29, సెప్టెంబర్ 2014, సోమవారం

కాకిగోల...!!

మనం వాడుకలో పిల్లలని విసుక్కుంటూ ఉంటాము కదా ... ఏంటిరా కాకిగోల ఆపండి అని... అది ఎంత నిజమంటే మా ఊరిలో బోలెడు కాకులు కాపురాలు ఉంటున్నాయి... ఇది నిజమేనండోయ్ అబద్దం కాదు.... పొద్దున్నే చాలా వరకు కాకులన్ని చుట్టుపక్కల ఊర్లు వెళ్ళి సాయంకాలానికి తిరిగివస్తూ ఉంటాయి.. నాలా బద్ధకం ఎక్కువగా ఉన్న కాకులు మాత్రం ఇక్కడే ఉండిపోతాయి... అబ్బా ఇక అవి వచ్చాక చూడాలి చాలాసేపు భలే కబుర్లు చెప్పుకుంటూ గోల గోల చేస్తాయి... ఆ గోల వింటూ ఉంటే నాకు కాకిగోల  మాటలు గుర్తుకు వచ్చి భలే నవ్వు వస్తుంది రోజు సాయంత్రం .... మాకు ఇదో వ్యాపకంలా వాటిని చూస్తూ ఉంటా.... మా ఊరి కాకిగోలను మీరు చూడాలనుకుంటే మా ఊరు వచ్చేయండి మరి .....ఆన్నట్టు నేను ఇలా అన్నానని వాటికి చెప్పేయకండి.... అసలే వాటికి కోపం ఎక్కువ... నన్ను పొడుచుకు తినేస్తాయి...  అందరికి చెప్పానని తెలిస్తే ....  చప్పుడు కాకుండా వచ్చి చూసి పొండి మరి..... !!

26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

మనుషులు ... కాలానుగుణంగా మారుతున్న బంధాలు....!!

ప్రియ నేస్తం...
                    ఏమిటో ఈ మారిపోతున్న బంధాలు, అనుబంధాలు చూస్తూ ఉంటే నువ్వు ఎలా ఉన్నావు అని కూడా అడగాలి అనిపించడం లేదు నాకు .. నాలానే నువ్వు కదా... మనం అందరం కలసి గడిపిన రోజులు ఎంత గొప్పగా ఉన్నాయి అనిపించక మానడం లేదు.... పక్కపక్కనే ఉన్నా అందరు కలసి ఉన్న ఆ అనుబంధాలు ఇప్పుడు ఎక్కడ... ఆఖరికి రక్తం పంచుకు పుట్టిన బంధాలే రాబందులుగా మారిపోతున్నాయి ఈ డబ్బు పిశాచి కోసం.... అమ్మా నాన్నలను పంచుకునే స్థితికి దిగజారాయి ధన దాహం తీరక... వేగం పెరిగిన మన జీవన ప్రయాణంలో బంధాలు కూడా వేగంగా పరుగులెత్తుతూ అప్పటికప్పుడే తెగిపోతున్నాయి... హోదాకు, పై పై హంగు ఆర్భాటాలకు దాసోహమంటూ... అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల ప్రేమలు వృద్ధాశ్రమాలకు పరిమితం అయిపోతున్న ఈ రోజులు చూస్తూ ఉంటే మనసు మూగబోతోంది... ఇక పెదనాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయిలు, మేనత్త, మేనమామలు అన్ని కలసి ఒకే పదం ఆంటి,,అంకుల్ గా రూపాంతరం చెంది ఎవరు ఎవరో తెలియని రోజులైపోయాయి... మన రోజుల్లో మీ ఇల్లు మా ఇల్లు అని లేకుండా మీ వాళ్ళు అందరు నాకు చుట్టాలే అయిన మన చుట్టాలు పిన్నిలు బాబాయిలు .. ఓహ్ నిజంగా ఆ రోజులు ఎంత బావుండేవి... కమ్మని పచ్చళ్ళు, ఇష్టమైన పిండివంటలు, రుచికరమైన కూరలు మనం అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి పంచుకున్న రొజులు... బాబాయి అనుకోకుండా దిగంతాలకేగిన ఆ రోజు ఇప్పటికి మర్చి పోలేను.... ఇప్పటికి ఆ తరువాత రోజు నువ్వు అన్న మాటలే గుర్తు నాకు " గులాబి దండల రేకలు చూసి నువ్వే గుర్తు వచ్చావు " అంటే ఇష్టం ఎంతగా ఉంటే కష్టంలో కూడా గుర్తు వస్తామో కదా అనిపించింది.... ఇప్పుడు ఇంట్లోనే ఒకరికి బాధ వస్తే నాకేంటి అనుకుంటున్న రోజులు...మనం కూడా యాంత్రికంగా అందరితో పాటు నటించేస్తున్నామేమో అని భయంగా ఉంది ... ఆధునిక యుగం కదా అన్ని ఆధునికంగా మారిపోతూ అమ్మా నాన్నలను కూడా మనకు పని చేసే యంత్రాలుగా చూస్తున్న ఈ రోజులను చూస్తూ అప్పటి మన రోజులను నదుర జ్ఞాపకాలుగా తలచుకుంటూ ఏమి చేయలేని ఈ కాలంతో పాటు పరిగెత్తేస్తున్నాము... మళ్ళి మరోసారి నా బాధను నీతో పంచుకుంటున్నా ప్రియబంధమా....
ఉండనా మరి... నీ నెచ్చెలి

పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రేమగా .....!!

 ప్రియమైన అమ్ముకు ....  
   
   పుట్టినరోజు శుభాకాంక్షలు........                
అల్లరి అమ్ము ....
అల్లరిలో ఆటల్లో అన్నకు పోటి
దాగుడుమూతల దొంగాటల చెల్లి
అనుకున్నది సాధించే మొండిపిల్ల
అందరిని ఆటపట్టించే బంగరు తల్లి
నన్ను మాత్రం ఆడుకునే రాకాసి బుల్లి
అక్కకు పోటి ప్రతి దానిలో ముందే
అందరి ప్రేమను అందుకునే అందాల తల్లి
ఈ ముద్దుల మురిపాల అపరంజి బొమ్మకు
పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రేమగా .....!!

24, సెప్టెంబర్ 2014, బుధవారం

రుధిర సౌధం....!!

రెక్కలు తెగిన ఆకాశం
వర్షించిన అరుణ రుధిరం
కట్టలు దాటిన కన్నీటి ప్రవాహం

విరిగిన మనసు శకలం 
ముక్కలుగా పడిన దేహం
కనపడని కలల కధల సాకారం

రాలిన చినుకుల శబ్దం
రాబందుల కబంద హస్తం
కలసిన వికృత చేష్టల రూపం

పలికిన చిలకల పలుకందం
వినపడని విలయ విద్వంసకరం
మూసిన రెప్పల మౌనపు సాక్ష్యం

వాకిలి వద్ద వేచిన ఉదయం
చీకటి దుప్పటి చుట్టిన తరుణం
రుధిర సౌధానికి వేసెను కళ్ళెం....!!

నా బాధ్యతేం లేదు మరి....!!

 నాలో మంచి ఉందో లేదో నాకు తెలియదు కాని చెడు లేదని అనుకుంటూ బతికేస్తున్నా... ఏం చేద్దాం ఎవరికి నచ్చినా నచ్చక పోయినా మనకి మనం నచ్చాలి కదా... ఎంత చెడ్డవారికైనా చెడు అంటే నచ్చదు అదేంటో మరి... వాళ్ళు మంచి కోసమే పాకులాడతారు కాకపొతే మనమే అర్ధం చేసుకోలేక పోతున్నాము... అందుకే ఎప్పుడోనే ఓ కవి అన్నారు... జరిగేవన్నీ మంచికని ఆనుకోవడమే మనిషి పని ... అని గుర్తుకొచ్చిందా ఆ పాట... నిజమే కదా... ఏమి చేయలేనప్పుడు ఇలా అనేసుకుని సరిపెట్టేసుకోవడమే... కాకపొతే ఆ సరిపెట్టుకోవడంలోనే అసలు గొడవలు వస్తున్నాయి... మనకు  దానిలోనే సరిపెట్టుకోవాలా... లేక ఇంకా ఎక్కువ కావాలని ఆశ పడాలా... ఏంటో ఏది అర్ధం కాకుండా గందరగోళంగా ఉంది.... పైకి ఎదగాలి అంటే ఆశ ఉండటంలో తప్పు లేదు.... అదేమరి లేని దాని కోసం ఆశ పడటం తప్పు అని చిన్నప్పుడు చెప్పింది గుర్తుకు వస్తే ఈ ఆశ తప్పే... చూసారా వింత ఒకే ఆశ మనకు తప్పుగానూ ఒప్పుగాను అనిపిస్తోంది.... ఎంత ఎదిగినా ఒదిగినా తృప్తిని మించినది మరొకటి లేదండి... అదే ఆత్మ తృప్తి.... ఆత్మానందం... ఇది మనకు దొరికిన రోజు ఈ ప్రపంచంలో అందరికన్నా గొప్ప జీవితం మనదే... ఉన్నా లేకపోయినా ఉన్నట్టుగా బతికేయగలగడం మనలో ఎంతమందికి చాతనౌతుంది చెప్పండి... ఎలా ఉన్నా... ఎక్కడ ఉన్నా సంతోషంగా బతకగలిగిన రోజున ఆ తృప్తి కోట్లకు సరితూగ గలదా.... అలానే మంచి చెడు అనేది మనం చూసే దృష్టిలో ఉంటుంది చాలా వరకు... మంచిని తీసుకుని చెడుని వదిలేస్తే పోలా ఏ గొడవా ఉండదు.... ఏదో సరదాకి రాశాను... ఎవరు నొచ్చుకోకండి.. మీరేం అనుకున్నా నా బాధ్యతేం లేదు మరి....-:) !!

బ్లాగులో నా మొదటి కవిత ,,,,!!

వేదన....!!

మనసు మూగగా రోదిస్తోంది...
నీ మౌనం నాతొ ఎందుకో తెలియక!
నా కంటినుంచి జాలువారే కన్నీరు అడుగుతోంది 
ఎందుకిలా ఈ వేదన అని?
మాటలకు కోటి భాష్యాలు చెప్పగలను కానీ.....
నీ మౌనానికి కారణం ఏమిటో 
తెలియక మూగబోయింది నా మది...!  
ఇది  బ్లాగులో నా మొదటి కవిత....  ఇప్పటికి చిన్నా చితకా కలిపి నాలుగు వందలు దాటి 401 లోనికి అడుగు పెట్టాయి.... 

23, సెప్టెంబర్ 2014, మంగళవారం

రెప్ప చాటు స్వప్నంగా....!!

సుక్కల్లో ఎదికానే మనసు ముక్కల్లో చూసానే
యాడ బోయావే నా మదిని దాటి
నాకే తావిలేని నా మదిలో గుండెను గుడిగా చేసానే
నీకై వేచి చూసానే కానరానైతివి
కన్నీటిలో పన్నీరైతివి సంతోషంలో చుక్కానివైతివి
రెప్ప చాటు స్వప్నంగా నిలిచిపోయావే
ఊహల్లో బాసవైనావు రేపటిలో మాపైనావు
చీకటిలో ఎలుగైపోయావే
రేయంతా తోడన్నావు రేతిరంత పగలన్నావు
సందె సీకట్లకు సద్దు చేయకున్నావే 
ఈ జన్మకు జతన్నావు మరు జన్మకు మరపే కాదన్నావు
కనపడని కాలమై పోయావే
రాతలే రాయమన్నావు మనసు బాటలే గీసావు
అక్షరాల్లో భావమై పోయావే
నేనే లేని నాలో నీవై మిగిలిపోయావు నీడలా నిలిచిపోయావు
నేనే నీవై పోయావే నేస్తమా...!!

22, సెప్టెంబర్ 2014, సోమవారం

మనసు ముచ్చట్లు....!!

మనసైన నేస్తం... 
                        ఎలా ఉన్నావు అని ఎన్ని రోజుల తరువాత అడిగినా బావుంటుంది కదూ... చెప్పాలనుకుంటునే చెప్పలేక పోయిన ఎన్ని కబుర్లు అలానే ఉండిపోయాయో నీకు తెలుసా.... చెప్పొద్దు అనుకుంటూనే బోలెడు సంగతులు చెప్పేస్తూనే ఉంటానాయే.... అసలే వాగుడుకాయని కదా నీకు తెలిసినప్పటి నుంచి... నీకేమో మాటలే రావు... నీవి నావి కలిపి నేనే చెప్పేస్తూ ఉంటే నిన్ను నువ్వు మర్చిపోయి నన్నే చూస్తూ ఉండే నువ్వు... ఏ భావాన్ని భాషలో చెప్పక దాచేసుకుంటే.... ఎలా తెలుస్తుందోయ్.... నాకేం టెలిపతి అదేనోయ్ దూర శ్రవణం తెలియదు కధా... ముడుచుకుని మొగ్గలా సిగ్గు పడితే ఎలా చెప్పు... రావు గోపాలరావు గారు అన్నట్టు కూసింత కళా పోషణ ఉండాలి... ఎప్పుడు ఒకటే పనా నీకు...  ఎన్ని రోజులు దూరంగా ఉన్నా నువ్వు దగ్గరగానే ఉంటూ మనసుని పంచుకుంటావు... అది కష్టంలోనైనా సుఖంలోనైనా... అందుకేనేమో దాన్నే చెలిమి అన్నారు.... మన చెలిమి మనకు తెలియాకుండానే మనల్ని ఎంత దగ్గరగా చేసిందో నీకు తెలుస్తోందా... పెంచుకున్న అనుబంధం ఆత్మీయంగా పలకరిస్తోంది అనుక్షణం... పరోక్షంగా వినిపించే నీ పలకరింపు నాకు వినిపిస్తూనే ఉంది... మరి నీకో.... ఏంటో ఎలా చెప్పినా మళ్ళి మొదటికే వచ్చాను.... మొత్తానికి నా చుట్టూ నీ చుట్టూ తిరుగుతూ .... ఇక్కడే ఆగిపొయాను ఎక్కడికి వెళ్లాలో తెలియక... నీకు తెలిస్తే నాకు చెప్పు... మళ్ళి ఎప్పటిలానే మౌనంగానే ఉండిపోకు......
ఉండనా మరి.... నీ నేస్తం.

తెలియని సంగతి.....!!

నే దాచుకున్ననా ఏకాంతాన్ని
అచ్చంగా తీసుకున్నావు
ఒంటరిగా ఉంటానంటే కాదంటూ
జతగా నీ జ్ఞాపకాల నొదిలి....

రేయంతా వెన్నెల కోసం చూసి
రాలేదని అలిగి వెళ్ళిన చీకటమ్మకు 
మబ్బులు దాచిన మసక వెలుతురు
నీ కోసం చుక్కల పహారా కాసినట్లు....

దూరంగా ఉన్నా దగ్గరైన దూరంతో
నేస్తం కట్టిన దగ్గరతనం భారమై
వదలని దూరపు బాంధవ్యాలను
పక్కనే దాచుకున్న ఈ చెలిమి ఏమిటో...

ఎందరిలో ఉన్నా నీ సామీప్యం నాదని
మోసపోయిన మనసుకు తెలియని
సంగతి ఆరాధన చేరని మది నీదని
రాసిన అక్షరాలు నీటి మీది రాతలని...!!

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

మరల మరల పలకరించు....!!

ఏకాంతంలో చేరువగా నీ తలపులు
నాతో నేను లేనని గుర్తు చేస్తూ....

ఒంటరిగా ఉండనీయని నీ గురుతులు
నాతో జతగా మారగా...

నిశబ్దపు రాగంలో వినిపించిన సరాగాలు
నీ పిలుపుల మేలుకొలుపులా....

చుక్కల లెక్కలలో అలసిపోయిన తారకలు
నాతో అలిగిన రాచిలుకలా....

మూసిన తలుపుల చాటున ముసిరిన జ్ఞాపకాలు
నను వదలని నా నీడలా....

వలచిన మనసుని విడువని వలపులు
మలి సంతకాల తరకలుగా...

మరల మరల పలకరించు ప్రియ భావనలు
మరు జన్మకు సాక్ష్యాలుగా...!!

కృష్ణ పరమాత్మ...!!

కంసుని ప్రాణభయానికి చిక్కిన చక్కని జంటకు
అలనాడు చెరసాలలో దేవకి గర్భాన
అష్టమ సంతానమై అష్టమి నాడు జనియించి
వసుదేవుని వెంట నది తోవనీయగా
వాసుకి గొడుగు పట్టిన దివ్యతేజము గోకులములో
నందుని ఇంట యశోదకు ముద్దుల తనయునిగా
బలరాముని తమ్మునిగా అల్లరి ఆటల పాటల
వెన్నదొంగగా మారి అమ్మకు  ముల్లోకాలు చూపిన మురారి
గోపికల సిగ్గులు దొంగిలించి రాధమ్మకు ప్రియమై
కాళీయుని మర్దించి గోవర్ధన గిరిదారుడై గోపాలుర
కాపాడి కంస వధ చేసి నూరు తప్పులు కాచి శిశుపాలుని వధించి
అష్ట భార్యల గూడి ఆనందమున పారిజాతమును ధరణికి దెచ్చి
నూర్గురు భార్యల సరస సల్లాపముల ముదమంది
కుచేలుని స్నేహానికి దోసిలొగ్గి స్నేహ ధర్మమును పాటించి
ఆపధర్మమున ద్రౌపది మానము కాపాడి ఆర్త రక్షణమున
ఆశ్రిత పక్షపాతియై రాయభారమొనరించి భూ భారము తగ్గింప
మహా భారత యుద్దమున రధ సారధిగా నుండి పార్ధునికి
కర్తవ్యమును భోదించి భగవద్గీతకు అంకురార్పణ చేసి
న్యాయాన్ని కాపాడి శాపమునకు తలను వంచి శరము
శూలమునకు బద్ధుడై అవతారమును చాలించె కృష్ణ పరమాత్మ...!!

20, సెప్టెంబర్ 2014, శనివారం

ముగింపు ఎక్కడ.....!!

కన్నీటి కలలు కల్లలాయెను
పన్నీటి చినుకు పలకరించక పోయెను
రాదారి ఏదని గోదారినడిగెను

చేజారిన బతుకు చెదరి పోయెను
మున్నాళ్ళ ముచ్చటగా ముగిసి పోయెను
కష్టాల కడలిని కౌగలించెను

ముసిరిన చీకట్లలో మునిగెను
కురిసిన కుండపోతలో తావి కానక తడిచెను
వెలుగు రేకలు ఎక్కడని వెదికెను

రాబందుల రాజ్యంలో పడెను
ఆకలి రక్కసి కోరల్లో కర్కశంగా నలిగెను
ముగింపు మృత్యువునడిగెను

తుదకు తానే చేరెను
చితిని పేర్చిన కరకురాతిని శిల్పంగా మార్చెను
పొద్దు పొడుపులో సింధూరమైయ్యెను...!!

చదువుల గురువుల కబుర్లు....!!

నేస్తం....!!
              ఎలా ఉన్నావు...!!  పిల్లలు బావున్నారా.... వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి... ఏంటో మన రోజుల్లో ఎంత హాయిగా గడిచి పోయాయి ఆ చదువుకున్న రోజులు.... ఇప్పుడు చదువు కొనుక్కున్నా ఏ సంతోషము సరదా లేదు పిల్లలకి... ఎంత సేపు చదువు లేదా వాడికి అది ఉంది వీడికి ఇది ఉంది... అంటూ మన ఇంట్లో ఏది లేదని గోల... తప్పని పరిస్థితిలో నలుగురితో పాటు మనం కూడా అని రాంకుల గోల ఎలా ఉన్నా ఈ కార్పోరేట్ స్కూల్స్ లో జాయిన్ చేయడంతో మనకు ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్నట్టుగా ఉంది... మన రోజుల్లో చదువుతో పాటు ఎన్ని విషయాలు చెప్పేవారు మన టీచర్లు.... ఆటలు, పాటలు, కబుర్లు, కధలు, నీతి పద్యాలు, మంచి, చెడు మనకు ఏరోజు స్కూలు ఎగ్గొట్టాలని ఉండేది కాదు... శెలవు వచ్చినా మనం స్కూలుతో అనుబంధాన్ని తెంచుకోలేక పోయేవాళ్ళం... ఇప్పటి పిల్లలకు బంధాలు బాధ్యతలు ఏవి లేకుండా పోతున్నాయి చాలా వరకు.... తప్పు చేస్తే మనల్ని గురువులే దండించేవాళ్ళు.... ఇప్పుడు పిల్లలకు భయపడుతున్నారు... సమాజం గురించి మనకు అన్ని చెప్పి ఎలా ఉండాలో నేర్పించింది ఎక్కువగా మన గురువులే.... మరి ఆ గురువులు ఈనాడు ఎక్కడ.... ఎంత వెదికినా దొరకడం లేదు ఈ రోజుల్లో... తల్లిదండ్రులకన్నా గురువులకు పిల్లలపై ఎక్కువ హక్కు ఉంటుంది... వచ్చామా... మన పని చెప్పడం... అర్ధం అయినా కాకపోయినా చెప్పేసామా.... వెళ్ళి మన జీతం మనం తీసుకున్నామా అన్నట్టు ఉంది గురువుల సంగతి.... పిల్లల మీద కాస్త శ్రద్ద పెట్టి చదువుతో పాటు నాలుగు మంచి ముక్కలు చెప్పే గురువులు కొందరయినా ఉంటే ఎంత బావుండు... మన పిల్లలు కూడా బావుంటారు... సమాజము బావుంటుంది.... చదువుని కొనుక్కుంటున్నాము అన్న బాధ తగ్గి ప్రశాంతంగా మనకు ఉంటుంది కదూ.... ఏంటో ఇప్పటి చదువులు పిల్లలు స్కూల్స్, టీచర్స్... మన రోజులతో పోల్చుకుని బాధగా అనిపించి ఇలా నీకు చెప్పేసాను.... అందరిని అడిగానని చెప్పు ... మరి ఇప్పటికి ఉండనా...
నీ ప్రియ నేస్తం  

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

కలకంఠి కలలు...!!

వేద నాదాన్ని మోదంగా
మౌన మంత్రాన్ని ఖేదంగా
మది తలుపులు మూసిన క్షణాలు....

రాలిన కన్నీటి సాక్షిగా
మూగబోయిన రాగాల వేదికగా
రెప్పలు దాటి రాని రాలుపూల తేనియలు....

వేసిన అడుగులు బాసటగా
మండిన నిప్పుల కణికల చట్రంగా
ముడిపడిన బతుకుల అముద్రిత జీవితాలు.....

స్నేహం చేసిన భావాలుగా
చేయి దాటిన అక్షర కావ్యాలుగా
కలకంఠి కలలు ఈ మనసు పరచిన కవితలు....!!

నాకో చిన్న ధర్మ సందేహం కాస్త తీర్చరూ....!!

నాకో చిన్న ధర్మ సందేహం కాస్త తీర్చరూ.... నేను పురాణాలు ఇతిహాసాలు చదవలేదు... అందుకే ఈ సందేహం సీతాదేవిని రావణాసురుడు ఎలా తీసుకు వెళ్ళాడు... ??
నాకు తెలిసిన విషయం వేదవతిని రావణాసురుడు జుట్టుపట్టుకుని తీసుకు వెళ్ళబోతే అగ్నిలో ఆహుతి అవుతూ శాపం పెడుతుంది ... పరస్త్రీని ఇష్టం లేకుండా ముట్టుకుంటే దహనమై పోతాడని.. సీతాదేవిని భూమితో సహా ఎత్తుకెళ్ళాడని మాత్రమే.... దయచేసి ఈ ధర్మ సందేహాన్ని వివరంగా తీర్చండి.... కొందరు చెప్పింది .... వాల్మీకి రామాయణంలో  సీతాదేవిని జుట్టుపట్టుకుని భుజం మీద వేసుకుని రధంలో తీసుకు వెళ్ళాడని.... అసలు విషయం చెప్పి నా ఈ సందేహాన్ని తీర్చగలరు..... ధన్యవాదాలు.... !!

మా చిరు చేయూత.....!!

మా ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మాతో కలసి వస్తున్న సహ
సభ్యులకు అందరికి మా కృతజ్ఞతలు.... 2008 లో మొదలు పెట్టిన మా చిరు చేయూత ఆర్ధిక స్తోమతలేని చదువుకునే విద్యార్దులకు మా చేతనైన ఆర్ధిక సహాయాన్ని అందించడం...  ఈ ప్రక్రియలో మాతో ఉన్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు... ప్రతి సంవత్సరం ఇచ్చినట్లుగానే ఈ సంవత్సరం కూడా విద్యార్ధులకు డబ్బులు అందించే కార్యక్రమాన్ని మన ఉపసభాపతిగారైన శ్రీ మండలి బుద్దప్రసాద్ గారి కార్యాలయంలో వారి చేతుల మీదుగా జరగడం చాలా సంతోషకరమైన విషయం... మా కోసం వారు కేటాయించిన విలువైన సమయానికి.... మా అందరి కృతజ్ఞతలు ..ట్రస్ట్ వారి చేతుల మీదుగానే ప్రారంభం చేయబడి ఇప్పటికి మాతో ఆ అనుబందాన్నే కొనసాగిస్తూ చాలా సార్లు చెక్కులు వారి చేతుల మీదుగానే పంపిణి చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం... ఇప్పటి వరకు డెబ్బై మందికి పైగా సాయాన్ని అందించడం జరిగింది.... ఎవరి దగ్గరా ఏమి ఆశించకుండా మాకున్న దానిలోనే మేము అందిస్తున్న ఈ చేయుతతో చాలా మందికి విద్యా దానం చేయగలిగినందుకు మాకు ఎంతో సంతోషం.. మునుముందు మరిన్ని చేయాలని అందరి సహకారాన్ని కోరుకుంటూ.... ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్

తెలుగు సాహితీ ముచ్చట్లు...గురించి నా మాట....!!

సాహిత్యంలో ఇంకా ఓ నా మా లు కూడా నేర్చుకొని నన్ను సాహసంగా సాహిత్యం గురించి సాహితీ సేవలో ఓ శీర్షికరాయమని కంచర్ల సుబ్బనాయుడు గారు అడిగితే అ ఆ లలోనే ఉన్న నేను వారు ఇచ్చిన ధైర్యంతో ఈ సాహిత్య శీర్షికకు శ్రీకారం చుట్టటం జరిగింది....శీర్షిక పేరు  "తెలుగు సాహితీ ముచ్చట్లు "  
చదవాలంటే ఈ లింక్ నొక్కండి లేదా సాహితీ సేవ సమూహము లోనికి తొంగి చూడండి ఓ సారి.... 
https://www.facebook.com/groups/sahitheeseva/732777870128642/?notif_t=like
 

మన తెలుగు సాహిత్యంలో ఎన్నో సాహితీ నుడికారాలు, చందోబద్దమైన చమత్కారాలు, అందమైన అలంకారాలు, గురు లఘువుల గుమ్మడి పూవులు, చక్కని తేట గీతి, అందమైన ఆటవెలది, ముచ్చటైన కందము, మురిపెంగా ఉండే సీసము ఇలా ఎన్నో రకాల పద్య చాటువులు, ద్విపదలు చోటు చేసుకోగా.... తరువాతి క్రమంలో వచ్చిన గ్రాంధికమైన తెలుగు కవితా మాలికలు కోకొల్లలు... సొంపైన కవితలు, సొగసైన కావ్యాలు ఎన్నో ఉన్నాయి... ఆ తరువాతి క్రమంలో కవితలు, కధానికలు, సంపుటాలు.... ఇలా వచన, గద్య, పద, పద్య రూపాల్లో భావాలను స్వేచ్చగా అక్షరరూపాల్లో అక్షరీకరించడం, అనువాదాలతో తెలుగు సాహిత్యం కొత్త పుంతలు తొక్కి సరళ, సున్నిత భావనలే కాకుండా విప్లవ, వీరోచిత కవిత్వం కూడా వీటిలో చోటు చేసుకుంది... జనపధం జానపదమై, వాడుక భాష వేడుకగా వేదికలెక్కి నీరాజనాలందుకొంది.... పాటల పల్లకీలలోఊరేగింది.... సముద్రంలో నీటి బొట్టులా నాకు తెలిసిన నేను తెలుసుకున్న లేదా తెలుసుకుంటున్న మన తెలుగు సాహితీ వనంలో సాహితీ మొగ్గలను విరిసిన విరిబోణులుగా మీ ముందు ఉంచుతున్న నా ఈ చిరు యత్నాన్ని పెద్దలు ఆశీర్వదించి.... పిన్నలు అభిమానించి తమ సహకారాన్ని సలహాలను అందిస్తారని ఆశిస్తూ ..... మీ మంజు

18, సెప్టెంబర్ 2014, గురువారం

'తెలుగు సాహితీ ముచ్చట్లు' కు స్వాగతం..!!


'తెలుగు సాహితీ ముచ్చట్లు' కు స్వాగతం!..

'మంజు' యనమదల...
ఈమె పేరు వింటేనే చాలు ... అభిమానం పొంగుకు వస్తోంది!..
మంజు గారి గురుంచి ఎంత చెప్పిన తక్కువే..
మంచి తనానికి మారు పేరు మంజు గారు!.. మంచి రచయిత్రి...
ఏ బాధ్యత చేపట్టినా ఓ నిబద్దతతో చేస్తారు..

ఈమె పుట్టింది... కృష్ణాజిల్లా జయపురం..
స్వస్థలం.... నరసింహాపురం..
పెరిగింది... అవనిగడ్డ, విజయనగరం.. చదివింది అక్కడే.
ఇంజనీరింగ్ చేసి చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేసారు..
అవనిగడ్డలో అధ్యాపకురాలిగా కొనసాగారు..
అమెరికాలో ఎనిమిది ఏళ్ళు జీవనయానం అనంతరం
భాగ్యనగరంలో నాలుగు ఏళ్ళు ప్రాజెక్ట్, క్వాలిటి మేనేజర్ గా పనిచేసారు.

* అపురూపమైనదమ్మ ఆడజన్మ..
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మని గుర్తు చేస్తూ...
ఇంటి ఇల్లాలిగా, తల్లిగా, కూతురిగా, మనుమరాలిగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నతమైన బాధ్యతలతో.. ప్రస్తుతం తమ జీవన ప్రయాణం సాగిస్తోంది.

మంజు గారి సాహిత్య నేపద్యం అంటారా?!...
ఇక ఆమె మాటల్లో చెప్పాల్సిందే!..

" మా నాన్నగారికి సంగీత, సాహిత్య, నాటక అభిరుచి ఎక్కువ...
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం అలవాటు...
కనపడిన ప్రతి పుస్తకమూ చదివేయడమే...
జరిగిన సంఘటనలు రాయడం మొదలు పెట్టి.. ఉత్తరాలతో జత కలిపి...
'తెలుగు' రాదన్న తెలుగు మాష్టారి మీద కోపంతో...
తెలుగంటే బోలెడు ఇష్టాన్ని పెంచుకుని...
అనిపించిన భావనలు పంచుకొని..
ఇలా సాహిత్యంతో..
'సాన్నిహిత్యం' ఏర్పడింది" అంటారు మంజు గారు!..

మరి ఇతంటి సాహిత్యాభిరుచి కలిగిన 'మంజు' యనమదల గారిని
ఈ కూటమిలో వారం .. వారం ఓ వ్యాసం రాయమని 'సాహితీ సేవ' అడిగింది.
సాహిత్యం గురించి నాకేం తెలుసంటూ.. తటపటాయిస్తుండగా మీ 'కబుర్లు, కాకరకాయలు' చూస్తుంటాం .. మీరు రాయగలరు, రాయండి' అనగానే అంగీకరించక తప్పలేదు మంజు గారు.
ఎట్టకేలకు వారం ... వారం ... ప్రతి శుక్రవారం " తెలుగు సాహితీ ముచ్చట్లు ' శీర్షికన రాయటానికి అంగీకరించారని తెలియచేయుటకు సంతోషిస్తున్నాం.
తెలుగు సంస్కృతి కుసుమం.. శ్రీమతి మంజు యనమదల గారి " తెలుగు సాహితీ ముచ్చట్లు" కు స్వాగతం పలుకుదాం.
రేపటి శుక్రవారం వెలువడే " తెలుగు సాహితీ ముచ్చట్లు" శీర్షికను ఆదరించండి!..
మంజు గారిని ఆశీర్వదించండి!... ప్రోత్సహించండి!..

జయహో తెలుగు సాహిత్యం

సదా సేవలో,
కంచర్ల
ఆర్వీ యస్ యస్ శ్రీనివాస్
రామకృష్ణ చౌదరి జాస్తి,
సుకన్య బీగూడెం,
డా. కత్తిమండ ప్రతాప్,
పుష్యమి సాగర్
సాహితీ సేవ.
వివరాలకు ఈ లింక్ నొక్కండి https://www.facebook.com/photo.php?fbid=696302963785589&set=gm.732421503497612&type=1&theater

17, సెప్టెంబర్ 2014, బుధవారం

ఎలా పంచుకోను.....!!

కలత పరచిన కలవరమా   
మనసు తెలిపిన మౌనమా
గడచి పోయిన జ్ఞాపకమా
గతమైన వాస్తవమా
ఎద లోతుల నిండిన పరిచయమా
మదిని మీటిన హృది నాదమా
మాటలకందని మధుర భావమా
చెప్పక చెప్పిన అనురాగమా
చుక్కల చేరిన వెన్నెల కెరటమా
ముక్కల ముద్దిడిన మనోహర రూపమా
చెంత చేరని చెలిమి తలపుల సోయగమా
పంచుకున్నా పెంచుకోలేని అనుబంధమా
రాలేటి పూల రాగ తాళమా
వద్దనా వదలని మమకారమా
ఎలా పంచుకోను ఆత్మ బాంధవ్యమా....!!  

16, సెప్టెంబర్ 2014, మంగళవారం

నాలో నీవుగా....!!

కలగా మెదిలావు
కధగా మారావు 
కధలోని కలగా మిగిలావు

శిలవైనావు 
శిల్పమై నిలిచావు 
శిధిలమైన శిల్పమై పోయావు

బంది వైనావు
బతుకువై చేరావు
బతుకు బందీగా మారావు 

గతమైనావు 
జ్ఞాపకమై పోయావు 
గత జ్ఞాపకమై చేరావు

మదివైనావు
మౌనమై మెదిలావు
మదిలో మౌనమై కదిలావు

మాటవైనావు
బాటవై పోయావు
బాటలో మాటగా కలిసావు 

రాతిరైనావు
వేకువై పోయావు
వేకువలో వెన్నెలై నిలిచావు   

చుక్కవైనావు
దిక్కువై నిలిచావు 
దిక్కులలో చుక్కానివైనావు

పొద్దువైనావు
పొడుపువై మెరిసావు 
పొద్దు పొడుపులో మురిసావు

నీవైనావు
నేనే నీవై పోయావు
నాలో నీవుగా నిలిచి పోయావు....!!  

15, సెప్టెంబర్ 2014, సోమవారం

నిను చేరితి.....!!

కలవర పరచే జ్ఞాపకమా 
పలవరింతల పలకరింపా
మనసుని తడిమే మౌనమా
కన్నుల నిలిచిన నీ చిత్రమా
మదిని దోచిన దరహాసమా
పలకరించిన ప్రియ రాగమా
మురిపించిన మానసమా
కురిపించిన అనురాగమా
వర్షించిన వలపు జల్లులా
వికసించిన విరి బాలలా
చెంత చేరిన స్వాంతనలా
వేకువ పొద్దుల వెన్నెలలా
నను చేరిన ప్రేమకు పల్లవిగా
పల్లవించిన కావ్య మాలికగా
ముడుచుకున్న ముగ్ధగా
నిను చేరితి వింజామరనై ఇష్టంగా....!!

ముగ్ధమోహనం గురించి ఓ చిన్న మాట...!!

అందమైన భావుకతకు చిరునామా చెప్పాలంటే ముందుగా జగన్నాధ్ గారి గురించే చెప్పాల్సి ఉంటుంది... ప్రేమను 
భావుకతలో రంగరించి చక్కని మనసు మాలికలు మణి మాలికలు, అందమైన వయ్యారాల పద ద్విపదులు, వర్ణనల సొగసుల ఒంపు సొంపులు, చక్కని ఆశు కవిత్వం చెప్పడం మాత్రమే తెలుసని నాకొక అపోహ ఉండేది... ఈ మధ్యన అచ్చంగా తెలుగులో గొలుసు నవలలో జగన్నాధ్ గారి రచన చూసాను.. తరువాత వారి నవల ముగ్ధమోహనం ... ముగ్ధ ఆ పేరు  చాలా ఇష్టం .... చదవడం మొదలు పెట్టాను ... నమ్మలేని నిజంలా.... కధ, కధనం రెండు అద్భుతంగా పండిన ముగ్ధమోహనం నిజంగా ముగ్ధమోహనమే... ముచ్చటైన ముగ్ధ, కరడుకట్టిన పాషాణం మోహన, నిండైన ప్రేమను నింపుకున్న కార్తికేయల మధ్యన ప్రేమలు, అనుబంధాలు, ఆకలి కేకలలో రుధిర వర్ణాల నోట్ల కట్టలను ధ్యేయంగా దేశ వినాశనానికి దారి తీసిన కరకు గుండె మోహన పాత్రను దేశం గర్వించే విధంగా మారాలని మనసు మార్చుకోవడానికి కారణమైన కార్తికేయ ప్రేమ వ్యక్తిత్వానికి దాసోహం అయిన ఆ పాత్ర చిత్రణ అమోఘంగా తీర్చిదిద్దడం... మొదటి నవలేనా ఇది అన్న అనుమానం మనకి రాకుండా పోదు చదువుతుంటే.... కవితల్లోలానే నవలలో కూడా భావుకతను మర్చిపోకుండా దానిని ప్రేమతో నింపి అనుబంధాలతో కలిపి చాలా అద్భుతంగా ముగ్ధమోహనాన్ని మన ముందుకు తెచ్చారు.... అలానే రెండో నవల ఆగష్టు 1..... వీరి భావాల ఝరులను అందుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేసి మీరు ఆస్వాదించండి ..... http://bhavajhari.blogspot.in/

14, సెప్టెంబర్ 2014, ఆదివారం

ఇప్పటికి.... ఎప్పటికి....!!

మొన్న కాక నిన్న ఇంజనీరింగ్ లో చేరినట్టుగా అనిపిస్తుంటే అప్పుడే పాతిక ఏళ్ళు గడచి పోయాయి.... రోజులు కాలంతో పాటుగా ఎంత తొందరగా వెళిపోతున్నాయో అనిపిస్తోంది.... మొదటిరోజు ఏమి తెలియక పోవడం... అదీను తెలుగు తప్ప మరో భాష తెలియని సందిగ్ధం.... అందులోను అసలే ఎర్ర బస్సాయే... ఎక్కడ ఏం ఉంటాయో తెలియదు... ఏది ఎక్కడో తెలియదు..... పలకరించని వాళ్ళు పాపాత్ములు అన్నట్టు తెలుగులో పలకరిస్తే చాలు ప్రాణం లేచి వచ్చేది.... అసలే రాగింగుల పలకరింపుల భయం ఓ పక్క... అదీను నాతో ఎక్కువగా కన్నడ వాళ్ళే అందరు.... వాళ్లకి మనకి పడిచచ్చేది కాదు.... మీ తెలుగు ఇలా అలా అని వెక్కిరించేవారు.... నాకేమో బోలెడు కోపం.... సివిల్ ప్రాక్టికల్స్ లో జామకాయలు తినడానికి మాత్రం వాళ్లకి భాష గుర్తుకి వచ్చేది కాదు... సరదాగానే ఏడిపించే వాళ్ళు.... మేము అంతే సరదాగా కౌంటర్ వేసే వాళ్ళం... మనకేమో ఇల్లు చుట్టుపక్కల వాళ్ళ మీద బెంగ... పదిహేను రోజులకొకసారి ఇంటికి ప్రయాణం అమరావతిలో..... కబుర్లే కబుర్లు.... పుట్టినరోజుల సరదాలు... అవి ఇవి అంటూ చిటుక్కున మొదటి సంవత్సరం చివరు.... రెండులో కూడా అందరి సహకారం... ఇక మూడులో సరదాగా అందరం హంపి ప్రయాణం... సీనియర్స్ కి సెండాఫ్ పార్టీ సరదాలు....  చిన్న చిన్న తగాదాలు తీర్పులు.... ఇలా కన్ను మూసి  తెరిచేంతలో నాలుగేళ్ళు అయిపోయి మళ్ళి మొదటి సంవత్సరం తిరిగి వచ్చి పాతిక ఏళ్ళు అయిన సందర్భం.... ఇన్ని ఏళ్ళు అయినా గుర్తు ఉంచుకుని మరి అప్పటి నేస్తాలే ఇప్పటికీ అంతే ఆత్మీయంగా పలకరిస్తున్నారంటే అది మరి అదృష్టం కాక మరేమిటి...!! ఆత్మీయ నేస్తాలు అందరికి పేరు పేరునా మన ఇంజనీరింగ్ మొదలైన రజతోత్సవ శుభాకాంక్షలు..... దూరంగా ఉన్నా దగ్గరలో ఉన్నా ఆత్మీయ బంధాలకు అందులోను దేవుడు మనకు వరంగా ఇచ్చిన ఈ స్నేహ బంధానికి మీరు ఇచ్చిన విలువకు నా కృతజ్ఞతలు.... ఎప్పటికి మీ స్నేహం ఇలానే ఉండాలని కోరుకుంటూ..... మీ అప్పటి నేస్తం ఇప్పటికి.... ఎప్పటికి

13, సెప్టెంబర్ 2014, శనివారం

నేనెవరో తెలియక...!!

ఇదిగో నిన్నే....
                    ఇంతకు ముందో సారి నీకు అన్ని చెప్పినట్టు గుర్తు... అయినా నీకు ఏది పట్టదు... నాకేమో పదే పదే చెప్పే అలవాటు లేదాయే... ఎలా కూర్చాడో ఏమో ఆ దేవుడు మనల్ని ఇలా... తలచుకుంటేనే భలే ఆశ్చర్యంగా ఉంటుంది నాకైతే ఇప్పటికి.... చిన్న చిన్న వాటికే బోలెడు సంతోషపడే నేను... ఏది పట్టని నువ్వు... పుస్తకాల పురుగుని నేనైతే అస్సలు వాటి వంకే చూడని నువ్వు... ఒక్క మాటలో చెప్పాలంటే మిన్ను విరిగి మీద పడినా చలనం లేని నువ్వు... నమ్మి వచ్చానని నీకు తెలిసినా నా నమ్మకాన్ని అటకకెక్కించిన రోజున నాతో హితంగా ఉన్న కన్నీరు కూడా నాకు దూరంగా వెళ్ళిన క్షణాలు ఎన్నని చెప్పను... జీవితంలో మనం పరుగులు పెడుతూనే ఉన్నా ఎక్కడో ఓ చోట ఆగాలి....  అది మనకు కోపాన్నో, బాధనో మిగిల్చే గమ్యం కాకూడదని నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నా... బాధ్యతలను మరచి పోలేదు... బంధాలను వదిలించుకోవాలన్న కోరికా లేదు.... కాని ఒంటరి ప్రయాణం చేయాలని మాత్రం అనుకోలేదు ఎప్పుడు.... నిన్ను అడిగాను ఈ సంగతి కూడా నీకు గుర్తు లేదనుకుంటా.... నువ్వేమో అన్ని మర్చిపోయావు... నన్నేమో ఏది వదలడం లేదు ఏం చేద్దాం మరి... చివరి వరకు చేరలేని నా గమ్యం మధ్యలోనే నాకు దొరికేస్తుంటే సంతోషంగా వెళిపొదామని బంధాలను బాధ్యతలను నీకు అప్పచెప్పాలని అనుకుంటూనే ఎలా చెప్పాలో తెలియక సతమతమౌతూ చూస్తూ ఉండిపోతున్నా నేనెవరో తెలియక...!!
నువ్వు మర్చిపోయిన నేను

12, సెప్టెంబర్ 2014, శుక్రవారం

స్వగతం....!!

ఏంటో అన్ని నాకు ప్రశ్నలుగానే మిగిలి పోతున్నాయి... ఇష్టం ఎన్ని రకాలుగా ఉన్నా దాని చివరి గమ్యం ఏమిటి..? నాకు ఇదొక అర్ధం కాని చిక్కు ప్రశ్నగా మిగిలిపోతోంది... ప్రేమలో ఇష్టం... అభిమానంలో ఇష్టం... పలకరింపులో ఇష్టం... మనిషి ఇష్టం.... మనసు ఇష్టం.... నడత ఇష్టం... నవ్వు ఇష్టం.... ఇలా ఎన్నో రకాల ఇష్టాలు మనతో ఉంటే వాటి చిట్ట చివరి గమ్యస్థానం ఏమిటి అనేది సమాధానం దొరకని ప్రశ్నగానే ఉండి పోతోంది...
మనని ఇష్టపడేవాళ్ళు కొందరు... మనం ఇష్టపడేవాళ్ళు మరి కొందరు.... ప్రేమలో రకాలున్నట్లే ఇష్టంలో కూడా బోలెడు రకాలు... కాని అన్ని ఇష్టాలు కలయిక కోసం కాదు.... ఆత్మ తృప్తి కోసం అందుకునే అవ్యాజ్యమైన ఇష్టం... ఆ ఇష్టం నుంచి జనించిన ప్రేమలో అనంతమైన అనురాగం, ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇలా అన్ని కలసిన ఇష్టం చాలా కొద్ది మందికి మాత్రమే దొరుకుతుంది... ప్రపంచంలో అతి గొప్ప ధనవంతులు వీరే అవుతారు... ఇష్టం ప్రేమ రెండు ఒకటి కావు కాని రెండు కలసిన సందర్భం అద్భుతం ఈ సృష్టిలో.... ఆ కలయిక వర్ణించడానికి అక్షరాల అమరిక కూడా అందంగా ఇమడలేదేమో.... మొత్తానికి ఇష్టంగా ఇష్టపడే ఇష్టం కష్టంగా ఉన్నా అందుకే కాబోలు ఇష్టంగా అత్యంత ప్రియంగా ఉంటుంది.... అందుకే ఇంత చెప్పినా ఇష్టం ఇంకా ఇష్టం తెలియని అర్ధంకాని శేష ప్రశ్నగానే మిగిలిపోయింది....!!

11, సెప్టెంబర్ 2014, గురువారం

నీ చిత్తరువులకన్నా....!!

మురిసిన మువ్వల సవ్వడి
మదిలో రేపిన రవ్వల రవళి
మురళికి అందిన మోహన రాగం
మనసుకు తెలిసిన మౌన సరాగం
పలికిన తరగల నురగల తాకిడి
వెదికిన దొరికిన మధురపు పెన్నిధి
అందిన అందపు అభినయ వెలుగులు
జారిన పరదాల చాటున చేరిన మంజీరం
అందుకున్న జతను వదలలేని తరుణం
కోరిన కలల కౌముది కాంచిన కావ్యాల
దాగిన కళల చాతుర్యాన్ని అందుకున్న
అక్షర కన్నెల వన్నెల చిన్నెలు వలచి
వగచిన నా ఆంతర్యాన్ని అభిమానించి
అందించిన నీరాజనాల నీలపు సౌందర్యం
నిలచిపోయే నీ చిత్తరువులకన్నా మేటిగా....!!

సినీ చిత్తరువులు.....!!

అనాదిగా వస్తున్న ఆచారమే మళ్ళి మరో సారి మనకు వినిపించి కనిపించింది.... ఎన్నో రంగు రాళ్ళలో కొన్ని బయట పడిన పాకుడురాళ్ళు .... వచ్చిన హోదా డబ్బు ఒక్కసారిగా పొతే వాటికి అలవాటు పడిన ప్రాణం కొట్టుకుంటూ ఈ పోటి ప్రపంచంలో అదీను సిని మాయాప్రపంచంలో ఒక్కసారిగా వద్దంటే తన్నుకు వచ్చిన ఆర్భాటాలు పొతే భరించలేని జీవాలు వాటికోసమే పాకులాడుతూ దిగజారుడు తనానికి అలవాటు పడిపోతూ పట్టుబడక పొతే రాజాలు రాణులు పట్టుబడితే కుటుంబం కోసం అంటూ నీతి వాక్యాలు... వచ్చిన హోదా పోతేనే కాదు అసలు వేషాల కోసం అవసరాల కోసం ఎంతో మంది ఇలా రంగులు పులుముకుంటూనే ఉన్నారు జీవితాలు నాశనం చేసుకుంటూ చిన్న తెరా లేదు పెద్ద తెరా లేదు .... తెర చాటు జీవితాలకు అంకితం అయిపోయారు... కొందరు తెర చాటునే ఉండిపొతే మరి కొందరు కాస్త అదృష్టం అనే అవకాశాన్ని అందుకుని అందలాలు ఎక్కుతున్నారు... అందలాలు ఎక్కినా ఎన్నో రోజులు ఉండలేని వారు అదః పాతాళానికి పడిపోతున్నారు.... సినీ రాజకీయ చదరంగంలో పెద్ద పాముల నోటిలో చాలా పావులు బలి అవుతూ తప్పించుకున్న ఆ కొన్ని పావులు కూడా ఏదో ఒక చట్రంలో పడి నలిగి పోతూనే నెట్టుకొస్తున్నాయి..... సిని వారసత్వానికి మాత్రమే చాలా వరకు పెద్ద పీటలు వేస్తున్న భజనకారులు అసలు నటనకు నీరాజనాలు పట్టడం మానేసి ఈ మురికి కూపంలోనే మగ్గుతూ జీవితాలని ఫణంగా పెట్టేస్తున్నారు.... అది సాహిత్య పరంగా... నటన పరంగా... ఎలా చూసుకున్నా వారసత్వ రంగులే ముందు ఉంటున్నాయి.... అసలు నైపుణ్యం మసి పూసిన వజ్రంలా మరుగునే ఉండి పోతోంది... ఒకటి అరా బయటికి వచ్చినా ఏదో ఒక రంగు పులిమి వారి చావుకో లేదా వారి జీవితాలను అల్లరి పాలు చేయడానికో తమకున్న డబ్బు హోదాతో మీడియాను కొనేసి అన్ని రకాలుగా ప్రతిభను బయటికి రాకుండా చేస్తున్న ఈ సినీ మాయా ప్రపంచం లో నిజంగానే ఎన్నో చిత్తరువుల నీలి నీడలు మనసు పెట్టి చూస్తే కనిపిస్తాయి...!!

అన్నట్టు ఓ చిన్న మాట ... ఇది నా 801 వ పోస్ట్ అండి ... ఇంత వరకు నా రాతలను కబుర్లుగా చెప్పినా కాకరకాయలైనా కవితలుగా మనసు విప్పినా ఎలా చెప్పినా అభిమానంతో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా మనఃపూర్వక కృతజ్ఞతా వందనాలు

7, సెప్టెంబర్ 2014, ఆదివారం

నీ జ్ఞాపకాల గుర్తులను దాచుకుని....!!

ఏమోయ్,
             అన్నిట్లోనూ నాకన్నా నువ్వే ముందు ఉండాలని ఎప్పుడు అనుకుంటూ ఆఖరికి ఇప్పుడు కూడా నువ్వే ముందు ఉన్నావు .... నీకు తెలియకుండానే ఇక్కడా నువ్వే గెలిచావు.... చదువులో సరే.... ఆటల్లో మనిద్దరం ఒక జట్టు గెలిచినా ఓడినా.... అన్ని ఆలోచనలు పంచుకున్న మన స్నేహం చూసి దేవుడు కూడా అసూయ పడి నిన్ను గెలిపించి నన్ను ఓడించానని సంబరపడి పోతున్నాడు చూడు... పాపం దేవుడికి తెలియదు కదా మన స్నేహం ముందు తనే ఓడిపోయానని తెలుసుకోలేక పోయాడు....  జ్ఞాపకాలు సజీవమని మనం ఉన్నా లేక పోయినా ఎప్పటికి మనతోనే ఉంటాయని వాటిలో జీవం ఉట్టిపడుతుందని.... ఏరుకుంటున్న కొద్ది దొరుకుతూనే ఉండే సముద్రపు ఆల్చిప్పల్లా ముత్యాలు రాసులుగా వాటిలో పోసుకుని దాచుకున్నామని తెలియక అలా అనుకున్నాడు విలయకారుడు... విలయంలో వినోదాన్ని అందించేది స్నేహమని దానిలోని మాధుర్యాన్ని చవి చూసిన మనకు దాని తీపిదనం తెలుసు కదా.... ఎప్పటికి మరచిపోలేని ఆ తియ్యదనం ముందు లయకారుడైనా తలను వంచాల్సిందే.... చెప్పా పెట్టకుండా నువ్వు వెళ్ళిపోయినా లేవని ఒప్పుకోలేని నిజాన్ని నీ గెలుపుగా అనుకుని ఇక్కడా నువ్వే ముందు ఉన్నావని సంతోషించాలో లేక ఆర్తిగా ఊసులాడే ఓ జాబిలమ్మా ఊసులే లేక మూగబోయావేమమ్మా అంటూ పలకరించే పిలుపు దూరమైందని బాధ పడాలో తెలియక సందిగ్ధంలో ఉండిపోయాను.... నీ జ్ఞాపకాల గుర్తులను దాచుకుని లేని నువ్వు మాకోసం మాతోనే ఉన్నావని తలుస్తూ..... !!
ఎప్పటికి నీ ప్రియ నేస్తం.

6, సెప్టెంబర్ 2014, శనివారం

కనిపించవూ ఒక్కసారి....!!

ప్రియ నేస్తం....!!
                       ఇన్ని రోజులైనా ఒక్కసారి కూడా నేను నీకు గుర్తు రాలేదా... నిజం చెప్పు మన కల్మషం లేని ఆ బాల్య స్నేహం నీకు ఒక్క క్షణం కూడా గుర్తుకే రాలేదంటే అది నా చెలిమి పొరపాటేమో.... మన జ్ఞాపకాలు అన్ని ఇప్పటికి సజీవంగా నా కళ్ళ  ముందు కదలాడుతూనే ఉన్నాయి... ఎన్నని చెప్పను.... ఏమని చెప్పను... మనం చేసిన అల్లరి చెప్పనా ... ఆడిన బొమ్మలాటలా... వాగులో కొట్టిన ఈతలా ... సైకిల్ పందాలా... చూసిన సినిమాలా , హరికధలా, నాటకాలా ఇలా చెప్పుకుంటూ పొతే నాకయితే బోలెడు.... మరి వీటిలో కనీసం నీకు ఒకటైనా గుర్తు ఉందా .... పోనీ ఆడిన రింగాట... పాడిన పాటల పోటీలు.... తిన్న తీపి మామిడి పచ్చడి ముక్కలు నాకైతే...  పండుమిరప పచ్చడి అన్నం నీకు... మనని అందరు జంట కవులని పిలిచిన పిలుపులు...  సరే ఇవి అన్ని వదిలేయ్.... ఈ ఒక్కటైనా నీకు గుర్తు ఉందా గులాబి రేకల నా ఇష్టం.... అందరు కలిసారు మళ్ళి కాని ఎంత వెదికినా దొరకని నీ చిరునామా కోసం ఏం చేయను చెప్పు .... నా మీద కోపంతో దాగున్న నువ్వు నాకెప్పుడు దొరుకుతావో మరి....!!
నీ స్నేహం.

ఆత్మ నివేదనావలోకం....!!

మనిషి ఇక్కడున్నా మనసు పయనం ఎక్కడికో
దారులు తెలియకున్నా రహదారుల వారధికి
శూన్యంలో వెదికే గమన నిర్దేశాన్ని అందుకునే
అలవాటు కోసం యంత్రాల సాధనాలు సరిపోవునా...!!

చింతన లేని చితాభస్మం చేరిన మట్టి ముంత అడిగేనా
నీ కులమేదని మతమేదని నిను కాల్చిన కట్టెల వాసనను
ఆరడుగుల నేలైనా అడగనే లేదు ఈ ప్రశ్నలను ఎందుకనో
మోసిన ఆ నలుగురైనా భారమని అనుకోనే లేదు మరి...!!

మోహాల పాశం మదిని వీడనంత కాలం ముసుగు వేసిన మూర్తి
మౌనమై నిను నీవు చూడలేని నిలువుటద్దం నీ ఎదురుగానే
అహం అలంకారాన్ని వదలలేని నేను నా చుట్టూనే పరిభ్రమణం
బంధాల భాషలు వదలనిదే బంధుత్వాలెక్కడికి మరలును....!!

మూన్నాళ్ళ ముచ్చట మూసిన రెప్పల మాటున ఒదిగిన
ముఖాల పై పై రంగుల హంగుల హరివిల్లే అన్నట్టుగా చేరి
క్షణంలో అదృశ్యమై పోయే హరిత వర్ణాలు మనవి కావని
ఆత్మ నివేదనావలోకం ఆనంద నిలయమని నమ్మిన చాలు....!!

5, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పాదాభివందనాలు....!!

 శ్రీ గురుభ్యోనమః ...!!
                           తొలి గురువు అమ్మ ... అమ్మతో మొదలై అ ఆ లు దిద్ది ణ రాయడం రాక దెబ్బలు తిని తరువాత ఆచారి మష్టారితో తెలుగు మొదలై విష్వక్సేనుడుతో కష్టాల కడలి దాటి కాస్త ముందుకు వెళ్ళి భగవద్గీత, హనుమాన్ చాలీసా, శివ స్తోత్రాలు పింగళి మాష్టారు నేర్పించగా.... నాగలక్ష్మి గారి వద్ద హింది అక్షరాలు దిద్ది, వేంకటేశ్వర శుప్రభాతంతో మరికాస్త మెరుగులు దిద్దుకుంటూ పెద్ద తెలుగు మాష్టారి సంస్కృత పాఠాలు వల్లె వేస్తూ శ్రీలత గారి పాటలు నేర్చుకుంటూ...  ఆర్ధిక శాస్త్రంలో అక్షరాభ్యాసం  చేసి భూగోళ చరిత్రలు వల్లె వేస్తూ సామాజిక న్యాయాలు చదివేస్తూ, కమల గారి బొమ్మలు వేసేస్తూ, లెక్కల ఎక్కాలు పై నుండి కిందికి, కింది నుండి పైకి గబ గబా చెప్పేస్తూ అప్పుడే కొత్తగా వచ్చిన ఆల్జీబ్రా ఎక్స్ వై లతో ఆటలు మొదలు మొదలు పెట్టించిన లెక్కల మాష్టారు, జీవ శాస్త్రంలో తన కన్నా బాగా బొమ్మలు వేస్తున్నా అని మళ్ళి వేయించిన వసంతరావు గారు, మీసాలు మెలిపెట్టి అందరిని ఆటలాడించిన మీసాల మాష్టారు, మనిషి చిన్నగా ఉన్నా స్కూలు మొత్తాన్ని తన ఆహార్యంతో భయపెట్టి ఆంగ్లం నేర్పిస్తూ వ్యాకరణం బాగా నేర్పించిన ప్రదానోపాద్యాయులు రత్నారావు గారు.... ఇవి శ్రీ గద్దె వెంకట సత్యన్నారాయణ శిశువిద్యామందిరం అవనిగడ్డలో ..... తరువాత.....
ఏమి రాకుండానే అందరిని భయపెడుతూ బాగా కొట్టే అప్పారావు గారు, వెంకట్రావు గారు, చక్కగా తెలుగు చెప్పిన చిన్న తెలుగు మాష్టారు, హిందితో పాటుగా బోలెడు కబుర్లు చెప్పిన రత్న కుమారి గారు..... లెక్కలు చాలా బాగా చెప్పిన లెక్కల మాష్టారు విశ్వేశ్వర రావు గారు,నాలో నాకే తెలియని మరో కోణాన్ని ... నాయకత్వాన్ని గురించి వాళ్ళ  పిల్లలకు చెప్పిన నేనంటే బాగా ఇష్టపడిన సైన్స్ మాష్టారు..... అల్లరి చేసినా భరించిన సోషల్ మాష్టారు, తెలుగులో ఒక్కసారి కూడా ప్రధమ స్థానం వేయకుండా ఏది చేసినా ఎప్పుడు నన్ను తిడుతూనే తెలుగును చక్కగా చెప్పిన పెద్ద తెలుగు మాష్టారు, ఇంగ్లీషు, ప్రపంచ పటాన్ని వివరించిన హెడ్ మాష్టారు, ఇలా అందరి ఆసరాతో అతి సుందరంగా గడిచిపోయిన బాల్యం జొన్నవలస ప్రభుత్వ పాతశాలలో ......
మరో రెండు ఏళ్ళు .....
కాలేజ్ అయినా అల్లరి మామూలే అన్నట్లు మహారాజ మహిళా కళాశాలలో మరో అధ్యాయం అందరి ఆశీస్సులతో ఆడుతూ పాడుతూ ఐపోయింది.... అలానే ఇంజనీరింగ్ కూడా కర్ణాటకలో.....  ఇక జీవిత పాఠాలు నేర్పిన తొలిగురువు మా పెద్ద ఆడపడుచు.... ఆమెతో మొదలై అది అలా ఎందరితోనో ఇప్పటికీ నేర్చుకుంటూనే జీవితాన్ని గడిపేస్తున్నా.... డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా ఆది అంతిమ గురువు భగవంతుడైనా మధ్యలో వచ్చిన ఈ గురువులందరికీ నా పాదాభివందనాలు....!!

4, సెప్టెంబర్ 2014, గురువారం

ఎంత వరకు....!!

నా నీకు.....
రహదారులన్నీ మూసేసి ఉన్నాయి.... చీకటి వాకిలి తెరచుకుంది నిశబ్దంగా నాకు తెలియకుండానే... పక్కనే నువ్వు  ఉన్నావనే అనుకుంటూనే లేవన్న నిజాన్ని దాచేయాలని ఎంతగా ప్రయత్నిస్తున్నానో.... అయినా ఎప్పుడో చెప్పిన మాటలు నువ్వు మర్చిపోయావని అవి మనసు నుండి రాలేదని తెలియని ఈ పిచ్చి మాలోకం ఇంకా నిన్ను నమ్ముతూనే బతికేస్తోంది... ఎప్పటికైనా నువ్వు  మారకపోతావా అని ఎదురుచూస్తూ మరో లోకానికి తన పయనం ఖరారైందని తెలిసినా నీ వరకు రానివ్వని ఆ నిజాన్ని అలానే రాకుండా చేయాలని చూస్తూ నువ్వు దూరం చేసిన సంతోషం చిరునామా కోసం వెదుకుతూ మళ్ళి నీ దగ్గరే అది ఆగి పోతుంటే నవ్వుకుంటూ ఉండిపోతున్నా ఏం చేయాలో తెలియక.... రాని నవ్వుని బలవంతంగా అద్దుకుని ఆ చిరునవ్వు చాటున రగులుతున్న మంటలను చల్లబరచాలని... నలుగురిలో నవ్వుతూ జీవం లేని ఈ జీవితంలో జీవాత్మ శోకాన్ని వినపడనివ్వని ఆడంబరాల హంగుల మధ్యలో దాచేస్తూ బతికేయాలన్న ఈ తాపత్రయం ఎంత వరకు సఫలీకృతం అవుతుందో మరి.....!!
నేను

గిర గిరా తిరుగుతూ ....!!పొద్దు వాలి పోతోంది అంటూ సూరీడయ్య
తొందర తొందరగా మబ్బులెనక పోతూ ఉంటే
దాగి ఉన్న చందరయ్య చుక్కల నెంటేసుకుని
దోర దోరగా దాపులకొస్తూ చీకటి చెలిమిని
పహరా కాస్తూ మునిమాపున కాపుకాసి
ఎప్పుడెప్పుడా అంటూ వెన్నెల వాకిట్లో
వాలడానికి సమాయత్తమౌతుంటే
సందె వాలిపోతూ ఉంటే స్వాగతం చెప్తూ
మువ్వల సవ్వడి మురిపెంగా అనిపిస్తే
ముగ్ధలా ముడుచుకున్న ముద్దమందారం
ముద్దులొలక బోస్తు ముంగిట్లో ముద్దరాలిలా
తీర్చిదిద్దిన రంగుల రంగవల్లిలో పరచుకున్న
పసిడి లోగిలి పండు వెన్నెల పానుపును
తలపించిన సందె చీకట్లలో మలి ఝాము
మలయ సమీరాలు తాకుతూ మళ్ళి
తొలి పొద్దు వేళను గురుతు చేస్తూ
ఇలానే గడచిపోతోంది ప్రతి రోజు
గిర గిరా తిరుగుతూ మరో ముద్దమందారం కోసం ....!!

3, సెప్టెంబర్ 2014, బుధవారం

ఎదురుచూస్తూ.....!!

వసంతాలు వస్తున్నాయి ...  నామీదో నీ మీదో కోపంతో అలిగి వెళిపోతున్నాయి... మనం మాత్రం ఇలానే ముసుగులో
దొంగల్లా దాగుండి పోయాం కదూ.... ఎప్పుడో చెప్పుకున్న అప్పటి కబుర్ల జ్ఞాపకాలు ఇంకా గుర్తు చేసుకుంటూ ఇప్పటి నిజాలు ఒప్పుకోలేని జీవితాన్ని వద్దని అనలేక మధ్యలో ఉండిపోయిన మనం కొత్త కబుర్ల కోసం వెదుకుతూ మళ్ళి ఒకరికి ఒకరం తారసపడినా ఆశ్చర్యం లేదనుకుంటా....ఎందుకంటే మనిద్దరం కలిసే ఉన్నా చూసుకోలేని ఈ అయోమయం ఏమిటో మరి.... ఎందుకో మరి అన్ని గుర్తు ఉంచుకునే నేను... అస్సలు ఏది గుర్తులేని నువ్వు ... అదృష్టం నీదే అనుకోవాలేమో... అప్పటికప్పుడు మాటల కూర్పులు నీ సొంతం అయితే దానిలో పడి కొట్టుకుపోతూ  బయటికి రాలేని నా నిస్సహాయతను చూస్తూ పగలబడి నవ్వకు... చేరువగా చేరినట్లే చేరి దూరంగా ఉండి తమాషా చూడటం నీకు పరిపాటే కాని మనసుని చూడటం మౌనాన్ని చదవడం రాని నీకు దానిలోని ఆనందం అనుభవించడం ఎలా తెలుస్తుంది...?? బంధాన్ని  పంచుకోవడం , బాధ్యతను అందుకోవడం తెలియని మనసుకి మమతను అందించడం తెలియాలి అనుకోవడం అత్యాశే కదా.... గడిచిన వసంతాలు బోసిగా ఉన్నా రాబోయే వాసంతం సంతోషం తెస్తుంది అని ఎదురుచూస్తూనే గడిపేస్తున్నా... ఎప్పటికి ఆగని కాలాన్ని ఆపలేక వెనుకకి తిప్పలేక మౌనాన్ని మాటలుగా చేసుకుని అవి అందించే అభిమానంలో బతికేస్తూ నీ కోసం మరో వసంతానికి స్వాగతం చెప్పాలని ఎదురుచూస్తూ.....!!

1, సెప్టెంబర్ 2014, సోమవారం

నమోనమః....!!

గగనపు విరితోటలో ఎగసిపడే
పద లయల విన్యాసపు పట్టపు రాణిలా
పరుగుల వరదల పలకరింపుల
మేని ముంగురుల మౌన మరీచికా
ముగ్ధపు కాంతుల ముసిరిన
మువ్వల నవ్వుల స్నిగ్ధ సింగారాల సంపెంగా
అలకల ఉలుకుల అలజడి రేపిన
అందాల అపరంజి బాపు చిత్ర సోయగమా
ముడుచుకున్న ముదిత మోహనపు
మనసు మాటున దాగిన ముద్దమందారమా
అంతరంగపు ఆటల పాటల
తేలియాడే అతివ హృదయపు చిత్రలేఖనమా
చూపరుల నాకట్టుకునే చిరు దరహాసపు
ఆడంబరాలు లేని అలంకారాల అంతః సౌందర్యమా
వశీకరణపు వాకిలి ముందర వలచిన
ప్రేమను వద్దకు చేర్చే అమలిన శృంగారపు నయగారమా
జన్మజన్మాల జాతఃకరణంలో జాగృతి
మరచి జీవనాదాన్ని జగతికి అంకితమొనర్చిన జగన్మాతా
వసంతాల వందనాల వాయులీనాల
స్వర సుస్వర సంగీతఝురుల సారస్వతి నమోనమః....!!

నీ చిరునవ్వుల కోసం....!!

పండి రాలుతున్నఆకులను చూపి
ఆ వెనుక వస్తున్న కొత్త చివుర్లను చూపిస్తూ
అమ్మ చెప్పే కబుర్లు వింటూ హాయిగా
నవ్వే పాపాయి.....

అందరాని అద్భుతాలు కావాలని మారాం చేస్తుంటే
అదిగో అక్కడ ఉంది అందుకో నువ్వు నా ఆసరాతో
అందరాని చందమామను సైతం నీ కోసం తెస్తా
నీ చిరునవ్వుల కోసం పరితపిస్తా....

తల్లిబిడ్డల అనుబంధానికి వెల కట్టే నవాబులు
ఆత్మీయతలను అమ్ముకుందామనుకునే ఈ రోజుల్లో
ఏ బంధమైనా కాసులతోనే ముడి వేసే కుహనావాదులు
ఖరీదు కట్టగలరా ఈ చిరునవ్వుల సంతోషానికి....

అందరాని అబద్దాలను నిజాలుగా అందించే అమ్మ ప్రేమకు
కొలమానాలు తేగలరా ఈ ఆధునిక అపర కుబేరులు
జీవాన్ని వదలివేయాలని తెలిసినా పురిటి నెప్పుల ప్రసవ వేదన
భరిస్తూ ఆనందంగా జీవితాన్ని అందించే అమ్మకన్నా కన్నా సాటి
ఉన్నదా ఈ లోకంలో....!!

నా నెచ్చెలి .....!!

మత్తెకించే మరువాల సుగంధాలను
మరపించే నీ మేని పరువాలు
తలపించే తరువుల అందాలు
గుట్టుగా చేరినా గమ్మత్తుగా అందినా
మధువుల సంతకాల ముడుపుల సౌకుమార్యాలు
లాలన పాలన నా చెంతన చేరునా....
కఠినపు శిలగా మారిన నీ మది కరుగునా నా ప్రేమకు
ఈ జన్మకు తీరునా ఎద నిండా చేరిన  నీ సన్నిధి
నాతో చేరువగా చేరవా ఉహల నా నెచ్చెలి.....!!
( మరువాలు , పరువాలు, తరువులు .... ఈ పదాలతో ఈ చిన్న కవిత రాయడంలో ఎంత వరకు సఫలం అయ్యానో మీరే చెప్పాలి ... జగన్నాధ్ గారు ఇచ్చిన సమస్య ఇది )
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner