27, జూన్ 2017, మంగళవారం

నిలిచిపోయిన తరుణం...!!

అందరాని అనుబంధాలను
అక్కునజేర్చుకునే ఆత్మీయత
చేజార్చుకున్న క్షణాలు

'సు'దూరంగా తరలి పోయిన
మనసుల మధ్యన తరగని మాటలు
మౌనంగా మిగిలిన వేళ

పిలుపులకందని చుట్టరికాలు
కలుపుకోవాలని ఆత్ర పడే ఆశల విహంగాలు
ఎదురుచూస్తున్న వైనాలు

మరిచిపోయిన గతాలు తట్టి లేపుతుంటే
జ్ఞాపకాల చెమరింతలు చెక్కిలిపై స్పృశిస్తుంటే
ఓపలేని భారాన్ని దించుకోవాలన్న వాస్తవం

వెన్నెల్లో చందమామ కథల సంగతులు
చిత్తడి నేలలో వేసిన తప్పటడుగుల గుర్తులు
కరిగిన బాల్యాన్ని తలపిస్తూ నిట్టూర్పులు

రూకలకై పరుగులు పెడుతూ
కోల్పోయిన జీవితపు ఆనందాలు
అందని చుక్కల్లా అగుపిస్తూ అల్లంత దూరంలో

సప్త సంద్రాల కేంద్ర బిందువు వారధిగా
బంధాలు కలిసిన మరుక్షణం వెల్లువెత్తిన సంబరం
వేల ఉగాదుల ఊసుల కలబోతగా నిలిచిపోయిన తరుణం...!!


బంధాలు, అనుబంధాలు, గతాలు, జ్ఞాపకాలు జీవితాల చుట్టూ తిగిగే నా అక్షరాలకు కూడా ఓ బహుమతినిచ్చి ప్రోత్సహించిన తెలుగుతల్లి, కెనడా వారి బృందానికి, నా అభిమాన రచయిత్రి నిషిగంధ గారికి, ఇతర న్యాయ నిర్ణేతలకు, ఈ అవకాశాన్ని తెల్పిన కన్నెగంటి అనసూయ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

25, జూన్ 2017, ఆదివారం

సాహితీ ఆత్మీయులందరికి ఇదే మా ఆహ్వానం..!!

ఏదో మనసుకు తోచిన మా భావాలకు అక్షర రూపాన్ని ఇస్తున్న మేము ఇప్పుడు ఓ పుస్తకంగా మలిచి మీ ముందుకు తెస్తున్నాము. మీ అందరి దీవెనలు అందాలని కోరుకుంటున్నాము.
                                           మీ రాకను కోరుకునే
                                                     మీ
                                               మంజు వాణి

జీవితాక్షరాలై...!!


జ్ఞాపకాలను గుర్తుచేస్తూ
గతం వెంబడిస్తూనే ఉంది

గాయం మానిపోయినా 
గురుతుగా మిగిలే ఉంది

దిగులు కన్నీళ్ళుగా మారి
పక్కనే పలకరిస్తూనే ఉంది

రేపటికి రాలే పువ్వులా
నవ్వు నాతోనే ఉంది

ఈ క్షణం నాదని గుర్తుచేస్తూ
ఏకాంతంతో ఎడద నిండింది

మరో మజిలికి సాయంగా
సంతోషం సహవాసం చేస్తానంది

సరిపోయినన్ని అనుభవాలుగా
జీవితాక్షరాలై ఇలా చేరిపోతున్నాయి...!!

23, జూన్ 2017, శుక్రవారం

అమ్మంటే...!!

నెలల భారాన్ని పురుటి నెప్పులను
ఓ పసికందు భూమిపై పడిన వెంటనే
వినిపించిన ఏడుపులో ఆనందాన్ని పొందుతూ
ఈ ప్రమంచాన్నే మరచిన తల్లి మనసు

లాలిపాటల గోరుముద్దల్లో మమకారాన్ని
ఆటపాటల అల్లరిలో ఆత్మీయతలను
మురిపాల ముద్దుమాటల్లో ముచ్చట్లను
నడకల నడవడిని తీర్చిదిద్దే అనురాగమూర్తి

వయసుల తారతమ్యాల ఒడిదుకులను
వావివరుసల బంధాలను అనుసంధానం చేస్తూ
అందరి ప్రేమను ఒక్కటిగా చేసి అందిస్తూ
మానవతా విలువలను నేర్పించే మమతల పాలవెల్లి

సృష్టికి మూలమై ఆది గురువు అమ్మై
మొక్కవోని ధైర్యాన్నిస్తూ విజయ పధానికి చేరువగా
వెతల వారధి తొలగిస్తూ బ్రతుకు పయనాన్ని నేర్పిస్తూ
అక్షరాలకు అందని మాతృమూర్తి అన్ని తానైన అంతర్యామి..!!

సంస్కారం...!!

నేస్తం,
         సంస్కారం అనేది పుట్టుకతో వస్తుంది కొందరికి. మరికొందరికేమో తమ పెద్దల నుండి లేదా పెరిగిన పరిస్థితుల ప్రభావంతోనూ అబ్బుతుంది. విద్వత్తుకు ఆభరణం వినయం, విధేయత అని మా  చిన్నప్పుడు పద్యాలలో చదువున్నట్లు గుర్తు. ఇప్పుడు పద్యాలు మనకు అంతగా అందుబాటులో లేవు కనుక ఈ సంస్కార సంబంధాలు కూడా ఊరికే నాలుగు మంచి మాటలు మనం నలుగురికి చెప్పడానికే పరిమితం అయిపోయాయి, ఆచరణకు పనికిరాకుండా.
ఇక సాహిత్యం విషయానికి వచ్చినా మేథస్సును పక్కనబెట్టి  అధికారాలకు డప్పులు కొట్టడం, డబ్బులకు అందనిదిలేదంటూ ఋజువు చేస్తున్నారు. పురస్కారాలకు విలువలేకుండా చేస్తున్నారు. మనదేశం గుర్తించినా మన తెలుగు విద్వత్తు మన పక్కనే ఉన్నా మనకు కనబడటం లేదు. విద్వత్తుకు పురస్కారం ఇస్తే అది పురస్కారానికి గొప్పదనాన్ని ఆపాదిస్తుంది. మన పురాణ ఇతిహాసాలను సామాన్యులకు అర్ధమయ్యే వచన పదాలతో ఎన్నో పుస్తకాలు రాసిన, మరెన్నో ప్రవచనాలు తమ స్వరాలనుండి పలికిస్తున్న పెద్దలకు మన వంతుగా తగిన గౌరవ పురస్కారాలను అందిస్తే తెలుగుజాతి గర్వపడుతుంది.
ఇక కవిత్వం విషయానికి వస్తే ఎందరో యువ కవులు, కవయిత్రులు చక్కని, చిక్కని కవిత్వం రాస్తున్నారు. వారిని అభినందించి ప్రోత్సహించే ప్రక్రియలో మనసున్న కొందరు కవులు, కవయిత్రులు తమ చక్కని విశ్లేషణలతో చక్కని ప్రోత్సాహాన్ని అందిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. మరికొందరేమో తమకు నచ్చినవారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది సహజ నైజమే. మీరు తెలిసినా తెలియకున్నా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ అభినందించిన వారికి కృతజ్ఞతలు తెల్పడం అన్నది మీ విజ్ఞతకే వదలివేస్తున్నాను. ఇచ్చిపుచ్చుకునే మన సంప్రదాయం చాలా గొప్పది నాదృష్టిలో. ఒకరు మిమ్మల్ని ప్రోత్సహిస్తే మీరు మరొకరికి చేయూత అందించండి, ఆంతేకానీ వారిని అట్టడుగుకి తొక్కే ప్రయత్నం మానుకోండి.

19, జూన్ 2017, సోమవారం

యుద్ధం అనివార్యమవుతున్నదని...!!

బాధలకు బంధీలౌతూ
బాధ్యతల బందిఖానాలో
సమస్యలకు సమాధానాల
వెదుకులాటలో దొరకని
ఆలోచనలను అందిపుచ్చుకోవాలన్న
ఆరాటాన్ని అధిగమించలేని
సగటు మద్యతరగతి జీవితాల
పరుగు పందెంలో
అలసిపోని నిరంతర శ్రామిక జీవులు
చీకటి రెక్కల్లో చిక్కుకుని
వెలుగుపూల దారులకై
వేచి చూస్తున్న నిరీక్షణకు 
యుద్ధం అనివార్యమవుతున్నదని
తెలిస్తే వచ్చే తెగింపుకి ముగింపు
బ్రహ్మకైనా అంతుచిక్కదేమో...!!

11, జూన్ 2017, ఆదివారం

అపురూపమైన చెలిమి...!!

నేస్తం,
        స్నేహం గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివితీరదెందుకో. రాహిత్యంలో మునిగిన వారికి ఈ తీయదనం మరీ మక్కువగా ఉంటుందనుకుంటా. ఈ చెలిమి అక్షరాలతో కావచ్చు, లేదా మనసులు పంచుకునే ఊసులతో కావచ్చు, జ్ఞాపకాలతో అనుబంధం కానీ లేదా మరింకేదైనా కావచ్చు. కారణం మాత్రం రాహిత్యమే అనిపిస్తోంది. నేస్తాల మధ్యన అహానికి, ఆడంబరాలకు తావుండదు. స్నేహం ఎప్పటి నుండి అని కాదు ఎంత చిక్కని బంధంగా అల్లుకుంది అన్నదే ముఖ్యం.
  మనసు కలత చెందినప్పుడో, సమస్యల వలయాలు కమ్మినప్పుడో ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఎదో ఒక క్షణంలో చిన్ననాటి నుండి ఇప్పటి వరకు మనతో చెలిమి చేసిన జ్ఞాపకాలను తడమకొనక తప్పదు. అలా చేయలేదు అని ఎవరైనా చెప్తే అది నిజం కాదు. మనిషి అన్న వారు జ్ఞాపకాలు లేకుండా ఉంటారా...! కడవరకు మనతో స్నేహం చేసేవి ఆ జ్ఞాపకాలే. మనకు మిగిలేవి కూడా ఆ నిధులే. ఆ నిధుల ఖజానాలో అందరు దాచుకునేవి నెయ్యపు జ్ఞాపకాల తీయద(ధ)నాన్ని. అవి లేని జీవితాలునిస్సారమైనవే అని అనడంలో ఏమి అతిశయోక్తి లేదు.
     పంచుకుని పెంచుకునేది స్నేహం. అంతేకాని ఆడంబరాలను, ఆర్భాటాలను చూపించుకునేది స్నేహం కాదు. బాధలో ఓ చిన్న ఓదార్పునిచ్చేది ఆత్మీయమైన స్నేహం. కష్టంలో ఆసరానిచ్చేది స్నేహం. మన అవసరానికి వాడుకునేది కాదు స్నేహమంటే. స్నేహమంటే పారిజాతాల పరిమళంలా వ్యాపించేది. పున్నమి వెన్నెలా, చీకట్లో మిణుగురుల వెలుగులు, చల్లని సాయంత్రాలు, మండే ఎండలు, కురిసే వానలు ఇలా ప్రతి దానిలో జ్ఞాపకాల గురుతులను మనకందించేదే అసలైన స్నేహం. శత జన్మాల బంధాల బంగారు క్షణాలను ఈ జన్మలో మనకు చేరవేసేదే చెలిమి కలిమి.
గత సంవత్సర కాలం నుండి నా క్షేమాన్ని కాంక్షించిన నా ఆత్మీయులకు, నేను వారి జ్ఞాపకాలలో లేకున్నా నా జ్ఞాపకాలలో ఎప్పటికి ఉంటూ, ఈ అరుదైన అపురూపమైన చెలిమి సంతసాన్ని నాకందించిన నా నా హితులకు, నేస్తాలకు ఈ పోస్ట్ అంకితం.

4, జూన్ 2017, ఆదివారం

అమ్మ...!!

ఈ సకల చరాచర సృష్టికి చేతననందించే పదం అమ్మ. మృత్యు కుహరంలోనికి అడుగుబెడుతున్నాను అని తెలిసి కూడా ఓ ప్రాణికి జన్మనివ్వడానికి సిద్దపడుతుంది అమ్మ. అందమైన బిడ్డయినా, అనాకారి బిడ్డయినా తన ప్రేమను సమంగా పంచుతుంది తల్లి. సమానత్వం నేర్చుకోవలసిందే తల్లి దగ్గర నుంచి. ఆది గురువు అమ్మ. బిడ్డ ఏడుపు విని సంతసించేది తల్లి ఒకే ఒక్కసారి. అది బిడ్డ పుట్టిన క్షణం ఏడ్చినప్పుడు. ఆ క్షణంలో తల్లికి తాను ప్రాణాలను పణంగా పెట్టి బిడ్డకు జన్మను ఇచ్చిన ఆనందం కనిపిస్తుంది. నవమాసాలు మోసిన బిడ్డ భూమిపై పడగానే, తాను పడిన కష్టాన్ని మర్చిపోతుంది. బిడ్డకు జన్మనివ్వడానికి, అమ్మా అన్న పిలుపు కోసం మరణానికి సైతం సాదరంగా స్వాగతం పలుకుతుంది. బిడ్డ నేర్చుకునే తొలి పిలుపు అమ్మ. ప్రతి తల్లి బిడ్డ ఎదుగుదలనే కోరుకుంటుంది ఎప్పుడూ. పసి ప్రాయంలో తప్పొప్పులు తెలియపరుస్తూ, లాలింపులు, బుజ్జగింపులతో గోరుముద్దలు తినిపిస్తుంది. తప్పు చేస్తే దండిస్తుంది ఎందుకంటే మంచి  నడవడి బిడ్డకు నేర్పాలని. సహనానికి, క్షమా గుణానికి చిరునామా అమ్మ. గాయమైతే ముందుగా గుర్తొచ్చేది అమ్మ.

ఓ చిన్న కథ క్లుప్తంగా రెండు మాటల్లో.
ఓ అమ్మ కొడుకు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ప్రియురాలు పెళ్లి చేసుకోవడానికి ఓ బహుమతి అడుగుతుంది. ఆ ప్రియుడు అమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మా "నీ గుండెను నాకివ్వు" అంటాడు. ఆ తల్లి మారుమాటాడక తన గుండెను కోసి ఇస్తుంది కొడుకుకి. అది తీసుకుని ప్రియురాలి వద్దకు బయలుదేరతాడు. దారిలో కాలికి రాయి కొట్టుకుని ఎదురుదెబ్బ తగులుతుంది. క్రింద పడిపోప్తాడు. చేతిలోని తల్లి గుండె బాధపడుతూ "బాబు దెబ్బ తగిలిందా, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు" అని అంటుంది. అమ్మ అంటే అది.

ఏ ఋణమైనా తీర్చుకోవచ్చు కానీ అమ్మ ఋణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది. జీవితాంతం మనకు అనుక్షణం రక్షణగా ఉండేది అమ్మే. అమ్మ దీవెనలు మనతో ఉంటే ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో ముందుండేది మనమే. జనన, మరణాలకు, మన అనుబంధాలకు, భాషకు, భావానికి, సాహిత్యానికి ఇలా అన్నింటికీ మూలం అమ్మ. అమ్మ గురించి రాయాలంటే ఆది అంతాలు లేని ఆకాశమే ఓ తెల్ల కాగితం. అమ్మ మనసు తెలపాలంటే నాకు కనిపించేది అందరిని అలరించే సముద్రమే. అమ్మ లేని జీవజాతి ఈ సృష్టిలో లేదు.
ప్రేమానురాగాలకు ప్రతిరూపమైన అమ్మకు వందనం.

అమ్మంటే...అమ్మే ,,,!!

బతుకునిచ్చి బాసటగా నిలిచి
బాంధవ్యాలు తెలిపి బంధాలకర్దాలు చెప్పి
ఆత్మీయతను అందించి ఆనందాలను పంచి
మమతానురాగాలతో మానవీయతను నేర్పి
ఉగ్గుపాలతో ఊసుల ఊరడింపులందించి
విద్యాబుద్దుల వివేకాలు వివరించి
అందరాని చందమామలో
అద్భుత ప్రపంచాన్ని చూపించి
అడ్డాలనాటి బిడ్డలు గడ్డాలనాడు అడ్డం తిరిగినా
ఓరిమికి మారుపేరుగా మారి
ఓటమినెరుగని సాయుధురాలిగా
నిరంతర జీవన పోరాటంలో నిత్య సిపాయిగా
యుద్ధభూమిని సైతం ప్రేమ రాజ్యంగా
తీర్చిదిద్దే సహనమూర్తి అమ్మ
జ్ఞాపకంగా వదిలేద్దామనుకుంటే
జీవితమే తానైన మాతృమూర్తి...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner