28, నవంబర్ 2017, మంగళవారం

ఏకాంతం - ఒంటరితనం...!!

నేస్తం,
        ఏకాంతం -  ఒంటరితనం అనేవి ప్రస్తుతం మన అందరితో స్నేహం చేస్తున్న స్నేహితులు. ఏకాంతం కొందరికిష్టమైతే మరి కొందరేమో ఒంటరితనానికి ఏకాంతపు స్నేహాన్ని ఆశిస్తారు. ఒంటరితనం కొందరికి భయాన్ని, బాధను కలిగిస్తుంది. అభద్రతాభావాన్ని ఎక్కువ చేస్తుంది. ఒంటరితనం ఎంత ప్రమాదకారి అంటే ఒక్కోసారి మరణానికి దగ్గరగా తీసుకువెళ్తుంది. కానీ ఏకాంతం అలా కాదు మరణంలో సైతం మళ్ళి బతికితే బావుండుననిపిస్తుంది.
      మన ఒంటరితనానికి కారణం మనమే అవుతున్నాం. మనకంటూ మనం లేనప్పుడు ఒంటరినన్న భావన పొడచూపుతుంది. తన చుట్టూ ఎందరున్నా ఎవరూలేని ఏకాంతానికి చోటిస్తారు కొందరు. మరికొందరేమో తన అన్న బంధాలెన్నున్నా ఎవరూలేని ఏకాకుల్లా ఒంటరిగా మిగిలిపోతారు.కొన్ని స్వయంకృతాపరాధం అయితే మిగిలినవి విధిరాతలని సరిపెట్టేసుకుంటున్నాం.
     ఒంటరితనం శాపమని, జీవితానికి ముగింపని అనుకుంటే మన  చుట్టూ చీకటే ఉంటుంది. ప్రపంచంలో ఒంటరితనమంత పెద్ద శిక్ష మరొకటి లేదనుకునే ముందు భరించలేని ఆ ఒంటరితనానికి కారణాలను తెలుసుకోగలిగితే దాన్ని అధిగమించడం చాలా సులువు. మనకంటూ, మనకోసం ఎవరు ఉండరు మనం తప్ప. మనలోని మనకిష్టం లేని ఒంటరితనం సమస్యను పెంచి పోషించకుండా దాన్ని నాశనం చేయడానికి మన వంతుగా ప్రయత్నించాలి. నాకు తెలిసి ఏకాంతం ఒంటరితనానికి సన్నిహితం. బాధగా కాకుండా ఇష్టంగా భరిస్తే ఒంటరితనమూ ఓ వరమే నువ్వేంటో నీకు తెలియడానికి. ఈ ప్రపంచంలో మనదే పెద్ద కష్టం అనుకుని మన మీద మనమే జాలి పడటం కన్నా దురదృష్టం మరొకటి ఉండదు. ఇష్టంగా భరిస్తే కష్టమూ ఇష్టంగానే ఉంటుంది. ఒక్కసారి అలా అనుకుని చూడండి ఎంత బావుంటుందో మీకే తెలుస్తుంది... !!

జత కలిపేవారెందరు..??

ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ అని గగ్గోలు పెడుతున్నాయి కానీ ఆచరణ ఎక్కడ..? నిన్నటికి నిన్న గన్నవరం దగ్గర శివాలయానికి వెళితే తెలిసిన పెద్దావిడ మా ఇంటికి వచ్చేవరకు ఎంత ఇబ్బంది పడిందో.. అభివృద్ధిలో మునుముందుకు వెళుతున్నాం అని నాయకులు చెప్పుకునే మాటల్లో ఎంత నిజం ఉందనేది తేటతెల్లం అవుతోంది. పార్టీ  ఆఫీసులు,  పబ్బులు, మాల్స్, సినిమా హాల్స్ కాదు సామాన్యులకు కావాల్సింది... ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసి మనం ఏం చేయాలన్నది ఆలోచించండి. ఎవరో వస్తారని ఎదో చేస్తారని ఎప్పటిలాగే ఎదురుచూసి మోసపోవద్దు. ఏ రాజకీయపార్టీ ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపదు, నిధులు స్వాహా చేయడం తప్ప....
దయచేసి మానవతా భావంతో ఈ సమస్యకు పరిషారాన్ని చూపండి. సుందర్ మోహన్ గారు ట్రస్ట్ ప్రారంభించి ప్రతి ఊరికి కట్టిద్దాం అంటున్నారు. తన వంతుగా 5000 రూపాయలు ఇస్తాను అని కూడా అంటున్నారు. మొదటి అడుగు పడింది. మరి ఆ అడుగులో జత కలిపేవారెందరు..??

https://www.facebook.com/jordarpori/videos/523662558010068/

27, నవంబర్ 2017, సోమవారం

సహజత్వమైన నటన...!!

నేస్తం, 
          సూక్తిముక్తావళి సూక్తులు చాలా ఎక్కువై, మనం పెట్టే సూక్తులు మనకే వర్తిస్తున్నాయని మర్చిపోతూ మనమూ గురువింద గింజలమై పోతున్నాం. మనలో సహజత్వమైన నటన సహజాతంగా మనతో కలిసిపోయిందని ఇతరులు గుర్తించరని అనుకుంటే అది పొరబాటే. మనం మంచివాళ్ళం అని నలుగురు గుర్తించడానికి మనతోనే ఉన్నవారిని అల్లరిపాలు చేయడం, లేనిపోని నిందలు వేయడం, అవాకులు, చవాకులు పేలడం వంటి పనులు ఎంత వరకు సబబు...? 
          వ్యక్తిత్వం పుట్టుకతోను, పెరిగిన పరిసరాల నుంచి మనకు ఆభరణంగా వస్తుంది. మన చుట్టూ వెన్నెలే చిమ్ముతున్నామని మనమనుకుంటే సరిపోదు, చీకటి నుంచి ఆ వెన్నెలను అనుభూతించే వాళ్లకు తెలుస్తుంది ఆ చల్లదనం. జీవితం విలువ తెలిసినవాళ్ళు ఇతరుల జీవితాలను నవ్వులపాలు చేయడానికి ప్రయత్నించరు. విలాసాలు, విందులు జీవితం కాదు, మనలని నమ్మినవాళ్లకు నేనున్నానన్న భరోసా ఇవ్వగలిగితే ఆ నమ్మకానికి వెల కట్టలేము. బంధం అనేది బలీయంగా ఉండాలి కానీ భరించలేనిదిగా ఉండకూడదు. ఆచరణ లేని సూక్తిముక్తావళి అసహ్యంగా ఉంటుంది. అభిమానం అనేది డబ్బుతో కొనేది కాదు, మనసుతో ముడిపడేది. నిజాయితీగా బతకాలంటే చాలా ధైర్యం కావాలి, సమయమూ ఉండాలి కానీ ఆ నిజాయితీని కోల్పోవడానికి ఒక్క క్షణం కానీ, ఓ మాట కానీ చాలు. నమ్మకం పోయిన తరువాత మళ్ళి ఎన్ని జన్మలు ఎత్తినా రాదు. మన పెద్దలు చెప్పినట్లు కాలు జారితే తీసుకోగలం కానీ మాట జారితే వెనక్కు ఎలా తీసుకోగలం..? 
          మనసులతోనూ, మనుష్యులతోను బంధాల పేర్లు, స్నేహ సంబంధాల ముసుగులు వేసి వక్ర భాష్యాలతో మంచితనంగా నటిస్తూ మోసాలు చేస్తున్న ఎందరో మహానుభావులందరికి మా పాదాభి వందనాలు. కాని ఒకటి మాత్రం మర్చిపోకండి ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీమీదే పడుతుందని తెలుసుకోండి చాలు...!!

26, నవంబర్ 2017, ఆదివారం

నాలోని నువ్వు పుస్తక సమీక్ష...!!

         సాహిత్యంతో గత 20 ఏళ్లుగా అనుబంధం ఉన్న సాహితీవేత్త శ్రీ మహిది ఆలీ గారు. కథా రచయితగా,
నవలాకారునిగా సాహితీ లోకానికి చిరపరిచితులు. వీరి మనసు నుంచి జారిపడిన అక్షరాల కవితా ప్రవాహం " నాలోని నువ్వు" గా మనముందుకు వచ్చింది. ఈ కవితాసంపుటి గురించి సమీక్ష రాయడం ఆంటే అది నాకు చేతగాని పనే. ఎదో నాలుగు మాటలు నాకు తోచిన విధంగా మీ ముందుంచుతున్నాను.
       ఈ సృష్టిలో అనిర్వచనీయమైన అవ్యక్తానుభూతి ప్రేమని ఆహ్లాదంగా, అందంగా తన అక్షరాల్లో పొందుపరచి మనముందుంచారు ఆలిగారు. నువ్వొక్కదానివే వెళ్ళిపోతే నా జీవితమేమి శిశిరమైపోదు, కానీ వసంతం కూడా ఇక నా దరికి రాదు అంటూ నాలోని నీకై అన్న చిన్న కవితలో నువ్వులేని నేను లేను అంటూ ఎంత గొప్పగా చెప్పారో. నీ  కోసంలో రెండు విషయాలే అంటూ ఓ ప్రేమికుడి ఆత్మానందాన్ని మనకు చాలా అలవాటైన పదాల్లోనే పరిచయం చేశారు. ఇంతవరకు తీయనిది.. తీస్తే తీయనైనది.. ని మనసులో నాపై ఉన్న భావం అని అందమైన భావంలో ప్రేమతత్వాన్ని బహు చక్కగా చెప్పారు. ఇలానే చూడలేమా అన్న కవితలో కూడా తన భావుకత్వాన్ని ప్రేమ పరిపూర్ణత్వాన్ని పలికించారు. నక్షత్రాలను లెక్కబెడుతూ ఉండు .. మళ్ళి వస్తానని చెప్పి వెళ్లిన నేస్తపు నిష్క్రమణాన్ని ఎంత నిశ్శబ్దంగా వెళ్ళిపోయావు నేస్తమా లో చదువుతుంటే మనసు ఓ అలౌకిక లోకములోనికి వెళ్ళిపోతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎ భావాలైతే పెదాలు చెప్పలేవో ఏవ్ కన్నీరు అవుతాయి అని కన్నీళ్లకు ఓ సరి కొత్త భాష్యాన్ని చెప్పారు. నీకెలా చెప్పనూ లో సముద్రపు సాంద్రతతో ప్రేయసిని పోల్చడంలో మనకు అక్షరాలను ఆపాదించిన అలంకారాలను నిజాయితీగా తన మనసులో జనించిన భావాలకు జీవం పోశారు. నువ్వుండకపోవచ్చు అనుక్షణంలో నువ్వు నాతోలేని శూన్యాన్ని నీ జ్ఞాపకాల  నింపుకోవడానికి తపన పడుతున్నానంటారు. నువ్వొక్కదానివే వెళ్ళిపోతే ఎవరు నాతో లేకపోయినా నువ్వుంటే చాలు అనుకునే అమాయకత్వాన్ని అద్భుతంగా చెప్పారు. ఇక తెలిసిందిలేలో ప్రేయసి మనసు గెలిచిన సంతోషాన్ని అందించారు. నా హృదయాన్ని స్పృశించవూ అంటూ చిరు ఆశలని వివరిస్తూ భావాల తడిని మనసు సవ్వడికి ఆపాదించారు. ఆకృతిలో అస్పష్ట జీవితానికి పరిపూర్ణ ఆకృతి ఎలా వస్తుందో మనిషిలోని వివిధ భావాల ముసుగులు పొరల నుంచి పరిణితి చెందిన పూర్ణ వ్యక్తిత్వం ఎలా ఉండాలో వివరించారు. అందాన్ని సరికొత్త కోణంలో చెప్పారు. రా నేస్తమా అంటూ ఇద్దరి మధ్యన సయోధ్యకు సోపానాలు ఏమిటనేది చెప్పారు. అసంకల్పితంగా జరిగే కొన్ని చర్యలను అందరి మనోభావాలేనని చెప్పేసారు. కాగితపు పూలు గురించి చెప్పాలంటే దీని ఒక్కదానికే సమీక్ష రాయాల్సి ఉంటుంది.  నాకు చాలా ఇష్టమైన కవిత ఇది. ప్రేయసికి ఇవ్వడానికి పూలను కానుకగా కోద్దామనుకున్న ప్రియుడికి వినిపించిన ఆధునిక పుష్ప విలాపం అనిపించింది. ప్రతి ఒక్కరు తప్పక చదవాల్సిన అద్భుతం దాగిఉంది ఈ కవితలో. నీ  మనసు, నేస్తమా చూసుకో ,అందం, ఎలా గుర్తుంచుకుంటావు నన్ను, భావ్యం కాదు కదా, స్మృతి మొదలైన కవితల్లో మరపురాని ప్రేయసి జ్ఞాపకాల గురుతులను, పల్లె మనసులో తెలంగాణా యాసలో పల్లె ప్రేమ స్వచ్ఛతను అందించారు. స్వరం, స్మృతులు చెదారావు కదా, నీ మహిమ, అసాధ్యం కదా కవితల్లో తన మది ఆశల రంగుల
కలలను చూపించారు. ప్రేమలో చెప్పిన నాలుగు వాక్యాల్లో ప్రేమలోని గాఢతను చూపించారు. వెళ్లిపోతూ ఉన్నది, నీ  తోనే కదా,  కొన్నిసార్లు, నీ రాక వంటి కవితల్లో కాలాన్ని ప్రేయసి గురుతుల గమనాన్ని అక్షర భావాల్లో ఇముడ్చుతున్నా అని చెప్పడం బావుంది.  మస్త్ యాదికొస్తావే మరో తెలంగాణా మాండలిక కవిత. సాంత్వన, నువ్వెందుకిలా అయ్యావు, ఏమైపోయింది నీకు కవితలలో దూరం చేసిన చెలి ప్రేమను ఎందుకిలా చేసావని ప్రశ్నిస్తారు. గ్యాపకం వస్తావే కవిత మరో ఆణిముత్యం.. తమతో అమ్మలేని దూరాన్ని అక్షరాల్లో కొలిచి నాన్నకు తోడుగా ఉంటామని చాలా హృద్యంగా చెప్పారు. ఏమని కోరను, నువ్విలా ఉంటావు, నీ విజ్ఞత అది, శిశిర దశ, ఇంతకూ మించి ఏంకావాలి కవితల్లో రాలిపోతున్న ఆశల చిగురుదనాన్ని బాగా చెప్పారు. కవిత పుట్టుకను తనదైన మాటల్లో చెప్పారు. చివరి కోరికలో తరగని దూరాన్ని కొలవలేనని చెప్పడం ఆలిగారి భావ ప్రకటనకు పరాకాష్ట.  ప్రేమ విఫలమైతే ప్రేయసి ఆత్మను త్యజించడం ఎంత నిగూఢమైన భావాన్ని నింపిందో కవితలో మనకి తెలుస్తుంది. నీకు నీ జ్ఞాపకానికి తేడా ఏమిటనేది తేడా కవితలో చక్కగా చెప్పారు. ఎలా చెప్పనూ, తేడా ఆమెకు అతనికి ఇంతే, తనే కదా,  స్పందన, తార్కాణం, వేచిచూడు, నిరీక్షణ, వెళ్ళాకనే కదా తెలిసేది, మరవకు, అందం, ఎవరితరం కాదు, సహజత్వం, సందిగ్ధం, అదృశ్య దూరం, చనువు, స్తబ్దత, ప్రత్యేకత, ఏకాంతం, ముత్యాలు వంటి కవితలు ప్రేమలోని దూరాన్ని, దగ్గరతనాన్ని జ్ఞాపకాలతో పంచుకోవడం చాలా బావుంది. మరి ఎలా కవితలో మరచిపోలేని గతానివి నువ్వైతే వెంటాడే జ్ఞాపకాన్ని నేనంటారు. నా జీవితానికి కవితలో తన ప్రేమ పారదర్శకతను నిరూపించుకున్నారు. కేవలం ఇంతే, నిద్ర రానప్పుడు, ఏనాటికి తిరిగి రానివి కవితలు కూడా ప్రియమైన ప్రేమవే. చేయుట ఇస్తారు కదూ కవితలో అమ్మానాన్న వదిలేసిన ఓ పసి హృదయపు ప్రేమ రాహిత్యం కనిపిస్తుంది. అమరత్వం కవిత గతంగా నే మిగిలినా ఓ సజీవ చరిత్రగా నిలబడతానని ప్రేమ సగర్వంగా చెప్తుంది. వస్తాడు ఒకరోజు కవిత ప్రేమకు ధీటుగా రాసిన సామాజిక ఉద్యమ కవిత. భార్య, నిశబ్దం, నాన్న, కోపం రాదా, కూతురు, కోల్పోయినవి, నిజం, ఒక తండ్రి ఆవేదన, ఉద్యోగిని, ఎన్నాళ్ళయింది, కఠినం, ఎప్పుడొస్తావు నాన్న, ఆర్ధ్రం, మర్చిపోకూ, సంఘర్షణ, తోడు, నేటి సమాజం, మట్టి  బంధం,నిశబ్దం ధ్వనిస్తే వంటి కవితలు సమాజంలో మానవ సంబంధాలు, అనుభూతులు, ఆప్యాయతలు, ప్రేమానురాగాల, కుటుంబ విలువలు తెలియజెప్తాయి. చివరిగా నా అక్షరాలు కవిత తిలక్ అక్షరాల్లా వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిలు కాకపోయినా ఒక్కోసారి గ్రీష్మంలో ఆహ్లాదాన్నిచ్చే చిరుజల్లులు కదా... అని మన అంగీకారాన్ని సవినయంగా కోరుతున్నాయి...

మహిది ఆలీ గారు మరిన్ని అందరి మనసులకు చల్లదనాన్నిచ్చే చిరు అక్షర కావ్యాల ముత్యపు చినుకులు మన ముందుకు తేవాలని కాంక్షిస్తూ... అభినందనలతో ఈ "నాలోని నువ్వు" కవితా కన్నియకు అభినందనలు....!!

22, నవంబర్ 2017, బుధవారం

తెలుగు గురించి నాలుగు మాటలు...!!

నే రాసిన తెలుగు గురించి నాలుగు మాటలు ఈరోజు ఆంధ్ర ప్రభ వార్తాపత్రిక లో చోటు చేసుకున్నాయి. దానికి కారణమైన సుబ్రహ్మణ్యం గారికి,  వారిని పరిచయం చేసిన సూర్య ప్రకాశరావు  గారికి, సంపాదక  వర్గానికి నా ధన్యవాదాలు.....

http://epaper.prabhanews.com/m5/1439603/Hyderabad-Main/22.11.2017-Hyderabad-Main#page/4/1

భాష లేనిదే జాతిలేదు అన్నది ఎంత నిజమంటే ఈనాడు తెలుగుజాతి ప్రాంతీయత కోసం విడిపోయినా అందరు తెలుగువారే అన్నంత నిజం. లిపి లేకుండా భాష లేదు. మాండలికాలను మమేకం చేసుకున్న భాష మన తెలుగు భాష. తెలుగు సంస్కృతులను, సంప్రదాయాలను ప్రతిబింబించేది మన తెలుగు భాష. భాతరదేశంలో ఎక్కువగా మాట్లాడే ద్రవిడ భాష తెలుగు. త్రిలింగ అనే పదం నుండి పుట్టింది తెలుగు అని, తేనే వంటిది తెనుగు అని నానుడి. క్రీ.పూ. మొదటి శకంలో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి ) గా ఉండటం గమనించి తెలుగును ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌గా వ్యవహరించారు.

   అజ్ఞాత యుగం,.ఆది యుగం నుండి ఆధునిక యుగం వరకు మనిషి మనుగడలో పరిణామక్రమాలున్నట్లే భాషలోనూ మార్పులు చోటుకున్నాయి. ఎన్నో కష్టనష్టాలకోర్చి తెలుగుభాషకు ప్రాచీన హోదానైతే తీసుకురాగలిగారు కానీ తెలుగుభాష మనుగడకు ఏర్పడుతున్న ముప్పును తప్పించలేక పోతున్నారు. తెలుగుకు ప్రాచీన హోదా వచ్చిన సంతోషం లేకుండా అంతరించి పోతున్న తెలుగు అక్షరాలను కాపాడుకునే ప్రయత్నంలో తెలుగు భాషాభిమానులు వివిధ సాహితీ ప్రక్రియలను అందుబాటులోనికి తెస్తూ తాము చేసే పనికి ప్రభుత్వ సహకారం అందక పలు ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రాచీన హోదాకు కేంద్రం నుండి వచ్చే నిధులన్నీ అక్రమంగా తరలించబడుతున్నాయి. దానిలో కాస్తయినా తెలుగుభాషను బ్రతికించడానికి ఉపయోగిస్తే బావుంటుంది.    

      తెలుగు భాష మీద మమకారం ఎంతగా ఉంటే  తెలుగుభాషా వికాసం అంతగా జరుగుతుంది. అమ్మ పాలు బిడ్డకు ఎంత అవసమో అమ్మభాష మీద కూడా మమకారం కూడా అంతే అవసరం. అక్షరాలూ, పదాలు, నుడికారాలు, పద పొందికలు, సొగసులు  చెప్పుకుంటూపొతే చాలా ఉంటాయి భాషలో.  అంతరించిపోతున్న తెలుగుభాషలోని అందాలను మన తరువాతి తరాలకు అందించాలంటే తెలుగుభాషను వినేటట్లు చేయడం ముఖ్యం. మనకున్న ఎన్నో సాహితీ ప్రక్రియలు, నృత్య రీతులు అందుకు దోహదపడతాయి. రూపకాలు, పాటలు, వినసొంపైన  తేలిక పదాల పద్యాలు పిల్లలకు వినిపించి నేర్పించడం ద్వారా తెలుగుభాషపై ఇష్టాన్ని పెంపొందించవచ్చు. 

     బిడ్డకు తల్లికి మధ్య భాష అవసరం లేకపోవచ్చు, స్పర్శ ద్వారా అనుభూతులను పంచుకుంటారు తల్లిబిడ్డలు. అమ్మపాడే జోలపాట ప్రతి బిడ్డకు అమృతతుల్యమే. పాటలో స్వరాలూ, సంగీతము బిడ్డకు అవసరం లేదు, అమ్మ గొంతు ఎలా ఉన్నా ఆ గొంతులోని మాధుర్యం బిడ్డకు అద్భుతంగా ఉంటుంది. అలానే మన తెలుగుభాషలో ఎన్ని  ప్రాంతీయతలున్నా అన్ని జనరంజకాలే.  జోలపాటలు, లాలిపాటలు, జనపదాలు, జానపదాలు, లొల్లాయి పాటలు, పల్లె పదాలు ఇలా అన్ని తెలుగు వెలుగులే.  ప్రాంతాలను బట్టి భాష యాస మారుతుంది కానీ అక్షరాలు ఒక్కటే. ప్రాంతాన్ని బట్టి ప్రతి యాసకు ఓ సొగసుంటుంది. మాండలికాలకు మకుటంగా మన తెలుగు భాష నిలిచింది. 

తెలుగును సాధారణంగా ఒకపదముతో మరొకటి కలిసి చేరి పోయే భాషగా గుర్తిస్తారు. ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.

మాండలికాలు

తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.

సాగరాంధ్ర భాష : కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు.రాయలసీమ భాష : చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల ప్రాంతపు భాషను రాయలసీమ మాండలికం అంటారు.తెలంగాణ భాష : తెలంగాణ ప్రాంతపు భాషను తెలంగాణ మాండలికం అంటారు.కళింగాంధ్ర భాష : విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం అంటారు.

మన ప్రాంతాలలోనే కాకుండా తెలుగును ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా వాడుతున్నారు. భాషలన్నింటికీ మూలం దేవభాష సంస్కృతం. దీని నుండి పుట్టిన భాషలన్నీ పదాలను కలుపుకుంటాయి. అందుకే ఇతర భాషల్లోని పదాలు మన తెలుగు భాషలో చాలా వరకు చేరిపోయాయి.  సుసంపన్నమయినదిగా, సుమధురమైనదిగా తేనెలొలుకు తెలుగు భాష దేశభాషలందు తెలుగులెస్స అని అందరితో కీర్తించబడుతున్నది. 17, నవంబర్ 2017, శుక్రవారం

చేజారిన చేవ్రాలు....!!

కన్నీరింకిన కనుదోయి
కలత పడుతున్న మనసు
కల'వరాల' నడుమ ఊగిసలాడుతున్నాయి 

అపసవ్యపు జీవితాలు
అర్ధాంతరపు బతుకులు
అడ్డదిడ్డంగా అడుగులేస్తూ తడబడుతున్నాయి

పరుగులెత్తే క్షణాల కాలం
మరచిన గతాల గురుతులు
మరలనివ్వని గుండె సవ్వడులైనాయి

చేజారిన చేవ్రాలు వెక్కిరిస్తూ
వీడని చిక్కుముళ్ళైన వాస్తవాన్ని
వద్దని వారిస్తూ వాపోతోంది...!! 

నా మొదటి పుస్తకం ఆవిష్కరణ.... !!

నా మొదటి పుస్తకం ఆవిష్కరణ....
https://www.youtube.com/watch?feature=youtu.be&v=qBbcXOQBI9Q&app=desktop15, నవంబర్ 2017, బుధవారం

ఏక్ తారలు..!!

1.  మనసు బాధను మాయం చేస్తున్నా_మౌనగానాన్ని ఆలపిస్తూ...!!

2.  దైవమూ చిన్నబోతోంది_మానవత్వం మరచిన మనుష్యులను చూస్తూ..!!

3.  మనసు విప్పే గుట్టులెన్నో_మౌనం మాటాడితే..!!

4.  అనురాగాక్షతలు ఆశీర్వదిస్తున్నాయి_నవ్వుల సందళ్ళ నడుమ...!!

5.   మనసు చెప్పని సంగతులెన్నో_ఘనీభవించిన అనుభవసారాల్లో...!!

6.  మనసు సున్నితమే_మాటలే కఠినం..!!

7.  తరగని పెన్నిధి_తలపుల సందడి..!!

8.  కన్నీళ్లు తీర్చే బరువులెన్నో_మది భారాన్ని తగ్గిస్తూ... !!

9.  నవ్విన కాలమే నగుబాటైంది_ఋతువుల అందాలు తిలకించి...!!

10.  కలవరాలన్నీ కనుమాయం_ఆనందభాష్పాలు ఆదరిస్తుంటే...!!

11.   ఎదురుచూపుల ఎదలు నిండాయి_కలలు వరాలై కనువిందు చేస్తుంటే...!!

12.   మౌనానికి మెాహమాటం_మాట్లాడితే ఎవరేమనుకుంటారోనని...!!

13.  సమన్వయమెుక్కటి చాలదూ_సామరస్యంగా బ్రతకడానికి...!!

14.  నినదించని వేదనలెన్నో_మౌనమైన మదిలో...!!

15.  గుప్పెడక్షరాలను గుట్టగా పోశా_నీ పేరే రాస్తాయని తలచి...!!

16.   అప్పు రేపటికని వాయిదా వేయమన్నా_మరో గుప్పెడక్షరాలను ఏరేద్దామని..!!

17.   నీవే నా భావాలకు అల్లిక_అక్షరాలను అందంగా అమర్చుతూ...!!

18.   రాగద్వేషాలకతీతం_ఆత్మానందం పరమానందమైనప్పుడు...!!

19.  చిక్కిన ఓ చుక్క మేలిముత్యమై మెరిసింది_నీ చెలిమి గూటికి చేరినందుకేమెా..!!

20.   నీ కరుకైన మనసుకు సాక్ష్యాలుగా_చెదరని శిలాక్షరాలై నిలిచాయి..!!

21.  శూన్యాన్నీ అలంకరించాయి_భావాక్షర నక్షత్రాలు..!!

22.  మౌనమే రక్ష_సమస్యల చట్రం నుండి బయట పడటానికి... !!

23.  ఎన్నిసార్లు చదివినా కొత్తదనమే_జీవిత పుస్తకం అయినందుకేమెా...!!

24.  స్మృతుల శకలాలే అన్నీ_మృత్యునినాదాలై వెంటబడుతూ...!!

25.   మనసు మౌనాన్ని వింటున్నా_గుప్పెడు గుండెను అక్షరాల్లో అమరుస్తూ... !!

14, నవంబర్ 2017, మంగళవారం

ఉన్నత వ్యక్తిత్వం ...!!

 నేస్తం,
       ఆస్తులు అందరు సంపాదిస్తారు కానీ వాటిని సద్వినియోగ పరిచేది కొందరే. ఆ కొందరిలో నాకు అత్యంత సన్నిహతులు కృష్ణకాంత్ గారు ఉండటం నాకు చాలా సంతోషకరమైన విషయం. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు పదిమందికి ఉపాధి కల్పించే స్థాయిలో ఉన్నారంటే అది వారి నిరంతర కృషికి నిదర్శనం. మాటలు అందరు చెప్తారు కానీ చేతల్లో ఎంతమంది చేస్తున్నారు అంటే వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చు. ప్రొగ్రెసివ్ ప్రెస్ లో పనిచేసే ఎవరినడిగినా కృష్ణకాంత్ గారి గురించి చెప్తారు. తన కింద పనిచేసే వారిని కూడా కుటుంబ సభ్యులుగా చూసే ఉన్నత వ్యక్తిత్వం వారిది. తన మాటలతో ఎంతోమందికి ధైర్యాన్నిచ్చి వారికి అండగా నిలబడిన మంచి మనిషి. 
పాపకు ఆరోగ్యం బాలేనప్పుడు వారు పడిన మానసిక ఆవేదన మరొకరు పడకూడదని తనకు తోచిన సాయాన్ని ప్రతి సంవత్సరం కొందరికి అందిస్తూ, తన ఉద్యోగుల పిల్లల చదువులకు సాయపడుతూ, అనుబంధాలను, అభిమానాలను అందరితో కొనసాగిస్తూ ఎంత ఎదిగినా ఒదిగియున్న నిగర్వి. 
      ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో పరిచయం, మాటలు తక్కువే మా మధ్యన. కానీ అన్నింట్లో  అండగా నిలబడుతూ, ఈ రోజుకి అదే అభిమానాన్ని అందిస్తున్న ఆత్మీయులు. చాలామంది నేను, నా కుటుంబం అనుకునే ఈరోజుల్లో, పలకరిస్తే ఏం అడుగుతారో అని చేసిన సాయాన్ని కూడా మరిచి మొఖం చాటవేస్తున్న బంధువుల, స్నేహితుల నీచపు నైజాలున్న సమాజంలో నీకు ఏం చేయడానికైనా సిద్ధం ఎప్పుడూ అని అండగా నిలబడిన వ్యక్తి. 
అటు కుటుంబానికి , ఇటు సమాజానికి  తనకు చేతనైన రీతిలో తన వంతుగా చేయి అందిస్తున్న కృష్ణకాంత్ గారు నాకు హితులు సన్నిహితులు కావడం చాలా గర్వంగా ఉంది. 

12, నవంబర్ 2017, ఆదివారం

గూడు లేని న్యాయం..!!

ఎండకు ఎండుతూ
వానకు తడుస్తూ
నిప్పుల్లో కాలుతోంది

అధికారానికి తలొగ్గి
ధనం చేతిలో కీలుబొమ్మై
కళ్ళు లేని  కబోధిగా మారింది

నిజాలను వింటూ
అబద్దాలను నమ్ముతూ
అంధకారంలో మునిగిపోతోంది

రావణ కాష్ఠాల నడుమ
రామరాజ్యం కోసం
ఎదురుతెన్నులు చూస్తోంది

అంగడిబొమ్మలా అమ్ముడుబోతూ
అర్ధనగ్న నైతిక విలువల్లోబడి
అల్లాడుతోంది ఈనాటి న్యాయదేవత...!!

9, నవంబర్ 2017, గురువారం

అర మనిషి..!!

మానవ అద్భుత మేథాశక్తికి
మరో రూపమైన  యంత్రాల చేతిలో
కీలుబొమ్మలౌతున్న జీవ చైతన్యం
సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్న విజ్ఞానం
కొత్త పుంతల ఒరవడిలో పడి
యాంత్రికతగా మారుతున్న
నేటి సగటు మనిషి జీవితాలు
పరిపూర్ణ మానవుని నుంచి
అసంపూర్ణ ఉనికిగా మారుతున్న
పరిణామ క్రమాన్ని స్వాగతిస్తున్నంత కాలం
కొడిగడుతున్న అనుబంధాలు
రెప రెపలాడుతూనే ఉంటాయి. 

2, నవంబర్ 2017, గురువారం

గాంధీ పుట్టిన దేశమా ఇది...!!

ఆచార సంప్రదాయాలకు
ఉపనిషద్వేదాలకు నిలయమైన
భరతావని కన్న ఆణిముత్యం గాంధీ

అర్ధరాత్రి స్వతంత్రాన్ని స్వాగతించి
స్వరాజ్యపు బావుటానెగురవేసి
అహింసాయుధాన్ని పరిచయం చేసిన ప్రథముడు

అరాచకాలకు అక్రమాలకు ఆలవాలమైన
ఈనాటి భారతంలో మహాత్ముడు మళ్ళి పుడితే
అభాసుపాలౌతాడేమో జాతిపిత

సస్యశ్యామల సుందర స్వతంత్ర భారతాన్ని
కలలుగన్న శాంతి సుధాముడు నివ్వెరపడి నొచ్చుకుంటాడేమో
ప్రగతి పథంలో దూసుకెళుతున్న స్వరాజ్యాన్ని..!!

ద్విపదలు...!!

1.  నా ఖాళీలన్నీ పూరించబడ్డాయి
నువ్వు విసిరెళ్ళిన జ్ఞాపకాలతో....!!

2.  వెలితి నింపాలన్న యత్నమే
వెలుగు తోడ్కొని తెచ్చి...!!

3.   వేగానికి కళ్ళాలేసాయి
ఎగిసి పడతున్న జ్ఞాపకాల వన్నెలు....!!

4.  తలపులు తల్లడిల్లుతున్నాయి 
   మూసిన రెప్పల వెనుక మౌనాలందక....!!

5.  అంతం లేనివే ఆలోచనలు
అగాధాలను అవలీలగా మెాసేస్తూ..!!

6.  మూసిన రెప్ప మాటునే
రేపటి స్వప్నం చేరింది... !!

7.  మనసు నీతో ముచ్చట్లాడుతోంది 
నా వాస్తవమూ వర్తమానమూ నువ్వేనని గతాన్ని  బుజ్జగిస్తూ..!!

8.   మనసుకూ మమకారమే
మౌనంమాట ఆలకించాలని...!!

9. నీ నిశ్శబ్ధాన్నీ ఆస్వాదిస్తా  
నా మనసంతా నీవైతే..!!

10.   మనసు మౌనం జతకడితే
మాటల సందడి మాయమేగా....!!

11.   మనసంతా నిన్నే నింపుకున్నా
మౌనంలో నీకు చోటిస్తూ...!!

12.  ఏకాంతం పలకరించిందేమెా
ఒంటరితనానికి ఊరటనిస్తూ...!!

13.   ఆత్మీయత అభాసుపాలౌతోంది
నకిలీ స్నేహాల నయవంచనలో పడి...!!

14.  శూన్యానిదెప్పుడూ దొడ్డ మనసే
అన్నింటిని తనలోనికి ఆహ్వానించేస్తూ...!! 

15.   అడుగులు తడబడుతున్నాయి
గమ్యాన్ని చేరలేమేమెానని...!!

16.   అతిశయమే నాది
స్వాతిముత్యంతో నెయ్యమందినందుకు..!!

17.  వెలుగులన్నీ చేరుతున్నాయి
చీకటిని చెరిపేస్తూ... !!

18.  ఆకాశమే నీ పాదాక్రాంతం
సడలని నీ మనోధైర్యానికి...!!

19.  మమత తోడైంది
మనసును బ్రతికించడానికి....!!

20. ఆంతర్యంలో అంతరార్థమెరుకే
గమ్యం చేరేందుకై..!!

21.   జ్ఞాపకం గమనిస్తోంది
గతానికి వర్తమానానికి జత కలపాలని...!!

22. ఏకాంతమెప్పుడూ నేస్తమే
 అలసి సొలిసిన జీవితానికి...!!

23.  ఆత్మీయతెప్పుడూ ఒంటరే
బంధాలకు బందీయై.. !!

24.   కలలో వస్తేనే తెలిసింది
నను వీడనినీడవు నువ్వేనని ....!!

25.   మానసంలో కొలువుదీరావు
మమతలకు నెలవై..!!

1, నవంబర్ 2017, బుధవారం

నీతులు చెప్పేందుకే...!!

నేస్తం,
         ఏంటో ఈమధ్య కొందరు ఎదుటివాళ్ళ తప్పులు వెదకడంలో బాగా ఆసక్తిగా ఉంటున్నారు. నీతులు చెప్పేందుకే కానీ ఆచరించేందుకు కాదు అని ఋజువు చేస్తూ ఒక వేలు ఎదుటివారిని చూపిస్తే మిగతా నాలుగు వేళ్ళు తమనే చుపిస్తున్నాయన్న చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఓ నాలుగు సన్మానాలు, కాసిన్ని బిరుదులూ వచ్చేస్తే చాలు ప్రతి ఒక్కరి రాతల్ని విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఆ బిరుదుల, సత్కారాలు వెనుక ఏముందో నలుగురికి తెలుసన్న చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు.
    కవిత్వంలో ప్రక్రియలకి నిర్దిష్టమైన నియమాలేమి లేవు. భావాన్ని చెప్పే విధానం, పాఠకులని ఆకట్టుకునేలా ఉంటే చాలు. అవార్డులు, రివార్డులు రాని ఎంతోమంది చక్కని భావాల్ని నలుగురు మెచ్చే విధంగా రాస్తున్నారు. వచన కవిత్వం ఇలానే ఉండాలని, వ్యాసం ఇలానే రాయాలని ఎవరు చెప్పలేదు. మనం తీసుకున్న వస్తువుని ఎలా చెప్పగలం అన్నది మన భావుకత మీద ఆధారపడి ఉంటుంది. ఒకే వస్తువుని ఎంతమంది రాసినా ఏ ఇద్దరిది ఒకేలా ఉండదు. మాతృస్పర్శ కవితా సంకలనంలో అమ్మ గురించి వందకు పైగా కవులు తమ కవితలను రాశారు. ఏ ఒక్కరిది మరొకరి కవితతో పోల్చదగినదిగా లేదు. ఈ  సృష్టిలో అమ్మ ఎవరికైనా అమ్మే మరి రాసే భావాల్లో ఎన్నెన్ని తేడాలో.
      లోపం చూసే మన దృష్టిలో ఉంది. కొందరు ఆధ్యాత్మికతను హేళన చేస్తున్నారు, మరికొందరు తమ మతమే గొప్పదని అంటున్నారు. పూజలు,  పునస్కారాలు చేసేవాళ్ళు, చేయనివాళ్ళు ఇద్దరు ఉంటారు. అంట మాత్రాన పూజలు చేసే ప్రతి ఒక్కరు మంచివాళ్ళూ కాదు, చేయనివాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. ముఖపుస్తకంలో దేవుళ్ళ బొమ్మలు పెట్టేసి నాలుగు సూక్తులు చెప్పేస్తే వాళ్ళు అపర ఆధ్యాత్మిక గురువులు కాలేరు. ఓ నాలుగు దేశభక్తిని చాటిన  నాయకుల చిత్రాలు, ఓ రెండు దేశభక్తి గీతాలు రాసినంత మాత్రాన వారు దేశభక్తులైపోరు. రాజకీయ నాయకుల తప్పులను ఎత్తిచూపితే అడవిలో అన్నలూ కాదు.
   ఎవరికివారు తమను తాము సగటు సమాజజీవిగా ప్రశ్నించుకుంటే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఎవరి ఇష్టాలు వారివి, ప్రక్క వారికి ఇబ్బంది కలిగించకుండా తమ తమ పనులు చేసుకుంటే అందరికి మంచిది. ఎంతసేపు ఎదుటివారిలో లోపాలు వెదకడానికే మీ సమయాన్ని వెచ్చించకండి, మీకోసం కూడా కాస్త సమయాన్ని కేటాయించుకోండి. ఎదుటివారి భావాలకు కాస్త విలువ ఇవ్వండి. నైతికతను మర్చిపోకుండా మెలగండి. అందరు బావుంటారు.


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner