28, జనవరి 2019, సోమవారం

మనసు చచ్చిపోయిన క్షణాలు...!!

మనసు
చచ్చిపోయిన క్షణాలు
నాకింకా గుర్తే
ఆంక్షల పర్వానికి
తొలి అడుగు పడినప్పుడు
అర్ధం కాని
ఆ పసితనపు ఛాయలు
ఇంకా కనుల ముందు
కదలాడుతునే ఉన్నాయి
కాలానుగుణంగా
మార్పులు చేర్పులు
అవమానాలు అవహేళనలు
సర్దుబాట్లు దిద్దుబాట్లు
తప్పని జీవితాలై
అలసిన దేహం కోరుకునేది
తన కోసమంటూ
ఆత్మీయతను
అరక్షణమైనా కేటాయించమని
అదే తీరని కోరికగా మిగులుతున్నా
అనునిత్యం అగ్నిహోత్రమై వెలుగుతూ
తను దహించుకుపోతున్నా
నాఅన్న వాళ్ళ కోసం కడవరకు
పరితపించేది నేనని తెలిసినా
నా పతనానికై ఎదురుచూస్తున్న
మీకెందుకు ఈ ఆక్రోశాలు..?



ఏక్ తారలు...!!

1.   పరిచింది అక్షరాలే_పదాలకు భావాల మత్తు చేరిందనుకుంటా...!!

2.   మనసులొకటే మరి_ఆంతర్యాల అంతర్యుద్ధం మౌనంగా చేస్తున్నా ...!!

3.   అస్పష్టంగా ఉన్నా స్పష్టమైనవే_మనసు తెలిసిన భావాలవి..!!

4.   అలవోకగానే ఈ అద్భుతాలు_మదినలరించే అక్షరాలు చేరికైనప్పుడు...!!

5.   అక్షరాల మాయాజాలమదే_అనుభవాల అనుభూతులను అద్దంలా చూపించేస్తూ...!!

6.  అలుపెరగని ఆలోచనలే_అడపాదడపా ఆనందాన్నిస్తూ...!!

7.   మర్మమెరుగని మనసది_మానసాక్షరాలకు నెలవుగా మారి...!!

8.   పసితనంలో నువ్వున్నావని కాబోలు_వయసేదయినా మది పయనం బాల్యానికే...!!

9.  కాలం ముదమందుతోంది_అనుబంధాలను అనుసంధానిస్తూ...!!

10.  భావాలు అలుగవూ_అక్షరాలన్నింటా నీవేనంటే...!!

11.   జ్ఞాపకాలు మురిసిపోతున్నాయి_నీ మౌనానికి తామే హితమైనందుకు...!!

12.   దాగలేనంటోంది మది గాయం_అక్షరాల్లో సేదదీరాలనుకుంటూ....!!

13.    అనుబంధమేదైనా సరే_మనసు మౌనాన్ని మాయ చేసేది ఈ అక్షరాలే...!!

14.    మది రాల్చిన మౌనం_సజీవ అక్షర శిల్పాలుగా....!!

15.    నుదుటిరాత అది_గమ్య నిర్దేశానికి గాయాలను రాతలుగా మార్చుతూ....!!

16.    సమయం చిక్కనీయని కాలమిది_సోమరితనానికి చోటెక్కడ మరి...!!

17.   కథలన్నింటా నువ్వే_పాత్రలతో నీకేలా..!!

18.   సంశయానికి చోటెక్కడిది_మనసులొకటైన మన మధ్యన...!!

19.   సిందూర మందారాలు సూరీడు నొసటన చుక్కలే_ఆకాశానికి ఆభరణాలై...!!

20.   లిపి తెలియని మదికి తెలుసు_గుర్తులను కాగితాలకెలా తెలపాలో...!!

21.   స్వరమే అక్షరమైంది_స్నేహరాగాలకు బాణీలు కట్టాలంటూ...!!

22.  మది పుస్తకానికి ఎరుకనే_అక్షర స్నేహానికి ఏ రహదారిన వెళ్ళాలో...!!

23.   స్నేహ సహవాసం అక్షయపాత్రే_పూరించిన ఖాళీలకు మళ్ళీ చోటిస్తూ...!!

24.    స్వరాలు తేనెలొలుకుతున్నాయి_జీవనాదమై అక్షరాలు అమరగా...!!

25.  అక్షరాలన్నీ ఇంతే_ఊపిరాడని జీవితాలకు ఆటవిడుపుగా మారుతూ...!!

26.   మనసు ఖాళీలు మాట్లాడుతున్నాయి_అక్షరాలను ఆసరా చేసుకుని...!!

27.   ఊతమే తానయ్యింది అక్షరం_ఊపిరాడని బతుకు పయనంలో...!!

28.   అక్షరాలు అలిగినా అందమే_మౌనానికి మనసుకి బంధం వేస్తూ...!!

29.   గురుతెరగని అనుబంధం కాదుగా మనది_జన్మజన్మలుగా కొనసాగుతునే...!!

30.   ఊపిరి పోసిన అక్షరాలే అన్నీ_ఊహలకు జీవాన్నిస్తూ...!!

ద్విపదలు...!!

1.   పదాల పదబంధం చాలదూ
పేర్చిన అక్షరాలు గాటినబడటానికి...!!

2.   అక్షరాలెప్పుడూ అక్షయమే
గుండెగూటిలో నీ జ్ఞాపకాలున్నంత వరకు...!!

3.   మలి వయసే ఇప్పుడు
పసితనపు ఛాయలు అద్దుకుంటూ. ..!!

4.   అక్షరాల చుట్టూనే అనుబంధం
మనసు పరిమళాన్ని భావాలకద్దేస్తూ...!!

5.    వద్దన్నా వెంటబడక మానవు కదా
విడిచి ఉండలేని అనుబంధం మనదైనప్పుడు...!!

6.    అక్షరమై అలరిస్తుంటానిలా
ఆదరించి ఆస్వాదించే మనసులు మీవైనప్పుడు...!!

7.   కొన్ని మనసాక్షరాలింతే
భావాలకు బాధ్యతలకు మధ్యన నలుగుతూ...!!

8.   నా జ్ఞాపకాల్లో నువ్వున్నావుగా
పేలవమైన బ్రతుకులో జీవాన్ని నింపి జీవితాన్ని ఇవ్వడానికి....!!

9.    తడబాటుకు స్థానమే లేదు
నా నెలవు నీలోనున్నప్పుడు...!!

10.   అక్షరాల్లో పరుస్తుంటానిలా
మనసైన ప్రతిసారి....!!

11.   ఆర్తిగా ఆలింగనం చేసుకుంటుంది దుఃఖం
మనసు భారాన్నంతా తానే మెాస్తూ...!!

12.   కాలాన్ని కలంతో కలిపేసా
కొత్త కథలు వినిపిస్తుందని..!!

13.    దిగులుకు చోటెక్కడా
గమ్యమే నీవైన పయనం నాదైతే...!!

14.   తప్పనితనంగా మార్చుకున్న ఆధునికత
అవసరార్ధం అనుబంధాలకు దగ్గరౌతూ....!!

15.   కనురెప్పల నీడలో కదలాడుతోంది
కనుమాయమవని నీ జ్ఞాపకమిలా..!!

16.    జ్ఞాపకాల ముత్యాలను సేకరిస్తున్నా
మేలిమిసరాలుగా వర్తమానానికి కానుకనీయడానికి...!!

17.   మనసుకు మాటిచ్చాను
మరపు దరిజేరదని...!!

18.   జ్ఞాపకాలూ అంతే
మనసు పుస్తకంలో చొరబడనిదే ఉండలేవు...!!

19.   అద్భుతాన్ని ఆవిష్కరించేది అక్షరాలే
మనోభావనలను చరిత్రపుటల్లో లిఖిస్తూ....!!

20.    రెక్కలు తెగిన అక్షరాలవి
ఆకాశవిహంగాలైన భావాలను మెాసినందుకు....!!

21.   చెప్పేవరకు వదలని భావాలవి
అక్షరాలకు అనువుగా మసలుతూ..!!

22.   కలలకు కొత్తదనం కావాలట
బుజ్జగింపులు వాస్తవాలను మరువనివ్వట్లేదని...!!

23.   తానైంది అమ్మ
మనసేదో తెలిసినట్టు మమతేదో పిలిచినట్టు..!!

24.   పరిధులే పదాలకన్నీ
అక్షరాలకు పొదుపు అలవాటు చేస్తూ..!!

25.   అక్షరమెప్పుడూ అపురూపమే
మనసులను రజింపజేస్తుందని..!!

26.   పొరబాటే మనసుది
మరిచిపోవడం తెలియక...!!

27.   కొన్ని చేతులంతే
అక్షరాలనలా ఒంపేస్తాయి మాటలకందని భావాలుగా...!!

28.   అవధుల్లేని ఆనందమే ఇది
అనిర్వచనీయ ప్రేమకు సాక్ష్యంగా..!!

29.   మరపు మౌనమయ్యింది
ప్రేమ సంద్రమై చెంత చేరితే...!!

30.   అద్దానికి అర్థమయ్యింది
మనసు భావాలు మనవే అని...!!

27, జనవరి 2019, ఆదివారం

మీ ఏడుపు మీరేడవండి...!!

మీ దృతరాష్ట్ర ప్రేమ మాకు వద్దు....

గత నాలుగునర్ర ఏళ్ళుగా తెలంగాణా వాదుల గురించి కాని, కే సి ఆర్ గురించి ఏమి మాట్లాడని నేను, మీ ప్రాంతీయతను గౌరవించడమే కారణం. ప్రాంతీయతాభిమానం అందరికి ఉండటంలో తప్పులేదు, ఉండాలి కూడా. చంద్రబాబు దగ్గినా తుమ్మినా అదో పెద్ద నేరంగా చూసే మీలాంటి వారికి దత్తత తీసుకున్న గ్రామాలు, పేర్లు ప్రభుత్వ సొమ్ముతో అభివృద్ధి అని అనుకోవడంలో మీ వక్రబుద్ది తెలుస్తోంది. మాకు అలా అయినా అభివృద్ధి జరుగుతోంది. యాగాల మూలంగా మీకొరిగింది ఏమిటి..? ఎదుటివారి కొంపలో ఏం జరుగుతోందని కాకుండా మీ కొంప తగలకుండా చూసుకునేడవండి...

మీరు, మీ కే సి ఆర్ ఎలా పోయినా మాకనవసరం. మీ అందరి మాటలకే మేము స్పందించాల్సి వస్తోంది. ఏం నష్టపోయామెా,  పోతున్నామెా మాకు తెలుసు. మీ ప్రాంతీయాభిమానమే మాకూ ఉంటుంది. మీకు మీ కే సి ఆర్ కి తేడా ఏం లేదు. మాటకు పది మాటలు సమాధానం చెప్పగలం. ఇన్నాళ్లు మీ గురించి మేమేం అనలేదు, కానీ మీరు రెచ్చగొడుతూనే ఉన్నారు. అందుకే సమాధానాలు చెప్పక తప్పదు. ఊరుకుంటామని అనుకోకండి...వ్యక్తి విలువలు దిగజార్చుకోకండి. తప్పును చూపడం తప్పులేదు.  తప్పుడు మాటలు, చేష్టలు వద్దు. ముందు మీ లోపాలు మీరు చూసుకోండి మాతో చెప్పించుకోకుండా.... అన్ని అమర్చితే అనుభవించడము కాదు. కనీసం నిలబెట్టుకోండి చాలు. ఇంకేమైనా కావాలంటే అడగండి... మాకు లేకపోయినా పర్లేదు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇది ఆంధ్ర ప్రదేశ్ అంటే ... మైండిట్

26, జనవరి 2019, శనివారం

ఏంటో మరి...!!

నేస్తం,
          కొందరి ఆలోచనలు చూస్తుంటే నవ్వు వస్తోంది, బాధ వేస్తోంది. ఈ ముఖపుస్తకంలో మన పోస్ట్లకు వచ్చే లైకులు, కామెంట్లు మాత్రమే మన అక్షరభావాలకు కొలమానాలనుకుంటే దానికన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదు. మనకు నచ్చిన పోస్ట్ మరొకరికి నచ్చాలని రూలేం లేదు కదా. మన చేతికున్న ఐదువేళ్ళే ఒకలా లేవు. మరలాంటప్పుడు మనమెలా చెప్పగలం "నాకు పలానా పోస్ట్ నచ్చింది, మీరందరూ లైక్ చేసి కామెంట్లు రాయండని." మనకు నచ్చిన వారి రాతలూ మనకు బావుంటాయి, అందరికీ కాదు. మనకి మనం అనుకుంటాం చాలా నిజాయితీపరులమని. అలా అనుకొనకపోతే బతకలేం. ఓ అమ్మ కడుపున పుట్టిన బిడ్డలే ఒకేలా ఆలోచించలేరు, విభిన్న దృక్పథాలు, దృష్టి కోణాలు ఉంటాయి. మనకి నచ్చని రాతలు విలువలేనివి కాదు, అలా అని నచ్చిన రాతలన్నీ అమెాఘమూ కాదు. లైకుల లెక్కల కోసం, కామెంట్ల కోసం కాకుండా మన కోసం మనం రాసుకుంటే చాలని నా అభిప్రాయం. ఈ విషయంలో దేవుడు కూడా మినహాయింపు కాదు. దేవుడు కూడ అందరికి మంచివాడేం కాదు కదా. కోరిక తీరితే దణ్ణం పెట్టి మెుక్కు చెల్లించుకుంటాం లేదా తిట్టిపోస్తాం. ఇది అంతే మరి. దేవుడే అందరికి మంచోడు కానప్పుడు మనమెలా అవుతాం, మన రాతలెలా నచ్చుతాయ్. మన ఆలోచనల్లో తేడా ఉందని అర్ధం చేసుకోవాలి.  ఇదన్న మాట అసలు సంగతి.

25, జనవరి 2019, శుక్రవారం

ప్రహసనం...!!

మళ్ళీ మెుదలైంది నోముల, మెుక్కుల, యాగాల ప్రహసనం. నా సొమ్మేం కాదుగా ఖర్చు అయ్యేది, అడిగేవాడు లేడు, అడ్డుకునే వాడు లేడు. అధికారం నాదయినప్పుడు ప్రజల సొమ్ము నాదే కదా.  అంతగా అయితే సెంటిమెంట్ ఉండనే ఉందాయే. మళ్ళీ అధికారంలోనికి రావడానికి....

24, జనవరి 2019, గురువారం

అక్షర సన్యాసం...!!

అలసిపోతున్న దేహంతో అనుసంధానం కాలేని
మనసును సముదాయించే
అక్షరాలు మెురాయిస్తున్నాయెందుకో
అణకువగా మెదిలే భావాలు
అర్ధాంతరంగా అడ్డుపడుతున్నా
రాయకుండా ఉండలేని కలాన్ని
మధ్యలో విరిచేస్తున్నారెందుకో
జ్ఞాపకాల చిట్టా విప్పిన
గతపు పద్దుల దొంతర్లలో
అక్కడక్కడా మిగిలిన
అనుబంధాలు అవశేషాలైనాయెందుకో
అస్త్రసన్యాసం అలవాటు లేని
అంతరంగం ఆఖరి అంకం వరకు
విరామమెరుగక పోరాడుతునే
అక్షర శరాలను విడువలేనంటోంది...!!

జీవన 'మంజూ'ష (జనవరి)...!!

నేస్తం,
         ఏ నావది ఏ తీరమో అన్నట్టు ఏ బంధమెటుపోతుందో తెలియడం లేదు. ఏ సమస్యా లేకపోయినా ప్రపంచంలో తమకన్నా ఎక్కువ సమస్యలున్నవాళ్ళు లేరని, కొందరు లేనిపోని రోగాల పాలబడుతున్నారు. కనబడిన డాక్టర్ దగ్గరకల్లా వెళుతూ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటూ శునకానందం పొందుతుంటారు. మనమసలే ఇప్పుడు బతుకుతున్నది కార్పొరేట్ వ్యవస్థలో, ఇక దీనికి తోడు ఏదో రోగముందన్నఈ అనుమాన భూతం తోడైతే పరిస్థితి చెప్పతరమా. ఈ విశాల ప్రపంచంలో మనమో చిన్న ఇసుక రేణువు పాటి కూడా చెయ్యము, దీనికి అందరు మన గురించే పట్టించుకుంటున్నారని, మన మీద నిఘా వేశారన్న అనుమానంతో ఇటు మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ, మన అన్నవాళ్ళకు కూడా నరకాన్ని చూపిస్తూ బతకడంలో అర్ధం ఉందంటారా...!
        జీవితంతో పోరాడేవారు కొందరైతే, జీవితం అంటే తెలియని వాళ్ళు బతుకు మాధుర్యాన్ని తెలుసుకోలేక పోతున్నారు. పుట్టడం చావడం అనేది జీవమున్న ప్రతి ప్రాణికి సహజమే. మన పెద్దలు చెప్పిన మాట ఉండనే ఉంది. " కాకిలా కలకాలం బతికేకంటే హంసలా అరక్షణం బతికినా చాలు" అని. ప్రస్తుత సమాజంలో అన్ని బంధాలు డబ్బుతో ముడిబడి ఉన్నాయన్నది చేదు వాస్తవమే. సొమ్ము లేకపోతే రక్త సంబంధమయినా అంటీముట్టనట్టుగా దూరంగా ఉంటున్న ఆత్మీయబంధాలే మన చుట్టూ. బిడ్డలు దూరంగా ఉన్నారని బాధ పడే తల్లిదండ్రులున్నట్టే, బిడ్డలను గాలికొదిలేస్తున్న తల్లిదండ్రులూ ఉన్నారు. దగ్గర బంధాలు దూరమైనా చాలా నిరాస్తకంగా తమకు ఏమి పట్టనట్టుంటున్న నాగరికులు ఎంతమందో నేడు మన చుట్టూనే ఉన్నారు. బతకడానికి డబ్బు అవసరమే, కాని బతుకే డబ్బుగా మార్చుకుంటున్న దొడ్డ మనస్కులు ఎప్పటికి తెలుసుకుంటారో..బంధాలను డబ్బుతో వెల కట్టలేమని. సంపాదన మన వెంట రాదన్న వాస్తవం తెలియక పైసాకి ప్రాకులాడుతూ కోల్పోతున్న వ్యక్తిత్వాన్ని, విలువను కాపాడుకోలేక మనిషిగా దిగజారిపోతున్నారు. రేపు పోయిన నాడు మోయడానికి " ఆ నలుగురు " కరువైన రోజున తెలిసినా ఉపయోగం ఏమి ఉండదు. దూరం అనేది పెంచుకుంటూ పోతే ఏకాకులమై మిగిలిపోతాము. ఓ చిన్న మాటే మనుష్యులను, మనసులను దగ్గర చేస్తుంది. అదే చిన్న మాట అందుకోలేని అగాధాలను సృష్టిస్తుంది. మన ప్రవర్తన మంచికో, చెడుకో అన్నది మన మాట తీరు మీదే ఆధారపడి ఉంటుంది అన్నది గుర్తుంటే అందరు మన దగ్గర బంధువులే.

ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం....

జనవరి నవ మల్లెతీగలో...!!

జనవరి నవ మల్లెతీగలో అంతర్లోచనాలు పుస్తకంపై సాగర్ శ్రీరామ కవచం గారు రాసిన సమీక్ష....మనఃపూర్వక ధన్యవాదాలు నవ మల్లెతీగ పత్రిక యాజమాన్యానికి, సాగర్ శ్రీరామ కవచం అంకుల్ కి..

ఐదో దిక్కు..!!

పురిటి మంచం నుండి
పుడకల శయ్య వరకు
పడిన అడుగులను
అక్షరాలు గుంపుగా చేరి
ఆకాశంలో నక్షత్రాలను
సముద్రంలో అలలను
లెక్కలేయాలన్న ఉబలాటంతో
అదరాబాదరా ఉరుకుల పరుగులతో
అలసటనెరుగక అవిశ్రాంతంగా
శ్రమిస్తూ సాగుతున్న జీవితంలో
చివరకు మిగిలేది ఏమిటన్న
ఆలోచనలకు ముగింపునిచ్చే స్థితిని
ఒంటరితనానికి అందించి
ఏకాంతానికి తావిస్తే
నాలుగు దిక్కుల సహవాసి
ఐదో దిక్కైన ఆత్మానందం
మానసాక్షరమై మురిపిస్తూ
మనకు అవగతమౌతుందేమెా....!!

21, జనవరి 2019, సోమవారం

పుట్టినరోజు జ్ఞాపకాలు కొన్ని...!!

నేను విజయనగరం జొన్నవలనలో 7 వ తరగతి చదివేటప్పుడు నా పుట్టినరోజున నాన్న స్నేహితులు, కొందరు చుట్టాలు ఇంటికి వచ్చారు. అందరు మామూలుగా హాపి బర్త్డే అని, మెని మెనీ హాపి రిటర్న్స్ అని మనకు కాస్త తెలిసిన ఇంగ్లీష్ లో చెప్పారు. యార్లగడ్డ బాబూరావు బాబాయ్ మాత్రం నన్ను ఇబ్బంది పెట్టాలని చాలా పెద్దగా ఇంగ్లీష్ లో విష్ చేసారు. మనకేమెా సగం సగం అర్ధం అయ్యింది. థాంక్స్ చెప్తే ఏం తప్పు పట్టుకుంటారోనని తప్పించుకు తిరుగుతున్నా . బాబాయ్ చాలా ఇంటిలిజెంట్. నా వెనుకే వచ్చి విష్ చేస్తే ఏం చెప్పకుండా వెళిపోతున్నావేంటి అంటే, ఇక ఏం చేయాలో తెలియక బాబాయ్ ఏం చెప్పాలో తెలియదుగా అంటే నవ్వేసి నీ పుట్టిన రోజుకి శుభాకాంక్షలే చెప్పాను అని అంటే హమ్మయ్య అనుకుని నవ్వేసి థాంక్యూ సో మచ్ బాబాయ్ అని చెప్పేసి బరువు దించేసుకున్నా...ప్రతి పుట్టిన రోజుకి ఆ విషయం మాత్రం నాకు గుర్తు వస్తుంది. నవ్వుకుంటా... 😊

అది అప్పటి సంగతి...ఈ రోజు నా కోసం ప్రత్యేకంగా కేక్ పంపిన ఆత్మీయులు కృష్ణకాంత్ ముమ్మనేని గారికి, వారి శ్రీమతి పూర్ణిమకు, ఫోన్లలో ఆత్మీయంగా పలకరించిన వారికి, ముఖ పుస్తకంలో,మెసెంజర్లో తమ ఆత్మీయతను, నా అక్షరాలపై మక్కవను చాటి చెప్పిన ఎందరో సన్నిహిత మిత్రులు,  సోదరులు, సోదరీమణులు, సాహితీ పెద్దలు, అక్షరాభిమానులు మనస్సుతో అందించిన శుభాకాంక్షలకు, శుభాశీస్సులకు నే పొందిన ఆనందం వెల కట్టలేనిది.  ప్రతి
ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞలు తెలియజేయడం తప్ప..

అందరికి ఇక్కడే కేక్, నేను చేసిన గులాబ్ జామూన్లు, అమ్మమ్మ చేసిన పాయసం మీ అందరి కోసం... 😊

18, జనవరి 2019, శుక్రవారం

రాజకీయాలు...!!

అణాకాణికి కూడా పనికిరాని పెతోడూ ఆంధ్రా రాజకీయాల్లో వేలెట్టేవోడే. ఇక్కడ వ్యక్తి పూజలు కాదు వ్యవస్థ బాగు ముఖ్యం. ఎవరెన్ని ఏసాలేసినా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు నిజాలు తెలుసు. కళ్ళు, చెవులు మూసుకుని లేరు ఆంధ్రోళ్ళు. కనీస బాధ్యత లేని నాయకులకు తమ ఓటుతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పాలక, ప్రతి పక్షాలను గమనిస్తూనే ఉన్నారు. ఆంధ్రను ఎద్దేవా చేసినోళ్ళను ఎన్నటికి క్షమించరు. వాళ్ళ అడుగులకు మడుగులొత్తే ఎవరిని ఉపేక్షించరు.

14, జనవరి 2019, సోమవారం

మార్పు...!!

నేనెప్పుడు ఒకలానే ఉన్నా... అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ. అప్పుడు నచ్చని నేను ఇప్పుడు కొందరికి నచ్చుతున్నా, మరి కొందరికి నచ్చడం లేదు. తేడా నాలో లేదు. మీ మీ ఆలోచనల్లో ఉంది...అప్పుడే మారని నేను ఎప్పటికి మారను.
ఏది ఎలా ఉన్నా మిత్రులకు, శత్రువులకు, బంధువులకు,  రాబందు(ధు)వులకు అందరికి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు.....

11, జనవరి 2019, శుక్రవారం

షో టైమ్....!!

రోడ్ షోలకు, టి వి షోలకే టైమ్ చాలడం లేదు ఇంక అసెంబ్లీ షోకి ఏమెాస్తాం చెప్పండి.....మేము చేస్తున్న ఈ ఎంటర్టెయిన్మెంట్ షోలు గుర్తించి మమ్మల్ని గెలిపిస్తే ఓ ముప్పై ఏళ్ళ పాటు మిమ్మల్ని ఇలాగే సంతోషపెట్టగలమని.... నేను భారత రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.... 😊

10, జనవరి 2019, గురువారం

ఆత్మఘోష...!!

కాల ప్రవాహం సాగుతూనే ఉంది
మనిషి మనుగడను ప్రశ్నిస్తూ

మనసెప్పుడూ ఆరని చితిలాంటిదే
భావాల మహాభారత యుద్ధంలో

అక్షరాలకు అంటరానితనం అంటుకుంటోంది
కులం చేతిలో కీలుబొమ్మగా మారుతూ

కళలు ఈర్ష్యల కుంపట్లలో కాలిపోతున్నాయి
సాహిత్యమెా ఉన్మాద క్రియగా సాగుతూ

అదుపు తప్పిన కలం అడ్డదిడ్డంగా రాస్తోంది
నైతిక విలువలకు తిలోదకాలిస్తూ

మన తలరాతను రాతలే బయటపెడతాయి
పదుగురు పరమార్థం తెలుసుకునేలా

ఆగలేని ఆత్మఘోష వినిపిస్తూనే ఉంటుంది
నిర్విరామంగా హృది అలజడికి అంతమే లేకుండా...!!

8, జనవరి 2019, మంగళవారం

జీవన మంజూష (మార్చి)...!!

నేస్తం,
             సగటు మనిషి ఆలోచనలు ఎలా ఉంటున్నాయని మనకు తెలుస్తుంటే చాలా ఆశ్ఛర్యంగా ఉంటోంది. ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరి ఆలోచన ఒక్కో విధంగా ఉంటోంది. జీవితపు చివరి మజిలిలో ఉన్న అత్తగారిని భారంగా భావించే కోడలు, పడుతున్నారు కదా అని కోడళ్లను ఇప్పటికి ఆరళ్ళు పెట్టే అత్తగార్లు, అమ్మాబాబులను అవసరాలకి వాడుకునే కొడుకులు, కూతుళ్లు ఇలా కళ్ళ ముందు ఎన్ని హృదయవిదారక సంఘటనలు జరుగుతున్నా కనీసం తప్పుని వేలెత్తి చూపలేక ప్రేక్షక పాత్రలో నాలాంటి ఎందరో నేడు ఈ సమాజంలో.
           ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలు ఈనాడు లేకపోయినా, మనం అన్న పదం మరుగున పడిపోతున్నా ఏమి చేయలేని నిస్సహాయత. తోడబుట్టిన వాళ్ళని పలకరించలేని నిర్భాగ్యులు, డబ్బే లోకంగా బతికేస్తున్న దౌర్భాగ్యులు ఈనాడు ప్రతి ఇంటా ఉన్నారనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఎందుకో ఈ క్రింది సుమతీ శతక పద్యం ఓసారి అందరికి గుర్తు చేయాలనిపించింది.
" అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా
నెక్కిన బారని గుఱ్ఱము
గ్రక్కున విడువంగవలయు గదరా సుమతి "
           చిన్నప్పుడు చదువుకున్న నీతి పద్యాలు కనీసం కొన్నయినా గుర్తుకు తెచ్చుకుంటే మనలో కాస్తయినా మార్పు వస్తుందేమో అనిపిస్తోంది. ఆధునికంగా ముందుకు పోతూ, అత్యాధునిక పరికరాలు అందుబాటులోనున్న నేటి రోజుల్లో మనుషుల్లో మానవత్వం కనుమరుగై పోవడానికి కారణాలు బోలెడు. రక్త సంబంధాలే రాక్షస బంధాలుగా మారిపోతూ, అవసరానికి అక్కరకు రాని ఆత్మీయతలు, జీవితమొక నాటక రంగమని, బరువులు, బాధ్యతలు మోయకుండా ప్రవక్తలమని ప్రగల్భాలు పలికే దగుల్భాజీల మాటల మత్తులో పడి తప్పించుకు తిరిగే ధన్యులు ఎందరో. ఏ సమస్యలు లేని జీవితాలు లేవు ఈ ప్రపంచంలో. మనకున్నదే అతి పెద్ద సమస్యగా భావించి కష్టాలన్నీ ఏకబిగిన మన చుట్టునే ఉన్నట్టు అనుకుంటూ చావు పరిష్కారమనుకోవడమంత తెలివితక్కువ తనం మరొకటి లేదు. జీవితంలో నాలుగు దశలు పరిపూర్ణమైవే. సంతోషాలు, బాధలు వాటిలో మిళితమై
" జీవితం సప్త సాగర గీతం 
వెలుగు నీడల వేదం
సాగనీ పయనం " అన్న సినీ కవి వేటూరి పాట ఎంత నిజం. కష్టమైనా, సుఖమైనా మన అన్న వారితో పంచుకోవడంలో ఉన్న ఆనందం వేల కోట్లు మన వెంట ఉన్నప్పుడు కూడా రాదు. కావాలనుకున్నవి దక్కలేదని జీవితం నిస్సారమైనదని, ఒంటరితనం శాపమని అనుకుంటూ బాధ పడటం మానేసి మన పుట్టుకకు ఓ అర్ధాన్నిచ్చే బాధ్యతను కల్పించుకుంటే మనమే కాకుండా మన చుట్టూ ఉన్నవారు కూడా సంతోషంగా ఉంటారు. వింత పోకడలు, విపరీత మనస్తత్వాలు కలిగిన ఇప్పటి మానవ సమాజంలో మంచి మార్పు కోసం ఎదురుచూడటం ఎడారిలో ఒయాసిస్సుల కోసం ఎండమావుల వెంట పడినట్లున్నా..మరో మార్గం కనబడనట్లే కనుచూపు మేరలో.
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం....

         

7, జనవరి 2019, సోమవారం

ఏక్ తారలు...!!

1.   అంతరంగం అణు విస్ఫోటనమయ్యింది_మదిని తాకిన మాటల తూటాలకు....!!

2.   భావతరంగాల అంతర్మథనం_అనంతాకాశానికి చేరువగా...!!

3.   అక్షరాల్లో అలవోకగా ఒదిగిపోతాయి_మనసు దాయలేని భావాలన్నీ...!!

4.   ఫలించకున్నా గెలిచిన ప్రేమది_త్యాగానికి మరో రూపమై...!!

5.   పరిచితమే ఎప్పుడూ_అపరిమితమైన నీ జ్ఞాపకాలతో...!!

6.  ఎద నిండిన జ్ఞాపకమైతే చాలు_ఏళ్ళ తరబడి నిలిచిపోవడానికి....!!

7.   ఒడిజేరని ఓదార్పది_కలానికందని మనసును కాలంలో కలిపేస్తూ...!!

8.    మానస సంచారమే ఇది_వెలితైన అనుబంధాలను వెలికి తీయడానికి...!!

9.   అమ్మ భాష తెలుసు అక్షరానికి_అనునయించే కలం సాక్షిగా...!!

10.   గమ్యాన్ని చేరుతోంది గమనం_బూటకపు బంధాలకు వెసులుబాటు కల్పిస్తూ..!!

11.   ఏకాంతానికెందరు నేస్తాలో_ఆకాశంలో తారల లెక్క తేలనట్లుగా..!!

12.  అవని ఆకాశం వెన్నెలమయం_చుక్కలకు దగ్గరైన ఏకాంతంలో..!!

13.   దాచుకోవాల్సిన క్షణాలు కొన్ని_కాలం దోచేసిన జీవితంలో..!!

14.   చీకటి స్వప్నంలో వెదుకులాడుతోంది_వెన్నెల్లో నీ జాడ  కానరాలేదని...!!

15.   గుండె నిండింది భావ మాలికలతో_అక్షరాలు అక్కున చేర్చుకోగానే...!!

16.   కాలం చేతిలో కీలుబొమ్మలమే_అస్పష్ట చిత్రాలకు ఆకృతినీయలేక...!!

17.   సందేశమెప్పుడూ సందేహాత్మకమే_అక్కరకు రాని అభాగ్యపు క్షణాల్లో....!!

18.   నీడే నిజమైంది_తిమిరానికి వెలుగు పంచలేని అశక్తతలో...!!

19.   మాయమయ్యింది మనసే_మౌనం నీతో చేరికైనందుకు...!!

20.    మనసు పడింది మౌనంపైనే_మనల్ని చేరిక చేస్తోందని..!!

21.   తడియారని సైకతరేణువునే_మనోసంద్రాన్ని తడుముతూ...!!

22.   మౌనాలు మురిపాలే_మనసులొకటైన చెలిమికి సాక్ష్యాలుగా..!!

23.    విరామానికి విశ్రాంతే లేదు_తడియారని స్వప్నాలు తలపులలో ఉంటే...!!

24.   కలం కాలాన్ని సిరాగా ఒంపుకుంటుంది_అక్షరాలపై మనసు పడినప్పుడల్లా...!!

25.  కలవరం కలత పడుతోంది_కలల్ని రానీయడం లేదని...!!

26.   నేనే నువ్వైన కల_'కల'వరమై చేరికైనప్పుడు...!!

27.   అక్షరాలు అలుముకున్నట్లున్నాయి_మనసు ఆర్ద్రత కనులకు చేరి..!!

28.   మనసైంది మదికి_మన కథే ఇదని తెలిసి..!!

29.    తప్పని వ్యధే ఇది_తరిగిపోతున్న అనుబంధాలకు సాక్ష్యంగా....!!

30.   గెలిచింది నీ మౌనాన్నే_మనసుని కాదుగా

4, జనవరి 2019, శుక్రవారం

అనుకోని కలయిక....!!

ఆత్మీయంగా పంచుకున్న అనుభవాల కబుర్లు, జీవితపు ఒడిదుడుకులు ఇలా అన్నీ కలిసి కాసేపు కాలాన్ని మనకప్పజెప్పినట్టుంది కదా రాణి అక్కా..
థాంక్యూ సో మచ్ నా పై నీ నమ్మకానికి...నీ సహచర్యాన్ని కోల్పోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో అత్యంత దురదృష్టవంతులు.... ఇన్నేళ్ళ తరువాత మనల్ని మళ్ళీ ఇలా కలిపిన నా రాతలకు, ఈ ముఖ పుస్తకానికి ధన్యవాదాలు...

గత పదేళ్లుగా నేను నా రాతలు...!!

          ఇదంతా చెప్పడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. నా కబుర్లు కాకరకాయలు బ్లాగు 10వ పుట్టినరోజు. 2009 జనవరిలో అంతర్జాలంలో అక్షరాలతో మొదలైన నా రాతల గురించి, నా గురించి కొన్ని కబుర్లు.ఓపిక ఉంటే చదివి మీ అభిప్రాయాలు చెప్పండి. సద్విమర్శలకు సదా స్వాగతం...
                      నా కబుర్లు కాకరకాయలు బ్లాగు 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరం లోనికి అడుగు పెట్టింది. 2009 జనవరి నుండి ఇప్పటి వరకు నేను రాసిన పోస్టులు 1700 పై చిలుకే. పోస్ట్ చేసినవి 1643.  బ్లాగు లోకంలో, ముఖ పుస్తకంలో నన్ను నా రాతలను పది సంవత్సరాలుగా అభిమానిస్తూ, ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

            ఈ మధ్యనే ఓ పేరున్న పత్రిక కోసం నా గురించి రాయమంటే రాసిచ్చాను ఇదంతా. వారి నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది, నన్ను అడిగిన ఒకే మాట "ఇప్పుడు మీరేం చేస్తున్నారు అని. " నేనేం చేయడం లేదని చెప్పాను. మరేం అడగలేదు ఫోన్ పెట్టేసారు. నన్ను రాయమని అడిగిన వారికీ నేను ముందే చెప్పాను, నాకు ఇష్టం ఉండదండి అని. ఇదే పత్రిక వారు మాదాల రంగారావు గారిని 4 గంటలు ఇంటర్వూ చేసి ఆ సమాచారమంతా ఇచ్చినా కూడా వేసుకోలేదు. తర్వాత ఆయన ఈ లోకాన్నే వదిలేసారు. మరి వీరి విలువలు ఏ లెక్క ప్రకారం నడుస్తున్నాయో చెప్పడం మనకు చేతకాదు.


                  మదిని తడిమే మౌనాలెన్నో_అక్షరాలకు ఆయువునిస్తూ..!!
                  అక్షరమే ఆటవిడుపు_అలుపెరుగని జీవితపు ఆటలో....!!
అంటూ అక్షర భావాలతో మనసు మాటలను, మౌన భావాలను, గతపు జ్ఞాపకాలను, గుండె చప్పుళ్లను అక్షరాలతో నింపడంలోనూ, రాహిత్యం నుండి సాహిత్యం జనిస్తుందన్న భావనలు నిజమని నా రాతలకు ఊపిరి పోసిన అక్షరంతో పాటు నాకు అతిశయం కాస్త ఎక్కువే. అమ్మలా అక్కున చేర్చుకున్న అక్షరం నాకిచ్చిన ఊరట, అందించిన అభిమానాలు వెల కట్టలేనివి. తిలక్ అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలైతే నా అక్షరాలు నన్ను నాకు చూపే నా అంతర్నేత్రాలు అని నేననుకుంటున్నాను. మాటలు, మౌనాలు, జ్ఞాపకాలు, అనుబంధాలు ఇలా అన్నింటితో పెనవేసుకున్న మనసాక్షరాలతో చెలిమిని పంచుకున్న భావనలే నా రాతలు. కవితలుగా, కథనాలుగా, వ్యాసాలుగా, పుస్తక సమీక్షలుగా, ఏక వాక్యాలుగా, మాలికలుగా ఇలా విభిన్న ప్రక్రియలలో నా మనసులోని భావాలను వెలువరిస్తూ అనారోగ్యంతో మగతలో పడున్న మెదడుని చేతనావస్థలోనికి తీసుకువచ్చే ప్రయత్నంలో నే సాగిస్తున్న మరణ యుద్ధమే ఈ అక్షర పోరాటం. నాలానే నా అక్షరాలకు అలుపు లేదు. శరీరానికి సాయమందించాల్సిన కణాలే హాని చేస్తుంటే వాటితో నిరంతరం పోరాడుతూ అక్షరాల ఆసరాతో అనునయాలను వెదుక్కుంటూ ఎందరి మనసులనో తడుముతున్న నా అక్షరాలంటే నాకూ అమితమైన ప్రేమే.
             అవరోధం అనేది ఒక మనిషి ఎదుగుదలకు అడ్డంకి కాదని, జీవితంలో గెలుపుకి సోపానమని నేననుకుంటాను. అన్ని సవ్యంగా సాగితే విజయం అందుకోవడం సులభమే. అపసవ్యాలు, అడుగడుగునా అడ్డంకులు ఎదుర్కుంటూ అంపశయ్య వరకు వచ్చిన జీవితాన్ని అక్షరాలతో గెలవడం అనుకున్నంత సులభమేమి కాదు. ఎర్ర బస్ కూడా లేని ఓ చిన్న మారుమూల పల్లెటూరి నుంచి ఎయిర్ బస్ వరకు సాగిన నా జీవితంలో ఐదు తరాలను చూసిన అనుభవాలు ఇవి.
       నేను ఓ మధ్య తరగతి రైతు కుటుంబం నించి వచ్చిన అతి సామన్యురాలిని. మాది కృష్ణాజిల్లా లోని నరసింహాపురం అనే ఓ చిన్న పల్లెటూరు. పెరిగింది అమ్మమ్మ తాతయ్యల మధ్య అమ్మానాన్నలతో జయపురంలో, విజయనగరంలో కొన్ని రోజులు. తరువాత ఇంజనీరింగ్ చదువు రీత్యా కర్ణాటక లోని బళ్ళారిలో. ఉద్యోగ పరంగా మద్రాస్, అమెరికాలో కొన్ని సంవత్సరాలు. తరువాత కొన్ని రోజులు హైదరాబాద్ లో. ప్రస్తుతం విజయవాడలో నివాసం. 
               నాన్నకు గారాలపట్టిగా అందరికి ఇష్టురాలిగా అమ్మానాన్నలకు ఏకైక సంతానంగా అమ్మమ్మ తాతయ్యలతో, అల్లారుముద్దుగా సాగిన బాల్యం. అవనిగడ్డ శిశువిద్యామందిరంలో 6వ తరగతి వరకు చదువు, తరువాత విజయనగరం జొన్నవలస ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు, తరువాత విజయనగరం మహారాజ మహిళా కళాశాలలో ఇంటరు, ఆ తరువాత బళ్లారి విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదువు. మద్రాస్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం, అవనిగడ్డ పాలిటెక్నీక్ కాలేజ్ లో లెక్చరర్ గా, తరువాత అమెరికాలో ఏడున్నర్ర సంవత్సరాలు సాఫ్ట్ వేర్, ఇతర  ఉద్యోగాలు. మళ్ళీ స్వదేశానికి వచ్చాక హైదరాబాద్ లో ప్రాజెక్ట్, క్వాలిటీ మేనేజర్ గా పని చేసి, ఇంటి బాధ్యతలతో ఉద్యోగం మానేసి తరువాత కొంత కాలం మళ్ళీ ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం అనారోగ్య కారణంగా మానేసిన నా గురించిన వివరాలు ఇవి.
                  చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం బాగా ఇష్టమైన అలవాటు. బహుశా నా రెండో తరగతి నుంచి పుస్తకాలు చదవడం అలవాటైందనుకుంటా. ఆ అలవాటే ఏ చిన్న సంఘటన జరిగినా అలాగే పుస్తకాల్లో రాయడం మొదలైంది. కనిపించిన ఏ పుస్తకం కాని, పేపర్ కాని వదలకుండా చదివేయడం, లైబ్రరికి వెళ్ళి అక్కడి పుస్తకాలూ వదలకుండా చదివేయడం ఆదో పెద్ద వ్యాపకమప్పుడు. నాన్నకు నాటక రచయితగా, నటునిగా ప్రవేశం ఉంది. అందుకేనేమో నాకు కాస్త ఈ సాహిత్యం వంటబట్టి ఉంటుంది. స్నేహితులు ఎక్కువగా ఉండటం, స్నేహానికి ప్రాధాన్యత ఇవ్వడం మూలంగా మేము విజయనగరం వెళ్లినా నా చిన్నప్పటి స్నేహితులకు ఉత్తరాలు రాయడంతో మొదలైన నా రాతలు ఇప్పటికి ఇలా సాగుతూనే ఉన్నాయి. ఏదో పుస్తకాలు చదవడం, మనసుకు అనిపించింది రాయడం మాత్రమే తెలిసిన నాకు సాహిత్యపు లక్షణాలు కాని, మూలాలు కాని తెలియదు. రాసినదేది అచ్చులో చూసుకోవాలన్న కోరిక కూడా లేదు. అడపా దడపా పుస్తకాల్లో రాయడమే కాని ఏ పత్రికకు పంపలేదు. ఆహ్వానం అనే సాహితీ మాస పత్రికలో అచ్చులో చూసుకున్న నా మొదటి కవిత "మౌనం".
                  అమెరికా నుండి వచ్చేసాక 11 సంవత్సరాల క్రిందట పిల్లల చదువుకు సాయమందించడానికి ఏర్పడిన మా ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కోసం బ్లాగు మొదలు పెట్టి, దానితోపాటుగా కబుర్లు కాకరకాయలు అన్న మరో బ్లాగులో నా రాతలు రాయడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 1600 పై చిలుకు పోస్ట్లు నా బ్లాగులో ఉన్నాయి. ముఖపుస్తకంలో ఎన్నో సమూహాల్లో కో అడ్మిన్ గా బాధ్యతలు నిర్వహించి, ప్రస్తుతం నాకు తోచిన నాలుగు భావాలు పంచుకుంటున్నాను.
               నా రాతలన్నీ ఎక్కువగా ప్రతికూల పరిస్థితుల్లో రాసినవే. మా ఇంట్లో అమ్మా వాళ్లకు ఈ రాతలు రాయడం ఇష్టం ఉండేది కాదు. ఏ కాస్త సమయం దొరికినా ఎవరు చూడకుండా గబగబా రాసేయడం, హమ్మయ్య రాసేసాను అనుకోవడం.20 నిముషాలు  బ్రెయిన్ డెడ్ అయ్యి 3 గంటలు ఏమి తెలియని స్థితి నుంచి బయటపడి కూడా రాయడం మానలేదు. డాక్టర్ ఇంట్లో వాళ్ళకు తన సంతోషానికి తనని వదిలేయండి అని చెప్పాక, నా రాతలను ఇష్టపడుతున్న ఎందరినో చూసాక అప్పుడు నా రాతలకు అడ్డంకి లేకుండా పోయింది. పుస్తకాలు చదివి ఎవరైనా మారతారా అని అనుకుంటాం కానీ నా రాతలకు వచ్చే కొన్ని స్పందనలు ఎంత ఆనందాన్నిస్తాయో మాటల్లో చెప్పడం కష్టం. " మేము అనుకున్నది మీరు రాసారు, మా మనసులో భావాలు ఉన్నదున్నట్టుగా రాసారు", మీ భావాలు  చదివి మేము చాలా మారాము ఇలా ఎంతో మంది పెద్దలు, పిన్నలు చెప్తుంటే ఆ అందానికి కొలమానమేముంటుంది.
             అక్షరాల సాక్షిగా నేను ఓడిపోలేదు, చెదరని శి(థి)లాక్షరాలు అనే కవితా సంపుటాలు, గుప్పెడు గుండె సవ్వడులు అనే  కవితా సంపుటి నేను, నా నేస్తం వాణి కలిపి వేసిన కవితా సంపుటి.  సడిచేయని (అ)ముద్రితాక్షరాలు అన్న వ్యాస సంపుటి ఇప్పటి వరకు ముద్రితమైన నా పుస్తకాలు. మరో పుస్తకం అంతర్లోచనాలు వ్యాస సంపుటి . నా రాతలకు మెచ్చి  ప్రైడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు కావ్యశ్రీ పురస్కారాన్ని, సుధీక్షణ్ ఫౌండేషన్ వారు ఉత్తమ కవయిత్రి పురస్కారం అందించారు. మరెన్నో ఆత్మీయ సత్కారాలు నా అక్షరాలకు దక్కాయి.
           నాన్నకు ఇష్టం లేని పెళ్ళి చేసుకుని జీవితంలో ఎన్నో ఒడిదుడుకులనెదుర్కుని, అక్షరాల సాహచర్యంతో అలవికాని అనారోగ్యాన్ని(SLE) సైతం ఆటపట్టిస్తూ బతికేస్తున్న నేను అక్షరాల సాక్షిగా గెలిచాననే అనుకుంటున్నా. ఇదండీ ఇప్పటి వరకు నా రాతల ప్రస్థానం.

         

అంతర్లోచనాలు పుస్తక ఆవిష్కరణ సభ సమీక్ష...!!


                           " అంతర్లోచనాలు...అందరి ఆలోచనల సమాహారం"   

          నవ్యాంధ్ర రచయితల సంఘం, భువన విజయం, తెలుగురథం సంయుక్తంగా విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంధాలయంలోలో నిర్వహించిన " అంతర్లోచనాలు " పుస్తక ఆవిష్కరణ సభ కాస్త ఆలశ్యంగా మొదలైనా ఆద్యంతమూ నవ్వుల చతురోక్తుల మధ్యన దిగ్విజయంగా జరిగింది.
          నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి, నవ మల్లెతీగ సంపాదకులు, " అంతర్లోచనాలు " పుస్తక ప్రచురణ సంస్థ వ్యవస్థాపకులు కలిమిశ్రీ సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సభాధ్యక్ష్యులు బిక్కి కృష్ణ గారిని, శాసనసభ ఉప సభాపతి డాక్టర్ మండలి బుద్ధప్రసాద్, చందు సాంబశివరావు, బండారు హనుమంతరావు ,సాగర్ శ్రీరామకవచం, డాక్టర్ కత్తిమండ ప్రతాప్, కొంపెల్ల శర్మ, నన్నపనేని సునీల్ కుమార్, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరిలను, అంతర్లోచనాలు పుస్తక రచయిత్రినైన నన్ను వేదిక మీదకు ఆహ్వానించి శాలువాలతో, గులాబీలతో గౌరవించి సభను నడిపించవలసిందిగా సభాధ్యక్ష్యులు బిక్కి కృష్ణకు సభా బాధ్యతలు అందించారు. 
         బిక్కి కృష్ణ సభను జ్యోతి ప్రజ్వలనంతో ప్రారంభించవలసినదిగా మండలి బుద్ధప్రసాద్ గారిని, చందు సాంబశివరావు తదితర పెద్దలను కోరగా అందరు దీపాన్ని వెలిగించి సభను మొదలు పెట్టారు. ముందుగా సాగర్ శ్రీరామకవచం మాట్లాడుతూ నేను రాసిన 4 పుస్తకాలను, నేను వాణి వెంకట్ కలిపి రాసిన గుప్పెడు గుండె సవ్వడులు కవితా సంపుటిని కూడా గుర్తు చేసారు. నా కవితలను, వ్యాసాలను వాటిలోని భావాలను చాలా పరిశీలనాత్మకంగా వివరించారు. వాణి కవితలను కూడా వినిపించి విశ్లేషించారు. నా ఆత్మీయ నేస్తం వాణి సభలో లేని లోటును గుర్తు చేసుకున్నారు. సాగర్ ఉపన్యాసం కాస్త ఆవేశంగా సాగింది. మధ్య మధ్యలో కాస్త సందడి చేసారు అతిథులను అల్లరి చేయకుండా సభ వినమని, నన్ను కూడా..
      మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ వారికి పుస్తకం ముందుగా అందివ్వని కారణంగా సభలో పుస్తకం చదవడానికి సమయాన్ని తీసుకున్నానని చెప్తూ వారి దివిసీమ ప్రాంతీయురాలినే నేను అని గుర్తు చేస్తూ, లోతైన కవిత్వాన్ని రాస్తున్నానని, నావి మూడు పుస్తకాలు ఆయనే ఆవిష్కరించారని చెప్తూ, ప్రపంచం అంతా గుర్తించాక వారు గుర్తించామని చెప్పారు. ఆ కాస్త సమయంలో చదివిన వ్యాసాల్లో కార్పొరేట్ వ్యవస్థ మీద ఎక్కుపెట్టిన శరాలు తమ మనసులో మాటలని చెప్తూ, సమాజంలో ఏ వ్యవస్థనూ వదలలేదని, కార్పొరేట్ పై మొదటగా వచ్చిన రచనగా పేర్కొంటూ, కవులు, రచయితలూ సమాజంలోని లోపాలపై తమ రచనలు ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు. చందు సాంబశివరావు మాట్లాడుతూ పుస్తకం తాను ఇప్పుడే చదివానని చెప్తూ, ఇంటిపేర్లు ఈ ప్రపంచంలో మన ఒక్కరికే ఉన్న సంప్రదాయమని, మన సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. మన పేరుకి ముందు ఇంటిపేరు ఉండటం మన సంప్రదాయమని చెప్పారు. సభలో నవ్వులు మెరిపించారు ఈ విషయంపై.
      అంతర్లోచనాలు పుస్తకాన్ని నేను, మావారు రాఘవేంద్రరావు కలిసి తెలుగు రథం అధ్యక్షులు కొంపెల్ల శర్మకు అంకితమీయగా, వారు మమ్మల్ని శాలువాలతో సత్కరించారు. తరువాత డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ నా అక్షర భావాల గురించి చెప్తూ, అంతర్లోచనాలు అందరి ఆలోచనలుగా అభివర్ణించారు. నన్నపనేని సునీల్ కుమార్ మాట్లాడుతూ నా రాతలు తనని కూడా ఎంతో మార్చాయన్నారు. రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి మాట్లాడుతూ మంజు మనసు ముచ్చట్లయినా మన అందరి మనసు మాటలే ఇవి అన్నారు. కొంపెల్ల శర్మ మాట్లాడుతూ అందరు అన్నట్లుగా అంతర్లోచనాలు లేఖా సాహిత్యం కాదన్నారు. మ్యూజింగ్స్ అని అంటూ అంతర్లోచనం అంటే సరిపోతుందని చెప్తూ, అంతర్లోచనాలు పుస్తకంలో ఉన్న శీర్షికలపై తన అభిప్రాయాలను సభికుల ముందుంచారు. లోతైన కవిత్వాన్ని రాస్తున్నందుకు బిక్కి కృష్ణ అభినందించారు. అంతర్లోచనాలు కి ముందు మాటలను తాను కూడా రాసి ఉంటే బావుండేదని అన్నారు. మాట్లాడటం రాని నాటో కూడా రెండు మాటలు మాట్లాడించారు.
     ఆప్తులు, ఆత్మీయులు అందరు వచ్చి సభను దిగ్విజయం చేసారు. పూతరేకులు ప్రత్యేకంగా చేయించి తెచ్చిన శ్రీనివాసరెడ్డి గారికి, పూర్ణాలు, వడలు, అరటి, మిర్చి బజ్జిలు, కేక్, సున్నుండలు, డ్రింక్స్, టీ అందించిన వంకాయలపాటి చంద్రశేఖర్ సోదరునికి, అంతా తమదే అన్నంతగా అన్ని ఏర్పాట్లు చేసిన కలిమిశ్రీ గారి కుటుంబానికి వ్యయ ప్రయాసలకోర్చి నా కోసమే సభకు వచ్చిన, నా వారైన ప్రతి ఒక్కరికి నా మనఃపూర్వక కృతజ్ఞతలు ఈ గోదావరి పత్రిక సాక్షిగా....
   
  

3, జనవరి 2019, గురువారం

యామినిదేవి కోడె...!!

అంతరంగ అంతర్మథనమే యామిని అక్షర శరాలు..!!
          తెలుగు సాహిత్యంలో కవిత్వం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ ఆధునిక తరంలో ఎందరి మనసులనో తడుముతున్న భావాలను రాస్తున్న ఈ తరం కవయిత్రులలో యామినీదేవి కోడె ఒకరు. మూడు వాక్యాలలో ముచ్చటగా త్రిపదాల్లో పొందు పరచినా, తన మనసు స్పందించిన భావాన్ని కవితగా అక్షరీకరించినా, ఎంతోమందిని  తన భావజాలంతో కట్టిపడేస్తున్న యామిని దేవి కోడె అభినందనీయులు.
             సందేశాత్మక కవిత్వమయినా, సామాజిక అంశమయినా తనదైన శైలిలో రాస్తూ చక్కని, చిక్కని భావాలు పలికిస్తూ అనేక సాహితీ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన వంతుగా తెలుగు సాహిత్యానికి సేవ చేస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆత్మాశ్రయ కవిత్వ ధోరణే ఎక్కువగా తన కవితల్లో కనిపిస్తుంది. అడుగంటిపోతున్న అనుబంధాలను చూస్తూ, ఉమ్మడి వ్యవస్థ గొప్పదనాన్ని చాటి చెప్తూ, ఊరి బాగు కోసం అందరం కలసి పని చేద్దామని పిలుపునిస్తూ కలసి అడుగేద్దాం రమ్మంటారు. నాన్న ప్రేమను తల్చుకుంటూ మదిలోని తడిని కన్నీరుతో పంచుకుంటారు. మరో చిరు భావనగా " అక్షరాల మత్తు పట్టింది.. ఆవహించిన అంతరంగమంతా ఇలా .. తరంగమైందని.." అంటూ అక్షరాల అమృతాన్ని మనకందిస్తారు. వెళ్ళనీయని అక్షరాన్నీ, ఉండనీయని కాలాన్ని తలపుల్లో ఉంచడానికి చీకటి ఒడిలో సేదదీరమంటారు. స్వప్నం కవితలో ఆశల ఊహలను అందంగా వినిపిస్తారు.  గురించి చెప్తూ చిన్నప్పటి భయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ చెట్టు  లేకపోయినా ఆ చోటు గుర్తు చేసిన జ్ఞాపకాలను పంచుకుంటూ ఓ చక్కని సందేశాన్ని చెప్తారు..
" జ్ఞాపకాల గుర్తుల్లో
బోసిపోయిన గట్టు మీద
ఎదుగుతున్న ఆశలతో
పెరుగుతున్న చెట్టు
అభివృద్ధికి మరో మెట్టు " అంటూ అద్భుతమైన భావాన్ని అందించారు. ఇలానే మరో కవిత తన ఊరి చెరువు గురించి కూడా రాసారు. మీ టూ, నోట్లరద్దు, ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు ఇలా ప్రతి సమస్యను సున్నితంగా స్పర్శిస్తూ చదువరుల మనసులను గెలవడం యామిని గొప్పదనం. తప్పని పరిస్థితిలో వేశ్యగా మారిన అతివ అంతరంగాన్ని అసహజ హంతకి కవితలో యామిని ఆవిష్కరించిన తీరు అద్భుతం.
" మీ చేతులన్నీ తాకి నేను కదా మైల పడింది
చెదపురుగులై మీరంతా తిన్న నా దేహాన్ని
నీటితో శుద్ధి చేయొచ్చు
మీ మనసు నిండా పట్టిన మకిలెలా
వదులుతుందో
మీ లోపల చూసుకోండి ఓ సారి. "
ఎంత హృదయ వేదన నిండి ఉందో ఈ అక్షరాల్లో చూసారా..
ఇలానే చీకటి గురించి చక్కని భావుకత
"రేయంతా కలల విహారం
ఊహలతో ఊసులాడే
సందు దొరికే రాతిరి.." ఎంత బావుంది ఈ భావన.
ప్రయాణం కవిత చక్కని తత్వాన్ని అందిస్తుంది.
" నన్ను నాలా మిగిల్చే క్షణాల కోసం అన్వేషిస్తూ
మౌనంలోకి జారుతున్నా " అంటూ ఏకాంతంలో తనకు తానుగా పంచుకునే మనసు నొచ్చుకున్న ముచ్చట్లను చెప్తూ ఓ వనిత కోల్పోతున్న జీవితపు ఆనందాలను, స్వేచ్ఛను చాలా తేలిక పదాలతో చెప్పడం హర్షించదగ్గ విషయం. మనం ఓ విషయాన్ని ఎలా చెప్పామన్నది ముఖ్యం కాదు, ఎందరి మనసులకు దగ్గరగా వెళ్ళింది అన్నది ముఖ్యం. ఈ స్థితి యామిని కవితలు చదువుతున్న ప్రతి ఒక్కరికి అనుభవమే. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, భేషజాలు లేకుండా క్లుప్తంగా చెప్పడమే యామినికి ఎంతోమంది అభిమానులను సంపాదించి పెడుతోంది.
దైవం గురించి రాసినా, సామాజిక చైతన్యం గురించి రాసినా, సమాజంలో జరుగుతున్న ఘోరాల గురించి రాసినా, చట్టాల మార్పుల మూలంగా సామాన్యుల ఇబ్బందులను గురించి చెప్పినా, మనసు వేదన, అనుబంధాలు, ఆప్యాయతలు, ఆవసరాలు, అపార్ధాలు, బాల్యపు జ్ఞాపకాలు, కోపం, ఆవేశం ఇలా ఏ పార్శ్వం తీసుకున్నా తనకు తానుగా అనుభవించినట్లుగా చక్కని అనుభూతిని అక్షరాలతో మమేకం చేసి రాయడం యామినికి దేవుడిచ్చిన వరమనే చెప్పాలి. కవిత్వమే కాకుండా చక్కని వ్యాసాలు, సమీక్షలు కూడా రాయగలగడం అభినందించదగ్గ విషయం. ఓ మనిషిలోని అన్ని కోణాలను తనదైన రీతిలో అంతర్లీనంగా దర్శించి ఆ భావాలను నలుగురు మెచ్చేటట్లు రాయడమే కాకుండా, చక్కని కంఠంతో భావయుక్తంగా చదవడమనే కళ కూడా ఈమె సొంతం. మొదటిసారిగా ఓ కవితను వేదిక మీద చుదువుతూనే టైమ్స్ ఆఫ్ ఇండియాలో చోటు సంపాదించుకున్న ఘనత ఈమెది. చాలా పత్రికల్లో యామిని కవితలు ప్రచురితమౌతూనే ఉంటాయి. కవితలు రాయడమే కాకుండా చిత్ర కళ, దుస్తులపై అందమైన పెయింటింగ్ వేయడం, కుట్లు మొదలైన చేతి కళలలో ప్రావీణ్యం బాగా ఉంది. గ్రామీణ నేపధ్యం నుంచి, ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చినా, అనుబంధాలు, అభిమానాలు వదులుకోలేని మధ్య తరగతి మహిళగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ పలు సాహితీ సంస్థలలో కార్య నిర్వాహకురాలిగా బాధ్యతలు స్వీకరించి, బాలోత్సవ్, కవి సమ్మేళనాలలో న్యాయ నిర్ణేతగా ఉంటున్నారు.
ప్రముఖ కవులు దేవిప్రియ, శివారెడ్డి,  రాజారాం తూముచర్ల వంటి వారితో అభినందనలు,సత్కారాలు అందుకున్నారు. అనేక కవి సమ్మేళనాల్లో పలు సత్కారాలు పొందారు. ఇప్పుడిప్పుడే తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేస్తున్న యామినీదేవి కోడె తన అక్షర భావాలతో అందరిని అలరించాలని కోరుకుంటూ శుభాభినందనలు.
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner