రెక్కలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
రెక్కలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, జులై 2026, సోమవారం

రెక్కలు

 1. దీర్ఘదృష్టి

బావుంది 

హ్రస్వదృష్టే

అనడం లేదు


దూరానిదెప్పుడూ

దగ్గరతనమే..!!

2.  కట్టె

కాలాలి

కట్టెలు 

కావాలి


కాపీనం

కాయానికి..!!

3.  తరుగు

బంగారానికే కాదు

బంధాలకు

పాకింది


విలువల

తూకమే..!!

4.   Attachment

Detachment 

Heart and

Soul 


Unconditional 

Love..!!

5.  విసుక్కోవడం

పరిపాటి 

వీడిపోవడం

స్వయంకృతం


సంయమనం

సరైనది..!!

6.  కొన్ని 

పరిచయాలు

ఆత్మీయ

అనుబంధాలు


దూరాల

కొలమానం అక్కర్లేదు..!!


7.  నమ్మకం

బలమైనది

నిజాయితీ 

విలువైనది


కోల్పోతోంది

మనిషితనం..!!

8.  తింటే

తిన్నామంటారు

తినకపోతే

తినలేదంటారు


రెండు నాల్కల

ధోరణి..!!

9.  బుద్ధుడిది

బోధివృక్షం

రుద్రుడిది

రుద్రభూమి 


సిద్ధాంతం 

ఎవరిది వారిదే..!!

9.  మాట 

పొదుపు

నోరు

అదుపు


క్రమశిక్షణా

రాహిత్యం..!!

10.  చెప్పే స్థాయి

కొందరిది

చెప్పించుకునే స్థితి

మరికొందరిది


మనిషికి

కాలానికి సంఘర్షణ..!!

11.  గుర్తింపు 

కావాలి

ఆధిపత్యపు

చరిత్ర


లిఖించేయడమే

తరువాయి..!!

12.  రాతల్లో

బ్రహ్మరథాలు

వడ్డించేది

మనవాడే 


పుస్తకానికో

పురస్కారం..!!

13.  ఆరుపదుల ప్రేమ

ఉప్పొంగి పోతోంది

తినడమే తెలిసిన

బతుకులు కొన్ని


ఒక్క దీపమైనా

ఎరుగని స్మృతి శకలాలు..!!

14.  చాతకానప్పుడు

ఊరుకోవాలి

నెపం 

వేయకూడదు


అన్నీ బావుంటే 

మన ప్రతిభే..!!

15.  అతుకులూడిన

అనుబంధాలు

మెతుకుల లెక్కల

బతుకులు


కొడిగట్టిన

దీపం..!!

16.  అన్నీ

శేషాలే

అవశేషాల

లెక్కలు తేలక


జీవితం

యంత్రాల యాంత్రికతలో..!!

17.  ఆశ

అధఃపాతాళం

కోరిక

కొసమెరుపు


ఏ రాతలో

ఏముందో..!!

18.  గాలి

ఎవరో

ఘనాపాటి

ఎవరో


మనస్సాక్షికి

తెలుసు..!!

19.  కత్తిరింపులు

తెలియకూడదు

పలకరింపులు

సున్నితంగా వుండాలి 


వాటంలో

నేర్పు..!!

20.  కొత్తగా తెలియాల్సినది 

ఏముంది?

పరిచయం

పాతదే కదా!


ఋణానుబంధం

ఎప్పటిదో..!!

21.  కోరికల

ప్రవాహం

ఆలోచనలకు

అడ్డేముంది


మది

పున్నమి సంద్రం..!!

22.  నెగ్గడం

తగ్గడం

పరిణితిని

తెలుపుతుంది


బంధం

ముఖ్యం..!!

23.  ఓటమిలోనూ

ఆనందమే

గెలుపు బంధం

మనదైనప్పుడు


జీవితం

విలువైనది..!!

24.  కష్టంలోనే

ఇష్టముంటుంది

బంధం

మన బాధ్యతయ్యాక


రాచరికం

రాచబాటే..!!

25.  నీటిదే 

కాదు

మనసుది

కూడా


ఘనీభవించే 

లక్షణం..!!

26.  అయినవారు

ఎవరో

పరాయివారు

ఎవరో 


చుట్టరికం

కాసులతో..!!

27.  చెప్పాల్సినవి

ఐపోయాయి

చేయాల్సినవి

మిగిలిపోయాయి


మాటలు

చేతలు..!!

28.  మనమిచ్చింది

గుర్తుంటుంది

మనకిచ్చింది

మర్చిపోతాం


ఇచ్చిపుచ్చుకోవడాలు

సహజమే..!!


26, ఫిబ్రవరి 2026, గురువారం

రెక్కలు

 1.  వద్దనుకునే

బంధాలు

విదిలించుకోలేని

పాశాలు


మనసు 

సున్నితమైనది..!!

2.  బాధ్యత 

లేదు

బంధాలు

అవసరార్థమే


కొందరు

పరాన్నజీవులు..!!

3.  ఆకాశంలో చుక్కలు

చూపడం సులువే

లెక్కలేయడమే

బహు కష్టం 


నీటి మీది

రాతలు..!!

4.  ఆట

ఆడాలి

వేట

కొనసాగించాలి


గెలుపుదే

పైచేయి..!!

5.  మాటలు

తేనె చినుకులు

మనసులు

కందిరీగలు


నైజం

బట్టబయలు..!!

6.  కలలెప్పడూ

నిదురలోనే

కలతలెప్పుడూ

మెలకువలోనే


తర్కానికి

దొరకవు..!!

7.  నిన్నటి

గతం

రేపటి

జ్ఞాపకం 


వాస్తవం 

ఈరోజు..!!

8.  పిలుపులు

పెట్టుబోతలు

స్థాయి

అవసరం


వ్యక్తిత్వం

ఆభరణం..!!

9.  మనసు 

దిగులు

కాగితాలకు 

చేరింది 


అక్షరం

ఆశ్రిత పక్షపాతి..!!

10.  కోట్లకు అధిపతులు 

కొందరు

మనిషితనమే

శూన్యం 


కుసంస్కారానికి

వయసుతో పనిలేదు..!!

11.  శుభ్రత

పరిసరాల్లో

అశుభ్రత 

మనసుల్లో


ఆకాశ హర్మ్యాల

సంప్రదాయం..!!

12.  నిత్య సంఘర్షణ 

మిగిలేవుంది

నిరంతరాన్వేషణా

క్రమంలో


యాంత్రికతే

జీవనమిప్పుడు..!!

13.  అవసరార్థపు

ప్రేమలు

ఆత్మీయతల

ముసుగులు


ఆంగికం

వాచకం సరితూగాయి..!!

14.  పనికిరాని

వస్తువులు

పనికిమాలిన

మనుష్యులు


అసూయకు

పరాకాష్ట..!!

15.  అహంకారం

స్వభావం 

ఆధిపత్యం 

అరకొరగా లభించేది


సంస్కారం 

జన్మతః..!!

16.  విలువైన 

వజ్రాలు

రాళ్ళు 

రప్పలు


స్థానబలిమితో

విలువ..!!

17.  కొన్ని

అవమానాలు

గెలుపుకి

పునాదిరాళ్ళు


కాలమే

సమాధానం..!!

18.  మనం

ఏంటన్నది 

మన 

ప్రవర్తన చెబుతుంది 


ఋజువు

చావు..!!

19.  బంధము

అనుబంధము

తోడు

నీడా 


మన

మధ్యన..!!

20.  మన

ఎదుగుదల

మనకి

ముఖ్యం


క్రియ

ఏదైనా సరే..!!

21.  మనసు

లేకుండా 

మనిషి

వుండడు


చావుపుట్టుకలు

సరితూకాలు..!!

22.  అవసరానికి

అయినతనము

అక్కర్లేనప్పుడు

పరాయితనము


మరిచింది

మనిషితనమే..!!

23.  మనం

అక్కర్లేని వాళ్ళు 

మనకి

వద్దు 


దూరం

దగ్గరే..!!

24.  మనిషి

కనుమాయమైతేనే

గొప్పదనం

గుర్తించడం 


అందరూ

చేసే పనే..!!

25.  గుట్టు

గుంభనమే

నిజం

నిప్పుకణిక


ప్రపంచం

అరచేతిలో..!!

26.  కొన్ని 

బంధాలు 

గతజన్మ 

అనుబంధాలు


రాకపోక

తప్పని ప్రయాణాలు..!!

27.  అంతరం 

ఎప్పుడూ అంతే

ఆంతర్యాన్ని

దాచేస్తూ


దూరం

తరగదు..!!

28.  ఆలంబన

దొరికితే చాలు

అందంగా

అల్లుకుపోతాయి


రేపటి 

చింత లేదు..!!

29.  సంపాదన

గెలుపు

పేదరికం

ఓటమి


చివరకు

మిగిలేది..?


30.  బతుకుతత్వం

బహుముఖీనం

మనసుతత్వం

మౌనతరంగం


తత్వం

అంతర్లోచనం..!!



25, జులై 2025, శుక్రవారం

రెక్కలు

 1.  కొన్ని 

జీవితాలింతే

ఎవరికి 

కాకుండా పోతూ


విధాత చేవ్రాలు

వి’చిత్రమైనది..!!

2.  విడివడలేని

ముడులు

విప్పుకోలేని

పాశాలు


చేజారుతున్న

అనుబంధాలు..!!

3.  చేసాం చేసాం

అంటాం

చేయించుకున్నది

మర్చిపోతాం


మని’షి

సహజ లక్షణం..!!

4.  బాధను

పంచుకోలేరు

బాధ్యతలను

భరించలేరు


గాలివాటపు

జీవితాలు..!!

5.  కొత్తగా పెరిగే

దూరమేముంది?

దగ్గరితనమసలే

లేనప్పుడు 


కావాలనుకున్నా

దొరకనివి కొన్ని..!!

6.  కోల్పోయిన 

కాలం 

ఎప్పుడూ

విలువైనదే


చేజార్చుకుంటున్న

అనుబంధాలు..!!

7.  అసలు

నకలు

నిజాయితీ

నటన


అన్నీ

ఒకే గాటిన..!!

8.  అదృష్టానికి 

ఆయువు తక్కువ

దురదృష్టానికి

ఊపిరెక్కువ


ఫలితం

మనది మాత్రమే..!!

9.  నెపం

వేయడం

నేరం

మోపడం


ఖర్చేం

అవదు..!!

10.  విషయసూచిక

ముందే తెలిసినా

విషాద

సంచికలే


కొన్ని 

జీవిత పుస్తకాలెప్పుడూ..!!

11.  తిరస్కారం 

అలవాటే

పురస్కారం 

పలకరించనప్పుడు


రాజకీయ 

చతురత..!!

12.  తీసివేతలు

రావడం లేదు

కూడికలు

ఎక్కువయ్యాయని కాబోలు


లెక్కలు

నేర్చుకోవడం అవసరమే..!!

13.  నీతులు 

చెప్పడానికి ఏముంది

పెద్దబాలశిక్ష

చదివితే చాలదూ


ఆచరణే

రావాలి..!!

14.  స్వప్న సౌధాలలో

విహారం

కలలకు సమయమే లేని

జీవితాలు 


సాకారానికి

ఆకారం తోడ్పాటు..!!

15.  విరామం

అవసరమే

తీరం తెలియని

దూరాలకు


వారధి

విరిగిపోయింది..!!

16.  మరలిరాని

క్షణాలు

దగ్గరవలేని

దూరాలు


మనసు

మమకార’మది..!!

17.  సాయం

చేయము

ఉపయోగించుకోవడం

వెన్నతో పెట్టిన విద్య


స్వభావం

సహజసిద్ధం..!!

18.  నమ్మితేనేగా

మోసపోయేది

మనిషైనా

మనసైనా


కాలాతీత

వ్యక్తులు..!!

19.  వాచకం

మరిచిపోయాం

వాచాలత్వం

పెరిగి


తూకం

అటుదిటు..!!

20.  మనలో

లేనిది

కొందరిలో 

ఉన్నది


మెచ్చుకునే

గుణం..!!

21.  మాట

మనిషి

ముందు

వెనుక


వ్యక్తిత్వం 

బట్టబయలు..!!

22.  విస్తరిది 

ఏముంది 

వడ్డించేవారు

మనవారైనప్పుడు


ధనసంబంధాలకు

విలువెక్కువ ..!!

23.  చేసేది

ఆత్మదానం

అవుతోంది

అపాత్రదానం


అక్షరాలకంటని

మాలిన్యం..!!

24.  సఖ్యత 

చిరునామా

ప్రపంచమంతా 

అరచేతిలోనే


వెతుకుతూనే

ఉండాలి..!!

25.  బొమ్మకు ప్రాణం పోసిన

బ్రహ్మ 

బతుకునే ఆటగా మార్చిన

కర్మ


రాతను మించినది లేదన్నది

సత్యం..!!

26.  మనసు

చదవగలిగితే

మౌనాన్ని 

వినగలం


మనిషి

మరో దృష్టికోణం..!!

27.  భోంచేయడానికి

బంధువులు 

బాధ్యతలక్కర్లేని

అనుబంధాలు


అయోమయంలో

బంధాలు..!!

28.  ఆదుకున్న

రోజులు

ఆదమరిచిన

కాలము


గుర్తే లేని

గతమైంది..!!


29.  బాధలు

కొన్ని

బరువులు

ఇంకొన్ని


మోసేవాళ్ళకు

అలవాటే..!!


30.  జీవించడంలో 

అర్థం 

చెప్పాల్సినవి 

చేయాల్సినవి


ఒక మంచి

ప్రేమ కథ..!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner