరో బిడ్డలకు కనువిప్పు ఈ  ఫ్యామిలీ ఫోటో కథ. ఋణానుబంధానికి, అవసరాన్ని, ఆపదలో ఆదుకోవడానికి కడుపున పుట్టిన బిడ్డలే కానక్కర్లేదు, రక్త సంబంధమూ కానక్కర్లేదు. స్నేహం, అభిమానం చాలని చెప్పిన సహాయం కథలో కథనం తీరు ఆకట్టుకుంటుంది. మానవసేవే మాధవసేవంటూ, మానవత్వమే దైవత్వం కన్నా మిన్న అని కులాల అంతరాలను చెరిపేసిన కథ ఏది సేవ. ఆచారాలు, సాంప్రదాయాలు సణుగుడు జ్ఞాపకాలుగా మిగిలిపోవడమే ఇప్పటి జీవితాలని, దూరమైనా తరువాతే కోల్పోయిన వాటి విలువ తెలుస్తుందని అమ్మ సణుగుడు కథలో వివరిస్తారు. రాష్ట్ర విభజన పర్యవసానం, ఉద్యోగుల బదిలీల మీదే కాకుండా వారి కుటుంబాలపై కూడా పడిందని చెప్తూ పిన్నల, పెద్దల మనస్సులో ఆలోచనలు రేకెత్తించిన సరి కొత్త కోణం ఈ ప్రపోజల్ కథ. మలి వయసులో ఏర్పడిన ఒంటరితనం నుండి బయట పడటానికి దొరికిన ఆలంబన అనుకోకుండా దూరమైతే ఏర్పడిన స్తబ్దత, జీవితపు ప్రయాణంలో ఎవరు ఎప్పుడు ఎందుకు కలుస్తారో తెలియదంటూ, కొన్ని సహవాసాలు అనుకోని మార్పులను తెస్తాయని సావాసం కథలో అద్భుతంగా చెప్తారు. మగతనపు ఆంక్షల బందిఖానాలో మగ్గిన అమ్మకు ఓ కూతురు ఏర్పరచిన స్వేచ్ఛ అమ్మ ఆశ కథలో కనిపిస్తుంది. మలి వయసులో దూరాన ఉన్న పిల్లల దగ్గరకు వెళ్ళడానికి, స్వతంత్రంగా ఉండటానికి గల కారణాలను వివరిస్తుంది ఈ సంధ్యలో కథ. ఆర్ధిక వెసులుబాటున్న ఈరోజుల్లో కుటుంబ బాధ్యతలు భార్యాభర్తలు ఇద్దరివి అని, భార్య విలువను గుర్తించిన భర్త కథ ఏమి మారాలి.
          హస్త కళలు, సాహిత్యం, కళలు ఇలా అన్ని కలగలిపిన కళామూర్తి డాక్టర్ లక్ష్మీ రాఘవ. కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ, తన అభిరుచుల మేరకు రచనా వ్యాసంగంలో కూడా రాణిస్తూ వైవిధ్యమైన రచనలు చేస్తూ అందరి అభిమానాన్ని అందుకున్నారు. మన చుట్టూ ఉన్న సమస్యలనే చిన్న చిన్న కథనాలతో అందరి మనసులను ఆకట్టుకునే రీతిలో చెప్పడం ఈ అపురూపం కథల సంపుటి ప్రత్యేకం. చక్కని కథలను వాస్తవికంగా అందించిన డాక్టర్ లక్ష్మి రాఘవకి హృదయపూర్వక అభినందనలు.
        

25, అక్టోబర్ 2018, గురువారం

నిజం చేయాలనుంది...!!

కదిలిపోతున్న క్షణాలను
గుప్పిట ఒడిసిపట్టాలన్న
ఉబలాటం ఎక్కువవుతోంది

గాయాలను మర్చిపోవాలనుకుంటూ
జ్ఞాపకాలను మిగుల్చుకోవాలన్న
ఆరాటం పెరుగుతోంది

అంగడి సరుకులుగా మారిన
అనుబంధపు వ్యాపారాన్ని
అడ్డుకోవాలనుంది

అనాదిగా వస్తున్న
దాయాదుల దాష్టీకాన్ని
ఎదుర్కోవాలనుంది

సహనం అసహనమైతే
పర్యవసానమెలా ఉంటుందో
చూపాలనుంది

అక్షరాలకు ఆటవిడుపునిస్తే
భావాలకెలా ఆయువు పోస్తాయెా
చూడాలనున్న కలను నిజం చేయాలనుంది...!!

19, అక్టోబర్ 2018, శుక్రవారం

దీపావళి సందడి...!!

         మన భారతీయ ఇతిహాసాలు, పురాణాలు మనకందించిన సంస్కృతీ సంప్రదాయాల వెనుక మంచి, చెడుల విశ్లేషణ ఉంది. కాలంతో పాటుగా మనము ఆధునికత వైపు పరుగులెడుతున్న ఈరోజుల్లో పండుగలు వాటి వెనుక కారణాలు కాస్తయినా తెలుసుకోవడం మన తరువాతి తరాలకు అవసరమనిపిస్తోంది. ఐదు తరాలను చూసిన అనుభవాలను తరచి చూసుకుంటే ఎన్నో అందమైన బాల్యపు అనుభూతులు, మరచిపోలేని జ్ఞాపకాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. మన పండుగలకు ఉన్న ప్రాముఖ్యం తెలుసుకోవాలన్న కుతూహలం చిన్నప్పుడు అమ్మ చెప్పే కథలతో మొదలైంది. 
       పిల్లలకు బాగా ఇష్టమైన పండుగలు దసరా, దీపావళి, సంక్రాతి. దసరా, సంక్రాంతి ఎక్కువ సెలవలు ఇచ్చే పండుగలు. దీపావళికి రెండు రోజులైనా కాని ఎంతో సందడిగా ఉండే పండుగ. ప్రతి పండుగ వెనుక ఎదో ఒక కారణమున్నట్లే ఈ దీపావళికి కూడా కొన్ని కారణాలు ఉన్నప్పటికి చెడుపై మంచి సాధించిన విజయంగానే చెప్పవచ్చు. అందరికి తెలిసిన కథ వర ప్రభావంతో నరకాసురుడు దేవతలను, ఋషులను ఇబ్బందులకు గురి చేస్తుంటే యుద్దానికి వెళ్లిన శ్రీకృష్ణుడు సైతం నరకాసురుణ్ణి వధించలేక పొతే సత్యభామ నరకాసురుణ్ణి వధించడం, ఆ మరుసటి రోజు చీకట్లను పారద్రోలి వెలుగు చూపించడానికి చిహ్నంగా ఈ దీపావళి పండుగను బాణాసంచా వెలుగుల్లో జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని పురాణ కథనం. రావణాసుర సంహారం తరువాత రాముడు సీతా సమేతంగా అయోధ్యకు వచ్చిన శుభ సందర్భంలో ప్రజలు సంతోషంతో దీపావళిని జరుపుకున్నారని రామాయణంలో మరో కథ ఉందని చెప్తారు. దీపావళి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. ముందు రోజును ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశి అని అంటారు. దీపాలను వరుస క్రమంలో అమర్చడాన్ని దీపావళి అంటారు. అమ్మయినా తప్పు చేసిన కొడుకుని దండించక మానదు అన్న సత్యాన్ని నరకాసుర వధతో లోకానికి చాటుతుంది సత్యభామ. 
        మా చిన్నప్పుడు దీపావళి పండుగకి 10,15 రోజుల ముందు నుండే టపాకాయలు, పిస్తోలు బిళ్ళలు, టేపులు టపా టపా కాల్చడం, లేదంటే సూదంటు రాయితో ఆ బిళ్లలను కొట్టడం, ఉల్లిపాయ టపాసులు కాల్చడం మొదలయ్యేది. కొందరు మతాబులు తయారు చేయడం మొదలు పెడితే, మరికొందరు పూలపొట్లాలు తయారు చేసేవారు. చెక్కలు చెక్కిన పొడి ఎండబెట్టి, గుడ్డలో పోసి దానిని చుట్టి, దానికి పేడ రాసి ఎండబెట్టి తాడుతో కట్టి, ఒక చివర వెలిగించి గుండ్రంగా తిప్పుతుంటే ఆ నిప్పురవ్వలు భలే కనిపించేవి. ఇలా రకరకాలుగా బాణసంచా తయారు చేసేవాళ్ళు. కాకరపువ్వొత్తులు, తాళ్లు, పెన్సిళ్ళు, చిచ్చుబుడ్లు, పాము బిళ్ళలు, విష్ణు చక్రాలు, భూచక్రాలు, రాకెట్టులు, తాటాకు టపాకాయలు, లక్ష్మి ఔట్లు, సీమ టపాకాయలు ఇలా బోలెడు మందుగుండు సామాన్లు ముందే తెచ్చుకుని వాటిని ఎండలో పెట్టి చూసుకోవడం ఆదో సరదా అప్పట్లో.  
        దీపావళి ముందు రోజు భోగి , కుంకుడుగాయలతో తలంట్లు, ఆ నీళ్లు కళ్ళలో పడితే మంటలు, అమ్మమ్మ నోట్లో కొద్దిగా ఉప్పు వేయడం, కొత్త బట్టలు, గోరింటాకు సరదాలు. ఇక పండుగ రోజు సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూడటం, చీకటి పడుతుండగానే అమ్మమ్మ దేవుడి దగ్గర దీపారాధన చేయడం, తాతయ్య అప్పటికే తయారు చేసిన తాటాకుల ఉట్టిలో 2 మట్టి ప్రమిదలతో దీపం పెట్టి, ఇంటి ముందు గడ్డితో మంట వేసి ఆ  మంట చుట్టూ మూడు సార్లు తిరిగి ఈ దీపపు ఉట్టి దానిలో వేయడం ఆడపిల్లల సరదా, మగపిల్లలతో ఎండిన గోగుఫుల్లతో కాగడా చేసి (దీనిని దివిటీ అని కూడా అంటారు) మూడుసార్లు మంట చుట్టూ తిప్పి మంటలో వేసి ఇంట్లోకి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని తీపి తిని, మట్టి ప్రమిదలతో దీపాలు ఇంటి ప్రహరి గోడలపైన, ఇంటి చుట్టూ అలంకరించడం, కొన్ని చోట్ల కొవ్వొత్తులు వెలిగించడం, తర్వాత నాన్న తెచ్చిన టపాసులు, మతాబులు వగైరా వగైరా మందుగుండు సామాన్లు అన్ని ఎవరి ఓపికకు వాళ్ళు కాల్చుకోవడమే పని. ఎవరు ఎక్కువ కాల్చితే వాళ్ళు గొప్ప అనుకుంటూ పిల్లలందరం భలే సంతోషపడేవాళ్ళం. పాపం మరుసటి రోజు ఆ చెత్తనంతా అమ్మవాళ్ళు ఊడ్చుకోలేక సతమతమయ్యేవారు. ఆ కాల్చే సందడిలోనే అప్పుడప్పుడు కాళ్ళు చేతులు కాలడాలు, బట్టలు చిల్లులు పడటాలు జరిగేవి. 
          వర్షాకాలంలో పడే వర్షాలకు దోమలు, అనారోగ్యాలు ఎక్కువ కాకుండా ఈ దీపావళి పండుగ టపాసులు ఉపయోగపడతాయని తెలియక, ఇప్పటి స్పీడ్ యుగంలో ముందు రోజో, లేదా పండుగ రోజో షాప్ కి వెళ్లి నచ్చినవి తెచ్చుకోవడం, రెండు కొవ్వొత్తులు వెలిగించి పెట్టేసి ఏదో కాల్చామంటే కాల్చామన్న పేరుకే అదీ అపార్ట్మెంట్ కింద ఖాళీ ఉంటే.  హమ్మయ్య  మనకి దీపావళి అయిపొయింది అని ఊపిరి పీల్చేసుకుంటున్నాం. టి వి షోలు, ఐ పాడ్, ఐ ఫోన్లలో గేములు, అక్కడే గంటలు గంటలు లేదా ఐ ఐ టి ర్యాంకులు, చదువులు అంటూ పిల్లల బాల్యాన్ని మనం దోచేస్తూ ఆరోగ్యవంతమైన బాల్యపు అనుభూతులను మన తరువాతి తరాలకు అందించలేని దీనస్థితిలో ఉన్నాం ఇప్పుడు. పరిస్థితులు ఇలా మారడానికి కారణం మనమా లేక మరెవరైనానా అన్నది ప్రశ్నగానే ఉండిపోతోంది. గొప్పల కోసమో మరోదానికోసమో సహజ సిద్దమైన కొన్ని పరిణామాలను మార్చేస్తూ, మన సంస్కృతి, సంప్రదాయాలను మన తరువాతి తరాలకు వారసత్వంగా అందించలేకపోవడమనే దౌర్భల్యం నుండి బయటపడి విలువలతో కూడిన వ్యక్తిత్వ, ఆరోగ్య సంపదను అందించాలని కోరుకుంటూ అందరికి దీపావళి శుభాకాంక్షలు... 


18, అక్టోబర్ 2018, గురువారం

ఏక్ తారలు...!!

1.  సంద్రమంత సంతోషమే_గగనమంత చెలిమి సొంతమయ్యిందని...!!

2.  భాషతో పనేముంది_మనసే నీదైనప్పుడు....!!

3.   వెంటాడే ఈ జ్ఞాపకాలు_వేదించే మదికి నివేదించే నివేదనలే..!!

4.  మనసూ మౌనవిపంచే_ముసిరిన భావాలను సుస్వరాలుగా సరిచేస్తూ...!!

5.   నిశీధికి వీడ్కోలిచ్చేది జ్ఞాపకాలే_గుప్పెడు గుండెకు ఆలంబనగా....!!

6.   అల్లుకుపోవడం అక్షరాలకలవాటే_ఆత్మీయత వాటి చుట్టమట...!!

7.   సోయగాల చంద్రుని స్వాగతిస్తున్నాడు_రవి రాజసంగా వీడ్కోలు తీసుకుంటూ...!!

8.  మదిని తడిమే అనుభ(భా)వాలు చాలు_అక్షరాల్లో ఊపిరి పోసుకోవడానికి...!!

9.   గాయమైంది ఓ గుండెకు_ప్రణయం మిగిల్చిన విషాదానికి...!!

10.    మదిని తడిమే మౌనాలెన్నో_అక్షరాలకు ఆయువునిస్తూ..!!

11.  పొడిబారిన మనసు తడే_ఆత్మీయతనద్దుకున్న ఈ అక్షరాలది..!!

12.   భరించనలవి కానిదే ఈ నిశ్శబ్ధం_జ్ఞాపకమెాపలేని భారమైనప్పుడు...!!

13.  జ్ఞాపకాలు గుభాళిస్తూనే ఉన్నాయి_బతుకు భారాన్ని తేలికజేస్తూ...!!

14.  సవ్వడి మిన్నకుంది_మౌనంలో మనసు సడి వినాలని....!!

15.   కల్లోల పరిచింది కలహమే_ఏమరుపాటుకు గురైన మనసుని...!!

16.  ప్రతిపక్షపు అక్షరాలు గోలెడుతున్నాయి_తీర్మానంలో తికమకలున్నాయట...!!

17.  రెండు పక్షాలకు సర్దుబాటే ఎప్పుడూ_పాలితులు పట్టించుకోనంత వరకు..!!

18.   కాలమూ హితమౌతోంది_నీతో నిశ్శబ్ధంగా సంభాషిస్తున్నందుకు...!!

19.  విడివడని బంధం మనది_తడబడిన అడుగుకు ఆసరానిస్తూ...!!

20.  కాలంతో కలిసిపోవాలనుకున్నా_గగనంలోనైనా సేదదీరాలని....!!

21.   మనసు ముడి వీడకుంది_మూడుముళ్ళ బంధం ఎగతాళి కాకూడదని..!!

22.   బాధ్యతలెక్కువ బంధానికి_మనసు మాయకు లోబడదందుకే...!!

23.   పేగుబంధానికి ప్రేమెక్కువ_ముడులను విడివడనీయకుండా....!!

24.  ఆత్మీయత అరుదైనదే_మది స్పందన స్వచ్ఛమైనదైనప్పుడు...!!

25.  మెాహం సమ్మెాహనమైంది_విడలేని బంధం మనదని తెలిసి..!!

26.   మర్మమెరుగనిదే అమ్మదనం_జీవాన్ని నింపి జీవితాన్నిస్తూ...!!

27.   మనసుకలవాటైనట్టుంది_అక్షరాల నిషాలో మునిగి తేలడంలో...!!

28.   కలంతో కలిసిన బంధమది_సిరాతో తప్పని సిగపట్లు అక్షరాలకు....!!

29.   అనుబంధాలలా అడ్డుపడుతుంటాయందుకే_మనసారాటానికి ఆయువునిస్తూ...!!

30.   ముగిసిన కథగా మిగలాలనుకున్నా_సశేషం కాకుండా...!!

17, అక్టోబర్ 2018, బుధవారం

ఎందుకు...!!

గాయాల గతమెందుకు
గమనమెరుగని బతుకులుండగా

మరలిపోయిన నవ్వులెందుకు
మసకబారిన కలలుండగా

కాలిపోయిన ఆశలెందుకు
కలతబారిన మనసుండగా

వదిలిపోయిన బంధాలెందుకు
ముడిబడని సంబంధాలుండగా

సడిలేని సందడెందుకు
చాటుమాటు సరదాలుండగా

చెరిగిపోయిన రాతలెందుకు
చెరగని విధిరాతలుండగా

రాలిపోయిన పువ్వులెందుకు
పూజకు నోచని విగ్రహాలుండగా

మరచిపోయే జ్ఞాపకాలెందుకు
మరపు వరమిచ్చే కాలముండగా

నీ కోసం మరుజన్మెందుకు
యుగాల నిరీక్షణకు తెరదించగా...!!

15, అక్టోబర్ 2018, సోమవారం

మరణ రహస్యం...!!

మౌనమెా మరణ రహస్యమే ఎప్పటికి
మాట్లాడటానికి అక్షరాలను
పేర్చుకుంటున్న మనిషి
నిస్సత్తువగా ఓ మూల ఒదిగిన క్షణాలు

బావురుమంటున్న ఏకాంతము
మనసుతో సహకరించని శరీరము
అప్పుడప్పుడు వినవస్తున్న రోదనలు
పైపైన పలకరిస్తున్న పరామర్శలు

కలలన్నింటిని కుప్పగా పోసి
ఆశలను హారతిచ్చేస్తూ
గతాన్ని బుజ్జగిస్తూ జ్ఞాపకాలుగా
మారిన గురుతులు వాస్తవానికి మిగిల్చి

నాకై నేను కోరుకొన్న ఈ ఒంటరితనం
కాస్త భయమనిపించిందనుకుంటా
ఓ కన్నీటిచుక్క అలా జారినట్టున్నా
కాలానికి అలవాటైన అంపశయ్య ఇది...!!

13, అక్టోబర్ 2018, శనివారం

జీవన "మంజూ"ష (నవంబర్)

నేస్తం,
         రెండు కుటుంబాల సమస్యలను సాంఘీక సమాజ సమస్యగా చేసి కులాల మతాల రంగులద్దేస్తూ మీడియా రేటింగ్ పెంచుకుంటుంటే, అంతర్జాలంలో అక్షరాల యుద్దాలు జరిగిపోతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవడమూ తప్పు కాదు. కుల, మత ఆంక్షలు, గొప్ప పేద తారతమ్యాలు అనాదిగా మన సమాజంలో ఉన్న వివక్షలే. ఆధునికతను సంతరించుకున్న నేటి తరం సంప్రదాయాలకు, సంస్కృతులకు కొత్త అర్ధాలు చెప్తూ కని పెంచిన తల్లిదండ్రులనే అడ్డగోలుగా ప్రశ్నించడం మనం చూస్తున్న నేటి యువత.
       కట్టుబాట్లు, ఆచారాలు మనం మన సౌలభ్యం కోసం ఏర్పరచుకున్నవే, కాని అనాగరికంగా ప్రవర్తించడానికి కాదని పిన్నలు, పెద్దలు అర్ధం చేసుకున్న రోజు కుల, మత హత్యలు, ఆత్మహత్యలు ఉండవు. పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకోవడం అన్నది ఒక స్టేటస్ సింబల్ కాదు. అలా అని ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లల ఇష్టాయిష్టాలను కాదనే హక్కు పెద్దలకు లేదు. ఒకే గూటిలో ఉంటున్నా కుటుంబ సభ్యుల మధ్య అగాధాలు పిల్లల మానసిక స్థితులపై చూపిస్తున్న ప్రభావం, దాని మూలంగా జరుగుతున్న దుష్పరిణామాలు రోజు మనం చూస్తున్న ఎన్నో సంఘటనలే ఇందుకు సాక్ష్యం.
        ఏ తల్లిదండ్రి వాళ్ళ సుఖం కోసమో, అవసరం కోసమో పిల్లల్ని కనరు. తమకన్నా తమ బిడ్డ బావుండాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ప్రేమకి వ్యామోహానికి తేడా తెలియని తనంలో ఇప్పుడున్న ప్రచార మాధ్యమాల సహకారంతో ఆ నాలుగు క్షణాల పేరు కోసం జీవితాలు నాశనం చేసుకుంటున్న యువత కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకుంటే కుటుంబ విలువలతోపాటు, సమాజ హితాన్ని కోరినవారౌతారు. కుటుంబంలో ప్రేమ రాహిత్యాన్ని సమాజ తప్పిదంగా చూపిస్తూ, సామాజిక విలువలకు తిలోదకాలిచ్చే ఆలోచనలను ఈనాటి యువతరం వదలి బంధాలను, బాధ్యతలను గౌరవిస్తూ, అనుబంధాలను, ఆనందాలను రాబోయే తరాలకు కానుకగా ఇవ్వాలని కోరుకుంటూ..

ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం...

శాపమూ వరమే...!!

ముసురు పట్టిన జీవితాలకు
మబ్బులు అడ్డం పడుతున్నట్టుంది

కడిగిన ముత్యాల్లా బయట పడదామంటే
కనపడని బంధం కట్టిపడేస్తోంది

అర్ధాకలికి తిలోదకాలిచ్చేద్దామని
పసితనం లేని పెద్దరికాన్ని ఆపాదించుకుంటోంది

బాల్యానికి వీడ్కోలిచ్చింది మెుదలు
బతుకు బావుటాకై ఆరాటానికి తెర లేచింది

ఒంటరి పోరాటం అలవాటై
ఓటమిని వాయిదాలు వేస్తోంది

వేగిరపడుతున్న ఊపిరినాపాలని
విశ్వ ప్రయత్నాలు చేస్తోంది

రాలిపడుతున్న కలలన్నింటిని
దిగులు దుప్పటిలో దాచేస్తోంది

కలతల వెతలన్నీ తాననుభవించి
కాసిన్ని సంతోషాలకు తల ఒగ్గింది

అలంకరణలక్కరల్లేని మనసనుకుంటా
అందుకేనేమెా శాపమూ వరమైంది...!!

7, అక్టోబర్ 2018, ఆదివారం

రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి...!!

                   తెలుగు సాహితీ మానస పుత్రిక రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి...!!        

             రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి ఈ పేరు తెలుగు భాష గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మృదు స్వభావి, స్నేహశీలి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావాన్ని కలిగి, ఎన్నో బిరుదులు, సత్కారాలు పొందినా అతి సామాన్యంగా కనిపించే వాగ్దేవి వర పుత్రిక. చిన్నతనం నుంచే తెలుగు భాషపై మక్కువను, మమకారాన్ని పెంచుకుని, తెలుగు భాషకు తన వంతుగా ఎన్నో విలువైన పుస్తకాల సంపదను భావి తరాలకు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
                   గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా మైనేనివారి పాలెంలో జన్మించిన మల్లీశ్వరి తన బాల్యం ఆనందంగా ఎటువంటి ఆంక్షలు, కట్ట్టుబాట్లు లేకుండా కృష్ణమ్మ అలల సందడిలో, ఎటి ఒడ్డున పిచ్చుక గూళ్ళ ఆటలతో, పల్లె పైరగాలుల పలకరింతల మధ్య స్వేచ్ఛగా సంపూర్ణంగా గడిచిందని గర్వంగా చెప్తారు. కళాశాల విద్య వరకు గుంటూరులోనూ, ఎం ఏ భీమవరంలోని డి ఎన్ ఆర్ కళాశాలలో పూర్తి చేసారు. ఉద్యోగ పర్వం విజయవాడలోని సిద్దార్థ పబ్లిక్ స్కూల్ తో మొదలై 26 ఏళ్లకు పైగా హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో పదవీ విరమణతో ముగిసింది. పాటలు, నాట్యం మీద చిన్నప్పటి నుండి ఉన్న ఇష్టంతో తాను నేర్చుకోలేక పోయినా వాటి మీద ఆసక్తిని వదులుకోలేక, పిల్లల మీదనున్న మక్కువతో కళాశాల బోధనా కన్నా పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయినిగా చేరి అందరి మన్ననలను పొందారు. అంతకన్నా ఎక్కువగా ఆత్మతృప్తిని అనుభవించారు. పర భాషకు ప్రాముఖ్యత పెరుగుతున్న ఈ రోజుల్లో అంతరించిపోతున్న తెలుగు భాషను నిలబెట్టడానికి ఉపాధ్యాయులకు తెలుగు భాష పట్ల నిబద్ధత ఉండాలని, పిల్లలకు సులభ రీతిలో ఉచ్చారణ, రాయడం నేర్పాలని, కనీసం ఇంట్లోనయినా తల్లిదండ్రులు పిల్లలకు తెలుగులో మాట్లాడటం, రాయడం, చదవడంపై కథలు, కబుర్ల ద్వారా ఆసక్తి కలిగించాలని, తద్వారా తెలుగు భాష బతుకుతుందని అంటారు. మన భాషను మనం మర్చిపోతే మనని మనం మర్చిపోయినట్లే అంటారు.
       పఠనాసక్తి మెండుగానున్న తనకు పదవ తరగతి తరువాత వచన కవితా రాయడం మొదలైందని, అధ్యాపకుల బోధనలలో కొత్త పదాలను సేకరిస్తూ, ప్రముఖ కవుల రచనలు చదవడం ద్వారా తన కవితా రచనకు మెరుగులు దిద్దుకున్నానంటారు. పోతన, కృష్ణశాస్త్రి, కరుణశ్రీ, శేషేంద్ర శర్మ, బాల గంగాధర తిలక్, దాశరథి, నారాయణరెడ్డి మొదలైన వారు తన రచనలకు ప్రేరణ అని చెప్తారు. మొదటి రచన వచన కవితగా చెప్తూ విజయవాడ ఆకాశవాణి యువవాణి కార్యక్రమంలో కవిత చదవడం, దానికి లభించి పారితోషికాన్ని ఇంట్లో అందరితో పంచుకోవడంలో ఆనందాన్ని తీయని జ్ఞాపకంగా చెప్తారు. వచన కవిత్వం, కథ, నవల, పద్యం, వ్యాసం, టాబ్లో, స్కిట్, గేయాలు, గేయ కథలు, లేఖా సాహిత్యం, భావ గేయాలు, గజళ్లు, బాల సాహిత్యం ఇలా తెలుగు భాషా ప్రక్రియలన్నింటిలోనూ తనదైన శైలిలో రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. విశాలాంధ్ర, వార్త వంటి ప్రముఖ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. మొలక అనే పిల్లల పత్రికలో ఇప్పటికి కరుణశ్రీ గారి తెలుగుబాల పద్య వ్యాఖ్యానం రాస్తున్నారు.
    తెలుగు భాషాసాహిత్యాలకు సంబంధించి దాదాపు 900 వ్యాసాలకు పైగా, 1300 పద్యాలు, 400 కవితలు, 200 గీతాలు రాశారు. 26 పుస్తకాలకు పైగా ప్రచురించారు. సంగీతం, సాహిత్యం, నాట్యం, నటన, దర్శకత్వం తదితర విభాగాల్లో ప్రవేశముండి, రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి ప్రతిభకు దక్కిన పురస్కారాలు బాలసాహితీ పరిషత్ వారి జ్ఞాపిక, రావూరి భరద్వాజ స్మారక ఉత్తమ గ్రంథ పురస్కారం, గురజాడ ఫౌండేషన్ వారి తెలుగు కవితా పురస్కారం ఇలా 15 వరకు బిరుదులు, పురస్కారాలు పొందారు. ఇవి కాకుండా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారు మరియు భారత కల్చరల్ అకాడమి వారు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విశిష్ట సాహితి సేవా పురస్కారం,  ఆంధ్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం ఈ రెండు మూడు రోజుల వ్యవధిలో అందుకున్న ఏకైక వ్యక్తి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి. నాలుగేళ్ళ  కఠోరశ్రమకోర్చి ఎంతో పరిశోధన చేసి నుడి గుడి అన్న 400 పేజీల పై చిలుకు భాషా పరిశోధక వ్యాసాల పుస్తకంలో కనుమరుగౌతున్న తెలుగు పద సంపదను అర్ధ సహితంగా ఏ ఏ పద్యాల్లో ఎలా వాడారో అన్నది సహేతుకంగా వివరించారు. దానికిగాను గిడుగు రామమూర్తి పంతులు పురస్కారాన్ని అందుకోనున్నారు.
తెలుగు భాషకు ఎనలేని సేవ చేస్తున్న రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి మరిన్ని బాషాసాహిత్య సంపదలను మనకందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి హృదయపూర్వక అభినందనలు.


మైనపు బొమ్మలు సమీక్ష...!!

                      ఆంతర్యాలను స్పృశించిన అక్షరాలు ఈ మైనపు బొమ్మలు..!!     

సుధాకర్  లోసారి కవిత్వం చదువుతుంటే వృత్తికి, ప్రవృత్తికి, సామాజిక విలువలకు, మానవత్వానికి, మంచితనానికి ప్రతీకలుగా చిన్న చిన్న పదాలతో అర్ధవంతమైన భావాలను అక్షరీకరించారని చెప్పడం అతిశయోక్తి కాదు. మైనపు బొమ్మలు సమీక్ష రాయడానికి చదవడం మొదలు పెట్టిన వెంటనే మొదటి కవిత నుంచి చివరి కవిత వరకు మనసు తడి గుండెలను తాకుతూనే ఉంది.
   వానాకాలం మన చిన్నప్పుడు ఎలా ఉండేదో, వాన కోసం ఎదురుచూసిన కరువు నేల తడిసి ముద్దైన తీరు, దాన్ని చూసిన సంతోషాల సంబరాలు, వాస్తవంలో రాని వాన కోసం తపన పడుతూ రాతిరి కలలో
" వానలో తడిచిన నేను
నాలో తడిచిన వాన
తడిచి తడిచి చెరిసగం మట్టిముద్దలవుతాం. " అంటూ కలల పక్షుల కోసం ఎదురుచూడటం చాలా బావుంది.
ఓ నా ప్రియ సైనికుడా కవితలో
" ఏ వీర స్వర్గపు ద్వారాల వద్దో నీవు
నన్నీ చీకటి తీరాన్నొదిలి..." తన వద్దకు వస్తాడో రాడో తెలియని సందిగ్ధతను సైనికుడి భార్య పడే వేదనను, వియోగాన్ని ఇంతకన్నా బాగా ఎవరు చెప్పలేరేమో.
" బతుకు ద్వార బంధాల వద్ద తలక్రిందులై వేలాడే గబ్బిలాల జీవితాలు మావి, చీకటి ఖండాలు మా జీవితాలు, దేవుడా నగ్న హృదయంతో నమస్కరిస్తున్నా, మావి కాని జీవితాలు మాకెందుకని గబ్బిలాలు కవితలో పావలాకి, పాతిక్కి అంగడి సరుకులైన బతుకుల ఆక్రోశాన్ని వినిపిస్తారు తనదైన గొంతుకతో.
కర్ఫ్యూ కవితలో యుద్దానికి, విధ్వంసానికి మధ్యన ఓ గంట విరామ కాలాన్ని వాస్తవాల దృశ్యాలను మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. మానవీయుడు కవిత మనలో మరో మనిషిని మేల్కొల్పుతుంది. ట్రాఫిక్ పోలీస్ గురించి చెప్పిన అక్షర సత్యం ఇది.
" కాలుతూ నానుతూ సహనమై
మానవీయ స్నేహమై
నాలుగు రోడ్ల కూడలిలో
అతనలా అలుపెరగని యోధుడై
కాలానికి క్రమశిక్షణ నేర్పుతూ.."
ఉద్యమ గీతంలో నిజాలకు, అబద్ధాలకు మధ్యన నిలిచిన శాసనాల చీకటిపై ధిక్కారాన్ని ప్రకటిస్తారు.
అమ్మని లేకుండా చేసిన కాలం మీద కోపాన్ని, అమ్మతోనూ, తనకి జ్ఞాపకాలనిచ్చిన అమ్మ గదితోనూ తన అనుబంధాలను తల్చుకుంటూ అమ్మ గురుతులు దాచుకోవడానికి అక్షరాలను హత్తుకోవడం అద్భుతం.
ఏకాకి ప్రయాణం కవితలో అపరిచితులుగా మిగిలిపోయిన రెండు మనసుల మద్యన ప్రేమ ఏకాకిగా నిలిచి ఎవరిది  వారిది ఒంటరి ప్రయాణం అంటూ ముగించడం కొత్తగా ఉంది. లోకమంతా వెలుగులు చిమ్మే మానవతా దీపాన్నవుతానంటారు మానవత్వం నా మతం కవితలో. జ్ఞాపకాల స్వప్నాలను వెదుకుతుంటారు నిరీక్షణ కవితలో.
పోగొట్టుకున్నది ఎవరికీ దొరకదని, కాలం ఎవరిదీ కాదని వెదకాలి కవితలో చెప్తారు. చావుకి, బతుక్కి,  ఆనందానికి,విషాదానికి పెద్ద తేడా లేదంటూ పల్లె గొడవల్లో ఇరు కుటుంబాలు క్షతగాత్రులే అంటూ ఫ్యాక్షన్ గొడవలకు వాస్తవ రూపాన్ని ఆవిష్కరించారు. అరుణిమ కవితలో అన్యాయానికి సమాధానం చూపించారు. నిశ్శబ్దంగా చెట్టు కరిగిపోయి ఒక అనాధ గీతమాలపించడం, మనసైన జ్ఞాపకంగా ప్రియసఖి, డయానా స్మృతికి స్వేచ్చా గీతాన్ని ఆలపించడం, జీవితం ఓ పెద్ద అబద్దం, బతుకు బార్లా తెరిచిన రహస్యం, ఎప్పుడు తడి గాయాల పర్వమే అంటూ అంగడి బొమ్మల ఆవేదనను ఎండుపూలు కవితలో చెప్తారు. వెలుతురు పాట పాడుతూ ప్రశ్నించడం కావాలంటూ తుపాకీ నీడలో నిలబడతారు. ఊరి పొలిమేర గ్రామదేవత గ్రామ కక్షలకు, కార్పణ్యాలకు సాక్ష్యమని ఆ పరిస్థితులను వివరిస్తారు. నిషేధించే నిజాలను, విజేతలను, పరాజితులను, అక్షరాల పరమార్ధాన్ని అందించిన ఆమెకు ప్రణామాన్ని, చరిత్ర మరచిన రాత్రులను గుర్తుచేస్తూ, ఊహారేఖలో అనువదించుకుంటూ, విశ్వమానవ దీపావళి కోసం కాలానికి అటు ఇటు గాయాలను తుడుస్తూ, రాలుతున్న పసి మొగ్గల కథనాలను అక్షరాల్లో చూపిస్తూ కవిగా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఓ యుగాంతానికి ఎరుపెక్కిన ఆకాశాన్ని పరిచయం చేస్తూ, పంజరంలోని ఆమె దేహాన్ని, శూన్యమైన అస్థిత్వపు బతుకును, హెచ్ ఈ వి తో ఆఖరి పోరాటాన్ని, ఇరు సంధ్యల అందాన్ని, ఆట వేట అడవిలో మొదలైనా నేటి నగరపు అడవిలో నాగరికత ఓ మహా అనాగరికత అని చెప్తారు. మానని గాయానికి మందు రాసి మహానుభావుల కోసం ఎదురు చూడటం, మా ఊరొక  వసుదైక కుటుంబం అంటూ సేద దీరడానికి తన ఊరెళ్ళినప్పుడు కనిపించిన, అనిపించిన భావాలకు, ఒకప్పటి జ్ఞాపకాల గురుతులను మేళవించి మన అందరిని కూడా మన ఊరికి పయనింపజేస్తారు. వియోగాన్ని ది బెడ్ రూమ్ కవితలో, మనసులోని ప్రేమను ప్రవహించే జ్ఞాపకంగా, రెండు గుండె గొంతుల ఏక గీతాన్ని గాయ పడిన ఒక మౌన శబ్దంలో, విషాద మోహనాన్ని విరచించడం, సూర్య చంద్రులను, ఉన్మాద ప్రేమను, నిజాలను నీడలను నిర్భయంగా చెప్తారు. ప్రశ్నించడం ఒక చారిత్రక అవసరమంటూ, నల్ల పంజరపు అవశేషాలను వెలికి తీస్తారు. పిడికిలి పట్టును గుర్తెరగమంటారు. వాస్తవికతను దూరం చేస్తున్న ఆధునికతను నాలోంచి నాలోకి కవితలో ఎవరికి వారు తరచి చూసుకునేటట్లు చెప్తారు.
ఘనీభవించిన జీవితం మరో జన్మకు వాయిదా మన జ్ఞాపకాల సాక్షిగా అంటూ అగాధాన్ని సృష్టించి విడిపోయిన ప్రిన్స్ డయానాలకు తన సున్నిత హృదయాన్ని చాటుకుంటారు. విస్మృతి కవిత వింత సోయగంతో చెప్పడానికి మాటలు చాలలేదు. నాకు బాగా నచ్చిన కవిత. చివరగా ఈ కవితా సంపుటి పేరైన మైనపు బొమ్మలు కవితలో
"దేహం వ్రణమై
బతుకు రణమై
క్షణక్షణం ఓ పదునైన కరవాలమై .." అంటూ సాగే అక్షర శరాలు మహాకవి శ్రీ శ్రీ ని  గుర్తుకు తీసుకురాక మానవు.
జీవితంలో తారసపడే ప్రతి చిన్న సంఘటనకు స్పందిస్తూ అక్షరికృతం చేసే సున్నిత హృదయమున్న సుధాకర్ లోసారి మైనపుబొమ్మలు కవితా సంపుటికి హృదయపూర్వక అభినందనలు. 

5, అక్టోబర్ 2018, శుక్రవారం

కొందరి బాదేంటో...!!

నేస్తం,
          చాలా రోజులుగా చెప్పాలనుకుంటున్న కొన్ని విషయాలు ఇప్పుడు చెప్తాను. నేను ఎప్పుడు నాకు రాయాలనిపించింది మాత్రమే రాస్తాను. చాలామంది చాలాసార్లు అడుగుతారు, ఫలానా దాని మీద రాసివ్వండి అని. నాకు కుదిరినప్పుడు, రాయాలనిపించినప్పుడు రాసిస్తానని చెప్తాను. నా రాతలు నాకు రాయాలని అనిపించినప్పుడే రాయడం చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు. నేను కవినని కాని, రచయితనని కాని ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. నాకనిపించిన భావాలకు ఓ అక్షర రూపాన్ని నాకు తోచిన రీతిలో ఇవ్వడం మాత్రమే తెలుసు.
      నే రాసిన అక్షరాలకు స్పందనలో అనురాధ వేదాంతం గారు ఓ సీన్ చెప్పి కవిత రాయమని అడిగారు. నాకు రాయాలనిపించినప్పుడు రాసి పంపిస్తానని చెప్పాను. దానికి ఆవిడ స్పందనలు నా గోడ మీద అందరు చూడవచ్చు. నా గోడ మీద నాకనిపించినవి రాసుకునే హక్కు నాకుంది కదా. నేనెవరికీ సలహాలు, సూచనలు ఎప్పుడు చెప్పను, ముక్కు మొహం తెలియని వారు, వయసులో పెద్దవారు కొందరు ఎందుకిలా ప్రవర్తిస్తారో మరి. నేను రాయడంతో ఆవిడకున్న ఇబ్బంది ఏమిటో నాకర్ధం కాలేదు. ఆవిడ అడిగినది నేను నాకనిపించినప్పుడు రాసిస్తాను అన్నా, ఆవిడ నేనిక నా గోడ మీద ఏమి రాయకూడదనడానికి కారణం ఏమిటో.? ఆవిడ బాధ ఏంటో నాకర్ధం కాలేదు. ఆవిడనే కాదు నా లిస్ట్ లో ఉన్న అందరికి ఇదే చెప్తున్నా మీకు ఇష్టమైతే చదవండి లేదా ఊరుకోండి. కాదు కూడదంటారా నా లిస్ట్ లో నుండి నిరభ్యతరంగా వెళ్లిపోండి. అస్సలు ఇబ్బంది పడవద్దు. సద్విమర్శలు చేయండి స్వాగతిస్తాను, కానీ మీ అక్కసు వెళ్లబోసుకోవడానికి,  ఊరికే ఉచిత సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించకండి. మరోసారి చెప్తున్నా నేను కవిని కాని, రచయితను కాని కాదు. నాకనిపించిన భావాలకు నాకు తోచినట్లు అక్షరరూపమిస్తూ ఆనందిస్తున్నా. మీరేంటి అన్నది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా.... నమస్కారం...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner