30, సెప్టెంబర్ 2010, గురువారం

చరిత్ర పునరావృతం...

ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్న మాట అక్షరాల నిజమైంది నిన్నటి తీర్పుతో....చరిత్ర పునరావృతమైంది మరొక్కసారి...న్యాయదేవత పలుకుబడి, అధికారం, డబ్బులకు అమ్ముడుపోయి నిజాన్ని ఒప్పుకోలేక మూగబోయింది.
ఆయేషా కేసు తీర్పులో న్యాయం అన్యాయమైంది...అని అందరికి తెలుసు కాని ఎవరు ఏమి చేయలేరు....కళ్ళు చెవులు అన్ని వుండి కుడా ఏమి లేనివారమయ్యాము ఈ రోజు....ఆయేషా కేసు అయినా మొద్దు శీను కేసు అయినా మరోకరైనా అధికారం, ధనాశకు దాసోహమనక తప్పడం లేదు...చట్టం తనపని చేసుకుపోదు. అధికారానికి కొమ్ము కాస్తుందని మరొక్కసారి ఋజువైంది అంతే.....సత్యంబాబు కి శిక్ష వేయడం ఎంత వరకు సమంజసం?? అందరికి తెలిసిన నిజం, అబద్దపు సాక్ష్యాలు కోర్టుకి ఎందుకు తెలియలేదు? నిరపరాధికి శిక్ష పడకూడదన్న నైతిక న్యాయాన్ని ఎందుకు మర్చిపోయారు? తీర్పు చెప్పిన గౌరవనీయులైన న్యాయాధికారిగారు. పేదవాడికి అందుబాటులో లేని చట్టం ఎవరి కోసం? మేధావులు ఒక్కసారి ఆలోచించండి......న్యాయాన్ని నిలబెట్టండి......!!!

29, సెప్టెంబర్ 2010, బుధవారం

మధురానుభూతుల బాల్యం....

చిన్నప్పటి జ్ఞాపకాలంటే....మరల రాని మరపు రాని....మధురానుభూతులు...
స్కూలు ఎగ్గొట్టి చుట్టుపక్కల వాళ్లకి కబుర్లు చెప్పి గులాబీలు తెచ్చుకోవడం జ్ఞాపకమే...
అమ్మమ్మ తిడితే పుస్తకంలో రాసి అమ్మకు చూపటం జ్ఞాపకమే...
బొమ్మలాటలు...టీచరులా బెత్తం చాక్పీసులతో ఆడిన ఆటలు జ్ఞాపకమే...
బాదం కాయల వేటలు...పారిజాతాల దండలు గుచ్చడం జ్ఞాపకమే...
చెరువులో....కాలువల్లో....కొట్టిన ఈతలు జ్ఞాపకమే...
అమ్మానాన్న ఆటలు....చేసిన సత్యన్నారాయణ వ్రతాలు....పంచిన ప్రసాదాలు... జ్ఞాపకమే...
పాడిన పాటలు...చదివిన కథల పుస్తకాలు...తిన్న తిట్లు...అన్ని... జ్ఞాపకమే...
స్నేహితులతో గిల్లికజ్జాలు...చూసిన సినిమాలు...వేసిన బొమ్మలు... జ్ఞాపకమే...
మాస్టారితో తిన్న తన్నులు....చెప్పిన పాఠాలు...చేసిన అల్లరి...జ్ఞాపకమే...
వన భోజనాలు...వార్షికోత్సవాలు... జ్ఞాపకమే...
ఉత్తరాల్లో పంచుకున్న పెంచుకున్న అనుభూతుల అనుబంధాలూ... జ్ఞాపకమే...
అప్పటి ప్రతి క్షణం ఇప్పటికీ.....ఓ మధుర జ్ఞాపకమే...

28, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఓ తల్లి వ్యధ

నాకు తెలిసిన ఓ తల్లి చాలా బాగా బతికింది ఒకప్పుడు. ఇప్పుడు ఎలా బతకాలో తెలియని అయోమయం లో బతకాలా వద్దా అన్న సందిగ్ధం లో బతుకు వెళ్ళదీస్తోంది...రాని చావు కోసం ఎదురు చూస్తూ…….. ముగ్గురు ఆడపిల్ల తరువాత లేక లేక కొడుకు పుట్టాడని ఎంతో మురిసి పోయారు ఆ తల్లిదండ్రులు. అందరికన్నా చిన్నవాడని అపురూపం గా పెంచుకున్నారు. పెద్ద పిల్లలకి పెద్దగా చదువు చెప్పించక పోయినా చిన్నవాళ్ళిద్దరికీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగేటట్లు టీచర్ ట్రైనింగ్ చెప్పించారు. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం....కాక పొతే తరువాత పార్టీలని కొంత సొమ్ము, వ్యాపారమని కొంత సొమ్ము పెట్టి మొత్తం నాశనమైంది పిల్లలు పెరిగేసరికి. కొడుకు కి యాక్సిడెంట్ అయి కొన్ని నెలలు మంచం లోనే వుంటే బతుకుతాడో లేదో తెలియని కొడుకు కోసం ఆ తల్లి పడిన వేదన చెప్పనలవి కానిది. తల్లి, పెద్ద కూతురు వాళ్ళ పిల్లలు ఒక సంవత్సరం కష్ట పడితే కాని మామూలు మనిషి కాలేదు. పుట్టిన పిల్లాడికి చేసినట్లు అన్ని ఆ పాతికేళ్ళ కొడుకుకి ఎంతో ఓర్పుతో, ఓపిక తో ఆ తల్లి, అక్క, అక్క పిల్లలు చేసిన సేవలు మనిషి జన్మ ఎత్తిన వాడు ఎవడు మర్చి పోలేడు. కాని ఈ మనిషి అది మర్చి పోయి అక్క కూతురిని చేసుకోకుండా కట్నం కోసం వేరే ఆవిడని చేసుకుని ఆవిడ అడుగుజాడలలో తల్లికి, అక్క చెల్లెళ్ళకు దూరం గా ఉద్యోగాన్ని మార్చుకుని అస్సలు వీళ్ళు ఎవరో తెలియనట్లు బతుకుతున్న గొప్ప బాద్యత గల ఉపాద్యాయ వృత్తిలో వున్నాడు ఈ రోజు. కనీసం తల్లికి అవసరానికి ఆదుకోకుండా వున్న ఇల్లు అమ్మి ఆ డబ్బులు కుడా ఎంత మంది చెప్పినా వినకుండా కొడుకు కి ఇచ్చిన కన్నతల్లి నెల రోజుల నుంచి అనారోగ్యం పాలైతే కనీసం చూడటానికి కుడా రాని ఆ కొడుకుని ఎవరితో పోల్చాలి? ఎంత మంది ఎన్ని సార్లు ఫోనులు చేసి చెప్పినా నెల రోజుల నుంచి తల్లిని చూడటానికి సెలవు దొరకని ప్రభుత్వ ఉపాద్యాయుడు . బాధ్యతాయుతమైన వృత్తిలో వుండి ఎంతో ఆదర్శవంతుడిని అని చెప్పుకునే ఈ కొడుకుకి తనకోసమే జీవితాన్ని ధారపోసిన తల్లి చివరి దశలో వుంటే చూసుకోవాల్సిన బాధ్యతా లేదా!! ఇలాంటి కొడుకులకు బుద్ధి చెప్పే చట్టం ఏదైనా వుంటే ఎంత బావుంటుంది!!!! తల్లిని చూడటానికి కుడా పెళ్ళాం అనుమతి తీసుకునే ఇలాంటి కొడుకులున్న మన సమాజం లో కనీస మానవత్వపు విలువలు మంటగలుస్తున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? పెళ్ళాం మీద ఈగ వాలనియని ఈ కొడుకు తన ప్రాణాన్నే ఫణంగా పెట్టి బతికించిన తల్లి ఋణం ప్రపంచంలో ఏ కొడుకు తీర్చుకోనంత బాగా తీర్చుకున్నాడు. మనం రోజు చూస్తూనే ఉన్నాము ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా సభ్య సమాజంలో జరుగుతూనే వున్నాయి కాని వీటికి పరిష్కారం ఏంటో మాత్రం అంతుపట్టడం లేదు……సమాధానం లేని ప్రశ్నలుగానే ఎన్నో జీవితాలు ముగుస్తున్నాయి……….!!

ఏమిచ్చినా తీర్చుకోలేని కల్మషం లేని తల్లి రుణాన్ని వెల కట్టకుండా కొడుకులు కూతుర్లు బాధ్యతలను మరచిపోరని ఆశతో.....

27, సెప్టెంబర్ 2010, సోమవారం

నీ జ్ఞాపకం....

ఎన్నో ఆలోచనలు…..గతకాలపు జ్ఞాపకాలు….
అక్షర రూపం ఇద్దామంటే పదాల అమరిక
పరుగిడిపోయింది అందనత దూరంగా ….
పాటలా పొందుపరుద్దామంటే …
పల్లవే కుదరనంది…..మరింకెలా రాసేది పాట?
గమకాల్లో అందామంటే గొంతు మూగబోయింది….
నీవు లేవన్న నిజాన్ని తట్టుకోలేక……!!!

9, సెప్టెంబర్ 2010, గురువారం

ఒక చిన్న మాట

మనిషికి, ఆ మనిషి లోని మానవత్వానికి తల వంచండి కాని డబ్బుకు, పై పై మెరుగులకు, హంగులకు, ఆర్భాటాలకు కాకుండా , మనసులో లేక పోయినా పైకి మీతో మర్యాద నటించే వారికి ఎంత విలువ ఇవ్వాలనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.... నిజం ఎప్పుడూ చేదుగానే వుంటుంది వినడానికి....పొగడ్తలు విని పొంగిపోతే ఆ విజయం తాత్కాలికమే కాని నిజమైన గెలుపు కాదు.....అదే నీ పతనానికి తొలి మెట్టు అవుతుంది....కష్టంగా వున్నా నిజాన్ని ఒప్పుకోడానికి ఎంతో పెద్ద మనసు వుండాలి. తప్పు చేసినప్పుడు సమర్దిన్చుకోకుండా లేదా పక్క వారి మీదకు నెట్టకుండా మన భాద్యత ఎంత అని ఒక్క సారి ఆలోచించుకుంటే అపార్ధాలకు, చెప్పుడు మాటలకు స్వస్తి చెప్పవచ్చు. చెప్పుడు మాటలు చెప్పే వారిది తప్పు కాదు దానిలో నిజం ఎంత అని ఆలోచించని మీదే క్షమించరాని తప్పు అవుతుంది.......కాదంటారా!!

3, సెప్టెంబర్ 2010, శుక్రవారం

పదవి - నడవడి

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడటం ఇంటికి ఒంటికి చాలా మంచిది. ఒక మాట మాట్లాడిన తరువాత దానిని వెనక్కి తీసుకోలేము కదా!! ప్రతి ఒక్క ఇంట్లోను సమస్యలు ఉంటాయి అలా అని ఇంటి సమస్యలను ఆఫీస్ లోనూ, ఆఫీస్ విషయాలను ఇంటిలోనూ కలపడం మంచిది కాదు. కనీసం వయస్సుకు తగినట్టుగా అయినా మన ప్రవర్తన ఉండాలి. మనం ఇబ్బందిలో ఉన్నామని ఎదుటివారిని ఇబ్బందులకు గురి చేయడం ఎంత వరకు సమంజసం? నువ్వు లేనప్పుడు నీ గురించి ఓ క్షణం ఆలోచించేటట్లు వుండాలి కాని హమ్మయ్య ఇప్పటికి ఈ పీడ తప్పింది అనిపించుకోకూడదు. మన మాటలు ఎదుటి వాళ్లకు ఆహ్లాదాన్నివ్వాలి కాని ఆక్రోశాన్నివ్వకూడదు. ప్రతి సంస్థలోనూ వుండే సమస్యలే ఇవి....సహోద్యోగులతోను, మనకన్నా తక్కువ స్థాయిలోని వారితోను మాట్లాడేటప్పుడు మన ప్రవర్తన అందరికి ఆమోదయోగ్యంగా ఉండేటట్లు చూసుకుంటే ఇంటా, బయటా చాలా సమస్యలు తీరి సంతోషంగా మనం ఉంటూ, మన చుట్టూ వున్న వారిని కుడా సంతోషపెట్ట వచ్చు.

2, సెప్టెంబర్ 2010, గురువారం

నీకు..నాకు ....

మాటలే లేని మౌనంలో.....
నీవు నాకు నేను నీకు చెప్పుకున్న
మాటల నిశబ్ధానికర్ధం ఏమిటో...?
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner