30, నవంబర్ 2019, శనివారం

జగన్నాటకం...!!

చీకటి చుట్టంలా వచ్చి
పలకరించెళుతూ
కాసిని జ్ఞాపకాలు
వొంపేసింది

కలతల కన్నీళ్ళు
ఓదార్పునెదుకుతూ
దిగులు దుప్పటిలో
తచ్చాడుతున్నాయి

మౌనం ముసురుకున్న
ఏకాంతానికి మాటలద్దడానికి
మరో ప్రయత్నంగా
మనసు సమాయత్తమౌతోంది

పిలుపుల్లోని మమకారపు
మాధుర్యంలోని మాయకు లోనైన
బంధుత్వం హడావిడిగా
అనుబంధాలను అల్లుకుంటోంది

అద్దంలాంటి ఆంతర్యమని
అరమరికలు లేని ఆత్మీయతనుకుంటే
అది అవసరాల ముసుగేసుకున్న
అవకాశవాదమని తెలిసింది

రహస్యాలన్నీ బట్టబయలౌతున్నా
రాయబారాల నడుమ సాగుతున్న
రంగురాళ్ళ రంగస్థలమీ
సర్దుబాట్ల దిద్దుబాట్ల జీవిత జగన్నాటకం..!!

29, నవంబర్ 2019, శుక్రవారం

కోల్పోతున్న మనిషితనం...!!

నేస్తం,
         అనాది నుండి అహానిదే ఆధిపత్యం. అధికారం కట్టబెట్టిన ప్రజలకు నాయకులిచ్చే నజరానాలేమిటా అని ఒకింత ఆలోచన రేకెత్తించాల్సిన అవసరమేర్పడుతోంది ఈనాడు. భద్రత ఇవ్వాల్సిన రక్షక వ్యవస్థే మనకు అభద్రతా భావాన్ని పరిచయం చేస్తోంది. ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యవస్థ పాలకుల కోసం పని చేస్తోంది. న్యాయం కోసం  పోలీస్ స్టేషన్ కి నా వెళ్ళినా, కొత్తగా వచ్చిన సైబర్ క్రైమ్ కి వెళ్ళినా మనకు న్యాయం జరగదు. మన రక్షణ మనమే చూసుకోవాలి. పసిబిడ్డ నుండి పండు ముదుసలి వరకు వదలని కామాంధులకు మాత్రమే రక్షణ ఈ సమాజంలో. ధరించే వస్త్రధారణలో లోపాలంటారు మేధావులు కొందరు. పసిబిడ్డ ఏ రకమైన దుస్తులు ధరించిందని ఈ దుర్గతి? అమ్మను, బిడ్డను కూడా వదలని నికృష్టులను సమర్థిస్తున్న సమాజమిది. రాజకీయ నాయకులకు ఇవేమీ పట్టవు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళినా హేళనగా మాట్లాడి, అవమానించి పంపడం తప్ప చర్యలు తీసుకోలేని అసమర్థులు. లంచాలు మరిగిన  వ్యవస్థలో న్యాయం జరగదు. న్యాయం జరగాలంటే తప్పు చేసిన ఏ ఒక్కరినైనా వెంటనే శిక్షిస్తే, ఆ శిక్ష కూడా మరొకరు తప్పు చేయాలంటే భయపడేలా ఉంటే ఈ ఘోరాలు కాస్త తగ్గుతాయి. నాయకులు పదవి మీద మమకారాన్ని తగ్గించుకుని, ప్రజల కనీస బాగు కోసం ఆలోచించాలి. విజ్ఞులు రాజకీయ నాయకులు ఏది చేసినా సమర్ధించడం మానేసి సామాన్య జన జీవితాలు కాస్త భయం లేకుండా బతకడానికి ఏం చేయాలో అది చేయించండి. ఈ అకృత్యాలను ఆపండి మనుషులుగా మీలో మానవత్వం ఎక్కడైనా మిగిలుంటే...!!

ద్విపదలు...!!

1.  అలరించడం ఆత్మీయత లక్షణం
అక్షరాలకు అలవాటైన అల్లికై...!!

2.   మాలను ఏర్చికూర్చడంలోనే పనితనమంతా
అక్షర భావాలు  అల్లుకుపోతానంటుంటే..!!

3.   అక్షరాలనే అటుా ఇటూ మార్చుతున్నా
అర్థవంతమైన పదబంధాల అమరిక కోసం..!!

4.   ఆదరించిన అక్షరం
ఆదమరచిన ఆకాంక్షలకు అన్యాపదేశంగా దిశానిర్ధేశంజేస్తూ..!!

5.   గురుతుల్లో మిగిలిన జ్ఞాపకం
గుండెను తట్టి లేపిందిలా...!!

6.  గతమైనా..ఘనమైన జ్ఞాపకమది
గుప్పెడు గుండెకు ఆధారమై...!!

7.   సంతోష సాగరానికి ఆహ్వానించాను
కన్నీటి జలపాతాలకు సాంత్వననీయడానికి..!!

8.  వ్యసనమని వదిలేద్దామనుకున్నా
విడువ లేని వ్యాసంగమైనావని తెలియక...!!

9.   పరిచితులమే ఎప్పుడూ
మనసునొదలని అక్షర భావాల పలకరింతలతో...!!

10.   ముసుగులక్కర్లేని బంధమిది
అపరిమితంగా అల్లుకుంటూ...!!

11.   నా అక్షరాలు బ్రహ్మాస్త్రాలై కట్టిపడేస్తాయి
వాటికి అణుకువ, అహం తెలుసు..!!

12.  నిశ్శబ్దమెప్పుడూ చప్పుడు చేస్తూనే ఉంది

గురుతులుగా మిగిలిన నీ జ్ఞాపకాలతో...!!

13.    శిథిలాలలోనూ చిరపరిచితమే

చెదిరిన మనసులో స్థిరమైన జ్ఞాపకమై...!!

14.  అక్షరాలను ఆవహించింది

కనుమరుగైన బంధమైనా చేతిస్పర్శగా చేరువౌతూ..!!


15.    పక్కనే ఉన్నా చూడవెప్పుడూ

నీ చూపులెప్పుడూ సుదూరానే..!!

16.    నన్ను అనుసరిస్తావనుకున్నా

అనుకరిస్తావని తెలియక...!!

17.   వియెాగము విరహమూ చుట్టాలనుకుంటా

పర్యవసానం పరమార్థం తెలిసినా...!!

18.   గురుతుకు నువ్వో నెలవే

గుప్పెడు గుండెకు ఆలంబనగా..!!

19.   పదాల కూర్పు కుదరడంలేదు

అక్షరాలనెలా రాయాలో తెలియనందుకేమెా...!!

20.  అమ్మ పంచిన ఆత్మీయతే అది

అందుకే ఆ పిలుపుకంత కమ్మదనం..!!

21.   యుగాల నిరీక్షణ

క్షణాల్లో మాయమైపోతూ...!!

22.  కొన్ని మౌనాలంతే

మాటలు అక్కర్లేకుండా మనసుని పరిచేస్తూ..!!

23.   సమస్యలెప్పుడూ చుట్టాలే

చెప్పాచేయకుండా వచ్చేస్తూ..!!

24.   కొన్ని చీకట్లంతే

అదాటున ఆశల నక్షత్రాలను  లెక్కలేయమంటూ..!!

25.   అనంతం తానైతేనేమి

నాకు అందనప్పుడు...!!

26.   అన్ని అక్షరాలు అంతే

అలసటెరుగని అమ్మలా లాలిస్తూ...!!

27.   విశేషమేమి లేదు

విషయమే తానైనప్పుడు...!!

28.   అక్షరాల్లో చూపించేద్దామన్న ప్రయత్నమే

అకారంలేని మది సవ్వడిని...!!

29.  ప్రాణం పోస్తున్న అక్షరాలు

వెతలను వెన్నెలకు జారవేస్తూ...!!

30.  వెతకనక్కర్లేదంటున్నా నీకోసం

అక్షరాలను వెంబడిస్తున్నది నువ్వేనని తెలిసి..!!

26, నవంబర్ 2019, మంగళవారం

వివక్ష..!!

అనాది నుండి స్త్రీని ఆటలో వస్తువుగా వాడుకున్నారు తప్ప ఆట ఆడనివ్వలేదు. ఇప్పుడు ఆ ఆటే స్త్రీ ఆడుకుంటే తప్పేంటి అద్దెచ్చా..? అభివృద్ధిని ప్రోత్సహించడం మానేసి ఇలా కటకటాల పాలు చేయడం అన్యాయం కాదా. ఏదో హై లెవెల్ క్లబ్బులకెళ్ళి ఆడుకొనే స్తోమత లేని కారణముగా నలుగురు కలిసి ఆడుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తారా..! అడిగేవారు లేరని ఇంత అన్యాయమా....మరీ క్రీడాస్పూర్తి లేకుండా పోయింది.. 😊

20, నవంబర్ 2019, బుధవారం

స్మార్ట్ జీవితం..!!

"  జీవితాన్ని తరచి చూపిన అనుభవాల పూపొద  "

        జన జీవితంలోని ఒడిదుడుకులను కథా వస్తువులుగా తీసుకుని డాక్టర్ లక్ష్మీ రాఘవ కథా సంపుటాలు వెలువరించారు. వాటిలోనిదే ఈ "స్మార్ట్ జీవితం " కథా సంపుటి. సమాజంలో మనిషి మనుగడ, మానవత్వపు విలువలు, సర్దుబాట్లు, దిద్దుబాట్ల గురించి తనదైన శైలిలో మనకందించిన మణిహారం "స్మార్ట్ జీవితం " లో ఏముందో చూద్దాం.
      కోరికేదైనా అది తీరితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇల్లు కట్టుకోవడం దగ్గర నుండి ఆ ఇంటి మీద ప్రేమ పెంచుకోవడం, అనుకోని కారణాలతో ఆ ఇంటికి దూరమైనా, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటూ మళ్ళీ అదే ఇంటికి చూడాలని రావడం, అనుభూతులు పంచుకోవడం..చదువుతుంటే కళ్ళ ముందు ఆ సంఘటనలన్నీ కనిపించిన అనుభూతి కోరిక కథలో. నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్టు హేళన చేసిన సహోద్యోగులతోనే శబాష్ అనిపించుకోడానికి తన అవసరానికి ధైర్యాన్ని కూడగట్టుకున్న శాంతలాంటి ఎందరో తల్లుల మనోగతం ఈ అవసరం కథ. పల్లె జీవితాలకు మానసిక నిపుణులు అవసరము, సమస్యల పట్ల అవగాహన కల్పించడం వంటి విషయాలను ఝాన్సీ కథ ద్వారా చెప్పడం బావుంది. ఏ బంధము లేని మనుష్యులు ఎలా దగ్గరౌతారో, అయిన వారి నిరాదరణ, శరణాలయాల ముసుగులోని లొసుగులు చెప్పే కథ శరణాలయం. ఇద్దరి మధ్య పెళ్ళి జరగడానికి కావాల్సింది నమ్మకం కాని ఎంక్వయిరీ కాదని చెప్పే కథ ఎంక్వయిరీ. శుచి కథ ఎందరో బడుగు మహిళల బయటకు చెప్పుకోలేని సమస్య. ప్రభుత్వం ఆలోచించి పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపే కథ. అయినవారికి అవసరానికని ఇచ్చిన డబ్బులు వారి పతనానికి, వ్యసనాలకు కారణమైతే ఏర్పడే పరిస్థితి అపాత్రదానం కథలో తెలుస్తుంది. మనిషి నమ్మకాలను సొమ్ము చేసుకోవడమెలాగో బాబాల మాయల లీలలేమిటో తెలిపే కథ కలలు. ఈనాటి పిల్లల, తల్లిదండ్రుల ప్రవర్తన గురించి చక్కని విశ్లేషణతో కూడిన కథ నిఘా. సామాన్యులకు నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను చూస్తూ ఓ బాంక్ ఉద్యోగి పెద్దాయనకు చేసిన సాయమే చిదంబర రహస్యం కథ. తల్లి బిడ్డకు ఎందుకు దూరంగా ఉంటుందో, అత్తగారు అమ్మగా మారిన కారణం చెప్పిన అయిష్టం కథ. పాత తరం నవతరానికి ఇచ్చే సూచనలు, సలహాలతో పాటు జీవితాన్ని సద్వినియోగము చేసుకోవడమెలాగో చెప్పిన కథ నాన్న డైరీ. రాయలసీమలో అనావృష్టి మూలంగా పడే ఇబ్బందులకు వర్షం ఎక్కువైతే వచ్చే అతివృష్టి ఇక్కట్ల గొడవే కరువు సీమలో అతివృష్టి కథ. లోకం తీరు చెప్తూ చెప్పుడు మాటల గురించి జాగ్రత్త పడమని చెప్పే కథ లోకులు. బిడ్డలకు మలి వయసులో భారం రాకూడదని ఓ తల్లి తీసుకున్న నిర్ణయమే మారిన మజిలీ కథ. సమాజంలో లంచాల మెాసాలు చూపిస్తూ, దైవం పేరు చెప్పుకుంటూ భక్తితో బతకడమెలాగో చివరకు ఇదీ కథలో తెలుస్తుంది. పెంచిన అమ్మకు ప్రేమతో తన మనోగతాన్ని వివరిస్తూ తన విశ్వాసాన్ని చాటుకున్న జీవి చెప్పిన కథ అమ్మకు ప్రేమతో.టెక్నాలజీ మాయలో పడి కోల్పోతున్న కుటుంబ బంధాలను, మర్చిపోతున్న బాధ్యతలను గుర్తు చేసిన కథ స్మార్ట్ జీవితం. గత వైభవాన్ని తల్చుకుంటూ కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటూ తన చాతనైన పని చేయాలని సంకల్పించిన ఓ గొప్పింటి పేద కోడలి కథ గతం గతః. బాధితుడెప్పుడూ సామాన్యుడేనంటూ, మాటల్లోనే నీతులు. చేతలకు పనికిరాని నీతులు కూడు పెట్టవని చెప్తూ న్యాయనికి భయపడే మనుషుల మనస్తత్వాలను తెలిపే కథ నీతి. పల్లె నుండి పట్టణానికి చదువు కోసం వెళ్ళే ఆడపిల్లలకు బస్లలో ఎదురయ్యే అగచాట్లు, వెకిలి చూపులు ఎలా తప్పించుకోవాలో చెప్పిన కథ ఎలాంటి మార్పు. తిరుమల శ్రీవారి పుష్పయాగంలో పాలు పంచుకున్న పూల మనసు మాటలు వినిపించిన పుష్పయాగంలో పుష్పాల సందడి కథ. నాటి నుండి నేటి వరకు పెళ్ళిళ్ళ తీరు, అది సహజీవనాలుగా మారిన వైనం చూపిన కథ నాడు....నేడు. వద్దన్న నిక్కరు మళ్ళీ రావాలనడం వెనుక కథే నిక్కరు.
బాంక్ లో బోలెడు డబ్బులున్నా అవసరానికి అందుబాటులో లేని ఏటియం మెషిన్, అవసరం తీరే మార్గం చెప్పిన కథ ఆపద్బాంధవుడు. పెళ్ళి విషయంలో ఈ కాలపు పిల్లల ఆలోచనలను తెలిపే కథ సంబంధం.
     కొన్ని మన నమ్మకాలకు పిల్లల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని సందర్భాల కథే వెక్కిళ్ళు. పెద్దలకు కావాల్సింది పిల్లల సంతోషమే అని చెప్పిన కథ ఇదే. శరీరంలో మార్పులకు కారణం ధ్యానంలో మెట్లు ఎక్కడం కాదు, అనారోగ్య సూచన అని అమెరికాలో ధ్యానం కథలో తెలుస్తుంది. కార్యక్రమం ఏదైనా ఎవరి పని వారిదేనని, భక్తి నటిస్తూ చేసిన మెాసం తెలిపినకథ ఆహా! ఏమి భక్తి. నిర్మాల్యంలో అమూల్యం అంటూ దేవుని అలంకరణకు వినియెాగించిన పూలను తీసివేసేటప్పుడు వాటి మనోభావాలను మనకు వినిపిస్తారు. కాలం మారింది చాలా అంటూ అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన సంగతులను జ్ఞాపకాలుగా మన ముందుకు తెచ్చిన స్వగతంలో 70 ఏళ్ళ జీవితం కనిపిస్తుంది సంపూర్ణంగా.
        అనుభవాలను కదంబమాలగా పేర్చి కూర్చిన కథల పొత్తంలో ఎన్నో జీవితాల ఆటుపోట్లు, అతివల అంతరంగాలతో పాటుగా, పూల మనోగతాన్ని కూడా చేర్చడం చాలా బావుంది. విద్యాధికురాలు, ఉద్యోగ బాధ్యతలతో పాటుగా కుటుంబ బాధ్యతలను చాకచక్యంగా నెరవేరుస్తూ, ఎందుకు పనికిరాని వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తూ, అదే నేర్పు, ఓర్పుతో అతి సుళువైన శైలిలో, అలంకారాలు, ఆర్భాటాలు లేకుండా వర్ణనకు తావీయని కథలు రాయడంలోనూ చేయి తిరిగిన డాక్టర్ లక్ష్మీ రాఘవ మరిన్ని కథలను మనకందించాలని కోరుకుంటూ, చక్కని కథల పొత్తం " స్మార్ట్ జీవితం " కి హృదయపూర్వక అభినందనలు.

17, నవంబర్ 2019, ఆదివారం

బాల్యం..!!

అమ్మ ఒడిలోని పసిపాపాయి
చీర చెంగు చాటుకి చేరుతూ నాన్న చేయినందుకుని
మెుగ్గ తొడిగినదే బాల్యమంటే

అరమరికలెరుగనిది
ఆంతర్యాలను, అంతరాలను లెక్కజేయనిది
సహజమైన ప్రకృతి అందాలలో ఇదొకటి 

అక్షరాలతో ఆటలాడుతూ
అల్లరి కేరింతల ఆనందాలకు నెలవై
చిరు అలకల బుజ్జగింపులదీ చిన్నతనం

ముద్దు ముద్దు పలుకులు నేరుస్తూ
మమకారపు మాధుర్యాలను చవిచూపే
పాలుగారే పసిడితనమిది

అనుబంధాలను దగ్గర చేర్చే
ఆత్మీయ పిలుపులు పలకరించే
అనురాగ సమ్మిళితమైన లాలిపాటల కమ్మదనమిది

అందరిని మనం కావాలనుకుంటే
ఎప్పుడో ఒకప్పుడు మనకు
చేరువౌతారని చెప్పే కల్మషమెరుగని మనసులివి

మరలని కాలంలో
మరపురాని అనుభూతులనందించే
మలి వయసుకు మధుర జ్ఞాపకమీ పసితనం...!!

ఇప్పుడే తెలిసింది..!!

       ఆంధ్రప్రదేశ్ ఆంగ్లప్రదేశ్ గా మారబోయే క్రమంలో అంధప్రదేశ్ గా కూడా మారిపోయింది. కొందరు పెద్దలకు కూల్చివేతలు, నిర్మాణ నిలిపివేతలు కూడా అభివృద్ధిలో భాగంగా కనబడటమే. భాషా ప్రాతిపదికతన ఏర్పడిన రాష్ట్రానికి అధిపతిగా, ఆ భాష మనుగడనే లేకుండా చేయడంలో కూడా తప్పేం లేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేయడానికి ఇంగ్లీష్ లో రాసి తీసుకెళితే Ease చదవడం రాని, అర్థమే తెలియని సి ఐ లు ఉన్నందుకు, ప్రజల తలరాత ఇంగ్లీష్ తో మార్చేద్దామన్న ప్రయత్నం అభినందించదగ్గదే.
       మరి కొందరు ఈ తెలుగు భాష గురించి బాధ పడేవారందరూ వారి వారి పిల్లల్ని తెలుగు మాధ్యమంలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారా అని అడగడంలోనూ తప్పు అస్సల్లేదు..

" ఒక చిన్న ప్రశ్న..చిన్నపాటి జ్వరం వస్తే మనలో ఎంతమంది ప్రభుత్వాసుపత్రికి వెళుతున్నాం..? "

ఇంగ్లీష్ చదువు ఉద్యోగాల కోసమనంటే...అదీ పేదవారి పిల్లల కోసమని అనుకుంటే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే సమాధానం తెలియని ప్రభుత్వంలో ఉన్న మనకి, తిరోగమనాభివృద్ధి లో ముందున్న మనకి, ఈరోజేంటన్నదే ప్రశ్నార్ధకమైన మనకి అసలు ఏ సమస్యా లేకుండా చేస్తున్నందుకు,

అదేమని అడిగితే పేటియం బాచ్ తో ట్రోల్ చేయించడం... సాక్ష్యాలు, ఆధారాలన్నీ తీసుకుకెళితే తప్పక కేస్ ఫైల్ చేసి, ఎఫ్ ఆర్ కాపీ ఇచ్చి తర్వాత చెత్తబుట్టలో వేసిన రక్షణ అధికారులు, ఇంకేముంది మీరు ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసి ఆ నంబర్ ఇవ్వండి...వీళ్ళను పట్టుకు వస్తామని అన్నీ చేసాక అడ్రస్ లేని సైబర్ క్రైమ్... ఇదండి పారదర్శకత...

నీతులు చెప్పవద్దు...మీరు చేయాలనుకున్నది చేస్తున్నారు... దానికి సాకులు చెప్పాల్సిన అవసరం లేదు..ఎవరేమన్నా మీ వర్గానికి మీరు న్యాయం చేసుకుంటున్నారంతే. దానికింత హడావిడి అవసరం లేదు..దిగ్విజయంగా మీ పని మీరు చేసుకోండి గౌరవంగా.. అడిగేవాడెవడు చెప్పండి..?

12, నవంబర్ 2019, మంగళవారం

అనంత యాస పుస్తక సమీక్ష..!!

      " అమ్మభాషను ఊపిరిగా మార్చిన మాండలీకమే అనంత యాస"          

             ఎవరికైనా పుట్టిన ఊరు మీద అభిమానం ఉండటం సహజం. పొట్ట చేతబట్టుకుని పరాయి దేశాల వెంట పడుతున్న నేటి రోజుల్లో మాతృభాష మీద అదీ తన ప్రాంత మాండలిక యాస, భాష మీద ఎనలేని మమకారం పెంచుకున్న అతి కొద్దిమందిలో రాయపాటి శివయ్య ఒకరు. తెలుగు సాహిత్యంలో కథ, కవిత్వం, వ్యాసాలు, లఘు రూప ప్రక్రియలు విరివిగా వస్తున్న తరుణంలో పుట్టిన గడ్డ మీద ప్రేమతో అమ్మకు సాటైన మాండలికాన్ని ఆత్మీయంగా హత్తుకుని నలుగురికి ఆ గొప్పదనాన్ని తెలియజేయాలని చాలా శ్రమ పడి పరిశోధన చేసి తమ ప్రాంతం చుట్టూ ఉన్న ఇతర ప్రాంతాల భాషల, యాసల ప్రభావాన్ని, తన ప్రాంతపు యాస ప్రత్యేకతను తెలియజేయడానికి " అనంత యాస " అనే భాషా పరిశోధనా గ్రంధాన్ని అందించిన రాయపాటి శివయ్యకు అభినందనలు. చదువుకునే రోజుల్లోనే ఈ పరిశోధనకు అంకురం పడిందని, కొందరు తన యాసను గేలిచేసినప్పటి బాధ నుండి జనించినదే ఈ కోరికని, అదే ఈరోజు ఈ పుస్తక ప్రేరణకు కారణమని చెప్తారు. చక్కని భాష నేర్చుకునే ప్రయత్నంలో ఎన్నో కొత్త పదాలు నేర్చుకున్నానని, అవే తన ఉపాధ్యాయ వృత్తిలో ఉపయోగ పడ్డాయని చెప్తారు.
          మానవుడు భావ వ్యక్తీకరణకు భాషను మాధ్యమంగా ఎంచుకున్నాడు. భాషకు మార్పు సహజం. మానవుడు నివసించే ఆ యా మరిసరాల భౌగోళిక పరిస్థితులు, విద్య, వైద్య, నాగరికత వగైరా ప్రభావాలనుబట్టి భాషలో యాసలు చోటు చేసుకోవడం, భాషలో మార్పులు, చేర్పులు రావడమన్నది సహజ పరిణామక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒరిసా రాష్ట్రాల ప్రభావం ఉంది. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు తెలుగునాడును వివిధ వృత్తి పరమైన పదకోశ పరిశోధన ఆధారంగా నాలుగు భాషా వ్యావహారిక మండలాలుగా విభజించారు. అవి
1. పూర్వ మండలం / కళింగ ప్రాంతం
2. మధ్య మండలం / కోస్తా ప్రాంతం
3. దక్షిణ మండలం / రాయలసీమ ప్రాంతం
4. ఉత్తర మండలం / తెలంగాణ ప్రాంతం.
ఈ విభజనలో రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఇక్కడి ప్రజల వాడుక భాషలోని పదాలను, మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా ఏర్పరచుకున్న మాండలిక పదాలను చూపే ప్రయత్నమే ఈ " అనంత యాస " పుస్తకం ముఖ్య ఉద్దేశ్యం. అనంతపురం భాషా మాండలీకంపై ఎక్కువగా కన్నడ భాషాయాస ప్రభావం ఉంటుంది. అలాగే తమిళ పదాలు, కడప, కర్నూలు భాషాయాసలు కూడా చోటుచేసుకుంటాయి. ఇక్కడి ప్రజలు  వాడే వస్తువులు, పదార్థాలు వివిధ ప్రాంతాల ప్రజలకు భిన్నంగా ఎలా ఉన్నాయో చెప్పడానికి ఇరవైఏడు భాగాలుగా విభజించి మనకు అందించారు.
మొదటగా ఏకాక్షర పదాల్లో ఆ, ఈ, ఉ, ఊ, ఏ ఇలా ఆ యా అక్షరాల వాడుకను, ఉదాహరణలను వివరించారు.
క్వా అంటే తీసుకో - ఇదిగో క్వా.
తర్వాత లాల, లాలి, ఆంతిను వంటి పిల్లల సంబంధ పదాలు, చుట్టంరాలు, పొద్దులు అవటం వంటి స్త్రీ పురుష సంబంధ పదాలు, అజ్జి, అవ్వ వంటి వరుసల బంధాల సంబంధ బాంధవ్యాలు, అంగి, ఒల్లి, కమ్మిడి వంటి వాడుక దుస్తుల పదాలు, కడిమి/కడెం, కమ్మలు, దావు(వడ్డాణం) లాంటి ఆభరణాల పేర్లు, కడత, సెయ్యి, దమ్ములు, దొక్క వంటి అవయవాల పదాల వాడుక పేర్లు కొన్ని. అరుగు, అసులు, కమాను, జలాట, గవాసి, వారపాకు, పడసాల వంటి ఇంటికి, ఇంటి పరిసర ప్రాంతాలకు సంబంధించిన పదాలు, దువ్వాన, ఇసర్రాయి, పీపీ ఇవి ఇంట్లో వాడే కొన్ని పరికరాల పేర్లు. అనకాగు, ఈలపీట, గిద్ది, గెంటి, పొంత, జోడ వగైరా వంట ఇంటి వాడుక పరికరాలు, ఉర్లగడ్డ, ఎర్ర గడ్డ, ఎల్లిపాయి, మిరక్కాయ వంటి కూరగాయల పేర్లు, అరటికాయ,ఎల్లూరుకాయ, కలంగరికాయ (పుచ్చకాయ) వంటి పండ్లు, కాయల పేర్లు, అవగిరి, ఉక్కిలి, కీరు, గోగాకు, బొరుగులు, మెతుకు, పుగ్యాలు మొదలగు వంటలు, వంట వదార్థాలు, కుసాలనూనె, చమురు వంటి నూనెల పేర్లు, దచ్చినం, తూరుపు, భానువారం, బేస్తువారం, అయ్యాలకాడ, పైటాల, రేత్రి ఇలా దిక్కులు, మూలాలు, వరాలు, సమయాల వాడుక పదాలు ఉదాహారణలతో చెప్పారు.
        కొన్ని కొలతలు, ప్రమాణాలు, వ్యవసాయ రంగం, కార్తెలు, వర్షాధారిత పదాలు, జంతువులు, సరీసృపాలు, వ్యక్తిత్వ పదాలు, ప్రశ్నార్థక పదాలు, అనుమతినిచ్చే పదాలు, తిట్లు, శాపనార్థాలు, సాధారణ వ్యవహారిక పదాలను సోదాహరణంగా ఎక్కడ ఎలా వాడతారో వివరించారు. 
       పరిశోధన భాష మీద చేయడం చాలా కష్టం. అందులోను మాండలికంపై చేయడమంటే కత్తి మీద సాము చేయడమే. భాషను సజీవంగా తరువాతి తరాలకు అందించాలంటే ఇలాంటి భాషా పరిశోధన గ్రంధాలు రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రతి ప్రాంతపు యాస ఓ ప్రత్యేకతను భాషకు అందిస్తుంది. మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మన భాషను, యాసను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదుందని మర్చిపోకూడదు. ఉపాధ్యాయునిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ, తన ప్రాంతం మీద మక్కువను, అమితమైన ప్రేమను చూపించడానికి " అనంత యాస " భాషా పరిశోధనా పుస్తకాన్ని అందించిన రాయపాటి శివయ్య గారికి హృదయపూర్వక అభినందనలు.
     
     


                         
                         
   

11, నవంబర్ 2019, సోమవారం

ఏక్ తారలు..!!

1.   మనవైన క్షణాలే_మనసు భారాన్నంతా దించేస్తూ..!!

2. సునామీలా చుట్టేసింది_నీ ప్రేమ వెల్లువై ఉప్పొంగుతూ..!!

3.   మనసుకన్నీ ఓదార్పులే_గాయాలనుపశమింపజేసే చెలిమి తోడైతే..!!

4.  మనిషిలోని మనసు మార్పది_ఓదార్చిన చేతిని అను(వ)మానిస్తూ...!!

5.   ఏ భవిష్యత్తు ఊతమిచ్చిందో_చెక్కిట ఆభరణమైంది చిరునవ్వు సొట్ట...!!

6.   గోముఖ వ్యాఘ్రాలుంటాయి మరి_జీవితంలో జాగరూకత అవసరమే..!!

7.  అక్షరాల అమరికకు దాసోహమవ్వాల్సిందే_ఏ పద సౌందర్యమైనా...!!

8.   మాలిమి అలవాటైన వనమాలి_అక్షర వనానికి వన్నెలద్దుతూ...!!

9.   జ్ఞాపకాలు వెంటబడుతున్నాయి_వర్తమానానికి అర్జీ పెట్టుకోవడానికేమెా...!!

10.   ఆరాధనంతా అక్షరాలను అలముకుంది_పద ప్రవాహమై ప్రవహిస్తూ..!!

11. పదక్రాంతులే కొందరు_అక్షరాల్లో ఒలికిన ప్రేమకు...!!

12.  దోసెడు పద పారిజాతాలు చాలు_గుప్పెడు గుండెలోని ఆరాధన చూపడానికి..!!

13.   తులాభారానికే భారమయ్యింది_మనసు జార్చిన కన్నీటిని తూకమేడానికి..!!

14.   ఆయువుదేముంది అరక్షణమే_జీవించడంలోనే చాకచక్యమంతా...!!

15.   ముందుకే పోతానంటోంది మనోధైర్యం_భయపెట్టే గతాన్ని గదమాయిస్తూ..!!

16.   నీ మౌనాన్ని వినడమెా వ్యసనమైంది_ఊరడించే ఊహలను వెదుకుతూ...!!

17.   అణుకువతో అందిపుచ్చుకోవడమే_సమయం మనదికాకున్నా..!!

18.   గత జ్ఞాపకాల్లో బతికేస్తుంటాం_వాస్తవం భయపెడుతుంటే..!!

19.   వర్తమానానికో హెచ్చరిక_వాస్తవమెప్పుడూ...!!

20.   విషాదమూ ఓ వరమే మరి_స్వగతంలో గతాన్ని స్మరిస్తూ..!!

21.  తరాజూ తల్లడిల్లింది_కన్నీటినెలా తూకమేయాలో తెలియక..!!

22.   నీలిఛాయ వెంటే ఉంది_చితి మీదకు చేరినా మాయమవకుండా..!!

23.   వేటగాడికి ఏ గాలైనా ఒకటే_గాయపరచడమాతని వృత్తి కనుక...!!

24.   స్వేచ్ఛను హరించింది వర్తమానం_జ్ఞాపకాలను మాయం చేస్తానని భయపెడుతూ...!!

25.   స్వాతిశయమూ ఎక్కువే అక్షరాలకు_తమను కాదని భావాలు మనలేవని...!!

26.   మౌనం వినిపించాలనుకుంటోంది_కాసిని మాటలు అరువివ్వవూ...!!

27.   చూపాలనుకుంది నిన్నే_పరిచయమున్న అక్షరాల్లో...!!

28.   మౌనం దాచేసింది_మనసు మాటలన్నీ..!!

29.  అంతిమయాత్రే తుది ఫలితం_జీవితపు తప్పొప్పుల పరీక్షలో..!!

30.  విలాపమూ విలాసమైంది_మనిషితనం మరచిన మదాంధులకు..!!

10, నవంబర్ 2019, ఆదివారం

ఏ బంధమెా ఇది..!!

ఏ రెప్పపాటు క్షణంలోనో
ఓ ఉలికిపాటుకు
ఏమరుపాటు కూడదనుకుంటూనే
లిప్తపాటు మరో ఆలోచన
ఆక్రమించేయడం జరిగిపోతుంటే
జారిపోయిన కాలాన్ని పట్టుకోలేక
అది విసిరేసెళ్ళిన ఘడియలకు
గడియ పెట్టడం చేతకాని
అశక్తత నుండి బయటపడలేక
జ్ఞాపకాల సుడులలో తిరుగుతున్న
మనసును మళ్ళించడానికి
అక్షరాల సహవాసం అలవాటై
అదే ఇష్టమైన వ్యాపకమై
విడలేని వ్యసనమైపోతుంంటే
ఆ నిస్సహాయతలోనుండి
నిర్భయంగా వెలువడే
భావాలు వెలువరించే బాధ్యతలు
వేసిన బంధమే ఇదనుకుంటా..!!









5, నవంబర్ 2019, మంగళవారం

కుల వృక్షం పుస్తక సమీక్ష...!!

                                 " జీవితానుభవాలే కథాంశాలుగా కులవృక్షం "
        తెలుగు సాహిత్యంలో కథలకు ప్రత్యేక స్థానం ఉంది. బ్లాగర్ గా, కవయిత్రి రచయిత్రిగా తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఉక్కు మహిళ తాతినేని వనజ. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా, నిక్కచ్చిగా చెప్పగల ధైర్యం, తెగువ ఆమె సొంతం. సమాజంలో ఎక్కువగా మహిళల మనసు వేదనలు, రోదనలే ఈమె కథాంశాలు. కథా సంపుటి పేరులోనే వైవిధ్యమున్నట్లుగానే ప్రతి కథా మన మనసులను తాకుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. 
              మొదటి కథ పూలమ్మి కథ మనిషిలోని మానవత్వాన్ని, మృగాన్ని ఒకేసారి చూపే కథ. దాహం రెండక్షరాలే కాని ఎన్ని రకాల దాహాలో దాహం కథలో తెలుస్తుంది. కట్టుకున్న బంధానికి విలువ ఇవ్వకుండా పరాయి స్త్రీల వెంటబడే మగనికి ఓ అతివ చెప్పిన సమాధానం లోపం లేని చిత్రం కత. మత సంప్రదాయాలను ఆసరా చేసుకుని చేసే మెాసాల్లో ఓక మెాసం కథ చూసి చూడనట్లు. మతాచారాలను ఎక్కడ ఎలా పాటించాలో, వాటి వలన ఇబ్బందులు తెలిపే కథ ఉడాన్. తమవి కాని రాతలు కూడ తమవేనని చెప్పుకునే కొందరు రచయితల నీచత్వం, రాతల్లో నీతులు, చేతల్లో శాడిజం బయట పెట్టిన కత రచయితగారి భార్య. నాయకులు వెంట తిరిగే ఖద్దరు చొక్కాల వెనుక అసలు రూపాన్ని బయట పెట్టిన కథ ఆదర్శ నాయకుడు. ఆడ పని, మగ పని అని విభజించి ఆంక్షలు ఆడవారికే అని ఆలోచించే వారికి జీవితం విలువను తెలిపిన కథ గంధపు చెక్క - సానరాయి. కొడుకు దుర్మార్గానికి భరించలేని తల్లి అపరకాళిగా మారుతుందని సంపెంగ సేవలో కథ నిరూపిస్తుంది. ఆధునిక పరికరాలు ఎంత అందుబాటులో ఉన్నా ఆత్మీయ స్పర్శను అందించలేవని ఓ తల్లి కొడుకు కోసం ఎదురుచూసిన వాస్తవ సంఘటనను, ఆ కలయికను హృద్యంగా చెప్పిన కథలాంటి నిజం ఆత్మీయ స్పర్శ కథ. నూతి నీళ్ళు మన దాహార్తిని తీర్చడానికే కాదు.. ఎందరో అతివలను తమ గుండెల్లో దాచుకున్న సహృదయం గలవని, వినే మనసుంటే కనీళ్ళ కతలెన్ని వినబడతాయెా విని చూడమంటుంది నూతిలో గొంతుకలు కథ. వాస్తవ వెతల సంకలనమీ కథ. ఈ తరం పిల్లలకు స్వేచ్ఛకు, విశృంఖలత్వానికి తేడా తెలియాలని చెప్పే కథ త్వరపడి. కొన్ని ఖాళీలంతే పూరించబడవు అన్న మాటలోనే ఎన్నో భావాలను అందిస్తూ పొట్ట కూటి కోసం తిప్పలను, నవ్వుల వెనుక దాచిన వెతలను చక్కగా   చెప్పారు ఆమె నవ్వు కథలో. ప్రకృతి విరుద్ధమైన బంధాలలోని లోపాలను తెలిపే సరికొత్త కథా వస్తువుతో వచ్చిన కథ పరస్వరం.
ఏ పనైనా ఇష్టంగా చేయాలి కాని పలానా కులం పలానా పని చేయాలన్న నిబంధన ఉండకూడదన్న సూచననిస్తూ, అభిరుచులకనుగుణంగా పని చేయాలని, మనుషుల మనస్తత్వాలు మారాలని ఈ కథా సంపుటి పేరైన కులవృక్షం కథ చెబుతుంది. తడియారని జ్ఞాపకాలెప్పుడు రెప్పలను తడి చేస్తూనే ఉంటాయని, అనుబంధం, మమకారం విలువను తెలిపే కథ రెప్పల తడి. దానం చేయడం తప్పు కాదు, అపాత్రదానం చేయడం మంచిది కాదని, అవసరాలు చేయించే తప్పులను చూపిన కథ ఆవలివైపు. లతాంతాలు కథ చదవడం పూర్తయినా కొన్ని రోజులు చదువరులను వెంటాడుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. సున్నితమైన కథా వస్తువును చాలా లాఘవంగా అక్షరీకరించారు.
కుటుంబ బంధాలకు, ఆడ మగ మధ్యన స్నేహానికి గల సన్నని తెరను చెప్పిన కథ చేరేదెటకో తెలిసి.
ఉద్యోగం చేసే మహిళలు పడే కష్టాలు, వారిని వేదించే పై అధికారులు, వారిని సమర్థించే కొందరి గురించి చెప్పిన కథ పిడికిట్లో పూలు. ఆడ మగ కాని మరో పుట్టుక ఈ సమాజంలో కష్టపడి పని చేసుకో బతకాలంటే ఎంత కష్టమెా మన కళ్ళకు కట్టినట్టుగా చెప్పిన కథ మార్పొద్దు మాకు, మార్పొద్దు. కథలలో అరుదుగా జరిగే విషయమిది. ఒక కథకు పొడిగింపుగా మరొక కథ. అలాంటి కథే చిగురించిన శిశిరం కథ. ఇది చేరేదెటకో తెలిసి కథకు పొడిగింపు.
మధ్య వయసు ఆడ మగ మధ్యన స్నేహం, ఆరాధనకు చక్కని తార్కాణం ఈ రెండు కథలు.
సరికొత్త కథా వస్తువు మగ వేశ్య మనసు కథను, చాలా సున్నింతంగా కథను నడిపించిన తీరు, సమస్యకు సూచించిన పరిష్కారం చాలా బావుంది.
                           ఎన్నో జీవితాలు మన చుట్టూనే ఉన్నా, మనకు తెలియని లేదా తెలిసినా ఆఁ మనకెందుకులే అని పక్కకు తప్పుకుపోయే సగటు మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలను, ఎందరో స్త్రీల ఎన్నో సమస్యలను. కొన్ని స్వీయానుభవాలను కథలుగా చెప్పడంలో వనజ తాతినేని కృతకృత్యులయ్యారు. ఓ రచయిత్రిగా సమాజంలో సమస్యలను కళ్ళకు కట్టినట్టుగా మన ముందుంచారు. సాధారణ శైలిలో, సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తన రచనలను తీర్చిదిద్దారు. ఎన్నుకున్న ప్రతి కథా వస్తువు ఉహాజనితం కాదు. వాస్తవ పరిస్థితులకు అక్షరరూపం. కథలా కాకుండా సహజ సంఘటనల్లా సాగిపోతుంటాయి. అద్భుతమైన కథలను కులవృక్షం ద్వారా అందించిన వనజ తాతినేనికి హృదయపూర్వక అభినందనలు.       

2, నవంబర్ 2019, శనివారం

త్రిపదలు..!!

1.   అప్పటి క్షణమే
కనుమరుగవక
ఇప్పటికి వెలుగులీనుతూ...!!

2.   ఉల్లాసమూ శీతకన్నేసింది
నీవు లేని విషాదాన్ని
తట్టుకోలేనంటూ...!!

3.   ఆనవాలుతో పనేముంది
ఆదమరువనివ్వక
వెన్నంటే ఉంటుంటే..!!

4.   కరిగిన నిజం

కలలా తేలిపోతుంటే

 ఊపిరి ఉండలేనంటోంది...!!

5.   అక్షరం హత్తుకుంది

మార్మికతను మనసు పాటిస్తుంటే

గాయాలను కలం సిరాలో ఒంపేయంటూ.. !!

6.   లెక్కకు రాని గాయాలే ఇవి

క్షణాలను ఖాళీ చేయిస్తూ

అక్షరాలతో నింపేయమంటూ..!!

7.    మనసెరిగిన మౌనమది

ఆవేశాన్ని అదుపుచేస్తూ

అనుబంధాలను దగ్గర చేస్తూ...!!

8.   చీకటి సిరాతో 

వెన్నెల సంతకాలు

నా(నీ) అక్షరాలు...!!

9.   తిమిరమూ తీయనే

వేదనను తరిమే

వేకువంటి మనసు తోడైతే...!!

10.   వెలుతురుకు వియ్యపురాలైనప్పుడు

చీకటి చుట్టం సర్దుకుంటూ

సంతసాల కానుకంపుతుంది..!!

11.   మానసానికెప్పుడూ పురిటినొప్పులే 

నిన్నారేపుల్ని తలచుకుంటూ 

ఈరోజులో బతికేస్తూ... !!

12.   చీకటెప్పుడూ చుట్టమే మరి

రెప్ప దాటు కన్నీళ్ళను

రెప్పలెనుక కలలో దాచేస్తూ...!!

13.   కొత్త కలల బరువుతో నూతన వధువు

అప్పగింతల కన్నీళ్ళతో

భారంగా అయినవాళ్ళు...!!

14.   కొత్త చిగురు వస్తోంది

పాత ఆకును రాల్చిన 

కాలపు మహా వృక్షానికి...!!

15.   కరతలామలకమే అన్నీ

క్షణాల కాలాన్ని

యుగాలుగా మార్చేయడంతో సహా...!!

16.   చెప్పకనే చెప్పావుగా

జీవంలేని నవ్వుకు 

కారణాన్ని..!!

17.   తడిపే చినుకెప్పుడూ ఆత్మీయమే

వేదనను పంచుకుంటూ

మనసు తడిని దాచేస్తూ...!!

18. శబ్దమే స్తబ్దుగా ఉంది

మరణిస్తున్న మనసును

మరోమారు చూడలేక..!!

19.   గాయమైనా

గేయమైనా

మనిద్దరిదే ఆ బాధ్యత...!!

20.  బాధ్యత 

ముడిబడిన బంధానికి

చిక్కిన నజరానా...!!

21.   కలత వాస్తవమైనా

కలలా అనిపించే నిజమే

మనకు మిగిలే సంబరం..!!

22.   ఆ చేతికున్న మహిమదేనేమెా

మత్తుతో గమ్మత్తుగా గారడి చేస్తూ

అక్షరాలను కావ్యాలుగా మలచడంలో...!!

23.   ప(క)లవరింతలకు తీరికెక్కడా

వద్దంటూనే వాలిపొమ్మంటూ

తికమక పెడుతుంటే..!!

24.   నిశ్చింత నాలో

నాదంటూ లేక

సర్వమూ నీవయ్యాక..!!

25.   గతంలో కాకెంగిలి తాయిలాలన్నీ

వాస్తవానికి ఊపిరద్దుతూ

రేపటి పలకరింపులకు మిగిలే నెమలీక నెయ్యాలు..!!

26.  ఒడ్డున నేనెక్కడున్నానూ

నిండా నీ ప్రేమలోనే

మునిగిపోయుంటే...!!

27.   ఆవాహన చేసుకోవాల్సింది

అక్షరాలను

శూన్యాన్ని చుట్టేయడానికి...!!

28.   నీడ జాడ తెలుపుతుంది 

అక్షరాలు చూపెడతాయి

మనసుని అద్దంలో...!!

29.   నాకన్నింటా ఉపమానమే నువ్వు 

అతిశయెాక్తికి తావివ్వకుండా

రూపకాన్ని అలంకరిస్తూ...!!

30.   పిలుపు పిలుపులో

ఓ హెచ్చరిక

గమనం నిర్దేశించుకోమంటూ..!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner