28, ఫిబ్రవరి 2021, ఆదివారం

తెలుసా...!!

నేను కోల్పోయిన 
అస్తిత్వం విలువ
నువ్వేనని 

నేను దాచుకున్న
జ్ఞాపకాల దొంతర్లన్నీ
నీతోనే నిండాయని 

ముదిమి వయసున
మౌనంతో మాటలన్నీ
నీతో పంచుకున్న అనుభూతులని 

రెప్ప వాల్చే తరుణాన
ఆ రెప్పల ఉప్పెన
నీకోసమేనని గుర్తెరగమంటూ

విరామం కోరుకునే 
మనసు కావాలనుకుంటోంది
మరోసారి బాల్యాన్ని చవిచూడాలని...!! 















 

27, ఫిబ్రవరి 2021, శనివారం

చిత్రానికి...

చిరువెన్నెల వన్నెలు_నిశికన్నె నీడల్లో...!!

22, ఫిబ్రవరి 2021, సోమవారం

కాలం వెంబడి కలం...42

         పిట్స్బర్గ్ లో రోజులు గడిచిపోతున్నాయి. నా H1B గురించి శ్రీనివాస్ మళ్ళీ నాకు మెయిల్ పెడితే, ఫోన్ చేసాను. సుబ్బరాజు మళ్ళీ ఫోన్ చేస్తానన్నారు, చేయలేదని చెప్పాను. వెంటనే శ్రీనివాస్ సుబ్బరాజుకి ఫోన్ చేసి చెప్తే, నాకు ఫోన్ చేసి మీరు H1B  చేయించుకున్నారని అనుకున్నాను, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, పేపర్స్ అన్నీ పంపండి. 1100 డాలర్లు కూడా పంపండి. వన్ ఇయర్ లోపల మీకు జాబ్ వస్తే మీ 1100ల డాలర్లు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పారు. సరేనని డబ్బులు, H1B కి అవసరమైన పేపర్స్ అన్ని పంపించాను. డాక్టర్ గారేమెా జాగ్రత్త, ఎవరికి నీ స్టేటస్ గురించి చెప్పకు, మళ్ళీ నాకు ప్రోబ్లం అవుతుంది, గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో ఉంది అని అన్నారు. డాక్టర్ గారి పేరు ఇందిర. పిల్లలు అనోన్య, అభిలాష్. 
       నాకు ఆడపిల్లలంటే బాగా ఇష్టం. అనోన్య బాగా దగ్గరైంది. అభిలాష్ చిన్నోడు కదా, సరిగా తినేవాడు కాదు. అందుకని నేను కాస్త కోపంగా ఉన్నట్టు నటించేదాన్ని వాడి తిండి దగ్గర. రోజు వాళ్ళ అమ్మ వచ్చాక నా మీద కంప్లయింట్స్ చెప్తూ ఉండేవాడు.  పాప నన్ను సపోర్ట్ చేసేది. డాక్టర్ గారు ఏమనేవారు కాదు. పిల్లలని చూస్తే తెలుస్తుందిగా, ఆవిడకు పిల్లలు ఎలా ఉన్నారని. వీళ్ళ ఫ్రెండ్స్ మెర్సీ వాళ్ళు కూడా పిట్స్బర్గ్ లోనే ఉండేవారు. అప్పుడప్పుడూ వాళ్ళు రావడం, లేదా మేం వాళ్ళింటికి వెళ్ళడం జరిగేది. అప్పుడప్పుడూ చర్చికి కూడా వెళ్ళేవాళ్ళం. పిల్లలతో హారిపోర్టర్ సినిమా అమెరికా థియేటర్ లో మెుదటిసారి చూసాను. మధ్యలో ఓ రోజు నా ఫ్రెండ్స్ కళ్యాణ్, రాంబాబు వాళ్ళు పిట్స్బర్గ్ వేంకటేశ్వర స్వామి గుడికి దర్శనానికి వచ్చారు. 
            నాకు అప్పటికి సెల్ ఫోన్ లేదు. ఇంటికి మాట్లాడుతునే ఉండేదాన్ని డాక్టర్ గారి లాండ్ లైన్ తో నా కాలింగ్ కార్డ్స్ తో. అప్పట్లో ఈమెయిల్ చూసుకోవాలంటే కంప్యూటర్ కూడా లేదు. లైబ్రరీలో అయితే ఇంటర్నెట్ ఫ్రీగా ఒక గంట చూసుకోవచ్చని చికాగోలో ఉన్నప్పుడు తెలుసు. అది కూడా రెండోసారి గెస్ట్ హౌస్ కి వెళ్ళినప్పుడు సిస్టమ్ లేదు. అప్పుడు విజయ్ తీసుకెళ్ళాడు. అలా తెలిసిందన్న మాట. ఓ రోజు అభిని స్కూల్ లో దించి, లైబ్రరీకి వెళదామని బయలుదేరాను. మా అపార్ట్మెంట్స్ బయట అడిగితే 10 మినిట్స్ పడుతుందన్నారు పబ్లిక్ లైబ్రరీకి వెళడానికి. సరేనని నడిచి బయలుదేరాను. నడవడానికి ఫుట్పాత్ కూడా లేదు. ఎంత దూరం నడిచినా 10 మినిట్స్ అంటూనే ఉన్నారు ఎవరిని అడిగినా. అలా మూడు మైళ్ళు నడిస్తే కాని రాలేదు. లైబ్రరీని చూడగానే ఎంత సంతోషమేసిందో. గబగబా మెయిల్స్ చెక్ చేసుకుని, రిప్లైలు ఇచ్చేసి బయలుదేరాను నడుచుకుంటూనే. ఇంటికి వచ్చాక డాక్టర్ గారికి ఇలా జరిగిందని చెప్పాను. ఆవిడకి చెప్పే వెళ్ళాలెండి. తర్వాత బస్ ఉందని తెలిసింది. బస్ లో వెళ్ళి వచ్చేదాన్ని. ఓరోజు లైబ్రరీకి వెళ్ళి  వచ్చేటప్పుడు పెద్ద వర్షం. బస్ స్టాప్ లో బస్ అయితే ఎక్కాను కాని పాపం బస్ డ్రైవర్ చాలా మంచోడు. ఎటేటో తిప్పి జాగ్రత్తగా నన్ను మా బస్ స్టాప్ లో దించాడు. లైబ్రరీకి  ఎదురుగుండా పూల చెట్లు చాలా ఉండేవి. భలే బావున్నాయి అనుకునేదాన్ని. తర్వాత తెలిసింది అది బరియల్ గ్రౌండ్ అని. మనవయితే భయం వేసేటట్లుగా ఉంటాయి. అమెరికాలో చనిపోయిన తర్వాత జ్ఞాపకాన్ని కూడా అందంగా ఉంచుతారని అర్థం అయ్యింది. 
            పిల్లల స్కూల్ లో నేనే వారికి అమ్మని అనుకునేవారు అక్కడికి మిగతా పిల్లల కోసం వచ్చే పేరెంట్స్. తన పేరు గుర్తు లేదు కాని ఓ అమెరికన్ మంచి ఫ్రెండ్ అయ్యింది నాకు. అప్పుడప్పుడు  తను డ్రాప్ చేసేది స్నో బాగా ఉన్నప్పుడు. పిల్లల పుట్టినరోజులకి 150 బెలూన్స్ ఊది ఉంచితే, డాక్టర్ గారు డ్యూటి నుండి వచ్చి డెకరేషన్ చేయడం, పిల్లల పార్టీలు, పిల్లలతో ఇంట్లో ఆడటం, మా క్రింది ఫ్లోర్ వాళ్ళు అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కి కంప్లయింట్స్ ఇలా రోజులు గడిచిపోతున్నాయి. 
            మామూలుగానే ఆరోజు కూడా అనోన్యని స్కూల్ లో దించి, అభిని రడీ చేసి స్కూల్ కి తీసుకువెళ్ళాను, స్కూల్ లేదన్నారు. తిరిగి వచ్చేసాము. ఇంటికి రాగానే ఫోన్ మెాగింది. ఎవరా అని ఫోన్ తీసాను. ఏమే ముసలి బతికేవున్నావా అని శోభ గొంతు. నాకేమవుతుందే అని, ఏమైంది అని అడిగా. నీకు తెలియదా, టివి చూడలేదా అంది. లేదు పిల్లల పనిలో ఉన్నాగా అన్నాను. పెంటాగన్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద బాంబ్ వేశారు. మెుత్తం కూలిపోయాయి. ఎంతమంది చనిపోయారో మరి. పిట్స్ బర్గ్ లో కూడా బాంబ్ వేశారు. గుడి మీద వేయాలని ప్లాన్ చేసినట్లున్నారు. కాకపోతే అది పిట్స్ బర్గ్ అవుట్స్కర్ట్స్ లో పేలింది. పిట్స్ బర్గ్ అనగానే నువ్వు గుర్తు వచ్చావు. ఎలా ఉన్నావో ఏమెా అని వెంటనే నీకు ఫోన్ చేసాను, అని కాసేపు మాట్లాడింది. ఇక వరసనే ఫోన్లు, డాక్టర్ గారికి, నాకు. యు ఎస్ కాపిటల్ ని కూడా టార్గెట్ చేసారు. అది ఫెయిల్ అయ్యింది. భారతదేశంలో చిన్నప్పుడు 1977 లో ఉప్పెనకు, 1988 లో రంగా యాజిటేషన్ కు, 2001 లో అమెరికాలో సెప్టెంబర్ 11 కి సాక్షిగా మాత్రమే మిగిలాను నేను కూడా. చాలా దారుణం అది. ఏమైందో కూడా తెలియకుండానే పోయిన ప్రాణాలెన్నో. బిల్డింగ్ కూలడం చూస్తూ పై ఫ్లోర్ నుండి ప్రాణ భయంతో కిందకి పరుగులు తీస్తూ ప్రాణాలు వదిలిన వాళ్ళు బోలెడుమంది. ప్రకృతి విపత్తులు కొన్నైతే, మూర్ఖుల దుష్టచర్యలకు పరాకాష్ఠ ఇలాంటి అనైతిక చర్యలు. ఇది జరిగిన తర్వాత కూడా చాలా రోజులు ఆంత్రడాక్స్ అని, పోస్ట్ లో కూడా వస్తుంది ఆ పౌడర్, దానిని అంటుకోవద్దని జాగ్రత్తలు. 
           అప్పటికే సాఫ్ట్ వేర్ జాబ్ ల మార్కెట్ బాగోలేదు. అందుకే నేను ఈ బేబి సిట్టింగ్ జాబ్ లో చేరాను. సెప్టెంబర్ 11 తర్వాత ఇక అసలు సాఫ్ట్ వేర్ జాబన్న మాటే లేదు. నేను పిట్స్ బర్గ్ రాకముందు చికాగో గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడే ఓరోజు మధ్యాహ్నం  లైబ్రరీకి వెళ్ళి మెయిల్స్ చెక్ చేసుకుంటే మా సుధ అన్నయ్య నీ కొడుకు ఎడ్వెంచర్ చేసాడు. విజయవాడ తీసుకువచ్చారు అని పెట్టాడు. అది పెట్టి కూడా 2, 3 రోజులయ్యింది నేను చూసేటప్పటికి. నా కొడుకు పేరు మౌర్య. రెండేళ్ళు అప్పటికి వాడికి. చాలా అల్లరివాడు. వెంటనే టైమ్ కూడా చూసుకోకుండా ఇంటికి ఫోన్ చేసాను. మామయ్య ఫోన్ తీసాడు. ఏమైంది మౌర్యకి, ఎందుకు విజయవాడ తీసుకెళ్ళారు అంటే..ఏం లేదు 4 మెట్ల మీద నుండి పడ్డాడు. ఏం కాలేదులే బానే ఉన్నాడని చెప్పాడు. నేను అంతే కాబోలు జరిగింది అనుకున్నా. మా ఫ్రెండ్స్ కి, అన్నయ్యకు, గోవర్థన్ కి కూడా అదే మాట చెప్పాను. నీళ్ళలోనికి వెళ్ళనీయవద్దని చెప్పు, జ్వరం వస్తే అశ్రద్ధ చేయవద్దని చెప్పమని అన్నయ్య చెప్పాడు. నేను కార్సన్ సిటీ లో ఉన్నప్పుడు సతీష్ ఇండియా వెళుతూ ఏం కావాలంటే మా అబ్బాయిని చూసిరా అని చెప్పాను. ఎవరు ఇండియా వెళుతున్నా ఇదే చెప్పేదాన్ని. అన్నయ్యా వాళ్ళు కూడా వెళ్ళినప్పుడు చూసి వచ్చారు. 
              ఈ అంతర్జాలం అందుబాటులోనికి రాక మునుపు కలం స్నేహం అని ఉండేది. ఇంటర్నెట్ వచ్చాక కాస్త నెట్టింటి స్నేహాలు మెుదలయ్యాయి. ఓరోజు మెయిల్ చెక్ చేసుకుంటే నాకు మెసేజ్ ఉంది. నేను ఏదో తెలుగు వెబ్ సైట్ లో నా మెయిల్ ఐడి ఇచ్చాను. అది చూసి మెయిల్ చేసాడట. పేరు వెంకట రమణ అని ఉంది. రిప్లై ఇచ్చాను. ఫోన్ నెంబర్ అడిగితే ఇచ్చాను. అలా ఇవ్వకూడదని అప్పట్లో తెలియదు. కాని ఇప్పటిలా అప్పుడు మిస్ బిహేవ్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ. వెంకట రమణ కాలిఫోర్నియాలో జాబ్ చేస్తూ ఉండేవాడు. అనుకోకుండా నాకు ఓ మంచి ఫ్రెండ్ ఇలా దొరికాడు. 

" సముద్రానికి అలవాటైన ఆటుపోట్లే జీవితంలో కూడా..."


వచ్చే వారం మరిన్ని కబుర్లతో..... 

19, ఫిబ్రవరి 2021, శుక్రవారం

ఎల్లక్క సమీక్ష

       " నాగరికతలో దాగిన అనాగరికతను ఎత్తి చూపే ఎల్లక్క " 
       అనాదినుండి జరుగుతున్న అన్యాయాలను ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు ఎత్తి చూపకుండా ఉండలేరు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యమే నేడు మన ముందున్న ఈ "ఎల్లక్క" సుదీర్ఘ వచనకావ్యం. ఇది పరిశోధనాత్మక, పరిశీలనా కావ్యం. ఇలాంటి సామాజిక లోపాలను ఎత్తి చూపడానికి గుండె ధైర్యంతో పాటుగా, ఓర్పు, నేర్పు కూడా చాలా అవసరం. 
       ఈ పుస్తకం నా దగ్గరకు రావడానికి ముందురోజు ప్రమెాద్ కుమార్ గారు, నేను ఫోన్ లో మాట్లాడుకుంటున్నప్పుడు ఈ ఎల్లక్క పుస్తకం గురించి ప్రస్తావన వచ్చింది. ఆ మరుసటి రోజే ఈ పుస్తకం నన్ను చేరడం అన్నది ఊహించని విషయం. దీనికి ముఖ్య కారణం సాగర్ శ్రీరామ కవచం అంకుల్. పుస్తకాన్ని నాకు పంపించమని జగదీష్ గారికి చెప్పినందుకు, పంపిన కెరె జగదీష్ గారికి వినమ్రపూర్వక ధన్యవాదాలు.
     ఈ పుస్తకం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏ పుస్తకమైనా నా దగ్గరకు రాగానే ముందుగా చదవడం మెుదలు పెడతాను. అలా కాస్త పైపైన చూసి, తర్వాత సమీక్ష రాసేటప్పుడు మెుత్తంగా చదువుతూ రాస్తాను. కాని " ఎల్లక్క " మెుదటి పేజి నుండి చివరి వరకు ఆపకుండా చదివించడమే కాకుండా, నా మెదడులో అదంతా చేరిపోయింది. ఇలా చాలా తక్కువ పుస్తకాల విషయంలోనే జరుగుతుంది. ఆనందోబ్రహ్మ, అధినేత, ఊసులాడే ఒక జాబిలట, యాతన...ఇలా కొన్ని పుస్తకాలు మాత్రమే మనసులో నిలిచిపోతాయి. ఆ కోవలోనిదే ఈ "ఎల్లక్క " కూడా.
      సమాజంలోని అనాచారాన్ని నిరసించాలంటే ఎంతో ధైర్యం కావాలి. పూర్వకాలపు రాజరికము వైభోగాలను వినిపిస్తూనే, అనాటి దేవదాసిల నుండి ఈనాటి జోగినిల వరకు, మధ్య మధ్య ప్రాంతాలకనుకూలంగా మారిన పేర్లను ఉదహరిస్తూ కావ్యాన్ని నడిపిన తీరు అద్భుతం. పేదరికంలో పుట్టిన ఆడబిడ్డల పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి ఎల్లక్కే ఉదాహరణ. 
      దురాచారం కుట్ర వెనుక జరిగిన మెాసాన్ని బసివినిగా ఎల్లక్కను మార్చడానికి పూనకం ముసుగులోని లొసుగును, బిడ్డను ఈ దుష్ట ప్రక్రియ నుండి కాపాడుకోలేని తల్లిదండ్రుల పేదరికాన్ని వాడుకున్న ఊరి పెద్దల దురాగతాన్ని కళ్ళకు కట్టినట్టుగా వివరించారు కెరె జగదీష్. ఏమి తెలియని వయసు నుండి చరమాంకం వరకు నలిగిన ఆ ఎల్లక్క మనసు గోసే ఈ ఎల్లక్క దీర్ఘకావ్యం. వయసులో ఉన్నప్పుడు వెలిగిన వెలుగులు, వయసుడిగిన తర్వాత వెలిసిన ఎల్లక్క బతుకుని చాలా హృద్యంగా చూపించారు. ఎల్లక్క అందాన్ని తనివితీరా ఆస్వాదించిన రసికులు, రోగాలతో కృసించి మరణించిన ఎల్లక్క దేహాన్ని చూడటానికి, మెాయడానికి కూడా రానప్పటి క్షణాలను కవి వర్ణించిన తీరు చదివిన ప్రతి ఒక్కరికి కన్నీరు తెప్పిస్తుంది. ఓ వెలుగు వెలిగిన బతుకు, ఆ వెలుగారిపోతే సమాజం ఏ విధంగా ప్రవర్తిస్తుందో తెలియడానికి ఎల్లక్కే సాక్ష్యం. ఇది ఒక ఎల్లక్క వ్యధ కాదు. ఈ దురాచారాలను అడ్డుకోలేని మన మానవ సమాజంలో ఎందరో ఎల్లక్కల మనసు పుస్తకం. ఈ అనాచారాలను చూస్తూ కూడా అడ్డుకోలేని నాగరిక సమాజం మనదైనందుకు సిగ్గుపడదాం. ఆధునికంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నామని భ్రమ పడుతున్న మనకు ఈ ఎల్లక్క జీవితం ఓ హెచ్చరిక. మనం ఎక్కడ ఉన్నామని తెలియజేస్తోంది. 
         సరళంగా, సున్నితంగా సమాజంలోని మూఢాచారాన్ని, హేయమైన చర్యను మూలాల నుండి పరిశోధన చేసి, సహేతుకంగా వివరిస్తూ, పరిష్కారాన్ని కూడా చూపించిన కెరె జగదీష్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. 

16, ఫిబ్రవరి 2021, మంగళవారం

రాజీనామా...!!

ఓటమితో రాజీ పడలేని మనసుతో
ప్రతి క్షణం పోరు సలుపుతూ
గెలుపుకై నిర్విరామంగా పయనిస్తూనే ఉన్నా

బిడ్డగా బంధాలనల్లుకుని
ఈ భూమి మీద పడింది మెుదలు
నవ్వులతో, కన్నీళ్ళతో ఆటలాడుతునే ఉన్నా

పసితనాన్ని వదులుకోలేదు 
నడిమి వయసునూ కాదనుకోలేదు
రాబోయే పండుతనాన్ని రావద్దనుకుంటున్నా

నలుగురి సంతోషం కోసం
సర్ధుకుపోవడాలను సమర్థిస్తూనే
సరిపెట్టుకోవడం అలవాటు చేసుకుంటున్నా 

నాకంటూ మిగలని కాలాన్ని
ఆలింగనం చేసుకోవాలన్న తాపత్రయాన్ని
బంధించాలనుకుంటూనే బంధనాలను ఆశ్రయిస్తున్నా

బతుకు బావుటానెగరేయలేక
బాధ్యతల బరువును మెాయలేక
జీవితంలో నా పాత్రలకు రాజీనామా లేఖ సమర్పించాలనుకుంటున్నా...!!

15, ఫిబ్రవరి 2021, సోమవారం

కాలం వెంబడి కలం..41


           మన తెలుగు పండుగలన్నీ కూడా అందరం కలిసి బాగా చేసుకునేవాళ్ళం. ఎక్కువగా శ్రీను సంధ్య వాళ్ళింట్లోనే అందరం కలిసేవాళ్ళం. ఓ రెండు నెలలు గడిచే సరికి నేను కాలే దంపతులతో కలిసి ఉండలేక వేరే మెాటల్ చూసుకుంటుంటే సంపత్ మారిన ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ ఉన్న చోటే రూమ్ ఉందంటే అక్కడ చూసుకుని మారిపోదామని అనుకున్నా. ఆఫీస్ అయ్యాక శ్రీను, అబ్బు బయటకు వస్తామంటే నా లగేజ్ తీసుకుని వాళ్ళు రాకముందే బయటకు వచ్చి నిలుచున్నా. కాసేపటికి వాళ్ళు వచ్చి లగేజ్ కార్ లో సర్ది నా కొత్త రూమ్ కి తీసుకువెళ్ళారు. నేను తీసుకున్న మెాటల్ రూమ్ లో బెడ్, టివి, చిన్న టేబుల్, చైర్, కాసిని వంట సామాన్లు ఉండేవి. బట్టలకు వాషర్, డ్రయర్ వేరే చోట ఉండేవి. రోజు మధ్యాహ్నం లంచ్ సంపత్ కి, అబ్బుకి మా ఇంట్లోనే. సాయంత్రం ఎవరి తిండి వారిది. నన్ను, అబ్బుని సంపత్ రోజూ ఆఫీస్ కి తీసుకువెళ్ళడం, తీసుకురావడం, ఎవరి పనుల్లో వాళ్ళు అలా జరిగిపోతోంది. ఓ రోజు మా మేనేజర్ క్రిష్ జాబ్ మానేస్తున్నానని చెప్పాడు. మా కంపెనీ ఓనర్ పేరు కూడా బాబ్. మా ప్రాజెక్టు పేరు చెప్పలేదు కదా లోయస్ట్ బిడ్స్ డాట్ కాం. బిడ్ బార్ డిజైనింగ్, ASP పేజ్ లింక్స్ బిడ్ బార్ లో పెట్టడం నా పని. బిడ్ బార్ డిజైనింగ్ అంతా క్లయింట్ సైడ్ VC++ లోనే. సర్వర్ సైడ్ సాకెట్ ప్రోగ్రామింగ్ అంతా క్రిష్ ఫ్రెండ్ పేరు సరిగా గుర్తు లేదు మైక్ అనుకుంటా తను చేసేవాడు. మిగతావాళ్ళంతా ASP, Administration, testing చేసేవారు. ప్రాజెక్ట్ లైవ్ అంతా చూసుకునేవారు. ఇష్యూష్ వస్తే ఎవరిది వారు సాల్వ్ చేసేవారు. అలాంటిది సడన్ గా క్రిష్ కి, బాబ్ కి క్లాష్ వచ్చి క్రిష్, క్రిష్ ఫ్రెండ్ జాబ్ కి రిజైన్ చేసేసారు. బాబ్ మీటింగ్ పెట్టి మా అందరికి జాబ్ పర్మెనెంట్ చేసి తన కంపెనీ నుండి వర్క్ పర్మిట్ స్పాన్సర్ చేస్తానని చెప్పారు. 
      మేం ఆలోచించుకుని చెప్తామని చెప్పాము.సాకెట్ ప్రోగ్రామింగ్ గురించి నన్ను చూడమని నాకు మైక్ సిస్టమ్, కాబిన్ ఇచ్చారు. కంపెనీ ఆఫర్ పర్మెనెంట్ తీసుకుంటే మనకున్న H1 కాన్సిల్ అవుతుంది. వీళ్ళు పర్మెనెంట్ అని కూడ తర్వాత జాబ్ తీసేస్తే మనకు స్టేటస్ ఉండదు. కొంత టైమ్ ఉంటుంది. ఆ టైమ్ లోపల H1 ఫైల్ చేయించుకోవాలి లేదంటే ఇల్లీగల్ అయిపోతాము. 
ఇలా పర్మెనెంట్ ఆఫర్ తీసుకుంటే మధ్యలో వేరే ఎవరు ఉండరు. డైరెక్ట్ క్లయింట్ తో మనకు లావాదేవీలుంటాయి. మధ్యలో వెండర్స్ ఉండరన్న మాట. నాలుగు రోజులయ్యాక అందరం సరేనని మా పని మేం చేసుకుంటున్నాం. ఈ మధ్యలో శ్యామ్ ఫ్రెండ్ కూడా మా ప్రాజెక్ట్ లోనికే వచ్చాడు వెంకట్ ఎంప్లాయర్ ద్వారా. నాకు కాస్త తమిళ్ కూడా అర్థమవుతుంది. శ్యామ్ అతన్ని తీసుకురావడానికి ఇక్కడ ఉన్నవారిలో ఎవరినైనా తీసేయించాలని ట్రై చేయడం, నాకు తమిళ్ తెలియదని తను తమిళ్ లో మాట్లాడటం, నేను వీళ్ళకు చెప్పడం జరిగింది. అసలే ప్రాజెక్ట్ ఉంటుందో, పోతుందో అన్న టెన్షన్ మాది. మధ్యలో ఈ గోల. అంటే అన్నానంటారు కానండి మన ఆంధ్రా వాళ్ళు మనవాళ్ళకి అసలు హెల్ప్ చేయరు. మిగతావాళ్ళు అలా కాదు. ఎంతయినా ఒక్క ఆంధ్రా వాళ్ళకు లేనిది మిగతావారికందరికి ఉన్న యూనిటితో శ్యామ్ తన ఫ్రెండ్ ని కూడా మా ప్రాజెక్ట్ లోనికి తెచ్చేసాడు సాకెట్ ప్రోగ్రామింగ్ మీద. 
3 నెలలు నాకు సాలరి పే చేసిన HNC కంపెని తర్వాత పే చేయడం మానేసింది. అడుగుతుంటే క్లయింట్ దగ్గర నుండి రాలేదని చెప్పడం మెుదలుబెట్టారు. మనకి క్లయింట్ తో సంబంధం లేదు, క్లయింట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మన ఎంప్లాయర్ మనకి పే చేయాలి. సరే ఇస్తారులే అని మరో 3 నెలలు ఊరుకున్నాను. ఈ క్లయింట్ పని చేయించుకుంటున్నాడు కాని మా పేపర్స్ అడగడం  లేదు ఫైలింగ్ కి. ఎనిమిది నెలలు చూసాక ఇక మానేద్దామని నిర్ణయించుకుని, ఎంప్లాయర్ బాబ్ ని అడిగితే సమాధానం చెప్పడం లేదు. వినయ్ గారికి ఫోన్ చేస్తే అడగండి అంటారే కాని ఉపయెాగం లేదు. ఓ నెల రోజులు అలానే ఉన్నా. అబ్బు వాళ్ళ అన్నయ్య దగ్గరకి అప్పుడే వెళ్ళనంటే, సరేనని నాతో ఉండమన్నా. షణ్ముఖ్ కూడ ఫోన్ చేసేవాడు అప్పుడప్పుడు. ఈ విషయం చెప్తే ఇక్కడికి వచ్చేయండి, ఏదైనా జాబ్ చూసుకోవచ్చు అని చెప్పాడు. అప్పటికే తర్వాత నెలకు కూడా మనీ పే చేసేసా. అబ్బు ఉంటానంటే తనకి అప్పజెప్పి, బస్ లో రెండునర్ర రోజులు నెవెడా స్టేట్  కార్సన్ సిటీ నుండి చికాగోలోని అరోరా HNC కంపెనీ గెస్ట్ హౌస్ కి వచ్చాను. అక్కడ విజయ్ అనే అతను ఉన్నాడు. తను ఇండియాకి వెళిపోతున్నాడు. ఓ వారం, పది రోజులున్నాక బాబ్ ఇండియా టికెట్ ఇస్తాను, ఇండియాకి వెళ్ళమన్నాడు. నాకు H1 కూడా వీళ్ళ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయలేదు. నేను పక్కన షాప్ కి వెళితే అక్కడ కనబడిన కాప్(పోలీస్ ని కాప్ అంటారు) కి జరిగిన విషయం అంతా చెప్పాను. కాప్ బాబ్ నంబర్ అడిగితే ఇచ్చాను. బాబ్ కి కాల్ చేసి తిట్టాడనుకుంటా. ఆ సాయంత్రం బాబ్ గెస్ట్ హౌస్ కి వచ్చి వాడిష్టం వచ్చినట్టు తిట్టి, గెస్ట్ హౌస్ నుండి వెళిపొమ్మన్నాడు. ఆ విజయ్ బాగా భయపడిపోయాడు. రావాల్సిన డబ్బులు ఇమ్మన్నాను నేను. ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. షణ్ముఖ్ కి కాల్ చేసి చెప్పాను జరిగింది. వాళ్ళ రూమ్ లో పూజారి గారు, తనతో పాటు ఉండమని చెప్పాడు. నేను కార్సన్ సిటిలో ఉన్నప్పుడు మా స్కూల్ అల్యూమిని వెబ్ సైట్ లో నేను యాడ్ అయ్యాను. గోవర్ధన్ బొబ్బా అని అవనిగడ్డ అతను, చిన్నప్పుడు మా స్కూల్ లోనే తను కూడా, కాకపోతే నా పేరు తెలుసు కాని నన్ను చూడలేదెప్పుడూ. తను ఓ రోజు కాల్ చేసాడు. తన వివరాలు చెప్పి అప్పటి నుండి అప్పుడప్పుడూ మాట్లాడేవాడు. ఇలా నా ప్రాజెక్ట్ అయిపోయిందని, కంపెని వాడు బెదిరించాడని చెప్పాను. గోవర్ధన్ ఇండియానా లో ఎమ్ ఎస్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరకు రమ్మని చెప్పాడు. మరుసటి రోజు విజయ్ ఇండియా వెళిపోయాడు. షణ్ముఖ్ వాళ్ళ రూమ్ లో ఉన్నాను ఆ రోజు. రెండు మూడు గాస్ స్టేషన్స్ కి జాబ్ అడగడానికి కూడ తీసుకువెళ్ళాడు. మన పరిస్థితి ఏంటా అని దిగులుతో ఆ రాత్రంతా నిద్ర పోలేదు. మరుసటి రోజు గోవర్ధన్ ఫోన్ చేసి తన ఫ్రెండ్స్ తో వచ్చానని, నన్ను వాళ్ళతో రమ్మని చెప్పాడు. అడ్రస్ చెప్తే వచ్చి ఇండియానా నన్ను కూడా తీసుకువెళ్ళారు. ఓ సూట్కేస్ ఇక్కడే వదిలేసాను తర్వాత తీసుకోవచ్చని. 
              ఇండియానా యూనివర్శిటీలో MS చేసే పిల్లలు అందరు కలివిడిగానే ఉండేవారప్పుడు. గోవర్థన్ రూమ్ లో విజయ్, ఇంకో అతను ఉండేవారు. వీళ్ళ క్లాస్మేట్ ఓ అమ్మాయి పేరు శ్వేత అనుకుంటా. తను చాలా మంచి అమ్మాయి. నాతో ఎక్కువ క్లోజ్ గా ఉండేది. పిల్లలు అందరు నన్ను బాగా చూసుకున్నారు. గోవర్థన్ కి నా చిన్నప్పటి క్లాస్మేట్స్ తెలుసు. బాబి అని  మా చిన్నప్పటి క్లాస్మేట్ అమెరికాలోనే ఉన్నాడని, తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఎప్పుడో 88 లో చూసాను. సరే కానీ..గుర్తు పడితే మాట్లాడదాం లేదంటే లేదని ఫోన్ చేసా. హమ్మయ్య గుర్తు పట్టాడు బాబి. తన కబుర్లు చెప్పి, నా గురించి అడిగాడు. అలా మా చిన్నప్పటి స్నేహం మళ్ళీ కలిసిందన్నమాట. ఇండియానా లో వీళ్ళున్నది టెర్రాహట్ అన్న ఊరు. ఇక్కడ ఏమైనా జాబ్స్ ఉంటాయేమెానని చూశాను. ఈ HNC వాడు నాకు H1B వీడి కంపెనీకి మార్చలేదు. నరసరాజు అంకుల్ నేను జాబ్ లో ఉన్నప్పుడు GIS వాళ్ళు వాళ్ళ H1B కాన్సిల్ చేసుకోవచ్చా అని అడిగితే వీడు ట్రాన్స్ఫర్ చేసుకుంటానన్నాడని చెప్తే GIS వాళ్ళు ఆ H1B కాన్సిల్ చేసుకున్నారు. అందుకని నాకిప్పుడు స్టేటస్ కూడా పోతుంది. వెంటనే వేరే ఎవరితోనైనా H1B ఫైల్ చేయించుకోవాలి. ఫ్రెండ్స్ అందరిని అడగడం మెుదలు పెట్టాను. మెుత్తానికి ఎవరి వల్లా కాలేదు. అప్పటికే అమెరికాలో ఉద్యోగాలు తగ్గిపోయాయి. నా క్లాస్మేట్, మద్రాస్ లో నా కొలీగ్ అయిన సుబ్బారెడ్డికి మెసేజ్ చేస్తే, తను మా జూనియర్ శ్రీనివాస చౌదరికి చెప్పాడట. వాళ్ళ ఫ్రెండ్ కంపెనీ ఉందని వాళ్ళతో మాట్లాడమని నెంబర్ ఇచ్చారు. అమెరికన్ సొల్యూషన్స్ సుబ్బరాజు ఇందుకూరికి ఫోన్ చేసి మాట్లాడాను. H1B చేస్తామని, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పారు. ఈ లోపల మా ఆయనకు తెలిసిన వారు ఉన్నారని వాళ్ళతో మాట్లాడమంటే, వాళ్ళేమెా MS చెయ్యి ఓ సెమిస్టర్ వరకు నేను చూసుకుంటానన్నారు. లేదండి H1B చేయించుకుంటానని చెప్తే, ఆ డబ్బులు తను పంపిస్తానని చెప్పారు. ఆయన పేరు రామస్వామి యనమదల. నేను ఈయనను ఇండియాలో ఓసారి కలిసాను జాబ్ కోసం. రఘుబాబు పోతిని పేరుతో పాటు ఈ ఇందుకూరి సుబ్బరాజు, రామస్వామి యనమదల పేర్లు బాగా గుర్తుంచుకోండి. 
           నాకేమెా ఖాళీగా ఉండటానికి ఇష్టంగా అనిపించలేదు. నా ఫ్రెండ్ వినికి ఫోన్ చేసి మాట్లాడుతుంటే తను వేరే జాబ్స్ ఉంటాయేమెా చూస్తానని, బేబి సిట్టింగ్ జాబ్స్ ఉన్నాయని ఆ వివరాలు చెప్పడం, వాటిలో ఓ రెండు నెంబర్లకి కాల్ చేయడం, నార్త్ ఇండియన్ వారు 1500 డాలర్లు ఇస్తాం రమ్మని చెప్పారు. మరొకావిడ తెలుగావిడ,డాక్టర్. రెసిడెన్సీ చేస్తున్నారు. వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి అడిగారు. వాళ్ళాయన కూడా డాక్టర్. వేరే చోట ఉంటారు. లండన్ నుండి వచ్చారనుకుంటా. 1200 డాలర్లు ఇస్తానన్నారు. సరే అని ఉమతోనూ, వినితోనూ ఆలోచించి డాక్టర్ గారి దగ్గరకు వెళడానికి సిద్ధపడ్డాను. గోవర్థన్ కి చెప్పాను ఇదంతా. తనకి కార్ లేదు, కార్ రెంట్ కి తీసుకుని తను,  విజయ్ వచ్చి పంపిస్తామన్నారు. మర్చిపోయా నేను వెళ్ళాల్సిన ఊరు పిట్స్బర్గ్. పెన్సల్వేనియా స్టేట్. అదేనండి అమెరికాలో బాగా ఫేమస్ అయిన మన వేంకటేశ్వర స్వామి గుడి ఉన్న ఊరన్నమాట. ఉమా వాళ్ళు ఉండేది ఒహాయెాలో. వాళ్ళు పిట్స్బర్గ్ మేము పంపిస్తాము, గోవర్థన్ వాళ్ళను ఇక్కడకు తీసుకువచ్చేయమని చెప్పమన్నారు. పాపం పిల్లలు ఉమావాళ్ళ దగ్గర దిగబెట్టారు. అక్కడ ఓ వారం రోజులున్నాక, ఉమ, సురేష్ పిట్స్బర్గ్ వచ్చి, నన్ను గుడికి తీసుకువెళ్ళారు. అక్కడ మా గోపాలరావు అన్నయ్యా, వదిన కనిపించారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసిన వదిన మేనమామ కొడుకు శీను అన్న కూడా కనిపించాడు. తర్వాత నన్ను డాక్టర్ గారి ఇంటిలో వదిలేసి, ఉమావాళ్ళు వెళుతుంటే బాగా ఏడుపు వచ్చేసింది. వాళ్ళిద్దరు వెంటనే " నీకెప్పుడు ఉండాలనిపించకపోతే అప్పుడు చెప్పు. మేం వచ్చి తీసుకువెళిపోతాం " అని, డాక్టర్ గారికి కూడా జాగ్రత్తగా చూసుకోండని చెప్పి వెళిపోయారు. డాక్టర్ గారికి పాప, బాబు. పాప 4, బాబు కిండర్ గార్డెన్. పాప స్కూల్ మేం ఉంటున్న అపార్ట్మెంట్ కి ఎదురుగానే. బాబు స్కూల్ కొద్దిగా పక్కన. డాక్టర్ గారు 6 గంటలకు డ్యూటీకి వెళిపోవాలి. పాపకి  8 కి, బాబుకి 11కి స్కూల్. స్కూల్ కి పంపడం, తీసుకురావడం, వాళ్ళను డాక్టర్ గారు వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకోవడం నా పని. నాకో రూమ్, వాళ్ళ ముగ్గురికి ఓ రూమ్. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో...  

13, ఫిబ్రవరి 2021, శనివారం

ఏక్ తారలు...!!

1.   అప్పగింతల అంపకాలివి_బుుణశేషాలను అక్షరాలకిచ్చేస్తూ..!!
2.   ఎడబాటు తాత్కాలికమే_ఆత్మనివేదన అక్షరాలదైతే..!!
3.  మనిషిని ఏమార్చడం సుళువే_మనసుని మళ్ళించడమే కాస్త కష్టం...!!
4.  మౌనమెప్పుడూ మంచిది కాదంటున్నా_తప్పొప్పులు తెలియజెప్పడం మన ధర్మమంటూ...!!
5.  భారాన్ని పంచుకునే కన్నీటిచుక్కకు తెలుసు_జ్ఞాపకాల విలువెంతో...!!
6.  ఓటమి నుండి నేర్చుకున్న పాఠమిది_గెలుపోటములను సమతూకమేస్తూ...!!
7.  తరగని ఆత్మీయతలే ఇప్పటికీ_కాలాన్ని శాసించే డబ్బు బంధాల మధ్యన...!!
8.   మమత పంచే అక్షరాలివి_మార్పులను చేర్పులను అక్కున చేర్చుకుంటూ...!!
9.   మారని మనసు పాశాలివి_చెప్పుడు మాటలకు చెదరని బంధాలతో...!!
10.   కొన్ని సాయంకాలాలను ఆహ్వానించా_తడిమిన జ్ఞాపకాలకు గుర్తులుగా....!!
11.   కొన్ని ఓటములను గుర్తు చేసుకున్నా_విజయపు పొద్దులను స్వాగతించాలని...!!
12.   వెన్నెలనూ వద్దనే ఉండమన్నా_చీకటి చుట్టానికి చోటిద్దామంటూ..!!
13.   మది కన్నీరది_అక్షరం ఓదారుస్తోందంతే...!!
14.   ఓటమిని భరించే తెగువుంటే చాలు_జీవితాన్ని గెలిచినట్లే...!!
15.   మనిషితనం మాటల్లోనే_బంధాలను తూకమేసే తక్కెడలో మెుగ్గు ధనానిదౌతూ..!! 
16.  మనసు పంచుకున్న చెలిమిది_అక్షరమే అలంకారమై అమరినప్పుడు...!!
17.  కొన్ని రాతలంతే_మన మనసుని చదివేసినట్టుగా...!!
18.   గుర్తులను వదలివేశాననుకున్నా_నా గుర్తింపే నీవని మరచి..!!
19.   సాక్ష్యాలతో పనేముంది?_చెలిమి చిరునామానే మనమైనప్పుడు...!!
20.   మమతలే దగ్గర చేసాయి_సంతసాల సంతకాలే వీలునామాలంటూ...!!
21.   చదువరుల గొప్పదనమది_మనసాక్షరాలను గుర్తించడంలో..!!
22.   అలక తీర్చే సమయమాసన్నమైంది_పలాయన బంధాలకు ధీటుగా చెలిమినందిస్తూ...!!
23.  మారిన తలరాతను అంగీకరించాలి మరి_మన చేవ్రాత బాగున్నా లేకున్నా...!!
24.   శేషాలు ఎక్కువైపోయాయి_వడపోతల ఎక్కాలు సరిగా రాక..!!
25.  ఏ జన్మ బంధమెా ఇది_అక్షరాలతో చేరి అక్కున చేరిందిలా...!!
26.  బతుకుపాట బాగా నేర్చుకున్నాననుకున్నా_పాడటమసలేం రాదని తెలియక..!!
27.   ఓటమిని ఒప్పుకోవద్దంటోంది మనసు_పోరాట పటిమను పెంచుకోమంటూ...!!
28.  జ్ఞాపకాలే ఆలంబన_చేజారిన జీవితానికి...!!
29.   మౌనంలోనూ మాటలే మన మధ్యన_మనసుల ఊసులు పంచుకుంటూ...!!
30.   తప్పించుకునే నైజం కాదిది_నమ్మితే ఊపిరినైనా వదిలేసే చెలిమిది..!!

12, ఫిబ్రవరి 2021, శుక్రవారం

కానుక...!!

నేస్తం, 
        రాసే అలవాటున్న వారిని కొన్ని పదాలో లేక కొన్ని భావాలో రాసే వరకు వదలవన్నది సత్యం. అవి భూగోళం చుట్టూ ఆవరించుకున్న నీరులా నిరంతరం పలకరిస్తూనే ఉంటాయి. గాయాలు గతానివైనా ఆ ఫలితం వర్తమాన, భవిష్యత్ కాలాలను ప్రభావితం చేయక మానదు. మన ఒంటరితనానికి ఎవరినో బాధ్యులను చేయడం సబబు కాదు. అలా అని మనకు నచ్చినవారిని అతిగా విసిగించడమూ కరక్ట్ కాదు. పలకరింపు అనేది మనసుకు ఆహ్లాదాన్ని పంచాలి కాని జీవితం మీద విసుగును కలిగించకూడదు. ఎంతసేపూ మన కోణంలో ఆలోచించడం, ప్రతి రాతను మనకు అన్వయించుకోవడం లేదా రాసిన వారికి అంటగట్టడం, మన అభిప్రాయాలను, ఇష్టాలను ఎదుటివారి మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం...ఇలాంటి మానసిక లక్షణాలను ఎంత తర్వగా వీలైతే అంత త్వరగా వదిలేయడానికి ప్రయత్నించాలి. ప్రపంచంలో ఉన్న అందరికన్నా మనదే పెద్ద సమస్య అని అనుకోవడమెా మానసిక జాడ్యం. 
         మాట తూలితే వెనుకకు తీసుకోవడం కుదరదని తెలిసి కూడా, మన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారి మీద నిందలు వేసేస్తాం చాలా తేలికగా. వయసు పెరుగుతున్న కొద్ది మానసిక పరిణితి మందగించడం బాధాకరం. అన్నీ తెలిసిన మనం మన అతి ప్రవర్తనతో ఎదుటివారిని ఇబ్బంది పెడుతున్నామని తెలుసుకోలేక పోతున్నాం. ఏదైనా మితంగా ఉంటేనే విలువని గుర్తించలేక పోతున్నాం. ఓ తెగ ప్రేమని చూపించేయడం, అంతలోనే మనసును కష్టపెట్టే మాటలనడం, మళ్లీ పలకరించడం...ఇవన్నీ అవసరమా! అతిగా ప్రవర్తిస్తున్నామని మనకనిపించక పోవడం నిజంగా బాధాకరమైన విషయమే. ముందు మన మానసిక స్థితిని తెలుసుకోవడం అవసరం. తర్వాత పక్కవారి తప్పులను ఎత్తిచూపుదాం. 
         ఎవరైనా ఓ విషయం గుర్తుంచుకోవాలి. మన సమయం మనకెంత ముఖ్యమెా ఎదుటివారి సమయం కూడా వారికంతేనని. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడటం మానేసి, కాస్త మనసుతో ఆలోచించ గలిగితే అంతా బావుంటుంది. మన మాటలతో ఎదుటివారిని బాధపెట్టి, రాక్షసానందం పొందటం సమంజసం కాదని తెలుసుకుంటే చాలు. బతికి నాలుగు రోజులు ప్రశాంతంగా మనముంటూ మన చుట్టూ ఉన్న వారిని కూడా ప్రశాంతంగా ఉంచగలుగుతాం. ఇదే మనం వారికిచ్చే విలువైన కానుక. 
          

11, ఫిబ్రవరి 2021, గురువారం

త్రిపదలు..!!

8, ఫిబ్రవరి 2021, సోమవారం

కాలం వెంబడి కలం... 40

     రెనో లో ఫ్లైట్ దిగి, ఎయిర్ పోర్ట్ లో నుండే అబ్బు శ్రీనివాస్ కి కాల్ చేసాను.  రెనో నుండి ఎలా రావాలని. కాబ్ మాట్లాడుకుని రమ్మని చెప్పారు. సరేనని ఎయిర్ పోర్ట్ బయటికి వచ్చి కాబ్ లో కార్సన్ సిటి బయలుదేరాను. నవేడా స్టేట్ కాపిటల్ కార్సన్ సిటీ. అమెరికాలో స్టేట్ కాపిటల్స్ ఎక్కువగా చిన్న చిన్న ఊర్లే ఉంటాయి. కార్సన్ సిటి మెుత్తం ఎటునుండి ఎటు తిరిగినా 2, 3 మైళ్ళ కన్నా ఎక్కువ ఉండదు. అబ్బు ఉండే మెాటల్ దగ్గరకి వెళ్ళేసరికి అబ్బు, సంపత్ ఇద్దరు సంపత్ జీప్ వేసుకుని వచ్చారు. లగేజ్ అబ్బు రూమ్ లో పెట్టి ఆఫీస్ కి వెళ్ళాము ముగ్గురము.  లోపలికి వెళ్ళాక వీళ్ళు నేను వచ్చానని చెప్పగానే, కాసేపటికి మైక్ వచ్చి లోపలికి తీసుకువెళ్ళి, డ్రింక్ ఏమైనా  కావాలా అని అడిగితే వాటర్ కావాలన్నాను. బాటిల్ తెచ్చి ఇచ్చాడు. మానేజర్ ఈరోజు రాలేదు రేపు వస్తాడు, మీకు వర్క్ ఎలాట్ చేస్తాడని చెప్పి, నాకు మిగతావాళ్ళ దగ్గర సిస్టమ్, సీట్ చూపించాడు. వాళ్ళందరు వర్క్ చేసుకుంటునే నాతో మాట్లాడం, అలా లంచ్ టైమ్ వచ్చేసింది. 
          అబ్బు, సంపత్ రోజూ సంపత్ ఇంట్లోనే లంచ్ చేస్తారు. మరో శ్రీనివాస్, శ్యామ్ వాళ్ళిళ్ళకి వెళతారు. సంపత్ రోజూ అబ్బూని ఆఫీస్ కి తీసుకురావడం, సాయంత్రం దింపడం చేస్తాడు. నన్ను కూడా సంపత్ వాళ్ళింటికే భోజనానికి తీసుకువెళ్ళారు. భోంచేసాక ఓ కోక్ టిన్ ఇస్తే అలవాటు లేదన్నా. పర్లేదు తాగమంటే నా హాండ్ బాగ్ లో వేసుకున్నా. మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాం. సాయంత్రం అబ్బు రూమ్ కి వచ్చాం. వంట నేను చేస్తానని చేసాను. పాపం ఒక్కడే ఉండే అలవాటు కదా... ఎంప్లాయర్ మాట కాదనలేక నేను నాలుగు రోజులు ఉండటానికి ఒప్పుకున్నాడు కాస్త ఇబ్బందిగా. నేను నా కంఫర్టర్ వేసుకుని కింద పడుకున్నా. మెాటల్ లో బెడ్, టీ వి, వంట పాత్రలు కొన్ని ఇస్తారు. చిన్న డైనింగ్ టేబుల్ సెట్ కూడా ఇస్తారు కొన్ని చోట్ల. 
    మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్ళాక, ప్రాజెక్ట్ మానేజర్ క్రిష్ వస్తే, తనతో మాట్లాడటం, టెన్షన్ పడకుండా, ఫ్రీగా వర్క్ చేసుకో, విల్ సపోర్ట్ యు.. అని వర్క్ ఎలాట్ చేసారు. VC++ లో బిడ్ బార్ ని డిజైన్ చేసి పేజ్ లింక్ లు Vb లో చేసిన వాటికి ఇమ్మని చెప్పారు. మనం ఈ ప్రాజెక్ట్ కి వచ్చింది  VC++లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగానన్నమాట. మనకేం రాదని చెప్పలేము. ఇక మన కష్టాలు మెుదలు. మనకా  VC++ చదివిన నాలెడ్జే కాని ప్రాక్టికల్ గా లేదాయే. సరే ఆరోజు అసలు ఏం చేయాలో, ఏమిటో అన్ని చూసుకుంటూ నోట్సు రాసుకున్నా. సాయంత్రం రూమ్ కి వచ్చాక పుస్తకాలు ముందేసుకుని రేపు చేయాల్సిన వాటి గురించి చూసుకుంటున్నా. అబ్బు అడిగాడు...వెంకట్ మీరు బాగా ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పాడంటే, నేను కాదని నా పరిస్థితి ఇదని చెప్పా.  మానేజర్ క్రిష్ చాలా మంచోడు, కంగారు పడకుండా మెల్లగా చేసుకోండని అబ్బు చెప్పాడు. అలాగే ఆ వీక్ గడిచింది. వీకెండ్ కొత్తగా మా ఆఫీస్ లో చేరే కాలే శ్రీనివాసరావు దంపతులు అబ్బు రూమ్ కి వచ్చారు. వాళ్ళు ఇల్లు చూసుకుంటున్నారు. నన్ను వాళ్ళతో షేర్ చేసుకోమన్నారు. నాకేమెా అంతా కొత్త కదా.. పోన్లే కాస్త ఖర్చు తగ్గుతుంది, కార్ తో కూడా పని ఉండదు, కాలే శ్రీనివాసరావు గారు తీసుకువెళతారులే, లేదంటే అదే అపార్ట్మెంట్స్ లో మరో శ్రీను, శ్యామ్ కూడా ఉంటున్నారు. ట్రాన్స్పోర్ట్ కి ప్రోబ్లం ఉండదులే అనుకున్నా. అబ్బు హెల్ప్ తో బాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, డబ్బులు దానిలో వేశాను. బాంక్ మనీ మెషిన్ లో డబ్బులు, చెక్ ఎలా డిపాజిట్ చేయాలో కూడా అబ్బునే చూపించాడు. వీకెండ్ అబ్బు రూమ్ లో కాలిఫోర్నియాలోని వాళ్ళ అన్నయ్య  దగ్గర నుండి తెచ్చుకున్న తెలుగు సినిమాలు చూడటంతో గడిచిపోయింది. నేను నా పెళ్ళైన తర్వాత చూడని సినిమాలన్నీ అమెరికా వెళ్ళాక చూసేసానన్నమాట. 
         మెుత్తానికి కాలే దంపతులతో కలిసి కొత్త ఇంటికి వచ్చాను. మా ప్రాజెక్ట్ లో పనిచేసే వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. మాది డబల్ బెడ్ రూమ్. ఓ రూమ్ నాది. ఇక మెుదలయ్యాయి నా పాట్లు. నాకేమెా పొద్దున్నే లేచే అలవాటు. ఆఫీస్ కి రడీ అయ్యి కాఫీ నేను పెట్టుకుంటూ వారిద్దరికి కూడా పెట్టిచ్చేదాన్ని. ఎందుకో తెలియదు కాని కాలే శ్రీనివాసరావు గారికి నేను ఏం చేసినా నచ్చేది కాదు. పేర్లు పెడుతూనే ఉండేవారు. అలా మెుత్తానికి నాకు కాఫీ పెట్టడం రాదని తేల్చేసారు. ఆవిడ పేరు నాకు గుర్తు లేదు కాని ఏ మాటకామటే... ఆవిడ ఏం మాట్లాడేది కాదు. నేను పట్టించుకోనట్టే ఉండటానికి ట్రై చేయడం మెుదలెట్టా. మధ్యాహ్నం లంచ్ ఆవిడే ప్రిపేర్ చేసేవారు. సాయంత్రం వచ్చాక మెుత్తం అంట్లు నా పనన్న మాట. నైట్ కూడా అన్ని  క్లీన్ చేసేసి పడుకునేదాన్ని.                    
        నాకేమెా VC++థియరీ నాలెడ్జ్ మాత్రమే ఉందాయే. కైలాష్ పుణ్యమా అని తన ఫ్రెండ్ కాలే VC++ లో వర్క్ చేయడం, తన ఫోన్ నెంబరిచ్చి హెల్ప్ చేస్తాడని చెప్పాడు. కాలే చాలా మంచబ్బాయ్. రోజూ నా డౌట్స్ అన్నీ సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక ఫోన్ చేసి అడగడం, తను క్లియర్ చేయడం ఇలా ఓ 15, 20 రోజులు బాగా కష్టపడ్డాను. తర్వాత బాగా ఈజీ అయిపోయింది వర్క్. ఆ టైమ్ లోనే నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ యశోద నాకు VC++ పుస్తకం ఆన్ లైన్ లో కొని పంపించింది.  నాకు అప్పటికి ఇంకా ఫోన్ లేదు. ఈ దంపతులు ఇంటికి లాండ్ లైన్ పెట్టించారు. అప్పట్లో ఇంటర్నెట్ కూడా లాండ్ లైన్ తోనే కనక్ట్ చేసుకునే వాళ్ళం. వాళ్ళకు డెస్క్ టాప్ కంప్యూటర్ కూడా ఉంది. లాండ్ లైన్ ఫోన్ ఈ స్టేట్ వరకే ఫ్రీ కాల్స్. వేరే స్టేట్స్ కి చేయాలంటే కాలింగ్ కార్డ్స్ వాడుకోవాలి. నాకు నరసరాజు అంకుల్ ఓ 1 800 నంబర్ ఇచ్చారు. ఇండియాకి చేసుకోవడానికి. నేనది ఈ ప్రాజెక్ట్ లో డౌట్స్ కోసం కూడా వాడేసాను తెలియక. పాపం అంకుల్ కి ఎక్కువ బిల్ వచ్చి, ఫోన్ చేసి అడిగితే ఇలా వాడానని చెప్పాను. ఇక్కడ ఫోన్ చేయడానికి వేరే కాలింగ్ కార్డ్స్ ఉంటాయని చెప్పారు. అప్పుడు ఇంకో శ్రీనివాస్ సంధ్య వాళ్ళతో  Cost Co కి గ్రోసరీస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ కాలింగ్ కార్డ్స్ కూడా కొనుక్కున్నా. నేను ఇంటికి చేయడానికి కూడా 10 డాలర్ల కాలింగ్ కార్డ్ కొంటే 12 నిమిషాలు వచ్చేది మెుదట్లో. తర్వాత తర్వాత 24 మినిట్స్ వచ్చేవి. నరసరాజు అంకుల్, గోపాలరావు అన్నయ్య ఫోన్ చేస్తూనే ఉండేవారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మా పెద్దమ్మ చెల్లెలి కొడుకు ప్రసాద్ అన్నయ్య కూడా నేను అమెరికా వచ్చినప్పటి నుండి మాట్లాడుతునే ఉండేవాడు. అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి చూసివెళ్ళాడు కూడా. 
        ఇక మా రూమేట్స్ నాతో బాగా ఆడుకునే వారు. వాళ్ళ ప్రెషర్కుక్కర్ లో నేను ఏదో పెడితే సేఫ్టీ వాల్వ్ పోయింది. దానికి అది నన్నే కొనిమ్మన్నారు. నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ శోభ కాలిఫోర్నియాలో ఉండేది. తనకి ఫోన్ చేసినప్పుడు ఈ సేఫ్టీ వాల్వ్ గురించి ఎక్కడ దొరుకుతుందని అడిగితే, నా దగ్గర ఉంది, నేను పంపిస్తాను అని నా అడ్రస్ తీసుకుని సేఫ్టీ వాల్వ్ పంపించింది. ఇలా రోజూ ఏదోక దానికి ఆయన  నన్ను సాధించడం, ఆవిడేమెా ఏమీ మాట్లాడకపోవడం, అలా నడుస్తోంది. నాకేమెా ఎంత అడ్జస్ట్ అవుదామన్నా వీలుకాకుండా ఉంది. ఆవిడకు ఆవిడ మీద చాలా నమ్మకం తను బాగా తెలివైనదాన్నని. నేను ఎందుకు పనికిరాని దానినని. జాబ్ కూడా ఆవిడకు రావాల్సింది, ఏదో నా లక్ బావుండి నాకు వచ్చిందని. ఆఫీసులో కూడా ఈయన అందరిని ఏదోకటి అనడంతో మా చుట్టుపక్కల వాళ్ళందరు కాస్త దూరంగానే ఉండేవారు. నాతో బావుండేవారు. అది కూడ వీళ్ళకి నామీద కోపం పెరగడానికో కారణమైయుండవచ్చు. 
          ఓ వీకెండ్ సంధ్యా  శ్రీనివాస్ వాళ్ళు " లేక్ తాహు " చూడటానికి వెళుతూ నన్ను రమ్మన్నారు. వాళ్ళకు  వన్ ఇయర్ పాప. పేరు సహన. నాకు బాగా అలవాటైపోయింది. తన స్పెషాలిటి ఏంటంటే అమ్మాయిల దగ్గరకస్సలు వెళ్ళదట. కాని నా దగ్గరకు బాగా వచ్చేది. నేనూ మా మౌర్యని వదిలి వచ్చానేమెా, తనతోనే ఎక్కువగా ఆడుకునేదాన్ని. "లేక్ తాహు  "  వెళుతున్నానని నరసరాజు అంకుల్ కి చెప్తే బావుంటుంది,ట్రెక్కింగ్ అది ఉంటుంది చూడు అని చెప్పారు. శ్రీను వాళ్ళ కార్ లో వాళ్ళు ముగ్గురు, నేను బయలుదేరాం. మాటల్లో శ్రీను మంజూ నువ్వు వచ్చి 6 నెలలు కాకుండానే ఇవన్నీ చూసేస్తున్నావు, నేను వచ్చిన 4, 5 ఏళ్ళకు కాని చూసే అవకాశం రాలేదని నవ్వాడు. బాగా స్నో ఉన్న చోట ఫోటోలు దిగుతూ, కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం బాగా జరిగింది. అలా లేక్ తాహు వెళ్ళే దారిలో కొండలు,లోయలు, టన్నెల్ కూడా ఆ లాంగ్ డ్రైవ్ లో చూసేసాను.


వచ్చే వారం మరిన్ని కబుర్లతో...... 

6, ఫిబ్రవరి 2021, శనివారం

ప్రశ్న(?)..!!

మనిషిగా మనలేనప్పుడు
మరో దారేది? 

మనసు మాట వినలేనప్పుడు 
బతుకుకర్థం ఏమిటి? 

బిడ్డగా బాధ్యతలు పంచుకోలేనప్పుడు
వారసత్వపు హక్కులెక్కడివి? 

తలిదండ్రులుగా బంధాలను కాదనుకున్నప్పుడు
ఆప్యాయతలెలా దొరుకుతాయి? 

ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు 
ఎలా చేరాలన్న సమస్యెందుకు? 

జీవించటమెలాగో ఎరుకలేనప్పుడు
జన్మకు సార్థకతేది? 

నాకు నేను ప్రశ్నగా మిగిలిపోయినప్పుడు
జవాబెక్కడని వెదకను...?

1, ఫిబ్రవరి 2021, సోమవారం

కాలాతీతం...!!

మనిషెప్పుడూ 
గెలుపునే కోరుకుంటాడనిపిస్తుంది

మనసెప్పుడూ 
సంతోషాన్నే స్వాగతిస్తుంది

సమయమెప్పుడూ 
తన మానాన తనెళ్ళిపోతుంటుంది

అహమెప్పుడూ
తనదే ఆధిపత్యమంటుంటుంది

ఓరిమెప్పుడూ
అణుకువగానే ఉంటుంది

కోపమెప్పుడూ
మన చేతగానితనాన్నే చూపెడుతుంటుంది

ఉక్రోషమెప్పుడూ
బాల్యాన్ని తలపిస్తుంటుంది

తప్పొప్పులెప్పూడూ
జీవితపు లెక్కలు సరి చూసుకోమంటాయి

జ్ఞాపకాలెప్పుడూ 
కాలాతీత క్షణాలను గుర్తు చేస్తుంటాయి

జీవితమెప్పూడూ
నేర్చుకోమని చెప్తూనే ఉంటుంది...!! 

కాలం వెంబడి కలం..39

        అన్నయ్య నాకు అమెరికన్ యాక్సెంట్ అర్థం కావడానికి టి వి చూడమని చెప్తూ, జీరోని ఓ(O) అంటారని, Z ని జీ అంటారని, పదంలో సెకెండ్ లెటర్ని సాగదీస్తారని ఇలా కొన్ని చిట్కాలు చెప్పాడు. అన్నయ్య ఇంకో మాట కూడా చెప్పాడు. అమెరికాలో కాలేజ్ ని స్కూల్ అంటారని కూడా. నాకు అమెరికాలో ఇళ్ళు చూస్తే భలే ఆశ్చర్యం వేసేది. గోడలకు రాళ్ళ(ఇటుకలు) కన్నా ఎక్కువ అద్దాలు ఉండేవి. నాకు ఓ పేద్ద అనుమానం వచ్చి వదినని అడిగాను. వదినా దొంగలకు గోడలు పగలగొట్టడం కన్నా గ్లాసులు పగలగొట్టడం తేలిక కదా అని. వదిన నవ్వి ఇక్కడ గ్లాసెస్ పగలగొడితే చాలా పెద్ద క్రైమ్ అని చెప్పింది. అప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నా. అలా నా యక్ష ప్రశ్నలతో అందరిని కాస్త విసిగిస్తూ ఉండేదాన్ని. 
        బెల్ ఎయిర్ లో అన్నయ్యా వాళ్ళింట్లో ఉన్నప్పుడు స్నో కొద్దిగా పడితేనే అదో వింతలా చూసిన నేను..చికాగోలో ఫ్లైట్ దిగిన రోజు 6 అడుగుల స్నో బయటంతా. విపరీతమైన చలి. డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ నుండి అరోరా HNC Solutions కంపెని గెస్ట్ హౌస్ కి రావడానికి కాబ్ మాట్లాడుకుని నా లగేజ్ వేసుకుని బయలుదేరాను. పాపం కాబ్ డ్రైవర్ చాలా మంచోడు. అడ్రస్ కనుక్కుని మరీ నన్ను సేఫ్ గా చేర్చడమే కాకుండా నా లగేజ్ రెండు పెద్ద సూట్కేస్ లు కూడా తెచ్చి గుమ్మం ముందు అదేలెండి తలుపు ముందు పెట్టి వెళ్ళాడు. మీటర్ ఛార్జ్ ఎంతయ్యిందో గుర్తులేదిప్పుడు. ఓ 140 డాలర్లు అయ్యిందనుకుంటా. కాలింగ్ బెల్ కొట్టగానే వినయ్ గారి వైఫ్ తలుపు తీసారు. లగేజ్ పైన రూమ్ లో పెట్టాను. వినయ్ గారు ఆఫీస్ నుండి వచ్చి కాసేపు మాట్లాడారు. అప్పుడు వాళ్ళకు నెలల బాబు సత్య కూడా ఉన్నాడు. వినయ్ గారి ఫ్రెండ్ బ్రహ్మయ్య కూడా పరిచయమయ్యారు. నేనున్న గెస్ట్ హౌస్ కి కాస్త దగ్గరలోనే మరొక గెస్ట్ హౌస్ లో కొందరు అబ్బాయిలున్నారు. మా అందరికి పీపుల్ సాఫ్ట్ క్లాసులు మెుదలయ్యాయి. నాతో కలిపి ఐదుగురు అనుకుంటా మా బాచ్. నేను ఒక్కదాన్నే అమ్మాయిని. కొత్తది నేర్చుకోవడం బానే ఉంది. మాలో మూర్తికి ముందే పీపుల్ సాఫ్ట్ వచ్చు. మాతోపాటుగా మరి కొందరికి ఒరాకిల్ ఫైనాన్షియల్, జావా లాంటి కోర్సులు కూడా నేర్పించారు. ఆ టైమ్ లోనే ఒకబ్బాయి ఈ కంపెనీ నుండి వేరే కంపెనీకి మారిపోయాడు. అదో పెద్ద గొడవ అప్పుడు. నేను వినయ్ గారి కుటుంబంతో కలిసి భోజనం చేసేదాన్ని. ఆవిడ పేరు కూడా మంజునే. ఆవిడే వంట చేసేవారు ఎక్కువగా. ఓ రోజు పారాడైమ్ కంపెనీ అతను ఫోన్ చేసి ఇన్ హౌస్ ప్రాజెక్ట్ ఉంది వచ్చేయండి అన్నాడు. నాకు మాట్లాడటం రాదని వాళ్ళు వేసుకున్న జోక్స్ నాకు బాగా గుర్తున్నాయి. నేను అంతలా బాధ పడటానికి కారణం వీళ్ళు కూడా. అందుకే రానని ఖచ్చితంగా చెప్పేసాను. వినయ్ గారు ఎవరు ఫోన్ అని అడిగితే విషయం చెప్పాను. బాబ్ కి ఇష్టం ఉండవు ఇలాంటి విషయాలు, వాళ్ళతో చెప్పేయండి ఫోన్ చేయవద్దని అని అంటే చెప్పేసానండి అని చెప్పాను. 
           HNC Solutions కంపెనీ CEO రఘుబాబు పోతిని. బాబ్ అన్న పేరుతో అమెరికాలో చలామణి అవుతున్నారన్నమాట. ఓ నార్త్ ఇండియన్ ఆమె, ఈయన కలిసి ఉంటున్నారని సూచాయగా అందరికి తెలుసు. ఆమె కూడా కంపెనీ వ్యవహారాలన్ని చూస్తుండేది. మాతో కాస్త కలివిడిగా మాట్లాడేది. బాబ్ సీరియస్ గా ఉండేవాడు. నా పర్సనల్ విషయాలు అడిగితే సూర్యవంశం టైప్ స్టోరి, కాకపోతే నేను కలక్టర్ ని కాదు అని చెప్తే నవ్వేసి, అంతకన్నా ఎక్కువే అంది. అన్నట్టు ఆమెకు తెలుగు రాదండోయ్. మనకా ఇంగ్లీష్ అంతంత మాత్రమేనాయే. అయినా కమ్యూనికేషన్ కి ఏం ప్రోబ్లం ఉండేది కాదు. మహానటి సినిమాలో సావిత్రి అన్నట్టు భాషదేం ఉంది..భావం ముఖ్యమన్నట్టుగా. 
           వేరే కోర్సుల కోసం మిగతావారు కూడా రావడంతో వినయ్ గారు వేరే ఇంటికి మారాలనుకున్నారు. కైలాష్, షన్ముఖ్ ఇంకా 4,5 అమ్మాయిలు గెస్ట్ హౌస్ కి వచ్చారు. పగలంతా ట్రైనింగ్ క్లాసులతో సరిపోయేది. వచ్చాక తిండి, చదువుకోవడం, నిద్ర టైమ్ కుదిరినప్పుడు ఇంటికి ఫోన్ చేయడం, క్షేమ సమాచారాల కబుర్లతో కాలం జరిగిపోతోంది. చికాగో వచ్చినప్పటి నుండి కళ్యాణ్ వాళ్ళు కొనిచ్చిన కంఫర్టర్ నాలో ఒక భాగమైపోయింది మళ్ళీ నేను అమెరికా వదిలి వచ్చేవరకూ. 
          మేము ఆఫీస్ కి వెళ్ళే దారిలోనే అరోరా వేంకటేశ్వరస్వామి గుడి ఉండేది. శుక్ర, శని, ఆదివారాల్లో కుదిరినప్పుడు టెంపుల్ కి వెళ్ళి, అక్కడ విష్ణు సహస్ర నామావళిలో మేమూ పాల్గొంటూ ఉండేవారం. చాలా ప్రశాంతంగా ఉండేది అక్కడి వాతావరణం. అమెరికాలో మెుదటి న్యూ ఇయర్ పార్టీ జరిగింది. వినయ్ గారు పొద్దున్నే కూర్చోబెట్టి మంచిమాటలు చెప్పి, భవిష్యత్తు మీద నమ్మకాన్ని కలిగించారు. తర్వాత వాళ్ళు ఇల్లు మారిపోయారు. 
            న్యూ ఇయర్ పార్టీ బాగానే జరిగింది. మనకేమెా అమెరికన్ ఫుడ్ ఏదీ తెలియదు. పేర్లు కూడా తెలియవాయే. పీజా పేరు తెలుసంతే. నాతో ఉండే పిల్లలు ఎవరో ఒకరు ఆర్డర్ చేసేవారు. కైలాష్ ఓసారి చికాగోలోని దీవాన్ స్ట్రీట్ కి తీసుకువెళ్ళాడు వీకెండ్. మరో చార్మినార్ చౌరస్తాలా ఉంటుంది, పాన్ ఉమ్ములు, గుట్టలు గుట్టలుగా జనాలు, పార్కింగ్ చేయడానికి కూడా ఖాళీ దొరకనంత బిజీగా ఉంది దీవాన్ స్ట్రీట్. దోశలు వేయడానికి మినప్పిండి(ఉరద్ ఫ్లోర్)అక్కడే మెుదట చూడటం. 4 కప్పులు బియ్యం పిండికి 1 కప్పు మినప్పిండి అంట. తర్వాత అలానే కలిపి దోశలు వేసి చూపించాడు కైలాష్. కావాల్సిన గ్రోసరీస్ కొనుక్కుని సాయంత్రానికి గెస్ట్ హౌస్ కి వచ్చేసాము. కైలాష్ కి ప్రాజెక్ట్ అయిపోయి గెస్ట్ హౌస్ కి వచ్చాడు. ఒరాకిల్ ఫైనాన్షియల్ ట్రైనింగ్ కోసం. అది ఇంజనీరింగ్ లో మా సీనియర్ తిరుమలరెడ్డి చెప్పారు. కైలాష్ నా గురించి చెప్తే వచ్చి కలిసి మాట్లాడి, మా సీనియర్ అక్కా వాళ్ళ వివరాలు, ఫోన్ నెంబర్లు చెప్పి వెళ్ళారు. అలా మా సీనియర్స్ కొందరు కూడా టచ్ లోకి వచ్చారన్న మాట కైలాష్ పుణ్యమా అని.
         కైలాష్, ఇంకా కొంతమంది పిల్లలతో గెస్ట్ హౌస్ సందడిగానే ఉండేది. ఈలోపల నా పుట్టినరోజు వచ్చేసింది. అందరు కలిసి కేక్ తీసుకువచ్చి నాకు సర్ప్రయిజ్ ఇచ్చారు ఆ రాత్రి 12 గంటలకి. మరుసటిరోజు బాబ్ కూడా కాల్ చేసి విష్ చేసారు. వినయ్ గారు, నా ఫ్రెండ్స్ అందరు విష్ చేసారు. అన్నయ్య వాళ్ళింట్లో ఉన్నప్పుడు కూడా  5 నిమిషాలయినా రోజూ లేదంటే రోజు విడిచి రోజయినా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. పాపం అన్నయ్యకు నా మూలంగా ఫోన్ బిల్ ఎక్కువే వచ్చి ఉంటుంది. అయినా ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. చికాగో వచ్చాక నరసరాజు అంకుల్ ముందు ఓ నెంబర్ ఇచ్చారు ఇండియాకి కాల్ చేసుకో అని. ఉమలు ఇద్దరు, సతీష్ కూడా కాలింగ్ కార్డ్స్ ఇచ్చారు. రోజూ ఇంటికి ఏదొక టైమ్ లో ఫోన్ మాట్లాడుతునే ఉండేదాన్ని. సంవత్సరంనర్ర కొడుకుని వదిలి దేశం కాని దేశం ఒంటరిగా వచ్చాను కదా. ఫోన్ లో మాట్లాడుతూ బెంగ తీర్చుకోవడమే. 
         ట్రైనింగ్ అయ్యాకా అమ్మాయిలందరు వెళిపోయారు. వాళ్ళంతా H4 డిపెండెంట్ వీసా మీద ఉన్నవాళ్లు. H1B కి డిపెండెంట్ ను H4 వీసాగా పరిగణిస్తారు. వీళ్ళు H4 వీసాతో జాబ్ చేయకూడదు. H1B గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా డిపెండెంట్ వీసా మీద వచ్చిన చాలామంది MS లో జాయిన్ అవుతారు. అమెరికాలో ఉండటానికి వీసా స్టేటస్ చాలా ముఖ్యం. అమ్మాయిలు వెళ్ళిన కొన్ని రోజులకే కైలాష్ కూడా వెళిపోయాడు. ఒక ఫామిలి గెస్ట్ హౌస్ కి వచ్చారు. వాళ్ళు వచ్చిన రెండు మూడు రోజులలోనే నాకు VC++ లో ప్రాజెక్ట్ ఉందని బాబ్, వినయ్ గారు చెప్పారు. జనవరి చివరిలో నాకు జాబ్ కార్సన్ సిటిలో వచ్చింది. కైలాష్ కి, నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పాను. ఇంటికేమెా రోజూ చేస్తూనే ఉన్నా. కార్సన్ సిటికి బయలుదేరే ముందురోజు షన్ముఖ్ మా గెస్ట్ హౌస్ కి కాస్త వాకబుల్ డిస్టెన్స్ లో వాల్ మార్ట్  అనుకుంటా సరిగా గుర్తు లేదు షాప్ కి తీసుకువెళ్ళి కావాల్సినవి చెప్తే కొనుక్కున్నాను. మౌత్ ఫ్రెషనర్, సోప్స్, డియడరెంట్స్ లాంటివన్న మాట. ఎయిర్ టికెట్ కంపెనీ వాళ్ళు బుక్ చేసారు. నా చేతికి 400ల డాలర్లు కూడా ఇచ్చారు. మరుసటిరోజు చికాగో డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ కి కాబ్ బుక్ చేసుకున్నా. కార్సన్ సిటిలో బాబ్ వాళ్ళ బాబాయి వెంకట్ అని ఆయన కంపెనీ వాళ్ళు నలుగురు నేను పని చేయాల్సిన ప్రాజెక్ట్ లోనే ఉన్నారు. వాళ్ళలో ఒకతని ఫోన్ నెంబర్, అడ్రస్ ఇచ్చారు. తన దగ్గరకి వెళ్ళి కలవమని. సాయంత్రం నా ఫ్లైట్. ఆరోజు ఉదయం నుండి జ్వరంతో ఉన్నా. నాతో గెస్ట్ హౌస్ లో ఉన్నామె ముందురోజు తను ప్రాజెక్ట్ నుండి ఎందుకు త్వరగా బయటకు వచ్చేసిందో, తన బాధల గాథలు చెప్పింది. మానేజర్ పార్టీకి రమ్మని పిలిచారు, వెళ్ళలేదని, అందుకే జాబ్ నుండి తీసేసారని చెప్పింది. విని ఊరుకున్నా. జ్వరంతో ఏమీ తినలేదని నూడిల్స్ చేసింది. నాకసలు పడవవి. కొద్దిగా తిని నా సూట్కేస్లు రెండు, హాండ్ లగేజ్, హాండ్ బాగ్తో కార్సన్ సిటికి వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ కి కాబ్ లో బయలుదేరా. దారిలో బాగా వామిటింగ్ అయ్యింది. వర్షం కూడా మెుదలయ్యింది. అలాగే ఎయిర్ పోర్ట్ కి వెళ్ళి లగేజ్ చెక్ ఇన్ చేసి, బోర్డింగ్ పాస్ తీసుకుని గేట్ దగ్గరకి వెళ్ళాను. ఫ్లైట్ లేట్ అన్నారు. వెదర్ బాలేదని వేరే రూట్లో పంపించారు. కెనడాలోని  ఓంటారియెా మీదుగా వెళ్ళాలి. ఓంటారియెాలో ఫ్లైట్ మారాలి. మా ఫ్లైట్ ఓంటారియెా వెళ్ళేసరికి కనక్టివ్ ఫ్లైట్ మిస్ అయ్యింది. రేపు మార్నింగ్ వరకు ఫ్లైట్స్ లేవన్నారు. వాళ్ళే ఓ రూమ్ ఇచ్చారు. నాకేమెా బాగా ఆకలి వేస్తోంది. రిసెప్షన్ కి కాల్ చేస్తే, రూమ్ బాయ్ ని పంపారు. మనకేమెా తినడానికి ఏం చెప్పాలో తెలియదు. బాయ్ ని అడిగా.. ఫుడ్ 20 డాలర్ల వరకు వాళ్ళే ఇస్తారట. సరేనని మనకి తెలిసిన ఒక్క పేరు పీజా చెప్పి ఓన్లీ వెజిటేరియన్ అని చెప్పా. ఓ పెద్ద పీజా తెచ్చిచ్చాడు. ఒకేవొక్క పీస్ తినేసరికి ఆకలి తీరిపోయింది. కార్సన్ సిటిలో కంపెనీవాళ్ళిచ్చిన నంబర్ కి కాల్ చేసి పరిస్థితి చెప్పాను. ఉమకి కాల్ చేసి చెప్పా పలానా చోట ఉన్నాను అని. అది నవ్వి నువ్వే నయం వీసా లేకుండా కెనడా వెళ్ళావంది. అది చెప్పే వరకు నాకు నేనున్నది కెనడా అని తెలియదులెండి. భయంభయంగా హోటల్ రూమ్లో ఆ రాత్రి గడిచింది. పొద్దున్నే 8 కి రెనో కి ఫ్లైట్ ఉందని చెప్పారుగా. మరో విమానంలో కార్సన్ సిటికి వెళ్ళడానికి రెనో బయలుదేరాను. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో... 

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner