27, మార్చి 2018, మంగళవారం

కాలం..!!

కదలిపోయే కాలం చేసే వింతలెన్నో
విచిత్రాల సచిత్ర కథనాల కన్నీళ్లెన్నో
గతపు గాయాల గాధల వ్యధలెన్నో
జ్ఞాపకాల చెమరింతల చేవ్రాలులెన్నో
వాస్తవాల వ్యాపకాల అంతర్మథనాలెన్నో
నిలువరించలేని శ్వాసల ఆక్రోశాలెన్నో
వర్తమానాల ఆశల ఊహల విహంగాలెన్నో
రాలిపడే రాచిలుకల రెక్కల లెక్కలెన్నో
నజరానాలు అక్కర్లేని అనుబంధాలెన్నో
నయగారాల్లో మునిగి తేలే మురిపాలెన్నో
అస్తవ్యస్తపు జీవితాల ఆటవిడుపులెన్నో
గెలుపోటముల చిరునామాల్లో
కాలగతిలో నిలిచిపోయే చరిత్రలెన్నో
మరలిరానిది మార్పు లేనిది
ఎవ్వరితో నిమిత్తం లేనిదీ కాలచక్రం
హరిహరాదులకు సైతం అంతుచిక్కనిది..!!

ఒక్క అడుగు ముందుకు వేస్తే..!!

రాజకీయ చదరంగంలో
కార్పొరేట్ కట్టుబాట్లలో
కులాల కుమ్ములాట్లలో
కల్తీ విత్తుల మాయలో
సబ్సిడీ ఎరువుల మత్తులో
ఋణాల సుడిగుండంలో
ఆకాశాన్నంటే కూలి కొట్టంలో
ఆకలి తీర్చే వ్యవసాయ పంటల కోసం
అందీ అందని నీటి 'అ'సౌకర్యాల నడుమ
బాలారిష్టాలు దాటినా
అదును పదును లేని
అకాల వర్షాలతో
అరకొరగా చేతికందిన పంటకు
గిట్టుబాటు ధర కరవై
బీడుబారిన భూమిని చూస్తూ
చిన్నబోయిన గూడుని తల్చుకుంటూ
గుండె చెదిరిన బడుగురైతు
ఉద్యమాల బాట పడితే
గొంతెత్తి నినాదాలు చేస్తే
సగటు మధ్యతరగతి రైతుకు
న్యాయం జరుగుతుందా..
ఎందరికో ఆకలి తీర్చే అన్నార్తుడు
పండించిన పంటకు వెల కట్టలేని
దుస్థితిలో ఏకాకిగా మిగిలిపోతూ..
దళారీల దళసరి నోట్ల మధ్య
నలుగుతున్న తనవాళ్ల ఆకలి జీవితాల
రోదనలకు కడుపు మండితే..
ఏ పంటను పండించనని
ఒక్క అడుగు ముందుకు వేస్తే ...!! 

23, మార్చి 2018, శుక్రవారం

తప్పని తిప్పలు...!!

నేస్తం,

        కొన్ని జీవాలను మనం లెక్కలోనికి తీసుకొనక పోయినా అసలు పేరుతో కాకుండా నకిలీ ఐడిలతో  మన వెంటే పడుతూ...పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదని తృప్తి పడుతున్న చందానా  బతికేస్తున్నారు.  కొన్ని రోజుల క్రిందటే నేను జనాభా లెక్కల్లోనుండి తీసేసినా రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం తప్పడం లేదు అన్నట్లుంది.  నా జోలికి వస్తే వదిలేస్తాను కాని నా అన్న వాళ్ళ జోలికి వస్తే నడి బజారులో సన్మానం తప్పదు.  మెున్ననే అతి కష్టం మీద ఆపేసాను బజారుకీడ్చి తన్నకుండా.  ఈసారి విషయం నా చేతిలో ఉండదు. ఎవరి బిజినెస్ ఏంటి అన్నది అందరికి తెలిసిన సత్యమే. ఇదే ఆఖరి వార్నింగ్ అనుకోండి లేదా ఇంకేమైనా అనుకోండి తేడాగా  ఉంటే ఒక్కరిని కూడా వదలను.  జాగ్రత్తగా మీ ఏడుపు మీరు ఏడవండి కోడిగుడ్డు మీద ఈకలు పీకొద్దు.

22, మార్చి 2018, గురువారం

ఏక్ తారలు...!!

1.  తరలినా తరగనివే_చెలిమి పరిమళాలైనందుకేమెా...!!

2.  కవిత్వం సజీవమైనదే_ప్రతి అక్షరంలోనూ జీవకళతో నిండిపోతూ...!!

3.   మనసు తేలికైనట్లుంటుంది_కొన్ని కన్నీళ్ళు పలకరించినప్పుడు...!!

4.   మాటలన్నీ మౌనంలో కలిసిపోయాయి_శబ్దం సద్దుమణిగాక....!!

5.   ముచ్చట్లన్నీ ముసురుకున్నాయి_మనసు మౌనం వీడిందని తెలిసి...!!

6.  మనసు ముగ్దమెాహనమైంది_మౌనం ముచ్చట్లకు...!!

7. మౌనం వినిపిస్తోంది_జీవితపు చివరి అంకానికి తెర తీయబడి...!!

8.  పగిలింది నిశ్శబ్దం_మౌనం మాటలు నేర్చిందని..!!

9.   మనసు మాట్లాడేస్తుంది_కొందరి సమక్షంలో... !!

10.  మౌనాన్ని పటాపంచలు చేయాలి_మూర్కుల మూఢత్వానికి సమాధానంగా..!!

11.  మౌనం మనతోనే_మానసికోల్లాసానికి ప్రతిరూపంగా...!!

12.   మాలిమి చేసుకున్నావు మనసుని_మరలి పోనియకుండా....!!

13. చేరువయ్యింది చెలిమి_చెదిరిన మనసులనొకటి చేస్తూ...!!

14.   మాటల యుద్ధం ముగిసింది_సుశ్శబ్దమైన నీ అంతరంగపు అలికిడి విని....!!

15.  కాకమ్మ కతలన్నీ నిజాలే_నీళ్ళెన్ని ఉన్నా నిండని కుండలతో ఇప్పుడు...!!

16.  కడలి ఘోషిస్తోంది_వెల్లువెత్తిన కన్నీటి సంద్రాలను మెాయలేక..!!

17.  మనసుకెరుకయ్యిందేమెా_మమతలతో ముడి పడిన జీవితమని..!!

18.   నేనూ ఓ ఆత్మకథ రాసేయాలి_సమయం మించకుండానే....!!

19.   తూరుపు సింధూరమై మెరుస్తోంది_
పడమటి కనుమలు చేరని ప్రేమ....!!

20.   అమాసను వెన్నెల వారించినట్లుంది_కృష్ణపక్షంలో చోటిస్తానని చెప్పి..!!

21.  వన్నెలన్నీ భావాలవే_మనసాక్షరాలైనందుకేమెా....!!

22.   అక్షరమే ఆటవిడుపు_అలుపెరగని జీవితపు ఆటలో...!!

23.   తలపే తన్మయత్వం _అలసిన మనసుకు ఊరటగా...!!

24.   పద ముద్రితాలై మదిని తాకుతున్నాయి_నను వీడిన నీ పాద ముద్రలు...!!

25.   మెలకువ రాని కలే ఎప్పుడూ_వాస్తవాన్ని ఏమార్చేస్తూ ....!!

26.   స్వప్నమూ మెలకువలోనే_గాయాలను నిదురపుచ్చలేక...!!

27.   నిష్క్రమణం అనివార్యమైంది_జ్ఞాపకమై జత చేరుతూ.... !!

28.  కలలై వరిస్తూనే_కన్నీరై వర్షిస్తూ...!!

29.   సమయమూ సమాయత్తమైంది_నిరీక్షణకు తెర దించేయాలని....!!

30.   సమయం మిగిలేవుంది_ఆశలకు ఊపిరి పోస్తూ...!!

17, మార్చి 2018, శనివారం

రాయికి నోరొస్తే కథా సంపుటి సమీక్ష,,,!!

          వనజ వనమాలి బ్లాగర్ గా అందరికి సుపరిచితులైన తాతినేని వనజ కథల సంకలం "రాయికి నోరొస్తే"లో కథలను చదువుతుంటే ఆ పేరెందుకు పెట్టారో అర్ధం అయ్యింది. తన చుట్టూ ఉన్న సమాజంలోని కష్టాలు, కన్నీళ్లు చూసి రాయిలా మారిన మనసుకి మాటలొస్తే అచ్ఛం ఈ రాయికి నోరొస్తే కథల్లోని పాత్రలే మన నిజ జీవితంలోని మన అనుభవాలే అనిపించక మానవు.
         ఇక కథల్లోని వెళితే ఆనవాలు కథలోని పేరు కూడా చెప్పుకోలేని ఓ భార్య చాటు భర్త, కొడుకుగా తన తండ్రికి అవసానదశలో ఆసరా కాలేక పోవడంలో పడే వేదనను, ఆస్తులు అడగడానికి పల్లెకు వెళుతూ గుండె లోతుల్లో దాగిన జ్ఞాపకాలను తడుముకుంటూ చివరికి తన కర్తవ్యాన్ని అద్భుతంగా నిర్వహించడాన్ని హృద్యంగా చెప్పారు. కాళ్ళ చెప్పు కరుస్తాదిలో పల్లెలోని ఆచారాలు, కట్టుబాట్లను, కులాల అహంకారాలను చెప్తూనే పల్లె మనసుల అభిమానాన్ని తమ దగ్గర పని చేసిన చిన్న పిల్లాడు యజమానురాలు తనపై చూపిన అభిమానానికి గుర్తుగా మథర్స్ డే రోజున అమ్మగా భావించి చీర పెట్టి ఆశీర్వదించమనడంలోని అనుభూతిని చక్కగా చెప్పారు. వెన్నెల సాక్షిగా విషాదంలో కులాల పట్టింపులకు బలైన ప్రేమను అందమైన మనసు పాటలతో దరి చేరని లేఖలో విషాదాన్ని వినసొంపుగా వినిపించారు. కూతురైతేనేంలో ఆర్ధిక బంధాలలో పడి ఎందరో పిల్లలు దూరమౌతున్న అనుబంధాల విలువలను ఓ తల్లి మనసు తన కూతురు గొంతానమ్మకోరికలను తీర్చడానికి ఆత్మార్పణ చేసుకోవడం చదువుతుంటే మన మనసులు కంటతడి పెట్టక మానవు. జాబిలి హృదయంలో మనసులు కలసిన బంధాలకు ఏ మతాలు, కులాలు,కట్టుబాట్లు  అడ్డు రావని అద్భుతంగా చెప్పారు. ఇక ఈ సంపుటి పేరైన రాయికి నోరొస్తే కథలో నిజానికి నమ్మకానికి మూలమైన అమ్మానాన్నా బంధంలో హక్కులకు, బాధ్యతలకు మధ్య అహానికి, ఆత్మాభిమానానికి తరతరాలుగా జరుగుతున్న సంఘర్షణను చెప్పడంలో సఫలీకృతులయ్యారు. సంస్కారంలో ప్రతి మనిషికి,మతానికి  మధ్య ఉండే విభిన్న ఆలోచనాసరళిలో ఉన్న ఆంతర్యాలను గౌరవించడం ఎలానో చెప్తూ, మనుష్యులు తనువు చాలించినా వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వమని చెప్పడం చాలా బావుంది. `కంట్రీ ఉమెన్ కూతురు కథలో మన సంప్రదాయపు కట్టుబొట్టు విలువను చెప్తూ అసలైన అందం ఆత్మ విశ్వాసంతో కూడిన వ్యక్తిత్వం అని చెప్తూ నేటి యువత వేగానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసారు. స్నేహితుడా నా స్నేహితుడాలో మనసు స్నేహాలు, రహస్య స్నేహాల మధ్యన పెరుగుతున్న అంతర్జాలపు వారధి, భావాల పంపకంలో ఆత్మల బంధాన్ని, అసలైన స్నేహాన్నిఅలవోకగా చెప్పేసారు. పాట తోడులో మానవత్వానికి, తోటి మనిషికి సాయపడటానికి గొప్ప కుటుంబంలోనే పుట్టనక్కరలేదని, ఆదుకునే మనసుంటే చాలని, ఇంకెన్నాళ్ళీ కథలో గుడిసెల్లో బతుకుల బాదరబందీలు, ఆడది ప్రేమను పంచడంలోనూ అదే కోపం వస్తే, తన సహనాన్ని పరీక్షిస్తే ఆదిశక్తిగా ఎలా మారుతుందో, మారాల్సిన ఆవశ్యకతను వివరించారు. మహిన్ లో చదువుకోవాలని ఉన్న ఓ పసి మనసు కుటుంబ పరిస్థితుల మూలంగా ఆగిన తన చదువు కోసం ఏం చేయడానికి నిర్ణయించుకుందో చెప్పడంలో ఆ భావోద్వేగాలు పలికించడంలో మనం రోజు చూసే సంఘటనలే కళ్ళ ముందు కనిపించేటట్లు చేసారు. మర్మమేమిలో మతాచారాలను అడ్డు పెట్టుకుని కొందరు ముసుగు వేసుకుని ఎలా మోసం చేస్తున్నారో దానికి పర్యవసానం మంచివాళ్ళు శిక్ష అనుభవించడం గురించి చాలా బాగా చెప్పారు. ఇంటిపేరుతో ఓ అతివ మనసులోని ఆవేదన తండ్రి, భర్త, కొడుకు వంటి బంధనాల నుంచి తనకంటూ ఓ అస్థిత్వాన్ని ఏర్పరచు కోవడానికి చేసిన ప్రయత్నం కనపడుతుంది. పలుచన కానీయకే చెలీలో స్నేహం ముసుగులో ఈర్ష్యను, అసూయను బయటపడకుండా పబ్బం గడుపుకునే ఈనాటి ఎన్నోకుటిల మసస్తత్వాలను, బేగం పేట్ ప్యాలస్ ప్రక్కనలో మన హడావుడి జీవితాల్లో మనముండి, మన దగ్గర పని చేస్తున్నవారి మానసిక స్థితిని అంచనా వేయలేని పరిస్థితులను, దూరపు కొండలు నునుపన్న అమెరికా వీసా జీవితాలను ప్రత్యక్షంగా చూసిన అనుభవాన్నిచక్కగా అక్షరీకరించారు. లఘు చిత్రంలో మనం చూసే మనిషిలో మనకి తెలియని మరో కోణం ఉంటుందని తెర మీద కనిపించే జీవితాల్లో ఆ తెర వెనుక విషాదాన్ని పరిచయం చేయడం, వేశ్యల మనసు కథను వినిపించడం, ఇల్లాలి అసహనంలో పట్టణవాసంలో అపార్ట్మెంట్ జీవితాలు, అసహనపు ఘట్టాలు భరించే ఓ సగటు ఇల్లాలి మనసు ముచ్చట్లు, గడప బొట్టులో అర్ధం లేని సంప్రదాయాలకు మనం ఇచ్చే విలువల గురించి, ఇప్పుడు కూడా రావా అమ్మాలో తనలో తాను మథనపడుతున్న కూతురికి దూరమై తప్పనిసరి పరిస్థితుల్లో రెండో పెళ్లి చేసుకుని కూతురికి దగ్గర కాలేని తల్లి వేదన, బయలు నవ్విందిలో అవసరాలకు జ్ఞాపకాలను నరుక్కోవడం, నా అన్న బంధాలను తెంపుకోవడం వెనుక ఎంత విషాదం పెద్దల మనసుల్ని మెలిపెడుతుందో,  ఆమె నవ్వులో అవసరానికి ఎలా వ్యాపారం చేయాలో, పురిటిగడ్డ కూలి బతుకుల్లో కష్టాలు, మగ బిడ్డ కోసం తపనతో భార్యనే కోల్పోవడం, లాఠీకర్ర కథల్లో బంధాల విలువలు, వ్యక్తిగత, ఉద్యోగ బాధ్యతలు ఎలా ఉండాలనేది సహాజ పాత్రలతో చక్కని శైలిలో చెప్పారు.

                    ప్రతి కథలోనూ మనచుట్టూ తిరిగే పాత్రలతో, మనకు అలవాటైన, దగ్గరైన అనుభవాలను ఇవి మనం చూస్తున్నంతగా లీనమైపోయేటట్లుగా సహజంగా చెప్పడంలో రచయిత్రి కృతకృత్యులైయ్యారు. ప్రతి కథలోనూ మానవీయ దృక్పథం కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి ఒక్కరు చదవదగ్గ పుస్తకం ఈ " రాయికి నోరొస్తే ". 

13, మార్చి 2018, మంగళవారం

మరో ఉగాదికై ...!!

ఉషస్సుల ఉగాది పయనమౌతోంది
వసంతాల సంతసాలను మనకందించ
మరలిపోయిన సుఖ దుఃఖాల మరపుల్లో
క్రొంగొత్త ఆశల కొత్త కాంతులకై
అరుదెంచిన ఆనందాలహేలల సందడిలో
కొత్త పాటను నేర్చిన కోయిలమ్మ రాగాల సడిలో
మావి చివురుల వగరు ఆస్వాదనలో
తీపి చేదు పులుపు కారాల వంటి షడ్రుచుల సమ్మేళనంలో
వేదనాదాల నడుమ పుణ్యమూర్తుల పంచాంగ శ్రవణ ఆశీస్సులతో
విందు భోజనాల విస్తరిగా వడ్డించిన జీవితం
మరో ఉగాదికై మనసు పడుతోంది...!!
హితులకు, సన్నిహితులకు, మిత్రులకు, శత్రువులకు అందరికి విళంబి నామ సంవత్సర శుభాకాంక్షలు.... 

12, మార్చి 2018, సోమవారం

ఎనిమిదో రంగు పుస్తక సమీక్ష....!!

                మన అందరికి తెలిసిన ఏడురంగుల ఇంద్రధనస్సే కాకుండా ఎనిమిదో రంగును మనకు పరిచయం చేయడానికి అనిల్ డ్యాని తన కవితలతో మన ముందుకు వచ్చేసారు. ముఖ చిత్రంలోనే ఆ రంగు ఏమిటన్నది చెప్పకనే చెప్పేసారు. యథాలాపంగా చెప్పడం మొదలు పెట్టినా సమాజపు తీరు తెన్నులు ఏమిటనేది ఈరోజు గాయపడ్డ సూరీడుతో రేపటి ప్రభాతమైనా ఆంక్షలు లేకుండా రావాలన్న కాంక్షని, ధర్మస్థలిలో వెలివాడల ఒంటరి కేకల ఆర్తనాదాన్ని,  ఆమె - రాత్రి చందమామలో చీకటిలో మేల్కొన్న ప్రపంచంలో నిన్నటికి నేటి మధ్యనున్న ఓ శూన్య కాలంలో బీద గొప్పల అంతరాన్ని గ్రహణం పట్టిన చీకటికి వెలుగులు పూస్తున్న సందడి హడావిడిలో పెళ్లి ఊరేగింపులో పెట్రోమాక్స్ లైట్ పట్టుకున్న ఓ అమ్మ చీర చిరుగుని దాచడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మనసుకు హత్తుకునేటట్లు చెప్పడం అభినందించదగ్గ విషయం. మరణ వాంగ్మూలంలో మృతదేహం ఎప్పుడు మరణించిందో మనకు స్పష్టంగా విప్పి చెప్పారు. నీకు నువ్వుగా నీతో నువ్వుమాట్లాడే సమయాన్ని నీకు కేటాయించుకో అని ఈ మౌనం మంచిది కాదు అని ఓ చురక వేశారు. జండాపై కపిరాజులో తెలిసిన నిజం జనం చప్పట్ల మధ్య నలిగిపోతోందని ఙివిత నాటకంలో గెలుపెవరిదో చెప్పని ముగిసిన నాటకం పాత్రలో ఎక్కడ వాలాలో తెలియని పావురం ఆసరా కోసం మనిషి భుజాన్ని వెదుక్కోవడం, వ్యూహంలో వీరుని తుపాకిని ముద్దాడే సీతాకోక చిలుక, ఆమెతనంలో ఇసుక రేణువులో దాగిన సంద్రం,అణచబడినా మొలకెత్తే మరో వసంతం, తెల్లారొచ్చిన సూర్యుడి వెలుగంతా ప్రపంచ తల్లులు స్రవించిన రక్తమంటూ అహాలకు, అధికారాలకు అంగడిబొమ్మగా మారిన అతివ మనసును ఆవిష్కరించారు. ఆలింగనం మతాల మానవత్వాన్ని చాటి చెప్తోంది. ఇదిగో పొలం నుంచే వస్తున్నాను గత జ్ఞాపకాల గుర్తులను తడమడం, ఇక్కడ ఏడుపు నిషేధంలో మూర్ఖుల మారణకాండకు బలైపోతున్న అన్నెం పున్నెం ఎరుగని పసి ప్రాణాలను, అతని పాటలో మనసు రాగాన్ని, ఓ ధిక్కార స్వరాన్ని కొత్తగా వినిపించారు. వలస వాన అవసరానికి అందని చినుకు పల్లెలకు మొఖం చాటేయడాన్ని అద్భుతంగా అందించారు. జనరల్ బోగీలో మనిషితనం కాస్త మనసులకు అంటడానికి సహజత్వాన్ని కోల్పోవద్దని సూచించారు. ప్రవాహం, వాన రాత్రి, ఒంటి రెక్క పక్షులు, గ్రేటర్ దెన్ వంటి కవితల్లో కవిత్వం వినబడడాన్ని, సంఘర్షణల చిత్తాలను చూపించారు. కొన్ని మాటలంతే అంటూ మనం పోగేసుకున్నంత కాలం మిగిలేది మాటలు రాల్చిన మౌన గాయాల కబుర్లే అంటారు. ప్రతీకలుగా నిలిచేది కొన్ని పొద్దులు, సాయంత్రాలు కలిపి మిగిల్చిన కాసిన్ని నిజాలు, అబద్దాలని చెప్పడం, భలే మంచి చౌక బేరములో దేశ రాజకీయంపై విసుర్లు, వెలుతురూ విరుగుతున్న శబ్దం, పంజరం చిలుక,పిల్లలారా వంటి చక్కని సందేశాత్మక కవితలు, వెకెటింగ్ కవితలో వెలయాలి గుండెకోతను, కాటి సీను పద్యంలో మనిషిగా మనలేని మన బతుకుల్ని, గాయపడ్డవాడాలో ఓ ఆశావహ దృక్పధాన్ని, మనుషుల మధ్యలో దూరమౌతున్న అనుబంధాలను చూపించారు. ఇక చివరిదైన ఈ కవితా సంపుటి పేరైన ఎనిమిదో రంగు గురించి చెప్పడం అనిల్ మాటల్లోనే .. అన్ని రంగులను తనలో ఇముడ్చుకునే నలుపు వర్ణం . అదే "ప్రేమ".
నిజరూప దర్శనం, గాజు దేహాలు, నివేదన, మాయ తెర, పహారా, ఆ ఇంటి ముందు వంటి చక్కని ఆలోచింప చేసి కవితలు, మరో రెండు ఆంగ్లానువాద కవితలతో ఎనిమిదో రంగు ఓ కొత్త సోయగాన్ని అందుకుంది.

  అద్భుతమైన 35 కవితలను ఎనిమిదో రంగుగా ఆవిష్కరించిన అనిల్ డ్యానికి అభినందనల శుభాశీస్సులు...

మంజు యనమదల. 

శ్రీ భవభూతి శర్మ గారి పుస్తక సమీక్ష గోదావరి వార్తా పత్రికలో...

గోదావరి యాజమాన్యానికి, కత్తిమండ ప్రతాప్ గారికి నా ధన్యవాదాలు...

7, మార్చి 2018, బుధవారం

ఆయుధ కర్మాగారం...!!

అంతర్యుద్ధమే అనునిత్యము
అలవికాని ఆశల ఆరాటాలకు
అర్ధం లేని అనుబంధాలకు నడుమ

వెసులుబాటు లేని వ్యాపకాల
వ్యామెాహానికి లోనైన మనసుల
నిర్వికార వాంఛల నిరోమయాలు

కన్నీళ్లకు కట్టుబడని వేదనలను
నేలరాలుతున్న జీవితాల రోదనలను
అక్షరాలకు పరిమితం చేస్తున్న భావాలు

సమాధాన పరిచే వెదుకులాటను
వెంటబడుతూ వేధిస్తున్న
వెతలకతలను అంతం చేసే ఆయుధ కర్మాగారమెక్కడని...!!

6, మార్చి 2018, మంగళవారం

ఏక్ తారలు...!!

1.  మది నిండుకుండైంది_నీ చెలిమి చెంత చేరగనే...!!

2.  హరివిల్లు చిన్నబోయింది_వేల వర్ణాల నీ భావాల వన్నెల ముందు...!!

3. మది నిన్నే తలుస్తుందేమెా అమాసలో_అలంకారాలన్నీ వదిలేసి...!!

4.   నీ భావాలు చేరికయ్యాయి_అక్షరాలను మాలిమి చేసుకున్నాక...!!

5.  గాయం మానుతోంది_దేహానికి లేపనాలతో అతుకులేస్తుంటే....!!

6.  మరక కూడ మంచిదే_జ్ఞాపకాలను సజీవంగా ఉంచుతూ..!!

7.  సంతసం పక్కనే ఉంది_నీ సహవాసం కోరుతూ...!!

8.   వాక్యాల వరుసలు నిండుకున్నాయి_అక్షర భావాల అలంకరణతో...!!

9.  నిరీక్షణకు తెర లేచింది_వియెాగానికి విరహానికి వారధిగా...!!

10.   సంఘర్షణలకు చరమగీతమే_సంబరాలు మనవైనప్పుడు...!!

11.   అలవికాని అనుబంధం_నిర్వచనాలకు చిక్కని మన చెలిమి...!!

12.  మనసు కూడ ముఖ్యమే_మౌనాన్ని దాచేందుకు...!!

13.  వెరవని ఉషోదయాలే అన్నీ_ముసిరిన చీకట్లను తరిమేయడానికి...
!!

14.  వరద వెల్లువ ప్రేమకావ్యం మనది_యుగ యుగాలుగా నిలిచిపోతూ....!!

15.   నీవని నేనని వేరెక్కడా_మనమైన మనసుల మమేకమే కదా...!!

16.  రేపటి సంతోషాలకు సాక్ష్యాలు_గడచిన గత జ్ఞాపకాలు....!!

17.   లంకలోనూ సీతమ్మ పదిలమే_రామయ్య తలపులతో...!!

18.  శుక్లపక్షం వెన్నంటే ఉంటుందని ధీమా_చీకటి చీర చుట్టుకున్న ఆకాశానికి...!!

19.  ఆకతాయిల అల్లరే అక్షరాలది_గుంభనమైన భావాల గుట్టు విప్పాలని....!!

20.  తెలిసిన పరిచయమే_గతజన్మ అనుబంధమనుకంటా...!!

21.   పరిచయముందనే పరిగెట్టుకు వచ్చింది_గతం స్పురణకు వచ్చి..!!

22.   కనురెప్ప చాటున పదిలమే_మరచిపోలేని గతాలన్నీ...!!

23.   చరిత్రెప్పుడూ చారిత్రాత్మకమే_అనుబంధాలకు దాసోహమైనా...!!

24.   విడిపోని బంధమే మనది_మనసులొకటైన మమతలతో...!!

25.  నిత్యమూ నీతోనే ఉంటున్నా_ఏకమైన మన భావాల సాక్షిగా...!!

26.  అక్షరాలు కలిపిన చెలిమిది_విడదీయరాని మమతానుబంధమై...!!

27.   ఇష్టసఖినై ఎదలో నిండిపోయా_అష్ట సఖులు వేల గోపికలెందరున్నా....!!

28.  పాత కాలం కనుమరుగౌతోంది_కొత్తగా వచ్చి చేరిన నీ సందడితో....!!

29.   వనవాసం సీతమ్మకేగా_రామరాజ్యంలో పట్టపురాణైనా...!!

30.  పరిమళాలు వీడని తలపులే అవి_ కాలపు గాలికి కొట్టుకెళ్ళినా...!!

3, మార్చి 2018, శనివారం

మనసంటే..!!

మాటలు రాని మౌనానికి
మార్గ నిర్దేశనం చేసే గురువేమెా

ఓడిన ప్రతిసారి బుజ్జగించే
అమ్మ ఒడి సేదదీర్పేమెా

జ్ఞాపకాలను గుట్టుగా దాచిన
పాతకాలపు భోషాణపు పెట్టేమెా

కాలంతో పోటి పడుతూ
క్షణాలతో పరుగులు పట్టే గమనమేమెా

చీకటింటికి ఓదార్పుగా చేరిన
కలలను దాచే వెన్నెల కలశమేమెా

నాతో చేరి ముచ్చట్లాడుతూ
ఆత్మబంధమై మిగిలిన నేనేనేమెా..!!

ఆలోచించాల్సిన విషయం....!!

నేస్తం,
         స్నేహం అంటే ఓ ఆత్మానుబంధపు చుట్టరికం. ఈ వర్చ్యువల్ ప్రపంచంలో స్నేహం అంటే చాలావరకు అవసరార్ధం అనుబంధమై పోయింది. ఎదుటివారు మనకు నచ్చినట్లు ఉండాలనుకోవడం, మనం చెప్పినట్లు వినాలనుకోవడం సంస్కారం అనిపించుకోదు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. విలువ ఇచ్చిపుచ్చుకోవడం తెలిస్తేనే ఏ బంధమైనా కలకాలం నిలబడుతుంది. అది స్నేహం కావచ్చు, ప్రేమ, పెళ్లి ఏదైనా కావచ్చు నమ్మకం, నిజాయితీ, నైతికత అనేవి ఈ సభ్య సమాజంలో చాలా ముఖ్యమైనవి. వ్యక్తిగతంగా మన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసే అనాగరిక, అనైతిక సంబంధాలు అనేవి ఎంతవరకు మనకి అవసరం అనేది అందరు ఆలోచించాల్సిన విషయం.
         క్రమం తప్పుతున్న మూడుముళ్ల బంధాలు ఎన్నో ఈరోజుల్లో మనం చూస్తున్నాం. రాహిత్యం అనేది ఇద్దరి మధ్యన లోపిస్తోన్న అనుబంధానికి ప్రతీక. మొగుడు అమ్మాయిలతో తిరుగుతున్నాడని వాపోయే ఇల్లాళ్లు వారు తిరిగేది కూడా వేరేవాళ్ళ మొగుళ్ళతో అని ఎలా మర్చిపోతున్నారో నాకు అర్ధం కాని ప్రశ్నగానే మిగిలిపోతోంది. మొగుడు / పెళ్ళాం పిల్లలు ఉన్నవాళ్లే ఇతర అనుబంధాలకు ప్రాకులాడుతూ నైతిక విలువలు లేకుండా చేస్తుంటే మనం చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ప్రేమ రాహిత్యంలో ఉన్నవాళ్లకు, ఒంరటితనంతో బాధ పడుతున్నవాళ్లకు ఈ అక్రమ అనుబంధాలు ఎడారిలో ఒయాసిస్సుల్లా అనిపించడంలో వింతేమీ లేదు. కాని మన ఈ అర్ధంలేని అక్రమ సంబంధం వలన మరో కుటుంబం చిన్నాభిన్నమై పోతోందని, మనం పడే బాధే ఎదుటివారు కూడా పడుతున్నారని తెలుసుకుంటే, ఎక్కడో బయట ఆత్మీయతను వెదుక్కోవడానికి అర్రులు చాచే మనసును మన అనుకున్న అనుబంధం కోసం ప్రయత్నం చేస్తే ప్రేమ రాహిత్యం కానీ, ఒంటరితనం కానీ లేకుండా పోతాయేమో. ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న ఎందరో ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలా అర్ధం పర్ధం లేని క్షణిక సుఖాల కోసం వెంపర్లాడటం చూస్తుంటే మాటల్లో చెప్పలేని ఏహ్య భావం కలుగుతోంది. ఎంతో ఉన్నత విలువలున్న మన సమాజంలో ఈ అసహజ మార్పు గొడ్డలిపెట్టులాంటిది. చదువుకున్న విజ్ఞులు, పెద్దలు ఆలోచించి ఈ జాడ్యానికి చరమగీతం పాడాలి.
మరోసారికలుద్దాం మరో విషయంతో.
        
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner