28, జూన్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం.. 60


        పొద్దు పొద్దున్నే ఆరింటికి అనుకోకుండా అప్పటికప్పుడు విజయనగరం బయలుదేరాను రత్నాచల్ లో. నా దగ్గర ఏ సెల్ ఫోనూ లేదప్పటికి. వాసు పెళ్లికి 1996 లో అనుకుంటా గజపతినగరం వెళ్ళి వచ్చాక మళ్లీ అటువైపు వెళ్ళనేలేదు. అందులోనూ రైలు ప్రయాణం పగటిపూట. నాకు చాలా ఇష్టమైన మా విజయనగరం వెళ్ళడం అనే సరికి బోలెడు సంతోషం కూడానూ. రాజమండ్రిలో గోదావరి బ్రిడ్జ్ ని ట్రైన్ లో నుండి చూడటం ఎంత బావుంటుందో. బ్రిడ్జ్ దాటేటప్పుడు ఆ చప్పుడు భలే ఉంటుంది. అదంతా నా వెంట తెచ్చుకున్న కామ్ కాడర్ లో రికార్డ్ చేసుకున్నాను. వైజాగ్ లో ట్రైన్ దిగి బస్ స్టేషన్ కి ఆటోలో వెళ్లి విజయనగరం బస్ ఎక్కాను. గంట ప్రయాణమే కాని నాకెందుకో చాలాసేపనిపించింది. మయూరి సెంటర్ చూడగానే హమ్మయ్య వచ్చేసా అనుకున్నా. బస్ స్టాండ్ లో దిగి ఆటోనో, రిక్షానో గుర్తులేదు పాల్ నగర్ అని మాట్లాడుకుని బయలుదేరాను. చాలా మారిపోయింది విజయనగరం నేను చూసినప్పటికి, ఇప్పటికి. అప్పట్లో కంటోన్మెంట్ దాటిన తర్వాత అంతా ఖాళీగా ఉండేది. ఇప్పుడేమెా అన్నీ ఇళ్ళే.                           మెుత్తానికి ఇల్లు గుర్తు పట్టాను. హిందీ టీచర్ గారిని చూడగానే ఎంత సంతోషమెా. కొన్ని అనుభూతులకు మాటలు కూడా కరువే. బాగా చిక్కిపోయారు టీచర్ గారు. అంకుల్ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఏవో నేను తీసుకెళ్లిన చిరు కానుకలు ఇచ్చాను. అరుణ ఫోటోలు నా కామ్ కాడర్ లో రికార్డ్ చేసుకున్నాను. వీళ్ళింటికి దగ్గరలోనే రాధక్క వాళ్ళ ఇల్లు. మా నాన్నను మెాసం చేసిన ఫ్రెండ్ మేనకోడలు. అలా ఆ సాయంత్రం వరకు బోలెడు కబుర్లు చెప్పుకున్నాం. లాండ్ లైన్ నుండి వాసుకి ఫోన్ చేసాను. వెంటనే టీచర్ గారింటికి వచ్చాడు. చిన్నప్పటి కబుర్లు చాలానే చెప్పుకున్నాం అందరం కలిసి. అప్పుడే వాసు వాళ్ళింటికి వెళదామంటే రేపు వస్తానని చెప్పాను. ఆ సాయంత్రం అంకుల్, నేను నాన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము. శైలక్క, అందరు కలిసారు. మామ్మ కూడా ఉందప్పుడు. కుమారి పెద్దమ్మ లేదు గుడికి వెళ్ళిందట. కాసేపు ఉండి వచ్చేసాము. 
     మరుసటి రోజు పొద్దుటే వాసు వచ్చాడు. వాసు బైక్ మీద మా ఊరు పినవేమలి లో రమా వాళ్ళింటికి ముందు వెళ్ళి అక్కడ అందరిని పలకరించి, చిన్ననాటి జ్ఞాపకాలను పలకరించడం, అక్కడ అందరు ఇంట్లో అందరిని పేరుపేరునా అడగడం చాలా సంతోషం అనిపించింది. మా ఇల్లు కొనుక్కున్న కరణం గారు ఆ పాత మిద్దె ఇల్లు పడగొట్టి అటు ఇటు రెండు ఇళ్ళుగా వేసుకున్నారు. వాళ్ళ పెద్దబ్బాయి మంగారావు మాతోనే చదివాడు. అక్కడ తను లేడప్పుడు. మిగతా ఇద్దరు పిల్లలు ఉన్నారు. సత్యవతి గారు, కరణం గారు ఉన్నారు. నా బొమ్మలాటలకు సత్యవతి గారు బొరుగులు(మరమరాలు) ఇచ్చేవారు. ఆ పక్కనే మాతో కలిసి చదువుకుని, మాతోపాటుగా పెరిగిన నరశింగరావు వాళ్ళింటికి వెళ్ళి, నరశింగరావు వాళ్ళ నాన్న సూరిరావుని కూడా పలకరించాను. బాగా తెలివిగలవాడు సూరిరావు. మా చిన్నప్పుడు భలే లాజిక్ లు అడుగుతూ ఉండేవాడు. మా బజార్లో అందరు ఎప్పుడూ సందడిగా  మా ఇంటి దగ్గరే కూర్చునేవారు. ఇంకా చాలామంది పలకరించారు. నరసింగరావుని శ్రీను అని మా ఇంటి దగ్గర ఆవిడ అప్పయమ్మ కోడలు తమ్ముడు ఫోన్ నెంబర్ కనుక్కోమని చెప్పాను. పినవేమలి నుండి వస్తూ దారిలో రాకోడు రోడ్డు దగ్గర రమణిని గుర్తు చేసుకున్నాం నేను, వాసు. రాకోడు తీసుకువెళ్ళనా అంటే రమణి ఎక్కడ ఉందో తెలియదుగా, అక్కడ ఎవరు మనకు తెలియదుగా వద్దులే అంటే, దారిలో మిల్ దగ్గర రమణి వాళ్ళ పిన్ని వాళ్ళు ఉన్నారనుకుంటా, వాళ్ళని కలిసినట్లు గుర్తు. 
     తర్వాత జొన్నవలస వచ్చాం. ఊరి మెుదట్లోనే లోపలికి జానకిరాం వాళ్ళిల్లు. సరేనని వాళ్ళింటికి వెళితే వాళ్ళింట్లో చాలామంది ఉన్నారప్పుడు. కార్తీకమాసం నోములట ఆరోజు. పిల్లలని, వాళ్ళావిడని పరిచయం చేసాడు. మరురోజు వాసు వాళ్ళింటికి రమ్మని చెప్పి, పాపం ఎందుకులే ఇబ్బంది పెట్టడమని మేం వచ్చేసాం. దారిలో కందిశీను ఇంటికి వెళితే తను లేడు, వాళ్ళావిడకు శ్రీనుని రేపు రమ్మని చెప్పి, ప్రదీప్, సుధల దగ్గరికి వెళ్ళి కాసేపు ఉండి, తనని కూడా రమ్మని చెప్పి, హిందీ టీచర్ గారి బాబు, కోడలు, పిల్లలు వస్తే వాళ్ళని కూడా కలిసి, అపర్ణ వేసిన నాకిష్టమైన తెపాళ చెక్కలు తిని, విజయనగరంలో నా ఇంటరు ఫ్రెండ్ వరలక్ష్మిని కలవడానికి వెళితే, వాళ్ళ అమ్మగారు చనిపోయిన విషయం తెలిసింది. మా వరలక్ష్మి కన్నా కూడా ఆంటి నాకు మంచి ఫ్రెండ్. అంకుల్ షాప్ లో ఉంటే అంకుల్ ని కూడా పలకరించి, మా మహరాజా మహిళా కళాశాలని చూసుకుని, ఆ రాత్రికి వాసు వాళ్ళింటికి చేరాం. వాసు భార్య సంధ్య వాసుకి మేనకోడలే. చాలా సేపు కబుర్లు చెప్పుకున్నాం. మరుసటి రోజు పొద్దుటే వాసు వాళ్ళ అక్క కూడా వచ్చారు. బొబ్బట్లు నాకు ఇష్టమని చేసారు. రాము, ప్రదీప్ వచ్చారు. మా చిన్నప్పటి కబుర్లు అన్నీ కలబోసేసుకున్నాం. సాయంత్రం వాళ్ళు వెళిపోయారు. నరసింగరావు శ్రీను ఫోన్ నెంబర్ ఇచ్చాడు. వెంటనే ఫోన్ చేసా. తన వైఫ్ మాట్లాడింది మాస్టారు లేరు బయటికి వెళ్ళారని చెప్పింది. తర్వాత మళ్లీ చేసి మాట్లాడాను. చాలా సంవత్సరాల తర్వాత కదా..మాటలు. ఇంటికి రమ్మంటే ఈసారికి కుదరదు వెళిపోతున్నానని చెప్పాను. 
        రైల్వేస్టేషన్ కి వెళ్ళి టికెట్ బుక్ చేసుకుంటుంటే శ్రీను వచ్చాడు తన పాత పద్ధతిలోనే స్వీట్ బాక్స్ తీసుకుని. టికెట్ బుక్ చేసుకుని నేను, వాసు, శ్రీను బస్ స్టాండ్ కి వచ్చాము. బస్ కనెక్షన్ డైరెక్ట్ గా రైల్వేస్టేషన్ కి. వాసు రేగ్గాయలు పెద్దవి కొనిచ్చాడు. అలా విజయనగరం చుట్టూ తిరిగి, మళ్లీ గోదావరి నదిని దాటుకుంటూ, విజయవాడ చేరానన్న మాట. 

"  ఒక్కోసారి మనసు నిండిన ఆనందాన్ని అంతా అక్షరాల్లో చూపించలేము. ఆ అనుభూతి ఆస్వాదన అలా ఉండిపోతుంది దశాబ్దాలు గడచినా.. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో..


23, జూన్ 2021, బుధవారం

ఓ జీవితం...!! (ఎర్రబస్ టు ఎయిర్ బస్)

పాత సామాన్ల గదిలో
భోషాణం పెట్టె మీద
మనసయ్యిందెందుకో

ఊతంగా గోడ పట్టుకుంటూ
డాబా మెట్లు ఎక్కలేకున్నా
మదిని తడిమిన జ్ఞాపకాలు నిలువనీయలేదు

వయసుడిగిన శరీరానికి
వచ్చి చేరిన వార్ధక్యపు వాసనలానే
మంజూషానికీి అవే పాతకాలపు సువాసనలు

చీదరింపులు చీత్కారాల నడుమ
చమత్కారాల నవ్వుల కోసం మెుదలైన
ఈ వెదుకులాట మనోలోకపు రహదారిగా మారింది

రెండు పసితనాల మధ్యన
మిగిలిన అనుబంధాల ఆనవాళ్ళలో
జీవిత పుటలన్నీ మళ్ళీ చదవాలనే ఈ పయనం

*******

అమ్మ బొజ్జలో హాయిగా ఉందని
ఓ నెల ఎక్కువే ఉన్నా విసుక్కోకుండా
పదిలంగా పాపాయిని హత్తుకుంది

పట్టుకోవడానికి సన్నగా ఉండి చేతికి అమరకున్నా
అపురూపంగా చూసుకుంటూ
కాకిపిల్ల కాకికి ముద్దంటూ ముద్దు చేసింది

అమ్మ చేతి మహిమనుకుంటా
గొంగళిపురుగును సీతాకోకచిలుకలా మలచడంలో
విధాతకే సవాలు విసిరింది

ఆకలిని తెలియనీయలేదు
అల్లరినీ భరించింది ఆనందాన్ని పంచింది
ఆటలన్నీ ఆడిస్తూ జోలపాటలు పాడి నిదురపుచ్చింది

కలలో కలత భయపెడితే
దగ్గరకు తీసుకుని ధైర్యానిచ్చి
ఆదమరిపించే అమ్మ చేయి నాదయ్యింది

అక్షరాలు దిద్దిస్తూ పుస్తకాలు తాను చదువుతూ
కథలన్నీ వినిపిస్తూనే కమ్మని తాయిలాలందించి
బడికి సాగనంపి బంగరుబాట పరిచింది

బిడ్డ మీద ఈగ వాలనీయదు తల్లి
బతుకు పయనంలో బాసటగా నిలుస్తూ
నా జీవితమే తానైంది అమ్మ

ఎంత చెప్పినా
ఇంకా ఏదో మిగిలిపోయినట్లున్న
మహా కావ్యమే అమ్మంటే

******

తల్లే బిడ్డగా తన దరికి చేరిందని
ఆడపిల్లయినా ఒక్కటే చాలంటూ
అంతులేని సంతోషంతో అక్కున చేర్చుకున్న నాన్న

పాపాయి పాదాలకు మన్నంటుతుందని
తన చేతులతో తుడిచి నిలబెట్టే నాన్న
ఎందరికుంటారీ ప్రపంచంలో

ఏదీ అడగకుండానే అన్నీ ఇచ్చే నాన్న
స్నేహమంటే తెలిపిన తొలి స్నేహితుడు
అరమరికలు లేకుండా అన్నీ పంచుకున్న ఆత్మీయ నేస్తం

ఆంక్షలు తన బిడ్డకు ఉండకూడదని
ఆటపాటల్లో అన్నింట్లో అందరితో సమానమేనంటూ
స్వేచ్ఛగా పెంచిన పెంపకం ఎందరికి సొంతం

మూడేళ్ళకే విమానాశ్రయంలో విమానం వద్దకు తీసుకెళ్ళినా
పుట్టినరోజుకని కంచిపట్టులంగా తెచ్చి నిదురలేపి చూపించినా
ఆ రోజుల్లోనే కేక్ కట్ చేయించి సంబరాలు చేసిందీ నాన్నే

పుట్టినరోజు ఊరందరి పండగలా చేసి
ఇప్పటికి పదుగురు గుర్తుంచుకునేలా
ఆ జ్ఞాపకాల సందడిని అందించిన నాన్న మీకున్నారా

ఊరిలో మెుదటి టివి తెచ్చినా
డిష్ పెట్టించినా, ఇన్వర్టర్ బిగించినా
నాటకాల నుండి క్రికెట్ వరకు అన్నీ బోలెడు జ్ఞాపకాలే

నా ఇష్టమే తనదైనా
తన ఇష్టమే నాదైనా
విధిరాతలో ఇద్దరం పావులమయ్యాము

సున్నితంగా చేతుల్లోకి తీసుకుని
సుకుమారంగా చూసుకునే
మమకారపు ప్రేమలాలసుడు నాన్నంటే

*******

అమ్మమ్మ తాతయ్యల ఆత్మీయతల మధ్యన
మేనమామతో కలిసి పెరిగి
బంధవుల ప్రేమాభిమానాలు చవిచూసిన బంగరు బాల్యమిది

వచ్చీరాని నడకలతో చెరువులో మునిగిపోవడం
వానచినుకుల్లో తప్పటడుగులతో పడిపోవడం
అమ్మానాన్న, టీచరాటలు ఆడని బాల్యమరుదే మరి

చుట్టపక్కాల పలకరింపుల సందడితో
చందమామ కథల సాహచర్యంతో
బొమ్మరిళ్ళ బొమ్మలాటల కల్మషమెరుగని పసితనమిది

అమ్మకొంగు చాటున చేరి దొంగలా తొంగిచూస్తూ
టీకాలు తప్పించుకోవాలన్న తాపత్రయం
ఆటల్లో తగిలిన దెబ్బలకు అమ్మ బుజ్జగింపుల పసిడి పసి వయసిది

చదువుల స్నేహాలతో చిలిపి తగవులతో
నెమలీకల దాపరింతల కాకెంగిలి తాయిలాల పంపకాల
ఆటపాటల ఇష్టాయిష్టాల అరుదైనదీ చిన్నతనం

మార్కుల పోటిలో ముందుండాలంటూనే
ఆటలు పాటలు అస్సలు వదలకూడదంటూ
అందమైన బొమ్మలు గీసే అల్లరి ఆకతాయితనం

ఏదైనా రాదంటే వచ్చే వరకు వదలని మెుండితనం
మాటలు నేర్చి చదవడం మెుదలు పెట్టినప్పటి నుండి
దొరికిన పుస్తకమల్లా చదివేసే పుస్తకాల పిచ్చిది

పాటలు శ్లోకాలు భగవద్గీత హనుమాన్ చాలీసా
పెద్దబాలశిక్ష సుమతి వేమన దాశరథి కృష్ణ శతకాలు
పంచతంత్రము వంటి మరెన్నో నీతి కథలు వల్లె వేయించిన మాస్టారు

సముద్ర స్నానాలు, గుళ్ళు గోపురాలు పూజలంటూ ప్రదక్షిణాలు
నవరాత్రుల నాటక నాట్యాల సందళ్ళు
తిరునాళ్ళలో కొన్న బొమ్మలు చూసిన ప్రభలు డాన్సులు

విత్తనాలు నానబెట్టేటప్పుడు ఎదురు రావడం
పొలంలో మెుదటి నాటు వేయడం
వడ్ల కంకులు(పరిగె) ఏరి అమ్మి ఆ డబ్బులు దాయడం

కార్తీక మాసపు వన భోజనాల హడావిడి
కాలవల్లో చెరువు దొరువుల్లో కొట్టిన వచ్చీరాని ఈతల జలకాలు
తోటల్లో తెంపుకున్న జామ మామిడికాయలు వాక్కాయలు మరెన్నో చిరుతిండ్లు

పుస్తకాల్లో దాచుకుని తిన్న తాటిచాప, జీడిలు
గడ్డిలో పండేసుకున్న ఈతకాయలు, నేరేడు, రేగు పండ్లు
నేలలో తవ్వుకున్న తేగలు, తిన్న పుల్ల ఐస్ లు

మల్లెపూల జడల సంబరాల్లో వయ్యారాలు
లేత చేతుల్లో గోరింటాకు ఎర్రదనాలు
పెద్ద చెట్టుకు వేసిన ఊయల్లో కేరింతలు

మల్లెపూలపై ఇష్టంతో
పొలంలో ఉన్నాయంటే నమ్మేసి వెళ్ళి
నాన్నతో మెుదటి దెబ్బ తిన్న అమాయకత్వపు కోపం

పుట్టినరోజని పళ్ళు తీసుకు వెళడానికి 

రమ్మని పిలవమంటే 

భోజనానికి రమ్మని చెప్పడం

ఓణి ఎవరిని పిలవకుండా కట్టబెట్టేద్దామనుకుంటే

చుట్టాలందరికి నా దగ్గరున్న చిల్లరతో

పోస్ట్ కార్డ్లు కొని ఉత్తరాలు రాసి ఆరోజు అమ్మకు చెప్పడం

వేసవి సెలవల్లో ఆరుబయట వెన్నెల్లో
పిల్లలందరమూ చెప్పుకున్న కతల కబుర్లు
ఉపవాసంతో శివరాత్రి జాగరణాల అంత్యాక్షరీలు

ఇంట్లో పెంచుకున్న బుజ్జాయిలు, చిలుక రాక్షసి
అమ్మ నాకు ఇచ్చిన పాలను పంచుకున్న
కుక్క, పిల్లి పిల్లల అరుదైన సహవాస సహజీవనం

కాయల కోసం చెట్లెక్కి చేసిన విన్యాసాలు
చిలిపి చేష్టలతో మాస్టారితో  తిన్న తిట్లు
ఆడపిల్లని తక్కువ చేస్తే కోపంతో తగవులాటలు

ముగ్గుల ముచ్చట్లలో గొబ్బెమ్మల అలంకారాలు
అబ్బాయిలతో గోళీలు, కర్రాబిళ్ళా వగైరా ఆటలు
రేడియెాలో నేర్చుకున్న లలిత, బృంద గేయాలు

ఎన్నో ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఉప్పెన ఉగ్రరూపమింకా గుర్తే
బిడ్డను గుండెల్లో పొదుపుకున్న ఓ తల్లి రూపంతో సహా
ఇప్పటికి తడియారని జ్ఞాపకమది

పాటల డాన్సుల హడావిడితో
వీధి వీధంతా చేసిన సందడి
పిల్లలు కాదు పిడుగులన్న పెద్దల మెచ్చుకోళ్ళు

సైకిల్ తొక్కుతూ తిన్న దెబ్బలు
ఓ రోజు చైన్ వేయడం రాక సీనియర్ని అడిగితే
ముందు చైన్ వేయడం నేర్చుకుని సైకిల్ తొక్కమని చెప్పడం

తేడా తెలియని పసితనపు ప్రేమ
ఇష్టమైన నేస్తాలతో అరమరికలు లేని నెయ్యం
అలుకలను కూడ అరక్షణంలోనే మరిచిపోయే అమాయకత్వం

ఇలాంటి అందమైన బాల్యం కొందరిదే
ఆ కొందరిలో నేనున్నానన్న సంతోషం
ఇప్పటికి నా బాల్య స్నేహితులు నాతో ఉన్నారన్న గర్వమిది

మరెన్నో మరపురాని మధురానుభూతుల
మలయ సమీరాల దొంతర్ల
మానస విహారమీ బాల్య జ్ఞాపకాలు

బతుకు భయం తెలియని
ఆంక్షల ఆధిపత్యపు పోరులేని
అమ్మ చీర చాటున దాచుకున్న సొంపైన జ్ఞాపకమే బాల్యమంటే

************

బాల్యాన్ని వదలలేని చిన్నతనం
అప్పుడప్పుడే మెుదలౌతున్న పెద్దరికంతో
రాజీ పడటంలో తెలియని సందిగ్ధం

అమ్మ ఆసరాతో ఇబ్బందులు లేకుండా గడిపేస్తూ
పెద్దగా మార్పులు చేర్పులు లేకున్నా
చిన్న చిన్న ఆంక్షలు కూడా నచ్చని ఏదో తెలియని చిరాకు

చిన్ననాటి నేస్తాలను వదలలేక
ఉత్తరాల పలకరింపులతో మెుదలైన రాతలు
దగ్గర చేసిన అనుబంధాల కలం స్నేహాలు నాకు ఎరుకే

వయసు పెరుగుతున్నా విడువలేని బొమ్మలాటలు
పండుగల్లో సెలవల్లో పేకాట సందడులు
పొలాల్లో వాగుల్లో ఆటల హడావిడి

వర్షంలో తడిచిపోతున్న కాకులను
లోనికి పిలవమని అమ్మతో మారామూ
కుక్క నోట్లో నుండి చిలుకను కాపాడిన ధైర్యము

గూండా సినిమా షూటింగని
జనాల్ని పోగేసి స్కూల్ ఎగొట్టి మరీ వెళ్ళి
మరురోజు అసెంబ్లీలో నేను మాత్రమే తిన్న తిట్లు

మామిడి కొబ్బరి తోటలలో ఆటల అల్లరి
సముద్రంలో ఇష్టం వచ్చినట్టు మునకలు
కొండ పైన ఏముందోనన్న ఉబలాటంతో కష్టపడి నిట్టనిలువుగా కొండెక్కిన విజయగర్వం

మా ఆకతాయితనాన్ని భరించి
అల్లరిని సహించి ఇష్టంగా అక్కున చేర్చుకుని
చదువుతోపాటు లోకజ్ఞానం నేర్పిన గురువులు

మెుదటిసారి చీర కట్టుకోవడంలో సతమతమౌతున్న అక్కకు చేసిన సాయం

వచ్చిన బోలెడు సందేహాలు

ఇద్దరం కలిసి మెుత్తానికి చీరకట్టు పూర్తిచేస్తూ నవ్వుకోవడం

పంచవటిలో అందరి మధ్యనా గారాబం
రెండోఆట సినిమాల్లో చేసిన అల్లరిగోల
పక్కింటి చా సో గారితో తిన్న తిట్లు

నిద్ర పోనీయకుండా తెల్లవారు ఝామునే మెుదలయ్యే చదువుల అగచాట్లు
ట్యూషన్లు కాలేజీలంటూ ఉరుకుల పరుగులు

నూట పద్దెనిమిది మందిని పేర్లు రోల్ నెంబర్లతో సహా
గుర్తుంచుకున్న జ్ఞాపకశక్తి అప్పుడు
క్రికెట్ స్కోర్ అడిగితే స్టాఫ్ రూమ్లో చూసి చెప్పిన రోజులు

అమ్మాయిల కాలేజ్లో మాదే రాజ్యమన్నట్టు
మహా సంతోషంతో చేసిన కాన్వాసింగ్
ఎలక్షన్ల పోటిలు ఆర్ట్స్ సైన్స్ గ్రూపుల మధ్యన

అక్క పెళ్ళిలో మెుదటిసారి సినిమా పాటల సందడి చూడటం

కొందరి డబ్బు అహాన్ని గమనించి కూడా తల వంచకపోవడం

నా కోపాన్ని మరిపించిన అక్క దగ్గరతనం మర్చిపోలేని జ్ఞాపకాలే ఇప్పటికి

కట్టిన సన్నజాజి మాలలు
చెట్లెక్కి కోసిన జామకాయలు
తిన్న బత్తాయిలు ఇలా ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలు

రోజూ జడ వేసే అమ్మమ్మ గారి మీద అక్క మీద అలక
జనవరి ఫస్ట్ కి వాకిట్లో పెద్ద ముగ్గు వేయలేదని
నాకోసం అర్ధరాత్రి అందమైన ముగ్గేసి అలక తీర్చిన అక్క

అక్క పెళ్ళికి అడిగి మరీ కుట్టించుకున్న
వెంకటగిరి పొడవులంగా
పిల్లల దగ్గర నేర్చుకున్న చదరంగం గుఱ్ఱంతో ఆట నేర్పిన అంకుల్

బంధువులు కాకున్నా ఆత్మీయంగా అక్కున చేర్చుకున్న
ఆ పంచవటి మిగిల్చిన మరిచిపోలేని
చేదు గురుతు ఆత్మీయులైన వారి మరణం

తొలి ఓటమి నేర్పిన పాఠం
చెడు జరిగినా మన మంచికే అని చెప్పి
ఓదార్చిన మా హింది టీచర్

చేతిలో రూపాయి లేనప్పుడు
బయటబడ్డ బంధుజనాల బుద్దులు
అప్పుడే పరిచయమైన మనుషుల మరో రూపాలు

నాన్నకు స్నేహంలో మెాసం నేర్పిన పాఠం
కోల్పోయిన ఆస్తులు, ఆప్తులనుకున్న వారి
అసలు నైజాలు చూపిన పరిస్థితులు

రాజకీయపు రాక్షసక్రీడలో పావులుగా మారిన
ఉన్మాదుల కులపిచ్చి దుర్మార్గానికి బలైన జీవితాలను
జరిగిన దహనకాండను చూసిన ప్రత్యక్ష సాక్షిని

బాల్య స్నేహితుల పలకరింపుల పరామర్శలు
గుర్తింపుల జ్ఞాపకాల చిలిపి చేష్టలతో
మళ్ళీ చిగురించిన చిన్ననాటి స్నేహాలు

మొదటిసారి వండిన అరటికాయ ఇగురు
ఇంటి చుట్టుపక్కల ఆత్మీయుల పరాచికాలు
వీధి అరుగుల మీద పంచుకున్న అనుబంధపు ఆనవాళ్ళు

ఆరునెలల చిన్నదానితో అల్లుకున్న బంధం
నన్ను అనుకరించిన అల్లరి చేష్టలు
దూరంగా వెళితే కలిగిన బాధ

చదువు కోసం మరో రాష్ట్ర ప్రయాణంతో
జీవితంలో మరో అధ్యాయం మెుదలై
కొత్త భాష పరిచయమైన క్షణాలు

చీకు చింతలు లేని చిన్నతనం

పలు సందేహలతో పరుగులు పెట్టే మనసు

మనిషి వ్యక్తిత్వానికి పునాదివేసేదే చిరుప్రాయం

***************

మెుదటిరోజు నాన్న వెంట ఇంజనీరింగ్ కాలేజి లో అడుగు పెట్టడం
మెుదటి మీటింగ్ క్లాస్ లో పక్కమ్మాయిని తెలుగులో పలకరిస్తే...

తను వింతగా చూసిన చూపు ఇప్పటికి జ్ఞాపకమే
పాపం తనకదే మెుదటిసారి తెలుగు వినడమట
ఆ మాట తర్వాత నాకు ఆత్మీయ నేస్తమయ్యాక
నేను ఆరోజు నువ్వు నన్నలా చూసావంటూ
మేము పంచుకున్న కబుర్లలో బయట పడింది

రెండోరోజు నాన్న నాతో వచ్చి ఇద్దరిని పలకరించి
వాళ్ళతో నన్ను వదిలి వెళ్ళడం
నా సెక్షన్ వాళ్ళ సెక్షన్ వేరు కావడము
నాతో ఉన్న నలుగురిలో ఒక్కమ్మాయికే కాస్త తెలుగు రావడము
మిగతావారు నాతో దూరంగా ఉండటం
నేను మరో భాష నేర్చుకోవడానికి కుదిరింది

అయెామయంగా మెుదటి డ్రాయింగ్ క్లాస్
ఇంట్లో పుస్తకాలు ముందేసుకుని కుస్తీపట్లు
కాాలేజ్ లో చిన్న చిన్న సరదా రాగింగ్ ముచ్చట్లు

అనుకోకుండా హాస్టల్ జీవితం.. 

మెుదటిసారి ఇంట్లోవాళ్ళను వదలి ఉండటంతో
హాస్టల్లో కొత్త జీవితం ప్రారంభం
ఇంగ్లీష్, కన్నడ భాషలతో సిగపట్లు

హాస్టల్ నుండి కాలేజ్ కి వెళ్ళి వస్తూ 

బస్సులో చేసే అల్లరి, పాడిన అంత్యాక్షరీలు

కాలేజ్ క్యాంటిన్ లో మిరపకాయ్ బజ్జీల రుచి

సైకిల్ స్టాండ్ లో జనాల చిలిపి సరదా కామెంట్లు 

హాస్టల్ బస్ మిస్సయితే ఓపిడి వరకు

నడిచి దుర్గమ్మ గుడి దగ్గర దిగడాలు

అమృతలో తిన్న ఐస్క్రీమ్, బేల్పూరి

అబ్బో ఇలా చెప్పుకుంటూపోతే బోలెడు

మెకానికల్, కార్పెంటరీ, ఫిట్టింగ్, ఫిజిక్స్ లాబ్ లలో సరదాలు
కెమిస్ట్రీ లాబ్ లో జీనియస్ కి లిక్విడ్

తీయడం రాకపోతే నే తీస్తూ బ్యూరెట్, పిపెట్ లతో ఆటలు

సివిల్ ప్రాక్టికల్స్ లో ఫీల్డ్ లో 

జామకాయలు కొనుక్కుని తింటూ 

సార్ లతో తిన్న తిట్లు
ఎలక్ట్రికల్ లాబ్ లో ఏదీ అంటుకోకుండా
గబగబా రీడింగ్స్ వేసుకుని సంతకం చేయించుకోవడం

కొద్దిమందే ఉండే మాథ్స్ క్లాస్ లో
వెనుక బెంచ్ లో కూర్చోవడం
మెకానికల్ సర్ సో అని ఎన్నిసార్లు అంటారో లెక్కలేయడం
కెమిస్ట్రీ క్లాస్ లో నిద్ర పోకుండా ఉండటానికి తంటాలు

పుట్టినరోజుల వేడుకల కోలాహలాలు

మెుదటి సంవత్పరపు పరీక్షల ముందు

రికార్డులు, డ్రాయింగ్ షీట్ల సబ్మిషన్లు

మూడు గంటలు ఇంగ్లీష్ లో 

పరీక్ష రాయగలనా అన్న సందేహం మనసులో

రాసేసిన ఆనందంలో చూసేసిన సినిమాలు

సంతోషాల సంబరాల మధ్యన 

ఇంటికి ప్రయాణం... 

పరిసరాల మార్పులతో కొత్త పరిచయాల పలకరింపులతో జ్ఞాపకాల అల్లికల పునాది 

***********

రెండవ సంవత్సరం మెుదట్లోనే

నేస్తాల అల్లరికి నవ్విన నవ్వుతో 

అపార్థం చేసుకున్న గురువులు

లాబ్లలో సంతకాలు పెట్టకుండా 

ఆట పట్టించి ఆడుకున్న వైనాలు

కంప్యూటర్ మీద చేయి వేసిన మెుదటి క్షణాలు

రేకుల షెడ్ క్లాస్ రూమ్లో గాలి లేదని

ఫాన్ల కోసం చేసిన బంద్

జూనియర్స్ ని రాగింగ్ చేయకపోయినా 

నేనంటే భయపడిన క్షణాలను 

తర్వాత చెప్పి నవ్విన సంఘటనలు

నన్ను ఏడిపించడం మెుదలెట్టిన కొందరు 

విసుగుతో తిట్టుకున్న తిట్లు

చిన్నప్పుడు కలిసిన తమ్ముళ్ళు

మళ్ళీ కాలేజ్ లో కనబడటం

అనారోగ్యం పలకరించడం

మరపురాని జ్ఞాపకాల పరిమళాలు...

*********

క్లాసులో పోట్లాటల పలకరింపుల నడుమన

హంపి, తుంగభద్ర డామ్ పిక్నిక్ కి అందరం వెళ్ళడం

సీనియర్స్ కి సెండాఫ్ పార్టీ ఇవ్వడం

మెుదటిసారి నేను రాసిన పేరడి పాట

చిన్న చిన్న అలకల మధ్యన 

హాయిగా సాగిన మూడవ సంవత్సరం...

************

అనేకానేక కారణాలతో 

ఆగిన నాలుగవ సంవత్సరం 

ఇండ్రస్టియల్ టూర్ సరదాలు

అనుకోకుండా ఆత్మీయురాలైన 

గోల్డ్ మెడలిస్ట్ సీనియర్ షర్మిల

 ఫైనలియర్ జూనియర్స్ తో కలవడం

క్లాస్ లు ఎగ్గొట్టి చూసిన సినిమాలు


కాలేజ్ డే ఫంక్షన్ కి ఆడి ఓడిపోయిన టెన్నీకాయిట్ 

జూనియర్స్ ఇచ్చిన సెండాఫ్ పార్టీ 

రాయించుకున్న ఆటోగ్రాఫ్లు

అబ్బో ఎన్నెన్ని సరదా సంతోషాలో

చదువులమ్మ ఒడిలో సేద దీరిన సంతోష ఘడియలు

అల్లరి ఆనందాలు అందించిన ఆప్యాయతలు

వీడ్కోలు కన్నీళ్ళతో బరువెక్కిన మనసులు

మరో జీవితానికి బాటలు వేసిన వైనం


ఇప్పటికి అరుదైనవే ఆ జ్ఞాపకాలు

గురుశిష్యుల అనుబంధాలకు 

నేస్తాల సహచర్యానికి సహకారానికి 

గురుతులుగా మిగిలిన గుత్తుల గుత్తుల 

గుండె నిండుగా నిండిన సజీవ ఆనవాళ్ళివి... 


పసితనం వదలలేని బాల్యం

బాల్యపు వాసనలనొదలని కౌమారం

ఈ మూడింటిని కలిపేసిన అందమైన కాలం ఇది... 

********

పై చదువుల కోసం ఆశతో

పోటీ పరీక్షలు రాయడం

ధనావసరాల అడ్డంకులతో అంతరాయం

అనుకోని పరిస్థితుల మానసిక దండయాత్ర

పెళ్లి విషయంలో సందిగ్ధం

నాన్నతో వాదులాట సంవత్సరం పైమాటే

ఇంటి నుండి బయటకు పంపేయడం

బరువు బాధ్యతలు తీసుకున్నానని 

పెళ్లి చేసి చేతులు దులుపుకుని

నలుగురి మెప్పు కోసం 

మంచితనం ముసుగులో  వంచన

మనిషిలో మరో రూపాన్ని చూసిన క్షణాలు

రెండు నాల్కల ధోరణుల పరిచయాలు

జీవితాన్కి మరో కోణాన్ని చూపించిన తీరు

కన్నీళ్ళు, కడగండ్ల మధ్యన అమ్మ ఆసరాతో

అమ్మతనం అందుకున్న క్షణాలు

పసిబిడ్డతో నడి రోడ్డున నిలిచిన క్షణాలు

బాధ్యతలు పంచుకోని అనుబంధాలు

గాలివాటపు జీవితాలుగా మిగలబోయి

తండ్రి స్నేహితుని ఆసరాతో

ఓ గాడిన పడిన వైనం

బతుకు పోరాటంలో 

బంధాలను వదులుకోలేక

బాధ్యతలకు బంధీగా సాగిన 

వైవిధ్య భరితమైన పోరాటంలో

రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి

చేసిన ఉద్యోగాలు ఎన్నో

తెలుసుకున్న జీవిత సత్యాలు 

పడిన అగచాట్లు, నష్టపోయిన ధనము

మెాసంగించిన స్నేహితులు, బంధువులు

ఇలా రకరకాల అనుభవాల నడుమన

మానసిక శారీరక వేదనల రోదనలెన్నో

పాతికేళ్ళు సంతోషాలు ప్రేమలతో మురిసి

మరో పాతికేళ్ళు కన్నీళ్ళతో కలకలిసిన

అనుకోని అక్షర ప్రయాణమే 

మీ ముందున్న ఈ సగటు మగువ జీవితం


ఓ మహిళ సంపూర్ణ జీవితంలో

రెప్పల చాటున దాగిన కలతల కల'వరాలు

మనసులోని మౌన వేదనకు 

సాక్ష్యాలుగా నిలిచే మనసాక్షరాలివి


ఎన్నో ఆటుపోట్లు మరెన్నో కన్నీళ్ళు

కలబోసుకున్న కాసిన్ని సంతోషాలు కలిసిన

చావుబతుకుల సయ్యాటలో 

గుప్పెడు అక్షరాలతో

గంపెడు ప్రేమాభిమానాలను పంచుకుంటూ

గెలుపోటముల గోదారిలో విరిగి పడి

తీరం చేరిన కెరటమే ఈ సజీవ చైతన్యం...!!


పసితనం నుండి పండుతనం వరకు 

మనిషితనానికి మనసుతనానికి మధ్యన

ముసుగేసుకున్న మానవత్వాన్ని, మనసులను

వెలికి తీయడానికి చేసిన ఓ చిన్న ప్రయత్నమే ఇది.



22, జూన్ 2021, మంగళవారం

హేమంత తుషారాలు సమీక్ష..!!

 " మనసును సేదదీర్చే హేమంత తుషారాలు "

       తెలుగు సాహిత్య ప్రక్రియల్లో తెలుగు గజల్ ది ఓ ప్రత్యేక స్థానం. గజల్ రాయడానికి భాష మీద పట్టు, గజల్ లక్షణాలన్నీ తెలిసుండాలి. ఓ విధంగా చూస్తే ఇది కాస్త క్లిష్టమైన ప్రక్రియే. సాధారణంగా ప్రేయసి కోసం విరహాన్ని చూపించే లక్షణం గజల్ అని, మగవారు మాత్రమే రాయగలిగినదని చాలా అపోహలుండేవి పూర్వం. ఇప్పటి కవులు, కవయిత్రులు సమకాలీన సమాజంలోని సమస్యల చుట్టూ కవితల్లానే గజళ్ళు కూడా అలవోకగా రాసేస్తున్నారు. ముఖ పుస్తకంలోను, వివిధ పత్రికల ద్వారా ఎన్నో గజళ్ళు అందించిన వారిలో డా. శ్యామల గడ్డం గారిది ఓ ప్రత్యేకమైన శైలి. వీరి రెండవ గజల్ సంపుటి హేమంత తుషారాలు. స్వతహాగానే తెలుగు భాషపై మక్కువతో, తన ఉన్నత విద్యను కూడా రంగరించి రాసిన ఈ గజళ్ళు  సౌందర్య, విషాదాలను సమపాళ్ళలో మనకు అందిస్తాయి.   
            విరహమూ తీయని వేదనే అని అన్నట్టుగా చాలా గజళ్ళలో ప్రేమ, విరహం, వేదన, నివేదనా, ఆర్తి, ఆలాపనా, కోరికలు, పులకింతలు, తుళ్ళింతలు, నిరీక్షణలు ఇలాంటి సున్నితమైన భావాలు ఈ హేమంత తుషారాలు లో మనకు కనిపిస్తాయి. డా. శ్యామల గడ్డం గారు వాడిన పద  వాక్య ప్రయెాగాలతో గజల్ కవయిత్రికి భాష పై గల పట్టు కూడా మనకు తెలుస్తుంది. సామాజిక, సమకాలీన సమస్యలపై తనదైన శైలిలో చక్కని గజళ్ళు చాలానే రాశారు. చినుకులను, మేఘాలను, ప్రకృతిని చూసి పరవశించడమే కాకుండా, చిరునవ్వుల సందడిని, దేశభక్తిని, సైనికుల త్యాగాలను, అమ్మానాన్నల ప్రేమను, బాల్యాన్ని, శిశుతనాన్ని, పసి(డి)తనాన్ని, పండు వెన్నెలను, నిశిరాతిరిని, కలలను, కల్లోలాలను, మనసును, మౌనాన్ని, మెాహాన్ని, మెాసాన్ని, అతివల అగచాట్లను, ఆడపిల్ల ఆశలను, కరోనా కష్టాలను, మంచిని, మానవత్వాన్ని, సమాజ శ్రేయస్సును కాంక్షించే ఓ బాధ్యత కలిగిన పౌరురాలిగా ఎన్నో సమస్యలను తన గజళ్ళ ద్వారా అందరికి నివేదించారు. రైతు కడగండ్లను, అప్పుల ఈతిబాధలను అద్భుతంగా వినిపించారు. శ్రామికుల శ్రమ వేదాన్ని, వైద్యుల గురించి, చదువుల సంగతులు, ఆనవాళ్ళను, అనుబంధాలను,అక్షర నివాళిని కూడా అందంగా చూపించారు. ఈ పుస్తకంలో అన్నీ వెరసి ఓ జీవితపు పుస్తకంలో పుటలన్నీ తెరిచి చూపించారనడంలో అతిశయెాక్తి ఏమీ లేదు. 
 "  వరమీయని దేవునితో పంతమేల  ఓ శ్యామల!
   జీవితమే ఒక ఆటే. గెలుపు వలపుల వాకిళ్ళు..! "
ఎంత బాగా చెప్పారో చూడండి జీవితంలో గెలుపుని. 
          చక్కని పదబంధాలతో చదువరులకు ఆనందాన్ని పంచే అంశాలతో, అక్కడక్కడా తన భాషా పఠిమను చూపుతూ, అలతి పదాలతో జీవిత పరమార్థాన్ని తెలుపుతూ, మంచిని, మానవత్వాన్ని,సమతను, మమతను చాటి చెప్పే గజల్ గేయాలను హేమంత తుషారాలు గజల్ సంపుటితో అందించిన సాహిత్య, సంగీత కళామతల్లి ముద్దుబిడ్డ, ఎన్నో కథలు, కవితలు, నవలలు రచించి ఎన్నో పురస్కారాలను అందుకున్న ప్రతిభావంతురాలు, తమ వంతుగా సాహిత్య పురస్కారాలతో ప్రతిభావంతులకు కొమర్రాజు ఫౌండేషన్ ద్వారా  పట్టం గడుతూ, సాహితీ సేవలు అందిస్తున్న డా. శ్యామల గడ్డం గారికి హృదయపూర్వక అభినందనలు. 


మంజు యనమదల 
విజయవాడ. 
                 
      
      

రెక్కలు

1.  మరుపు 
సహజం
మార్పు
జీవనక్రమం

కాలమే
సమాధానం అన్నింటికి..!!

2.  సమాధానాలు
ప్రశ్నలతోనే
సమస్యలు
జీవితాల్లో

ఎంత చెట్టుకి
అంత గాలి మరి..!!

3.  ఆరాటం
మనసుది
ఆర్తిని పంచేది
అక్షరం

అనంతాన్ని 
అరచేతిలో చూపెడుతూ...!!

4.   కాలం 
చెప్పిన సంగతులే
కలానికి
అందిన అనుభవాలు

మనసు గమనాలే 
గత చరిత్ర పుటలన్నీ..!!

5.  రెప్పల చాటున
కన్నీరు
గుండెల మాటున
గునపపు పోట్లు

అనుబంధపు ఆటల్లో
అలుపెరుగని అక్షర శరాలు..!!

6.   మాట 
నేర్పిన వారొకరు
మౌనం
అలవాటు చేసిన వారొకరు

మార్పు
మంచిదే..!!

7.  అమ్మ ఒడే
అక్షరాల బడి
మాట నేర్చినా
మౌనం వహించినా

ఆది గురువు 
అందించిన ఆసరానే ఇదంతా..!!

8.  నమ్మకం
ఆసరా అవుతుంది
నడత
అమ్మ నేర్పుతుంది

గెలుపోటములు
జీవితపు ఆటవిడుపులు..!!

9.   భరించడం
అలవాటే
బాధ్యతలకు
బంధీగా మారి

చేతగానితనమని 
చిన్నతనం చేస్తున్నా..!!

10.  సరిపెట్టుకోవడం
నేర్చుకుంటే
సర్దుకుపోవడం
అలవాటవుతుంది

కొన్ని బంధాలను 
భరించాలంటే తప్పదు మరి...!!

11.   ఆపేక్షలు
అద్దంలో చందమామాలే
అనుబంధాలు 
అంగడి సరుకులైపోయాయిప్పుడు

నోటి మాట నొసటి విరుపు 
మనిషి నైజమైంది...!!

12.  ధర్మం
అధర్మం
ఏది సత్యం
ఏది నిత్యం

మహా భారతం 
మన కథైనప్పుడు..!!

13.   మౌనం
వహించింది
మాటలు
మరచికాదు

కాలం 
చెప్పే సమాధానం చేరుతుందని...!!

14.   రాయి వేయడం
ఎంతసేపు
శిలాఫలకం కావడానికే
సమయమెంతన్నది తెలియదు

రాజకీయ 
నటనా చాతుర్యమది...!!

15.   అక్షరంతో
సాన్నిహిత్యం 
అమ్మతో
సన్నితత్వం 

కొన్ని బంధాలు
గతజన్మవే...!!

16.   మనిషికి
ఆత్మకు
మధ్యన
అంతరమే

చీకటి వెలుగుల
రహస్యం...!!

17.   ప్రయత్నమే
గెలుపు
ఫలితం
ఏదైనా

జీవితపు
అంతర్యుద్ధంలో...!!

18.   వెలి
వేయాల్సిన తరుణం
అంతరంగపు
ముసుగు నైజాలను

సంఘర్షణలకు
చరమగీతం పాడాలంటే...!!

20.  ఆరాటానికి
పోరాటానికి మద్యనే
మనిషి జీవిత
ప్రయాణం

నడక నడతల
సమతౌల్యమే వ్యక్తిత్వం..!!

21.  సమయ పాలన
తెలియాలి
సమస్యను
తట్టుకోగలగాలి

జీవితం
పూలపానుపు కాదు..!!

22.  తప్పించుకునే నైజం 
కొందరిది
తప్పించుకోలేని వైనం
మరి కొందరిది

జీవితం
చీకటి వెలుగుల సయ్యాట...!!

23.  అవసరానికి
ఆణిముత్యాలు
ధనప్రేమకు
అసలైన చుట్టాలు

నటించడం
నేటి మనిషి కళ..!!

24.   అదుపు 
అవసరమే
నోటికైనా
మనిషికైనా

మనమేంటో
మన చావు చెప్తుందట..!!

25.   మౌనం చెప్పిన
మాటలు
మనసుని 
అనువదించిన అక్షరాలు

కాలానికి కలానికి
జత కలిపిన సాక్షీ సంతకాలివి..!!

26.   మాట 
ఏమార్చడం 
మనిషి
నైజమైనప్పుడు

కలమూ బదులివ్వలేనంటూ
కాలానికే వదలివేసింది..!!

27.   ఉత్తములని
కొందరిని
అధములని
మరి కొందరిని అనుకుంటాం

పుట్టుకతోనే నిర్ణయించబడే 
గుణాలని తెలియక..!!

28.  చెదిరిపోయే
మనసు కాదు
చెరిగిపోయే
రాతలు కాదు

అంతరార్థం అర్థమయితే
ఆత్మజ్ఞాన దర్శనమే...!!

29.  విలువ
తెలియని మనుష్యులు
రాత లోతు ఎరుగని
నిరక్షరాస్యులు

కలమయినా కాలమయినా
మూర్ఖునికొకటే...!!

30.   మౌనాన్ని 
కానుకగా చేసి
మనసుని విరిచేసిన
బంధాలు కొన్ని 

దూరం తరగని
ప్రయాణమది...!!

21, జూన్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం.. 59

       మెుత్తానికి ఎలాగైతేనేం అమెరికా నుండి ఇండియా రావడం, హైదరాబాదు ఎయిర్ పోర్ట్ లో తెల్లవారు ఝామున దిగడం, లగేజ్ అంతా తెచ్చుకోవడానికి ఓ 20 డాలర్లు లంచం ఇవ్వడం, మరో 20 డాలర్లు బయటకు తీసుకువచ్చినందుకు ఇచ్చేయడం జరిగింది. బయటకు రాగానే అమ్మా, రమణ, సుధ అన్నయ్య,  కనిపించారు. శౌర్యగాడికి ప్రాణం లేచివచ్చినట్లైంది వాళ్ళని చూసేసరికి. అప్పటికే బసవతారకం కాన్సర్ హాస్పిటల్ లో ఉన్న రంగ వదినను చూడటానికి ఆ టైమ్ లో వెళ్లి, జ్యోతి అన్నయ్యను, వదినను చూసి కాసేపు అక్కడ ఉండి, విజయవాడ బయలుదేరాము. దారిలో ఓ చోట పేరు గుర్తు లేదు,  మంచి కాఫీ తాగి, విజయవాడ చేరాము. మా చిన్నాడపడుచుకి రెండో పెళ్లి కూడా నేను ఇండియా వచ్చిన వెంటనే చేసారు కాని నన్ను పిలవలేదు వారెవరూ. అవన్నీ డబ్బు అవసర అనుబంధాలే కదా..నేనూ పట్టించుకోలేదు వాళ్ళ గురించి. 
           ఇంటికి రాగానే మా చిన్నదాని దర్శనం. నేను వచ్చేసరికి మా నాన్న లేరు. ఎక్కడికో ఊరు వెళ్ళారు. తర్వాత ఎప్పటికో ఓ వారానికి వచ్చినట్టున్నారు. నేను ఇండియా వచ్చే ముందే మా నాయనమ్మ అన్నయ్య భార్య, మా రెండో పెద్దమ్మ అమ్మ అయిన శేషారత్నం మామ్మ కాలం చేసింది. దశదిన కర్మకి మా ఊరు నరసింహపురం వెళ్ళాము. అక్కడ అందరు కనిపించారు. నా పెళ్లి అయిన తర్వాత చాలా సంవత్సరాలుగా పలకరింతలు లేని చుట్టాలు కొందరు పలకరించారప్పుడు. చాలామందిని నేనే పలకరించాను. మా రంగన్నయ్యను, శాంతి వదినను, మా పెద్ద పెదనాన్న పిచ్చయ్య గారిని కూడా నేనే పలకరించాను. భోజనాలయ్యాక రంగన్నయ్య కొడుకు నాని బండి మీద ఇంటి దగ్గర దించాడు. నేను నడిచి వెళతానన్నా వినలేదు. వాడు మాత్రం ఇంట్లోకి రమ్మని పిలిచినా రాలేదప్పుడు. 
     చిన్నప్పటి నుండి రెండవ పెదనాన్న రెండో కొడుకు జ్యోతి అన్నయ్యతో నాకు అనుబంధం కాస్త ఎక్కువే. నేను ఎక్కడున్నా, ఎలా ఉన్నా తనతో దగ్గరగానే ఉండేదాన్ని. నా పెళ్లి తర్వాత మా వాళ్ళందరు రానప్పుడు కూడా అన్నయ్య విషయం తెలిసిన వెంటనే నా దగ్గరకి వచ్చాడు. మౌర్య పుట్టినప్పుడు కూడా అన్నయ్య, వదిన ఇద్దరు బాబుని, నన్ను చూడటానికి వచ్చారు. నా పుట్టినరోజు ఎవరికి గుర్తున్నా లేకున్నా ఇప్పటికి మా అన్నయ్యకు గుర్తే. మేము విజయనగరంలో ఉన్నప్పుడు కూడా నా పుట్టినరోజుకి భోపాల్ నుండి వచ్చేవాడు. తను అక్కడ జాబ్ చేసేవాడు అప్పుడు. ఉత్తరాలు నా ఫ్రెండ్స్ తో పాటుగా అన్నయ్యకు కూడా రాస్తుండేదాన్ని. తర్వాత మా రంగ వదిన చెప్తుండేది అమ్ములూ నీ పుట్టినరోజుకి నెల ముందే గ్రీటింగ్ కొని పెట్టేవాడు మీ అన్నయ్య. కొత్తలో పోట్లాడేదాన్ని తెలియక అని చెప్పేది. మా రంగ వదినకు కల్లాకపటం తెలియదు. మనసులో అనుకున్నది చెప్పేసేది. అన్నయ్య నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా తనే ఫోన్ చేసేవాడు. నేను చేస్తానన్నా కూడా వద్దని, తనకే తక్కువ డబ్బులు అవుతాయని తనే చేసేవాడు. వదినకు బాలేదని ఇండియా రాక ముందే తెలుసు. అందుకే ఫ్లైట్ దిగిన వెంటనే వదినను చూడటానికి వెళ్ళాను. 
        ఆగస్టు లో ఇండియా రాగానే శౌర్య పుట్టినరోజు, తర్వాత వినాయక చవితి, దసరా అయ్యాక హైదరాబాదు AMSOL లో జాయిన్ అవుదామని అలా అలా డేట్ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాను. ఈలోపల విజయనగరంలో మా హిందీ టీచర్ గారికి బాలేదని తెలిసి ఆవిడని చూడటానికి అటు వెళ్ళాను. చిన్ననాటి నేస్తాలను కలిసిన కబుర్లు, ఆ ముచ్చట్లు మరోసారి. 

     " డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు కాని అనుబంధాలు తెగిపోతే అతకవు. "

 వచ్చే వారం మరిన్ని కబుర్లతో..            

15, జూన్ 2021, మంగళవారం

ఏక్ తారలు.. !!

1.  అందంగా వికసించిన వాస్తవం_గతపు ముళ్ళ గాయాల నుండి...!!
2.  అసాధ్యమేమెా_అలవికాని ఆ పాత మధురాల నుండి బయట పడటం...!!
3.  మనసుని తట్టి లేపాయనుకుంటా ఆ క్షణాలు_భారాన్ని కాస్తయినా పంచుకుందామని...!!
4.  మనసునోదార్చే ముత్యాలే అవి_గాయపు ఛాయలకు లేపనాలుగా...!!
5.  పేర్చుకుంటూ పోతానలా అక్షరాల్ని_పెంచుకున్న పాశాలకు సాక్ష్యాలుగా...!!
6.  మాటలే మంత్రాలయ్యాయి_ఓదార్పు అక్షరం అయినప్పుడు..!!
7.   అక్షర సంద్రపు ఆంతరంగికమిది_తీరని ఆవేదనకు తీరముగా..!!
8.   మౌనాన్ని తేటతెల్లం చేసేస్తుంటాయి_అక్షరాలకు అలవాటైన విద్య మరి...!!
9.  చతురత అక్షరాలదే_వి(స)న్యాసమైనా..!!
10.  మరచిపోని గతము తానైంది_మరపు తెలియని మనసుల మధ్యన..!!
11.  పంచుకుంటూ పోతానిలా_తెంచుకోవడం తెలియక..!!
12.   మనసు పరిచే సంవేదనలివి_మౌనాలకనుగుణంగా అక్షరాలేరుకుంటూ..!!
13.   లెక్కకు రానివే తడిసిన చెక్కిళ్లు_మాట రాని మౌనం మనసుదయ్యాక..!!
14.  లెక్కలకందనివే ఈ అక్షరాంగనలు_మనసులను సమ్మెాహనం చేసేస్తూ...!!
15.   అంతర్వాహిని అంతరంగం_అనంతాన్ని తనలో దాచేస్తూ...!!
16.  అమ్మ చేయాల్సిన రాజీనామా_మర్చిపోయిందనుకుంటా ఈ జన్మకు..!!
17.  పలవరింతే తానెప్పుడూ_మనసు ముడిగానో మౌన జ్ఞాపకంగానో..!!
18.  ఆగని పయనమిది_అలుపు లేని అక్షరం సాక్షిగా...!!
19.  అమ్మంతే_ఓడిపోతున్నా గెలుపు తనదేనని మురిసిపోయేంత అమాయకత్వంతో...!!
20.   మరో అధ్యాయానికి నాందీ వచనమే_ముగింపు ముంగిలి ముందున్నా..!!
21.  చెలిమి చెంతనే ఉంది_చీకటి కన్నీరు చెరిపేయడానికి..!!
22.  అద్భుతాల అవసరమే లేదు_మనసైన స్నేహం మనదైతే చాలుగా...!!
23.  అంతర్ముఖీనత అనివార్యమైంది_అంతరంగ అంతర్లోచనావిష్కరణకు...!!
24.  అవసరానికి అందరు కానివారే_చుట్టరికం దుడ్లకే పరిమితమౌతూ...!!
25.  అహంకారం అదిలించింది_గాయం మౌనంగా భరిస్తూ ఉండిపోతోంది..!!
26.  పసితనపు ఆనవాళ్ళవి_పండు వయసులోనూ ఊపిరౌతూ..!!
27.   మరుపు తప్పనిసరైంది_ఆకారాలు ఉనికి కోల్పోయాక..!!
28.   నేనొక సజీవ సాక్ష్యాన్ని_గతకాలం చెక్కిన సమాధిపై..!!
29.  అనుభవమై అలరాలుతున్నా_అక్షరాలు అక్కున చేర్చుకుంటున్నాయని...!!
30.  కొన్ని మనసులోనికి చొప్పించాలి తప్పదు_కాలం చెప్పే తీర్పుని వినాలంటే...!!

జీవన 'మంజూ'ష

నేస్తం, 
         మనిషి సృష్టించిన డబ్బు ఆ మనిషినే శాసించడం మనం ఇంతకు ముందు చూసాం. ఇప్పుడు, ఆ తర్వాత కూడా ఇదే చూస్తామేమెా అనుకున్న తరుణంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన కరోనా ప్రపంచాన్నే ఒణికించిందనడంలో ఏమాత్రమూ సంశయం లేదు. 
          అనుబంధాలు అనేక రకాలుగా మనకు తెలుసు. రక్త సంబంధాలు, ఆత్మీయ స్నేహ సంబంధాలు, ఇరుగు పొరుగు అనుబంధాలు అంటూ ఎన్నో రకాల బంధాలకు తోడుగా ఈ ఆధునిక విజ్ఞానం మనకు ఈ ముఖపుస్తక స్నేహాలను అనడం కంటే అంతర్జాల స్నేహాలను అనడం సబబేమెా, వీటిని చేర్చింది. కాని ఈ కరోనా అన్నింటిని అణగదొక్కేసింది. ప్రాణ భయాన్ని రుచి చూపిస్తూ, మానవత్వాన్ని అక్కడక్కడా మిగిల్చింది. 
            కరోనా ఒకరి నుండి మరొకరికి అంటుకుంటుంది నిజమే. ఇది ఎవరూ కాదనలేని సత్యం. దీనికి తరతమ బేధం లేదు. ఓ పక్క పిట్టలు రాలినట్టు జనాలు రాలిపోతున్నా, నా పంతమే నెగ్గాలని కొందరు, శవాలతో కూడా వ్యాపారం చేసేవారు మరికొందరు ఇలా ఎవరి తెలివితో వారు పేరుప్రఖ్యాతులు, సొమ్ము సంపాదించుకోవడంలో తల తిప్ప లేనంత బిజీగా ఉన్నారు. 
            ప్రతి మనిషికి తప్పకుండా మరో మనిషి సాయం అవసర పడుతుందన్న ఇంగిత జ్ఞానం లేనివారు, కనీసం ఇప్పటి పరిస్థితిలోనయినా మారతారేమెానన్న ఆశ కలగడం అత్యాశే అని, రోజూ మన చుట్టూ జరుగుతున్న సంఘటనలే బుుజువు చేస్తున్నాయి. కొందరు మనకి కరోనా వచ్చింది సరే, పక్కవారికి రాకుండా ఎందుకుండాలన్న క్రూరమైన ఆలోచనలతో కరోనా విజృంభణకు శ్రీకారం చుట్టి, ఈనాడు ప్రపంచమంతా కరోనా మయం చేసారు. 
            వ్యక్తి ఆలోచన బావుంటే వ్యవస్థ బావుంటుంది. తద్వారా సమాజం, రాష్ట్రం, దేశం, ప్రపంచం బావుంటాయన్న నిజం అందరు తెలుసుకుంటే ఎంత బావుండు. 

14, జూన్ 2021, సోమవారం

బతికేద్దాం...!!

అవసరార్థం అనుబంధాలు
మనవైనప్పుడు
మాటా మంచికి
మన మధ్యన చోటుందా?

మెుక్కుబడి పలకరింతల
ప్రహసనాలు 
రోజూ పరిపాటై పోయినప్పుడు
ఆత్మీయతకు అర్థం ఎక్కడా?

ధనానుబంధాలుగా 
రూపుదిద్దుకున్న
రక్తపాశాల నడుమ
బుుణానుబంధాలకు తావెక్కడా?

ఏదేమైనా 
ఎవరెలా ఉన్నా 
మన అవసరాలు మనకు ముఖ్యం
మిగతావన్నీ మనకెందుకు?

నీతి నిజాయితీలంటూ
విలువలు వ్యక్తిత్వాలని 
పద్ధతుల గురించి ప్రవచనాలివ్వడం మానేసి
పెద్దరికపు అహంకారంలో గుడ్డిగా బతికేద్దాం...!! 
 

కాలం వెంబడి కలం... 58

      మా మరిది గారి కుటుంబం అలా మమ్మల్ని వారి అవసరాలకు వాడుకుని, పెట్టాల్సిన గొడవలు పెట్టేసి,  నాలుగు నెలల తర్వాత, ఆవిడకి జాబ్ వచ్చిందని వేరే ఊరు వెళ్ళారు. శౌర్యని స్కూల్లో జాయిన్ చేద్దామని ఫీజ్ కట్టాను. నా ఇంటికి వచ్చి చాలా మంది ఉండి వెళ్ళారు కాని, ఇంత దరిద్రపు పాదాలు ఎవరివి లేవు. 
           గ్రీన్ కార్డ్ ప్రాసెస్లో I 485 అయితే వచ్చింది కాని I 140 ఇంకా క్లియర్ కాలేదని, మా AMSOL కంపెనీ లాయర్ జెన్నిఫర్ కు అప్పుడప్పుడూ కాల్ చేసేదాన్ని. ఇమ్మిగ్రేషన్ సైట్ లో స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని. తెలిసినవాళ్ళ ద్వారా పరిచయమైన తమ్మడు శ్యాం అమెరికా వచ్చాడు. ఉండటానికి హెల్ప్ కావాలంటే, నేను మద్రాస్ అలైడ్ ఇన్ఫర్మాటిక్స్ లో ట్రైనింగ్ ఇచ్చిన సతీష్ కి ఫోన్ చేసి చెబితే తనతో ఉంచుకున్నాడు. నేను చికాగోలో రామస్వామి దగ్గర చేసినప్పుడు తన వైఫ్ తో వచ్చి కలిసాడు సతీష్. శ్యాం హంట్స్విల్ వస్తాను టికెట్ బుక్ చేయక్కా, మనీ తర్వాత ఇస్తానంటే, బుక్ చేసాను. వాడు వచ్చి  రెండు రోజులుండి వెళ్ళాడు. 
వాడు వెళ్ళిన తర్వాత ఎందుకో ఇమ్మిగ్రేషన్ సైట్ లో I 140 స్టేటస్ చెక్ చేస్తే డినయల్ అయినట్లు వచ్చింది. వెంటనే లాయర్ జెన్నిఫర్ కి కాల్ చేసాను. I 140 డినయల్ అయితే ఆటోమేటిక్ గా I 485 కూడా కాన్సిల్ అవుతుంది. I 140  డినయల్ పై మళ్ళీ అప్లై చేయవచ్చు. కాని ఈసారి కూడా డినయల్ అయితే మీకు ఇమ్మిగ్రేషన్ స్టేటస్ ఉండదు. ఇల్లీగల్ అవుతారు. అందుకని ఇండియా వెళ్ళిరావడం కరక్ట్ అని చెప్పింది. 
          AMSOL బాలా ఇటికిరాల కి కాల్ చేసి విషయం చెప్తే ఏమి మాట్లాడకుండా, రాజుతో మాట్లాడండి అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. మా AMSOL ECO సుబ్బరాజు ఇందుకూరి కి కాల్ చేసాను. తను వెంటనే I 140 రి ఓపెన్ చేయించమంటే చేయిస్తాను. లేదా మీరు ఇండియా వెళతానంటే, మళ్ళీ H1B చేసి అమెరికా తీసుకువస్తాను. ఇండియాలో AMSOL లో వర్క్ చేయండి అప్పటివరకు మీకు ఇష్టమైతే అని చెప్తే, సరే ఇండియా వెళతాను, కాకపోతే L1 చేయండి H1B వద్దు అని అంటే సరేనన్నారు. ఇండియా లో అరి కేసరి చూసుకుంటున్నాడు. తను ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. మీరు కాల్ చేసి మాట్లాడండి అని చెప్పారు. అరి కేసరికి కాల్ చేసాను. ఇండియా వచ్చాక కలవమని చెప్పారు. 
          క్రెడిట్ కార్డ్స్ లో కాస్త కాస్త డబ్బులు తీసి ఇండియా పంపాను. కొన్ని కార్డ్స్ డబ్బులు తీయడానికి రావు. అవి మధు వాళ్ళకు పంపమంటే పంపాను. వాళ్ళు నాకో కెమెరా కొన్నారు. ఇంకా ఎవరెవరు ఎంత తీసుకున్నారన్నది తిన్న వాళ్ళకు తెలుసు. పైనుండి చూసిన భగవంతునికి తెలుసు. షాపింగ్ అంటూ పెద్దగా ఏం చేయలేదు. నాకు శౌర్యకి ఇండియాకి టికెట్స్ ఆన్ లైన్ లో బుక్ చేసాను. సుబ్బరాజుని,  బాలా ఇటికిరాలని ఏమైనా పేపర్స్ కావాలేమెా అని అడిగితే ఏం అవసరం లేదని చెప్పారు. హంట్స్విల్ నుండి హ్యూస్టన్ కి, అక్కడి నుండి ఇండియా కి. మధ్య లో లండన్ లో మారాలి. 
        అప్పటికే ఈయన తమ్ముడు, మరదలి మూలంగా గొడవలు బాగానే అయ్యాయిగా మా మధ్యన. అందుకని ఈయన దేనికి ఓ డాలర్ కూడా నాకు ఇవ్వలేదు. శౌర్యని మా చేతులకు ముద్దుగా అందించిన మా కాకాని డాక్టర్ గారు, మేం ఇండియా వెళుతున్నామని తెలిసి భోజనానికి రమ్మని పిలిచారు. ఆవిడ బోలెడు బిజీ. అయినా కూడా ఓ రోజు సాయంత్రం అంతా మాతోనే స్పెండ్ చేసారు. శౌర్యతో బోలెడు కబుర్లు చెప్తూ, వాడితో బాగా ఆడుకున్నారు. భోజనం చేసి వచ్చేటప్పుడు శౌర్యకి బ్లాక్స్ తో ఆడుకోవడం ఇష్టమని బోలెడు బ్లాక్స్, రకరకాలగా బిల్డ్ చేయడానికి, క్రియేటివిటి పెరగడానికి అన్నట్టుగా గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా ప్రసాద్ అంకుల్ వాళ్ళు, సీతక్కా వాళ్ళు కూడా ఇంటికి రమ్మని పిలిచారు. ప్రసాద్ అంకుల్ వాళ్ళింటికి వెళ్ళాను కాని సీతక్క వాళ్ళింటికి వెళ్ళడానికి కుదరలేదు. అది అక్కకి నా మీద కోపం వచ్చేటట్లు చేసిందనుకుంటా. తర్వాత నేను ఇండియా నుండి చాలాసార్లు కాల్ చేసినా కాస్త పుల్లవిరుపుగా మాట్లాడింది. నేనూ ఇష్టం లేనప్పుడు డిస్ట్రబ్ చేయడం ఎందుకులే అని కాల్ చేయడం మానేసాను.
           అప్పటి వరకు తమ తమ అవసరాలకు మనల్ని వాడుకున్న వారంతా మెల్లగా మెుహం చాటేయడం, అప్పటి వరకు వారు మన మీద చూపిన కన్సర్న్ అంతా నాటకమని తెలియడానికి ఎక్కువ రోజులేం పట్టలేదు. ఇండియా రాగానే ఎవరేంటి అన్నది బాగా అర్థం అయ్యింది. వినయ్ గారు ఎయిర్ పోర్ట్ కి వెళ్ళే వరకు కాల్ చేసి మాట్లాడారు కాని ఆ తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు మాట కూడా లేదు. సంధ్యా, శ్రీనివాస్ లకు కూడా నేనే కాల్ చేసేదాన్ని. తర్వాత తర్వాత వారూ బిజీ అయిపోయారు. మనల్ని మర్చిపోయారు. వారు  ఇండియా వచ్చినప్పుడు ఫంక్షన్ కి పిలిస్తే నాకు వెళ్ళడానికి కుదరలేదు. అది వారి కోపానికి కారణమేమెా. అవసరానికి మలేషియాలో ఉన్నప్పుడు పదివేలు పంపమన్న పెద్దమనిషితో సహా..తర్వాత అమెరికా వచ్చి కూడా..ఇలా అమెరికాలో అందరు మెుత్తానికి మనల్ని   మర్చిపోయారన్న మాట.  
        తెల్లవారు ఝామునే రెండింటికే లేచి అన్ని సర్దుకుని హంట్స్విల్ ఎయిర్ పోర్ట్ కి నేను, శౌర్య మాతోపాటు రాజేష్, రాజు, మా ఆయన ముగ్గురు హంట్స్విల్ ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేయడానికి వచ్చారు. వారి టాప్ మర్చిపోతే ఈయన వెళ్ళి తీసుకువచ్చాడు. పర్మిషన్ తీసుకుని గేట్ వరకు వచ్చారు. నా దగ్గర రూపాయి అదేలెండి డాలర్ కూడా ఉండదని తెలిసికూడా మా ఆయన పిల్లాడితో బయలుదేరినా ఒక్క డాలర్ కూడా ఇవ్వలేదు. రాజేష్ ఎయిర్ పోర్ట్ లో 200/300 డాలర్లు తీసి ఇచ్చాడు. హ్యూస్టన్ ఎయిర్ పోర్ట్ లో లగేజ్ చెక్ ఇన్ చేసి, బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. ఫ్లైట్ ఎక్కడానికి గేట్ దగ్గరకి వెళితే, మారిన ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం లండన్ లో ఫ్లైట్ మారాలంటే నాకు లండన్/అమెరికా వీసా ఉండాలట. కావాలంటే హంట్స్విల్ పంపేస్తాము. లండన్ వీసా పర్మిషన్ తీసుకుని, మళ్లీ టికెట్ బుక్ చేసుకోండి అని చెప్పారు. లండన్ వైపు నుండి కాకుండా వేరే వైపు నుండి ఇండియా వెళితే వీసా అవసరం లేదు. నాకేం చేయాలో తెలియలేదు. పిల్లాడిని తెల్లవారు ఝామున లేపాను. పాపం వాడికి తిండి లేదు. వాడు ఒకటే ఏడుపు. నేనేమెా మళ్లీ లగేజ్ అంతా తీసుకోవాలి. ఏం చేయాలో తెలియక సుబ్బరాజుకి కాల్ చేసాను. ఫోన్ లో ఛార్జ్ కూడా లేదు. అంతమంది ఎయిర్ పోర్ట్ లో ఉన్నా ఎవరి దారి వారిదే. పాపం ఎవరో మళయాళీ అతను వాళ్ళ అమ్మను ఫ్లైట్ ఎక్కించడానికి వచ్చాడు. ఏమైందని నా దగ్గరకు వచ్చాడు. విషయం చెప్పాను. తన ఫోన్ తోనే సుబ్బరాజుతో మాట్లాడాను. మరుసటిరోజు కి టికెట్స్ బుక్ చేస్తానని చెప్పి, హోటల్ లో ఉండమన్నారు. లగేజ్ చాలా ఉంది. మళయాళీ అతనిది పెద్ద కార్. అతనే హోటల్ కి తీసుకువెళ్ళాడు. శౌర్యకి, నాకు కూడా బాగా ఆకలి వేస్తోంది. తినడానికి ఏమైనా తెమ్మంటే, పాపం తనకి కూడా తెచ్చుకుని, మాతోపాటే తిని, వాటికి డబ్బులు ఇవ్వబోతే కూడా తీసుకోలేదు. నిజంగా దేవుడు పంపినట్టు వచ్చి చాలా హెల్ప్ చేసాడు. ఎప్పటికి మర్చిపోలేను ఆ సాయాన్ని. మధు, సంధ్య వాళ్ళు కూడా ఫోన్ లో మాట్లాడారు. అప్పుడు వాళ్ళు డాలస్ లో ఉంటున్నారు. మరుసటి రోజు ఇండియా బయలుదేరాము. ఇండియా వచ్చాక సాయం పొందిన వారెవరూ కనీసం కాల్ చేయలేదు. 
           నా అమెరికా జీవితం ఇలా గడిచింది. అందరిది ఇలానే ఉండాలని లేదు. కాకపోతే మెాసం చేయడం అనేది ఎక్కడైనా ఉంటుంది. అవసరాల కోసం నమ్మించి మెాసం చేసేవారు ఎక్కడైనా ఉంటారు. మనవారు అని నమ్మితే నట్టేట్లో ముంచుతారు. చాతనైనంత వరకు  జాగ్రత్తగా ఉండటమే మనం చేయగలిగింది. కొత్తగా అమెరికా వెళ్ళేవాళ్ళకు  అమెరికా భూతల స్వర్గమేమి కాదు, కష్టసుఖాలు రెండూ ఉంటాయని చెప్పడానికే ఈ నా అనుభవాలను మీతో పంచుకున్నాను. 
నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి, ఇంత విపులంగా రాయించిన రాజశేఖర్ చప్పిడి గారికి, కవితాలయానికి, మీ ఇంటి మనిషిగా భావించి నా రాతలను చదివి ఆదరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.

"   జీవితాన్ని గెలవడానికి, ఓడిపోవడానికి మధ్యన సన్నని తెర అనుబంధం. ఆ విలువ తెలుసుకోగలిగితే ప్రతి ఒక్కరూ విజేతే. "

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.... 

11, జూన్ 2021, శుక్రవారం

గెలుద్దాం..!!

ఓటమిని మన దరి 
చేరనీయనంతగా

ప్రకృతిని పరిహసించిన
అనారికతకు పాఠం నేర్పుతూ

రాజకీయపు చెదలను
నివారించే సాధనాలను సమకూర్చుకుంటూ

మృతకణం మెాగిస్తున్న మృత్యుఘంటికలకు చరమగీతమెలా పాడాలో నేర్చుకుంటూ

తెలిసీ తెలియక తప్పులెన్ని చేసినా 
బిడ్డను అక్కున జేర్చుకున్న తల్లిలా

పర్యావరణమెప్పుడూ పచ్చనిదే
ప్రాణవాయువుల సేదదీర్చు పుడమిగా

మనిషిగా మారదాం మానవత్వాన్ని చాటుతూ
మన సహజ వనరులను కాపాడుకుంటూ గెలుద్దాం..!!

7, జూన్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం... 57

             డాలస్ సిటీ గ్రూప్ జాబ్ అయ్యాకా, అన్ని అప్పులు పోను నా దగ్గర ఓ పది లక్షలు మిగిలాయి. అవి పెట్టి ఓ అపార్ట్మెంట్ విజయవాడలో తీసుకున్నాము. మిగతాది లోన్ తీసుకున్నాం. లోన్ కోసం క్రెడిట్ చెక్ చేస్తే చికాగోలో రామస్వామి నా పేరు మీద తీసుకున్న రెంటల్ అపార్ట్మెంట్ కి మనీ కట్టలేదని వచ్చింది. నాకు ఎవరితో చెప్పాలో తెలియక రామస్వామి వైఫ్ మాధవి అక్క బాబాయ్ నవనీత కృష్ణ గారి నెంబర్ నెట్ లో వెదికి ఆయనకు వివరం చెప్పాను. అప్పటికి రామస్వామికి ఉన్నదంతా పోయిందట. మరదలి ఇంట్లో ఉంటున్నారని చెప్పి, మాధవితో మాట్లాడతావా అని అడిగారు. ఆయనతో మాట్లాడను కదండి,అక్కంటే నాకెంత ఇష్టమైనా, అక్కతో కూడా మాట్లాడలేను, అది పద్ధతి కాదు అని చెప్పాను. తర్వాత నవనీత కృష్ణ గారు రామస్వామితో మాట్లాడితే, నన్ను బాగా తిట్టాడట. ప్రోబ్లం మాత్రం సాల్వ్ చేయించారు. ఈరోజు ఆయన లేకపోయినా ఆయన నాకు చేసిన హెల్ప్ మర్చిపోలేను. నేను ఇండియా తిరిగి వచ్చిన కొత్తలో మా కోటేశ్వరరావు మామయ్య కోసం మా ఊరు వ  చ్చినప్పుడు, హంసలదీవి సముద్రం దగ్గర కలిసి పలకరించారు కూడా. 
             డాలస్ లో ఉన్నప్పుడు చేసిన బేబి సిట్టింగ్ డబ్బులు, ఇంకా కొన్ని డబ్బులు కలిపి మా ఊరు దగ్గర కోడూరులో కడుతున్న సాయిబాబా గుడిలో విగ్రహానికి విరాళంగా ఇచ్చాము. అంతకు ముందు అయ్యప్ప గుడికి కూడా అదే ఊరిలో వినాయకుడి గుడికి ఇచ్చాము. ఇండియాలో కొందరు వెధవలు..ఆఁ మనం అంత డబ్బులు ఇచ్చేపాటివారమా అని ఈయనకు లేనిపోని మాటలు చెప్పి ఆ వెధవలు పబ్బం గడుపుకున్నారు. ఈయన ఆ వెధవల చెప్పుడు మాటలన్నీ మనసులో ఉంచుకున్నాడుగా.  ఆ కచ్చి అలా తీర్చుకున్నాడన్నమాట. అంతకు ముందు కూడా అప్పుడప్పుడూ మగవాడి అహంకారం చూపించేవాడు. మా ఫ్రెండ్ వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి నాకేమీ రాదని, నేనేమి చేయడంలేదని చెప్పడం, ఇండియా ఫోన్ చేసి జనాలకి చెప్పడం చేస్తే, వాళ్ళు అప్పుడే చెప్పారు. మాకు తెలిసి మంజు ఎప్పుడూ ఖాళీగా లేదు, ఏదోకటి చేస్తూనే ఉంది. మేం చేయలేని పని కూడా తను చేసిందని చెప్పారు. మా ప్రసాద్ అన్నయ్య చూడటానికి వస్తే తనతోనూ ఇదే మాట. తనూ అదే చెప్పాడు. నేను అమెరికా రాకుండా, డబ్బులు పంపకుండా, చదువు లేకుండా ఈయన అమెరికా ఎలా వచ్చాడో కాస్త బుర్రున్న వాళ్ళకి తెలుస్తుంది కదా. నెలకి 1500 డాలర్లు ఈయన ఫోన్ బిల్, బట్టలు డ్రై క్లీనింగ్. ఇండియాలో ఫ్రెండ్స్ కి డబ్బులు పంపడానికి, బావగారి అప్పు తీర్చడానికి ఈయన సంపాదనెంతో మరి. చెల్లెలి పెళ్లి కి నేనే ఇచ్చాను. మరి ఈయన చేసిన గాస్ స్టేషన్ ఉద్యోగంలో ఖర్చులు పోనూ ఎంత సంపాదన మిగిలిందో మరి. తప్పు నాదే నాకంటూ ఏదీ ఉంచుకోకపోవడం. ఇండియాలో కొన్నవన్నీ లోన్లు, క్రెడిట్ కార్డ్లు గీకి. అంతా నా సంపాదనే..మంజు ఏమీ చేయలేదు అని అందరికి చెప్పడం,..ఇప్పటికి అదే అలవాటు. ఉమా వాళ్ళు అట్లాంటా వచ్చాకా, కొడుకు రిషితో మా ఇంటికి వచ్చి రెండు రోజులుండి వెళ్ళారు. మిక్సీ తీసుకువచ్చింది. ఇంకా ఏమైనా కావాలా అంటే ఏమి వద్దన్నాను. 
మా తోడికోడలికి H1B వీసా చేసిన శామ్ కంపెనీ డెట్రాయిట్ లో. అప్పటి ఇమ్మిగ్రేషన్ రూల్స్ ప్రకారం వాళ్ళు ముగ్గురు డెట్రాయిట్ రావాలి. వాళ్ళతో పాటు నా చిన్న కొడుకు శౌర్యని కూడా తీసుకువచ్చారు. శామ్ ని వాళ్ళని పికప్ చేసుకోమని చెప్పి, డెట్రాయిట్ నుండి నాకు, వాళ్ళకి హంట్స్విల్ టికెట్స్ బుక్ చేసి,  నేను డెట్రాయిట్ వెళ్ళాను. ఆరు నెలల పిల్లాడప్పుడు ఇండియాలో అమ్మావాళ్ళ దగ్గర 2004 లో వదిలేసిన శౌర్యని మళ్ళీ 2007 లో చూసానన్నమాట. వాడికి ఏం తెలిసిందో నాకు తెలియదు. నిద్రకళ్ళతోనే చూడగానే చంక ఎక్కేసాడు. శామ్ ఆవిడతో SSN అప్లై చేయించారు. ఆ నైట్ అక్కడ హోటల్ లో ఉండి మరుసటి రోజు అందరం ఫ్లైట్ లో హంట్స్విల్ వచ్చాము. 
                నేను జాబ్ ఏమి చేయకుండా ఉంది మెుత్తం మీద ఓ సంవత్సరం అంతే. నాకు అప్పటికే బాగా విసుగ్గా ఉండి ఆ ఇయర్ ఇక జాబ్ చేయలేదు. ఓ రోజు వంట చేస్తూ ఆవిడతో అనేసాను. నువ్వు నా పొజిషన్ లో ఉండి, నేను నీలా ఉండి ఉంటే నన్ను అమెరికా తీసుకు వచ్చేదానివి కాదు అని. ఆవిడకి కాసేపు మాట రాలేదు. తర్వాత ఎందుకలా అనుకున్నావు అంది. అది నిజం కనుక అని చెప్పాను. అంతకు ముందు చాలా మాటలు అని ఉన్నారు వాళ్ళు. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఈయన సంవత్సరం కూడా నిండని పెద్దోడు మౌర్యని తీసుకుని వాళ్ళింటికి వెళ్ళినప్పుడు, కాస్త గొడవ అయ్యింది. దానికి ఈవిడ గారు సెటిల్ అవ్వకుండా పిల్లల్ని కనకూడదు అని అంది. వాళ్ళ కార్ ఎవరో తీసుకుంటే, మా ఆయన అది అమ్ముకుని అమెరికా వచ్చాడని కూడా అన్నారు. చెల్లెలి పెళ్లికి రూపాయి ఇవ్వకపోయినా వాళ్ళందరికి వీళ్ళు చాలా మంచివాళ్ళు. మా పెళ్లైన కొత్తలో నేను మద్రాస్ లో జాబ్ చేసేటప్పుడు, ఈయన మద్రాస్ వచ్చి, తమ్ముడికి ఫోన్ ఎన్నిసార్లు చేసినా తీయలేదు. డబ్బులేమైనా అడుగుతాడని భయం. ఇన్ని చేసినా మేం ఏమీ అనలేదు వాళ్ళని. 
             మా ఆయన తమ్ముడిని షాప్ కి తీసుకువెళ్ళి, తనకి నచ్చిన ఫోన్ కొనిపెట్టాడు. పిల్లలు సైకిల్, స్కేటింగ్ సైకిల్ ఇలా ఏది కావాలన్నా కొనడం చేసారు. ఆవిడ పుట్టినరోజుకి అనుకుంటా చిన్నది హాండ్ బాగ్ కొని ఇస్తే, తర్వాత అది నచ్చలేదని మార్చుకుంటానంటే నా క్రెడిట్ కార్డ్ ఇచ్చి షాప్ కి పంపాను. ఏవో కొనుక్కున్నానంది. నాకు ఆన్ లైన్ లో క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ చెక్ చేసుకోవడం అలవాటు. మరుసటిరోజో, ఆ తర్వాతో చెక్ చేస్తే 90 డాలర్లు చెప్పులు తీసుకున్నట్టు ఉంది. నేనేమెా పది డాలర్లు పెట్టి కొనడానికి కూడా తటపటాయిస్తాను. అదేమైనా రాంగ్ బిల్ ఏమెానని సుధా 90 డాలర్లు పెట్టి చెప్పులు కొన్నావా అని అడిగాను. నేను అడిగినప్పుడు ఈయన కూడా ఉన్నాడు. లేకపోతే నామీద ఇంకెన్ని చెప్పేవారో. ఆవిడ దానికి చాలా పెద్ద సీన్ చేసి ఏవో లెక్కలు రాసి ఈయనకు చూపించింది. ముగ్గురు కలిసి నన్ను ఒక్కదాన్ని చేసి, పిల్లాడిని కూడా నా దగ్గరకి రాకుండా చేయాలని చూసేవారు. ఆవిడ కంపెని గెస్ట్ హౌస్ లో ఉంటే దానికి డబ్బులు కూడా నేను కట్టాను. మధ్యలో వచ్చివెళ్ళడానికి టికెట్లు,  క్లయింట్ ఇంటర్వ్యూలకు ఫ్లైట్ టికెట్స్ ఇలా ఓ నాలుగు నెలలకు 30000 డాలర్లు ఖర్చు పెట్టించారు. వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ వాడితే ఎక్కువ వడ్డీ పడుతుందట. మనకి పాపం పడదు కదా అందుకని ఎదుటి వారివి వాడేసేవారు. వాళ్ళ జాగ్రత్త అది. 
ఈయనకు నేను క్రెడిట్ కార్డ్ ఇప్పిస్తే అది తమ్ముడికి ఇచ్చాడు. బాంక్ లో డబ్బులు వేయాలంటే తమ్ముడికి డబ్బులిచ్చి, వాళ్ళతో నన్ను వెళ్ళమనేవాడు. సాయంత్రం పూట ఈయన గాస్ స్టేషన్కి వెళ్ళి ఏమి చెప్పి వచ్చేవాడో మరి తమ్ముడు. ఈయన ఇండియాలో కార్ లోన్ కి, ఇంటి లోన్ కి డబ్బులు పంపడం మానేసాడు. 
          ఏదో మాటల్లో ఈయన తమ్ముడితో అన్నాను. మీ అన్నయ్య మూలంగానే నా హెల్త్ పాడయ్యిందని. ఎవరం ఊహించని మాటన్నాడు. అయితే డైవోర్స్ ఇచ్చేయండి అని. అది విని నాకు నోట మాట రాలేదు. ఆ టైమ్ వస్తే నువ్వే దగ్గరుండి ఇప్పిద్దువులే అని ఊరుకున్నాను. దేవుడు ఎక్కడైనా జంటలను అటు ఇటుగా కలుపుతాడు. వీళ్ళు మాత్రం ఇద్దరూ ఒకటే. రూపాయి కోసం అమ్మానాన్నని విడదీయడానికి కూడా వెనుకాడని రకం వీళ్ళు. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నారు పుణ్యాత్ములు.

    " రూపాయి కోసం అమ్మానాన్నని విడదీసే రకాలుంటారని తెలుసుకోవడం, ఎవరి రూపాయి వారికెంతో ఎదుటివారి సొమ్ము కూడా అంతే అని అనుకోని అతి గొప్ప నైజాలను దగ్గరగా చూడటం ఓ గుణపాఠమే మరి జీవితంలో. నా శవం కూడా చూడటానికి ఇష్టపడని వారు కొందరు ఉన్నారు మరి."


వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

4, జూన్ 2021, శుక్రవారం

రెక్కలు

1.   వెక్కిరింతలకు
వెరవదు
ఓటమికి
క్రుంగిపోదు

అక్షరాల ఆటతో
అనంతానందం..!!

2.   విన్యాసం 
విధాత చేతిరాతది
అక్షరాల ఝల్లు 
అమ్మ నేర్పించినది

మనదేముంది
నిమిత్తమాత్రులం...!!

3.  ఆనవాళ్ళు
వెదుక్కుంటూ వస్తాయట
అనుబంధాలను
వదులుకోలేక

ఎవరిదే పాత్రయినా
గతజన్మ వాసనలే ఇవన్నీ...!!

4.   భావాలని
అనుకోలేము
మనసు మౌనాలని
సరిపెట్టుకోనూలేము

కాలం విసిరిన
పరీక్షలకు సమాధానాలంతే...!!

5.   కాలానికి
ఎవరితోనూ పని లేదు
కలానికి 
విరామమూ తెలియడం లేదు

గెలుపోటముల 
చరిత్ర లిఖించేయాలిగా..!!

6.   ఛాయకు
ప్రత్యామ్నాయాన్నే
వెలుగు
ఉన్నంత వరకు

ప్రయత్నం 
మన నైజం...!!

7.  మనిషి
మనుగడ
గతమెా
గుణపాఠం 

కాలం చెప్పే
నిత్యసత్యం...!!

8.   అర్థం 
చేసుకోవడానికి
కొత్తగా
ఏముందని

మనసు పుస్తకం
మూయనిదేగా...!!

9.   అహం
అడ్డుపడుతుంది
అంతరంగం
అవగతమయినా

అడ్డుతెరల
అభిజాత్యం మరి...!!

10.   అవసరం
బ్రతకడం నేర్పుతుంది
అనుభవం
ఓ పాఠంగా మారుతుంది

అనుబంధాల్లో 
నిజానిజాలు తేటతెల్లమౌతాయి...!!

11.  పుట్టడం
పూర్వజన్మ సుకృతం 
పోవడం
చేసిన కర్మల ఫలితం

నడుమ ఈ నాటకం
విధి విలా(ప)సం...!!

12.  కొన్ని
అక్షరాలంతే
వాతలు
వేస్తాయలా

బిడ్డను 
మందలించే తల్లిలా...!!

13.  కలత పడిన
మది
కలం విదిల్చిన
అక్షరాలు

గతం మిగిల్చిన
ఆనవాళ్ళు...!!

14.   గారం
ఎక్కువైనా
నయగారం 
తక్కువైనా

దెబ్బలకు
వెన్న రాయాలి తప్పదు మరి...!!

15.   గతాలన్నీ
మరువలేనివే
జ్ఞాపకాల
చిత్తరువులుగా

ఘడియకో రూపం మార్చే
ఈ మనుష్యుల మధ్యన...!!

16.  పుటలెక్కువే
పుస్తకంలో
వచ్చి
పోయే వారితో

మూసే సమయమే
చిక్కడం లేదు మరి...!!

17.   సమయ 
పాలన
సర్దుకుపోవడంలో
నేర్పు

నేర్పుతుంది
జీవితం...!!

18.  పరాన్న జీవుల
పాలబడుతున్నాయి
నిషిద్దమని తెలియని
నిత్య ప్రసాదాలు

మమకారం మరిచిన
బతుకులైపోయాయిప్పుడన్నీ..!!

19.   గాయాన్ని
జ్ఞాపకంగా మలచడం
గతాన్ని
మనసాక్షరాలుగా మార్చడం

గమనానికి
గమ్యాన్ని అనుకరించమనడమే...!!

20.   బలమూ
బలహీనతా
రెండూ
నువ్వే

బంధాలు 
కొందరికి ఇంతేననుకుంటా...!!

21.   సామాన్యుడి
పరిధులు వేరు
రాజకీయ నాయకుడి
అవసరాలు అనేకం

చట్టాలు 
ఎవరికి వెసులుబాటో మరి..!!

22.  వెలుతురు 
ఎప్పుడూ ఉంటుంది
చీకటికి
చేరువలోనే

నిరంతరాన్వేషణ అవసరమే
జీవితంలో గెలుపోటములు తెలియాలంటే..!!

23.   అక్షరం 
ఊపిరినిస్తుంది
ఊరటను
పంచుతుంది

అజరామరం 
చరిత్ర చెప్పిన సత్యాలు...!!

24.   గాయమూ
ఘనమైనదే
గతానికి
సాక్ష్యంగా 

కాలానికి 
అప్పగించిన కావ్యముగా...!!

25.  మది
కనబడుట లేదు
మనిషితనం
మాయమైపోతున్నది

కాలం
నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తోంది..!!

26.   గంతలు
కట్టుకున్న ఆకాశం
రెప్పలు
విప్పుకున్న రేయి

మిణుగురుల
మెరుపు కలలు..!!

27.  సమయమూ
విలువైనదే
మరలిరాని
క్షణాలను తనలో దాచుకుని

జీవితాలను
గాయాలుగానో గేయాలుగానో మార్చుతూ...!!

28.   కొన్ని ఆనవాళ్ళు
మిగిలిపోతాయలా
మనసు గాయాలు
మాసిపోవు

కాలంతో సమాంతరంగా పయనిస్తూ
కలానికి అనుసంధానమౌతాయిలా..!!

29.   ఎదురీత
అలవాటై పోతుంది
ఓటమికి
వెరవకుంటే

మానవ సంబంధాలు
ఆర్థికానుబంధాలుగా మారుతుంటే..!!

30.   ముడిబడిన 
అనుబంధాలు
విడివడని
బుుణపాశాలు

కాలం 
తేల్చాల్సిన లెక్కలివి...!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner