29, జనవరి 2018, సోమవారం

తుషార మాలిక ...!!

 మాలికలో వచ్చిన నా వ్యాసం                         

                                                      తుషార మాలిక లఘు సమీక్ష  ...!!             

కవితలకు, కథలకు సమీక్షలు రాయడం అంటేనే చాలా కష్టమైన పని.  సిరి వద్దే గారు రాసిన త్రిపదలకు అది 1300 ల త్రిపదలకు నేను సమీక్ష రాయడమంటే సాహసం చేయడమే.  అక్షరాలకు అందమైన పదభావాలను జత చేసి ముచ్చటైన మూడు వాక్యాల్లో త్రిపద కవితలను సిరి వడ్డే మనకు "తుషార మాలిక" తొలి త్రిపద సంపుటిగా అందించారు. ముందుగా వారికి నా ప్రత్యేక అభినందనలు.
                ఒక్కో వాక్యానికి 20 అక్షరాలకు మించకుండా మూడు వాక్యాల్లో ముచ్చటైన కవితలను అందించిన తీరు చదువరులను ఆకట్టుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక తుషార మాలికలో మొదటి త్రిపదం జన్మనిచ్చిన అమ్మతోనే మొదలు.  చరాచర సృష్టికి మూలం అమ్మ. ఆ అమ్మ ఒడి ఓనమాలతో మొదలై జీవిత పాఠాలు నేర్చుకునే వరకు చదువుల తల్లి శారదమ్మలా మనకు బాసటగా ఉంటుందని చెప్పడం. అమ్మని కూడా పసిపాపను చేస్తూ మనల్ని కొట్టి అమ్మ కూడా ఏడవడాన్ని ఎంత బాగా చెప్పారో..
అమ్మ కూడా పసిపిల్లనే ...
నన్ను కొట్టి ,

తను ఏడుస్తోందేమిటో...అలా వెక్కి వెక్కి..!!

పాపాయి బోసి నవ్వులతో నేర్చుకోవడం మొదలైన అమ్మ చదువుకోవడంలో ఎప్పటికి నిత్యా విద్యార్థిగానే ఉందని చెప్పడంలో భావుకురాలి గొప్పదనం తెలుస్తోంది. జ్ఞాపకాల గురించి చెప్పినప్పుడు వాడని పున్నాగపూల పరిమళాన్ని వీడని జ్ఞాపకాల మడతలతో పోల్చడం, ఇష్టమైనవాళ్లు విసిరిన చిరునవ్వు ఎదను హత్తుకున్న అమ్మ చేతి స్పర్శతో పోల్చడం, పాపాయి అలిగి అన్నం తినకపోతే అన్నం తినని అమ్మ అలకని తన చిన్నతనంలో పోల్చుకుని చెప్పడం, నాన్నతో అనుబంధాన్ని జీవితపు అవినాభావ సంబంధంగా, గుప్పెడుగుండేలో ఒదిగిన ప్రేమ అమ్మానాన్నల స్పర్శగా అనుభూతించడం, మానవత్వాన్ని చాటిచెప్పేవి పల్లెలే అని, ప్రపంచాన్ని, పుట్టిన పల్లెటూరును తూకం వేస్తె అనుబంధాలకు తూనిక తమ పల్లెలే అని తేల్చి చెప్పడం, అనుభవ పాఠాలను నేర్పే జీవితాన్ని గురువుగా భావించడం, వెన్నెల్లో విహరిస్తున్నా మాటల అమృతాన్ని మది నిండుగా గ్రోలడంలో ఓ రకమైన తీయని విరహాన్ని చెప్పడం, మనసు కొలనులో స్వప్నసుమాలను, చేజార్చుకున్న స్మృతుల మూటల వేడుకులాటలు, రెప్పలా మాటున దాగిన కలల మంత్రంనగరి మర్మాన్ని ఛేదించడం, కాలాన్ని పట్టి ఆపేసిన జ్ఞాపకాల డైరీని, అల కల  దూరాల తీరాలని,నిశీథి సుమాలను ఏరి వెన్నెల నవ్వులకివ్వడం, మది వేదన శిశిరాన్నిదాటి ఆశతో పోల్చడం, కలిసిన క్షణాలన్నీ అందెల మువ్వల నవ్వులే అని, దైన్యాన్ని దాటి ధైర్యాన్ని అందుకోవడం, మౌన ధ్యానంలో వరమైన ప్రేమని, విధి పంపకాలను అప్పగింతలుగా, హృదయపు తికమకలను, మనోనేత్రపు మనసును, ప్రక్రుతి, సనాతన ఆవర్తనాలను, సెలయేటి గలగలలు, మబ్బు గిన్నెలు తొలకరి వర్షపు పూలజల్లులను, ఆకులపై అలరాలే చినుకుల ముత్యాలను, పాత పరిచయాన్ని పడే పడే పలవరించడం, చిగురాకు సవ్వడిలో పూమొగ్గల పరిమళాన్ని ఆస్వాదించడం, తలపుల తాకిడిని పెనుగాలికి రాలిపోయే పూలతో పోల్చడం, నది నడకలను,  రాకను, పోకను కూడా సంధ్యానాదంతో పోల్చడం చాలా చాలా బావుంది. కదిలే మేఘాలను, పొద్దుపొడుపుల అందాలను, చీకటి దుప్పటిలో వెన్నెల నక్షత్రాలను, జ్ఞాపకాల తుంపర్లను, ప్రేమలో విజయ కేతనాన్ని,  ధీరత్వాన్ని జీవితంలో ఆటుపోట్లకు వెరవని మనసని చెప్పడం, పొగడ్త మంచిదికాదని, సాగర సంగమం జీవితమని, పున్నమి, కలువల అనుబంధాన్ని, కలల నిరీక్షణలో వేసారిన కనురెప్పలకు,  రెప్పల పరదాలను  వేయడం చాలా అద్భుతమైన భావం. 
రెప్పల పరదాలను వేసేసాను...
కనుల సౌధానికి,
నీ కలలను గుట్టుగా దాచుకుందామనే..!!

ఇలాంటి ఎన్నో అద్భుతమైన త్రిపదలు ఈ సంపుటి నిండా పరుచుకుని మనలను ఆపకుండా చదివిస్తాయనడంలో సందేహం లేదు. అన్ని సమీక్షించడం కన్నా చదవడం బావుంటుంది. ఓ చక్కని తుషార మల్లికను అందించిన సిరి వడ్డేకి మరోసారి మనఃపూర్వక అభినందనలు. 

మంజు యనమదల 
విజయవాడ 


సంకురాతిరి సంబరాలు...!!

                                 సంకురాతిరి సంబరాలు...!!           

            ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. డిసెంబర్ వచ్చింది అంటే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరికి సంబరమే. పల్లెటూర్లో పెరిగిన మాకైతే మరీనూ. అప్పటి సరదాలు, సంతోషాలు గుర్తు చేసుకుంటూ ఇప్పుడు యాంత్రికంగా జీవితాలు గడిపేస్తున్నాము.
               మా ఊర్లో అయితే పొలాల్లో వరికుప్పలు, వడ్ల రాశులు, చిన్న చిన్న మినుము, పెసర మొక్కలు, గడ్డి వాములు  పొలాల్లో సందడి చేస్తూ ఉంటే, ఇక ఇళ్ళ దగ్గర ముద్దబంతి, చామంతి, కారబ్బంతి, సీతమ్మవారి జడబంతి వంటి పులా మొక్కలతోప్రతి లోగిలి, సంక్రాంతి ముగ్గులతో గుమ్మాలు,  ఆ ముగ్గుల్లో ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు వాటి అలంకారాలతో వాకిళ్లు కనువిందు చేయడం ఇప్పటికి ఓ మధుర జ్ఞాపకమే.
               చదవడానికి తెల్లవారుఝామున లేవని మేము పండగ శెలవల్లో నాలుగింటికే లేచి ఆ చీకటిలో భయం లేకుండా ఆవులు పొడుస్తాయేమోనని కూడా లెక్క చేయక ఆవుపేడ కోసం వెళ్ళడం, గొబ్బెమ్మలు చేసి వాకిట్లో ముగ్గుల్లో అందంగా అమర్చడం, ధనుర్మాసంలో రామాలయంలో తెల్లవారుఝామున పంచే ప్రసాదాల కోసం పరిగెత్తడం, చలి కాచుకోవడానికి చలిమంటల దగ్గర చేరడం, ఆ చలిమంటలో వరిగడ్డి వేసినప్పుడు వడ్ల పేలాలు ఏరుకోవడం లాంటి బోలెడు జ్ఞాపకాలు తడుముతూనే ఉంటాయి ఇప్పటికి కూడా.
             ఇంట్లోవాళ్ళు దులుపుళ్ళు, కడుగుళ్ళతో మొదలుబెట్టి నానబెట్టిన బియ్యం పిండి రోట్లో రోకళ్ళతో దంపడం, జల్లించడం, ఆ పిండితో చలిమిడి చేయడానికి పాకాలు చూడటం, నేతి అరిసెలు నొక్కడం, బూందీ లడ్డ కోసం బూందీతో పాటు మేము మిరపకాయ్ బజ్జిలు వేయించుకోవడం, చెక్కలు, చక్కిడాలు మొదలైన పిండి వంటలు మెక్కడం, భోగి మంటలు, భోగి  స్నానాలు, బొమ్మల కొలువులు, చిన్న పిల్లలకు భోగిపళ్ళు పోయడం, కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు, కబడ్డీ ఆతల పోటీలు, పండగ పేకాటలు ఇలా చాలా సరదాగా గడిచిపోయేది సంక్రాంతి. కొన్ని సంవత్సరాల క్రిందట జరిగిన సంక్రాంతికి మా తాతయ్యనానమ్మల కుటుంబం అంతా మా ఇంటి దగ్గర చేరి ఆడిన అంత్యాక్షరి, పిల్లలు, పెద్దలు అని లేకుండా అందరమూ చేసిన అల్లరి, సముద్ర స్నానాలు, చూసిన అర్ధరాత్రి టూరింగ్ టాకీస్ లో సినిమా, అందరం కలసి చేసిన భోజనాలు ఇప్పటికి నిన్నే జరిగినట్లుగా అనిపించడం అంటే బహుశా ఆ అనుబంధాలలోని దగ్గరితనం కావచ్చు.
              మన పెద్దలు మనకు మిగిల్చిన ఆస్తులు ఏమైనా ఉన్నాయి అంటే అవి ఈ మరిచిపోలేని అనుబంధపు ఆనవాళ్ళని నేను చెప్పగలను. తమకు తామే సమయాన్ని కేటాయించుకోలేని దీనస్థితిలో ఇప్పుడు జీవితాలు చాలా వేగంగా వెళ్లిపోతున్నాయి. మనం పుట్టి పెరిగిన మన ఊరుని చూడటానికి, ఆప్యాయంగా వినిపించే ఆ పల్లె పలకరింపులు కోసం కనీసం ఒక్కసారైనా మన అనుకున్న మనవాళ్ళ కోసం ప్రతి ఒక్కరు తమ తమ పరిమిత కుటుంబాలను తీసుకుని ఉమ్మడి కుటుంబాల సాంప్రదాయపు పండుగల సంతోషాలను ఆస్వాదించాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు మన తరువాతి తరాలకు కూడా అందించాలని కోరుకుందాం.
ఇంతకీ మా ఉరి పేరు చెప్పనే లేదు కదూ .... నరసింహపురం, కోడూరు మండలం, దివిసీమ అండి.. ముచ్చటైన పల్లెటూరు మాది. 

28, జనవరి 2018, ఆదివారం

ఏక్ తారలు...!!

1.  ఆస్వాదనా అరుదైనదే_మౌనం స్వర పరచిన శబ్దానికి...!!

2.  ఆత్మీయ స్నేహ సరాగమది_ఆనంద రాగం మనదైనదని...!!

3.  అక్షరాలు అక్షయాలే_మనసాకాశాన్ని అద్దంలో చూపిస్తూ...!!

4.   నిరాశ నీరవమైంది_స్తబ్ధతను ఛేదించిన ప్రేమ పలుకులకు... !!

5.  సరిగమలూ సమాయత్తమౌతున్నాయి_మౌనస్వరాలకు బాణీలు కట్టాలని...!!

6.  గాత్రమూ మధురమే_గుప్పెడుగుండె సవ్వడుల స్వరాల జతలో...!!

7.   భావాలకూ సంబరమే_మనసాక్షరాలు మనవని తెలిసి...!!

8.  ఇరు ఆత్మల సంధానమది_మమేకమైన మనసుల అంత:కరణ సాక్షిగా...!!

9.   గాయమే గేయమైంది_మనసు రాసిన కవనంతో కలిసి....!!

10.  అక్షరాలొదిగి పోయాయి_భావాల సారూప్యతకు దాసోహమై...!!

11.  సాయంత్రాలను స్వాగతిస్తున్నా_రాతిరి కలలతో కలిసిన రేపటి కోసం...!!

12.   రెండు ఆత్మలొకటిగా చేరిన క్షణాలు_బింబ ప్రతిబింబాలకు తావులేకుండా...!!

13.  రాహుకేతువుల కోపం కాసేపే_జీవితానికి గ్రహణం వీడేదెన్నడో...!!

14.  మరణాన్నీ ఆస్వాదించాలనుకున్నా_జీవితపు మరో పార్శ్వాన్ని చూడాలని...!!

15.   మది మౌనం వీడింది_చెలిమి నిజాయితీని గుర్తెరిగి...!!

16.   పరిమళం నీ నెయ్యానిదే_కయ్యానికి చోటివ్వని సాంగత్యం మనదైనప్పుడు...!!

17.  మరు మల్లియవే నీవు_నిత్యం చెలిమి పరిమళాలు వెదజల్లుతూ...!!

18.  అక్షరాలు ఆడుకుంటున్నాయి_భావాలు మాలిమి అయ్యాయని...!!

19.   కలత పడ్డ మనసు_కలవరాన్ని మరచింది నీ సాన్నిహిత్యంలో...!!

20.  మనసేనాడో మౌనమైంది_నీలో నేను లేనని తెలిసి....!!

21.  నా మనసు నీతోనే ఉందిగా_మౌనాన్ని కూడ మాటల్లో ముంచేస్తూ..!!

22.  మౌనాన్ని శలవడిగింది మనసు_మన మధ్యనున్న బంధానికి దాసోహమై...!!

23.  మనసుకు మనసైంది_నీ మాటల మధువు గ్రోలి....!!

24.   విరిసిన నవ్వులతో జత చేరాయి_చెక్కిలిపై ఆనందభాష్పాలుగా మారి...!!

25.  అక్షరాలన్నీ సమ్మెాహన సమ్మిళితాలే_మన భావాల సంఘర్షణకు చిక్కి...!!

26.   కోపమే శాపమౌతుంది_మనసు మధన పడుతూ రుథిరాన్ని చిమ్ముతుంటే...!!

27.  తలపులను తడియారనీయడం లేదు_జ్ఞాపకమై వెన్నాడుతూ...!!

28.   అభిమానం గెలిచిందట_బురద నుండి కమలం బయట పడినప్పుడు...!!

29.  రేరాజు స్వాగతించాడట_వెన్నెల్లో వన్నెల కలువను...!!

30.    పండు వెన్నెల పండగ చేసుకుందట_కలువల మధ్యన పూర్ణ చంద్రుని చూసి...!!

26, జనవరి 2018, శుక్రవారం

తెర చాటు...!!

మనసు మాటలు దాగిన
మౌనపు సంకేతాలు మూగబోయినా
కనుల చాటున ఇంకిన
కలల దారులు మూసుకుపోయినా
మమతలెరిగిన బాంధవ్యాలు
ఆత్మీయతలకై ఎదురుచూస్తున్నా
మేలిముసుగు తొలగని మగువ
దాగాలని తెర చాటుగా చేరినా
దాయలేని ఊహల ఊసుల
సందడి చేస్తున్న సవ్వడి
ఇంతి మెామున వెలుగుతున్న
ఇంద్రధనుస్సును ఆవిష్కరించె...!!

22, జనవరి 2018, సోమవారం

ఏకైక సాక్ష్యం...!!

వెలితి నిండుకుంది
మది అంతటా
శూన్యాన్ని చుట్టేయాలన్న
తాపత్రయంలో పడి

అక్కరకు రాని
అనుబంధాలు వెక్కిరిస్తూ
ఎడారి తాయిలాన్ని
ఎడదకు పంచుతున్నాయి

కలలు ఆవిరై
కన్నీరింకిన కంటి చెలమ
జ్ఞాపకాల ఊటకై
గతాన్ని తవ్వుతోంది

ఎదురైన వాస్తవం
ఏకాకిగా ఎదురుతెన్నులు చూస్తూ
రాలిపోతున్న జీవితాలకు
మిగిలిన ఏకైక సాక్ష్యమైంది....!!

11, జనవరి 2018, గురువారం

రెక్కల కవచం..!!

జీవితాన్ని ఇష్టపడిన నేను
నిన్ను అంతే ఇష్టపడుతున్నా

పక్కనే ఉంటూ పలకరిస్తావు
పర్లేదు రమ్మంటే పారిపోతున్నావు

అలసిన మదికి సాంత్వనగా
అక్కున చేర్చుకోవాలన్న ఆరాటం నీది

విడివడని అనుబంధాల నడుమ
విడవలేని అగచాట్లు నావి

జ్ఞాపకాల తాయిలాలు ఊరిస్తూ
గతమూ ఘనమైనదని వాపోతున్నాయి

నువ్వు చేరువౌతున్నావంటే వాపోయే
కన్నీటి పలకరింపుల పలవరితలు

రెప్పలార్పే క్షణాల రెక్కల కవచం
ఆపలేని ఆయువు కేరింతల్లో చిన్నబోతోంది...!!

9, జనవరి 2018, మంగళవారం

రాధామాధవీయం...!!

ప్రేమ పారవశ్యంలో
అనురాగ మధువులు గ్రోలుతూ
సాన్నిహిత్యపు సంతసంలో
సరాగాల మధురిమల
సుస్వర వేణునాదపు మైమరపులో
ప్రణయ ప్రబంధ ప్రియలాలసులు
రాధామాధవులు..!!

2, జనవరి 2018, మంగళవారం

ఈ తపనెందుకో ....!!

కథలెందుకో
కలలెందుకో
మరులెందుకో
మమతలెందుకో
కనులెందుకో
కన్నీరెందుకో
మాటలెందుకో
మౌనమెందుకో
భయమెందుకో
భారమెందుకో
వలపెందుకో
వలలెందుకో
పాటెందుకో
పగుగెందుకో
ప్రేమెందుకో
పగలెందుకో
మనసెందుకో
మరపెందుకో
జీవమెందుకో
జీవితమెందుకో
గతమెందుకో
జ్ఞాపకమెందుకో
ఎందుకో
నీకెందుకో
ఈ తపనెందుకో ....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner