30, డిసెంబర్ 2021, గురువారం

శిక్ష ఎవరికి..?

నేస్తం, 

      జీవితంలో ఒడిదుడుకులు రావడం సహజం. అలాగే నమ్మి మోసపోవడమూ సహజమే. అలా అని నమ్మకుండానూ వుండలేం. ఇలా నమ్మి డబ్బులు ఇచ్చో లేదా మధ్యన వుండి ఇప్పించిన పాపానికో తమ ఆస్తులు అమ్మి పెళ్ళాం బిడ్డలను రోడ్డున పడేసిన వారు కొందరైతే, కుటుంబంతో సహా ప్రాణాలు తీసుకున్న వారు ఎందరో. అప్పు ఇచ్చిన వారు, తీసుకున్న వారు ఇద్దరు బానే వున్నారు. మధ్యలో నాశనమైంది మరో కుటుంబం. 

     దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి పెళ్ళాం బిడ్డలకు ఏ లోటు లేకుండా చేసి చచ్చే వెధవలు కొందరు. రాజకీయ కక్షలతో హత్య గావించబడేవారు మరి కొందరు. వీరికి అప్పు ఇచ్చినవారు, ఇప్పించినవారు  రోడ్డున పడ్డారు. వీరి పెళ్ళాం మాత్రం హాయిగా మూడు కోట్లతో గవర్నమెంటు ఉద్యోగం చేసుకుంటోంది. మరి కొందరేమో చాలా తెలివిగా కమీషన్ తీసుకుని అటు వారిని ఇటు వారిని వెధవలను చేసి, వీరు మాత్రం చాలా హాపిగా హాలిడే ట్రిప్ కి విదేశాలు తిరుగుతూ బతికేస్తుంటారు, తమకేం సంబంధం లేనట్టుగా. మనం ఎటు చూసుకున్నా నష్టపోతోంది మధ్యలోని వారే. 

        ఇంట్లో పెళ్ళాం బిడ్డల అవసరాలు పట్టవు గాని ప్రజా సేవకులు కొందరు. ప్రపంచం తమని మంచి ఉత్తముడిగా గుర్తించాలన్న ఆరాటం వీరిది. కుటుంబం తిండి ఖర్చులు లెక్కలు వేసుకుంటారు కాని తాము తగలేసే పుణ్యకార్యాలకు(పేకాట, తిరుగుళ్ళు, తాగుబోతులకు, చావులకు, దినవారాలకు వగైరా..)ఎంత ఖర్చు అయ్యిందో తెలియని అమాయకులు పాపం. ఎక్కడెక్కడ తిరిగేది, ఎవరికెంత తగలేసింది ఇలాంటివన్నీ గుట్టే. కొందరు పెద్ద మనుష్యులేమో ఆడపిల్లకు పెట్టాల్సింది పోయి తరతరాల నుండి ఆడపిల్లల సొమ్ము తిని బతికేస్తూ నీతులు మాత్రం వల్లిస్తారు. మరి కొందరేమో ఎలుక మీద పిల్లికి , పిల్లి మీద ఎలుకకి చాడీలు చెప్తూ తమ పబ్బం గడుపుకుంటూ వుంటారు. పెళ్ళాం బిడ్డల ఉసురు పోసుకున్న ఎవడూ బాగు పడిన దాఖలాలు చరిత్రలో లేవు.

        ఎవరికి వారు అందరు నీతిమంతులే. తమ బండారం బయట పడనంత వరకు. ఆ ఇంటికి ఈ ఇల్లు, ఈ ఇంటికి ఆ ఇల్లు మధ్యన దూరం ఒకటే. బంధమైనా, చుట్టరికమైనా, స్నేహమయినా ఇచ్చిపుచ్చుకోవడంలోనే వుంటుంది. డబ్బుతో అన్నీ దొరకవని తెలియాలి. రక్త సంబంధాలే అంటరాని బంధాలుగా మారిపోతున్న ఈ రోజుల్లో మనిషితనం కొరవడటంలో ఆశ్చర్యం లేదులెండి.


వెంకటేశ్వరరావు, శ్రీదేవిలకు మధ్యలో ఉండి అప్పు ఇప్పించిన పాపానికి బలైన కుటుంబం వీరు. వీరి చావుకు శిక్ష ఎవరికి వేస్తుంది న్యాయస్థానం?

19, డిసెంబర్ 2021, ఆదివారం

జీవన మంజూష జనవరి 2022

నేస్తం,

           ప్రపంచంలోనికి ప్రతి ఒక్కరం ఒంటరిగానే వస్తాంఒంటరిగానే పోతాంమహాయోధుడు అలగ్జాండర్ చనిపోయే ముందు చెప్పిన మాటల్లో ఎంత సత్యముందోగమనించండితనను సమాధి చేసేటప్పుడు తన చేతులను పైకి పెట్టి వుంచి సమాధిచేయమన్నాడటదాని అర్థం ఈపాటికి అందరికి తెలిసే వుంటుంది కదాఎంతసంపాదించినావిశ్వవిజేతగా నిలిచినా పోతూ ఏమి తీసుకుపోలేముఉత్తి చేతులతోవెళిపోవాల్సిందే అన్న సత్యాన్ని నలుగురికి తెలియజెప్పడానికి అలా తన చేతులను పైకివుంచి సమాధి చేయమన్నాడు

      మనకు అన్ని తెలిసినా బ్రతికినన్నాళ్ళు మనకు అది లేదని ఇది లేదని తాపత్రయపడుతూనే వుంటాంఅవసరాలకు డబ్బులు కావాలికాని మన అవసరమే డబ్బుగామారిపోయింది ఈనాడుప్రతి బంధమూ డబ్బుతోనే ముడిబడిపోయిందినైతికవిలువలు నశించి పోతున్నాయినాగరికత ముసుగులో అనాగరికత పురుడు పోసుకునిమర్రి ఊడలుగా బలంగా పాతుకుపోతోందిఏవైపు చూస్తున్నా బలహీనమౌతున్నఅనుబంధాలే తప్ప బలపడుతున్న మానవ సంబంధాలు కనబడటం లేదు.

        ఒకే ఇంటిలో ఉంటున్నాఅపరిచితులుగా భార్యాభర్తలుపిల్లలుమిగిలిపోతున్నారంటే..తప్పు ఎక్కడ జరుగుతోందికుటుంబ సంబంధాలలోనాఆధునికతను సంతరించుకున్న వ్యవస్థలోనాలేదా మూలాలను మరచిఅందలాలనుఅందుకున్న మనిషి ఆలోచనలదాఆధునిక విజ్ఞానంలో మనిషి ఎంత పురోగతినిసాధించినా నేటికీ తగ్గని గృహహింసలకు కారణాలను కనుగొనలేక పోతున్నాంకనీసం హింసలను బయటికి కాకపోయినా కన్న తలిదండ్రులకు కూడా చెప్పుకోలేని దుస్థితిలోఎందరో గృహిణులు మన సమాజంలో ఉన్నారుప్రపంచంలో ఎవరినోమనముద్దరించనక్కర్లేదుమన చుట్టు జరుగుతున్న ఎన్నో సంఘటనలకు సాక్షులుగామిగలకుండా కాస్త మానవత్వం మనలో ఉందని మనకి మనం చెప్పకోగలిగితే చాలు

        ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండాతడబడి తడబాటుకుగురౌతున్న కొన్ని బతుకులకైనా మాట సాయమోమనిషి సాయమో చేయగలిగితే చాలుకదా..!!
16, డిసెంబర్ 2021, గురువారం

గుర్తుకొస్తున్నాయి...
" గురుతులు కావివి..గుండెను తట్టి లేపే జ్ఞాపకాలివి.... "
     " మన ఊరు, మన మట్టి, మన గాలి అలాగే ఉంటాయి. మనమే వస్తుంటాం, పోతుంటాం ".
ఈ మాట చదివిన ఎవరికైనా ఓసారి మనసు భారంగా కాకుండా ఉంటుందా చెప్పండి? మనం ఎంత దూరంగా వెళ్లినా ఏదోక సమయంలో జ్ఞాపకాలు మనసు తలుపు తట్టకుండా ఉండవు. అవి మనకు నచ్చినవైనా సరే. బాధించేవైనా సరే. ఈ భూ ప్రపంచంలో జ్ఞాపకాలు లేని మనుష్యులు అరుదుగా ఉంటారేమెా. అలాంటి వారిని వదిలేస్తే ప్రముఖ పశు వైద్యులు డాక్టర్ డి. ప్రసాద్ గారు రాసిన " గుర్తుకొస్తున్నాయి.." పుస్తకం చదువుతుంటే ఆనాటి తరం నుండి ఈనాటి తరం వరకు ప్రతి ఒక్కరికి ఏదోక పేజిలో తమ జ్ఞాపకాలు గుర్తుకు రాక మానవు అనడంలో ఏమాత్రం అతిశయెాక్తి లేదు. 
    సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చి అప్పటి రోజులలోనే మూగజీవాలపై ఉన్న ఆపేక్షతో ప్రజా  వైద్యునిగా కాకుండా పశు వైద్యునిగా అకుంఠిత దీక్షతో తన చదువును కొనసాగించి, ఎన్నో మూగజీవాలకు తన సేవలందించి, వైద్యరంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టి, నిజాయితీ విలువను ఆకాశంలో నిలిపి, మానవత్వాన్ని చాటిన డాక్టర్ డి ప్రసాద్ గారు ఎందరికో మార్గదర్శకులు నేడు. 
      " గుర్తుకొస్తున్నాయి...నా జ్ఞాపకాలు " అంటూ తన చిన్ననాటి నుండి ఇప్పటి వరకు జరిగిన ఎన్నో సంఘటనలను మన కనుల ముందు కనిపించేటట్లుగా రాయడమే కాకుండా, దానికి పుస్తక రూపమివ్వడం సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే మనకు స్వతంత్రం రాక ముందు నుండి జరిగిన ఎన్నో విషయాలను, తర్వాత తర్వాత వచ్చిన మార్పులను, చేర్పులను, చరిత్రలోని ఎన్నో మనకు తెలియని విషయాలను, ఎందరో మహానుభావులను, వారితో తన అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. 
    చిన్నతనంలోనే నాన్న మరణంతో మెుదలైన మెాసాన్ని ఓ పాఠంగా తీసుకున్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి తాను నమ్మిన న్యాయాన్ని గెలిపించారు. చిన్నతనంలోని చదువును, నాటకాలను, ఆటలను, పాటలను, ఆనాటి అనుబంధాలను, స్నేహ పరిమళాలను, ఉపాధ్యాయులను, గురువులను, స్పూర్తినందించిన నాయకులను, వారి ఉపన్యాసాలను వివరించడమే కాకుండా తాను సందర్శించిన యూరోపియన్, అమెరికా, కెనడా దేశాలను, అక్కడి విశేషాలను, వింతలను, భిన్న మనస్తత్వాలను చక్కగా అక్షరీకరించారు. 
        తన వృత్తిలో తనకెదురైన సవాళ్ళను ఎదుర్కుంటూ, నలుగురిని కలుపుకుని సమాజానికి, మూగజీవాలకు ఎలా మంచి చేయవచ్చో చేసి చూపించి, నలుగురికి ఆదర్శంగా నిలిచారు. చేసే వృత్తి పట్ల అంకితభావముంటే ఎన్ని అద్భుతాలు చేయవచ్చో మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు. వీరి విజయ ప్రస్థానం ఎందరికో మార్గదర్శకం. ఎన్నో వ్యాసాలు రాసిన అనుభవంతో వెలువడుతున్న ఈ " గుర్తుకొస్తున్నాయి...(నా జ్ఞాపకాలు )" అందరి మనసు తలుపులను తప్పక తడుతుందని చెప్తూ....నాకూ నాలుగు మాటలు రాసే అవకాశమిచ్చినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు.

అతి కొద్ది పరిచయంతోనే ఆత్మీయబంధమైన బాబాయికి హృదయపూర్వక శుభాకాంక్షలతో.. 

మీ
మంజు

రణ నినాదం...!!

రాజకీయ రాక్షసక్రీడకు
ఆహుతి అవుతున్న 
ప్రజా సంపదలెన్నో

స్వప్రయెాజనాలకు 
కన్నతల్లినే కాలరాస్తున్న
కిరాయి బిడ్డలెందరో

ఎన్నో ఉద్యమాల పోరాటంతో
ఎందరో మహాత్ముల
త్యాగఫలమీ ఆంధ్రరాష్ట్రం 

స్వార్థాల చీకటి కోరల్లో
ఉచితానుచితాల మాయలో
పన్నుల భారాన్ని మరచినారు జనులు

విభజన పాలకుల 
మెాసపు మాటల్లో పడకండి
విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కని మరువకండి

నివేదనలు పనికిరావు
నినాదమై నినదించాలి
మన హక్కు మనకే సొంతం కావాలి

ప్రైవేటీకరణకు కాదు ప్రజలసొమ్మంటూ
పాలకుల నియంతృత్వానికి 
చరమగీతం పాడుతూ
రణ నినాదమే జననినాదంగా
పోరుబాటగా సాగుతూ
ఆంధ్రుడి ఆత్మగౌరవం 
ఉక్కు విశాఖను కాపాడుకోవడం
మన అందరి బాధ్యతగా
సమిష్టి పోరాటంతో 
సమైక్యంగా కాపాడుకుందాం
రండి కదలిరండి ఆంధ్రులారా
గొంతెత్తి పలకండి 
నలుదిక్కులు పిక్కటిల్లేలా
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కంటూ
పరాయి సొత్తు కానివ్వమంటూ...!! 

11, డిసెంబర్ 2021, శనివారం

ఏక్ తారలు..!!

 1.  ఆత్మీయ పలకరింపు చాలు_ఆకాశమంత ఆనందం పంచడానికి..!!

2.   తడబాటు తప్పటగులే అన్నీ_కాలమిచ్చిన నజరానా కన్నీళ్లనుకుంటూ..!!

3.  కలల వరాలే కొన్ని_అందని ఆకాశాన్ని అరచేతిలో పెడుతూ..!!

4.   కథలన్నీ కాలానికెరుకే_ముగింపు తెలియనిది మనిషికే..!!

5.   పదము పదమూ పేర్చుతునే వున్నా_మనోఫలకాన్ని తెలపాలని..!!

6.  కనుమరుగయ్యా_కల’వరించని కనుపాపల్లో..!!

7.   యుగాల నిరీక్షణకు సమాధానం_నీలో నేనుగా నిలిచిన క్షణాలు..!!

8.   పంచుకున్న జ్ఞాపకాలివి_పెంచుకున్న బంధానికి సాక్ష్యంగా..!!

9.    ఉనికి ప్రశ్నార్థకమౌతూనే వుంది_ఏ కాలంతోనూ సంబంధం లేనట్టుగా..!!

10.   మనసు రాగం మౌనవించింది_కనుకొలుకుల్లో తారాడుతూ..!!

11.   పిలుపు వినబడని మనోధ్యానమది_తలపులన్నీ నీవైన క్షణాలలో..!!

12.   పిలుపుకందని ధ్యానమది_మది మౌన సరస్సులో నీ ప్రతిబింబమై..!!

10, డిసెంబర్ 2021, శుక్రవారం

జీవన మంజూష జనవరి 2022

నేస్తం,

          ప్రపంచంలోనికి ప్రతి ఒక్కరం ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే పోతాం. మహాయోధుడు అలగ్జాండర్ చనిపోయే ముందు చెప్పిన మాటల్లో ఎంత సత్యముందో గమనించండి. తనను సమాధి చేసేటప్పుడు తన చేతులను పైకి పెట్టి వుంచి సమాధి చేయమన్నాడట. దాని అర్థం ఈపాటికి అందరికి తెలిసే వుంటుంది కదా. ఎంత సంపాదించినా, విశ్వవిజేతగా నిలిచినా పోతూ ఏమి తీసుకుపోలేము. ఉత్తి చేతులతో వెళిపోవాల్సిందే అన్న సత్యాన్ని నలుగురికి తెలియజెప్పడానికి అలా తన చేతులను పైకి వుంచి సమాధి చేయమన్నాడు

      మనకు అన్ని తెలిసినా బ్రతికినన్నాళ్ళు మనకు అది లేదని ఇది లేదని తాపత్రయ పడుతూనే వుంటాం. అవసరాలకు డబ్బులు కావాలి. కాని మన అవసరమే డబ్బుగా మారిపోయింది ఈనాడు. ప్రతి బంధమూ డబ్బుతోనే ముడిబడిపోయింది. నైతిక విలువలు నశించి పోతున్నాయి. నాగరికత ముసుగులో అనాగరికత పురుడు పోసుకుని మర్రి ఊడలుగా బలంగా పాతుకుపోతోంది. ఏవైపు చూస్తున్నా బలహీనమౌతున్న అనుబంధాలే తప్ప బలపడుతున్న మానవ సంబంధాలు కనబడటం లేదు.

        ఒకే ఇంటిలో ఉంటున్నా, అపరిచితులుగా భార్యాభర్తలు, పిల్లలు మిగిలిపోతున్నారంటే..తప్పు ఎక్కడ జరుగుతోంది? కుటుంబ సంబంధాలలోనా! ఆధునికతను సంతరించుకున్న వ్యవస్థలోనా! లేదా మూలాలను మరచి, అందలాలను అందుకున్న మనిషి ఆలోచనలదా! ఆధునిక విజ్ఞానంలో మనిషి ఎంత పురోగతిని సాధించినా నేటికీ తగ్గని గృహహింసలకు కారణాలను కనుగొనలేక పోతున్నాం. కనీసం హింసలను బయటికి కాకపోయినా కన్న తలిదండ్రులకు కూడా చెప్పుకోలేని దుస్థితిలో ఎందరో గృహిణులు మన సమాజంలో ఉన్నారు. ప్రపంచంలో ఎవరినో మనముద్దరించనక్కర్లేదు. మన చుట్టూ జరుగుతున్న ఎన్నో సంఘటనలకు సాక్షులుగా మిగలకుండా కాస్త మానవత్వం మనలో ఉందని మనకి మనం చెప్పకోగలిగితే చాలు

        ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా, తడబడి తడబాటుకు గురౌతున్న కొన్ని బతుకులకైనా మాట సాయమో, మనిషి సాయమో చేయగలిగితే చాలు కదా..!!


6, డిసెంబర్ 2021, సోమవారం

చీకటి మరకలు..!!

చీకటి మరకలు
చిత్తంలోనే
మగ్గుతున్నాయి

వెలుతురు నీడలో
వెంటాడే
క్రీనీడలకు చిక్కకూడదని

మబ్బుల మాటున
మనసును
దాచే ఆట మెదలయ్యింది

మౌనాన్ని ఆవాహన
చేసుకున్న
మాటలకర్థం వెదుకుతూ

ఓ పక్కన
చితిని పేర్చుతున్నా
భయమనిపించడం లేదు

చెంతనే
చిరునవ్వు తోడుగా
ఉన్నందుకనుకుంటా

గాయాలన్నీ
కాలిపోతాయని
ఎదురుచూస్తూంటే

ఆ గతపు మంటల నుండి
జ్ఞాపకాల నుసి
ఎగసిపడుతూనే వుంది

అక్కడక్కడా
రాలిన కన్నీటి చుక్కల
చెమ్మదనం ఇంకిపోలేదింకా

అక్షరాలకంటిన తడి
అద్దాల మేడలకు 
తాకలేదని ఆలస్యంగా తెలిసింది..!!

5, డిసెంబర్ 2021, ఆదివారం

Manju Yanamadala : పదునైన అక్షరం.. పరిమళించే సాహిత్యం.. మంజు యనమదలకు..

Manju Yanamadala : పదునైన అక్షరం.. పరిమళించే సాహిత్యం.. మంజు యనమదలకు..

3, డిసెంబర్ 2021, శుక్రవారం

రెక్కలు

1.  వదులుకోలేనిది
బలహీనత
తర్కానికి అందనిది
నమ్మకం

ఇహము పరము
తెలుసుకునేది మానవజన్మ..!!

2.  ఉలి దెబ్బలు
భరించాలి
రాతికి
రమణీయత రావాలంటే

నేర్పరితనమంతా
మలిచే తీరుదే..!!

3.   అన్నీ 
ఆశల సౌధాలే
కాసులతో
నిర్మితమిప్పుడు

జీవిత తులాభారమంతా
ధనతూకమే..!!

4.  చెంపదెబ్బ
మాసిపోతుంది
మనసుదెబ్బ
చితి మీద కూడా కాలదు

హింస
పలురకాలు..!!

5.  పరిమితంగా
కొన్ని
అపరిమితమైనవి
మరికొన్ని

అమ్మ దెబ్బల్లో ప్రేమ
తెలియనిదా..!!

6. ముసుగు పేరు
ఆధునికత
మనిషి తీరు
అనాగరికం

పరిజ్ఞానం బట్వాడా అయినది
పరాయితత్వం నుండి..!! 

7.   ప్రశ్నలతోనే
సమస్యలు
బాధ్యతనెరగని
హక్కులు

వితండవాదంతోనే
వింతపోకడలు..!!

8.   అణువే
ఆది అన్నింటికి
ఆకాశానికైనా 
అవనికైనా

దూరానికి 
కొలమానమెప్పుడూ దగ్గరతనమే..!!

9.  మారుతున్నవి
మానవ సంబంధాలే
అనుబంధాలకు
అడ్డుగోడలు కడుతూ

చుట్టరికాలెలా వున్నా
కాలంలో మార్పులేదు..!!

10.   ఓడిపోయేవి
కొన్ని
ఊరటనిచ్చేవి
మరికొన్ని

ఆటేదైనా
నైజమదే..!!

11.   రూపం లేనిది
మనసు
ఉనికి కోసమే
ఆరాటం

మనసు మనిషి మధ్యన
పోరాటమే జీవితం..!!

12.  యుద్ధమేదైనా సరే
సిద్దమే
చాటుమాటుతనం
అలవాటు లేదు

గెలుపోటములు
అక్షరాలకు అంకితం..!!

13.   ఏకపక్షం
కాదేదీ
ఏ జట్టుదైనా
గెలుపే లక్ష్యం

జీవితంలో
ఏ అటైనా..!!

14.   తల వంచని
స్థైర్యం
మెుక్కవోని
ఆత్మవిశ్వాసం

అక్షరాలకు మాత్రమే తెలిసిన
మనసు..!!

15.   ఎదురీతల
జీవితం
ఎడతెగని
అనుబంధాల నిలయం

అమ్మకు అక్షరానికి
ఎరుకైన పాశం..!!

16.   చిరునవ్వై 
సేద దీరుతున్నా
మౌనం
మనసు విప్పిందని

ఆత్మను
అక్షరం పరిపూర్ణం గావించిందని..!!

17.   కలతలు
కారణాలుగా మారుతున్నాయి
బాంధవ్యాలు
భారంగా మారుతున్నాయి

ధనానికి దాసోహం అంటోంది 
సమాజం..!!

18.    ఉచితానుచితాలు
ఆలోచించాలి
అయాచితంగా
మాట జారకూడదు

లాభం సంగతెలా వున్నా
అపాత్రదానం కూడదు..!!

19.   విభజన
ఊసెందుకు
నా నీ ఉనికి
ఒకటే అయినప్పుడు

మనమన్న మాట
మనసులో మెదిలితే చాలు..!!

20.   కలలన్నీ
కల(ల)‘వరాలే
వాస్తవాలన్నీ
వేకువ పొద్దులవే

అడుగులెటు పడినా
అంతిమ ఫలితం కాలానిదే..!!

21.   తల్లీబిడ్డల బంధం
తెచ్చిపెట్టుకుంటే వచ్చే పదవి కాదు
డబ్బుతో కొలవలేనిది
మమతనెరిగిన బాధ్యత

సంస్కారం
జన్మతః ప్రాప్తిస్తుంది..!!

22.   జ్ఞాపకాలన్ని
గత కాలానివే
చెరపలేని రాతలకు
సాక్ష్యాలుగా

భవితతో ముడిబడిన
వాస్తవం మనం..!!

23.   విసుగు
భరించవచ్చు
విరక్తి
రానివ్వకూడదు

మనిషికి 
జీవితానికి తెలియాల్సినవి..!!

24.   వీగిపోతున్న 
చుట్టరికాలు
కొలమానంగా మారిన
ధనము

మనిషితనానికి మిగిలిన
ప్రశ్నార్థకమీనాడు..!!

25.   నిరాశ
చుట్టమౌతోంది
ఆశ
ఆకాశం వైపు చూపెడుతోంది

అనుబంధాలు
ధనాత్మకమైపోతున్నాయి..!!

26.   వెలితి
తెలుస్తోంది
వెతలు
వెంబడిస్తుంటే

కాలం
నిర్వికారంగా సాగిపోతూనే వుంది..!!

27.    వెతలు
వెంటాడుతునే ఉంటాయి
బాధ్యతలు
బంధాలకు చిక్కుబడిపోయాయి

అవినాభావ సంబంధం
కాలానిది జీవితానిది..!!

28.   అనుభవాల
ఆటుపోటులే అన్ని
చిక్కుముళ్లను
విప్పుకుంటూ

భూమ్యాకాశాల కొసలను
కలిపే కాలయంత్రంలో..!!

29.   చుట్టరికానికి కొలమానం
ధన సంబంధం
మనిషితనానికి తూగేది
ఆత్మానుబంధం

కాలపు తక్కెడలో
తూకపురాళ్ళెప్పుడూ ఒకటే..!!

30.  కనబడే అబద్ధం
పొగడ్త
వినబడని నిజం
విమర్శ

కొలవలేని దూరం
రక్త సంబంధాల మధ్యన..!!

1, డిసెంబర్ 2021, బుధవారం

అవస్థ..!!

మనిషికి
మనసుకు 
మధ్యన అవస్థ

మాటకు
మౌనానికి
మధ్యన అవస్థ

బంధానికి
బంధనానికి
మధ్యన అవస్థ

ఆక్రోశానికి
ఆనందానికి 
మధ్యన అవస్థ

ప్రేమకు
ద్వేషానికి 
మధ్యన అవస్థ

అహానికి
ఆత్మాభిమానానికి 
మధ్యన అవస్థ

అక్షరానికి
పదానికి
మధ్యన అవస్థ

అనుభవానికి
సంఘర్షణకి
మధ్యన అవస్థ

చావుకు
పుట్టుకకు
మధ్యన అవస్థ

దూరానికి
చేరువకి 
మధ్యన అవస్థ

వ్యవస్థకి
వ్యక్తికి
మధ్యన అవస్థ

అర్థానికి
పరమార్థానికి
మధ్యన అవస్థ

ఆదికి
అంతానికి
మధ్యన అవస్థ

జీవితానికి
జీవించడానికి
మధ్యన అవస్థ..!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner