25, ఫిబ్రవరి 2010, గురువారం

ఒక్క క్షణం....!!


"కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే మరణం రెప్పపాటు ఈ జీవితం" ......
ఈ మాటలు ఎంతో నిజం!!
మనం బతికే ఈ నాలుగు రోజుల కోసం మనతో మనం కుడా నటించడం అవసరమా!!
వ్యక్తిత్వం చంపుకుని నాలుగు డబ్బుల కోసం అడ్డమైన పనులు చేయడం, ఎంతోమంది జీవితాలతో ఆడుకోవడం, మనకు తెలియకుండానే ఎంతో పాపాన్ని మూట కట్టుకుంటున్నాము....
హంసలా ఒక్క రోజు బతికినా చాలు కాకిలా కలకాలం బతకనక్కరలేదు...
మనం చేసే మంచి చెడు మాత్రమే మన తరువాత తరాలకి మనం ఇచ్చే కానుక...మనం తెలియక చేసే తప్పులు ఎన్నో....తెలిసి ఒక్క మంచిపని చేద్దాము......

22, ఫిబ్రవరి 2010, సోమవారం

మరిచావా నేస్తం .......

ఒక్కసారి కుడా గుర్తు రాలేదా!!
చిన్నప్పటి మన అల్లరి....స్కూల్ లో ఆడిన తొక్కుడుబిళ్ళలాట, రింగాట, దాగుడుమూతలు, అంత్యాక్షరీలు, సెలవల్లో......చెరువుల్లో, కాలువల్లో ఈతలు కొట్టడం.....మామిడి కాయల దొంగతనాలు ......శివరాత్రి కి ఆడిన ఆటలు, పాడిన పాటలు, నిద్ర లేకుండా చేసిన అల్లరి...జాగారాలు ....నామీద నువ్వు నీమీద నేను చెప్పి కలిసి చూసిన సినిమాలు, మాష్టారు తిడతారని నాకు రాసిపెట్టిన సోషల్ అస్సైన్మెంట్లు....చెప్పించుకున్న లెక్కలు ....పంచుకున్న టిఫిన్ బాక్సులు...సైన్సు మాష్టారు మన అనుబంధాన్ని గతజన్మ బంధంగా చెప్పిన మధుర క్షణాల్ని....... ఇలా ఇన్ని మధురానుభూతులను ఎలా మరిచిపోగలిగావు? ఇన్ని వసంతాల జీవితం లో ఒక్క సారి కుడా గురుతుకు రాలేదా!!
రమణి!! ఎక్కడ ఉన్నావో....ఎలా ఉన్నావో....చూడాలని వుంది....

మానవత్వపు విలువలు.....

రోజు మానవత్వం డబ్బుతో ముడిపడి వుంది..గొప్ప వాళ్ళ ఇంట్లో ఎవరైనా పొతే అబ్బో.... తన మన అని లేకుండా అందరు వెళ్లి పరామర్సలు, సానుభూతులు ప్రకటిస్తారు...కాని నిన్నటి వరకు మనతో వుండి మనల్ని ఎంతో నవ్వించిన మనమనిషి మహామనిషీ శ్రీపద్మనాభం గారికి హృదయ పూర్వక అశ్రునివాళి.... ఎంతమంది అర్పించారు?

11, ఫిబ్రవరి 2010, గురువారం

శివరాత్రి

నిద్ర పోకుండా రాత్రంతా జాగారణలు, ఆటలు, పాటలు, అందరికి గుర్తు వచ్చే వుంటాయి కదా!! అందుకే అందరికి శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు...

9, ఫిబ్రవరి 2010, మంగళవారం

మనలో మనం....

ఒక్కసారి మనలోకి మనం చూసుకుంటే.....ఎదుటి వాడి తప్పులు వెదకడం మానేసి మనల్ని మనం చూసుకోడం మొదలు పెడితే మనం ఏంటో మనకి అర్ధం అవుతాము. ప్రతిదానికి ఎవరో ఒక్కళ్ళని బాద్యులు గా చేస్తే మన పని ఐపోదు...తప్పు జరిగితే దానిలో మన బాద్యత ఎంతవరకు వుందో ఆలోచించాలి..పని చేసే వాళ్ళ లో తప్పులు వెదకడం మానేసి పని చేయని వాళ్ళను పని చేసేటట్లు చేస్తే సంస్థ బాగుపడుతుంది...దానితో...వ్యవస్థ కుడా పురోభివృద్ధిని సాధిస్తుంది.చాతనైతే ఎదుటివాడికి సాయపడదాం లేదా దూరం గా ఉందాం.. అంతే కాని తెలిసి చెడు మాత్రం చేయవద్దు....ఎవరో చేసిన పనిని గొప్పగా మనమే చేసాము అని చెప్పుకోకుండా పని చేసిన వారికి వారి కష్టానికి ఫలితాన్ని, అభినందనలను అందించి మనం మనుష్యులమే అని గుర్తు చేసుకుందాం.....


6, ఫిబ్రవరి 2010, శనివారం

స్నేహామృతం

మనము స్నేహాన్ని కోరుతున్నామంటే ఎదుటివారి లోని మంచి - చెడు రెండు సమం గా స్వీకరించాలి, అప్పుడే స్నేహానికి అర్ధం పరమార్ధం. సృష్టి లో దేముడు మనకు....మనకోసమే సృష్టించిన అపురూపమైన అనుబంధం స్నేహానుబంధం ..స్నేహితులని సంపాదించుకోండి కాని శత్రువులను పెంచుకోకండి...నాకేమో ఎంత శత్రుత్వం వద్దు అనుకున్నా కొన్ని తప్పడం లేదు.....ఇవి అన్ని మనకు మాములే కదండీ....ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నిద్దాం అందరి స్నేహ హస్తాల కోసం....సరేనా!!

5, ఫిబ్రవరి 2010, శుక్రవారం

చిన్నప్పటి పండగ సెలవల సరదాలు

ఉగాదికి వేపపువ్వులు కోయడం, తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఇలా అన్ని రుచులు కలిసిన ఉగాది పచ్చడి తో మొదలు పెట్టి.....శ్రీరామ నవమికి సీతారాముల పెళ్లి తో పాటు పానకం, చలిమిడి, వడపప్పు, కొబ్బరి ముక్కలు, బెల్లం తో మొదలు పెట్టి తోలి ఏకాదశికి పేలాల పిండి, శ్రావణ మాసం లక్ష్మివ్రతం, వినాయకచవితి ఉండ్రాళ్ళు, కుడుములు, పులిహోర, జిల్లేడుకాయలు, లాంటి పిండివంటలు.....పూజ కోసం పొద్దున్నే పత్రి కోసం తోటల వెంట తిరగడం, తామర పూలు, కలువ పూలు వీటి కోసం చెరువు లో లోపలకి దిగడం ఎవరికీ ఎక్కువ పూలు దొరికాయో అని లెక్కలు వేసుకోడం, సాయంత్రం ఇళ్ళలో రాళ్ళు వేసి, పల్లేరుకాయలు వేసి బెదిరించి తాయిలాలు తీసుకోడం, తెల్లారగట్ట తద్ది ముందు రోజు రాత్రి గోరింటాకు పెట్టుకుని పొద్దున్నే ఎవరికి బాగా పండిందా!! అని వెదుక్కొడం......ఇక దసరా దీపావళి సంక్రాంతి అప్పుడు ....పప్పుబెల్లాలు, టపాకాయలు కాల్చడం, సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మల కోసం తెల్లవారుఝామున ఆవుల దగ్గర పేడ తెచ్చి గొబ్బెమ్మలు చేసి ఎవరివి ఎక్కువ బాగున్నాయో చూసుకోడం ......సాయంకాలం ఒక టిక్కెట్టు పై రెండు సినిమాలు మా ఊరికి రెండు మైళ్ళ దూరం లో వున్న టూరింగ్ హాల్లో చూడటం ......వేసవి సెలవల్లో బొమ్మలాటలు , కోతికోమ్మచ్చి, నాలుగురాళ్ళాట, ఏడుపెంకులాట, చెరువు లో కాలవల్లో ఈతలు కొట్టడం.....ఏటి ఇసుకలో పిచ్చుక గూళ్ళు కట్టడం, కుక్కలు, పిల్లులు , చిలుకలు, ఆవుదూడలు, గేదదూడల తో పరుగుల పందాలు, రాత్రి పూట డాబా పై పడుకుని కధలు, కబుర్లు, కాకరకాయలు, చెప్పుకోడం.... ఇలా చెప్పుకుంటూ పొతే ................ఎన్నోకదా!!....చదువుతుంటే మీకు గుర్తు వస్తున్నాయి కదూ... !!

ఈ రోజుల్లో మనం అంతా .....నగర జీవితం లో ఉన్నామని అదే నాగరికత అని భ్రమలో మనం వుంటూ మన పిల్లలకు కుడా తెనేలుఅరే తెలుగుతనాన్ని, పచ్చని పైరు గాలుల, పంట కాలువల, కల్మషమెరుగని...కాలుష్యం లేని.... పల్లెలకు దూరం గా పెంచుతున్నాం కదా!! నాకైతే మనం పొందిన ఆనందాన్ని ఇప్పటి పిల్లలు కోల్పోతున్నారని......టి.వి. లకు అంకితమై పోతున్నారని చాలా బాధ గా వుంది. జీవితం లో గడిచిన ప్రతి క్షణం తిరిగిరానిదే. మనిషికి బాల్యం దేముడు ఇచ్చిన ఆమూల్య వరం. అందరి బాల్యం సంతోషం గా ......సరదాగా....... వుండాలని.....మనస్పూర్తి గా కోరుకుంటూ.....

4, ఫిబ్రవరి 2010, గురువారం

చేతనైన సాయం చేద్దాము.....

హలో నేస్తాలు.... మీకు తెలిసిన ఎవరైనా కాలిన గాయాలతో గాని లేదా ఇంకా వేరే ఇబ్బందులతో గాని (చెవులు, నోరు, ముక్కు సరిగా లేకుండా వుండటం ) వుంటే కొడైకెనాల్ పాశం హాస్పిటల్ లో ఫ్రీ గా ప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నారు జర్మని డాక్టర్లు .... మార్చ్ ఇరవై మూడు నుంచి ఏప్రియల్ నాలుగు వరకు.

సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు : 045420240668,240668,245732

2, ఫిబ్రవరి 2010, మంగళవారం

చిన్నారి వైష్ణవి - మానవత్వం మరచిన మృగాలు.

చిన్నారి వైష్ణవి ని పొట్టన పెట్టుకున్న కిరాతకుల్ని వాళ్ళు చేసినట్లే వాళ్ళని కుడా చంపాలి. ఇదే అందరు కోరుకునేది. గతకాలం లో శ్రీలక్ష్మి, ఆయేషా, మనీషా .......ఇలా ఎందరో మనకు తెలియకుండా రోజు బలి అవుతూనే వున్నారు. మనోహర్ ని కుడా యాసిడ్ పోసో లేదా కత్తితో ఖండాలు గా నరికితే ఈ రోజు ఈ దారుణం జరగకుండా వుండేదేమో! ఆయేషా కేస్ గురించి ఇప్పటి వరకు ఒక్క అడుగు కుడా ముందుకు పోలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనపడక పోతేనే మన పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం చాలా తొందరగా స్పందించి కనుక్కున్నారు కదా!! ఇది కుడా అలానే ఐంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కే అంత టైం తీసుకున్నప్పుడు సామాన్యుని గతి ఏమిటి?
అంతా అయిపోయాక విఫలమయ్యాం అని చెప్పుకోడం తప్ప ఏమి వుండటం లేదు. కౄరులకు క్షమాభిక్ష పెట్టడం మళ్ళి సమాజం లోకి స్వేచ్చ గా వదిలేయడమే మన ప్రభుత్వం చేస్తోంది ఇప్పుడు.
ఇది ఎంత వరకు న్యాయం గా వుందో ఒక్క సారి ఆలోచించండి ప్రతి ఒక్కరు....!!

1, ఫిబ్రవరి 2010, సోమవారం

మహాత్మ - అవధూత

మనకు స్వేచ్చ ని ప్రసాదించిన మహాత్ముని మరణం భారతీయులందరి కి అత్యంత దురదృష్టకరమైన రోజు.కనీసం జనవరి ముప్పైన ఓ నిముషం మహాత్ముని తలుచుకుని అంజలి ఘటిద్దాం, కనీస మర్యాదను పాటిద్దాం. ఇది భారతీయులు గా మన కర్తవ్యం.
అహింస - గాంధీ గారి గురించి సిరివెన్నెల గారు, క్రిష్ణవంశి గారు చెప్పింది అక్షర సత్యం.
ఇదుగో మీ కోసం....
"అవతలివాడు నిన్ను లొన్గదీయలేడు అనే చలించని తత్వాన్ని మానసికం గా క్రియేట్ చేయడమే ఆహింసాతత్వం" !

"ఆశ్రమ దీక్షా , స్వతంత్ర్య కాంక్షా ఆకృతి దాల్చిన అవధూత" మన బాపూజి
అవునంటారా కాదంటారా!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner