ముచ్చట్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ముచ్చట్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఆగస్టు 2026, మంగళవారం

జీవన మంజూష 08/26




 నేస్తం,

            వాస్తవాలను అంగీకరించాలంటే ఎంతో కొంత ధైర్యాన్ని కూడగట్టుకోవాలి. మనకు నచ్చలేదని చేదునిజాలన్నీ తీపి తాయిలాలు కావు కదా. కాలం మనకు నేర్పే పాఠాల్లో కొన్ని బతుకులు నేర్చుకోవడంలోనే ముగిసిపోతాయి. చాలా తక్కువమంది మాత్రమే అడ్డంకులను అధిగమించి గమ్యాన్ని చేరుకుని విజయకేతనాన్ని ఎగురవేస్తారు. చరిత్ర విజయాలను మాత్రమే గుర్తుంచుకుంటుంది. నువ్వు వందలసార్లు ఓడిపోయినా ఒక్క విజయం నిన్ను నలుగురికి పరిచయం చేస్తుంది. ఓటమి మన జీవితానికి ముగింపు కాదు. మనం అందుకోబోయే విజయానికి తొలిమెట్టు

                 మన జీవితమే సమస్యల చెట్టు. పచ్చని కొమ్మలతో కళకళలాడుతూ, క్షణంలోనే ఏం జరుగుతుందో తెలిసే లోపల ఎండిపోయి, మోడువారిన మహావృక్షాలెన్నో మనకు తారసపడుతూనే వుంటాయి. చెట్టు మోడుబారినా కట్టెలు కూడా దేనికోదానికి పనికొస్తాయి. మానవ శరీరం కూడా మనకు తెలియకుండానే దేనికోదానికి పనికొస్తుంది. అవయువదానం మరికొందరికి జీవితాలను ఇస్తుంది. దేహదానం మనకు తెలియని ఎన్నో రోగాలకు వైద్యుల ప్రయోగాలకు పనికివస్తుంది. ఎందరో మానవతావాదులు ఈనాడు శరీరదానానికి సుముఖంగా వున్నారు, చేస్తున్నారు, చేసారు కూడా

                  మనకు కష్టం వచ్చిందని క్రుంగిపోతే జీవితం అక్కడితో ఐపోతుంది. కష్టం గురించి ఇతరులకు అవగాహన కల్పిస్తే జీవితానికి అంతకన్నా సార్థకత ఏముంటుంది? తప్పులు చేయడం మానవ సహజం. తప్పుల నుండి మనం నేర్చుకునే మంచి మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. అది తెలుసుకోవడంలోనే విజ్ఞత, వివేకం బయటబడతాయి. అంతేకానీ కష్టానికి ఇతరులను బాధ్యులుగా చేసి నిందించడం వలన ప్రయోజనం ఏమి వుండదు. బాధను గెలవడం నిజమైన గెలుపు అని ఎందరికి తెలుసు?

                   ఒంటరితనం మనకు అమ్మ కడుపులో ప్రాణం పోసుకున్నప్పటి నుండే అలవాటు కదా. మన ప్రయాణం ఎప్పుడూ ఒంటరిదే. మనతో మనకు బంధమే అసలైన సంబంధం. మనతో మనం నిజాయితీగా వున్నామా లేదా అన్నది ప్రశ్న కాకుండా, సమాధానం చెప్పుకోగలిగే స్థాయిలో మనమున్నప్పుడు మనం మరొకరికి సలహాలు, సూచనలు ఇవ్వడం సమంజసం. చిన్న మాట జీవితాలను నిలబెడుతుంది. అదే చిన్న మాట జీవితాలను కాలరాస్తుంది. ఎదుటివారి స్థాయిని బట్టి కాకుండా మనిషితనానికి విలువనిచ్చిన రోజు మనమూ నిజమైన మనుష్యులుగా నిలబడగలుగుతాం. ఏదేమైనా కాలం అన్నింటికి, అందరికి సమాధానం నేర్పుగా, ఓర్పుగా చెబుతుంది. వేచి చూడటమే మనం చేయాల్సిన పని..!!


               

18, జులై 2026, శనివారం

జీవన మంజూష 07/26

 నేస్తం,

          బంధమయినా దృఢంగా వుండాలంటే, రోజుల్లో ముఖ్యంగా కావాల్సింది నమ్మకం కాదు. మనిషి తన జీవితంలో కోల్పోయింది, కోల్పోతున్నది నమ్మకాన్నే. అమ్మతనాన్ని కూడా అమ్మకానికి పెడుతున్న రోజులు కదా! అందుకే తనాన్నయినా అమ్మడానికి సిద్ధంగా వున్నారు ఈనాటి మనుష్యులు. అలాగే అమ్మేవారుంటే కొనేవారికేం కొదవ అన్నట్టుంది మన సమాజం కూడా. సమాజమేముంది ప్రపంచమే అలా మారిపోయింది. మనిషి ఆలోచనలు వింత పోకడలు పోతుంటే దానికి తగినట్లుగానే మనిషి మేధావితనమూ సహకరిస్తోంది. కాని మనిషిగా మనమేం కోల్పోతున్నామో మనకే తెలియనంతగా ఆధునికీకరణ మాయలో పడిపోయాం

           మనం సంతోషాన్ని పంచుకోవడానికి మన తాహత్తుకు తగ్గ వారిని అతిథులుగా ఆహ్వానించడం మన సంస్కారంగా చూపించుకుంటున్నాము. అయినవారు, ఆత్మీయులు మనకు, మన హోదాకు తగ్గవారే అవుతున్నారు సమయంలో. అదే మనకు ఆపదో, కష్టమో వచ్చినప్పుడు తాహత్తు గుర్తురాదు. ఎందుకంటే సంస్కారులు ముఖం చాటేస్తారు కనుక. సమయంలో మనకు మనలో మరుగున పడిపోయిన ఎక్కడెక్కడి చుట్టరికాలు, రక్త సంబంధాలు భలే గుర్తొస్తాయంటే నమ్మండి. దూరాన్ని మనమే పెంచి పోషించి ఇలాంటి అవసర సమయాల్లో దగ్గరతనం దగ్గరగా రావాలని కోరుకోవడం సమంజసం కాదు కదా. మనం ఇచ్చిందే మనకి తిరిగి వస్తుంది. విషయం అందరం గుర్తు పెట్టుకోవాలి.

            మనలో చాలామందిలో ఈర్ష్య, అసూయలు ఎంత బలంగా నాటుపోయాయో చూస్తుంటే నిజంగా మనం మానవ సంబంధాల గురించి గొప్పగా చెప్పుకునే సమాజంలోనే బ్రతుకుతున్నామా అని ఒకింత అయోమయంలో వున్నట్టుగా అనిపిస్తోంది. మన గొప్పలు చెప్పుకోవడానికి ఇతరులను హీనం చేసి చూపనక్కర్లేదు కదా! అది మనకు మంచి చేస్తుంది అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి వుండదు. ఏదోక గొప్పదనం అందరిలో వుంటుంది. గుర్తించే గొప్ప మనసు మాత్రం కొందరికే వుంటుంది. కొందరిలో మనమున్నామా లేదా అన్నది మన మనసుకు తెలియాలి.

              కీర్తిశేషులయ్యాక కీర్తించడం మనకు పరిపాటి అయిపోయింది. మాట అందరికీ వర్తించదు. కొందరికి మాత్రమే. “పోయినోళ్ళందరు మంచోళ్ళూ కాదు, అలా అని బతికున్నోళ్ళందరూ పాపులు కాదు”. మనిషి చనిపోయాక కాని మనకు మనిషి గొప్పదనం తెలియకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఒక వ్యక్తి చేసిన విలువైన పనులకు వ్యక్తి సేవలను గుర్తించి వారు జీవించి వున్నప్పుడే వారికి తగిన గుర్తింపు ఇస్తే, అది మనం వారికి ఇచ్చే గౌరవం అవుతుంది. ముందు మనల్ని మనం సంస్కరించుకుంటే తర్వాత ఇతరుల సంస్కారం గురించి మాటలు, రాతలు వంటివి చేయవచ్చు

             

               నూరు పుస్తకాలనవ మల్లెతీగతో నా అనుబంధం కూడా దాదాపుగానూరు పుస్తకాల నవ మల్లెతీగ పదిహేను పుస్తకాల నా అక్షర ప్రయాణంవెరసి లెక్కకు మూడు శీర్షికలకు తక్కువగా. నూరుజీవన మంజూషలతో నా పయనం నవ మల్లెతీగతో కొనసాగుతోంది. నెల నెలా నవ మల్లెతీగ నిత్య నూతనంగా రూపుదిద్దుకోవడానికి నిరంతరం శ్రమిస్తూ, అవసరమైతే పుస్తకం కోసందొంగనికూడా అవుతానన్నకలిమిశ్రీగారి సాహితీ తపస్సుకు విఘ్నాలు కలగకుండానవ మల్లెతీగసాహితీ మిత్రుల చేతుల్లో కలకాలం కళకళలాడాలని కోరుకుంటూ..నూరవ పత్రికకు హృదయపూర్వక శుభాకాంక్షలు.



              

            


             

             


3, జూన్ 2026, బుధవారం

జీవన మంజూష 06/26

 నేస్తం,

            చేసిన/ చేస్తున్న సాయానికి తిరిగి ఫలితం ఆశించకూడదు అన్నది నిజమే కాని కనీసం అందుకున్న సాయానికి ప్రతిఫలంగా మనమూ కొంతయినా ఇతరులకు చేయూతనివ్వడం మనిషిగా పుట్టినందుకు మన బాధ్యత. అయినా నా పిచ్చి కాకపోతే రోజుల్లో బంధాలను గుర్తుంచుకోవడమే మరిచిన మనిషికి సాయాలు, చట్టుబండలు లాంటి పదాలకు అర్థాలు తెలుసుకోవాలని అనుకోవడం మన అమాయకత్వం. ఈరోజుల్లో రక్త సంబంధాలను కూడా పూర్తిగా మరిచిపోతున్న నవ నాగరీకత మనది. అలాంటప్పుడు ఎవరో చేసే చిన్న చిన్న సహాయాలు ఎలా గుర్తుంటాయి?

              ఏదోక సమయంలో మనమూ ఎవరొ వొకరి సాయం పొందే వుంటాం కదా. సాయం పొందని మనిషి ప్రపంచంలో ఎవరూ వుండరనే నా అభిప్రాయం. మాట సాయమో, మనిషి సాయమో లేదా మరోరకంగానైనా సాయమో, చేయూతో అందుకోని జీవాలు, జీవితాలు వుండవు. కాకపోతే అది మరిచిపోయి ఏదో అదృష్టం కలిసివచ్చి అందలాలు ఎక్కగానే మూలాలు మరిచిపోయే వారే మన చుట్టూ కనబడుతూ వుంటారు. మనమూ వారికి వారి మూలాలను గుర్తు చేయడమెందుకని మన పని మనం చేసుకుంటూ పోతుంటాం. అనాలోచితంగా వచ్చినఅతికివారు ప్రదర్శించే విన్యాసాలను వినోదంగా చూడటం మనకలవాటై పోయింది. అలవాటే వారి అహంకారానికి సోపానంగా మారింది. కాల మహిమ మరి.

            ఎదుటి మనిషి మీద మన అసూయను, ద్వేషాన్ని మనిషి మన ఎదురుగా వున్నప్పుడు చూపించాలి. అంతేకానీ మనిషి లేనప్పుడు మనిషి మీద. వారి వస్తువుల మీద మన ద్వేషాన్ని చూపించడం మన నైజాన్ని మనమే అందరి ముందు బయటేసుకోవడం అవుతుంది. మన బలుపుని బలం అనుకుంటే ఏదోకరకంగా మనం వెళ్లగక్కే ద్వేషం మనకే వడ్డీతో సహా తిరిగి వస్తుంది. కాలమెుప్పుడూ ఒకరి వెంటే తిరగదు కదా. ప్రతి ఒక్కరికి సమయమంటూ వస్తుంది. అహం కూడు పెట్టదు. అభిమానం నలుగురిని దగ్గర చేస్తుంది. ఏది కావాలన్నది మన వివేకాన్ని బట్టి వుంటుంది

               మనం అందలం మీద వున్నామని ఎగిరెగిరి పడుతుంటే, మనం చేసే న్యాయాన్యాలు మనల్ని అధఃపాతాళానికి నెట్టేయడానికి ఎక్కువ సమయం పట్టదు. కోట్లకధిపతులు బికారులై రోడ్లను పడిన సంఘటనలు మనం చరిత్రలో ఎన్ని చూడలేదు. దానినే కర్మ ఫలితం అంటారని మన పూర్వులు చెప్పారు కదా. ఇంతకు ముందైతే మరుజన్మలో మన కర్మ ఫలితం అనుభవానికి వస్తుంది అనేవారు. కలికాలంలో ఇప్పటిది ఇప్పుడే అనుభవానికి వచ్చేస్తోంది. పాపం కర్మకు కూడా సహనం నశించి చాలా త్వరపడుతుంది దాని పని అది చేయడానికి. మనిషిగా పుట్టినందుకు ప్రపంచంలో మిగిలిన కాస్త మానవత్వాన్నైనా బతికించుకునే ప్రయత్నం చేయడం మన కనీస ధర్మం

ధర్మో రక్షితి రక్షితః..!


           


Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner