28, జూన్ 2022, మంగళవారం

అసలైన గెలుపు ఏమిటో..!!

              మనం బతకడం మామూలు విషయం. మనతో పాటుగా పదిమందిని బతికించడం అసాధారణ విషయం. సహజంగా మనమెంతసేపు మనము, మన ఇంటివారి గురించే ఆలోచిస్తాం. మన చదువు మనకు, మనవారికి ఉపయోగ పడితే చాలనుకుంటాం. చిన్న పల్లెటూరులో అతి సాధారణ కుటుంబం నుండి వచ్చి, చదువుకున్నది ఐటిఐ అయినా, ఈనాడు పుట్టిన ఊరిలోని చదువుకునే పిల్లలకు మా చదువు అయిపోగానే మాకు మా నవీన్ అన్నయ్య ఉన్నాడు అండగా అన్న భరోసానిచ్చిన అసాధారణ వ్యక్తి గురించి నాలుగు మాటలు చెప్పాలి. 

           తండ్రి ప్రేమ తెలియకున్నా..అమ్మా, అమ్మమ్మ, తాతయ్య, మేనమామ, పిన్నిల వద్దనే పెరిగి, ఐట్ఐ చదివి, ఈరోజు హైదరాబాదులో ఓ కంపెనీ పెట్టి, పదిమందికి ఉపాధి కల్పించిన నవీన్ ఈనాటి యువతకు ఆదర్శప్రాయం. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన నవీన్ ను, నేను అవనిగడ్డ పాలిటెక్నిక్ కాలేజ్ లో పని చేసేటప్పుడు, ఓరోజు అవనిగడ్డ బస్ స్టాండ్ లో వాళ్ళ అమ్మమ్మతో చూసాను. తనే నా దగ్గరికి వచ్చి అక్కా అంటూ పలకరించాడు. తర్వాత చూసిన జ్ఞాపకమేమి లేదు. 

             ఈరోజు ఎందరో అమెరికా, ఆస్ట్రేలియా వంటి సంపన్న దేశాలు వెళ్ళి డాలర్లు సంపాదిస్తూ, తమ తమ కుటుంబాలను పోషించికుంటున్నారు. బతకడం అంటే మనం మాత్రమే కాదు, మనతో పాటు పదిమందికి దారి చూపించడమన్న సదుద్దేశ్యం ఏ కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో నవీన్ ఉన్నందుకు, ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని, తనే కాకుండా తన పిన్ని పిల్లలను కూడా సొంతవారిలా చూసుకుంటూ, పదిమందికి నేనున్నానన్న భరోసానిస్తున్న నవీన్ ను చూస్తుంటే, నిజంగా మా విజయక్క చాలా అదృష్టవంతురాలు అనిపించింది. తను చాలా ఇబ్బందులు పడే నవీన్ ను పెంచింది. కాని బిడ్డొచ్చిన వేళా, గొడ్డొచ్చిన వేళా అన్నట్టు నవీన్ జీవితంలో అర్ధాంగి రాకతో వచ్చిన మార్పు చాలా సంతోషకరమైనది. ఇద్దరు బిడ్డలతో చక్కని కుటుంబం. జీవితాన్ని గెలవడమంటే ఇది అని అనిపించింది నాకు.

              మేమందరం కలిసి పెరిగిన ఊరు జయపురం. మా జయపురానికే కాకుండా అందరికి ఆదర్శప్రాయుడు నవీన్. సంకల్పం గొప్పదైతే దైవం తోడవుతుందని పెద్దలు ఊరికినే చెప్పలేదు. నవీన్ మరింత ఉన్నతిని సాధించాలని, సమాజానికి మరింత ఉపయోగ పడాలని కోరుకుంటూ.. హృదయపూర్వక శుభాభినందనలు…


21, జూన్ 2022, మంగళవారం

నువ్వు దేవుడు సామి…!!

బయట జనాలకు

ప్రపంచ బాగోగులన్నీ

పట్టించుకునే నువ్వు  

దేవుడు సామి


ఇంట్లో ఈగల మోతయినా

బయట డప్పుల మోతకు

ఉబ్బితబ్బిబ్బయ్యే నువ్వు

దేవుడు సామి 


మంచిలో చెడు వెదికే 

పెంపకంలో పెరిగి

అనుబంధాలకు అర్థాలు మార్చేసిన నువ్వు

దేవుడు సామి


కుటుంబం రోడ్డున పడ్డా 

చేతికి ఎముకలేని అపర దాన కర్ణుడని

నలుగురు పొగిడితే చాలనుకునే నువ్వు

దేవుడు సామి


బాధ్యతలు తప్పించుకుంటూ

వెధవల మాటలు నమ్మి

ఇల్లాలిని నగుబాటు చేసే నువ్వు

దేవుడు సామి


పదుగురి మెప్పు కోసం పాకులాడితే 

చివరకు మిగిలేదేమిటో తెలుసుకోనప్పుడు

ఏకాకితనమే నీదని గుర్తెరగని నువ్వు

దేవుడు సామి..!!

15, జూన్ 2022, బుధవారం

గొప్ప కానుక..!!

పుస్తకాన్ని ఆస్వాదిస్తూ చదవడమంటే ఇదే కాబోలు….మనఃపూర్వక ధన్యవాదాలు లక్ష్మిరాఘవ గారు….


ఒక నిర్ణయానికి కట్టు బడి పెళ్ళి , ఎదురైన ప్రతి సంఘటనా మనసును కలిచివేసినా చూపిన నిబ్బరం, అమెరికా చేరినా వీడని ధైర్యం .. పైగా 6 నెలలు experience లేకపోతే మీరు ఇంటెర్వ్యూ కి పిలవరుగదా అని అడిగేస్తారా ???


అయ్యబాబోయ్ ! అమెరికాలో ప్రతి అడుగూ ఎలాపడిందో ఇంతమంది ఎలా సాయ పడ్డారో ఎలా జ్ఞాపకం పెట్టుకున్నావు తల్లీ . అమెరికా వెళ్ళే వాళ్ళు ఈ పుస్తకం చదివి z ని జీగా నేర్చుకోవడమే కాదు, V+++ లో experiance లేకపోయినా నేర్చుకుని చేసిన నేర్పరితనం ... అందరికీ క్రిష్ లాటి మేనేజర్ దొరకరేమో ...అంతేకాదు కాలిఫ్హోర్నియా నుండీ సేఫ్టీ వాల్వ్ తెప్పించుకోలేరు కూడా 😳😳😄 hat’s off to you my dear 👏🏼👏🏼👏🏼


అయినా ఇన్నిరోజులూ గడచినా , ఇన్ని కబుర్లు చెప్పి , కాబ్ కూడా బుక్ చేసుకుని    airport నుండీ గమ్య స్థానం చేరగలిగిన మంజు చీర కాకుండా వేరే వస్త్ర ధారణ గురించి చెప్పలేదే ????


ఫోటో కూడా పంపారు కాని వారికి చెప్పలేదని ఫోటో పెట్టలేదు…


మనల్న్ని మనం నమ్మాలి . నమ్మినదారిలో నడవాలి అనే రకం.


ఒక పుస్తకానికి ఇంతకన్నా విలువైన పురస్కారం ఏముంటుంది చెప్పండి….🙏


చిన్నప్పటి జ్ఞాపకాలు ఇలా…!!

ఎప్పుడో కలిసిన జ్ఞాపకం_ఇప్పటికి ఎద కనుమలలో విహరిస్తూ..!!


నా చిన్నప్పటి నేస్తాలు…రెండు నుండి ఆరు వరకు అవనిగడ్డ  శ్రీ గద్దే వెంకట సత్యనారాయణ శిశువుద్యామందిరంలో చదువుకున్నాం. పోట్లాటలు, అలకలు, ఆటలు బోలెడు పంచేసుకున్నామప్పుడు..ఇద్దరూ శ్రీలక్ష్మి లే.

10, జూన్ 2022, శుక్రవారం

​మూల్యాంకనం ఆవిష్కరణ…!!

    అనుకోకుండా మెుదలైన నా అక్షర ప్రయాణంలో 11వ పుస్తకం  “ మూల్యాంకనం “  ఆత్మీయ కుటుంబ సభ్యుల మధ్యన సాదాసీదాగా ఆవిష్కృతమైంది. 

10వ పుస్తకం “ రాతిరి చుక్కలు…అక్షరాంగనల ఆంతర్యాలు “ రాకుండానే 11వ పుస్తకం వచ్చేసింది. 

ఏదో మనసుకు అనిపించింది రాయడమే కాని సర్దుబాట్లు, దిద్దుబాట్లు చేయని రాతలే నావన్నీ. అడిగిన వెంటనే కాదనకుండా ఈ పుస్తకానికి ముందుమాటలు రాసిన పెద్దలు, పిన్నలు అందరికి పేరుపేరునా మనఃపూర్వక ధన్యవాదాలు. పేరుకి తగ్గట్టుగా ముఖచిత్రాన్ని వేసిన శ్రీచరణ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు. 

   మాకత్యంత ఆప్తులు, ఆత్మీయులైన శ్రీ కోనేరు వెంకట రామారావు గారు, వెంకట సుబ్బలక్ష్మి గారు వారి 43వ పెళ్లిరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల నడుమన “ మూల్యాంకనం” పుస్తకాన్ని వారి ఇంటిలో ఆవిష్కరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

9, జూన్ 2022, గురువారం

జీవన మంజూష జూన్ 2022

నేస్తం,

         మనిషి జీవితంలో అతి ముఖ్యమైనది సమస్య. ఇది ఎందుకు, ఎలా వస్తుందన్న దానికి మూలాలు వెదకడంలో మనం సఫలీకృతులు కాలేకపోతున్నాం. మానవ జీవితాలను తరచి చూస్తుంటే ఆశ,కోరికలు కొన్ని సమస్యలకు కారణాలు. మరికొన్నింటికి అహంకారం, ఈర్ష్య, అసూయలు ముఖ్య కారణాలౌతున్నాయి. పూర్వం మన పెద్దలు మనకు వారసత్వంగా ఇచ్చిన అనుబంధాలను, ఆప్యాయతలను నేడు మనం డబ్బు మోహంలో పడి, వారిచ్చిన జీవితపు విలువలకు తిలోదకాలిచ్చేసాం. మనమన్న ద్విపదాలను మరచి నేనన్న ఏక పదమే ముద్దని మన పిల్లలకు అదే నూరిపోస్తున్నాం. ఎన్ని ప్రకృతి విలయాలు ఎన్ని పాఠాలు నేర్పినా మన బుద్ధిని మార్చుకోలేక పోతున్నాం. ఎందుకింతగా మానవ విలువలు దిగజారి పోతున్నాయి?

            మూగ జీవాలు ప్రాణాపాయ స్థితిలో వుంటే పట్టించుకోం. కనీసం సాటి మనిషి కష్టంలో మాట సాయానికి కూడా మనం పనికిరావడం లేదంటే తప్పు ఎవరిది? మానవత్వం లేకుండా పోతున్న మనిషిదా? మనిషితనానికి విలువనివ్వని సమాజానిదా? వ్యామోహాల మాయలో కొట్టుమిట్టాడుతున్న మనిషి మోహాల నుండి బయటబడి అసలైన జీవితపు విలువలు తెలుసుకునే అవకాశం ఉందా! తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్యన దూరం, ఒకే గూటిలో మసలే భార్యాభర్తల మధ్యన అడ్డుగోడలు, దగ్గరితనాన్ని మరచిపోతున్న బంధుగణం. ఇలా చెప్పకుంటూ పోతుంటే సవాలక్ష సమస్యలు కుటుంబాల్లో. సమస్యల్లేని మనిషీ లేడు, సమస్యల్లేని కుటుంబాలు లేవు. ఇక సమాజమంటారా! మనందరం కలిస్తేనే సమాజం. సమాజం సక్రమంగా నడవడానికి మనం ఏర్పరచుకున్నదే వ్యవస్థ. వ్యవస్థ సక్రమంగా నడవడానికి కొన్ని కట్టుబాట్లు. దిద్దుబాట్లు అవసరం

               బంధం మనది అనుకుంటేనే బాధ్యతలు గుర్తుంటాయి. అది బంధమయినా సరే. బంధానికి మనం విలువ ఇస్తేనే, దాని ఫలితాన్ని పరిపూర్ణంగా అనుభవించ గలుగుతాం. నిజాయితీ ఇద్దరి మధ్యనా ఉండాలి. ఇప్పటి అంతర్జాల అనుబంధాల మూలంగా ఎన్నో కుటుంబాలు కకావికలం అయిపోతున్నాయి. ఎదుటివారిని అక్షేపించే ముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. బంధాన్ని మోసగించడమంటే మనల్ని మనం మోసం చేసుకోవడమే. మనకి అహంకారముంటే ఎదుటివారికి ఆత్మాభిమానముంటుంది. ఏదొక రోజు ఆత్మాభిమానానికి మనం సమాధానం చెప్పవలసిందే. ఎందుకంటే మనది కర్మభూమి. మన కర్మలను జాగ్రత్తగా మనకు అప్పజెప్పే వాడు పైవాడు. వాడు విశ్వంలోనే చేయి తిరిగిన రాతగాడు. మన లెక్కలు బాగా తెలిసిన వాడు కూడానూ. అవహేళనలకు, అరాచకాలకు చరమగీతం తప్పక రాస్తాడు

            మనం అనుకుంటాం మనం చాలా తెలివి గల వాళ్ళమని. కాని మన తెలివితేటలు ఇంట్లో వారిని మభ్య పెట్టడానికి మాత్రమే పనికివస్తాయి. అది కూడా వాళ్ళకు నిజమేంటో తెలిసినా మన అతితెలివిని మనసులో అసహ్యించుకుంటూ, పైకి మనం చెప్పేదే నిజమని నమ్మినట్టు మనకు కనిపిస్తారు. మనది చాలా గొప్ప ఆటని, గెలిచామని మనమనుకుంటే, అసలు గెలుపేంటో రేపటి రేజున పైవాడు చూపిస్తాడు. కుటుంబాన్ని మోసం చేయడం గెలుపు కాదు. కుటుంబ ప్రేమను గెలవడం గెలుపని తెలుసుకున్న రోజు నిజమైన గెలుపు ఆనందం తెలుస్తుంది


8, జూన్ 2022, బుధవారం

చిన్ననాటి జ్ఞాపకాలు..!!

నా చిన్ననాటి ఆత్మీయ నేస్తం కొడుకు కొడుకు…వాడి బోసి నవ్వులు ఎంత బావున్నాయో. 


   మేమిద్దరం కలిసి చదువుకోక పోయినా మా మధ్యన స్నేహం కుదిరింది. మా టెంత్ అప్పుడు తను ఇంటరు ఫస్ట్ ఇయర్. వాళ్ళ అక్క ఇంటరు సెకెండ్ ఇయర్. చెల్లెలు మా స్కూల్. వీళ్ళంతా మా క్లాస్మేట్ ప్రదీప్ వాళ్ళ పెద్దమ్మ కూతుర్లు. మేము బస్ ఎక్కడానికి వీళ్ళ ఇంటి అరుగుల మీద కూర్చుని, బస్ వచ్చే వరకు ఆడుకుంటూ ఉండేవాళ్ళం. అలా తనతో స్నేహామన్న మాట. మేమంతా ఒకే కాలేజ్ విజయనగరంలో. అప్పట్లో నిర్మల పెళ్లి అప్పుడు కలిసాను తనని. ఎప్పుడో విడిపోయిన మేము ఆమధ్యన ఫోన్‌లో మాటలతో కలుసుకున్నాము. 

     జ్ఞాపకాలు, ఆత్మీయ పలకరింపులు మనసుకు చాలా సంతోషాన్నిస్తాయి. 

  మీరూ మా బుల్లి రాజా వారికి ఆశీస్సులు అందజేయండి మరి😍ఇంతకీ తన పేరు చెప్పలేదు కదూ …నీరజ😍

7, జూన్ 2022, మంగళవారం

అతివా జాగ్రత్త..!!

​     అనాది నుండి పురుషాధిపత్యం కొనసాగుతున్న మన సమాజంలో మహిళకు జరుగుతున్నది అన్యాయమే. అది ఏ విషయంలో తీసుకున్నా సరే. అహంకారం పురుషుడికి ఆభరణంగా మారిపోయింది. ఇంటి పనులు, ఒంటి పనుల విషయంలోనే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా మహిళకు సరైన న్యాయం జరగడం లేదు. యుక్త వయసులో మెుదలయ్యే శారీరక మార్పులు, ఓ బిడ్డకు జన్మనివ్వడానికి పడే శారీరక, మానసిక అవస్థలు, నడిమి వయసులో హార్మోనుల వలన కలిగే ఇబ్బందులు, మోనోపాజ్ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు మహిళలను చుట్టుముడుతున్నాయి. ఇవి ప్రకృతి పరంగా సమస్యలు. ఇక వ్యక్తుల పరంగా, సమాజ పరంగా వచ్చేవి కోకొల్లలు. ఎంత చదువుకున్నా, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నా, ఇంటా బయటా సమస్యలు తప్పడం లేదు కొందరికి. 

     మన శరీర ఆరోగ్యం బాగుండాలంటే ముందు మన మానసిక ఆరోగ్యం బావుండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మానసికంగా దృఢంగా వుంటే ఎన్నో శారీరక సమస్యలు, అనారోగ్యాలు వాటంతట అవే పోతాయి. పోక పోయినా శారీరక అనారోగ్యాన్ని ఎదుర్కునే ధైర్యం మానసిక శక్తి అందిస్తుంది. అన్ని అనారోగ్యాలను నయం చేసే మందులు లేవు. మనోధైర్యం మనిషి ఆయువును పెంచుతుంది. ఇప్పటి ప్రపంచ సమస్య కరోనా, కాన్సర్, కొన్ని ఆటో ఇమ్యూనిటి అనారోగ్యాలను జయించాలంటే మనకు ముందుగా కావాల్సింది మానసిక స్థైర్యమే. 
      ఆటో ఇమ్యూనిటి డిసీజ్ ల పై ఇప్పుడిప్పుడే కాస్త అవగాహన వస్తోంది. వాటిలో అందరికి తెలిసింది సొరియాసిస్. మరొకటి కీళ్ళనొప్పి. ఈ కీళ్ళనొప్పులు కూడా పురుషుల కన్నా మహిళలలోనే ఎక్కువ. కీళ్ళ వాపులు, జాయింట్ల దగ్గర నొప్పులు వస్తుంటే సహజంగా మనం కీళ్ళనొప్పులని అనుకుంటాం. కాని వీటిలో మనకు తెలియనివి చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది లూపస్. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మే 10ని లూపస్ డే గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ లూపస్ రావడానికి రకరకాల కారణాలున్నాయి. ఇదమిద్ధంగా పలానా కారణమని చెప్పలేము. ఈ వ్యాధి లక్షణాలు కూడా మనిషికి మనిషికి వేరు వేరుగా వుంటాయి. అన్ని లక్షణాలు ఉంటేనే లూపస్ అని నిర్థారించనవసరం లేదు. ఏ లక్షణాలన్నా దీనికి సంబంధించిన కీళ్ళవ్యాధి నిపుణులను సంప్రదించాలి. 
    ఈ లూపస్ ప్రధాన లక్షణం ముఖంపై సీతాకోకచిలుక చిలుక ఆకారంలో ఎర్రని, నల్లని మచ్చలు రావడం. కాస్త జ్వరం, ఎండ తగిలితే శరీరం మంట పుట్టడం, చర్మంపై ఎర్రని పొక్కులు రావడం, కీళ్ళ దగ్గర వాపులు, నొప్పులు వంటి మిగతా లక్షణాలు కనబడతాయి. లూపస్ వున్న రోగిలో ఇవి అన్ని ఉండకపోవచ్చు.వీటిలో ఏ కొన్ని వున్నా వెంటనే డాక్టర్ ని సంప్రదించడం అవసరం. దీనిని మెుదట్లోనే గుర్తించడం కాస్త కష్టమే. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో దీనికి వైద్య సలహాలు తీసుకోవాలి. ఇది పూర్తిగా తగ్గదు. కాని సరైన వైద్యం, సకాలంలో తీసుకుంటే లూపస్ ని కంట్రోల్ చేయవచ్చు. వైద్యం చేయించుకోవడంలో అశ్రద్ధ చేస్తే రోగి శరీరంలో వ్యాధులు రాకుండా పరిరక్షించే యాంటిబాడీస్ వ్యతిరేకదిశలో పనిచేస్తూ శరీరంలోని వివిధ కణజాలాల వ్యవస్థలపై దాడి చేసి ఆ యా వ్యవస్థలను నిర్వీర్యం చేసేస్తాయి. ఈ వ్యాధి ఎక్కువగా 40 వయసు దాటిన మహిళలలో కనబడుతుంది. మగవారికి తక్కువగానే వస్తుంది. కాని వస్తే మాత్రం దాని ప్రభావం చాలా తీవ్రంగా వుంటుంది. 
      తెలిసిన సాధారణ లక్షణాలని అశ్రద్ధ చేయకుండా ఏ కాస్త అనారోగ్యమున్నా వెంటనే సంబంధిత వైద్యుని సలహా తీసుకోండి. మహిళలూ మీరు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. మీరు లేనిదే ఇల్లు, సమాజం మనలేదు. ఇంటికి, సమాజానికి మీరెంత అవసరమో..మీ ఆరోగ్యం కూడా మీకంత ముఖ్యమేనని మరువకండి. 

1, జూన్ 2022, బుధవారం

​అందరికి మనఃపూర్వక ధన్యవాదాలు..!!

   అక్షర స(వి)న్యాసం తరువాత కవిత్వం పుస్తకం తేలేనేమో అనుకున్నా.  ఆ ఆలోచనకు తెర దించుతూ త్వరలో మీ ముందుకు వస్తోంది “ మూల్యాంకనం “ కవితా సంపుటి. 

ముందు మాటలు రాసిన పెద్దలకు, పిన్నలకు హృదయపూర్వక ధన్యవాదాలు. 

  అడిగినదే తడవుగా అమ్మకు అద్భుతమైన ముఖచిత్రాన్ని పేరుకు తగ్గట్టుగా వేసిచ్చిన శ్రీచరణ్ కు శుభాశీస్సులు. 

  పుస్తకం ముఖచిత్రం చూస్తుంటేనే కలిమిశ్రీ గారి చేతి పని తీరు మీకందరికి తెలిసిపోయుంటుంది. 

    ఇంతకు ముందు పది పుస్తకాలను ఆదరించిన పాఠక ఆత్మీయులు ఈ పదకొండవ పుస్తకం “ మూల్యాంకనం “ ని కూడా సహృదయంతో ఆదరించి మీ సద్విమర్శలు తెలుయజేస్తారని ఆశిస్తూ….

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner