28, ఫిబ్రవరి 2015, శనివారం

గెలుపోటముల రెక్కలు ఎక్కడో....!!

ఆగిన మెదడు పోరాటం
అలసిన గుప్పెడు గుండె ఆరాటం
ఎద సవ్వడి మరచిన క్షణం

మౌన పోరాటాల మధ్యన
అంతులేని నిశబ్దాల నడుమ నలిగిన
తెలియని ఘడియలు కోరిన విశ్రాంతి జీవితమేమో

ఆశ నిరాశల ఆరాటంలో
మరో మనసు చేసిన చలనానికి
కదలికలు అందుకున్న కొత్త హృదయం 

కాలాన్ని శాసించిన ధన్వంతరి
దైవానికి ఎదురొడ్డి చేసిన జీవన్మరణ యుద్దంలో
గెలుపోటముల రెక్కలు ఎక్కడో....!!

27, ఫిబ్రవరి 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ఇరువది ఒకటవ భాగం....!!

వారం వారం సాగుతున్న మన సాహితీ ముచ్చట్ల ప్రయాణంలో ఈ వారం క్షీణ యుగం గురించిన వివరాలు
చూద్దాము.. ఈ యుగంలో ముఖ్యులైన కవుల గురించి, ప్రముఖమైన రచనల గురించిన వివరాలు చూద్దాం.. 
తెలుగు సాహిత్యంలో 1775నుండి 1875 వరకు క్షీణ యుగము అంటారు.
క్షీణ యుగంలో ప్రముఖులైన కవులు త్యాగరాజు, కంకంటి పాపరాజు, కూచిమంచి తిమ్మ కవి,కూచిమంచి జగ్గకవి, అడిదము సూరకవి, తరిగొండ వేంకమాంబ, మండపాక పార్వతీశ్వర శాస్త్రి .... మొదలైన వారు...
ప్రముఖ రచనలు : త్యాగరాజు కీర్తనలు, ఉత్తర రామాయణము, అనిరుద్ధ చరిత్ర, కుక్కుటేశ్వర శతకము, అచ్చ తెనుగు రామాయణము,  దశావతార చరిత్రము, కుచేలోపాఖ్యానము ... మొదలైనవి...


త్యాగరాజు (మే 4, 1767 - జనవరి 6, 1847) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై ఆయనకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై ఆయనకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.

బాల్యం, విద్యాభ్యాసం

త్యాగరాజు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం మండలం లో కాకర్ల అను గ్రామం నందు తెలుగు వైదిక బ్రాహ్మణ కుటుంబంలో 1767 లో జన్మించాడు. త్యాగరాజు కాకర్ల రామబ్రహ్మం, కాకర్ల సీతమ్మ దంపతుల మూడవ సంతానం. ఇతని జన్మనామం కాకర్ల త్యాగ బ్రహ్మం. వీరు మురిగినాడు తెలుగు బ్రాహ్మణులు.త్రిలింగ వైదీకులు. ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలం లో కాకర్ల అను గ్రామం నుండి తమిళ దేశానికి వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆద్వర్యం లో ఉండేవాడు. త్యాగరాజు గారి తాతగారు గిరిరాజ కవిగారు. వీరిని గురించి త్యాగయ్య తన బంగాళరాగ కృతిలో "గిరిరాజసుతా తనయ" అని తన తాతగార్ని స్తుతించియున్నారు. త్యాగయ్య గారి విద్య కొరకు రామబ్రహ్మము తిరువారూర్ నుంచి తిరువయ్యూర్ కు పోయిరి. త్యాగయ్య గారు అచట సంస్కృతమును, వేదవేదాంగములను అమూలాగ్రము పఠించెను. సంగీతాభ్యసము కొరకు త్యాగయ్య గారు శొంఠి వేంకటరమణయ్య గారి దగ్గర విడువబడెను. వేంకటరమణయ్య గారు త్యాగయ్య గారి చాకచక్యమును, సంగీతమునందుగల ప్రావీణ్యతను గమనించి వారియందు అతి శ్రద్ధతో సంగీతోపదేశము చేయసాగిరి.

జీవిత విశేషాలు

త్యాగయ్య గారి తండ్రి గారు పిన్న వయస్సులోనే గతించిరి. కనుక అన్నదమ్ముల మధ్య అయిన భాగపరిష్కారములలో త్యాగయ్య గారి భాగములో కులప్రతిమలైన శ్రీరామ లక్ష్మణులు విగ్రహములు వచ్చెను. ఆ ప్రతిమను అతి భక్తితో పూజించుచుండిరి. అయ్యగారు ఉంఛవృత్తి నవలంబించి సర్వసామాన్యముగా జీవనం చేయుచుండిరి. తక్కిన సమయమంతయు తన యిష్టదైవమైన "శ్రీరాములు" పై కృతులు రచించుటలో పాల్గొనుచుండిరి. త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ నామములు జపించి వారి దర్శనము పొంది వారి ఆశీర్వాదము పొందిరి.అయ్యగారు మంచి శారీరము కలిగియుండిరి. అయ్యగారు వైణికులు కూడా.
18 సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆయన 23 వయస్సులో ఉండగా ఆమె మరణించడం జరిగింది. తరువాత ఆయన పార్వతి సోదరియైన కమలాంబను వివాహమాడాడు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది. ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే మరణించాడు. కాబట్టి త్యాగరాజుకు ఖచ్చితమైన వారసులెవరూ లేరు కానీ ఆయన ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.

సంగీత ప్రతిభ

త్యాగరాజు తన సంగీత శిక్షణను శొంఠి వెంకటరమణయ్య దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించాడు. పదమూడేండ్ల చిరు ప్రాయమునాడే త్యాగరాజు నమో నమో రాఘవా అనే కీర్తనను దేశికతోడి రాగంలో స్వరపరచాడు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో ఎందరో మహానుభావులు అనే కీర్తనను స్వరపరచి పాడాడు. ఇది పంచరత్న కృతులలో ఐదవది. ఈ పాటకు వెంకటరమణయ్య గారు చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావి గురించి తంజావూరు రాజుగారికి చెప్పగా, రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధి మాత్రమే సుఖమని ఆ కానుకలను నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే నిధి చాల సుఖమా అనే కీర్తన. సంగీతాన్ని భగవంతుని ప్రేమను పొందే మార్గముగా త్యాగరాజు భావించాడు. సంగీతంలోని రాగ, తాళములను వాటిపై తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడానికి కాక, భగవంతుని నామాలను చెప్పడానికి, భగవంతుని లీలలను పొగడటానికి ఓ సాధనముగా మాత్రమే చూసాడు.
తంజావూరు రాజు పంపిన కానుకలను తిరస్కరించినపుడు ఆగ్రహించిన అతని అన్నయ్య జపేశుడు, త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామ పట్టాభిషేక విగ్రహాలను కావేరీ నదిలో విసిరివేసాడు. శ్రీరామ వియోగ బాధను తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళి అనేకానేక దేవాలయములను, తీర్థములను దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలను త్యాగయ్య రచించాడు. చివరగా శ్రీరాముని అనుగ్రహంతో విగ్రహాలను పొందాడు. వైకుంఠ ఏకాదశి నాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నాడు.
త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి,"స్వరార్నవ"మనే ఓ అద్భుతమైన పుస్తకం ఇచ్చాడనీ, ఆ సంధర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదైన "సాధించెనే" అనీ చెపుతారు. ఈ పుస్తకము వల్ల త్యాగయ్యగారు సంగీతములో అత్యుత్కృష్టమైన విషయములను తెలిసికొనినట్లు తెలియుచున్నది. శంకరాభరణము లోని "స్వరరాగ సుధారసము" అను కృతిలో ఈ గ్రంథమును గురించి త్యాగయ్య పేర్కొనియున్నారు. త్యాగయ్యవారు 24000 రచనల వరకు రచించిరి. "దివ్యనామ సంకీర్తనలు" , "ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు" అను బృంద కీర్తనలు కూడా రచించెను. "ప్రహ్లాద భక్తి విజయము", నౌకా చరిత్రము అను సంగీత నాటకములు కూడా రచించిరి.

త్యాగరాజు జీవితంలో కొన్ని సంఘటనలు

  1. త్యాగరాజు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు పాడిన పాట: ఎందు దాగినావో
  2. ఇతడు తిరుపతి వేంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, తెరతీయగరాదా అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత అవే తొలగిపోయినాయి. ఆ తరువాత ఆయన వేంకటేశ నిను సేవింప అనే పాట పాడినాడు.
  3. త్యాగయ్య పరమపదము చేరటానికి ముందు పాడిన పాటలు: గిరిపై, పరితాపము

త్యాగరాజ ఆరాధనోత్సవాలు

అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటసంగీతానికి మూలస్థంభంగా చెపుతారు. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నాడు (జనవరి, ఫిబ్రవరి నెలలలో) తిరువయ్యూర్ లో ఆయన సమాధి చెందిన త్యాగరాజ మహోత్సవ సభనందు త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు.
ఆయన భక్తులు మరియు సంగీత కళాకారులు మొదట ఉంచవృతి భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. సంగీతాభిమానులకు ఈ గానం శ్రవణానందాన్ని కలిగించడమే కాకుండా భక్తిభావాన్ని కూడా రేకెత్తిస్తుంది. ఈ ఉత్సవాన్ని ప్రపంచంలో చాలాచోట్ల నిర్వహిస్తారు కానీ తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధి గాంచినది. ప్రతీ సంవత్సరం పెరుగుతూ వస్తున్న కళాకారుల మరియు సందర్శకుల కోసం ఇక్కడ ఒక పెద్ద భవనం కూడా నిర్మాణదశలో ఉంది.

సమాధి

త్యాగరాజ స్వామివారి మహాభక్తురాలు బెంగుళూరు నాగరత్నమ్మ కావేరీ నది ఒడ్డున శిధిలావస్థలోనున్న స్వామి వారి సమాధి చూసింది. ఆ స్థలాన్ని, దాని చుట్టు ఉన్న ప్రదేశాన్ని తంజావూరు రాజుల ద్వారా, రెవిన్యూ అధికారుల ద్వారా తన వశము చేసికొని పరిశుభ్రము చేయించి, గుడి, గోడలు కట్టించింది. మదరాసులోని తన ఇంటిని అమ్మి రాత్రనక పగలనక వ్యయప్రయాసల కోర్చి దేవాలయ నిర్మాణాన్ని ముగించింది. అక్టోబర్ 27, 1921లో పునాదిరాయిని నాటగా, జనవరి 7, 1925న గుడి కుంభాభిషేకము జరిగింది. స్థలాభావము వలన ఇంకా నేల కొని ఒక మంటపము, పాకశాల 1938లో నిర్మించింది. ఈ నిర్మాణములతో ఆమె సంపద, ఆభరణాలు హరించుకుపోయాయి. 1946లో త్యాగయ్య చిత్ర నిర్మాణసందర్భములో చిత్తూరు నాగయ్య గారు నాగరత్నమ్మను కలిశారు. ఆమె సలహాపై నాగయ్య గారు త్యాగరాజనిలయం అనే సత్రాన్ని కట్టించారు.

రచనలు

రామేతి మధురం వాచం' అన్నట్లు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వగాన మధురానుభూతిగా లోకానికి అందించారు. భూలోక నారదుడైన త్యాగరాజ స్వామి నారద మంత్రోపదేశం పొంది, అనుగ్రహం ప్రాభవంతో 'స్వరార్ణ వం' 'నారదీయం' అనే రెండు సంగీత రహస్యార్ధ 'శాస్త్ర గ్రంథాలు రచించారు. పంచరత్న కృతి సందేశం : శ్రీత్యాగరాజస్వామి రచించిన కృతులను ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం, నిత్యానుష్ఠానాలని వర్గీకరించవచ్చు. త్యాగరాజస్వామి కీర్తనలలో ఘనరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి.శ్రీత్యాగరాజస్వామి. రామభక్తా మృతాన్ని సేవించి, కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలచి సంగీత, సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు. త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సంప్రదాయం.

కీర్తనలు

త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించాడు.. వీటిలో చాలావరకు ఆయన మాతృభాష ఐనటువంటి తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడినవి. కానీ ఈ కీర్తనలు మాత్రం ఆంధ్రదేశంలోకన్ననూ కర్ణాటక సంగీతం బాగా ప్రాచుర్యంలో ఉన్న తమిళనాట బాగా ప్రాచుర్యం పొందాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న 108 పేర్లను ప్రస్తావిస్తుంది. 'ప్రహ్లాద భక్తి విజయం','నౌకా చరితం' అనే నాట్యరూపకాలను కూడా రచించాడు. త్యాగరాజు కీర్తనల పూర్తి పట్టిక కోసం త్యాగరాజు కీర్తనలు అనే వ్యాసాన్ని చూడండి.
త్యాగయ్య గారు క్షేత్రములకు వెళ్ళునపుడు, ఆయా క్షేత్రము మీదను, క్షేత్రములోని దేవుని మీదను కృతులు రచించెను. అవి యేవనిన:

కొవ్వూరు పంచరత్నములు

(కొవ్వూరు లోని శ్రీ సుందరేశ్వర స్వామి పై వ్రాసిన ఐదు కృతులు)
సంఖ్య పాట మొదలు రాగము తాళము
1 నమ్మివచ్చిన కల్యాణి రూపకము
2 కోరిసేవింప ఖరహరప్రియ ఆదితాళము
3 శంభోమహదేవ పంతువరాళి రూపకతాళము
4 ఈ వసుధ శహాన ఆదితాళము
5 సుందరేశ్వరుని కల్యాణి ఆదితాళము

తిరువత్తియూరు పంచరత్నములు

(తిరువత్తియూరులో వెలసిన శ్రీ త్రిపుర సుందరీ దేవిపై రచించిన కృతులు)
సంఖ్య పాట మొదలు రాగము తాళము
1 సుందరి నన్ను బేగడ రూపకము
2 సుందరీ నీ దివ్య కళ్యాణి ఆదితాళము
3 దారిని తెలుసుకొంటి శుద్ధ సావేరి ఆది
4 సుందరి నిన్ను వర్ణింప ఆరభి చాపు
5 కన్నతల్లి నిన్ను సావేరి ఆదితాళము


కూచిమంచి తిమ్మకవి
18వ శతాబ్దపు తెలుగు కవి. తిమ్మకవి పదిహేడవ శతాబ్దపు నాలుగవ భాగంలో జన్మించి, పద్దెనిమిదవ శతాబ్దపు మూడవభాగం వరకు జీవించి ఉండేవాడని విమర్శకులు, చారిత్రకులు చెప్తున్నారు.
తడు ఆరువేల నియోగి. కౌండిన్యస గోత్రుడు. ఇతని ముత్తాత బయ్యనామాత్యుడు. తామ తిమ్మయార్యుడు. తండ్రి గంగనామాత్యుడు, తల్లి లచ్చమాంబ. సింగన్న, జగ్గన్న, సూరన్న ఇతనికి తమ్ములు. గొట్తిముక్కుల రామయమంత్రిగారి కుమార్తె బుచ్చమ్మ ఇతని భార్య. దెందులూరి లింగయ్య ఇతనికి గురువు.

చారిత్రక విశేషాలు

తిమ్మకవి పిఠాపురం సంస్థానంలోని కందరాడ గ్రామానికి కరణమట. ఇతడు ప్రతిదినము పిఠాపురానికి వచ్చి కుక్కుటేశ్వరడుని సేవించేవాడు. సహస్రమాస జీవి. పిఠాపురాన్ని పరిపాలించిన ప్రభువులలో రావు పెదమాధవరావు, రావు నరసింహారావు, రావు వేంకటరావు, రావు వేంకటకృష్ణారావు, రావు చినమాధవరావు పాలనాసమయంలో ఇతడు జీవించి వున్నాడు. రావు చినమాధవరావు తిమ్మకవికి "కవి సార్వభౌమ" అనే బిరుదాన్నిచ్చాడు. అయినా తిమ్మకవి తన గ్రంథాలను పిఠాపురపు కుక్కుటేశ్వర స్వామికి అంకితం చేశాడు. ఇతని చివరిదశలో భార్యావియోగంతో సన్యాసం స్వీకరించి శేషజీవితాన్ని పిఠాపురంలోని కుక్కుటేశ్వరాలయంలోనే గడిపాడు.

రచనలు

  1. అచ్చతెలుగు రామాయణము
  2. రుక్మిణీ పరిణయము (1715)
  3. సింహాచల మహాత్మ్యము (1719)
  4. నీలాసుందరీ పరిణయము
  5. సారంగధర చరిత్ర
  6. రాజశేఖర విలాసము (1705)
  7. రసికజన మనోభిరామము (1750)
  8. సర్వలక్షణసార సంగ్రహము (1740)
  9. సర్పపురీ మహాత్మ్యము (1754)
  10. శివలీలా విలాసము (1756)
  11. కుక్కుటేశ్వర శతకము
  12. శ్రీ భర్గ శతకము (1729)
  13. భర్గీ శతకము
  14. చిరవిభవ శతకము

బిరుదులు

  • అభినవ వాగనుశాసనుడు
  • కవిసార్వభౌమ
కూచిమంచి జగ్గకవి
18వ శతాబ్దపు కవి. పిఠాపురం సమీపంలోని కందరాడ గ్రామాణికి చెందినవాడు. కూచిమంచి తిమ్మకవికి తమ్ముడు. చంద్రరేఖా విలాపం అనే బూతు ప్రబంధం రాశాడు. పుదుచ్చేరిలోని కామ గ్రంధమాల సంపాదకులు యస్.చిన్నయ్య 1922 లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేదించిందట.
ఈయన 1700-1765 కాలానికి చెందిన కవి. డబ్బు కక్కుర్తితో నీలాద్రిరాజు వేశ్యమీద మొదట 'చంద్రరేఖా విలాసం'అనే కావ్యం వ్రాసి, తరువాత కృతి స్వీకరింప నిరాకరించిన ఆ నీలాద్రిరాజు మీద కోపంతో 'చంద్రరేఖా విలాపం' అనే బూతుల బుంగ కావ్యం వ్రాసి తిట్టు కవిగా సుప్రసిద్ధుడైన ఈ ప్రబుద్ధుడు వ్రాసిన ఒక చాటు శతకం కూడా ఉంది. (తెలుగులో తిట్టుకవులు పుటలు 133-145). 'రామా! భక్తమందారమా!' అనే మకుటంతో వ్రాసిన ఈ శతకంలోని పద్యాలు అనేకం కవి ఆర్తిని, ఆనాటి కవుల హీనస్థితినీ వర్ణించేవిగా ఉన్నాయి. ఈ పద్యం చూడండి;
మ. గడియల్ రెండిక సైచి రా, వెనుక రా, కాసంతసేపుండి రా.
  విడిదింటం గడె సేద దీర్చుకొని రా, వేగంబె భోంచేసి రా,
  ఎడపొద్దప్పుడు రమ్మటంచు సుకవిన్ హీనప్రభుండీ గతిన్
  మడతల్ పల్కుచు త్రిప్పు కా సిడక రామా ! భక్తమందారమా !
ఈయన అన్న కూచిమంచి తిమ్మకవి 'నిరాఘాట నత చ్చాటు కవిత్వాంకు డరయ జగ్గన ధరణిన్' అని ఇతడిని వర్ణించాడు.

రచనలు

  • చంద్రలేఖా విలాసం
  • చంద్రలేఖా విలాపం
  • "రామా భక్తమందారమా" శతకము
  • నర్మదా పరిణయము
  • రాధాకృష్ణ చరిత్ర
  • సుభద్రా పరిణయము
  • సోమదేవరాజీయము
  • పార్వతీ పరిణయము
తెలుగు సాహిత్య చరిత్రలో చెప్పకోదగ్గ కవుల్లో 18వ శతాబ్దంలో జీవించిన అడిదము సూరకవి (Adidam Surakavi) ఒకరు. ఇతడు చంద్రాలోకం, ఆంధ్రనామశేషం వంటి రచనలు చేశాడు. పైడిపాటి లక్ష్మణకవి తో కలసి ఆంధ్రనామ సంగ్రహం రచించాడు.

అడిదము వారి వంశచరిత్ర

ఆంధ్రదేశంలో కవితా వృత్తిచే పేరు పొందిన నియోగి బ్రాహ్మణ కుటుంబాలలో అడిదము వారు ఒకరు. ఈ వంశీయులు కవిత చెప్పడంలోనే గాక కత్తి తిప్పడంలోనూ సమర్ధులు. 'వసిష్ట' గోత్రులు శివ శ్యామలాదేవతోపాసకులు. ఈ వంశీయులు 23 తరాలనుండి కవితా వృత్తిచే జీవించారని, 14 తరాలనుండి వీరికి రాజాస్థానం లభించిందని తెలుస్తుంది. ఈ వంశీయులలో మొదటి వారిని గురించిన సమాచారం దొరకడం లేదు. ఈ వంశీయులు రాజాస్థానం పొందిన దగ్గర నుండి సమాచారం దొరుకుతుంది.
గృహనామం
కళింగదేశం లోని సుప్రసిద్ధ విద్వత్కవి వంశాలలో ఒకటి అడిదము వారి వంశం. మొదట మోదుకూరి, తరువాత గంధవారణం అనే ఇంటిపేర్లు గల ఈ వంశం వారికి వీరి పూర్వీకుడైన నీలాద్రి కవి రణరంగ వీరుడై ఒక అడిదాన్ని (కత్తిని) కానుక గా పొందిన నాటి నుండి అడిదము వారని ప్రసిద్ధి వచ్చింది. గోదావరి మండలం మోదుకూరు కాపురం వచ్చిన వీరికి మోదుకూరు ఇంటి పేరు అయింది. తరువాత వీరి ఇంటి పేరు 'గంధవారణం' అయింది.
లోకంలో తిట్టుకవిగానూ, లోకజ్ఞ్డుడుగానే విఖ్యాతుడైనా, నిజానికి 'మృడ పద పంకజ రిరంసు మృదు మానసు'డై రామలింగేశ శతకం వంటి పదహారణాల చాటుత్వం గల చక్కని శతకం చెప్పిన ఆడిదం సూరకవి ఆ నీలాద్రి కవికి 9 వ తరం వాడు. తనను గూర్చిన వివరాలను సంభాషణాత్మక చాటువు లో ఇలా స్వయంగా సూరకవి చెప్పుకున్నాడు--
కం. "ఊరెయ్యది?" "చీపురుపలి",
  "పేరో?" "సూరకవి" ; "ఇంటిపే?" "రడిదమువార్" ;
  "మీ రాజు?" "విజయరామ మ
  హా రా": "జత డేమి సరసుడా ?" "భోజు డయా!"
ఈ పద్యాన్నిబట్టి ఈ కవి విజయనగర ప్రభువు శ్రీ పూసపాటి విజయరామరాజు ఆస్థానానికి చెందిన వాడని తెలుస్తూంది. తన ప్రభువును స్తుతిస్తూ పెద్దాపురం ఆస్థానంలో ఈ కవి చెప్పిన సుప్రసిద్ధ చాటువు -
ఉ. రాజు కళంకమూర్తి; రతిరాజు శరీర విహీను ; డంబికా
  రాజు దిగంబరుడు; మృగరాజు గుహాంతర సీమవర్తి ; వి
  భ్రాజిత పూసపా డ్విజయరామ నృపాలుడు రాజు కాక ఈ
  రాజులు రాజులా పెను తరాజులు కాక ధరాతలంబునన్.
సభలో ఉన్న రాజు లంతా తమనే తరాజు లంటున్నా డని రోషం తెచ్చుకోగా, చమత్కారంగా ఈ కవి తాను పద్యంలో పేర్కొన్న రాజు (చంద్రుడు), రతిరాజు (మన్మధుడు), మొదలైన రాజుల్నే తాను తరాజు లన్నా నని చెప్పి శాంత పరిచాడట. సూరకవికి కనకాభిషేకం చేయించిన విలువైన చాటు విది.

'పొణుగుపాటి వేంకట మంత్రీ!' అనే మకుటం తో సూరకవి చెప్పిన 39 కందాలు కళింగ దేశ ప్రాంతాల్లో వ్యాప్తిలో ఉన్నాయి. ఈ వేంకట మంత్రి (1720-1780) శృంగవరపుకోట జమీందారు శ్రీ ముఖీ కాశీపతిరావుగారి వద్ద దివానట! ఈయన మహాదాత, కవి, పండిత పక్షపాతి. సూరకవి ఈ మంత్రిగారి ఇంట ప్రతి యేడూ మూడు నాలుగు మాసాలపాటు గడుపుతూ ఉండే వా డని 'ఆడిదం సూరకవి జీవితం' (పుట 80) చెబుతూంది.
కం. వెన్నెల వలె కర్పూరపు
  దిన్నెల వలె నీదు కీర్తి దిగ్దేశములన్
  మిన్నంది వన్నె కెక్కెను
  విన్నావా ? పొణుగుపాటి వేంకట మంత్రీ !

కం. చుక్కల వలె కర్పూరపు
  ముక్కల వలె నీదు కీర్తి ముల్లోకములన్
   క్రిక్కిరిసి పిక్కటిల్లెను
   వెక్కసముగ పొణ్గుపాటి వెంకట మంత్రీ !

కం. సన తేనియ గైకొను భృం
   గ నిరూఢిని దాత మనసు కందక యుండన్
   కొనవలె యాచకు డర్ధము
   విను మవహిత ! పొణుగుపాటి వేంకట మంత్రీ !

కం. పొగ త్రాగనట్టి నోరును
   పొగడంగా బడయనట్టి భూపతి బ్రదుకున్
   మగడొల్లని సతి బ్రదుకును
   వెగటు సుమీ పొణుగుపాటి వేంకట మంత్రీ !
కందానికి కవి చౌడప్ప అలవరించిన తేటతనానికి మెరుగులు పెట్టదం సూర కవి చెప్పిన ఈ కందాల్లో కనిపిస్తుంది. 'చుక్కల వలె' అనే పద్యం 'కన్యాశుల్కం' (పుట 82) లో గిరీశం ఉపన్యాసాలలో చోటు చేసుకునేటంత ప్రసిద్ధి పొందింది. పొణుగుపాటి వేంకట మంత్రి బ్రాహ్మణ సమారాధానలకు పేరు మోసినవాడు. ఒకనాటి సమారాధన వైభవం చూసి, సూరకవి 'ఒక్క సముద్రము దక్కగ' అనే పద్యం చెప్పాడట. ఒక ఉప్పు సముద్రం తప్ప, క్షీర, దధి, ఘృతాది ఇతర ఆరు సముద్రాలూ ఆ సమారాధనలో వెల్లివిరిసినాయట. ఈ పద్యం విని సమారాధనలో మదిచార పోసి పట్టుకోక ధరించి విప్రులకి నెయ్యి వడ్డిస్తున్న వేంకటమంత్రిగారి సోదరి బావ గారి వరస అయిన సూరకవితో 'స్వయంపాకులైన బావగారి కోసం ఆ సముద్రం మా అన్నయ్య విడిచి పెట్టాడు లెండి' అని ముసి ముసి నవ్వులు నవ్వుతూ విసరిన చెణుకుకి సూరకవి అంతటి వాదే నిరుత్తరు డయాడని ఐతిహాస్యం.

నియోగి, వైదీకి మనస్పర్ధలు సూరకవి నాడే తారస్థాయి అందుకున్నట్లు 'చెన్నగు నియోగి కవనపు' లాంటి పద్యాలే గాక, విద్వత్కవి, గొప్ప తార్కికుడు, వైదికుడు అయిన రేకపల్లి సోమప్ప తో సూరకవి వివాదం లాంటివి కూడా స్పష్టం చేస్తున్నాయి. ఆ సోమప్పను సూరకవి ఇలా పరిహసిస్తాడు -
కం. ఏమేమో శాస్త్రంబులు
  తా మిక్కిలి సతికె నంట తద్దయు కవితా
  సామర్ధ్య మెరుగ నేరని
  సోముని జృంభణము కలదె సూరుని ఎదుటన్ ?

కం. తెలుగుం గబ్బపు రీతులు
  కల నెరుగని శుష్క తర్క కర్కశ మతికిన్
  తెలిసె నొకయించు కించుక
  వెలిపలి గౌతన్న కృప కవిత్వపు జాడల్.

సూరకవి తిట్టుకవి గా ప్రసిద్ధుడవడానికి ఈయన శాపానుగ్రహ సమర్ధుడని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. తన తిట్టు పటిమను గూర్చి సూరకవే ఇలా చెప్పుకుంటాడు -
చం. గడియకు నూరు పద్యములు గంటము లేక రచింతు, తిట్టగా
  దొడగితినా పఠీలు మని తూలి పడున్ కుల శైల రాజముల్
  విడువ కను గ్రహించి నిరుపేద ధనాధిపు తుల్యు చేతు నే
  నడిదము వాడ సూరన సమాఖ్యుడ నా కొకరుండు సాటియే ?
సూరకవి వివిధ రాజాస్థానాలు సందర్శించినట్టూ, సర్వత్రా విజయలక్ష్మిని చేపట్టినట్టూ ఆయన జీవిత చరిత్ర చెపుతూంది. బొబ్బిలి సంస్థానం దర్శించినప్పుడు ఈయన పూరించినట్లు చెప్పబడుతున్న ఒక సమస్య;
ఉ. సౌరతర ప్రబంధము లసంఖ్యముగా నొనరించు నట్టి ఈ
  సూర కవీంద్రునిం జునిగి చూత మటంచును మాటి మాటికిన్
  ఈరస మెత్తి దుష్కృతుల నిచ్చిన నారల నోరు మొత్తుడీ
  మీరును మీరు మీరు మరి మీరును మీరును మీర లందరున్.

ఒకసారి సూరకవి భార్య "అందరి మీదా మీరు పద్యాలు చెబుతారు, మన బాచన్నమీద కూడా ఒక పద్యం చెప్పకూడదూ?" అందిట నిష్టూరంగా. వెంటనే 'తన,పర' అనే భేదం లేని సూర కవి ఆ ఎత్తు పళ్ళ సుందరాంగుడి మీద ఈ హాస్య చాటువు చెప్పాడు-
కం. బాచా బూచులలోపల
  బాచన్నే పెద్ద బూచి పళ్ళున్ తానున్
  బూచంటె రాత్రి వెరతురు
  బాచన్నను చూసి పట్టపగలే వెరతుర్.
సూర కవి పద్యాల్లో ఎంతటి మహారాజునైనా 'నువ్వు', ను'వ్వని ఏకవచన ప్రయోగం చేస్తూండడాన్ని ఆక్షేపించిన పూసపాటి సేతారామరాజు గారికి సూరకవి ఇలా జవాబు చెబుతాడు. పిల్లల్నీ, రతి సమయంలోనూ, కవిత్వంలోనూ, యుద్ధంలోనూ ఎవరినైనా 'ఏరా' అనవచ్చునట !
కం. చిన్నప్పుడు, రతికేళిని
  ఉన్నప్పుడు, కవితలోన, యుద్ధములోనన్
  వన్నె సుమీ 'రా' కొట్టుట
  చెన్నగు నో పూసపాటి సీతారామా !

త్యాగరాజు కీర్తనలు 

త్యాగయ్య, త్యాగ బ్రహ్మ, త్యాగ రాజు గా ప్రసిద్ది కెక్కిన ఈయన ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి లతో పాటు కర్ణాటక సంగీత వాగ్గేయకారులైన త్రిమూర్తులలో ఒకడు. 16 వ శతాబ్దాంతమున విజయ నగర సామ్రాజ్య పతనానంతరం జన జీవన శైలిలో వచ్చిన విపరీతమైన మార్పుల వలన ఎంతో మంది తెలుగు వాళ్ళు తమిళనాడుకు వలస పోయారు, ఆ విధంగా వలస పోయిన కుటుంబాలకు చెందిన వాడే త్యాగయ్య కూడా. కర్నూలు జిల్లా కు చెందిన కాకర్ల గ్రామమునకు చెందినవాడని చెప్పుకున్నాడు త్యాగయ్య. 1767?? లో కాకర్ల రామబ్రహ్మం,సీతమ్మలకు తిరువారూర్ గ్రామంలో జన్మించాడు త్యాగయ్య. తరువాత కావేరీ నదీ తీరాన ఉన్న తిరువయ్యూరు కు మారాడు కాకర్ల రామబ్రహ్మం. ఇప్పటికీ తిరువయ్యూరులో త్యాగరాజ వంశస్తులు ఆయన ఇంటిని పరిరక్షిస్తూనే ఉన్నారు.
ఈయన పంచరత్న కీర్తనలు, సంగీతం మీద త్యాగయ్య పట్టు ను వెల్లడిచేస్తాయి. వీటితో పాటు ఈయన ఎన్నో ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, దివ్య నామ సంకీర్తనలు కూర్చాడు.
కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడయిన త్యాగరాజులవారి కీర్తనలు

పంచరత్న కీర్తనలు

త్యాగరాజ స్వామి వారి కీర్తనలలో ఉత్తమమైనవిగా విద్వాంసుల చేత నిర్ణయించబడినవి పంచరత్న కీర్తనలు:
అవి....
  • జగదానంద కారక - నాట రాగం
  • దుడుకుగల - గౌళ రాగం
  • సాధించెనె - ఆరభి రాగం
  • కనకనరుచిరా - వరాళి రాగం
  • ఎందరో మహానుభావులు - శ్రీ రాగం

కీర్తనలు

మచ్చుకు ఈ కీర్తనను చూడండి:
బిళహరి రాగము - ఆది తాళము
దొరకునా ఇటువంటి సేవ ॥దొరకునా॥ దొరకునా తప మొనరించిన భూ సురవరులకైన సురలకైన ॥దొరకునా॥

తుంబుర నారదులు సుగుణకీర్త

నంబుల నాలాపము సేయగా
అంబరీష ముఖ్యులు నామము సే
యగ జాజులపై చల్లగా
బింబాధరులగు సురవారయళి
వేణులు నాట్యములాడగా
అంబుజభవ పాకారు లిరుగడల
నన్వయ బిరుదావళిని బొగడగా
అంబరవాస సతులు కరకంక
ణంబులు ఘల్లని విసరగ మణిహా
రంబులు ఘల్లని విసరగ మణిహా
రంబులు గదలగ సూచే ఫణి త
ల్పంబున నెలకొన్న హరిని గనుగొన ॥దొరకునా॥


మరకతమణిసన్నిభ దేహంబున
మెఱుగు గనకచేలము శోభిల్ల
చరణయుగ నభావళికాంతులు
జందురు పిల్లలను గేర
వరనూపురము వెలుగంగ గతయుగమున
వజ్రపు భూషణములు మెఱయ
ఉరమున ముక్తాహారములు మఱియు
ఉచితమైన మకరకుండలంబులు
చిఱునవ్వులుగల వదనంబున ముం
గురు లద్దంపుగపోలము ముద్దు
గురియు దివ్యఫాలంబున దిలకము
మెఱసే భువిలావణ్యనిధిని గన
తామసగుణరహిత మునులకు బొగడ
దరముగాకనే భమసి నిల్వగ
శ్రీమత్కనకపు దొట్లపైని చెలు
వందగ గొలువుండగ
కామితఫలదాయకియౌ సీత
కాంతునిగని యుప్పొంగగ
రామబ్రహ్మ తనయుడౌ త్యాగ
రాజు తా బాడుచు నూచగ
రాముని జగదుద్ధారుని సురరిపు
భీముని త్రిగుణాతీతుని బూర్ణ
కాముని చిన్మయరూపుని సద్గుణ
ధాముని కనులార మదిని కనుగొన ॥దొరకునా॥

నగుమోము కనవా!

పల్లవి:నగుమోము గలవాని నామనోహరుని
జగమేలు శూరుని జానకీ వరుని

చరణం1:దేవాదిదేవుని దివ్యసుందరుని
శ్రీవాసుదేవుని సీతా రాఘవుని

చరణం2:నిర్మాలాకారుని నిఖిల లోచనుని
ధర్మాది మోక్షంబు దయచేయు ఘనుని

చరణం3:సుజ్ఞాన నిధిని సోమసూర్యలోచనుని
అజ్ఞాన తమమును అణచు భాస్కరుని

చరణం4:భోధతో పలుమారు పూజించి నేను
ఆరాధింతు శ్రీత్యాగరాజా సన్నుతుని

కోదండ రామ

రామ కోదండ రామ
రామ కల్యాణ రామ
రామ పట్టాభి రామ
రామ పావన రామ

రామ సీతాపతి
రామ నేవేగతి
రామ నీకుమ్రొక్కితి
రామ నీచేజిక్కితి

రామ నేనందయినను
రామ నిను వేడగలేను
రామ ఎన్నడైనను
రామ బాయగలేను

రామ నీకొక్క మాట
రామ నాకొక్క మూట
రామ నీమాటే మాట
రామ నీపాటే పాట

రామ నామమే మేలు
రామ చింతనే చాలు
రామ నేవు నన్నేలు
రామ రాయడే చాలు

రామ నీకెవ్వరు జోడు
రామ క్రీకంట జూడు
రామ నేను నీవాడు
రామ నాతో మాటాడు

రామాభి రాజ రాజ
రామ ముగజీతరాజ
రామ భక్త సమాజ
రక్షిత త్యాగరాజ


గంధము పూయరుగా...

గంధము పూయరుగా
పన్నీరు గంధము పూయరుగా
అందమైన యదునందుని పైని
కుందరదనవర వందగ పరిమళ "గంధము"

తిలకము దిద్దరుగా
కస్తూరి తిలకము దిద్దరుగా
కళకళమని ముఖకళగని సొక్కుచు
పలుకుల నమృతము నొలెకిడి స్వామికి "తిలకము"

చేలము గట్టరుగా
బంగారు చేలము గట్టరుగా
మాలిమితో గోపాల బాలులతో
నాల మేపిన విశాల నయనునికి "చేలము"

ఆరతులెత్తరుగా
ముత్యాల ఆరతులెత్తరుగా
నారీమణులకు వారము యవ్వన
వారక యొసగెడి వారిజాక్షునికి "హారతులు"

పూజలు చేయరుగా
మనసారా పూజలు చేయరుగా
జాజులు మరివిర జాజుల దవనము
రాజిత త్యాగరాజ వినుతునికి "పూజలు"

"గంధము" "తిలకము" "చేలము" "హారతులు" పూజలు"


ఇలా చెప్పుకుంటు పోతుంటే అంతు లేని మహా సాగరం ఈ సాహితీ సంద్రం... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

ఏక్ తారలు....!!

26/2/15
1. మనసు పుస్తకం మౌనమైనా_పుస్తకపు పుటలన్నీ నిండుకున్నాయి నీ జ్ఞాపకాలతో
2. కావ్య కన్నియను కాదన్నా_నీ కోసమే తరలి వచ్చింది
3. హర్షపు వర్షంలో_మునిగినా తేలినా మధురమే
4. మౌనమూ మాటలు నేర్చింది_నీ అధరపు మధువులను గ్రోలి
5. మదనుడి మాయకు_పరువపు మరువాలు మనసు పడ్డాయేమో
6. మనసు అక్కడే ఉండిపోయింది_నాలోని నిన్ను వదలి రాలేనంటూ
7. మనసు రాగం_మౌనరాగంలో జత చేరింది కదా
8. చేదులోనే తీపిని పరిచయం చేస్తూ_నీతో జీవితం అన్ని రుచుల సంగమం
9. మనసడ్డం తిరిగింది_అద్దంలో అబద్దాల నీడలను చూస్తూ

26, ఫిబ్రవరి 2015, గురువారం

మణి మాలికలు....!!

1.  మనసు పొరల్ని త్రవ్వుకుంటున్నా
   నువ్వు వదలి పోయిన నన్ను నేను వద్దనుకుంటూ 
2. మనసు పొరల్ని త్రవ్వుకుంటున్నా
  అలముకున్న నీ జ్ఞాపకాల్లో నేనంటూ ఉన్నానా అని  
3. మనసు పొరల్ని త్రవ్వుకుంటున్నా 
   మాయమైన నువ్వు కనిపిస్తావని  

నిలిచిపోయిన....!!

కలలో 'కల'వరమైనది
నిన్నటిలో ఉండిపోయిన 
నీ జ్ఞాపకాల తాకిడి తట్టి లేపుతుంటే

వాస్తవాన్ని వద్దని వాదులాడినా 
విడువలేని  చెలిమిగా వెంటపడుతూ
చేరలేని గమ్యాన్ని మరు జన్మకు వాయిదా వేసి

రేపటిలో రాలిపోయే
గుర్తుగా మిగిలి నేనున్నా
నిలిచిపోయిన నా కాలం నీతోనే ఉండిపోయింది...!!

25, ఫిబ్రవరి 2015, బుధవారం

ఏక్ తారలు ....!!

23/2/15
1. ఐక్యతా రాగం ఆలపిస్తున్నాయి_ఆసరా ఇస్తున్న ఆపన్న హస్తాలు
2.  రంగులు వేరైనా_కలసిన కరాల నినాదం ఒకటే
3.  చేయి చేయి కలసినది_చైతన్యానికి నాంది పలుకుతూ
4.  అక్షరాలే అనుబంధాలు_నను వదలని నీ జ్ఞాపకాలుగా
5. నీ నవ్వుల్లోనే_మురిసిపోతున్న గతంగా మిగిలిపోయా
6. మనసుకెంత మైమరపో_నీ రాతి హృదయంలో చలనం తెచ్చినందుకు
7. తుంటరి కోరికలే_నీతో చేరిన విరహానికి సెలవంటూ
8. అక్షరాలకూ ఆకారం వచ్చింది_నీ భావాల చేరికతో
9. అభయ హస్తం అందింది_ప్రేమ పరాజయానికి
10. తన ప్రతిబింబం నీ కన్నుల్లో కాంచి_పున్నమి వెన్నెల పక్కుమంది
11.  రగిలే ప్రేమ వాయువుకు_చల్లని అనురాగమే తోడుగా
12. ఊహలా అలరించినా_వాస్తవాన్నై నీతోనే ఎప్పటికి
13. మరణంలో సైతం నీతోనే_మరుజన్మకు తీరని ఋణమంటూ
14. నీ రాకను పసిగట్టి_శతకోటి రాగాలు పలికాయి మది తంత్రులు
15. రాగాల కలయికలో_ రస భరితమే జీవితం
16. హృదయం చేజారిపోయి_మనస్సు మాత్రమే మిగిలిపోయింది
17. స్నేహ గీతాల ఆలాపన_అందుకున్న ఆత్మీయతా బంధం
18. అందించిన చెలిమికే_అక్షరాలై రాలుతున్న భావనలు
19.  ప్రేమే ప్రాణమైన తరుణంలో_నీ రూపానికి రంగరించడంలో ఆదమరిచా
20. శిశిరానికి తెలియలేదు_చెలిమి చిగురింతలు మొదలయ్యాయని
21. వాసంత సమీరాలే_చెలిమి చెంతనుంటే
22. మది నిండా మధుర భావనలే_అక్షరాలకు అందని తారకల్లా
23. ప్రణయం ప్రళయమై_ఆ(డ)దమరచిన జ్ఞాపకాలను ముంచేసింది
24. వెన్నెల వర్షంలో_నిండు జాబిలి పక్కన చిన్నబోయిన తారకలు
25. పలుకుల తేనెల్లో_మెరుపులా అవి మైమరపులా
26. సందె పొద్దు సందడిలో_సిరి చందనాల పరిమళాలు
27. యుగాల నిరీక్షణలో_చెలి(మి) చేరువయ్యేనా 
28. తారకల నవ్వులే_అప్పుడప్పుడూ మెరిసే నీ మోము కాంతులట

ఏక్ తారలు...!!

24/2/15
1. నవ్వుల అందానికి దాసోహమై_ముత్యాలేరదామని ఆగిపోయాయేమో
2. అందం అక్షరానిదైనా_చెలిమికి చేయి అందించినది భావమే కదా
3. మౌనం మాటలాడింది_నీ భావాలకు మురిసిపోతూ
4.ప్రతిరోజూ పండుగయితే _మరు జన్మతో పనేముంది
5. పూల పరవశం _నీ ముగ్ధ మోహన రూపాన్ని తిలకించే 
6. భవిత మీ చేతిలోనే ఉంటే_జ్యోతిష్యంతో పనేముంది 
7. పులకింప చేసే చిరుగాలికి_అల్లరి అందాలు తోడైతే పరవశానికి పండగే 
8. మున్నాళ్ళ ముచ్చటే తనదని తెలియక_ఆ మిడిసిపాటు పరువానికి 
9. చిరు స్పర్శే_విశ్వమంతగా మారింది నీ అక్షర భావాలతో 
10. సితారలు సింగారించిన రాగాలు_ఈ భావాల లయ భంగిమలు 
11. చెలిమి చేరువ కోసమే_ఈ నిరవధిక నిరీక్షణ 
12. చెరగని నుదుటి రాతే నవ్వుతూ_కడవరకు తోడు రాని చెలిమి నీటి రాతను చూసి 
13. మరెందుకాలశ్యం_నవ పారిజాతాలను నా నవ్వులో పొదగరాదూ 
14. మరుగున ఉన్నా_మదిని బయల్పెడుతూ భావ తారాక్షరాలు 
15. భావాలు బోలెడన్ని తారలై_నీ అక్షరాల్లో ఒదగాలని ఎదురు చూస్తూ 
16. అరువది నాలుగు కళలు_నీ భావాల్లో ఇమిడిపోవాలని తపిస్తూ 
17. మత్తుగా నిద్దరోయింది రాతిరి_కలలో నిన్ను చేరిన మైమరపులో 
18. శీతలానికై తపిస్తూ_వేసవి వేడిమిలో నీ తలపుల తాకిడి నాలో
 

24, ఫిబ్రవరి 2015, మంగళవారం

చాలా చిన్న కోరిక...!!

ముక్కోటి దేవతలకు నా విన్నపం ఒక్కటే ... ఏదో చాలా చిన్న కోరిక... మీరు నా కోరిక తీర్చిన వెంటనే మీ ముడుపులన్ని చెల్లిస్తా... ఇదుగో నా చిన్న కోరిక.. ఒక్కసారి నేను ప్రధాన మంత్రిని అయితే తిరుపతి వెంకన్నకు ఏడు తులాల తొడుగు చేయిస్తా... బెజవాడ దుర్గమ్మకు వజ్రపు ముక్కు పుడక కానుకగా ఇస్తా... శ్రీశైలం మల్లన్నకు బంగారు నందిని బహుమతిగా ఇస్తా... ఇంకా ఇలా బోలెడు కానుకలు ముక్కోటి దేవతలకు సమర్పిస్తా... కాకపొతే మనలో మన మాట నా సొమ్ముతో కాదండోయ్ మీ సొమ్ముతోనే.... నా దగ్గరేముంది చెప్పండి ఏదో మీ అందరి అభిమానం తప్ప... దానితో కానుకలు చెల్లించలేను కదా... ఈ విషయంలో నాకు కె సి ఆర్ గారే ఆదర్శం అండి... -:)

23, ఫిబ్రవరి 2015, సోమవారం

ఏక్ తారలు.....!!

21/2/15
1. చిరునవ్వుని చెంతకు చేరనియని వేదన_చిద్విలాసంగా నవ్వుతోంది
2. ఏ దారైనా చేర్చేది గమ్యానికే_రాజబాటయినా రాదారయినా
3. ఇరుకు గుండె అని ఒదిగి ఉన్నా_వైశాల్యం పెరగక పోయినా
4. నాట్య మయూరానికి నడకలు నేర్పాలా_జతుల గతులన్ని కరతలామలకమే కదా
5. మధువు రుచెరిగిన తుమ్మెదను_మకరందాన్ని గ్రోలవద్దంటే ఊరుకుంటుందా
6. తొలి చినుకు స్పర్శకు_పులకించిన అవని విన్యాసం
7. కను రెప్పలు మూసుకున్నాయి_కలలో నిన్ను దర్శిద్దామని
8. నన్ను గతాన్ని చేస్తే ఎలా_భవిత నీతో ముడి పడి ఉంటే
9. వెన్నెలకు వినోదమే_రేయిని ఆట పట్టిస్తూ
10. నా మది నీ తలపుల్లో చిక్కుకుందని_నీ చిరునవ్వుకు అర్ధమనుకుంటా
11. రెప్పలు అలిగాయి_ఎప్పుడు నీ రూపేనా తమలోనని
12. విసిరేసిన జ్ఞాపకం కూడా_మళ్ళి నిన్నే చూపిస్తోంది
13. సుకుమారం మనసు_అందుకే జ్ఞాపకాల భారాన్ని మోయలేక పోతోంది
14. అందనంత ఎత్తులో అభిమాన ధనం_మోసపోతున్నా విడువని ఆత్మ గౌరవంతో

21, ఫిబ్రవరి 2015, శనివారం

ఏక్ తారలు...!!

20/2/15
1. వద్దంటే వెంట పడుతూ_జ్ఞాపకమై వేదిస్తున్నావు
2. నీ ఊహలైనందుకేమో_భావాల ఆభరణాలు అందంగా అమరాయి
3. ఎంత తవ్వినా వస్తూనే ఉన్నాయి_మనసు ఊటబావిలో  మన జ్ఞాపకాలు
4. గుండె చప్పుడులో వినిపించేది_నీ స్మరణమే కదా
5. బంధాలను బాధ్యతలను మోస్తున్నా_కాలానికి తర తమ బేధం లేదెందుకో
6. అప్పు రేపని చెప్పేసానే_మరెలా ఇప్పుడు
7. పారిజాత తొడిమతో_పడతి అధరానికి మంకెన చేరినట్లుంది
8. మనసు లోపాన్ని చూపించేది_ఆ కళ్ళే కదా
9. తొలి కిరణాల పలకరింపుల్లో_చేరినవి నీ తలపులే
10. విస్తరిస్తోంది వెన్నెల_చీకటిని చెల్లాచెదురు చేస్తూ
11. కాలానికి అసాధ్యమే_నీ తలపులను తనతో తీసుకెళ్ళడం
12. మన్నించే మనసుకు_ప్రతిదీ పవిత్రమే ఈ సృష్టిలో
13. భావాలన్నీ దాగున్నాయి_విరహానికి భయపడి
14. నీవు నేర్పిన విద్యయే కదా_నవ్వించినా కవ్వించినా
15. ప్రమాదం ప్రమోదమయ్యింది_ఫాలాక్షుని రాతను మార్చలేక
16. రక్తం రంగు ఒకటైనా_విభజనలో బోలెడు తేడాలు
17. కల కల్ల కాకూడదని_వాస్తవాలు ఎదురుగా
18. నేను నువ్వు వాస్తవంలో ఉంటే_గతంతో నీకేం పని
19. కొత్త గుభాళింపు మత్తులో_మమకారాన్ని మరచి మోహంలో పడిపోయాను
20. అలల కెంత సంబరమో_మళ్ళి కడలితో కలుస్తున్నందుకు
21. కళ్ళు నిండుకున్నాయి_విరహాన్ని విషాదాన్ని మదిలో దాయలేక
22. కాలం పోతూనే ఉంది_అనుభవాలను పంచుకుంటూ
23.  ఆత్మీయతా లేపనం రాశానుగా_అతికిన మదికి

20, ఫిబ్రవరి 2015, శుక్రవారం

కానరాలేదెందుకో....!!

విధాత రాసిన రాతలో ముడిపడిన
రెండు జీవితాల కలయికలో పిండమై
అమ్మ ప్రేమలో ఊపిరి పోసుకుంటూ
నవ మాసాల పాపాయిగా మారి
అందరి ప్రేమను అందుకుంటూ
ప్రాయపు ప్రేమల వైరుధ్యాన్ని చవి చూస్తూ
ఆత్మీయతానుబందాల నడుమ నడయాడుతూ
అప్పుడప్పుడు ఎక్కువైన మమకారానికి
కంటి నిండా చిప్పిల్లే కన్నీరుని దాచేస్తూ
ఏడుస్తూ రొద పెడుతున్న మదిని
జ్ఞాపకాల తాయిలంతో ఊరడిస్తూ
ఏ మూలో మెదిలిన భావాన్ని
గొంతు దాటి రానీయక నులిమేస్తూ
కలలన్ని కళ్ళముందే కాలిపోతుంటే
చూస్తూ ఉండిపోతూ....
కడలి ఒడిలో వాలిపోవాలని తపిస్తూ
చుట్టూ ఆవరించుకున్న స్మశాన వైరాగ్యాన్ని
దూరం చేసుకోలేని నిస్సహాయ స్థితిని భరిస్తూ
చిరునవ్వుని పులుముకున్న చిత్రంలో
జీవకళ కానరాలేదెందుకో....!!

ఏక్ తారలు...!!





18/2/15

1. ఇంకిన కన్నీళ్ళకు బదులుగా_నువ్వు చేసిన గాయాల తడి నాతోనే ఉంది
2. భావమై బందీనైయ్యా _అక్షరాల అల్లికలో అమరి
3. వరమై వడిని చేరావని తలచా_వాస్తవాన్ని గుర్తు చేస్తావని తెలియక
4. జ్ఞాపకంగా నాతోనే_గతం తోడులేని వాస్తవమై
5. చెరువులన్నీ ఎండిపోయాయి_విరహానికి ఆవిరై కన్నీళ్ళ కరువుతో 
6. మౌనం జతగా వచ్చి చేరింది_నీ జ్ఞాపకాలను నాతో చేరి తిలకిస్తూ
7. మనసు మౌనమయ్యింది_నీ విరహంలో మాటలు దూరమై

మణి మాలికలు...!!

 1.  విరహానికి ఎందుకో అంత వగపు
  నీ ప్రేమకు దూరంగా తారాడుతున్నందుకేమో
2. నిరీక్షలోనే ఉన్నా
  నీ విరహంతో వేగలేక
3. విరహం వేధిస్తోంది
నా చెంతన నువ్వు లేవని

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ఇరువదవ భాగం....!!

వారం వారం సాగుతున్న మన సాహితీ ముచ్చట్ల ప్రయాణం క్రిందటి వారం తెలుగు స్వర్ణ యుగాన్ని... దానికి మూలమైన ఆంధ్ర భోజులు శ్రీకృష్ణ దేవరాయల గురించిన కొన్ని వివరాలు తెలుసుకున్నాము... ఈ వారం రాయల యుగం తరువాతి యుగమైన దక్షిణాంధ్ర యుగం గురించి కొన్ని వివరాలు చూద్దాం...

1600 - 1775 : దక్షిణాంధ్ర యుగము

తెలుగు సాహిత్యంలో 1600 నుండి 1775 వరకు దాక్షిణాత్య యుగము అంటారు.

కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్య వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు.
  • పదకవితా పితామహుడైన అన్నమయ్య తిరుపతి వేంకటేశ్వరునిపై రచించి, పాడిన ముప్పైరెండువేల పద్యాలు ఓ ప్రత్యేక సాహితీ భాండాగారం.
  • క్షేత్రయ్య, త్యాగరాజు, భద్రాచల రామదాసు వ్రాసిన కీర్తనలు నేటికీ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాయి. త్యాగరాజ కీర్తనలు కర్ణాటక సంగీతానికి ఆయువుపట్టు వంటివి.

రఘునాథ నాయకుడు తంజావూరు ను ఏలిన తంజావూరు నాయక వంశపు మూడవ రాజు. తంజావూరు నాయక వంశపు రాజుల్లో అత్యంత ప్రసిద్ధుడు రఘునాథ నాయకుడు. ఇతడు 1600 నుండి 1634 వరకు పాలించాడు. కృష్ణదేవరాయల అనంతరం అంతటివాడేకాక, అంతకుమించినవాడని ఎన్నదగిన ఆంధ్రభోజుడు. ఈయన రాజేకాకుండా సంస్కృతం, తెలుగు ఉభయభాషలలోనూ కవిత్వం చెప్పగలవాడు. అంతేకాకుండా నూతన రాగాలను, తాళాలను కనిపెట్టి వీణల మేళవింపును సంస్కరించిన సంగీతశాస్త్ర నిపుణుడు. పారిజాతా హరణం అను గ్రంథమును చిరుత ప్రాయంలోనే సంస్కృతం లో రచించినాడు. ఇప్పుడు లభిస్తున్న వీరి గ్రంథములు వాల్మీకి చరిత్ర, రామాయణము అను పద్య కావ్యములు, నల చరిత్ర అను ద్విపద కావ్యము, జానకీ కల్యాణం అను చాటు కావ్యం, రుక్మిణీ కల్యాణం అను యక్ష గానములు. ఈయన పాలనలో తంజావూరు సాహిత్యానికి, కళలకు మరియు కర్ణాటక సంగీతము నకు ప్రధాన కేంద్రమైనది.

ప్రారంభ జీవితం

రఘునాథ నాయకుడు, అచ్యుతప్ప నాయకుని పెద్ద కుమారుడు. తండ్రి ఘోర తపస్సు చేసిన తర్వాత కలిగిన సంతానము. రఘునాథాభ్యుదయము మరియు సాహిత్యనాట్యకారలో ఈయన బాల్య వివరాలు వివరంగా ఇవ్వబడినవి. బాలునిగా ఉన్నప్పుడే రఘునాథునికి శాస్త్రాలు, యుద్ధవిద్యలు మరియు పాలనవ్యవహారాలలో మంచి శిక్షణ పొందాడు. రఘునాథ నాయకునికి అనేకమంది భార్యలు ఉండేవారు. ఈయన భార్యలలో ప్రముఖురాలైన కళావతి, "రఘునాథాభ్యుదయం"లో పట్టపురాణిగా వర్ణించబడింది. తంజావూరు నాయక వంశ చరిత్ర వ్రాసిన రామభద్రమ్మ రఘునాథుని భోగపత్ని. 
తొలిరోజుల్లో రఘునాథ నాయకుడు గోల్కొండ రాజ్యంతో పోరాడి అందరి ప్రశంసలు అందుకొన్నాడు. రఘునాథుడు1600లో రాజ్యపాలన బాధ్యతలను చేపట్టాడు. 1600 నుండి 1614 వరకు తండ్రితో సహపాలకునిగా పాలించాడు. 1614లో తండ్రి మరణం తర్వాత పట్టాభిషిక్తుడై, 1634లో మరణించేవరకు రాజ్యాన్ని పాలించాడు.

కళా పోషణ

రఘునాథ నాయకుడు సంస్కృతము, ఆంధ్రము లలో తొమ్మిది రచనలు చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం 4 మాత్రమే లభ్యం.. వీనిలో 3 ప్రబంధాలు. అవి
  • 1. వాల్మీకి చరిత్ర : వాల్మీకి గాథ కావ్యంగా రచించబడింది.
  • 2. రఘునాథ రామాయణము: కొంతమాత్రమే లభిస్తోంది. శ్రీ రామచంద్రునికే అంకితమీయబడింది.
  • 3. శృంగార సావిత్రి: ఇది శృంగారప్రబంధం. దీని మరో పేరు ' సావిత్రీ కల్యాణం '.
ఈయన ఆస్థానంలోని కవులలో ప్రముఖులు :
  1. చేమకూర వేంకటకవి
  2. గోవింద దీక్షితులు
  3. యజ్ఞనారాయణ దీక్షితులు
  4. కృష్ణాధ్వరి
  5. రామభద్రాంబ
  6. మధురవాణి

ఈ కాలంలో కవయిత్రులు ముద్దుపళని, రంగాజమ్మ, మధురవాణి, రామభద్రాంబ

ముద్దుపళని
(1730-1790) 18వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి. ఈమె 1739 నుండి 1763 వరకు తంజావూరు నేలిన మరాఠ నాయక వంశపు రాజు ప్రతాపసింహ యొక్క భోగపత్ని. ఈమె ప్రతాపసింహుని ఆస్థానములో నెల్లూరు శివరామకవితో పాటు ఆస్థాన కవయిత్రి కూడా. ముద్దుపళని యొక్క గురువు తిరుమల తాతాచార్యుల వంశమునకు చెందిన వీరరాఘవదేశికుడు.
దేవదాసీల కుటుంబములో జన్మించిన ముద్దుపళని తల్లి పోతిబోటి, అమ్మమ్మ తంజనాయకి కూడా కవియిత్రులని, తండ్రి పేరు ముత్యాలు అని రాధికా స్వాంతనముకు ఈమె రాసిన ప్రవేశికలో తెలుస్తున్నది.
ముద్దుపళని రాసిన రాధికా సాంత్వనము ఒక గొప్ప శృంగార ప్రబంధ కావ్యము. అలిగి కోపముతో ఉన్న రాధను కృష్ణుడు బుజ్జగించడము ఈ కావ్య ఇతివృత్తము. దీనికి యిళా దేవీయము అని కూడా పేరుకలదు. చిన్ని కృష్ణునికి అకింతమైన ఈ గ్రంధములో నాలుగు భాగములలో 584 పద్యములు కలవు. ముద్దుపళని యొక్క వర్ణనా శైలిని అనుకరించి నంది తిమ్మన పారిజాతాపహరణము రచించాడని ఒక ఆలోచన కలదు.
ముద్దుపళని యొక్క కవితా జాలమునకు ఒక మచ్చుకైన ఉదాహరణ
శౌరిని బిల్వగా జనిన చక్కని కీరమదేల రాదొయే
దారిని జన్నదో నడుమ దారెనో చేరెదొలేదొ గోపికా
జారుని గాంచెనోకనదొ చక్కగ నావెతవిన్నవించెనో
సారెకులేక శౌరినుడి చక్కెరయుక్కెఋఅ మెక్కిచిక్కెనో
                -- రాధికా సాంత్వనము 2-104.
ముద్దుపళని గొప్ప విష్ణు భక్తురాలు. ఈమె గోదాదేవి రచించిన తిరుప్పావై లోని 30 పాశురాలలో పదింటిని తెలుగులోకి అనువదించి సప్తపది అని నామకరణము చేసినది. వైష్ణవులు ధనుర్మాసములో సప్తపదిని పఠిస్తారు.

పసుపులేటి రంగాజమ్మ
17వ శతాబ్దమునకు చెందిన తెలుగు కవయిత్రి.
రంగాజీ అనికూడా పిలవబడే రంగాజమ్మ, ఒక దేవదాసి కుటుంబములో పసుపులేటి వెంకటాద్రి మరియు మంగమాంబ దంపతులకు జన్మించినది. ఈమె 1633 నుండి 1673 వరకు తంజావూరు ను పరిపాలించిన విజయరాఘవ నాయకుని భోగపత్ని మరియు ఆయన ఆస్థానములో కవయిత్రి.
రంగాజమ్మ మన్నారు దాసవిలాసము అనే కావ్యము రచించినది. ఈమె అనేక యక్షగానములను కూడా రచించినది.
ఒక చాటువు విజయరాఘవనాయకుని భార్య, తనభర్తకు ఉంపుడుకత్తెగా ఉన్న రంగాజమ్మకు, తన భర్తను తనకు వదలివేయవలసినదిగా అభ్యర్థిస్తూ, పంపిన రాయబారానికి, సమాధానము గా రంగాజమ్మ పంపినదని చెప్పబడుతున్న పద్యం:
ఏ వనితల్ మముందలుపనేమిపనో తమరాడువారుగా
రో, వలపించునేర్పెరుగరో,తమకౌగిలిలోననుండగా,
రావదియేమిరా విజయరాఘవ యంచిలుదూరి
బలిమి మై, తీవరకత్తెనై, తీసుకవచ్చితినాతలోదరీ

ఒక నింద

తుది దినములలో, విజయరాఘవనాయకుడు, తనకు సోదరుని వరుస అని తెలిసి, రంగాజమ్మ ఆత్మహత్యకు పాల్పడినదని ఒక కథ వాడుకలో ఉన్నది.

రచనలు


  • మన్నారు దాస విలాసము
  • ఉషా పరిణయము
  • రామాయణ సంగ్రము
  • భారత సంగ్రహము
  • భాగవత సంగ్రహము

మన్నారు దాస విలాసము

ప్రాకృతనాటకమనబడు ఈ యక్షగానం మన్నారు దాస విలాసము రంగాజమ్మ రచించినది. దీనిని 1926లో ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రచురించింది.

మధురవాణి
తంజావూరును పరిపాలించిన రఘునాథ నాయకుని ఆస్థానములో విదుషీమణులలో ఒకరు. "శుకవాణి" అని ఈమె మొదటి పేరు . సంస్కృతములో సుందరకాండ వరకు రామాయణాన్ని రచించింది. ఇది సంపూర్ణముగా లభించలేదు. 1500 శ్లోకములుగల 14 సర్గల గ్రంధము మాత్రమే లభించుచున్నది. రామాయణ సారా కావ్య తిలకము 9 సర్గాంత గద్యలలో" మధురైక ధురంధరాంద్ర కవితా నిర్మాణ సమ్మాన్యయా" అని ఈమె చెప్పుకున్నది.

భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించినాడు. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. (కబీర్ దాసు గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కథ యున్నది)

వాగ్గేయకారులలో ఆధ్యుడు

శ్రీ రాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తమ శేషజీవితమును గడిపాడు. త్యాగరాజాదులకు అతను ఆద్యుడు, పూజ్యుడు. త్యాగరాజు కీర్తన - "ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది విన్నానురా రామా?" - ఇంకా ప్రహ్లాదవిజయములో "కలియుగమున వర భద్రాచలమున నెలకొన్న రామచంద్రుని పాదభక్తులకెల్ల వరుడనందగి వెలసిన శ్రీరామదాసు వినుతింతు మదిన్" - అన్నాడు.

చేమకూర వెంకటకవి
నాయకరాజుల్లో ముఖ్యుడు, సాహితీప్రియుడైన రఘునాథనాయకుని కొలువులో ప్రముఖ కవి. దక్షిణాంధ్ర సాహిత్య యుగంలో చేమకూర వెంకటకవిది ముఖ్యస్థానం.

జీవిత విశేషాలు

చేమకూర వెంకట కవి కాలం క్రీ.శ.1630 ప్రాంతం. తంజావూరు నాయకరాజులలో ప్రసిద్దుడగు రఘునాథరాజు ఆస్థానంలో ఈ సరసకవి ఉండేవాడు. ఈ కవి వృత్తి రిత్యా రఘునాథుని వద్ద, క్షాత్ర ధర్మం నిర్వర్తిస్తూ రాజు సైనికులలోనో, సైనికాధికారులలోనో ఒకరిగా ఉండేవారు.

రచనలు

చేమకూర వెంకటకవి సారంగధర చరిత్ర, విజయవిలాసం రచించారు. ఆయన రచనల్లో విశిష్టమైన విజయవిలాసాన్ని అర్జునుడి(విజయుని) తీర్థయాత్ర, మానవ, నాగ కన్యలను అయన వివాహం చేసుకోవడం ఇతివృత్తంగా రచించారు.

శైలి

ప్రబంధయుగాన్ని దాటి దక్షిణాంధ్రయుగంలోకి సాహిత్యం అడుగుపెట్టాకా ఆ శైలిలో అత్యున్నత స్థాయిని అందుకున్న కవి చేమకూర వెంకన్న. ఆశ్చర్యకరమైన, అద్భుతమైన చమత్కారాలతో కళ్లు మిరుమిట్లుగొలిపేలా చేస్తారంటూ ఆయన శైలిని ప్రముఖ సాహిత్యవేత్త బేతవోలు రామబ్రహ్మం ప్రశంసించారు.

ప్రఖ్యాతి

చేమకూర వేంకటరాజకవిని, అతడు వ్రాసిన ప్రబంధరాజాలు విజయవిలాసం, సారంగధర చరిత్రలను నోరార ప్రశంసించని కవులుగాని, పండితులుగాని, విమర్శకులుగాని ఈ మూడువందల యాభై సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో ఎవ్వరూ లేరని నిరాఘాటంగ చెప్పవచ్చు. కొందరు చేమకూర పాకాన పండిందన్నారు. ఇంటిపేరు నసగా ఉన్నా కవిత్వం పసగా ఉందన్నారు కొందరు. చక్కెరమళ్ళలో అమృతం పారించి పండించిన చేమకూర అని ఒకరు అన్నారు. ఇంకొకరు కడుంగడుం గడుసువాడు అని మెచ్చారు.
కందుకూరి వీరేశలింగము "అచ్చ తెలుగు పదములను పొందికగ గూర్చి కవనము చెప్పు నేర్పు ఈ కవికి కుదిరినట్లు మరియొక కవికి కుదిరిందని చెప్పవనలు వడదు ...పింగళ సూరనార్యుని ప్రభావతీ ప్రద్యుమ్నమునకు తరువాత విజయవిలాసము సర్వ విధములచేతను తెలుగులో శ్లాఘ్య కావ్యముగ నున్నది, జాతియాది చమత్కృతినిబట్టి విజయవిలాసమే శ్లామ్యతరమయినదని అనేకు లభిప్రాయపడుచున్నారు" అన్నారు. కృతిపతి రఘునాథనాయకుడు "ప్రతి పద్యంలోనూ చమత్కృతి ఉండేట్టు రచించా"వని చేమకూర వెంకన్నను ప్రశంసించారు.

కర్ణాటక సంగీతంలో పేరెన్నికగన్న వాగ్గేయకారులలో క్షేత్రయ్య (1595-1660) ఒకడు. ఈయన అసలు పేరు మొవ్వా వరదయ్య గా భావిస్తున్నారు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు క్షేత్రజ్ఞుడనే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్య గా మారింది.
క్షేత్రయ్య జీవితకాలం 1595 - 1660 మధ్యకాలం కావచ్చును. ఇతని అసలుపేరు "వరదయ్య". ఇంటిపేరు "మొవ్వ". క్షేత్రయ్య పదాలలోని "వరద" అనే ముద్ర స్వనామ ముద్రగా భావించి అతని అసలుపేరు 'వరదయ్య'గా నిర్ణయించారు. ఇతని జన్మ స్థలం ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌లోని, కృష్ణా జిల్లాలో మొవ్వ గ్రామం. ఆ వూరిలో వెలసిన వేణుగోపాల స్వామి అతని ఇష్టదైవం.

క్షేత్రయ్య పద విశిష్టత

మాట, పాటలను స్వతంత్రంగా రచించగలిగినవారినే వాగ్గేయకారులు లేదా బయకారులు అన్నారు.
భక్తుడు తనను నాయికగా భావించి భగవంతుని పొందుకోసం చెందే ఆరాటమే మధుర భక్తి. ఇలాంటి మధుర భక్తి ప్రబలంగా ఉన్న 17 వ శతాబ్దం లో క్షేత్రయ్య జీవించాడు. పదకవితలకు ఆద్యుడిగా క్షేత్రయ్యను భావిస్తున్నారు. ఆయన పదకవితలు నేటికీ సాంప్రదాయ నృత్యరీతులకు వెన్నెముకగా నిలిచి ఉన్నాయి. ఆయన 4,500 కు పైగా పదాలు రచించాడు అని "వేడుకతో నడుచుకొన్న విటరాయుడే" అనే పదం వలన తెలుస్తున్నది. వాటిలో 1,500 పదాల వరకు గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్ షా కు అంకితమిచ్చాడు. ఈనాడు మనకు 330 పదాలు మాత్రమే లభిస్తున్నాయి.

క్షేత్రయ్య పదాలలో లలితమైన తెలుగుతనంతో పాటు చక్కని అలంకారాలు మరియు జాతీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. సంగీతానికి, సాహిత్యానికి సరైన ప్రాధాన్యము యిచ్చిన పదకర్తగా ఆధునికులు క్షేత్రయ్యను మిక్కిలి ప్రశంసించారు.
డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి తన రచనలో క్షేత్రయ్య పదాలకు ఈ విశిష్టతలు ఉన్నాయని వివరించింది -
  • భావ విస్తృతికి అనువైన రాగ ప్రస్తారం.
  • క్షేత్రయ్య పదాలకు సంగతులు పాడే అలవాటున్నది.
  • ఈతని పదాలు రాగ భావ పరిపూరితాలు. రాగాలను భావానుగుణంగా ప్రయోగించడం తెలిసిన సంగీతజ్ఞుడు క్షేత్రయ్య. ఈయన తన పదాలలో షుమారు 40 రాగాలను ఉపయోగించాడు. త్రిపుట తాళంలో ఎక్కువ పదాలు పాడాడు.
  • క్షేత్రయ్య పదాలు ఎక్కువగా అభినయం కోసం ఉద్దేశింపబడినవి. వీనిలో నృత్తానికి అవకాశం తక్కువ.దృశ్య యోగ్యాలైన శబ్దాలను ఎన్నింటినో చక్కగా వాడాడు.మూర్తి వర్ణన కూడా చాలా చక్కగా చేశాడు.
  • ఒక్కమాటలో చెప్పాలంటే క్షేత్రయ్య పదం దృశ్య శ్రవణ సమసంబంధి! కళాహృదయ చైతన్య గ్రంధి! సంగీత సాహిత్య అభినయాలకు సముచిత ప్రాధాన్యత ఉన్న పదకవితలను రచించి క్షేత్రయ్య తరువాతివారికెందరికో మార్గదర్శకుడైనాడు.



మచ్చుకు ఒక ఉదాహరణ చూద్దాం
ఆనంద భైరవి రాగం - ఆదితాళం
పల్లవి:
శ్రీపతి సుతు బారికి నే-నోపలేక నిను వేడితే
కోపాలా? మువ్వ గోపాలా?

అనుపల్లవి:
ఏ ప్రొద్దు దానింటిలోనే-కాపైయుండి నీ సరస స
ల్లాపాలా? మువ్వ గోపాలా?

చరణాలు:
పైపూత మాటలు నేర్ప-జూపుదాని రతిపై నింత
తీపేలా? మువ్వ గోపాలా?

చూపుల నన్యుల దేరి-చూడని నాతో క
లాపాలా? మువ్వ గోపాలా?

నా పొందెల్ల దానికబ్బి-యే పొందును లేక యుసురనుటే
నా పాలా? మువ్వ గోపాలా?
ఇలా చెప్పుకుంటు పోతుంటే అంతు లేని మహా సాగరం ఈ సాహితీ సంద్రం... ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

ఏక్ తారలు....!!

19/2/15
1. వేడుకోలు వీడ్కోలుగా మారితే_ వియోగం వేదనా భరితమే
2. మనిషి నైజం అప్పుడప్పుడూ_సంతోషంలో ఏడిపిస్తూ
3. విరుల వింజామరల తాకిడి_సుమ గంధాల పరిమళాలను వెంట తీసుకెళ్తు
4. నవ్వినా ఏడ్చినా_కరిగేది మట్టిబొమ్మ జీవితమే
5. ఓడినా గెలుపు విరహానిదే_ప్రేమను బంధించి
6. జావళికీ తెలుసు_విరహానికే తన రాగం అంకితమని
7. విరహాన్ని వదలక పొతే_ప్రేమ పాపొద్దెక్కింది రిపోతుంది మరి
8. కన్నుల జతల కాంతిలో_కామిని తళుక్కుమంది
9. మనసులెందుకు కలవడం_జాతకంలో ధనలక్ష్మి చాలు కదా
10. కాలం పరుగులెత్తుతోంది_విరహాన్ని తాళలేక
11. విరహానికి బారెడు పొద్దెక్కింది_ప్రేమలో పడి నిద్దరోతూ
12. ఏడుస్తోంది విరహం_ప్రేమ తనకు వీడ్కోలిచ్చిందని

18, ఫిబ్రవరి 2015, బుధవారం

కన్నీటి నిజాలుగా....!!

దిగులు దుప్పటి పరిచింది ఈ రేయికి
మనసు గుబులు మిణుక్కుమంటోంది
అక్కడక్కడా రాలిపడే చుక్కల్లా

వేసారిన గుండెల్లో వేకువ నిట్టూర్పుల్లో
రాలేని జాబిలి కోసం ఎదురు చూసిన
నిశీధిని చేరలేని వెన్నెల్లా

మౌనమైన మాటల అలజడి రేపిన
గాయం చేసిన జ్ఞాపకం వెన్నాడుతూ
వెదుకుతోంది మది శకలాల్లో

వీడలేని జతను వదలలేని బంధంగా
పెనవేసుకున్న చెలిమి సంతకాలను
చెరిపివేస్తూ మిగిల్చిన సాక్ష్యాల్లో

దురాన్ని దగ్గర చేయలేని వాస్తవమై మిగిలి
గతపు మనసు పుటలను మూసివేయలేక
కన్నీటి నిజాలుగా కనుకొలుకుల్లో

అక్షరాలై చెంతను చేరి ఆర్తిగా ఆదుకుంటూ
పంచుకుంటున్న భావాల స్నేహం నుంచి 
అలఓకగా జారిన ఈ సిరాక్షరం మది ముంగిల్లో....!!

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

శూన్యం....!!

మనసు మెదడుకు పంపే నిశబ్ద నాద సంకేతం 
ఒక్కసారిగా మూగబోయి చలన రహితమయ్యి
ఎద పొరల్లో అంతులేని ఆలోచనా ప్రవాహాలు
మూకుమ్మడిగా దాడి చేసి యుద్ధం ప్రకటిస్తే
తట్టుకోలేని గుప్పెడు గుండె బావురుమంటూ
మది తరంగాలను మెదడుకు తర్జుమా చేయలేక
స్తబ్దుగా ఉండిపోతే....
ఆ ఘడియలో నన్ను నేను మరచిన మరో కొత్త ప్రపంచం
నాకే తెలియని వింతల విడ్డూరాల ఆవిష్కరణలు
పదే పదే తొలిచే గత జ్ఞాపకాలు లేవు దానిలో
భవిష్యత్తును గురించిన చింత అసలే లేదు
బతికి ఉన్నా బతుకంటే తెలియని భార రహిత స్థితి
అదే నా లోకమనుకొంటుంటే...
మళ్ళి జనారణ్యంలోనికి పొమ్మంటు విసిరేసింది
భవ బంధాలు లేని శూన్యమే బహు ముచ్చటగా ఉందంటే
కాదు కాదంటూ అనుబంధాల సంకెళ్ళు వేసి
ఆత్మీయతలను అందుకొమ్మంటూ బుజ్జగిస్తూ
శూన్యాన్ని చుట్టి వద్దామని నే వెళితే నన్నే తిప్పి పంపేసింది...!!

ఏక్ తారలు.....!!

16/2/15
1. కలానికి కోపం వస్తే_కాలాన్ని కూడా గడ గడలాడిస్తుంది
2. నిద్ర లేచినప్పుడు_కలలు రానని మోరాయించాయేమో
3. అమ్మ ప్రేమ_బిడ్డలకెప్పుడు రక్షక కవచమే
4. మరో సూర్యోదయానికి చూడక_నాటకానికి స్వస్తి పలికి వాస్తవమైతే పోలా
5. అభిమానంతో అందర్నీ నువ్వే తీసేసుకుంటే_మా సంగతేంటి మరి
6. మనసు మౌనంగానే ఉంటుంది ఎప్పుడు_తేడా వస్తేనే కకావికలమౌతుంది

16, ఫిబ్రవరి 2015, సోమవారం

ఏక్ తారలు...!!

13/2/15
1. నా అను'రాగం' ఎప్పుడు నీదేగా_అనుమానంతో అంకితాన్ని నిరాశ పరచనేల
2. చదువుల బడి ఒడి ఖాళీ_ఆకలి కేకల మధ్యన అల్లాడుతున్న బాల్యాన్ని చేరదీయ లేక
3. నీ పిలుపులో చోటీయరాదు_నేను తోడొస్తా

14, ఫిబ్రవరి 2015, శనివారం

ఇదేగా మన జీవితం నేస్తం....!!

నేస్తం....
        అందరు ప్రేమ కోసం పరుగులెత్తిన రోజుల్లో ప్రేమంటే తెలియదు... కావాలని అనిపించలేదు అప్పుడు... అన్ని ప్రేమలు అందుకున్న ఆత్మీయతలో... ఇప్పుడేమో ఏ ప్రేమా వద్దని వారిస్తోంది మనసు.. బాధ్యతలను మాత్రమే గుర్తు చేస్తూ... ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ముళ్ళ బాటలు... ఇప్పటికి గతపు ముళ్ళను ఏరుకుంటునే... నెత్తుటి చారికలు పేర్చుతున్న జ్ఞాపకాలను అప్పుడప్పుడు అక్షరాలుగా వెదజల్లుతూ కాస్త భారాన్ని మనసు నుంచి దించే యత్నం.
       జగమంత కుటుంబం నాది...  ఏకాకి జీవితం నాది...  సంసార సాగరం నాది...  సన్యాసం శూన్యం నాదే.... ఎంత నిజం కదా .. సిరివెన్నెల గారు తన కోసం రాసుకున్న ఈ పాట ఇప్పటికి చాలా మందికి ఇది నా జీవితమే అని అనిపింప చేస్తోంది అంటే ఈ పాట రాసిన శాస్త్రి గారు ధన్యులు... మనం అనుకుంటూ ఉంటాము చాలాసార్లు ఈ రోజు కాకపొతే రేపు మన జీవితంలో గొప్ప మార్పు వచ్చేస్తుంది అని... అలా ఎదురుచూడటం లోనే గడిచిపోతుంది జీవితం అంతా... కనీసం ఒక్కరోజు కూడా మనది అని అనుకోలేనప్పుడు అసలు జీవితానికి అర్ధం ఏమిటి...? ప్రతి క్షణం రేపటి భయంతో బతికేయడమేనా.... లేదా దానికే రేపటి మీద ఉన్న ఆశ అని సర్ది చెప్పుకుంటూ రానంటున్న చిరునవ్వును బలవంతంగా పెదాలపైకి రప్పిస్తూ మనల్ని మనం మోసం చేసుకుంటూ ఆశాజీవులమని మరో నలుగురిని నమ్మించే ప్రయత్నమా... మనసు గాయాలు బాధనే పంచుతాయి కాకపొతే ఆ బాధని కాస్త కన్నీరు తీసుకుంటుంది... ఒక్కోసారి బాధని పంచుకోవడానికి మనకు తీరిక లేనట్లే దానికి తీరిక ఉండదు... అలా అలా పేరుకున్న బాధ బడభానలంలా మదిలోనే దాగుండి పోతుంది... ఎప్పుడో ఒకప్పుడు ఉప్పెనై ముంచుతుంది లేదా తనలో తనే కాలిపోతుంది పరిష్కారం తెలియక... రెప్ప మూసుకుపోతుంది శాశ్వతంగా.... అక్షరం నిరాశ్రయమై పోయి మూగగా రోదిస్తుంది ఆ క్షణాన... తనతో పంచుకునే అనుబంధం దూరమైందని.... అంతే కాని ఈ ముళ్ళ బంధాలకు ఏ బాధా ఉండదు... హమ్మయ్య ఓ పనై పోయిందని ఊపిరి పీల్చుకుంటూ తమ తమ రోజువారి కార్యక్రమాల్లో మునిగి తేలుతుంటారు... ఇదేగా మన జీవితం నేస్తం....!!
నీ నెచ్చెలి.   

13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

ఈ అక్షరాల.....!!

గుండె గొంతునెవరో గుప్పిట పట్టి
జ్ఞాపకాలను కాల్చేసిన ఆనవాళ్ళు 
మనసుని పిండేస్తుంటే...

ప్రతి క్షణం వెంట పడి తరుముతూ
బంధాలను అదిలించి దారి మళ్ళించి
ఆశను ఎరగా వేస్తూ....

అనుబంధాలను మరో చోటుకి బదలాయించి
ఆత్మీయతకు అగ్గిపుల్లతో వెలిగించిన మంటలలో
హృదయపు నెగడు మండుతూ....

సగం ఎండిన వేపచెట్టు నీడలో సేదదీరుతూ
గతించిన జీవితం రాల్చిన కన్నీటి చుక్కల చెమ్మలో 
కనిపించని మలయ సమీరం...

చుక్కల లెక్కల్లా తేలని బాంధవ్యాలు ఎన్నున్నా
వేసారిన మదికి ఊరట అందించే చెలిమి 
ఈ అక్షరాల ఆత్మ బంధమైంది...!!

తెలుగు సాహితీ ముచ్చట్లు ... పంతొమ్మిదవ భాగం....!!

వారం వారం మన సాహితీ ముచ్చట్ల ప్రయాణంలో తెలుగు సాహిత్యపు కవి యుగాలలోని కొన్ని ముఖ్య  ఘట్టాలను  తెలుసుకుంటున్నాము కదా... ఈ వారం తెలుగు వైభవానికి స్వర్ణ యుగమైన రాయల వారి యుగం గురించిన వివరాలు, ప్రబంధం గురించి సంక్షిప్తంగా చూద్దాం..మన అందరం విని ఉన్నాము.. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో రత్నాలు రాశులుగా పోసి వీధుల్లో అమ్మేవారని... రాయలవారి ఆస్థానమైన సభా మండపం  భువనవిజయమన్న పేరుతో అష్టదిగ్గజాలతో విలసిల్లేదని చతురోక్తుల తెనాలి రామకృష్ణ కవి చెప్పిన పద్యం తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో ... "మేక తోక పద్యం"... కాస్త లోతుగా చరిత్ర వివరణలోనికి వెళ్తే....

1500-1600 : రాయల యుగము దీనినే "ప్రబంధ యుగము" అని కూడా అంటారు. విజయనగర చారిత్రక శకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యద తో ప్రబంధం అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాల తో ఆయన ఆస్థానం శోభిల్లింది.
పదహారవ శతాబ్దంలో విజయనగర శ్రీ కృష్ణదేవరాయల పాలనా కాలంలో తెలుగు వైభవంగా వెలిగింది. తెలుగు పండితులను పోషించుటే కాక స్వయంగా తాను కూడా తెలుగులో రచనలు చేసిన సవ్యసాచి, రాయలు.
పదిహేనవ శతాబ్దంలో ప్రారంభమైన ప్రబంధ యుగము తరువాత రెండు శతాబ్దాలు తెలుగు సాహితీ జగత్తును ఏలింది
శ్రీ కృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. సాళువ నరసనాయకుడి వద్ద మహాదండనాయకుడుగా పనిచేసిన తుళువ నరసనాయకుని మూడవ కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు. నరసనాయకుడు పెనుకొండలో ఉండగా, రెండవ భార్య నాగలాంబకు జన్మించాడు కృష్ణదేవరాయలు. ఈయన పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుడు గా మరియు కన్నడ రాజ్య రమారమణుడిగా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.రాయలు, తుళువ నరస నాయకుని రెండవ భార్య అయిన నాగలాంబ (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలు నూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు. రాయలు తల్లి నాగలాంబ గండికోట ను పాలించిన పెమ్మసాని నాయకులు ఆడపడుచు. 240 కోట్ల వార్షికాదాయము కలదు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.

సాహిత్య పోషణ

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, మదాలసాచరితము, సత్యవధూపరిణయము, సకలకథాసారసంగ్రహము, జ్ఞానచింతామణి, రసమంజరి తదితర గ్రంథములు, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు రేడ నేను తెలుగొకొండ ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి దేశభాష లందు తెలుగు లెస్స అన్న పలుకులు రాయలు వ్రాసినవే. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువనవిజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.

భక్తునిగా

తిరుమలవెంకన్న ఆలయంలో సతీసమేతుడైన కృష్ణదేవ రాయలు
కృష్ణదేవ రాయలు తక్కిన విజయనగర రాజులలాగే వైష్ణవుడు. కానీ పరమతసహనశీలుడు. అనేక వైష్ణవాలయాలతో పాటు శివాలయాలను నిర్మించినాడు. అంతేకాక ధూర్జటి, నంది తిమ్మన వంటి పరమశైవులకు కూడా తన సభలో స్థానం కల్పించాడు. అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి, అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు.

నిర్మాణాలు

ఈయన చెన్నకేశవస్వామి వారి దేవాలయం కట్టించాడు.

కుటుంబము

కృష్ణదేవ రాయలుకు తిరుమల దేవి, చిన్నాదేవి ఇద్దరు భార్యలని లోక విదితము. కానీ, ఆముక్తమాల్యద ప్రకారం ఈయనకు ముగ్గురు భార్యలు (తిరుమలాదేవి, అన్నపూర్ణ మరియు కమల). కృష్ణదేవరాయలు విజయనగర సామంతుడైన శ్రీరంగపట్నం రాజు కుమార వీరయ్య కూతురు తిరుమలాదేవిని 1498లో వివాహం చేసుకున్నాడు. పట్టాభిషిక్తుడైన తర్వాత రాజనర్తకి అయిన చిన్నాదేవిని వివాహమాడాడని న్యూనిజ్ వ్రాశాడు. ప్రతాపరుద్ర గజపతి ని ఓడించి, ఆయన కూతురైన తుక్కా దేవి ని మూడవ భార్యగా స్వీకరించాడటనటానికి చారిత్రకాధారాలున్నాయి. ఈమెనే కొందరు లక్ష్మీదేవి అని, జగన్మోహిని అని కూడా వ్యవహరించారు. చాగంటి శేషయ్య, కృష్ణరాయలకు అన్నపూర్ణమ్మ అనే నాలుగవ భార్య ఉందని భావించాడు. కానీ, చిన్నాదేవే అన్నపూర్ణమ్మ అని కొందరి అభిప్రాయం. డొమింగో పేస్ ప్రకారం కృష్ణరాయలకు పన్నెండు మంది భార్యలు. కానీ అందులో తిరుమలాదేవి, చిన్నాదేవి, జగన్మోహిని ప్రధాన రాణులని చెప్పవచ్చు. అయితే శాసనాల్లో ఎక్కువగా ప్రస్తావించబడిన తిరుమలాదేవి పట్టపురాణి అయిఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం ఇద్దరు కుమార్తెలు, వారిలో పెద్ద కూతురు తిరుమలాంబను ఆరవీడు రామ రాయలకు, చిన్న కూతురును రామ రాయలు సోదరుడైన తిరుమల రాయలుకు ఇచ్చి వివాహం చేసాడు. ఒక్కడే కొడుకు, తిరుమల దేవరాయలు. ఇతనికి చిన్న తనంలోనే పట్టాభిషేకం చేసి, తానే ప్రధానిగా ఉండి రాజ్యవ్యవహారాలు చూసుకునేవాడు. కాని దురదృష్టవశాత్తూ తిరుమల దేవ రాయలు 1524 లో మరణించినాడు. ఈ విషయంపై కృష్ణ దేవ రాయలు తిమ్మరుసు ను అనుమానించి, అతనిని గ్రుడ్డివానిగా చేసాడు. తానూ అదే దిగులుతో మరణించినాడని ఓ అభిప్రాయము. మరణానికి ముందు చంద్రగిరి దుర్గమునందున్న సోదరుడు, అచ్యుత రాయలు ను వారసునిగా చేసాడు.

కులము

శ్రీ కృష్ణదేవ రాయలు ఏ కులానికి చెందిన వాడన్న విషయంపై ఇతర కులాలవారి మధ్య అనేక వాదోపవాదాలున్నాయి. ఈయన కాపు, బలిజ, గొల్ల, బోయ కులాలకి చెందిన వాడని ఆయా కులాల వారు చెప్పుకుంటారు. ఇతని తండ్రియైన తుళువ నరస నాయకుడు చంద్ర వంశపు క్షత్రియుడు అని పలు కవులు వ్రాసిన పద్యములు నిరూపించుచున్నవి. ఇప్పటికీ వీరి మూలాలు దక్షిణ భారతదేశమంతటా ఉన్నాయి.

సమకాలీన సంస్కృతిలో

శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యం నేపథ్యంగా తెలుగులో అనేక సినిమాలు విడుదలైనవి. అందులో కొన్ని మల్లీశ్వరి, మహామంత్రి తిమ్మరుసు, తెనాలి రామకృష్ణ మరియు ఆదిత్య 369

ప్రబంధ యుగము

తెలుగు కవిత్వంలో 15వ శతాబ్ది నాటికి అభివృద్ధి చెందిన ప్రక్రియా భేదం ప్రబంధం. ప్రకృష్టమైన పదబంధమున్న కావ్యం ప్రబంధము.
ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో తిక్కన తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. ఎర్రనకు 'ప్రబంధ పరమేశ్వరుడు' అనే బిరుదు ఉన్నది. అయితే ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉన్నది. నన్నెచోడుడు అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక కుమార సంభవంలో అనేక వర్ణనలు చేశాడు. శ్రీనాథుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి. అల్లసాని పెద్దన మనుచరిత్ర రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది.
పెద్దన రాసిన మనుచరిత్ర బహుళ ఆదరణ సంపాదించి ప్రక్రియగా ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టింది. వచ్చిన వసుచరిత్ర మనుచరిత్రకు మించిన కవిత్వం కలిగిన కావ్యమనే పేరు సంపాదించింది. తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మహత్మ్యం, పింగళి సూరన కళాపూర్ణోదయం, చేమకూర వెంకటకవి రాసిన విజయవిలాసం వంటివి ప్రబంధాలుగా ప్రసిద్ధి పొందాయి.

లక్షణాలు

ప్రబంధ లక్షణాలను పలువురు విమర్శకులు ఇలా వివరించారు.
  • పింగళి లక్ష్మీకాంతం: ప్రబంధమునకు ఏక నాయకాశ్రయత్వము, దానితోపాటు వస్త్వైక్యము ప్రధాన ధర్మములు. ప్రబంధము అష్టాదశ వర్ణనాత్మకమై యుండవలెను. అందు శృంగారము ప్రధాన రసము. ఆవశ్యకతను బట్టి తక్కిన రసములు గౌణములు కావచ్చును. ఆలంకారిక శైలి ప్రబంధమునకు జీవము. ప్రబంధము భాషాంతరీకరణము కాకూడదు. స్వతంత్ర రచనయై యుండవలెను. పదునారవ శతాబ్ది ఆది నుండీ వెలువడిన మనుచరిత్రాది కావ్యములన్నిటికి పైన పేర్కొన్న లక్షణములన్నియు సమగ్రముగా పట్టినను, పట్టకున్నాను, స్వతంత్ర రచనలగుట చేతను, ఆలంకారిక శైలీ శోభితములగుట చేతను అవన్నియు ప్రబంధములుగానే పరిగణింపబడినవి. 
  • కాకర్ల వెంకట రామ నరసింహము: కథైక్యమును అష్టాదశ వర్ణనలును గలిగి శృంగార రస ప్రధానమై, అర్థాతిశాయియైన శబ్దమును గ్రహించి యాలంకారిక సాంకేతికములకు విధేయమై, ఆనాటి విస్తృతిగల యితివృత్తముతో, భాషాంతరీకరణముగాక, స్వతంత్రరచనయేయైన తెలుగు కావ్యము ప్రబంధము. అయితే పైని వివరించిన లక్షణములు కొన్ని ప్రబంధములందు గానరాకున్నను నాయా యుగధర్మ ప్రాధాన్యము బట్టియు, రచనా ధోరణి బట్టియు నవియు బ్రబంధనామముననే వ్యవహరింపబడుచున్నవి.
  • దివాకర్ల వేంకటావధాని: ధీరోదాత్త నాయకములును, శృంగార రస ప్రధానములును, పంచమాశ్వాస పరిమితములును ఐన కావ్యములు ఆలంకారిక శైలిలో వ్రాయబడినవి- వీటికే ప్రబంధములని పేరు.
  • సి.నారాయణరెడ్డి: ప్రబంధము యొక్క లక్షణములు నాలుగు.
ఒకటి: కథానాయకుని యొక్క తృతీయ పురుషార్థమునకు(కామమునకు) చెంది ప్రాయికముగా తద్వివాహ సంబంధియగుట.
రెండు: శృంగారము అంగీరసముగా నుండుట.
మూడు: వర్ణన బాహుళ్యము కలిగియుండుట.
నాలుగు: రీతి ప్రాధాన్యము కలిగి యుండుట.
  • వేల్చేరు నారాయణరావు: పురాణమార్గం కథనమార్గం, ప్రబంధమార్గం వర్ణనమార్గం. ప్రబంధానికీ, పురానానికి తేడా కథనం వర్ణన-వీటి ఎక్కువ తక్కువలలో మాత్రమే వుందనే అభిప్రాయం బలపడింది.

చరిత్ర రచనలో

తెలుగు ప్రబంధాలకు అప్పటి స్థితిగతులను కాక కవుల ఊహాలోకాలనే అద్దంపట్టాయన్న అపప్రధ ఉన్నా చాలామంది పండితులు, చరిత్రకారులు వీటికి చరిత్ర రచనలో ఎంత ప్రాధాన్యత ఉందో, ఆనాటి స్థితిగతులు ప్రబంధాల్లో ఎలా ప్రతిబింబించాయో వివరించారు. ప్రబంద యుగంగా వర్దిల్లిన విజయనగర సామ్రాజ్య కాలంలోని ఆచారాలు, వ్యవహారాలు, జీవనశైలి వంటివాటికి ప్రబంధాలు ప్రతిబింబాలుగా నిలిచాయి. విజయనగర సామ్రాజ్యంలో 15-16 శతాబ్దుల కాలంలో పర్యటించిన పలువురు విదేశీ యాత్రికులు నమోదుచేసిన చరిత్రలో ఏదైనా సంస్కృతికి సరిపోలని విషయం ఉన్నా, స్పష్టత కావాల్సివచ్చినా వారేమి సూచిస్తున్నారో అర్థం చేసుకునేందుకు ప్రబంధాలు పనికివచ్చాయి. ప్రబంధాల్లో జలక్రీడల వర్ణనం, సుగంధ ద్రవ్యాల వినియోగం, వారకాంతల వివరాలు, జాతరలు - మొక్కుబళ్ళు, సైనిక ప్రయత్నాలు వంటివాటి వర్ణనలు సామాజిక చరిత్ర నిర్మాణంలో ఉపకరిస్తున్నాయి.

ఉదాహరణలు

  1. మనుచరిత్ర
  2. సంస్కృతమునందలి మాళ వికాగ్నిమిత్రము
  3. ఆముక్త మాల్యద
  4. నాలాయిర దివ్య ప్రబంధము-తమిళము
  5. ముకుందవిలాసము
  6. వీరభద్ర విజయము
ఇక ఈ వారానికి ముగిస్తూ వచ్చే వారం మరి కొన్ని సాహితీ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం....

సేకరణ : వికీపీడియా నుండి 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner