28, ఫిబ్రవరి 2019, గురువారం

విజయుడవై తిరిగిరా...!!

శత్రుదాడికి
ధీటుగా జవాబిచ్చిన
క్షాత్ర పౌరుషమా
మెుక్కవోని
గుండె నిబ్బరంతో
జూలు విదిల్చిన 
ఆత్మ విశ్వాసమా
అఖండ భరతావని
అందిస్తోంది
ఆత్మీయతాశీస్సులు
ధీరుడవై
విజయకేతనంతో
విజయుడవై
పద్మవ్యూహపు
ఛేదనలో
సవ్యసాచివై
తిరిగిరా విక్రమాభినందనుడా..!!
 

నీ...!!

నీ మౌనంలో
నేనుండాలన్నంత
అత్యాశెందుకో

నీ మాటల్లో
నాపై ఇష్టముండాలన్నంత
కోరికెందుకో

నీ మనసులో
నాకే చోటుండాలన్నంత
తపనెందుకో

నీ జ్ఞాపకాల్లో
నే పదిలమవ్వాలన్నంత
ఆశెందుకో

నీ తలపుల్లో
నే మిగిలిపోవాలన్నంత
తమకమెందుకో

నీ వాస్తవంలో
నే కలగా నిలిచిపోవాలన్నంత
ఆరాధనైనందుకేమెా...!!

20, ఫిబ్రవరి 2019, బుధవారం

ఆమె తప్పిపోయింది సమీక్ష...!!

                           " అతివ అంతరంగాన్ని వెదుకుతున్న అక్షరాభావాలు ఆమె తప్పిపోయింది.."
       గట్టు రాధిక మోహన్  అమ్మానాన్న పేర్లను తన కలం పేరు వెంకి గా మార్చుకుని కవిత్వం రాస్తూ మానసిక, సామాజిక అసమానతలపై ఎక్కుపెట్టిన అక్షర శస్త్రాలు ఆమె తప్పిపోయింది కవితా సంపుటిలో కనిపిస్తాయి. ప్రాంతీయతను ఎంతగా అభిమానిస్తారో రాధిక ప్రతి కవితలోను స్పష్టంగా కనిపిస్తుంది.
      ఆమె తప్పిపోయింది కవితా సంపుటిలో మొదటి కవితలోనే తన కవిత్వ భావాలను రాత్రులను తరిమేస్తూ, ఉదయాలకు ఊపిరయ్యే భావాల కన్నీళ్లను, అంతరంగాన్ని అక్షరాలుగా మలిచి కవిత్వం అనే మూడు అక్షరాల్లో నియంతృత్వానికి నిద్ర లేకుండా చేయాలనే యుద్దాన్ని ప్రకటిస్తారు. ఆకలీ..చచ్చిపో కవితలో పిడికెడు బువ్వకు పిడిగుద్దులు అందుతున్న ఈ సమాజంలో ప్రాణాలతో బతకడానికి ఆకలి పేగులను పెట్రోలుతో తగులబెట్టాలని ఉందని సరికొత్త అభివ్యక్తితో చెప్పడం చాలా బావుంది. అవ్వపాల భాష కవిత ప్రాంతీయతమీదున్న ప్రేమను చాటుతూ కాళోజిని స్మరణకు తెచ్చుకోవడం అభినందించదగ్గ విషయం. నువ్వొక పొడిచే పొద్దువి కవిత ఇప్పటి చదువుల భారాన్ని చూస్తూ ఏమి చేయలేని నిస్సహాయతను చూపిస్తుంది. బ్లాక్ మినిట్స్ కవిత మౌనంలో మనసు భావాలను చెప్తుంది కొత్తగా. మా నాయిన కవితను చదువుతుంటే మళ్ళి కొడుకుగా పుట్టిన బిడ్డని చూస్తూ దేవుని వరమని తలపోస్తూ, " అమ్మ పక్కనే కూసోని (వెంకి ) కవిత్వమైతడు  అందనంత దురానున్నా.. అందనంతెత్తుకు ఎదుగుబిడ్డాని దీవెనార్తి పెడ్తడు " అంటూ దూరమైన నాయిన జ్ఞాపకాల గురుతులను యాది చేసుకుంటారు. అసిఫా మాట్లాడితే కవిత చదువుతుంటే మనసు చెమ్మగిల్లక మానదు. నీ ఊహల మేఘాలు, నీతో.. నువ్వు కవితలు చక్కని భావుకత్వంతో ఉన్నాయి. తెలంగాణ సిద్ధాంత కర్త కొత్తపల్లి జయశంకరుని గురించి చెప్పడం బావుంది. ఊహామాత్రంగా మిగిలిన అమ్మను దూరం చేసిన కరకు కాలాన్ని శపిస్తూ అమ్మను మనసులో దాచుకున్న పసి హృదయాన్ని అమ్మ చిత్రంలో హృద్యంగా చూపెడతారు. సంక్షోభ స్త్రీ, గొంగళి పురుగు, అనంత రూపసి, అమ్మ  కొంగు, ఆమె తప్పిపోయింది, నేనొక దాచిన హక్కుని, కీచక పర్వం, గర్భాలయం, సీతాయణం, ఆ శాపం, ఆమె వెళ్ళిపోతుంది, వి'తంతు' , ఆమె మెదడే ఆమెకు శత్రువట వంటి కవితలు స్త్రీలపై జరుగుతున్న అమానుషాలను ప్రశ్నిస్తూ, అతివ మనసులోని ఎన్నో వేదనలను సూటిగా అక్షరబద్దం చేసారు. జ్ఞాపకాల శకలాలతో అందమైన శబ్దం చేయించారు. అలసిన శరీరం ఎలా అద్భుత శక్తిగా వెలగాలన్న ఊహను చూపించారు. డాక్టర్ సూర్య కవిత తమాషాగా చీకటిని, వెలుగుని చెప్తుంది. రైతే రాజీనామా చేస్తే..? కవితలో అన్నదాతకు అగ్ర తాంబూలం ఇచ్చారు సరికొత్తగా. అడ్డుపడే గౌరవం కవిత బంధాల మధ్య దూరాన్ని తగ్గించే దారిని చెప్తుంది. ఆటలే అనాథలైన వేళ కవితలో ఈ ఆధునిక యుగంలో, అంతర్జాల మాయాజాలంలో మరుగున పడిపోయి కనుమరుగౌతున్న బాల్యపు ఆటపాటలను, పసితనపు జ్ఞాపకాలను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. అగ్నికణుడు దాశరథి కవితలో కలాన్ని హలంగా చేసి, జనంపై అభ్యుదయ అక్షరాలను చల్లిన దాశరథిని కీర్తిస్తారు. వేల రాత్రులను దిగమింగుతున్న సూర్యుడు కవితలో ఒకే పేగు తెంచుకుని, ఒకే రక్తం పంచుకున్న అన్నాచెల్లి రక్త సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఏడున్నది ప్రాణం గ్యారంటీ క్షణంలో పోయే  ప్రాణమున్న దేహానికి ఈర్ష్యా అసూయలు ఎందుకంటూ  తాత్వికంగా అడుగుతారు. నాయిన బిడ్డ కవిత చక్కని తెలంగాణా యాసలో తండ్రిబిడ్డల ప్రేమను చెప్తుంది. పిత్తలి పీతాంబరం కవిత మది బాధని గుర్తు చేస్తుంది. మనసు వాసన కవిత మనిషి మనసు ఆరాటాన్ని, ఆరాధనను చెప్తుంది. మానవత్వమా.. ఘర్ వాపస్ ఆజావ్ కవిత ఈ నిర్జీవపు సమాజ విలువలపై సూటిగా ఎక్కుపెట్టిన అక్షర శరం. రాలిపడుతున్న సమయం, విధి రాత, I am not alone, పరదేశి, అవుటాఫ్ కవరేజ్ ఏరియా వంటి కవితలు విభిన్న  కవితా వస్తువులతో చదువరులను అలరిస్తాయి. పాలిథిన్ సమాధి, పొడుపు కొండ, నాలుగ్గోడలు, కలం వారసులు, ఏంజెయ్యను అని సమాజపు లోపాలను ఎత్తి చూపిస్తూ  చివరిగా తన అందమైన తెలంగాణా యాసలో ప్రాంతీయత మీద తనకున్న అపారమైన అభిమానాన్ని ఇఫ్తార్ విందుగా జ్ఞాపకాల గుట్టను కదుపుతూ సమానత్వాన్ని చాటి చెప్తారు.
స్త్రీ వాదాన్ని, సమాజపు అసమానతలను, మనసు వేదనలను, జ్ఞాపకాల చిట్టాను, బాల్యపు అనుభూతులను ఇలా జీవితపు ప్రతి క్షణాన్ని తనదైన చక్కని ప్రాంతీయపు యాసలో, తెలంగాణా వాడుక భాషలో అందంగా " ఆమె తప్పిపోయింది " అంటూ అక్షరీకరించారు గట్టు రాధిక మోహన్. చక్కని, చిక్కని భావాలను అందించిన రాధిక మోహన్ కి హృదయపూర్వక అభినందనలు.... 

అంతర్లోచనాలు సమీక్ష...!!



నా పుస్తకం అంతర్లోచనాలు పై చక్కని సమీక్ష రాసిన సునీల్ కుమార్ నన్నపనేని గారికి, సమీక్షను వేసిన విశాఖ సంస్కృతి మాస పత్రిక సంపాదకులు శిరేల సన్యాసిరావు గారికి, మనఃపూర్వక ధన్యవాదాలు...

16, ఫిబ్రవరి 2019, శనివారం

ఉచిత సలహాలు..!!

నేస్తం,
         వ్యక్తుల గురించి తెలియదు, వారి వ్యక్తిత్వాల గురించి తెలియదు కాని ప్రతి ఒక్కరూ సలహాలిచ్చేటోరే. ఫలానా సంఘటన జరిగింది ప్రపంచం యావత్తూ దిగ్భ్రాంతికి లోనైవుంటే మీరేంటి వెన్నెలపాటలు రాసుకుంటున్నారంటూ కామెంట్లు. కనీసం నేనేం రాశానో కూడ అర్ధం చేసుకోకుండా కామెంట్ రాయడమే వాళ్ళ పని. నా గోడ మీద నాకు నచ్చింది నేను రాసుకుంటాను. సైనికులపై దాడి హేయమైన చర్యే, వారి కుటుంబాలకు జరిగిన నష్టం ఎవరు పూడ్చలేనిది. ఇది జగమెరిగిన సత్యం. పుంఖానుపుంఖాలుగా శాంతి సందేశాలు, బాధాకరమైన పోస్ట్ లు పెట్టేసి వారి కుటుంబాలకు సంతాప సందేశాలు, ప్రొఫైల్ పిక్చర్ మార్చేసి  అదీ కాణీ ఖర్చు లేకుండా చెప్పేసి మన బాధ్యత అయిపోయిందనుకుంటే  సరిపోతుందా. ఇది తెలియక జరిగిన తప్పిదం కాదు. నన్ను అడిగిన సదరు పెద్దమనిషి దీనికి కారణాలను ప్రభుత్వాన్ని అడిగితే చాలా బావుంటుంది. గోడలలో మీ ముఖచిత్రాలు పెట్టుకున్నారు, కనీసం ఓ సైనికుడి ఫోటో పెట్టలేదు, ఓ సందేశము పెట్టలేదు, నా రాతల గురించి మాట్లాడే హక్కు మీకు లేదని మనవి. నేను ఎప్పుడూ ఎవరి రాతలను క్రిటిసైజ్ చేయలేదు, చేయను కూడా. అయినా నా మీద పడి ఏడుస్తున్నారు కొందరు. కనీసం ఇంట్లోవాళ్ళ గురించి ఆలోచించని వాళ్ళు దేశం గురించి, ఎదుటివాళ్ళ బాధల గురించి ఓ తెగ ఫీలయిపోతున్నారు. ముందు మీ గురించి చూసుకుని తర్వాత పక్కవాళ్ళ లోపాలు వెదకండి...మరోసారి చెప్తున్నా
"నాకు నచ్చింది నేను రాసుకుంటాను."
ఉచిత సలహాలివ్వకండి....

12, ఫిబ్రవరి 2019, మంగళవారం

ఏక్ తారలు...!!

1.   పద బంధాలు పలకరిస్తూనే ఉంటాయి_ఆశలను అక్షరాలకందిస్తూ....!!
2.   ఈ అక్షరాలే అనునయించేది_విషాదానికిీ వెసులుబాటిస్తూ...!!
3.   ఎదను తాకిన ఉప్పెనది_ఎన్ని జన్మల ఎడబాటో మరి...!!
4.   నకలుతో పనేముంది_అచ్చంగా మనసంతా నీదే అయితే...!!
5.   స్వగతాలను సముదాయిస్తున్నా_స్వప్నాలను సాకారం చేద్దామంటూ....!!
6.   మరలని జ్ఞాపకమై మనతోనే ఉంది_గాయమైనా గతించని స్వప్నమై...!!
7.    మనసును మమతను పంచుకునేవి_మర్మమెరుగని ఈ అక్షరాలే....!!
8.   దేహాన్నంతా చీకటి చుట్టేసింది_మనసుని వెన్నెల్లోనికి ఒంపేస్తూ...!!
9.   అందిన నెయ్యమలాంటిది_ఆఖరి మజిలీ అచ్చెరువందేలా...!!
10.    అలలకు ఆశలెక్కువే_కల్లోలాన్ని సైతం కనబడనీయకుండా చేద్దామని..!!
11.    అక్షరాలు అలుకను మరిచాయి_హొయలొలికే నీ భావాలను చూస్తూ....!!
12.   పదాలు పరవశిస్తున్నాయి_అందమైన భావాల నడుమ అనునయంగా చేరుతూ....!!
13.   అక్షర అలల తుళ్ళింతలు_అలసిన మదికి ఆస్వాదనలా....!!
14.   విలక్షణాలు సులక్షణాలౌతాయి_మనకి మనం సరికొత్తగా ఆవిష్కృతమైతే...!!
15.    మది దాసోహమందుకే_పలకరించిన పలుకులన్నింటా నీ ప్రేమే నిండినందుకు...!!
16.    ఆర్ద్రత మనసుది_పదాలను పదిలంగా అందిపుచ్చుకునేవి భావాలైనప్పుడు...!!
17.   మనసు పడిందే నీ మౌనానికి_చదవనక్కర్లేకుండా అవగతమయ్యావనేమెా...!!
18.   రాతిరికి ప్రేమెక్కువైందట_చీకటిని వెన్నెలకు చుట్టేసిందందుకే...!!
19.    గమనం గెలుపు కొరకే_ఓటమిని సోపానాలుగా చేసుకుంటూ...!!
20.    ముగింపు వాక్యమెుక్కటే_మురిపెంగా మిగిలిన కవనానికి...!!
21.    కుదింపు తప్పని జీవితాలే అన్నీ_ముగింపు కథనం తెలిసినా....!!
22.   క్షణాలు క్షణికమైనవే_అనుభూతులను పదిలంగా మదిలో నిక్షిప్తం చేస్తూ...!!
23.   ముక్తాయింపు ముచ్చటైనదే_కవనంలో భావం సరికొత్తగా చేరితే...!!
24.   గాటిన బడుతున్నాయి సంతోషాలు_కాలాన్ని మది వశపర్చుకున్నాక...!!
25.   సద్దు మరచిన గుండె సవ్వడి నేర్చింది_కల'రవళులు నీతో ఊసులాడుతుంటే...!!
26.    వాస్తవమై వద్దనే ఉన్నానుగా_నిరంతరాయంగా నీ హృది సవ్వడి వింటూ..!!
27.    అక్షరాలకు మాటిచ్చాను_మనోభావాలను అనుసంధానం చేస్తానని..!!
28.    మర్చిపోతేనే కదా గుర్తుకొచ్చేది_ఏమయ్యావన్న చింతేల మరి...!!
29.   విలువైనది శూన్యమే_అనంత విశ్వాన్ని తనలో ఇముడ్చుకుని....!!
30.   పలకరిస్తున్నాయి బాల్యస్మృతులు_ఒడిదుడుకుల జీవితానికి ఒయాసిస్సుల్లా...!!

11, ఫిబ్రవరి 2019, సోమవారం

ఖాళీలు మాట్లాడతాయి...!!

యుద్దానికి సన్నద్ధమై 
ఎదుదుదాడిని తట్టుకుంటూ
ప్రతికూల పరిస్థితిని తనకు
అనుకూలంగా మార్చుకుంటూ
నిస్సహాయతను నీరుకారుస్తూ
సమాధానపు శస్త్రాలను
సూటిగా ఎక్కుపెట్టి
జీవితపు లోటుపాట్లను
పూరించే దిశగా పయనిస్తూ
అనుబంధపు ఆనవాళ్ళకై వెదుకుతూ
రాలిపడుతున్న చుక్కల్లో చేరుతూ
సంద్రపుహోరుకు ధీటుగా
నా మనసు ఖాళీలు మాట్లాడతాయి
అక్షరాలను ఆసరా చేసుకుని...!!

ఫిబ్రవరి నెల నవ మల్లెతీగలో టి. చంద్ర శేఖర్ ఆజాద్ గారు రాసిన మేకింగ్ ఆఫ్ ఏ రైటర్ వ్యాసం చదివిన తరువాత నా స్పందన...

10, ఫిబ్రవరి 2019, ఆదివారం

అవకతవకలు....!!

అయ్యా చంద్రబాబు గారు,
మీరందించిన వరాల జల్లులు కొందరి అతి తెలివి వలన, ఎదుటివారు కూడా ఎందుకు లాభం పొందాలి అన్న కుటిలబుద్దితో ఈ స్కీములకు సంబంధించిన అధికారులతో కుమ్ముక్కై, మీరు డ్వాక్రా మహిళలకు అందించిన సొమ్మును అందరికి చేరనీయకుండా అడ్డుపడుతున్నారు. సదరు అధికారులు వివరాలు అడుగుతున్న మహిళలను చాలా అసభ్యపదజాలంతో అవమానిస్తూ మహిళలకు చేరాల్సిన సొమ్మును తాము పంచుకోవాలని చూస్తున్నారు. దీని వలన మీకు చాలా నష్టం జరుగుతుంది. అతి తెలివి అవకాశవాదుల వలన మీ ఓటమిని మీరే కొనితెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై తక్షణ చర్య తీసుకోవాలని మనవి. లేదంటే మీ ఓటమికి మీరే బాధ్యులౌతారు.

9, ఫిబ్రవరి 2019, శనివారం

సంతోష క్షణాలు...!!

కొన్ని సంతోష క్షణాలను నాకందించిన గిడుగు రామమూర్తి పంతులు గారి పురస్కారం...


"అంతర్లోచనాలు" పుస్తకానికి అందిన గౌరవం...
కాంతికృష్ణ గారికి, బిక్కి కృష్ణ గారికి, కలిమిశ్రీ గారికి, ఈ ఫోటోలు తీసి పంపిన మాధవరావు గారికి నా మనఃపూర్వక ధన్యవాదాలు

మధురానుబంధం...!!

ఇరు మనసులొకటిగా కలిసి
ఏక హృదయరాగమైన వేళ
వలపుల వన్నెలు వెన్నెల చిమ్మగా
పలకరింతల పలవరింతలు
ప్రియమార దరిజేరిన తరుణాన
మధుర భావనల మమతానుబంధమే ఇది...!!

7, ఫిబ్రవరి 2019, గురువారం

పురస్కారం...!!

పురస్కార గ్రహీతలకు అభినందనలు...
నా "అంతర్లోచనాలు" మంజు మనసు గోల కి దక్కిన గిడుగు రామమూర్తి పంతులు గారి పురస్కారం.
నిర్వాహకులకు,  కాంతి గారికి, న్యాయ నిర్ణేతలకు నా మనఃపూర్వక కృతజ్ఞతలు ...



రామానుజం మాస్టారి స్పందన...!!

రామానుజం మాస్టారి స్పందన నా అంతర్లోచనాలు పుస్తకంపై....
మనఃపూర్వక ధన్యవాదాలు మాస్టారు మీ అమూల్యమైన స్పందనకు, ఆశీస్సులకు...

తొలుత గా చిరంజీవులు మౌర్య , సౌర్య లకు శుభాశీస్సులు 🍇👐 అంతర్లోచనాలు 💎👀
మీ రచనల్లో ఓ మాధుర్యం ప్రత్యేకత ఏమిటంటే  మన నిత్య జీవితంలో అనుభవాత్మక అంశాలే అయినప్పటికీ , విషయం ప్రాధాన్యం తో పాటు ముగింపు/ ముక్తాయింపు అనిర్వచనీయం.
పాఠకులను ఆకట్టుకుని , మనసుకు పదును పెట్టే విధంగా వుంటుంది.
మున్నుడి లలో శ్రీ కొంపల్లె శర్మగారు అందించిన భావప్రకటన, సూచనాత్మక విశ్లేషణ హృద్యంగా వుంది.
లేఖా గమనాల్లో
నేనింతే, మనసు గోల, ఇది నిజం, అమ్మ భాష, ఆలోచించండి, చేదు నిజం, ప్రయాణం లో పాడుగోల.   ఇలా దేనికదే ప్రత్యేకత సంతరించుకుంది అంటే అతిశయోక్తి కాదు.
ఆ చదువులతల్లి కృప తోడై మీ మానసిక, శారీరక శక్తి ని పెంపొందిస్తుందని నా అభిప్రాయం.
మీరు ఎంచుకున్న రచనా వ్యాసంగం మీకు వరప్రసాదం గా భావిస్తూ  అన్నిరంగాల్లో మీ కృషి ఫలించాలని ఆకాంక్షిస్తూ న్న  మీ శ్రేయోభిలాషి...
రామానుజం
హృదయ పూర్వక శుభాభినందనలు.
మీరు‌ కొన్ని ‌సందర్భాల్లో  విమర్శలతో ఎండగట్టి నా తగు పాళ్లలో వ్యక్తీకరించారు.
సాగరసంగమం పై మీకు గల మక్కువ నవరసభరితంగా మీ రచనల్లో ఆవి‌ష్కరణ జరిగింది.
జీవితకాలం లో చేసే పుణ్యకార్యక్రమాల్లో గ్రంధరచన ఒకటి.
అందులో మీరు సఫలీకృతులయ్యారు.
ధన్యజీవీ ! శుభమస్తు 🍀

3, ఫిబ్రవరి 2019, ఆదివారం

కలానికి గాయమైంది...!!

ఏ కలానికి గాయమైందో
నెత్తురోడుతున్న క్షణాలన్నీ
గేయాలుగా మారుతూ
రుధిరాక్షరాలై వెల్లువెత్తుతున్నాయి

గాలి వాటుకి చెల్లాచెదురై
బంధాలు రెపరెపలాడుతూ
అడపాదడపా తాకే ఆప్యాయపు చినుకుల్లో
తడిసి మురిసి పోతున్నాయి

అరకొరగా మిగిలిన రక్తసంబంధాలు
ఆదరణ కోసం అర్రులు చాస్తూ
అరచేయి అడ్డు పెట్టిన దీపాల్లా
మిణుకు మిణుకుమంటున్నాయి

దాహార్తి తీరని ధనదాహంలో మునిగి
కాలపు వలకు చిక్కుతూ
అహపు తెరలను చుట్టుకుని
పేగుబంధాలను పేలవం చేస్తున్నాయి

ముడిపడలేమంటూ ముగిసిపోతున్న బుుణానుబంధాలను
అక్షరాలు అటుఇటు మార్చినా
అందంగా ఇమడలేమంటూ
భావాలు రొద పెడుతున్నాయందుకే...!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner