31, జనవరి 2014, శుక్రవారం

ఆరాధనం...!!

అందరాని అనుబంధం
చెప్పలేని మౌన విలాసం
మది తలపుల ఆరాటం
మాటలు తెలియని మమతావేశం
అచంచల ఆనందోద్వేగం
అంతం లేని అభిమానం
అర్ధం కాని అద్దంలో ప్రతిబింబం
ఆత్మ ప్రవాహ అనురాగం
నీకు చేరని నివేదనం
మనసు విరచిత కవనం
మృదు మధుర మంజుల నాదం
ఎన్నటికి తరగని ఈ ఆరాధనం...!!

30, జనవరి 2014, గురువారం

వేసిన ముడులు ముళ్ళుగా తగులుతుంటే...!!

అదేంటో మరి అందరిలా నేను ఉంటే సరి పోయేదేమో....ఎందుకులే అని సరిపెట్టుకుంటూ ఎప్పటికప్పుడు ఎప్పుడూ సర్దుకు పోవడమే సరి పోతోంది... అది కావాలి ఇది కావాలి అని రాచి రంపాన పెట్టిన పాపాన పోలేదు...ఉన్న దానితో సరిపెట్టుకుంటుంటే అదే తప్పుగా మిగిలి పోయింది...నీలా బాధ్యతలను గాలికి వదిలేసి మంచితనం అనే ముసుగును కప్పుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు...తప్పుని సరిపెట్టుకోలేని నిస్సహాయత నాది కావచ్చేమో...కాని మనసుని చంపేసిన నీ మంచితనం నాకు తెలిసినంతగా మరెవరికి తెలియదు...నీ బతుకు కోసం నీ వాళ్ళ కోసం బతికి చూడు అప్పుడు తెలుస్తుంది నీకు కుటుంబం బంధం భాద్యత అసలైన సంతోషం అంటే ఏమిటో....!! నీ చుట్టూ తిప్పుకుంటున్న నలుగురు నీ ఆపదలో అడ్డు పడ్డారా ఎప్పుడైనా...!! అబద్దంలో బతకడంలో నీకు ఆనందం ఉందేమో అది నిజమైన సంతోషం కాదు...నీతో నువ్వు నిజాయితీగా ఉండగలుగుతున్నావా ఎప్పుడైనా....నీతో నీకే బతకడం రానప్పుడు ఇక మాతో ఏం కలిసి బతకగలవు...సున్నితమైన బంధాలు నీకు ఈ జన్మకి అర్ధం కావేమో.. అహంకారాన్ని అభిమానంగా మార్చి చూడు...అసలు నిజాలు తెలుస్తాయి...అహంకారమే ఆత్మాభిమానం అనుకుంటే...నువ్వు ఎందరున్నా ఎవరు నీకంటూ లేని ఏకాకి లా మిగిలి పోతావు...నీ గొప్ప నువ్వు చెప్పుకోవడం కాదు నలుగురు చెప్పుకోవాలి... అంతే కాని గొప్ప కోసం ఇంట్లో వాళ్ళని ఉసురు పెట్టి భజన చేయించుకోవడం కాదు.. కాస్తయినా మానవత్వం ఉన్న మనిషి అయితే బతుకుతున్న ఈ జీవితం ఎవరి వల్ల వచ్చిందో...మన కృతజ్ఞత ఎంత వరకు వాళ్ళ పట్ల ఉందో.... ఒక్కసారి మనసుని అడిగితే అది చెప్పే సమాధానం వింటే..వినగలిగే మనసు నీకుంటే నీ కుటుంబం నీకు మళ్ళి కొత్తగా పరిచయం అవుతుంది...కుటుంబం అనేది నీ గొప్ప కోసం నలుగురికి చెప్పుకోవడానికి కాదు...అనుబంధాలను, అభిమానాలను, ఆప్యాయతలను, కష్టాలను, కన్నీళ్ళను కలసి పంచుకోవడం...కట్టుకున్న బంధానికి, మనసుకు, మనిషికి ఆసరా, భరోసా...నేను మీతో ఉన్నా..ఉంటా ...అన్న నమ్మకం..ముడి వేసుకున్న పాశానికి అనుక్షణం ఆలంబనగా ఉంటావన్న నిజాయితీ తో కూడిన ఆత్మీయత పంచగలిగితేనే ఆ బంధానికి అసలైన అర్ధం...!!వేసిన ముడులు ముళ్ళుగా తగులుతుంటే తట్టుకునే శక్తి ఎన్నో రోజులు ఉండదు...మనసుని జీవితాన్ని... మరచి పోవడానికి కాలం సాయం చేస్తుంది...కాని ఆ ముళ్ళు గుచ్చిన గాయాల గురుతులు మాసిపోక యుగాల వరకు కాల్చుతూనే ఉంటాయి...అందమైన జ్ఞాపకాలుగా మిగిలి పోక అసంపూర్తి జీవితంగా ఉండి పోతుంది....తప్పు ఎవరిదో తెలిసే సరికి ఓ జీవిత కాలం ఆలస్యమై పోతుంది...మరి మార్పు ఎవరిలో రావాలో...!!

28, జనవరి 2014, మంగళవారం

నీ రూపం నాకపురూపం...!!

నువ్వు ఊపిరి పోసుకున్న ఆ క్షణమే 
ఊహలు అల్లుకున్నా నీ చుట్టూ....
చెదిరిన జ్ఞాపకాల గూడుని పేర్చుకుంటూ
పగడాల పొదరింటిని సృష్టించా నీ కోసం...
ఆశలు హార్మ్యాలు ఊహల సౌధాలు
కష్టాల కన్నీళ్ళ బతుకు బాటను నీ ముందుంచా...
పాశాన్ని పంచుకున్నా పేగు తెంచుకున్నా
మమకారాన్ని తెలిపే మధుర బంధం మనది...
ఒంటరి తనానికి తోడైన ఆలంబన నీ రాక
భాష లేని భావాన్ని పంచుకున్న గొప్ప మనసు నీది...
చెప్పని మౌనాన్ని స్పర్శలో అందుకున్న అనుబంధం
మాటల కందని మనసుల అలజడి
అందుకున్న అనురాగపు నుడికారం
నాలో ప్రాణం పోసుకున్న నీ రూపం నాకపురూపం...!!

27, జనవరి 2014, సోమవారం

ఆలాపన....!!

ఆలాపనే ఆరాధనై 
అనురాగమే ఎద పాశమై
అడ్డు పడుతూ ఆటలాడుతుంటే
నిరవధికంగా తట్టి లేపే తలపుల
అలజడి అలల కలల్లో ఉండి పోతూ
అర్ధాశల బతుకుల అతుకుల ఆడంబరాల
గతుకులను దాటుకుంటూ పయనిస్తూ
అర్ధాంతర జీవితాల తెలియని గమ్యాల 
నిర్దేశాన్ని చేరాలని ఆరాటంతో తడబడే
మనసు తొందరను ఆపాలన్న ఆలోచన
రానీయకుండా నీ ఆలాపనే అణువణువునా
అవిశ్రాంతంగా వివిపిస్తూనే ఉంది
నన్ను నేను మరిచేంతగా....!!

23, జనవరి 2014, గురువారం

ఈ జీవన పయనం ఏ తీరాలకు చేరుతుందో....!!

అంతిమ సంస్కారం కూడా అందంగా ఉంటుందని ఈ రోజే తెలిసింది....అక్కినేని గారి చివరి యాత్రను ఎంతో చక్కగా చూడముచ్చటగా ముగించారు కుటుంబ సభ్యులు అందరు కలసి....రాజకీయ ప్రముఖులు, చిత్ర సీమ మొత్తంగా కదలివచ్చి ఆయనకు కడసారి వీడ్కోలు కడు సుందరంగా ముగించారు....దివి కేగిన అక్కినేని గారికి, భువి పై నున్న మనకు ఈ విషయం చాలా సంతోషించదగినది...చిత్ర పరిశ్రమకు, తెలుగు జాతికి నట సామ్రాట్ లేనిలోటు తీరనిది.... ఆయన నట ప్రస్థానం గురించి చెప్పడానికి మాటలు చాలవు...ఏ పాత్రలోనైనా ఒదిగి పోయే మహా నటుడు...జీవితాన్ని శూన్యం నుంచి అనంతాకాశం వరకు చూసిన వ్యక్తిత్వం...!! అంతటి మహా మనీషికి మనఃపూర్వక ఆనదాశ్రు నివాళి...కడసారి వీడ్కోలు అత్యంత ఘనంగా కుటుంబ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, మూవీ అసోసియేషన్, ప్రముఖులు, సామాన్యులు ఇలా అందరు సమర్పించారు....చాలా సంతోషించాల్సిన విషయం...!!
డబ్బు హోదా తోనే అన్ని గౌరవాలు వస్తాయని మరోసారి రుజువు ఐంది. కనీసం సహ నటుడు చనిపొతే చూడాలన్న ఇంగిత జ్ఞానం లేని పెద్ద మనసున్న పెద్ద బాబులు, ఎక్కడెక్కడి నుంచో తీరిక చేసుకుని మరీ వచ్చి తమ సంతాపాన్ని పెద్దాయనకు తెలిపారు...గొప్ప వారి ఇంట్లో కుక్కకు బాలేక పోయినా పది సార్లు క్షేమ సమాచారాలు కనుక్కునేంత తీరిక ఉంటుంది కాని డబ్బు, పలుకుబడి, పేరు, హోదా లేని సామాన్య నటులకు ఆసుపత్రి నుంచి మూవీ అసోషియేషన్ కు తీసుకు వెళ్ళడానికి కూడా మనసు రాదు...స్నేహితుడిని పెళ్ళికి పిలిచి ఆలింగనం చేసుకుంటే సరి పోదు..చనిపోయినప్పుడు చివరి చూపు చూడటానికి కూడా మనసు ఉండాలి...పేరు ప్రతిష్టలు, డబ్బు శాశ్వతం కాదు...కాస్తయినా మనసున్న మనుష్యులుగా మిగిలి పొతే చాలు...!! జీవితంలో డబ్బు అవసరమే కాని అదే జీవితంగా మారిపోకూడదు....కాకపొతే మనకు అదే జీవితంగా మారి పోయింది...అన్ని బంధాలను అనుబంధాలను పరపతి, డబ్బుతోనే బేరీజు వేస్తున్నాము...అవే లోకంగా బతికేస్తున్నాము...ఇలానే ఉంటే ఈ జీవన పయనం ఏ తీరాలకు చేరుతుందో....!!

21, జనవరి 2014, మంగళవారం

నే పుట్టిన రోజు కూడా గుర్తు లేనంతగా...!!

మనసుకి మాటలు రాకపోతేనేం
నీ చుట్టూనే తిరిగే ఆ పరిభ్రమణంలో
కబుర్ల కమ్మదనం తరగడం లేదు
ఆలోచనల అంతరాల ఆంతర్యంలో
అంతర్నేత్ర ఆంతరంగీకాన్ని అర్ధంతరంగా
నిద్రపుచ్చిన మది మౌనంగా నిశ్శబ్దంమైంది
సవ్వడి చేయని జ్ఞాపకాలు పక్కనే ఉన్నా
తగిలిన గాయాల ముసుగును
మేలి పరదా మాటున దాచిన
చిరునవ్వు చాటున కనపడని
వెతల కతలు కన్నుల చెలమలో
నిండిన కన్నీరు జారక పోయినా
రుధిర వర్షాల హర్షాతిరేఖలలో చిక్కినా...
అందమైన బాల్యానుభూతుల ఆ ఆనందపు
గురుతుల గువ్వల గుజ్జన గూళ్ళు మరపు రాక ముందే....
నీతో వేసిన ఆ అడుగుల ముద్రలు
సంతోషపు సడి తెలియకుండా చేసి
శరీరాన్ని మనసును కాల్చేసి శిధిలం చేసిన
గులాబీలతో పాటుగా గుచ్చిన ముళ్ళు
ఆనవాలుగా నాతోనే మిగిలి పోయాయి...
నే పుట్టిన రోజు కూడా గుర్తు లేనంతగా...!!

20, జనవరి 2014, సోమవారం

పరాన్న జీవులు...!!

ప్రేమ ద్వేషం రెండు ఒకలానే అనిపిస్తున్నాయి...మనం ఇష్టపడిన వాళ్ళని ఎంత దగ్గరగా అనుకుంటామో మనకు
బాగా ఎవరి మీదైతే కోపంగా ఉంటుందో వాళ్ళని కూడా అంతే ఎక్కువగా తల్చుకుంటాము...నాకు తెలిసి కోపం ఉన్న వాళ్ళనే ఇంకా ఎక్కువగా తలుస్తామేమో...!! బంధాన్ని, భాద్యతలను పంచుకోవడానికి గుర్తు రాని అహం కోపాన్ని, తన చేతగాని తనాన్ని నిరూపించుకోవడానికి భలే తొందరగా గుర్తుకు వస్తుంది....కోపాన్ని, ద్వేషాన్ని చూడటమే అలవాటయిన ప్రాణం ప్రేమను, అభిమానాన్ని దగ్గరకు రానీయటానికి భయపడటంలో అర్ధం ఉంటుంది... ఎందుకంటే నటనను నమ్మి మోసపోయిన జీవితం ఊసరవెల్లి రంగులను ఎంత కాలం నమ్మగలుగుతుంది..?? తన కంటూ ఏమి లేని మనిషికి అర్ధవంతమైన జీవితాన్ని, జీవితపు విలువను అందించిన కుటుంబాన్ని తన విషపు కోరలకు బలి చేస్తూ నలుగురిలో అతి మంచితనం నటిస్తూ తనకు తిండి పెట్టిన చేతిని అనుక్షణం కాటేసే విషపు పురుగును ఏం చేస్తే పోయిన ఆ సంతోషం మళ్ళి తిరిగి వస్తుంది...?? దిక్కు దివాణం లేని మనిషికి అడగకుండా అన్నిచేస్తే...అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందాన తనది కానిది తన సొమ్మే అన్నట్టు తన చుట్టూ తిరిగే భజన బృందానికి చేతికి ఎముక లేదన్నట్టు దానాలు చేస్తూ కన్న పిల్లల ఉసురు పోసుకుంటూ...నమ్మిన బంధాన్ని నట్టేట ముంచి...నా అంత దాన కర్ణుడు లేడని, తన మంచితనం తనను కాపాడుతుందని విర్ర వీగుతున్న ఆ ఇల్లు ఆ ఇల్లు పట్టుకు తిరిగే ఓ గోముఖ వ్యాగ్రాన్ని నమ్మి కట్టుకున్న పాపానికి ఆ పాప భారాన్ని భరించడం తప్ప ఏమి చేయలేని దుస్థితి...!!
మంచితనం ముసుగులో మనకు కనపడని మరో రూపం ఉంటుంది....అది అసలు స్వరూపం కాకపొతే దాన్ని తెలుసుకోగలిగితే ఆ విషపు కోరలకు చిక్కకుండా తప్పించుకోవచ్చు...కాని నటన బావుంటుంది మనకు కూడా...అందుకే ఎన్నో జీవితాలు ఇలాంటి ఇనుప పాదాల క్రింద పడి నలిగి పోతూ ఉంటాయి...కనీసం మళ్ళి కొద్దిగా అయినా తేరుకోవడానికి ఈ జీవితం సరిపోదు...అంటే ఆ అవకాశం మనకు రానివ్వరు...ఒకసారి మొసపొయాక మళ్ళి బతికి బట్ట కట్టడానికి అవకాశం రానివ్వరు...వాళ్ళు మన మీద పడి బతకడానికి అలవాటు పడతారు కదా... ఈ పరాన్న జీవులు...!! ఈ ప్రపంచంలో ఇలాంటి పరాన్న జీవులు కోకొల్లలు ఉన్నాయి కనుక జీవితాన్ని అందంగా అర్ధవంతంగా మలచుకోవడానికి వీటి బారిన పడకుండా ఉండేవాళ్ళు అత్యంత అదృష్టవంతులు...!! మరి ఎవరెవరు ఏ జాబితాలో ఉన్నారో తేల్చుకోండి...-:)

15, జనవరి 2014, బుధవారం

మనసు మౌనం...!!

మాటలు రాని మనసు
చెప్పిన ఊసులు
మౌన తరంగాలుగా
నను తాకిన అలజడులు
కుదురుగా ఉండనివ్వని
నీ జ్ఞాపకాల పరిమళాలు
ఊపిరాడనివ్వని నీ ప్రేమ బంధం
తెలిపే తపన చెప్పిన
మది కందిన మధుర క్షణం
వెన్నెల వెలుగుల వెచ్చదనం
అలలా తాకిన ఆనందం
మరులు గొలిపే మమతలు
మాయమైపోయే ఆ క్షణాలు
అలా ఉండి పొతే....
కాలమే ఘనిభవించి
గుప్పెడు గుండెలో
మది దాచిన మధుర కవనం
నీ కోసమే...!!
 (వెన్నెల వెలుగులు మొదటి  వార్షికోత్సవం సందర్భంగా ఈ మనసు కవితను రాయించిన వెన్నెల వెలుగులు గారికి ధన్యవాదాలు )
వెన్నెల వెలుగులు మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ రోజు మా మా అందరి హృదయ శుభాకాంక్షలు

13, జనవరి 2014, సోమవారం

ఏమిటో ఈ బంధం...!!

నాతో నీకు స్నేహం ఎందుకో....!!
నాకంటూ ఎవరు లేరని
నా  ఒంటరి తనానికి తోడుగా
నా ఏకాంతానికి సహవాసంగా
నీ చెలిమిని పంచుకోనా...!!
ఎవరికి వద్దని విసిరి వేసినా
మాటల ముళ్ళు గుచ్చుతున్నా
గాయపడిన మదిని ఓదార్చే
జ్ఞాపకాల ఒరవడిలో సేద దీరే గతాన్ని..!!
నిశిధి వెలుగులో కనిపించే క్షణాలు
నిజాలు కాని వాస్తవాలుగా మిగిలాయి
వాడిన పూల పరిమళాలు ఇంకా వస్తూనే
నాతో నువ్వు లేని నా కాలాన్ని నాకు జ్ఞప్తికి తెస్తూ
చెలిమి శీతలాన్ని గ్రీష్మ తాపంగా చేసి
చోద్యం చూస్తూ ఎలా నవ్వుతోందో...!!
అక్కరకు రాని ఆత్మాభిమానం
నన్ను వదలకుండా చుట్టుకుంటే
అర్ధంలేని అహం నీ అలంకారంగా ఉంటే
జత కుదరని బంధంగా మిగిలి పోతుంటే
విడలేని పాశం ఈ అనుబంధమేమో..!!

చివరి ప్రేమ లేఖ....!!

 నాలోని నీకా... లేక నీలోని నాకనాలేమో....!!
మొదటి లేఖ రాయాలనుకున్నా...చివరి లేఖో చిట్ట చివరి లేఖో ఇది నాకే తెలియడం లేదు...నాకు తెలియకుండానే ఇష్టపడ్డావు అదే ప్రేమనుకున్నావు..!! చెప్పకుండా నీ మనసులోనే దాచుకున్నావు...నీ ప్రేమ ఇష్టం నాకు తెలియకుండానే దూరం అయ్యావు...కలవని సమాంతర రేఖలు మన జీవితాలు...కలిసినా జత కలవని బంధాలు మనవి..బాధ్యతలకు బందీలుగా మనకున్న అనుబంధాలకు దూరం కాలేని సున్నిత మనసుతో చెప్పలేక పోయిన నీ ప్రేమ తెలిసినా... దూరంగానే ఉన్నా...నిన్ను ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక...ప్రేమ మనసులో ఉంటే చాలు....మనసుకు మాత్రమే తెలిసిన ఈ మౌన తరంగం...మనసుల బంధం ఎప్పటికి మదిలో నిలిచి పోతుంది సజీవంగా...!! అందరిలా మనం కలిసి పంచుకున్న ఊసులు, ఊహలు లేవు...పలకరింపుల పరిచయాలు...ఆ పరిచయాల పరిమళాలు అసలే లేవు...అయినా మన పరిచయం ఇప్పటికి గుర్తుగానే ఉంది ఇద్దరికీ...ఇది నిజం కదూ...!! మనకి తెలియకుండానే ఒకరి గురించి ఒకరం వెదుకుతూనే ఉన్నాం...చూసుకున్నా మాటలు మరచి పోయిన ఆ క్షణాలు ఇంకా నాకు ఇప్పటికి గుర్తు ఉన్నాయి...నిన్నో మొన్నో జరిగినట్టుగా...!! ఈ దోబూచులాటేనా ప్రేమంటే...!! మరి నీకు తెలిస్తే నాకు చెప్పాల్సింది అప్పుడే...!! చెప్పలేని నీ మొహమాటం మన మధ్య దూరం పెంచిందేమో...!! నీ అంతరంగాన్ని చదవలేని నా మనసుకు ఏ శిక్ష వేయాలో మరి...!! అయినా ఇలా నీ మనసులో ఉన్న నేను ఓ రకంగా అదృష్టవంతురాలినే అనుకోవాలి...!! ఇది నా ఊహకు అందనిదే అయినా ఇలా అనుకోవడం కూడా బావుంది నాకు...ప్రేమంటే కలిసి బతకడమే కాదు... ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఇష్టమైన జ్ఞాపకాలతో సంతోషంగా ఉండటమే...!! ఇష్టమైన ప్రేమను ఇష్టంగా తలచుకుంటూ మనను ఇష్టపడే వారితో కష్టంగా ఉన్నా ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా భరిస్తూ... నీ సుఖమే నే కోరుకున్నా... నిను వీడి అందుకే వెళుతున్నా... అని భారమైన మనసును బరువుగా మోసుకుంటూ జీవితాన్ని గడిపేయకుండా ప్రేమను బతికిస్తు ఓ జీవిత కాలపు ఆలస్యాన్ని మరో కొత్త జీవితానికి నాందిగా మధుర జ్ఞాపకాలను పదిలంగా దాచుకుంటూ నీ జీవితాన్ని నందన వనం చేసుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ ..... ఎప్పటికి నీ ప్రియమైన నేస్తాన్నే....!!

( ఉత్తరాలు రాయడం మాత్రమే వచ్చిన నాకు ప్రేమ లేఖ అదీ చివరి ప్రేమ లేఖ రాయడం ఎలా వస్తుంది ..!! ప్రేమ లేఖ రాసే అవసరం నాకు ఎప్పుడు రాలేదు..అందుకేనేమో మొదటి చివరి లేఖ ఇదే అవుతుంది...మొత్తానికి నాకు కోకిల గీతం నిర్వహించిన ఈ చివరి ప్రేమలేఖల పోటిలో మూడవ బహుమతి వచ్చింది .... ఆర్ వి ఎస్ ఎస్ శ్రీనివాస్ గారికి, లక్ష్మి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు )

10, జనవరి 2014, శుక్రవారం

మనసు పుట్టినరోజులు.....!!

ఎందరు మారినా మార్పు రాని నన్ను మెచ్చుకుంటున్నారు అనుకోవాలో...లేక నలుగురితో పాటు మారలేని నా అశక్తతచూసి జాలి పడాలో...!! ఏమో ఎవరు ఎలా అనుకున్నా.... నవ్వుకున్నా....మారాలని అనుకోని నా మనస్తత్వం...నాలా నేను ఉండాలనుకునే నా అస్థిత్వం నన్ను మారనివ్వలేదనుకుంటా ఇన్ని రోజులు...అసలు నేను మారాలి అని అనుకునే ఆలోచనే రాలేదు ఎప్పుడు... అందరిలో మార్పు చూస్తున్నాము కాని అప్పటికి ఇప్పటికి మార్పు లేనిది నాలోనే అని చాలామంది అంటూ ఉంటే...అవును ఎందుకు మారాలి అని ఆలోచించాను....నేను నాలానే  ఇష్టం...ఇలానే ఉంటాను  నచ్చినట్టు.... ఎవరి ఇష్టం కోసమో నన్ను నేను నాకు ఇష్టం లేక పోయినా మార్చుకోను...కాకపొతే నా ఇష్టాల్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది ఒక్కోసారి అందరి సంతోషాల కోసం....అలా ఉంటూ నన్ను నేను మర్చి పోతానేమో అని  భయం కూడానూ....!!
అన్నట్టు నా భావాలను నా మనసు స్పందనలను నాతోపాటుగా పంచుకుంటూ నాలో  భాగమైన నా కబుర్లు కాకరకాయలు ఐదు పుట్టినరోజులు చేసుకుని ఆరో సంవత్సరంలోనికి అడుగు పెటింది....ఇలా నాతోపాటుగా మీరు నా కబుర్లు కాకరకాయలను అస్వాదిస్తున్నందుకు  అందరికి నా మనఃపూర్వక వందనాలు ..... !!

9, జనవరి 2014, గురువారం

నిన్ను ఇంకెలా వెదకను...!!

జ్ఞాపకాల నీడల్లో వెదుకుతూనే ఉన్నా
గతాన్ని కదుపుతూనే ఉన్నా
వాస్తవమై నువ్వెప్పుడు వస్తావని...!!

నిశీధి నీరెండలో చూస్తూనే ఉన్నా
ఏ మిణుగురు వెలుగుల్లో అయినా
కనిపించక పోతావా అని...!!

నీ మనసు మాయలో పడి
నన్ను నేను మరచి పోతానేమోనని
అనుక్షణం భయపడుతూనే ఉన్నా....!!

ఈ భయాల వెదుకులాటలో
దరి చేరని బంధాల భావాలు
నీకు తెలియకుండానే ఎన్నో  ఎన్నెన్నో....!!

చెలిమి తలపు మనసు మమత
మాయని మౌన వీచికలుగా తాకుతూ
నేనెక్కడో తెలియని నన్ను నీలో చూపించిన
నిన్ను ఇంకెలా వెదకను...!!

8, జనవరి 2014, బుధవారం

ఇది నిజం....!!

రంగుల జీవితాల్లో వెలసి పోయిన రంగుల చిత్రాలు ఇలానే తెల్లవారి పోతాయి కాబోలు ....మొన్న దివ్య భారతి నిన్న
స్మిత ఈ రోజు ఉదయ కిరణ్...రేపు మరెవ్వరో...!! ఏ జీవితాన్ని అయినా అధికారం..హోదా...డబ్బు...వారసత్వాలు ... ఇవే శాసిస్తున్నాయి...రంగుల జీవితాలయినా..మామూలు జీవితాలయినా పాకుడు రాళ్ళు ఉంటాయి... నడిచే దారి అంతా గులాబి రేకులే స్వాగతం పలకవు...గుచ్చుకునే గులాబి ముళ్ళు ఆ రేకుల పక్కనే దాగి ఉంటాయి...గుచ్చుకుంటున్నాయని బాధ పడుతూ ఉంటే ముందుకు వెళ్ళలేని పరిస్థితి..పోనీ అక్కడే ఆగిపోదామంటే అలవాటయిన అవసరాలు, దర్పాలూ ఊరుకోనివ్వవు మనసును...తెలియకుండా వచ్చిన పేరు ప్రతిష్టలు తెలిసి పోతూ ఉంటే తట్టుకోలేని స్వభావం...  సుఖానికి అలవాటు పడిన ప్రాణం కష్టాలను అలవాటు  ఇష్టపడదు...ఎందరున్నా ఎవరు లేని ఒంటరి తనాన్ని మిగులుస్తుంది...ఆ ఏకాంతమే ప్రాణాలను హరిస్తుంది  ఒక్కోసారి...!! అలా అర్ధాంతరంగా ముగిసి పోయిన జీవితాలు ఎన్నో  రంగుల ఊసరవెల్లుల ప్రపంచంలో...హోదా డబ్బు ఉంటే చాలు ఎంత వెధవ అయినా ఆకాశానికి ఎత్తుతారు భజన బృందాలు... వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో కుక్కల చావులకి కూడా ఎగేసుకుంటూ వెళ్ళి  సానుభూతి నాటకాలు వేస్తారు...అసలు రంగులు కనపడనీయరు...దాచేస్తారు.. ఇలా దాయడం అలవాటయిన బ్రతుకులు కదా...!!
ఒక్క కాకి చనిపోతే వందల కాకులు గుమికూడతాయి.... కనీసం వాటిని చూసి అయినా నీతులు చెప్పడం ఆపేసి మన తప్పులకు ఎన్ని జీవితాలు నేల రాలి పోతున్నాయో అని ఒక్క క్షణం మానవత్వంతో ఆలోచిస్తే ఈ రోజు ఉదయ కిరణ్ చనిపోయే వాడు కాదు...గొప్ప వారి ఫోటోలు పెట్టుకుని...సామాజిక న్యాయమంటూ అర్ధం తెలియని పదాలు చెప్తూ పార్టీలు పెట్టి దొరికినంత సొమ్ముకూడగట్టుకోవడం కాదు... పదవి కోసం అర్రులు చాస్తూ నైతిక విలువలు మరిచి పోయి...పాకులాడటం కాదు...ఆర్ధిక అవసరాలు, ఇంట్లో గొడవలు ఉదయ్ ప్రాణాలు తీసాయని చెప్తూ మన బాబులు అసలు కారణాన్ని మరుగున దాచేస్తున్నారు వారికి అందిన సూచనల మేరకు...ఈ ఉదయ కిరణం చిరునవ్వును చిదిమేసిన పాపం ఎవరిదో అందరికి తెలుసు....మీడియా, ప్రముఖుల కుటుంబాలు చాలా వరకు పెద్ద పెద్ద బాబులకు అయితే వెంటనే ఉరుక్కుంటూ వెళ్లి బూడిద తెచ్చే వరకు ఉంటారు...కనీసం సహా నటుడు చనిపోతే రాని ఆ పెద్ద పెద్ద బాబుల మనసులు ఎంత పెద్దవో ఇకనయినా అభిమానులు అర్ధం చేసుకోండి... మంచి ఎక్కడున్నా అభినందించండి....చెడు ఎంత పెద్దదయినా ఖండించండి...లేదా ఈ రోజు ఉదయ్ పరిస్థితే రేపు మరోకటికి వస్తుంది...ఇది నిజం....!!

5, జనవరి 2014, ఆదివారం

శిరస్సు వంచండి....!!

ఒక్కోసారి వింతగా అనిపిస్తూ ఉంటుంది...ఈ అంతర్జాలం....!! ఈ స్నేహాలు, పరిచయాలు....ఇక ముఖపుస్తకమయితే చెప్పనక్కర లేదు...ఎందుకు స్నేహం అంటారో తెలియదు...అసలు రూపాలు ఉండవు...కొసరు మాటలే ఉంటాయి...స్నేహానికి మీ అర్ధం  ఎదుటి వారికి కూడా తెలిసేటట్లు ఉండాలి....ఉన్న కొద్ది సమయంలో
మన పనిలో మనం ఉంటే మధ్యలో అంతరాయాలు...అక్కరకు రాని మాటలు...సమాధానం చెప్పక పొతే చెణుకులు మిణుగురు పురుగుల్లా....అందరి సమయము విలువైనదే అండి...మీ జీవితం మీకు ఎంత ముఖ్యమో ఎదుటి వారి జీవితం కూడా వారికి అంతే ముఖ్యం అని అర్ధం చేసుకోండి....మన బంధాలను నిర్లక్ష్యం చేయకుండా కొత్తొక వింత పాతొక రోత అన్నట్టు ఉండకండి...మూలాలు మరచిపోతే మనకే నష్టం....మనం ఎక్కిన కొమ్మను మనమే నరుక్కున్న చందాన అయిపోతుంది....మానసికమా.. శారిరకమా... అన్నది మన మనసు విజ్ఞత సంస్కారం మీద ఆధారపడు ఉంటుంది...అందరికి తెలిసిందే అయినా  చెప్తున్నా.. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు..మాన్ జీవితం ఎంత బావున్నా ఇంకా ఏదో లేదని వెలితిగా ఉందని అనుకుంటూ అందని దాని కోసం ఆశ పడుతూ ఉంటాము....తప్పేం లేదు...ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలని ఆశ పడే మన మనసుదే ఆ ఆట మనతో....ఇటు మన సంస్కృతి సంప్రదాయాలు..అటు పాశ్చ్యాత్య సంస్కృతి వైపుమోగ్గు చూపుతున్న ఎందరో....వారిలోనూ చక్కని మంచి తనముంది...కాని మనకి అది నచ్చదు....ఆధునికత పేరుతో...రోంలో ఉంటే రోమన్ లా ఉండాలని అనుకుంటూ...మనం మనల్ని మర్చి పోతూ...దూరపు కొండలు నునుపు అన్న సామెతను నిజం చేస్తూ...అబద్దంలో ఉండి పోవాలనుకుంటూ... అదే జీవితమని భ్రమలో ఉండిపోతున్నాము...మన విలువలను, విజ్ఞానాన్ని ప్రపంచం యావత్తు గౌరవిస్తుంటే మనం దానికి వలువలు లేకుండా చేస్తున్నాము...నాగరికత ఏదైనా దానిలోని మంచికి శిరస్సు వంచండి....!! స్నేహాలను సంప్రదాయాలను వాటి అభిమానాలకు, అర్హతలకు మచ్చ రాకుండా... ఆధునిక విజ్ఞానాన్ని ఆనందంగా అనుభవిస్తూ... మీ తోటి నలుగురికి ఆ ఆనందపు హాయిని అందించండి...!!

4, జనవరి 2014, శనివారం

అందమైన నక్షత్రాలు....!!!రాలిపోయిన పువ్వులా వాడి పోయిన మొగ్గలా
వన్నెలు తరిగి వెలసి పోయిన రంగుల జీవితం
అక్కడక్కడా మట్టి చారికలు వెక్కిరిస్తూ
అంతలోనే పక్కన వాన నీటి గుర్తులు
ఇంకిన కన్నీటి సంద్రానికి  సరిహద్దుగా
గుంటలు పడిన పై కప్పులో కనిపిస్తూ
గొంతును నొక్కేసిన రక్కసి ఉక్కు పాదాలు
జరుగుతున్న రాక్షస క్రీడలో తమ భాగంగా
న్యాయం నోరు నొక్కేసి చట్టం కళ్ళను కప్పేసి
అన్యాయానికి పట్టం కట్టే అఖండ సింహాసనం
కబంధ హస్తాల నడుమ నలిగి రాలిపోయిన
లేత చివురాకుల జ్ఞాపకాల చుక్కల ముక్కలు
ఆకాశంలో తారాడే అందమైన నక్షత్రాలు
చీకటి చుట్టానికి నేస్తాలు
పగిలిన మనసుకు బంధాలు
ఒంటరిగా మిగిలి పోయిన జీవశ్చవాలు....!!

3, జనవరి 2014, శుక్రవారం

నవరత్నాల రాజసాన్ని.....!!

రత్నాల రాశులు కుప్పలుగా పోసి
నక్షత్రాల వెలుగులో నీ కోసం చూస్తూ....
ముత్యాల రాశిలో మురిపెంగా చేయి వేసా
జల జలా జారిపోయింది చేతికందకుండా
నీ కోసమే ఈ ముత్యాల పానుపంటూ...
పగడాల రాశి పక్కున నవ్వింది
పలువరుస తళుక్కుమనేలా
నీ చిరు దరహాసంతో పోటి పడుతూ...
మాణిక్యం మెల్లగా జారుకుంది
నీ బుగ్గల కెంపుల కాంతికి తడబడి పోతూ...
మరకతమణి పచ్చని పచ్చికను స్పృశించిన
అనుభూతిని అందించింది నీ స్పర్శలో...
పుష్యరాగాల సరాగాల రవళి
నీ పాదాల సవ్వడిలో చేరి
గోమేధికాల అడుగుల్లో కలసి పోయి
వజ్ర వైడూర్యాల నీల మణిని
నవరత్నాల రాజసాన్ని ఏర్చి కూర్చి
నాకందించిన విధాతకు వందనాలు...!!

1, జనవరి 2014, బుధవారం

మనసు కవిత్వం....!!

మాటలలో మనసు తెలుస్తుంది అంటారు.. అది నిజమేనేమో అనిపిస్తుంది ఒక్కోసారి...!! చక్కని పరిచయంలో తొణికిన పలుకుల భావాలు మనసులో నుంచి ఆశువుగా చెప్పిన అక్షర కర్త ఆశు కవిత్వం....మనసు కవిత్వం...... మీ అద్భుత భావ జాలానికి వందనాలు..... 

మనసు విప్పి మాటాడితే ముదితా..
ఎదకు హాయి కలిగె నెందుకో...
పెదవి దాటి రాని భావమేదో తడిమిపోయే నెందుకో....!!

నీ నవ్వుల పువ్వులతో
నవలోకాన్ని సృష్టించావు....!!
నా బ్రతుకులో ఆనంద
రంగవల్లులే చిత్రీకరించావు....!!

పదాల పూమాలలతో
వాగ్దేవిని అలంకరించనా....!!
హృదిలో తీపి భావనతో
మది రాణిని అర్చించనా...!!

కొత్త సంవత్సర శుభాకాంక్షలు....!!

కాలం పరుగెత్తి పోతూనే ఉంది
రోజు సూర్య చంద్రులను మార్చుకుంటూ
క్షణాలను నిమిషాలుగా చేసి
ఆ నిమిషాలను గంటలుగా మార్చి
రోజులుగా రూపుదిద్దుకుని
వారాలు నెలలుగా రూపాంతరం చెంది
సంవత్సరంగా మారుతూ....
దానిలో బోలెడు జ్ఞాపకాలను
వాటిలో జీవితాలను మోసుకుంటూ
మరో కాలండరు మారిపోవడానికి
సమాయుత్తమవుతూ.....
క్రొంగొత్త ఆశలతో మార్పు కోసం 
కొత్త కాలండరు వత్సరానికి స్వాగతిస్తూ
అందరికి ఆనందంగా ఉండాలని ఆశ పడుతూ
అందరికి ఆంగ్ల కొత్త సంవత్సర శుభాకాంక్షలు....
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner