29, ఆగస్టు 2017, మంగళవారం

రెప్ప దాటని స్వప్నం...!!

గతం గాయమైనా ఎందుకో
జ్ఞాపకమై ఊరడిస్తోంది

వాస్తవాలు వెన్నాడుతున్నా
ఆశగా భవితకై ఎదురు చూస్తోంది

నిశీథిని నిలువరించాలని
వెలుగుపూలకై వెతుకుతోంది

కలత కన్నీరుగా మారి
మది భారాన్ని పంచుకుంటోంది

తీరం చేరని కథనం 
కడలి ఒడిలో కలవర పడుతోంది

రెప్ప దాటని స్వప్నం
రేయి చెక్కిట చుక్కలా మెరిసింది...!!

25, ఆగస్టు 2017, శుక్రవారం

అరుదైన సంతోషం....!!

ఈ అరుదైన సంతోషాన్ని అందించిన సాగర్ శ్రీరామకవచం గారికి మా(మంజు వాణి ) మనఃపూర్వక
కృతజ్ఞతావందనాలు.
గత కొన్నేళ్లుగా ముఖ పుస్తక స్నేహితులమైన మేము పంచుకున్న ఆలోచనలు, అనుభవాలు, అక్షర సాన్నిహిత్యాలు, ఆత్మీయ పలకరింపులలో ఎప్పుడో అనుకున్న అక్షర భావాల కలయిక ఒక పుస్తక రూపంగా రావాలని. ఆ ఆలోచనకు అండగా నిలిచిన వజ్జా రామకృష్ణ గారికి మా వందనాలు.
నా రాతలు ఎప్పుడూ పుస్తకంగా రావాలని అనుకోలేదు. పుస్తకంగా రావడానికి అర్హత ఉందో లేదో కూడా తెలియదు. అనిపించినా ప్రతి భావాన్ని అక్షరాలుగా నా కబుర్లు కాకరకాయలు బ్లాగులో దాచుకుని చూసుకోవడం ఓ అలవాటుగా మారిపోయింది గత కొన్ని సంవత్సరాలుగా. అలా మేమిద్దరం అనుకున్న మాట "మనిద్దరం కలిసి మన రాతలు ఓ పుస్తకంగా వేసుకుందాం ఎప్పటికైనా". దానికి కార్యరూపమే "గుప్పెడు  సవ్వడులు" ( మంజు వాణి మనోభావాలు). పుస్తకాన్ని వేసేటప్పుడు కూడా మేము అనుకోలేదు దానికి ఇంత అరుదైన గౌరవం దక్కుతుందని.
తోటి రచయితల రాతలను ఎద్దేవా చేసే ఈ రోజుల్లో మా పుస్తకానికి లభించిన మాటల ముత్యాల సరాలు సాగర్ శ్రీరామకవచం గారివి. మాటల్లో చెప్పలేని ఆనందాన్ని తమ అభిప్రాయం ద్వారా అందించిన సాగర్ గారికి, పుస్తక సమీక్షను వేసిన మల్లెతీగ కలిమిశ్రీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
వీలైతే మీరు చదివి మీ అభిప్రాయాలను చెప్పండి. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు.
మంజు వాణి.

24, ఆగస్టు 2017, గురువారం

ఎంత బావుండు..!!

అక్షరాల అలికిడికి
ఆటవిడుపుగా నిలిచిన
జ్ఞాపకాల ఒరవడి
భావాలకు బందీగా
మారిన మదిని
సముదాయించే యత్నంలో
ఆసరాగా చేరిన
అమ్మ ఒడిలోని
పాపాయి నవ్వుల
సందడిలో ఆదమరచిన
పసితనపు ఛాయలు
మళ్ళి వస్తే ఎంత బావుండు..!!

మంచిరోజులు వచ్చినట్లే....!!

నేస్తం,
        మన అవసరాలు తీర్చుకోవడానికి బంధాల మధ్యన బంధనాలు వేయడం, అవాకులు చవాకులు పేలడం నిత్య కృత్యంగా మార్చుకున్న కొందరు మానసిక రోగులను చూస్తుంటే వాళ్ళ మీద కోపం రావడం కాకుండా జాలి వేస్తోంది. అంతకన్నా విచారకర  విషయం ఏమిటంటే ఈ మానసిక రోగుల మాటలు విని ఎదుటివాళ్ళని సూటీపోటీ మాటలనే చదువుకున్న, చదువు చెప్పే మూర్ఖులను చూస్తుంటే చాలా బాధగా ఉంటోంది. మనకు అవసరం అనిపించింది వేరొకరికి అనవసరం అనిపించొచ్చు, అందుకని ఎదుటివారిని దుబారా మనుష్యులు అనడం ఎంత వరకు సమంజసం..?
        జీవితంలో నిలబడటానికి ఆసరా ఇచ్చిన చేతిని మరచి, అవసరానికి అనుబంధాలను అడ్డుగా పెట్టుకునే నయ వంచకుల తీయని మాటలు వింటూ వాస్తవాలను ఆలోచించలేని దౌర్భాగ్యం ఎన్ని సమస్యలను తెస్తుందో, ఎన్ని ఆత్మీయతలను దూరం చేస్తుందో తెలుసుకోలేక పోవడం నిజంగా కొందరి దురదృష్టమనే చెప్పాలి. ఆపదలో అక్కరకు రాకున్నా, అదను చూసి తోడబుట్టిన వారిని నట్టేట ముంచుతున్నా తప్పుని తప్పు అని చెప్పలేని సభ్య సమాజంలోని సగటు జీవులం. ఎటు పోతున్నామో కూడా తెలియని అయోమయంలో మాటల మాయలో పడి కొట్టుకుపోతూ చివరాఖరికి బయట పడాలనుకునే సరికి కాలం మన చేతిలో లేకుండా పోతుంది. పర్యావరణాన్ని కాపాడుకుందాం, మట్టి వినాయకుళ్ళని పెడదాం అని నినాదాలు చేస్తూ మన కుటుంబాన్ని సరి చేసుకోవడం మర్చిపోతున్నాం. కాపాడుకోవాల్సింది కుటుంబ విలువలను, బంధాలను, అనుబంధాలను. ఇవి సరిగ్గా ఉంటే సమాజం తద్వారా పర్యావరణం అన్ని బావుంటాయి. ఒకప్పటి మట్టి మనుష్యులను, మంచి మనసులను మనం గుర్తు చేసుకోగలిగితే మళ్ళి మన కుటుంబ వ్యవస్థకు మంచిరోజులు వచ్చినట్లే.
 అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు


         

22, ఆగస్టు 2017, మంగళవారం

జీవన 'మంజూ'ష (2)...!!

నేస్తం,
        తరాల ఆంతర్యాల అనుభవాలకు చిహ్నంగా మిగిలిన విలువలు వెల వెలా పోతున్నాయి. ఈనాటి తల్లిదండ్రులు ఒకప్పటి పిల్లలే అన్న సంగతి మరచి తమ గొప్ప కోసమో లేదా నలుగురిలో తమ హోదాను చాటుకోవడం కోసమో పిల్లల మనసులతో ఆడుకుంటున్నారు. ఈ కార్పొరేట్ చదువులు వచ్చిన  తరువాత చదువుని కొనుక్కోవడం మామూలై పోయింది.  రాంకుల కోసం తపన మొదలైంది. మన ఇష్టాయిష్టాల కోసం పిల్లల ఇష్టాలు కాలరాయడం ఎంత వరకు సబబు..?
అలా అని తప్పంతా పెద్దలదే అనుకోవడం కూడా పొరపాటే. మధ్య తరగతి కుటుంబాలను తీసుకుంటే పిల్లలు తమలా కష్టపడకూడదని పిల్లలకు అన్ని అమర్చి పెడుతుంటే వాళ్ళకు రూపాయి విలువ, చదువు ఆవశ్యకత తెలియకుండా పోతోంది. విలాసాల మోజులో పడి మానవతా విలువలనే మర్చిపోతున్నారు. సరదాల అవసరాలకు, ఆడంబరాలకు అమ్మానాన్నలను వాడుకుంటున్నారు. ప్రచార మాధ్యమాలు, ముఖ పుస్తకాలు, ట్విటర్లు మొదలైన సేవలు, సెల్ ఫోన్ల వాడకం వచ్చాక ఒకే ఇంట్లో ఉన్నా పెద్దల పిల్లల మధ్య దూరం పెరిగిపోయింది. "ఎవరికీ వారే యమునా తీరే" అన్న నానుడి అక్షరాలా నిజమైంది.
అనుబంధాలను పెంచుకుంటూ, మార్కులతోనూ, రాంకులతోను పిల్లల తెలివితేటల్ని అంచనా వేయడం మానివేసి వాళ్లలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం మొదలుపెడితే ప్రతి విద్యార్థి ఓ అబ్దుల్ కలాం కాక మానడు.
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం.

9, ఆగస్టు 2017, బుధవారం

రెక్కలు..!!

1. అందని
ఆకాశం
అంతేలేని
కడలి

మనసుకు
ప్రతిరూపాలు...!!

2. గతాలు
జ్ఞాపకాలు
వాస్తవాలు
వర్తమానాలు

అక్షరాలుగా
కాగితాలపై..!!



8, ఆగస్టు 2017, మంగళవారం

మెరిసిన కవితాకన్నియ...!!

రెప్పపాటు ఈ జీవితానికి
కనురెప్పల మాటున కలలెన్నో
కనపడని వ్యధల కథలెన్నో

మాటల చాటున మౌనానికి
వినిపించే వితరణ వేదనలెన్నో
వివరించలేని గాయపు గురుతులెన్నో

పెదవి దాటని పలుకులకు
మిగిలిన గుండె సవ్వడులెన్నో
నినదించలేని గొంతు రోదనలెన్నో

పరుగులెత్తే కాలానికి
పోటీ పడలేని జీవనాలెన్నో
ఓటమి ఓదార్పుల వెతలెన్నో

జ్ఞాపకాల గువ్వలలో
గూడు కట్టుకున్న గతాలెన్నో
గాలికెగిరిపోయే గాథలెన్నో

అంతేలేని అక్షర ప్రవాహానికి
అడ్డుపడే ముద్రారాక్షసాలెన్నో
మనసు వాకిట నిలిచిన భావాలెన్నో

ఒలికిన కవనపు చినుకుల్లో
చిలికిన చిరు జల్లులెన్నో
మెరిసిన కవితాకన్నియ హరివిల్లులెన్నో..!!

3, ఆగస్టు 2017, గురువారం

త్రిపదలు ..!!

1. కన్నీరు నీరైంది
నీరవమైన  మదిని
ఊరడించలేక...!!

2. బాధ్యత భారమైంది
బతుకు భళ్ళున తెల్లారి
గూడు చెదిరితే..!!

3. అక్షరం ఆయుధమై
భావం విస్ఫోటనం చెందితే
అగ్నికణ వర్షమే కాగితాల నిండా..!!

మీరుగానే మిగిలిపోతారు రేపటి రోజున...!!

నేస్తం,

   బంధాలు, బంధుత్వాలు ఎంతగా పలచబడి పోతున్నాయంటే చెప్పడానికి కూడా ఏదోలా ఉంది. అక్క బిడ్డలు, అన్న బిడ్డలు అని మనకున్నా, ఎంతగా మన చేతుల్లో పెరిగినా వారి నుండి ఓ పలకరింపు కరువై పోతోంది ఈనాడు. పలకరింపు అనేది మనసునుంచి రావాలి, తెచ్చిపెట్టుకొనకూడదు. వరుసలను వాడుకునే వారు కొందరైతే, మనసులతో, మనుష్యులతో డబ్బు కోసం ఆడుకునే వారు మరికొందరు. డబ్బు జబ్బు సోకగానే ఆప్యాయతలు మరచిపోతున్నారు. సంపాదన మనకు ఉంటే మనమే అనుభవిస్తాము కానీ ఎవరికీ ఒక పైసా పెట్టము. మాటలు, చేతలు మాత్రం కలకాలం నిలిచిపోతాయి. అసలు ఒకరు మనలని పలకరించలేదు అనుకోవడానికి ముందు మనం ఎంత వరకు పలకరిస్తున్నాం అనేది చూసుకుంటే బంధాలు కొన్ని రోజులైనా నిలబడతాయి. నాలుగు రోజులు ఒకరితో, మరో నాలుగు రోజులు మరొకరితో మన అవసరాలు గడుపుకోవడం ఎంతవరకు సబబు..? మనం చేసిన తప్పొప్పులను నిజాయితీగా ఒప్పుకున్న రోజు మనకు ఓ మనస్సాక్షి ఉందని అనిపిస్తుంది. అందరం బతికేస్తున్నాం కనీసపు విలువలు లేకుండా అన్ని బంధాలను దుయ్యబడుతూ అల్లరిపాలు చేస్తూ కొన్నిరోజులు, తరువాతేమో తప్పయిపోయింది అని మన అవసరాలు తీర్చుకోవడానికి ఆ బంధాలను వాడుకుంటున్నాము. అన్నం పెట్టిన చేతినే కాటు వేసే విషపు పురుగులున్న సమాజం మనది. ఇక ఈ అభిమానాలకు, అనుబంధాలకు చోటు ఉంటుందని ఎదురుచూడటం కూడా అత్యాశే అవుతుంది.  చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయగానే సరి కాదు, పెద్దలు తప్పుచేసినా సరిదిద్దే పిన్నలు ఉండాలి. అంతేకానీ ఆ తప్పుని సమర్ధించే వ్యక్తిత్వం మీకుంటే మీరుగానే మిగిలిపోతారు రేపటి రోజున.

అన్నట్టు చెప్పడం మరిచా .. ఇది నా బ్లాగులో 1401 వ పోస్టు.
 
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner