30, జూన్ 2015, మంగళవారం

బంధీలుగా చేయలేక...!!

నిశ్చలత కదులుతోంది అటు ఇటూ
మనసు మౌనానికి మాటలు వస్తే
రెప్పల మాటున కదిలే కలలకు
రూపం తెలియక...

అలజడికి విరామమే తెలియక  
అంతరంగానికి ఆలోచనల సంద్రాన్ని
అమర్చిన విధాత రాతకు విస్మయాన్ని
చిందించడం తప్ప...

ఒలికిన కన్నీటిలో వేల భాష్యాలు
మది భారాన్ని మోస్తున్నందుకేమో
దిగులు బరువుకు ఒరుగుతూ
నిండు చెలమలుగా...

పొందిక లేని భావాలు దొరకక
అల్లాడుతున్నాయి అక్షరాలు
ఎదలో నిండిన అసంతృప్తికి
జ్ఞాపకాలను బంధీలుగా చేయలేక...!!

27, జూన్ 2015, శనివారం

అభినందనల శుభాకాంక్షలు....!!

అవార్డులు అంటే అడిగితే వచ్చేవి కాదని ప్రతిభకు ఇచ్చే గౌరవం అని మరోసారి నిరూపించారు శ్రీ కొండ్రెడ్డి వెంకటరెడ్డి
గారు ... ఎవరు సాహసించని కత్తి మీద సాము వంటి విమర్శనా రంగంలో తెలుగు విశ్వ విద్యాలయం వారి నుంచి కీర్తి పురస్కారం అందుకున్న శుభ సంధర్బంలో ఇవే నా అభినందనల శుభాకాంక్షలు....!!

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ముప్పది ఎనిమిదవ భాగం....!!

గత ముప్పది ఏడు వారాలుగా నిరంతరాయంగా సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్లలో అ ఆ ల నుంచి ఱ వరకు నాకు తెలిసిన నేను తెలుసుకున్న అన్ని ముచ్చట్లు చెప్పేసాను.. క్రిందటి వారం ఎర్రని సాహిత్యం విప్లవ సాహిత్యం గురించి నాలుగు మాటలు చెప్పుకున్నాం.. ఈ వారం మన జీవితంలో అతి మధురమైన బాల్యం మనల్ని ఎప్పటికి వెన్నాడుతున్నట్లే ఉండే ఆ జ్ఞాపకాల మధురాలను గుర్తు చేసుకుంటూ బాల సాహిత్యం గురించి కొద్దిగా చూద్దాం...
ఈ లోకానికి పరిచయమవుతూనే అమ్మ లాలి పాటలు, జోల పాటలతో పాటల సాహిత్యానికి మైమరచే అద్భుతమైన బాల్యం మనకు ఆ దేవుడు ఇచ్చిన వరం... పుడుతూనే అమ్మ పాటతో మన పసితనం మొదలై సాహిత్యానికి శ్రీకారం చుడుతుంది... చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బాలజ్యోతి.. మొదలైన కథల పుస్తకాలతో దిన దిన ప్రవర్ధమానం చెందుతూ ఆటల పాటల బాల సాహిత్యం అలరాలుతుంది పసితనంలో...

ప్రతి పత్రికలోనూ బాల సాహిత్యానికి ఓ ప్రత్యేకత ఉంటుంది... దాని బట్టే మనకు అర్ధం అవుతుంది .. బాల సాహిత్యానికి ఎంత ప్రాముఖ్యత ఉందో... చాలా మంది రచయితలు / రచయిత్రులు బాల సాహిత్యానికి పెద్ద పీట వేశారు... నాటకాలు, నాటికలు బాలలకు సంబంధించి ఎన్నో వచ్చాయి... ఈనాడు బాల రచయితలు కూడా చక్కని సాహిత్యాన్ని అందిస్తున్నారు... తరాలు మారుతూ పోతున్నాయి.. నాగరికత కొత్త పుంతలు తొక్కుతోంది.. ఆధునికత, సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందినా పసితనాన్ని వదలని జ్ఞాపకాలు మన జీవితంలో ఎప్పుడు మనతోనే ఉంటాయి.. వెన్నెల్లో ఆరుబయట అందరు పడుకుని చెప్పుకున్న కథలు, పాడుకున్న పాటలు, ఆడిన ఆటలు మరచి పోయేవారు ఎవరు ఉండరు... తిరిగిరాని బాల్యాన్ని మళ్ళి మన కళ్ళ ముందుకు తెచ్చేది ఈ బాల సాహిత్యమే... అందమైన బాల్యాన్ని అందించే బాల సాహిత్యం ఎప్పటికి అజరామరమే...

గత ముప్పది ఏడు వారాలుగా మీ అందరితో నాకు తెలిసిన నేను తెలుసుకున్న తెలుగు సాహిత్యపు కబుర్లను ... తెలుగు సాహితీ ముచ్చట్లుగా మీ అందరితో పంచుకునే అవకాశాన్ని నాకు ఇచ్చిన సాహితీసేవకు కృతజ్ఞతలతో... నా ముచ్చట్లను ఆదరించిన మీ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు... !!

జ్ఞాపకాలు వెళిపోతున్నాయి...!!

జ్ఞాపకాలు వెళిపోతున్నాయి రోదిస్తూ
అమ్మ చేతిని వదలి వెళ్ళే పసికూనలా
నాన్న వేయించిన అడుగులను వదలలేని
బుడి బుడి నడకల తడబాటులా
నవ్వులు మరచి అలసిన ఆనంద భైరవిలా
గతాన్ని నిలువరిస్తూ గాయాన్ని రేపుతూ
కన్నీటిలో కరుగుతూ పన్నీరై చిప్పిల్లుతూ
రాలిన చుక్కల వెలుగులా మాసిన రేపటి పొద్దులా
శీతలానికి వణుకుతూ వెచ్చదనానికై పరుగులు పెడుతూ
తరలిపోతున్నాయి అపనిందల తాకిడికి తట్టుకోలేక
రాలిపడుతున్నాయి రెక్కలు తెగిన పక్షుల్లా
రుధిరాన్ని వర్షిస్తున్నాయి రక్తాశ్రువులను దాయలేక
చెలిమిని వీడి చితికి చేరుతున్నాయి కాలుతున్న జీవితాలకు
సాక్ష్యాలుగా నిలుస్తూ శిధిలాలలోనైనా చిరంజీవులుగా
మిగిలిపోవాలన్న చరమ గీతానికి చేదోడు వాదోడుగా....!!

24, జూన్ 2015, బుధవారం

మీ ధీమా గెలిచింది...!!

ముఖ పుస్తక నేస్తాలకు,
                                 గత కొన్ని రోజులుగా జరుగుతున్న వాదోపవాదాలు మీ అందరికి తెలిసినవే.. దీనికి అసలు మూల కారణమైన రమణ శ్రీ ఎవరో ఇంత వరకు తెలియలేదు కాని ఆయన పెట్టిన పోస్ట్ ల మూలంగా ఆయన అసభ్యంగా మాట్లాడిన ఆడ కూతుళ్ళనే కాకుండా సదరు కొందరు ఆడ కూతుళ్ళే అంత కన్నా ఘోరంగా అనడం కూడా చూశాము.. దీని మూలంగా కొందరు చిన్నపిల్లలు పాపం వాళ్లకి ఏమి తెలియదు లెండి మమ్మల్ని అన్నప్పుడు తెలియలేదా అని అడిగారు .. నిజమే అది మీరు అలా అడిగే చనువు ఎందుకు ఇచ్చారు.. అప్పుడే ఎందుకు బయట పెట్టలేదు.. తప్పుని ఎప్పుడు ఎవరు సమర్ధించరు... ఇద్దరి మధ్యలో గొడవ వచ్చినప్పుడు చాతనయితే సరిదిద్దాలి లేదా పక్కకు వెళ్లిపోవాలి అంతే కాని ఆజ్యం పోసి అందరి మనసులను చిన్నాభిన్నం చేయకూడదు.. ఒకప్పుడు కవితల పోటీలకు బహుమతుల విషయంలో గొడవ ... ఇప్పుడు ఇలా ... దీని మూలంగా కొన్ని ప్రాణాలు విల విలలాడుతున్నాయి .. వాటికి ఏదైనా నష్టం జరిగితే ఎవరు బాధ్యులు.. సదరు ఈ గొడవకి ఆద్యులు రమణ శ్రీ నా.. లేక స్పందించిన మాలాంటి వారా.. లేక రమణ శ్రీ నే అని అనుమానపడుతున్న వారా.. చక్కని సాహిత్యం వెల్లి విరియాల్సిన ముఖ పుస్తకంలో ఈనాడు చదుకున్నా  సంస్కారం మరచిన మాటలు చూడాల్సి వస్తోంది.. అయ్యా రమణ శ్రీ గారు మీరు ఎవరో తెలియదు కాని ప్రతి ఒక్కరిని మనస్తాపానికి గురి చేసిన మీ తెలివికి అభినందనలు... ఎవరు మిమ్మల్ని కనుక్కోలేరనే మీ ధీమా గెలిచింది... మీ తెలివిముందు  మా చాతకాని తనం తలను వంచింది... మీ కోరిక నెరవేరింది.... మంచి చెడు ఆలోచించలేని మా విచక్షణా రహిత ఆవేశాల ముందు...
అంతే కదా నేస్తాలు... !!

23, జూన్ 2015, మంగళవారం

ప్రోత్సాహక బహుమతి.....!!

పోటీలకు అంటూ పెద్దగా రాయని నేను రాసిన కవితకి కువైట్ ఎన్నారైస్  వారు పెట్టిన కవితా పోటీలో ప్రోత్సాహక బహుమతికి నోచుకున్న నా కవిత ఈ క్రింది లింక్ లో చూడండి....

 

కువైట్ ఎన్నారైస్ కవితల పోటీ కన్సోలేషన్ బహుమతి విజేత మంజు యనమదల గారి వివరాలు

19, జూన్ 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ముప్పది ఏడవ భాగం....!!

వార వారం సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్ల ప్రయాణంలో ఇప్పటి వరకు తెలుగు సాహిత్యం పూర్వాపరాలు చాలా వరకు తెలుసుకున్నాము... తెలుగు సాహిత్యంలో ఒకటైన విప్లవ సాహిత్యం గురించి ఈ వారం చూద్దాం...
ఈ విప్లవ సాహిత్యంలో భావావేశంతో పాటుగా జనాన్ని చైతన్య పరిచే గుణం కూడా ఉంటుంది... విప్లవ సాహిత్యంలో కూడా కథలు, కవితలు, కధానికలు, వచనం, నవల, సిని సాహిత్యం ఇలా అన్ని కోణాలు ఉంటాయి.... మనసులో నుంచి పుట్టేది భావావేశం... జరుగుతున్న సమస్యలకు మనసు స్పందిస్తే పుట్టేది విప్లవం... సమాజానికి తప్పును వేలెత్తి చూపేది విప్లవ... సమస్యలో మరో కోణాన్ని చూపిస్తూ మనిషిని తద్వారా సమాజాన్ని చైతన్య పరిచేది విప్లవసాహిత్యం... అక్షరాన్ని ఆయుధంగా మలిచి పోరాటాన్ని సాగించిన ఎందఱో నాయకులు, అమర వీరులు ఈనాడు మన మనస్సులో నిలిచిపోయారంటే అతిశయోక్తి ఏమి లేదు...
ఉద్యమమ నుంచి, సాజాజిక జన జీవనం నుంచి, సమస్యల నుంచి ఉద్భవించేదే విప్లవ సాహిత్యం ... ఇది జనానికి దగ్గరగా వచ్చినంతగా ఇతర సాహిత్యాలు ఈ కాలంలో రాలేదనే చెప్పాలి... మన అందరికి తెలిసిన మహా కవి శ్రీ శ్రీ మహా ప్రస్థానం ఇప్పటికి ఎందరి హృదయాల్లో సజీవంగా నిలిచి పోయిందో మనకు తెలుసు... సినీ పాటల రచనలో కూడా తనదైన శైలిని సృష్టించారు శ్రీ శ్రీ...సమాజంలో నలుగుతున్న సమస్యలతో ఎన్నో విప్లవ సినిమాలు వచ్చాయి ...దొరల ఆధిపత్యానికి అడ్డం పట్టిన చిత్రాలు, ఉద్యమాల నేపద్యాలలో వఛ్చిన చిత్రాలు అనేకం... విప్లవ రచయితలూ కాళోజి గారు, వరవరరావు గారు విరసం స్థాపనలో ముఖ్యులు... మన అందరికి సుపరిచితులు గద్దర్ గారు ఎంత గొప్ప విప్లవ కవో ఆయన పాటల గొంతు వింటే తెలిసిపోతుంది... విప్లవ  సాహిత్యం, జానపద సాహిత్యం జనాల్లో చొచ్చుకు పోయినంతగా ఇతర సాహిత్య ప్రక్రియలు చుచ్చుకు పోలేదనే చెప్పవచ్చు...

అక్షరానికి ఉన్న శక్తి అపారం. అధికారిక శాసనాన్ని స్థిరపరిచినా, ‘అనధికార శాసనకర్త’గా వ్యవహరించినా సాహిత్యం పోషించిన పాత్ర పదునైనది. ‘సాధారణ మాటలకు ఇంత అసాధారణ సౌందర్యం, అలౌకిక ఆకర్షణ ఎలా వచ్చాయి.. అని పంక్తుల మధ్యలోకి ఆశ్యర్యంగా చూస్తూ ఉండిపోయేవాడి’నని తన తొలి పఠనానుభవాన్ని గురించి గోర్కీ రాసుకున్నాడు. అందుకేనేమో సాహిత్యం వెంట గుర్తింపు, కీర్తి వస్తాయి. సమాజంలో సాహిత్యకారులకు ఎంతో కొంత గౌరవం లభిస్తుంది. కళాసాహిత్య పోషకులైన రాజులను చరిత్ర కూడా తగు రీతిలో గుర్తుపెట్టుకుంది. కళాసాహిత్యాల అసలైన సృష్టికర్తలు మాత్రం చరిత్ర ఎరుకలో ఉండరు...

సాహిత్యం దేని కోసం? దాని పరమార్థమేమిటి?’ వంటి ప్రశ్నలు బహుశా మన సమాజంలో ఇప్పుడు కొత్తగా వేసుకోనక్కర్లేదు. రాజాస్థానాల నుండి, అధికార పీఠాల నుండి స్వేచ్ఛ పొందిన సాహిత్యం, మందిలో కలిసిన సాహిత్యం, తలెత్తుకు నిలబడి ధిక్కార పతాకను ఎగరేసిన సాహిత్యం సమాజానికి ఒక భరోసానిచ్చింది. తెలుగు సాహిత్యకారులు ఆ వారసత్వాన్ని సగర్వంగా స్వీకరించారు. అక్షరం ఆధిపత్యానిది కాదు, అశేష ప్రజాసమూహాలకు ప్రాతినిథ్యం వహించేదనే దశకు చేరుకోవడంలో ఎంత సంఘర్షణ ఉందో నేటికీ నడుస్తున్న చరిత్రే. సాహిత్యాన్ని సాహిత్యంగానే చూడాలంటే, రాజకీయం కాని వ్యక్తీకరణ ఏదీ ఉండదని కుండ బద్దలు కొట్టి చెప్పాయి మన సాహిత్యోద్యమాలు. ఎన్ని వాదాలున్నా తెలుగు సాహిత్యం పీడిత సమూహాల పక్షాన నిలిచింది. దేశంలోనే కాదు, ప్రపంచంలోని సకల దుర్మార్గాలను ప్రశ్నించింది. సామ్రాజ్యవాద మార్కెట్‌ చేతిలో పరాయీకరణకు గురవుతున్న మనిషిని గురించి దు:ఖించింది. తెలంగాణ నుండి పాలస్తీనా దాకా ఆధిపత్యాన్ని, హింసను, అణచివేతను ప్రశ్నించింది. అట్టడుగుకు నెట్టివేయబడ్డ సమాజాల సాంస్కృతిక వ్యక్తీకరణకు అక్షరరూపమిచ్చింది.

సాహిత్యకారులు అంతకన్నా ఇంకా ముందుకే నడిచారు. ఎన్నో సార్లు నేరుగా ఉద్యమ గొంతుక వినిపించారు.
విద్యార్థి, మేధోరంగాన్ని ప్రభావితం చేశారు. ప్రగతిశీల భావాలకు వాహికలయ్యారు. ప్రగతిశీల రచయితలు అని వేరుగా కాక రచయితంటేనే ప్రగతిశీలవాది అనే భావన తెలుగు సాహితీలోకంలో స్థిరపడిరది. భాషా సాహిత్యాలను పాలకవర్గం చేతుల నుండి తప్పించి ప్రజా ఉద్యమాలు తమ సొంతం చేసుకున్నాయి. ఎన్నో వేదికలు, భిన్న ప్రాపంచిక దృక్పథాలు, భావ సంఘర్షణలు మామూలే. ఎన్నివైపుల నుండి వ్యవస్థతో, రాజ్యంతో ఘర్షణ పడితే సామాజిక పురోగతికి అంత ప్రయోజనం. పురోగామి శక్తులను, భావజాలాలను అయితే అణచివేయడం, లేదా వారి చేతుల్లోకి తీసుకోవడం చేయడం పాలకవర్గాలు నిరంతరం చేసే పని. మొదటిది సూటిగా ఉంటుంది. రెండోది అనేక ముసుగులు వేసుకొని ఉంటుంది....

అన్యాయాన్ని ఎదిరించే ధైర్యాన్ని అక్షరానికి అందించేదే విప్లవ సాహిత్యం... పదునైన భావాలను శరాలుగా సంధించడానికి... నిరాయుధమైన అక్షరమే వేల శరాలుగా మారి చేతనాన్ని కలిగిస్తుంది.. చెఇతన్యాన్ని రగిలిస్తుంది... అది విప్లవానికున్న శక్తి.... వేల ఉద్యమకారుల గొంతుల్లో భువనం బద్దలయ్యేలా వినిపించే ఒకే ఒక శక్తి... ఆయుధం విప్లవం... కనిపించని ఎర్రదనాన్ని అక్షరంలో కనిపింప చేసేదే విప్లవ సాహిత్యం....

ఇప్పటికే విప్లవ సాహిత్యం గురించి చాలా చెప్పేసుకున్నాం... మిగిలిన ముచ్చట్లు మళ్ళి వారం....

ఈ ముచ్చట్లు అరుణతార సంపాదకీయ సౌజన్యంతో.....
వచ్చే వారం మరికొన్ని సాహితీ ముచ్చట్లతో .....
 

17, జూన్ 2015, బుధవారం

ఏక్ తారలు....!!

1. అసూయ నల్లపూసైంది_అంతులేని నీ ఆప్యాయత ముందు
2. కోపానికి అసూయ వేస్తోంది_చెరగని నీ చిరునవ్వును చూస్తూ
3. ప్రేమకు మనసైంది_అసూయెరుగని నీ చెలిమికి ముగ్ధమౌతూ
4. విషాదానికి చిరునామా కరువైంది_నీ చెలిమి నాతో చేరాక
5. మనసుకి మరపు కరువైంది_నీ జ్ఞాపకాల అల్లరికి
6. మౌనానికి మాటలెక్కువైయ్యాయి_నీ సాన్నిహిత్యంలో నేనున్నప్పుడు
7. రాగానికి పరవశం_నీ సరాగానికి మైమరచి
8. సంతోషానికి స్వాగతాలే అనునిత్యం_స్నేహ సంతకాలు వీడని బంధాలుగా
9. నీ ఆప్యాయతలో బందీగా మారింది_వెల లేని మమతకు తలను వంచుతూ
10. మనసుతో చూడరాదూ_తగవుకు చోటే ఉండదు
11

ఈ సమాధానం సరిపోతుంది కదూ.... !!

నేస్తం,
         ఎలా మొదలుపెట్టాలా అని ఓ చిన్న సందిగ్ధం... బాగోగులు చెప్పాలంటే ఏమి చెప్పాలో తెలియని పరిస్థితి.... ఈ ముఖ పుస్తకానికి ఎందుకు వచ్చాను... వస్తే వచ్చాను... ఈ సమూహాల గోల నాకెందుకు.. నా పని నేను చూసుకుని పోవచ్చు కదా... నేస్తాల కోసం వచ్చి ఇలా కూరుకుపోయాను కాని పేరు కోసం ప్రతిష్ట కోసం కాదు... బ్లాగులో రాసుకునే వాళ్ళు ముఖ పుస్తకాని కి రాకూడదా... నన్ను ఎవరూ ముందుకి తేనక్కరలేదు... నాకు పేరు వద్దు ప్రతిష్ట వద్దు... నా మానాన నన్ను వదిలితే చాలు.... నేను నాకు అనిపించిందే రాస్తాను అది తప్పు అయినా ఒప్పు అయినా... ఎవరి కోసమో వారు చెప్పినట్టు రాయను...  ఇష్టం లేని వారు చదవనక్కర లేదు.. స్పందనలు తెలుపనక్కరలేదు... నా నైజం నచ్చని వారు నిరభ్యంతరంగా స్నేహాన్ని వదలివేయవచ్చు... కష్టమైనా నష్టమైనా నేను నాలానే ఉంటాను... నా మీద అవాకులు చవాకులు వాగేవాళ్ళు ధైర్యం ఉంటే నా ఎదురుగా మాట్లాడండి సమాధానం చెప్తాను అంతే కానీ వెనుక వాగడం కాదు.. ఏ సమూహాన్ని నేను నా పేరు కోసం వాడుకోలేదు... అది నేను తెలిసిన అందరికి తెలుసు... నాకు చాతనైంది చేసాను కాని ఎప్పుడు నా స్వ విషయాలకు ఉపయోగించుకోలేదు... మరొక విషయం వేరే వాళ్ళ వివరాలు తెలుసుకోవడానికి నాటకాలేయమని నేను ఎవరికీ ఏ విధమైన సలహాలు సూచనలు ఇవ్వలేదు... నా దగ్గర ఒకరి గురించి చెప్పే వారు నా గురించి మరొకరికి చెప్తారని తెలుసు కాని మరీ ఇంతగా దిగజారి పోతారని ఊహించలేదు... ఒప్పుకున్న పనిలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చేయకుండా వదలిపెట్టలేదు .. పెట్టను కూడా... స్టేజ్ లు ఎక్కాలని ఆర్భాటాలు చేయాలని అనుకుంటే ఈరోజు ఇలా ఉండను .... నేను తెలిసిన అందరికి నా గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కాని కొన్ని అనుకోని కారణాల వలన ఈ స్వోత్కర్ష ఇలా రాయాల్సి వచ్చింది ...
నేస్తం నీకు కొత్తగా నా గురించి చెప్పాల్సింది ఏమి లేదు... చెప్పడానికి నీకు తెలియని నేను కాదు కదా... స్నేహం ముసుగులో, అభిమానం అడ్డుగా పెట్టుకుని మనుష్యుల మనసులతో ఆడుకునే కొన్ని కుటిల మనస్థత్వాలకు ఈ సమాధానం సరిపోతుంది కదూ....

నీ నెచ్చెలి

ఎన్నికలు బహిష్కరించండి అందరు...!!

తాకీదులిచ్చారు ఇక తన్నుకు చావండి... ఇది రెండు తెలుగు రాష్ట్రాల పరిస్థితి... అవినీతి, పరిపాలన, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదు... భారత దేశాన్ని అమ్మగారి కాలి కింద పెట్టినప్పుడే నాయకులుగా చచ్చిపోయారు వాళ్ళు.. ఇక కె సి ఆర్, చంద్ర బాబుల అవినీతి గురించి నాలుగురోజులు ఆగితే అన్ని బయటకు వస్తాయి... అధికారం కోసం వీళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ అసలు నేరస్తులను మర్చిపోతున్నారు... ఒక రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా ఉంటే ఆ రాష్ట్ర ప్రజల అందరి తరపునా నిర్దేశకుడు అని.. చవుకబారు రాజకీయాలు చేసి ప్రజల వ్యక్తిత్వాన్ని నవ్వులపాలుచేయడం కాదు... పదవికి తగినట్టుగా హుందాగా నడచుకోవాలి... రాష్ట్ర సమస్యలు వదలివేసి కుళ్ళు రాజకీయాలు చేయడం అసలే కాదు... చాతనయితే అభివృద్దిలో పోటి పడాలి... మనకు నచ్చిన సెక్షన్లు ఉంచుకోవడము... నచ్చనివి అమలు చేయడానికి కుదరదు దానిలో పనికి రానివి చాలా ఉన్నాయి అంటున్న నాయకులకు ప్రజాస్వామ్యం మీద రాజ్యాంగం మీద ఎంత గౌరవం ఉందో చెప్పకనే తెలుస్తోంది.. పాలకుల తప్పులు సమర్ధించడం కాదు... ప్రజలు చేయాల్సింది... తప్పును ఎత్తి చూపించడం... ఓటుకు నోటు కేసులో నాయకులది కాదు తప్పు... నోటుకు అమ్ముడు పోయిన జనాలది తప్పు... అందుకే ధన ప్రవాహ ఎన్నికలు బహిష్కరించండి అందరు...!!

14, జూన్ 2015, ఆదివారం

సందిగ్ధం....!!

ఎటూ తేలని న్యాయం ఎదురు చూస్తోంది
సందిగ్ధానికి ఎలా తెర తీయాలా అని.... 
దాటిపోయిన కాలంలో కాలిపోయిన గతాన్ని
గాలివాటుకి వదలివేసి వాస్తవాల రూపానికి
వేసిన వెలిసిన రంగుల్లో వెలాతెలాబోయిన
సత్యానికి చేదోడు వాదోడు కాలేక నిలిచిపోయిన
సాక్ష్యంగా మిగిలిన అరకొర జీవితాన్ని
మాసిన అద్దంలో కనిపిస్తున్న అసలు నిజాలను 
భరించలేని నైజాల నిజ స్వరూపాన్ని
దిగిలు దుప్పటిలో దాచేస్తూ
ఇంకిన కన్నీటికి అర్ధాలను చెప్పలేక
మండుతున్న మమతల కొలిమి తాకిడికి
మసిబారుతున్న వెన్నెలగా నిలిచి
చిరునవ్వు చిత్రానికి అలంకారమై చేరి
జీవం లేని వర్ణ చిత్రంగా మిగిలింది....!!

12, జూన్ 2015, శుక్రవారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ముప్పది ఆరవ భాగం....!!

వారం వారం  సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్లలో క్రిందటి వారం ఆశు కవిత్వం గురించి కొంత వివరణతెలుసుకున్నాము... ఈ వారం తెలుగు సాహితీ పద్దతులలో మరొకటైన సినీ సాహిత్యం గురించి కొన్ని వివరణలు చూద్దాం...
అందరికి అత్యంత ఇష్టమైన సినిమాలో ముందుగా ఒకప్పుడు కథకు చక్కని ప్రాముఖ్యముండేది... కథలో పాత్రలకు తగినట్టుగా సంభాషణ, కథను నడిపిస్తూ సన్నివేశానికి తగినట్టుగా చక్కని అర్ధవంతమైన పాటలు, వినసొంపైన సంగీతం, ఇలా ఎన్నో సాహిత్యాల సమ్మిళితంగా చలన చిత్ర సాహిత్యం ఉండేది...
ప్రధానంగా సినీ కథా సాహిత్యం...
ఒకప్పుడు కథలో పాత్రలో లీనమయ్యే నటులు ఉండేవారు.. ఇప్పుడేమో అగ్ర నటులకు అనుగుణంగా కథను రాస్తున్నారు మన రచయతలు.. జానపద, పౌరాణిక, సాంఘిక నేపధ్యాలలో దేనిని తీసుకున్నా ఎంతో అర్ధవంతమైన ఇతివృత్తాలతో చక్కని సందేశాన్ని అందించేవారు... సకుటుంబంగా చూడటానికి, మానసికోల్లాసానికి దోహదపడేవి.... సిని సాహిత్యంలో నవలా సాహిత్యానికి కూడా పెద్ద పీటే వేశారు అప్పట్లో.. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నవలలు ప్రముఖ పాత్రను ధరించాయి పాత కొత్త సినిమాల మేలుకలయికలో...
ఇక సినీ మాటల సాహిత్యం....
ఒక సినిమాకు కథ ఎంత బలమైనదో దానికి అనుగుణమైనదే సినీ మాటల సాహిత్యం... కథ ఔచిత్యం తగ్గకుండా సంభాషణలను రక్తి కట్టించడం కూడా ఓ గొప్ప కళ... దీనిలో నిష్ట్నాతులు ఎందఱో ఉన్నారు మన తెలుగు సినీ సాహిత్యానికి.... అప్పట్లో గొల్లపూడి మారుతీ రావు గారు చక్కని మాటల సాహిత్యానికి తెర తీశారు.. ఆ నేపధ్యంలోనే పరుచూరి బ్రదర్స్ ఎన్నో విజయవంతమైన సినిమాలకు కథా, సంభాషణా సాహిత్యాన్ని తెలుగు తెరకు అందించారు... తరువాతి కాలంలో త్రివ్రిక్రమ్ మాటల పదును మన అందరికి తెలిసినదే... చాలా మంది ఇప్పుడు త్రివ్రిక్రమ్ బాటలోనే నడుస్తున్నారు.. తక్కువ మాటల్లో ఎక్కువ నైపుణ్యాన్ని పలికిస్తున్నారు...
తరువాత అతి ముఖ్యమైన సినీ పాటల / గేయ సాహిత్యం....
 పాత తరం పాటలు ఇప్పటికి జనం నోళ్ళలో నానుతున్నాయంటే అప్పటి పాటల సాహిత్యం ఎన్ని అద్భుతాలు అందించిందో మనకు తేట తెల్లమౌతోంది... ఏ పాటల పోటిలలో మనం చూసినా ఇప్పటి తరం పిల్లలు ఆనాటి పాటలను ఎంత గొప్పగా పాడుతున్నారో అర్ధం అవుతుంది... అది అప్పటి సాహిత్యానికి ఉన్న గొప్పదనం.. కథకు తగినట్టుగా, ఆ సన్నివేశానికి అనుగుణంగా పాటలను రాయగలగడం అంటే మాటలు కాదు... కొన్ని పాటలు వింటూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది ఇంత గొప్పగా ఎలా రాయగలిగారు అని... అది పౌరాణికమైనా, సాంఘికమైనా సన్నివేశానికి తగిన పాటలు రాయడం, వాటికి సంగీత బాణీలు కూర్చడం మామూలు విషయం కాదు.. ఏదో మనం ఓ మూడు గంటలు సినిమా చూసేసి వచ్చేస్తాం... కాని అందులో ఉన్న కథ, మాటలు, పాటలు మనకు చాలా కాలం గుర్తుండి పోయేలా చేయగలిగే సామర్ధ్యాన్ని కలిగిన సినీ సాహిత్యానికి నీరాజనాలు పలుకక తప్పదు... మన పాటల రచయితలల్లో ముఖ్యులు కొందరు

 1. నార్ల చిరంజీవి
 2. ఆచార్య ఆత్రేయ
 3. ఆరుద్ర
 4. అనిశెట్టి సుబ్బారావు
 5. రసరాజు
 6. కొసరాజు రాఘవయ్య చౌదరి
 7. సముద్రాల
 8. శ్రీశ్రీ
 9. మైలవరపు గోపి
 10. జాలాది రాజారావు
 11. మల్లాది రామక్రిష్ణశాస్త్రి
 12. దేవులపల్లి కృష్ణశాస్త్రి
 13. డా.సి.నారాయణ రెడ్డి
 14. డా. మల్లెమాల
 15. సిరివెన్నెల సీతారామశాస్త్రి
 16. వేటూరి సుందరరామ్మూర్తి
 17. దాశరథి
 18. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ
 19. సదాశివ బ్రహ్మం
 20. జ్యోతిర్మయి
 21. జంధ్యాల పాపయ్య శాస్త్రి
 22. దాసరి నారాయణ రావు
 23. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
 24. సామవేదం షణ్ముఖశర్మ
 25. చంద్రబోస్
 26. సుద్దాల అశోక్ తేజ
 27. కుల శేఖర్
 28. వెన్నెలకంటి
 29. రాజశ్రీ
 30. సాహితీ
 31. రామజోగయ్య శాస్త్రి
 32. జె.కె.భారవి
 33. భువనచంద్ర
 34. వనమాలి
 35. అనంత్ శ్రీరామ్
 36. భాస్కర్ భట్ల రవికుమార్
 37. వెన్నెల శామ్ ప్రకాష్
వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి ... అనువాదాల్లో నిష్ట్నాతులు కొందరు... ఇప్పటి తరంలో కూడా చాలా చక్కని సాహిత్యాన్ని అందిస్తున్న ఎందఱో కవులు / రచయితలు జాతీయ పురస్కారాలను అందుకోగలిగిన పాటలను అందిస్తున్న ఎందఱో మహానుభావులు ... అందరికి వందనాలు.... సినీ సాహిత్యం గురించి చెప్పాలంటే నాకున్న అనుభవము , నా వయసు సరిపోదు.. ఏదో నాకు తెలిసిన నాలుగు మాటలు తెలుగు సాహితీ ముచ్చట్లుగా మీ అందరి ముందుకు తేవడానికి నాకు చక్కని అవకాశాన్ని అందించిన సాహితీ సేవకు కృతజ్ఞతలు....
వచ్చే వారం మరో సాహితీ ముచ్చటతో మీ ముందుకు....

10, జూన్ 2015, బుధవారం

మీరే ఆలోచించుకోండి....!!

చూసారా మన రాజకీయాలు ఎంతగా విలువలు లేకుండా పోతున్నాయో... ఒకడి అవసరానికి మరొకడిని పావుని చేస్తూ ... నిజాలు తెలియని జనాలు... మాటల్లో న్యాయాన్ని చెప్తూ చేతల్లో అవినీతికి అమ్ముడుపోయినవారే అందరు... ఇక్కడ కె సి ఆర్ చేసింది తప్పా కాదా అన్నది ఆలోచించాలి... అంతే కాని ఫోను ట్యాపింగ్ చేశారు అంటే చంద్రబాబు తప్పు చేసాడని కాదు.. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోను పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ట్యాపింగ్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది..?? ఏం ఈయనగారు అసలు డబ్బులే వెదజల్లలేదా లేక పాపం లంచాలు తినడం తెలియదా... ఏమి తెలియకుండానే కుటుంబాన్ని మొత్తం కాబినెట్లో పెట్టుకున్నారు... మరి ఏం చేద్దామనో... ఇక్కడ ఎవరు నీతిమంతులు కారు.. ఆ విషయం డబ్బులు తీసుకుని ఓటేసి గెలిపించిన రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు... అభివృద్ధి చేయడంలో తెలివి చూపించాలి కాని ఈ అడ్డదారుల్లో జనాలను పక్కదారి పట్టించడం మానుకోవాలి... కొన్ని రోజులు ఓపిక పడితే ప్రపంచానికి తెలుస్తుంది అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో... అంతే కానీ ఈ చిల్లర మల్లర పనులు ఇకనైనా మానుకుని మీ పదవికి హోదాకు తగ్గట్టుగా ప్రవర్తించండి కె సి ఆర్ గారు.. ప్రాంతీయతను రెచ్చగొట్టి విబేధాలు సృష్టించి దాని మాటున మీరు వెనకేసుకోకండి... ఒక రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అని మరచి పోకండి... రాజకీయం తెలివిగా ఉండాలి కాని తెగులుగా ఉండకూడదు... మీ వ్యక్తిగతాలు మీరు చూసుకోండి... ఇప్పటికే మీరు ఏం అభివృద్ధి చేసారో జనాలకు తెలుస్తోంది... ముందు దాని మీద పెట్టండి మీ దృష్టి... పక్కవాడి మీద కాదు... మీరు నీతిమంతులని, నిస్వార్ధపరులని మీ మనస్సాక్షిని అడగండి... అది మీకు నిజం చెప్తుంది... ఎందుకండీ రాజకీయాలను ఇంకా ఇంకా బ్రష్టు పట్టిస్తారు మీ కుళ్ళు కుతంత్రాలతో... చంద్రబాబు మంచివాడు అనడం లేదు కాని మీ అందరికన్నా మంచివాడు... ఒక్కమాట గుర్తు ఉంచుకోండి ఈరోజు హైదరాబాదు ఇలా ఉందంటే దానికి కారణం చంద్రబాబే... బాబు ఆంధ్ర రాష్ట్రాన్ని 20 ఏళ్ళు ముందుకి తీసుకువెళ్తే .. స్వర్గీయ రెడ్డిగారు తమ పాలనలో ఓ 50 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని వెనక్కి తీసుకువెళ్ళారు... ఈ రోజు ప్రతి చిన్న ఇంట్లో కూడా ఒకరు అమెరికా డాలరు చూస్తున్నారంటే దానికి కారణం ఎవరు...?? ఇదంతా ఎందుకు మీరు ఎక్కడి వారో మీకు తెలుసు ఈ జనానికి తెలుసు.. కాకపొతే ఎవడి పబ్బం వాడికి గడవాలి... దీని కోసం మీరు ప్రజాస్వామ్యాన్ని వాడుకోవడం ఎంత వరకు సబబో మీరే ఆలోచించుకోండి....!!

విసిరేసిన జ్ఞాపకాలు......!!

విసిరేసిన జ్ఞాపకాలు
ఒక్కొక్కటిగా చేరుతున్నాయి
వద్దన్నా వెంటపడుతూ
ఎదలో రేపిన గాయాలకు
మరపు లేపనాన్ని అద్దుతూ
మనసు బంధానికి అర్ధాన్ని వెదుకుతూ
కాలానికి పోటీగా పరుగులెత్తే
ఆలోచనల్లో కలల అల్లికలను ఆసరాగా ఇస్తూ
కలత పడుతున్న కన్నీటికి
సాక్ష్యమై చేరిన అక్షరాల ప్రవాహాన్ని చూస్తూ
వెలితిగా ఉన్న మదికి తోడుగా
నిలిచిన భావాలకు నిలువెత్తు రూపాన్నిచ్చి
గతానికి జీవాన్ని పోస్తున్నందుకేమో
వలస వస్తున్నాయి జ్ఞాపకాలన్నీ వదలిపోకుండా...!!

8, జూన్ 2015, సోమవారం

చాలా చెప్పాలనే ఉంది...!!

నేస్తం,
         ఈ మధ్యన తరచుగా వింటున్న కొన్ని మాటలు ఎందుకో కోపాన్ని తెప్పిస్తున్నాయి... ఎవరికీ వారు ఏదో  సత్య హరిశ్చంద్రునికి చుట్టాలై నట్టు ఎదుటివారి తప్పులు చూడడానికే అన్నట్టు బతికేస్తున్నారు ... ఇదేదో తెలియని రోగంలా వెన్నాడుతోంది అనిపిస్తోంది... ఒక్కోసారి మనం చూసింది కూడా నిజం కాదు.. మన కళ్ళు మనల్నే మోసం చేస్తాయి... ఇక వినే అవాకులు చవాకులు ఎంత వరకు నిజం అనే ఆలోచన కూడా రావడంలేనంతగా వాటి ప్రభావం పడిపోయింది మనసుపై... మొన్నేదో పోస్టులో చూసాను.. ఎవరూ సీతారాములు కాదు అని... ఏం సీతారాములు కానంత మాత్రాన ఈ భూమి మీద బతికే హక్కు లేదా....రాముడు పేరు కోసం ప్రతిష్ట కోసం సీతమ్మను వదిలేసాడు... ఇది ఎవరు కాదనలేని సత్యం... అందరు సీతారాములే కానక్కరలేదు...అనుబంధాలకు అర్ధాలను తెలుసుకుంటే చాలు... ఈ ప్రపంచంలో ఉన్న మేకవన్నె పులులకు సమాధానం చెప్పడానికి అందరికి ధైర్యం చాలదు... కొందరు ఎదుటివారితో స్నేహం నటిస్తూ మరొకరికి ఆ స్నేహాన్ని పెడర్థాలతో చెప్తే గందరగోళమే కదా.... ఇక కొంత మంది వాళ్ళకి వేరే పనేం ఉండదేమో అమ్మయి పేరు,తెలిసిన వాళ్ళ పేర్లు ఉన్నాయని మనం కూడా చేర్చుకుంటే పెద్ద పతివ్రతాశిరోమణుళ్ళా సుమతి మొగుణ్ణి వేశ్య దగ్గరకు తీసుకువెళ్ళిన చందాన మాటలు...అలా మాట్లాడేది అమ్మాయి కాదు అబ్బాయే ... ధైర్యం ఉంటే అసలు పేరు, ఫోటోతో ఉండాలి... ఎందుకో మరి ఈ వెధవ నాటకాలు... ఈ నా కొడుకులు ఏం అనుకుంటారో...  ముఖ పుస్తకంలో అమ్మాయిలు రమ్మనగానే వచ్చి వాళ్ళ ఒళ్ళో వాలిపోతారని... ఈ వెధవలకెంత నమ్మకమో వాళ్ళ మీద వాళ్ళకి... పని పాట ఏం ఉండదేమో అమ్మాయి పేరు,ఫోటో కనపడగానే మొదలు... అందరు అమ్మాయిలు సీతా సావిత్రులు కాకపోయినా వాళ్ళకంటూ ఓ వ్యక్తిత్వం ఉంటుంది... మీ అంత దిగజారి ఎవరు లేరు... బజారు బుద్దులు వదలి కాస్తయినా మారండిరా... ధైర్యంగా బతకడం నేర్చుకోండి ముందు మీ అసలు పేరు మర్చిపోకుండా... అమ్మా బాబు పెట్టిన పేరు ఉంటుందిగా అది వాడండి కాస్తయినా మంచి బుద్ది వస్తుంది.... అమ్మకు ఆలికి తేడా లేకుండా కళ్ళు మూసుకుని బతకకండిరా... పుట్టగతులు ఉండవు.... ఇంకా చాలా చెప్పాలనే ఉంది... కాని రాతలు మనవైనా ఈ ప్రపంచంలో మిగిలి ఉన్న కొద్దిపాటి మంచితనానికి కూడా మచ్చ పడుతుందని ఆపేస్తున్నా.... మన రాతలుమన ఇష్టమే కాని ఎదుటివారి వ్యక్తిగతాలు విమర్శించేంతగా మన మన వ్యక్తిత్వం ఉండకూడదు... ఇక్కడ ఈ ముఖ పుస్తకంలో ఎవరు ఏది తెలియని వారు లేరు... వారు చేసేది మంచో చెడో అన్నది వారి వారి విజ్ఞతకే వదిలేసి మన పని మనం చేసుకుందాం... ఏమంటావు నేస్తం...!!
నీ నెచ్చెలి

7, జూన్ 2015, ఆదివారం

తెలుగు సాహితీ ముచ్చట్లు ... ముప్పది ఐదవ భాగం....!!

వారం వారం సాగుతున్న మన తెలుగు సాహితీ ముచ్చట్ల ప్రయాణంలో క్రిందటి వారం అవధాన ప్రక్రియ గురించి కాస్త వివరణ చూసాము... ఈ వారం ఆశు కవిత్వం గురించి కొద్దిగా తెలుసుకుందాం...
అసలు ఆశు కవిత్వం అంటే ఏమిటో దాని పుట్టు పూర్వోత్తరాలు దానిలోని రకాలు మొదలైన వాటి గురించి చూద్దాం...
ఆశు కవిత్వం ...
చతుర్విధ కవితా భేదాలలో ఆశు కవిత ఒకటి. కవులు సాధారణంగా ఆలోచించి సావధానంగా కవిత్వం చెప్పుతారు. అలా కాకుండా కొందరు కవులు వచనంలో మాట్లాడినంత వేగంగా భావాలను చంధోనియమ బద్ధంగా పద్య రూపంలో వ్యక్తం చేస్తారు. ఇలాంటి దానినే ఆశు కవిత్వం అంటారు.

ఆశు కవిత్వం / పద్యం / చాటువు
అప్పటికప్పుడు ఇచ్చిన వస్తువు పై ఆశువుగా చెప్పే కవిత / పద్యం / చాటువు. ఇది దైవానుగ్రహముగా అలవడే లక్షణం... పూర్వజన్మ సుకృతంగా లభించే సరస్వతీ కటాక్షం... మన పూర్వ కవులలో చాలామంది చెప్పిన ఆశు పద్యాలు / చాటువులు ఎన్నో మన తెలుగు సాహిత్యంలో లభిస్తున్నాయి... తెనాలి రామలింగని చతురత మన అందరికి తెలిసిన మేక తోక పద్యం, శ్రీనాధుని తిరిపెమునకిద్దరాండ్రా గంగను విడుము పార్వతి చాలున్ అంటూ శివునికి వేసిన చురక... ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఆశు పద్యాలు / చాటువులు మనకు మన తెలుగు సాహిత్యంలో కనిపిస్తాయి... ఆధునిక యుగంలో పద్యాల / చాటువుల స్థానంలో వచ్చిన కవిత్వంలో వచనంలో చెప్పినా కవితా పద్య రూపంలో చెప్పినా ఆశువుగా చెప్పిన ఎన్నో కవితలు ఈనాడు మనకు లభిస్తున్నాయి...
ఇక రెండవదైన సమస్యా పూరణంలో కొన్ని విశేషాలు కూడా చూద్దాం...
అష్టావధానం లో సమస్యా పూరణం ఒకటి....

చరిత్ర

సమస్యాపూరణం అనేది రాయల కాలంలోనే మనకి కనిపిస్తుంది.అంటే సుమారు 500 ఏళ్ళ ముందు ప్రక్రియ.అంతకు ముందు ఏమైనా ఉన్నా పరిశోధకుల దృష్టిలో ఆ సమయం నుంచే ప్రాచుర్యములోనికి వచ్చినట్లుగా చెప్తారు.అసలు పద్యం ఛందస్సుకి లోబడి కావలసిన భావంతో వ్రాయడం ఎంత కష్టమైన ప్రక్రియో!. సరళమైన పదాలతో కవితలు వ్రాయడం కంటే కొన్నిరెట్లు కష్టమైన పని. అలాంటిది ఒక పాదం ఇచ్చి(సాధారణంగా నాలుగవపాదం ) మిగిలిన పాదాలు పూరించమనడం మరీ కష్టం. గమ్మత్తైన విషయమేమిటంటే ఈ పాదం మామూలు భావంలా ఉండక ఒక సమస్యతో ఉంటుంది. ఈ పాదం అర్ధరహితం గానో, లేక అసంబద్దార్ధముగానో, అన్వయ రహితంగానో ఉంటుంది. చమత్కారంతో పూరించడం లోనే కవికి ఉన్న పాండిత్యం తెలుస్తుంది. ఈ సమస్యాపూరణం అవధానం అనే ప్రక్రియలో చాలా ముఖ్యమైనది. అష్టావధానంలో వర్ణనము, దత్తపది, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం (ప్రశంస) ఘంటానాదం, సమస్యా పూరణము ఈ ఎనిమిది ప్రక్రియలని ఏక కాలంలో చేయగలగడం. ప్రశ్నలడుగు వారిని పృచ్చకులు అంటారు.సమాధానం చెప్పే పండితుని ‘అవధాని’ అంటారు.[1]

లక్షణములు

 • సమస్యా పూరణం అనేది తెలుగు సాహితీ ప్రియులకు, అందునా అవధాన ప్రియులకు, అంత్యంత ప్రీతికరమైన ప్రక్రియ.
 • అవధానికి పృచ్ఛకుడు ఒక పాదాన్ని (పద్యంలో ఒక లైను) ఇస్తాడు. అవధాని ఆపాదాన్ని అలాగే ఉంచి తన కల్పనా చమత్కృతితో మిగతా మూడు పాదాలను జోడించి పూర్తి పద్యం చెప్పవలసి ఉంటుంది.
 • ఈ సమస్యా పూరణం చాలా చమత్కారం గాను, ఆశ్చర్యంగాను ఉంటుంది. ఏమాత్రం సంబంధం లేని సంగతిని ఒక పాదంలో ఇరికించి సవాలుగా ఇస్తే, దానికి చాలా అర్ధవంతమైన సమాధానాన్ని అవధాని ఇవ్వవలసి ఉంటుంది. అందుకే దీనిని సమస్యా పూరణం అన్నారు కాబోలు.
 • సమస్యా పూరణం ప్రక్రియ సంస్కృతం నుంచి తెలుగులోనికి వచ్చినది. కవి, పండితుల సామర్థ్యాన్ని పరీక్షించడం లో సమస్యాపూరణాన్ని కూడా ఒక భాగంగా వాడుతారు.

ఉదాహరణ 1

సమస్య:“గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్”
పూరణ:
ఉండ్రాని యడవి లోపల
గుండ్రాయైయున్న మౌనికోమలిపై, గో
దండ్రాము పదము సోకిన
గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్
భావం: ఉండరాని అడవిలో గుండ్రాయి గా పడి ఉన్న ముని (గౌతముడు) పత్ని (అహల్య) పై కోదండరాముని పాదము తగిలి ఆగుండ్రాయి తిరిగి అహల్య గా మారి నడుచుకుంటూ వెళ్లి పోయింది అని అవధాని గారు సమస్య పాదాన్ని రామాయణం లో అహల్యా వృత్తాంతానికి జోడించి చెప్పారు.

ఉదాహరణ 2

భువనవిజయ సభలో రాయలవారు ఇచ్చిన సమస్య : “రవి గాననిచో కవి గాంచునే కదా” అని ఈ సమస్య సాధారణంగానే కనిపిస్తుంది. రవి చూడని చోటు కవి చూడగలడు అని.అయితే భట్టు మూర్తి ఈ విధంగా పూరించినట్లుగా చరిత్ర చెప్తోంది మనకు.
ఆరవి వీరభద్రుని పదాహతి డుల్లిన బోసినోటికిన్
నేరడు, రామకృష్ణ కవి నేరేచెబో మన ముక్కుతిమ్మరా
ట్క్రూర పదాహతిమ్బడిన కొక్కిరి పంటికి దుప్పి కొమ్ము ప
ల్గారచియింప, నౌర! రవి గాననిచో కవి గాంచునే కదా!
పూర్వం శివరాత్రి జాగరణల్లోను, శ్రీరామ నవమి పందిళ్ళ లోను సమస్యా పూరణం ఒక సత్కాలక్షేపం గా ఉండేది.
ఇలా చెప్పుకుంటూ ఉంటే మన తెలుగు సాహిత్యంలో ఎన్నో సొగసులు, ఒంపుల నుడికారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి... వచ్చే వారం మరికొన్ని వివరణలు చూద్దాం...

సేకరణ : వికీపీడియా సహకారంతో ... 
వచ్చే వారం మరికొన్ని ముచ్చట్లతో.....

మళ్ళి మళ్ళి కావాలని.....!!

ఆశలు లేని ఆనందానికి
అల్లరి ఆటల చిలిపితనం కానుక అనుకున్నా
తెలిసి తెలియని తనంలో
ఓ అద్భుతాన్ని నీకు అందిద్దామనుకున్నా
అమాయకమైన బాల్యానికి
రాలిన పారిజాతాల్ని చుట్టాలుగా చేద్దామనుకున్నా
గుజ్జన గూళ్ళ సహవాసానికి
కలసిన చేతుల చప్పట్లు నేస్తాలనుకున్నా
చందమామ కథల రాకుమారిని
అమ్మ చెప్పిన కథలో అందంగా ఊహించుకున్నా
జలతారు పరదాలచాటున దాగిన 
వాస్తవాలకు  మేలిముసుగు తొలగించాలనుకుంటున్నా
దూరంగా పారిపోతున్న భావాలను
గుప్పిట్లో పట్టుకోవాలని వెంబడిస్తూ  పరిగెడుతున్నా
మదిని చుట్టిన నైరాశ్యానికి
వెలుగు రేఖలతో తెర తీయాలని ఆత్రపడుతున్నా
పొడిబారని కన్నీటి హృదయానికి
చిరునవ్వుల లంచాన్ని అందించాలని తపిస్తున్నా
అక్షరాలకు ఆకారాన్ని దిద్ది
మనసు అద్దాన్ని చూపాలని తాపత్రయపడుతున్నా 
అందుకే మరలి రాని కాలాన్ని
మళ్ళి మళ్ళి కావాలని జ్ఞాపకాల సాయాన్ని కోరుతున్నా ....!!

6, జూన్ 2015, శనివారం

ఇలానే ఉండి పోతుందేమో ఎప్పటికి... !!

నేస్తం,
         ఎలా ఉన్నావు... పలకరించి చాలా రోజులే అయినా ఎన్నో వేల సంవత్సరాల దూరాన్ని తలపిస్తోంది... ఏదో చెప్పాలని ఉన్నా ఆ చెప్పడానికి ఎక్కడో చిన్న అవాంతరం మధ్యలో అడ్డుగోడై మాట పెదవి దాటలేని బాటలో మూగగా గొంతులోనే ఉండిపోయింది... చీకటి చుట్టమై వెంట పడుతూనే ఉంది వదలకుండా ఈ జీవితానికి... ఎప్పుడు కమ్మేద్దామా అని కాచుకుని కూర్చుంది... క్షణాల వెలుగులను లెక్కేస్తూ చుక్కల్లో చేరడానికి సమాయత్తమైన దేహాన్ని బుజ్జగిస్తూ రోజు రేపటికి వాయిదా వేయడం అలవాటు చేసుకుని జ్ఞాపకాల పారిజాతాలను ఏరుకుంటూ... వాటిలో అప్పుడప్పుడు వేసవి మల్లెలను పేర్చుకుంటూ... రాలిన పొగడపూల పరిమళం బాల్యాన్ని మోసుకు పోతున్నా... వీడని బంధాల విడలేని అనుభూతుల జాబితాను దాచుకుంటూ... కడలి కలల అలలను తాకుతూ...  ఆశ చావని ఊపిరిని భారంగా మోస్తూ.. మళ్ళి మరో పసితనానికి నాందిగా మారే అమ్మ పానుపుకై వెదుకులాటలో నిరంతరాన్వేషిగా మారి... వేలసార్లు మరణించినా మళ్ళి  మరో అమ్మ కోసం.....అమ్మ నవ్వు కోసం జీవించాలనే ఈ తపన ఇలానే ఉండి  పోతుందేమో ఎప్పటికి... !!

2, జూన్ 2015, మంగళవారం

మండే సూరీడు....!!

అగ్ని శిఖల సెగల ఆహార్యాన్ని
కాలుతున్న జీవితాల ప్రతి రూపాల్ని
మండుతున్న మనసు మంటలను
నిలువునా తనలో దాచుకున్న
నిప్పుల కుంపటి వేసవి మిట్ట మధ్యాన్నపు సూరీడు
తొలిసందెలో  ప్రత్యూషపు అందాలు చిమ్ముతూ
నడిపొద్దుకి రోషారుణిమను దాల్చి
మలి సందెకి సింధూరాన్ని మేలి ముసుగును చేసుకునే
అరుణ వర్ణాల అందని ఈ రేడు ఆకశానికే ఆభరణం
జగతికే వెలుగులు పంచే దేదీప్య రవి కిరణం
దిగంతాల జగజ్జేత మండుతున్న సూరీడయ్య ....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner