31, మార్చి 2020, మంగళవారం

మా నాయన కవితా సంకలన సమీక్ష...!!

              మమకారపు ప్రేమలాలసుడు " మా నాయన "..!!
        ఎన్నో ముఖ పుస్తక సమూహాల్లో కవితాలయం సమూహానికి ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా ఒక సమూహంలో ఉన్నప్పుడు నలుగురు రాయడం, వాటికి స్పందనలు, అందరు కలవడం సహజం. ఓ ప్రత్యేక సందర్భానికి చిరపరిచితమైన అంశం మీద కవితా పోటీ నిర్వహించడమే కాకుండా ఆ పోటీలోని ఉత్తమ కవితలను సంకలనంగా తేవడానికి చేసిన ప్రయత్నం మనస్ఫూర్తిగా అభినందించదగ్గ విషయం. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మానాన్న లేకుండా ఙివితం లేదన్నది నిర్వివాదాంశం. ఆ ఇద్దరిలో ఎక్కువగా అమ్మను గురించిన ఎన్నో కవితలు, కథలు, నవలలు, సినిమా పాటల్లాంటి పలు సాహితీ ప్రక్రియలు వచ్చాయి. నాన్న మీద వచ్చినవి వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలా ఇరవై ముగ్గురు కవితాలయం సమూహపు కవులతో వచ్చిన కవితా సంకలనమే " మా నాయన " కవితా సంకలనం.
             నాన్న తన కోసం ఏమీ చేయలేడట, కానీ తనకోసం ఆటబొమ్మగా మారి తన జీవితానికి పునాది వేసి ఉన్నత స్థానంలో నిలిపారని, విలువలు నేర్పారని చక్కని భావాలను నాన్న కవితలో డాక్టర్ పాణిగ్రహి చెప్పారు. మరపురాని నాన్న జ్ఞాపకంగా మారితే, తన కలలకు కదిలే రూపమైన కొడుకు ఇంట బిడ్డగా మళ్ళీ పాడాడిన క్షణాలను నమ్మకుండా ఉండలేనంటూ నాన్న మళ్ళీ పుట్టాడంటారు యు ఎల్ నరసింహ గౌడ్. కష్టాలకు తాను
కుంగిపోతున్నా, బిడ్డ ఎదుగుదలకు ఊతంగా మారినందుకు పొంగిపోతుంది తండ్రి మనసు అంటారు ఊతకర్ర కవితలో నాగ్రాజ్. అపురూపంగా, అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చెప్పకుండా గడప దాటితే, విధి వంచనంటూ విలవిలలాడిన ఆ తండ్రి ప్రాణం గుండె మంట తీర్చుకోవడానికి చితి మంటలు చేరిందని మామిళ్ళపల్లి కృష్ణ కిశోర్ అంబరాన్నంటిన సంబరం కవితలో చెప్తారు. నా చిన్నతనంలో అర్థం కాని విలన్, నడివయసులో ఊతంగా మారి, తర్వాత కనిపించే దేవుడయిన నాన్న గురించి అతనంతే ముళ్ల దారిలో కవితలో జాకిర్ షేక్ కొత్తగా చెప్తారు. అహర్నిశలూ కుటుంబం కోసం శ్రమించే నిస్వార్థజీవి, నాన్న రెండక్షరాల పదం కాదు అని సానా సాంబమూర్తి అంటారు. అమ్మ ప్రాణం పోస్తే, ఊపిరి తానందించి నడత, నడక నేర్పే అనుబంధాల పందిరి నాన్నఅంటారు డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి. కాలాలు మూడే కావచ్చు కానీ కాలాలకతీతంగా నీవు ఎప్పటికీ మాతోనే ఉన్నావంటారు జ్ఞాపకంగా మారిన నాన్న గురించి నాన్నే నా సైన్యం కవితలో దేవపట్ల పవన్ కుమార్. నాన్న గొప్పదనాన్ని అల్పాక్షరాల్లో వర్ణించలేనంటారు వేంపల్లి రెడ్డినాగరాజు. విధిరాత విధాత రాస్తే, విశ్వాన్ని పరిచయం చేసేది, బాసట, భరోసా అయ్యేది నాన్న ఒక్కరే అంటారు దిక్సూచి కవితలో నామని సుజనాదేవి.
                   అప్పుడు కఠినంగా ఉన్న నాన్న, ఇప్పుడు కన్నీళ్ళ  జ్ఞాపకాల పాలపుంతగా మారిపోయాడు. చిట్టిపొట్టి వాక్యాలకే కవయిత్రైపోయానని పొంగిపోయిన నాన్ననాకెప్పుడూ అర్థం కాని అపురూపమేనంటారు శ్రీమతి శాంతి కృష్ణ. అనుక్షణం బిడ్డల గురించి తపన పడే నాన్నకు పలకరింపులు చివరి క్షణాల్లోనయినా దగ్గర చేయండని వేడుకుంటున్నారు సుకన్య వేదం. నాన్నంటే అమ్మకు ప్రతిరూపమని చాలా చక్కగా ఆశాదీపం కవితలో స్వర్గీయ సత్య రామాల్కర్ చెప్పారు.
             కమ్యూనిష్ట్ పార్టీ సిద్దాంతాలకు జీవితాంతం కట్టుబడి, మంచికి మారుపేరైన నాన్న అపురూపమై, ప్రత్యక్ష దైవమైనారని సంధ్యాకుమారి యేరుసుఅంటారు. ఫాదర్ మూడక్షరాల పదం కాదు, నవనాగరిక సమాజంలో సమున్నతంగా నడిపించే లేజర్ అని, జీవితాంతం పహరా కాసే సోల్జర్ అని, తన శక్తిని స్వేదంగా మార్చి పరిమళమద్దే వారియర్ అంటారు రామచంద్ర పల్లం. అన్నీ తానైన నాన్నకు వెన్నంటి నడిచే నీడనవుతానంటారు నాన్నతో నేను కవితలో విహారి బీరే వేణుగోపాల్. నాన్న కళ్ళలో నరకం ఉన్నా నిజంలో నవ్వుతూ ఉండే మామూలు మనిషంటారు డి ఎం మహాశివ. అమ్మే మరో రూపంలో నాన్నంటారు అనలకుమారి. నాన్నంటే నిస్వార్థ రూపమంటూ, విశ్వాత్ముడని విశ్వానికే చాటుతానంటారు సావిత్రి రవి దేశాయి. కొడుకుకే కొడుకుగా పుట్టాలనుకునేంత ప్రేమ గల తండ్రిని పితృదేవోభవ అంటారు జానపాటి మహాలక్ష్మి. కుల,0మత, వర్గ విభేదాలు వద్దని సంతృప్తిని మించిన సుఖము లేదంటూ, స్నేహం విలువ తెలిపిన అన్నను అమ్మాయిలో చూసుకున్న నాన్నవంటార చావలి బాల కృష్ణవేణి. అభిమానానికి ఆద్యుడు, జీవితానికి మార్గదర్శి అంటారు ఎల్ వెంకటేశ్వర్లు. అన్నీ తానైఞ పిల్లల జీవితంలో శాశ్వతంగా నిలిచిపోయే ఓ మధురకావ్యం నాన్నంటారు చేబ్రోలు యజ్ఞనారాయణ.
              అక్షరం కోసం నిరంతరం శ్రమిస్తూ, సాహిత్యానికి, సాహిత్యాభిలాషులకు చేదోడుగా ఉంటూ, అందరి అభ్యున్నతికి పాటుపడే పిన్న వయస్కుడు దేవపట్ల పవన్ కుమార్. కవితాలయం సముహంతో నిరంతరాయంగా తెలుగు సాహితీ మూర్తులను గౌరవిస్తూ, కొత్తగా రాసే వారికి సహాయ సహకారాలందిస్తూ అక్షరయానం చేస్తున్న పవన్, మా నాయన కవితా సంకలనం వేయడం ఎందరికో స్పూర్తివంతం. ఇంత మంచి పుస్తకం వేయాలన్న పవన్ ఆలోచనకు అభినందనలు. 
          ఈ సంకలనంలో నాన్న గురించి రాసిన ప్రతి ఒక్కరూ అభినందనీయులే. తీసుకున్న వస్తువు ఒకటే అయినా విభిన్న అభివ్యక్తులతో, సున్నింంగా నాన్న ప్రేమను అక్షరాల్లో అందించినందుకు అందరికి హృదయపూర్వక అభినందనలు.
      

29, మార్చి 2020, ఆదివారం

తెలుసుకో...!!

నీవాళ్ళతో 
నువ్వెలానయినా 
మాట్లాడుకో

పదుగురెదుటా
బాధ్యతాయుతమైన
పలుకులు పలకడం నేర్చుకో

తప్పులు చేయడం
మానవ సహజమే
ఒప్పుకునే ధైర్యం నీలో పెంచుకో

అధికారమిచ్చిన అహంతో
ఆధిపత్యం చెలాయిస్తే
ఎన్నాళ్ళో మనలేవని తెలుసుకో

విభజన రూపంలో
ప్రజా జీవితాలను
దోచేయాలన్న తలంపుని వదులుకో

వ్యక్తిగత ద్వేషంతో
వ్యవస్థ వినాశనానికి
పధకాలు వేయడం మానుకో

అందివచ్చిన అవకాశాన్ని
స్వప్రయెాజనాలకు వినియెాగించక
ప్రజల మనసులు గెలుచుకో

అధికార పీఠం దక్కిన గర్వముతో 
లక్ష్యమెరుగని విలుకాడిగా 
చరిత్రలో మిగిలిపోకుండా చూసుకో

ముల్లోకాలను చూసే ముక్కంటి 
మూడోకన్ను తెరవక ముందే
మనిషిగా మసలుకో

ఎంతటివారమైనా 
కాలచక్రం(కరోనా) కోరల్లో నలుగుతూ
కర్మానుసారం కడతేరక తప్పదని గుర్తుంచుకో...!!


28, మార్చి 2020, శనివారం

భూతల స్వర్గమేనా...!! 3

వర్షంలో ఇంటి నుండి బయలుదేరి పినాకినిలో మద్రాస్ చేరుకున్నాము. మద్రాస్ ఎయిర్ పోర్ట్ లోనికి వెళ్ళగానే ముందు బాగేజ్ అంతా స్కాన్ చేసాక, రూపాయలను డాలర్లుగా మార్చుకుని, అది పాస్పోర్ట్ లో ఎంటర్ చేయించుకున్నా. మనం లగేజ్ సర్దుకునేటప్పుడే మన టికెట్ వెనుక ఇన్స్ట్రక్షన్స్ చదువుకుని మన లగేజ్ సర్దుకోవాలి. మనం బాగేజ్ లో ఏం లగేజ్ పెట్టుకోవాలి, హాండ్ లగేజ్ లో ఏం తీసుకువెళ్ళాలన్నది, ఎంత వెయిట్ తీసుకువెళ్ళాలన్నది క్లియర్ గా రాసి ఉంటుంది. నిబంధనలకు మించి ఉన్న లగేజ్ కాని, తీసుకు వెళ్ళకూడని వస్తువులు కాని తీసేస్తారు. మనం టెన్షన్ పడకుండా ఉండాలంటే కాస్త తక్కువ వెయిట్ తో సర్దుకోవాలి. మెుదటిసారి కదా..నాకు కాస్త భయం అనిపించినా అన్ని సరిగానే ఉండటంతో లగేజ్ తీయాల్సిన ఇబ్బంది రాలేదు. మనం వాటర్ బాటిల్స్ తీసుకు వెళ్ళనక్కరలేదు.

       బ్రిటీష్ ఎయిర్ వేస్ లో బాగేజ్ చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకుని, చివరిసారి అందరికి వీడ్కోలు చెప్పి ఇమ్మిగ్రేషన్ చెక్ పూర్తి చేసుకుని లోపలికి వెళ్ళడం, బోర్డింగ్ పాస్ లో గేట్ నెంబర్ చూసుకుని లాంజ్ లో కూర్చున్నా. మా హాస్టల్ అమ్మాయి కనబడితే పలకరించా.  తను కూడా అదే ఫ్లయిట్ లో లండన్ వరకు అంది. కాస్త ఎగ్జయిట్ మెంట్, కొద్దిగా బెరుకుతో, అందరిని వదిలి వెళుతున్న దిగులుతో చిన్నప్పుడు ఆకాశంలో, హైదరాబాదు ఎయిర్ పోర్ట్ లో చూసిన విమానం నేనూ ఎక్కబోతున్నానన్న ఆనందం కాస్త...ఇలా ఆలోచిస్తుండగానే ఎనౌన్స్ మెంట్ వినబడింది.. గేట్ లో నుండి లోపలికి వెళ్ళడం, కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళగానే ఫ్లైట్ లోపలకి చేరడం..ఎయిర్ హోస్టెస్ స్వాగతంతో అప్పుడే ఫ్లైట్ లోనికి తెలియకుండానే వచ్చేసాన్న సంబరం. సీట్ చూపెట్టడం, హాండ్ లగేజ్ పైన సర్ది, కూర్చోవడం జరిగిపోయాయి. టేకాఫ్ ముందు జాగ్రత్తలు చెప్తూ, సీట్ బెల్ట్ పెట్టుకోమనడం చకచక జరిగిపోయాయి. నా పక్కన ఓ వైపు తమిళ్ అమ్మాయనుకుంటా..తను కూడా నేను వెళ్ళాల్సిన వాషింగ్టన్ డిసి కే అని చెప్పింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నా. మరోవైపు ఎవరో పలకరించారు.. ఆ అబ్బాయి లండన్ అని చెప్పాడు.  నార్త్ ఇండియన్ అనుకుంటా.  

       కాసేపయ్యాక ముందు నాకు టిఫిన్ తెచ్చింది ఎయిర్ హోస్టెస్. అదేంటబ్బా ఎవరికి పెట్టకుండా నాకే ముందు పెడుతోంది అనుకున్నా. సగం కాలిన ఆమ్లెట్ ,అది చూడగానే నచ్చలేదు...టిఫిన్ మార్చమంటే మార్చి, తర్వాత చెప్పింది "మీరు హిందూ మీల్ అని పెట్టారు, ఈసారి నుండి ఇండియన్ మీల్ అని పెట్టండి". నాకు విండో పక్క సీట్ రాలేదు.. ఆకాశంలో వెళుతూ ఆకాశాన్ని, కింద సముద్రాన్ని చూడలేకపోయానే అనుకున్నా.. ఏదో కాస్త అప్పుడప్పుడూ దూరంగా పక్కవాళ్ళ విండోలో నుండి చూసేసాను. నా సంతోషాన్ని చూసి పక్కమ్మాయి...ఫస్ట్ టైమ్ కదా ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎగ్జైట్మెంట్ అని నవ్వింది.  నేనూ నవ్వేసి తెచ్చుకున్న పుస్తకం " ది ఫ్యూచర్ "  నవల్లో తలదూర్చాను కాసేపు. తర్వాత నిద్రపోయా.  మధ్యలో లంచ్ అదీ నచ్చలేదు హాఫ్ బాయిల్డ్ చికెన్.. ఏదో కాస్త తిన్నాననిపించి జూస్ తాగేసా.  తర్వాత లండన్ ఎయిర్ పోర్ట్ లో దిగడము, ఫ్లైట్ క్లీనింగ్, మళ్ళీ విమాన ప్రయాణం. అమెరికాలో లాండ్ అయ్యే ముందు ఫ్లైట్ లో ఓ ఫామ్ ఇచ్చారు. అది ఫుల్ చేసి ఉంచుకోవాలి. తెలియకపోతే పక్కవారిని, లేదా ఎయిర్హోస్టెస్ ని అడిగితే చాలు. దానిని I -94 అంటారు. మెుత్తానికి భూతల స్వర్గమనే అమెరికాలోని వాషింగ్టన్ డిసి లో దిగడం, అందరితోపాటు నేనూ బస్ ఎక్కడం, ఇమ్మిగ్రేషన్ చెక్ లో I -94 మీద, మన పాస్పోర్ట్ మీద స్టాంప్ వేసి ఇవ్వడంతో,  హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని,  అక్కడి నుండి బయటబడి, లగేజ్ ఎక్కడా అని వెదుక్కుంటూ, నా లగేజ్ గుర్తు పట్టగలనో, లేదో అనుకుంటూ, అయినా పెద్ద అక్షరాలతో ప్రింట్ తీసి మరీ అంటించిన నా లగేజ్ గుర్తు పట్టేసా. మెుత్తానికి నా 2 సూట్కేస్ లు, హాండ్ లగేజ్ తో బయటకు రాగానే అమ్మాయ్ మంజూ అంటూ చిరపరిచితమైన అన్నయ్య పిలుపు. గుర్తు పడతావో లేదో అనుకున్నానన్నయ్యా అంటే.. నన్ను నువ్వు గుర్తు పట్టకుండా ఉంటావా అని అన్నయ్య అనడం..నేనెందుకు గుర్తు పట్టనూ అంటే.. నేను అంతేనమ్మూయ్ అని కార్ దగ్గరకు తీసుకువెళ్ళి లగేజ్ కార్ లో సర్ది, ముందు సీట్ లో కూర్చున్న తర్వాత ముందుగా కార్ లో కూర్చున్న వెంటనే చేయాల్సిన పని సీట్ బెల్ట్ పెట్టుకోవడం అని చెప్పి చూపించాడు. సిరివెన్నెల పాటలు పెట్టి, నేనేమి మారలేదమ్మాయ్, మీరెందుకలా అనుకున్నారని అంటూ, అందరి కబుర్లు అడుగుతూ, తనూ కబుర్లు చెప్తూ, మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి డిన్నర్ కి తీసుకువెళ్ళి, తిన్న తర్వాత చేయి కడుక్కోవడానికి వాష్ రూమ్ లో వేడి, చన్నీళ్ళు ఎలా వస్తాయెా
చూపించాడు. తర్వాత ఇంటికి వచ్చాం. రాగానే వదిన అలసిపోయి ఉంటారు ముందు స్నానం చేసి రెస్ట్ తీసుకోమని, బాత్ టబ్ అవి చూపించి, తర్వాత మాట్లాడుకుందామని చెప్పి రూమ్ చూపించి నిద్ర పొమ్మంది. వాళ్ళిద్దరు బాగా బిజీ డాక్టర్స్. పిల్లలు చదువుకుంటున్నారప్పుడు. 


మళ్ళీ కలుద్దాం

ఆంద్ర ఆడపడుచు మొదటి సారి విమానం లో అమెరికా ప్రయాణం... ఇబ్బందులు ఎలా ఎదుర్కుంది ఒంటరిగా... స్వ-గత అనుభవాలు...

ఆంద్ర ఆడపడుచు మొదటి సారి విమానం లో అమెరికా ప్రయాణం... ఇబ్బందులు ఎలా ఎదుర్కుంది ఒంటరిగా... స్వ-గత అనుభవాలు...

ఏది నిజం - ఏది అబద్ధం...!!

      హైదరాబాదులో రెడ్ జోన్ ప్రకటించలేదని కలక్టర్ చెప్పారని ఓ వార్త స్క్రోలింగ్ లో..అదే ఛానల్ లో మరో స్క్రోలింగ్ లో రెడ్ జోన్ ప్రకటించిన ఏరియాలతో సహా...ఈ రెండింటిలో ఏది నిజమెా, ఏది అబద్ధమో తెలియని సందిగ్ధంలో జనాలు. 
     విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మీడియానే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిండం ఎంత వరకు సబబు? ఏ వార్త నిజమెా తెలుసుని ప్రజలకు చేరవేయాల్సిన మీడియానే ఇలా రెండు రకాల వార్తలను ప్రచురిస్తూ, ప్రజలను అయెామయానికి గురిచేయడం చాలా బాధాకరం. 
    అచ్చుతప్పులైతే సరిపెట్టుకోగలం. కాని లాక్ డౌన్ సమయంలో ప్రజలందరు ఆధారపడేది మీడియా మీదే. దయచేసి అసత్య ప్రచారాలు, రెండు నాల్కల స్టేట్మెంట్స్ ప్రసారం చేయవద్దని మనవి.

25, మార్చి 2020, బుధవారం

ఆలోచించండి..!!

మెడికల్ షాపులు, కిరాణా షాపులు తెరిచి ఉంచడమెందుకు..? అన్ని మెడిసిన్స్ ఇంటికి 2, 3 కిలోమీటర్ల దూరంలో దొరకవు కదా...9 లోపల తెచ్చుకోవడానికి కొన్ని మెడికల్ షాపులు తెరిచేదే 9 తరువాత. ప్రిస్క్రిప్షన్ తీసుకుని కార్ లో ఒకరు వెళ్ళినా కేస్ రాస్తే...ఈ లెక్కన అన్ని మూసేయడం మంచిది కదా... జనాలు ఆకలితోనో... మెడిసిన్ దొరకకో పోతారు...కరోనా సోకకుండానే..!!

మాధవి గోపిశెట్టి గురించి గోదావరి లో...!!

      
 "  పట్టుదలకు సాక్ష్యమే మాధవి గోపిశెట్టి రచనలు " 

      కొన్ని సంవత్సరాలుగా తెలుగు మీద మక్కువతో, తెలుగు సాహిత్యాభివృద్ధికి తనవంతుగా సేవ చేయాలన్న సంకల్పంతో కవిత్వం రాయడం మెుదలుపెట్టిన కవయిత్రి గోపిశెట్టి మాధవి. ద్విపదలు, త్రిపదలు, ఏక్ తారల వంటి లఘు కవిత్వంలో కూడా ప్రవేశముంది. పలు తెలుగు భాషా సాంస్కృతిక సమావేశాల్లో తన వాణి వినిపించడమే కాకుండా పురస్కారాలు, సన్మానాలు కూడా అందుకున్నారు. పుట్టుకతోనే పట్టుదలను ఆభరణంగా అందుకుని ఏదైనా నేర్పుతో సాధించడం ఈమెకున్న గొప్ప లక్షణం. చదువుకుంది పదవ తరగతైనా తెలుగు భాష మీద మమకారంతో, కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూనే చక్కని కవిత్వాన్ని రాయడం వంటబట్టించుకున్నారు. ఏదైనా త్వరగా నేర్చుకునే లక్షణం ఉండటం వలన అతి కొద్ది కాలంలోనే చిక్కని కవిత్వాన్ని రాస్తున్నారు. 
         జీవితానికి గమ్యం ఉండాలని అలుపెరగక, ధైర్యంతో అడ్డంకులను అధిగమించి ముందుకు సాగిపోవాలని "పదండి ముందుకు "అంటూ జీవిత గమనాన్ని చెప్తారు శ్రీ శ్రీ గారి కవిత " పదండి ముందుకు " ను అనుకరిస్తూ. మనసుతో చూసి, చిరునవ్వుతో పలకరిస్తే మన చుట్టూ అంతా ప్రేమమయమేనంటారు మరో చిరు కవితలో. స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి బాధను వ్యక్తపరుస్తారు ఓ కవితలో. అంతులేని ఆరాధనను, ఆర్తిని చూపిస్తారు తన కవితల్లో చాలా చోట్ల. నిన్ను నీవు మార్చుకో అంటూ వ్యక్తిత్వం ఎలా ఉండాలో తెలుపుతారు. తెలుగుభాష గొప్పదనాన్ని, మహిళ 
ఒౌన్నత్యాన్ని, మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను, సమాజ రుగ్మతలపై అక్షరాన్ని ఆయుధంగా తాను ఎలా ఎక్కుపెడుతున్నారో చెప్తారు తనదైన శైలితో. అందరిని వదలి పరాయి దేశ ప్రయాణం చేయడానికి కారణాలను, అప్పటి మానసిక సంఘర్షణలను కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తారు. నాన్న కవితలో నాన్న విలువను తెలియజెప్తారు. ఎంకి నాయుడుమావను గుర్తుకు తెస్తారు ఓ కవితలో.  జీవిత చదరంగంలో మనమందరం దేవుని చేతిలో పావులమని తాత్వికతను బోధిస్తారు. మగువ తాను ఓడి మగని గెలిపించండంలో భార్య గొప్పదనాన్ని, త్యాగాన్ని వివరిస్తారు. కాలుష్యపు కోరల్లో ప్రకృతి ఎలా కలుషితమైపోతోందో వివరిస్తారు మరో కవితలో. 
       మాధవి మధురిమలంటూ చక్కని మంచి మాటలను చెప్తారు. దూరమైన బంధాన్ని గుర్తు చేసుకోవడంలో ప్రేమను అక్షరీకరిస్తారు. భూమిపుత్రుడు రైతుబిడ్డను ఏ చరిత్రా  మరువలేదంటారు. సమెాసా, సున్నుండల గురించిన వర్ణన చదువుతుంటే..వేంటనే తినేయాలనిపించేస్తుంది. దీపం గురించి, అక్షరాల గురించి, జీవితం గురించి, ఆశ, ఆనందం, ఆహ్లాదం, అందం, అభిమానం, స్నేహం, ప్రేమ, విరహం, వేదన, వైరాగ్యం, మానవ సంబంధాలు ఇలా జీవితంలో మనకు తారసపడే విషయాల గురించిన ప్రతి అంశమూ మనకు మాధవి మధురిమల్లో కనిపిస్తాయి. 
      మన విజయమే తమ విజయంగా భావించి సంతోషపడే గురువుల గురించి చాలా బాగా చెప్పారు. జీవిత పుస్తకం ఎలా మలచుకోవాలన్నది మన చేతిలోనే ఉందంటూ సున్నితంగా హెచ్చరిస్తారు. జవాన్ల గొప్పదనాన్ని, చిన్నప్పటి చిలిపి అల్లరులను, రుబ్బరాయితో చేసిన పచ్చడి కమ్మదనాన్ని, బడిని, గుడిని ఇలా తనకు అనిపించిన ప్రతి విషయాన్ని కవితా వస్తువుగా తీసుకుని అలతి పదాలతో అర్థవంతమైన కవితలు అందిస్తున్నారు. 
       ఏక్ తారల్లో చాలా వరకు మహిళ ఒౌన్నత్యాన్ని చూపే తారలే ఎక్కువ. అందుకే 
" అతివకు వందనాలు_ఆత్మాభిమానంతో అందరికి సేవలందిస్తున్నందుకు..!! " అంటూ అక్షరాల్లోనూ అతివనే చూపుతారు. 
    ద్విపదల్లో తీసుకుంటే
 "  అమ్మ పలుకునేగా 
   ఆదిస్వరంగా నేవిన్నది...!! " ఎంత అద్భుతమైన భావన ఇది. నాన్న గురించి, మౌనం, ప్రేమ, బాధ ఇలా అన్నీ అనుభూతులను లఘుకవితలుగా లాఘవంగా మలిచారు. 
    వీరికి లభించిన పురస్కారాలు లెక్కకు మించే ఉన్నాయి. 
సృజన సాహితీ వారి కవిశ్రేష్ఠ ఆత్మీయ పురస్కారం 
కవితాలయం వారి కవితేజం 
ఐ వి యం ఎస్ ఇంటర్నెట్ వాసవి మహిళా సమాఖ్య వారి వైశ్య ముద్దుబిడ్డ మరియు మల్లినాథపీఠం వారు, కవనపూదోట మరి కొందరి నుండి ఆత్మీయ సత్కారాలు, పలు బహుమతులు అందుకున్నారు.
పలు పత్రికలలో కవితలు ప్రచురితమయ్యాయి. 
     సరళమైన భాషలో, సున్నిత భావాలను రాయడంలోనూ, అక్షరాన్ని ఎక్కడ ఎలా పదునుగా వాడాలో, సమాజంలో ఏ ఏ అంశాలపై ఆయుధంగా ప్రయెాగించాలో బాగా తెలిసిన పట్టుదలకు పెట్టని గోడ మన మాధవి గోపిశెట్టి. మరిన్ని సమాజ హితకర కవితలు రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ... అభినందనలతో
మంజు యనమదల 
విజయవాడ 

 
       

21, మార్చి 2020, శనివారం

భూతల స్వర్గమేనా..!! 2

ఇక్కడ మరో నాలుగు మాటలు చెప్పాలి. H1 వీసా కోసం నా మార్క్స్ లిస్ట్లన్నీ.. 10, ఇంటర్, ఇంజనీరింగ్, వర్క్ ఎక్స్పీరియన్స్ పేపర్స్ అమెరికాకి విజయవాడలో పోస్టాఫీసు లో పోస్ట్ చేయడం. ఆ తర్వాత హైదరాబాదులో 6 నెలలు JAVA, ASP, VC++ నేర్చుకుంటూ, కార్ డ్రైవింగ్ కూడ నేర్చుకున్నా. ఓ రోజు వీసా పేపర్స్ వచ్చాయని కబురు వస్తే అమీర్పేట్ లో ఆఫీస్ కి వెళ్ళి పేపర్స్ తీసుకున్నా. తర్వాత 4,5 రోజుల్లోనే వీసా స్టాంపిగ్ కి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ 2 సెట్స్ జిరాక్స్, ఒరిజినల్ పేపర్స్ అన్నీ తీసుకుని మద్రాస్ వెళ్ళాం నేను, మావారు.బాంక్లో 2 డి డి లు తీసుకున్నాం.  హోటల్ నుండి రాత్రి రెండింటికి వెళ్ళి క్యూలో నించోవడం, తర్వాత నేను లోపలికి వెళ్ళడం, అప్లికేషన్ పూర్తి చేయడం, వీసా వస్తుందో, రాదోనన్న టెన్షన్ ఓ పక్క.. ఇలా ఎవరి గొడవలో వాళ్ళం ఉన్నాం. నా టోకెన్ నెంబర్ పిలవగానే వాళ్ళు చెప్పిన విండో దగ్గరకు వెళ్ళాను. లేడి ఉన్నారు కౌంటర్లో. వాళ్ళు ముందే చెప్పిన  పేపర్స్ అన్నీ వాళ్ళిచ్చిన ఫైల్ లో పెట్టి ఇచ్చాను. వర్క్ చేయడానికి వెళుతున్నారా అని అడిగారు. అవునని చెప్పాను. ఫీజ్ కట్టి వెళ్ళండి అని చెప్పారు. నిజమా కాదా అని మరోసారి అడిగాను. ఆవిడ నవ్వి కౌంటర్లో ఫీజ్ కట్టండి. పాస్పోర్ట్ మీరిచ్చిన అడ్రెస్ కి పంపిస్తామన్నారు. భలే సంతోషం వేసింది. ఎందుకంటే పాపం నా ముందు వాళ్ళకి ఇవ్వలేదు. కౌంటర్లో లేడి ఉంటే వీసా ఇవ్వడంలేదావిడ అని బయట భయపెట్టారు. మెుత్తానికి మరుసటిరోజు నేనిచ్చిన మా పాతింటికి నా పాస్పోర్ట్ వచ్చింది. మేం అది తీసుకుని మా ఆఫీస్కెళ్ళి ఫ్రెండ్స్ ని కలిసి తిరిగి మా ఊరు వచ్చేసాము. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి బట్టల షాపింగ్, కావాల్సిన పుస్తకాలు అన్నీ తీసుకుని ఇంటికి వచ్చేసా. ప్రయాణం దగ్గర పడే సమయానికి బాగా జ్వరం వచ్చి ఓ వారం టికెట్ పోస్ట్ పోన్ చేయించుకున్నా. రెండు పెద్ద సూట్కేస్ లు,  ఓ చిన్న సూట్కేస్, హాండ్ బాగ్ లలో లగేజ్ సర్ధాలింక. 5,6 జతలు పాంట్, షర్ట్ లు, 4 చూడీదార్లు, 7,8 చీరలు, నైటీలు, లెదర్ జాకెట్...ఇలా అవసరమైన బట్టలు, దుప్పట్లు అన్నీ కలిపి 22 కేజీలు ఒక సూట్కేస్లో, చిన్న చిన్న వంట సామాన్లు, పచ్చళ్ళు, కారాలు, పుస్తకాలు మరోదానిలో 22 కేజీలు సర్ది, ఓ రెండు జతలు, డాక్యుమెంట్స్ అన్నీ హాండ్ లగేజ్ లో 4,5 కేజీలు సర్ధేశాం. హాండ్ బాగ్ లో వీసా పేపర్స్, పాస్పోర్ట్, ఫోన్ నెంబర్ బుక్,సోప్,బ్రష్, పేస్ట్ ఇలా అవసరమైనవి పెట్టుకున్నా. ఇక ప్రయాణం రోజు రానే వచ్చింది. అందరిని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉన్నా తప్పని ప్రయాణమాయే. 

మళ్ళీ కలుద్దాం... 

ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంధ్రా ప్రవాసి వారికి, రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు.ఆంద్ర ఆడపడుచు అమెరికా విసా కోసం చదువుల ట్రైనింగ్, ప్రయాణం కోసం ఏర్పాట్లు సర్దుకోవతటాలు ... ఆసక్తికరంగా...

19, మార్చి 2020, గురువారం

సింహా గారి గురించి..!!

అక్షరాలతోనే తన అనుబంధమంటున్న "సింహా"..!!

" నా ప్రయాణం...
అడుగులతో కాదు అక్షరాలతోనే..!! "
అంటూ తన జీవితంలో అక్షరానికెంత ప్రాముఖ్యత ఉందో చెప్పకనే చెప్పారు యు. లక్ష్మీ నరసింహ గౌడ్ చక్కని లఘు కవితలో.  ఏక్ తారలు, ద్విపదలు, త్రిపదలు అలవోకగా రాయడంలో అందె వేసిన చేయి లక్ష్మీ నరసింహది. కలం పేరు "సింహా"తో ముఖపుస్తకంలో అందరికి సుపరిచితులు. లఘు కవితా ప్రక్రియలే కాకుండా చక్కని కవిత్వం రాయడంలో కూడా నిష్ణాతులే. పలు సామాజిక అంశాలపై తన స్పందనలను కవితలుగా అందించారు. 
           చిన్నతనం నుండి రాయడమంటే మక్కువ ఎక్కువని, 17 ఏళ్ళ వయసులోనే శతకం పూర్తి చేయాలన్న సంకల్పంతో 60 ఆటవెలది పద్యాలు రాసిన దిట్ట. అంతకు ముందే 10వ తరగతిలోనే పాట రాసి, అభినయించి అందరి ప్రశంసలతోబాటు, ప్రధమ బహుమతి కూడా అందుకున్నారు. వృత్తి రీత్యా కాలేజ్ ఇన్ఛార్జ్ గా పని చేస్తూ, కుటుంబ బాధ్యతలతో పాటు సాహిత్యాన్ని కూడా అమితంగా ప్రేమించే వ్యక్తి సింహా. 1000 కి పైగా వచన కవితలు, 5000 వేల పైచిలుకు ద్విపదలు, 2000పైన ఏక వాక్య కవితలు, 500పైగా త్రిపద కవితలు ఇప్పటి వరకు రాశారు. ముద్రితమైన పలు కవితా సంకలనాలలో తాను పాలుపంచుకున్నారు. 
  " అక్షరమై బతికేస్తుంటా...
తానో పుస్తకమై నాలో ఉన్నంతకాలం...!! "  
అక్షరాల్లోనే తన ఆరాధనను, ఆర్తిని ఒలకబోయడం సింహకు వెన్నతో పెట్టిన విద్యగా అనిపిస్తుంది తన కవితలు చదువుతుంటే.
" నీ జ్ఞాపకాల్ని వెంటేసుకున్నానందుకే
భవిష్యత్తులోకి ధైర్యంగా నడవాలనే..!! "...నీవు లేకున్నా నీ జ్ఞాపకాలు చాలు నేను బతికేయడానికి అంటూ దూరమైన తన ప్రేమను అక్షరాల్లో నింపుకోవడంలోనే ఆ అందమైన భావుకత్వానికి మరింత వన్నె తెచ్చింది. 
" తను నవ్వుతుంటే తెలిసింది
నా కన్నులకు పండుగెందుకొచ్చిందో...!! " అనడంలోనే తెలిసిపోతోంది మదిలోని అంతులేని ప్రేమకు ఇదో మచ్చుతునక అని. 
"  అమ్మ దిగులు పట్టుకుందేమెా బ్రహ్మకు
    మా అమ్మను తీసుకెళ్ళి ఆనందిస్తున్నాడు "  అంటూ అమ్మను దూరం చేసిన దైవానికి సున్నితంగా చురక వేయడం వీరికే చెల్లింది. 
" కలం కాలం ఒకటేనేమెా
  కవినొకటి విధాతనొకటి అనుసరిస్తూ..!! " ఎంత గొప్ప మాట ఇది. కలానికి, కాలానికి పొంతన అద్భుతంగా చెప్పారు. 
" కల్పనలో కాలానిదే ముందంజ
  కవులను మించి కథలల్లడంలో..!! " కాలం చతురతను ఇంతకన్నా బాగా ఎవరు చెప్పగలరు. 
ఇలా మరెన్నో లఘు కవితల్లో అందమైన, అద్భుతమైన భావుకత్వాన్ని సరళమైన పదాలతో అందించే నేర్పు వీరి కలానిది. 
     రైతు గురించి చెప్పినా, బొమ్మా బొరుసు జీవితపు ఆటలో మనిషి పాత్ర గురించి రాసినా, తరిగిపోతున్న మానవ విలువల గురించి బాధను వ్యక్తపరుస్తూ మనిషి మనిషిగా బతికే కాలం ఎప్పుడు వస్తుందో అంటారు ఇంకెప్పుడో మరి కవితలో. పసిబిడ్డలపై జరుగుతున్న అకృత్యాల గురించి మృగా(లు)ళ్లు కవితలో ఆవేదన వ్యక్తం చేస్తారు. అక్షరాల ఆస్తిని అందించిన బ(గు)డిలో దేవుడి గురించి అద్భుతంగా రాశారు. దూరపు కొండలు నునుపనుకునే వారి కోసం గల్ఫ్ కష్టాల గురించి, ఆడపిల్లల భయం గురించి, వాన చినుకు కోసం ఎదురుచూసే రైతు కన్నీటి చినుకులను గోరువెచ్చని చినుకులుగా మలచడంలోనూ, కష్టాలను నవ్వు కన్నీళ్ళ వెనుక దాచుకుని కుటుంబ బాధ్యతలను మెాసే అమ్మానాన్నలను చూసాక జీవితం సంతోషాలమయమని ఎలా భ్రమపడను అని ప్రశ్నించినా, అమ్మ భాష గురించి రాసినా, జ్ఞాపకాల గురించి రాసినా...ఇలా కవితా వస్తువు ఏదైనా తన కలం గళాన్ని మనసుతో వినిపించిన కవి సింహా. 
నానీలలో రైతు గురించి చక్కగా రాశారు. 
         తన కలంతో అక్షర విత్తనాలు చల్లుతూ, సాహిత్య సేద్యం మెండుగా చేస్తున్న ఈ తరం కవులలో సింహా ఒకరు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నో కవి సమ్మేళనాల్లో పాల్గొని తన గళాన్ని వినిపించి అందరి మెప్పును అందుకున్నారు. వీరికి లభించిన పలు పురస్కారాలే వీరి ప్రతిభకు తార్కాణం. 
             కవితాలయం (సాహిత్య సామాజిక సేవా సంస్థ) వారు లాస్ట్ 2019కి గాను మొదట దీపావళి పురస్కారం లభించింది, తరువాత ఇదే సంవత్సరంలో వారి ద్వారానే *కవిచక్ర* బిరుదు లభించింది. వసుంధర విజ్ఞాన వికాస మండలి (గోదావరఖని) వారు జరిపిన రాష్ట్ర స్థాయి కవితలు పోటీలో ప్రథమ స్థానం బహుమతి లభించింది.
సృజన సాహితీ సంస్థ వారి ఆత్మీయ పురస్కారం, న్యూ విజన్ సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన రైతు ఆత్మహత్యలు నివారణ అంశం మీద జరిగిన పోటీలో ప్రధమ బహుమతి పురస్కారం.
తెలుగు సాహితీ సామ్రాజ్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని, మరిన్ని పురస్కారాలు అందుకోవాలని కోరుకుంటూ... అక్షరాలను అమితంగా ప్రేమించే సింహా గారికి హృదయపూర్వక అభినందనలు. 
       

18, మార్చి 2020, బుధవారం

కెరటం కి ముందు మాటలు

                           అలంకారాలక్కర్లేని అసలైన కవిత్వ " కెరటం "

              సహజమైన కవిత్వానికి హంగు, ఆర్భాటాలు అక్కరలేదన్నది వాస్తవం. అంతర్మధనానికి, ఆవేశానికి ఓ సున్నిత రూపాన్నిస్తే అది అనుశ్రీ కవిత్వమవుతుంది. మదిసంద్రంలోని  అలజడిని కెరటాలుగా అదేనండి అలల కలల ఆశల విహంగాలను కవితలుగా ఏర్చి కూర్చి తొలి కవితా సంపుటి  " కెరటం " గా తెలుగు సాహిత్యానికి అందించడం అభినందించదగ్గ విషయం.
                 నాన్న తమతో లేకున్నా నాన్నే తన కవిత్వానికి, ఎదుగుదలకు ప్రేరణ అని క్షయంలేని అక్షరాల్లో పదిలం చేసుకున్నారు.  అమ్మను గగురించి చెప్పిన భావాల్లో ఇది బాగా నచ్చింది. ఇంతకన్నా బాగా ఎవరు చెప్పగలరు?
" నిరంతరం మనకై తపించే
   నూరేళ్ళ తాపసి  అమ్మ "
అమ్మ గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలే ఉంటుంది అది వేరే సంగతి. నేను చదివిన వాటిల్లో అమ్మను గురించిన అద్భుత భావాలివి. మనసులో నుండి వచ్చిన భావాలకు ఏ అలంకరణలు అవసరం లేదనడానికి ఇవే సాక్ష్యాలు.  పరకాయ ప్రవేశం చేసి రాసిన కవితలు ఈ సంపుటి నిండా మనల్ని అలలు అలలుగా తాకుతూనే ఉంటాయి చదివినంతసేపూ.. 
           ఇల్లాలి గురించి రాసిన కవిత చదువుతుంటే మన సమాజంలో ఎందరో భార్యల జీవితాలు కళ్ళ ముందుకదలాడక మానవు.
          " ఆశలతో బయలుదేరి
             నిరాశలు మూటగట్టుకునేకన్నా " (కంచెలే మంచివి కవిత)
కంచెలే మంచివి, పంజరమే సుఖమనిపిస్తుంది అనడంలో ఎంత లోతైన భావన ఇమిడి ఉందో తెలుస్తోంది.
మరో కొత్త కవితా వస్తువు స్వర్ణకారుల గురించి " వెన్నెలకే వన్నెలు అద్దే అసాధ్యులు " అని " స్వర్ణకారులు " కవితలో సరి కొత్తగా ఆవిష్కరించారు. మరెన్నో సమాజపు పోకడలు, ఆచారాలు, సంప్రదాయాలు ఇలా ప్రతి అనుభూతి మనకు తనదైన శైలిలో ఆవిష్కృతమౌతాయి. ఇది "అను శ్రీ " తొలి వచన కవిత్వ సంపుటి అన్న భావన మనకు రాదని నొక్కి వక్కాణించగలను.
ఆంగ్ల పదమనేది వాడకుండా  రాసిన ఘనత కూడా ఈమెది.

          ఆశలు, ఆశయాలు, ప్రేమాభిమానాలు, ఆక్రొశాలు, ఆప్త వాక్యాలు,  అహం,  మమతల మణిహారాలు, మహిళల మనోగతాలు, అగచాట్లు ఇలా వైవిధ్యమైన వస్తువులతో కెరటం కవితా సంపుటిని పేరుకు తగ్గట్టుగా చక్కని సరళమైన తెలుగు పదాలతో పరిపుష్టం చేసారు. ఎంత కోపంగా రాయాలనుకున్నా అతివ సహజ లక్షణాన్ని వీడకుండా అహాన్ని,  బాధను, కన్నీటిని కూడా అందంగానే చెప్పారు.
    ఎంతో అభిమానంతో నన్ను నాలుగు మాటలు రాయమని అడిగినందుకు ధన్యవాదాలు. చక్కని అలతి పదాలతో కెరటాన్ని మనోసంద్రపు భావాల మాయాజాలంతో మనల్ని కట్టిపడేసిన ఈ సాహితీ చైతన్యం " అను శ్రీ " కి హృదయపూర్వక అభినందనలతో....
మంజు యనమదల
విజయవాడ.
     

17, మార్చి 2020, మంగళవారం

అక్షర సన్యాసం సమీక్ష..!!

పుట్టపర్తి మల్లికార్జున గారు రాసిన సమీక్షకు 
మన:పూర్వక ధన్యవాదాలు..


మంజు యనమదల అమ్మ గారి అక్షర స(వి)న్యాసం పై నా సమీక్ష

**అపసవ్య సమాజంపై 
అక్షర తూటాల విన్యాసాలు** 

         మంజు అమ్మ గారి కవిత్వం అంతరంగాల్ని స్పృశించేలా గాఢమైన పదబంధాలతో బందిస్తూ మనసును హత్తుకునే కవితా వస్తువులతో ప్రతి కవనాన్ని హృదయ స్పందనలకు అనుగుణంగానే శిల్పంగా మలిచారు. భావ వ్యక్తీకరణలో సరైన ఎత్తుగడను ఎంచుకుని ,శీర్షికల ఎంపికలో వైవిధ్యం చూపుతూ,ముగింపులో పదునైన పదజాలంతో మంచి కవితలను అందరికీ అర్థమయ్యేలా అందించారు.సగటు మనిషి జీవన విన్యాసాలే,హృదయాలను తడిమే తరంగాలే,భావావేశ ఉత్ప్రేరకాలే కవయిత్రి అక్షర విన్యాసాలు.సమాజంలోని సంఘర్షణల కింద మగ్గిపోతూ మృత స్థితికి చేరుతున్న అభ్యుదయ భావాలను ఉన్నత ప్రమాణాలతో విరామమెరుగక వెనుదిరిగి చూడని ధీరవనిత కలం నుండి జాలువారిన కలల ప్రవాహాలు.తన మదిలోని స్వప్నాలన్నిటినీ,ఘర్షణలన్నిటినీ అక్షరాలలో నిక్షిప్తం చేసి సమాజ వికాసం కోసం ధారలా నిర్విరామంగా ప్రవహింప చేస్తున్నారు.సమాజంలో త్వరితగతిన మార్పు వచ్చి సమసమాజ సృష్టి జరగాలనే ఆశ ,ఆతృత తన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.ఒకవైపు ఆత్మీయ ఆనవాళ్ళకై అనుబంధాలకై వెతుకుతూనే మరోవైపు ఎదురుదాడుల్ని తిప్పికొడుతూ సమాధానపు అస్త్రశస్త్రాలను ఎక్కుపెట్టి యుద్ధానికి కలం దువ్వుతూ మనసులో ఏర్పడుతున్న శూన్యత నుండి అక్షర తూటాలను పేల్చుతున్న వీరనారే మంజు అమ్మ గారు.అస్త్ర సన్యాసం తన విధానం కాదనే దానికి తన అంతరంగ భావావేశ ప్రవాహమే నిదర్శనం.నిరంతరం సమీక్షలకై కదులుతున్న కవయిత్రి కలం వర్ధమాన కవులకు దిక్సూచని అనడంలో సందేహం లేదు.రక్తం పంచివ్వని బంధమైతేనేం మానవత్వానికి,మమతలకు నెలవైన అమ్మతనమే కాదు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చే వారిని,సంఘ విద్రోహ శక్తులను చీల్చి చండాడే వీరత్వం కలబోసిన నిండైన రూపం మంజు అమ్మ గారు.

        రక్తపాతాలు వద్దంటూ కులమెరుగని గుణాన్ని,మతమెరుగని మానవత్వాన్ని నింపుకున్న రక్తదానమే జీవనాదమని హృద్యంగా ఆవిష్కరించిన తీరు అభినందనీయం మరియు అనుసరణీయం.జీవనదులతో బీటలు వారిన భూములను తడిపితే మోడువారిన రైతుల జీవితాల్లో వెల్లివిరిసే నవ్వుల్ని చెమ్మగిల్లిన కన్నులతో దర్శించమని సేవా హృదయాలతో స్పర్శించి పరితపించాలని రాజకీయ నాయకుల బాధ్యతలను గుర్తు చేసిన విధానం,రైతుల పట్ల తనకున్న ప్రేమను సామాజిక బాధ్యతను అభివ్యక్తీకరించిన తీరు బహుదా ప్రశంసనీయం.పర్యావరణాన్ని అతలాకుతలం చేయడానికా ఆధునిక మానవుని మేధ‌స్సు అంటూ ప్రశ్నిస్తూనే ప్రకృతి తల్లికి పరిపూర్ణతను అందించే దివ్యౌషదమే చెరబట్టని ఆకుపచ్చని అవనేనని తనలోని ప్రకృతి ప్రేమికురాలిని పరిచయం చేస్తారు.
 
       అనుభవాలను అక్షరాలుగా మలచి ,గాయాలను కన్నీటి సిరాగా మార్చి బాంధవ్యాల బంధీఖానాలో మగ్గుతున్న జీవితాలతో నింపిన పేజీలే దర్శనమిచ్చే కవితా సంపుటిని అందరూ చదవాల్సిందే.నైరాశ్యపు నీడ కమ్మని కలల ప్రపంచాన్ని కాల్చేస్తుందని ఉపదేశిస్తూనే ఆగిపోయే ఊపిరులకు ,దగాపడే జీవితాలకు అక్షరాలు ఆసరా కావాలని, సాహితీ ప్రపంచం దన్నుగా నిలవాలని తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.ఉనికి కోసం పాకులాడే ఆకారంలేని అర్దనగ్నపు గీతలన్నీ ,వెలవెలబోతూ వలసపోయే అరువు తెచ్చుకున్న నవ్వులన్నీ అర్థం కాని లెక్కలేనని అనుభవాల సారాంశాన్ని చక్కగా వివరించారు ‌.అనుబంధాలను అల్లరి పాలు చేసే వంచకుల,రక్త సంబంధాల రాతలను మార్చేసే మాయగాళ్ళ,రాక్షస క్రీడలాడే రాజకీయ నాయకుల వంకర బుద్ధిని బయటపెట్టే రోజులు ఎంత దూరమని ఆవేదనా భరితమైన, ఆక్రోశం నిండిన కలంతో గర్జిస్తోంది కవయిత్రి.

       బంధాలను భారంగా ఎంచి స్వార్థం కోసం బరితెగించే మానసిక రోగుల గుండెల్లోకి కలమనే గునపం దించుతున్నారు మంజు అమ్మ గారు.మనది కాని ప్రయాణానికి ఉసిగొల్పే తప్పటడుగులు మరణశాసనాన్ని లిఖిస్తూ అసమర్థులుగా సంఘంలో నిలబెడతాయని తెలిపే జీవిత మర్మాలెన్నిటినో ఒంపిన కవితా సంపుటి.ఉపన్యాసాలతో ఊదరగొడుతూ,ఉద్యమాలంటూ ఊరేగుతూ నడిబజార్లో సత్యాన్ని సమాధి చేసి సంతాప సభలు పెట్టే ఊసరవెల్లులకు కొమ్ము కాయద్దని సుతిమెత్తగా మేధావులను హెచ్చరించిన తీరు ప్రశంసనీయం.

      సంద్రంలోని అలల వలే హృదయాన్ని తాకుతున్న సమాజ సంఘర్షణల్ని, జీవిత అనుభవాల్ని,మదిలో మెదిలే భావాల్ని కవితా ధారలుగా ఒంపారు.సమాజంలోకి పరకాయ ప్రవేశం చేశారో లేక యావత్ సమాజాన్ని తనలోనే బంధించి దర్శించి నిరంతర శోధన చేశారో ప్రతి రుగ్మతను మన ముందుంచారు.ప్రతి కవనంలో సామాజిక స్పృహ గోచరిస్తూ సన్మార్గాల్ని చూపిస్తూ ఎద లోతుల్ని విశాలం చేస్తూ బాధ్యతను గుర్తెరిగేలా నడిపించే భావ తరంగ చైతన్య దీప్తై మనల్ని నడిపిస్తాయనడంలో అతిశయం లేదు.మనసు పడే యాతన నుండి పుట్టిన సంఘర్షణ భావోద్వేగాలను ప్రజ్వలన చేశాయేమో అనేక కోణాల్లో నిర్మింపబడిన సమాజంలోని భిన్నమైన మనస్తత్వాలను వాటి పర్యావసానాలను ప్రతిబింబించిన తీరు అభినందనీయం.చెల్లాచెదురవుతున్న జ్ఞాపకాలను, చెదిరిపోయిన చిన్ననాటి చిత్రాలను,రాలిన కలలను ఒక చోట పేర్చి మనకు అందించారు ‌.అంటీముట్టని ఆప్యాయతల్ని,మకిలి పట్టిన మురికి మనుషుల్ని వెలివేయడమే సబబని నిక్కచ్చిగా చెప్పడం ఆమె అంతరంగ ఆవేదనకు,అంతరిస్తున్న విలువలకు అద్దం పడుతుంది.మండుతున్న గుండెలతో బడుగు రైతులు ఉద్యమాలకు ఉద్యుక్తులైతే ఏ పంట పండించనని ఒక అడుగు ముందుకు వేస్తే మన పరిస్థితేంటని రైతుల గొప్ప మనసును కీర్తిస్తూనే రాజకీయ నాయకుల, కార్పొరేట్ శక్తుల,దళారుల కుటిలత్వాన్ని ఎండగట్టడం చూస్తే రైతుల పట్ల మమకారాన్ని అర్థం చేసుకోవచ్చు.
నిరంతర సంఘర్షణల్లో నుండి ,కోల్పోతున్న బంధాల వేదన నుండి మానవత్వపు వెలుగులు పూయించాలన్న ఆరాటం ఆత్మపరిశీలనై ,అంకురమై మొదలైన అక్షర ప్రయాణంలో నేనొక ప్రయాణికుడను అయినందుకు అదృష్టంగా భావిస్తున్నాను.నిజాలను విన్ననూ అబద్దాలను నమ్ముతూ అరకొర అర్దనగ్న నైతిక విలువలతో విలవిల్లాడుతున్న న్యాయదేవతకే గూడులేదని గోడు వెల్లబోసుకోవడం సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షేనని ఆవేదన చెందడం వారిపట్ల తన నిబద్ధతను చాటి చెబుతారు కవయిత్రి.
      
      అంతర్లీనంగా దాగిన భావావేశపు వెలుగులను మన మనసుల్లో ప్రోది చేస్తూ సమాజ రుగ్మతల సత్వర సన్యాసానికి దూసుకొచ్చిన అక్షర తూటాల విన్యాసమే మంజు యనమదల అమ్మ గారి "అక్షర స(వి)వ్యాసం.అక్షరాల విన్యాసాలను క్రమంగా పదాల పోరాటపు ఆరాటంగా మార్చడం స్పష్టంగా కనిపిస్తుంది.ప్రతి ఒక్కరూ చదవాల్సిన కవితా సంపుటి.చక్కటి కవనాలను అందించిన మంజు యనమదల అమ్మ గారికి హృదయపూర్వక అభినందనలతో....

   పుట్టపర్తి మల్లికార్జున
           ఉపాధ్యాయుడు
           గోరంట్ల
      అనంతపురం జిల్లా
       9490439029

16, మార్చి 2020, సోమవారం

స్వప్నాలు బద్దలైన వేళ..!!

కాలిపోతున్న జీవితాల నుండి
రాలిపడుతున్న అవశేషాలు

ఏ లెక్కలెటుపోతున్నాయెా తెలియని
అనుబంధాల చిక్కుముడులు

ఆస్తుల శేషాల కోసం వెంపర్లాడుతూ
దిగజారిన నైతిక విలువలు

నాటకీయత లోపించకుండా 
జగన్నాటకాన్ని రక్తి కట్టిస్తున్న రక్త సంబంధాలు

ముసుగు కప్పుకున్న ద్విముఖాలను
వెలుగులో చూపించలేని చీకటి బతుకులు

గమ్యాలనెరుగని అగమ్యగోచరమైన 
కాంక్షల నడుమ చిక్కుబడిన మనసులు  

వ్యక్తులు వ్యవస్థలు ఛిద్రమైపోతున్నా
మనుషులుగా మనం చింతించలేని క్షణాలు

కలగన్న స్వప్నాలు బద్దలైన వేళ 
కలతబారిన మనసుల కన్నీటి వీడ్కోలివి..!!

14, మార్చి 2020, శనివారం

సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు...మన:పూర్వక ధన్యవాదాలు ఆంధ్రా ప్రవాసి డాట్ కామ్ వారికి రాజశేఖర్ చప్పిడి గారికి..సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం తెలుగు ఆడపడుచు... భూతల స్వర్గం అమెరికా వెళ్ళాలనే పట్టుదల... ఏమైది చివరకు...

భూతల స్వర్గమేనా...!! 1 పార్ట్

      ఒకప్పుడు అమెరికా అంటే భూతల స్వర్గమన్న భావన ప్రతి ఒక్కరిలో ఉండేది. అమెరికా నుండి ఎవరైనా వచ్చారంటే, వారిని ఎంత అపురూపంగా చూసేవారో మనందరికి తెలుసు. నా వరకు నాకు మా గోపాలరావు అన్నయ్య, శిరీష వదిన అమెరికా నుండి వస్తే ఎంత గొప్పగా ఉండేదో. చిన్నప్పుడు మా ఆటల్లో కూడా వాళ్ళలా అమెరికా వెళ్ళినట్లుగా వారిని అనుకరిస్తూ ఆడుకునేవాళ్ళం. బహుశా నా అమెరికా ప్రయాణానికి బీజం అక్కడే పడి ఉండవచ్చు.
      సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చి, ఆ రోజుల్లో ఆడపిల్ల అదీ పక్క రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదవడమే ఓ సాహసం. ఇంటరు వరకు తెలుగు మీడియంలో చదివి ఇంజనీరింగ్ పూర్తి చేసి, అమెరికాలో ఎమ్ ఎస్ చేయాలన్న కోరికతో జి ఆర్ ఈ, టోఫెల్ రాసి క్వాలిఫై అయ్యి కూడా ఆర్థిక వెసులుబాటు లేక అమెరికా కలకు తాత్కాలిక విరామం ఇచ్చినా...నా అమెరికా వెళ్ళాలన్న కోరికను
తీర్చడానికి మా రాధ పెదనాన్న తన చుట్టాన్ని అడిగితే, వాళ్ళు AS/400 చేయమనండి తీసుకువెళతాం అని చెప్తే.. అప్పట్లో అందరు IBM Mainframes చేస్తుంటే..ఎలక్ట్రానిక్స్ చదివిన నేను బెంగుళూరులో CMC లో ఈ కోర్స్ చేసి, అనుకోని కారణాల వలన పెళ్ళి, తర్వాత మద్రాస్ లో ఉద్యోగం, బాబు పుట్టడం, లెక్చరర్ గా కొన్ని నెలలు, తర్వాత నా అమెరికా సన్నాహాలకి నాన్న ఫ్రెండ్ మంతెన నరసరాజు అంకుల్ సాయం చేయడం, H1 రావడం, టికెట్ కూడ అంకుల్ తీసుకోవడంతో సంవత్సరం నర్ర బాబుని, అందరిని వదిలి అమెరికా ప్రయాణం డాలర్ల కోసం మెుదలయ్యింది. 

మళ్ళీ కలుద్దాం... 
        
       

13, మార్చి 2020, శుక్రవారం

రెక్కలు...!!

1.  గగనాన్ని తాకిన
ఆశలు
గమ్యాన్ని చేరాలన్న
కోరికలు

సందిగ్ధంలో
జీవితం..!!

2.   అక్షరాలన్ని 
వాడనక్కర్లేదు
అనంతమైన
భావాలొలికించడానికి

అపహాస్యం
అన్ని వేళలా మంచిది కాదు..!!

3.   సంధించడానికి
ఏకాగ్రత
లక్ష్య ఛేదనకు
పట్టుదల

ఏది అటూ ఇటైనా
గురి తప్పుతుంది...!!

4.   అణువు
అనల్పం
అక్షరాలు 
కొన్నే

వామనావతారం
కోపిస్తే పాతాళమే జన్మస్థలం...!!

5.   ఏ క్షణం
ఎలా ఉంటుందో
ఈ క్షణం
మనది

రెప్పపాటే
ఈ జీవితం...!!

6.   మౌనం ఎదురుచూస్తోంది
మాట్లాడాలని
తడబాటు తెలియకుండాలని
గళం ప్రయత్నం

గరళం గొంతులోనుంచడం
బహు కష్టం సుమా..!!

7.   మాట
మౌనం
మనసు
మనిషి

అర్థమైతే
సంతృప్తే జీవితంలో..!!

8.   మంచికి
తక్కువ స్థానం
లోపానిదే
అగ్రస్థానం 

అను(ఆడిపోసు)కునేవాళ్ళు 
ఎప్పుడూ ఉంటారు...!!

9.  నియంత్రణ 
మనిషికి
నియంత్రించలేనిది
కాలం

వ్యాధి 
వాహకమెవరు?

10.   మాయమై
మదిని గుబులు గొల్పింది
సంజీవిని 
చేతికి దొరికింది

ప్రాణాలిక
స్వర్గానికి పయనమంటున్నాయి...!!

11.   చదవడం
అలవాటు చేసుకోవాలి
బతుకు 
విలువ తెలియాలంటే

జీవితం
చీకటిలోనే బాగా కనబడుతుంది...!!

12.  చుట్టం 
చీకటయినా
వెలుగు
స్నేహం చేస్తానంటోంది

ఆశ
భవితవ్యం..!!

13.   మనసు
మాటునే ఉంటుంది
మెాము
తెలియజెప్తూనే ఉంటుంది

చీకటి వెలుగులు
అద్దంలో చిత్రాలే...!!

14.   అక్షరం 
లిఖిస్తుంది
మనసు
అంతర్మధనాన్ని

ప్రణవ(య)నాదం
ఆవిష్క్రతమవుతుంది...!!

15.  హక్కులు
తెలుసుకోవాలి
బాధ్యతలు
పంచుకోవాలి

ఇద్దరు
సమానమే..!!

16.   ప్రశ్న
ప్రశ్నించడం
సమాధానం 
జవాబు చెప్పలేకపోవడం

అనైతికత
ఉక్రోషానికి పరాకాష్ఠ...!!

17.   బంధువులు 
భోజనానికి మాత్రమే వచ్చేవారు
స్నేహితులు
అడగకుండానే ఆసరా ఇచ్చేవారు

ఇద్దరూ ముఖ్యపాత్రదారులే
జీవితంలో..!!

18.  దూరమెప్పడూ
దగ్గరే
నవ్వులెప్పుడూ
మనవి కానట్టు

గతమెా
జ్ఞాపకం అంతే...!!

19.  గతాన్ని 
మర్చిపోయినా
గాయం
మానినా

గురుతులెప్పుడూ
గమనాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయి..!!

20.   ఎదురుదెబ్బలు
ఎన్ని తగిలినా
మనోధైర్యం 
మహా గట్టిది

ఓటమి
తలను వంచాల్సిందే..!!

21.   ఊహకు
ఊతమౌతున్నా
కథలకు
కలలనిస్తూ

ప్రాణం
నిలబెట్టాలని..!!

22.   ఓదార్పు 
అవసరమే
బాధ్యతలను 
మెాయాలంటే

బంధం
బలమైనది...!!

23.  చూడమంటున్నా
రేపటి వెలుగును
బంధానికి
బంగరుబాట వేసి

రెప్పపాటే
ఈ జీవితం..!!

24.   హంగులు
ఆర్భాటాలు
అహాలు
ఆధిపత్యాలు

జీవితం
క్షణికమైనదే..!!

25.   సత్యం
మరణించినా
సమాధి 
నిజం చెబుతుంది

లెక్క 
సరిజేయబడుతుంది...!!

26.  
మనసుతో 
మాటలు
కాలంతో
పయనం 

గతమెప్పడూ
జ్ఞాపకాల తాయిలాలందిస్తూ..!!

27.  కదిలేది
కాలమయినా
కదిలించేది
మనసు

మానవత్వం
మనిషి చిరునామా అయితే..!!

28.   ఓటమి
విజయం
చీకటి
వెలుగులు

జీవితం
రంగులరాట్నం..!!

29.  ఆరాటమెప్పుడూ
ఆశల నిలయమే
జీవితం
చదరంగమైతే

గెలుపు
లక్ష్యం...!!

30.   మాట 
పొదుపు 
మనిషి
విలువ తెలుపును

మౌనం మంచిదే 
కొన్నిసార్లు...!!


11, మార్చి 2020, బుధవారం

వెన్నెల పుష్పాలు సమీక్ష..!!

సమాజంలో చాలా కొద్దిమందే భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అందులో అతి అరుదైన లక్షణం అవయవదానం. దీని మీద సరైన అవగాహన లేని మన సమాజంలో..ఎంతోమందికి తన రాతల ద్వారా, చేత ద్వారా సరైన అవగాహన కల్పిస్తూ, ఎంతోమందికి మార్గదర్శకంగా నిలబడిన నేటి మహిళ భారతి కాట్రగడ్డ. ఈమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. తీరికలేని ఇంటి బాధ్యతలతో, ఉద్యోగ బాధ్యతలతో సతమతమౌతూనే, తనవంతుగా నలుగురికి శరీర, అవయవదానాల గురించి చెప్తూ, ఎందరో పెద్దల నుండి ఆశీస్సులు,  పురస్కారాలు అందుకుంటున్న భారతి కాట్రగడ్డ అభినందనీయులు. చక్కని కవిత్వాన్ని అందిస్తూ, అది కూడా అవయవదానానికే ప్రాధాన్యతనిస్తూ ఓ కవితా సంపుటి " వెన్నెల పుష్పాలు " తేవడం ముదావహం. 
      
     ప్రాణం పోయాక మట్టిలా మారకుండా, మాణిక్యమై మరొకరిలో జీవాన్ని నింపుతుందని, గుప్పెడు బూడిద కాకుండా నలుగురికి ప్రాణం పోయమని, ఇలా ఓ అరవై చిరు కవితల్లో అవయవదానం గొప్పదనాన్ని చెప్తారు. మృత్యువును సవాల్ చేస్తూ, నేను మరణించిన బూడిదగా మారను, మరి కొందరిలో జీవిస్తాను అవయవదానంతో అంటారు. కవితలుగానే కాకుండా దానాల్లోకెల్లా అవయవదానం శ్రేష్ఠమంటారు చక్కని సీస పద్యంలో.  పండుటాకులా రాలిపోతున్నా పదుగురిలో జీవించే ఉంటానన్న ఆత్మవిశ్వాసం, పరోకారాయమిదం శరీరం అన్న లోకోక్తిని గుర్తు చేస్తారు మరోచోట. మూడేళ్ళ చిన్నారికి నూరేళ్ళు బ్రెయిన్ డెడ్ తో నిండితే, ఆ తల్లిదండ్రులు బాధను బాధ్యతగా మార్చుకుని, కొందరు తలిదండ్రులకు కడుపుకోతను దూరం చేసిన మహోన్నత అవయవదానం యజ్ఞాన్ని అక్షరబద్దం చేసారు హృద్యంగా. ఒక్కసారి అవయవదాతగా మారి చూడు, జీవితపు అంతర్ముఖం తెలుస్తుందంటారు. ఎందరో స్పూర్తిప్రధాతలు ప్రభోదించి, అవలంబించిన మార్గం ఈ అవయవదానం, శరీరదానం అంటూ కొందరని గుర్తు చేస్తారు. మనిషి అహంతో ఎంత విర్రవీగినా ఆఖరి క్షణాల్లోనైనా అవయవదానం ఆవశ్యకతను గుర్తెరిగి తమ జీవితానికి అర్థాన్ని గుర్తించాలంటారు. ఎందరో తల్లుల త్యాగాలను తెలుపుతూ, మరణం మన అతిథే ఆహ్వానించు తప్పదు కాని, మరణించీ జీవించడమే జీవిత పరమార్ధం అంటారు. వెన్నెల ఆకాశంలోనే కాదు, ఈ భువిపై కూడా అవయవదానం " వెన్నెల పుష్పాలు " గా విరాజిల్లుతుందన్న ఆశాభావంతో అవయవదానం కోసం ఎదురుచూస్తున్న ఎందరికో చేయూతనివ్వమంటూ, సమాజంలో చైతన్యాన్ని కలిగించమని ప్రతి ఒక్కరికి వినమ్రంగా నివేదిస్తూ, ఈ క్రతువులో పాలుపంచుకుంటున్న మనసివ్వు మహనీయులందరికి అక్షరాంజలి ఘటిస్తున్నారు. 
          మెుదటి అడుగు ఎప్పుడూ ఒంటరే అని గుర్తు చేస్తూ, ఆశయ సాధన ధ్యేయంగా, మానవజన్మకు సార్థకత కల్పిస్తూ, యువత ముందడుగు వేయాలని కోరుకుంటూ, మనమే మరి కొందరికి ప్రేరణగా మారాలని ఆకాంక్షిస్తూ, సమాజానికి అవయవదానంలో ఉన్న అపోహలు తొలగించి, ప్రతి ఒక్కరిలో దేహ, అవయవదానం గురించి అవగాహన కల్పిస్తూ, మానవజన్మకు అవయవదానంతో పరిపూర్ణత అని చెప్తూ చక్కని సందేశాత్మక కవితలు ఈ పుస్తకం నిండా చోటు చేసుకున్నాయి. అందరూ చదివి ఆచరించదగ్గ ఆచరణ ఇది. ఇంత అద్భుతమైన సందేశాత్మక కవితా సంపుటి  " వెన్నెల పుష్పాలు " రచించిన భారతి కాట్రగడ్డకు హృదయపూర్వక అభినందనలు. 
     

10, మార్చి 2020, మంగళవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు... 2వ భాగం

తెలుగు సాహితీ ముచ్చట్లు  రెండవ భాగం..!!

తెలుగు ఛందస్సు గురించి ప్రత్యేక వ్యాసం..

మనకు తెలిసిన పద్యాలలో ఛందస్సు గురించి విపులంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి.

పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్ని ఛందస్సు అంటారు. ఛందస్సును మొట్టమొదట సంస్కృతములో రచించిన వేదాలలో ఉపయోగించారు. వేదముల యొక్క అంగములనబడు ఆరు వేదాంగములలో ఛందస్సు ఒకటి. వేదత్రయాన్ని ఛందస్సు అని కూడా అంటారు. ఋగ్వేదము మరియు సామవేదము సంపూర్ణముగా పద్య (శ్లోక) రూపములో నున్నవి. యజుర్వేదములో గద్యము కూడా ఉంది. సామవేదమంతయూ ఛందస్సేనని పండితుల అభిప్రాయము. బ్రహ్మవిష్ణుశివులలాగా ప్రతి మంత్రానికీ ఋషి, ఛందస్సు, దేవత త్రిమూర్తులని భావిస్తారు. కావ్య నిర్మాణానికి వాడబడునది ఛందస్సు.

వేద ఛందస్సు సవరించు
వేదాలలో ముఖ్యంగా అనుష్టుప్ (8 అక్షరములు), బృహతి (9), పంక్తి (10), త్రిష్టుప్ (11), జగతి (12) అనబడు ఛందములను ఉపయోగించారు. మిక్కిలి ప్రఖ్యాతి గడించిన ఛందస్సు త్రిపద గాయత్రీ ఛందస్సు. అది తత్సవితుర్వరేణియం భర్గోదేవస్య ధీమహీ ధియో యోనః ప్రచోదయాత్. కొందరు మొదటి పాదములో వరేణ్యం అంటారు. అప్పుడు గాయత్రి ఛందస్సుకు 23 అక్షరాలే. ఇది గాయత్రిలో ఒక ప్రత్యేకత.

ఛందస్సు వేదాంగమైనప్పటికీ, వేద ఛందస్సును వివరించే గ్రంథాలేవీ ప్రస్తుతము లభ్యము కావట్లేదు. ఛందో శాస్త్రముపై ప్రస్తుతం లభ్యమవుతున్న అత్యంత పురాతనమైన గ్రంథము ప్రాచీన భారతీయ గణిత శాస్త్రజ్ఞుడైన పింగళుడు రచించిన ఛందస్ శాస్త్ర. ఇది వేద సంస్కృతము మరియు పురాణ సంస్కృతముల సంధికాలమునకు చెందినది. హిందూ పౌరాణికంలో ఈశ్వరుడు పార్వతికి ఛందస్సును బోధిస్తుండగా దానిని విని పింగళాచార్యుడు ఛందస్సు శాస్త్రమును వ్రాసినాడని అంటారు. పింగళుడు ఇప్పటి కర్ణాటక దేశ వాసుడని ప్రతీతి.

ఆ తరువాత మధ్యయుగపు తొలినాళ్లలోని ఛందస్ శాస్త్రపై ఆధారితమైన అగ్ని పురాణము, భారతీయ నాట్య శాస్త్రంలోని 15వ అధ్యాయము మరియు బృహత్‌సంహిత యొక్క 104 అధ్యాయములు ఛందస్సుపై లభ్యమవుతున్న వనరులు. 14వ శతాబ్దములో కేదారభట్టు రాసిన వ్రిత్తరత్నాకర ఛందస్సుపై ప్రసిద్ధి చెందిన గ్రంథమైనప్పటికీ వేద ఛందస్సును చర్చించదు.

తెలుగు ఛందస్సు

పాదాది నియమములు గలిగిన పద్య లక్షణములను తెలుపుంది చందస్సు అనబడును. తెలుగు ఛందస్సు, సంస్కృత ఛందస్సు పై ఆధార పడి అభివృద్ధి చెందినది. సంస్కృత ఛందస్సులోని వృత్తాలతో బాటు జాతులు, ఉపజాతులు తెలుగులోని ప్రత్యేకతలు. ఆధునిక పాఠకులు, లేఖకులు, నవ కవులు, విప్లవ కవులు ఛందస్సు పురాతనమైనదని, ప్రగతి నిరోధకమని భావించినా కొన్ని సినిమా పాటలలో, శ్రీ శ్రీ గేయాలలో మాత్రా ఛందస్సును చూడవచ్చు.

గురువులు, లఘువులు

ఛందస్సు ద్విసంఖ్యామానంపై ఆధారపడి ఉంది. ఛందస్సులో రెండే అక్షరాలు. గురువు మరియు లఘువు. గురువుని U తోటీ, లఘువుని | తోటీ సూచిస్తారు.

గురువు, లఘువు, విభజించడము

ఈ గురు లఘు నిర్ణయం ఒక అక్షరాన్ని పలికే సమయంపై ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకు "అమల, అమ్మ, ఆవల, అండ" ఇందు మొదటి పదము "అమల": అ మ ల మూడు అక్షరాలూ ఒక్కొక్కటీ ఒక లిప్త కాలము మాత్రమే తీసుకుంటున్నాయి. రెండవ పదము "అమ్మ" ఇందులో మొదటి అక్షరము అ ఒక లిప్త కాలము ఆ తరువాతి మ్మ అక్షరము రెండు లిప్తల కాలము తీసుకుంటున్నది. అలాగే మూడవ పదము "ఆవల" ఆ = రెండు లిప్తలు, వ, లలు ఒక లిప్త కాలములు తీసుకుంటున్నాయి. ఇలా ఒక లిప్త కాలము తీసుకొను వాటిని లఘువు అని, రెండు లిప్తల కాలము తీసుకొను వాటిని గురువు అని అంటారు.

కొన్ని నియమాలు

1. దీర్ఘాలన్నీ గురువులు, ఉదాహరణకు ఆట = U I
2. "ఐ" "ఔ" అచ్చులతో కూడుకున్న అక్షరాలు గురువులు. (ఉదా: ఔనులో "ఔ" గురువు, "సైనికుడు"లో "సై" గురువు)
3.  ఒక సున్నా, విసర్గలు ఉన్న అక్షరాలు అన్నీ గురువులే (ఉదా: సందడిలో సం గురువు, అంత:పురములో త: అనునది గురువు )
4.   సంయుక్తాక్షరం (లేదా ద్విత్వాక్షరం) ముందున్న అక్షరం గురువవుతుంది. (ఉదా: అమ్మలో అ గురువు, భర్తలో భ గురువు). ఇది సాధారణంగా ఒకే పదంలోని అక్షరాలకే వర్తిస్తుంది. ఒక వాక్యంలో రెండుపదాలున్నప్పుడు, రెండవ పదం మొదటి అక్షరం సంయుక్తమైనా మొదటి పదం చివరి అక్షరం గురువు అవ్వదు. (ఉదా: అది ఒక స్తంభము అన్న వాక్యంలో "క" గురువు కాదు) అయితే రెండు పదాలూ ఒకే సమాసంలో ఉంటే ఈ నియమం వర్తిస్తుంది. (ఉదా: అది ఒక రత్నస్తంభము అన్నప్పుడు "త్న" గురువు అవుతుంది)
5.  ఋ అచ్చుతో ఉన్న అక్షరాలూ, వాటి ముందరి అక్షరాలూ (కృ, మొదలగున్నవి ) లఘువులు మాత్రమే.
6.   ర వత్తు ఉన్నప్పటికీ దాని ముందు అక్షరములు కొన్ని సందర్భములలో లఘువులే! అద్రుచులోని అ లఘువు, సక్రమలో స గురువు. అభ్యాసము ద్వారా వీటిని తెలుసుకొనవచ్చు.
7.   పొల్లుతో కూడిన అక్షరాలు గురువులు. (ఉదా: "పూసెన్ గలువలు"లో "సెన్" గురువు)

గణాలు-రకాలు . 

అక్షరాల గుంపును గణము అని అంటారు.ఇవి నాలుగు రకాలు 1. ఏకాక్షర గణాలు .2. రెండక్షరాల గణాలు 3. మూడక్షరాల గణాలు 4.నాలుగక్షరాల గణాలు.

ఏకాక్షర గణాలు

ఒకే అక్షరం గణంగా ఏర్పడుతుంది.అది గురువు లేదా లఘువు కావచ్చు.

U, l, U

ఉదా: శ్రీ , ల, సై

రెండక్షరాల గణాలు

రెండు అక్షరాలు కలిసి గణంగా ఏర్పడును. ఇవి నాలుగు రకాలు .1. లలము 2. లగము ( వ గణం ) 3. గలము ( హ గణం ) 4.గగము.

లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు

లగ లేదా వ IU ఉదా: రమా

గల లేదా హ UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ

గగ UU ఉదా: రంరం, సంతాన్

మూడక్షరాల గణాలు

ఇవి మూడక్షరాల కలయికలతో ఏర్పడేవి (బైనరీ 0, 1, తీసుకున్న 000, 001, 010, 011, 100, 101, 110, 111) కింది వాక్యాన్ని మననం చేసుకుంటూ వీటిని సులువుగా గుర్తుంచుకోవచ్చు. య మా తా రా జ భా న స ల గం యగణం కావాలంటే పై వాక్యంలో యతో మొదలుపెట్టి వరుసగా మూడక్షరాల గురు లఘువులను గుర్తిస్తే యగణం అవుతుంది. యతో మొదలుపెట్టి మూడక్షరాలు: య మా తా - లఘువు, , గురువు, గురువు IUU అలాగే రాతో మొదలుపెట్టి మూడక్షరాలు (రా జ భా - UIU) రగణం అవుతుంది. ఈ విధంగా అన్ని గణాలను గుర్తుంచుకోవచ్చు

అన్ని గణాలు:

ఆది గురువు భ గణము UII

మధ్య గురువు జ గణము IUI

అంత్య గురువు స గణము lIIU

సర్వ లఘువులు న గణము III

ఆది లఘువు య గణము IUU

మధ్య లఘువు ర గణము UIU

అంత్య లఘువు త గణము UUI

సర్వ గురువులు మ గణము UUU

ఇవి మూడక్షరముల గణములు.

ఉపగణాలు

ఉప గణములు అనగా పైవాటి సమ్మేళనంలో ఏర్పడేవి. ఇవి మూడు రకములు

సూర్య గణములు

న = న = III
హ = గల = UI

ఇంద్ర గణములు

నగ = IIIU
సల = IIUI
నల = IIII
భ = UII
ర = UIU
త = UUI

చంద్ర గణములు

భల = UIII
భగరు = UIIU
తల = UUII
తగ = UUIU
మలఘ = UUUI
నలల = IIIII
నగగ = IIIUU
నవ = IIIIU
సహ = IIUUI
సవ = IIUIU
సగగ = IIUUU
నహ = IIIUI
రగురు = UIUU
నల = IIII

వృత్తాలు

గణాలతో శోభిల్లుతూ, యతి ప్రాస లక్షణాలను కలిగి ఉన్నటువంటివి వృత్తాలు. ఇందు చాలా రకాలు ఉన్నాయి.

చంపకమాల
ఉత్పలమాల
శార్దూల విక్రీడితము
మత్తేభ విక్రీడితము
తరళం
తరలము
తరలి
మాలిని
మత్తకోకిల
ఇంద్రవజ్రము
ఉపేంద్రవజ్రము
కవిరాజవిరాజితము
తోటకము
పంచచామరము
భుజంగప్రయాతము
మంగళమహశ్రీ
మానిని
మహాస్రగ్ధర
లయగ్రాహి
లయవిభాతి
వనమయూరము
స్రగ్ధర

జాతులు

జాతులు మాత్రాగణములతో మరియు ఉపగణములతో శోభిల్లును. జాతులకు కూడా యతి, ప్రాస నియమములు ఉన్నాయి.

కందం
ద్విపద
తరువోజ
అక్కరలు (మహాక్కర, మధ్యాక్కర, మధురాక్కర, అంతరాక్కర అల్పాక్కర)
ఉత్సాహము

ఉప జాతులు

తేటగీతి
ఆటవెలది
సీసము (పద్యం)
సర్వలఘు సీసము.

పలు విధములైన ఛందములు సవరించు
యధా-ఆర్యా చందము- ప్రథమ తృతీయ పాదములందు ద్వాదశ మాత్రలును ద్వితీయపాదమందు 18 మాత్రలు చతుర్దశపాదమందు 15 మాత్రలను కలిగి యుండు చందమును యద్ధా ఆర్యా చందము అంటారు. ఇందు పూర్వార్ధ సదృశమై ఉత్తరార్ధమునుండి ఉన్నచో అది గీతి ఉత్తరార్ధ సదృశమై పూర్వార్ధముండినచో అది ఉపగీతి అనబడును.ఆర్యాది ఛంధములో 4 మాత్రలు గల 5 గణములుండును. సర్వగురు, అంత్యగురు,మధ్యగురు, ఆదిగురు, చతుర్లఘువులు ఈ భేదములకు వరుసగా కర్ణ, కరతల, పయోధర, వసుచరణ,విష్ఠములని నామములు.
పరిగణితాక్షర సిద్ధమగు చందములను వర్ణిక లందురు.
శిఖరిణి అను ఛంధములో ప్రతిపాదమునందు సమానములైన హ్రస్వదీర్ఘములైన 17 యక్షరములు ఉండును.
పుష్పితాగ్ర ఛంధము- దీని ప్రథమ తృతీయ చరణములు సమాన లక్షణములతో 12 అక్షరములు- రెండు నగణములు 1 రగణము 1 యగణముతో ఉండును. ద్వితీయ చతుర్ధ చరణములలో ఒకే లక్షణముతో కూడిన 13 అక్షరములు- 1నగణము 2 జగణములు 1 రగణము 1 గురువు ఉండును.
చండవృష్టి ఛంధము- 20 అక్షరములు గల దండమునకు చండవృష్టి ప్రపాతమని పేరు. ఇందు రెండు నగణములు 7 రగణములు ఉన్నాయి.పదాంతమున విరామము.
పేరుక్త ఛంధము - ప్రతిపాదమునందును ఒక్కొక్క అక్షరము ఉండును.దీనికి రెండు భేదములు కలవు మొదటిది గురువు అగునది- దీనికి శ్రీ అని పేరు- ఉదా: వి ష్ణుం వందే, రెండవది లఘువు అక్షరముతో అగునది- ఉదా: హరి హర.
రత్యుక్త ఛంధము - ప్రతిచరణమునందును 2 అక్షరములు గలవు. ప్రసారముచే దీనికి 4 భేదములు. ప్రధం భేదము స్త్రీ; రెండు గురువులుగల నాల్గుపాదముల ఛంధము స్త్రీ.
మధ్య ఛంధము- మూడు అక్షరములు గల ఛంధము. దీనికి 8 చేదములు ఉన్నాయి.మూడు అక్షరములు గురువుగా నున్న మొదటి భేదము పేరు వారి.
ప్రతిష్ఠ ఛంధము- 4 అక్షరములు గల ఛంధము.ప్రస్తారమున దీనికి 16 భేదములు ఉన్నాయి.ప్రథమభేదము పేరు కన్య. ఉదా: భాస్వత్క న్యా సైకా ధన్యా. యస్యాః కూలే కృష్ణో ఖేలత్||
సుప్రతిష్ఠ ఛంధము- ప్రస్తారమున దీనికి 32 భేదములు ఉన్నాయి. దీని 9 వ భేదముపేరు పంక్తి 1 భగణము 2 గురువులు.
గాయత్రి ఛంధము- దీనికి ప్రస్తారమున 64 భేదములు ఉన్నాయి. దీని మొదటి భేదము పేరు విద్యుల్లేఖ- 2 మగణములు 13 వ భేదము పేరు తనుమధ్య-తగనము, యగణము 16 భేదము పేరు శశివదన -నగనము, యగణము 19వ భేదము వసుమతి తగణము, సగణము.
అనుష్టుపు ఛంధము - ప్రస్తారమున దీనికి 256 భేదములు ఉన్నాయి. దీనిన విద్యున్మాల మాణవకాక్రీడ, చిత్ర పద, హంసరుత, ప్రమాణిక, సమానిక, శ్లోక, భేద ప్రబేధములు ఉన్నాయి. శ్లోక ఛంధమున ప్రతి చరణము నందును 6వ అక్షరము గురువై 5వ అక్షరము లఘువు. ప్రధం, తృతీయ చరణములందును 7 అక్షరము దీర్షముగాను ద్వితీయ,చతుర్ధ చరణములందును హ్రస్వముగాను ఉండును.
బృహతి ఛంధము- ప్రస్తారమున దీనికి 512 భేదములు ఉన్నాయి. 251వ భేదము హలముఖి- ర, న, సగణములు. 64 వ భేదము భుజ్మగ శిశుభృతము- 2నగణములు 1మగణము.
పంక్తి ఛంధము- ప్రస్తారమున దీనికి 1024 భేదములు ఉన్నాయి. దీనిలో శుద్ధవిరాట్, పణవ, రుక్మవతి, మయూర సారిణి, మత్తా, మనోరమా, హంసీ, ఉపసిత్థా, చంపకమాలా అనేక అవాంతర భేదములు ఉన్నాయి.
త్రిస్టుపు ఛంధము - ప్రస్తారమున దీనికి 2048 భేదములు ఉన్నాయి.దీనికే అనేకావాంతర భేదములు కలవు - ఇంద్రవ్రజ- 2 తగణములు 1 జగణము 2 గురువులు, ఉపేంద్రవ్రజ-1 జగణము 1 తగణము 1 జగణము 2 గురువులు, ఉపజాతి- ఇంద్రవ్రజ ఉపేంద్రవ్రజ కలయిక, దోధక- 3 భగణములు 2 గురువులు, శాలిని రథోద్దత- మ,త గణములు 2 గురువులు, స్వాగత -ర,న,భ గణములు 2 గురువులు- మొదలగు నామములతో ప్రసిద్ధమైనవి.
జగతి ఛంధము -ప్రస్తారమున దీనికి 4096 భేదములు ఉన్నాయి. అందులో వంశస్థము- జ,త,జ,ర గణములు పాదాంతరమున యతి, ఇంద్రవంశము-త,త,జ,రగణములు పాదాంతమున యతి, ద్రుత విలంబిత,తోటక, భుజంగ ప్రయూత, స్రగ్విణి, మొదలైనవి ప్రసిధములు.
అతి జగతి ఛంధము - ప్రస్తారమున దీనికి 8192 భేదములు ఉన్నాయి. ఇందులో ప్రహర్షిణి-మ,న,జ,రగణములు 1 గురువు 2-10 యక్షరములపై యతి- ప్రసిద్ధమైనది.
శక్వరి ఛంధము - ప్రస్తారమున దీనికి 16384 భేదములు ఉన్నాయి.ఇందులో ఒకటి వసంతలతిక- త,భ గణములు 2 జగణములు 2 గురువులు. పాదాంతరమున విరామము.దీనినే కొందరు సింహోన్నత, ఉద్ధరిణి అని కూడా అంటారు.
అతిశక్వరి ఛంధము- ప్రస్తారమున దీనికి 32768 భేదములు ఉన్నాయి. చంద్రావర్త- 4 న, 1 సగణము 7-8 అక్షరములపై విరామము, మాలిని-2 న, 1 మ, 2 భగణములు 7-8 అక్షరములపై యతి, చంద్రావర్తకం - 7-8 అక్షరములపై విరామము 6-9 అక్షరములపై విరామము.
అష్టి ఛంధము- ప్రస్తారమున దీనికి 65536 భేదములు ఉన్నాయి.ఇందులో వృషభజగ విలసితము- భ,ర 3 న, 1 గురువు 7-9 అక్షరములపై యతి.
అత్యష్టి ఛంధము- ప్రస్తారమున దీనికి 131072 భేదములు ఉన్నాయి. ఇందు హరిణి, పృధ్వి, వంశపత్రపతితము, మందాక్రాంత, శిఖరిణి వృతములు ఉన్నాయి.
ధృతి ఛంధము- ప్రస్తారమున దీనికి 262144 భేదములు ఉన్నాయి.అందు భేదము కుసుమితాలతావేల్లితము- మ,త,న, 3 య గణములు 5-6-7 అక్షరములపై యతి.
విధృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 524288 భేదములు ఉన్నాయి.ఇందలి భేదమే శార్దూల విక్రీడితము- మ,స,జ,స,త,త,గ ములు.12-7 వ అక్షరములపై యతి.
కృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 1048576 భేదములు ఉన్నాయి.ప్రతి చరణము నందును 20, 20 అక్షరములు ఉన్నాయి.
ప్రకృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 2097152 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి స్రగ్ధర-మ,ర,భ,న,య,య,య,గణములు ఏడేసి అక్షరములపై యతి.
ఆకృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 4194304 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి భద్రకము- భ,ర,న,ర,న, గములు 10-12 అక్షరములపై యతి.
వికృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 8388608 భేదములు ఉన్నాయి. ఇందులో అశ్వలలిత- న,జ,భ,జ,భ ల గములు, మత్తాక్రీడ- మ,మ,త,న,న,న,ల గములు.8-15 అక్షరములపై విరామము.
సంకృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 16777216 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి తన్వి -భ,త,న,స,భ,భ,న,య గణములు.5-7-12అక్షరములపై విరామము.
అతికృతి ఛంధము-ప్రస్తారమున దీనికి 33553432 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి క్రౌంచపదము- భ,మ,స,భ,న,న,న,న గములు.5-8-7 అక్షరములపై విరామము.
ఉదాయము ఛంధము-ప్రస్తారమున దీనికి 67108864 భేదములు ఉన్నాయి. ఇందులో ఒకటి భుజంగ విజృంభితము - 2 మ, 1త, 3 నగణములు, 1ర, 1 స, 1ల, 1 గు 8-11-7 అక్షరములపై విరామము.


సేకరణ వికీపీడియా నుండి
మరిన్ని ముచ్చట్లతో వచ్చే వారం.. ఆంధ్రా ఆడపడుచు... అమెరికా ఉద్యగం, అనుభవాలు, అనుభూతులు...

నాకు ఈ అవకాశమిచ్చిన ఆంధ్రప్రవాసి వెబ్ సైట్ నిర్వహించే రాజశేఖర్ గారికి నా ధన్యవాదాలు...

నా అమెరికా అనుభవాలను వారం వారం మీ అందరితో పంచుకోవడానికి ఆంధ్ర ప్రవాసి వేదికగా మారడం, ... చాలా సంతోషంగా ఉంది... చదివి ఎలా ఉందో చెప్పండిఆంధ్రా ఆడపడుచు... అమెరికా ఉద్యగం, అనుభవాలు, అనుభూతులు...

8, మార్చి 2020, ఆదివారం

ఏక్ తారలు

1.   వెన్నెల సంతకం పెడదామన్న అత్యాశ_చీకటి సిరాతో..!!
2.   పలకరించాలనుకుంటున్నా_మౌన వారధిని మన మధ్య చెరిపేయాలని..!!
3.  గతంతో పనేముంది_వాస్తవమంతా నీతోనే ఉంటే..!!
4.   చెరపలేని గతమే వాస్తవమైంది_కన్నీరు కలత చెందినా..!!
5.   చీకటి మాత్రం నా సొంతమే_వెలుగు అందరికి పంచాలన్న స్వార్థంతో...!!
6.   సంశయమక్కర్లేని చెలిమిది_చీకటి చిరునవ్వుకు తోడంటూ...!!
7.   నిశ్శబ్ధమే నేస్తమెప్పుడూ_చిగురించే చిరునవ్వుల సహవాసానికి..!!
8.   నిందలేయడమే కొందరి నైజం_నెయ్యపు ముసుగులో..!!
9.   వద్దని వారించలేనివే జ్ఞాపకాలన్నీ_కలతపడినా కన్నీరు తెప్పించినా..!!
10.   కోరిక చిన్నదే_ఆశే అలవికానిదైంది..!!
11.  గమ్యాన్ని చేరుకో ఇలా_వెన్నెల పొద్దులో వేకువాక్షరాలతో..!!
12.   అంతిమం గురించి ఆలోచనేల_పరవశించే పదాలు నీ సొంతమైనప్పుడు...!!
13.   ఉదయాక్షరాలే అవి_హృదయానికి ఊపిరిగా మారుతూ..!!
14.   మరో మాటకు తావెక్కడ_మనసే లేనప్పుడు...!!
15.  మనసు ఉంటేనేమి లేకుంటేనేమి_మనిషే ముక్కలయ్యాక..!!
16.  నిష్క్రమణం అనివార్యమని ఎరిగినట్లుంది శూన్యం_మన మధ్యన ఇమడలేక...!!
17.   మాటలవసరం లేదు_మనసుంటే చాలేమెా..!!
18.  ఏళ్ళ తరబడి పరిచయాలక్కర్లేదు_కొన్ని బంధాలకు...!!
19.   అక్షరాలతో కలిసిన ఆత్మబంధమది_పలకరింపులకు పరిమళాలనద్దుతూ...!!
20.    కలానికి కళ్ళిద్దాం_మనం చూడలేని మరో లోకాన్ని పరిచయం చేసుకోవడానికి...!! 
21.  చిరిగిన బతుకుల అతుకులెన్నో_చెరగని నవ్వుల చాటున...!!
22.   ఆంతరంగికం ఆత్మీయులకెరుకే_మౌనం మాటలు నేర్వకున్నా..!!
23.   వెదుకులాటకు ముగింపే లేదు_తట్టి లేపేది జ్ఞాపకమైనప్పుడు..!!
24.   మౌనంతో ఊసులాడేదీ జ్ఞాపకమే_ముగింపు తెలియని జీవితాల్లో...!!
25.   తట్టుకోలేనిదే మనిషి నైజం_ముసుగులు తీసేస్తే...!!
26.   నిర్ణయం నీదేగా_నిరీక్షణకు తెర తీయాలన్నా వేయాలన్నా...!!
27.   దూరమని నువ్వనుకుంటే ఎలా_దగ్గరతనాన్ని గుర్తు చేస్తున్నానంతే..!!
28.  చివరి తేది లెక్కింకా తేలలేదట_దేవుడి జమాఖర్చుల్లో...!!
29.  చీకటి చుట్టేసిన జీవితాలెన్నో_మెలకువ కల కోసం ఎదురుచూస్తూ..!!
30.   వెలుగులు చిమ్ముతూనే ఉంటుంది_కలతకు నెలవైన కన్నీటి చిత్రమైనా...!!

7, మార్చి 2020, శనివారం

Where is your [Bra]...!!

నేస్తం,
          ఇది జరిగి దాదాపు 31 సంవత్సరాలు అవుతోంది. అవి నేను కర్నాటక బళ్ళారి విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ మెుదటి సంవత్సరం చదువుతున్న కొత్త. మాది D సెక్షన్. నాతోపాటు నలుగురు కన్నడ, తమిళ్ అమ్మాయిలు ఉండేవారు. ఒకమ్మాయికే కాస్త తెలుగు తెలుసు. అబ్బాయిల్లో నార్త్ ఇండియన్స్, కన్నడ, తమిళ్, మళయాళం, తెలుగు..ఇలా అందరు ఉండేవారు. 
        పల్లెటూరు నుండి వచ్చిన నేను కొత్తలో రెండు రోజులు చూడీదార్ వేసుకున్నా, తర్వాత నుండి లంగా ఓణినే వేసుకునేదాన్ని. మెుదటిబెంచ్ లో కూర్చునేవాళ్ళం అందరం. ఒక్కోరోజు క్లాస్ కాస్త ఖాళీగా ఉంటే నేను, తెలుగు కాస్త వచ్చిన హేమలత మెదటి బెంచ్ లో కూర్చుంటుండేవాళ్ళం. అమ్మా నేను కాలేజ్ కి దగ్గరలో రూమ్ లో ఉండేవాళ్ళం. 
        ఓ రోజు మధ్యాహ్నం రెండింటికి క్లాస్ కి వెళ్ళాం ఎప్పటిలానే. అప్పటికే సెకెండ్ బెంచ్ లో మిగతా ముగ్గురు అమ్మాయిలు కూర్చున్నారు. నేను, హేమలతా వెళ్ళేసరికి మా బెంచ్ పైన 
" Where is your [ BRA ] " అని రాసుంది. అది చూసి హేమలత ఛీ అనుకుంటూ సెకెండ్ బెంచ్ లో కూర్చుంది. మేం వెళ్ళేటప్పటికే అబ్బాయిలందరూ వచ్చి కూర్చున్నారు. నేను రాసింది చెరిపేసి అక్కడే కూర్చున్నా. వెంటనే సమాధానం బోర్డ్ మీద రాద్దామనుకున్నా "నీ అమ్మని అడగరా"అని. కానీ సర్ క్లాస్ కి వచ్చేసారు. 
   ఆ రాసిన వాడికి ఏం ఒరిగిందో ఇప్పటికి నాకు అర్థం కాదు. వాడి అమ్మ వాడికి నేర్పిన సంస్కారమది అనుకుని ఊరుకున్నా. కాని బాధ కలిగించిన విషయమేమిటంటే అక్కడ క్లాస్ లో 50 మంది అబ్బాయిలయినా ఉండి ఉంటారు కదా.. ఏ ఒక్కడు రాసిన వాడిని ఖండించలేదు, మేము రాకముందే అది చెరపలేదు. అందరికి కొత్తే కదా అనుకోవడానికి ఆడపిల్లని అవమానించిన వాడిని మొత్తం క్లాస్ అబ్బాయిలందరూ సమర్థించినట్లే కదా. మన ఇంటి ఆడపిల్లను కాదు కదా అంది అని ఊరుకోవడం నేను ఇప్పటికి క్షమించలేని విషయం. 
       నాకు ఇద్దరు మగపిల్లలే. వారిని మేము మానవత్వపు విలువలతో, మంచి వ్యక్తిత్వాలతో పెంచుతున్నాం. వ్యక్తులుగా బతకడం కాదు వ్యక్తిత్వపు విలువలతో బతకండి. ఏ ఇంటి ఆడపిల్లను అవమానించకండి. మీ అమ్మాబాబులు మిమ్మల్ని కాలేజ్ కి చదువుకోవడానికి మాత్రమే పంపుతున్నారన్నది గుర్తుంచుకోండి. ఇప్పుడు అంతర్జాలం అందుబాటులోనికి వచ్చాక వావి  వరుసలు, వయసు తారతమ్యాలు కూడా చూడకుండా కొందరు నికృష్టులు దిగజారి ప్రవర్తిస్తుంటారు. మీ అమ్మా ఒక ఆడదేనని, ఆ ఆడదే మీ మగ పుట్టుకలకు కారణమని తెలుసుకుని ఛావండి. 
   మహిళలకూ.. మహరాణులకు...మహిళాదినోత్సవ శుభాకాంక్షలు..

అనుకోనిది..!!

నేస్తాలూ, 

2006 లో హంట్స్ విల్ లో నా నార్త్ ఇండియన్ ఫ్రెండ్ మధుమిత కూతురు శిల్పిని చూడటానికి నేను, చైతన్య వెళ్ళినప్పుడు తీసిన ఫోటో ఇది... 2011 లో ముఖపుస్తకంలో పెట్టానని గుర్తు చేసింది ముఖపుస్తకం. ఏదో నా బ్లాగు కబుర్లు కాకరకాయలులో నాలుగు ముక్కలు రాసుకునే నేను నా నేస్తాల కోసం ఈ ముఖపుస్తకానికి వస్తే ఆర్ వి యస్ యస్ శ్రీనివాస్ గారు ఆ రాతలే ఇక్కడ కూడా పెట్టండి అనడంతో, అనుకోకుండా మెుదలైన  ముఖపుస్తక ప్రయాణంలో, నా రాతలు ఈనాడు మీ అందరికి నచ్చడం చాలా సంతోషం. నా రాతలకు బోలెడు గుర్తింపునిచ్చి, మీ అందరి నేస్తంగా భావిస్తున్నందుకు మీ అందరికి మన:పూర్వక ధన్యవాదాలు...!! 

6, మార్చి 2020, శుక్రవారం

నా రాతల గురించి అబ్దుల్ రజాహుస్సేన్ మాస్టారి విశ్లేషణ..!!

కౌంట్ డౌన్..29

(అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.)

ఆమె ఎల్లలు తెలియని ఏకాంతవాసి, ...ఆమె అక్షరాలు ‘ ఆకాశ విహంగాలు ‘  !!

మంజు యనమదల కవిత్వం...విహంగావలోకన‌!!

ఆమె….అక్షరాల “ఏకంత వాసి . ఆమె అక్షరాలు ఆకాశ విహంగాలు. అందుకేనేమో?
తను “ రెక్కలు “  తొడుక్కని విహంగమై..సాహితీ గగనంలో ఎగురుతుంటుంది.
పేరు..మంజు యనమదల.ఇంజినీరు పట్టభద్రురాలు. కవిత్వం ప్రవృత్తి.తన గురించి,
తన కవిత్వం గురించి ఆమె మాటల్లోనే వినండి.

“నేను స్వేచ్ఛాజీవిని
నిత్య సంచారిని
నిరంతరాన్వేషిని

అడ్డుకట్టలు
ఆనకట్టలు
అసలాపలేవు

బంధాల
అనుబంధాల
ముసుగులు మెాసగించలేవు

ఏతావాతా 
ఎల్లలు తెలియని
ఏకాంతవాసిని

అందుకే
నా అక్షరాలు
ఆకాశ విహంగాలు...!!

తను విహంగంలా.. స్వేచ్ఛాజీవి..సాహితీ గగనంలో నిత్య సంచారిణి.కవిత్వ రహస్యాల 
నిరంతరాన్వేషి .ఆమె స్వేచ్ఛకు,ఇచ్ఛకు అడ్డుకట్టలు,ఆనకట్టలు అసలాపలేవు. బంధాల,
అనుబంధాల ముసుగులో  మోసగించలేవు.ఏతావాతా.! ఆమె ‘ ఎల్లలు లేని ఏకాంత వాసి ‘,
ఆమె అక్షరాలు ఆకాశ విహంగాలు. అయితే చూపు మాత్రం నేలపైనే.ఆమె కవిత్వానికి నేల
విడిచి సాము చేయడం తెలీదు మరి.!

ఆమె ఆలోచనలు క్రిస్టల్ క్లియర్ గా వుంటాయి.ముసుగులో గుద్దులాట లేదు.ఉన్నదేదో కుండ
బద్దలు కొట్టినట్లు చెప్పడం ఆమె అక్షరాలకు అలవాటైపోయింది.ఆమె కవిత్వానికి  ఈ ముక్కు 
సూటి తత్వం ,నిక్కచ్చితనం సహజాలంకారాలు.

ఈ కింది కవిత చదవండి..విషయం మీకే తెలుస్తుంది.!

*వెలి వేయమంటున్నా.,”..కవిత !!

“అక్కరకు రాని అనుబంధాలను
వద్దనుకుంటున్నా

గతమే మరచిన మనుషులకు
జ్ఞాపకాలే లేవంటున్నా 

నాటకీయతే జీవితమనునే వాళ్ళను
నచ్చలేదంటున్నా

స్నేహం ముసుగేసుకున్న మెుసళ్ళను
చీదరించుకుంటున్నా

పిలుపుకు పలుకుకు తేడా తెలియని జీవాలకు
జీవించే అర్హత లేదంటున్నా

మంచిలో చెడు వెతికే నైజాలకు
సూక్తిసుధలు చెప్పే నైతికతెక్కడిదంటున్నా

వ్యక్తిత్వ హీనులకు
వ్యక్తిగతమే ఉండదంటున్నా

సమాధానం చెప్పలేని బతుకులకు
ప్రశ్నించే హక్కు ఎక్కడిదంటున్నా

బాధ్యత లేని బంధాలకు
కుటుంబమెందుకని వెలి వేయమంటున్నా.” !!

అక్కరకు రాని అనుబంధాలను ఆమె మెళ్ళో వేసుకోదు. వద్దని వదిలించుకోడానికీ వెనుకాడదు.
గతం మరిచి వ్యవహరించే మనుషులంటే ఆమెకు ఒళ్ళుమంట.అటువంటి వారికి ఇంకా..జ్ఞాపకాలు
ఏముంటాయన్నది ఆమె ప్రశ్న? నాటకీయతే జీవితంలా గడిపే వాళ్ళంటే ఆమెకు అస్సలు నచ్చదు.
స్నేహం ముసుగేసుకునే మొసళ్ళంటే ఆమెకు చీదర. కమ్మని పిలుపుకు , కఠినమైన పలుకుకు తేడా
తెలియని వారికి జీవించే హక్కు లేదన్నది ఆమె నిశ్చితార్థం.‌మనుషుల చేతల్లో,పనుల్లోమంచీ చెడు
వెతికేవారికి సూక్తిసుధలు చెప్పే నైతికత ఎక్కడుంటుంది? వ్యక్తిత్వ హీనులకు వ్యక్తిగతమేముంటుంది?
అసలు సమాధానం చెప్పలేని బతుకులకు ఎదుటి వారిని ప్రశ్నించే హక్కు ఎక్కడిది? అన్నది మంజు
అభిప్రాయం.బాధ్యత లేని బంధాలకు కుటుంబం ఎందుకు? వెలేసతేపోలా? అంటుంది.
ఓ కవికి జీవితం పట్ల ఇంత స్పష్టమైన అవగాహన వుండటం బహుఅరుదు.

మంజు ఎనమదల కు అమ్మంటే ఎంతిష్టమో? మాటల్లో చెప్పలేం.
అదేదో ఆమె మాటల్లోనే‌ విందాం..!

*అమ్మంటే..!!

“అమ్మ బొజ్జలో హాయిగా ఉందని
ఓ నెల ఎక్కువున్నా విసుక్కోకుండా
పదిలంగా పాపాయిని హత్తుకుంది

పట్టుకోవడానికి సన్నగా ఉండి చేతికి అమరకున్నా
అపురూపంగా చూసుకుంటూ
కాకిపిల్ల కాకికి ముద్దంటూ ముద్దు చేసింది

అమ్మ చేతి మహిమనుకుంటా
గొంగళిపురుగును సీతాకోకచిలుకలా మలచడంలో
విధాతకే సవాలు విసిరింది

ఆకలిని తెలియనీయలేదు
అల్లరినీ భరించింది ఆనందాన్ని పంచింది
ఆటలన్నీ ఆడిస్తూ జోలపాటలు పాడి నిదురపుచ్చింది

కలలో కలత భయపెడితే
దగ్గరకు తీసుకుని ధైర్యానిచ్చి
ఆదమరిపించే అమ్మ చేయి నాదయ్యింది

అక్షరాలు దిద్దిస్తూ పుస్తకాలు తాను చదువుతూ
కథలన్నీ వినిపిస్తూనే కమ్మని తాయిలాలందించి
బడికి సాగనంపి బంగరుబాట పరిచింది

బిడ్డ మీద ఈగ వాలనీయదు తల్లి
బతుకు పయనంలో బాసటగా నిలుస్తూ
నా జీవితమే తానైంది అమ్మ

ఎంత చెప్పినా 
ఇంకా ఏదో మిగిలిపోయినట్లున్న
మహా కావ్యమే అమ్మంటే..” !!

అమ్మ గురించి టన్నులకొద్దీ కవిత్వం వచ్చింది. ఇప్పుడీమె కొత్తగా చెప్పేదేముంది? అన
అనిపించవచ్చు. అమ్మ ప్రేమ హిమనగమంత . ఎంత పంచినా తరగదు ..అలాగే అమ్మ 
గురించి ఎంతమంది ఎంత రాసినా కూడా రాయడానికి ఇంకా మిగిలే వుంటుంది.ఆత్మా
శ్రయమా? అన్నట్లు మంజు రాసిన ఈ కవిత మనసుకు హత్తుకుంటుంది.

నవమాసాల్లో అమ్మకడుపునుండి బిడ్డ బయటకు రావడం సహజం.కానీ ..అమ్మ కడుపులో
హాయిగా వుందనీ,ఏ బాదరాబందీ లేదని ఆమె ఓ నెల ఎక్కువగానె వుందట.అయినా... అమ్మ 
విసుక్కోలేదు.సరికదా పదినెలలకు బయటకు వచ్చినా ప్రేమగా ఎత్తుకొని 💓 గుండెకు హత్తు
కుంది.పుట్టుకలో సన్నగా,పీలగా  వుండి,చేతుల్లో పట్టుకోడానికే రానప్పుడు కూడా తనను  అపు
రూపంగాచూసుకుంది.కాకిపిల్ల కాకికి ముద్దయితే..తన పిల్ల తనకు ముద్దురాదా ఏమిటి? 
అందుకే  ప్రేమతో ముద్దుపెట్టుకుంది.ముద్దు చేసింది.

అమ్మ చేతి మహిమ..రోజులు తిరక్కుండానే తనుళ ఆరోగ్యంగా,పుష్టిగా తయారైంది.గొంగళి 
పురుగును సీతాకోక చిలుకగా మార్చడంలో ఆ దేవుడికి ఏదైనా ఇబ్బంది వుంటుందేమో కానీ..
పేగు తెంచుకు పుట్టిన బిడ్డ విషయంలో అమ్మ ఏమాత్రం తక్కువ చేయదని  రుజువు చేసింది.
ఓ రకంగా ఆ దేవుడిక్కూడా ఆమె సవాలు విసిరింది.

అమ్మంటే అక్షయపాత్ర.బిడ్డకు ఆకలి తెలీనివ్వలేదు.భూదేవంత సహనంతో తన అల్లరినీ సహించింది.
భరించింది.ఆనందాన్ని పంచింది.తనకు తెలిసిన ఆటలన్నీ ఆడిస్తూ..జోలపాట పాడి నిద్రబుచ్చింది.

కలత నిద్దట్లో  భయపడితే తనను దగ్గరకు తీసుకొని ధైర్యాన్నిచ్చింది.ఆదమరిపించే అమ్మ చేయి 
తనదైంది.అక్షరాలు దిద్దించింది.పుస్తకాలు చదువుతూ..తనకు కథలు వినిపించింది.
కమ్మని తాయిలాలందించి,బడికి సాగనంపి 
తనకు బంగారు బాట పరిచింది.భవోష్యత్తుకు మార్గదర్శకమైంది.

బిడ్డమీద ఈగను కూడా వాలనీయదు తల్లి.అమ్మ ప్రేమంటే అదే.బతుకు పయనంలో చేయిపట్టుకొని
బాసటగా నిలిచింది.తానున్నానన్న భరోసా ఇచ్చింది.తన జీవితమే తానైంది .

అమ్మ గురించి ఎంత చెప్పినా..ఇంకా ఏదో ...మిగిలిపోయే మహాకావ్యమే అమ్మ.చదవగలిగే ఓపిక,
అర్థం చేసుకునే విజ్ఞతవుండాలే కానీ...
అమ్మ విలువైన ఓ పాత సందూకు పెట్టె.
అనుభవాల కాసారం.మమ
కారానికి ఆకారం.ప్రేమకు ఓంకారం. 
త్యాగానికి శ్రీకారం.

అమ్మంటే..అమ్మే..అమ్మకు నిర్వచనం లేదు.
లోకంలో దేనికైనా ప్రత్యామ్నాయం వుండొచ్చు.కానీ
అమ్మకు మాత్రం ప్రత్యామ్నాయం లేదు.

*ఆకాశం 
చేతికి అందదు
సముద్రానికి 
ఆవలి తీరం తెలియదు

మనసు గుట్టు
విప్పలేము...!! అంటూనే …,తన మనసు గుట్టును విప్పి చెప్పారు మంజు యనమదల.!!
మంజు గారి ”రెక్కలు “ బాగా రాస్తున్నారు.మరెప్పుడైనా ఆ “ రెక్కలు “ గురించి తెలుసుకుందాం.!!

5, మార్చి 2020, గురువారం

జీవన 'మంజూ'ష (మార్చి )

నేస్తం, 
       అంతర్జాలం విరివిగా అందుబాటులోనికి వచ్చిన తరువాత నేరాల, ఘోరాల సంఖ్య ఎక్కువైనదన్నది అందరం ఒప్పుకుని తీరవలిసిన వాస్తవం. నేరాలు అనాది నుండి జరుగుతూనే ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు వెంటనే తెలిసిపోతున్నాయి ఈ సామాజిక మాధ్యమాల పుణ్యమా అని. 
     ఆధునికంగా ఎంతో పురోగతిని సాధించిన మనం ఈ నేరాలను అరికట్టడంలో విఫలమవడానికి కారాణాలనేకం. ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తోంది. మన రాజ్యాంగ పరిధులను బట్టి " వందమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు, ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్న " సదుద్దేశ్యం. దీనిని ఆసరాగా చేసుకుని దోషులు శిక్షల నుండి తప్పించుకోవడానికి సవాలక్ష మార్గాలను చూసుకుంటున్నారు. అధికారాన్ని, ధనాన్ని విరివిగా ఉపయెాగిస్తూ తమ నేరాలను బుుజువు కాకుండా నిర్దోషులుగా బయట పడుతున్నారు. లేదా అమాయకులకు శిక్షలు వేయిస్తున్నారు. నేరం చేసిందొకరయితే, శిక్ష మరొకరికన్న మాట. ఇది మన నేటి వ్యవస్థ తీరుతెన్నులు. 
         ఇక మీడియా విషయానికి వస్తే జరిగిన నేరాలు వేలల్లో ఉంటే వీరు పదే పదే చూపించే క్లిపింగ్స్  ఒకటో, రెండో సంఘటనలకు సంబంధించినవి మాత్రమే. మరి కొన్ని ఛానల్స్ అయితే మరికాస్త ముందుకు వెళ్ళి జరిగిన సంఘటనను చిన్న చిన్న నటీనటులతో చిత్రీకరిస్తూ, ఆ నేరం ఇలా జరిగుండవచ్చు, అలా జరిగుండవచ్చంటూ సినిమాలు, సినిమాలుగా మనకు చూపించడం వలన వాళ్ళ ఛానల్ రేటింగ్స్ పెంచుకోవడానికే ప్రయత్నిస్తున్నారు కాని ఆ నేరాలు తగ్గించడానికి ఏమాత్రం తమ వంతు ప్రయత్నాలు చేయడం లేదు.
    మన రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎవరి కోసం ఉన్నాయెా తెలియని అయెామయం నేడు ప్రతి ఒక్కరిలో ఉంది. సి సి కెమేరాల ఏర్పాటు, రాత్రుళ్ళు పహరా పోలీసులు ఇలా ఎందరో పాపం మన కోసం కష్టపడుతూ.. నిర్విరామంగా నేరాలు జరగకుండా ఉండటానికి చర్యలని నాయకులు, అధికారులు ఉపన్యాసాలు వినిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క సంఘటనలోనయినా పోలీసులు కాని, వారు ఏర్పాటు చేసిన వివిధ రక్షణ చర్యలు కాని నేరాలు, ఘోరాలు జరగకుండా నిరోధించగలిగాయా? సి సి కెమేరాలు కర్మచాలక పని చేసినా నేరం ఎలా జరిగిందో అన్న విషయానికి సాక్ష్యంగా మాత్రమే పనికి వస్తోంది, అదీ సదరు పోలీసులు ఏ ఎడిటింగ్ చేయకుండా ఉంటే. ఇక మన పోలీసులు నేరం జరిగాక ఆర్చుకుని, తీర్చుకుని తీరికగా వస్తారు. లేదంటే సదరు బాధితులు వెళ్ళి కంప్లయింట్ ఇవ్వబోతే యక్ష ప్రశ్నలతో వారిని వేధించి, బతికుండగానే చంపేస్తూ, చివరాఖరికి ఈ సంఘటన జరిగిన ప్రదేశం మా పరిధిలోనికి రాదని చావు కబురు చల్లగా చెప్తారు. జీరో ఎఫ్ ఐ ఆర్ ఉందని ఎవరికీ తెలియదన్న ధీమాతో. వీరు పని చేసేది ఒక్క రాజకీయ అధికారానికే అని సామాన్యులు తెలుసుకునే రోజు ఎప్పుడు వస్తుందో..!! 
 

2, మార్చి 2020, సోమవారం

ఆత్మ పయనం..!!

అమ్మకెపుడూ 
బరువు కానిది
తల్లి ఎప్పుడూ 
తట్టుకోలేనిది
బిడ్డ దూరమైన క్షణాలను

మమకారపు మాధుర్యాన్ని పంచుతూ
కన్నపేగు బంధాన్ని కావలి కాచుకుంటూ
బుజ్జగింపుల ఊరడింపులను
ఆకతాయి అల్లరిని
ఓరిమిగా భరించేది మాతృ హృదయం

దైవంతో సైతం సవాలంటుంది
దేనికైనా తెగిస్తుంది 
తన ప్రాణాలను పణంగా పెడుతుంది
ఏ లోకానికైనా పోతానంటుంది
కనుల ముందే కడుపుతీపి కరువౌతుంటే 

కన్నీటి వీడ్కోలు 
కడసారి చెప్పలేక
తల్లడిల్లే ఆ కన్నతల్లి 
ఆత్మఘోషకు  
సాంత్వనమెక్కడ...?
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner