30, సెప్టెంబర్ 2023, శనివారం

ఎన్నుకోండి..!!


ఎన్నుకోండి ఎన్నుకోండి

ముద్దులిచ్చే మారాజులను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

భస్మాసుర హస్తాలను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

కూల్చివేతల పురోభివృద్ధిని ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

ఆర్థిక నేరగాళ్లను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

రక్తపు మరకల రంగురాళ్ళును ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

రక్తపాశాలను వెలివేసిన వాళ్ళను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

మాతృభాషను మృతభాషగా మార్చినోళ్ళను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

శవాల పక్కన చిరునవ్వులు చిందించేటోళ్ళను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

కుతంత్రాల కుక్షులను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

పాలనెరుగని ఏలిముద్రగాళ్ళను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

ఆంధకారాన్ని అందించేటోళ్ళను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

అమ్మామెుగుళ్ళలనేటోళ్ళను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

పార్టీలు మారే ఊసరవెల్లులను ఎన్నుకోండి


ఎన్నుకోండి ఎన్నుకోండి

దైవా(దెయ్యా)న్ని ఎన్నుకోండి


పడండి పడండి

బాగా బాగు పడండి..!!

27, సెప్టెంబర్ 2023, బుధవారం

కొన్ని రాతలు..!!

కంటికి కనిపించినంత మేరా

నీలి రంగుల ప్రతిబింబాలే

సముద్రమెుడ్డున నిలబడినప్పుడు


అందినట్లున్న ఆకాశం

అందకుండా కవ్విస్తుంటుంది

నన్నందుకోలేవన్నట్టుగా


ఎగసిపడే అలలు 

ఆటలాడుతుంటాయి

తీరంతో పోటీపడుతూ


కొట్టుకొస్తున్న గవ్వల్లో

దాగిన జ్ఞాపకాలను 

గుప్పెట దాయాలన్నంత ఇష్టం


సైకతపు రాతలు

చెరపడానికి కష్టపడనక్కర్లేదు

కాని మనసుపై ముద్రను మాపలేం కదా..!!



రెక్కలు

 1.  వాయిదాల మీద

బతికేవాడొకడు

వద్దనేవాడు

ఒకడు


న్యాయం

ఎటువైపో..!!

2.  అత్యంత కీలకం

అభియోగం

నిరాధారమైనది

సాక్ష్యం


ఇదే

నేటి న్యాయం..!!

3.  మంతనాలు

ముగింపుకు రాలేదు

వాయిదాల పర్వం

కొనసాగింపు


అభియోగాలది

ఎంత గొప్పతనమో..!!

4.  వేల కొలది

పేజీలు

వందల కొద్దీ

అభియోగాలు


తీర్పులకు

సమయమెక్కడా..!!

5.  చీ’కటి బతుకులే

మనవి

వెలుతురు వాకిలి

తెరిచున్నా


ధిక్కారస్వరం

వినిపించలేనప్పుడు..!!

6.  బతుకు భయమే

ఎప్పుడూ

బాధ్యతలకు

బంధీలుగా


జీవన(వి)చిత్రం

ముఖచిత్రంగా..!!

7.  ఇష్టపడి చేయడంలో

ఆనందం

నిర్భందించి చేయించుకోవడంలో

అహం 


ఏదైనా

చరిత్రే..!!

8.  చదువుకున్న

విజ్ఞత

చదువు’కొన్న

మూర్ఖత్వం


ప్రపంచం

తెలుసుకుంటోంది..!!

9.  వాయిదాలు

రిజర్వులు

కాలయాపనే

కర్తవ్యం


ఇప్పటి

రాజ్యాంగమిది..!!

10.  మనసు

సముద్రం

మనిషి

జీవిత సంచారి


సృష్టి

వి’చిత్రం..!!

11.  అహంకారం

మానవత్వాన్ని మరిచింది

మనిషితనం

ఆత్మీయతను పంచింది


శాశ్వతానికి అశాశ్వతానికి

అక్షరమే తేడా..!!

12.  మాట

కఱకు

మనసు

బరువు


మృష్టాన్నం

బాగు బాగు..!!

13.  కరిగిన కాలానికి 

జ్ఞాపకాల అలంకరణలు

మలి పలకరింపుల 

చిరునగవులు


గుప్పెట దాచిన

అనుభూతుల జాడలు..!!

14.  రాక

పోక తప్పదు

మాజీ

తాజా మారకమే


నడిమధ్యదే

ఈ జగ’న్నాటకం..!!

15.  బాధ్యత

బరువు

బంధం

అరువు


అబద్ధం

అందమైనది..!!

16.  అరకొర

ఆనవాళ్ళు

ఆశ ఛావని

బతుకులు


నిజం

మారదు..!!

17.  న్యాయం

మారదు

అన్వయం

అవసరాల్ని బట్టి


భగవద్గీత

ఒక్కటే..!!

18.  పోటాపోటీగా

(వి)గ్రహాలు

(తే)నీటి

కావ్యాలు


గతుల

నిర్దేశం..!!

19.  దూరంగా వుంటే

ఓ పలకరింపు

దగ్గరలో వుంటే

ఓ ఆత్మీయ కలయిక


గడిచిన క్షణం

తిరిగిరాదు..!!

20.  తెగింపుతో

తేలుతుంది

ముగింపు

ఏమిటో


గెలుపే

లక్ష్యం..!!

21.  అక్షరాల

అమరిక

అతివ

అందం


కొందరికి

పైత్యం..!!

22.  వేడుకోలు

అప్పుడప్పుడు

వీడుకోలు

తప్పనిసరి


పయనం

కాలంతో..!!

23.  ఆకాశంలో 

సముద్రం 

మోడైన 

ఒంటరితనం  

కలవని తీరాలు 

కలల విహంగాలు..!!

24.  అర్థం

కావడం

వ్యర్థం

అవడం


ప్రకృతి

సహజం..!!

25.  బంధాల్లేని

చుట్టరికాలు

అనుబంధాల్లేని

రక్త సంబంధాలు


కాలం చెప్పే

కథలే ఇవి..!!

26.  ఎదుగుదల

మంచిదే

ఏకాకితనానికి

అర్థం తెలిస్తే


బంధం

నిలబడుతుంది..!!

27.  సంతకం

విలువైనదే

బంధం

బలమైనది


అవసరాన్ని బట్టి

విలువల మార్పు..!!

28.  ఏ ఆటైనా 

ఆడించేది వాడే 

ఫలితాన్ని 

నిర్దేశించేది వాడే


చతురుడు

పైవాడు..!!

29.  విద్య

ఉండాలి

వైవిధ్యం

తెలియాలంటే


గుర్తింపు

గొప్పదనం..!!

30.  వెలితి

పడటం

కలత

చెందడం


మనసుకు

తప్పనిసరి..!!





26, సెప్టెంబర్ 2023, మంగళవారం

ప్రతిదీ..!!

 ప్రతి మౌనంలో

ఓ భావముంటుది

ప్రతి భావానికి

అక్షరం ఓ రూపునిస్తుంది

ప్రతి రూపు

అందమైనది కాకపోవచ్చు

ఏ అందమైనా

మనసు ఆస్వాదించేదిగా

మిగిలితే చాలు..!!

16, సెప్టెంబర్ 2023, శనివారం

పుస్తక ఆవిష్కరణ..!!

             నేను రాసిన “ అక్షరాలతో అనుబంధాలు..యనమదల ముత్యాల సరాలు “ పుస్తకాన్ని మా పెదనాన్న, పెద్దమ్మ డాక్టర్ యనమదల రాధాకృష్ణ, బసవేశ్వరి గార్లు వారి ఇంట్లో మా అమ్మమ్మ కాసరనేని సీతారావమ్మ, మా అమ్మ యనమదల సామ్రాజ్యం, మావారు యార్లగడ్డ రాఘవేంద్రరావు గార్ల సమక్షంలో ఆత్మీయంగా ఆవిష్కరించారు. వారందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.









12, సెప్టెంబర్ 2023, మంగళవారం

13వ పుస్తకం…!!


 “ అక్షరాలతో అనుబంధాలు…యనమదల ముత్యాల సరాలు “


        మారుతున్న కాలంతోపాటు మసిబారిపోతున్న అనుబంధాల మధ్యన రక్త సంబంధాలను ఉత్తుత్తి సంబంధాలుగా మార్చేస్తున్న ధనానుబంధాలకు నమస్కారం. నా ఈ పుస్తకంలో పేర్లు లేని వారు కొందరు ఏమనుకోవద్దు. నేను ఒకే ఒక పేరు మాత్రం రాసి కూడా వద్దని తొలగించేసాను. మిగతా లేని పేర్లు నాకు తెలియనివి మాత్రమే రాయలేదు. వీలైనంత వరకు సేకరించాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం మాత్రమే. ఈరోజే ముద్రణకు వెళ్లిన నా పదమూడవ పుస్తకం మా యనమదల వారి వంశ వృక్షం. దాదాపుగా ఎనిమిది తరాల వరకు సేకరణ జరిగింది.


మల్లెతీగ పబ్లిషర్స్ కలిమిశ్రీ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు

10, సెప్టెంబర్ 2023, ఆదివారం

స్మృతిపథంలో…సమీక్ష..!!


                 మానవ సమాజంలో మనిషి తత్వం..”

      కృషితో నాస్తి ధుర్భిక్షం అన్న మాటకు నిదర్శనం డాక్టర్ పోగుల శేషగిరికుమార్ గారు. చదువుకున్న చదువుకు కొలువు రాకపోయినా నిరాశ చెందలేదా.ఎవరిని నిందించనూ లేదు. అవకాశాలను వెదుకుతున్న వారికి విజయం తథ్యమని నిరూపించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, సకళ కళ్లలో నిష్ణాతులు అయిన డాక్టర్ పోగుల శేషగిరికుమార్ గారు చిత్ర లేఖనం, తండ్రిగారి వారసత్వ సంపదైన నాటక రంగం, రచనా రంగాల్లో చక్కని ప్రతిభ కలిగినవారు. గ్రంథాలయ విద్యలో రాణించినా, ఎన్నో పరిశోధనలు చేసి రచించిన గ్రంథాలు వారికి ఎనలేని కీర్తిప్రతిష్టలను సంపాదించి పెట్టాయి. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ఆయనను వరించాయి.

     పురిటిగడ్డ మీద మమకారం లేనివాడు బహు అరుదు. పుట్టిన నేల మీద ప్రేమను వదలలేక తన చుట్టూ జరిగిన సంఘటనలను కథలుగా మలిచిస్మృతిపథంలో..” అనే కథా సంపుటిని అందించారు. కథలన్నీ అతి సాధారణ శైలిలో సామాన్య చదువరులకు సాయం చక్కగా అర్థమయ్యే రీతిలో రచింపబడ్డాయి. ప్రతి కథా మన చుట్టూ కనబడే సంఘటనలకు రూపమే


మరి స్మృతిపథంలో..ఏముందో క్లుప్తంగా నా మాటల్లో..


         ఫలితమాశించని స్వచ్ఛమైన భక్తికి, ప్రేమకు దక్కిన గౌరవం భక్త శబరిలో మనం చదవవచ్చు. భగవంతునికి భక్తితో అర్పించే తృణమైనా, ఫలమైనా దేవదేవునికి అత్యంత ప్రీతికరమని ఆనాటి శబరి కాకుండా, ఈనాటి శబరి కూడా నిరూపించింది. మనిషితనాన్ని, మానవత్వాన్ని చుట్టుపక్కలవారు నిరూపించుకున్నారు కథలో.

        చంద్రమోహన్ తిరిగిరాలేదు కథ ఎన్నో వాస్తవ సంఘటనలకు మూలం. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో చంద్రమోహన్ లు ఇలా కనబడుతూనే ఉన్నారు. మనసు బాధగా అనిపించింది కథ చదువుతుంటే.

   అల్లుడు దిద్దిన కాపురంలో సగటు మగవాడికి వాడి దారిలోనే బుద్ధి చెప్పిన వైనం చాలా బావుంది. బోలెడు కుటుంబాల్లో జరిగే విషయమే అయినా చక్కని పరిష్కారాన్ని రచయిత చూపారు కథలో.

     పంచిన ప్రేమ కథలో ఆత్మీయతకు, అనుబంధానికి బంధుత్వమేమి అవసరం లేదని, ఇద్దరి మధ్యన అభిమానమే విడదీయరాని బంధంగా మారుతుందని తెలిపిన కథ. మమకారం ఎంత తీయగా ఉంటుందో, అంత తీయగానూ చెప్పారు రచయిత.

     మాస్టారు తప్పు చేసారా? నిజమే ఇది మనకూ వచ్చే సందేహమే. సందేహం రాకపోతే కథకు అర్థం పరమార్థం ఉండదు. కొన్ని జీవితాలు ఎందుకలా అయిపోతాయన్న దానికి ఎవరి దగ్గరా సమాధానముండదు. సందేహాలు మాత్రమే పుట్టుకొస్తాయి

     గెలుపు -ఓటమి చాలా జీవితాల్లోని కథే ఇది. తమ స్వార్థానికి ప్రేమను ఎరగా వేసి తాము అందలాలెక్కాలనుకునే వారి కథ. నమ్మిన ప్రేమకు దక్కిన కానుక ఆత్మహత్య. విద్యార్థి జీవితంలోనే కాదు, మరెన్నో చోట్ల స్వార్థపు ప్రేమల్లో పడి జీవితాలు నాశనం చేసుకున్న ఎందరో మనకు గుర్తుకు రాక మానరు.

     కలను నమ్మి కలలో కనిపించిన దైవానికి తన యావదాస్తిని దానం చేయడం గొప్ప విషయమే. రామార్పణం కథలోని విషయమిది.

      ఇష్టమైన వ్యాపకం కోసం కష్టాన్ని కూడా ఇష్టంగా భరించడమంటే ఇదే కాబోలు. సినిమా మీద ఇష్టంతో కష్టపడిన పెద్దాయన కథ సినిమా పిచ్చోడు

  చదువు నేర్పిన గురువుకు శిష్యుడికి వచ్చిన అధికారంతో ఇచ్చిన గురుదక్షిణ గురించి చాలా బాగా చెప్పారు.

     పూలమ్మిన చోటనే..కథలోని పాత్రలు నిత్యం మనకు తారస పడుతూనే ఉన్నాయి ఇప్పటికి. అపాత్రదానం చేయడం వలన కష్టనష్టాలను తెలిపే కథ ఇది. కథలోని నారాయణరావులు చాలామంది ఉన్నారు ఇప్పుడు కూడా. అలానే పొందిన సాయం మరిచిన వారు కూడా

   చెప్పుడు మాటలు చేసే చేటు, మించిన కూడా చెడు దృష్టితో చూటే చుట్టుపక్కల అమ్మలక్కలు ఉన్నంత వరకు సమాజంలో చాలామంది కథలు పునుగుల సుందరం కథలే.

   డబ్బుకు ఎంత వరకు విలువ ఇవ్వాలి అని కథ మనకు చక్కగా తెలుపుతుంది

          

           డాక్టర్ పోగుల శేషగిరికుమార్ గారుస్మృతి పథంలో..” రాసిన ప్రతి కథా మనకూ తెలిసిన కథలే. ఆనాటి సమాజంలో తన చుట్టూ జరిగిన ప్రతి చిన్న విషయాన్ని చిన్నతనం నుండి గుర్తుంచుకుని కథలుగా రాయడం అభినందించదగ్గ విషయం. ప్రతి కథా వాస్తవ కథనమే. ప్రపంచాన్ని చుట్టినా, తాను పెరిగిన ఊరిని, మనుష్యులను మరువక తన అక్షరాల్లో వారిని మనందరికి చూపించి , అందరి మనసులను ఆలోచింపజేసారు. ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకంస్మృతి పథంలో..” . ఇప్పటి సమాజానికి అవసరమైన చక్కని విషయాలను కథలుగా అందించిన డాక్టర్ పోగుల శేషగిరికుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు.


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner