31, అక్టోబర్ 2017, మంగళవారం

ఏక్ తారలు..!!

1.  విసుగు రావడంలేదెందుకో_భేషజాల్లేని చెలిమి మనదని కాబోలు...!!

2.  బాసలక్కరలేని బంధమే మనది_పది కాలాలు పదిలమంటూ...!!

3.  ఆహ్లాదంగా హత్తుకుంటున్నా_చినుకుల చిరునవ్వులను...!!

4. గమనానిదెప్పుడూ వెలుగు బాటే_తప్పటడుగులెన్ని వేసినా..!!

5.  వన్నెలన్నీ చిన్నబోతున్నాయి_వెన్నెలంత స్వచ్చమైన మన స్నేహాన్ని చూసి...!!

6.  జ్ఞాపకం ఓదార్చింది_మౌనం గాయపడితే... !!

7.  జీవితాన్ని నిలబెట్టింది_ఆలంబనగా నిలిచిన నీ ప్రేమ...!!

8.  వెలుగు రాదారిని పరిచా_క్రీనీడలకు తడబడకు నేస్తమా...!!

9.   సంతసాల అతిశయమే_ ఆత్మీయతానుబంధానికి దక్కిన గౌరవానికి...!!

10.  అద్దంలో ప్రతిబింబాలు మనవి_అంతంలేని అనుబంధానికి సాక్ష్యంగా...!!

11.  వాస్తవాల ఉరుములు_భవిష్యత్తును భయపెడుతూ...!!

12. మనసుకే అన్ని కష్టాలు_పాపమేమి చేసిందో...!!

13.   అక్షరాలన్నీ ఎనలేని సంపదే_దొంగిలించే వీలు లేకుండా...!!

14.  దుఃఖపు దారిని మళ్ళిస్తున్నా_సంతోషాలను చేరువ చేయాలని...!!

15.  విశేషాలతో నిండుతున్నాయి_జ్ఞాపకాల గదులన్నీ...!!

16.  నిరీక్షణకు స్ధానమే లేదు_మనసంతా నువ్వయ్యాక..!!

17.  చైతన్యానికి చేరువౌతున్నా_మరణంతో నిత్యం రణం చేస్తూ...!!

18.  గెలుపు అనివార్యం కావాలి_మానవత్వాన్ని స్వాగతించడానికి...!!

19.  శోకానికి తెలుసు_శ్లోకంలో  పోగొట్టుకున్నది దొరుకుతుందని...!!

20.  మనసు గేయం వింటున్నా_ అలంకృతమైన మౌనంలో...!!

30, అక్టోబర్ 2017, సోమవారం

ఏక్ తారలు..!!

1.  ఎందరున్నా ఏదో లోటే_నువ్వు లేని ఖాళీని పూరించలేక...!!

2.   హద్దులెరుగనిది మన స్నేహం_ఆకాశమే సాక్ష్యంగా...!!

నీరెండకు నిశ్శబ్ధానికి....!!


నీరెండకు నిశ్శబ్ధానికి స్నేహం
ఏకాంతమైయ్యింది ఎందుకో

ఒంటరితనానికి వలస వచ్చిన
జ్ఞాపకాల గువ్వల సందడెందుకో

సమస్యల చట్రాలు చుట్టుముట్టినా
పోరాట పటిమ తగ్గడంలేదెందుకో

చీకటి చుట్టమై చేరుతుంటే
నేనున్నానని వేకువ ఓదార్పెందుకో

గతపు గాయాలు గుచ్చుతుంటే
రేపటి భవితపై ఆశలెందుకో

దిగులు దుప్పటిలో దాగిన
చిరునవ్వులకు వెలుగెప్పుడో

రాలిపడుతున్న స్వప్నాల నడుమ
వెలసిన రంగుల కలలెన్నో

మాటలు రాని మౌనాల
మనసుచాటు వ్యధలెన్నో

ఓటమి పాఠానికి తెలియజెప్పే
గెలుపు చిరునామా ఎక్కడో

కాలంలో పోటీపడే బ్రతుకుల్లో
కాళరాత్రుల కోరల కాట్లెన్నో

రెప్పపాటు జీవితానికి
రెప్పపడని క్షణాలెన్నో...!!

26, అక్టోబర్ 2017, గురువారం

ఎటూ పోలేక...!!

తరతరాలుగా తరలి వస్తోంది
ఆకలి కేకల అరణ్యరోదన

నరనరాన వ్యాపిస్తోంది
నడతలేని సంప్రదాయం

దిగంతాలుగా వెలుగుతోంది
దుర్మార్గపు దురాచారం

మారుతున్న వ్యవస్థ మూగబోయింది
రంగుల రాజకీయ క్రీడల నడుమ

తడబడి తబ్బిబ్బవుతోంది
మార్పు కోరే మెుదటి అడుగు

అనుబంధాలు ఆవిరౌతున్నాయి
అలవికాని ధన దాహానికి

సర్దుబాటుకు సామాన్యుడు  తలవంచక తప్పడం లేదు
అవినీతి అందల మెక్కాక

సగటుజీవి బ్రతుకులు కన్నీటిలో కొట్టుకపోతున్నాయి
కార్పోరేట్ ఖజానాకి వైద్యం తాకట్టు పెట్టాక

బాబాలు పరమాత్ములయ్యాక
సంస్కృతి ధనం ముసుగుకప్పుకుంది

సాధించిన ప్రగతి కూడా
కులాల కంపు కొడుతూనే ఉంది

ఆధునికత దేశం నుదుట దిష్టిచుక్కయ్యింది
పేదరికం మూఢనమ్మకాలకు తలవంచుకుంటోంది

తలరాత మారని దైన్యం రైతుదయ్యాక
వాగ్దానాల ముండ్లకిరీటాలు మోస్తూనే ఉంటాడు

ఎదుగుతూనే ఉన్న దేశంలో
ఓట్లవరకే పరితమౌతుంది ప్రజాస్వామ్యం

బలిపశువులౌతున్న బడుగుజీవులు
ఆశలను రేపటికి వాయిదా వేసుకుంటూ

ఎటుపోలేక నిస్సహాయతలో నలగుతూ
కొత్తదనం కోసం కాస్త సంతృప్తి కోసం వేచి చూస్తూనే ఉన్నారు...!!

ఇద్దరి మనసు చప్పుడు ఈ కవిత... ఎలా ఉందో చదివి చెప్పండి...
మంజువాణి

ద్విపదలు...!!

1. ఎందరిలో ఉన్నా ఏకాంతమే
    నువ్వులేని క్షణాలను గుర్తుచేస్తూ...!!

2.  ఏ పిలుపుకి మురిసిన పుడమెా
పులకింతల ఝురిలో తడిమిన మైమరపులో...!!

3.   పలుకే బంగారమయ్యింది
వలపులో మునిగిన మది ముంగిట...!!

4.  మాటలన్నీ  ముుత్యాలే
మమకారం చేరువైనందుకేమెా...!!

5.   మౌన బాస చెప్పింది
జీవిత పుటలన్నీ నీతోనేనని...!!

6.  నీ స్నేహపరిమళం తాకింది
విడలేని అనుబంధమై చేరి...!!

7.  అగచాట్లు వగస్తున్నాయి
గమ్యం చేరే యత్నానికి నీ ఆసరా దొరికిందని...!!

8.  కనువిందు చేసిన స్వప్నాలెన్నో
వాస్తవానికి ధీటుగా ఊతమిస్తూ...!!

9.  ఉనికి మెుదలైందే అక్షరాలతో
అమ్మఒడి చేరిన పసిపాపలా....!!

10.   గాయాన్ని మరిపించాలనే..
స్నేహంతో  సేదదీరుస్తున్నా...!!

11.  నీవు నేను ఒకటేగా
మది తెలిపెను మనసుమాట...!!

12.   నీ చెలిమికి దాసోహమంటున్నాయి
పదాలన్ని పద పదమంటూ...!!

13.  ఊపిరే తానయ్యింది జ్ఞాపకం
ఊతమై ఉండిపోతానని బాసచేస్తూ...!!

14.   చిలకపలుకులే అన్నీ
చిరాయువై వర్ధిల్లుతూ..!!

25, అక్టోబర్ 2017, బుధవారం

ఇదేనా ప్రజాస్వామ్యం అంటే..?

 నేస్తం,
    మనకు ఏది కావాలన్నా మన సమాజంలో ప్రతి దానికి ఓ అర్హత ఉంటుంది. దేశాన్ని శాసించే రాజకీయాల్లో ఎందుకు లేదు..? డబ్బు, రౌడీయిజం ముఖ్యమైన అర్హతలుగా మన దేశ సామాజిక రాజకీయాలు నడుస్తున్నాయి. ఒక చిన్న ఊరి నుండి మొదలై ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఉన్నాయి. కాస్త పేరున్న స్కూల్ లో జాయిన్ అవడానికి తల్లిదండ్రి అర్హత అడుగుతున్నారు ఇప్పుడు. ఒకప్పటి సంగతి పక్కన పెడితే ఇప్పటి రాజకీయాల్లో ఎంతమంది నాయకులు న్యాయబద్దంగా, చట్టబద్ధంగా గెలుస్తున్నారు..? డబ్బు, అధికారం కోసం ఒక పార్టీలో గెలిచి మరో పార్టీ లోనికి మారడం ఎంత వరకు సమంజసం..? వ్యక్తుల మీద అభిమానాన్ని చంపుకుని కొందరు పార్టీ కోసం ఓట్లు వేసి గెలిపిస్తే, గెలిచాక పార్టీ ఫిరాయిస్తున్న ఎందఱోనాయకులు. అప్పుడు ప్రజల తీర్పుకు తల ఒగ్గింది ఎక్కడ. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే..? నాయకులు వారి వారి స్వప్రయోజనాల కోసం ఎన్నో మార్పులు, చేర్పులు చట్టాల్లో చేస్తున్నారు, కానీ ప్రజల కోసం ఎన్నుకోబడే ప్రతినిధుల అర్హత కోసం ఎందుకు నియమాలు పెట్టడం లేదు. ఎదో ఓటేశాము, ఎవరో ఒకరు గెలిచారు మన పని అయిపోయింది అనుకుంటున్నంత కాలం మనము, మన సమాజమూ ఇలానే ఉండిపోతాం. మార్పు మనలోనే మొదలు కావాలి.... !!

24, అక్టోబర్ 2017, మంగళవారం

పుట్టినరోజు సందడి...!!






పసిడి వెన్నెల నవ్వుల పసి పాపాయి ఆన్యకి పుట్టినరోజు శుభకామనలు 

నాలుగో తరం యువరాణికి శుభాభినందనలు 

ప్రేమతో
మూడు తరాల ఆత్మీయులు 

23, అక్టోబర్ 2017, సోమవారం

జీవన "మంజూ";ష (3)...!!

నేస్తం,
        హక్కులు, బాధ్యతల నడుమ కొట్టుమిట్టాడుతున్న మధ్యతరగతి జీవితాలు మనవి. పాత కొత్త తరాల మధ్యన నలుగుతూన్న అనుబంధాలకు వారసులం. బాధ్యతలకు కట్టుబడి బంధాలను వదులుకోలేని బాంధవ్యాలకు బానిసలం. దూరమై పోతున్న చుట్టరికాలను చూస్తూ, తరిగిపోతున్న ఆత్మీయతలు కోసం అల్లాడుతు అక్కడక్కడా దొర్లుతున్న మమతలను పదిలంగా దాచుకోవాలని ప్రయత్నిస్తున్న అతి సామాన్యులం. ఒకప్పటి ఉమ్మడి కుటుంబాలకు ప్రతిరూపంగా అరకొరగా మిగిలిన అనుబంధాలు వెలవెల బోతున్నాయి. ఇవి అన్ని చూస్తూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నిలిచిన అస్సహాయులం.
        క్రొత్తగా మారిన విలువలతో, వింతైన జీవన విధానాలు మింగుడు పడక అటు పాత తరానికి, ఇటు కొత్త తరానికి మధ్యన మిగిలిన అసంపూర్ణ జీవితాలై పోయాయి. తోడబుట్టిన బంధాలను, తోడుగా వచ్చిన తోడును అపహాస్యం చేస్తూ కాపురాలను, కట్టుబాట్లను నడిరోడ్డున పడేస్తున్న అహంకారపు మదగజాలను భరిస్తున్న ఎందరో అమృతమూర్తులు కన్నీళ్ళను కాననీయక, బడబానలాన్ని దిగమింగుతూ చిరునవ్వుల చాటున వెతలను దాచేస్తూ, అహానికి తలను వంచుతూ బతుకు బండిని  వెళ్లదీస్తున్నారు. మానవతా విలువలతో కూడిన క్రొత్త శకానికి నాంది పలికే రోజు కోసం ఎదురుచూస్తూ... !!
ఇప్పటికి ఈ ముచ్చట్లకు సశేషం. 
       

21, అక్టోబర్ 2017, శనివారం

ద్విపదలు...!!

1.   ఎదురుచూపులు అలవాటేనట
మాటల మౌనానికి...!!

2.  మధుర స్వరాలు మనవే
నీ నా తేడాలెందుకు...!!

3.  మమతలన్ని నీతోనే
గాయాలన్నింటిని మాన్పేస్తూ..!!

4.  మూన్నాళ్ళ ముచ్చటే
ఏడడుగుల బంధం ఎగతాళి చేసాక....!!

5.   అద్దిన వర్ణాలన్నీ
దరహాసాల్లో మెండుగా కనువిందు చేస్తూ...!!

6.  అమాస తడబడుతోంది
నెల పొడుపు వెలుగుతో తేలిపోతానని...!!

7.    బుద్దులు పెడత్రోవనే
నట్టింట ఇల్లాలిని నవ్వులపాలు చేస్తూ...!!

8.  కాంతినద్దింది అక్షరం
మలినం కాని పరమాత్మ తేజంతో....!!

9.  మరణ శాసనం రాయాలి
ఋణపాశాలు వెంట పడకుండా....!!

10.   పరవశిస్తూ ప్రకృతి
ప్రణమిల్లుతూ ప్రణయం..!!  

11.   మరపురానివి జ్ఞాపకాలు
మనతో మమేకమైపోతూ...!!

12.  నిశ్శబ్దమెప్పుడూ నేస్తమే
నా ఏకాంతాన్ని నీతో జతచేస్తూ...!!

13.  జ్ఞాపకాలను వదలలేకున్నా
నువ్వు లేని రేపటికి రాలేకున్నా...!!

14.  ఊపిరే నీవుగా
ఉండి పోయావు ఎద నిండుగా...!!

15.  అనుభవాల వర్షమే జీవితం
హర్షాలన్నీ మనవి రాకున్నా...!!

16.   మనసంతా నేనైతే
మౌనానికి చోటెక్కడ....!!

17.   శబ్దం చుట్టమైంది
మన కలయికలో మాధుర్యాన్ని గ్రోలి.. !!

18.   అక్షయపాత్రే మన బాంధవ్యం
చెలిమి సంతసాలతో విలసిల్లుతూ...!!

19.  ఆశలు రేపింది ఎదకు
తోడై కడవరకు కలిసుంటానని..!!

20.  కన్నీటిని పన్నీరుగా మార్చేస్తూ
జీవిత నౌకను నడిపించడమే..!!

21.   విచలితమౌతుానే ఉన్నా
శూన్యాన్ని సైతం నువ్వే ఆక్రమిస్తుంటే...!!

20, అక్టోబర్ 2017, శుక్రవారం

అంతర్లోకాలు....!!

కనిపించని లోకాల్లో
వినిపించని కథనాలు

తెరచిన రెప్పల్లో
తెలియని భావాలు

మూసిన గుప్పిట్లో
దాగిన సూర్యోదయాలు

వెలితి పడుతున్న బంధాల్లో
వెతల సంకలనాలు

గతించిన గతాల్లో
గమనించలేని గురుతులు

అలసిన ఆత్మ నివేదనల్లో
మిన్నకుండి పోయిన అంతర్లోచనాలు....!!

19, అక్టోబర్ 2017, గురువారం

స్నిపెట్స్....!!

1.  మనసు ఉలిక్కి పడుతోంది
మౌనం అర్ధం కావడం లేదని...!!

2.  శబ్దాలంకారాలెన్నో
మౌనం దాల్చిన మనసుకు...!!

16, అక్టోబర్ 2017, సోమవారం

ద్విపదలు..!!

1.  చీకటి స్వప్నాలే అన్నీ
వెలుతురు వర్ణాలు అంటనీయకుండా...!!
2.  అనుభవాల ఆస్వాదనలో నేను
కలల సాగరంలో తరిస్తూ... !!
3.  చీకటి చుట్టమైంది
కలల హరివిల్లై నువ్వు కనిపిస్తావని...!!
4.  మౌనమే మారణాయుధం
మనసుని గాయపరచడానికి...!!
5.   మర్మాలన్ని మనకెరుకే
మౌనం మాటాడుతుంటే...!!
6.  కన్నీటికర్ధం తెలియని జన్మది
అమ్మ రుథిరాన్ని అమ్మేస్తూ...!!
7.  నిరీక్షణో వరం
నిన్ను చేరే క్షణాల కోసం..!!
8.   సమర్ధింపు అసమర్ధమైంది
అన్యులకు చోటిచ్చినందుకు...!!
9.   మనసు విప్పుతూనే ఉంటాయి
మాటలు మౌనాలై మిగిలినా..!!
10.  మృగ్యమైన ఆత్మలు
మానవరూపంలోనున్న మృగాలకు..!!
11.  ఆశ్చర్యమే ఎన్నటికీ
ఆశించని ఆత్మీయతలెదురైనప్పుడు..!!
12.  అతిశయం అక్షరాలదే
అన్నింటా తనదే పైచేయి అయినందుకు...!!
13.  శబ్దం చేరువౌతోంది
నిశబ్దానికి వీడ్కోలిస్తూ...!!

ఏక్ తారలు...!!

1.  వయసుడిగినా అందమే_ఆత్మీయత నిండిన జీవితాల్లో...!!

2.  ధనాత్మకమైనాయి_అరువు తెచ్చుకున్న అనుబంధాలు..!!

3.  హర్షపు చిరుజల్లులే అన్నీ_నీ స్నేహంలో సేదదీరాక...!!

4.  అపాత్రదానపు ప్రేమలు_అందుకోలేవు ఆత్మీయతాస్తాన్ని...!!

5.   అమ్మదనం అలానే ఉంది_అనాధలకు ఆలంబనౌతూ...!!

6.  లెక్కకు తేలని శేషమే_ప్రేమ రాహిత్యంలో మునిగి...!!

7.  రాహిత్యాన్నీ పెంచుతుంది_అందీ అందని ప్రేమ..!!

8.  అక్షరం అక్కునజేర్చుకుంది_అమ్మలా ఆసరానందిస్తూ...!!

9.   పరిచయం పాతదే_సరి కొత్త పరిమళాన్ని వెంట తెస్తూ...!!

10.  వలపెంత పంచాలో_బంధం బలపడటానికి....!!

11.  అనుభూతుల అశ్వాలే అన్నీ_అక్షరాల రథాన్ని అధిరోహిస్తూ...!!

12.   మనో గవాక్షం తెరచుకుంది_నీ వలపు అలికిడికి....!!

13.  మది తలుపులు తెరిచే ఉన్నాయి_నీ తలపు రాక కోసం...!!

14.  గమ్యం పరిచితమే_ఆటుపోట్ల రుచి చూసాక...!!

15.   అక్షరాల అలికిడిలో జీవిస్తున్నా_వాస్తవాలను విశదీకరిస్తూ....!!

16.   సాక్ష్యాలన్నీ సజీవాలే_అక్షర లక్షలకు ప్రణమిల్లుతూ....!!

17.  శృంఖలాలకు ఆటవిడుపే_అక్షర యుద్ధంలో గెలిచిన భావాలతో.... !!

18.  ఇలా వెళిపోయింది కాలం_నీ తలపులను తోడ్కొని..!!

19.  జరిగిపోయిన కాలంలో_జ్ఞాపకాల జలతార్లు...!!

20.  కనువిందు చేసిన స్వప్నాలెన్నో_
వాస్తవానికి ఊతమిస్తూ...!!

15, అక్టోబర్ 2017, ఆదివారం

ఇట్లు... నీ... పుస్తక సమీక్ష...!!

ముఖపుస్తక మిత్రురాలు గాయిత్రి కనుపర్తి గారి ఇట్లు...  నీ... పుస్తకం గురించి చెప్పాలంటే..
ముందుగా పుస్తకాన్ని చూడగానే ఆకర్షించే ముఖ చిత్రంతో కనిపించింది. కాస్త లోపలి పేజీలు తిరగేయగానే అందమైన చిత్రాలతో అర్ధవంతమైన కవితా భావజాలాలు ఆర్తిగా పలకరించాయి. ఇట్లు... నీ... అన్న పేరులోనే అంతర్గతంగా పరిచిన ఓ ఆత్మీయత, ప్రేమపూర్వక అక్షరాల అక్షింతలు మనకు కనిపిస్తాయి.
మొదటి కవనంలోనే ఆరు కాలాల అలరింపులని అందంగా అందిస్తూ వాసంతాల వనవాసం నుంచి పరితాపాల గ్రీష్మంతో పలకరించి చినుకుల సందడిని స్పర్శిస్తూ వర్షాన్ని, విరహాన్ని ఓదార్చే శరత్తును తాకి, చల్లని సమీరంగా హేమంతాన్ని, రాలుపూల శిశిరపు సవ్వడిలో ఆరు ఋతువుల ఆనందాలను కానుకగా చేసి అందించడంలోనే భావాలను అద్భుతంగా పండించారు పుస్తకానికి తగ్గ పేరును సార్ధకం చేస్తూ.  తలపుల నెమలీకలు ఎడబాటులో జ్ఞాపకాల పరిమళాలు యుగళ గీతాలుగా వినిపిస్తాయి. నీవెవరివో కదా అంటూనే.. ఎవరు నీవంటే అని జీవిత తోటమాలిని ఆద్రతగా అడుగుతారు. రాత పుట్టుకని రెప్పపాటు కాలానికి కనికట్టుగా వర్ణిస్తారు. రమ్మని పిలవకుండానే వచ్చిన అతిథిని రాకోయి అనుకోని అతిథీ అంటూ ఆహ్వానిస్తారు. మనసుకి హెచ్చరికలు చేస్తూనే మానసాన్ని మేల్కొలుపుతారు. ప్రణయ వీణ సరిగమల్లో సరాగాలను,నవరాగా మాలికలను అన్వేషిస్తారు. బ్రతుకు అంతర్ముఖాన్ని అద్దంలో చూపిస్తారు. ఊహాలోకంలో మనసులో గీసుకున్న ప్రకృతి చిత్రాన్ని మనోజ్ఞంగా చూపిస్తారు. కళల తీరంలో ఏకాంతపు రాణివాసాన్ని వాస్తవ కలల విహారంలో ప్రణయ కావ్యంలో వేచి చూసే అభిసారికను చూపిస్తారు. తొలకటిలో తొలి వలపుని, అక్షరసావాసంలో నిరీక్షణల ఆరాటాన్ని, వెన్నెల పుష్పంలో వలపులని అందించే ఏకాంతపు కాంతని, క్షణాలు సాక్షిగా కాలాన్ని నిలిచి పొమ్మంటూ నెమలి కన్నుల కలని నిజం చేయమని ప్రేమార్థిగా శోధిస్తూ కన్నీళ్లను కారణమడుగుతూ, వన్నెల వసంతంలో వెన్నెల కొంటెతనాన్ని ఊహల సవ్వడిలో ఏకాంతపు సంకెళ్లను వివరిస్తూ, ప్రేమ దివ్యత్వాన్ని పలవరిస్తూ, వడిలో వాలిన క్షణాలను వల్లె వేస్తూ, అర్ధంకాని పుస్తకమని ఎందరన్నా నాకే తెలియని నేను ని మనసులోని మనసుకు పరిచయిస్తూ, ఆత్మైక్యంలో మమేకమై, మనసు మజిలీకి శాశ్వత క్షణాలను లెక్కలేస్తూ, జ్ఞాపకాల పారిజాత పరిమళాలను ఆఘ్రాణిస్తూ, తలవని జ్ఞాపకాన్ని తలపుల్లో దాచుకుంటూ, మౌన సవ్వడిని హృదయ సవ్వడిగా కలసిన మనసుల సాక్షిగా అనుబంధంగా ప్రమాణం చేద్దామా అని అడుగుతారు. అంతరంగ రణరంగాన్ని,పాణిగ్రహణానికి పరమార్ధాన్ని, అక్షర నిరీక్షణలో అవ్యాజమైన ప్రేమార్తిని, వలపు వనమాలిలో ఒంటరి గీతాన్ని, ఎదురుచూపుల కథను, మైమరపుల ఆరాటాన్ని, అవ్యక్త మాధుర్యాన్ని, నిండైన నా మదంటూ గొంతు గడప దాటలేని భావాన్ని అలవోకగా అలా అలా ఎగసిపడే అలల వయ్యారంలో నిలిచిన గమ్యాన్ని, ఆశల ఆజ్యంలో చీకటి వెలుగుల సందె పొద్దుల్లో శ్రావణ మేఘాల ప్రణయ కావ్యాల మౌన భాష్యాలను లిఖించడంలో ప్రేమను మురిపించడమే కాకుండా చదువరులందరిని తన అక్షర సంద్రంలో, భావజాలాలతో మరిపించి మురిపించారు తనదైన శైలిలో. ఈ పుస్తకానికి సమీక్ష రాయడంలో ఎంత వరకు కృతకృత్యురాలని అయ్యానో తెలియదు కానీ చదువుతున్నంత సేపు ఓ చల్లని పైరగాలి పలకరించినట్లు అనిపించింది.
అందమైన భావుకతతో, అర్ధవంతమైన చిత్రాలతో ఇట్లు... నీ... కవితా సంపుటి అందరిని అలరిస్తుందని ఆశిస్తూ..
గాయిత్రి కనుపర్తి గారికి అభినందనలతో... 
మంజు యనమదల

14, అక్టోబర్ 2017, శనివారం

ద్విపదలు...!!

1.  ధ్యాసంతా నీపైనే
ధ్యానానికి తావీయక...!!
2.  మనసు చెమ్మ
మదిని తాకింది....!!
3.  నాకెప్పుడూ నీ ధ్యాసే
మరలనీయని మనసు కళ్ళెంతో...!!
4.  భావనలన్నీ నీతోనే జత
మన బాంధవ్యానికి పోటిగా ...!!
5.   ఇలలో నిలిచి పోతుందిలే
మరుజన్మకు మళ్ళీ జతకడుతూ...!!
6.  కలతలెన్ని ఎదురైనా
కలవర పడదులే మన చెలిమి....!!
7.  కన్నీరింకి పోయింది
వేకువ వెన్నెల వెంట రాలేదని...!!
8.  రాటుదేలింది మనసు
మనిషి కర్కశత్వాన్ని కళ్లారా చూసాక....!!
9. రెప్పపాటు జీవితానికి
రెప్పపడనీయని అనుభవాలెన్నో...!!
10.  ఊరడింపుల తాయిలాలే
మరపులో ముంచేస్తూ...!!
11.   నిలిచిపోయిన స్వప్నం వెనుక
నిదుర లేని రాతిరులెన్నో..!!
12.  వేకువలన్నీ విశేషాలే
నిదురపోయిన రాతిరి కలల కబుర్లతో..!!
13.  వేకువ పిలిచింది
రాతిరి కలలు నిజం చేయమని..!!
14.   వర్ణాలన్నీ నీతోనే తిష్టేశాయి
చీకటికి సైతం వెలుగులద్దుతూ...!!

13, అక్టోబర్ 2017, శుక్రవారం

ఏక్ తారలు..!!

1.  అత్యల్పం జీవితం_చావు పుట్టుకల చేతిలో...!!

2.  అక్షరానికి ఆయువెక్కువ_అనంత భావాలకు ఆలవాలమౌతూ...!!

3.  అనునిత్యం నీతోనే_అనురాగం నేనై...!!

4.  అక్షరాల విరులే అంతటా_ఆత్మీయంగా అల్లుకుంటూ...!!

12, అక్టోబర్ 2017, గురువారం

ద్విపదలు..!!

1.  వాస్తవమై వద్దామనుకున్నా
కలగా కలిసి పోతానని తెలియక...!!

2. అనుసరణే నాది
అనుకరణలో నీతో...!!

3.  మెలకువలోనూ కలవే
మదిని వీడిపోవు....!!

4.  ప్రణయమిప్పుడు ప్రణవమైంది
ఆత్మానందం నాదైనాక....!!

5.  ఇరువురు ఒకటే కదా
ఒకరికి ఒకరు ఎరుకే...!!

6.  ఇలలోనూ నీదాననే
ఇంతిలా నిన్నలరిస్తూ...!!

11, అక్టోబర్ 2017, బుధవారం

ద్విపదలు..!!

1.  ఆస్వాదిస్తున్నా నీ చెలిమిని
మదిని నింపిన మౌనంలో...!!

2.  మనసు చెప్పింది
నీ మౌనాన్ని మాటల్లో తెలపమని...!!

3.  అలరించా అక్షరాన్ని
మౌనాన్ని ఛేదించాలని...!!

4.  చమత్కారానికి తెలిసింది
మౌనానికి మాటలెరుకని...!!

5.  మాటల గలగలలు
మౌనాక్షరాల చెలిమి సంగతుల సవ్వడులు...!!

6.   మౌనం అలిగింది
మనసు నీ మాయలో పడిపోయిందని...!!

7.  వీడను ఎన్నటికి
వాడని మన చెలిమి సాక్షిగా...!!

8.  వెలుతురు వాకిలికి వర్ణాలద్దుతున్నా
వెన్నెల పూలను పూయించాలని..!!

9.   మేలిముసుగు తొలగించా
పన్నీట స్నానమాడిన మనసని  తెలిసి....!!

10.  కలల రాదారి రమ్మంటోంది
కలవరాలను వదలి కరిగిపొమ్మంటూ...!!

11.  నీ మానసాన్ని తాకినందుకేమెా
ఈ చెలిమి పరిమళాలు...!!

బెర్ముడా ట్రయాంగిల్..!!

ఓ అంతు తెలియని
అగాధంలో పడిపోతున్నాయి
ఎన్నో ప్రాణాలు ఉసూరుమంటూ
ఆకర్షణో క్షణికావేశమెా
తెలియని స్థితిలో నలుగుతూ
బెర్ముడా ట్రయాంగిల్ లక్షణాల
నరునికి చిక్కిన జీవితాల
హాహాకారాలు రొద పెడుతుంటే
ఆ రోదనల స్వరాల ఆక్రందనలు
విననివ్వని సాగర ఘోషలో
కలిసిపోయిన శకలాలు
మెాసపోయిన నమ్మకానికి
అమ్ముడుబోయిన సాక్ష్యాలు
కోకొల్లలుగా కనుల ముందు నిలిస్తే
నాకెందుకని న్యాయం నిదురబోతోంది
గెలిచానని మృగం గర్వంగా
మరోసారి జూలు విదిలిస్తూ
మళ్ళీ వేటకు బయలుదేరింది...!!

10, అక్టోబర్ 2017, మంగళవారం

మార్పు..!!

నేస్తం,
        మనమున్నది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అని అనుకుంటే అది తప్పే అవుతోంది. పాలక పక్షమా,  ప్రతి పక్షమా అని తేడా లేకుండా ఎవరికి వారు న్యాయాన్ని ఉద్దరిస్తున్నారు. చిన్న చేప నుంచి పెద్ద చేప వరకు అందరు సమానమే.  మనం ఎన్నికల్లో నిలబడిన వ్యక్తి వ్యక్తిత్వాన్ని చూడకుండా పార్టీని బట్టి ఓట్లు వేస్తున్నాం చాలా వరకు, కాని వారు గెలిచాక అది తమ గొప్పతనమని భావిస్తూ అహాన్ని ప్రదర్శిస్తున్నారు.  దీని వలన పార్టీకి లాభనష్టాలు ఎంత అనేది మళ్ళీ ఎన్నికల్లో తేలిపోతుంది. 
ఉదాహరణకు  మా ఊరినే తీసుకుంటే పంచాయితీ స్ధలాన్ని ఆక్రమించిన ఎమ్ పి టి సి మేడం గారిని అడిగినందుకు పంచాయితీ ప్రెసిడెంట్ ముందే సదరు మేడం గారి భర్త గారు నానా రకాలైన తిట్లు తిట్టి రాళ్ళు విసిరి రెండుసార్లు కొట్టి మూడోసారి కూడ రాయి తీస్తే దగ్గరకు వెళ్ళి ఓ దెబ్బ వేసిన పాపానికి వేంటనే ప్రభుత్వ  ఆసుపత్రిలో రెండు రోజులు విశ్రాంతి తీసుకుని కాసిని కాసులు సమర్పించి దొంగ పత్రాలు తీసుకుని కేసు పెట్టారు. దీనిలో కొస మెరుపు ఏమిటంటే సాక్షులుగా పంచాయితీ ప్రెసిడెంట్ గారే. ఇదండీ మన ప్రజాస్వామ్యం.
మరో మాట ప్రెసిడెంట్ గారిని నాలాంటి వారొకరు మా వీధి రోడ్డు బాగా పోయింది కాస్త దాని సంగతి చూడండి అని అడిగితే వారి సమాధానం " నువ్వు ఎలక్షన్ లో పోటి చేయ్" అని. పార్టీ పేరు చెప్పి ఇలాంటి వారికి పదవులు అపాత్రదానం చేస్తే పార్టీకి పుట్టగతులుండవు. వారం రోజుల నుండి కోతులు ఊరిని అతలాకుతలం చేస్తుంటే ఈ నాయకుల కళ్ళకు కనపడలేదేమెా. పేరుకి మాత్రం అన్ని తమ ప్రతాపమే అని చెప్పుకుంటారు.   మా ఊరనే కాదు అన్ని పల్లెల పరిస్థితి ఇదే.
మరి మార్పు ఎక్కడ మెుదలవ్వాంటారు...?

శుభాకాంక్షలు...!!

నేస్తాలు,
             పొద్దుపొద్దున్నే ఓ సంతోషకరమైన విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించింది. భువన విజయం వ్యవస్థాపకులు సోదరులు వంకాయలపాటి చంద్రశేఖర్ గారికి లభించిన ప్రతిష్టాత్మకమైన గౌరవ పురస్కారం శ్రీ గజల్ శ్రీనివాస్ గారు అందిస్తున్న విశిష్ట సేవా పురస్కారం. 
చంద్ర శేఖర్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు....!!
👍✨✨✨
🎉😊👏😁👏😃🎉
Congratulations!

9, అక్టోబర్ 2017, సోమవారం

ప్రతిభకు కొలమానాలు...!!

నేస్తం,
         సత్కారాలు, సన్మానాలు ప్రతిభకు గుర్తింపు అనుకునే రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. బిరుదులు, అవార్డులు, రివార్డులు కొనుక్కునే రోజులు ఇప్పుడు.  ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఇచ్చే ప్రతిభా పురస్కారాలు విద్వత్తు చూసి ఎంతమందికి ఇస్తున్నారు..?
ఒక్కొక్కరికి ఒక్కో బలహీనత అనుకున్నా, ఇష్టం అనుకున్నా తప్పేం లేదు.  కొందరికి కాదు కాదు చాలామందికి పేరు ప్రఖ్యాతులు కావాలి.  మరి కొందరికి అధికారం, హోదా కావాలి.  వీటితో పాటుగా ఇంకొందరికి డబ్బు కూడ కావాలి.
మనసుకి నచ్చినట్టు రాస్తే శిల్పం లేదు,  భావుకత్వం లేదు, అసలు కవితా లక్షణాలే లేవు కాని పుస్తకాలు వేసేస్తున్నారంటారు.  లక్షణాలు, లాక్షణికాలు, సౌందర్యాలు ఇలా అన్ని చూసుకుని రాస్తే అవార్డులు, బిరుదులు ఇస్తారా అంటే అదీ లేదాయే. వాటికి రికమండేషన్లు, డబ్బులు కావాలాయే.  లేదా పెద్దలతో సోషల్ గా నడుచుకోవాలి. అదీ కాదంటే కొన్ని  సంస్థలలో మనమూ సభ్యులుగా ఉండాలి.  ఇవి కొన్ని మచ్చుకి మాత్రమే.  మనకు తెలియని వ్యక్తి రాసిన రాత బావుంటే భేషజాలు లేకుండా మనలో ఎంతమందిమి మెచ్చుకోగలుగుతున్నామెా గుండెలమీద చేయి వేసుకుని చెప్పండి. మనకి తెలియని వారికి సమీక్ష రాసినా కనీసం వారు కూడ మెచ్చుకోరు. ఇది నా స్వీయానుభవం.
ఇక ఆఖరుగా నే చెప్పొచ్చేదేటంటే ఎవరి వ్యాపారం వారిది. ప్రతిభకు గుర్తింపు,  గౌరవం అన్న పెద్ద మాటలు పక్కనెట్టేసి యథా రాజ తథా ప్రజా అనేయడమే...!!

6, అక్టోబర్ 2017, శుక్రవారం

రాయలేని...!!

ఎదుట నిలిచింది చూడు
కలలాంటి జ్ఞాపకమేదో
కలత పడుతుంది నేడు
కలవరమైన మదితో

కరిగి పోతున్న క్షణాలన్నీ
మెాయలేని భారాలౌతుంటే
తిరిగిరాని కాలమేమెా
నిన్నే తలపిస్తోంది

రాయలేని లేఖలన్నీ
భావాలకు బందీలైపోతుంటే
అక్షరాలు అక్కునజేర్చుకుని
చెలిమందిస్తున్నాయి సిరాచుక్కలతో

మౌనాలన్నీ ముసురుతుంటే
గాయాలన్నీ గాథలైపోతూ
గతంలో మిగిలిపోయిన
గుర్తులకు సజీవ సాక్ష్యాలే...!!

3, అక్టోబర్ 2017, మంగళవారం

ఆడపిల్లనమ్మా...!!

సృష్టికి మూలమైనా
అమ్మ కొంగు చాటు ఆడపిల్లనే
నాన్నకు యువరాణినే
అన్నదమ్ములకు తోబుట్టువునే
ఆత్మీయతానుబంధాలకు చిరునామానే
మమతానురారాలకు నెలవుని
ఆదిపత్యపు అహంకారానికి అడ్డుగోడగా
ప్రపంచ పురోగమనానికి గీటురాయిగా
అన్నింటా నేనంటూ
అన్నీ తానైన ముగ్ద మనోజ్ఞి
మన ఇంటి మారాణి
ప్రగతి పూబోణి
ఈ పుత్తడిబొమ్మ...!!

జీవన 'మంజూ'ష (4)...!!

     బంధం అనేది  అవసరానికి అనేక రకాలుగా రూపాంతరం చెందుతోంది ఈ కలియుగంలో.  మన జీవితంలోని అన్ని అనుబంధాలు అవసరార్ధ బంధాలుగా మిగిలిపోతున్నాయి. ఆడ మగ స్నేహానికి నానార్ధాలు చెప్పడంలో ఇప్పటి ప్రచార మాధ్యమాలు కానీ, సోషల్ నెట్ వర్క్స్ కానీ ముందుంటున్నాయి. మన ప్రవర్తనే ఇందుకు మూల కారణంగా చెప్పవచ్చు. సమాజం అంటే మనమే. మరి సమాజంలో మార్పు కోరుకోవడమంటే మనలో మార్పుని ఒప్పుకోవడం. ఎక్కడ చూసినా విపరీతార్ధాల వింత పోకడలు, కుటుంబ అనుబంధాలు కకావికలమై పోతున్న ఈ కాలంలో మన అన్న అనుబంధాన్ని నిలబెట్టుకోవడం అనేది కత్తి మీద సాము లాంటిదే. ఏ చిన్న లోపాన్ని సహించని సహజీవనాలు మనం అరువు తెచ్చుకోవడమెందుకు, మనకు అక్కరకు రాని బంధాలు ఛిద్రమై పోతున్నాయని బాధ పడటమెందుకు. అమ్మానాన్న, అక్కాచెల్లి, అన్నాతమ్ముడు, ప్రేయసీప్రియులు, పిల్లలు, స్నేహాలు ఇలా మానవ సమాజంలో మనకంటూ మిగిలిన ఈ బంధాలను కూడా అక్రమ బంధాలుగా మార్చేస్తున్న నేటి సమాజంలోని కొందరు ప్రముఖులు కావచ్చు, ఊరు పేరు లేని అనామకులు కావచ్చు ఎదుటివారి అవసరాన్ని, అమాయకత్వాన్ని  తమకు అనుకూలంగా మార్చుకుని పబ్బం గడుపుకుంటూ పైకి మాత్రం అతి మంచివాళ్ళుగా నటిస్తూ నాలుగు రోజులకో కొత్త బంధానికై వెంపర్లాడుతుంటే, వీరిని ఏ నిర్భయ చట్టం మాత్రం ఏం చేస్తుంది. అసహాయతను అవకాశంగా మార్చుకునే ఈ నికృష్ట జాతిని సమాజం వెలివేసి రోజు ఎప్పుడు వస్తుందో...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner