24, నవంబర్ 2023, శుక్రవారం

శ్రద్ధాంజలి..!!

మరణాన్ని 

జయించిన పుట్టుక

మనదైనప్పుడు


చుట్టుకున్న

గతజన్మ బుుణపాశాన్ని

తెంపినప్పుడు


మనిషిగా

మనుగడ సాగించడానికి

బయల్దేరినప్పుడు


అడ్డుపడుతున్న

అనుబంధాలను నెట్టేస్తూ

అందలాలెక్కుతున్నప్పుడు


స్పురణకు రాకుండా

గతపు ఆనవాళ్ళకు

సమాధి కట్టేసినప్పుడు


మనముగా మనలేని

మన బతుకులకు దాసోహామంటూ 

శ్రద్ధాంజలి ఘటించేద్దాం ఘనంగా..!!



22, నవంబర్ 2023, బుధవారం

అరుదైన క్షణాలు..!!


 నేస్తాలు,

         టైమ్ మెషీన్ మనకు అందుబాటులోనికి వచ్చి దాదాపు ముప్పైఐదేళ్లు వెనక్కి వెళితే ఎలా ఉంటుందన్న ఊహే అద్భుతం కదా. మరి అద్భుతాన్ని ఆస్వాదించడానికి మనకు అవకాశం వస్తే..అందిపుచ్చుకోకుండా ఉండగలమా..! కాకపోతే ఇక్కడ చిన్న మార్పు. అదేంటంటే ప్రస్తుతం మనమున్నట్టుగానే వుంటూ గతానికి వెళ్ళడమన్న మాట. ఎవరెవరికి ఏమేం గుర్తుకొస్తాయన్నది మీ మీ ఆలోచనల్ని బట్టి ఉంటుంది. గతము, జ్ఞాపకాలు లేని మనుష్యులు బహు అరుదు. అరుదైన వారిలో నేను లేను. మరి మీరు ఎవరో మీకే తెలియాలి.

         లేబ్రాయాన్ని వదల్లేమంటూనే కౌమారాన్ని కలుపుకుని, యుక్త వయసులోనికి అడుగులు పడే సమయం అది. అంతా కొత్త కొత్తగా భవిష్యత్తులో ఏదో ఘనంగా సాధించేయాలన్న కోరికలతో ఇంజనీరింగ్ కాలేజ్ లో అడుగు పెట్టిన తొలి క్షణాలు నిజంగా అపురూపమే. స్వేచ్ఛా విహంగాల హంగామా, సీనియర్ల రాగింగ్, పంచుకున్న పచ్చళ్లు, చిరుతిండ్లు, కొత్తగా మెుదలైన స్నేహాలు, అలకలు, కోపాలు, కొట్లాటలు, క్లాసులు ఎగ్గొట్టి చూసిన సినిమాలు, క్లాసుల్లో చేసిన అల్లరి, ఆకతాయితనాలు, ప్రేమలు, పెళ్లిళ్లు అబ్బో ఇలా ఎన్నని జ్ఞాపకాలను తిరిగి తోడగలం చెప్పండి.

           మనం చదువుకున్న బళ్ళారి విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజ్ లోనే జ్ఞాపకాలను అందిపుచ్చుకునే అవకాశం 89 బాచ్ కి డిసెంబర్16 వచ్చింది. మరి ఎందరు అరుదైన క్షణాలను అందుకుంటారో..!!

          పెరిగిన పొట్టలు, భారీ కాయాలు, బయట పడిన అరెకరాలు, అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు ఇలా గుర్తు పట్టలేని ఆకారాల్లో ఎవరెవరు ఎవరిని గుర్తుపట్టగలరో చూద్దాంఅందరి మేథలకు పరీక్షా కాలం ఆసన్నమౌతోంది…2023 డిసెంబర్ 16.

    “ప్రతి కలయికా  వీడ్కోలుకు అయితే 

    ప్రతి వీడ్కోలు మరో కలయికకు నాంది అవుతుంది.”

అప్పటి మన వీడ్కోలు రాబోయే అరుదైన క్షణాలకు సరికొత్తగా నాంది పలకాలని ఆశిస్తూ




            


15, నవంబర్ 2023, బుధవారం

ఏక్ తారలు

 1.  అక్షరాలు నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తున్నాయట_మాటల యుద్ధానికి విరామమంటూ..!!

2.  వర్తమానంతో పనేముంది_వాస్తవంలో మనమున్నప్పుడు..!!

3.  ఇద్దరి ఆలోచనా ఒకటే_ఏ వైపున ఎవరున్నా..!!

4.  కథలుగా అల్లినప్పుడు కలగనలేదు_కఠోర సత్యమై నిలుస్తావని..!!

5.  అంతరాల అడ్డుదేముంది_ఆంతర్యాలు ఒకటైనప్పుడు..!!

6.  కనులొలికించే భావమెుక్కటే_కలవని తీరాలు తమవైనా..!!

7.  బంధాలకు అడ్డం పడుతోంది_చూడొద్దనుకున్నప్పుడల్లా చూపు మరలక..!!

8.  నిదుర నిండుకుండయ్యింది_రాతిరి కలలకు చోటీయకుండా..!!

9.  కాగితపు పూలకూ సువాసనే_నీ ప(పు)లకరింపులు చేరి..!!

10.  చీకటి చుట్టం_చుక్కల వెలుతురుకు చోటిస్తూ..!!

11.  నీ ముందర అందరు భావుకులే_ఆస్థానం ఎవరిదైనా..!!

12.  అపురూప క్షణాలను అందిపుచ్చుకుంటున్నా_చేజార్చుకోవడానికి మనసు రాక..!!

13.  చదువుతూనే వుంటా_చివరి క్షణాలకు సైతం చిరునవ్వును అద్దుతూ..!!

12.  పునః పరిచయం చేసుకుంటూనే ఉన్నా_మరుజన్మకు మరల వరమిస్తావని..!!

13.   కల్పనలెప్పుడూ కనుల పండుగే_వాస్తవమై ఊరిస్తున్నట్టుగా..!!

14.  కాలం కనికట్టిది_దగ్గరతనాన్ని దూరం చేస్తూ..!!

15.  గురుతే లేదు ఏ కాలమూ_నీతోనున్న ఈ క్షణాలు నావని తలచి..!!

16.  కలత పడ్డ మనసు_కలల విహారంలో విహరిస్తూ..!!

17.  రహస్యమెప్పుడూ బహిరంగమే_విశ్వానికి తెలియకున్నా..!!

18.  అనుబంధం అందని ఆకాశమే_బంధాన్నే కాదనుకున్నప్పుడు..!!

19.  కడవరకు కలిసే నడవాలనుకున్నా_తడబాటును కనబడనీయక..!!

20.  మనోకాశాన్ని పరికిస్తున్నా_కోల్పోయిన క్షణాలను తాకాలని..!!

21.  అక్షరానికెంత మమకారమో_అమ్మ ప్రేమనంతా ఒలికించేస్తూ..!!

22.  అన్నీ మరవాలన్న తపన_కాలం కొనల చిక్కుముళ్ళలో సతమతమౌతూ..!!

23.  దగ్గరనే అనుకున్నా_దూరం పెంచుతారని తెలియక..!!

24.  ఆ’దేశం అమలయ్యింది_నిర్ణయం, నిరీక్షణ మాటలు కలిపాక..!!

25.  అక్షరం ఆలంబన అవుతూనే వుంది_చీకటి చిత్రానికి వెన్నెల రంగులద్దుతూ..!!

26.  గగనం పరుగులెడుతూనే వుంది_కాలానికి ధీటుగా..!!

27.  మనసు భారమనుకుంటా_మోపలేని బరువుగా..!!

13, నవంబర్ 2023, సోమవారం

ముసుగేసిన ఆకాశం సమీక్ష

                 ముసుగేసిన ఆకాశం

          “ముసుగేసిన ఆకాశంఅంటూ జీవితపు ముసుగుని తొలగించి నిర్మలమైన జీవితాకాశాన్ని తనదైన శైలిలో మన ముందు పరిచిన ముండూరు సాయిలక్ష్మి గారికి హృదయపూర్వక అభినందనలు.

            సగటు మనిషి జీవితం అదీ మహిళైతే జీవితంలో ఎన్ని పార్శ్వాలు ఉంటాయో అన్నింటిని స్వచ్ఛంగా తనకు తెలిసిన, అలవాటున్న భాషలోముసుగేసిన ఆకాశంఅంటూ తన జీవితంలో ఇప్పటి వరకు జరిగిన సంఘటనలను పుస్తకంగా తీసుకువచ్చారు. పూర్వుల వివరాల నుండి తరాల సంగతులు, ఆచార, వ్యవహారాలు, చదువులు, సంప్రదాయాలు, ఉమ్మడి కుటుంబాల ఆనందాలు, అనుబంధాలు ఇలా ప్రతి విషయాన్ని చక్కగా వివరించారు. తన చిన్ననాటి నేస్తాలను, అల్లరి,ఆకతాయితనాన్ని, తన మెుండి ధైర్యాన్ని, తను పాటించిన జీవితపు విలువలను, తప్పుని సహించలేనితనాన్ని ఇలా ఒకటేమిటి..అన్నింటిని అరమరికలు, హంగులు, రంగులు లేకుండా స్వచ్ఛమైన మనసుని అక్షరాల్లో ఒదిగారు. అందుకేనేమో చదవడం ఆలశ్యమౌతుందని చెప్పి కూడా మెుత్తం చదివేటట్లు చేసారు. తన సాహితీ ప్రయాణాన్ని వివరిస్తూ కొన్ని కవితలను కూడా పుస్తకంలో అందించారు. చక్కని ప్రయత్నానికి హృదయపూర్వక అభినందనలు..


4, నవంబర్ 2023, శనివారం

గొప్పదనం..!!

నేస్తం,

         మనకి మనం గొప్ప కావచ్చు కాని, అదే ఉద్దేశ్యం మనపట్ల ఎదుటివారికి ఉండాలనుకోవడం సరి కాదు. చూడగలిగే మనసుంటే ఈ సృష్టిలో ప్రతి ఒక్కరిలో ఏదోక గొప్పదనముంటుంది. ఆ గొప్పతనాన్ని గుర్తించే గొప్ప మనసు మనకుండాలి. సమయం అందరిది ఒకటే. మన కోసం ఎదుటివారు ఓ క్షణం కేటాయించినా అది వారి సహృదయత. దానిని గౌరవించే సంస్కారం మనకు కూడా ఉండాలి. 

          నా రాతలకు ప్రతిస్పందన తెలియజేస్తున్న అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇన్ని సంవత్సరాలుగా ఆదరిస్తున్న మీ సహృదయతకు మనఃపూర్వక వందనం. ముఖపుస్తకానికి వచ్చిన కొత్తలో “మన తెలుగు మన సంస్కృతి” సమూహంలో ప్రతి ఒక్కరి పోస్ట్‌కి నా స్పందన తెలియజేసేదాన్ని. నా గోడ మీద పోస్టులకు సరిగా స్పందన ఉండేది కాదు. అయినా నాకు నచ్చిన రాతలు రాసుకుపోతున్నాను ఇప్పటికి. అప్పటికి ఇప్పటికి నా రాతలకు స్పందనలు బాగా పెరిగాయి. అలా అని నేను చూసిన ప్రతి పోస్ట్ కి వీలైనంత వరకు నా స్పందన తెలియజేస్తూనే ఉన్నాను ఇప్పటికి. 

        మనమేదో గొప్ప అనో, మన రాతలు గొప్పవనో కాదు. మనకు ఎదుటివారు స్పందించినప్పుడు కనీసం మనకు తోచిన విధంగా వారికి ప్రతిస్పందించడం మన సంస్కారం. సమయం మనకెంత విలువైనదో ఎదుటివారికి కూడా అంతే కదా. నాకు తెలిసి నేను అనవసరంగా రాసాను అనుకున్నవి రెండు పోస్టులు ఇప్పటికి. ఇక మీదట జాగ్రత్తగా ఉంటాను. 

     తెలుగు భాషను అభిమానించే అందరికి, స్పందనలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి మనఃపూర్వక ధన్యవాదాలు. ఏమరుపాటున ఎవరినైనా నొప్పిస్తే మంచి మనసుతో మన్నించేయండి మరి..🙏

3, నవంబర్ 2023, శుక్రవారం

జీవన మంజూష నవంబర్23


 నేస్తం,

         “మెుదటి అడుగు ఎప్పుడూ ఒంటరేఅన్న నానుడి మనకు తెలిసిందే. చివరి పయనానికి కూడా తోడెవరూ వుండరు. ప్రపంచంలోకి రావడం, పోవడం రెండు ఒంటరిగానే జరుగుతాయి. నడిమధ్యన బంధాలు, బాధ్యతలు, కోపాలు, తాపాలు వగైరాలన్నీ మన మానసిక, శారీరక స్థితిని బట్టి వస్తూ, పోతూ వుంటాయి. రెప్పపాటు జీవితానికి రెప్పలార్పే క్షణాలను లెక్కేయడం సాధ్యమేనా..!

           అధికారమైనా, అహంకారమైనా మన మానసిక స్థితి వాటిలో ప్రతిఫలిస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. వ్యక్తిగతానికి, వ్యవస్థకు ముడిబెడితే ఫలితం ఏమిటన్నది చరిత్ర చెబుతోంది. గీతాబోధకుడు చెప్పినట్టు చేసేది, చేయించేది పైవాడే. నేను నిమిత్తమాత్రుణ్ణి అంటే నమ్మడానికి ఇది పురాణయుగం కాదు. మన లెక్కల తక్కెడ మనదే. మార్చాలని చూడటం అవివేకం. “బుద్ధి కర్మానుసారిణేఅన్న మాట అక్షరాలా నిజం. మనం మన కుటుంబానికే న్యాయం చేయలేనప్పుడు వ్యవస్థకు ఎలా న్యాయం చేయగలం? ప్రశ్న మనల్ని ఎవరో వేయడం కాదు మనల్ని మనమే ప్రశ్నించుకునే ధైర్యం మనకుండాలి. అప్పుడే వ్యక్తిగా మనం గెలిచినట్లు. వ్యక్తిగా మనం ఓడిపోయినప్పుడు వ్యవస్థను గెలిపించగలమా!

             పుట్టడం, గిట్టడం అన్నది సృష్టిలో జరిగేనిరంతర ప్రక్రియ”. మనమెలా బతికామన్నది చివరకు మన చావు చెబుతుందట. ఇది నా మాట కాదు పెద్దల మాట. పుడుతూ ఏమి తీసుకురాము. పోతూ ఏం తీసుకుపోతామన్నది మనం చూసిన రణాలు చెప్పిన బహిర్గత రహస్యం. అయినా పాకులాటలు వదులుకోలేక పోతున్నాం. మన బలాలు, బలహీనతలు ఏమిటన్నది మనకే బాగా తెలుసు. కల్పనలు, వాస్తవాలు ఏమిటన్నదీ తెలుసు. నిజాన్ని నిర్భయంగా ఎదుర్కునే ధైర్యమున్నప్పుడు ఓటమి కూడా గెలుపేనని ఎంతమందికి తెలుసు? ఇక్కడ గెలిచామా, ఓడామా అని కాదు పోరాటంలో ఎంతమంది స్ఫూర్తిని పొందారన్నది ముఖ్యం. విజేత ఎప్పుడూ ఓడిపోడు. ఓటమి నుండే విజయాన్ని సొంతం చేసుకుంటాడు. ఇది తెలుసుకుంటే జీవితాన్ని గెలిచినట్లే..!!


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner