28, ఫిబ్రవరి 2020, శుక్రవారం

వైల్డ్ కార్డ్...!!

వాస్తవానికి 
నాదో నైజం 

అవసరానికి
ఎటైనా పోతాను

ఆటల్లో పాటల్లో
అలా మెరుస్తుంటాను

కులాల రాయితీలకు
కీలకంగా ఉపయెాగ పడతాను

మతాల మార్పిడిలో 
మాయజేస్తాను

నీతులు వల్లించే నాయకులకు
నాతోనే బోలెడు పని

ఎన్నికల్లోనే కాదు
మరెందులోనైనా నేనే ముందు

రాతలనైనా
కోతలనైనా వదలను

పురస్కారాలకు
తిరస్కారాలకు నాదే అగ్రస్థానం 

సాహిత్యానికి
సమాజానికి కూడా తెలుసు నేనంటే

మనుషుల ఆటలో వైల్డ్ కార్డైన నేను
ఇప్పుడో ట్రంప్ కార్డన్నమాట...!!

27, ఫిబ్రవరి 2020, గురువారం

ఎవరి పక్షం..!!

ఎవరి పక్షం..!!

ఎవరి పక్షం ఎవరి పక్షం
న్యాయమెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం
ధర్మమెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం
ప్రజలెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం
ప్రకృతెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం 
రక్షణవ్యవస్థెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం 
నమ్మకమెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం 
మహాభారతమెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం 
దైవమెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం 
నీతినిజాయితీలెవరి పక్షం

ఎవరి పక్షం ఎవరి పక్షం 
చివరికి విజయమెవరి పక్షం...?

26, ఫిబ్రవరి 2020, బుధవారం

రాతలు.. !!

నేస్తాలు, 
  కొందరి అత్యుత్సాహం వలన ఏం రాయాలన్నా కాస్త భయపడాల్సిన పరిస్థితి వచ్చింది ఈనాడు.
  నేననే కాదు రాసే ప్రతి ఒక్కరి రాత వారికి, వారి వ్యక్తిగతానికి సంబంధించినది కాదు అన్న నిజాన్ని గమనించండి. మరి కొందరేమెా రాసిన ప్రతి రాత తమకే అనుకుంటే ఎలా? రాత నచ్చితే చదవండి లేదా పక్కకు వెళ్ళండి.. అంతే కాని అర్థం పర్థం లేని కామెంట్లు పెట్టవద్దు. మాకు రాయాలనిపించింది రాసుకోనివ్వండి దయచేసి. సరదాగా కామెంట్లు పెట్టడం వేరు.. మీకే సొంతమారాత అనుకోవడం వేరు. రచయిత స్వేచ్ఛను హరించకండి మీ ప్రవర్తనతో.... ధన్యవాదం.

25, ఫిబ్రవరి 2020, మంగళవారం

త్రిపదలు..!!

1.  అలలకుందా 
అలుపు వెరుపు
పడినా లేవడమే దాని లక్షణం...!!
2.   చిన్మయంలోనే
ఆ చిదంబర రహస్యం
మనసు మాయం కావడంలో..!!
3.   రేపటులన్నీ... 
నిన్నటి ఆనవాళ్ళే 
ఈరోజుని కలుపుకుంటూ...!!
4.   లౌక్యం తెలియని బతుకులింతే
అటు తెంచుకోనూలేవు
ఇటు సరిపెట్టుకోనూలేవు...!!
5.   ఏ క్షణమూ 
నాది అవడం లేదు
తడబడకుండా ఉందామంటే..!!
6.   హత్తుకోవడంలో 
అమ్మతో సమానమే అక్షరమూను
మనసు భారాన్ని తానందుకుంటూ..!!
7.   నా అనుకున్న బంధాల
ఘడియలన్నీ గడియ లోపలే
నేనంటూ మిగలనప్పుడు..!!
8.  మనసు.. 
కనిపించకుండానే
కనుమాయ చేసేస్తుంది...!!
9.  శూన్యానికి చోటేది
చిత్తమంతా నీ చిత్తరువే
కొలువై ఉంటే..!!
10.   మనోనేత్రంతో చూడు
అంతరార్థమేంటి
విశ్వమే నీ పాదాక్రాంతమౌతుంది...!!
11.  వినాలనే ఉంటుదెప్పుడూ
నిశ్శబ్ధంలో నీ మనసు పలికే 
నయగారపు పిలుపులను...!!
12.   నేస్తమనే అనుకున్నా
నన్నే లేకుండా చేసి
తానే నిండిపోతుందని తెలియక..!!
13.   దెప్పడం కాదది
ప్రేమగా మందలించడమని
తెలుసుకోవెందుకూ..!! 
14.    వెంటబడే వెతలను
సముదాయించడంలోనే
అయినవారి ఆనందం వెదుక్కునే అల్పసంతోషి ఆమె...!!
15.   దోబూచులాడే నవ్వులు 
దాచే దుఃఖాలెన్నో
వెతలకు మరుపు లేపనమద్దుతూ...!!
16.  అమ్మ నేర్పిన అక్షరాలివి
అనుబంధాలకు వారధులుగా
మమకారానికి మరో రూపుగా...!!
17.   అక్షయమెప్పుడూ 
అమ్మ చేతిలో ఆటబొమ్మే
విశ్వాన్ని తన చీరకొంగులో దాచి మనకిస్తూ..!!
18.   శూన్యంతో పనేంటి
చుట్టమైన ఏకాంతం 
నీతోనే ఉందిగా గాయాలను జోకొడుతూ..!!
19.   నెలవంక వయ్యారమది
అరకొరగా ఉన్నా
ఆకాశంలో చుక్కలరేడై విలసిల్లుతూ..!!
20.   ఓ క్షణం సరిపోదనేగా
అరుదైన జ్ఞాపకమవ్వాలన్న
అతిశయంలో అలా మిగిలిపోతున్నా...!!
21.   వినే మనసుంటే
శిథిలాలు చెప్పే చరితలెన్నో
ఘనమైన గతాన్ని భవితకందిస్తూ...!!
22.  చెప్పేద్దామనే అనుకున్నా
కానీ...విలువ కన్నా
బంధమే ఎక్కువనిపించి..!!
23.  ముడి ఎలాంటిదైనా 
బంధాన్ని ఏర్పరిచిందిగా
ఇక అభిజాత్యాని ఆత్మభిమానానికి లంకెందుకటా...!!
24.  ఆంతర్యాన్ని అంచనా వేస్తున్నా
అర్థం కాకున్నా 
ఆలోచనలనాపలేక...!!
25.   నీ(నా) మనసుకు 
వ్యాఖ్యాతగా వ్యవహరిద్దామనుకున్నా
ఓ వాక్యంలో చెప్పలేక...!!
26.  చెప్పమని అడగలేదందుకే
అక్షరాలకు తెలుసు కదా
ఎలా వ్యక్తపరచాలో..!!
27.  ఏ నగరానికి ఏమి కాలేదు
చుట్టంలా చూసెళ్ళమంటే
ఇల్లరికం ఉండిపోతానందంతే..!!
28.   మంద్రంగా 
వినిపించే పాటయినా
మౌనాన్ని ఛేదించలేదేమెా...!!
29.   శబ్దం వినిపిస్తూనే ఉంది
చీకటి చీర చుట్టుకుంటున్న ఆకాశంలో
అలికిడితోనైనా గుర్తుపడతావని...!!
30.   దాయలేకున్నా మనసుని
ఊరడించే అక్షరాలతో 
బంధుత్వం కలుపుకున్నాక..!!

23, ఫిబ్రవరి 2020, ఆదివారం

రాచమర్యాదలెవరికో...!!

ఆంధ్రులను అడ్డమైన కారుకూతలు
కూసిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ కి గులామన్న గౌరవనీయ ఆంధ్రా ముఖ్యమంత్రి గారు...
భారతీయులను చిన్నచూపు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారికి సకల రాచమర్యాదలు చేస్తున్న భారత ప్రధానమంత్రివర్యులు... 
దీనినిబట్టి మనకేం అర్థమయ్యింది అద్దెచ్చా..!! 

అభివృద్ధి..!!

నవ మాసాల్లో
రాలిన నవ రత్నాలు
ఏరుకుంటున్న ఆంధ్రులు

మెుదటి అడుగు నుండి
అభివృద్ధికే పెద్ద పీటట
అవినీతి అంతమే ధ్యేయమట

ప్రజలలోనికి పాలనట
పారదర్శకతకు క్రొంగొత్త అర్థం 
పురోగమనమన్న అధికారం

చట్టమెవరి చుట్టమెా
చట్టసభల సభామర్యాదలేంటో
కనులకింపుగా తిలకింపులు

అధికారభాష ఏమిటన్నది
తేటతెల్లమైన క్షణాలు
ఎలా నేర్చుకోవాలో తెలుపుతున్న నాయకులు

భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో
ఆ భాష మనుగడే వద్దంటున్న అధినాయకుడు
పరాయి భాషతో ముందడుగంటు ప్రగల్భాలు

దైవంతో ఆటలు
దైవత్వాన్ని అపహాస్యం చేయడంతో
అహం చల్లార్చుకుంటున్న కుటిలనీతి

కక్ష సాదింపుల కార్పణ్యం
రైతన్నకు మిగిలిన శోకం
ఆడబిడ్డలకు అవమానం 

సుపరిపాలనంటూ 
స్వయంపాలనకు తెర లేపి
అనుయాయులకు కనకపు సింహాసనాలు

ఉచితాలకు తలొగ్గిన ఆంధ్రుడా
తిరోగమనమేదో తెలుసుకోరా
తొందరపడి ఓ అవకాశమిచ్చినందుకు అంధకారమైనదిరా నీ బ్రతుకు...!!

16, ఫిబ్రవరి 2020, ఆదివారం

తెలుగుకే తెలుగు అనువాదం ఏంటో..!!

మెుత్తానికి పాపం మీడియా వారికి కాస్త ఇబ్బందే. కొందరు మాట్లాడుతున్న తెలుగునే అనువాదం చేయాల్సిన పరిస్థితి మనకుంది ఇప్పుడు. అలా మాట్లాడేవారికి ఓ చక్కని అవకాశం "నేను మాట్లాడిన మాటలను మీడియా వక్రీకరిస్తోందని" సదరు తెలుగు ధారాళంగా మాట్లాడే మేతావి వాపోతున్నారు. వారు మాట్లాడే మాటలకు క్రింది స్క్రోలింగ్ వేయడమే బహు కష్టం. మీడియాలో ఏం మాట్లాడినా జనానికి ఆ మాటలు అర్థం కావు..కాని వారితోనే మాట్లాడిస్తూ జనాలను అయెామయంలో పడేస్తూ....మాట్లాడే భాష ఏదైనా.. కాస్త  తెలుగయినా, ఇంగ్లీషయినా నాలుగు ముక్కలయినా అర్థమయ్యేటట్లు మాట్లాడించండిరా బాబూ... 😊

12, ఫిబ్రవరి 2020, బుధవారం

చచ్చిపోయిన సమాజం...!!

సినిమా ప్రపంచంలోనే బోలెడుమంది పాశవికంగా చెరచబడి చంపబడ్డారు...ఆ కేస్ లలో ఏ ఒక్క నటుడు స్పందించిన దాఖలాలు లేవు. ఎందుకురా నీతులు వల్లిస్తారు.. విని జేజేలు కొట్టే గొఱ్ఱెల మందలం మేమని మీకు బాగా తెలుసు. రాజకీయాలు పాకేజీలు తీసుకుని తొంగోడానికే అని నిరూపిస్తున్నారు కదరా..మిమ్మల్ని ఎంతగానో అభిమానించే ప్రజల సమస్యలకు స్పందించని ఏ నటుడూ మాకు అక్కర్లేదు. మాలో మాకే సంఘటితం లేదు...అందుకే సినిమావాళ్ళ, రాజకీయ నాయకుల ఆటలు సాగుతున్నాయి... జిందాబాద్ జిందాబాద్ చచ్చిపోయిన సమాజమా...!!

11, ఫిబ్రవరి 2020, మంగళవారం

నేను నా అక్షరాలు..!!

నేను స్వేచ్ఛాజీవిని
నిత్య సంచారిని
నిరంతరాన్వేషిని

అడ్డుకట్టలు
ఆనకట్టలు
అసలాపలేవు

బంధాల
అనుబంధాల
ముసుగులు మెాసగించలేవు

ఏతావాతా 
ఎల్లలు తెలియని
ఏకాంతవాసిని

అందుకే
నా అక్షరాలు
ఆకాశ విహంగాలు...!! 


 

9, ఫిబ్రవరి 2020, ఆదివారం

అపసవ్యం..!!

చావు పుట్టుకల
సమతూకమే
సవ్యాపసవ్యాలు

భ్రమెా  
భ్రమణమెా తెలియని
కాలవృత్తపు మాయలు

పరితాపమెా
పర్యవసానమెా 
తెలియని క్షణాలు

రొదలు 
రోదనల నడుమన
సాగుతున్న జీవితాలు

మాటకు 
మౌనానికి మధ్యన
నలుగుతున్న మనసులు

పసితనానికి
పండినతనానికి చేరికైన
అనుబంధపు చుట్టరికాలు

రెప్పలకు
మాత్రమే తెలిసిన 
ఆనంద విషాదాల అంతరంగాలు

తలపుల
తలుపుల తేడాలో
ఆవల ఈవల మిగిలిన వైరుధ్యాలు

చేరేది
తుదకు చేరికయ్యేది
ఆరడుగుల అంపశయ్యే...!!

 





8, ఫిబ్రవరి 2020, శనివారం

వివాదాస్పదమౌతున్న నేటి సినిమా పాటలు..!!

ఈ నెల నవ మల్లెతీగలో నా వ్యాసాన్ని ప్రచురించిన మల్లెతీగ సంపాదకులకు నా మనఃపూర్వక ధన్యవాదాలు..

వివాదాస్పదమౌతున్న నేటి సినిమా పాటలు..!! 

తెలుగు సినీ వినీలాకాశంలో పాత కొత్త పాటల్లో కొన్ని ఆణిముత్యాలైతే మరికొన్ని కర్ణకఠోరమైనవి. సాంఘికమైనా పౌరాణికమైనా పాత తరం పాటల్లో చిత్రానికి తగ్గట్టుగా సన్నివేశానికి అనుకూలంగా అర్ధవంతమైన పాటలు చక్కని సంగీతంతో జత పది ఉండేవి. ఇప్పటికి ఆ పాత మధురాలు మనలను వీడిపోలేదంటే  అప్పటి పాటల్లో సంగీతం కానీ, సాహిత్యం కానీ మనసులకు దగ్గరగా ఉండేది. ఇప్పటి పాటల్లో ఎక్కువగా సంగీతమే సాహిత్యాన్ని వినబడనీయకుండా చేస్తోంది. 
            అప్పటి పాటల్లో ఏ సినిమా తీసుకున్నా..  ఓ పాతాళభైరవి, మాయాబజార్, జగదేక వీరుని కథ వంటి పౌరాణిక చిత్రాలు, డాక్టర్ చక్రవర్తి, కులగోత్రాలు, గుండమ్మ కథ వంటి సాంఘీక చిత్రాలోని పాటలు సంగీతం కానివ్వండి ఇప్పటికి అజరామరమే అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.  కారణం కథ, కథనం, సన్నివేశాలకు తగ్గట్టుగా పాటల్లో సాహిత్యం కానీ సంగీతం కానీ ఉండేది. 
             ఇక మధ్య తరంలో వచ్చిన సినిమా పాటల్లో రాను రాను కాస్త సంగీతం పాలు ఎక్కువగా ఉండటం మొదలైంది. అల్లూరి సీతారామరాజు, భక్త కన్నప్ప, సిరివెన్నెల, నిరీక్షణ, దేవాలయం వంటి ఎన్నో సినిమాల్లో అర్ధవంతమైన సంగీత సాహిత్యాలతో కూడిన పాటలు మనకు వినసొంపుగా ఉండేవి. కొన్న్ని సంగీత ప్రధానమైన సినిమాలు, శంకరాభరణం, సప్త పది, సాగర సంగమం, స్వాతిముత్యం లాంటి సినిమా పాటలు పాటల ప్రియులకు చక్కని సంగీతంతో పాటు మంచి సాహిత్యంతో కూడిన పాటలను అందించాయి.
           ఇప్పుడు చాలా వరకు పాటలు అర్ధమే కాకుండా టెక్నలాజి అందుబాటులోకి వచ్చి బీట్స్ వినిపించడమే తప్ప పాటలోని సాహిత్యం కనుమరుగై పోతోంది. చాలా పాటలు వివాదాస్పదమౌతున్నాయి. తెలుగు పాటల సాహిత్యంలో ఒకరిని కించపరిచే సంస్కారం ఎక్కువైపోతోంది. సినిమాకు పాటలు రాయించుకునే దర్శకులదా, అసభ్యకరమైన పదాలతో రాసే పాటల రచయితలదా, అర్ధంలేని సంగీత వాయిద్యాలతో ఊదరగొట్టే సంగీత దర్శకులదా లేక ఇలాంటి సంస్కృతికి తెర తీసి ఆదరిస్తున్న ప్రేక్షకులదా... తప్పు ఎవరిది..?


7, ఫిబ్రవరి 2020, శుక్రవారం

ఏక్ తారలు..!!

1.   ఓదార్పెప్పుడూ నీతోనే_అలసిన మదికి ఆలంబనగా...!!
2.   నిత్యస్మరణకు తీరికెక్కడా_మౌనంలోనూ నీ జపమే చేస్తుంటే..!!
3.  ఓరిమిగా వెంటబడుతుంది వలపు_వద్దన్నా వదలక వెంబడిస్తూ...!!
4.  ఒల్లకుంటాయా భావాలు_అక్షరాలతో నెయ్యం నెరపకుండా...!! 
5.   సరిపెట్టుకోవడమే అలవాటయిపోయింది_అర్థాలు అపార్థాల పాలౌతుంటే..!!
6.   అపార్థం అధిష్టానాన్ని ఆక్రమించింది_సర్దుబాటుకు అవకాశం లేకుండా...!!
7.   అక్షరాలకు తెలుసు_అది భారమైనా, భావమైనా నా మనసేనని...!!
8.   తెలియనిదల్లా నీకే_బోధపరిచే అక్షరాలను ఆషామాషిగా తీసుకుంటూ...!!
9.   లోకంతో పనేముందిక_నా ప్రపంచమంతా నీవయ్యాక...!!
10.   అక్షరాలు వదిలుండలేవట_అమాయకంగా పదాల ఆటకు పడిపోతూ..!!
11.   బడాయి భావాలకెందుకో_నయగారం అక్షరకన్నెలదయితే..!!
12.   పైసలకు చిక్కలేదట అక్షరాలు_పదాల కూర్పుకు తలొగ్గాయట..!!
13.   బేరసారాలే నడుస్తున్నాయిప్పుడు_అనుబంధాలు అంగట్లో సరుకులుగా మారితే..!!
14.   తొలి పలుకులిక్కడే_అమ్మ నేర్పిన అక్షరాలను అటు ఇటు సర్దుతూ...!!
15.   సాధ్యం కాదనెలా అంటావు_నా మౌనం మాట్లాడేదే నీతోనైతే..!!
16.   నీకు తెలియని లిపేముందని_మరో వివరణతో పనేముందిగనుక..!!
17.  అక్షరాలెప్పుడూ ఆకతాయివే_భావాలను అల్లరిగా అల్లేసుకుంటూ...!!
18.   గొప్పదనం అక్షరాలది కాదు_ఆదరించే మనసులది..!!
19.   బాధ్యతనెరిగిన అక్షరాలవి_పదాలనటూనిటూ పోనీయకుండా..!!
20.   పరిమితులు తెలిసిన అక్షరాలివి_పద పారిజాతాలతో విలసిల్లుతూ...!!
21.  విహారంలో విరుపులెక్కువైయ్యాయట_అక్షరాలందుకే అలా..!!
22.   ఆత్మకథల అగచాట్లవి_చీకటిలో వెలుగు నింపే యత్నంలో..!!
23.   సన్నిహితులమే కదా_సహకారం నామమాత్రమే మన మధ్య...!!
24.   చేయకుండా చేయించే హత్య_నిర్లక్ష్యం..!!
25.  అలంకరణలెన్నుంటేనేమి_కనబడని మనసేగా అది..!!
26.   లెక్కకురాని నైరాశ్యాలు_కనులకు తెలియని కన్నీటిలా...!!
27.   జ్ఞాపకాల నిండా గాయాలే_వాస్తవంలో సైతం వీడలేమంటూ..!!
28.  నిశీథిని పారద్రోలే జ్ఞాపకాలవి_తల్లడిల్లే మనసును ఊరడింప..!!
29.   నిజం పునాది గట్టిదనం తెలియలేదు_పేకమేడలో జీవించే అబద్ధానికి...!!
30.   కొన్ని నవ్వులంతే_కలతలను కలలుగా మార్చేస్తూ..!!

5, ఫిబ్రవరి 2020, బుధవారం

సమయం అందరిది..!!

నేస్తం, 
         ఒకరి సమయాన్ని మనం తీసుకోవడానికి మనకేం హక్కు ఉంటుంది? మనకి మరో పని లేదని ఎదుటివారి మెదడు, ఆలోచనలు మనకోసమేననుకుంటే ఎలా? మన ఒంటరితనానికి మరొకరిని బలి చేయడం ఎంత వరకు సబబు? మనం ఏ రాహిత్యంలో కొట్టుకుపోతున్నామెా తెలుసుకుని, దానిని అధిగమించడానికి మనమే ప్రయత్నించాలి కాని మరొకరిని శిక్షించే హక్కు మనకు లేదని తెలుసుకోవాలి. 
      అభిమానం, ఇష్టం, ప్రేమ అనేవి హద్దుల్లో ఉండాలి. మెాతాదు మించితే వెగటుగా ఉంటుంది. ముందు మన ఇంట్లోని వారితో మన అనుబంధం బావుండాలి. అంతేకాని స్నేహం పేరు చెప్పి భరిస్తున్నారు కదా అని విసిగించకూడదు ఎవరిని. సలహాలు, సంప్రదింపులు అడగకుండా చెప్పకూడదు. మీకు మాట్లాడే సమయముందని ఎదుటివారు మాట్లాడాలని అనుకోవడం ఎంత వరకు సబబు? దయచేసి ఎవరి సమయాన్ని వారికి వదిలి పెట్టండి. స్నేహాన్ని స్నేహంగానే ఉండనీయండి. సమస్యగా మార్చకండి. నాకు తెలిసి.. సమస్య లేకపోవడమే పెద్ద సమస్యనుకుంటా..!! 

4, ఫిబ్రవరి 2020, మంగళవారం

రాజసూ(కీ)య యాగం..!!

అధికారాన్ని 
చూపించడానికి
ఇదో మార్గం 

అహాం గుఱ్ఱాన్ని
అదిలించడానికి
ఇదో కళ్ళెం

అజమాయిషీల
అభిజాత్యానికి 
ఇదో సాధనం

బలహీనతలను
దాచేయడానికిదో
బలమైన దుర్గం

యుగమేదైనా
రాచరికపు జూదక్రీడదే
గెలుపు సింహాసనం...!!

3, ఫిబ్రవరి 2020, సోమవారం

జీవన 'మంజూ'ష (ఫిబ్రవరిె 2020 )

నేస్తం,
          పిలుపులకు, పలుకులకు సంబంధం లేకుండా పోతోంది. ఎంతయినా నాభి నుండి వచ్చే పిలుపులకు, నాలుక మీది పలుకులకు తేడా తెలుసుకోలేక పోవడం కాస్త దురదృష్టమనే చెప్పాల్సి వస్తోంది కొందరి ప్రవర్తన చూసిన తర్వాత. అభిమానాన్ని ఆసరా చేసుకుని పబ్బం గడుపుకునే వారు కోకొల్లలు మన సమాజంలో.
         అమ్మ, అక్క, చెల్లి అంటూనే అడ్డమైన వాగుడు వాగేవారు బోలెడుమంది. కనీసం ఎదుటివారి వయసు కూడా గుర్తురాదు వీళ్ళకు. మన భారతీయ సంస్కృతిలో కుటుంబ విలువలకు అగ్రస్థానం ఒకప్పుడు. పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతూ వ్యక్తిత్వ విలువలకు తిలోదకాలిస్తూ ఆధునికత మెాజులో పడి పెడదారులు పడుతున్న సమాజం నేడు. పరాయి సంస్కృతిని వంటబట్టించుకునే ముందు మనమెక్కడున్నాం, మనమేంటి అన్నది తెలుసుకోవాలి. స్వేచ్ఛకు, విచ్చలవిడితనానికి తేడా తెలుసుకోవాలి. విశృంఖలత్వానికి స్నేహమనే ముసుగు వేసేసి చేతులు దులిపేసుకోవడం సమంజసం కాదు.
        ఇంటి మనుషులకు విలువ ఇవ్వని ఎవరూ ప్రపంచంలో బాగు పడిన దాఖలాలు లేవు. ఇంటి బాధ్యతలు, ఇంటిలోని వారికి విలువ ఇవ్వని  చదువు, సంస్కారం ఈనాడు గొప్పదని కొందరనుకుంటున్నారు. అక్కరకు రాని బంధుత్వాలే అన్నీ ఈనాడు. రక్త సంబంధాలు రాలిపోతున్న ఆనవాళ్ళే అయిపోతున్నాయి.
       భాషా సంస్కృతులు మన ఉనికికి పట్టుగొమ్మలు. మనమే చీడపురుగుల్లా చేరి పచ్చని చెట్టు వినాశనానికి దోహదం చేస్తున్నాం. మరోపక్క సభ్య సమాజ అభ్యుదయం కావాలంటున్నాం. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవని మర్చిపోతున్నాం. అందరం సమాజం బాగుపడాలనే అంటాం కాని, సమాజమంటే మనమేనని మర్చిపోతున్నాం. మనం మేల్కొన్న రోజే సమాజ పురోభివృద్ధి. ఎంత త్వరగా మనం మేల్కొంటే అంత త్వరగా మన తరువాతి తరాలకు చక్కని కుటుంబ అనుబంధాలను, వ్యక్తిత్వ విలువలను ఇస్తూ, ఉన్నతమైన మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కానుకలుగా అందించగలుగుతాం.

2, ఫిబ్రవరి 2020, ఆదివారం

మడిపల్లి వెంకటేశ్వరరావు గారి గురించి...!!

                       " అందరి మనసులు తెలిసిన అక్షర ఆంతరంగికుడు మడిపల్లి వెంకటేశ్వరరావు "
        బ్రహ్మాండమంత విశ్వంలో అణువంత అక్షరం సృష్టించే విస్ఫోటనం ఏంటో అక్షరం విలువ తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకప్పుడు తమ భావాలు పదిమందికి చేరాలంటే ముద్రితాక్షరాలై ఉండాలి. ఇప్పుడు మనకు క్షణాల్లో మన భావాలు ప్రపంచాన్ని చుట్టి వస్తాయి. ఆ వెసులుబాటు సాంకేతికత కల్పించింది. కావ్యాలు,  పద్యాలు, దీర్ఘ కావ్యాలు, కవితలు, కథలు, వ్యాసాలు, నవలలు ఇలా అన్ని ప్రక్రియలు ప్రజల్లో ప్రాచుర్యం పొందాయి మన తెలుగు సాహిత్యంలో. ఆ కోవలోకే ఇప్పుడు పలు లఘు కవితా భావ ప్రక్రియలు ప్రాచుర్యం పొందుతున్నాయి. అనల్ప పదాలలో అంతులేని భావాలను పొదగడంలో చాలా నేర్పు, ఓర్పు అవసరం. ఆ నేర్పును, ఓర్పును అలవోకగా అందుకున్న అతి కొద్దిమందిలో మడిపల్లి వెంకటేశ్వరరావు గారు ఒకరు. నిగర్వి, ముక్కుసూటితనం, దేనికి ఎవరికి భయపడని తత్వం, సమాజం పట్ల తన వంతుగా ఏదైనా చేయాలన్న తపన, అన్యాయాలను, అక్రమాలను నిరసించే గళం ఇలా ఎన్నో బాధ్యతలను తానుగా నిర్వహిస్తూ, సమాజ హితం కోసం అక్షర శరాలను సూటిగా ఎక్కుపెట్టి చదువరుల మనసు లోతులను తడిమే అక్షర ఆంతరంగికుడు మడిపల్లి వెంకటేశ్వరరావు గారు.
               తాను చెప్పాలనుకున్న విషయం సామాజికమైనా, ఆర్ధికపరమైనదైనా, రాజకీయమైనా నిష్పక్షపాతంగా, స్పష్టంగా చెప్పడం, అధికార పక్షం, ప్రతిపక్షం కాకుండా ప్రజల పక్షాన తన అక్షర శరాలను సంధించడం ఈయన ప్రత్యేక లక్షణం.  రైతుకు ప్రభుత్వం ఇచ్చే నష్టం పంటకా..? పోయిన ప్రాణానికా..? అన్న ప్రశ్నఎవరైనా ఇప్పటి వరకు వేసారా..? మడిపల్లి వెంకటేశ్వరరావు గారు మాత్రమే అడగగలిగారు. ఈ ఒక్క మాటలోనే ఆయన వ్యక్తిత్వం తెలుస్తోంది. పుణ్యానికి కొలమానాలు ఏమిటని మరొక మాట అడుగుతారు ఇలా..
" చేసేది పాపపట
   వేసేది ముస్టట
వచ్చేది పుణ్యమట.. నిజమేనా..!! " ఎవరు సమాధానం చెప్పగలరు ఇలాంటి ప్రశ్నలకి.
మాతృభాషను కాదని ఆంగ్ల భాషను, అధికార భాషను అభివృద్ధి చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం అని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తారు. కుల, మత వివక్షలకు సూటిగానే చురకలు అంటించారు. కలం విలువ, కలం విలువ తెలిసిన మనిషిగా
" కలం కథానికగా మారింది
   కలం విలువ తెలిసిన కథకుడి చేతిలో.. " అంటూ చక్కని భావాన్ని అందించారు.
మరో చోట నిజంలో జీవిస్తూనే అబద్ధంలో బతికేస్తున్నామన్న జీవిత సత్యాన్ని ఎంత సుళువుగా చెప్పేసారో. 
అనుబంధాల్లో నటనలు, మోసాలు, ఆనందాన్ని, కోపాన్ని, వేదనను, స్నేహాన్ని, ద్వేషాన్ని ఇలా ప్రతి అనుభూతిని చిన్న చిన్న వాక్యాల్లో చదివే వారి మనసులోనికి దూసుకుపోటట్లుగా రాయగలగడం ఓ కళ. బాధను ఒకేలా అనుభవించగలగడం స్థితప్రజ్ఞతగా తాత్విక భావాన్ని చెప్తారు. ఓ మనిషిలో మంచిని, మానవత్వాన్ని ఆ మనిషి పోయాకే మహాత్మునిగా గుర్తిస్తారని ఇప్పటి జనం తీరును చమత్కరిస్తారు. సమాజంలో మంచి మార్పు కోరేవాడు ఎప్పుడు సమాజానికి శత్రువేనంటారు. మనం అనుభవించే సుఖాలు మరొకరి కష్ట ఫలితమే అని ఎందుకు గుర్తించమో అని ఒకింత బాధను వ్యక్తపరుస్తారు. రాజకీయ మాయలో ప్రజానాయకుడెవరో, సేవకుడెవరో అన్న సంశయాన్ని రేకెత్తిస్తారు. ఆట ఏదైనా, రాజకీయమైనా గెలుపు నిజాయితీగా ఉండాలంటారు.
    " కలం నాదే
సిరానే నాదికాదు
చేయి నాదే
రాతే నాది కాదు.." అంటూ మనసు రాసే రాతలే తనవని స్పష్టం చేసారీ సమాజ హితుడు, అక్షర సన్నిహితుడు మడిపల్లి వెంకటేశ్వరరావు. సమాజంలో లోపాలను సరిచేయడానికి అక్షర ఆయుధాలను సిద్ధం చేసుకుని సాహిత్య యుద్ధభూమికి అడుగిడి, అలతి పదాలతో అందరిలో ఆలోచనలు రేకెత్తిస్తూ, బాధ్యతాయుత రచనలను అందిస్తున్న అక్షర శ్రామికుడు మడిపల్లి వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు. వీరి సాహితీ శర పరంపర నిత్యం కొనసాగాలని కోరుకుంటూ.... శుభాభినందనలు.

ఈమని శ్రీసత్య సాంబశివరావు గారి గురించి...!!

                     సమాజ అసమానతలే తన కవితా వస్తువులంటున్న ఈమనికి గౌరవ డాక్టరేట్ పురస్కారం...!!
               ఏ అధికార హోదా, సాహిత్యపు పెద్దల వెన్నుదన్ను లేని ఓ సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చిన, సామాజిక బాధ్యత గలిగిన కవి, రచయితకు గుర్తింపు రావడమంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటిది ఎన్నో అడ్డంకులను, అవరోధాలను ఎదుర్కొంటూ, కుటుంబ,ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ, రచనల్లో తనకంటూ ఓ విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న అతి సామాన్యులుగా ఉండే అసామాన్యులు ఈమని శ్రీసత్య సాంబశివరావు గారిని గౌరవ డాక్టరేట్ వరించడం, అదీ సాహిత్యంలో సేవలకు లభించడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ మరియు అమెరికాకు చెందిన అంతర్జాతీయ సంస్కృత సంస్థ సెప్టెంబర్ 27న దుబాయిలో ప్రముఖ హోటల్ ఆర్కిడ్ వ్యూ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన అవార్డ్ ఫంక్షన్ లో సాహిత్య, సంస్కృత సేవలకు గుర్తింపునిచ్చి పలువురు ప్రముఖుల సమక్షంలో గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం తెలుగువారిగా మనము గర్వించదగ్గ విషయం. ఈమని శ్రీసత్య సాంబశివరావు గారి సాహితీ ప్రస్థానం వెనుక ఎంతో కఠోరశ్రమ ఉంది. ఎన్నో కష్టనష్టాలకోర్చి అక్షరం మీద మమకారాన్ని, సమాజానికి తనవంతుగా సేవ చేయాలన్న తలంపుతో మొదలుబెట్టిన సాహిత్యం ఈరోజు గౌరవ డాక్టరేట్ అందించి వారిని అత్యున్నత స్థానంలో నిలబెట్టింది. సమాజం మనకేమిచింది అని కాకుండా సమాజానికి మనమేం చేశామన్న ఆలోచనే ఈ పురస్కారానికి కారణం అయ్యింది. నిత్య సాహితీ సేవకులు ఈమని శ్రీసత్య సాంబశివరావు గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనల శుభాకాంక్షలు.                
        కృష్ణాజిల్లా మచిలీపట్నంకి 15 కి మీ దూరంలో గల భోగిరెడ్డిపల్లి అన్న చిన్న పల్లెటూరు నుంచి పేదరిక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన సామాజిక కవి ఈమని శ్రీసత్య సాంబశివరావు గారి గురించి నాలుగు మాటలు చెప్పడానికి ముందు వారు కవిత్వం రాయడం ఎప్పుడు, ఎలా మొదలైందో చెప్పాలి. కవిత్వం రాయడం అనేది దేవుడిచ్చిన ఒక వరం. చిన్నప్పటి నుండి పేదరికపు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబపు బరువు, బాధ్యతలు ఎలా ఉంటాయో కళ్లారా చూసిన వ్యక్తి తన మనసులో కలిగిన భావాలకు అక్షర రూపం ఇవ్వడం అనేది, అది ఏ సాహిత్యపు వాసనలు లేని ఒక కుటుంబం నుండి రావడమన్నది చాలా అరుదైన విషయం. చిన్నప్పటి నుండి చదువులో ముందుంటు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తొమ్మిదవ తరగతిలోనే కవిత రాయడం ఆ రోజుల్లో చాలా అరుదు. ప్రముఖ కవయిత్రి డా. మంగళగిరి ప్రమీలాదేవి, మరో ప్రముఖ కవి అందరికి సుపరిచితులు రావి రంగారావు గారి శిష్యు. డినని సవినయంగా చెప్పుకుంటూ, శ్రీ శ్రీ కళా వేదిక తెలంగాణకు సహాయ కార్యదర్శిగా గురుతర బాధ్యతలను నెరవేర్చుతున్న అసాధారణ వ్యక్తి ఈమని శ్రీసత్య సాంబశివరావు. ఇప్పటి వరకు 800 పై చిలుకు కవితలు, 50 పైగా వ్యాసాలు ఈమని కలం పేరుతో రాశారు. 30 పైగా కవితలు, వ్యాసాలు వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
                      వీరి కవిత్వంలో ఎక్కువగా సమాజ అసమానతలను ప్రశ్నిస్తూ, ప్రజలను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా కనిపిస్తుంది. సగటు మనిషి కష్టాలను, కన్నీళ్లను, ఆవేదనను, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను ఎత్తి చూపడం, అనాధలకు, బడుగు బలహీన వర్గాలకు  ఉంటూ, న్యాయం కోసం కోసం పోరాడటమే తన కవితల లక్ష్యం అంటున్నారు. భవిష్యత్ తరాలకు వారధిగా తన భావాలను అమర్చుతాననడం సమాజం పట్ల ఈయనకున్న నిబద్ధతను తెలియజేస్తోంది.
                 వీరి కవితలు కొన్ని పరిశీలిస్తే వాటిలో దాగిన సమాజ హితం, సంస్కృతుల పట్ల తనకున్న ఇష్టం తెలుస్తుంది. సగటు మనిషి సవ్వడి కవితలో సగ్గటు మనిషి ఆంతర్యాన్ని చక్కగా వినిపిస్తారు. ప్రశ్నలు, సమాధానాలు, న్యాయాన్యాయాలు, అవకతవకలు ఇలా ప్రతి విషయాన్నీ విప్పి చెప్తారు. తన భావాల్లో అప్పుడప్పుడు కాస్త తాత్వికత కూడా చోటు చేసుకోవడం గమనార్హం. తాను పనిచేసే మెడికల్ సంస్థలకు కూడా న్యాయం చేసే ఉద్దేశ్యంతో ప్రజలకు ఆరోగ్య విషయాలను చక్కని వ్యాసాల ద్వారా పలు వార్తా పత్రికల్లో ప్రచురించారు. అమ్మ లేని లోటుని, రాజకీయ అసమానతలను, కష్టాలకు ఓదార్పుగా ఆశావహ దృక్పథాన్ని, తొందరపడి ప్రేమలో మోసపోతే ఎలాంటి అనర్థాలు కలుగుతాయో ఇలా తన ప్రతి ఆలోచనకు చక్కని అక్షర రూపాన్ని అందించడంలో కృతకృత్యులయ్యారు. రాజకీయ, సామాజిక అంశాలతోపాటుగా,  ప్రేమ, వేదన, ఆశలు, ఆశయాలు మొదలైన భావాలను తన కవితల్లో పంచుకున్నారు. ఈ తరం నుండి తరువాతి తరాలకు పది కాలాలు  మంచి  సాహిత్యం, మానవత్వపు విలువలు అందించాలన్న ఈమని గారి కోరిక నెరవేరాలని కోరుకుంటూ, మరిన్ని రచనలు ఈయన కలం నుండి వెలువడాలని ఆశిస్తూ ... హృదయపూర్వక అభినందనలు.. 
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner