31, డిసెంబర్ 2020, గురువారం

వీడ్కోలు...!!

నేస్తం, 
          కాలం విదిలించిన విషాదాన్ని మెాసింది ఈ సంవత్సరం. విషాన్ని చిమ్మే మనుష్యుల మధ్యన కదలాడుతున్నందుకేమెా క్షణాలు సైతం భయాన్ని కూడగట్టుకున్నాయి. ఇదీ ఒకందుకు మంచిదే అయ్యింది. మనవారెవరో, పరాయి వారెవరో తేటతెల్లం చేసింది. బంధాలను, అనుబంధాలను సవాలు చేసి తల ఎగరేసింది కాలం. ఆదుకోవడానికి అయినవారు, కానివారు అన్న భేదం లేదని చెప్తూ, మనవారెవరో నిక్కచ్చిగా నిరూపించింది. 
          నేనెప్పుడూ గుర్తు చేసుకునే మాట మా హింది టీచర్ రత్నకుమారి గారు చెప్పిన మాటే. చెడు జరిగినా అదీ మన మంచికే. అవసరానికి అడగకుండా ఆదుకున్న ఆత్మీయ నేస్తం. తనని కాస్తేమిటి బాగానే ఇబ్బంది పెట్టాను. అయినా ఓర్పుతో స్నేహబంధానికి విలువనిచ్చాడు. మాట అడిగినదే తడవుగా నీ టెన్షన్ నాకు వదిలేసి నువ్వు సంతోషంగా ఉండమ్మా. మేముండగా నువ్వు ఇబ్బంది పడకూడదంటూ క్షణాల్లో నా ఇబ్బందిని తీర్చిన పెదనాన్న, పెద్దమ్మ. ఏం రాసినా, రాయకున్నా పాతవైనా, కొత్తవైనా నా రాతలను ఆదరిస్తున్న సాహితీ ఆత్మీయులెందరో. 
          అనుక్షణం నన్ను జాగ్రత్తగా చూసుకునే మా డాక్టరమ్మలు ఉండగా నాకేమీ కాదన్న భరోసా. మన ఇంటివారి ప్రేమాభిమానాలు మనకుండగా దేనికీ లోటు లేదు, రాదు అన్న నమ్మకం. ఎన్నో అసహనాలు, సహనాల మధ్యన కడతేరుతున్న ఈ సంవత్సరానికి తుది వీడ్కోలు పలికేస్తూ...రేపటిపై ఆశతో....
       అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో..

29, డిసెంబర్ 2020, మంగళవారం

కాలం వెంబడి కలం...34

    వీసా స్టాంపింగ్ ప్రహసనం అయ్యాక మళ్లీ హైదరాబాదు బయలుదేరాను బస్ లో. మరీ తెల్లవారు ఝామునే కాకుండా ఐదు దాటాక అమీర్ పేటలో బస్ దిగాను. బానే వెలుగు వచ్చేసింది. జనాలు రోడ్డు మీద బాగానే తిరుగుతున్నారు. ఆ రోజు ఆగస్టు 15. బస్ దిగి మెల్లగా నడుచుకుంటూ మా హాస్టల్ వైపు బయలుదేరాను.  మెయిన్ రోడ్డు మీదే బస్ కి కొద్ది దూరంలోనే నా పక్కగా బైక్ ఆపి ఒకడు బైక్ ఎక్కండి. డ్రాప్ చేస్తాను అన్నాడు. అవసరం లేదు, దగ్గరే నేను వెళిపోగలను, అయినా మీరెవరో నాకు తెలియదు. అన్నాను. నా పేరు రాజు బైక్ ఎక్కండి అన్నాడు. ఎక్కనని వాడికి అందకుండా దూరం జరిగేసాను. అప్పటికే నాకు వాడి ప్రవర్తన చాలా తేడాగా అనిపించి. బాగా తాగేసి ఉన్నాడు. నా చేతిలో చిన్న కవరే ఉంది. అది పట్టుకుని నా చేయి పట్టుకోబోయాడు. వేంటనే దూరంగా ఓ గెంతు వేసి పరుగో పరుగు. ఆ పరుగు ఆపకుండా అవతల దూరంగా మెయిన్ రోడ్డు మీదున్న ఆటో వాళ్ళ దగ్గరకి వెళ్ళాను. పాపం వాళ్ళు అప్పుడే నా పరుగు చూసి అలర్ట్ అయ్యారు. గట్టిగా వాళ్ళతో వీడు నన్ను పట్టుకోవడానికి చూస్తున్నాడని చెప్పాను. నేను ఈ ఆటో వాళ్ళ దగ్గరకి ఎప్పుడైతే వచ్చానో, అప్పుడు నా వెంట పటం మానేసి వాడు బైక్ స్పీడ్ గా పోనిచ్చాడు.  ఓ ఆటోలో ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చి నన్ను మా హాస్టల్ దగ్గర దింపి, గేట్ తీసి నేను లోపలికి వెళ్ళాక వాళ్ళు వెళిపోయారు. మెయిన్ రోడ్డు మీద జనం మధ్యలో జరిగినా ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన ఆ రోజుల్లోనే ఉన్నారు. ఎవరైతే మనం మర్యాదస్తులు, చదువుకున్న వారు అనుకునే సమాజం పరిస్థితి అది. జరుగుతున్న సంఘటన చూస్తూ కూడా ఎవరి దారిన వారు వెళిపోయారు. ఆ ఆటోవాళ్ళకున్న దొడ్డ మనసు కనీసం మనలో ఏ ఒక్కరికి లేకపోయింది. గొప్పదనం నిర్వచనం ఏమిటో ఇప్పటికయినా అందరికి తెలిసుండాలి. 
     వీసా స్టాంపింగ్ అయ్యాకా కార్ డైవర్ తో అలా, హైదరాబాదు నడిరోడ్డు మీద ఇలా...అదీ మన దేశ స్వాతంత్ర్య దినోత్సవం రోజు జరగడం కాకతాళీయమేమెా మరి. మెుత్తానికి ఆగస్టు నెల నన్ను ఇలా కొన్ని అనుకోని సంఘటనలకు గురి చేసింది. తర్వాత అమెరికాలోని నరసరాజు అంకుల్ కి ఫోన్ చేసి చెప్పాను. వీసా వచ్చిందని. అంకుల్ వాళ్ళ పెద్దబ్బాయి చెప్పిన పారాడైమ్ కంపెనీ CEO శ్రీధర్ గారికి ఫోన్ చేస్తే VC++ నేర్చుకోమన్నారు. అప్పటి నుండి అస్సలు ఖాళీ ఉండేది కాదు. JAVA, ASP, VC++ నేర్చుకోవడము ఓ పక్క, కార్ డ్రైవింగ్ నేర్చుకోవడము మరో పక్కా జరిగిపోయింది. కావాల్సిన బట్టలు, పుస్తకాలు షాపింగ్ చేయడము అన్నీ జరిగిపోయాయి. ఆ టైమ్ లోనే మధ్యలో నేను ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మని, మౌర్యని కూడా హైదరాబాదు తీసుకువచ్చి ఓ రెండు రోజులుంచుకుని పంపాను. అప్పుడు రాఘవేంద్ర కూడా హైదరాబాదులోనే ఉన్నాడు. 
            ఫ్లైట్ టికెట్ కూడా నరసరాజు అంకుల్ తీసుకున్నారు. వాళ్ళ తమ్ముడికి చెప్తే ఆయన తీసుకున్నారు. యూని యాడ్స్ అంకుల్ వాళ్ళ తమ్మడిదే. టికెట్ అక్టోబర్ 14 కి తీసుకున్నారనుకుంటా. బ్రిటీష్ ఎయిర్ వేస్. యూని యాడ్స్ ఆఫీస్ కి వెళ్ళి టికెట్ తీసుకుని ఇంటికి బయలుదేరాను మిగతా లగేజ్ సర్దుకోవడానికి. అమెరికా ప్రయాణానికి సన్నాహలు చేసుకుంటున్నా మెల్లగా. అమ్మ ఏదో మెుక్కుందని నాగాయలంక అవతల ఏదో అమ్మవారి దగ్గరకు తీసుకువెళ్ళింది. అప్పుడు ఉష కూడా ఇంటికి వచ్చింది. ఆ మెుక్కు తీర్చుకుని వస్తూ, నాగాయలంకలో సుబ్బారావు అంకుల్ వాళ్ళకి చెప్పాలని ఇంటికి వెళితే ఆంటీ ఎవరింటికో వెళ్ళారని చెప్పారు. వాళ్ళింటికి వెళ్ళి అంటీకి చెప్పి, అక్కడే ఉన్న రాజేష్ గాడికి కూడా చెప్పా. వాడి ఇంటర్ రిజల్ట్స్ అప్పుడే వచ్చాయనుకుంటా. వాడు ఏదో వాడి గోలలో ఉన్నాడప్పుడు. నన్ను పట్టించుకోలేదు. అక్టోబర్ 14కి అంతా సిద్ధం చేసుకున్నా. ప్రయాణానికి రెండు రోజుల ముందు గా పీవర్ వచ్చింది. నాన్నకు ప్రయాణం వాయిదా వేయడం ఇష్టం లేదు. నాకేమెా ప్రయాణం చేయడానికి ఓపిక లేదు. అంకుల్ కి ఫోన్ చేసి ఓ వారం పోస్ట్ పోన్ చేయడానికి కుదుతుందేమెా చూడమన్నాను. అంకుల్ మాట్లాడి వారం పోస్ట్ పోన్ చేసారు. కాస్త నీర్సం తగ్గాక చుడిదార్ వేసుకుని ఫోటో దిగి అంకుల్ కి పంపాను. నన్ను గుర్తు పట్టడానికి. ఆ వారం రోజులు తిండి లేదు. కాస్త నీర్సపడ్డాను. 
         ఆ సమయంలోనే మా పెద్దాడపడుచు వాళ్ళ పెద్దాడపడుచు చనిపోయిందని తెలిసి, రాఘవేంద్ర వాళ్ల పెద్దమ్మ రాముడత్తయ్య చెప్తే, వాళ్ళు పలకరించడానికి వెళ్తుంటే నేను వాళ్ళతో కలిసి అవనిగడ్డ వెళ్ళాను. అప్పటికే నాలుగైదు రోజులైంది ఆవిడ చనిపోయి. మేం వెళ్లేసరికి మా పెద్దాడపడుచు అక్కడలేదు. భోజనం చేయము అని అంటే వాళ్ళు ఊరుకోలేదు. భోజనాలప్పుడు పెద్దాడపడుచు వాళ్ళ బావగారి అమ్మాయి పలకరించింది. తనకి మెడిసిన్ సీట్ వచ్చిందప్పుడు. తర్వాత రాఘవేంద్ర వాళ్ల బావగారు పలకరించారు. అమెరికా ఎందుకు ఇక్కడ లేవా ఉద్యోగాలు అని. ఇక్కడ నన్ను బతకనీయడం లేదు కదా అందుకే అమెరికా వెళుతున్నానని చెప్పాను. 
                  రేపు ప్రయాణమనగా ఈరోజు మారేజ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అవనిగడ్డ రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్ళాము.. సాయంత్రం అయిపోయింది. సాక్షి సంతకాల కోసం రాఘవేంద్ర ఇద్దరిని తీసుకువచ్చాడు. మల్లిగారని మా నాన్నకు కూడా బాగా తెలుసాయన. మరొకరు నాకు గుర్తులేదు. అప్పుడు తెలిసింది మా ఆయన చదువు నైన్త్ క్లాస్ అని. మెట్రిక్యులేషన్ ఎగ్జామ్స్ రాయలేదంట. నేను తన చదువు గురించి ఎప్పుడూ అడగనూ లేదు పట్టించుకోనూ లేదు. నాకు అది అవసరం అనిపించలేదప్పుడు. కాని అప్పటి వరకు నాకు తెలియదంటే ఎవరూ నమ్మరు కదా. మన దేశంలో డబ్బులతో జరగని పనంటూ ఉండదు కదా. మాది అన్ని పేపర్స్ ఉన్న పెళ్లి అయినా డబ్బులు తీసుకునే సర్టిఫికేట్ ఇచ్చారప్పుడు రాత్రిపూట. తెల్లవారుఝామున మద్రాస్ ప్రయాణం. ఆ రాత్రి జోరున వర్షం. మా శేషులు పెద్దమ్మ, పెదనాన్న ఆ వర్షంలో కూడా ఇంటికి వచ్చి మేము బయలుదేరే వరకు ఉన్నారు. లక్ష్మీ అక్క కూడా వచ్చింది. మిగతా ఎవరూ కనీసం తొంగి కూడా చూడలేదప్పుడు. సీతారామయ్య అన్నయ్య నా ప్రయాణానికి రెండు మూడు రోజుల ముందు వచ్చివెళ్ళాడు. కార్ బయలుదేరేటప్పుడు అమ్మమ్మ ఎదురువచ్చింది. ఈలోపల ఆ వర్షంలోనే హైమావతి మామ్మ, కోవా పట్టుకు వచ్చి ఇచ్చింది. వాళ్ళ  పెద్ద మనుమడు అమెరికా వెళ్ళినప్పుడు తనకి అలానే ఇచ్చానని చెప్పింది. కోటేశ్వరరావు మామయ్య, పద్మక్క వాళ్ళు కూడా వచ్చారప్పుడు. మా ఇంట్లో వాళ్ళం అందరం అమ్మమ్మ, తాతయ్యలని ఇంట్లో వదిలి, ఇద్దరు పిల్లలతో సహ, లక్ష్మక్క వాళ్ళ రమణతో కలిసి మద్రాస్ కి పినాకిని లో బయలుదేరాం. రాజగోపాల్ కి మద్రాస్ తాంబరం ఎయిర్ పోర్ట్ కి దగ్గరలో హోటల్ బుక్ చేయమని చెప్పాం. 

జీవితంలో అడ్డంకులు రావడం సహజమే. వాటిని అధిగమించడంలోనే మన నైపుణ్యం తెలుస్తుంది. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.. 
26, డిసెంబర్ 2020, శనివారం

పుస్తక సమీక్ష లైవ్

https://m.facebook.com/story.php?story_fbid=429476251505058&id=100033280607442&sfnsn=wiwspwa

25, డిసెంబర్ 2020, శుక్రవారం

నాలుగు మనసు మాటలు...

https://youtu.be/cdZMstGk4Yk

24, డిసెంబర్ 2020, గురువారం

ఖాళీ...!!

మనిషి ఆలోచనల్లో
పురుడు పోసుకుందా? 

మనసు అరల్లో
నిరంతరం తిరుగాడుతోందా? 

ఆశల చిట్టాల్లో
అంతులేని కోరికల పద్దులున్నందుకా? 

అవసరాల ఆరాటాలు
ఆకాశాన్ని అందుకుంటున్నందుకా? 

బాంధవ్యాలను తూకమేయడానికి
డబ్బుల తక్కెడ వాడుతున్నందుకా? 

అనుబంధాలను అంగడి సరుకుల్లా
మార్చేసిన మన మానసిక దుస్థితిదా? 

ఆధునికత మెాజులో పడి
ఆత్మాభిమానాన్ని అమ్ముకుంటున్నందుకా? 

ఏ జీవితాన్ని వదలని
ఈ వెలితిని పూరించడమెలా? 

మనిషితనాన్ని  పట్టి పీడిస్తున్న 
ఈ ఖాళీలను పూరించే యంత్రమెాస్తే బావుండునేమెా..!! 


21, డిసెంబర్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం..33

                 హైదరాబాద్ లో మరిది వాళ్ళింట్లో ఓ వారం ఉన్నానేమెా. మా తోడికోడలు కూడా జావా నేర్చుకోవడానికి ఐసాల్వ్ నెట్ లో చేరింది. నాకు దానిలోనే మాట్లాడారు. కాని రాఘవేంద్ర తనకు తెలిసిన తెలుగు వన్ ఫౌండర్ కంఠమనేని రవిశంకర్ గారితో మాట్లాడి అమీర్ పేటలోని ఆబ్జెక్ట్ వన్ లో జాయిన్ చేసాడు. అంతకు ముందు నేనున్న హాస్టల్ లోనే మరలా జాయిన్ అయ్యాను. విని అమెరికా వెళిపోయింది. ఉష అక్కడే ఉంది. శ్రీదేవి, లత కూడా ఆ హాస్టల్ లోనే ఉన్నారు. రాణి అని కొత్త వంటమ్మాయి కూడా ఉంది. 
              జావా మాది మధ్యాహ్నం బాచ్. షరా మామూలుగా మనమెప్పుడు వెనుక బెంచ్ వెదుక్కుంటాం కదా. అలా నాతోపాటు విజయ, వత్సల, ప్రగతి చేరారన్న మాట. మా అందరిలో వత్సల చిన్నపిల్ల. విజయని, నన్ను పెద్ద అత్తయ్య, చిన్నత్తయ్య అనేది. ప్రగతి వాళ్ళాయన అమెరికాలో ఉన్నారు. తను జావా నేర్చుకుని అమెరికా వెళిపోతుంది. మెుదట్లో HTML ఒకావిడ చెప్పేది. తర్వాత కార్తీక్ అని చిన్నతనే కోర్ జావా అవి చెప్పేవాడు. మా అల్లరిని కూడా బాగా ఎంజాయ్ చేసేవాడు. మాతో సరదాగా ఉండేవాడు. అలా మళ్లీ నేర్చుకోవడం మెుదలైంది. ఓరోజు మధ్యాహ్నం క్లాస్ కి బయలుదేరి వెళుతుంటే మా హాస్టల్ సందు చివర్లో నన్ను ఎవరో పిలిచినట్లనిపించి, నన్నా కాదా అని చూసాను. మీరు జయపురం మంజు కదా అని ఒకతను అడిగాడు. మనకసలే మనుషులు గుర్తుండరు కదా. అవునండి, మీరెవరు అంటే తెనాలి వేణుని ఇంజనీరింగ్ క్లాస్మేట్ ని అని చెప్పాడు. మా ఫస్ట్ ఇయర్ క్లాస్మేట్ శ్రీనివాస రెడ్డి కంపెని ఓపెన్ చేసాడు అని కూడా చెప్పాడు. వేణు ఆఫీస్ కూడా మా హాస్టల్ కి దగ్గరే అని చెప్పాడు. ఇంతకు ముందు కూడా రెండు మూడుసార్లు చూసాను. నువ్వా కాదా అనుకున్నాను. కాని నీ నడక చూసి గుర్తు పట్టానని చెప్పాడు. నేను గుర్తు పట్టలేదని కాస్త ఫీలయినట్టు అనిపించాడు. నాకేమెా ఈ మతిమరుపు అప్పుడే  ఉందాయే. అదేంటో దారులు, ఫోన్ నెంబర్లు గుర్తుండేవి కాని మనుషులు పెద్దగా గుర్తుండేవారు కాదు చిన్నప్పటి నుండి. ఎందుకిలా అని అనుకుంటూనే ఉంటానిప్పటికి. 
             వారం వారం ఇంటికి వెళ్ళి మౌర్యని చూసి, మళ్లీ వెంటనే బయలుదేరి వచ్చేయడం జరుగుతోంది. బాబు, కొడుకు నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి స్కూటర్ మీద కోడూరు వచ్చేవారు. స్కూటర్ ముందు కూర్చుని మౌర్య ఇంటికి వెళ్లేవరకు నన్ను తొంగి తొంగి దొంగలా సిగ్గుపడుతూ చూస్తుండేవాడు. మళ్లీ సాయంత్రం బయలుదేరి అవనిగడ్డ వచ్చి హైదరాబాదు బస్ ఎక్కేసేదాన్ని పొద్దున్నే క్లాస్ కి అటెండ్ కావడానికి. మధ్య మధ్యలో ప్రాక్టీస్ వర్క్ కోసం నైట్ కూడా లాబ్ కి వెళుతుండేవాళ్ళం. మాతో ఉష కూడా వచ్చేది. తనప్పటికే జావా నేర్చుకుంది. ASP నేర్చుకోవడానికి ఉదయం బాచ్ కి ఉష నేను వేరే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళేవాళ్ళం. కార్ డ్రైవింగ్ కోసం కొన్ని రోజులు పొద్దు పొద్దున్నే వెళ్ళేదాన్ని. ఈ లోపల మద్రాస్ లో నాతోపాటు HIET వారి KCG ఎలక్ట్రానిక్స్ లో చేసిన రాజగోపాల్ హైదరాబాదు వచ్చాడు. SAP నేర్చుకుంటే జాబ్ తనకి ఇక్కడ వచ్చింది. 
             నాకు H1B పేపర్స్ వచ్చాయని చెప్పారు. ఆదిత్య ఎన్క్లేవ్ లో GIS కంపెని ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్ళి పేపర్స్ తీసుకున్నాను. వీసా కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ రాజగోపాల్ రడీ చేయించి ఇచ్చాడు. మేమూ ఆ పని మీద బాగా తిరిగాము అప్పట్లో. నేను రాఘవేంద్ర మద్రాస్ వీసా స్టాంపింగ్ కోసం వెళ్ళాము. మద్రాస్ బాంక్ లో డిడి లు రెండు తీసుకుని అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాం. హోటల్ లో మాతోపాటుగా మరొకరు కూడా వీసా స్టాంపింగ్ కి వచ్చారు. రాఘవేంద్ర, అతను తెల్లవారు ఝామునే వెళ్ళి క్యూ లో నిలుచున్నారు. ఆ అమ్మాయి, నేను తెల్లవారాక వెళ్ళాము. అప్పట్లో అలా క్యూ ఉండేది. ఇప్పట్లా అపాయింట్మెంట్ లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత టోకెన్ నంబర్ ఇచ్చి, మైక్ లో డాక్యుమెంట్స్ లిస్ట్ చెప్పి, ఆర్డర్ లో పెట్టమన్నారు. వరుసనే వీసా కౌంటర్స్ దగ్గరకి పంపిస్తున్నారు. అంతకు ముందే అందరు చెప్పుకుంటుంటే విన్నాను. అమ్మాయి ఉన్న కౌంటర్ లో వీసాలు ఎక్కువగా రిజక్ట్ అవుతున్నాయని. ఏదైనా నాకు ఇబ్బంది లేదులే అనుకున్నా. వీసా వస్తే మౌర్యని వదిలిపెట్టి వెళ్ళాలని బాధ. కాని నా ముందు ఉన్న అవసరం వెళ్ళక తప్పదని చెప్తోంది. ఈలోపల నా టోకెన్ నంబర్ పిలిచి, కౌంటర్ నెంబర్ చెప్పారు. తీరా చూస్తే తమిళ్ ఆవిడ కౌంటర్ లో ఉంది. విండో దగ్గరకి వెళ్ళాను. అడిగిన డాక్యుమెంట్స్ ఇచ్చాను. అవి చూస్తూ జాబ్ చేయడానికి వెళుతున్నారా అని అడిగింది. అవునని చెప్పాను.ఒక డిడి తీసుకుని,  వెళ్ళి ఫీజ్ కట్టండి అని చెప్పింది. అప్పుడు అర్థం అయ్యింది వీసా వస్తుందని. మా పాతింటి వాళ్ళకు ముందే చెప్పాను వీసా కోసం ఇంటి అడ్రస్ ఇస్తానని. మా ఆయన సలహా మేరకు నేను మద్రాస్ మా పాతింటి అడ్రస్ ఇచ్చాను, మరుసటి రోజు పాస్పోర్ట్ వచ్చేస్తుందని. లేదంటే ఓ వారం పడుతుంది రావడానికి. మరుసటి రోజు పాతింటికి వెళ్ళి అక్కడి వాళ్ళతో మాట్లాడుతుండగానే కొరియర్ అతను వచ్చి పాస్పోర్ట్ ఇచ్చాడు. పాస్పోర్ట్ చూసేవరకు అనుమానమే వీసా స్టాంపింగ్ అవుతుందో లేదోనని. వెంటనే పాస్పోర్ట్ చూడగానే వీసా స్టాంపింగ్ రెండేళ్ళకు వేసి ఉంది. అక్కడ అందరికి చెప్పి, మా పాత ఆఫీస్ HIET కి వెళ్ళి, అక్కడ యాస్మిన్ ని కలిసి,పినాకినిలో విజయవాడ బయలుదేరాము. విజయవాడ వచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటింది. రెంటల్ కార్ మాట్లాడుకుని, రాఘవేంద్రకు, నాన్నకు ఖద్దరు షర్టులకు క్లాత్ తీసుకుని బయలుదేరాం. ఆ బట్టల కోసం రాఘవేంద్ర షాప్ లోపలికి వెళితే, ఈలోపల డ్రైవర్ హారన్ బాగా కొట్టేసి, ఎవరితోనో గొడవ పెట్టుకుంటే వాళ్ళు కొట్టబోయారు. అమ్మా పొద్దుటి నుండి ఉపవాసం ఉన్నాను, చిరాకుగా ఉందని చెప్పాడు డ్రైవర్. ఏమైనా తిన్నామెా లేదో కూడా నాకు గుర్తు లేదు. నాకు అర్థం అయ్యింది ఏంటంటే డ్రైవర్ బాగా తాగి ఉన్నాడని. రాఘవేంద్రతో అన్నాను సరిగ్గా మనం ఇంటికి వెళతామా అని. ఈలోపల తాడిగడప దగ్గరకు రావడం, లారి ఏదో వెనుక నుండి వస్తుంటే కార్ పక్కకి వెళ్ళి, సిమ్మెంట్ గట్టు ఎక్కేయబోవడం కాస్తలో తప్పింది. ఇలా కాదని రాఘవేంద్ర డ్రైవర్ ని జరగమంటే, లేదు సార్ నేను తీసుకువెళతానంటాడే. కాదని స్టీరింగ్ రాఘవేంద్ర తీసుకుని, నరశింహాపురం ఇంటి వరకు తనే డ్రైవ్ చేసుకువచ్చి, డ్రైవర్ కి డబ్బులు ఇచ్చి, పడుకుని పొద్దున్నే వెళ్ళమంటే, కాదు వెళిపోతానంటే, జాగ్రత్తగా వెళ్ళమని చెప్పి పంపించాడు. మరుసటిరోజు పొద్దుటే విజయవాడ వరకు అందరికి ఫోన్లు చేసి, దారిలో ఏమైనా యాక్సిడెంట్ జరిగిందేమెానని కనుక్కున్నాడు. ఏది జరగలేదని తెలిసి చాలా సంతోషపడ్డాము.
  
     ఏ క్షణం మనదో తెలియని జీవితానికి ఎన్ని ఆశలు, అహాలు, ఆర్భాటాలో కదా. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక పోయినా అంతా మన ఘనకార్యమేనన్న దురహంకారం మనకు దేవుడు బహుమతిగా ఇచ్చాడేమెా మరి. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో...

19, డిసెంబర్ 2020, శనివారం

కోరికల చిట్టా..!!

నేస్తం, 

       ఏంటోయ్ చాలా రోజుల తర్వాత ఈ పలకరింపులేంటా అని కోపమా.. ఏంటో ఈ మధ్యన కాస్త నిరాసక్తత అలవాటైన క్షణాలు ఎక్కువే. అలా అని వ్యాపకాన్ని వ్యసనంగా మార్చాలన్న ప్రయత్నమూ చేయలేదు. అందుకే ఈ ఆలశ్యపు పలకరింపులన్న మాట. అవునోయ్ నీ సంగతేంటో కాని కొందరికి కొన్ని తీరని కోరికలుంటాయి కదా. నాకయితే బోలెడుండిపోయాయి మరి.
      చిన్నప్పటి నుండి మెుదలెడతాను. అప్పట్లో మన దేశంలో అందరికన్నా రాష్ట్రపతికి ఎక్కువ జీతం పదివేలట. ఏమైనా సరే రాష్ట్రపతి ఓసారయినా అయిపోయి పదివేల రూపాయలు తీసేసుకోవాలని.  తర్వాత పాడుతా తీయగా మెుదలయ్యింది టీవిలో. అప్పటి నుండి ఓ పేద్ద కోరిక ఉండిపోయింది. పాడాలని కాదు. పాడుతా తీయగా ప్రోగ్రామ్ లో బాలుగారి పక్కన కూర్చోవాలని. MBBS ఎలాగూ చేయలేదు MS అయినా చేయాలనుకున్నా. అదీ తీరలేదు. సరే అమెరికా వెళ్ళానా.. నయాగరా ఫాల్స్ కూడా చూడలేదు. పోని అమెరికా నుండి వచ్చాక నాకిష్టమైన స్పెషల్ తెలుగులో పిజి చేసి, తర్వాత డాక్టరేట్ కోసం ప్రయత్నించి పేరు ముందు డాక్టర్ అని అయినా పెట్టుకుందామనుకున్నా. అదీ కుదరలేదు. 
       చిన్నప్పటి నుండి సముద్రంలో నుండి పొద్దు పొద్దున్నే వచ్చే సూర్యుడిని చూడటానికే ముందురోజే హంసలదీవి సముద్రస్నానాల తిరునాళ్లకు వెళిపోయేవాళ్ళం. అలా అని అసలు కోరికేంటంటే కన్యాకుమారి దగ్గర పౌర్ణమి రోజు ఒకేసారి సూర్యాస్తమయాన్ని, చంద్రోదయాన్ని చూడాలని బలీయమైన కోరికన్నమాట. నా తీరని కోరికల లిస్ట్ చాలా చిన్నదే కదా... 😊 .

18, డిసెంబర్ 2020, శుక్రవారం

రాయితీలు ఇవ్వబడవు...!!

కష్టంలో లేని పలకరింపు
సుఖాలలో అక్కర్లేదు 

అవసరానికి అక్కరకు రాని ఏ బంధమూ
పెంచుకోవాల్సిన అగత్యమూ లేదు

చావుపుట్టుకలకు కనీసం మాటామంచి లేని  చుట్టరికాలను వదిలించు కోవడమే మంచిది

అశుభమని భావించే శుభప్రదాయిలకు 
తులసినీళ్ళు వదిలేయడమే

బాధ ఈరోజు నాఇంటిది కావచ్చు
రేపటిరోజున నీ ఇంటి తలుపు తట్టదని లేదుగా

డబ్బు జబ్బు చుట్టుకున్న
అహంకారులెవరైనా నా దృష్టిలో లేనట్లే లెక్క

ఎవరినైనా క్షమించవచ్చు కాని
మానసిక హింసాంతకులను క్షమించేంత సుగుణమూ నాకు లేదు

అక్షరాలా ఇది నిజం
ఈ విషయాల్లో ఏ రాయితీలు ఇవ్వబడవు16, డిసెంబర్ 2020, బుధవారం

అంతర్లీనం..!!

ఎక్కడో ఉన్న శూన్యాన్ని 
అదాటున చుట్టేయాలన్న ఆత్రమెందుకో 

ఉలికిపాటును రెప్పల మాటున
దాచేయాలన్న ప్రయత్నమెందుకో

కనబడని మనసు కలతను
కనుమాయ చేయాలన్న కోరికెందుకో

అడ్డు పడుతున్న బంధాలను వదిలేసి
వైతరణి దాటేయాలన్న తొందరెందుకో

గుండె చప్పుడును తెలిపే అక్షరాంగనల 
అభ్యంగన స్నానానికి సిద్ధపడాలన్న సాహసమెందుకో

అంతర్లోచనాలకు సాయంగా నిలిచిన
అంతర్లీన ఆలోచనా ప్రవాహానికి ఆనకట్ట వేయడానికేమెా...!! 

14, డిసెంబర్ 2020, సోమవారం

ఏక్ తారలు

1.  మనసు తెలుపుతోంది_మౌనాన్ని  అర్థవంతంగా...!!
2.   తొలగించేంత అడ్డుతెరలేమున్నాయ్ మన మధ్యన_అహాన్ని వదిలేస్తే...!!
3.  పరిధి తెలియక కాదు_పర్యవసానమాలోచించనివే ఆ బంధాలు..!!
4.  భ్రమత తీరదేమెా_అక్షరాలతో మనోభావాలనెంతగా అలకరించినా..!!
5.   మౌనం ఆవహించాలి_మనిషిలోని మనసు తెలియాలంటే...!!
6.  అలవాటైన అక్షరాలకు తెలిసిపోతుంది_సందర్భం చెప్పకుండానే...!!
7.   పరాజితులమయ్యామని మర్చిపోతున్నాం_విరాజితులమన్న భ్రమలో పడి..!!
8.  సంతసాలతో సందిగ్ధాలకు తెరలేయడమే_ప్రశ్నలకు తావీయక..!!
9.   అమ్మంటే అంతే_తన ప్రాణాన్ని మనకోసం ఇచ్చేస్తూ..!!
10.  మనసు పనే అది_మరల మరల తరచి చూసుకోమంటూ...!!
11.   చీకటితో కబుర్లాడుతోంది_వెన్నెలకూ చోటిమ్మంటూ...!!
12.   విడమరిచి చెప్పడానికేముంది_విషాదాన్ని విదిలించిన కా(క)లానికి..!!
13.  ఎడదలో నిండినవీ ఎడబాటులే_అక్షరాలకు అలవాటుగా మారిన ఆనవాళ్ళై...!!
14.   తడబడినా తప్పని పయనం_కాలం విదిల్చిన క్షణాల్లో జ్ఞాపకాలను దాచేస్తూ...!!
15.  అక్షరాలు గుప్పెడే_అవి అందించే భావాలే అనంతం..!!
16.  ఆవిష్కరణ అలవాటైపోయింది_అంతరంగాన్ని అదిలించాలంటే..!!
17.  అనునయింపు ఆత్మాక్షరానిదే_మనోతరంగం మాటల సంద్రమైతే...!!
18.   ఎన్ని నిరీక్షణలో మనసుకి_వ్యర్థమవుతున్న అనుబంధాల నడుమన...!!
19.   బంధాలిప్పుడంతే_ఎప్పుడూ ఓడిపోయేది మనసే మరి..!!
20.  ఇప్పటి మనిషితనం అలవాటిదే_మనసుతనాన్ని చేతగాని తనమంటూ...!!
21.   మనవారనే భ్రమపడ్డానిన్నాళ్ళు_మనసు మాయలో పడి గ్రహించక...!!
22.  సాంకేతిక పరిజ్ఞానం పెరిగి యంత్రాలమైపోయాం_అనుబంధాలను వదిలేస్తూ...!!
23.  వొంపేయడానికేం మిగిలాయని_కడగండ్లన్నీ కన్నీళ్లతో కలిసి జారిపోయాకా...!!
24.   అయిన చుట్టరికమే మరి_అక్షరాల సాంగత్యానిది...!!
25.   పొంతన కుదిరితేనే కదా_అక్షరాలు కుందనంగా అమరేది...!!
26.  సత్వరమే అందుతుంది సాంత్వన_అక్షరాలకు మాలిమైన మనసుకు..!!
27.  అమ్మ పంచిన ఆస్తి ఈ అక్షరం_బంధాలకు లోబడిపోతామనేమెా ఇలా..!!
28.  ఎదురీత తప్పని బతుకులివి_నిందలేయడం బంధాలకు నిత్యకృత్యమేగా..!!
29.   అనుబంధపు రణరంగాలింతే_ఆత్మ సంబంధం అక్షరాలతో అయినప్పుడు...!!
30.   చూపక చెప్పక తప్పలేదు_నా అక్షర ఖడ్గానికి రెండు వైపులా పదునేనని...!!

కాలం వెంబడి కలం..32

   
    పిల్లల మనసులు ఎంత మంచివో చెప్పడానికి ఈ సంఘటనే ఉదాహరణ. కాలేజ్ లో మా ఊరి అబ్బాయి కూడా చదువుతుండేవాడు. మెకానికల్ క్లాస్ లో అనుకుంటా ఉండేవాడు. రాఘవేంద్ర వేరే వాళ్ళ కోసం వెళ్ళి ఓ కేస్ లో ఇరుక్కున్నాడు. అంతకు ముందు కూడా తనని ఎవరో ఏదో అన్నారని, ఈయన ఫ్రెండ్స్ వాళ్ళని కొడితే ఆ కేస్ లో ఈయన్ని పెట్టారు. ఈయన ఎక్కడికి వెళ్ళాడన్న విషయం మాకసలు తెలియదు. కొందరు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఉండటం గొప్ప అనుకుంటారనుకుంటా. రాజా అన్నయ్య వచ్చి ఎక్కడికి వెళ్ళాడు రాఘవేంద్ర అంటే, హైదరాబాద్ వెళ్ళాడనుకుంటా అని చెప్పాను. కాదు శ్రీకాకుళం వెళ్ళి, అక్కడ కేస్ లో ఇరుక్కున్నాడు, పేపర్ లో పడింది అని చెప్పాడు. తర్వాత పోలీస్ ఎంక్వైరీకి వచ్చి, నన్ను వివరాలడిగి, ఇప్పటికే రెండు కేస్ లు ఉన్నాయి. మరో కేస్ అయితే షీట్ ఫైల్ చేస్తారు. జాగ్రత్త మిమ్మల్ని చూసి ఊరుకుంటున్నాను ఈసారికి అని చెప్పి వెళ్ళారు. పల్లెటూరు కదా పోలీస్ లు వచ్చే సరికి ఊరంతా ఇంటికి వచ్చేసారు. ఆపదలో ఉంటే ఆదుకోవడానికి ఎవరూ రారు కాని, చోద్యం చూడటానికి అందరూ వస్తారు. పోలీస్ అడిగిన ఆ మాటకు నిజంగా అప్పటికప్పుడు చనిపోవాలనిపించింది. ఎప్పుడూ సొమ్ము ఉన్నా లేకపోయినా విలువగానే బతికాము. అలాంటిది ఆ మాట పడేసరికి, ఎవరితో ఓ మాట అనిపించుకుని ఎరగని నాకు చాలా బాధ వేసింది. ఇంత చదువుకున్నావు ఎలా చేసుకున్నావమ్మా అని కూడా అన్నాడు. 
         
       తర్వాత రాఘవేంద్ర వచ్చాక పసి అక్క తనకు రాఘవేంద్ర ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళ చిన్నాడికి చీటి రాసి పంపింది. ఆరోజు తను ఇంటికి వచ్చి వెళ్ళింది కాని తను అడగలేదు. సాయంత్రం పిల్లాడిని పంపింది. ఆ విషయానికి గొడవ పెట్టుకుని ఓ దెబ్బ వేశాడు. నేనూ ఎదురు తిరిగాను. అమ్మ మీద కూడ పోట్లాడాడు. అమ్మ ఇంటికి వెళ్ళి పోయిందప్పుడు. అయినా నా దగ్గరకి వస్తూనే ఉండేది. గొడవ జరిగిందని పాపక్క వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమన్నారు. తర్వాత మండా రాజేశ్వరరావు గారి ఇంట్లో వేరే చిన్న గదిలోకి మారాము. గొడవ ఇందుకు. రాఘవేంద్ర వాళ్ళ అక్క వాళ్ళింటికి వెళ్ళి డబ్బులు అడుగుతాడట. నేను తనతో వెళ్ళాలట. నన్ను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటావా అని అడిగాను. నువ్వు వాళ్ళని అడిగినా, నేను మా నాన్నని అడిగినా ఒకటే. మా నాన్ననే అడుగుతాను అని చెప్పాను. అడిగాను కాని మా నాన్న కూడా ఇవ్వలేదప్పుడు.  

            పసి అక్క నాకు చాలా సాయం చేసింది. ఆ విషయాలు ఏవి కాదనలేను. కూతురిలానే అనుకుంటున్నా అనేది. కనీసం తనే ఆ డబ్బులు అడిగితే బావుండేది.  చిన్నపిల్లాడితో చీటి రాసి పంపింది. అమ్మ కూతురిని ఇలానే అడుగుతుందా అని చాలా బాధ వేసింది. అయినవారు ఎవరు ఏమి చేయకపోయినా నన్ను బాగా చూసుకునే పసి అక్క ఇలా చేయడం బాగా కష్టంగా అనిపించింది మనసుకి. రాఘవేంద్ర ఇవ్వలేక పోయినా వడ్డీతో సహా నేను ఇచ్చేస్తానని తను మద్రాస్ వచ్చినప్పుడు చెప్పినా ఇలా చేసింది. మా వాళ్ళందరు మా ఇంటి వైపు నుండి వెళితే, మేము కనబడితే ఏ అప్పు అడుగుతానోనని వేరే దారి నుండి వెళ్ళేవారు ఇటు రాకుండా. 

          మరుసటిరోజు కాలేజ్ కి వెళ్ళాలంటే బెరుకుగా అనిపించింది. సహజంగా మనకు ఇతరుల వ్యవహారాలపై మక్కువ ఎక్కువ కదా. ఏ చిన్న విషయం తెలిసినా దానిని గోరంతలు కొండంతలుగా చేసి చెప్పుకోవడం పల్లెటూర్లులో మామూలే. కాలేజ్ లో పిల్లలందరికి ఈ విషయం తెలిసి నన్ను చులకనగా చూస్తారేమెానన్న మీమాంస. ఈ విషయం పిల్లలకు తెలుసో లేదో నాకు ఇప్పటికి తెలియదు. పిల్లలందరు ఎప్పటిలానే నాతో ఇష్టంగానూ, గౌరవంగానూ ఉండేవారు. 

           మేము ఇంటరులో నేర్చుకున్న ఫిజిక్స్ ప్రాక్టికల్స్ పిల్లలకు చెప్పడమే కాకుండా ఆ పరికరాలన్ని పిల్లలు ప్రాక్టికల్స్ చేయడానికి వీలుగా అమర్చుకుని, ప్రతి పాక్టికల్ చేసి పరికరాలు సరిగ్గా పని చేస్తున్నాయెా లేదో చూసుకోవడం కూడా చేయాల్సి వచ్చింది. పిల్లలకు ఫైనల్ పరీక్షలు మెుదలయ్యాయి. ఇన్విజిలేషన్ కూడా చేయడం బావుండేది. మెుత్తానికి పిల్లలందరు బాగా నే పరీక్షలు రాసేసారు. 
               మౌర్యకు తొమ్మిదవ నెలలో మెాపిదేవిలో జుట్టు తీయించాము. శ్రీశైలం మాతో వచ్చిన చిన్నోడే మౌర్యకి జుట్టు కత్తెర వేశాడు. చిన్నా బట్టలు తర్వాత పెడతాలేరా అన్నాను. అలా జీవితం జరిగిపోతూ ఉంది. అంతలో కోడూరు బాలభాను మురళి మాస్టారు ఇంగ్లీష్ మీడియం యుకేజి పిల్లలకు లెక్కలు చెప్పమని అడిగారు. రాఘవేంద్ర వద్దన్నాడు. పాపం పిల్లలకు చెప్పే టీచర్ డెలివరీకి వెళ్ళారట. ఆ టైమ్ లో మరొకరు దొరకడం కష్టం కదా. రాఘవేంద్ర వద్దన్నా, తనకు తెలియకుండా చెప్పేదాన్ని. కాలేజ్ అయ్యాక మధ్యాహ్నం నాకు ఎప్పుడు ఖాళీ కుదిరితే అప్పుడు బాలభాను స్కూల్ కి వెళ్ళి పిల్లలకు క్లాస్  చెప్పేసి, మళ్ళీ సెంటర్ వరకు నడుచుకుంటూ వచ్చి, మా రోడ్డుకి వచ్చేదాన్ని. పెద్ద పిల్లలకు చెప్పడం చాలా తేలిక. ఈ చిన్న పిల్లలకు చెప్పడం కష్టంగా అనిపించేది. అదీ తీసివేతలు చెప్పడం బాగా కష్టం అనిపించేది. పునాది గట్టిగా ఉండాలి కదా అందుకన్న మాట. నాకు మా చిన్నప్పుడు శిశువిద్యామందిరంలో లెక్కలు ఎలా చెప్పారా అని గుర్తుకు తెచ్చుకునేదాన్ని. ఓ ఇద్దరు అల్లరి పిల్లలు మినహా మిగిలిన పిల్లలు అందరు బుద్ధిగా చెప్పింది విని నేర్చుకునే వారు. బావుండేది చిన్నపిల్లలకు చెప్పడం. 

         పిల్లల పరీక్షల చివరిలో నాకు ఇంట్లో సమస్య మూలంగా ఓ రెండు, మూడు రోజులు అనుకోకుండా కాలేజ్ కి వెళ్ళడం కుదరలేదు. రాఘవేంద్ర మౌర్యని తీసుకుని హైదరాబాద్ వెళ్ళాడు. మా మరిది వాళ్ళింటికి వెళ్ళాడు. అతను ఫోన్ చేసి పిల్లాడు ఉండటం లేదు ఏడుస్తున్నాడని చెప్తే అమ్మానాన్న, నేను అప్పటికప్పుడు బయలుదేరి హైదరాబాద్ వెళ్ళాము. అవనిగడ్డలో హైదరాబాదు బస్ కోసం ఎదురుచూస్తుంటే కాలేజ్ పిల్లలు కొందరు చూసి నా దగ్గరకు వచ్చారు. రెండు గ్రూప్ ల మధ్యన పెద్ద గొడవ జరిగిందని చెప్పారు. వెంటనే ఆ పిల్లలను పిలిచి ఇద్దరికి కాంప్రమైజ్ చేసాను. పిల్లలు గబగబా వెళ్ళి అప్పటికప్పుడు నాకు చిన్న ఫ్లవర్ వాజ్ గిఫ్ట్ గా తెచ్చారు. ఈ లోపల మిగతా పిల్లలందరికి నేను ఊరు వెళుతున్నానని తెలిసి బస్ దగ్గరకి వచ్చేసారు సెండాఫ్ ఇవ్వడానికి. వాళ్ళందరిని చూసి మా నాన్న నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది అని చాలా సంతోషపడిపోయారు. 

         మౌర్యని రాఘవేంద్ర హైదరాబాదు తీసుకు వెళ్ళేటప్పటికి మౌర్య నా దగ్గర పాలు మానలేదు. వాడి పుట్టినరోజుకి కొన్ని రోజుల ముందు తీసుకువెళ్ళాడు. మేం వెళ్ళి నా పిల్లాడిని ఇవ్వలేదు. మా బావగారు కూడా వచ్చి తిట్టి వెళ్ళారు. సరేనని మేం ఇంటికి వచ్చేసాం. నేను అప్పుడు అమ్మా వాళ్ళింట్లోనే ఉన్నాను. మా తోడికోడలు మాట అననే అంది. సెటిలవ్వకుండా పిల్లలని కనకూడదని. తప్పు మాదే మరి. మన బంగారం మంచిది కానప్పుడు ఎవరు ఏమి అన్నా పడాలి తప్పదు. తర్వాత రెండు రోజులకే మౌర్యని తీసుకువచ్చి ఇచ్చేసాడు. 

              నేను మళ్లీసారి మౌర్య పుట్టినరోజుకి ఉంటానో ఉండనో అని బాగా చేయాలనుకున్నా. కాని ఈ గొడవ జరిగేసరికి ఊరిలో పిల్లలందరిని మాత్రమే పిలిచి చేసాను. తర్వాత నేను కాలేజ్ లో మానేసి హైదరాబాదు వెళ్ళాను. అమెరికా వెళ్ళడానికి జావా నేర్చుకోవడానికి. 

     ఏ ఉద్యోగానికైతే నేను పనికిరానని అన్నారో, వారికి తెలిసేటట్లుగా నన్ను నేను నిరూపించుకుని, మరో మజిలికి ప్రయాణమయ్యాను. 
 
      జీవితంలో అడ్డంకులు, ఆటుపోట్లు మనిషిలోని, తనకు తెలియని శక్తిని బయట పడేస్తాయి. పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి ఉపయెాగపడతాయి.దేనినైనా తట్టుకునే శక్తిని కూడా ఇస్తాయి. కాస్త ఓర్పు, నేర్పు ఉంటే చాలు. 


వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

13, డిసెంబర్ 2020, ఆదివారం

కొన్ని..!!

కొన్ని మనసులింతేనేమెా
ఎప్పుడూ వెలితిగా

కొన్ని నవ్వులింతేనేమెా
ఎప్పుడూ  వెలవెలబోతూ

కొన్ని బంధాలింతేనేమెా
ఎప్పుడూ అంటీ అంటనట్టుగా

కొన్ని కలలింతేనేమెా
ఎప్పుడూ కలకలం రేపుతూ

కొన్ని ప్రేమలింతేనేమెా
ఎప్పుడూ అర్థం చేసుకోలేనట్లుగా

కొన్ని నిజాలింతేనేమెా
ఎప్పుడూ నమ్మలేనట్టుగా

కొన్ని ఆశలింతేనేమెా
ఎప్పుడూ తీర్చుకోలేనట్టుగా

కొన్ని ఖాళీలింతేనేమెా
ఎప్పుడూ పూడ్చుకోలేనంతగా

కొన్ని జీవితాలింతేనేమెా
ఎప్పుడూ అసంతృప్తిగా....!!

8, డిసెంబర్ 2020, మంగళవారం

మనకో నీతి - తనకో నీతి..!!

     నాయకులూ మీ ప్రాణాలు పదిలంగా కాపాడుకోండి. పిల్లల ప్రాణాలు ఏమైనా మీకనవసరం. మీకు మాత్రం ఎన్నికలు వద్దు కాని పిల్లలకు పాఠశాలలు, కళాశాలలు తెరిచి, పరీక్షలు పెట్టి మీ చేతులు దులిపేసుకోండి. తప్పు మీది కాదులెండి. గుడ్డిగా నమ్ముతూ వెనకేసుకు వస్తున్న మాది. మాకింతే జరగాలి. మీరు మీ మీ పనులు రాజబాటలో పూర్తి చేసుకోండి నాలుగు చిల్లర రాళ్ళు మా మీద విసిరేస్తూ... ఆ మహా ప్రసాదాన్ని మేం ఆనందంగా స్వీకరించేస్తాం. మీ ప్రాణాలు మీరు భద్రంగా కాపాడుకోండి. పిల్లలు ఏమైతే నీకెందుకు?  

7, డిసెంబర్ 2020, సోమవారం

తప్పొప్పులు...!!

నేస్తం, 
          ఒకరికి రాని విద్య మనకు వచ్చునని గర్వము కూడదు. ధనం మూలమిదం జగత్ అన్నది అక్షరాల సాక్షిగా పచ్చి నిజం. ఏం చేస్తాం ప్రపంచమే అలా ఉంది మరి. విద్యను వ్యాపారంగా చూడవచ్చు కాని మంచి చెడు కాస్త ఆలోచించాలి. కృతజ్ఞత చూపడం కూడా మన వ్యాపార ధోరణికి తప్పని భావిస్తే, రేపటి రోజున అమ్మని కూడా అమ్మకానికి పెట్టేస్తామేమెా. ఇష్టపడో లేదా అభిమానంతోనో చేసిన పనికి వెల కట్టలేము. బహుశా అదే కష్టానికి ఫలితం కోట్లలో రావచ్చు. కృతజ్ఞత తెలపడమే నేరమని భావించే వారికి చెప్పగలిగినది ఏమి ఉండదు. ఎవరి కారణాలు వారికుంటాయని సరి పెట్టుకోవడం తప్ప. ఈ కారణం చూపించి నింద వేయడం సరి కాదు. 
         సినిమా వాళ్ళు కొందరు కొందరికి డబ్బు తీసుకోకుండా పని చేస్తారు. అలా అని అందరు వాళ్ళను అందరికి ఊరికినే చేయమని అడగరు కదా. అలాగే ఏ పనైనా అంతే. కొందరి మీద అభిమానంతోనో, ఇష్టంతోనో, పోని మెామాటంతోనో చేయాల్సి వస్తుంది. అదే పని అందరికి చేయలేం కదా. వారికి చేసారు, నాకెందుకు చేయరంటే చెప్పడానికి కారణమే ఉండదా చెప్పండి. 
            మా హిందీ టీచర్ చెప్పిన మాటే గుర్తు చేసుకుంటూ... చెడు జరిగినా అది మన మంచికే... కాలమే నిర్ణయిస్తుంది మన తప్పొప్పులను. విషయ పరిజ్ఞానం లేకుండా రాసానని అనిపిస్తే పెద్ద మనసు చేసుకుని మన్నించేయండి అందరూ...!!

కాలం వెంబడి కలం...31

         
          మెుదటి ఫిజిక్స్ క్లాస్ తీసుకోవడానికి ఎందుకయినా మంచిదని, రెండు గంటల క్లాస్ కి అని నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అవనిగడ్డ పాలిటెక్నిక్ కాలేజ్ లో మెుదటి ఫిజిక్స్ క్లాస్ మెకానికల్ బాచ్ కి తీసుకున్నాను. నాకు ఇష్టమైన వెక్టర్స్ తో మెుదలుబెట్టాను. క్లాస్ రూమ్ కి వెళ్ళగానే క్లాస్ తీసుకున్నాను. రెండు గంటలకని ప్రిపేర్ అయిన సబ్జెక్ట్ గంట కూడా రాలేదు. క్లాస్ చెప్పడం అవగానే పిల్లల పరిచయం అయ్యింది. ఎలక్ట్రికల్, కంప్యూటర్స్ రెండు బాచ్ లను కలిపి ఓ క్లాస్ తీసుకునేదాన్ని. కంప్యూటర్ గ్రూప్ లో మాత్రమే అమ్మాయిలు ఉండేవారు. అలా నా లెక్చరర్ జీవితం, మేం చిన్నప్పుడు చదువుకున్న అవనిగడ్డలో మెుదలైంది. నాతోపాటు కెమిస్ట్రీ లెక్చరర్ సంధ్య గారు ఉండేవారు. ఇంక మిగతా అందరు అబ్బాయిలే. సంధ్యను అడిగాను ఇలా. రెండు గంటలకు ప్రిపేర్ అయితే గంటే వచ్చిందండి ఏం చేయాలి అంటే ఆవిడ నవ్వేసారు. కబుర్లతో టైమ్ పాస్ చేయవచ్చు కాని పిల్లలకు చెప్పాల్సిన సిలబస్ చాలా ఉంది. పాఠమే కాకుండా నోట్స్ కూడా చెప్పాలి. ఇన్ని పనులు టైంకి  అవ్వాలంటే క్లాస్ లో టైమ్ వేస్ట్ చేయకూడదని నా ఉద్దేశ్యం. నాకేమెా కాస్త ఫాస్ట్ గా చెప్పడం అలవాటు. అందుకనే మెుదట్లో కొందరు పిల్లలు ఇబ్బంది పడేవారు. కొందరు వేరే లెక్చరర్స్ పిల్లలను అడిగినట్లున్నారు. మాడం ఎలా చెప్తున్నారని. ఈ విషయం చెప్పినట్లున్నారు పిల్లలు. ఇంగ్లీష్ లెక్చరర్ పేరు గుర్తు లేదు నాకు. ఆయన మాడం మీరు చాలా ఫాస్ట్ గా చెప్తున్నారంట. కాస్త నెమ్మదిగా చెప్పండని సలహా ఇచ్చారు. 
            తర్వాత రోజు రెండు గ్రూప్ లను కలిపి ఫిజిక్స్ క్లాస్ తీసుకున్నా. ఈ మాటే అడిగాను. నేను ఫాస్ట్ గా చెప్తున్నాను, కాని మీకు అర్థం కాకుండా చెప్పడం లేదు కదా అని అడిగాను. మీకు పాఠం చెప్పాలి, నోట్స్ చెప్పాలి స్పెల్లింగ్స్ తో సహా. మనకు టైమ్ ఎక్కువ లేదు. మీ ఇష్టం మరి పాఠం నెమ్మదిగా చెప్పి, నోట్స్ ఇవ్వను. మీరేం చేయమంటే అది చేస్తాను అని. పిల్లలందరు మాడం మీరు ఇప్పుడెలా చెప్తున్నారో అలాగే చెప్పండి అని ముక్త కంఠంతో అరిచారు. అలా పిల్లలందరు బాగా దగ్గరైపోయారు అతి కొద్ది కాలంలోనే. 
                 నేను కాలేజ్ నుండి వచ్చి మరుసటి రోజు క్లాస్ కి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటుంటే మౌర్యగాడు అస్సలు ఊరుకునేవాడు కాదు. నేను అన్నం తినేటప్పుడు కూడా ఏడిచేవాడు కాదు. అలాంటిది పుస్తకం పట్టుకుంటే ఏడ్చేవాడు. వాడిని నిద్రపుచ్చి, అప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని. మా ఊరు నుండి మూడు కిలోమీటర్ల దూరంలోని కోడూరు వెళ్ళి బస్ ఎక్కి అవనిగడ్డ వెళ్ళాలి రోజూ. ఎక్కువగా నడుచుకుంటూ కోడూరు వెళ్ళి, అక్కడి నుండి బస్ లో అవనిగడ్డ వెళ్ళేదాన్ని. అప్పుడప్పుడూ రాఘవేంద్ర కోడూరులో బండి మీద దింపేవాడు. వచ్చేటప్పుడు కూడా అంతే. 
        ఎలక్ట్రికల్, కంప్యూటర్ గ్రూప్స్ కి కామన్ గా ఉన్న ఫిజిక్స్ కాకుండా ఇతర సబ్జెక్టులు కూడా చెప్పేదాన్ని. మాథ్స్ ఓ సర్ చెప్పేవారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వేరే సర్ చెప్పేవారు. అలా ఫిజిక్స్ అని జాయిన్ అయ్యి, మిగతా సబ్జక్ట్ కూడా చెప్పేదాన్ని. పిల్లలు గులాబిపువ్వులు తెచ్చి ఇస్తుండేవారు. పూలు ఎక్కువగా నేను పెట్టుకోను. అందుకని పిల్లలు బాధ పడకుండా, పువ్వులు తీసుకుని సంధ్య గారికి ఇచ్చేసేదాన్ని. ఆవిడ నవ్వేవారు ముందునుండి ఉన్నా నాకు ఇవ్వలేదు, చూసారా మీకు ఇస్తున్నారు అని. వాళ్ళకి తెలుసులెండి నేను మీకే ఇచ్చేస్తానని అని నేను నవ్వేసేదాన్ని. అందరం అనుకుంటుంటాం ఈ మాట. సహజంగా ఇద్దరు ఆడవాళ్లు ఉన్న చోట గొడవలుంటాయని. కాని ఇక్కడ రివర్స్. మేమిద్దరం చాలా బావుండేవాళ్ళం. అబ్బాయిల ఆరోపణలు వింటూ మేమిద్దరము ఈ మాటే అనుకుని బాగా నవ్వుకునేవాళ్ళం. మధ్యలో మాథ్స్ సర్ ఎందుకనో చాలా రోజులు రాలేదు. కాలేజ్లో కూడా ఎవరికి చెప్పలేదు. పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు ఎగ్జామ్స్ దగ్గరకి వచ్చేస్తున్నాయని. సిలబస్ చాలా ఉందని. నాకు పాపం పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారనిపించి, సరే నేను కొన్ని చాప్టర్స్ చెప్తానని నాకిష్టమైన ఇంటిగ్రేషన్ తో స్టార్ట్ చేసాను. ఆ రోజు పిల్లలందరు బాగా కుషి. మాడం మీరు ఆల్ రౌండరా అంటూ. తర్వాత మాథ్స్ సర్ వచ్చేసారు. నేను హెల్ప్ చేసినందుకు థాంక్స్ కూడా చెప్పారు. 
         పిల్లలు అందరు చాలా మంచివాళ్ళు. చెప్పేది చక్కగా వినేవారు. అప్పుడే టెంత్ అయి వచ్చారు కదా బుద్ధిగానే ఉండేవాళ్ళు. మేమంటే గౌరవంగానే ఉండేవారు. మెకానికల్ వాళ్ళకి, కంప్యూటర్స్ వాళ్ళకి ఎందుకో పడలేదు. ఈ కార్తీకం మాసంలోనే అనుకుంటా పిక్నిక్ ప్లాన్ చేసుకున్నారు. మెుత్తానికి ఏదో గోడవ అయ్యింది. చిన్నా చితకా గొడవలకు సర్దిచెప్తుండేదాన్ని. సంధ్య నవ్వుతుండేవారు... మీ మాటలు బాగా వింటున్నారండి అని. పిల్లలకు నాకు తెలిసిన మంచి విషయాలు కూడా చదువుతో పాటుగా చెప్తుండేదాన్ని. ఇది మా హింది టీచర్ రత్నకుమారి గారి దగ్గర నేర్చుకున్నాను. ఆవిడ మాకు చదువే కాకుండా లోకజ్ఞానం కూడా నేర్పేవారు. బోలెడు మంచి విషయాలు కూడా చెప్పేవారు. ఓ రోజు మా జయపురం నుండి అమ్మయ్యగారి మనుమరాలు జనని బస్ లో కలిసింది. తను చిన్నప్పుడు మేము చదువుకున్న శిశువిద్యామందిరంలో టీచర్ గా చేస్తోంది. మా శ్రీలత టీచర్ గారి గురించి అడిగితే కలవమని చెప్పారని చెప్పింది. తర్వాత ఓ రోజు మధ్యాహ్నం పూట మా శిశువిద్యామందిరంకి వెళ్ళి టీచర్ గారిని కలిసాను. ఎంత సంతోష పడిపోయారో మా శ్రీలత టీచర్ గారు, నా అల్లరంతా గుర్తు చేసుకుంటూ.  పెద్ద తెలుగు మాస్టారిని పలుకరించాను కాని ఆయనకు అప్పటికే మతిమరుపు వచ్చేసింది. అలా బస్ లో ఎక్కువగా సాయంత్రం పూట నేను, జనని కలిసేవాళ్ళం. ఇంతకి జీతం ఎంతో చెప్పలేదు కదూ. రెండు గంటలకి రెండు వేలు అనుకుంటా. తర్వాత తర్వాత క్లాస్ లు ఎక్కువసేపు చెప్పేదాన్ని. 

మనం చేసే పని ఏదయినా ఇష్టంగా చేస్తేనే ఆ పనిలో ఆనందం పొందగలుగుతాం. అంతే కాని పని చిన్నదా, పెద్దదా అని కాదు. ఎంత సంపాదించామన్నదీ కాదు. ఆత్మతృప్తి కలిగిందా లేదా అని చూసుకోవాలి. 


వచ్చే వారం మరిన్ని కబుర్లతో....

5, డిసెంబర్ 2020, శనివారం

న్యాయం జరిగేదెన్నడో...?

కాలం కాటునుండి
తప్పించుకోలేని కష్టజీవి
దళారుల చేతుల్లో 
దగాపడుతున్న సేద్యగాడు 

నేలను నమ్ముకుని 
అమ్మలా కాచుకునే రైతుబిడ్డను 
ప్రకృతి కూడా పరిహసిస్తోంది
తన చేతిలో కీలుబొమ్మంటూ

విత్తుల దగ్గర నుండి 
ఎరువుల పురుగుమందుల వరకు
కల్తీ కోరల్లో చిక్కుకున్నది
దేశానికి బువ్వనందించే భూమాత సారం

కాసులు కూడబెట్టుకోవడం తెలియని
అలుపెరుగని ధరణీ సుతుడితడు
కూలీగా మారి మన ఆకలిదీర్చే ఆత్మబంధువితడు
అప్పుల ఊబిలో ప్రాణాలర్పిస్తున్న అన్నార్తుడితడు

ఎన్నికల మాయాజాలంలో
ఓట్లకు నోట్లకు అమ్ముడుబోతున్న 
మధ్యతరగతి బతుకులను మార్చలేని 
రాజకీయ రాక్షస కోరల్లో నలుగుతున్న దగా పడిన రైతన్నకు న్యాయం జరిగేదెన్నడో

శ్రమను అమ్ముకోవడం 
చేతగాని భూమి పుత్రుడు కన్నెర్రజేస్తే
పంట వేయనని మెుండికేస్తే
పరిణామమెలా ఉంటుందో ఊహించగలమా...!!ప్రవాసుని చేతిలో తెలుగు భాషకు దక్కిన అరుదైన గౌరవం....!!

               పూర్వీకుల తెలుగు మూలాలను మహోన్నతంగా, దేదీప్యమానంగా వెలిగించి చరిత్ర పుటల్లో ఓ నూతనాధ్యాయాన్ని లిఖించిన అద్భుతవ్యక్తి మారిషస్ నివాసి శ్రీ సంజీవ నరసింహ అప్పడు గారు. వీరి చేతిలో రూపుదిద్దుకున్న తెలుగు అక్షరాల పట్టి(ఫాంట్) త్వరలో "మారిషస్ సంజీవ తెలుగు పట్టి(ఫాంట్)గా వెలుగులోనికి రానుంది. 
         భరతభూమికి 5445 యెాజనాల దూరంలో గల మారిషస్ దీవుల నివాసితులయిన శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారి ముత్తాతలు మన ఆంధ్రులు. సంజీవ నరశింహ అప్పడు గారికి ముత్తాతల మాతృ
భాష అన్న అంతులేని ప్రేమ. భరతభూమికి సుదూరంగా ఉన్నా తెలుగు మీద అభిమానంతో, మారిషస్ ప్రభుత్వ సహాయ, సహకారాలతో అక్కడి పిల్లలకు పాఠశాలలో తెలుగు నేర్పడము, మన భారతీయ సంస్కృతీ, సనాతన సంప్రదాయాలను వివరించడములో చాలా కృషి చేస్తున్నారు. 
      శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. వీరికి తెలుగు భాషపై మంచి పట్టు ఉండటమే కాకుండా, దైవానుగ్రహముతో వివిధ రంగుల పెన్నులతో, 8,12,16 కలాలను ఒకేసారి ఉపయెాగిస్తూ తెలుగు లిపిని తనదైన శైలిలో అందంగా రాయగలరు. అంతేకాకుండా సొంపుగా పెద్ద పెద్ద రంగవల్లులను అత్యద్భుతంగా వేయగలరు, అదీ అతి తక్కువ సమయంలో. వీరు  తెలుగు సాంస్కృతిక పసుపు ఝండాను రూపొందించారు. ప్రపంచంలోని లక్షలాది తెలుగువారికి తెలుగు వ్యాఖ్యాతగా పరిచితులై, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను తన అద్భుత వ్యాఖ్యానంతో మన కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తున్నారు. పదివేల సార్లు భారతదేశాన్ని సందర్శించాలన్న దృడ సంకల్పం వీరిది. ఇప్పటికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 149 పుణ్య ప్రదేశాల నుండి మట్టి ప్రసాదాన్ని తమ ఇంటి దేవుని గదిలో గుట్టలు గుట్టలుగా అలంకరించారు. తాను వెళ్ళిన ప్రతి ఊరిలోని ప్రముఖులతో తెలుగు సాహిత్య కార్యక్రమాలు నిర్వహించి, అదే వేదికపై అందరి సమక్షంలో వయసులో పెద్దాయనను, ఓ యువకుడిని పిలిచి, ఆ యువకుడితో పుట్ట మట్టిని తవ్వించి, ఆ పెద్దాయన చేతుల మీదుగా మట్టిని స్వీకరించి తనతో మారిషస్ తీసుకువెళ్ళారు. తెలంగాణా ప్రభుత్వం మారిషస్ లో పెట్టబోతున్న శ్రీ పాములపర్తి వేంకట నరశింహారావు గారి విగ్రహానికి, తెలుగుతల్లి విగ్రహానికి భూమి పూజలో ముందుగా శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారు ఇప్పటి వరకు సేకరించిన భరతభూమి మట్టి ప్రసాదాన్ని ముందుగా వేసి, ఆ తరువాత విగ్రహ ప్రతిష్ఠ పనులు మెదలుబెడతారు. నాకు తెలిసి ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరు చేయని ఈ మట్టి సేకరణకు దక్కిన అపూర్వ గౌరవమిది. ఈ గౌరవాన్ని శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారికి అందించిన తెలంగాణా ప్రభుత్వానికి శుభాభినందనలు. 
    తెలుగు భాషలో చిరస్థాయిగా నిలిచిపోయిన సి పి బ్రౌన్ మహాశయుని మనం నిత్యం స్మరించుకున్నట్లే, శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారిని కూడా గుర్తు చేసుకోవాలి. శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారి తెలుగు భాషా సేవలలో సరి కొత్త అధ్యాయం చోటు చేసుకుంది. అది ఈయన రాసిన తెలుగు అక్షరాలను మారిషస్ సంజీవ తెలుగు పట్టి(ఫాంట్)గా వాడుకలోనికి రానుంది. అను ఫాంట్, బాపు ఫాంట్ వగైరా ఫాంట్ లు మనకు అందుబాటులో ఉన్నట్లుగా ఈ "మారిషస్ సంజీవ తెలుగు పట్టి(ఫాంట్) త్వరలో వాడుకలోనికి రానుంది. ప్రవాసులలో ఈ ఘనతను అందుకున్న మెుదటి వ్యక్తి శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారు. తెలుగు భాషా చరిత్రలో వీరి పేరు అజరామరంగా నిలిచిపోతుంది. ఈ మారిషస్ సంజీవ తెలుగు పట్టి తయారు చేయడానికి దాదాపుగా నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది. ఇది చాలా ఖర్చు, శ్రమతో కూడుకున్న పని. అతి తక్కువ ఖర్చుతో ఈ మారిషస్ సంజీవ తెలుగు పట్టి తయారయ్యింది. దీనికి ఆర్థిక సహాయ, సహకారాలను అందించి తమ దొడ్డ మనసును చాటుకున్న శ్రీ లయన్ విజయకుమార్ గారు, కృష్ణ వల్లభనేని గార్లకు తెలుగు భాషాభిమానులందరు బుుణపడి ఉంటారు. శ్రీ లయన్ విజయకుమార్ గారు తెలుగు సాహిత్యాభిమాని. ఎందరి పుస్తకాలకో ఆర్థిక సహాయం అందించారు. పలు సేవా కార్యక్రమాల్లో తన ధాతృత్వాన్ని చాటుకుంటున్నారు. వీరంతా శ్రీ సంజీవ నరశింహ అప్పడు గారికి ముఖ పరిచయం లేని వారే. అయినా తెలుగు భాష  మీద ప్రేమతో వీరంతా ఈ మహా యజ్ఞంలో తమ వంతుగా సహాయ సహకారాలందించి భాషాభిమానాన్ని చాటుకున్నారు.
         భగవదనుగ్రహం మెండుగానున్న సంజీవ నరశింహ అప్పడు గారు మరో మహతి కార్యం తలపెట్టారు. అది శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 32000 సంకీర్తనలలో ప్రసిద్ధి పొందిన 30 సంకీర్తనలను " మారిషస్ అన్నమయ్య గీతాలు " పుస్తకంగా తీసుకురానున్నారు. దాతల సహయంతో 55 వేల పుస్తకాలు ప్రచురించి ప్రపంచవ్యాప్తంగా, ఈ  పుస్తకం కావాల్సిన వారికి ఉచితముగా ఇవ్వనున్నారు. ఈ పుస్తకంలో ప్రతి కీర్తన ఐదు భాగాలుగా విభజింపబడి ఉంటుంది. మెుదటి భాగంలో సంకీర్తన తెలుగులో, రెండవ భాగంలో ఆంగ్లంలో మూడవ భాగంలో తెలుగు భావం, నాలుగవ భాగంలో ఆంగ్ల భావం, ఐదవ భాగం పుస్తకం వెనుక ఈ కీర్తనలన్ని వినడానికి వీలుగా సిడి లో పొందుపరిచి మనకు ఉచితముగా అందివ్వనున్నారు. ఈ పుస్తకం వేయడానికి ముఖ్య కారణం తెలుగుభాష తెలియని ఎంతోమంది ఈ సంకీర్తనలను రాగతాళ యుక్తంగా పాడగలుగుతున్నారు కాని భావయుక్తంగా పాడలేక పోతున్నారన్న కారణంతో ఈ అద్భుతమైన ఆలోచన చేసారు.  

           ఈ " మారిషస్ సంజీవ తెలుగు పట్టి " ఎవరికైనా తమ తమ గణన తంత్ర యంత్రములు(కంప్యూటర్) లేదా చర వాణి యంత్రము(సెల్ ఫోన్) ద్వారా ఎవరి అనుమతి లేకుండా వాడుకోవచ్చును. ఒక్క నయా పైసా కూడా మనం ఎవరికి ఇవ్వనవసరం లేదు.

          ఇప్పటి వరకు తెలుగు పట్టీలు వెలువడ్డాయి. భారత పుణ్య భూమి లో ఉన్న తెలుగు ప్రజలు వాళ్ల వాళ్ల తెలుగు చేతిరాతల నైపుణ్యము వలన ఎన్నెన్నో తెలుగు లిపులు వివిధ శైలులలో సృష్టించబడ్డాయి.అవి అన్నీ భారతీయుల చేతిలో తయారు అయ్యాయి. కాని ఇప్పుడు భారత పుణ్య భూమి యొక్క సరిహద్దులు దాటి, మన తెలుగు కళామతల్లి వారి పరిమళమైన సుమధుర సువాసనతో సప్త సముద్రాలు దాటి ఓ చిన్ని ద్వీపములో పుట్టి పెరిగిన మారీచ మహర్షి పుణ్య భూమి అయిన మారిషస్ ద్వీపములో పుట్టి పెరిగిన సంజీవ నరసింహ అప్పడు వారి తెలుగు హస్త రేఖలతో రాసిన అన్ని తెలుగు అక్షరాలు, ద్విత్వాలు, సంఖ్యలు, చిహ్నాలు ఇప్పుడు ఈ ఆధునిక సాంకేతిక పద్ధతి లో చేయబోతున్నది. తెలుగు చరిత్రలో ఈ అద్భుత సంఘటన సువర్ణ తెలుగు అక్షరాలతో రాయబడుతున్న దేశీయ  తెలుగు పట్టి ఈ " మారిషస్ సంజీవ తెలుగు పట్టి", 

   ఈ పట్టి తయారుచేయాలన్న సుమధుర ఆలోచన సంజివ నరశింహ అప్పడు గారికి ఎలా వచ్చిందంటే, తన తాతయ్య ఒక అతి పాత తెలుగు పెద్ద బాల శిక్ష అనే తెలుగు జాతికి " తెలుగు వేదం " లాంటి పుస్తకాన్ని ప్రసాదించారు. ఉభయ తెలుగు  రాష్ట్రాల్లో ఈ తెలుగు పెద్ద బాలశిక్ష అందరికిచిరపరిచితమే. 

       సంజీవ నరశింహ అప్పడు వారి తాతయ్య " ఆంధ్ర"  జనానండ సహాయ సంఘం " నడుపుతున్న దేవస్థానము మారిషస్ దేశంలో తెలుగు వాళ్ళు తొలుతగా కట్టి, విగ్రహం స్థాపించిన శ్రీ విష్ణు దేవస్థానం. వీరి తాతయ్య గారే ఆ ఆలయ అస్తానార్చకులు.         

        ఐదు సంవత్సరాల పసి వయస్సు నుంచి తాతయ్య సంజీవ నరశింహ అప్పడు వ్రేళ్ళను పట్టుకుని ప్రతి రోజు ఆలయానికి తీసుకుని వెళ్లేవారు. ఆలయంలోనే చాలా మంది తెలుగు యువతీ యువకులు తాతయ్య దగ్గర తెలుగు నేర్చుకునే వారు. సంజీవ నరశింహ అప్పడుకి తాతయ్య మాట్లాడే తెలుగు మరియు రాసే తెలుగు వలన అతనికి ఒక ప్రేరణ ఉత్సాహం ఉద్భవించింది. 

        తెలుగు యొక్క అందం మరియు తెలుగు అన్ని అక్షరాల లిపులు గుంద్రాకారంలో మాత్రమే ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న వేలాది భాషల లిపులతో పోల్చి చూస్తే తెలుగు లిపి యొక్క లిపి అన్ని అక్షరాలు తామర పువ్వులు ఉన్న దళాల ఆకారంలో మనకు దర్శనం ఇస్తాయి. శ్రీ మహా విష్ణువు, శ్రీ మహా లక్ష్మీ, శ్రీ సరస్వతీ దేవి బొమ్మలు మనకు పద్మము మీదనే దర్శనం ఇస్తాయి.ఈ కారణంగా సంజీవ నరశింహ అప్పడు గారు ఎంతో ఆసక్తితో సొంతంగా అనేక వ్యయప్రయాసలకు ఓర్చు, వినూత్న  పద్ధతి సృష్టించారు పరాయి దేశంలో తెలుగు కోసం.తెలుగు మీద ప్రేమతో. 
         మారిషస్ ద్వీపము లో ఎప్పుడైన ఎక్కడైనా ఎవరి ఇంట్లో అయినా శుభ కార్యం ఉంటే సంజీవ నరశింహ అప్పడు గారి దగ్గరకు వచ్చి, శుభకార్యం గురించి చెప్తే ప్రత్యేక ఆహ్వాన పత్రికలు చేతితో ఉచితముగా చేసి ఇచ్చి ముద్రణాలయంలో వందలాది ప్రతులు చేస్తారు. అదే విధముగా అన్ని తరగతులలో ప్రతి సంవత్సరంలో తెలుగు విద్యార్థుల కోసం ప్రతి ఒక్కరికీ విశేష తెలుగు పరీక్షల్లో  ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ప్రమాణ పత్రాలు సంజీవ నరశింహ అప్పడు గారు ఉచితంగా చేసి ఇస్తారు.
        అంతర్జాతీయ తెలుగు మహా సభలు 1990
 సం||లో మూడవ ప్రపంచ తెలుగు మహా సభలు మరియు 1994 సం||లో ప్రథమ అంతర్జాతీయ తెలుగు ఉపాధ్యాయుల మహా సభల యొక్క  అధికార చిహ్నానికి(లోగో) రూపకల్పనలు సంజీవ నరశింహ అప్పడు గారే తయారు చేసారు. ఇంకా అనేక తెలుగు సభలకు, మారిషస్ ఆలయాల సభలకు ఆహ్వాన పత్రికల రూపకల్పన వీరే చేసారు. 

• రావి ఆకుల మీద చిత్రాలతో సంజీవ నరశింహ అప్పడు గారి కీర్తి ప్రపంచ స్థాయికి  ఎదిగింది. గిన్నీస్  అంతర్జాతీయ ప్రసిద్ధి పుస్తకంలో ఈయన పేరు నమెాదయ్యింది. ఎందుకంటే " తెలుగు సాంస్కృతిక వారసత్వం అనే శీర్షిక తో తెలుగు తనం, తెలుగు ధనం, తెలుగు ధర్మం గురించి 1400ల బొమ్మలు రావి ఆకుల మీద గీశారు. ఎవరైనా తనని అడిగితే అవి కూడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎంతో సహృదయంతో తెలుగు మీద భక్తితో, అడిగిన వారికి అందిస్తారు.ముఖ పుస్తకములో సంజీవ నరశింహ అప్పడు గారి తెలుగు కళలు మనం చూడవచ్చు. 

      వీరిని సంప్రదించడానికి ముఖ పుస్తకము ద్వారా : Sanjiva Narasimha Appadoo
అతని వాట్సాప్ చరవాని సంఖ్య(వాట్సప్ నెంబర్):
±౨౩౦౫౭౬౯౫౬౭౬
23057695676
సంజీవ యొక్క విద్యుల్లేఖ విలాసము (ఈమెయిల్ ఐడి) :
simhasan1008@yahoo.com

• ఎవరైనా మీ పేరు పన్నెండు వివిధ రంగుల కలములతో గీయమని అడిగితే, తెలుగు మీద ప్రేమతో ఉచితముగా ఆనందంతో చేసి ఇస్తారు.

           ఇంతటి మహోన్నత తెలుగు భాషాభిమానికి ఈ నాలుగు మాటలు ఉడుతాభక్తిగా సమర్పిస్తూ...యావత్ ప్రపంచ తెలుగు వారందరి తరపునా హృదయపూర్వక శుభాభినందనలు. 

         
               

3, డిసెంబర్ 2020, గురువారం

రైతు రాజీనామా...!!

జీవన చదరంగంలో
ఎప్పుడూ ఓడిపోతోంది రైతే
రాజకీయ కుతంత్రాలకు
అనాది నుండి నష్టపోతూనే ఉన్నా
నలుగురి ఆకలి తీర్చాలన్న ధ్యేయంతో
అప్పు చేసి వ్యవసాయం చేసినా
కనికరించని వరుణుడు
సహకరించని ప్రకృతిల నడుమన నలుగుతూ
బాలారిష్టాలన్నీ దాటినా
దళారుల దురాగతాలకు
అయినకాడికి పండిన పంటను  
అమ్ముకోవలసి దుస్థితి నేడు

తాను కష్టపడి పండించి పంటకు
సరైన ధరను నిర్ణయించలేని రైతన్న 
చెమట చుక్కలను తిండి గింజలుగా మార్చి
అందరి ఆకలిని తీరుస్తున్న
రైతంటే ప్రతి ఒక్కరికి చిన్నచూపే
కాయకష్టానికి కనీస కూలి గిట్టని రైతన్న
కడుపు మండి పంటకు శలవు ప్రకటిస్తే
ఆ పరిణామమెలా ఉంటుందో 
ఊహించగలమా... 

ఓటు కోసం 
నోటు కోసం
సన్నకారు చిన్నకారు రైతుల
కడుపు కొట్టే రాజకీయ నాయకుల 
దురాగతాలను అడ్డుకోవడానికి
మార్చండి రాజ్యాంగం
రైతుకు ఇవ్వండి హక్కు
తన పంటకు తానే ధర నిర్ణయించే అధికారం
అదే సమన్యాయం
అప్పుడే సమ సమాజ నిర్మాణం...!!

30, నవంబర్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం..30

     శేషయ్యతాత మనవడు చిన్నోడి కార్ లో మా తాతయ్య, పసి అక్కతో మేము శ్రీశైలం బయలుదేరాం. మా ఇంటి ఓనర్ పాపక్క వాళ్ళ  నాన్న బసవపూర్ణయ్య తాత మౌర్యకి 500 ఇచ్చాడప్పుడు. దారిలో విజయవాడలో అమెరికా వెళ్ళడానికి H1B వీసాకు కావాల్సిన పేపర్లన్నీ నాన్న ఫ్రెండ్ మంతెన నరసరాజు అంకుల్ కి పోస్ట్ చేసి శ్రీశైలం బయలుదేరాం. మేం ఘాట్ రోడ్ దగ్గరకు వెళ్ళేసరికి రాత్రి పది అయ్యిందనుకుంటా. వాళ్ళు అడవి లోపలికి వెళ్ళడానికి వదలలేదు. పులులు అవీ ఉంటాయని. మెుత్తానికి వీళ్ళు ఏదో చేసి ఆ అర్ధరాత్రి బయలుదేరాం గుడిని చేరుకోవడానికి. దారి మధ్యలో ఒక్కరు మాట్లాడలేదు. ఇంతలో మా కార్ లో నీళ్ళు పోయాల్సివచ్చింది. దిగాలన్నా భయమే. మెుత్తానికి భయం భయంగానే నీళ్ళు తెచ్చి పోసారు. ఏమి ఇబ్బందులు లేకుండానే గుడికి చేరుకున్నాం.  
       మౌర్యకు అన్నం ముట్టించడానికి అక్కడ పాయసం వండడానికి కుదరలేదు. రాఘవేంద్ర పూజారితో మాట్లాడి, చక్రపొంగలి చేయించి, అమ్మవారికి నైవేద్యం పెట్టించి అప్పుడు అన్నం ముట్టించాము. అప్పటికే పాపం మౌర్య బాగా ఆకలితో ఉన్నాడు. వెండిగిన్నెలో చక్రపొంగలి, భగవద్గీత, పెన్ను, బంగారం ఇలా ఏవేవో పెట్టారు. వీడు బాగా ఆకలి మీదున్నాడుగా, అన్నం గిన్నె మీద మెుదటిగా చేయి వేసేసాడు. తర్వాత పుస్తకం, పెన్ను పెట్టుకున్నాడు. శ్రీశైలం గుడిలో అద్దాల గది బాగా నచ్చింది. పెద్ద మర్రిచెట్టు గుర్తుంది. బయట నంది మీద కూర్చోబెట్టి ఫోటో తీద్దామనుకుంటే మౌర్య బాగా ఏడుపు. అందరు నవ్వుతున్నప్పటి ఫోటోలు దాచుకుంటారు. అందుకని నేను బాగా ఏడుస్తున్న ఫోటో తీసాను. అంతా బాగా జరిగింది.తిరుగు ప్రయాణంలో ఏవేవో చూసుకుంటూ వస్తున్నాం. ఓ చోట రెండు కోతులు ముద్దు పెట్టుకుంటూ కనిపించాయి. చిన్నోడిని అక్కడ నిల్చోమని ఫోటో తీసాను. తర్వాత ఇంటికి వచ్చే దారిలో మా తాతయ్య మేనకోడలు కుమారక్క వాళ్ళు వినుకొండలో ఉంటే, వాళ్ళింటికి వెళ్ళి, చక్రపొంగలి ప్రసాదం ఇచ్చివచ్చేసాము. విజయవాడలో కుమారక్క వాళ్ళ  పెద్దమ్మాయి లక్ష్మిని అర్ధరాత్రి లేపి చూసి, ఇంటికి చేరాము. 
        తర్వాత నాకు అవనిగడ్డలో పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టారని ఎవరో చెప్పారు. సరే జాబ్ ట్రై చేద్దామని అనుకుని నాన్నకు కూడ చెప్పాను. నా చిన్నప్పటి క్లాస్మేట్, క్లోజ్ ఫ్రెండ్ అయిన కళ్యాణి వాళ్ళ బావగారు, నవ జీవన్ స్కూల్ ఓనర్ అయిన ఈశ్వరరావు గారిని, జయ అక్కను కలిసాను ఈ విషయమై.మా తాతయ్య చెల్లెలి కూతురు(మేనకోడలు) లక్ష్మి అక్క కొడుకు రమణ తీసుకువెళ్ళాడు అవనిగడ్డ వీళ్ళని కలవడానికి.  బావగారు చెప్పారు కాలేజ్ వాళ్ళకు. కాలేజ్ కి వెళ్ళి ప్రిన్సిపల్ సర్ ని కలిసాను. టైమింగ్స్ సంగతి ఏంటని అడిగారు. బాబుకి ఆరవనెల. మెల్లగా అలవాటు చేస్తాను వదిలుండటానికి. కొన్ని రోజులు 2 అవర్స్ చెప్తాను అని చెప్పాను. ఆయన కూడా చాలా కన్విన్సింగ్ గా ఫీలయ్యారు. ఫిజిక్స్ చెప్పమన్నారు. కాని అప్పటికే కాలేజ్ స్టార్ట్ అయ్యి చాలా కాలమయ్యింది. చెప్పాల్సిన సిలబస్ చాలా ఉంది. సరే రేపటి నుండి వస్తానని చెప్పి వచ్చేసాను. అప్పటికి నా కొడుకుని వదిలి రెండు గంటలయ్యింది. ఇంటికి వెళ్ళగానే మెడ చుట్టూ చేతులు వేసేసి మెుహమంతా చుట్టేసాడు వెధవ. ఆ కాసేపటికే ఎంత బెంగ పడిపోయాడో. అందరు వాడు చేసినది చూసి బాగా నవ్వేసారు. మరి రేపటి ఫిజిక్స్ క్లాస్ కి ప్రిపేర్ అవ్వాలి కదా. అందులో ఎప్పుడో మర్చిపోయిన ఇష్టమైన ఫిజిక్సాయే. 

ఎప్పుడో ఓసారి తప్పదు ఎవరికైనా. జీవితంలో కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలి. అది నాకు ఇప్పుడే మెుదలైంది. ఎన్నింటిని వదులుకున్నా నా మీద నాకున్న నమ్మకాన్ని అస్సలు వదులుకోలేదు ఎప్పుడూ. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

29, నవంబర్ 2020, ఆదివారం

భాషాభిమానం..!!

           మారిషస్ పేరు అందరికి చిరపరిచితమే. దక్షణాఫ్రికా దగ్గరలో ఓ చిన్న దీవి.  అక్కడున్న జనాభా కూడా పరిమితమే. ఆ పరిమిత జనాభాలో కూడా తెలుగువారు ఉన్నారు. ప్రపంచమంతా మన  తెలుగువారు ఉన్నారన్నది అందరికి తెలిసిన విషయమే. తెలుగువారయినా అందరికి తెలుగు ఇష్టమై ఉండాలన్న నియమం లేదు ఈ రోజుల్లో. 
   తెలుగు భాష మీద అక్కరతో, ముత్తాతల మూలాలైన తెలుగును తాను నేర్చుకుని, తన చుట్టూ ఉన్న వారికి నేర్పుతూ, తెలుగు భాషకు ఎనలేని సేవలందిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి సంజీవ నరసింహ అప్పడు గారు అందరికి సుపరిచితులు. మారిషస్ లో చక్కని తెలుగు కార్యక్రమాలు చేస్తూ, పిల్లలకు తెలుగును నేర్పుతూ, తెలుగు భాషను దశదిశలా వ్యాపింపజేస్తున్నారు. వారికి ప్రత్యేక అభినందనలు. 
      మాతృభాష ఆవశ్యకత గురించి ఎంత బాగా చెప్పారంటే.. " మనం ఏ భాషలో విన్నా ముందుగా మన మాతృభాషలోనికి తర్జుమా చేసుకుని, దానికి అనుగుణంగా ఇతర భాషల్లోనికి అనువదించుకుంటాం. " ఇది అక్షరాలా నిజం కూడా. 
తెలుగు అన్య భాషయినా మారిషస్ ప్రభుత్వం తెలుగు భాషకు ఎంతో గుర్తింపునిచ్చి, తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడుతోంది. 
      మనం తెలుగు రాష్ట్రంలో ఉండి, మన మాతృభాష తెలుగై ఉండి కూడా తెలుగును తెర మరుగు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అనుకోకుండా ఈ మధ్యన నేను హాజరైన రెండు కార్యక్రమాలు పరాయి దేశాలైనా అక్కడి ప్రజలు తెలుగును ఎంతగా ఆదరిస్తున్నారో చూసిన తరువాత చాలా సంతోషమూ వేసింది. అలాగే చాలా సిగ్గుగా కూడా అనిపించింది. మనమేమెా తెలుగు మాట్లాడటం వలన ఉపయెాగమేముందని అనుకుంటున్నాం. అమెరికాలోని అట్లాంటాలో తామా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బాల పలుకులు, పద్యాలు కార్యక్రమం విజయవంతం కావడం వెనుక అక్కడి పిల్లల తల్లిదండ్రుల పాత్ర ఎంతైనా ఉంది. అలాగే మారిషస్ లో తెలుగు వెలుగుకు కారణం మన సంజీవ నరసింహ అప్పడు గారు. నాకయితే వారు చెప్పిన మాటలు విన్న తరువాత వారి మీద చాలా ఈర్ష్య కలిగింది. అంత మంచి ప్రభుత్వం వారికి ఉన్నందుకు. 
       అమ్మ విలువ తెలియని వాడికి అమ్మభాష గురించేం తెలుస్తుంది? అధికారం అశాశ్వతమైనది.అమ్మ ఎప్పటికి అమ్మే. పరిపాలన అంటే కూల్చడమే కాదు.  కనీసం మాతృభాష గౌరవాన్ని కాపాడగలగడం. 
టోరి తెలుగు  రేడియెా లో మారిషస్ లో తెలుగుతల్లి ప్రేమ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, తెలుగు వెలుగులను పంచిన సంజీవ నరసింహ అప్పడు గారికి మనఃపూర్వక ధన్యవాదాలు...

27, నవంబర్ 2020, శుక్రవారం

సాక్షాత్కారం...!!

మెలకువ కలలో 
ఊహకందని ప్రయాణం 
ఎక్కడికో మెుదలైంది
అర్థం లేని ఆలోచనల 
ఆత్రానికి అడ్డుకట్టలు
వేయడమెందుకని 
స్వేచ్ఛగా వదిలేసాను
పరిచితులతో పాటుగా
అపరిచితులెందరో
కనిపించి కబుర్లు చెప్పారు
వారిలో కొందరితో 
బాధ్యతల బరువుతో
కష్టంగా గమనం సాగింది 
దారి తెలియని 
గమ్యం వైపుగా
అడ్డంకులను అధిగమించి 
బోలెడు శ్రమకోర్చి 
చేరలేనుకున్న మజిలీ లోపలికి 
ప్రవేశం లభించింది ఆఖరి క్షణంలో
జనం లోనికి తోసుకుంటూ
వస్తూనే ఉన్నారు 
ఇసుక వేసినా రాలనంతగా
ఆ జన ప్రవాహం చూసి
భయంతో వెనుదిరిగి 
పోదామని పక్కకు జరిగి
వెనకడుగు వేయబోయా
అడుగు వెనక్కి పడలేదు
అంతలో..
ఒక్కసారిగా చిమ్మచీకటి 
ఆ వెంటనే మెల్లగా వెలుగురేఖలు
నా చుట్టూ మునుపెన్నడూ చూడనటువంటి
అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది 
అరుదైన సుందర కట్టడాలన్ని 
ఒకే చోట కనిపిస్తూ...  
నిజమా కలా అన్నట్టుగా
అవి చూస్తుంటే మాటలు కరువై
మదిలో ఏదో చెప్పలేని ప్రశాంతత
అంతలోనే గెలుపోటముల పిలుపులు
పరిచయస్థుల విజయనామాలు
ఆ ఆనందంలో అందరితో
అలా ముందుకు సాగుతుంటే
కనిపించి కనిపించని రూపంగా
షిరిడిసాయి రూపం 
నేనున్నానని అభయమిస్తూ
మనసంతా నిర్భయమైంది
తదుపరి నడకంతా 
సందేహం లేకుండానే
ధైర్యంగా ముందడుగు...!! 

26, నవంబర్ 2020, గురువారం

అసంబద్ధ జీవితాలు..!!

నేస్తం, 
    ఏవిటో ఈమధ్యన ఈ పదం బాగా గుర్తుకు వచ్చింది. మన దైనందిన జీవితాల్లో కూడా ఈ అసంబద్ధత చోటు చేసుకోవడం బాధాకరం. త్యాగరాజు గారన్నట్టు " సమయానికి తగు మాటలాడు..." కీర్తననే తమ పనులు కానిచ్చుకోవడానికి చాలా మంది పాటిస్తున్నారు. మార్పు మంచిదే. కాని అదే మార్పు తుఫాన్ ప్రభావంలా కొందరి జీవితాలను అతలాకుతలం చేస్తుంది.  మరి కొందరి జీవితాలకు ఎదుగుదల కూడా అవుతుంది. తుఫాన్ మూలంగా నష్టమే కాని లాభం ఎలా అన్న నీ ప్రశ్నకు సమాధానం నేను చెప్పాలంటావా. జరిగిపోయిన సంఘటనలను కాస్త తరచి చూడు. సాక్ష్యాలతో సహా సమాధాన సమాచారం దొరుకుతుంది. వెలుగు కొందరికి సంతోషం. చీకటి మరి కొందరికి ఆనందం. ఆయా సమయాల్లో ఎవరి పనులు వారివి కనుక. 
        ఏ విషయాన్నైనా ఆచరించి చెప్పేవారు బహు అరుదు. సూక్తులదేం వుంది. సవాలక్ష సూక్తులు ఉన్నాయి. ఒకప్పుడు మన రాయల పెదబాల శిక్ష, సుమతి, వేమన వంటి బోలెడు శతకాల్లోనూ, చిన్నయసూరి పంచతంత్రములోను ఇంకా బోలెడు పుస్తకాల్లో దొరికేవి చదవాలన్న అభిలాష కలవారికి. ఇప్పుడంతా కష్టం లేకుండా జూకర్ గారి పుణ్యమా అని మనకు తెలియని సూక్తిసుధలు కూడా చాలా తేలికగా ( బరువుగా కాదండోయ్) ముఖపుస్తకంలో దొరికేస్తున్నాయి. చెప్పడానికేముందండి వినేవాడుండాలి కాని. మన రాజకీయ నాయకుల దగ్గర నుండి సామాన్య పౌరులు వరకు అందరూ ఈ సూక్తిసుధలకు అర్హులే. 
          మన జీవితం ఏంటన్న ఆలోచన లేకుండా, ఎంతసేపు పక్కింటి పురాణం కోసమే మన తపనంతా. ఎదుటివారి గురించి తెలుసుకుంటే, వారి అనుభవాల నుండి మనం ఎంతో కొంత నేర్చుకోగలిగితే, అది మన జీవన మార్గం సుగమం కావడానికి పనికివస్తుంది. అలాకాకుండా లోపాలు వెదకడం, అవహేళన చేయడమే పనిగా పెట్టుకుంటే మన చిట్టా మెుత్తం బయటబడుతుందన్న చిన్న లాజిక్ మర్చిపోతే ఎలా? 
          ప్రతి మనిషికి ఓ హద్దు అనేది ఉంటుంది. మనమెంత ఎదిగినా మన పరిధి మర్చిపోకూడదు. మన ఇంటి భాగోతాలు మరిచి ఎదుటివారికి నీతులు వల్లిస్తుంటే, మన ముందు నవ్వకపోయినా, మన చాటున పగలబడి నవ్వుకుంటారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ..ఆఁ నన్నెవరూ చూడటం లేదులే అనుకుందట. అలా ఉంది ఈ పరిస్థితి. అసంబద్ధ జీవితాలు మనవని అందరికి తెలుసు. కొత్తగా ఎవరూ బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. 
        నూటికి తొంభైతొమ్మిది మంది తల్లిదండ్రులు బిడ్డల బాగు కోరుకుంటారు. ఈ తల్లిదండ్రుల బిడ్డలలో ఎంతమంది కన్నవారి బుుణం తీర్చుకుంటున్నారో నిజంగా మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. ఈరోజు లక్షల జీతాలు తీసుకుంటున్నారంటే అది మీ తల్లిదండ్రులు మీకు పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోండి. ఈరోజు మనం చేసినదే రేపటిరోజున వడ్డీతో సహా మనకు గిడుతుంది. పాతదే అయినా మరోసారి గుర్తు చేయక తప్పడం లేదు. తాతకు పెట్టిన ముంత తల వైపునే ఉంటుంది అని. 
      చంపడం, చావడం బహు విధములు. శారీరక హత్యలకు సాక్ష్యాలుంటే, అదీ న్యాయవాదులు న్యాయం కోసం నిలబడితే చాలా వరకు శిక్షలు పడతాయి. మరి మానసిక హత్యల సంగతేంటి? పూర్తిగా మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న మనిషిని మానసిక హింస ద్వారా దాదాపు ఓ సంవత్సరంలో చంపేయడం సాధ్యమంటే నమ్మగలరా ఎవరైనా! మరి ఈ మానసిక హంతకులకు మన న్యాయస్థానాలు ఏ శిక్షలు విధిస్తాయి? మన న్యాయమూర్తులకు కావాల్సింది సాక్ష్యాలే కదా. ఇక ఆత్మహత్యల విషయానికి వస్తే, ఇంతకు ముందు నాకో దురభిప్రాయం ఉండేది. బతకడానికి ధైర్యం లేనోళ్ళు అలా నిర్ణయం తీసుకుంటారని. నాకు అలా చనిపోయిన వాళ్ళంటే చాలా కోపం కూడానూ. ఇప్పుడనిపిస్తోంది ఛీదరింపులు, ఛీత్కారాల మధ్యన రోజూ చస్తూ బతకడం కన్నా బలవంతంగానైనా చావడమే మంచిదని. కళ్ళ ముందే ఎన్నో జీవచ్ఛవాలను, కనీసం మానవత్వం లేని దిగజారుడు మనుష్యులను చూసాక కొన్ని విషయాల్లో ఆత్మహత్యలు సబబే అనిపించింది. 
    సంపాదన ఉండగానే సరికాదు. మన బాధ్యతలను గాలికొదిలేసి, మనం జల్సాగా బతికేస్తే సరిపోదు. కనీసం మన కన్నవారికి ఓ ముద్ద పెట్టగలగాలి. ఈ విషయంలో తప్పు మన ఇంటికి వచ్చిన వారిదని చాలామంది తప్పించుకుంటారు. అది కానేకాదు. అమ్మాబాబుకి కూడు పెట్టడం బిడ్డల బాధ్యత. మనకీ ఇష్టం లేకపోతేనే కదా ఎదుటివారి మీదకి నెట్టి మనం సేఫ్ సైడ్ ఉండాలనుకుంటాం. మనం తినే ప్రతి ముద్దా వాళ్ళు వేసిన భిక్షే. కోట్లు ఉండగానే సరికాదు. ఆ కోట్ల ఉపయెాగం దేనికో తెలుసుకోండి. 
       కొన్ని రోజులుగా కొందరంటే చాలా అసహ్యంగా ఉంది. అలాంటి వాళ్ళ గురించి రాయాలన్నా అక్షరాలు కూడా సిగ్గుతో తలను వంచుకుంటాయి. దయచేసి సహజ మరణాన్ని అందించండి. శిక్ష లేదని మానసిక హత్యలకు పాల్పడకండి. ఈ విషయాల్లో ఎవరు నొచ్చుకున్నా నాకేం సంబంధం లేదు. 

          

అయెామయం...!!

చేరాల్సిన 
గమ్యమేమిటో 
తెలియదు

అడుగేయాల్సిన
గమనమెటో
గుర్తుకేరాదు

అందలమెక్కాలన్న
ఆశేమిటో
నిలువనీయదు

చెప్పాలన్న
మాటేమిటో
గొంతునీడదు

చూపాలనుకున్న
మనసేమిటో
కనబడదు

వద్దనుకున్న
బంధాలేమిటో
వదలవు

కావాలనుకున్న
అనుబంధాలేమిటో
కడకు చేరవు

అర్థం కాని
ఈ అయెామయమేనేమెా
జీవితమంటే..!!

24, నవంబర్ 2020, మంగళవారం

సాగర్ శ్రీరామ కవచం గారి కవితకు విశ్లేషణ

సాగర్ శ్రీరామ కవచం గారి కవిత... 
అతిధి గృహంలో,,,,,, 
-------===----====-----=
ఈ గాలీ, నీరు, నేల, సూన్య  ఆకాశం 
ఈ సమస్థానికి మనం అతిధుల మేనా 
నిజంగానో, అభద్ధంగానో దిష్టి బొమ్మలమై 
*-*****
పెద్ద గాయాలవుతున్నాయి 
నొప్పి తెలీటం లేదు 
బాధలు చుట్టుముడ్తూన్నాయి 
అయినా శవంలా ఒంటరిగానే 
*****
నాలోని శవానికి అంత అద్దెకట్టి 
నిజానికి నేనే మోస్తూన్నాను రోజు రోజునా 
----*****---
రేపు ఎప్పటి మాదిరే ఓ చిల్లి పడవలో 
ఊళ్ల  మాదిరే నగరాలు 
ఖాళీ అవుతాయి, ఓ తెలీని వుచ్చులో 
---*******---
మీరూ ఏమీ పట్టించుకోరు 
అంతే, ఓ సూన్య ప్రాంతంలో 
ఓ శవం మాదిరే నేలకో, నిప్పుకో 
మీరూ నాలానే అతిధులేనా ఓ సెల్ఫీతో 
ఓ సూన్య పాత్రతో, పాత్రోచిత నాట్యంతో 
ప్రాచీన అతిధి గృహంలో ------
  
సాగర్ శ్రీరామకవచం

అతిధి గృహంలో...నాదైన విశ్లేషణ 

చదువరులకు మెుదట్లోనే ఓ ప్రశ్న సంధిస్తారు ఈ విధంగా...ఈ అందమైన  సమస్త ప్రకృతికి  మనం నిజంగానో, అబద్ధంగానో దిష్టి బొమ్మలమేనా..? అని. 

శరీరానికి తట్టుకోలేనంతగా పెద్ద పెద్ద గాయాలవుతున్నా నొప్పి తెలియడం లేదు, శారీరకంగానో, మానసికంగానో భరించలేని బాధలు చుట్టుముడుతున్నా ఒంటరిగానే ఉండిపోయాను జీవం లేని కట్టెగా అనడంలో ఓ నిర్వేదం ధ్వనిస్తుంది. దానిలోనే ఓ తత్వమూ బోధ పడుతుంది. శ్వాస లేని శరీరానికి ఇహమూ, పరమూ తేడా లేదన్న నగ్న సత్యం ఇది. 

అంతలోనే మరో సందేహత్మకమైన ప్రశ్న...ఇన్ని ఇబ్బందులు పడుతూ కూడా, ఎందుకు ఈ జన్మ?  ఎందుకూ కొరగాని ఈ దేహానికి కావాల్సిన భౌతిక అవసరాలు తీర్చే మార్గాల కోసం నిరంతరం అన్వేషిస్తూనే ఉండటం ఎందుకని.  

ఒక్క మాటలో కవి మాటిది. 
బతికున్న శవానికి రోజూ అద్దె కట్టడం ఎందుకు? 

కాలచక్రంలో నిరంతరం జరిగే మార్పులు, చేర్పులు జరిగిపోతూనే ఉంటాయి ఏ అవాంతరాలు లేకుండా. చావు, పుట్టుకలు ఏ అడ్డంకులు లేకుండా,ఎవరితో సంప్రదింపులు జరపకుండా నిరంతరాయంగా జరిగిపోతుంటాయి. కొత్త కొత్త రోగాలతో పల్లెలు, నగరాలన్న తేడా లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా మృత్యువు దాని పని అది చేసుకుపోతుంది జాలి, దయ లేకుండా. 
మన కళ్ళ ముందే ఇవన్నీ జరుగుతున్నా మనకేమీ పట్టనట్టుగా ఎవరికి వారుగా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోతాం. మనలోనూ జీవం లేదేమెానన్నట్లుగా బతికేస్తుంటాం. శూన్యం నిండిన మదిని, జీవన నాటకానికి సమాయత్తం చేస్తూ, పంచభూతాలకు మనమూ ఓ అతిధిలానే అన్నట్టుగా మనల్ని మనమే చూసుకుంటూ...ఆధునిక భాషలో కని చెప్పినట్టుగా ఓ సెల్ఫిలా..ఇప్పటి పరిస్థితులకు అద్దం పట్టింది ఈ కవిత.

23, నవంబర్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం...29

    పసి అక్క వాళ్ళింట్లో ఇరవై రోజులు ఉండి వేరే ఇల్లు చూసుకుని వెళిపోయాం. మా అమ్మ చిన్నప్పుడు చదువు కోసం ఉన్న వాళ్ళింటికే మేము మౌర్యతో వెళ్ళడం కాకతాళీయంగా జరిగింది. నాంచారయ్య బాబాయి, పాప అక్క వాళ్ళు మౌర్యని వాళ్ళింట్లో మెుదటి మనుమడిలానే ఆడించేవారు. మా ఎదురింటి శాండు మామ్మ, తాతయ్య ఇలా ఆ బజార్లో అందరికి మౌర్య బాగా ఇష్టుడైపోయాడు. మా వాళ్ళు అందరు ఏదో మెుహమాటానికి అప్పుడప్పుడూ వచ్చి చూసి వెళ్ళేవారు. మా పెద్దాడపడుచు నా పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు, నా సామాన్లు అన్నీ వేసి పంపేసింది. కాని ఓ బాగ్ మాత్రం ఇప్పటికి ఇవ్వలేదు. అవేంటంటే ఇంజనీరింగ్ లో నా ప్రాజెక్ట్ వర్క్ రికార్డ్, కొన్ని పుస్తకాలు, ఇంకేం ఉన్నాయెా నాకు గుర్తు లేదు. వాటి కోసం నేను ఆవిడ దగ్గరకు వెళతానని అనుకుందనుకుంటా. ఉద్యోగం కోసం అవి కావాలి కదా అప్పట్లో. దైవాధీనముగా సర్టిఫికేట్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి. అన్నీ పంపినావిడ అవి మాత్రం పంపలేదు ఇప్పటికి. నేను అడగనూ లేదు. బాగా మెుండిదాన్ని కదా. నాకు ఆత్మాభిమానం కాస్త ఎక్కువే. 
    మా జ్యోతి అన్నయ్య మాత్రం నా పెళ్ళి అయిన తర్వాత రావివారిపాలెం వచ్చి వెళ్ళాడు. తర్వాత మౌర్య పుట్టిన వెంటనే వదిన, అన్నయ్య ఇద్దరు రావివారిపాలెం వచ్చి చూసి వెళ్ళారు. నా మేనల్లుడు చిన్నవాడైనా నరశింహాపురం రాగానే మంజు అత్తని చూడాలని గోల గోల చేస్తే మా శేషారత్నం మామ్మ తీసుకువచ్చి మౌర్యని చూపించింది. వాడు 500 మౌర్యకి ఇచ్చాడు కూడా. 
       అన్నట్టు ఇక్కడో విషయం చెప్పడం మర్చిపోయా. మౌర్య పుట్టక మునుపే మా మరిది పెళ్ళి కుదిరింది. డెలివరీ డేట్ చెప్పాక వాళ్ళు పెళ్ళి తేది మార్చుకున్నారు. వాళ్ళ అక్కాబావలకు పెళ్ళికి చెప్పడానికి రావివారిపాలెం వచ్చి, మౌర్యని చూసి వెళ్ళాడు. అక్కని రమ్మని మాట వరుసకు కూడా చెప్పకపోయినా ఆ తమ్ముడంటే ఉన్న ఇష్టంతో పెళ్ళికి వెళ్ళింది. మేము నరశింహాపురం వచ్చేసాక మరిది, తోడికోడలు చుట్టాలందరి ఇళ్ళకు వెళుతూ మా ఇంటికి కూడా వచ్చి మౌర్యకు ఓ 500 ఇచ్చి వెళ్ళారు. 
       మా పెద్ద పెదనాన్న కొడుకు రాజా అన్నయ్య నా పెళ్ళైన తర్వాత సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. నేను సెండాఫ్ అవనిగడ్డలో ఇచ్చాను. ఆ తర్వాత మా పెద్ద పెదనాన్న వాళ్ళందరు రావివారిపాలెం వచ్చి వెళ్ళారు. మేము ఈ ఇంటికి వచ్చాక రాజా అన్నయ్య సౌత్ ఆఫ్రికా నుండి వచ్చి, మౌర్యని చూడటానికి వెళుతున్నానని కోడూరులో అందరికి చెప్పాడట. ఎందుకనుకున్నారూ... ఈ మాట చెప్పింది 500 కి చిల్లర కోసమట. మౌర్యని చూడటానికి వచ్చి 200లో, 300లో ఇచ్చాడు. నాకు గుర్తు లేదు. తర్వాత వెంటనే అన్నయ్యకు కొడుకు పుడితే అమ్మ చూడటానికి పెద్దమ్మతో మాచర్ల వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేసి వచ్చింది. అప్పుడు మౌర్యకు మూడో నెల. శాండు మామ్మ మౌర్యకు నీళ్ళు పోయడానికి కాళ్ళ మీద వేసుకుంటే ఒకటే ఏడుపు. వాడికి నేనే స్నానం చేయించుకున్నాను అమ్మ వచ్చే వరకు. 
         పసి అక్క వాళ్ళ చిన్నోడు, సరు వాళ్ళ తరుణ్ యుకేజి చదువుతున్నారనుకుంటా అప్పుడు. సాయంత్రం పూట నా దగ్గరకు చదువుకోవడానికి వచ్చేవాళ్ళు. మౌర్యకు 4వ నెల వచ్చాక ఓ రోజు మంచం మీద నుండి పడిపోయాడు. మంచం మధ్యలో వెల్లకిలా పడుకోబెట్టి, నేను అక్కడే బయట గడప దగ్గరకి వెళ్ళాను. ఆ వెంటనే వీడు బోర్లా పడటమూ, కిందకి పడిపోవడమూ జరిగింది. అసలు వాడెలా చివరికి వచ్చి పడ్డాడో ఇప్పటికీ ఆశ్చర్యమే నాకు. మా అమ్మ అవతల ఎక్కడో ఉంది. వచ్చి ఇక నన్ను ఎన్ని తిట్లు తిట్టిందంటే చెప్పలేను. అప్పటి నుండి ఇప్పటికి పిల్లల కోసం అప్పుడప్పుడూ నన్ను తిడుతూనే ఉంటుంది. 
       మా తాతయ్య మా ప్రియను (మేనమామ కూతురు) తీసుకువస్తూ ఉండేవాడు. మౌర్యకు దానికి సంవత్సరం నర్ర తేడా. వస్తే చాలు ఇక్కడే 
ఉంటా వెళ్ళననేది. దానికి స్నానం చేయించి వీడికి పెద్దవైన బట్టలు దానికి వేసేది అమ్మ. ఆ మాటా ఈ మాటా చెప్పి బలవంతంగా ఇంటికి పంపేవాళ్ళం మళ్లీ వద్దువుగాని అని చెప్పి. అమ్మ మౌర్య పుట్టక మునుపే మేము మద్రాస్ లో ప్రియ ఆపరేషన్ అయ్యాక మాంగాడుతల్లి గుడికి వెళ్ళినప్పుడు అబ్బాయి పుడితే శ్రీశైలంలో అన్నం పెడతానని మెుక్కుకుందట. మౌర్యకి 6వ నెల 6వ రోజు అన్నం శ్రీశైలంలో పెట్టాలని అనుకున్నాం. 

      అహానికి, ఆత్మాభిమానానికి మధ్యన జరిగే యుద్ధంలో గెలుపోటములు ఎవరిని వరించాయెా కథ పూర్తయితే కాని తెలియదు.. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.....


17, నవంబర్ 2020, మంగళవారం

భూతల స్వర్గమేనా..34 ఆఖరి భాగం

పార్ట్.. 34
మా మరిది గారి కుటుంబం అలా మమ్మల్ని వారి అవసరాలకు వాడుకుని, పెట్టాల్సిన గొడవలు పెట్టేసి,  నాలుగు నెలల తర్వాత, ఆవిడకి జాబ్ వచ్చిందని వేరే ఊరు వెళ్ళారు. శౌర్యని స్కూల్లో జాయిన్ చేద్దామని ఫీజ్ కట్టాను. నా ఇంటికి వచ్చి చాలా మంది ఉండి వెళ్ళారు కాని, ఇంత దరిద్రపు పాదాలు ఎవరివి లేవు. 
గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో I 485 అయితే వచ్చింది కాని I 140 ఇంకా క్లియర్ కాలేదని, మా AMSOL కంపెనీ లాయర్ జెన్నిఫర్ కు అప్పుడప్పుడూ కాల్ చేసేదాన్ని. ఇమ్మిగ్రేషన్ సైట్ లో స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. తెలిసినవాళ్ళ ద్వారా పరిచయమైన తమ్మడు శ్యాం అమెరికా వచ్చాడు. ఉండటానికి హెల్ప్ కావాలంటే, నేను మద్రాస్ అలైడ్ ఇన్ఫర్మాటిక్స్ లో ట్రైనింగ్ ఇచ్చిన సతీష్ కి ఫోన్ చేసి చెబితే తనతో ఉంచుకున్నాడు. నేను చికాగోలో రామస్వామి దగ్గర చేసినప్పుడు తన వైఫ్ తో వచ్చి కలిసాడు సతీష్. శ్యాం హంట్స్విల్ వస్తాను టికెట్ బుక్ చేయక్కా, మనీ తర్వాత ఇస్తానంటే,బుక్ చేసాను. వాడు వచ్చి  రెండు రోజులుండి వెళ్ళాడు. 
వాడు వెళ్ళిన తర్వాత ఎందుకో ఇమ్మిగ్రేషన్ సైట్ లో I 140 స్టేటస్ చెక్ చేస్తే డినయల్ అయినట్లు వచ్చింది. వెంటనే లాయర్ జెన్నిఫర్ కి కాల్ చేసాను. I 140 డినయల్ అయితే ఆటోమేటిక్ గా I 485 కూడా కాన్సిల్ అవుతుంది. I 140  డినయల్ పై మళ్ళీ అప్లై చేయవచ్చు. కాని ఈసారి కూడా డినయల్ అయితే మీకు ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ఉండదు. ఇల్లీగల్ అవుతారు. అందుకని ఇండియా వెళ్ళిరావడం కరక్ట్ అని చెప్పింది. AMSOl బాలా ఇటికిరాల కి కాల్ చేసి విషయం చెప్తే ఏమి మాట్లాడకుండా, రాజుతో మాట్లాడండి అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. మా AMSOL ECO సుబ్బరాజు ఇందుకూరి కి కాల్ చేసాను. తను వెంటనే I 140 రి ఓపెన్ చేయించమంటే చేయిస్తాను. లేదా మీరు ఇండియా వెళతానంటే, మళ్ళీ H1B చేసి అమెరికా తీసుకువస్తాను. ఇండియాలో AMSOL లో వర్క్ చేయండి అప్పటివరకు మీకు ఇష్టమైతే అని చెప్తే, సరే ఇండియా వెళతాను, కాకపోతే L1 చేయండి H1B వద్దు అని అంటే సరేనన్నారు. ఇండియా లో అరి కేసరి చూసుకుంటున్నాడు. తను ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. మీరు కాల్ చేసి మాట్లాడండి అని చెప్పారు. అరి కేసరికి కాల్ చేసాను. ఇండియా వచ్చాక కలవమని చెప్పారు. 
క్రెడిట్ కార్డ్స్ లో కాస్త కాస్త డబ్బులు తీసి ఇండియా పంపాను. కొన్ని కార్డ్స్ డబ్బులు తీయడానికి రావు. అవి మధు వాళ్ళకు పంపమంటే పంపాను. వాళ్ళు నాకో కెమెరా కొన్నారు. ఇంకా ఎవరెవరు ఎంత తీసుకున్నారన్నది తిన్న వాళ్ళకు తెలుసు. పైనుండి చూసిన భగవంతునికి తెలుసు. షాపింగ్ అంటూ పెద్దగా ఏం చేయలేదు. నాకు శౌర్యకి ఇండియాకి టికెట్స్ ఆన్ లైన్ లో బుక్ చేసాను. సుబ్బరాజుని,  బాలా ఇటికిరాలని ఏమైనా పేపర్స్ కావాలేమెా అని అడిగితే ఏం అవసరం లేదని చెప్పారు. హంట్స్విల్ నుండి హ్యూస్టన్ కి, అక్కడి నుండి ఇండియా కి. మధ్య లో లండన్ లో మారాలి. 
రాజేష్, రాజు, మా ఆయన ముగ్గురు హంట్స్విల్ ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేయడానికి వచ్చారు. నా దగ్గర రూపాయి అదేలెండి డాలర్ కూడా ఉండదని తెలిసికూడా మా ఆయన పిల్లాడితో బయలుదేరినా ఒక్క డాలర్ కూడా ఇవ్వలేదు. రాజేష్ ఎయిర్ పోర్ట్ లో 200/300 డాలర్లు తీసి ఇచ్చాడు. హ్యూస్టన్ ఎయిర్ పోర్ట్ లో లగేజ్ చెక్ ఇన్ చేసి, బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. ఫ్లైట్ ఎక్కడానికి గేట్ దగ్గరకి వెళితే, మారిన ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం లండన్ లో ఫ్లైట్ మారాలంటే నాకు లండన్/అమెరికా వీసా ఉండాలట. కావాలంటే హంట్స్విల్ పంపేస్తాము. లండన్ వీసా పర్మిషన్ తీసుకుని, మళ్లీ టికెట్ బుక్ చేసుకోండి అని చెప్పారు. లండన్ వైపు నుండి కాకుండా వేరే వైపు నుండి ఇండియా  వెళితే వీసా అవసరం లేదు. నాకేం చేయాలో తెలియలేదు. పిల్లాడిని తెల్లవారు ఝామున లేపాను. పాపం వాడికి తిండి లేదు. వాడు ఒకటే ఏడుపు. నేనేమెా మళ్లీ లగేజ్ అంతా తీసుకోవాలి. ఏం చేయాలో తెలియక సుబ్బరాజుకి కాల్ చేసాను. ఫోన్ లో ఛార్జ్ కూడా లేదు. అంతమంది ఎయిర్ పోర్ట్ లో ఉన్నా ఎవరి దారి వారిదే. పాపం ఎవరో మళయాళీ అతను వాళ్ళ అమ్మను ఫ్లైట్ ఎక్కించడానికి వచ్చాడు. ఏమైందని నా దగ్గరకు వచ్చాడు. విషయం చెప్పాను. తన ఫోన్ తోనే సుబ్బరాజుతో మాట్లాడాను. మరుసటిరోజు కి టికెట్స్ బుక్ చేస్తానని చెప్పి, హోటల్ లో ఉండమన్నారు. లగేజ్ చాలా ఉంది. మళయాళీ అతనిది పెద్ద కార్. అతనే హోటల్ కి తీసుకువెళ్ళాడు. శౌర్యకి, నాకు కూడా బాగా ఆకలి వేస్తోంది. తినడానికి ఏమైనా తెమ్మంటే, పాపం తనకి కూడా తెచ్చుకుని, మాతోపాటే తిని, వాటికి డబ్బులు ఇవ్వబోతే కూడా తీసుకోలేదు. నిజంగా దేవుడు పంపినట్టు వచ్చి చాలా హెల్ప్ చేసాడు. ఎప్పటికి మర్చిపోలేను ఆ సాయాన్ని. మరుసటి రోజు ఇండియా బయలుదేరాము. ఇండియా వచ్చాక సాయం పొందిన వారెవరూ కనీసం కాల్ చేయలేదు. 
నా అమెరికా జీవితం ఇలా గడిచింది. అందరిది ఇలానే ఉండాలని లేదు. కాకపోతే మెాసం చేయడం అనేది ఎక్కడైనా ఉంటుంది. అవసరాలకు కోసం నమ్మించి మెాసం చేసేవారు ఎక్కడైనా ఉంటారు. మనవారు అని నమ్మితే నట్టేట్లో ముంచుతారు. చాతనైనంత వరకు  జాగ్రత్తగా ఉండటమే మనం చేయగలిగింది. కొత్తగా అమెరికా వెళ్ళేవాళ్ళకు  అమెరికా భూతల స్వర్గమేమి కాదు, కష్టసుఖాలు రెండూ ఉంటాయని చెప్పడానికే ఈ నా అనుభవాలను మీతో పంచుకున్నాను. 
నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి, ఇంత విపులంగా రాయించిన రాజశేఖర్ చప్పిడి గారికి, మీ ఇంటి మనిషిగా భావించి నా రాతలను చదివి ఆదరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.


కాలం వెంబడి కలం..28

          ఓ పది రోజులున్నాము మా పెద్దాడపడుచు ఇంట్లో. ఆ పది రోజుల్లో పిల్లాడికి నీళ్ళు అమ్మ పోస్తుంటే, ఇష్టమైతే చేతి మీద నీళ్ళు పోసేది, లేకపోతే నేనే పోసేదాన్ని అమ్మకు సాయంగా. రాఘవేంద్రేమెా ఓ పది రోజులు ఓపిక పెట్టండి. మనం హైదరాబాదు వెళిపోదాం అన్నాడు. పిల్లాడికి మా నాన్న పోలికలని ఆమె చుట్టాలతో ఎద్దేవగా మాట్లాడటం విన్నా కూడా విననట్టుగా ఊరుకున్నాం. నా ఫ్రెండ్ ఉష బాబుని చూడటానికి వచ్చి, ఓ రోజుండి వెళిపోయింది. తను వెళ్ళగానే ఈవిడ గదిలోకి వచ్చి ఏంటేంటో అని వెళిపోయింది. రాఘవేంద్ర కూడా అక్కడే ఉన్నాడు. నేనప్పుడు అన్నాను.. నేనేమైనా చేసి ఉంటే నాకు లేకపోతే ఆవిడకే అంతా అని. మరుసటి రోజు ఆవిడకు బాలేదు. ఆవిడకి నా అన్న వాళ్ళెవరు రావడం ఇష్టం లేదని అర్థం అయ్యింది.నాకెంతో చేసిన పసి అక్క కూడా రావడం తగ్గించేసింది అందుకే. 
       ఆవిడకి రెండు రోజులకి తగ్గిన వెంటనే పొద్దు పోద్దున్నే బట్టలు సర్దుకుని బయలుదేరింది ఇంట్లో నుండి వెళిపోవడానికి. నేను పడుకుని ఉండే అమ్మ వచ్చి చెప్పింది. ఏంటో బట్టలు సర్దుకుంటోంది అని. మనకెందుకులేమ్మా ఆవిడ గురించి ఏదడినా పెడర్థాలు తీస్తుంది. ఏ ఊరైనా వెళుతుందేమెాలే అని అన్నాను. వాళ్ళాయన మిల్ దగ్గర నుండి వచ్చారు. మరి ఈవిడే ఫోన్ చేసిందో, లేక రాఘవేంద్ర చెప్పాడో మాకు తెలియదు. తర్వాత కార్ పిలిపించుకుని బయలుదేరితే ఈయన వద్దని తోసేసినట్టున్నాడు. వెంటనే రాఘవేంద్ర వాళ్ళ బావ మమ్మల్ని ఇంట్లో నుండి వెళిపొమ్మన్నారు. అప్పటికప్పుడు బట్టలు సర్దుకుని, పదకొండు రోజుల పసిపిల్లాడితో ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి. నా డెలివరీకని మామయ్య మద్రాస్ వచ్చినప్పుడు ఇచ్చిన డబ్బులు కూడా, ఆయన బయట తెచ్చారని అంటే తిరిగి ఇచ్చేసాను. తర్వాత ఆయన నన్ను ఎందుకు ఇచ్చేసావు నాకు చెప్పకుండా అని అన్నారు. 
      రాఘవేంద్ర వాళ్ళ బావగారి మిల్ ఓనర్ గారి అబ్బాయిని అడిగి కార్  తీసుకువచ్చాడు. అంతకు రెండు మూడు రోజుల ముందే మిల్ ఓనర్ గారు తేనెటీగలు కుట్టి చనిపోయారు. బాబు పుట్టక ముందు మా పిన్ని వాళ్ళింట్లో ఉన్నప్పుడు నన్ను చూడటానికి కూడా వచ్చారాయన. బాబుని చూడటానికి కూడా వద్దామని బాబుకి డ్రెస్ కూడా తీసుకున్నారట. సడన్ గా ఆయనకు ఇలా జరిగింది.మేం కార్ లో బయలుదేరాం. ఎక్కడికి వెళుతున్నామెా మాకు తెలియదు. మెాపిదేవి సెంటర్ లో కార్ అవనిగడ్డ వైపు తిప్పితే నరశింహాపురం అనుకున్నాం. ఎక్కడికి వెళదాం సాంబక్కా అని రాఘవేంద్ర అమ్మని అడిగితే, నీ ఇష్టమంది. మా నాన్న వాళ్ళింటికి వెళదామంటే సరేనని ఏం మాట్లాడలేదు. నాన్న అంటే రాఘవేంద్ర నరశింహాపురంలో వాళ్ళ పెదన్నాన్న ఇంట్లో ఉండేవాడు కొన్నాళ్ళు. ఆయనని నాన్నే అంటాడు. ఏవో గొడవలు జరిగి తర్వాత బయటికి వచ్చేసాడు. కార్ మా ఇంటికి దగ్గరలోని పసి అక్క వాళ్ళింటి దగ్గర ఆపి దిగమంటే అప్పుడు అర్థం అయ్యింది. పసి అక్క వాళ్ళింటికి తీసుకు వచ్చాడని. 
             ఓ ఇరవై రోజులు పసి అక్క వాళ్ళింట్లో ఉన్నాము. పసి అక్క వాళ్ళమ్మ నాంచారమ్మామ్మ బోలెడు వెన్నపూస రాసి మౌర్యకు స్నానం చేయించేది. మా అమ్మమ్మ పాల కోసం వచ్చి బాబుని చూసి వెళుతుండేది. మా తాతయ్య కూడ వస్తుండేవాడు. ఊర్లో వాళ్ళు బాబుని చూడటానికి వచ్చేవారు. పసి అక్క, బావగారు వాళ్ళందరు ఆ ఇరవై రోజులు చాలా బాగా చూసుకున్నారు. ఆ టైమ్ లోనే సోదమ్మ వస్తే అమ్మ మళ్ళీ సోది అడిగింది. మా నాయనమ్మ వచ్చి బాబుకి తన పేరు పెట్టమని అడిగితే, నాకుంది కదా ఇంకా నీ పేరు పెట్టమంటావేంటి, పెట్టను అని అంటే కనీసం ఓ అక్షరమైనా కలిసేటట్లు పెట్టమంది. అప్పటికే మేము పేరు మౌర్య చంద్ర అని పెడదామని అనుకున్నాం. మా రెండో ఆడపడుచు ఆ పేరెందుకు పాత పేరు అని  అంటే కూడా నేను అదే పెడతానని చెప్పాను. ఆ రోజు సాయంత్రం పిల్లాడు కారణం లేకుండా గుక్కపట్టి ఒకటే ఏడుపు. మాకెవరికి అర్థం కాలేదు ఎందుకేడుస్తున్నాడో. సడన్ గా గుర్తు వచ్చిందప్పుడు. నాయనమ్మ పేరు పెట్టమంటే పెట్టనని చెప్పానని. అయినా అంత కోపం రావాలా నాయనమ్మకు, పెడదామనే అనుకున్నాం కదా, అర్థం చేసుకోకుండా పిల్లాడిని ఏడిపిస్తోందని నాకు కోపం కూడా వచ్చింది. మనసులో అనుకున్నా ఈ మాటలే. అప్పటి వరకు ఆపకుండా ఏడుస్తున్న పిల్లాడు  చటుక్కున ఏడుపు ఆపేసాడు. భలే నవ్వు వచ్చింది అక్కడున్న అందరికి. ఆవిడకు భ్రమత తీరలేదింకా అని అనుకున్నాం. 
       జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మన రీజన్ కి అందవు. అలాగే మన నమ్మకాలు కూడా అంతే. నమ్మడంలో ఆనందం ఉంటే నమ్మేయడమే. అవి  దేవుడా, దెయ్యమా, జ్యోతిష్యమా వంటివే కాకుండా సోది వంటివి కూడా. మనసుకి సంతోషం కలిగించే ఏ నమ్మకమైనా మంచిదే మరి. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఎయిర్ పోర్ట్ లో కష్టాలు ... నిజంగా దేవుడు పంపినట్టు వచ్చి సాయం చేసిన వ్యక్తి ...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి, రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఎయిర్ పోర్ట్ లో కష్టాలు ... నిజంగా దేవుడు పంపినట్టు వచ్చి సాయం చేసిన వ్యక్తి ...

16, నవంబర్ 2020, సోమవారం

మన భాషా సంస్కృతుల గొప్పదనం...!!

       మనం వద్దనుకుంటున్న మన భాషను, సంస్కృతిని విదేశాల్లో ఎంత గొప్పగా ఆదరిస్తున్నారో చూస్తుంటే పట్టరాని సంతోషం కలుగుతోంది. 
ఆదివారం పొద్దున్నే అమెరికాలోని అట్లాంటాలో దీపావళి, పిల్లల పండుగ అయిన చాచా నెహ్రూ పుట్టినరోజు నవంబర్ 14ను పురస్కరించుకొని 15న తామా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు చూడముచ్చటగా అనిపించాయి. 5 సంవత్సరాల వయసు నుండి 16 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలచే నిర్వహించిన బాల కవులు, బాల పలుకులు పోటీలు ఆద్యంతమూ రసరమ్యంగా జరిగాయి. 
  భరత్ గారి అధ్యక్షతన సాయిరాం గారు, తిరు గారు ఈ పోటీలను చక్కని వేడుకగా జరిపించడానికి చేసిన కృషి ఎన్నదగినది. నన్ను న్యాయ నిర్ణేతగా చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించినందుకు వీరికి నా మనఃపూర్వక ధన్యవాదాలు. 
       పిల్లలు చాలా బాగా పద్యాలు తప్పులు లేకుండా రాగయుక్తంగా పాడారు. ప్రతి ఒక్కరు భావాన్ని వివరించారు. పరాయి దేశంలో ఉన్నా చక్కని ఉచ్ఛారణతో వినసొంపుగా చెప్పారు. దీనికి కారణం పిల్లల తల్లిదండ్రులు. వారందరికి ప్రత్యేక అభినందనలు. పిల్లలు అందరు బాగా పాడటం, పండుగల గురించి పూర్వాపరాలు చెప్పడంతో విజేతల ఎంపిక బాగా కష్టమయ్యింది. బహుమతి రాకపోయినా కూడా పోటీలో పాల్గొన్న పిల్లలందరికి హృదయపూర్వక అభినందనలు. 
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికి ధన్యవాదాలు.

11, నవంబర్ 2020, బుధవారం

స్వ'గతం...!!

నేస్తం, 

     ఆత్మవంచన చేసుకోవడం నా అక్షరాలకు ఇష్టం ఉండదు. రాయడమైనా మానేస్తాను కాని నిజాన్ని చెప్పకుండా, ఆ నిజానికి అబద్ధపు రంగు పులమను ఎప్పుడూ. ఎవరో ఏదో అనుకుంటారనో, లేక మరేదో మాట తూలతారనో, నలుగురిలో చిన్నతనం చేస్తారనో విషయాన్ని తప్పుదోవ పట్టించలేను. అది రాజకీయమైనా, సామాజికమైనా, నా జీవితమైనా. నేను రాసేదంతా స్వ'గతం. ఏ కొందరికో తప్ప.. కుటుంబమన్నంక గొడవలు, సంసారమన్న తర్వాత ఆటుపోట్లు ఉండక తప్పదు. లేదని మనం అనుకుంటే ఇదెంత నిజమెా మనకూ తెలుసు కదా. చిన్నాచితకా బాధలు, ఆ వెనుకే సంతోషాల క్షణాల జీవితమే ఇది.
       చాలా మందికి నా రాతలు బాధ కలిగించి ఉండవచ్చు. కొందరికి తమ జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఉండవచ్చు. నా జీవితానుభవాలు రాయాలని ఎప్పుడూ అనుకోలేదు. నా ఫ్రెండ్ సిరి రాయమని అన్నప్పుడు కూడా నావల్ల కాదన్నాను. అనుకోకుండా రాజశేఖర్ చప్పిడి గారు అమెరికా అనుభవాలు రాయమంటే ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వెబ్ సైట్ లో రాయడం మెుదలుపెట్టాను. చాలా  వరకు నేను పొందిన చిన్న సహాయాన్ని కూడా రాశాను. నేను నష్టపోయిన సొమ్ము కాని, నా మూలంగా ఎవరెలా ఉన్నారన్నవి చాలా తక్కువగా రాశాను. సాయం పొందిన వాళ్ళకు, సొమ్ము తిన్న వాళ్ళకు, పైన ఆ భగవంతుడికి ఆ విషయాలు తెలుసు.  తర్వాత కవితాలయం పవన్, అంజు కవితాలయంలో ఏదైన రాయమంటే పుస్తకానుభవాలు రాద్దామని మెుదలుబెడితే అది నా జీవితానుభవాలు రాయడంగా మారింది.
       అమెరికన్ సొల్యుషన్స్ వాళ్ళు  అమెరికా, ఇండియాల్లో నన్ను ఎంతగా మెాసం చేసారన్నది నేను తెలిసిన సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో అందరికి తెలుసు. సుబ్బరాజు ఇందుకూరి నాకు చేస్తానన్నవి చేయనీయకుండా చేసి, ఆ కంపెని ఇండియాలో మూసుకుపోవడానికి ప్రధాన కారకులు, నన్ను బాగా ఇబ్బంది పెట్టిన ముగ్గురు మహానుభావులను ఎప్పటికి మర్చిపోను.
       మా ఇంజనీరింగ్ బాచ్ చాలామంది ఎవరికి వారుగా ఉన్నారు. మిగతా అన్ని బాచ్ ల వాళ్ళు వాళ్ళ వాళ్ళకి హెల్ప్ చేసుకున్నారు చాలా విషయాల్లో అది అమెరికాలోనైనా, ఇండియాలోనైనా. మరి వీళ్ళెందుకు ఇలానో.
       నా రాతలు పుస్తకాలుగా రావడానికి చాలా చాలా హెల్ప్ చేసింది నా ఇంజనీరింగ్ ఆత్మీయనేస్తాలు. మెుదటి పుస్తకం మా విశాలక్క, వెంకటేశ్వరరావు బాబాయ్ వేయించారు. రెండు పుస్తకాలు రామకృష్ణ వజ్జా గారు వేయించారు. మరో రెండు పుస్తకాలు అనిత, శోభ, నీరజ, మమత, నీలిమ కలిసి వేయించారు. రఘు యడ్ల,  అనురాధ కోనేరు చెరొక పుస్తకం వేయించారు. అందరికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు. నేను రాసే సమీక్షలను ప్రచురిస్తున్న కత్తిమండ ప్రతాప్ గారికి, గోదావరి యాజమాన్యానికి, రాయడం రాదన్న నాతో నవ మల్లెతీగలో జీవన "మంజూ"ష  శీర్షిక గత మూడు సంవత్సరాలుగా రాయిస్తున్న కలిమిశ్రీ గారికి, రాయడంలో, పుస్తకాలు వేయడంలో నన్నెంతగానో ప్రోత్సాహించిన కొండ్రెడ్డి అంకుల్, సాగర్ శ్రీరామ కవచం అంకుల్ ఇంకా మరెందరో మహానుభావులకు నా వందనాలు. నా రాతలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా మనఃపూర్వక ధన్యవాదాలు...

ఎవరైనా నా రాతల మూలంగా బాధపడితే పెద్ద మనసుతో మన్నించేయండి మరి... 😊

10, నవంబర్ 2020, మంగళవారం

భూతల స్వర్గమేనా..33

 పార్ట్..33
డాలస్ సిటీ గ్రూప్ జాబ్ అయ్యాకా, అన్ని అప్పులు పోను నా దగ్గర ఓ పది లక్షలు మిగిలాయి. అవి పెట్టి ఓ అపార్ట్మెంట్ విజయవాడలో తీసుకున్నాము. మిగతాది లోన్ తీసుకున్నాం. లోన్ కోసం క్రెడిట్ చెక్ చేస్తే చికాగోలో రామస్వామి నా పేరు మీద తీసుకున్న రెంటల్ అపార్ట్మెంట్ కి మనీ కట్టలేదని వచ్చింది. నాకు ఎవరితో చెప్పాలో తెలియక రామస్వామి వైఫ్ మాధవి అక్క బాబాయ్ నవనీత కృష్ణ గారి నెంబర్ నెట్ లో వెదికి ఆయనకు వివరం చెప్పాను. అప్పటికి రామస్వామికి ఉన్నదంతా పోయిందట. మరదలి ఇంట్లో ఉంటున్నారని చెప్పి, మాధవితో మాట్లాడతావా అని అడిగారు. ఆయనతో మాట్లాడను కదండి,అక్కంటే నాకెంత ఇష్టమైనా  అక్కతో కూడా మాట్లాడలేను, అది పద్ధతి కాదు అని చెప్పాను. తర్వాత నవనీత కృష్ణ గారు రామస్వామితో మాట్లాడితే, నన్ను బాగా తిట్టాడట. ప్రోబ్లం మాత్రం సాల్వ్ చేయించారు. ఈరోజు ఆయన లేకపోయినా ఆయన నాకు చేసిన హెల్ప్ మర్చిపోలేను. నేను ఇండియా తిరిగి వచ్చిన కొత్తలో మా కోటేశ్వరరావు మామయ్య కోసం మా ఊరు వచ్చినప్పుడు, హంసలదీవి సముద్రం దగ్గర కలిసారు. 
డాలస్ లో ఉన్నప్పుడు చేసిన బేబి సిట్టింగ్ డబ్బులు, ఇంకా కొన్ని డబ్బులు కలిపి మా ఊరు దగ్గర కోడూరులో కడుతున్న సాయిబాబా గుడిలో విగ్రహానికి విరాళంగా ఇచ్చాము. అంతకు ముందు అయ్యప్ప గుడికి కూడా అదే ఊరిలో వినాయకుడి గుడికి ఇచ్చాము. ఇండియాలో కొందరు వెధవలు..ఆఁ మనం అంత డబ్బులు ఇచ్చేపాటివారమా అని ఈయనకు లేనిపోని మాటలు చెప్పారు. ఓ రోజు పొద్దుట వాల్మార్ట్ కి ఏదో ఫోటో పిల్లలది లామినేట్ చేయడానికి ఇచ్చివద్దామంటే నేను రడి అయ్యి వచ్చేసరికి ఈయన ఫోన్ గుడగుడా మాట్లాడుకుంటున్నాడు. నేను వచ్చేసరికి ఆపేసాడు.  అప్పటికి చాలాసార్లు అలా చేసి ఉన్నాడు. నాకు బాగా కోపం వచ్చినా తమాయించుకుని సీక్రెట్స్ మాట్లాడటం అయిపోయిందా అన్నాను. దానికి ఎన్ని దెబ్బలంటే...చేతులు, కాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉపయెాగించాడు. వెధవల చెప్పుడు మాటలన్నీ మనసులో ఉంచుకున్నాడుగా. ఆ కచ్చి అలా తీర్చుకున్నాడన్నమాట. అంతకు ముందు కూడా అప్పుడప్పుడూ మగవాడి అహంకారం చూపించేవాడు. మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి నాకేమీ రాదని, నేనేమి చేయడంలేదని చెప్పడం, ఇండియా ఫోన్ చేసి జనాలకి చెప్పడం చేస్తే వాళ్ళు అప్పుడే చెప్పారు. మాకు తెలిసి మంజు ఎప్పుడూ ఖాళీగా లేదు, ఏదోకటి చేస్తూనే ఉంది. మేం చేయలేని పని కూడా తను చేసిందని చెప్పారు. మా ప్రసాద్ అన్నయ్య చూడటానికి వస్తే తనతో ఇదే మాట. తను అదే చెప్పాడు. నేను అమెరికా రాకుండా, డబ్బులు పంపకుండా, చదువు లేకుండా అమెరికా ఎలా వచ్చాడో కాస్త బుర్రున్న వాళ్ళకి తెలుస్తుంది కదా. నెలకి 1500 డాలర్లు ఈయన ఫోన్ బిల్, బట్టలు డ్రై క్లీనింగ్. ఇండియాలో ఫ్రెండ్స్ కి డబ్బులు పంపడానికి, బావగారి అప్పు తీర్చడానికి ఈయన సంపాదనెంతో మరి. చెల్లెలి పెళ్లి కి నేనే ఇచ్చాను. మరి ఈయన చేసిన గాస్ స్టేషన్ ఉద్యోగంలో ఖర్చులు పోనూ ఎంత సంపాదన మిగిలిందో మరి. తప్పు నాదే నాకంటూ ఏదీ ఉంచుకోకపోవడం. ఇండియాలో కొన్నవన్నీ లోన్లు, క్రెడిట్ కార్డ్లు గీకి. అంతా నా సంపాదనే..మంజు ఏమీ చేయలేదు అని అందరికి చెప్పడం,..ఇప్పటికి అదే అలవాటు. ఉమావాళ్ళు అట్లాంటా వచ్చాకా, కొడుకు రిషితో మా ఇంటికి వచ్చి రెండు రోజులుండి వెళ్ళారు. మిక్సీ తీసుకువచ్చింది. ఇంకా ఏమైనా కావాలా అంటే ఏమి వద్దన్నాను. 
మా తోడికోడలికి H1B వీసా చేసిన శామ్ కంపెనీ డెట్రాయిట్ లో. అప్పటి ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం వాళ్ళు ముగ్గురు డెట్రాయిట్ రావాలి. వాళ్ళతో పాటు నా చిన్న కొడుకు శౌర్యని కూడా తీసుకువచ్చారు. శామ్ ని వాళ్ళని పికప్ చేసుకోమని చెప్పి, డెట్రాయిట్ నుండి నాకు, వాళ్ళకి హంట్స్విల్ టికెట్స్ బుక్ చేసి,  నేను డెట్రాయిట్ వెళ్ళాను. ఆరు నెలల పిల్లాడప్పుడు ఇండియాలో అమ్మావాళ్ళ దగ్గర 2004 లో వదిలేసిన శౌర్యని మళ్ళీ 2007 లో చూసానన్నమాట. వాడికి ఏం తెలిసిందో నాకు తెలియదు. నిద్రకళ్ళతోనే చూడగానే చంక ఎక్కేసాడు. శామ్ ఆవిడతో SSN అప్లై చేయించారు. ఆ నైట్ అక్కడ హోటల్ లో ఉండి మరుసటి రోజు అందరం ఫ్లైట్ లో హంట్స్విల్ వచ్చాము. 
నేను జాబ్ ఏమి చేయకుండా ఉంది మెుత్తం మీద ఓ సంవత్సరం అంతే. నాకు అప్పటికే బాగా విసుగ్గా ఉండి ఆ ఇయర్ ఇక జాబ్ చేయలేదు. ఓ రోజు వంట చేస్తూ ఆవిడతో అనేసాను. నువ్వు నా పొజిషన్ లో ఉండి, నేను నీలా ఉండి ఉంటే నన్ను అమెరికా తీసుకు వచ్చేదానివి కాదు అని. ఆవిడకి కాసేపు మాట రాలేదు. తర్వాత ఎందుకలా అనుకున్నావు అంది. అది నిజం కనుక అని చెప్పాను. అంతకు ముందు చాలా మాటలు అని ఉన్నారు వాళ్ళు. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఈయన సంవత్సరం కూడా నిండని పెద్దోడు మౌర్యని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళినప్పుడు, కాస్త గొడవ అయ్యింది. దానికి ఈవిడ గారు సెటిల్ అవ్వకుండా పిల్లల్ని కనకూడదు అని అంది. వాళ్ళ కార్ ఎవరో తీసుకుంటే, మా ఆయన అది అమ్ముకుని అమెరికా వచ్చాడని కూడా అన్నారు. చెల్లెలి పెళ్లికి రూపాయి ఇవ్వకపోయినా వాళ్ళందరికి వీళ్ళు చాలా మంచివాళ్ళు. మా పెళ్లైన కొత్తలో నేను మద్రాస్ లో జాబ్ చేసేటప్పుడు, ఈయన మద్రాస్ వచ్చి, తమ్ముడికి ఫోన్ ఎన్నిసార్లు చేసినా తీయలేదు. డబ్బులేమైనా అడుగుతాడని భయం. ఇన్ని చేసినా మేం ఏమీ అనలేదు వాళ్ళని. 
మా ఆయన తమ్ముడిని షాప్ కి తీసుకువెళ్ళి, తనకి నచ్చిన ఫోన్ కొనిపెట్టాడు. పిల్లలు సైకిల్, స్కేటింగ్ సైకిల్ ఇలా ఏది కావాలన్నా కొనడం చేసారు. ఆవిడ పుట్టినరోజుకి అనుకుంటా చిన్నది హాండ్ బాగ్ కొని ఇస్తే, తర్వాత అది నచ్చలేదని మార్చుకుంటానంటే నా క్రెడిట్ కార్డ్ ఇచ్చి షాప్ కి పంపాను. ఏవో కొనుక్కున్నానంది. నాకు ఆన్ లైన్ లో క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవడం అలవాటు. మరుసటిరోజో, ఆ తర్వాతో చెక్ చేస్తే 90 డాలర్లు చెప్పులు తీసుకున్నట్టు ఉంది. నేనేమెా పది డాలర్లు పెట్టి కొనడానికి కూడా తటపటాయిస్తాను. అదేమైనా రాంగ్ బిల్ ఏమెానని సుధా 90 డాలర్లు పెట్టి చెప్పులు కొన్నావా అని అడిగాను. నేను అడిగినప్పుడు ఈయన కూడా ఉన్నాడు. లేకపోతే నామీద ఇంకెన్ని చెప్పేవారో. ఆవిడ దానికి చాలా పెద్ద సీన్ చేసి ఏవో లెక్కలు రాసి ఈయనకు చూపించింది. ముగ్గురు కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి, పిల్లాడిని కూడా నా దగ్గరకి రాకుండా చేయాలని చూసేవారు. ఆవిడ కంపెని గెస్ట్ హౌస్ లో ఉంటే దానికి డబ్బులు నేను కట్టాను. మధ్యలో వచ్చివెళ్ళడానికి టికెట్లు,  క్లయింట్ ఇంటర్వ్యూలకు ఫ్లైట్ టికెట్స్ ఇలా ఓ నాలుగు నెలలకు 30000 డాలర్లు ఖర్చు పెట్టించారు. వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ వాడితే ఎక్కువ వడ్డీ పడుతుందట. మనకి పాపం పడదు కదా అందుకని ఎదుటి వారివి వాడేసేవారు. వాళ్ళ జాగ్రత్త అది. 
ఈయనకు నేను క్రెడిట్ కార్డ్ ఇప్పిస్తే అది తమ్ముడికి ఇచ్చాడు. బాంక్ లో డబ్బులు వేయాలంటే తమ్ముడికి డబ్బులిచ్చి, వాళ్ళతో నన్ను వెళ్ళమనేవాడు. సాయంత్రం పూట ఈయన గాస్ స్టేషన్కి వెళ్ళి ఏమి చెప్పి వచ్చేవాడో మరి తమ్ముడు. ఈయన ఇండియాలో కార్ లోన్ కి, ఇంటి లోన్ కి డబ్బులు పంపడం మానేసాడు. 
ఏదో మాటల్లో ఈయన తమ్ముడితో అన్నాను. మీ అన్నయ్య మూలంగానే నా హెల్త్ పాడయ్యిందని. ఎవరం ఊహించని మాటన్నాడు. అయితే డైవోర్స్ ఇచ్చేయండి అని. అది విని నాకు నోట మాట రాలేదు. ఆ టైమ్ వస్తే నువ్వే దగ్గరుండి ఇప్పిద్దువులే అని ఊరుకున్నాను. దేవుడు ఎక్కడైనా జంటలను అటు ఇటుగా కలుపుతాడు. వీళ్ళు మాత్రం ఇద్దరూ ఒకటే. రూపాయి కోసం అమ్మానాన్నని విడదీయడానికి కూడా వెనుకాడని రకం వీళ్ళు. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు పుణ్యాత్ములు. 

మళ్లీ కలుద్దాం..


ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో చుట్టాలు ... వాళ్ళతో చిక్కులు విడకులదాక ...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి, రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు

9, నవంబర్ 2020, సోమవారం

కాలం వెంబడి కలం...27

       ఏప్రియల్ 24 డేట్ ఇచ్చారు. తర్వాత ఓ రెండు రోజులు చూద్దామని చెప్పారు. 26న హాస్పిటల్ లో జాయిన్ అవ్వమని చెప్పారు. ఆరోజు నొప్పులు రావడానికి ఇంజక్షన్ చేసారు. లోపల ఫ్లూయిడ్ తగ్గిపోయింది. నొప్పులు రాకపోతే రేపు సాయంత్రం ఆపరేషన్ చేసేద్దాం అన్నారు. మరుసటి రోజు ప్రొద్దుటే నాన్న ఫ్రెండ్ తో కూడా మాట్లాడి విషయం చెప్పారు డాక్టర్ గారు. ఆయన సాయంత్రం వరకు ఆగవద్దు, వెంటనే సిజేరియన్ చేసేయమన్నారు. ఆపరేషన్ సాయంత్రం కదాని అందరు ఇంటికి వెళ్ళారు. అమ్మానాన్న, నేను,ఈయన ఉన్నాము. 7.30 కి రూమ్ కి వచ్చి ఇప్పుడే ఆపరేషన్ అని నన్ను ఆపరేషన్ థియేటర్ కి తీసుకు వెళ్ళారు. అమ్మ రూమ్ లో సర్దుకుంటోంది. నేను ఒక్కదాన్నే వెళిపోయాను వాళ్ళవెంట. సరిగ్గా 7.37 కి ఆపరేషన్ మెుదలుపెట్టారు డాక్టర్ పద్మావతి గారు. మత్తు ఇంజక్షన్ మామూలుది చాలదని చెప్పాను. నేను చూసుకుంటాలే అని మత్తు ఇంజక్షన్ ఇచ్చారు. తర్వాత కళ్ళకు గంతలు కట్టారు. కాసేపటికి వామిటింగ్ అయ్యింది కొద్దిగా. తర్వాత  కబుర్లు చెప్తూనే ఆపరేషన్ చేసేసారు. పది నిమిషాల్లో బేబిని బయటికి తీసేసారు కూడా. ఆపరేషన్ చేసేటప్పుడు ఆక్సిజన్ పెడితే నాకు ఇబ్బందిగా ఉండి తీసేయబోతే బేబికి ఇబ్బందవుతుంది, ఉంచుకో అని అంటే అలాగే అని భరించాను. బాబు బావున్నాడని చెప్పారు. బాగా జుట్టు ఉందా అని అడిగితే, నవ్వి అదేంటి జుట్టు గురించి అడుగుతున్నావన్నారు. అమ్మకు జుట్టు ఎక్కువ ఉంటే ఇష్టమన్నాను. పద్మావతి గారు పొట్ట కోసేసి, బాబుని తీసి వెళిపోయారు. చిన్న డాక్టర్ గారు మిగతా పనంతా చూసుకున్నారు. సాయంత్రం వరకు రికవరి రూమ్ లో ఉంచి, తర్వాత రూమ్ కి పంపారు. 
      మా ఆయన  అమ్మమ్మ వాళ్ళు ఉన్నంతసేపు బాబుని చూడటానికి రాలేదు. వాళ్ళు వెళిపోతేనే వస్తానని పంతం పట్టాడు. పాపం అమ్మమ్మ, బేబి నన్ను, బాబుని చూసి వెళిపోయారు. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ బాబు పావుతక్కువ నాలుగు కేజీలు ఉన్నాడు. బాగా రంగు కూడానూ. చూసిన అందరు మా నాన్నలా ఉన్నాడని అన్నారు. జుట్టు కాస్త తక్కువే ఉంది. నేను పుట్టగానే ఫోటో తీయించమన్నాను. మా పెద్దాడపడుచు వద్దని అంది. అందుకని తీయించలేదు. రాఘవేంద్ర వాళ్ల బావగారు పిల్లడి ఉయ్యాల చుట్టూ తిరుగుతూ,నువ్వెలా ఉన్నా బాబుని బాగా పెంచావమ్మా పొట్టలో అని అన్నారు. అంతకు ముందు కూడా ఏదో విషయానికి ఇంత మంచిగా ఎలా పెరిగావే అంటే అది మా నాన్న పెంపకమని గర్వంగా చెప్పాను. మరుసటి రోజు బాబుకి కాస్త జాండీస్ ఎక్కువగా ఉన్నాయన్నారు. కొద్దిగా జ్వరం కూడా వస్తే కాస్త దూరంలో పిల్లల హాస్పిటల్ ఉంటే అక్కడికి పంపించారు. మలేరియా అని టెస్ట్ లో వచ్చింది. బహుశా అంతకు ముందెప్పుడో నాకు మలేరియా వచ్చివుంటుంది. ఓ ఐదు రోజులు కోర్స్ వాడాలని చెప్పారు. 
     పద్మావతి గారు ఈ ఆపరేషన్ లు చేయడంలో చాలా ఎక్స్పర్ట్. 4వ రోజు కుట్లు ఉప్పదీసి పంపేసేవారు. అప్పట్లో కాన్పు ఆపరేషన్ కి పదివేలు తీసుకునేవారు. నాలుగోరోజు కుట్లు ఉప్పదీసేసారు. ఆపరేషన్ కి భయపడలేదు కాని కుట్లు విప్పేటప్పుడు భయం వేసింది. కాని చాలా సున్నితంగా తీసేసారు చిన్న డాక్టర్ గారు. బాబుకి మరో రెండు రోజులు ఇంజక్షన్స్ ఉన్నాయి. అందుకని మరో రెండు రోజులు ఉండాల్సి వచ్చింది. మధ్యలో నాన్న వచ్చి వెళిపోయారు. అంతకు ముందు అంతా నేను చూసుకుంటాను అని చెప్పారు.  అలాంటిది ఏమి చెప్పకుండా ఆపరేషన్ డబ్బులు కట్టేసి వెళిపోయారు. తర్వాత రెండు రోజులకి బాబుకి ఇంజక్షన్స్ అయిపోయాయి. ఇంటికి వెళ్ళాలి కదా, అమ్మ ఇంటికి ఫోన్ చేసి అడిగితే, వాళ్ళ తిప్పలు వాళ్ళని పడమని చెప్పు అని అంటే, అమ్మకు కోపం వచ్చి, నా ఇంటికే తీసుకువస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసిందంట. రూమ్ కి వచ్చి నాకేం చెప్పలేదు. రాఘవేంద్ర మీ ఆయన ఏం అన్నాడు సాంబమ్మా అని అడిగితే అప్పుడు తనకి విషయం ఏడుస్తూ చెప్పింది. రాఘవేంద్రకి ఏం చేయాలో తెలియలేదు కాసేపు. తర్వాత వాళ్ళ బావకి ఫోన్ చేసి ఏం చెప్పాడో తెలియదు. ఆయన వచ్చి మా ఇంటికి వెళదాం పదండి అని, అమ్మని కూడా వచ్చి పంపించి వెళ్ళమని చెప్పారు. రావివారిపాలెం వెళుతూ, దారిలో పిన్ని వాళ్ళింటికి వెళ్ళితే, పిన్ని చీర పెట్టి, బాబుకి ఉంగరం పెట్టింది. ఆరోజు మా పాతింటి దగ్గర, మా ఎదురింటి దేవి వచ్చింది బాబుని చూడటానికి. ఈ విషయాలన్ని తనూ చూసి, మాతోపాటు తనూ బాధ పడింది. అమ్మ తనని కూడా వెంట రమ్మని, మంజుని పంపేసి మనం వెళిపోదాం అంటే, మాతో తను కూడా రావివారిపాలెం వచ్చింది. బాలింతని వదిలి వెళ్ళలేక అమ్మ నాతోనే ఉండిపోయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మ నాతోనే ఉంది. అమ్మ లేకపోతే ఈ మంజు లేదిప్పుడు. కోపం వస్తే తిట్టినా, ఏం చేసినా అమ్మ లేనిదే నా జీవితమే కాదు, మా ఆయన, పిల్లల జీవితాలు కూడా లేవు ఇప్పటికీ. 
నా జీవితంలో వెనుకా ముందు ఎటు చూసుకున్నా అమ్మే. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.... 

5, నవంబర్ 2020, గురువారం

ఓ మంచి పుస్తకం గురించి నాలుగు మాటలు...!!

        మెుదటి అడుగు ఎప్పుడూ ఒంటరిదే అన్న మాటలో ఓ జీవిత సత్యం ఇమిడి ఉంది. రెప్పపాటు జీవితంలో ఎన్ని ప్రశ్నలు ఎదురైనా సమాధానం కోసం నిరంతరం అన్వేషించే మనుష్యులు కొందరు ఉంటారు. అలా వారి అన్వేషణా ప్రయాణంలో ఎన్నో మలుపులు, మరెన్నో అనుభవాలు. ఆ అరుదైన అనుభూతులకు అక్షర రూపమివ్వడం నాలాంటి సామాన్యులకు ఓ మహా యజ్ఞమే. కనీసం ఆ పుస్తకాల గురించి ఇలా నాలుగు మాటలు రాయాలనుకోవడమే ఓ పెద్ద సాహసం నాకు తెలిసి. ఇది ఓ విధంగా నా పూర్వజన్మ పుణ్యమే అని చెప్పాలి. 
            నేను ఆస్తులు అమ్ముకున్న ఓ యెాగి కథ పుస్తకం తెలుగు అనువాదం చదివినప్పుడు ప్రతి అక్షరంలో నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది.  ఏ భాషలోని సంగీత సాహిత్యాలనైనా ఏ చిన్న తేడా అయినా లేకుండా అలవోకగా తెలుగులో అనువాదం చేయగల పాటల అనువాద మాంత్రికుడు మన భువన చంద్ర గారు. ఈయన తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయెాక్తి ఏమాత్రమూ లేదు. అతి పిన్న వయసులోనే వారికి లభించిన అనుభవాలను, అనుభూతులను కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు 1,2,...పుస్తకాలలో వివరించారు. ప్రతి ఇంటా తప్పక ఉండవలిసిన పుస్తకాలని అవి చదువుతున్నప్పుడు నాకనిపించింది. 
           హిమాలయాల్లో తనుకు ఎదురైన ప్రతి అనుభవాన్ని మనకు అందించడంతో,మనలో కూడా ఓ జిజ్ఞాసను రేకెత్తించారు. నిజంగా ఆ అనుభూతులన్ని సామాన్యులకు కలగవు. అదంతా పూర్వజన్మ సుకృతమే. ఈ విషయంలో మీ మీద అసూయగా ఉంది భువన చంద్ర గారు. పుస్తకం చదువుతున్నప్పుడు నా మనసులో మాట ఇది. పుస్తకంలో అంతా నేను, మనసు, పలు ప్రశ్నలు, వాటికి గురువుల సమాధానాలు, సమాధి స్థితి వంటి ఆత్మ సంబంధమైన అనుభవాలను మనకు వివరిస్తారు. క్షణాల జీవితానికి శాశ్వతమైనది ఏదో,  అశాశ్వతమైనది ఏదో మనం కూడా తెలుసుకోవాలన్న కోరిక కలుగుతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. 
            యెగ సాధనకు గురువు అవసరం, గురువే శిష్యుడిని వెదుక్కుంటూ వస్తారన్న సత్యం, మనకు ఏది ఎప్పుడు ఎలా లభ్యమవ్వాలో అప్పుడే అది మనకు దక్కుతుందని, చావు పుట్టుకలు పుస్తకానికి ముందు వెనుక అట్టలు, మధ్య కాగితాలే మన జీవితపు విశేషాలని చెప్తూ ఇవన్నీ మన గతజన్మ బుుణశేషం శేషాలని చెప్తారు. ఇలా ఈ పుస్తకాల గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది. వాళ్ళు 1 హిమాయాల్లో అనుభవాల అనుభూతులు. వాళ్ళు 2 ఎడారుల్లో అనుభవాల ఆస్వాదనకు గుర్తులు. 
         యెాగం సిద్ధించాలన్నా గతజన్మల ఫలం మనకుండాలి. మానవ జన్మ పరిపూర్ణం కావాలంటే భగవదనుగ్రహం కావాలి. దానికి గురువుల అనుగ్రహం, ఆసరా చాలా అవసరం. బాగా నచ్చిన మాట " కోపాన్ని ప్రేమగా మార్చడం ". ఎన్నో చేయగల మనిషికి ప్రయత్నిస్తే సాధ్యం కానిది లేదని చెప్తూ కోపాన్ని కూడా ప్రేమగా మార్చి చూడమంటారు భువన చంద్ర గారు. 
          ఇంకా చాలా చెప్పాలని ఉన్నా, చెప్పలేక పుస్తకం చదువుతున్నప్పటి అనుభూతిని ఆస్వాదిస్తున్నా. ఇంత గొప్ప పుస్తకాలను అందించిన భువన చంద్ర గారికి మనఃపూర్వక ధన్యవాదాలు.

3, నవంబర్ 2020, మంగళవారం

భూతల స్వర్గమేనా...32

పార్ట్..32
ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు నైట్ లేట్ అవుతూ ఉండేది. మా మానేజర్ డిన్నర్ తెప్పించేవాడు. అందరికన్నా ముందు నన్ను పిలిచి తీసుకోమనేవాడు. సిటీ గ్రూప్ లో వారంతా చాలా బావుండేవారు మాతో. మా కాలేజ్ ఇంజనీరింగ్ జనాభా చాలామంది డాలస్ లోనే ఉన్నారు. ఝాన్సీ, యశోద, నాగజ్యోతి, అనురాధ ఇంకా చాలామందే ఉన్నారు. నేను వీళ్ళని మాత్రమే కలిసాను. కొందరు జూనియర్స్ అబ్బాయిలు కూడా పలకరించారిక్కడ. యశోద వాళ్ళ పాపని చూడటానికి వాళ్ళింటికి వెళ్ళి,  ఝాన్సీ కొడుకు పుట్టినరోజుకి ఝాన్సీ వాళ్ళింట్లో యశోద డ్రాప్ చేసింది. అక్కడే జ్యోతి కనిపించి, అను కి చెప్తే, అను ఫోన్ చేసి తన కొడుకు పుట్టినరోజుకి రమ్మంటే నాకు వెళ్ళడానికి కుదరకపోతే, తర్వాత కనే మా ఆఫీస్ కి వచ్చి లంచ్ కి నన్ను బయటికి తీసుకువెళ్ళింది. అను, నీరజల ఫ్రెండ్ భావన కూడా సిటీ గ్రూప్ లోనే వర్క్ చేసేది. మూడు నెలల ప్రాజెక్ట్ 6,7 నెలలు జరిగింది. మధ్యలో లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు, మరో రెండు రోజులు లీవ్ పెట్టి హంట్స్విల్ వెళ్ళి వచ్చేదాన్ని. పాపం మా చైనీస్ కో ఆర్డినేటర్ బాగా కో ఆపరేట్ చేసేది. తను లీవ్ లో వెళ్ళినప్పుడు మేం చూసుకునే వాళ్ళం. 
సాయంత్రం 5 కి మా వర్క్ అయిపోయేది. అవసరం అయినప్పుడు లేట్ అవర్స్ వర్క్ చేసేవాళ్ళం. సంధ్య ఏదో బేబి సిట్టింగ్ జాబ్స్ వెదికితే నైట్ 7 నుండి 11 వరకు పిల్లలని చూసే జాబ్ ఉందని చెప్పింది. నాకు ఆఫీస్ అయ్యాక ఎలానూ ఖాళీనే కదా అని, సంధ్య ఆ జాబ్ నాకు చెప్పింది. అందులోనూ అది రోజూ ఉంది. అప్పుడప్పుడూ ఉంటుంది. వాళ్ళే వచ్చి పికప్, డ్రాపింగ్ చేస్తానంటే సరేనని ఆ జాబ్ ఒప్పుకున్నాను. అప్పుడప్పుడూ వీకెండ్ కూడా అడిగేవారు. అలా వచ్చిన డబ్బులు అన్నీ దేవుడికి ఇచ్చేసాను తర్వాత. అంతకు ముందు కూడా పేపర్ లో చూసి ఎవరో పాపకి ఓ 150 డాలర్లు నా దగ్గర లేకపోయినా క్రెడిట్ కార్డ్ నుండి తీసి మరీ పంపాను. నేను చేసింది చిన్న సాయమే వాళ్ళకి. ఓ ఆంటి వాళ్ళంట్లో పనమ్మాయి కూతురు ఆ పాప. తర్వాత ఆంటి పెద్ద లెటర్ రాశారు. అప్పట్లో వార్త పేపర్ లో కూడా వేసారు ఆ విషయం. నా జాబ్ సిటీ గ్రూప్ లో అయిపోయినప్పుడు డాని, డాన్ లు నాకు సెండాఫ్ పార్టీ ఇచ్చారు. నివాస్ గారిని, తన వైఫ్ అపర్ణని కూడా కలిసాను. మంచి మెమరీస్ డాలస్ సిటీ గ్రూప్ తో. 
ఇదే టైమ్ లో మా ఎదురింటికి తెలుగువాళ్ళు వచ్చారు. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. తర్వాత పాప పుట్టింది. వాళ్ళ అమ్మానాన్న వచ్చారు. ఎందుకో తెలియదు కాని నాతో ఎంతో బావుండే రమణి గారు మాట్లాడటం మానేసారు. లక్ష్మి గారని తెలుగావిడ ఆ టైమ్ లోనే పరిచయం అయ్యారు. ఏంటో మనుషులు వివిధ రకాలన్నట్టుగా ఉండేవారు. సీతక్క, మామయ్య వాళ్ళు నాతో బావుండేవారు. చౌదరి గారు ఇల్లు కొనుక్కున్నప్పుడు సీతక్క వాళ్ళింటికి తీసుకువెళ్ళింది. అంతకు ముందు ఓసారి జనవరి ఫస్ట్ కి ఫంక్షన్ విష్ణు వాళ్ళు చేసినప్పుడు మాట్లాడింది. అప్పటినుంచి రాకపోకలుండేవి మాకు వాళ్ళకి. మా కాకాని డాక్టర్ గారికి మేనల్లుడే మామయ్య. 
కాస్త సిటీ గ్రూప్ లో వర్క్ చేసినప్పుడు అప్పులు చాలా వరకు తీరిపోయాయి. ఈయన నా క్రెడిట్ కార్డ్ ల నుండి కొంత డబ్బు తీసి, మిగతా అమౌంట్ కలిపి ఓ రెండు సైట్లు విజయవాడలో తీసుకోమంటే మా మామయ్య తీసుకున్నాడు. అప్పటికే స్కార్పియెా కూడా లోన్ మీద తీసుకున్నారు. అంతకు ముందే ఈయన వాళ్ళ బావకి ఓ 3.5 లక్షలు ఇచ్చారు. చెల్లెలి పెళ్ళి కి ఓ లక్ష ఇచ్చాము. పెళ్ళి కుదర్చడం నా మెుదటి తప్పు. ఈయన మరదలికి H1B చేయించడానికి నాకు తెలిసిన శామ్ కి 2000 డాలర్లు కట్టి, వీసా క్వరీ పడితే అది క్లియర్ చేయించి, తమ్ముడిని, మరదలికి, వాళ్ళబ్బాయిలకి అమెరికా రావడానికి వీసా స్టాంపిగ్ ప్రాసెస్ చేయించాను. ఇది నా రెండో తప్పు. 
వాళ్ళు ముగ్గురు అమెరికా వస్తూ, మా చిన్నోడు శౌర్య కూడా వస్తానంటే తీసుకు వచ్చారు. వీళ్ళు వచ్చేటప్పటికే మా ఇంట్లో మా సుబ్బారావు అంకుల్ కొడుకు MS చేయడానికి అమెరికా వస్తుంటే నాన్న చెప్తే, వాడిని మేము పికప్ చేసుకుని, పంపిస్తామని చెప్పాము. వాడు హంట్స్విల్ వచ్చాడు. మా పక్కింటి రెడ్డి అంకుల్ తో మాట్లాడి వాడికి A&M యూనివర్శిటీకి మార్చమని చెప్పాము. వాడిని వేరే యూనివర్శిటీకి కౌన్సెలింగ్ రోజుకి తీసుకువెళ్ళి, వాళ్ళతో మాట్లాడి, ఇక్కడికి మార్పించాము. వాడితో పాటు రాజు అని వాడి ఫ్రెండ్ కూడా మా ఇంట్లోనే ఉండేవాడు. 
అప్పటికే నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ శ్రీనివాసరెడ్డి ఫామిలీ కొన్ని రోజులు మా ఇంట్లో ఉండి, తర్వాత వేరే ఇల్లు తీసుకుని ఉండేవారు. వీళ్ళందరి కన్నా ముందు విష్ణు వాళ్ళ తమ్ముడు అనిల్ కూడా కొన్ని రోజులు ఉన్నాడు. తర్వాత తను వేరే చోటికి వెళిపోయాడు. అప్పటి నుండి విష్ణు వాళ్ళు నాతో మాట్లాడటం మానేసారు. నాకు సిటి గ్రూప్ ప్రాజెక్ట్ తర్వాత వెంటనే మరొక ప్రాజెక్ట్ వచ్చింది. కాని జాయిన్ కాలేదు. అప్పటికే కాస్త హెల్త్ ప్రోబ్లంగా ఉంది. ఈయన చిన్న విషయానికి చెప్పుడు మాటలు విని బాగా గొడవ పెట్టుకున్నాడు. 
మా మరిది వాళ్ళు వచ్చిన కొన్ని రోజులకు శ్రీనివాసరెడ్డి వాళ్ళు వేరే చోటికి వెళిపోయారు. 
ఇక మా మరిది వాళ్ళు వచ్చాక అసలు సినిమా మెుదలైంది. 

మళ్లీ కలుద్దాం...


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner