17, ఆగస్టు 2016, బుధవారం

నా సన్నిహిత నేస్తాలు అందరికి....!!

ఎనలేని సంతోషాన్ని ప్రతి క్షణం నాకందిస్తూ నా శ్రేయస్సు కోరే నా సన్నిహిత నేస్తాలు అందరికి చాలా చాలా కృతజ్ఞతలు ....
థాంక్యు సో మచ్ శరత్ దంపతులకు....

15, ఆగస్టు 2016, సోమవారం

అక్షరం ఆశయం....!!

బిరుదులకందక
అధికారానికి లొంగక
కనుల ముందు కదలాడే
సామాన్యుల సమస్యలపై
ఎన్నో ప్రశ్నల శరాలను
దేవుడు చేసిన మట్టిమనుష్యుల 
మసనుల సంఘర్షణలను
మానవీయ కోణంలో
అతి సున్నిత సరళ పదాల
అక్షర పద సంపదను
అందరికి అర్ధం కాకపోయినా 
కొందరిలోనైనా స్పందన
తేవాలన్న దృఢ సంకల్పం
అక్షరం ఆశయం....!!

ఈ సదుద్దేశ్యంతో వయసుతో నిమిత్తం లేకుండా పెద్దలు, పిన్నలు వచనం, కవిత్వం, భావుకత్వం, వ్యాసం .... ఇలా ఎన్నో ప్రక్రియలలో ఎందరో అక్షర బ్రహ్మలు నాకందించిన విలువైన సంపద నా పుస్తక భాండాగారం. అందరివీ చదివి నాలుగు మాటలు చెప్పాలనే తపన ఉన్నా తొందరగా చెప్పలేక పోతున్నా.. నాకందిన ప్రతి పుస్తకంపై  పైన రాసిన భావనే నాది. ప్రపంచంలో అత్యంత విలువైన సంపదను నాకందించిన ప్రతి ఒక్కరికి వందనం....!!

14, ఆగస్టు 2016, ఆదివారం

అందరు సంతోషంగా బావుండండి.. !!

చాలా నెలల తరువాత వంట ఇంటిలో ఈ రోజు నా వంటకాలు వెలిసాయి. పిల్లల ముఖాల్లో సంతోషాన్ని చూడటానికి సహకరించని శక్తిని కూడగట్టుకుని పండిన చికెన్ బిరియాని, వెజిటబుల్ బిరియాని, పెరుగు పచ్చడిలతో మా పిల్లల అందరి కేరింతలతో అప్పుడప్పుడు అలిగిన పుట్టినరోజు బుల్లి శౌర్య ముంగమూతి అందాలతో సంతోషం సందడి చేసేసింది మా ఇంట. ఇంట్లోనే కాకుండా మా అపార్ట్ మెంట్ లో అందరి పిల్లలతో సరదాగా అలుగుతూ వారి బుజ్జగింపులు సముదాయంపుతో, ఆంటీలకు, అంకుల్స్ కు, అందరికి ప్రియమైన అల్లరివాడు శౌర్యకు
పుట్టినరోజు శుభాకాంక్షల ఆశీస్సులు....
 ఎవరు ఎలా అనుకున్నా స్వకార్యం తరువాతే స్వామి కార్యం అని నేను అనుకుంటాను ... బాధ్యతలు వదిలేసి దీన జనోద్ధరణ, సమాజసేవ అని బిరుదుల కోసం పాకులాడే వాళ్ళు కనీసం ఇంటిలోని వారికి కాస్త సంతోషాన్ని అందివ్వగలిగితే ఆ పిల్లల పసి మనస్సులో మనకు ఎప్పటికీ స్థానం పదిలంగా ఉండి పోతుంది. చేతనైన సాయం చేయడంలో తప్పులేదు కానీ ఇంటి కనీస బాధ్యతలు పట్టించుకోకుండా ఉండటం అనేది ఎంత వరకు సమంజసం..? ఏదైనా చేయాల్సిన సమయంలో చేయాలి. అంతా అయిపోయాక ఏమి చేయడానికి ఉండదు. ఎందుకంటే గడచిన క్షణాల కాలాన్ని తిరిగి ఎలా తేగలం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా... మనం చేసే ఓ చిన్న తప్పు కానీ, మనం మాట్లాడే ఓ చిన్న మాట కానీ తరువాత వెనక్కి తీసుకోలేము. ఎదుటి వారిని బాధ పెట్టడం అనేది చాలా తేలిక కానీ సంతోష పరచడం, మానసిక ధైర్యం ఇవ్వగలగడం అనేది ఏ కొద్దీ మందో చేయగలరు. అందరు బావుండాలి అన్న చిన్న కోరిక నాది. కష్టం వఛ్చినా సంతోషం తప్పక ఉంటుంది దానిలో అనుకుంటే అంతా బోలెడు సంతోషమే . అందరు సంతోషంగా బావుండండి.. !!

12, ఆగస్టు 2016, శుక్రవారం

అన్నీ బావుంటాయి కదూ నేస్తం ....!!

నేస్తం,
         ఎందుకో ఈ రోజు చాలా మాట్లాడాలి అనిపిస్తోంది. మళ్ళి మాట్లాడే సమయం నాకు వస్తుందో లేదో తెలియదు కదా, అందుకే ఇలా అన్నమాట..
నేను పుట్టిన క్షణం నుంచి ఓ పాతిక ఏళ్ళ వరకు నా అంత ఆనందంగా ఉన్నవాళ్ళు చాలా అరుదే అని నా ప్రగాఢ  నమ్మకం. అది నేను కష్టాలు, సంతోషాలతో కూడా చాలా సంతోషంగానే ఉన్నాను అందరి మధ్యలో. తరువాత మొదలయిన ఈ ఇరవై ఏళ్ళ జీవితంలో తారసపడిన చాలా మంది వలన సంతోషం అనేది కానీ బాధ కానీ నాకు రెండూ చాలా వరకు మానసిక క్షోభనే మిగిల్చాయి. ప్రతి పనిలోనూ ప్రతి క్షణం వాళ్ళ వాళ్ళ అవసరానికి పావుగా వాడుకుంటూ అనుక్షణం నన్ను అధఃపాతాళానికి తొక్కాలని ప్రయత్నించినవారే ఎక్కువ. వాళ్ళు అలా చేసిన ప్రతిసారి నాకు నేనుగా నిరూపించుకుంటూనే ఉన్నా. అదే ఈ రోజు నేను ఏంటో అందరికీ చెప్పింది. నిజంగా వాళ్ళందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు ఇలా చెప్పేస్తున్నా.
నాకు మాట్లాడటమే రాదు, చలాకీతనం, చురుకుతనం లేవు, ఒక లెక్చరర్ గా పనికిరాను, అసలు దేనికి పనికిరాను, ఏ ఉద్యోగం చేయడం రాదు, అసలు ఉద్యోగమే చేయలేదు, ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, డబ్బులు ఏమి సంపాదించలేదు ..... ఇలా చాలా చాలా బిరుదులు నాకు ఇఛ్చారు. అవి అన్ని నాకు సరిపోతాయో లేదో ఈ ప్రపంచంలో నేను తెలిసిన ప్రతి ఒక్కరికి పని గట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు నన్ను కాదన్నా దూరం చేసుకున్నా నా బాధ్యతలు అన్ని ఇప్పటి వరకు చేశాను. ఎవరెవరికి ఏమి చేశాను అన్నది మనసాక్షి వారికి ఉంటే జీవితంలో కనీసం ఓ క్షణం నిజాయితీగా నిజాన్ని ఒప్పుకునే ధైర్యం చేయండి. దీని వలన నేను నా జీవితంలో ఎన్నో కోల్పోయాను. ఇప్పుడు కోట్లు తీసుకు వచ్చి నా ముందు పోసినా నా సంతోషం తీసుకురాలేరు.నా పిల్లల బాధ్యతలే సరిగా చేయలేక పోతున్నాను ఇప్పుడు. అందరికి అన్ని చేసిన నేను ఇక అలసిపోతున్నాను. అయినా ప్రయత్నిస్తూనే ఉంటాను ... చేయలేను అని ఆగిపోవడం మంజుకి చేతకాదు కదా.... ఇప్పుడు సూరయ్యకు నా మీద బోలెడు ఇష్టం పెరిగి నన్ను ఎండలోనికి రావద్దు అని చెప్పాడు.. కాస్త భారంగా కబుర్లు మొదలెట్టినా జీవితాన్ని ఎలా ఉన్నా ఆస్వాదించడం తెలిస్తే అన్నీ బావుంటాయి కదూ నేస్తం ....!!

10, ఆగస్టు 2016, బుధవారం

మనసుల మమతల నెయ్యం...!!

నేస్తం,
         ఎన్నోరోజుల తరువాత బోలెడు కబుర్లు ఉన్నా కాసిని సందడి కబుర్లతో ఇలా ....

జ్ఞాపకాలు, అనుభూతులు, ఆప్యాయతలు .... అన్నవి మనం ప్రతి క్షణం మాట్లాడుకుంటేనో లేదా కలసి ఉంటేనో అని అనుకోనక్కర లేదు . ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఓ సెకను పలకరింపు లేదా గుర్తు చేసుకోవడం అన్నది లేని జీవితాలు ఏం కోల్పోతున్నాయో ఈ రోజుల్లో ప్రత్యేకంగా ఎవరికీ పనిగట్టుకుని చెప్పాల్సిన అవసరం లేదు.
నాలుగు గోడలకే పరిమితమైన కొన్ని నెలల కాలంలో ఇప్పటి యంత్రాల పకరింపులు( ఫోన్, ఎఫ్.బిలు లాంటివి ) లేక పోయినా ఎప్పుడూ ఒంటరితనం అనిపించలేదంటే ఎవరైనా నమ్మగలరా..!!
అస్సలు సమయమే లేదు అన్నది మనని మనం మోసం చేసుకోవడమే.
ఒకప్పటి గడచిన జ్ఞాపకాల అల్లరి సందడితో ఉన్న కొద్దిసేపైనా కొన్ని సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ చదువుల సరదా పిలుపుల కాలాన్ని నా కళ్ళ ముందుకు సజీవంగా తెఛ్చి నాకు మళ్ళి బోలెడు సంతోషాన్ని స్నేహితులరోజుకు ఒకరోజు ముందుగానే నాకు కానుకగా మూటగట్టి ఇఛ్చిన అప్పటి అల్లరి నేస్తాలు, చల్లని స్నేహం స్పర్శ ఎప్పటికీ ఇలా నా సొంతమే కావడం అన్నది ఎన్ని జన్మల పుణ్యమో మరి. అందరి రూపాలు చూపలేక పోయినా ప్రతి ఒక్క నేస్తం ఎప్పటికీ నాకు దగ్గరే.
ఆత్మీయ నేస్తాలు శారద, ఉమ, శోభ, నీరజ, అందరిని కలిపి అల్లరి చేసే అనిత, అను, మమత, కవిత, మంజు, నీలిమ  .... ఇలా చెప్పుకుంటూ పొతే చాంతాడే..... కొందరితో సంతోషం కాదు అందరిలో సంతోషం నింపితే అది కలకాలం అలానే సజీవమై ఉండి పోతుంది ... ఎన్ని జన్మలకైనా దాని పరిమళం తరిగిపోదు. ఇదేనేమో మనసుల మమతల నెయ్యం.

8, ఆగస్టు 2016, సోమవారం

సాకారమైన స్వప్నం.....!!

కలలకు కలతపడి
కథలతో చెలిమి...

వెతలకు భయపడి
వేదన చెందిన మది అలజడి...

వ్యధలకు వడలిన బతుకుల
వేసారిన జీవితాలు...

కనులకు నిండుగ
కన్నీటి సుడులు....

వదలని గతాల
గాయాల గుట్టలు....

ఓటమికి వెరవక
విజయానికై తపన... 

సాకారమైన స్వప్నం
సుందర స్వరూపం సాక్షాత్కారం...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner