సాహిత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సాహిత్యం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, జులై 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... పంతొమ్మిదవ భాగం....!!

వారం వారం మన సాహితీ ముచ్చట్ల ప్రయాణంలో తెలుగు సాహిత్యపు కవి యుగాలలోని కొన్ని ముఖ్య  ఘట్టాలను  తెలుసుకుంటున్నాము కదా... ఈ వారం తెలుగు వైభవానికి స్వర్ణ యుగమైన రాయల వారి యుగం గురించిన వివరాలు, ప్రబంధం గురించి సంక్షిప్తంగా చూద్దాం..మన అందరం విని ఉన్నాము.. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రత్నాలు రాశులుగా పోసి వీధుల్లో అమ్మేవారని... రాయలవారి ఆస్థానమైన సభా మండపం  భువనవిజయమన్న పేరుతో అష్టదిగ్గజాలతో విలసిల్లేదని చతురోక్తుల తెనాలి రామకృష్ణ కవి చెప్పిన పద్యం తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో ... "మేక తోక పద్యం"... కాస్త లోతుగా చరిత్ర వివరణలోనికి వెళ్తే....

1500-1600 : రాయల యుగము దీనినే "ప్రబంధ యుగము" అని కూడా అంటారు. విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యద తో ప్రబంధం అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాల తో ఆయన ఆస్థానం శోభిల్లింది.

పదహారవ శతాబ్దంలో విజయనగర శ్రీ కృష్ణదేవరాయల పాలనా కాలంలో తెలుగు వైభవంగా వెలిగింది. తెలుగు పండితులను పోషించుటే కాక స్వయంగా తాను కూడా తెలుగులో రచనలు చేసిన సవ్యసాచి, రాయలు.

పదిహేనవ శతాబ్దంలో ప్రారంభమైన ప్రబంధ యుగము తరువాత రెండు శతాబ్దాలు తెలుగు సాహితీ జగత్తును ఏలింది

శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుడు గా మరియు కన్నడ రాజ్య రమారమణుడిగా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, తుళువ నరస నాయకుని రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలు నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు. రాయలు తల్లి నాగలాంబ గండికోట ను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడుచు. 240 కోట్ల వార్షికాదాయము కలదు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.
సాహిత్య పోషణ

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, మదాలసాచరితము, సత్యవధూపరిణయము, సకలకథాసారసంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి తదితర గ్రంథములు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు రేడ నేను తెలుగొకొండ ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.
భక్తునిగా

తిరుమలవెంకన్న ఆలయంలో సతీసమేతుడైన కృష్ణదేవ రాయలు

కృష్ణదేవ రాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు. కానీ పరమతసహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించినాడు. అంతేకాక ధూర్జటి, నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు. అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు.
నిర్మాణాలు

ఈయన చెన్నకేశవస్వామి వారి దేవాలయం కట్టించాడు.
కుటుంబము

కృష్ణదేవ రాయలుకు తిరుమల దేవి, చిన్నాదేవి ఇద్దరు భార్యలని లోక విదితము. కానీ, ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ మరియు కమల). కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు. పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. ప్రతాపరుద్ర గజపతి ని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవి ని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు. చాగంటి శేషయ్య, కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు. కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయిఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524 లో మరణించినాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసు ను అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలు ను వారసునిగా చేసాడు.
కులము

శ్రీ కృష్ణదేవ రాయలు ఏ కులానికి చెందిన వాడన్న విషయంపై ఇతర కులాలవారి మధ్య అనేక వాదోపవాదాలున్నాయి. ఈయన కాపు, బలిజ, గొల్ల, బోయ కులాలకి చెందిన వాడని ఆయా కులాల వారు చెప్పుకుంటారు. ఇతని తండ్రియైన తుళువ నరస నాయకుడు చంద్ర వంశపు క్షత్రియుడు అని పలు కవులు వ్రాసిన పద్యములు నిరూపించుచున్నవి. ఇప్పటికీ వీరి మూలాలు దక్షిణ భారతదేశమంతటా ఉన్నాయి.
సమకాలీన సంస్కృతిలో

శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం నేపథ్యంగా తెలుగులో అనేక సినిమాలు విడుదలైనవి. అందులో కొన్ని మల్లీశ్వరి, మహామంత్రి తిమ్మరుసు, తెనాలి రామకృష్ణ మరియు ఆదిత్య 369

ప్రబంధ యుగము

తెలుగు కవిత్వంలో 15వ శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన ప్రక్రియా భేదం ప్రబంధం. ప్రకృష్టమైన పదబంధమున్న కావ్యం ప్రబంధము.

ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో తిక్కన తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. ఎర్రనకు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు ఉన్నది. అయితే ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉన్నది. నన్నెచోడుడు అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక కుమార సంభవంలో అనేక వర్ణనలు చేశాడు. శ్రీనాథుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి. అల్లసాని పెద్దన మనుచరిత్ర రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది.

పెద్దన రాసిన మనుచరిత్ర బహుళ ఆదరణ సంపాదించి ప్రక్రియగా ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టింది. వచ్చిన వసుచరిత్ర మనుచరిత్రకు మించిన కవిత్వం కలిగిన కావ్యమనే పేరు సంపాదించింది. తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మహత్మ్యం, పింగళి సూరన కళాపూర్ణోదయం, చేమకూర వెంకటకవి రాసిన విజయవిలాసం వంటివి ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి.
లక్షణాలు

ప్రబంధ లక్షణాలను పలువురు విమర్శకులు ఇలా వివరించారు.

    పింగళి లక్ష్మీకాంతం: ప్రబంధమునకు ఏక నాయకాశ్రయత్వము, దానితోపాటు వస్త్వైక్యము ప్రధాన ధర్మములు. ప్రబంధము అష్టాదశ వర్ణనాత్మకమై యుండవలెను. అందు శృంగారము ప్రధాన రసము. ఆవశ్యకతను బట్టి తక్కిన రసములు గౌణములు కావచ్చును. ఆలంకారిక శైలి ప్రబంధమునకు జీవము. ప్రబంధము భాషాంతరీకరణము కాకూడదు. స్వతంత్ర రచనయై యుండవలెను. పదునారవ శతాబ్ది ఆది నుండీ వెలువడిన మనుచరిత్రాది కావ్యములన్నిటికి పైన పేర్కొన్న లక్షణములన్నియు సమగ్రముగా పట్టినను, పట్టకున్నాను, స్వతంత్ర రచనలగుట చేతను, ఆలంకారిక శైలీ శోభితములగుట చేతను అవన్నియు ప్రబంధములుగానే పరిగణింపబడినవి.
    కాకర్ల వెంకట రామ నరసింహము: కథైక్యమును అష్టాదశ వర్ణనలును గలిగి శృంగార రస ప్రధానమై, అర్థాతిశాయియైన శబ్దమును గ్రహించి యాలంకారిక సాంకేతికములకు విధేయమై, ఆనాటి విస్తృతిగల యితివృత్తముతో, భాషాంతరీకరణముగాక, స్వతంత్రరచనయేయైన తెలుగు కావ్యము ప్రబంధము. అయితే పైని వివరించిన లక్షణములు కొన్ని ప్రబంధములందు గానరాకున్నను నాయా యుగధర్మ ప్రాధాన్యము బట్టియు, రచనా ధోరణి బట్టియు నవియు బ్రబంధనామముననే వ్యవహరింపబడుచున్నవి.
    దివాకర్ల వేంకటావధాని: ధీరోదాత్త నాయకములును, శృంగార రస ప్రధానములును, పంచమాశ్వాస పరిమితములును ఐన కావ్యములు ఆలంకారిక శైలిలో వ్రాయబడినవి- వీటికే ప్రబంధములని పేరు.
    సి.నారాయణరెడ్డి: ప్రబంధము యొక్క లక్షణములు నాలుగు.

    ఒకటి: కథానాయకుని యొక్క తృతీయ పురుషార్థమునకు(కామమునకు) చెంది ప్రాయికముగా తద్వివాహ సంబంధియగుట.

    రెండు: శృంగారము అంగీరసముగా నుండుట.

    మూడు: వర్ణన బాహుళ్యము కలిగియుండుట.

    నాలుగు: రీతి ప్రాధాన్యము కలిగి యుండుట.

    వేల్చేరు నారాయణరావు: పురాణమార్గం కథనమార్గం, ప్రబంధమార్గం వర్ణనమార్గం. ప్రబంధానికీ, పురానానికి తేడా కథనం వర్ణన-వీటి ఎక్కువ తక్కువలలో మాత్రమే వుందనే అభిప్రాయం బలపడింది.

చరిత్ర రచనలో

తెలుగు ప్రబంధాలకు అప్పటి స్థితిగతులను కాక కవుల ఊహాలోకాలనే అద్దంపట్టాయన్న అపప్రధ ఉన్నా చాలామంది పండితులు, చరిత్రకారులు వీటికి చరిత్ర రచనలో ఎంత ప్రాధాన్యత ఉందో, ఆనాటి స్థితిగతులు ప్రబంధాల్లో ఎలా ప్రతిబింబించాయో వివరించారు. ప్రబంద యుగంగా వర్దిల్లిన విజయనగర సామ్రాజ్య కాలంలోని ఆచారాలు, వ్యవహారాలు, జీవనశైలి వంటివాటికి ప్రబంధాలు ప్రతిబింబాలుగా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యంలో 15-16 శతాబ్దుల కాలంలో పర్యటించిన పలువురు విదేశీ యాత్రికులు నమోదుచేసిన చరిత్రలో ఏదైనా సంస్కృతికి సరిపోలని విషయం ఉన్నా, స్పష్టత కావాల్సివచ్చినా వారేమి సూచిస్తున్నారో అర్థం చేసుకునేందుకు ప్రబంధాలు పనికివచ్చాయి. ప్రబంధాల్లో జలక్రీడల వర్ణనం, సుగంధ ద్రవ్యాల వినియోగం, వారకాంతల వివరాలు, జాతరలు - మొక్కుబళ్ళు, సైనిక ప్రయత్నాలు వంటివాటి వర్ణనలు సామాజిక చరిత్ర నిర్మాణంలో ఉపకరిస్తున్నాయి.
ఉదాహరణలు

    మనుచరిత్ర
    సంస్కృతమునందలి మాళ వికాగ్నిమిత్రము
    ఆముక్త మాల్యద
    నాలాయిర దివ్య ప్రబంధము-తమిళము
    ముకుందవిలాసము
    వీరభద్ర విజయము

ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి

వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

ముందు మాట....!!


'తెలుగు సాహితీ ముచ్చట్లు' కు స్వాగతం!..
'మంజు' యనమదల...
ఈమె పేరు వింటేనే చాలు ... అభిమానం పొంగుకు వస్తోంది!..
మంజు గారి గురుంచి ఎంత చెప్పిన తక్కువే..
మంచి తనానికి మారు పేరు మంజు గారు!.. మంచి రచయిత్రి...
ఏ బాధ్యత చేపట్టినా ఓ నిబద్దతతో చేస్తారు..

ఈమె పుట్టింది... కృష్ణాజిల్లా జయపురం..
స్వస్థలం.... నరసింహాపురం..
పెరిగింది... అవనిగడ్డ, విజయనగరం.. చదివింది అక్కడే.
ఇంజనీరింగ్ చేసి చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేసారు..
అవనిగడ్డలో అధ్యాపకురాలిగా కొనసాగారు..
అమెరికాలో ఎనిమిది ఏళ్ళు జీవనయానం అనంతరం
భాగ్యనగరంలో నాలుగు ఏళ్ళు ప్రాజెక్ట్, క్వాలిటి మేనేజర్ గా పనిచేసారు.
* అపురూపమైనదమ్మ ఆడజన్మ..
ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మని గుర్తు చేస్తూ...
ఇంటి ఇల్లాలిగా, తల్లిగా, కూతురిగా, మనుమరాలిగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నతమైన బాధ్యతలతో.. ప్రస్తుతం తమ జీవన ప్రయాణం సాగిస్తోంది.
మంజు గారి సాహిత్య నేపద్యం అంటారా?!...
ఇక ఆమె మాటల్లో చెప్పాల్సిందే!..
" మా నాన్నగారికి సంగీత, సాహిత్య, నాటక అభిరుచి ఎక్కువ...
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం అలవాటు...
కనపడిన ప్రతి పుస్తకమూ చదివేయడమే...
జరిగిన సంఘటనలు రాయడం మొదలు పెట్టి.. ఉత్తరాలతో జత కలిపి...
'తెలుగు' రాదన్న తెలుగు మాష్టారి మీద కోపంతో...
తెలుగంటే బోలెడు ఇష్టాన్ని పెంచుకుని...
అనిపించిన భావనలు పంచుకొని..
ఇలా సాహిత్యంతో..
'సాన్నిహిత్యం' ఏర్పడింది" అంటారు మంజు గారు!..
మరి ఇతంటి సాహిత్యాభిరుచి కలిగిన 'మంజు' యనమదల గారిని
ఈ కూటమిలో వారం .. వారం ఓ వ్యాసం రాయమని 'సాహితీ సేవ' అడిగింది.
సాహిత్యం గురించి నాకేం తెలుసంటూ.. తటపటాయిస్తుండగా మీ 'కబుర్లు, కాకరకాయలు' చూస్తుంటాం .. మీరు రాయగలరు, రాయండి' అనగానే అంగీకరించక తప్పలేదు మంజు గారు.
ఎట్టకేలకు వారం ... వారం ... ప్రతి శుక్రవారం " తెలుగు సాహితీ ముచ్చట్లు ' శీర్షికన రాయటానికి అంగీకరించారని తెలియచేయులకు సంతోషిస్తున్నాం.
తెలుగు సంస్కృతి కుసుమం.. శ్రీమతి మంజు యనమదల గారి " తెలుగు సాహితీ ముచ్చట్లు" కు స్వాగతం పలుకుదాం.
రేపటి శుక్రవారం వెలువడే " తెలుగు సాహితీ ముచ్చట్లు" శీర్షికను ఆదరించండి!..
మంజు గారిని ఆశీర్వదించండి!... ప్రోత్సహించండి!..
జయహో తెలుగు సాహిత్యం
సదా సేవలో,
కంచర్ల
ఆర్వీ యస్ యస్ శ్రీనివాస్
రామకృష్ణ చౌదరి జాస్తి,
సుకన్య బీగూడెం,
డా. కత్తిమండ ప్రతాప్,
పుష్యమి సాగర్
సాహితీ సేవ.

తెలుగు సాహితీ ముచ్చట్లు ...ఎనిమిదవ భాగం....!!

ఇప్పటి వరకు నాకు తెలిసిన వృత్తాల గురించి నాకు తెలిసిన, నేను తెలుసుకున్న  వివరాలు మీకు అందించాను... వృత్తాలు అంటే ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము, మత్తకోకిల అనే నాకు తెలుసు... అంతర్జాలంలో వెదికితే మరికొన్ని వృత్తాల గురించిన వివరాలు దొరికాయి.... వాటిలో తరళము, తరలి, మాలిని కొత్తగా కనిపించిన వృత్తాలు... ఇవి కాక మరికొన్ని కూడా ఉన్నాయి.... వాటి గురించి మళ్ళి వారం చూద్దాము... దిగితే కాని లోతు  తెలియదు... ఒడ్డున ఉండి రాళ్ళు వేసేవాడికేమి తెలుసు... అన్న సామెత ఎంత నిజమో ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది... సాహిత్యానికి ప్రాణాధారమైన భాషను గురించి నాకు తెలిసిన అది మా తెలుగు మాష్టారు చెప్పింది... నాకు బాగా ఇష్టమైన అమ్మ భాష గురించి నాలుగు ముక్కలు చెప్పేద్దామని గబ గబా మొదలెట్టేసానా... సముద్రంలో ఓపికగా వెదికిన కొద్ది మరకతమణులు, మాణిక్యాలు దొరికినట్లు ఈ సాహితీ ముచ్చట్ల కోసం వెదికిన వెదుకులాటల్లో ఎన్ని మణి మాణిక్యాలు మీతోపాటుగా నాకు దొరుకుతున్నాయో.... ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు అందించిన సాహితీ సేవకు వందనాలు.... ఇక ఈ వారం వృత్త వివరణలు చూద్దామా....
తరలము

    ఇది మత్తకోకిలకి జంట వృత్తము
    మత్తకోకిలలో ని మొదటి గురువు తరలములో రెండు లఘువులుగా మారుతుంది.

 లక్షణములు

    పాదాలు : నాలుగు
    ప్రతి పాదంలోని గణాలు : న భ ర స జ జ గ
    యతి : ప్రతిపాదంలోనూ 12 వ అక్షరము
    ప్రాస: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు

నడక

    మతత కోకిల మత్త కోకిల మత్త కోకిల కోకిలా
    తనన తానన తాన తానన తాన తానన తాన తా

ఉదాహరణ 1

ప్రవిమలాగమతత్త్వవేది తపఃప్రభాసి జగత్త్రయీ

శివకరుండు హితోపదేశము సేయఁగాఁ గడువేడ్కతో

దివిజవంద్యుఁడు బ్రీతితోఁ జనుదెంచె నారదుఁ డంబుజో

ద్భవతనూజుఁడు భానుతేజుఁడు పాండవేయులపాలికిన్

ఉదాహరణ 2

క్రతుశతంబుల బూర్ణకుకుక్షివి కాని, నీవిటు క్రేపులున్

సుతులు నై - చనుబాలు ద్రావుచు, జొక్కియాడుచు, గౌతుక

స్థితి జరింపగ, దల్లు లై విరసిల్లు గోవుల, గోపికా

సతులధన్యత, లెట్లు సెప్పగ జాలువాడ? గృపానిధీ!

పోతన భాగవతము - 10 - 569

తరలి పద్య లక్షణములు

    వృత్తం రకానికి చెందినది
    ధృతి ఛందమునకు చెందిన 97247 వ వృత్తము.
    18 అక్షరములు ఉండును.
    23 మాత్రలు ఉండును.
    మాత్రా శ్రేణి: U I I - I I U - I I I - I U I - I I I - U I U
        త్రిమాత్రా శ్రేణి: U I - I I I - U I - I I I - U I - I I I - U I - U
        చతుర్మాత్రా శ్రేణి: U I I - I I U - I I I I - U I I - I I U - I U
        పంచమాత్రా శ్రేణి: U I I I - I U I I - I I U I - I I I U - I U
        షణ్మాత్రా శ్రేణి: U I I I I - U I I I I - U I I I I - U I U
        మిశ్రగతి శ్రేణి (5-4) : U I I I - I U I - I I I U - I I I I - U I U
    4 పాదములు ఉండును.
    ప్రాస నియమం కలదు
    ప్రతి పాదమునందు 11 వ అక్షరము యతి స్థానము
    ప్రతి పాదమునందు భ , స , న , జ , న , ర గణములుండును.

ఉదాహరణ 1

చారుభసన భూరిజన రసాంద్రగణములన్‌ దిశా

సార విరతి నందముగ నిజంబు తరలి చెన్నగున్‌.

చారుభసన భూరిజన రసాంద్రగణములన్‌ దిశా

సార విరతి నందముగ నిజంబు తరలి చెన్నగున్‌.

మాలిని

సాధారణంగా ఇది ఆశ్వాసాంత పద్యాలలో ఉపయోగిస్తారు.

లక్షణములు

    పాదాలు : 4
    ప్రతి పాదంలోని గణాలు : న న గ గ | ర ర గ |
    యతి : 9వ అక్షరము
    ప్రాస: కలదు

నడక

    ననన ననన నానా | నాననా నాన నానా

ఉదాహరణ 1

దివిజరిపువిదారీ! దేవలోకోపకారీ!

భువనభర నివారీ! పుణ్యరాక్షానుసారీ!

ప్రవిమలశుభమూర్తీ! బంధుపోషసవర్తీ!

ధవళ బహుళ కీర్తీ! ధర్మ నిత్యానువర్తీ!

తరలి --------------భ-స-న-జ-న-ర-----యతి-11
తరలము(ధ్రువకోకిల)----న-భ-ర-స-జ-జ-గ----యతి-12
తరళము------------7నగణములు+గురువు----యతి-13

వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

27, జూన్ 2015, శనివారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ముప్పది ఎనిమిదవ భాగం....!!

గత ముప్పది ఏడు వారాలుగా నిరంతరాయంగా సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్లలో అ ఆ ల నుంచి ఱ వరకు నాకు తెలిసిన నేను తెలుసుకున్న అన్ని ముచ్చట్లు చెప్పేసాను.. క్రిందటి వారం ఎర్రని సాహిత్యం విప్లవ సాహిత్యం గురించి నాలుగు మాటలు చెప్పుకున్నాం.. ఈ వారం మన జీవితంలో అతి మధురమైన బాల్యం మనల్ని ఎప్పటికి వెన్నాడుతున్నట్లే ఉండే ఆ జ్ఞాపకాల మధురాలను గుర్తు చేసుకుంటూ బాల సాహిత్యం గురించి కొద్దిగా చూద్దాం...
ఈ లోకానికి పరిచయమవుతూనే అమ్మ లాలి పాటలు, జోల పాటలతో పాటల సాహిత్యానికి మైమరచే అద్భుతమైన బాల్యం మనకు ఆ దేవుడు ఇచ్చిన వరం... పుడుతూనే అమ్మ పాటతో మన పసితనం మొదలై సాహిత్యానికి శ్రీకారం చుడుతుంది... చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బాలజ్యోతి.. మొదలైన కథల పుస్తకాలతో దిన దిన ప్రవర్ధమానం చెందుతూ ఆటల పాటల బాల సాహిత్యం అలరాలుతుంది పసితనంలో...

ప్రతి పత్రికలోనూ బాల సాహిత్యానికి ఓ ప్రత్యేకత ఉంటుంది... దాని బట్టే మనకు అర్ధం అవుతుంది .. బాల సాహిత్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో... చాలా మంది రచయితలు / రచయిత్రులు బాల సాహిత్యానికి పెద్ద పీట వేశారు... నాటకాలు, నాటికలు బాలలకు సంబంధించి ఎన్నో వచ్చాయి... ఈనాడు బాల రచయితలు కూడా చక్కని సాహిత్యాన్ని అందిస్తున్నారు... తరాలు మారుతూ పోతున్నాయి.. నాగరికత కొత్త పుంతలు తొక్కుతోంది.. ఆధునికత, సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందినా పసితనాన్ని వదలని జ్ఞాపకాలు మన జీవితంలో ఎప్పుడు మనతోనే ఉంటాయి.. వెన్నెల్లో ఆరుబయట అందరు పడుకుని చెప్పుకున్న కథలు, పాడుకున్న పాటలు, ఆడిన ఆటలు మరచి పోయేవారు ఎవరు ఉండరు... తిరిగిరాని బాల్యాన్ని మళ్ళి మన కళ్ళ ముందుకు తెచ్చేది ఈ బాల సాహిత్యమే... అందమైన బాల్యాన్ని అందించే బాల సాహిత్యం ఎప్పటికి అజరామరమే...

గత ముప్పది ఏడు వారాలుగా మీ అందరితో నాకు తెలిసిన నేను తెలుసుకున్న తెలుగు సాహిత్యపు కబుర్లను ... తెలుగు సాహితీ ముచ్చట్లుగా మీ అందరితో పంచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చిన సాహితీసేవకు కృతజ్ఞతలతో... నా ముచ్చట్లను ఆదరించిన మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు... !!

19, జూన్ 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ముప్పది ఏడవ భాగం....!!

వార వారం సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్ల ప్రయాణంలో ఇప్పటి వరకు తెలుగు సాహిత్యం పూర్వాపరాలు చాలా వరకు తెలుసుకున్నాము... తెలుగు సాహిత్యంలో ఒకటైన విప్లవ సాహిత్యం గురించి ఈ వారం చూద్దాం...
ఈ విప్లవ సాహిత్యంలో భావావేశంతో పాటుగా జనాన్ని చైతన్య పరిచే గుణం కూడా ఉంటుంది... విప్లవ సాహిత్యంలో కూడా కథలు, కవితలు, కధానికలు, వచనం, నవల, సిని సాహిత్యం ఇలా అన్ని కోణాలు ఉంటాయి.... మనసులో నుంచి పుట్టేది భావావేశం... జరుగుతున్న సమస్యలకు మనసు స్పందిస్తే పుట్టేది విప్లవం... సమాజానికి తప్పును వేలెత్తి చూపేది విప్లవ... సమస్యలో మరో కోణాన్ని చూపిస్తూ మనిషిని తద్వారా సమాజాన్ని చైతన్య పరిచేది విప్లవసాహిత్యం... అక్షరాన్ని ఆయుధంగా మలిచి పోరాటాన్ని సాగించిన ఎందఱో నాయకులు, అమర వీరులు ఈనాడు మన మనస్సులో నిలిచిపోయారంటే అతిశయోక్తి ఏమి లేదు...
ఉద్యమమ నుంచి, సాజాజిక జన జీవనం నుంచి, సమస్యల నుంచి ఉద్భవించేదే విప్లవ సాహిత్యం ... ఇది జనానికి దగ్గరగా వచ్చినంతగా ఇతర సాహిత్యాలు ఈ కాలంలో రాలేదనే చెప్పాలి... మన అందరికి తెలిసిన మహా కవి శ్రీ శ్రీ మహా ప్రస్థానం ఇప్పటికి ఎందరి హృదయాల్లో సజీవంగా నిలిచి పోయిందో మనకు తెలుసు... సినీ పాటల రచనలో కూడా తనదైన శైలిని సృష్టించారు శ్రీ శ్రీ...సమాజంలో నలుగుతున్న సమస్యలతో ఎన్నో విప్లవ సినిమాలు వచ్చాయి ...దొరల ఆధిపత్యానికి అడ్డం పట్టిన చిత్రాలు, ఉద్యమాల నేపద్యాలలో వఛ్చిన చిత్రాలు అనేకం... విప్లవ రచయితలూ కాళోజి గారు, వరవరరావు గారు విరసం స్థాపనలో ముఖ్యులు... మన అందరికి సుపరిచితులు గద్దర్ గారు ఎంత గొప్ప విప్లవ కవో ఆయన పాటల గొంతు వింటే తెలిసిపోతుంది... విప్లవ  సాహిత్యం, జానపద సాహిత్యం జనాల్లో చొచ్చుకు పోయినంతగా ఇతర సాహిత్య ప్రక్రియలు చుచ్చుకు పోలేదనే చెప్పవచ్చు...

అక్షరానికి ఉన్న శక్తి అపారం. అధికారిక శాసనాన్ని స్థిరపరిచినా, ‘అనధికార శాసనకర్త’గా వ్యవహరించినా సాహిత్యం పోషించిన పాత్ర పదునైనది. ‘సాధారణ మాటలకు ఇంత అసాధారణ సౌందర్యం, అలౌకిక ఆకర్షణ ఎలా వచ్చాయి.. అని పంక్తుల మధ్యలోకి ఆశ్యర్యంగా చూస్తూ ఉండిపోయేవాడి’నని తన తొలి పఠనానుభవాన్ని గురించి గోర్కీ రాసుకున్నాడు. అందుకేనేమో సాహిత్యం వెంట గుర్తింపు, కీర్తి వస్తాయి. సమాజంలో సాహిత్యకారులకు ఎంతో కొంత గౌరవం లభిస్తుంది. కళాసాహిత్య పోషకులైన రాజులను చరిత్ర కూడా తగు రీతిలో గుర్తుపెట్టుకుంది. కళాసాహిత్యాల అసలైన సృష్టికర్తలు మాత్రం చరిత్ర ఎరుకలో ఉండరు...

సాహిత్యం దేని కోసం? దాని పరమార్థమేమిటి?’ వంటి ప్రశ్నలు బహుశా మన సమాజంలో ఇప్పుడు కొత్తగా వేసుకోనక్కర్లేదు. రాజాస్థానాల నుండి, అధికార పీఠాల నుండి స్వేచ్ఛ పొందిన సాహిత్యం, మందిలో కలిసిన సాహిత్యం, తలెత్తుకు నిలబడి ధిక్కార పతాకను ఎగరేసిన సాహిత్యం సమాజానికి ఒక భరోసానిచ్చింది. తెలుగు సాహిత్యకారులు ఆ వారసత్వాన్ని సగర్వంగా స్వీకరించారు. అక్షరం ఆధిపత్యానిది కాదు, అశేష ప్రజాసమూహాలకు ప్రాతినిథ్యం వహించేదనే దశకు చేరుకోవడంలో ఎంత సంఘర్షణ ఉందో నేటికీ నడుస్తున్న చరిత్రే. సాహిత్యాన్ని సాహిత్యంగానే చూడాలంటే, రాజకీయం కాని వ్యక్తీకరణ ఏదీ ఉండదని కుండ బద్దలు కొట్టి చెప్పాయి మన సాహిత్యోద్యమాలు. ఎన్ని వాదాలున్నా తెలుగు సాహిత్యం పీడిత సమూహాల పక్షాన నిలిచింది. దేశంలోనే కాదు, ప్రపంచంలోని సకల దుర్మార్గాలను ప్రశ్నించింది. సామ్రాజ్యవాద మార్కెట్‌ చేతిలో పరాయీకరణకు గురవుతున్న మనిషిని గురించి దు:ఖించింది. తెలంగాణ నుండి పాలస్తీనా దాకా ఆధిపత్యాన్ని, హింసను, అణచివేతను ప్రశ్నించింది. అట్టడుగుకు నెట్టివేయబడ్డ సమాజాల సాంస్కృతిక వ్యక్తీకరణకు అక్షరరూపమిచ్చింది.

సాహిత్యకారులు అంతకన్నా ఇంకా ముందుకే నడిచారు. ఎన్నో సార్లు నేరుగా ఉద్యమ గొంతుక వినిపించారు.
విద్యార్థి, మేధోరంగాన్ని ప్రభావితం చేశారు. ప్రగతిశీల భావాలకు వాహికలయ్యారు. ప్రగతిశీల రచయితలు అని వేరుగా కాక రచయితంటేనే ప్రగతిశీలవాది అనే భావన తెలుగు సాహితీలోకంలో స్థిరపడిరది. భాషా సాహిత్యాలను పాలకవర్గం చేతుల నుండి తప్పించి ప్రజా ఉద్యమాలు తమ సొంతం చేసుకున్నాయి. ఎన్నో వేదికలు, భిన్న ప్రాపంచిక దృక్పథాలు, భావ సంఘర్షణలు మామూలే. ఎన్నివైపుల నుండి వ్యవస్థతో, రాజ్యంతో ఘర్షణ పడితే సామాజిక పురోగతికి అంత ప్రయోజనం. పురోగామి శక్తులను, భావజాలాలను అయితే అణచివేయడం, లేదా వారి చేతుల్లోకి తీసుకోవడం చేయడం పాలకవర్గాలు నిరంతరం చేసే పని. మొదటిది సూటిగా ఉంటుంది. రెండోది అనేక ముసుగులు వేసుకొని ఉంటుంది....

అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని అక్షరానికి అందించేదే విప్లవ సాహిత్యం... పదునైన భావాలను శరాలుగా సంధించడానికి... నిరాయుధమైన అక్షరమే వేల శరాలుగా మారి చేతనాన్ని కలిగిస్తుంది.. చెఇతన్యాన్ని రగిలిస్తుంది... అది విప్లవానికున్న శక్తి.... వేల ఉద్యమకారుల గొంతుల్లో భువనం బద్దలయ్యేలా వినిపించే ఒకే ఒక శక్తి... ఆయుధం విప్లవం... కనిపించని ఎర్రదనాన్ని అక్షరంలో కనిపింప చేసేదే విప్లవ సాహిత్యం....

ఇప్పటికే విప్లవ సాహిత్యం గురించి చాలా చెప్పేసుకున్నాం... మిగిలిన ముచ్చట్లు మళ్ళి వారం....

ఈ ముచ్చట్లు అరుణతార సంపాదకీయ సౌజన్యంతో.....
వచ్చే వారం మరికొన్ని సాహితీ ముచ్చట్లతో .....
 

12, జూన్ 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ముప్పది ఆరవ భాగం....!!

వారం వారం  సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్లలో క్రిందటి వారం ఆశు కవిత్వం గురించి కొంత వివరణతెలుసుకున్నాము... ఈ వారం తెలుగు సాహితీ పద్దతులలో మరొకటైన సినీ సాహిత్యం గురించి కొన్ని వివరణలు చూద్దాం...
అందరికి అత్యంత ఇష్టమైన సినిమాలో ముందుగా ఒకప్పుడు కథకు చక్కని ప్రాముఖ్యముండేది... కథలో పాత్రలకు తగినట్టుగా సంభాషణ, కథను నడిపిస్తూ సన్నివేశానికి తగినట్టుగా చక్కని అర్ధవంతమైన పాటలు, వినసొంపైన సంగీతం, ఇలా ఎన్నో సాహిత్యాల సమ్మిళితంగా చలన చిత్ర సాహిత్యం ఉండేది...
ప్రధానంగా సినీ కథా సాహిత్యం...
ఒకప్పుడు కథలో పాత్రలో లీనమయ్యే నటులు ఉండేవారు.. ఇప్పుడేమో అగ్ర నటులకు అనుగుణంగా కథను రాస్తున్నారు మన రచయతలు.. జానపద, పౌరాణిక, సాంఘిక నేపధ్యాలలో దేనిని తీసుకున్నా ఎంతో అర్ధవంతమైన ఇతివృత్తాలతో చక్కని సందేశాన్ని అందించేవారు... సకుటుంబంగా చూడటానికి, మానసికోల్లాసానికి దోహదపడేవి.... సిని సాహిత్యంలో నవలా సాహిత్యానికి కూడా పెద్ద పీటే వేశారు అప్పట్లో.. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నవలలు ప్రముఖ పాత్రను ధరించాయి పాత కొత్త సినిమాల మేలుకలయికలో...
ఇక సినీ మాటల సాహిత్యం....
ఒక సినిమాకు కథ ఎంత బలమైనదో దానికి అనుగుణమైనదే సినీ మాటల సాహిత్యం... కథ ఔచిత్యం తగ్గకుండా సంభాషణలను రక్తి కట్టించడం కూడా ఓ గొప్ప కళ... దీనిలో నిష్ట్నాతులు ఎందఱో ఉన్నారు మన తెలుగు సినీ సాహిత్యానికి.... అప్పట్లో గొల్లపూడి మారుతీ రావు గారు చక్కని మాటల సాహిత్యానికి తెర తీశారు.. ఆ నేపధ్యంలోనే పరుచూరి బ్రదర్స్ ఎన్నో విజయవంతమైన సినిమాలకు కథా, సంభాషణా సాహిత్యాన్ని తెలుగు తెరకు అందించారు... తరువాతి కాలంలో త్రివ్రిక్రమ్ మాటల పదును మన అందరికి తెలిసినదే... చాలా మంది ఇప్పుడు త్రివ్రిక్రమ్ బాటలోనే నడుస్తున్నారు.. తక్కువ మాటల్లో ఎక్కువ నైపుణ్యాన్ని పలికిస్తున్నారు...
తరువాత అతి ముఖ్యమైన సినీ పాటల / గేయ సాహిత్యం....
 పాత తరం పాటలు ఇప్పటికి జనం నోళ్ళలో నానుతున్నాయంటే అప్పటి పాటల సాహిత్యం ఎన్ని అద్భుతాలు అందించిందో మనకు తేట తెల్లమౌతోంది... ఏ పాటల పోటిలలో మనం చూసినా ఇప్పటి తరం పిల్లలు ఆనాటి పాటలను ఎంత గొప్పగా పాడుతున్నారో అర్ధం అవుతుంది... అది అప్పటి సాహిత్యానికి ఉన్న గొప్పదనం.. కథకు తగినట్టుగా, ఆ సన్నివేశానికి అనుగుణంగా పాటలను రాయగలగడం అంటే మాటలు కాదు... కొన్ని పాటలు వింటూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంత గొప్పగా ఎలా రాయగలిగారు అని... అది పౌరాణికమైనా, సాంఘికమైనా సన్నివేశానికి తగిన పాటలు రాయడం, వాటికి సంగీత బాణీలు కూర్చడం మామూలు విషయం కాదు.. ఏదో మనం ఓ మూడు గంటలు సినిమా చూసేసి వచ్చేస్తాం... కాని అందులో ఉన్న కథ, మాటలు, పాటలు మనకు చాలా కాలం గుర్తుండి పోయేలా చేయగలిగే సామర్ధ్యాన్ని కలిగిన సినీ సాహిత్యానికి నీరాజనాలు పలుకక తప్పదు... మన పాటల రచయితలల్లో ముఖ్యులు కొందరు

  1. నార్ల చిరంజీవి
  2. ఆచార్య ఆత్రేయ
  3. ఆరుద్ర
  4. అనిశెట్టి సుబ్బారావు
  5. రసరాజు
  6. కొసరాజు రాఘవయ్య చౌదరి
  7. సముద్రాల
  8. శ్రీశ్రీ
  9. మైలవరపు గోపి
  10. జాలాది రాజారావు
  11. మల్లాది రామక్రిష్ణశాస్త్రి
  12. దేవులపల్లి కృష్ణశాస్త్రి
  13. డా.సి.నారాయణ రెడ్డి
  14. డా. మల్లెమాల
  15. సిరివెన్నెల సీతారామశాస్త్రి
  16. వేటూరి సుందరరామ్మూర్తి
  17. దాశరథి
  18. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ
  19. సదాశివ బ్రహ్మం
  20. జ్యోతిర్మయి
  21. జంధ్యాల పాపయ్య శాస్త్రి
  22. దాసరి నారాయణ రావు
  23. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
  24. సామవేదం షణ్ముఖశర్మ
  25. చంద్రబోస్
  26. సుద్దాల అశోక్ తేజ
  27. కుల శేఖర్
  28. వెన్నెలకంటి
  29. రాజశ్రీ
  30. సాహితీ
  31. రామజోగయ్య శాస్త్రి
  32. జె.కె.భారవి
  33. భువనచంద్ర
  34. వనమాలి
  35. అనంత్ శ్రీరామ్
  36. భాస్కర్ భట్ల రవికుమార్
  37. వెన్నెల శామ్ ప్రకాష్
వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి ... అనువాదాల్లో నిష్ట్నాతులు కొందరు... ఇప్పటి తరంలో కూడా చాలా చక్కని సాహిత్యాన్ని అందిస్తున్న ఎందఱో కవులు / రచయితలు జాతీయ పురస్కారాలను అందుకోగలిగిన పాటలను అందిస్తున్న ఎందఱో మహానుభావులు ... అందరికి వందనాలు.... సినీ సాహిత్యం గురించి చెప్పాలంటే నాకున్న అనుభవము , నా వయసు సరిపోదు.. ఏదో నాకు తెలిసిన నాలుగు మాటలు తెలుగు సాహితీ ముచ్చట్లుగా మీ అందరి ముందుకు తేవడానికి నాకు చక్కని అవకాశాన్ని అందించిన సాహితీ సేవకు కృతజ్ఞతలు....
వచ్చే వారం మరో సాహితీ ముచ్చటతో మీ ముందుకు....

7, జూన్ 2015, ఆదివారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ముప్పది ఐదవ భాగం....!!

వారం వారం సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్ల ప్రయాణంలో క్రిందటి వారం అవధాన ప్రక్రియ గురించి కాస్త వివరణ చూసాము... ఈ వారం ఆశు కవిత్వం గురించి కొద్దిగా తెలుసుకుందాం...
అసలు ఆశు కవిత్వం అంటే ఏమిటో దాని పుట్టు పూర్వోత్తరాలు దానిలోని రకాలు మొదలైన వాటి గురించి చూద్దాం...
ఆశు కవిత్వం ...
చతుర్విధ కవితా భేదాలలో ఆశు కవిత ఒకటి. కవులు సాధారణంగా ఆలోచించి సావధానంగా కవిత్వం చెప్పుతారు. అలా కాకుండా కొందరు కవులు వచనంలో మాట్లాడినంత వేగంగా భావాలను చంధోనియమ బద్ధంగా పద్య రూపంలో వ్యక్తం చేస్తారు. ఇలాంటి దానినే ఆశు కవిత్వం అంటారు.

ఆశు కవిత్వం / పద్యం / చాటువు
అప్పటికప్పుడు ఇచ్చిన వస్తువు పై ఆశువుగా చెప్పే కవిత / పద్యం / చాటువు. ఇది దైవానుగ్రహముగా అలవడే లక్షణం... పూర్వజన్మ సుకృతంగా లభించే సరస్వతీ కటాక్షం... మన పూర్వ కవులలో చాలామంది చెప్పిన ఆశు పద్యాలు / చాటువులు ఎన్నో మన తెలుగు సాహిత్యంలో లభిస్తున్నాయి... తెనాలి రామలింగని చతురత మన అందరికి తెలిసిన మేక తోక పద్యం, శ్రీనాధుని తిరిపెమునకిద్దరాండ్రా గంగను విడుము పార్వతి చాలున్ అంటూ శివునికి వేసిన చురక... ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఆశు పద్యాలు / చాటువులు మనకు మన తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయి... ఆధునిక యుగంలో పద్యాల / చాటువుల స్థానంలో వచ్చిన కవిత్వంలో వచనంలో చెప్పినా కవితా పద్య రూపంలో చెప్పినా ఆశువుగా చెప్పిన ఎన్నో కవితలు ఈనాడు మనకు లభిస్తున్నాయి...
ఇక రెండవదైన సమస్యా పూరణంలో కొన్ని విశేషాలు కూడా చూద్దాం...
అష్టావధానం లో సమస్యా పూరణం ఒకటి....

చరిత్ర

సమస్యాపూరణం అనేది రాయల కాలంలోనే మనకి కనిపిస్తుంది.అంటే సుమారు 500 ఏళ్ళ ముందు ప్రక్రియ.అంతకు ముందు ఏమైనా ఉన్నా పరిశోధకుల దృష్టిలో ఆ సమయం నుంచే ప్రాచుర్యములోనికి వచ్చినట్లుగా చెప్తారు.అసలు పద్యం ఛందస్సుకి లోబడి కావలసిన భావంతో వ్రాయడం ఎంత కష్టమైన ప్రక్రియో!. సరళమైన పదాలతో కవితలు వ్రాయడం కంటే కొన్నిరెట్లు కష్టమైన పని. అలాంటిది ఒక పాదం ఇచ్చి(సాధారణంగా నాలుగవపాదం ) మిగిలిన పాదాలు పూరించమనడం మరీ కష్టం. గమ్మత్తైన విషయమేమిటంటే ఈ పాదం మామూలు భావంలా ఉండక ఒక సమస్యతో ఉంటుంది. ఈ పాదం అర్ధరహితం గానో, లేక అసంబద్దార్ధముగానో, అన్వయ రహితంగానో ఉంటుంది. చమత్కారంతో పూరించడం లోనే కవికి ఉన్న పాండిత్యం తెలుస్తుంది. ఈ సమస్యాపూరణం అవధానం అనే ప్రక్రియలో చాలా ముఖ్యమైనది. అష్టావధానంలో వర్ణనము, దత్తపది, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం (ప్రశంస) ఘంటానాదం, సమస్యా పూరణము ఈ ఎనిమిది ప్రక్రియలని ఏక కాలంలో చేయగలగడం. ప్రశ్నలడుగు వారిని పృచ్చకులు అంటారు.సమాధానం చెప్పే పండితుని ‘అవధాని’ అంటారు.[1]

లక్షణములు

  • సమస్యా పూరణం అనేది తెలుగు సాహితీ ప్రియులకు, అందునా అవధాన ప్రియులకు, అంత్యంత ప్రీతికరమైన ప్రక్రియ.
  • అవధానికి పృచ్ఛకుడు ఒక పాదాన్ని (పద్యంలో ఒక లైను) ఇస్తాడు. అవధాని ఆపాదాన్ని అలాగే ఉంచి తన కల్పనా చమత్కృతితో మిగతా మూడు పాదాలను జోడించి పూర్తి పద్యం చెప్పవలసి ఉంటుంది.
  • ఈ సమస్యా పూరణం చాలా చమత్కారం గాను, ఆశ్చర్యంగాను ఉంటుంది. ఏమాత్రం సంబంధం లేని సంగతిని ఒక పాదంలో ఇరికించి సవాలుగా ఇస్తే, దానికి చాలా అర్ధవంతమైన సమాధానాన్ని అవధాని ఇవ్వవలసి ఉంటుంది. అందుకే దీనిని సమస్యా పూరణం అన్నారు కాబోలు.
  • సమస్యా పూరణం ప్రక్రియ సంస్కృతం నుంచి తెలుగులోనికి వచ్చినది. కవి, పండితుల సామర్థ్యాన్ని పరీక్షించడం లో సమస్యాపూరణాన్ని కూడా ఒక భాగంగా వాడుతారు.

ఉదాహరణ 1

సమస్య:“గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్”
పూరణ:
ఉండ్రాని యడవి లోపల
గుండ్రాయైయున్న మౌనికోమలిపై, గో
దండ్రాము పదము సోకిన
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్
భావం: ఉండరాని అడవిలో గుండ్రాయి గా పడి ఉన్న ముని (గౌతముడు) పత్ని (అహల్య) పై కోదండరాముని పాదము తగిలి ఆగుండ్రాయి తిరిగి అహల్య గా మారి నడుచుకుంటూ వెళ్లి పోయింది అని అవధాని గారు సమస్య పాదాన్ని రామాయణం లో అహల్యా వృత్తాంతానికి జోడించి చెప్పారు.

ఉదాహరణ 2

భువనవిజయ సభలో రాయలవారు ఇచ్చిన సమస్య : “రవి గాననిచో కవి గాంచునే కదా” అని ఈ సమస్య సాధారణంగానే కనిపిస్తుంది. రవి చూడని చోటు కవి చూడగలడు అని.అయితే భట్టు మూర్తి ఈ విధంగా పూరించినట్లుగా చరిత్ర చెప్తోంది మనకు.
ఆరవి వీరభద్రుని పదాహతి డుల్లిన బోసినోటికిన్
నేరడు, రామకృష్ణ కవి నేరేచెబో మన ముక్కుతిమ్మరా
ట్క్రూర పదాహతిమ్బడిన కొక్కిరి పంటికి దుప్పి కొమ్ము ప
ల్గారచియింప, నౌర! రవి గాననిచో కవి గాంచునే కదా!
పూర్వం శివరాత్రి జాగరణల్లోను, శ్రీరామ నవమి పందిళ్ళ లోను సమస్యా పూరణం ఒక సత్కాలక్షేపం గా ఉండేది.
ఇలా చెప్పుకుంటూ ఉంటే మన తెలుగు సాహిత్యంలో ఎన్నో సొగసులు, ఒంపుల నుడికారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి... వచ్చే వారం మరికొన్ని వివరణలు చూద్దాం...

సేకరణ : వికీపీడియా సహకారంతో ... 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

29, మే 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ముప్పది నాలుగవ భాగం....!!

వారం వారం సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్లలో క్రిందటి వారం నవలా సాహిత్య ప్రక్రియ గురించి కాస్త తెలుసుకున్నాం... ఈ వారం అవధానాల గురించిన వివరణ చూద్దాం...
అవధానం అనేది తెలుగు సాహిత్యం లో ఒక విశిష్ట ప్రక్రియ. సంస్కృతం, తెలుగు కాకుండా వేరే ఏ భాష లోనూ ఈ ప్రక్రియ ఉన్నట్లు కనపడదు. క్లిష్టమైన సాహితీ సమస్యలను అలవోకగా పరిష్కరిస్తూ, చమత్కార పూరణలను అవలీలగా పూరిస్తూ, అసంబధ్ధ, అసందర్భ ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కొంటూ, ఆశువుగా పద్యాలు చెప్తూ - వీటన్నిటినీ ఏక కాలంలో - అవధాని చేసే సాహితీ విన్యాసమే అవధానం.

అవధానం స్వరూపం

కవి యొక్క ఆశుకవిత్వ గరిమకు, సాహితీ పటిమకు, ధారణా శక్తి (గుర్తుంచుకోగల శక్తి, memorising ability)కి పాండితీ ప్రకర్షకు అవధానం అత్యున్నత పరీక్ష. సాంప్రదాయికంగా జరిగే అష్టావధానం లో 8 మంది పృఛ్ఛకులు (ప్రశ్నలు అడిగే వారు) అవధాని చుట్టూ చేరి వివిధ రకాలైన ప్రశ్నలు (పాండిత్యాన్ని పరీక్షించేవి కొన్ని, అవధాని సహనాన్ని పరీక్షించేవి మరి కొన్ని) అడుగుతూ ఉంటారు. పృఛ్ఛకులు కూడా పాండిత్య పరంగా ఉద్దండులైన వారే ఉంటారు.
ఎందరో కవి పండితులు అవధాన ప్రక్రియను జయప్రదంగా చేసి పండితుల మన్ననలను పొందారు. అవధానం విజయవంతంగా చేసిన వారిని అవధాని అని అంటారు. ఏక కాలంలో తెలుగు, సంస్కృతం - రెండు భాషల లోనూ అవధానం చేసిన పండితులు ఉన్నారు. అవధానాలు చాలా రకాలు. ముఖ్యంగా అవధానాలను వేదసంబంధ, సాహిత్య, సాహిత్యేతర అవధానాలుగా వర్గీకరించవచ్చు.
  • సాహిత్య అవధానాలు: అష్టావధానం, శతావధానం, సహస్రావధానం... ఇలా 20దాకా ఉన్నాయి.
  • సాహిత్యేతర అవధానాలు: శతకలశావధానం, శభ్దావధానం, రామాయణ, భగవద్గీత అవధానాలు. ఇవి ధారణ సంబంధమైనవి. అంటే ఒక్కసారి చదివి లేదా విని గుర్తుంచుకోవడం ద్వారా మళ్లీ చెప్పేవి.
సంగీత నవావధానం ..ఈప్రక్రియను ప్రారంభించిన వారు మీగడ రామలింగస్వామి. ఎనమిది మంది పృఛ్ఛకులకు ,ఇరవై పద్యాలను పన్నెండు రాగాలను ఇస్తారు. వాటిలో నుండి పద్యాలు తాము కోరుకున్న రాగాలలో గానం చేయమని అడగవచ్చు. ఉదాహరణకు పాండవోద్యోగమ లో బహుళ ప్రచారం లో ఉన్న పద్యం 'జెండాపై కపిరాజు ' ఇంతవరకు పాడిన నట గాయకులందరూ దీన్ని మోహన రాగం లోనే పాడగా మనం విన్నాము. పరస్పర విరుద్ధమైన లక్షణాలు ఉన్న శివరంజని లేక ముల్తాన్ రాగాలలో పాడమని పృఛ్ఛకులు అడిగితే అవధాని ఆ రాగం లో పద్యభావం చెడకుండా పాడాలి. పృచ్చకులు దాదాపుగా పద్యాలను రాగయుక్తంగా పాడగలవారై ఉంటారు. అందువల్ల ఒక్కొక్క పద్యాన్ని పరస్పర విరుద్ధమైన ఛాయలున్న రాగాలలో వినగలుగుతాం.

అష్టావధానము

ఇందు ఎనిమిది ప్రక్రియలు ఒకేసారి చెయ్యవలెను, కనీస సమయము నాలుగు గంటలు. ఆ ఎనిమిది ప్రక్రియలు
  1. కావ్య పాఠము
  2. కవిత్వము
  3. శాస్త్రార్థము
  4. ఆకాశపురాణము
  5. లోకాభిరామాయణము
  6. వ్యస్తాక్షరి (లేదా) న్యస్తాక్షరి
  7. చదరంగము
  8. పుష్ప గణనము
ఇవే కాకుండా కొంతమంది సమస్యాపూరణం, దత్తపది, వర్ణన, ఆశువు, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగం, వివర్గాక్షరి, నిర్దిష్టాక్షరి, ఘంటా గణనం, పురాణ పఠనం, సహ పఠనం, కావ్యోక్తి, ఇచ్ఛాంక శ్లోకం మొదలగు వాటిలో ఎనిమిది ప్రక్రియలు ఎన్నుకుంటారు. చివరలో "ధారణ" తో అవధానం ముగుస్తుంది. ధారణ అనగా అన్ని పద్యాలను అవధాని చివరలో చెప్పవలసి ఉంటుంది.
అష్టావధానములో ఇవ్వబడిన ఎనిమిది అంశాలలో స్వల్ప తేడాలుంటాయి. వాటిని - వాటి వివరణను గమనించండీ.
1.నిషిద్ధాక్షరి
వృచ్ఛకుడు ఒక విషయాన్ని గురించి ఫలాన చందస్సులో ఒక పద్యం చెప్పవలసినదిగా అవధాని గారిని కోరతాడు. అవధానిగారు ఆ విషయం మీడ ఒక చందస్సులో ఒక పద్యం మెదలెడతాడు ఒక పదంతో. అప్పుడు వృచ్ఛకుడు అవధాని చెప్పిన పదాన్ని బట్టి తరువాత ఏ అక్షరం రాగలదో ముందుగుగానే వూహించి ఆ అక్షరం మీద సిషేదం విధిస్తాడు. అనగా ఆ అక్షరం ఉపయోగించ కూడదని. అవధాని గారు ఆ అక్షరాన్ని వదలి వేరే అక్షరం తో పద్యాన్ని కొనసాగిస్తాడు. ఈ విధంగా ఆ పద్యం పూర్తయ్యే లోపు అనేక సార్లు నిషిద్దాక్షరాన్ని ప్రయోగిస్తాడు వృచ్ఛకుడు. అవదాని గారు పద్యభావం చేడకుండా నిషిద్దాక్షరిని వాడకుండా.... పద్యాన్ని పూర్తి చేస్తాడు. పూర్తి చేయడమంటే ఒకేసారి పూర్తి చేయడం కాదు. అవధానం పూర్తయ్యేలోపు పూరించాలి. అవధాని గారు ఆ పద్యంలో రెండు మూడు పదాలు చెప్పగానే మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు. ఇంత వరకు చెప్పిన పద్య భాగాన్ని అలాగే మనసులో ముద్రించుకొని ఇచ్చిన మరో అంశానికి వెళతారు అవదాని. ఈ అవధాన ప్రక్రియ సంస్కృతంలోను మరియు తెలుగులో మాత్రమే వునటు తెలుస్తుంది. ఇది తెలుగు భాషకు మహా భూషణము
నిషిద్ధాక్షరి విభాగంలో అవధానిని - శ, ష, స, హ - లను ఉపయోగించకుండా శివుని పై ఒక పద్యాన్ని చెప్పమనగా అవధాని గారు ఇలా చెప్పారు.
డమరుకమును మ్రోగించుచు నమరించెను మానవులకు ' అఆ ' మాలన్ కమనీయముగా వ్రాయగ నుమతోడుగ నున్న వాని నుద్ధతి గొలుతున్.
2. న్యస్తాక్షరి
వృచ్ఛకుడు ఒక విషయాన్ని గురించి ఫలాన చందస్సులో ఒక పద్యం చెప్పమని అవధానిని అడుగుతూ పద్యంలోని నాలుగు పాదాలలో ఫలాన స్తానంలో పలాన అక్షరం మాత్రమే వుండాలి అని నాలుగు అక్షరాలను నిర్దేశిస్తాడు. అవధాని గారు వృచ్ఛకుడు చెప్పిన అక్షరాలను ఉపయోగించి పద్యాన్ని పూరిస్తారు. ఆ పద్యాన్ని ఒక్కసారే చెప్పడానికి వీలు లేదు. పద్య పూరణ కొంత అవగానే మరొక వృచ్చకుడు మరో సమస్యనిస్తాడు. అవధాని గారు అప్పటి వరకు చెప్పిన పద్య భాగాన్ని గుర్తుంచుకొని మరో సమస్య మీదికి మనసును కేంద్రీక రించాలి.
3.దత్తపది
ఇది న్యస్తాక్షరి లాంటిదే. కాక పోతే అక్కడ ఒక పాదానికి ఒక అక్షరాన్నిస్తారు. ఇందులో ఒక్క పాదానికి ఒక్కొక్క పదాన్నిస్తారు. ఆ పదాలు కూడ ఒక దానికి ఒకటి పొంతన లేకుండా వుంటాయి. ఉదాహరణ గా చెప్పాలంటే. వంకాయ, అమెరికా, రాముడు, గాందీతా. ఒక్కొక్క పాదంలో ఒక పదాన్ని వుంచి ఫలాన చందస్సులో, ఫలాన విషయంపై ఒక పద్యం చెప్పమని వృచ్ఛకుడు ప్రశ్నను సందిస్తాడు. అవదానిగారు ఆయా పదాలను పయోగించి అర్థవంతమైన పద్యాన్ని చెప్పడానికి ప్రయత్నించి నాలుగు పదాలు చెప్పగానే మరొక వృచ్ఛకుడు మరో సమస్యతో అడ్డగిస్తాడు. అవదాని గారు అంతవరకు చెప్పిన పద్య భాగాని అలాగె గుర్తు పెట్టుకుని మరో సమస్యలోకి దిగాలి.
4.సమస్యా పూరణం.
వృచ్ఛకుడు లోక విరుద్ధంగా వున్న విషయాన్ని సమస్యగా చేసి ఒక పద్య పాదాన్ని ఇస్తాడు. అవదాని గారు తనకిచ్చిన పద్య పాదంలోని లోక విరుద్ధమైన భావాన్ని విరిచి లోకామోదమైన భావంతో పద్యాన్ని పూరించాలి. ఉదాహరణకు: కప్పను చూడంగ పాము గజగజ లాడెన్. ఈ పద్య పాదంలోని అర్థం లోక విరుద్ధము. అదే అర్థంతో పద్యాన్ని ఎవరైనా చెప్పగలరు. అందులోని అర్థాన్ని సజావుగా మార్చి పద్యం చెప్పాలి. అవధాని గారు ఈ సమస్యను స్వీకరించి మొదటి పద్య పాదంలో కొంత భాగము చెప్పగానే ...... అతని ధారణకు ఆంతరాయాన్ని కలిగిస్తూ మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు.
5. వర్ణన
వృచ్ఛకుడు ఏదో ఒక చందస్సులో, ఏదో ఒక విషయాన్ని వర్ణిస్తూ ఒక పద్యం చెప్పమంటాడు. అవధానిగారు ఆ నిర్థిష్టమైన చందస్సులో ఆ విషయమై వర్ణనాత్మకమైన పద్యం చెప్పాలి.
6. ఆశువు
వృచ్ఛకుడు ఒక విషయాన్నిచ్చి అడిగిందే తడవుగా , ఆలోచించుకోకుండా వెంటనే ఆసువుగా చందోభద్దమైన పద్యాన్ని ఆ విషయాన్ని గురించి చెప్పాలి అవధాని గారు.
7.పురాణ పఠనం:
వృచ్ఛకుడు పురాణం, ఇతిహాసం, ప్రబందం, కావ్యం ఇలాంటి గ్రంధాలలో ఒక ప్రథాన ఘట్టాలలో నుండి ఏదైనా ఒకటి రెండు పద్యాలను చదివి వినిపిస్తాడు అవధానిగారికి. అవధానిగారు ఆ పద్యాలను విని ..... ఆ పద్యాలు ఏ గ్రంథంలోనివి, ఆ గ్రంథ కర్త ఎవరు? ఆ సందర్బమేది వంటి విషయాలు.... పురాణ పక్కీలో చెప్పాలి... అవధాని గారు ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తుండగా....... మరో వృచ్ఛకుడు మరో ప్రశ్న సందిస్తాడు. అవదానిగారు అతన్ని 'కొంత సేపు ఆగు ' అని అనకుండా అతని ప్రశ్న వినడానికి సిద్ధ పడాలి.
8.అప్రస్తుత ప్రసంగం:
పైన చెప్పిన సమస్యలు అవధాని గారి జ్ఞాపక శక్తికి, అతని ధారణా శక్తిని పరీక్షించేవి. ఆ యా విషయాల గురించి తీవ్రంగా అలోచిస్తూ వుండగా ఈ వృచ్ఛకుడు ప్రస్తుత విషయానికి పూర్తిగా విరుద్ధమైన విషయాన్ని గురించి ఒక కొంటె ప్రశ్న సందిస్త్గాడు. ఉదాహరణకు...... అవధానిగారూ..... నిన్న ఇదే సమయానికి మీరెక్కడున్నారు..... ఏమి చేస్తున్నారు చెప్పండి అంటాడు. దానికి సమాధానంగా అవధానిగారు మామూలుగా అడిగిన దానికి సమాధానము చెప్పడము కాదు... ఆ కొంటె ప్రశ్నకి సమాధానం మరింత కొంటెగా సభాసధులందరూ ఆహా అని మెచ్చుకునే టట్లు సమాధానం చెప్పాలి.
వివరాలు
1.ఇప్పటి వరకు ఒక ఆవృతం మాత్రమే పూర్తయింది. ఏ ఒక్కరికీ పూర్తి సమాధానం ఇవ్వకనే మరో వృచ్ఛకుడు అడ్డు తగిలాడు. ఈ సారి రెండో ఆవృతంలో (రెండో రౌండు) తిరిగి మొదటి వృచ్ఛకుడు నాప్రశ్నకు సమాదానమేది అని ప్రశ్నిస్తాడు. అతనడిగిన ప్రశ్నేమిటో ఎంతవరకు సమాదాన మిచ్చాడో గుర్తు పెట్టుకొని ఆ పద్యంలో రెండో పాదం చెప్పాలి. మొదటి వృచ్చకునికొ సమాధానం పూర్తి కాక ముందే రెండో వృచ్చకుడు నాసంగతేమిటని అడుగుతాడు. అతనికి ఇంతకు ముందు ఎంతవరకు సమాధానము చేప్పారో గుర్తు పెట్టుకొని మిగతా సమాదాన భాగాన్ని పూరిచి చెప్పాలి. ఇంతలో మూడో వృచ్చకుడు.... ఇల ఒకరి తర్వాత మరొకరు తాము ఇదివరకు సంధించిన ప్రశ్నలు చెప్పకుండా తమకు రావలసిన సమాధానలను గురించే అడుగుతారు. అవధానిగారు ....... మీకు ఎంత వరకు సమాదానము చెప్పాను? అని అడగ కుండా ఆ విషయాన్ని మనసులోనే వూహించుకుని తరువాతి పద్య పాదాన్ని పూరించి సమాధానము చెప్పాలి. ఆ విధంగా నాలుగో రౌండులో మాత్రమే ప్రతి వృచ్ఛకునికి పూర్తి సమాదానము వస్తుంది. అవధానులెవరైనా వృచ్చకులు అడిగిన ప్రశ్నలకు చంధోబద్దమైన పద్యాలతో సమాధానము చెప్పడమే కాదు ఆ సమాధానాలు అత్యంత రసవత్తరంగా, మనోజ్ఞంగా. సాధారణ ప్రేక్షకుల సైతం ఆకట్టు కునే విధంగా వుటాయి. అందులోనే అవధాని గారి గొప్పతనం, ప్రజ్ఞా వుంటాయి.
ఆ విధంగా అన్ని నియమాలతో పద్యాలు చెప్పడం ఒక్ ఎత్తైతే నాలుగు రౌండ్లు పూర్తవగానే ఆ పద్యాలన్నిటినీ ధారణ చేసి అదే క్రమంలో ఏక ధాటిగా వాటిని అపొపగించడం మరో ఎత్తు. ఇదే ఈ అవధాన కార్య క్రమంలో గొప్పవిషయం. అలా అష్టావధాన కార్య క్రమం చాల కోలాహలంగా ఆనంద భరితంగా ముగుస్తుంది.
3 సమస్యా పూరణం అన్న పై విషయంలో కప్పను జూడంగ పాము గజగజ లాడేన్. ఇది అసమజమైనది. (అనగా కప్పను చూడగా పాము గజగజ లాడి భయపడు. ఆ ఆర్థాన్ని మార్పు చేసూ అక్షరాలను ఏమాత్రము మార్చకుండా పూరించాలి) అనే పద్య పాదాన్ని పూర్వం ఒక సమస్యగా ఇచ్చారు ఒక అవధాని గారికి. దానికి అవధానిగారు పూరించిన సమాదానము పూర్తి పద్యం లోని భావం చూడండి. వెంకప్ప అనే రైతు తన పొలంవద్ద నున్న కుప్పలకు కావలికై వెళుతూ ఒక కర్రను, కిర్రు చెప్పులును ధరించి వెళుతుంటే అతన్ని చూసి అనగా వెంకప్పను జూడంగ పాము గజగజ లాడెన్. ఈ పూరణ ఎంత అద్భుతంగా వుందో.......
4.పువ్వులు విసురుట: అవధాన కార్యక్రమము జరుగుతుండగా ఒకరు అవదాని పైకి అప్పుడప్పుడు ఒక్క పువ్వును విసురు తాడు. అవధానం పూర్తి కాగానే తనపైకి ఎన్ని పువ్వులు విసిరారో గుర్తు పెట్టుకొని ఖచ్చితమైన సమాధానం చెప్పాలి అవధాని గారు.
6. గంటలు కొట్టుట. అవధానం జరుగుతున్నప్పుడు ఒకరు గంట కొడుతుంటాడు. అవధానం పూర్తవగానె., అతను ఎన్ని గంటలు కొట్టాడొ గుర్తు పెట్టుకొని అవధాని గారు చెప్పాలి. పువ్వులు విసరటం , గంటలు కొట్టటం అనే రెండు అంశాలు రెండు వుండవు. ఈ రెంటి వుద్దేశం ఒక్కటే గాన ఏదో ఒక్కటే వుంటుంది. అది కూడ పైన చెప్పిన ఎనిమిది అంశాలలో ఒకదాని బదులుగా ఈ రెంటిలో ఒక్క దాన్ని వుంచు తారు. ఎలాదైనా ఎనిమిది అంశాలుండాలి అది ని భందన.

శతావధానము

వంద మంది పృచ్ఛకులను ఎదుర్కొని చేసే అవధానాన్ని శతావధానం అంటారు. సాధారణంగా శతావధానంలో సమస్య, దత్తాక్షరి, వర్ణన, అప్రస్తుత ప్రసంగం అంశాలు ఉంటాయి.

సహస్రావధానము

ద్వి సహస్రావధానము

త్రి సహస్రావధానము

నాట్యావధానము

గణితావధానము

ఘంటావధానము

నేత్రావధానము, అంగుష్టావధానము, అక్షరముష్టికావధానం

ఇందులో ఇద్దరు అవధానులు ఎదురెదురుగా కూర్చుని ఉంటారు. పృచ్ఛకులు మొదటి అవధానికి ఒక కాగితంపై విషయం వ్రాసి ఇస్తారు. అతడు దానిని చదివి రెండవ అవధానికి తన కనుసైగల ద్వారా చెప్పాలి. దాన్ని ఆయన అర్థం చేసుకుని బయటకు చదవాలి. ఇలా చేయడానికి ఆ జంట తెలుగులో ప్రతి అక్షరానికి ఒక్కో గుర్తును పెట్టుకుంటారు. తిరుపతి వేంకట కవులు, కొప్పరపు కవులు ఈ నేత్రావధానంలో సిద్దహస్తులు.
కళ్లతో కాకుండా బొటనవేలితో భావాలను చెప్పితే అది అంగుష్టావధానం, పిడికిలితో చేస్తే అక్షరముష్టికావధానం. ఇంకా పుష్పావధానం, ఖడ్గావధానం, గమనావధానం... లాంటివి 13దాకా ఉన్నాయి. వీటిని సాంకేతిక అవధానాలు అంటారు.
ఇలాంటి అవధానాలను చేయడానికి జంట అవధానులు తప్పనిసరి. అది ఆ ఇద్దరికి మాత్రమే సాధ్యమవుతుంది. వారిలో ఎవరు లేకపోయినా రెండోవారు మరొకరితో కలసి చేయలేరు.

అష్టావధానం లోని ప్రక్రియలు

పుష్ప గణనము

పుష్ప గణనము అనగా అవధానికి తగిలేలా అప్పుడప్పుడు పుష్పాలు విసురుతుంటారు. ఆయన ఆ పూల సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్ని పూలు విసిరారో చివరలో చెప్పాల్సి ఉంటుంది.

ఆశువు

ఆశువు లేదా ఆశుకవిత్వం. ఇది ప్రజలను విశేషంగా ఆకర్షించే ప్రక్రియ. అగ్గిపుల్ల నుంచి అంతరిక్షం దాకా దేని మీదనైనా ఆశువు గా పద్యమో దండకమో చెప్పమంటారు పృచ్ఛకులు. అవధాని చతురత, ధార ఇక్కడ ప్రదర్శించాల్సి ఉంటుంది.

నిషిద్ధాక్షరి

నిషిద్ధాక్షరి అంటే పృచ్ఛకుడు ముందుగానే ఏయే అక్షరాలు నిషిద్ధమో నిర్దేశిస్తాడు. ఉదాహరణకు, మేడసాని మోహన్ ను ఒకసారి క, చ, ట, త, ప అనే అక్షరాలు లేకుండా సీతాకల్యాణం గురించి చెప్పమన్నారు. ఆయన ఈ విధంగా చెప్పాడు.
సరసనిధిరామభద్రుడు
ధరణిజ ఎదలోన మధుర ధారణుడయ్యెన్
సురలెల్ల హర్షమందిరి
విరాజమాన సువిలాస విభవ మెసగిన్

నిర్దిష్టాక్షరి

నిర్దిష్టాక్షరి అనగా నిర్దేశించబడిన అక్షరాలు గలదని అర్థం. దీనిలో 32 గళ్లుంటాయి. పృచ్ఛకుడు బేసి స్థానాల్లో గానీ, సరి స్థానాల్లో గాని ఇష్టానుసారం అక్షరాలను వ్రాసి ఇస్తాడు. అవధాని మిగిలిన ఖాళీలను పూరించి కోరిన దేవతా స్తుతిని పూర్తి చేస్తాడు.

ఘంటా గణనం

ఘంటా గణనం అనగా అప్పుడప్పుడు గంట కొడుతుంటారు. అవధాని ఆ సంఖ్యను లెక్కించి మొత్తం ఎన్ని గంటలు కొట్టారో చివరలో చెప్పాల్సి ఉంటుంది.

అప్రస్తుత ప్రసంగం

అవధాని ఏకాగ్రతను చెడగొట్టడానికి అప్రస్తుత ప్రసంగి (పృచ్ఛకులలో ఒకరు) చేయని ప్రయత్నం ఉండదు. ఉదాహరణకు ఒక సభలో ఒకాయన "అవధాని గారూ, భర్త భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తోంది. భర్త పశువ అన్నాడు. భార్య కోతి అంది. వారి మాటల్లో ఆంతర్యమేమిటి" అని అడిగారు. దానికి అవధాని... "ళ్లెం నిండా శుభ్రంగా డ్డించవే" అని భర్త అంటే "కోరినంత తినండి" అని భార్య జవాబిచ్చింది అని చెప్పాడు. "హనుమంతుని తోక పెద్దదా-ద్రౌపది కోక పెద్దదా" వంటివి మరికొన్ని ఉదాహరణలు. అవధాని, అప్రస్తుత ప్రసంగి విసిరే ఛలోక్తులూ చెణుకులకు తడుముకోకుండా చెప్పగలిగితేనే సభ శోభిస్తుంది. ఎందుకంటే, పద్యాలూ ఛందస్సుల గురించి తెలియని వారిని ఆకట్టుకునేది ఈ అప్రస్తుత ప్రసంగమే.
శతావధాన సహస్రావధానాలలో సాధారణంగా ఉండే అంశాలలో కొన్ని....1. సమస్యాపూరణం 2.దత్త పది 3.వర్ణన 4.ఆశువు 5.నిషిద్ధాక్షరి 6.నిర్దిష్టాక్షరి 7.వ్యస్తాక్షరి 8.న్యస్తాక్షరి 9.చందోభాషణం 10.పురాణ పఠనం 11.శాస్త్రార్థము 12.ఏకసంథా గ్రహ్ణం 13.వివ్ర్గాక్షరి 14.అనువాదం 15.చిత్రాక్షరి 16.అక్షర విన్యాసం 17.స్వీయ కవితా గానం 18.వార గణనం 19.పంచాంగ గణనం 20.పుష్ప గణనం 21.ఘంటా గణనం 22.అప్రస్తుత ప్రసంగం 23.కావ్యానుకరణం 24.సంగీతం 25.మీ ప్రశ్నకు నా పాట మొదలగునవి.

కొందరు అవధానులు

ఆధునిక కాలంలో

  • డాక్టర్ గరికిపాటి నరసింహారావు . వేయి మంది పృచ్ఛకులతో అవధానం చేసి మహా సహస్రావధాని అనీ, ముందు చెప్పిన వేలాది పద్యాలు క్రమంలో మళ్ళీ చెప్పి ధారణా బ్రహ్మ రాక్షసుడు అనీ బిరుదులు పొందాడు.
  • దూపాటి సంపత్కుమారాచార్య 1932 మే 18 న ఓరుగల్లు పట్టణంలో జన్మించారు. వీరి తల్లి ప్రఖ్యాతి గాంచిన కవయిత్రి శ్రీమతి శేషమ్మ గారు. తండ్రి శేషాచార్యులు గారు. వీరు ప్రాథమిక విద్యను వరంగల్లు లోను, మచిలీపట్నం లోను పూర్తి చేసి, ఎస్.ఎస్.ఎల్.సి ని మాత్రం పాలకొల్లు లో పూర్తి చేశారు. ఆ తర్వాత 1962 లో హన్మకొండ లో బి.ఏడ్. శిక్షణను పూర్తి చేశారు. వీరు 1965 వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి ప్రవేటుగా చచివి తెలుగులో ఎం.ఏ పట్టాను పొందారు. ద్విశతావధానిగా ప్రఖ్యాతి వహించిన రాళ్ళబండి కవితా ప్రసాద్ గారి వద్ద సంపత్కుమారు గారు అవధానము చేయుటలో వున్న మెళుకువలు, రహస్యాలను నేర్చుకున్నారు. వీరు రెండు వందలకు పైగా అష్టావధానాలు చేసిన ప్రముఖులు.
  • డాక్టర్ మేడసాని కృష్ణమోహన్. (జననం ఏప్రిల్ 19, 1954) అష్టావధానాలు, శతావధానాలు, ఒక సహస్రావధానం చేశాడు. ఇటీవలే పంచసహస్రావధానం నిర్వహించి సాహితీ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని సాక్షాత్కరింపచేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ గా సేవలందిస్తున్నాడు.
  • కడిమెళ్ల వరప్రసాద్. పలు అష్టావధానాలు, శతావధానాలే కాక అవధాన ప్రక్రియలో శిష్యుడు కోట లక్ష్మీనరసింహంతో కలిసి జంట సహస్రావధానం కూడా నిర్వహించారు. అవధానులుగా రాణిస్తున్న కోట లక్ష్మీనరసింహం, వద్దిపత్తి పద్మాకర్ లకు అవధాన ప్రక్రియ నేర్పి తీర్చిదిద్ది "గురు సహస్రావధాని"గా పేరొందారు.
  • అష్టకల నరసింహరామ శర్మ. అవధాన ప్రక్రియపై విశేష పరిశోధన జరిపాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. 150పైగా అవధానాలు చేశాడు .
  • డాక్టర్ ఆర్.గణేష్ 17పైగా భాషలలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. 8 భాషలలో 500పైగా అవధానాలు చేశాడు.
  • రాంభట్ల పార్వతీశ్వర శర్మ బాల కవి, 20 ఏళ్ళ వయసులో 12 అష్టావధానాలు చేశాడు. "శ్రీ రాంభట్ల వేంకటీయము" అనే లఘు పద్యకావ్యం వ్రాసాడు. చదివింది బియస్సీ మైక్రో బయాలజీ... చదువుతూ ఉన్నది ఎమ్మే తెలుగు, ఆంధ్ర విశ్వకళా పరిషత్.
  • నరాల రామారెడ్డి వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన వీరు ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ గా పదవీ విరమణ చేశారు. అష్ఠావధాని. అనేక అవధానాలు చేశారు. చమత్కారం వీరి ప్రత్యేకత. అమెరికాలో అవధానాలు చేసి మన్ననలు పొందారు.
==పంచసహస్రావధానులు== 
జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి , మేడసాని మోహన్
==ద్విసహస్రావధానులు ==
మాడుగుల నాగఫణి శర్మ.
==సహస్రావధానులు== 
మేడసాని మోహన్ , మాడుగుల నాగఫణి శర్మ , వద్దిపర్తి ప్రభాకర్ , గరికపాటి నరసింహారావు.
== పంచశతావధానులు== 
మాడుగుల నాగఫణి శర్మ.
==ద్విశతావధానులు ==
రాళ్ళబండి కవితా ప్రసాద్ , కడిమిళ్ళ వరప్రసాద్ , గరికపాటి నరసింహారావు , మాడుగుల నాగఫణి శర్మ.
== --శతావధానులు 
==
చెఱువు సత్యనారాయణ శాస్త్రి ,సి.వి.సుబ్బన్న , నరాల రామారెడ్డి , గండ్లూరి దత్తాత్రేయ శర్మ ,బూరాడి గున్నేశ్వర శాస్త్రి , మేడసాని మోహన్ , గరికపాటి నరసింహారావు , రాళ్ళబండి కవితా ప్రసాద్, మాడుగుల నాగఫణి శర్మ , వద్దిపర్తి పద్మాకర్ , పల్నాటి సోదర కవులు, చల్లా పిచ్చయ్య శాస్త్రి , అబ్బిరెడ్డి పేరయ్య నాయుడు, దోర్భల ప్రభాకర శర్మ]] , దోకూరి కోట్ల బాల బ్రహ్మచారి , జాను దుర్గా మల్లికార్జున రావు ,కొండపి మురళీ కృష్ణ , గౌరీభట్ల వెంకటరామ శర్మ ,శ్రీ రామ నరసింహమూర్తి కవులు , కడిమిళ్ళ వరప్రసాద్, సురభి శంకర శర్మ. కోట వెంకట లక్ష్మీనరసింహం , మాడుగుల వెంకట సూర్య ప్రసాదరాయ కవి , పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ , జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి , భూతపురి సుబ్రహ్మణ్య శర్మ , భూతపురి బాల సుబ్బారాయుడు , పోచిన పెద్ది సుబ్రహ్మణ్యం , పాణ్యం నరసరామయ్య , రొంపిచర్ల శ్రీనివాసా చార్యులు...
== అష్టావధానులు== 
ప్రసాదరాయ కులపతి ,దివాకర్ల వెంకటావధాని , ధూళిపాళ మహదేవమణి , గౌరీభట్ల రఘురామ శర్మ ,బేతవోలు రామబ్రహ్మం , దూపాటి సంపత్కుమారాచార్య , [[కోవెల సుప్రసన్నా చార్య [[, విఠాల చంద్రమౌళి శాస్త్రి , చిఱ్ఱావూరి శ్రీరామ శర్మ , ఆర్.అనంత పద్మనాభరావు , మాజేటి వెంకట నాగలక్ష్మీ ప్రసాద్ ,తిగుళ్ళ శ్రీహరి శర్మ , మాడుగుల అనిల్ కుమార్ , సురభి వెంకట హనుమంతు రావు , గణపతి అశోక్ శర్మ , ఇందారపు కిషన్ రావు , మేడూరు ఉమామహేశ్వరం , గాడేపల్లి కుక్కుటేశ్వర్ రావు , మరింగంటి కులశేఖరా చార్యులు , కర్రా గోపాలం , కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాద రావు , కట్టమూరు చంద్రశేఖర్ , లోకా జగన్నాధ శాస్త్రి , అయాచితం నటేశ్వర శర్మ , చింతలపాటి నరసింహ దీక్షిత శర్మ , అష్టకాల నరసింహరామ శర్మ , వెల్లాల నరసింహ శర్మ ,కేసాప్రగడ సత్యనారాయణ , గురువేపల్లి నరసింహం ,రాళ్ళబండి నాగభూషణ శర్మ ,కురుబ నాగప్ప , పూసపాటి నాగేశ్వర రావు , అందె వెంకటరాజం , రాంభట్ల పార్వతీశ్వర శర్మ , కావూరి పూర్ణచంద్రరావు , ముటుకుల పద్మనాభ రావు , ఆశావాది ప్రకాశరావు , పేరాల భరత శర్మ , పరవస్తు ధనుంజయ , నారాయణం బాల సుబ్రహ్మణ్య శర్మ , మేడవరం మల్లికార్జున శర్మ ,సమ్మెట మాధవ రావు , అవధానం రంగనాధ వాచస్పతి , వేదాటి రఘుపతి , ఆరుట్ల రంగాచార్య ,బులుసు వెంకట రామమూర్తి ,గడియారం శేషఫణి శర్మ , ఆమళ్ళదిన్నె వెంకట రమణ ప్రసాద్,పాలపర్తి వేణుగోపాల్ ,దిట్టకవి శ్రీనివాసాచార్యులు , దోనిపర్తి రమణయ్య , శంకరగంటి రమాకాంత్ , ముద్దు రాజయ్య , తిగుళ్ళ రాధాకృష్ణ శర్మ, గౌరీభట్ల రామకృష్ణ శర్మ , కోట రాజశేఖర్ , చిలుకూరి రామభద్ర శాస్త్రి , పరిమి రామ నరసింహం , బెజుగామ రామమూర్తి , పణితపు రామమూర్తి , జోస్యుల సదానంద శాస్త్రి , మద్దూరి రమమూర్తి , చిలుకమర్రి రామానుజాచార్యులు , గౌరిపెద్ది రామసుబ్బ శర్మ , పణతుల రామేశ్వర శర్మ , పాణ్యం లక్ష్మీనరసింహ శర్మ , చక్రాల లక్ష్మీకాంత రాజారావు ,శిరిశినహళ్ శ్రీమన్నారాయణాచార్యులు , పుల్లాపంతుల వెంకట రామశర్మ , దేవులపల్లి విశ్వనాధం , వంకరాజు కాల్వ వీరభద్రాచార్యులు , పణిదపు వీరబ్రహ్మం , భద్రం వేణు గోపాలా చార్యులు ,రావూరి వెంకటేశ్వర్లు , గుమ్మా శంకర రావు , ప్యారక శేషాచార్యులు ,మామిళ్ళపల్లి సాంబశివ శర్మ , నేమాని రామజోగి సన్యాసి రావు , కొప్పరపు సీతారామ వరప్రసాద రావు , శనగల సుందరరామయ్య , అవధానం సుధాకర శర్మ , పైడి హరనాధ రావు , పమిడికాల్వ చెంచు సుబ్బయ్య , తావి కృష్ణ శర్మ ,వడిగేపల్లి నరసింహులు , మేడికుర్తి పుల్లయ్య , కె.ప్రభాకర్ , పుల్లపంతుల రాధాకృష్ణ మూర్తి , బి.శ్రీనివాసాచార్యులు , అక్కపెద్ది రామసూర్యనారాయణ , సురభి శంక శర్మ , ప్రభల సుబ్రహ్మణ్య శర్మ , ఎస్.ఎ.టి.కె. తాతాచార్య , ఫణితపు శ్రియ:పతి , సి.విజయకుమార్ , గోవర్ధనం నరసింహా చారి , ఎం.కె.ప్రభావతి , తంగిరాల ఉదయ చంద్రిక , పుల్లాభట్ల శాంతి స్వరూప , కొంపెల్ల కామేశ్వరి,బులుసు అపర్ణ , ఆకెళ్ళ దుర్గ నాగసత్య బాలభాను మున్నగువారు.

తెలుగులో అత్యంత క్లిష్టమైన అవధాన ప్రక్రియ గురించి కొంత వివరణ తెలుసుకున్నాము... ఇంతటితో ఈ వారం ఇంతటితో ముగిస్తూ వచ్చే వారం మరో సాహితీ ప్రక్రియతో మళ్ళి కలుద్దాం...

సేకరణ : వికీపీడియా సహకారంతో ... 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner