28, జులై 2022, గురువారం

రెక్కలు..!!

​1.  మనిషైనా

మనసైనా

కష్టానికి 

సుఖానికి ఒకటే


ప్రశ్న, సమాధానం

కాలమే..!!

2.   గాయం చేసేది

మనిషే

మాయం చేసే నేర్పు

కాలానిది


తీరుతెన్నుల ఫలితం

మనసుదే..!!

3.  ఉధృతిని భరించేది

సముద్రం

అలజడిని అనుభవించేది

మనసు


సారూప్యం

కొన్నింటిది..!!

4.   దూరం పెంచడం

సుళువే

దగ్గర చేయడమే

కష్టం


మాటకున్న

విలువ..!!

5.  నటించడం

మనకలవాటు

ఆడుకోవడం

పైవాడికి తెలుసు


రేపనేది ఉంటుంది

ఎవరికైనా..!!

6.  బంధుత్వం

దగ్గరదే

బాంధవ్యమే

బహు దూరం


ఈనాటి

అనుబంధాల్లో..!!

7.   అణుమాత్రమే

అభిమానం

నిలువెల్లా

అహంకారమే


సమన్వయమే

ప్రేమపాశం..!!

8.  నీతో

నువ్వు

నీలో

నవ్వు


నెయ్యానికి

నేస్తం..!!

9.   తప్పొప్పులు

సహజం

ఎత్తి చూపే నైజం

మనిషి లక్షణం


తీర్పు

కాలానిది..!!

10.  నోటితో

మాట

నొసటితో

వెక్కిరింత


కొందరి

నైజమింతే..!!

11.  కల

కనుమరుగౌతుంది

వాస్తవం 

వద్దనే వుంటుంది


కాలం

మారదు..!!

12.  అభిమానం

ఆత్మీయత

బంధం

అనుబంధం


మానవ సంబంధాలు

చరిత్ర పుటల్లో..!!

13.   అర్హత

అనర్హత

అక్షరమే

తేడా


వ్యవస్థ

పు(తి)రోగతికి మూలం..!!

14.  రాయలేని

లేఖ

మోయలేని

బరువు


మనసు పొరల్లో

పదిలం..!!

15.  సహజత్వం

మెరుపు

అసహజత్వం

విరుపు


వెరసి

అత్యున్నత పురస్కారం..!!

16.   జీవన పయనంలో

అనుభవాల పరంపరలు 

భారమో బాధ్యతో

మోయక తప్పదు


భవితకు బాట

అక్షర సంపద..!!

17.  బాల్యపు

గాలిపటం

తెరచిన

పంజరం


ఊహలు

స్వేచ్ఛా విహంగాలు..!!

18.  దృతరాష్ట్ర ప్రేమ

కొందరిది

శకుని అభిమానం

మరి కొందరిది


ప్రేమలు

పలురకాలు..!!

19.  జీతం

పనికి

జీవితం

నమ్మకానికి


చరిత్ర

చెబుతోంది సత్యం..!!

20.  వెన్నెల రాక

అనివార్యం

చీకటి చుట్టం

పరామర్శకు


ప్రకృతి

సహజ లక్షణం..!!

21.  అమ్మ దాచిన

తాయిలాలు

దేవుడు మిగిల్చిన

జ్ఞాపకాలు


జీవానికి జీవితానికి

నడుమన బంధాలు..!!

22.   మళ్ళింపు

బహు సుళువు

మనిషి

బలహీనత తెలిస్తే


చాకచక్యం

చారిత్రాత్మకం..!!

23.  దూరాన

మబ్బు తెరలు

గాలి వాలున

మనసులను తాకుతూ


లేఖల బంధాలు

అపురూప జ్ఞాపకాలు..!!

24.   ముందుచూపు(విజన్)

భవిష్యత్ తరాలకు

కారాగారం(ప్రిజన్)

కనిపిస్తున్న నిజం


ఏది కావాలన్నది

మీ చేతిలోనే…!!

25.   కాలం దాచే

తాయిలాలు

ఆటల్లో తగిలే

దెబ్బలు


సజీవపు 

ఆనవాళ్ళు..!!

26.   ఒడుపు

తెలియాలి

రాతిని

పట్టుకోవాలంటే


నేర్పరితనం

వాడకాన్ని బట్టి..!!

27.   సాక్ష్యాన్ని

రూపుమాపడం

వ్యవస్థను

శాసించడం


మరణ వాంగ్మూలానికి

విలువెంతో..!!

28.  గుచ్చుకునే

గులకరాళ్ళు

గుండెను చీల్చే

గులాబిముళ్ళు


మాట పదును

మహ మెత్తన..!!

29.  అవసరాలకే

అనుబంధాలు

ఆత్మీయతలు

ఆమడ దూరమే


యుగాల

సత్యమిదే..!!

30.   మరణ వాంగ్మూలానికి

విలువ లేదు

మతి స్థిమితం లేదని

తేల్చేస్తారు


అధికారం చేతుల్లోనే

అన్ని వ్యవస్థలు..!!


10, జులై 2022, ఆదివారం

కల’కలం..!!

ఏకాకి మేఘమెుకటి

ఎదను గిల్లి పోయింది

రాకాసి రాగమెుకటి

రాలుగాయితో జతగూడింది


కూతవేటు దూరమైనా

చేరలేని తావిగా మారింది

మాటలెన్ని పంచుకున్నా

వినలేని మనసే అయ్యింది


గాలివాటు గాయాలెన్నో

మౌనంగానే మిగిలాయి

కాలంతోనే కలిసుంటూ

కలవరాల పయనం సాగిస్తున్నాయి..!!
6, జులై 2022, బుధవారం

బతుకుపాట..!!

ఏరెల్లిపోనాది

ఊరెల్లిపోనాది

మడిసెల్లిపోనాడు

మమతెల్లిపోనాది


బాటేదో బరువేదో

తెలియకపోయనే ॥ఏరెల్లి॥


మాటే మౌనమైనాది

గుండె చెరువైనాది

చేరలేని గమ్యాలకు

పయనం మెుదలైనాది


మనసేదో మాయయేదో

ఎరుకైతలేకపోయనే ॥ఏరెల్లి॥


బతుకే భారమైనాది

ఊపిరాడకుండాది

బంధాల ఎలియేతకు

పాణమే పోతున్నాది 


పాశమేదో మోసమేదో

తేడాలేకపోయనే ॥ఏరెల్లి॥


కట్టె కాలాలన్నా

కర్మ కడతేరాలన్నా

కాసుల కానుకలు 

తప్పనిసరాయనే


గమనానికైనా గమ్యానికైనా

గతజన్మ కారణమాయనే ॥ఏరెల్లి॥

4, జులై 2022, సోమవారం

మూల్యాంకనం ఆవిష్కరణ..!!

​నవమల్లెతీగ యాజమాన్యానికి ధన్యవాదాలు


​జీవన మంజూష జులై2022


నేస్తం,

          సంస్కారం-కల్చర్ అన్న పదాలు నాటి-నేటి మన జీవన విధానాన్ని సూచిస్తున్నాయనడంలో అబద్ధమేం లేదు. ఐదు తరాల అనుభవాలను చూసిన మనలో కొందరికి సంస్కారం అంటే ఏమిటన్నది మనమేమి విడమరిచి చెప్పనక్కర్లేదు. అలానే ఇప్పటి కల్చర్ కు అలవాటు పడిన మనస్తత్వాలకు ఎవరి జీవితాలు ఎలా సాగుతున్నాయన్నది లోక విదితమే

          మనం మాత్రమే బావుండాలన్న చట్రంలోనే బందీలుగా మారిపోయి, కుటుంబం అంటే నేను, నా భర్త/భార్య, పిల్లలు అని మాత్రమే అనుకునేంత విస్తృత పరిధి మన మనసులకు ఆపాదించేసుకున్నామిప్పుడు. వయసైపోయిందన్న వారితో పనేముందనే మానసిక పరిపక్వత సాధించేసి, మనమెంత కల్చర్ గా బతికేస్తున్నామో నలుగురు గుర్తించేయాలన్నంత అభిలాషతో ప్రగతిపథంలో మునుముందుకి సాగిపోతున్నాం. ఒకే చోట ఉంటున్నా రోజూ ముఖాముఖాలు చూసుకోలేని తల్లీబిడ్డలెందరో ఈనాటి కల్చర్ కి నిలువెత్తు సాక్ష్యాలు. నాలుగు మెట్లు దిగి నడిచి రాలేక ముదిమి వయసును మనసారా నాలుగు మాటలు పలకరించలేని మన పెంపకాలకు మనమే గర్వపడదామీ రోజున

             డబ్బు, మందు, మగువ, మత్తు, షాపింగ్ లు మాత్రమే మన హై క్లాస్ కల్చరని భ్రమపడుతూ, పిల్లలను విచ్చలవిడిగా వదిలేయడమే మన అసలైన సంస్కారమని మనమనుకుంటే సరిపోదు. ఉన్నత చదువులు చిదివిస్తున్నామన్న మాయలో పడి కనీస విలువలు పిల్లలకు నేర్పలేక పోతున్నామన్న నిజాన్ని మర్చిపోతున్నాం. పరాయి భాషలు మాట్లాడటమే అసలైన కల్చర్ అని అనుకుంటూ, మనం వదిలేసుకుంటున్న జీవితపు విలువలు, రేపటి రోజున మనల్నే ఎగతాళి చేస్తాయని గుర్తెరగలేక పోతున్నామెందుకో

             అమెరికా, ఆస్ట్రేలియాల్లో మన పిల్లలు ఉండటమే మన డిగ్నిటి అని మనం ఫీలవడంలో వింతేమీ లేదిప్పుడు. ఎందుకంటే రూపాయికున్న విలువను డాలర్లు, పౌండులతో పోల్చుకుని మన చుట్టరికాలు పెంచుకోవడం చేస్తున్నాం కదా! బంధాలను బాధ్యత అనుకోకుండా బంధనాలని మనమిప్పుడు అనుకుంటున్నాం కనుక మన చేతలు తప్పేం కాదసలు. ఒకప్పుడు వలస పక్షులు కూడా మన గూటిలోనే తలదాచుకునేవి. ఇప్పుడేమో ఒకే కప్పు కిందున్నా యోజనాల దూరం అనుబంధాల మధ్యన. అవసరాలకు బంధాలను వాడుకోవడమే ఇప్పటి కల్చర్

        అన్నం పెట్టిన చేతినే కాటు వేసే విషపు నైజమున్న సంస్కారులిప్పుడు కోకొల్లలు. పరాయి కొంపల్లో పాకులాడుతూ, బతుకునిచ్చిన బంధాలను అల్లరిపాలు చేసి, చాటుమాటు వ్యవహారాలు నడుపుతూ, ఊసరవెల్లిలా బతికే అధములు నీతులు వల్లించేయడం, ఎవరి బతుకేంటో అందరికి తెలిసినా అహంతో 

మాట తూలడం గొప్పనుకుంటున్నారు. ఒకరిని అనేముందు మన పుట్టుక ఏమిటన్నది మనం గుర్తుంచుకుంటే మంచిది. అమ్మ రక్త సంబంధాలను అవసరానికి ఉపయోగించుకునే అవకాశవాదులమని నలుగురికి తెలిసినామన నటనే గొప్పదన్న భ్రమ మనల్ని వీడనంత కాలం పరాయి పంచనే మన బతుకు. మాట జారడం సుళువే. పగిలిన మనసతకడమే విధాతకైనా సాధ్యం కాదు. అహానికి, ఆత్మాభిమానానికి తేడా తెలుసుకుంటే మినుములది జీవితంలోనైనా మనకంటూ నలుగురు మిగులుతారు

         


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner