23, జులై 2011, శనివారం

ఊహా నిజమైతే.....!!

ఆనందం ఆహ్లాదం
కోపం ఆవేశం
చిరాకు విసురు
ప్రేమ అభిమానం
బాధ దుఃఖం
ఇలా అన్ని ఒకచోట ఒక్కేసారి కలగలిస్తే ఎలా వుంటుందో!!
మీ ఉహలకు అందిన ఊహాసృష్టిని అందంగా అక్షరాల అమరికలో పరిస్తే ఎలా వుంటుందో!!
శ్రమ అనుకోకుండా మీ ఊహాక్షరాలను ఇక్కడ రాయండి......
నేను ఆస్వాదించిన అనుభూతిని తరువాత పంచుకుంటాను మరొక టపాలో....

13, జులై 2011, బుధవారం

దేవుడు-డబ్బు-మానవుడు....??

అనంత పద్మనాభుడి ఆస్థులు అనంతానంతమేమో..!! అందరిలో డబ్బులు ఎక్కువగా ఉన్న దేవుడని జనాలు.... ఇన్నాళ్ళు కొలిచిన తిరుపతి వెంకన్నను మర్చిపోతారేమో!! ఎంతయినా డబ్బులకున్న మహిమ అదే కదా మరి. ఇన్ని రోజులు గుర్తుకు రాని పద్మనాభుని ఆస్థులతో పాటుగా జగన్నాధుని సొమ్ములకు లెక్కలు చెప్పమనే ధైర్యం మన నాయకులకు వచ్చిందోచ్..!! ఆఖరుకి ఏమి తేల్చుతారో కానీ మంచి రసదాయకంలో పడింది బడా నాయకుల పని ఇప్పుడు. దేవుని సొమ్ములు దేవుని సొంతం కాని మరి అక్రమంగా సంపాదించిన సొమ్ము ఎవరికీ చెందుతున్దనేది ప్రశ్నార్ధకమే?? జగన్ ఒక్కడేనా అక్రమంగా సంపాదించింది? అందరి ఆస్థులకు లెక్కలు తేల్చాలి కదా...ఇప్పుడు వారికి ఎదురు తిరిగాడని లెక్కలు చూడాలా!! అమ్మగారికి సలాములు కొట్టే నాయకుల లెక్కల పద్దులు అక్కరలేదా!! చట్టం అందరికి సమానమైతే అందరి లెక్కలు తేల్చండి.....జనాల సొమ్ము తినేస్తున్నారు అంటున్నారు కాని జనాలని కుడా తినేస్తున్నారు ఈ నాటి మన ప్రజాస్వామ్య నాయకులు.....ఇదేనండి మన ప్రజాస్వామ్యం!!

12, జులై 2011, మంగళవారం

నిదురించే మదిలో....

మాట మౌనమై మనసు మూగదై....
రెప్ప చాటున దాగిన స్వప్నం..!!
కనురెప్ప తెరిస్తే చెదిరిపోతుందేమో...!!
కలవర పాటున కనుమరుగౌతుందేమో..!!
ఉహల ఉసులలో నిదురించే క్షణంలో
కనిపించే కల కనుమాయమైతే..!!
తట్టుకోలేని మది ఆరాటంతో
కన్ను తెరిస్తే ఓ క్షణం...!!
రెప్ప మాటున ఒదిగిన స్వప్నం
నిశ్శబ్దంగా మరలిపోయింది....!!

5, జులై 2011, మంగళవారం

రాజీనామాలా...!!!!

జనానికి పంగనామాలా...!! లేక రాజీనామాలా..!! ఎన్ని సార్లు రాజీనామాలు చేస్తారు? ఎన్ని సార్లు ఎన్నికలలో పోటి చేస్తారు? రాజకీయపు రాక్షస ఆటలో బలిపశువులు ఎందఱో.....?? సామాన్యుని జీవితంలో రోజు రోజుకి పెరుగుతున్న పన్నుల భారం...నిత్య జీవిత కృత్యమై పోయింది. ఏ పన్ను భారం ఎప్పుడూ పడుతుందో తెలియదు....ఏ బంద్ ఎప్పుడూ మొదలవుతుందో ఎరుక లేదు....పండిన పంటకు సగటు ధర లేదు, నిత్యావసరాలు నీలాకాశంలో చుక్కల్లా అందకుండా ఊరిస్తున్నాయి....నాయకుల వాగ్ధానాలు ఎడారి ఒయాసిస్సులను తలపిస్తుంటే మింగమంటే కప్పకి కోపం వదలమంటే పాముకి కోపం... చందాన ఎప్పుడూ ఏమౌతుందో తెలియని అయోమయం లో పడవేసిన అమ్మగారు మరి ఏ పరిష్కారం చూపుతారో వేచి చూద్దాం..!!

ఈ జన్మకు సార్ధకత..!!

అష్టపదిలా అలరించలేను ఇష్టసఖిలా ఇమడలేను
రాధలా లాలించలేను సత్యభామలా ఆలుగనూ లేను
యశోదమ్మలా ప్రేమను పంచలేను
భక్తిలో రుక్మిణిని కాలేను
అనురక్తిలో గోపికలను మించలేను
అల్లరి ఆటల్లో....తుంటరి చేష్టల్లో....
ప్రేమను పంచడంలో....చెలిమిని పెంచడంలో....
మాయల్లో ముంచడంలో....జీవితార్ధాన్ని చెప్పడంలో....
నిను మించిన ఘనుడెవ్వరు ఆర్తరక్షకా.....
అందుకే అందరూ నీ దాసానుదాసులు....
నీ అనంత భక్త జన కోటిలో ఓ నీటి బిందువును....
ఈ అక్షర కుసుమాంజలితో......అంజలి ఘటించడం....
అనంత విశ్వంలో ఓ రేణువులా నిను చేరితే.....ఈ జన్మకు సార్ధకత..!!

1, జులై 2011, శుక్రవారం

ఏం చేయను..???

నిశిరాతిరి నిద్ర ముంచుకొస్తుంటే....
కరిగిపోయిన కాలంలో నుంచి
చెరిగిపోని ఓ జ్ఞాపకం కవితలా అల్లుకుంటుంటే...
నిద్రదేవత వడిలో సేద తీరాలా!! ...లేక....
కలలోకొచ్చిన జ్ఞాపకంలో కరిగిపోవాలా!!
మదిలో పొంగే కవితావేశాన్ని ముత్యాలాక్షరాల్లో
నింపడానికి కాలమనే కాన్వాసుపై పొందుపరుద్దామంటే.... !!
నిద్రాదేవత కరుణించి నిశిధి ఒడిలో సేదదిర్చుకోమని అక్కున జేర్చుకుంది........
( ఇది నా ఫ్రెండ్ రాసిన కవిత......)
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner