30, ఆగస్టు 2021, సోమవారం
కాలం వెంబడి కలం... 69
ఓ రోజు అనుకోకుండా ఈయన పని మీద బజారుకి వెళ్ళి వస్తూ, రాజేంద్రనగర్ లో విశ్వభారతి స్కూల్ కి దగ్గరలో ఓ ఇల్లు రెంట్ బోర్డు పెట్టి ఉంటే, చూసి ఓ 500 అడ్వాన్స్ ఇచ్చి వచ్చారు. ఇంటికి వచ్చి విషయం చెప్పి, కిచెన్ చాలా చిన్నది మనకి చాలేమెా, ఓసారి చూసిరండని చెప్తే, ఎలాగూ అడ్వాన్స్ ఇచ్చేసారు కదా అని మారిపోదామన్నాము. ఇంటివాళ్ళకు చెప్తే కాస్త బాధ పడ్డారు. రాజేంద్రనగర్ లో అందరు తేడానేనని తర్వాత తెలిసింది. గుడివాడలో దోమలు బాగా ఎక్కువ. రోజూ బాట్ తో వాటితో యుద్ధమే. సామాన్లు సర్దుతూ, మంచం ఎక్కి దోమలు చంపుతుంటే కాలు జారి, నుదురు గోడకు కొట్టుకుని, గోడ మీద అచ్చు పడటం, నాకు తల దిమ్మ దిరగడం జరిగింది. దెబ్బ బాగా గట్టిగానే తగిలింది. గోడ గట్టిదనం, నా నుదురు గట్టిదనం బాగా తెలిసింది. కొత్త ఇంటికి మారేటప్పుడే సూచనలు కనబడినా మనం అంత లెక్క చేయలేదు. ఈ ఇల్లు బయటికి చూడటానికి బావుంది, కాని లోపల కన్వీనెంట్ గా లేదు. డ్యూప్లెక్స్ టైప్ లో కట్టుకున్నారు. తర్వాత వాళ్ళు పైనుంటూ కింద రెండు పోర్షన్లు చేసారు. మాకు పైన ఓ రూమ్, కింద ఓ రూమ్, హాల్ సగం మాకు, సగం పక్క వాళ్ళకి.
ఈ ఇంటికి దగ్గరలోనే మా ఊరి వాళ్ళు స్రవంతి, శిరీష కూడా ఉన్నారు. స్రవంతి ఇల్లు క్లీన్ చేసేటప్పుడు హెల్ప్ చేసింది కూడా. ఇంటి వాళ్ళు మేం వచ్చాక వాళ్ళ రెండో అమ్మాయి అమెరికాలో ఉంటే, తన దగ్గరకి వెళ్ళారు డెలివరీ టైమ్ కి. అమ్మమ్మతో చలిమిడి చేయించుకుని వెళ్ళారు. మెుదట్లో చాలా బాగా మాట్లాడేది ఆవిడ. ఈ ఇంట్లోకి రాగానే చిన్నోడు శౌర్య స్కూల్ కి సైకిల్ మీద వెళుతూ, పడిపోయి పన్ను విరగ్గొట్టుకున్నాడు. అప్పటికప్పుడు ఆటోలో హాస్పిటల్ కి తీసుకువెళ్ళాం అమ్మా నేను. ఇంటివాళ్ళు 6 నెలలు లేకపోతే వాళ్ళ కరంట్ బిల్లులు కూడా నేనే కట్టేదాన్ని. వాళ్ళ పెద్దమ్మాయి లండన్ లో ఉండేది. ప్రతి సంవత్సరం 6 నెలలు వాళ్ళు వెళుతూ ఉండేవారు. మెాటర్ వేయాలన్నా పంపు బాగా కొట్టి మెాటర్ వేయాలి. బయట బోలెడు ప్లేస్ ఊడవడానికి. వర్షాకాలం ఎప్పుడూ పనే. ఇంట్లోకి నీళ్ళు వచ్చేసేవి. ఇంటివాళ్ళ కార్ బయటికి తీస్తే, అదంతా కడగాలి. ఇలా చాలా పనే ఉండేది. ఇది చాలక పక్కింటి వాళ్ళ వేపచెట్టు ఆకులు, కాయలు, పండ్లు అన్నీ మాకే. ఏ కాస్త గాలి వేసినా బయట గచ్చంతా ఇసకే. వేసవి కాలంలో రోజుకు పది, పదిహేను సార్లు ఊడ్చేదాన్ని.
పక్క పోర్షన్ లో విశ్వభారతిలో పని చేసే టీచర్, వాళ్ళ పిల్లలు ఇద్దరు, అత్తగారు, మామగారు ఉండేవారు. తర్వాత కొన్ని రోజులకు అత్తగారు, మామగారు వాళ్ళ సొంత ఊరు వెళిపోయారు. మా ఊరి పిల్లలు బాగా దగ్గరగా ఉండేవారు. మా పిన్ని వాళ్ళమ్మాయి కూడా కొన్ని రోజులు బాబుతో మా ఇంటికి దగ్గరలోనే ఉండేది అమ్మమ్మ తాతయ్యలతో.
నేను హైదరాబాదు లో వర్క్ చేసేటప్పుడే మా అపార్ట్మెంట్ రెండోది అమ్మడం నాకు ఇష్టం లేకపోయినా ఓ దిక్కుమాలిన వాడి మాయలో పడి, బలవంతంగా అమ్మించి, ఆ డబ్బులు మెుత్తం బిల్డర్ కి ఇచ్చేసాడు. అంతకు ముందు నుండే తన ఫ్రెండ్ కోసం కొన్ని సైట్లు అమ్మేయడం, వడ్డీలకు తెచ్చి డబ్బులు ఇవ్వడం చేసాడు. ఇంటి లోన్ కడతానని అది కట్టకపోవడంతో, మరో సైట్ అమ్మి ఇంటి లోన్ కట్టేసాము. అమ్మావాళ్ళు ఇచ్చిన బంగారమంతా బాంక్ లో పెట్టి మరొకరికి డబ్బులు కట్టాము. వీళ్ళుగా పెట్టిన బంగారం గొలుసు తప్ప మరేం లేదు. దానికే లక్షన్నర్ర అప్పని చెప్పి మూడున్నర్ర లక్షలు తీసుకున్నారు. ఇవి కాక మిగతా లెక్కలు చెల్లి, తమ్ముడు, చిన్నా చితకా చాలా అయ్యాయి అంతకు ముందే. మరో అక్క కొడుకు స్కూల్ ఫీజ్ ఓ సంవత్సరం కట్టడం ఇవన్నీ అమెరికాలో ఉన్నప్పటి లెక్కలు. అవి చాలక వచ్చిన దగ్గర నుండి వక్కలగడ్డ జనాలను ఉద్దరించాడు మాకు తెలిసి ఓ పాతిక లక్షల వరకు. తెలియకుండా ఇంకెన్నో మరి. డబ్బులిచ్చి ఆ బిల్డర్ చుట్టూ ఓ 8 ఏళ్ళు హైదరాబాదు చుట్టూ తిరిగి అసలు తెచ్చానని చెప్పాడు.
అప్పటికే అమెరికాలో నా ఫ్రెండ్ మధు దగ్గర ఈయన నాకు తెలియకుండా, వాళ్ళతో ఏదో చెప్పి 5 లక్షలు తీసుకున్నాడు. తర్వాత వాళ్ళు నాకు చెప్పడం, ఈయన వాళ్ళకు సమాధానం సరిగా చెప్పకపోవడం, నేను కొన్ని నెలలు వాళ్ళ కార్డ్ బిల్ 2 లక్షల వరకు వడ్డీ కట్టడం, తర్వాత మా మామయ్య దగ్గర వడ్డీకి తీసుకుని మధు వాళ్ళకు కట్టేసాను. అపార్ట్మెంట్ అమ్మినప్పుడు ఈ అప్పు, ఇంటి లోన్ కట్టేద్దామన్నా వినకుండా, ఇంటి లోన్ తో సహా మెుత్తం నేను చూసుకుంటానని చెప్పి, రెండు నెలల తర్వాత చేతులెత్తేసాడు.
పోని అసలైనా వచ్చాయి కదా ఇప్పుడన్నా ఆ అప్పులు కట్టేయమంటే వినకుండా కార్ కొన్నాడు. అంతకు ముందు స్కార్పియెా ఉండేది కదా. అమ్మకు ఆపరేషన్ ముందు బయాప్సి చేయించడానికి NRI హాస్పిటల్ కి వెళుతుంటే మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఈయన అంతకు ముందే మా ఊరిలో ఎవరో చనిపోతే వెళ్ళి దినం అయ్యాకా బయలుదేరి ఆ రోజే వస్తున్నాడు ఊరి నుండి. మాకు తెలియదు వస్తాడో రాడో. మేము డ్రైవర్ దిలీప్ ని తీసుకుని హాస్పిటల్ కి బయలుదేరాం. ఏంటో ఆరోజు నేను ముందు సీట్ లో కూర్చున్నా. అమ్మ వెనుక కూర్చుంది. దిలీప్ ని ఆయిల్ కొట్టించమంటే, దాటేసాం కదా అవతల కొట్టిద్దామని, కాస్త స్పీడ్ గానే డ్రైవ్ చేస్తున్నాడు. అప్పటికే అన్నాను కాస్త స్పీడ్ తగ్గించమని. హైవే రోడ్డు మీద మధ్యలో KLU బస్ ఆగి ఉంది. పక్కన ఖాళీ నుండి వెళిపోవచ్చని స్పీడ్ తగ్గించలేదు. బస్ దగ్గరికి వచ్చాక కాని తెలియలేదు. కాస్త పక్కన ముందు మరో బస్ ఆపుకుని ఇద్దరు మాట్లాడుకుంటున్నారని. KLU బస్ కి మాకు దూరం లేదు. దిలీప్ బ్రేక్ వెయ్యి అంటే సడన్ గా వేసాడు. అప్పటికే కార్ ఎగిరిపడి ముందు బస్ ని గుద్దేసింది. బస్ కి ఏమి కాలేదు కాని కార్ బాగా పాడయి పోయింది. కాస్త దూరంలో పెట్రోల్ బంక్ దగ్గర కార్ ఆపి చూసాడు ఏమైందోనని. నేను కార్ షెడ్ కి తీసుకు వెళిపో, మేము ఆటోలో వెళతామని చెప్పాను. కాదని దింపుతానని హాస్పిటల్ దగ్గర దింపాడు. ఈ కార్ హాస్పిటల్ వాళ్ళకి తెలుసు, కార్ చూసి ఏమైందోనని హడావిడిగా అందరూ కార్ దగ్గరకి వచ్చారు. మాకేం కాలేదని చెప్పి, దిలీప్ ని పంపేసాను ఓ 1000 ఇచ్చి. అంత పెద్ద యాక్సిడెంట్ అయినా మాకేం కాలేదు కాని అమ్మకు మెాకాలు కొద్దిగా కొట్టుకుపోయిందంతే. కార్ కి ఎంత డామేజ్ అయ్యిందన్న ఆలోచన కూడా నాకు లేదప్పుడు. 9 కంతా హాస్పిటల్ లో ఉండమన్నారు, అమ్మకి ఏమౌతుందో అన్న ఆలోచనే నాదంతా. కనీసం కార్ వంక కూడా చూడలేదు. ఈయనకు ఫోన్ చేసి చెప్పి, కార్ షెడ్ కి పంపేసాను. ఆరోజే మౌర్యని గుడివాడ నుండి తీసుకురావాలి. ఈయనను అటు వెళ్ళమని, బయాప్సి అయ్యాక సాయంత్రం ఆటోలో అమ్మని తీసుకుని ఇంటికి వచ్చానప్పుడు.
" భగవంతుడు మన ద్వారా ఏమైనా చేయించాలనుకున్నా, లేదా మనం పడాల్సినవేమైనా మిగిలున్నా ప్రాణం పోనివ్వడు ఎంత ఆపద ఎదురైనా. "
వచ్చే వారం మరిన్ని కబుర్లతో....
వర్గము
ముచ్చట్లు
26, ఆగస్టు 2021, గురువారం
కాలం వెంబడి కలం...68
గుడివాడలో ఇల్లు చూడటానికి వెళ్ళినప్పుడు, రాఘవేంద్రకు తెలిసిన వాళ్ళింటికి వెళ్ళాము. వాళ్ళింట్లో లిఫ్ట్ ఉంది. వాళ్ళింటికి దగ్గరలో ఓ ఇల్లు చూసాం, కాని నచ్చలేదు. తిరిగి విజయవాడ వచ్చేస్తూ స్కూల్ కి దగ్గరలో ఓ ఇల్లుంటే చూసి, అడ్వాన్స్ ఇచ్చేసాము. నేను, మా బేబి ఓ మంచిరోజు చూసి వెళ్ళి పాలు పొంగించి వచ్చాము. తర్వాత విజయవాడ నుండి అవసరమైన సామానుతో మాత్రమే గుడివాడ వెళ్ళాము. ఆంటీ, బుజ్జి, రాజు(కుక్క) పైన ఉండేవారు. మేము కింద పోర్షన్ లో ఉండేవాళ్ళం. మెుదట్లో కాస్త భయపడ్డాం కాని తర్వాత తర్వాత వాళ్ళు చాలా బావుండేవారు. తాతయ్య, అమ్మమ్మ, అమ్మ, పిల్లలు, మేము అందరం అక్కడే ఉండేవాళ్ళం.
అప్పుడప్పుడూ విజయవాడ వచ్చి, ఇల్లు క్లీన్ చేసి వెళుతుండేదాన్ని. తర్వాత ఓ రూమ్ లో మా సామాన్లు అన్నీ సర్దేసాం. డబల్ బెడ్ రూమ్ గా రెంట్ కి మా క్రిందింటి భారతి గారు మాట్లాడారు. ఒకావిడే ఉంటారని చెప్పారు. టాయ్లెట్ వెస్ట్రన్ స్టైల్ గా మార్చమంటే మార్చి, మెుత్తం ఇల్లంతా క్లీన్ చేయించి, లైట్స్ అన్నీ పెట్టించి ఇస్తూ, నాకు మళ్ళీ ఇలాగే మా ఇల్లు అప్పజెప్పండి అని అద్దెకు వచ్చే ఆవిడ కూతురికి, భారతి గారి ముందే చెప్పాను. సరేనని చెప్పింది ఆవిడ. కాని పేరుకి మాత్రమే ఒకావిడ. కూతురు కాపురమంతా ఇక్కడే. కొడుకు అమెరికా అమ్మాయిని చేసుకుని అక్కడే ఉంటాడు. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు కనీసం ముందు చెప్పకుండా, బాత్ రూమ్ లో, బయట లైట్లతో సహా పీక్కుని పోయారు. బయట మెుక్కలు పెట్టి మార్బుల్ అంతా పాడుచేసారు. చాలా చోట్ల టైల్స్ పగలగొట్టేసారు. వాష్ ఏరియాలో చెప్పుల స్టాండ్ పై రాయితో సహా పగలగొట్టేసారు. పోయే ముందు కనీసం మెంటెనెస్స్, కరంట్ బిల్ కూడా కట్టలేదు. ఉన్న మూడేళ్ళలో కరంట్ మీటర్ కూడ కాల్చేసారు. మేం గుడివాడ నుండి విజయవాడ వచ్చాక ఇల్లంతా రిపేర్లు, రంగులు వేయించడానికి ఓ లక్ష పైనే అయ్యింది. ఇదీ మనం ఇల్లు అద్దెకిస్తే పరిస్థితి.
ఇక గుడివాడలో ఉన్నప్పుడు అప్పుడప్పుడూ అమ్మావాళ్ళు మా ఊరు వెళ్ళినా ఇంటి ఆంటీ అమ్మా మంజూ సాయం చేయనా అని అడిగేవారు. మా పక్కింట్లో ఆవిడ కూడా గోడ మీద నుండి పలకరించేవారు. వారి పాప కూడా మా పిల్లల స్కూల్ లోనే చదివేది. చిన్నోడికి పుల్కాలు బాగా ఇష్టం. ఆవిడ ఓరోజు చాలా చేసి పంపారు కూడా. ఆ ఇంట్లో ఉన్నప్పుడే ఇంజనీరింగ్ తర్వాత కలవని రఘు ఫోన్లో కలిసాడు. జొన్నవలసలో మాతో చదువుకున్న సాధూరావు తన ఫ్రెండ్స్ తో వచ్చి కలిసివెళ్ళాడు. జవహర్ బాబు కొడుకుని కూడా మౌర్యతో పాటే కె కె ఆర్ లో జాయిన్ చేసాడు. వాడు మౌర్యకన్నా ఓ సంవత్సరం ముందు. బాబుని చూడటానికి వచ్చినప్పుడు ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళాడు కూడా. బ్లాగు ద్వారా పరిచయమైన శివ కూడా వచ్చివెళ్ళాడు. అమ్మని చూడటానికి రాణి అక్కా, నాగభూషణం మామయ్య కూడ వచ్చెళ్ళారు. అప్పుడే మామయ్య అమ్మాయ్ ఓసారి అమెరికా వెళ్ళొద్దామంటే ఈ అమెరికా వాడు వీసా ఇచ్చి ఛావడం లేదన్నాడు. తర్వాత మేం విజయవాడ వచ్చేసాక రాణక్కా, మామయ్య అమెరికా వెళ్ళారు, కాని మామయ్య ప్రాణాలతో తిరిగిరాలేదు. తను పని చేసే సిద్దార్ధ కాలేజ్ వాళ్ళు సెలవు ఇవ్వమన్నా పోట్లాడి మరీ, సంతోషంగా అమెరికా వెళ్ళిన మామయ్య తిరిగిరాని లోకాలకు వెళిపోయాడు. మా మధ్యన చుట్టరికం లేకున్నా, విలువైన స్నేహానుబంధం ఇప్పటికీ ఉంది. అయినవాళ్ళ పలకరింతలకు నోచుకోకున్నా ఆత్మీయంగా అక్క అప్పుడప్పుడూ పలకరిస్తూనే ఉంటుంది ఇప్పటికి. మామయ్య ఇచ్చిన చిన్న మనీప్లాంట్ పెద్దదై ఇప్పటికీ మా ఇంట్లో ఉంది.
" మనుష్యులు లేకున్నా కొందరి జ్ఞాపకాలు మనతోనే ఉండిపోతాయిలా. "
వచ్చే వారం మరిన్ని కబుర్లతో...
వర్గము
ముచ్చట్లు
కాలం వెంబడి కలం...66
ఆఫీస్ లో చాలా మార్పులు చేర్పులు జరిగాయి. కొత్తగా ఇద్దరిని తీసుకుని, వీరి అవసరం తీరిపోయిందని దుర్గ గారిని, విక్రం, ఆనంద్ ని తీసేసారు. ఇంకా కొంతమందిని చక్రధర్, వరప్రసాద్ లకు నచ్చని వారిని కూడా ఏదోక వంక పెట్టి తీసేసారు. నన్నేమీ చేయలేక నా సీట్ మార్చేసారు. చంద్రశేఖర్, శరత్ ల వద్దకు మార్చారు. ఏమయ్యిందిలే అని చంద్రశేఖర్ దగ్గర php నేర్చుకోవడం మెుదలుబెట్టాను. నన్ను టెస్టింగ్ టీమ్ కి ఇన్ ఛార్జ్ గా వేసారు. శ్రీకాంత్, అనిల్, ప్రవీణ్ ఉండేవారు ఆ టీమ్ లో. మా ఇంజనీరింగ్ క్లాస్మేట్ రాంప్రసాద్ వాళ్ళమ్మాయికి పెద్దమ్మ గుడిలో అన్నప్రాశన చేస్తూ రమ్మంటే, గుడికి వెళ్తే మా శ్రీను అన్న వచ్చి కలిసాడు. తనకి జాబ్ అవసరమంటే సుబ్బరాజుకి చెప్పాను. వాళ్ళిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. శ్రీను అన్న, సురేష్, వరుణ్ కూడా మా టెస్టింగ్ టీమ్ లో జాయిన్ అయ్యారు. మా ఇంజనీరింగ్ కాలేజ్ శివ సర్ కూడా కొన్ని రోజులు ఈ ఆఫీస్ లో ఉన్నారు. చాలా బాగా మాట్లాడేవారు. మా క్లాస్మేట్ వర్మ కూడా వర్క్ చేసారు కొన్ని రోజులు.
అప్పటికే అరికేసరి తన రాజకీయం నామీద బానే ప్రయెాగించాడు. శ్రీను అన్నయ్యతో మంతనాలాడి, ఇద్దరూ కలిసి నామీద తమ తెలివి ప్రదర్శించారు. ISO సర్టిఫికేషన్ చూడమని శ్రీను అన్నయ్యకి ఇచ్చారు. నేనేం పట్టించుకోలేదు. అప్పటికి అనురాధ వెళిపోయింది. అలా ఒకరొకరు చాలామంది వెళిపోయారు. వరప్రసాద్, చక్రధర్ లకు పి ఏ లుగా ఇద్దరమ్మాయిలను కూడా అప్పటికే అపాయింట్ చేసుకున్నారు. తర్వాత ఆ అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేసారని వరప్రసాద్ ని కూడా తీసేసారు. అది వేరే సంగతి. అప్పటికే సుబ్బరాజు సినిమాల పిచ్చితో రెండు సినిమాలు తీసి చేతులు బాగా కాల్చుకున్నారు. ఎవరి సొమ్ము వారు వెనకేసుకుని మెుత్తానికి కంపెనీని దివాళా తీయించి, ఐపి పెట్టించారు. కంపెనీని మూయించారు. అమెరికాలో కూడా బ్లాక్ లిస్ట్ లోకి వెళిపోయింది. అప్పటికే 4,5 నెలల నుండి జీతాలివ్వలేదు నాకు. అమెరికాలో చేసినట్టే ఇండియాలో కూడా చేసారు. ఈ విధంగా అమెరికన్ సొల్యూషన్స్ (AMSOL)ని నమ్మినందుకు నా జీవితాన్ని ఇలా ముంచేసారన్న మాట. చాలా తక్కువగా చెప్పాను వాళ్ళు చేసిన మెాసాన్ని. ఇక్కడ ఈ అరికేసరి గాంగ్ నన్ను పెట్టిన ఇబ్బందులను. కనీసం ఒకే కాలేజ్ అని కాని, ఆడపిల్లను ఇబ్బందులు పెట్టామని కాని, నమ్మించి మెాసం చేసామని కాని వాళ్ళు అనుకోలేదు. అమెరికాలో ఎంతమందిని కంపెనిలో జాయిన్ చేసానో, కంపెనీకి ఎంత ఉపయెాగపడ్డానో మర్చిపోయారు. వీళ్ళని నమ్మి వేరే కంపెనీల ఆఫర్లు చాలా వదిలేసుకున్నా ఆ రోజుల్లో. గ్రీన్ కార్డ్ ప్రాసెస్ లో, సాలరీ విషయంలో, ఇమ్మిగ్రేషన్ విషయంలో ఇలా అన్నిట్లో AMSOL మెాసం చేసారన్నది అందరికి తెలిసిన విషయమే.
" మనం ఎవరినైనా నమ్మితేనే కదా మెాసం చేయగలరు. ఈ విషయం తెలిసినా మెాసపోతూనే ఉంటాం. ఇది మనిషి బలహీనత. "
వచ్చే వారం మరిన్ని కబుర్లతో...
వర్గము
ముచ్చట్లు
22, ఆగస్టు 2021, ఆదివారం
తెలియదని..!!
కాలం విసిరేసిన
జ్ఞాపకాలు కొన్ని
అక్కడక్కడా పడున్నాయి
ఏ దారెంట వెళుతున్నా
గతాన్ని వెంటేసుకుని
వెంబడిస్తునే ఉన్నాయి
గాయాల ఆనవాళ్ళు
గమనానికి అడ్డంకిగా మారక
గమ్యాన్ని నిర్థేశించాయి
వెక్కిరింతల వికృత చేష్టలకు
రాతలతో సమాధానమిస్తూ
ఆత్మాభిమానాన్ని ఆభరణాలుగా చూపాయి
విజ్ఞతకు విలువనెలా ఆపాదించాలో
వ్యక్తిత్వానికి వన్నెలేమిటో తెలియని
మానసిక జాడ్యాలను విదిలించేసాయి
కూడికల తీసివేతల బుుణానుబంధాలను
హెచ్చవేతల భాగహారాల బుుణశేషాలను
బుుణపాశాలకు మిగిల్చివేసాయి
క్షణాలు రాల్చిన పారిజాతాలు కాసిని
కన్నీళ్ళు విదిల్చిన గుర్తులతో
స్నేహం చేస్తున్నాయి
అక్షరాలకు
అలవాటైన మనసని
వాటికి తెలియదనుకుని..!!
వర్గము
కవితలు
19, ఆగస్టు 2021, గురువారం
డైవర్షన్..!!
నేస్తం,
సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు చావు పరిష్కారం కాదు. మనల్ని బాధించే విషయం నుండి మళ్ళింపు(డైవర్షన్) అవసరం. మన అన్నియ్య చేస్తున్నదదేగా. నీకేమైనా హెల్ప్ అవసరమైతే విషయ డైవర్షన్ లో దిట్టైన అన్నియ్య సలహా తీసుకో.
ఏ సమస్యకైనా డైవర్షన్ అన్నది చాలా బాగా ఉపయెాగ పడుతుంది. భువనచంద్ర గారి వాళ్ళు పుస్తకం చదువుతున్నప్పుడు ఆయన అనుభవాలు మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడతాయి. వాటిలో కొన్ని మనకూ అనుభవాలే కాని మనకంతగా తెలియదంతే. ఉదాహరణకు చన్నీటి స్నానం అందరు చేయలేరు కదా. ముందే చలి అని అనుకుంటూ మనసులో అదే నిండిపోయి ఉంటుంది. ఆ సమయంలోనే ధ్యాస వేరే విషయం వైపు మళ్ళించి, చన్నీటి స్నానం చేసి చూడు. నీకే తెలియదు నువ్వు చన్నీటితో స్నానం చేసావని. ఇది చాలా చిన్న విషయం. అలాగే మనసుకు బాధ కలిగినప్పుడు ఆ బాధ కలిగించిన విషయాన్ని మర్చిపోవడానికి మరో మార్గం వైపు మనసును మళ్ళించడమే. అంతేకాని భగవంతుడు మనకిచ్చిన జన్మను అర్ధాంతరంగా ముగించడానికి కాదు. కాస్త ప్రశాంతంగా ఆలోచించి చూడు విషయం బోధపడుతుంది. ఎదుటివారి నిర్లక్ష్యం మనం భరించలేనప్పుడు, వారిని మనం కూడా పట్టించుకోకుండా ఉండటమే. అది ఎంత దగ్గర బంధమైనా సరే.
వర్గము
కబుర్లు
16, ఆగస్టు 2021, సోమవారం
కాలం వెంబడి కలం..67
నేను హైదరాబాదులో AMSOL లో వర్క్ చేసేటప్పుడే నాన్న శబరిమలై నడిచివెళుతుంటే యాక్సిడెంట్ అయ్యి, కాలు విరిగింది. NRI లో నరసరాజు అంకుల్ ఉన్నారని, అక్కడ ఆపరేషన్ చేయిస్తే, అది సెట్ అవక రెండుసార్లు చేయాల్సి వచ్చింది. అయినా సరిగా సెట్ కాకపోవడంతో మూడవసారి కూడా చేయాలంటే వద్దని, తునిలో నాన్న ఫ్రెండ్ కొడుకు ఉంటే అక్కడికి తీసుకువెళ్ళాం. ఆయన ఆపరేషన్ వద్దని చెప్పారు. అప్పట్లో ఓ నెల సెలవు పెట్టేసాను ఆఫీస్ కి. ఆరు నెలలు అమ్మ నాన్నని కాలు కింద పెట్టకుండా చూసుకుంది. తర్వాత అమ్మకి తేడా చేస్తే తనకి ఆపరేషన్ జరిగింది NRI హాస్పిటల్ లోనే. చిన్నప్పటి నేస్తం వాసు అనుకోకుండా స్వైన్ ఫ్లూ తో చనిపోవడమెా నమ్మశక్యం కాని విషాదం. అప్పటికే మౌర్యని గుడివాడ కే కే ఆర్ గౌతమ్ స్కూల్ లో 7 లో హాస్టల్ లో జాయిన్ చేసాము. ఎలాగూ జాబ్ మానేసానని శౌర్యని కూడా ఆ స్కూల్ లో జాయిన్ చేసి విజయవాడలో ఇల్లు రెంట్ కి ఇచ్చేసి గుడివాడ మారిపోయాము.
AMSOL లో జాబ్ మానేసే ముందే మా చిన్నప్పటి శిశువిద్యామందిరం అవనిగడ్డ బాచ్ అందరం కలవాలని చెప్పి ఆ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసారు. హైదరాబాదు వచ్చాకే చాలామంది చిన్నప్పటి ఫ్రెండ్స్ కలిసారు. అందరికి నేను గుర్తున్నాను కాని వసంతకి మాత్రం గుర్తులేను. లలిత, హైమ, అనురాధ, సాయి, చిట్టిబాబు, సత్యనారాయణ, రామకృష్ణ వీళ్ళంతా హైదరాబాదు లోనే ఉండేవారు. మిగతా వారంతా ఎక్కువగా అవనిగడ్డ, ఆ పరిసరాల్లోనే ఉండేవారు. జవహర్ బాబు ఢిల్లీ లో ఎయిర్ ఫోర్స్ లో వర్క్ చేస్తూ, సూర్యలంక ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు అప్పటికి. తను ఢిల్లీలో వర్క్ చేసేటప్పుడు ఓ రోజు మెయిల్ చేసాడు. నేను పలానా అని.. గుర్తు చేస్తూ. తను చిన్నప్పటి నుండి ఎక్కువగా ఎవరితో మాట్లాడేవాడు కాదు. బాగా చదివేవాడు. మేము అవనిగడ్డలో మెుదట్లో ఉన్నప్పుడు వీళ్ళింటికి దగ్గరలోనే ఉండేవాళ్ళం. వీళ్ళ అక్క, తమ్ముడు, చెల్లి, అందరం కలిసే స్కూల్ కి వెళ్ళేవాళ్ళం. మనకేమెా నోటి మీద మూత ఉండేది కాదాయే. ఎంతసేపూ అల్లరి, ఆటలే. అవన్నీ గుర్తు వచ్చి, ఆ మెయిల్ చూసి చాలా సర్ప్రయిజ్ అయ్యాను అప్పుడు. అవనిగడ్డలో చిన్నప్పటి నేస్తాలను, గురువులను కలవడం మరపురాని మధురానుభూతే ఇప్పటికీ.
అప్పటికే మా ఉప్పల రాజ్యలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ కోసం ఫ్రీ వెబ్ సైట్స్ గురించి వెదుకుతూ, బ్లాగ్ అయితే బావుంటుందన్న కొందరి సలహాతో ట్రస్ట్ పేరుతో బ్లాగు ఓపెన్ చేసాను. తర్వాత నా రాతల కోసమన్నట్టుగా మరో బ్లాగు ఓపెన్ చేసాను. " నాలో నేను " అని పేరు పెడదామంటే అప్పటికే ఎవరిదో ఉందని చెప్పడంతో " కబుర్లు కాకరకాయలు " అని నామకరణం చేసేసాను. " సలహాలు చిట్కాలు " అన్న మరో బ్లాగు కూడా ఉంది. కాకపోతే " కబుర్లు కాకరకాయలు " మాత్రం ఇప్పటికి జీవించే ఉంది నా రాతలతో. అలా చిన్న చిన్న రాతలతో మెుదలైన నా రాతల వ్యాపకమే ఈరోజిలా మీ అందరి అభిమానం నాకందించింది.
" కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తు చేసుకున్నా బావుంటాయి. " ఎందుకో మరి మీకూ తెలుసు కదా.
వచ్చే వారం మరిన్ని కబుర్లతో...
వర్గము
ముచ్చట్లు
15, ఆగస్టు 2021, ఆదివారం
చేసుకుంటున్నాం సంబరాలు...!!
దశాబ్దాలు గడిచిపోతున్నా
మారని మన జీవితాలకు
మరో వత్సరం కలిసినందుకు
చేసుకుంటున్నాం సంబరాలు
శతాబ్దాల చరితను
తిరగరాయలేని అశక్తత
మనదైనందుకు సంతోషపడుతూ
చేసుకుంటున్నాం సంబరాలు
విద్రోహులు మనతోనే ఉన్నా
సర్వమత సౌభ్రాతృత్వం మనదనుకుంటూ
మన చేతగానితనాన్ని దాచేస్తూ
చేసుకుంటున్నాం సంబరాలు
శాంతి కాముకత మన నైజమంటూ
దేశద్రోహమసలే తెలియదంటూ
దేశాన్ని అధఃపాతాళానికి నెట్టేస్తున్నా ఏమెరగనట్లు
చేసుకుంటున్నాం సంబరాలు
నీరాజనాల నీడలో నమస్కారాల మాయలో
నటనలో నిజాయితీగా జీవించే నట నాయకులారా
మిమ్మల్ని మనస్పూర్తిగా నమ్ముతునందుకు
చేసుకుంటున్నాం సంబరాలు...!!
అందరికి డెబ్భై ఐదేళ్ళ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు...
వర్గము
కవితలు
14, ఆగస్టు 2021, శనివారం
రెక్కలు
1. ఏ ఆటైనా
ఆడేది
గెలవాలన్న
కోరికతోనే
చావు పుట్టుకల సయ్యాటలో
గెలుపెవరిదన్నది తెలియక..!!
2. వాస్తవానికి
అబద్ధం చేరికైంది
కాలంతో పాటుగా
నిజం కదులుతుంది
నాటకాలకు
చివరి అంకం ఏమిటో..!!
3. యుగాంతమౌతున్నా
మారని నైజాలే
క్షణాల మాయలో
మగ్గుతూ
కాలాతీతం
కారణజన్ములకెరుక..!!
4. చిరునవ్వుతో
సమాధానం
మనసులోని
మధనానికి ముసుగు
అంతర్నేత్రం
అందరికి ఉండదు..!!
5. అబద్ధం
అందమైనదే
నిజం
భరించలేనిదే
సత్యాసత్యాల నడుమ
ఓ అక్షరమే తేడా...!!
6. అంబరమూ
అనంతమైనదే
సంద్రమూ
అంతుచిక్కనిదే
ఏ ఆడంబరమూ
అక్కర్లేదు ఆత్మసౌందర్యముంటే..!!
7. కాలానికి
తెలిసిన కబుర్లే అన్నీ
కలంతో
పని లేకుండా
మనసు చెప్పే
నిజాలవి...!!
8. నిజమెప్పుడూ
నిష్టూరమే
అబద్దమెప్పడూ
అందమైనదే
వాస్తవాన్ని ఒప్పుకునే నైజం
కొందరికే సొంతం..!!
9. కొందరితో
అనుబంధమంతే
మరి కొందరితో
దగ్గర కాలేనంతగా
ఏ బంధానికి
ఏ వెసులుబాటో..!!
10. అర్థమంతా
అందులోనే
మాటయినా
మనసయినా
తీరానిదే బంధమైనా
తీర్చుకునే బుుణానుబంధమై..!!
11. ఎదను తడిమేవి
కొన్ని
ఎదుట నిలిచేవి
ఎన్నో
సాధ్యాసాధ్యాలను
తెలిపేది కాలం..!!
12. విరక్తి పెంచేవి
కొన్ని
అనురక్తిని పంచేవి
మరికొన్ని
జీవిత పుస్తకంలోని
పరిచయాల పుటలు..!!
13. జవాబు తెలిసిన
ప్రశ్నలే అన్నీ
పరీక్ష రాయడం
అయిపోయాక
కడలి లోపల
ప్రశాంతత తెలిస్తే..!!
14. వ్యక్తిగతం
జీవితం
వ్యక్తిత్వం
సహజ లక్షణం
సమాంతర రేఖల
సారమే గమ్యం..!!
15. విజయం
గుర్తింపునిస్తుంది
అపజయం
నీవారెవరో తెలుపుతుంది
జయాపజయాలు
దైవాధీనాలు..!!
16. శిలగా మిగిలింది
మనిషే
మనసుని రాయిగా
మార్చేస్తూ
కదలికలు రావాలిక
అక్షర ఉలి స్పర్శతో..!!
17. లెక్క
మారదెప్పడూ
మారేది
జవాబే
జీవితపు లెక్కల చిట్టా
అంతు చిక్కదెప్పుడూ..!!
18. తప్పటడుగులు
ఆనందం
తప్పుటడుగులు
వేదనాభరితం
తడబాటుల దిద్దుబాటే
జీవితం..!!
19. రాయడం తెలియని
కలమూ కాదు
అమరికనెరుగని
అక్షరాలు కావు
మనసును సాంత్వన పరిచే
మనో విహంగాలివి..!!
20. గాయం
మనసుకి
గురుతులు
కాయానికి
కాలం
నిమిత్తమాత్రం..!!
21. నేర్చుకోవాల్సిన
అవసరమూ లేదు
తెలియజెప్పాలన్న
కోరికా లేదు
కాలం విసిరిన క్షణాలు
కలం అందుకుందంతే..!!
22. ఆడించేవాడు
ఆ పైవాడు
ఆడేది
జీవుడు
కాలం నేర్పే
వింత అనుభూతి..!!
23. వెగటు పుట్టించేవి
కొన్ని
వేదన మిగిల్చేవి
మరికొన్ని
జీవితంలో
కొన్ని పరిచయాలంతేనేమెా..!!
24. వదిలించుకోవాల్సినవి
బోలెడు
విదిలించాల్సినవి
మరిన్ని
మెుహమాటం
మంచిది కాదు అన్నివేళలా..!!
25. గొంతు
పెగలినివి
మనసు
మెాయలేనివి
అక్షరాలకు మాత్రమే తెలిసిన
అద్భుత విద్యలు..!!
26. పరిచయం
పాత బంధమనిపించాలి
విరక్తిని
పెంచకూడదు
సమయం
విలువైనదని గుర్తించాలి..!!
27. అనుభవసారమే
అన్నింటికి మూలం
అమృతమేదో
విషమేదో తెలుసుకోవడానికి
ఈ జీవితం
షడ్రుచుల సమ్మేళనం..!!
28. రాతి దెబ్బలు
మనసుకైన గాయాలు
వెంటాడే
నిజాల నీడలు
మసక చీకటిలో
వెలుగు రవ్వలు అక్షరాలు..!!
29. అపహాస్యాలు
వినబడినా
అవరోధాలు
వెన్నంటినా
వెరవని మెుండితనం
ఈ అక్షరాలది...!!
30. పంచుకునే
ఆత్మీయతలు
పెంచుకునే
అనుబంధాలు
అక్షరాలకు
తెలిసిన మక్కువ మరి..!!
వర్గము
రెక్కలు
13, ఆగస్టు 2021, శుక్రవారం
ఏక్ తారలు..!!
1. సడలని ఆత్మవిశ్వాసమది_విరిగి పడుతున్నా లేవాలన్న అల ప్రయత్నంలో..!!
2. ఆనందం పంచినట్లుంది_అనంతాన్ని అక్షరాల్లో దాచేసినందుకు..!!
3. అనుబంధం అల్లుకుంది_గతజన్మ పరిచయాన్ని గుర్తుజేస్తూ..!!
4. అన్నీ ధన సంబంధాలే_బుుణానుబంధ రూపేణ..!!
5. గతంతో ముడిబడిన గురుతులే ఇవన్నీ_ఇలా అక్షరాల్లో కనబడుతూ..!!
6. మౌనమే మన మధ్యన బంధం_మాటల గారడీలకు స్వస్తి పలుకుతూ..!!
7. మనసు భారమంతా కాగితానిదైయ్యింది_అబద్ధపు బతుకులతో వేగలేక..!!
8. సంకటం వీడిపోయింది_మనసు బంధం గట్టిదనుకుంటా మరి..!!
9. చిగురించే ఆశలకు రూపాలివి_చెదరిన కలలను సమాధానపరుస్తూ..!!
10. నిట్టూర్పు దినచర్యలో భాగమే_వీడ్కోలు పలకడం రాని మదికి..!!
11. అపనమ్మకమసలే లేదు_మనసు తెలిసిన అక్షరంపై..!!
12. గురుతు చెరగనీయకుంది_మరపు తెలియని మనసు..!!
13. మనిషి చాటు మనసుని నేను_బదులు పలుకని మౌనం నువ్వైనప్పుడు...!!
14. మనసు పడ్డ హృదయమిది_నీ నిర్లక్ష్యాన్ని సహిస్తూ...!!
15. అనుభవం సర్దిచెబుతోంది_మన తన తెలుసుకుని మసలుకొమ్మంటూ..!!
16. అక్షరం మనసు వెలితిని మాయం చేస్తుంది_కడగండ్లకు కావ్యరూపమిస్తూ..!!
17. అక్షరాలకు వెనకడుగు పడితే ఎలా?_అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలిగాని..!!
18. మనసు మాయమైపోతోంది_అడుగంటుతున్న అనుబంధపు లెక్కలతో తూగలేక..!!
19. ఓ జీవితకాలం సరిపోయింది_గుప్పెడు గుండెలో నిండిన జ్ఞాపక పరిమళంతో..!!
20. ఆశలంతే_తీరకుండా మిగిలిపోతూ..!!
21. ఆశయాలు అంతే_లక్ష్యాన్ని ఛేదించే దిశగా సాగిపొమ్మంటూ..!!
22. సాధన సాంగత్యం అవసరం_విజయ రహస్యం తెలియాలంటే..!!
23. తీర్చుకోవాల్సిన బాధ్యతలున్నాయి_ఎగతాళికి ఎదురు నిలువమంటూ..!!
24. చెలిమిని పంచుకున్న భావాలవి_అక్షరాల అనుబంధానికి గుర్తుగా..!!
25. ఆశ్చర్యం ఆరంగేట్రం చేసింది_అక్షరం క(కా)లంలో చేరిపోయిందని..!!
26. ముగిసింది మాటలేగా_మనసెప్పడూ మమతలకు నెలవే...!!
27. ఏ వాసనా తెలియడం లేదు_చీకటి మాత్రమే కనిపిస్తోందెందుకో...!!
28. మనసు మనుగడ మరుగైంది_అవసరాల ఆటలో ఈ లోకంలో...!!
29. స్వార్థానికి చేరువైంది ధనం_అనుబంధాన్ని ఆమడ దూరం నెట్టేస్తూ..!!
30. ఎన్ని ఆటుపోట్లో మనసుకు_వదలక వేధిస్తూ..!!
వర్గము
ఏక్ తార
6, ఆగస్టు 2021, శుక్రవారం
జీవన 'మంజూ'ష..(ఆగష్టు )
నేస్తం,
ప్రతి మనిషి జీవితంలో చావు పుట్టుకలన్నవి సహజం. ఒక ఐదారేళ్ళ నుండి చూస్తున్నా...దగ్గర బంధువులని, రక్త సంబంధీకులని కూడా లేకుండా కనీసం ఆఖరి చూపులకు కూడా దూరంగా ఉంటున్న మన కుటుంబ బాధవ్యాలను చూసి గర్వపడాలేమెా. కనీసం మనిషి బతికున్నప్పుడు ఓ ముద్ద అన్నం ప్రేమగా పెట్టనివారు, చావుబతుకుల మధ్యన మనిషుంటే ఆస్తి కోసం వెంపర్లాటలు కొందరు, తన అహమే నెగ్గాలని మరి కొందరు, పై పై ప్రేమలు ఒలకబోసేవారు మరికొందరు...ఇవి నేటి మన నైజాలు.
పన్నెండేళ్ళకోమారు వచ్చే పుష్కరాలకు ఇంటి మనుషులకు పుష్కరాలు పెట్టడం కూడా అశుభమని భావించేవారు ఏవో కుంటి సాకులు చెప్పడం, ఆ కార్యాలకు పుట్టింటివారు జరపాల్సిన పెట్టుపోతలు ఏ సాకు చెప్పి తప్పించుకోవాలా అని చూసేవారు, మా ఇల్లు పెళ్ళిల్లు, మా ఇంట్లో చూలింత ఉంది, చనిపోయినవారిని చూడలేము, చూస్తే భయం.. ఇలా సవాలక్ష కారణాలు చెప్పి తప్పించుకోవడం ఫాషన్ అయిపోయింది. మంచి, చెడు ప్రతి
ఒక్క ఇంటిలోనూ జరుగుతాయి. ఈరోజు గడిచిపోయింది లెక్క కాదు, రేపనేది ఒకటుంటుందని మర్చిపోతే ఎలా?
మనం కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ పలకరించలేదని, పరామర్శించలేదని బాధ పడితే సరిపోదు. మనమెంతవరకు ఆ పని చేస్తున్నామని మన మనస్సాక్షిని అడిగితే చాలు, సమాధానం దొరుకుతుంది. మాటయినా, మంచయినా ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంటుంది. పిండం పెట్టడమనేది పవిత్ర కార్యం. చెడు కార్యక్రమం అని మనం అనుకుంటే రేపటి రోజున మనకూ, లేదా మన ఇంటిలో చావనేది రాకుండా ఉంటుందా..! చావును ఆపగలిగే శక్తి మనకుందో లేదో తెలుసుకుంటే చావును గురించి ఇలా మాట్లాడం. మన మంచి చెడులు బేరీజు వేసేవాడు పైన ఒకడున్నాడు. వడ్డీతో సహా మన లెక్కలు సరి చూస్తాడు. మనం చేసే ప్రతి పనికి కాస్త కూడా అటు ఇటు కాకుండా మెుత్తం తిరిగి మనకే ఇచ్చేస్తాడు వాడు. ఏమీ ఉంచుకోడు. మనకేంటి అందరు ఉన్నారు, అన్ని ఉన్నాయన్న అహంతో ఉంటే వాడికి ఓ క్షణం చాలు..మనం చేసిన వాటికి మూల్యం చెల్లించడానికి. కనీసం కాస్త కూడా పాపభీతి లేకుండా పోయింది చాలామందికి. ఎందుకో ఈ బతుకులు మరి?
వర్గము
ముచ్చట్లు
4, ఆగస్టు 2021, బుధవారం
సాగుబడి పుస్తక సమీక్ష...!!
స్వచ్ఛమైన మనసు సేద్యమే ఈ అక్షర " సాగుబడి "
ఇంటి బాధ్యతలనే సక్రమంగా నిర్వర్తించలేని మనుష్యులున్న ఈ రోజుల్లో సమాజ శ్రేయస్సు కోసం తన వంతుగా " ప్యూర్ " సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ, సాహిత్యంలో సరికొత్త ప్రయెాగంతో మన ముందుకు తీసుకు వచ్చిన సంధ్య గోళ్ళమూడి గారి పుస్తకం " సాగుబడి ". ఆటవెలది పద్య రూపంలో మన నిత్య ఆహార పంటలను, అక్షర పంట రూపంలో మనకందించడం, అదీ రెండు భాషలలో ఏకకాలంలో ఒకే పుస్తకంలో తీసుకురావడమన్న విషయం నిజంగా అందరు అభినందించదగ్గ విషయం.
ముందుగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం అందరం నమ్ముతాం కనుక వరిపంటను, అది పండించే ప్రదేశాలను, పంటకు అనువైన కాలాలను మెుదలైన విషయాలను చక్కని ఆటవెలదులుగా అందించారు. తరువాత కంది, మినుము, పెసర, మెుక్కజొన్న, పొద్దుతిరుగుడు, పసుపు, చెరకు, పత్తి వంటి నిత్యావసర వాడుక పంటలను వాటి వివరాలను అందించారు. పండ్ల తోటల సాగును వచనంలో వివరించి బత్తాయి, జామ, సీతాఫలం, బొప్పాయి, పనస, సపోటా, మామిడి వగైరా పండ్ల పంటల వివరాలను చక్కని ఆటవెలదుల పద్యాలుగా చెప్పారు. పూల పంటల సాగును వచనంలో వివరిస్తూ గులాబి, బంతి పూల సాగును అందమైన ఆటవెలదులుగా అక్షరాల్లో తీర్చి దిద్దారు. చివరిగా మనిషికి అత్యంత ఉపయెాగకరమైన ఒౌషద వృక్షం వేప గురించి వచనంగాను, పద్యంగాను వివరించి, అన్ని పంటలకు రక్షణ కవచమైన కంచెను గద్యంగా అందించి " సాగుబడి "ని సంపూర్ణం గావించారు.
ఓ పక్క ఆంగ్లం, మరో పక్క తెలుగులో చక్కని తేలిక పదాలతో, అందరికి అర్థమయ్యే భాషలో సాధారణంగా అందరికి తెలిసిన పంటలను, వాటి మూలాలను, ఉపయెాగాలను వివరించడం ఇప్పటికి వరకు ఎవరు చేయని పని. నిరంతరం సేవా కార్యక్రమాలలో, ఓ క్షణం కూడా తీరిక లేకుండా, వయసు, ఆరోగ్యంతో కూడా సంబంధం లేకుండా కాలంతో పోటి పడే " అమ్మ " కు ఇంత అందంగా అక్షర సేద్యం చేయడానికి ఎలా తీరిక చిక్కిందో! నాకైతే పుస్తకం చదువుతున్నంతసేపూ ఆశ్చర్యమే అనిపించింది. ఈ అక్షర వ్యవసాయానికి పాదాభివందనం చెప్పడం తప్ప మరో మాట లేదు. " సాగుబడి "కి సంధ్య గోళ్ళమూడి గారికి హృదయపూర్వక శుభాభినందనలు.
వర్గము
సమీక్ష
మనిషి - బాధ...!!
నేస్తం,
మనలో బాధ, భయం, అసహనం, కోపం ఇలా ఎన్నో రకాల భావాలుంటాయి. అన్ని చోట్లా అన్నింటిని చూపలేం. ఎదుటివారు మనల్ని బాధ పెట్టినప్పుడూ మనమే బాధ పడతాం. మన మూలంగా వారు బాధ పడుతున్నారని తెలిసినా మనమే బాధ పడతాం. దీనంతటికి కారణం మనసు. అది లేకపోతే ఏ గోలా లేదు.
కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్టుగా, మన బాధలకూ బోలెడు కారణాలు. మహా భారతంలో శ్రీకృష్ణుడు చాలా తేలికగా బాధను త్యజించమని చెప్తాడు. ఎదుటివారి తప్పులను క్షమించమంటాడు. మనం క్షమించడమే వారి పతనానికి తొలిమెట్టు అని చెప్తాడు. చెప్పినంత సుళువు కాదుగా వదిలేయడం. పడేవాళ్ళకు తెలుస్తుంది. ఒడ్డున ఉండి రాళ్ళేయడమేముంది. పడినవాళ్ళను లేపడమే కష్టం.
సమస్యకు లొంగిపోవడం అనేది మన ఓటమి. గెలుపోటముల సంగతి పక్కనబెట్టి సమస్యతో పోరాడటం మన నైతిక విజయం. బాధ మనకే, శిక్ష మనకే అంటే ఎలా? బాధ పెట్టినవారికి ఆ బాధను తెలియజేయాలి. అంతే కాని మనమే బాధను భరిస్తూ ఉండకూడదు. శాంతి ప్రవచనాలకు, అనుభవాలకు చాలా తేడా ఉంటుంది. బాధ ఏ మనిషికైనా, మనసుకైనా ఒకటేనని ఎందుకు తెలుసుకోలేక పోతున్నాం? మనం వంద మాటలన్నప్పుడు ఎదుటివారు మాట అనగానే మనకు బాధ, కోపం వచ్చినప్పుడు, అదే పరిస్థితి ఎదుటివారికి వస్తుందని మర్చిపోతే ఎలా! వేలెత్తి చూపడం చాలా తేలిక. మిగతా నాలుగు వేళ్ళు మనల్నే చూపిస్తాయని మర్చిపోతాం. మనుష్యులం కదా, ఇది మన నైజం. మాట అనే ముందు ఆలోచించాలి. పడతూ ఉన్నారని పదే పదే అంటే...సమాధానం చెప్పడం చేతకాక కాదు, ఎదుటివారు మీకిచ్చిన విలువని గుర్తించండి. అహం, అధికారం మన ఆస్తులనుకుంటే, రేపటి రోజున కనీసం మంచినీళ్ళకు కూడా దిక్కు లేకుండా పోతుంది. ఇంటివారిని మానసికంగా, శారీరకంగా హింసించి, వారి ఆక్రోశానికి కారణమైన ఎవరూ బాగుపడరు.
" మన ప్రవర్తన గురించి మనం కాదు చెప్పుకోవాల్సింది. ప్రపంచం ఇచ్చే కితాబులకన్నా ఇంటి మనుష్యులు సంతోష పడితే సిరులన్నీ నీవే."
వర్గము
కబుర్లు
2, ఆగస్టు 2021, సోమవారం
కాలం వెంబడి కలం..65
నేను ఆఫీస్ లో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే హెచ్ ఆర్ మానేజర్ మిలి వెళిపోయింది. జయ హెచ్ ఆర్ మానేజర్ అయ్యింది. రిసెప్షనిస్ట్ జ్యోతి బాగా క్లోజ్ అయ్యింది నాకు. కబుర్లు చెప్పినా వర్క్ చేయిస్తున్నానని నాకు బోలెడు నిక్ నేమ్స్ కూడా పెట్టేసారు. వెనుక తిట్టుకున్నా నాతో అందరు బానే ఉండేవారు. సుబ్బలక్ష్మి బాగా క్లోజ్ గా ఉండేది. ఆఫీస్ రాజకీయాలు షరా మామూలే. అనురాధ నాతో బావుంటూనే తన అవసరం కోసం నామీద చెప్పడం చేసి మెుత్తానికి తన సాలరీ పెంచించుకుంది. నాముందు అరి కేసరి కూడా ఆవిడతో చాలా ఆత్మీయంగా మాట్లాడం చేసేవారు. మా సీనియర్ చెల్లెలు ఈవిడ. అరి కేసరికి గ్రీన్ కార్డ్ రావడం, అది నాకు చూపించడం, CMMi సర్టిఫికేషన్ కోసం ప్రయత్నాలు మెుదలు కావడం జరిగాయి. ఓ రెండు రోజులు ట్రైనింగ్ క్లాసులతో మెుదలుబెట్టి ఆ CMMi Level 3 సర్టిఫికేషన్ కోసం టీమ్ ఏర్పాటు చేసి, డాక్యుమెంటేషన్ మెుదలుబెట్టారు. విక్రమ్, ఆనంద్ డాక్యుమెంట్ రైటర్స్ గా వచ్చారు. అప్పుడే వాణి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆవిడ బిజినెస్ టీమ్ లో ఉండేవారు. మెుత్తానికి APSPD sale ప్రాజెక్ట్ సంపాదించి, ఆ ప్రాజెక్టు కోసం విజయవాడ నేను, వాణి గారు, విక్రమ్, ఆనంద్ వచ్చాము. నాకు TA, DAల గురించి ఏమి తెలియదు. వాళ్ళు హోటల్ లో ఉన్నారు. నేను సాయంత్రం వరకు అన్ని పనులు చేసి ఇంటికి వచ్చేసాను ఆ రెండు రోజులు. నాకు అప్పగించిన పని నేను కరక్ట్ గానే చేసాను. అందరితో అప్లికేషన్స్ ఫిల్ చేయించి, అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకోవడం. అవన్నీ నా వంతు నేను చేసాను. తర్వాత వాళ్ళు లెక్కలేవో చూసుకుని నాకు ఓ 1000 రూపాయలు మాత్రం ఇచ్చినట్టు గుర్తు.
తర్వాత వైజాగ్ EPD sale ISO quality ఇన్స్పెక్షన్ కోసం అనూరాధ, నేను, విక్రమ్, ఆనంద్ వెళ్ళామనుకుంటా. వైజాగ్ నుండి విజయవాడ వరకు చూసుకుంటూ వచ్చాము. విజయవాడలో ఇంటికి తీసుకువచ్చి, ఆవిడని హైదరాబాదు బస్ ఎక్కించాను. ఆ తర్వాత ఆవిడ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఎందుకులే అని నేను కాస్త దూరంగా ఉండేదాన్ని. CMMi కోసం నేను, అనూరాధ అన్ని చూసేవాళ్ళం. తర్వాత ప్రాజెక్ట్ మానేజర్ గా దుర్గ గారిని తీసుకున్నారు. మెుత్తానికి కష్టపడి cmmi Level 3 సర్టిఫికేట్ సంపాదించారు. తర్వాత పార్టీ కూడా ఇచ్చారు. ఆ పార్టీ లో మాకందరికి సర్టిఫికేట్స్ ఇచ్చారు. అప్పుడు సుబ్బరాజు ఇండియా వచ్చారు. నాకు స్టేజ్ మీద సర్టిఫికేట్ ఇస్తూ, మీతో మాట్లాడాలి తర్వాత కలవండి అని చెప్పారు. తర్వాత మాట్లాడినప్పుడు ఆఫీస్ విషయాలు అడిగితే జరిగిన విషయాలు చెప్పి, మీ జాగ్రత్తలో మీరుండండి అని చెప్పాను. నాకు సాలరీ చాలా తక్కువే ఇచ్చేవారు. సాలరీ విషయం నేను చూసుకుంటాను, మీ అకౌంట్ నంబర్ ఇవ్వండి. అక్కడి నుండి నేను పంపిస్తాను అని చెప్పారు. కాని ఒక్క రూపాయి కూడా పంపలేదు ఎప్పుడూ.
అమెరికాలో మా ఇంటి పక్కన ఉండే రెడ్డి అంకుల్ ఇండియా వచ్చి, నన్ను కలిసి తన ఇల్లు శ్రీనగర్ కాలనీలో ఉందని, అక్కడికి రమ్మని బలవంత పెట్టి, ఆ భూత్ బంగళాకు నా మకాం మార్చారు. వాణి గారి అపార్ట్మెంట్ కు దగ్గర అది. అప్పుడప్పుడూ నేను, వాణి గారు, జ్యోతి కొత్త సినిమాలకు వెళుతూ ఉండేవాళ్ళం.
అంకుల్ భూత్ బంగళాలో ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉండేది. అయినా ఉండటానికి అలవాటు పడ్డాను. తర్వాత తర్వాత అంకుల్ అసలు రూపం తెలిసింది. హంట్స్ విల్ లో అందరు ఈయన గురించి చెప్పినవి నిజమని, ఆంటీ చెప్పిన ప్రతి మాటా నిజమని, ఈయన మూలంగానే ఆవిడ మైండ్ అలా అయ్యిందని, ఈయనే ఆవిడకు ట్రీట్మెంట్ చేయించకుండా అలా చేసారని అర్థం అయ్యింది. నన్ను బాగా ఇబ్బంది పెట్టారు.
పిల్లల అల్లరి తట్టుకోలేక సరదాగా సమ్మర్ హాలిడేస్ లో విజయవాడ లో స్కేటింగ్ లో జాయిన్ చేస్తే మౌర్య బాగా చేసేవాడు. శౌర్య అల్లరోడుగా, ఆటగా చేసేవాడు. స్కేటింగ్ లో జాయిన్ చేసిన మూడు నెలలకే స్టేట్ కాంపిటీషన్ కి సెలక్ట్ అయ్యాడు మౌర్య. హైదరాబాదు అందరు సరదాగా వచ్చారు. అమ్మమ్మ, తాతయ్య కూడా వచ్చారు. మా పిన్ని వాళ్ళు BHEL దగ్గరలోఉండేవారు. పొద్దుటి నుండి సాయంత్రం వరకు వీడి స్కేటింగ్ తోనే సరిపోయేది. వెళ్ళడానికి కుదరక తనను రమ్మంటే, తను, వాళ్ళ తోడికోడలు రాధక్క స్టేడియం దగ్గరకు వచ్చారు. దానికి ఆవిడ ఇప్పటికి దెప్పుతూనే ఉంటుంది వాళ్ళింటికి రాలేదని. తర్వాత వెళ్ళలేని పరిస్థితిలో కూడా కొత్తింటి ఫంక్షన్ కి అమ్మమ్మని తీసుకువెళ్ళినా అది గుర్తులేదావిడకు. చెప్తే చాలా ఉన్నాయి. ఎందుకులే అని ఊరుకోవడమే. మాటల్లో ప్రేమ చూపించడం కాదు చేతల్లో ఉండాలి.
" దూరం అనేది ఎవరికయినా ఒకటే. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్యన దూరం సమానమే. "
వచ్చే వారం మరిన్ని కబుర్లతో...
వర్గము
ముచ్చట్లు
1, ఆగస్టు 2021, ఆదివారం
మాట సమీక్ష
మాటే మనిషికి వరమూ..శాపమూ..!!
మాట రెండు అక్షరాలే కాని ఆ మాటలో దాగున్న జీవిత సత్యాలెన్నో. మన పంచమ వేదమైన మహాభారతంలోని పదునెనిమిది పర్వాలకూ ఉన్న విశిష్టత చిన్ని నారాయణ రావు గారు రాసిన "మాట" దీర్ఘ కవితకు ఉందనడంలో అసత్యమేమీ లేదని ఈ "మాట"ను చదివిన నాకనిపించడంలో విడ్డూరమేమి లేదు. పలుమార్లు సాహితీ వేదికల మీద చిన్ని నారాయణ రావు గారిని చూడటం, నేస్తం వారి మాటలు వినడం జరిగింది. నాకు అప్పుడు తెలియదు వారి మాటలు ఎందుకు అంత ఆచితూచినట్లుగా ఉంటాయెా. ఈ " మాట " దీర్ఘ కవిత చదివిన తర్వాతే మాటలోని మర్మం తెలిసింది.
మహభారతంలోని ఆది పర్వంలో చెప్పబడినట్లుగానే "మాట" పూర్వాపరాల గురించి, మాట ఔచిత్యం గురించి వివరిస్తూ పలువురు పెద్దలను, న్యాయస్థానములో మాట విలువను సూఛాయగా చెప్పడంతో మాట మెుదటి భాగం మెుదలౌతుంది.
"మౌనం విజయానికి కాబోదు
సంకేతం...
మాటే గురి పెట్టి నడిపే
మహోన్నత మార్గం "
మాట విజయానికి సంకేతంగా మారడాన్ని, కొందరి కంచు కంఠాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతునే ఉన్నాయని, కళారంగంలో మాట ప్రాముఖ్యతను గుర్తు చేసారు. మాటే అన్నింటికి మూలమని మాటలోని గుట్టును కాస్త చెప్పారు.
కాలజ్ఞానం అందరికి చేరినా, మనకు వినోదాన్నిచ్చే చలనచిత్ర, నాటక రంగాలలో మాట వాడి, వేడి గురించి చెప్తూ, మాటలే మనసులను దోచే పాటలుగా మారడం, మాటే మన మిత్రుడు, శత్రువు కూడా అని చెప్తూ, మన తోడూనీడా మాటేనంటారు. మాట భావ ప్రకటన మాత్రమే కాదు మన వ్యక్తిత్వానికి ప్రతీక అంటారు. నిజమే కదా అది. మాట మనసు గాయాలను మాన్పే ఔషదమౌతుంది. కొడిగట్టిన ప్రాణాలను నిల్పే శక్తి మాటకు మాత్రమే ఉందంటూ, బతుకు చిరుగులను దాచే దివ్య ఔషదం మాటనడం చాలా బాగా నచ్చింది.
మాటే లోకం, మాటే మనిషిని నడిపించే యంత్రం, మాటే అన్నింటికి మూలమంటూ, మాటే మనిషిని అందలాలు ఎక్కిస్తుంది. ఆ మాటే మనిషిని అధఃపాతాళానికి తోసేస్తుందన్న హెచ్చరిక కూడా అంతర్లీనంగా చేస్తారు.
మట్టిభాష నుండి మహాభారతంలోని శ్రీమద్భగవద్గీత వరకు మాట గొప్పదనం గురించి గుర్తు చేస్తారు. అమ్మ మాటలోని ఆనందాన్ని, నాన్న పలుకులోని బాధ్యతను మనకు తెలియజేస్తూ, గురువు నేర్పిన చదువుతో.. బంధాలను, అనుబంధాలను అల్లుకున్న మాట మనిషికి జీవనాడిగా మిగిలిందంటారు.
ప్రేమ, ద్వేషం, బాధ, సంతోషం, కోపం ఇలా ప్రతి దానికి కారణమైన మాట మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. న్యాయాన్యాయాలను బేరీజు వేయడానికి, అమాయకత్వానికి, విరుచుకు పడే కడలి కెరటంలా మారడానికి మాటే కారణమంటారు.
మాట నిలబెట్టుకోవడం, మాట దాటటం వలను కలిగిన ఇబ్బందుల గురించి మనకు మరోమారు శ్రీరాముడి నుండి లక్ష్మణరేఖ దాటిన సీత, తదుపరి పరిస్థితులను ఒక్కమాటలో గుర్తు చేస్తారు.
పురాణ, ఇతిహాసాల నుండి మనిషి మనుగడకు మూలాధారమైన " మాట " ముత్యంలా మెరవాలన్నా, మురికి కూపంలో పడిపోవాలన్నా మాటే కారణమంటారు.
చక్కని అలతి పదాలతో రెండక్షరాల "మాట"ని పదునెనిమిది భాగాలుగా వివరించడం చాలా కష్టమైన పని. ఇంత కష్టమైన పనిని సుళువుగా చేసేసిన చిన్ని నారాయణ రావు గారికి హృదయపూర్వక అభినందనలు.
వర్గము
సమీక్ష
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)