15, అక్టోబర్ 2021, శుక్రవారం

జీవన “మంజూ”ష నవంబర్

 నేస్తం,

        జీవితంలో గెలవడమే మన విజయమని అందరు అనుకుంటారు. కాని జీవితాన్ని గెలవడమే అసలైన విజయమని మనలో ఎంతమందికి తెలుసు? ఇంతకీ గెలుపంటే ఏమిటి? మనమున్నా లేకున్నా మనకంటూ నలుగురిని సంపాదించుకోవడమే గెలుపు. ఆటలో గెలుపోటములు సహజం. అదే జీవితపు ఆటలో జయాపజయాలు మనమేంటో నలుగురికి తెలియజెప్తాయి. మనమేంటో మనకీ గుర్తు చేస్తాయి.

      మాటలు పొదుపుగా వాడటం మనకు ఎంత బాగా వస్తే అంత బాగా అనుబంధాలు బలపడతాయి. అలాగే అక్షరాలను కూడా అంతే పొదుపుగా వాడాలి. మన మాట కానివ్వండి, అక్షరాలు కానివ్వండి వాటి వాడుకను బట్టే మన వ్యక్తిత్వం తెలుస్తుంది. రాతలు ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, కాని మనిషినయినా మార్చగలిగితే రాతకు సార్థకత లభించినట్లే. అవార్డులు, రివార్డులు దానికి సాటి రావు. సాహిత్యం, సాహితీకారులు సంక్లిష్టంగా మారకూడదు.

   డబ్బుకు లోకం దాసోహమిప్పుడు. బంధమయినా డబ్బుతోనే ముడిబడిపోయిందిప్పుడు. సమాజం సహజ స్థితిని కోల్పోయి అసహజతతో కప్పబడి వుంది. మన చుట్టూ వున్న రంగమూ దీనికి మినహాయింపు కాదు. నైతికత అనేది నశించి పోతూ, నాగరికత ముసుగులో మనలో కొంతమంది అష్టావక్రులుగా తయారౌతున్నారు. వంకరలను బయట పడనీయకుండా ముసుగులను వేసుకుని వంచనను ఇంటిపేరుగా మార్చుకుని ఆధిపత్యం చెలాయిస్తున్నారు. రేపటి తరాలకు అందించాల్సిన విలువలను కాలరాసేస్తున్నారు

      వేదికనయినా తమ అభిప్రాయాన్ని చెప్పడానికి మాత్రమే వాడుకుంటూ, తమని ఎందుకు పిలిచారో అన్న విషయాన్ని పక్కన పెడుతున్నారు. సూక్తులు వల్లించడం అందరికి చాతనౌతుంది. ఆచరణలో చూపడం కొందరికో మాత్రమే సాధ్యం. సంస్కారం గురించి మాట్లాడే ముందు మన సంస్కారం ఏపాటిదో ఎరిగితే నలుగురిలో నవ్వులపాలు కాకుండా వుంటాము. నలుగురిలో మాట్లాడాలంటే విషయ పరిజ్ఞానం చాలా అవసరం. మన మాటలు నలుగురికి చేరాలంటే భాష మీద పట్టు, మన చుట్టూ జరుగుతున్న సఘటనలపై అవగాహన చాలా ముఖ్యం. రాతయినా, మాటయినా నిజాయితీగా వుంటే నాలుగు కాలాలు నిలిచి వుంటుంది. సమాజమూ బావుంటుంది.


11, అక్టోబర్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం...75

 


      అమెరికా నుండి వచ్చిన ఈ 15 ఏళ్ళలో అటు ఉద్యోగ పరంగా మెాసం చేసిన కంపెనీ, ఇటు బంధువులు, స్నేహితుల మూలంగా జరిగిన నష్టాల కారణంగా ఆర్థికంగా, మానసికంగా చాలా నష్టపోయాం నేను, పిల్లలు, మా కుటుంబం. పిల్లల చదువుల అవసరాలకు కాని, నా అనారోగ్య అవసరానికి కాని ఆదుకున్న బంధువులను, స్నేహితులను వేళ్ళ మీద లెక్కించవచ్చు. కనీసం మాట అడగడానికి కూడా గొంతు పెగలని వారే అధికం. గత 45 ఏళ్ళ నుండి అందరి గురించి తెలిసినా అంతగా పట్టించుకోలేదు. కాని నా పెళ్లైన పాతికేళ్ళుగా జరిగిన అనుభవాలు, ఈ ఐదారేళ్ళ నుండి చూసిన డబ్బు జబ్బు మనస్తత్వాలు అనుబంధాల మీద చాలా విరక్తి కలిగించాయి. నా అవసరాలకు ఆదుకున్న ఆత్మీయులు అతి కొద్దిమందే. మేమున్నాం అని నోటి మాట కాకుండా మనసు మాటైతే, ఎవరి నుండైనా చాలా సంతోషం.            

           జీవితం ఏ క్షణం ఎలాంటి మలుపులు తిరుగుతుందో మనకు తెలియదు. మనం ఎంత ప్లాన్ ప్రకారం బతికేద్దామన్నా మన చేతిలో ఏదీ ఉండదు. సమస్య లేని జీవితమూ లేదూ అలా అని ప్రతి సమస్యా పెద్దదీ కాదు. సమస్యకు భయపడకుండా బతకడం మనం అలవాటు చేసుకోవాలంతే. ఏ సమస్యా లేకుండా సాఫీగా జీవితం సాగిపోతుంటే కూడా బావుండదు కదా. పెద్దలన్నట్టు జీవితం సప్త సాగర గీతం. గెలుపోటముల సంగమం. భయపెట్టే సునామీలూ ఉంటాయి. ఆహ్లాదపరిచే అలల ఆనందాలూ ఉంటాయి. చీకటి వెలుగుల సయ్యాటే జీవితం. జీవితంలో ప్రతి పరిచయం ఓ అనుభవ పాఠమే మనం నేర్చుకోవాలంతే. మంచి చెడుల సమతూకం మనకు తెలియాలంతే. కాదూ కూడదంటే మనం ఏకాకుల్లా ఎడారి జీవితాలకు అలవాటు పడిపోవాలంతే. 

             

          ఈ ముఖపుస్తకంలో మంచి చెడు రెండూ ఉన్నాయి. కొన్ని పరిచయాలు సంతోషాన్నిస్తే, మరి కొన్ని పరిచయాలు భయాన్ని, అసహ్యాన్ని, విరక్తిని పంచాయి. మన రాతలు మనసు నుండి వచ్చినప్పుడే అవి నలుగురికి చేరతాయి. ఎదుటివారిని ఎద్దేవా చేద్దామనుకుంటే మనమే నవ్వులపాలైపోతామని గుర్తెరగాలి. ముఖ పుస్తక స్నేహ పరిధిలో స్వేచ్ఛకు, విశృంఖలతకు తేడా తెలియడం అవసరం. నాలుగు రోజులు అవసరం కోసం రాసుకు పూసుకుని, తర్వాత మన మీదే అవాకులు చవాకులు వాగే మహామహులు చాలామందే ఉన్నారిక్కడ. మన జాగ్రత్తలో మనముండటం మంచిది. ఏదైనా ఇచ్చిపుచ్చుకోవడంలోనే మర్యాద ఉంటుంది. డబ్బులతోనో, నటించడంతోనో అందరిని ఆకట్టుకోగలమనుకుంటే మనంత మూర్ఖులు ఈ ప్రపంచంలో మరొకరుండరు. లేని ప్రేమలు నటించకుండా మనం మనలా ఉంటే మనకంటూ నలుగురుంటారు. ఏదున్నా లేకున్నా మన వ్యక్తిత్వం మనకుంటే అదే మనకు వెలకట్టలేని ఆస్తి. దానిని తాకట్టు పెట్టి బతకడం అంటే మనం బతికున్న శవంతో సమానం. 

        రాయడం రాదన్నా వినకుండా నాతో 75 వారాలు కవితాలయంలో రాయించిన తమ్ముడు పవన్ కు, చెల్లి అంజుకు, అమెరికా విశేషాలను రాయించిన ఆంంధ్రాప్రవాసి డాట్ కాం రాజశేఖర్ చప్పిడి గారికి, మీ ఇంటి మనిషిగా ఆదరించిన ప్రత్యక్ష, పరోక్ష ఆత్మీయులందరికి నా మనఃపూర్వక ధన్యవాదాలు. 


5, అక్టోబర్ 2021, మంగళవారం

జీవన 'మంజూ'ష అక్టోబర్



నేస్తం, 
          విమర్శకు, విశ్లేషణకు తేడా తెలియని స్థితిలో కొందరు పెద్దలున్నారని చెప్పడం బాధాకరం. విమర్శ, విశ్లేషణ అన్నవి వ్యక్తిగత, సామాజిక, రాజకీయ, సాహిత్యం వగైరాలలో ఏదైనా కావచ్చు. ఎదుటివారిని విమర్శించే ముందు మనమేంటో మనం తెలుసుకోవాలి. అసలు విమర్శించే అర్హత, స్థాయి మనకుందో లేదో గమనించాలి. మనం చేస్తే గొప్ప పని. అదే పని ఎదుటివారు చేస్తే డబ్బు కోసమెా, పేరు కోసమెా చేసారనడం హాస్యాస్పదం. 
       ముందుగా మనం తెలుసుకోవాల్సింది మనం విమర్శిస్తున్నామా, విశ్లేషిస్తున్నామా అన్న దానిలో క్లారిటి. మనకు నచ్చిన వారిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేయడంలో ఎలాంటి ఆక్షేపణా లేదు. అది మనిష్టం. కాని మరో వ్యక్తిని కాని, వ్యవస్థను కాని తప్పు పట్టేటప్పుడు, మనకు నచ్చిన వ్యక్తికి వ్యతిరేకం అన్న చిన్న కారణంతో కళ్ళ ముందు జరిగిన వాస్తవాలను విస్మరిస్తే, మన లోపం మనకు తెలియకున్నా ప్రపంచానికి తేటతెల్లమవుతుంది. 
           మనలో చాలామందికి వాక్యానికి, వ్యాఖ్యానానికి తేడా తెలియనట్లే విమర్శకు, విశ్లేషణకు తేడా తెలియకుండా పోతోంది. మనం రాసేది అచ్చమైన కవిత్వం అనుకుంటూ, మరొకరు రాసేది కవిత్వమే కాదు వచనమంటే, అది ఎంత నిజమెా మనకు తెలుసు. కాని ఆ నిజాన్ని అంగీకరించే మనస్సాక్షి మనకు లేకపోవడమే మన కొరత. పేరు కోసమెా, ప్రతిష్ఠ కోసమెా దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదు. 
         సాహిత్యంలోనూ సన్మానాలు, పురస్కారాలు ఈరోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. విలువైన సాహిత్యం అట్టడుగునే ఉండిపోతోంది. ఎవరైనా ధైర్యం చేసి గుర్తింపునిచ్చినా, పలువురు సాహితీ పెద్దలు నందిని పంది అంటే, మనమూ ఆ పెద్దలతో జేరి నందిని పంది అనే స్థితిలో ఉన్నందుకు గర్వపడదాం. మనమూ, మన రాతలు, మన భజన బృందాలు మన వెంట ఉన్నంత వరకు మనకు తిరుగులేదని మురిసిపోదాం. జయహో అంటూ మనమే చప్పట్లు కొట్టుకుంటూ బతికేద్దాం. 
          
           

అనీడ పుస్తక సమీక్ష..!!

             " ప్రశ్నలకు సమాధానాలు కాదు, దారులు వెదకడం సరైన పని " అంటున్న " అనీడ "


         కవిత్వానిదో ప్రత్యేక లోకం. నిజమే ఆ కవిత్వ ప్రపంచంలో మనసు సంవేదనలు, మౌనం నింపుకున్న మాటలు, శబ్దం లేని నిశ్శబ్దాలు, శూన్యం చెప్పే సంగతులు, వెన్నెల ఒంపే జ్ఞాపకాలు, చీకటి కార్చిన కన్నీళ్ళు ఇలా ఎన్నో రకాల భావాలను తన మనసుతో " అనీడ" గా అందంగా అక్షరీకరించారు మన అందరికి సుపరిచితురాలు రూపరుక్మిణి కె. 

       " మనసు ముంగిటిలో 

         మంచుతెరలా ఏవో జ్ఞాపకాల దొంతరలు రంగురంగుల సీతాకోకచిలుకలై విహరిస్తున్నాయి. "

ఈ చిన్న మాటల్లోనే పుస్తకంలో ఏముందో, తను ఏం చెప్పాలనుకుందో చెప్పకనే చెప్పేసారు. ఎక్కువగా మహిళల మనోగతాలు, మౌన వేదనలు, కన్నీటి కతలు, రైతుల ఈతిబాధలు ఈ కవిత్వ సంపుటిలో కనిపిస్తాయి. సైనికుని మరణానంతరం అతని బిడ్డ మనోగతాన్ని బొమ్మ కావాలి కవితలో చాలా బాగా రాశారు. అందరు తప్పక చదవాల్సిన కవిత ఇది. 

 " మౌనం మాటైన క్షణం

   గాయాలు గాలివాటుగా తేలిపోతాయి. "  నిజమే కదా. ఎంత సుళువుగా బాధను తేల్చేసారో రంగుల గాయం కవితలో మీరే చూడండి. 

       వెలుతురుతో నీడకున్న అనుబంధాన్ని చీకటి లేకుండా చేయడాన్ని " అనీడ " గా మార్చేసి అదే ఈ కవితా సంపుటి పేరుగా స్థిరపరచి, ఆ నీడల వెనుక నిజాలను ప్రశ్నిస్తూ, సమాజ అసమానతలను ఎత్తిచూపుతూ, ఎందరో " ఆమె " లకు వారసురాలిగా తన అక్షర భావాలతో వకాల్తా పుచ్చుకున్న రూపరుక్మిణి అభినందనీయురాలు. ప్రశ్నలకు సమాధానాలు వెదకడం కంటే దారులు వెదకడమే సరైన పని అంటారీవిడ. సంకల్పం మంచిదనుకుంటే మార్పు మనతోనే మెుదలు కావాలంటారు. అమ్మతనం గురించి, అమ్మానాన్నల గురించి, పసితనం, బాల్యం, జ్ఞాపకాలు, ఎదురుచూపులు, ఎడద చప్పుళ్ళు, ప్రేమ, విరహం, నిరీక్షణ ఇలా జీవితంలోని అన్ని పార్శ్వాలను చాలా హృద్యంగా మన ముందుకు తెచ్చారు. వీటిలో తాయిలాల పెట్టె, ఒలికి పోతున్న కాలం, అర్ధ నగ్న సత్యం, తీరం చేరలేని మౌనం, జీవితకాల సంతకం వంటి కవితలు మచ్చుకు కొన్ని. 

        " మనసు పరదాలలో 

   ముసుగేసుకు కూర్చోనూ లేక

   అలాగని వెలుగు దుప్పట్లను చీల్చుకురాలేక 

   స్వగతంలో కూరుకున్న మనోమందిరాలెన్నో. "

అంటూ తన మనసు అలజడిని, ఆవేదనను చక్కని పదజాలంతో, ఆకట్టుకునే శైలితో "అనీడ " గా సాహితీ లోకానికి అందించిన రూపరుక్మిణి కె కి హృదయపూర్వక శుభాభినందనలు.   

మంజు యనమదల
విజయవాడ

4, అక్టోబర్ 2021, సోమవారం

కాలం వెంబడి కలం... 74



       SLE అని తెలియక ముందు నన్ను చూసే డాక్టర్ గోపాళం శివన్నారాయణ గారికి నాకు SLE అని చెప్తే ఆయన, ఇక్కడి రిపోర్ట్స్ అన్నీ తప్పులు వస్తాయి. రాయవేలూరు వెళ్ళిరండన్న సలహా ప్రకారం రాయవేలూరు హాస్పిటల్ కి కూడా రెండుసార్లు వెళ్ళివచ్చాను. వాళ్ళూ ఇదేనని చెప్పారు. జూనియర్ డాక్టర్స్ చూసి సీనియర్ డాక్టర్ తో ఫోన్ లో మాట్లాడి ప్రిస్క్రిప్షన్ రాశారు. హడావిడిలో కనీసం మన రిపోర్ట్స్ కూడా సరిగా చూడలేదు. కొన్ని నేనే చెప్పాను. పొరపాటున చూడలేదని చెప్పి మెడిసిన్స్ రాసిచ్చారు. మణిపాల్ హాస్పిటల్ లో కూడా చూపించాను. ఆవిడయితే మీకు కరక్ట్ ట్రీట్మెంట్ జరుగుతోంది డాక్టర్ ని మార్చకండి అని చెప్పారు. ఇవన్నీ నేను మా డాక్టర్ పి వి ప్రసన్న గారికి చెప్పే చేసాను. ఈరోజిలా బతికున్నానంటే ఆవిడే కారణం. 

         మనకు తెలిసిన హాస్పిటల్ అని టెస్ట్ చేయించినా, టెస్ట్ చేయకుండా చేసామని చెప్పిన డాక్టర్లు, రిపోర్ట్స్ నలుగురు డాక్టర్లుచూసి కూడా కనీసం రిపోర్ట్స్ లో ఉన్నది పట్టించుకోకపోవడం, మనం చెప్తే తప్ప రిపోర్ట్స్ లో ఉన్నది చూడని డాక్టర్లు,ఇలాంటి పెద్ద పేరున్న కార్పోరేట్ హాస్పిటల్స్ మనకున్నందుకు గర్వపడదాం. మరో డాక్టర్ అంటాడు..నేనింత డబ్బు పెట్టి హాస్పిటల్ కట్టాను. రోజుకి నేనింతమంది పేషంట్స్ ని చూస్తే కాని నాకు బ్రేక్ ఈవెన్ రాదు అని ఓపెన్ గా చెప్పారు. ఇలాంటి అనుభవాలు బోలెడు. 

                   నా రెండో పుస్తకం ప్రింట్ వేయడానికి ఇచ్చినప్పుడు అనుకుంటా, నా రాతలు తెలిసిన కలిమిశ్రీ గారు నవ మల్లెతీగలో నెలకి ఒక వ్యాసం రాయమన్నారు. నాకు రాయడం రాదన్నా వినలేదు. సాగర్ అంకుల్, కలిమిశ్రీ గారి ప్రోద్బలంతో గత మూడేళ్ళుగా నవ మల్లెతీగలో జీవన 'మంజూ'ష ఆర్టికల్ వస్తోంది. టైటిల్ సెలక్షన్ కలిమిశ్రీ గారిదే.గోదావరి దినపత్రికలో బోలెడు పుస్తక సమీక్షలు, కవుల గురించి రాశాను. డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారు, గోదావరి యాజమాన్యం చాలా చాలా  సహకారమందించారు. మనం దినపత్రికలో యజ్ఞమూర్తి గారి ద్వారా కొన్ని వ్యాసాలు,ఆంధ్రప్రభలో తెలుగు గురించి వ్యాసం, గో తెలుగు డాట్ కాం, గోదావరి రాత పత్రిక, వార్త పవర్ పేపర్, విశాఖ సంస్కృతి, శిరా కదంబం ఇలా పలు పత్రికలలో వ్యాసాలు, కవితలు, సమీక్షలు ప్రచురితమయ్యాయి. 

         ముఖపుస్తక సమూహాలలో ఎందరో సాహితీ మిత్రులు పరిచయమయ్యారు. ఏదో మనసుకు అనిపించింది రాయడంతో మెుదలైన ఈ రాతలు ఎందరో సన్నిహితులను, సాహితీ మిత్రులను పరిచయం చేసాయి. కొన్ని ఎదుటి వారికి నచ్చని రాతలు రాసినప్పుడు అవమానించి సన్మానాలూ చేసారు. మరి కొందరు వారి అవసరాల కోసం మనతో స్నేహం నటించి, మెాసాలూ చేసారు. రాజకీయ విమర్శలకు మంచి బహుమతులే దక్కాయి పేటియం బాచ్ తో. పోలీసులకు కంప్లయింట్ చేస్తే, మనం సాక్ష్యాలన్నీ ఇచ్చినా, దొరక లేదని ఫైల్ చేసిన ఎఫ్ ఐ ఆర్ చెత్తబుట్టలో వేసిన ఘనులు. సైబర్ క్రైమ్ వాళ్ళయితే పట్టుకున్నాం రమ్మని చెప్తే, వెళ్ళి అడిగితే వాళ్ళని పట్టుకోవాలంటే ఎఫ్ ఐ ఆర్ కావాలని, అది చేయడానికి వెళితే ముందురోజు గంటు గంటలు నిలబెట్టి, రచయిత్రి అంటా అని తేలికగా మాట్లాడిన సి ఐ, మరురోజు మాడం అంటూ మర్యాదిచ్చి, ఇంగ్లీష్ లో EASE చదవడం రాక, అర్థం కూడ తెలియక, మెుత్తానికి ఎంత విసిగించినా వదలనని ఎట్టకేలకు కంప్లయింట్ తీసుకుని, రాత్రి పదకొండు గంటలకు 8 కాపీలు మాతోనే తీయించి, వాటిలో ఒకటి మాకిచ్చి, ఇంకేముంది పట్టేసుకుంటామని చెప్పి, చెత్తబుట్టలో వేసిన ఘనత మన పోలీసువారిది. చెప్పాలంటే చాలావుంది కాని ఇంతటితో వారిని వదిలేస్తున్నా. రికమండేషన్, లంచం లేనిదే ఏ పనీ జరగదన్న దానికి ఇదో సాక్ష్యంగా మీకు చూపాలని రాశాను. 

            " వ్యవస్థలో న్యాయం సామాన్యుడికి అందుబాటులో ఉండదు. వ్యక్తిత్వం మంచిదై ఉండాలి. అది కావాలంటే పెంపకంలో సంస్కారం, సద్బుద్ధి ఉండాలి. "


వచ్చే వారం మరిన్ని కబుర్లతో...

3, అక్టోబర్ 2021, ఆదివారం

దూరం..!!

దూరమెప్పుడూ మారదు

మనసుల మధ్యనైనా

మనుష్యుల నడుమనైనా


తారతమ్యమెప్పడూ ఒకటే

తరాల ఆంతర్యానికి 

తలరాతల తేడాకి


మౌనమెప్పుడూ మాటల మాటునే

కోపానికి వెసులుబాటిస్తూ

సామరస్యానికి చోటిస్తూ 


దారులెన్నైనా గమ్యం వైపుకే

ఓటమి వెంట వచ్చినా

గెలుపు పిలుపు వినిపించినా


వయసెప్పుడూ పసిదే

బాల్యానికి గోరుముద్దలు తినిపించి

వార్థక్యానికి జ్ఞాపకాల తాయిలాలిస్తూ


రహదారులెన్నున్నా కూడలి అదే

బంధాలకు బాధ్యతలప్పగిస్తూ

బాంధవ్యాలను కొనసాగించమంటూ


చివరాఖరికి చిటారుకొమ్మిదే

అసూయతో రగిలిన ద్వేషాలన్నీ

అక్షరాలతో ఆడిన ఆటల్లో పండిపోవడమే...!! 



రెక్కలు

 1.   మాటలు

మనసు నుండి వెలువడాలి

చేతలు

హృదయం నుండి రావాలి


అరువు నగలు

బరువుచేటు..!!


2.   మనోసంద్రంలో

సుడిగుండాలు

నీటి మీద రాతలుగా

కారాదు


అక్షర ప్రవాహం

అనంతమైనది..!!


3.   అసహనం 

ఇంటిపేరు

చేతగానితనాన్ని

కప్పెట్టుకోవడాన్కి


అబద్ధపు బతుకులు

నిజాయితీ విలువెరగవు...!! 


4.   రాత

మారదు

గీత

చెరగదు


విధాత

గొప్ప రచయిత...!!


5.   చమత్కారం

చురుక్కుమంటుంది

ఛీత్కారం గురించి 

చెప్పేదేముంది


ఏ కారమయినా

మమకారం ముందు దిగదుడుపే...!!


6.   అక్షరాలకు

తెలియని విద్యలేమున్నాయి

మనిషికి

అంతుబట్టని మాయలే అన్నీ


ప్రకృతి 

ఎరుగని వింతలేమున్నాయని..?


7.   ఆధిపత్యం 

అనాది నుండి ఉన్నదే

అమ్మదనం

అంగడి సరుకుగా మారడమిప్పుడే


కాలాతీతమైపోయాయి

అనుబంధాలు..!!


8.  వెలుగు రెక్కలు

అందుకోవాలి

చీకటి చుక్కల

కలల ప్రయాణంలో


అనంతాన్ని ఆకళింపు చేసుకోవాలి

గమ్యాన్ని చేరడానికి..!!.   


9.  పయనం

అనివార్యం

ఆటంకాలెన్ని

ఎదురైనా


విజ్ఞుని లక్షణం

గమ్యం చేరుకోవడం..!! 


10.    కొరత పడేసింది

కదిలిపోతున్న కాలం

వలస పోతున్న

క్షణాలను వడిసి పట్టలేక


కోత పడింది గుండెకు

కన్నీటి రూపంలో..!!


11.   కాంతిపుంజం నుండి

వెలుతురు మదిలోనికి

అక్షరంతో ఆకర్షింపబడి

సాంత్వన ఇస్తోంది


ఎన్నో ప్రశ్నలకు

సమాధానాలు ఇక్కడే..!!


12.   కష్టానికి

మాట సాయం దూరం

తినడానికి

ఏ మొహమాటం లేదు


పై పై ప్రేమలు

నీటి మీది రాతలే మరి..!!


13.  తరంగ రూపం

ఎక్కడైనా ఒకటే

స్వగతంలో

మిగిలేది గతమే


నిరంతర అంతర్మథనానికి

నాంది అక్షరం..!!


14.  పోయేవన్నీ

పై పై ప్రాణాలే

స్వాగతించేది

స్వ’గతాన్నే


రాసిగా పోసేది

అక్షరాలనే..!!


15.   ఆశలుండక తప్పని

జీవితం

అవసానదశ

అనివార్యం


రెప్ప చాటు 

కలల కుటీరం..!!


16.    పేదరికం

పరిధి కాదు

ధన అహం

గొప్పదని చెప్పలేదెక్కడా


వ్యక్తిత్వం

విలువైన జాతివజ్రం..!!


17.  విరుపు

తెలిస్తే చాలదు

వడుపు

తెలియాలి


బంధానికి

ప్రాణాధారం నమ్మకమే..!!


18.   విరవడమే కాదు

అతుకేయడమూ తెలియాలి

వస్తువుకి మనిషికి

తేడా ఉంటుంది


అతకని బతుకులు

మనవని అనుకోలేమెందుకో..!!


19.   ఎగసిపడే అలలన్నీ

తీరం చేరలేవు

గాయాల్లేని 

గతమూ ఉండదు


కాలాన్ని దాచేది

అక్షర భోషాణమే..!!


20.   చంచలమైన

మనసు

అదుపులేని

మాట


సంస్కారం 

తెలియని జన్మలు…!!


21.   కలలన్నీ

కనుల చాటున

గురుతులన్నీ

గుండె లోతుల్లో


తరచి చూస్తే

తడిమే జ్ఞాపకాలే అన్నీ..!! 


22.  దిగులు దుప్పటి

మనసుకు

వెలుగు రెక్కలు

కలలకు


గుండె ఖాళీలు

పూరించేది అక్షరం..!!


23.   కన్నీరు 

తెలియని కన్నూ లేదు

నీరింకిన

సంద్రమూ లేదు


కాలానికి 

తెలిసిన కబుర్లే అన్నీ…!!


24.   సంకల్పం

ఒకటే

సమస్యలు

ఎన్నైనా


తాను బతుకుతూ

నలుగురిని బతికించడం..!!


25.  దాచలేని

మనోగతం

దాగలేని

అవగతం


తేటతెల్లం

మనసు పుస్తకం..!!


26.   గాయం 

గుర్తెరిగి మసలుకోమంది

బాధ్యత

బంధాన్ని పదిలపర్చుకోమంది


కాయం

కష్టసుఖాలను పంచుకోమంది..!!


27.   రాత ఏదైనా 

వాసి ముఖ్యం

మనిషి ఎవరైనా

మనసు అవసరం


అక్షరాలుగా మారేవి

సాక్ష్యాలుగా మిగిలేవి జీవితపు అనుభవాలే..!!


28.   సాన్నిహిత్యం

పరిమితం

సహవాసం

అవసరార్థం


తీరేదైనా మారనిదే

వ్యక్తిత్వం..!!


29.   విరామమెరుగని 

జీవితాలు కొన్ని

విలాసాల్లో

మునిగి తేలే వారు మరికొందరు


రేపుమాపంటూ

కాలానికి వదిలేయడమే..!!


30.   కొందరి మనసులంతే

అల్ప సంతోషాలతో తృప్తి పడతాయి

కొందరు మనుషులంతే

మాటల తూటాలతో బాధిస్తారు


ఏదేమైనా బంధం నిలబడేది

మాటా మనసుని బట్టే..!!













Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner