27, ఏప్రిల్ 2013, శనివారం

నా మనసులోని మాటలు కొన్ని బ్లాగులోకంలో....!!

నా మనసులోని మాటలు కొన్ని బ్లాగులోకంలో.... ఉగాది కవితా పోటిలో రెండో బహుమతి వచ్చిన నా కవితకు గోదావరి కధలతో పాటు నా ఇంటర్వు కూడా ఇచ్చిన లాస్య రామకృష్ణ గారికి ధన్యవాదాలు :)
చూసి మీ అభిప్రాయాలు కాస్త చెప్తారు కదూ..... మంజు

 http://submityourblogs.blogspot.in/2013/04/blog-post_26.html

25, ఏప్రిల్ 2013, గురువారం

నాతోనే నువ్వని ఒప్పుకొని నువ్వు....!!

నేనస్సలు గుర్తుకే రావడం లేదంటావు
పలకరించక పొతే అలుగుతావు
సరే పోనీ అని మాటాడిస్తే మాట్లాడవు
వేళ కాని వేళలో గుర్తు వచ్చినా...
ఒప్పుకోక జ్ఞాపకమే లేనంటావు...!!
దారి కాని దారిలో ఎదురు వచ్చినా...
పరిచయమే లేనట్లుగా 
నేనెవ్వరో తెలియదంటావు..!!
మరచి పోయానంటావు
మరుపన్నదే తెలియదంటావు...!!
వదలలేనంటావు...ఉండలేనంటావు
దగ్గరగా రావు.... అలా అని....
దూరంగాను ఉండలేవు...!!
ఒప్పుకోవు...వదలలేవు....!!
అందుకేనేమో ఎప్పుడు...
నను వదలక నాతోనే ఉంటావు నువ్వు ...!!
నాతోనే నువ్వని ఒప్పుకొని నువ్వు....!!
నాతోనే ఎప్పటికీ....!!

22, ఏప్రిల్ 2013, సోమవారం

ప్రియ నెచ్చెలి అరుదెంచిన వేళ....!!

ప్రియ నెచ్చెలి అరుదెంచిన వేళ....
ఆనందం అంబరాన్నంటిన సమయం  
ప్రేమగా పంచుకున్న ముచ్చట్లు
ఆనాటి నుంచి ఈ నాటి వరకు....!!

ఆత్మీయ పకరింపు విలువ
వెల కట్టలేనిది... ఈ సృష్టి లో...!!
మనసు తెలిసిన మమతలు
కలబోసుకున్న పాత జ్ఞాపకాలు
కలుసుకున్న ఆ క్షణం....!!
మాటలు మౌనమై...
మనసులు  మాటాడుకున్న తరుణం....!!

ఓ ఆత్మీయ కలయిక
ఓ చిన్న పలకరింపు 
అదే స్నేహం గొప్పదనం...!!
ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా మారని
ఆనాటి చెలిమి ఈ నాటికి అలాగే
అప్పటి అనుభూతితోనే....!!

21, ఏప్రిల్ 2013, ఆదివారం

నీ రాక కోసం నేనిలా.....!!

ప్రకృతి కాంత వెదుకులాట వసంతుని కోసమేమో....!!
విరి పువ్వుల చిరునవ్వులు ఎవరి కోసమో....!!
వాసంత సమీరం పలకరించి వెళ్ళింది
మలయమారుతం తాకి పోయింది
తెలియకుండా వసంతమే వచ్చిందో
వనమంతా వెదజల్లి వెళ్లిందో....!!
విరుల విరుపుల ఒయ్యారాలు
నీ ఆగమనం కోసం
నా ఎదురు చూపులను తలపిస్తుంటే....!!
వసంతంలో ఉగాది ఉషస్సులు
ఎప్పుడెప్పుడా అని...
నీ రాక కోసం నేనిలా.....!!

( ఇది కూడా వేరే ఉగాది కవితా పోటికి పంపాను కాని బహుమతి రాలేదు -:)....)

19, ఏప్రిల్ 2013, శుక్రవారం

నాదో....నీదో....!!

పెద్ద కధ రాద్దామనుకుంటే చిన్న కధే వస్తోంది....!! ఏం చేయాలి మరి...!! నా కధ చెప్పనా....!! నీ కత చెప్పనా....!!
అవునూ నీది నాది ఏంటి మన కత చెప్పేస్తాను సరిపోతుంది....!!
ఎప్పుడూ మాటాడని నువ్వు ఒక్కసారిగా కాస్త పరిచయంతో దగ్గరగా వచ్చావు...పోనిలే అనుకుంటే నా ఆలోచనల్లో చోటు చేసుకున్నావు...నీ మాటలతో....!! నా ప్రపంచంలో నేనుంటే....నాకు చోటు కావాలన్నావు...నేనేం చెప్పకుండానే నాతో జీవితం అన్నావు...!! అటు ఇటు అయ్యి నాన్న ఇంట్లో నుంచి పంపేస్తే నా చేయి అందుకున్నావు నేను అనుకోకుండానే....!! ఏమి తెలియని నాకు ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసావు...!! దానిలో బాధలు...  సంతోషాలు.....కోపాలు...రేపేంటి అన్న ప్రశ్నలు....ఇలా అన్ని కలగాపులంగా నాతోనే కలిసి పోయి జీవితాన్ని....దానితో పాటు నిన్ను అర్ధం చేసుకునే క్రమంలో జీవితం గడిచి పోయింది నాకు తెలియకుండానే....!! అయినా ఇప్పటికి అర్ధం కాని విష్యం మన ఈ బంధం ఏమిటా అని....!!
చేయి అయితే అందుకున్నావు కాని దానితో పాటు బంధాలను బాధ్యతలను కూడా భరించాలి అని మర్చిపోయావా...!! ఇబ్బంది లేకుండా అన్ని అందుతూ ఉంటే అన్నింటా సంతోషమే...అదే ఆనందం కష్టంలో ఉన్నప్పుడు కూడా అలానే ఉండాలి....అదీ నిజమైన సంతోషం...జీవితం కూడానూ....!!
ఆర్తిగా అందుకున్న చేయిని జీవితాంతం అలానే చూసుకోవాలి....అవసరం తీరిందని చులకన చేయకూడదు....!! ఎందరితో నువ్వున్నా... అందరిని కావాలనుకున్నా...నీ కోసం తపించేది... ఆలోచించేది నేనే అని నీకెప్పటికి తెలుస్తుంది...??   ఇన్ని చెప్తున్నానా...!! ఆవునూ ఇంతకీ మనది ఏ బంధం...!! ఇది సమాధానం లేని ప్రశ్నగానే ఉండి పోయింది నాలో....!!

నీకెలా చెప్పను....!!

ఉత్తరంగా రాద్దామని                               
ఉత్పలమాలనడిగితే
ఊ...అంటూ వెళ్ళిపోయింది
ఏమి చెప్పకుండానే...!!

మత్తుగా గమ్మత్తుగా
చెప్తుందేమోనని మత్తేభాన్నడిగితే
మత్తుగా నిద్దరోతున్నానంటూ
ముగ్ధంగా సోలిపోయింది....!!

సంతోషంగా చెప్తుందేమోనని
చక్కని చుక్క శార్దులాన్నడిగితే
చెప్పాపెట్టకుండా ఇంచక్కా పోయింది....!!

ముద్దమందారంలా ముద్దుగా బొద్దుగా
చెప్తుందేమోనని చెంపకమాలకి చెప్తే...
చెట్టాపట్టాలేసుకుని తిప్పుకుంటూ
చెమ్మచెక్కలాటకి వెళిపోయింది
తిరిగి చూడకుండా...!!

జారుతూ జాలువారుతూ
జావళిలా చెప్తుందేమోనని
సన్నని సీసాన్నడిగితే....
మెత్తగా జారిపోయింది దొరకకుండానే....!!

కమ్మగా అమ్మ జోలపాటలా
చెప్తుందేమోనని కందాన్నడిగితే....
మరుక్షణంలోనే మరుగై పోయింది...!!

వినసొంపుగా విరుపుల ఒయ్యారాలతొ
చెప్తుందని మెత్తని మత్తకోకిలని పలకరిస్తే...
మాటాపలుకు లేకుండా మాయమై పోయింది....!!

సరే పోనీ....నాకొచ్చినట్లు చెప్దామంటే...
అక్షరాలు అలుక పూని
అందకుండా దాక్కున్నాయి....!!
ఇక నీకెలా చెప్పను....!!

18, ఏప్రిల్ 2013, గురువారం

అసలైన ఉగాది....!!

ఏవి ఆనాటి ఉగాది సౌరభాలు....?
కమ్మని వేప పూల సుగంధాలు
పుల్లని మామిడి పిందెల కమ్మదనాలు
పంచదార చెరుకు రసాలు
షడ్రుచుల ఉగాది....
చక్కని జీవితాలు ఆనాడు...!!
పై పై మెరుగులు
కల్తి సరుకులు
గమ్మత్తైన మమకారాలు కలిపిన
నటనే జీవితం ఈనాడు...!! 
భేషజాలు లేని మనసుల ఉగాది ఆనాడు...!!
భేషజాలతో కలగలిపిన ఖరీదైన ఉగాది ఈనాడు....!!
పచ్చని తోరణాల పండువెన్నెల ఆనాడు.....!!
పచ్చదనమే లేని కాన్వాసు రంగులు ఈనాడు....!!
ఏది ఆ మధుర కోయిల మత్తెక్కించే గానం...?
లేమావి చివురులు దొరక లేదని
వెదికి వేసారి మూగబోయింది ఈనాడు...!!
మళ్ళి ఎప్పుడో అసలైన ఉగాది....!!

(
'బ్లాగులోకం' నిర్వహించిన ఉగాది కవితల పోటీలో బహుమతి పొందినందుకు అభినందనలు. మీకు బ్లాగులోకం తరపు నుంచి ఒక చిరు కానుక. 

'గోదావరి కథలు' ఈ బుక్ ని అటాచ్ చేస్తున్నాను. )

ఓ కన్నీటి చుక్క...!!

జారి పడుతోన్న కన్నీటి చుక్కకేం తెలుసు
తన పయనం ఎక్కడికో...!!
తన తావిని వీడి పోతున్నా
చేరే మజిలి ఎక్కడుందో....!!

విరి పువ్వుల చిరునవ్వుల
కేరింతలు వినిపిస్తుంటే....!!
చటుక్కున బయట పడింది
కలల సంతోషాలు చూద్దామని...!!

ఎటు పోవాలో తెలియక
దిగాలుగా గాలివాటుగా పోతోంది....!!
పాపం దానికేం తెలుసు
బాధైనా సంతోషమైనా ఓ కన్నీటి చుక్కే అని...!!

17, ఏప్రిల్ 2013, బుధవారం

నువ్వేంటో....!!

నీకేమైంది....?? అందరితో మాట్లాడతావు నాతో మాత్రం మాటలుండవు? నా మీద కోపమా...!! లేక అలుకా....!!
కనీసం అదీ చెప్పవు....!! పోనీ మాటలు రావా అంటే ప్రవాహపు వెల్లువలా అలా వినవస్తూనే ఉంటాయి....నా దగ్గరకొచ్చేసరికే మౌనాన్ని ఆశ్రయిస్తావు ఎందుకోమరి...!! పోనీ నువ్వు నాకు...నేను నీకు కొత్తా...!! అంటే అదీ కాదు పాత పరిచయమే..!! సరే పోనీ దూరమేమో అంటే అదీ కాదాయే...!! నీకు తెలియని నేను కాదు నాకు తెలిసిన నువ్వేనాయే....!! మరి ఈ దాగుడు మూతలు ఎందుకోయ్....!!
నీలోనే చెప్పలేని ప్రేమని దాచుకున్నా...చూపించడం ఎందుకులే అనుకుంటున్నావా...!! దూరంగా ఉంటే ఎప్పటికి దూరం దూరమే....!! కాస్త దగ్గరగా వచ్చి చూడు ఎంత బావుంటుందో నీకే తెలుస్తుంది...!! అయినా అన్ని తెలిసిన నీకు నేను ఇలా చెప్పడం ఎవరో అన్నట్టు తాతకు దగ్గులు నేర్పడంలా  ఉంది కదా...!! మరి ఇంక నీకెలా చెప్పాలి...!! కొందరికి పంచుకోవడం రాదు...మరి కొందరికి వ్యక్తీకరించడం రాదు...ఇంకొందరికేమో తీసుకోవడం రాదు....!! నీకేమో రెండూ రావనుకుంటా...!!
నీకు భయం నువ్వు ఏంటో తెలిసి పోతావేమో అని....!! అయినా ఇప్పుడు కొత్తగా తెలియడానికేం ఉంది నీలో....!! నువ్వేంటో నాకు తెలుసు కదా....!! నీకే తెలియదు నువ్వేంటో....!! ఇక నేను నీకెలా తెలుస్తాను...!! నువ్వు నీకు తెలిస్తే నేను నీకు తెలిసినట్లే...!! అది ఎప్పుడో మరి...!!

16, ఏప్రిల్ 2013, మంగళవారం

నీ నవ్వు చెప్పింది నాకు...!!

నీ నవ్వు చెప్పింది నాకు...
నాలో నువ్వేమిటో....!!
నీ మాట చెప్పింది నాకు...
నేనెవ్వరో ఏమిటో....!!

పలికే స్వరం నాదైనా...
ఒలికించిన భావం నీది....!!
పలుకులు నావైనా....
పలికించే లాలిత్యం నీది....!!

జీవితం నాదైనా....
జీవం నువ్వే...!!
ప్రాణం నాదైనా....
ఊపిరి నువ్వే....!!

ఎదురు చూసేది నేనైనా
ఎదుట పడనిది నువ్వే...!!
రెప్ప పాటులో మాయం నువ్వు
అందుకే రెప్ప పడని క్షణం నీ కోసం....!!

15, ఏప్రిల్ 2013, సోమవారం

కలవని తీరాలు....!!

పరధ్యానంలో ఉన్నానా...!!
నీ ధ్యానంలో ఉన్నానా....!!
పరాకులో ఉన్నా చిరాకులో ఉన్నా
నీ తలపుల వాకిట్లోనే ఉన్నా...!!

మూసుకున్న కనురెప్పల చాటుగా
దాచుకున్న అనుభూతుల పొత్తిళ్ళలో
పెనవేసుకున్న అనుబంధం ఆశగా
తొంగి చూస్తోంది నీ కోసమే....!!

రాయలేని కన్నీటి కావ్యాలు
అక్షరాల కోసం ఎదురు చూస్తున్నాయి...!!
చెప్పలేని మనసు స్పందనలు
మూగగా తపిస్తున్నాయి నీకు చెప్పాలని ..!!

మౌనమే సాక్ష్యంగా....మన ఇద్దరి మధ్యన
తల్లడిల్లి పోతోంది ఎటూ చెప్పలేక....!!
దరి చేరని నువ్వు....దూరం కాని నీ ఆలోచనలు
కలవని తీరాల కలయిక ఎప్పుడో....!!

13, ఏప్రిల్ 2013, శనివారం

ఈ అనుబంధం.....!!

కలత నిదురలో కనిపించావు
కన్ను తెరిస్తే కనుమరుగైనావు

కలల కౌముది కట్టి పడేసింది
ఊహల వంతెన వారధిగా నిలిచింది

చాటు మాటు సోయగాలు
మబ్బుల మాటున మసక జాబిల్లి అందాలు

పదే పదే పలకరించే నీ పలకరింపుల
జ్ఞాపకాల జాజుల సుమ గంధాలు

వద్దని విదిలించినా వదలిపోనివి
కాదని వదిలేసినా వీడి పోనివి

అందుకేనేమో అప్పుడు అల్లుకున్న
ఈ అనుబంధం ఇప్పటికి అలాగే
అప్పటి అనుభూతులతో అజరామరం...!!

12, ఏప్రిల్ 2013, శుక్రవారం

చీమలు చెప్పిన సత్యం....!!

నిన్న పొద్దున కాఫీ తాగుతూ బయట కూర్చుంటే పొద్దు పొద్దునే నల్ల గండు చీమలు బారుగా ఒక వరుసలో పోతూ నా కంట బడ్డాయి. చూస్తూ ఉంటే వెనుక చీమల కోసం ఆగుతూ మళ్ళి వాటిని కలుపుకుని పోతూ పక్కలమ్మట రెండు మూడు చీమలు ముందుకు వెనుకకు పోతూ మొత్తం మీద అన్నిటిని కలుపుకుని అన్నీ కలిసి వెళ్ళాయి. నాకు వాటిలో నచ్చిన విష్యం రాలేని వాటి కోసం ఆగడం...చుట్టుపక్కల ఏమైనా జరుగుతుందేమో అని గమనించడం భలే నచ్చింది. మళ్ళి సాయంత్రం చూసినా అదే సీను....మొత్తం మీద చిన్న చీమలైనా మంచి విష్యాన్ని చెప్పాయనిపించింది.
మనలో లేని మంచితనం చిన్న ప్రాణి అయినా వాటిలో ఉంది. కలిసి కట్టుగా ఉండటం అనేది. కాస్త తిండి దొరికినా అన్ని కలిసి పంచుకుంటాయి. మనమేమో మనం తప్ప ఎవరు బావున్నా చూడలేము....
పరాయి వాళ్ళు కానక్కర లేదు ఓ తల్లి కడుపున పుట్టిన వాళ్ళే అయినా తోబుట్టువులు బావుంటే ఓర్వలేరు.
పక్క వాళ్ళు బావుంటే పది రూపాయలు ( ఈ రోజుల్లో పది రూపాయలు కాదు లెండి వెయ్యి రూపాయలు అనాలి కాబోలు) అప్పు అయినా ఇస్తారు అనుకోవాలి కాని మనం పొతే పక్క వాడు కూడా పోవాలి అనుకునే మనస్థత్వం ఎప్పటికి మారుతుందో మరి...!!

10, ఏప్రిల్ 2013, బుధవారం

అందరికి......!!
వసంత శోభలతో విలసిల్లె  ఉగాది.....
అందరికి ఆనందాన్ని పంచాలని....
అనుబంధాలను పెంచాలని.....
ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని.... 
కోరుకుంటూ అందరికి ఉగాది శుభాకాంక్షలు 

8, ఏప్రిల్ 2013, సోమవారం

వి...డాకులు....!!
విడాకులు అనేవి ఒక్క భార్యాభర్తల బంధానికేనా....??
మరి ఏ ఇతర బంధాలకు వర్తించవా....!!7, ఏప్రిల్ 2013, ఆదివారం

ఆలోచించండి.....!!

ఇల్లంటే....??
కుటుంబం అంటే....??
ఓ బాధ్యత...ఓ హక్కు మాత్రమే కాదు....!!
ప్రేమలు....అభిమానాలు....కోపాలు....తాపాలు....బాధ...సంతోషం....ఇలా అన్ని కలబోసిన మనది మాత్రమే అన్న ప్రపంచం. హక్కులను మాత్రమే గుర్తు ఉంచుకుని బాధ్యతలను మర్చిపోయి....ఎప్పుడో ఒకసారి......అదీ అందరూ నిన్ను కాదన్నప్పుడు  వచ్చినా కూడా సాదరంగా ఆహ్వానం పలికేదే ఇల్లు. ఇంటి విలువ తెలియని వాడికి ఇంటిలోని కుటుంబం విలువ మాత్రం ఎలా తెలుస్తుంది....??
వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు అని ఎండమావుల వెంట పడి పోయే వాడికి ఒయాసిస్సు చల్లదనం కాని.....చల్లదనం ఏంటి....అసలు ఒయాసిస్సు అంటేనే తెలియదేమో....!! ఏదో నలుగురు భజనగాళ్ళు తన చుట్టూ చేరి  డప్పు కొడుతుంటే అదే వినసొంపైన వీనుల విందైన సంగీతమని భ్రమలో బతికే వాళ్ళకి అదే స్వర్గం గా కనిపిస్తుంది....అంతే కాని ఈ భజనగాళ్ళు మన దగ్గర సొమ్ములు లేనప్పుడు మనకు అస్సలు మొహమే చూపించలేదని గుర్తుకు రాదు. మనకు తాడు బొంగరం లేనప్పుడు ఆసరా ఇచ్చిన చేయి ఇప్పుడు గుర్తుకు రాదు....ఇది మనిషి సహజ నైజమేమో....!! తిని మర్చిపోతే మామూలే అనుకోవచ్చు కాని తిని...పెట్టిన చేతినే కాటు వేసే గుణాన్ని పాముతో పాటు కొందరు మనుష్య జీవులు కూడా అలవర్చుకున్నాయి. అందుకే ఏదైనా మనకు తోచిన సాయం చేయాలన్నా....ఎవరి మీదైనా జాలి చూపాలన్నా ముందు మన మీద మనం జాలి పడి తరువాత ఎదుటివారి గురించి ఆలోచించాలి. తొందరపడి అపాత్ర దానం చేస్తే తరువాత జీవితాంతం మనమే బాధ పడాల్సి వస్తుంది.

5, ఏప్రిల్ 2013, శుక్రవారం

నీ చెలిమి సుమ గంధం....!!

బెదిరి చెదిరిన బతుకులో
గాలి వాటుగా వచ్చి చేరింది
చల్లని పిల్లతెమ్మెర లాంటి
నీ చెలిమి....!!

అలసిన మనసుకి ఆలంబనై
చెంత చేరి...సేద దీర్చి...
చేయూత నిచ్చింది
నీ చెలిమి....!!

కన్నీటి కోనేటి సంద్రాన్ని
పన్నీటి జల్లుగా మార్చి
నీ జ్ఞాపకాల గుభాళింపులతో
వర్తమానాన్ని పరిమళ భరితం చేసింది
నీ చెలిమి....!!

చలనం లేని చేజారిన జీవితాన్ని
ఉల్లాసంతో గగనంలో గమనంలా
అందని చందమామను సైతం
అందుకుంటానన్న ఆశను రేపి
ఆకాశంలో విహారం చేయించింది
నీ చెలిమి....!!

నువ్వు వీడి పోయినా
నను విడిచి పోనంటోంది
నీ చెలిమి సుమ గంధ పరిమళం ....!!

3, ఏప్రిల్ 2013, బుధవారం

మంచి మనసు.....!!

ఏంటో నా రాతలు కొంతమందికి ఆ...కొంతమందికేముంది లెండి చాలామందికి నవ్వులాటగా ఉంది..ఏదో నాకు ఎవరి
మీదైనా కోపం వస్తే రాస్తాను అది....ఇది...అనుకున్నట్లుగా ఉంది...నేను కోపాన్ని మాత్రమే కాదు పంచుకునేది బ్లాగులో నా ప్రతి ఆలోచనని అక్షర రూపంలో నాకు అందుబాటులో ఉన్న పదాలతో వ్యక్తికరిస్తున్నాను. నాకు తెలియని ప్రపంచాన్ని చూపించిన అనుభవాలు...అనుభూతులు...బాధ...కోపం...ఆవేశం....ఆక్రోశం..సంతోషం....ఇలా ప్రతి చిన్న అనుభూతిని పంచుకుంటున్నాను. ఇష్టమైన వాళ్ళు చదవచ్చు....లేని వాళ్ళు చూడనే వద్దు...అంతే కాని నవ్వులాటగా నా రాతల్ని మార్చకండి దయచేసి. ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించక పోయినా పర్లేదు కాని అపహాస్యం చేయకండి.
రాయడం అనేది కూడా దేవుడిచ్చిన ఒక వరమే....!! రాతల్లో జీవితార్ధాన్ని చూడలేని వారికి ఏ రాతల విలువా తెలియదు. దిగ్రీలు ఉండొచ్చు...సొమ్ములు కూడా బోలెడు ఉండి ఉండొచ్చు....కాని మనకు లేని లక్షణం ఎదుటి వారిలో ఉంటె అభినందించే మంచి మనసు మాత్రం కొందరికే సొంతం...!! ఒకప్పుడు పుస్తకాల విలువ ఎంతో ఉన్నతం. పుస్తకం చదివినా రాసినా చాలా గొప్పగా ఉండేది...ఇప్పటి రోజుల్లో పుస్తకాలు ఎంతమంది చదువుతున్నారో వేళ్ళ మీద లెక్క పెట్ట వచ్చు. ఇక రాతల్లో అనుభూతిని ఎలా పొందగలరు? పది మందిలో అపహాస్యం చేయడం తప్ప...!! మరి ఈ జ్ఞాన సంపన్నులు ఎంత గొప్పవారో వారి వెనుక ఉన్న సొమ్ము చెప్పాలి లేదా వాళ్ళ నెరిగిన వారు చెప్పాలి....!!
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి....అభినందించే మంచి మనసు కూడా ఉండాలి....!! మరి ఎంత మందికి ఉందో ఆ మంచి మనసు....-:).

2, ఏప్రిల్ 2013, మంగళవారం

సజీవ చిత్రం....!!

నా ఊహల్లో  నా ఊసుల్లో
ఎప్పుడో....ఎక్కడో...ఎలానో...
నువ్వు చేరావు....పొమ్మంటే పోవు...!!

చిన్ననాటి చిలిపి ఆశ
ఎప్పటికైనా నిజమనిపించే....
నిజం కాని నా స్వప్నం....!!

పరిణితి లేని పరిమళ భరితం
ఆనాటి నా అంతరంగం
నీతోనే నా సహవాసం...!!

ఎవరికీ చెప్పక పోయినా
నీకంటూ తెలియక పోయినా 
నీతో చుట్టుకుపోయిన అనుబంధం....!!

నీకు తెలియక పోయినా
నాకు ఎంతో బావుంది
నీతోనే పంచుకున్న నా మనసు....!!

ఎప్పటికి దరి చేరని నువ్వు
నను విడి పోని నీ ఊసులు
ఎప్పటికి సజీవ చిత్రమే నా నువ్వు....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner