21, ఫిబ్రవరి 2016, ఆదివారం

నా మాతృ భూమి... !!

రోజూ నన్ను నేను మోసం చేసుకుంటునే ఉన్నా
కన్నతల్లిని మరిచా పురిటి గడ్డను వదిలేసా
డాలర్ల బరువుతో రూపాయిని బేరీజు వేసా
చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన దేశభక్తిని వదిలేసా
అమ్మ భాష కూడు బెట్టలేదని అరకొరగా వచ్చిన
ఆంగ్ల భాషను అందలమెక్కించా అదే జీవితమనుకొన్నా
అనుక్షణం భయంతో చస్తూ బతుకుతున్నా
అదే స్వర్గమని మాయలో పడి అమృతమయిని
నిరాదరణకు గురి చేసిన నా నిర్లక్ష్యపు విలువ
కట్టలు తెంచుకున్న ఓ కన్నపేగు ఆక్రోశం చేసిన ఆర్తనాదం
వేల గొంతుకలుగా గుచ్చుతుంటే...
సప్త సముద్రాలను దాటిన మాతృప్రేమలో కలసిన
దేశాభిమానం మదిని తాకుతూనిదురలేపగా
కలో గంజో అయినవాళ్ళ మద్యన తాగుతూ
జన్మనిచ్చిన అమ్మ ఋణం కన్నా ఆ అమ్మకు
ప్రాణం పోసిన గడ్డ పవిత్రతే ముఖ్యమని
అసహనం, అసమానత, జాత్యహంకారాలు దరిజేరనీయక
పరమత సహనం, శాంతి, సౌభ్రాతృత్వం పెంచుతూ
మంచి మానవత్వం మనదని చాటుతూ
సాటివారి కష్టానికి చేయి అందిస్తూ
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే  మనుషులోయ్ అన్న
గురజాడ మాటని అక్షరాలా నిజం చేసిన మనసున్న
మనుష్యులున్న భరతభూమి నా మాతృ భూమిపై 
పెంచుకుకున్నా అనుబంధం తెంచుకోలేక
ఉండి పోతా తుది శ్వాస వరకు ఈ గడ్డ పైనే..!! 

18, ఫిబ్రవరి 2016, గురువారం

మణి మాలికలు....!!

1. నీ సమక్షంలో తెలుసుకున్నా
యుగాలను క్షణాలుగా బంధించడమెలానో..

ఏడవ పుట్టినరోజుకి...!!

2009 జనవరిలో మొదలైన ఈ కబుర్లు కాకరకాయలు బ్లాగు  ఆరు పుట్టినరోజులు జరుపుకుని ఏడవ పుట్టినరోజుకి మీ ముందుకి కొద్దిగా ఆలశ్యంగా ఓ 1270 పోస్ట్ లతో వచ్చేసింది మరి ..
బాధో, కోపమో, ఆవేశమో ఇలా అనిపించిన అన్ని నాతో పాటుగా ఇక్కడ నాకు తెలిసిన కొన్ని అక్షరాల్లో అదీ నాకు అప్పటికప్పుడు వచ్చిన భాషలో పంచుకోవడం బాగా అలవాటై పోయింది ఒకప్పుడు ... ఇప్పుడేమో రాయాలని ఉన్నా రాయలేని అశక్తత వెన్నాడుతోంది ... అందుకే రాబోయే కాలంలో నాలాంటి వాళ్ళ కోసం మనసుని డి కోడ్ చేసే పరికరాలు కూడా కనిపెడితే బావుండేమో .. నాకసలే కాస్త రాయడం అంటే బద్ధకం కూడానూ ..
అవునూ సమానత్వం, స్వేచ్చ అని అంటారు కదా .. అవి మాటల వరకేనా ... కనీసం ఒక ఇంట్లో ఉన్న మగాడు చెప్పాపెట్టకుండా వెళిపోయి వాడి ఇష్టం వచ్చినప్పుడు వాడు వస్తాడు .. అదే ఆడది అలా వస్తే ఊరుకుంటారా... బోలెడు బిరుదులు అందించరూ ... కనీసం పగలు చెప్పకుండా వెళితేనే ఊరుకోరు .. మీలో ఎంతమంది ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు కనీసం అమ్మకో ఇల్లాలికో చెప్పి వెళుతున్నారో ఆత్మవంచన చేసుకోకుండా నిజాయితీగా ఒప్పుకోండి ... తప్పించుకోవద్దు కొన్ని చెప్పి వెళ్ళేవి ఉంటాయి .. కొన్ని చెప్పకుండా వెళ్ళేవి ఉంటాయి అని .. అది నటన అవుతుంది .. అమ్మ ప్రేమ ఆస్వాదించడం తెలియని వాడికి ఆలుబిడ్డల మమకారం తెలియదు .. నాకు అందుకే భగవంతుడి మీద కోపం ... కన్నపేగు తీపి అనేది దేవుడికి తెలియదు .. మొన్నీమద్య చిన్ని చిన్ని పిల్లి పిల్లలు మూడు ఆడుతూ ఉన్నాయి రెండు రోజులు .. తరువాత రోజు చూస్తే చనిపోయి ఉన్నాయి .. అక్కడ చిన్న స్టోర్ రూం తలుపు వేయడం మర్చిపోవడం మానవ తప్పిదం .. దానికి మూల్యం అభం శుభం ఎరుగని రోజుల పసి గుడ్డులు ప్రాణం కోల్పోయాయి .. పాపం ఆ తల్లి పిల్లి ఎంత ఏడ్చిందో .. దాని కోపం తీరక కార్ కవర్ చిన్చేసింది ... కుక్కలు దానికన్నా పెద్దవి వాటిని ఏమి చేయలేదు కదా .. అందుకే ఇక్కడ దేవుడికి కన్నపేగు మమకారం తెలియదు అని అనేది అది తెలిస్తే వాటి ప్రాణాలు అంత కర్కశంగా తీసేవాడు కాదు .. ఇక్కడ రాయలేను ..  ఎక్కడ చూసినా ఈ మగతనపు అహంకారమే కనిపిస్తుంది ... పైకి మాత్రమే నీతులు .. నేతి బీరకాయలో నెయ్యి చందాన అన్నమాట ... !!

15, ఫిబ్రవరి 2016, సోమవారం

చిరిగిన పేజీ....!!


మోపలేని భారాన్ని
మదిలో దాయలేక
గతజన్మలో అలవాటైన 
అక్షరాన్ని ఆసరాగా
అంది పుచ్చుకుంటూ
అల్లరిగా కాగితాన్ని
అటుఇటు నలుపుతూ
ఆడుతూ పాడినప్పుడు
తెలియనే లేదు ...
ఆ మమకారపు సవ్వడి
నైరాశ్యాన్ని పారద్రోలి
నిశీధిలో సైతం వెలుగు పూలు
విరజిమ్మే వింత శక్తినిస్తుందని
రాయలేని కలానికి
మనో వీక్షణం అవుతుందని
చరిత్రలో ఓ చిరిగిన పేజీ అయినా 
ఈ అసమర్ధపు జీవిత పోరాటంలో
అహానికి సమాధానంగా నిలుస్తుంది....!!

1, ఫిబ్రవరి 2016, సోమవారం

శిధిల శిల్పమై నిలిచాను ... !!















రాయలేని అక్షరాలు ఎన్నో
చలనం లేకుండా పడి ఉన్నాయి
ఎటూ పోలేక బందీలుగా

కదిలే మదిలో భావాలెన్నో
నైరాశ్యపు నిరీక్షణలో ఎదురుతెన్నులౌతూ
చిరునవ్వు చాటుగా దాగుంటూ

మౌనాన్ని వీడని క్షణాలెన్నైనా
నిశబ్దంలో వినిపించిన నీ పిలుపులై
పలకరించినట్లుగా తాకుతూ

వేదన నాదైనా వేకువ నీదంటూ
గ్రహణం నాకని జ్ఞాపకం నీకొదిలివేసి 
శిధిల శిల్పమై నిలిచాను ... !!

ఎవరు బాధ్యులు ..??

ఇంతకు ముందే టి వి లో జగన్ గారి మాటలు విన్నా ... రంగా గారు చనిపోవడానికి కారణం చంద్రబాబు గారు కారణం
అని చెప్పారు .. ( పరిటాల రవి , మొద్దు శీను మొదలైన వాళ్ళు చనిపోవడానికి కారణం ఎవరో ) అలాంటప్పుడు వారి తండ్రి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇవి అన్ని గుర్తుకే రాలేదా వారికి .. వర్గ పోరాటాలను రాజకీయ అవసరాలకు వాడుకుని ఈ ముద్రగడ గారే రంగా చనిపోక ముందు 1988 డిసెంబర్ లో పీపుల్స్ ఎన్ కౌంటర్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ నాకు ఇప్పటికి గుర్తు ఉంది .. రంగా చనిపోతే ఆంధ్రాలో మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అని .. అంటే ఎవరు చనిపోవాలని ఎదురు చూసారో కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది అందరికి వాస్తవం ... అప్పుడు ఎంతమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారో అందరికి తెలుసు ... అదే పరిస్థితి నాకు నిన్న గుర్తుకు వచ్చింది ... ఎంత సౌమ్యంగా చెప్తున్నారో గాంధేయవాదులు ... చాలా నవ్వు వచ్చిన మాట తినడానికి తిండి లేదట ... దానికోసమట .. మరి జరిగిన నష్టానికి బాధ్యత ఎవరు తీసుకుంటారో ముందు చెప్తే కాని తరువాతి సంగతి తేల్చడానికి జనాలు ఒప్పుకోరు ఈసారి .. లేకపోతే ప్రతిసారి ఇదే పునరావృతం అవుతోంది .. పన్నుల భారం మాపై మోపడానికి మేము ఒప్పుకోము .. ప్రతిభకు ఎలానూ గుర్తింపులేదు .. కనీసం కొద్దిపాటి న్యాయ పోరాటం ఈసారి నుండి మేము చేయడలుచుకున్నాము .. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్థులకు ఉద్యమకారులు , ఆందోళనకారులు నష్టం కలిగించినప్పుడు .. దానికి బాధ్యులైన వారిని ముందుగా చట్టం శిక్షిస్తే కాని తదుపరి వారి వారి విషయాలను న్యాయపరంగా పరిగణలోనికి తీసుకోవడానికి మేము అనుమతించము ... అన్నిరకాలుగా నష్టపోవడానికి మేము సిద్దంగా లేము .. మేము సామాన్యులము .. నిన్న జరిగిన దానికి ఎవరు బాధ్యులు ..??
కులం మార్చుకుని అవసరాలకు వాడుకంటే తప్పు లేదు ... ఆత్మహత్యలకు రాహుల్ గారి హుటాహుటి ప్రయాణం ... అదే కాంగ్రెస్ నాయకుడు కోడలిని అభం శుభం తెలియని చిన్నారులని చంపేసి కల్లబొల్లి ఏడుపులు ఏడ్చేస్తే అప్పటి ఎలక్షన్ లో పార్టి టికెట్ ఇవ్వలేదని జనాల కళ్ళ నీళ్ళు తుడిచేయడం ... ఇదండీ కులం కుళ్ళు కంపు కొట్టే కుళ్ళు రాజకీయం ... ఇదే నేటి రాజకీయం ...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner