30, మే 2020, శనివారం

భూతల స్వర్గమేనా... 12


           మన తెలుగు పండుగలన్నీ కూడా అందరం కలిసి బాగా చేసుకునేవాళ్ళం. ఎక్కువగా శ్రీను సంధ్య వాళ్ళింట్లోనే అందరం కలిసేవాళ్ళం. ఓ రెండు నెలలు గడిచే సరికి నేను కాలే దంపతులతో కలిసి ఉండలేక వేరే మెాటల్ చూసుకుంటుంటే సంపత్ మారిన ఫర్నిష్డ్ అపార్ట్మెంట్స్ ఉన్న చోటే రూమ్ ఉందంటే అక్కడ చూసుకుని మారిపోదామని అనుకున్నా. ఆఫీస్ అయ్యాక శ్రీను, అబ్బు బయటకు వస్తామంటే నా లగేజ్ తీసుకుని వాళ్ళు రాకముందే బయటకు వచ్చి నిలుచున్నా. కాసేపటికి వాళ్ళు వచ్చి లగేజ్ కార్ లో సర్ది నా కొత్త రూమ్ కి తీసుకువెళ్ళారు. నేను తీసుకున్న మెాటల్ రూమ్ లో బెడ్, టివి, చిన్న టేబుల్, చైర్, కాసిని వంట సామాన్లు ఉండేవి. బట్టలకు వాషర్, డ్రయర్ వేరే చోట ఉండేవి. రోజు మధ్యాహ్నం లంచ్ సంపత్ కి, అబ్బుకి మా ఇంట్లోనే. సాయంత్రం ఎవరి తిండి వారిది. నన్ను, అబ్బుని సంపత్ రోజూ ఆఫీస్ కి తీసుకువెళ్ళడం, తీసుకురావడం, ఎవరి పనుల్లో వాళ్ళు అలా జరిగిపోతోంది. ఓ రోజు మా మేనేజర్ క్రిష్ జాబ్ మానేస్తున్నానని చెప్పాడు. మా కంపెనీ ఓనర్ పేరు కూడా బాబ్. మా ప్రాజెక్టు పేరు చెప్పలేదు కదా లోయస్ట్ బిడ్స్ డాట్ కాం. బిడ్ బార్ డిజైనింగ్, ASP పేజ్ లింక్స్ బిడ్ బార్ లో పెట్టడం నా పని. బిడ్ బార్ డిజైనింగ్ అంతా క్లయింట్ సైడ్ VC++ లోనే. సర్వర్ సైడ్ సాకెట్ ప్రోగ్రామింగ్ అంతా క్రిష్ ఫ్రెండ్ పేరు సరిగా గుర్తు లేదు మైక్ అనుకుంటా తను చేసేవాడు. మిగతావాళ్ళంతా ASP, Administration, testing చేసేవారు. ప్రాజెక్ట్ లైవ్ అంతా చూసుకునేవారు. ఇష్యూష్ వస్తే ఎవరిది వారు సాల్వ్ చేసేవారు. అలాంటిది సడన్ గా క్రిష్ కి, బాబ్ కి క్లాష్ వచ్చి క్రిష్, క్రిష్ ఫ్రెండ్ జాబ్ కి రిజైన్ చేసేసారు. బాబ్ మీటింగ్ పెట్టి మా అందరికి జాబ్ పర్మెనెంట్ చేసి తన కంపెనీ నుండి వర్క్ పర్మిట్ స్పాన్సర్ చేస్తానని చెప్పారు. 
      మేం ఆలోచించుకుని చెప్తామని చెప్పాము.సాకెట్ ప్రోగ్రామింగ్ గురించి నన్ను చూడమని నాకు మైక్ సిస్టమ్, కాబిన్ ఇచ్చారు. కంపెనీ ఆఫర్ పర్మెనెంట్ తీసుకుంటే మనకున్న H1 కాన్సిల్ అవుతుంది. వీళ్ళు పర్మెనెంట్ అని కూడ తర్వాత జాబ్ తీసేస్తే మనకు స్టేటస్ ఉండదు. కొంత టైమ్ ఉంటుంది. ఆ టైమ్ లోపల H1 ఫైల్ చేయించుకోవాలి లేదంటే ఇల్లీగల్ అయిపోతాము. 
ఇలా పర్మెనెంట్ ఆఫర్ తీసుకుంటే మధ్యలో వేరే ఎవరు ఉండరు. డైరెక్ట్ క్లయింట్ తో మనకు లావాదేవీలుంటాయి. మధ్యలో వెండర్స్ ఉండరన్న మాట. నాలుగు రోజులయ్యాక అందరం సరేనని మా పని మేం చేసుకుంటున్నాం. ఈ మధ్యలో శ్యామ్ ఫ్రెండ్ కూడా మా ప్రాజెక్ట్ లోనికే వచ్చాడు వెంకట్ ఎంప్లాయర్ ద్వారా. నాకు కాస్త తమిళ్ కూడా అర్థమవుతుంది. శ్యామ్ అతన్ని తీసుకురావడానికి ఇక్కడ ఉన్నవారిలో ఎవరినైనా తీసేయించాలని ట్రై చేయడం, నాకు తమిళ్ తెలియదని తను తమిళ్ లో మాట్లాడటం, నేను వీళ్ళకు చెప్పడం జరిగింది. అసలే ప్రాజెక్ట్ ఉంటుందో, పోతుందో అన్న టెన్షన్ మాది. మధ్యలో ఈ గోల. అంటే అన్నానంటారు కానండి మన ఆంధ్రా వాళ్ళు మనవాళ్ళకి అసలు హెల్ప్ చేయరు. మిగతావాళ్ళు అలా కాదు. ఎంతయినా ఒక్క ఆంధ్రా వాళ్ళకు లేనిది మిగతావారికందరికి ఉన్న యూనిటితో శ్యామ్ తన ఫ్రెండ్ ని కూడా మా ప్రాజెక్ట్ లోనికి తెచ్చేసాడు సాకెట్ ప్రోగ్రామింగ్ మీద. 
3 నెలలు నాకు సాలరి పే చేసిన HNC కంపెని తర్వాత పే చేయడం మానేసింది. అడుగుతుంటే క్లయింట్ దగ్గర నుండి రాలేదని చెప్పడం మెుదలుబెట్టారు. మనకి క్లయింట్ తో సంబంధం లేదు, క్లయింట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా మన ఎంప్లాయర్ మనకి పే చేయాలి. సరే ఇస్తారులే అని మరో 3 నెలలు ఊరుకున్నాను. ఈ క్లయింట్ పని చేయించుకుంటున్నాడు కాని మా పేపర్స్ అడగడం  లేదు ఫైలింగ్ కి. ఎనిమిది నెలలు చూసాక ఇక మానేద్దామని నిర్ణయించుకుని, ఎంప్లాయర్ బాబ్ ని అడిగితే సమాధానం చెప్పడం లేదు. వినయ్ గారికి ఫోన్ చేస్తే అడగండి అంటారే కాని ఉపయెాగం లేదు. ఓ నెల రోజులు అలానే ఉన్నా. అబ్బు వాళ్ళ అన్నయ్య దగ్గరకి అప్పుడే వెళ్ళనంటే, సరేనని నాతో ఉండమన్నా. షణ్ముఖ్ కూడ ఫోన్ చేసేవాడు అప్పుడప్పుడు. ఈ విషయం చెప్తే ఇక్కడికి వచ్చేయండి, ఏదైనా జాబ్ చూసుకోవచ్చు అని చెప్పాడు. అప్పటికే తర్వాత నెలకు కూడా మనీ పే చేసేసా. అబ్బు ఉంటానంటే తనకి అప్పజెప్పి, బస్ లో రెండునర్ర రోజులు నెవెడా స్టేట్  కార్సన్ సిటీ నుండి చికాగోలోని అరోరా HNC కంపెనీ గెస్ట్ హౌస్ కి వచ్చాను. అక్కడ విజయ్ అనే అతను ఉన్నాడు. తను ఇండియాకి వెళిపోతున్నాడు. ఓ వారం, పది రోజులున్నాక బాబ్ ఇండియా టికెట్ ఇస్తాను, ఇండియాకి వెళ్ళమన్నాడు. నాకు H1 కూడా వీళ్ళ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయలేదు. నేను పక్కన షాప్ కి వెళితే అక్కడ కనబడిన కాప్(పోలీస్ ని కాప్ అంటారు) కి జరిగిన విషయం అంతా చెప్పాను. కాప్ బాబ్ నంబర్ అడిగితే ఇచ్చాను. బాబ్ కి కాల్ చేసి తిట్టాడనుకుంటా. ఆ సాయంత్రం బాబ్ గెస్ట్ హౌస్ కి వచ్చి వాడిష్టం వచ్చినట్టు తిట్టి, గెస్ట్ హౌస్ నుండి వెళిపొమ్మన్నాడు. ఆ విజయ్ బాగా భయపడిపోయాడు. రావాల్సిన డబ్బులు ఇమ్మన్నాను నేను. ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు. షణ్ముఖ్ కి కాల్ చేసి చెప్పాను జరిగింది. వాళ్ళ రూమ్ లో పూజారి గారు, తనతో పాటు ఉండమని చెప్పాడు. నేను కార్సన్ సిటిలో ఉన్నప్పుడు మా స్కూల్ అల్యూమిని వెబ్ సైట్ లో నేను యాడ్ అయ్యాను. గోవర్ధన్ బొబ్బా అని అవనిగడ్డ అతను, చిన్నప్పుడు మా స్కూల్ లోనే తను కూడా, కాకపోతే నా పేరు తెలుసు కాని నన్ను చూడలేదెప్పుడూ. తను ఓ రోజు కాల్ చేసాడు. తన వివరాలు చెప్పి అప్పటి నుండి అప్పుడప్పుడూ మాట్లాడేవాడు. ఇలా నా ప్రాజెక్ట్ అయిపోయిందని, కంపెని వాడు బెదిరించాడని చెప్పాను. గోవర్ధన్ ఇండియానా లో ఎమ్ ఎస్ చేస్తున్నాడు. వాళ్ళ దగ్గరకు రమ్మని చెప్పాడు. మరుసటి రోజు విజయ్ ఇండియా వెళిపోయాడు. షణ్ముఖ్ వాళ్ళ రూమ్ లో ఉన్నాను ఆ రోజు. రెండు మూడు గాస్ స్టేషన్స్ కి జాబ్ అడగడానికి కూడ తీసుకువెళ్ళాడు. మన పరిస్థితి ఏంటా అని దిగులుతో ఆ రాత్రంతా నిద్ర పోలేదు. మరుసటి రోజు గోవర్ధన్ ఫోన్ చేసి తన ఫ్రెండ్స్ తో వచ్చానని, నన్ను వాళ్ళతో రమ్మని చెప్పాడు. అడ్రస్ చెప్తే వచ్చి ఇండియానా నన్ను కూడా తీసుకువెళ్ళారు. ఓ సూట్కేస్ ఇక్కడే వదిలేసాను. 

మళ్ళీ కలుద్దాం... 

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం లో ఇబ్బందులు... జీతం కుడా ఇవ్వకుండా పని చేపించుకునే యాజమాన్యం... రాజీనామా... మరో ఉద్యోగ వేట... ఎన్ని ఎబ్బందులో...నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం లో ఇబ్బందులు... జీతం కుడా ఇవ్వకుండా పని చేపించుకునే యాజమాన్యం... రాజీనామా... మరో ఉద్యోగ వేట... ఎన్ని ఎబ్బందులో...

29, మే 2020, శుక్రవారం

మన చరిత్ర...!!

      నీలం సంజీవరెడ్డి గారు పదవిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తుందని తెలియగానే రాజీనామా చేసిన ఘన చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ ది ఒకప్పుడు. 
మరి మన ఇప్పటి చరితేమిటయా అంటే ముద్దాయిలు పాలించే పరిస్థితి. కోర్టులు ఎన్నిసార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చినా తమని కాదని దులిపేసుకునే రకాలని అర్థం అయ్యిందా ఇప్పటికయినా.  
మరిలా ఎంత కాలమెా... ప్రభుత్వం మీద వ్యతిరేకంగా 60 పైబడి కేసులు, వ్యతిరేక తీర్పులు...తన తీరు మార్పు రాని, మార్చుకోని ప్రభుత్వం ..మరి కోర్టు తీర్పుల ఫలితం ఏమిటి...? 

27, మే 2020, బుధవారం

ఏక్ తారలు

1.  ఓదార్చే అక్షరాలను నీకందిస్తున్నా_వేదనకు వీడ్కోలిమ్మంటూ..!!
2.     రంగుల మాయ అలాంటిది మరి_మార్పు కాలానికేం తెలుసు పాపం..!!
3.  అమ్మ కడుపున పుట్టలేదుగా దైవం_నవ మాసాల విలువ తెలియలేదందుకే...!!
4.  తరాజు తూయలేనంటోంది_భారమైన కలల బరువును..!!
5.  మదికెప్పడూ మెామాటమే_మౌనం వీడితే మాయమౌతావేమెానని..!!
6.  గురుతులెప్పుడూ జ్ఞాపకమే_కాలమెంత వేగంగా పరుగులిడినా..!!
7.  తోలు మందమైంది_అవమానమని తెలిసినా ఒప్పుకోలేని అహంతో.. !!
8.  నిరీక్షణకు చోటు లేదు_మనసంతా రాయిలా మారిపోతే...!!
9.   ఆ రాయిని పూజించే రోజు రాకమానదు_ఓటమి విజయమై చేరితే..!!
10.   కొన్ని రాళ్ళు కరగవంతే_నిబద్దతయినా నిజాయితైనా వాటికొకటే...!!
11.  స్వప్నాలకు స్థోమత అక్కర్లేదు_నిదురకు మనసునిస్తే చాలు..!!
12.  కన్నీటి కథలెన్నయినా కానీ_అక్షరాల్లో చేరాక అవి పన్నీటి చినుకులే...!!
13.   వాలే పొద్దులో వర్ణాలు చూస్తున్నా_మనసు కాన్వాసుపై రంగుల లోకం చిత్రిద్దామని...!!
14.   క్షణాలెప్పుడూ పదిలమే_కాలమెలా సాగిపోతున్నా...!!
15.   అలకలదెప్పుడూ అల్ప సంతోషమే_క్షణాల్లో కోపాన్ని మర్చిపోతూ...!!
16.   నలుపు రంగుది విశాల హృదయం_రంగులన్నింటిని తనలో ఇముడ్చుకుంటూ...!!
17.   కలలెన్ని సేదదీర్చాయెా కదా_కన్నీళ్ళను తుడుస్తూ...!!
18.  మనసునేమార్చే మెళకువ తెలియాలి_కన్నీటిని పన్నీరుగా మార్చడానికి...!!
19.   మరుపునే మరిపించాయి_జ్ఞాపకాలను వీడలేని మనసుందని గుర్తుజేస్తూ..!!
20.  గుప్పెడు గుండెతో గంపెడాటలు_అలవాటైన వ్యసనమే కొందరికి...!!
21.   వర్ణనదేముందిలే_వాచకం బావుంటే చాలట..!!
22.  ఓటమి ఆహ్వానాన్ని తిరస్కరించు_గాయాన్ని విజయగీతంగా మార్చుతూ...!!
23.   అలవాటైన ఆట కదా_మనసుతో మనిషితనానికి...!!
24.   పరిపాటేనని పాత పాటే పాడితే ఎలా_ఏమరుపాటుకి మూల్యం చెల్లించాలేమెా...!!
25.   ఏదీ మిగలదేమెా_వెలి వేయడమంటూ మెుదలైతే..!!
26.   నిస్సత్తువు నీకేలా_చీకటిలో వెలుగు నింపే చెలిమి నీతోనుంటే...!!
27.  నిస్సత్తువు నీకేలా_చీకటిలో వెలుగు నింపే చెలిమి నీతోనుంటే...!!
28.  పోగొట్టుకున్న గతాన్ని వెదుక్కుంటున్నా_రాశులుగా పేరుకున్న జ్ఞాపకాల్లో..!!
29.  మరుక్షణమే మరిచిపోయి వుంటుంది మానవాళి_కాల్చిన దేహం సాక్షిగా...!!
30.   గ్రహణం వీడిన శకునం బావుంది_ఆషాడపు చినుకులతో...!! 

25, మే 2020, సోమవారం

పట్టలేని సంతోషం...!!

నేస్తం, 

         ఈమధ్య జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పాలని చాలా రోజుల నుండి అనుకుంటూనే ఉన్నాను కాని కుదరలేదు. యాభైల్లో పడుతున్న వయసుకి చిన్నప్పటి నేస్తాల పలకరింపులు, అదీ ఎన్నో ఏళ్ళ (1985 నుండి 2020) తరువాత అయితే ఆ సంతోషం ఎలా ఉంటుందంటావ్? నేను చెప్పనా... నాకిష్టమైన సముద్రం దగ్గర నిలుచుని, ఆ అలలతో ఆడుకున్నంత సంతోషమన్న మాట.
            సరదాగా చూసే యుట్యూబ్ ఛానల్ లో జాతకం రేపటి రోజుది వింటే మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు అని చెప్తే, అసలే కరోనా కాలమని ఎలా జరుగుతుందని తీసిపారేయకండని కూడా చెప్పారు. నవ్వుకున్నా అప్పుడు. మరుసటి రోజు పొద్దున్నే నా మెసెంజర్ లో నా ఫ్రెండ్ లిస్ట్ లో లేని వారి దగ్గర  నుండి మెసేజ్. తనెవరో వివరంగా పెట్టారు. మాతో కలిసి చదువుకున్న చిన్ననాటి మిత్రుడు మంగారావు. వెంటనే ఫేన్ నెంబరడిగి ఫోన్ చేసి మళ్ళీ బాల్యాన్ని పలకరించేసాం. మరో బస్ ఫ్రెండ్ శ్రీదేవి మంగారావు వాళ్ళ వదిన. తన నెంబర్ కూడా తీసుకుని తనతో కూడా కబుర్లు పంచేసుకున్నా. బాగా  చిన్నప్పటి ఫ్రెండ్ గత 7,8 ఏళ్ళుగా మాట్లాడని మా అల్లరి బాచ్ సత్యన్నారాయణ కూడా పలకరించేసాడీ మధ్యనే.
         అనుకోని మరో కబురేంటంటే జొన్నవలస స్కూల్ లో మా సీనియర్ పార్వతి వా నెంబర్ వాళ్ళ ఫ్రెండ్ ఎర్రయమ్మని అడిగి మరీ నాకు ఫోన్ చేసింది. ఎన్ని కబుర్లు చెప్పేసుకున్నామెా... కార్తీకం మాసంలో పులిహోర చేయించుకుని వన భోజనాలకి వెళ్ళడం, టిటిడి వారి పరీక్ష రాసేసి సినిమాకి వెళ్ళడం, భీమ్ సింగ్ బ్రిడ్జ్ పై చిరంజీవి గూండా సినిమా షూటింగ్ కి స్కూల్ ఎగ్గొట్టి, నాతోపాటు మరో నలుగురిని కూడా తీసుకువెళ్ళి, మరుసటిరోజు ప్రేయర్ లో అందరి ముందు హెడ్ మాస్టారితో తిట్లు... నన్నేం అనలేదు కాని..." ఎంతో తెలివి గల ఈ పాప కూడ వెళ్ళింది " అనే అన్నారు. కాకపోతే మా హిందీ టీచర్ బాగా తిట్టారనుకోండి క్లాస్ లో...ఇలా మా చిన్నప్పటి జ్ఞాపకాలనన్నింటిని గుర్తు చేసేసుకున్నాం..మనకి అందరు గుర్తున్నా మనం కూడా కొందరికి గుర్తుండటం భలే బావుంటుంది...అదీ సీనియర్స్ కూడా గుర్తుంచుకోవడం ఇంకా బావుంటుంది. కాని నాతో కలిసి ఆడుకున్న ఒకరు నన్ను మర్చిపోయారు...నా పేరు చెప్తే గుర్తు రావాలి కదా... ఎప్పటికో గుర్తు వచ్చిందట... 😊
పనిలో పని మీకు ఓపాలి గతాన్ని పలకరించి రారాదు...ఎంత బావుంటుందో తెలుస్తుంది...
           

నా గురించి...!!

పల్లె నుంచి ఇంజినీర్ గా అమెరికాకు..వ్యవసాయం పై మక్కువతో ఇండియా కు..సాహిత్య ప్రపంచంలో అమ్మలకు అమ్మ మనసున్న మహారాణి ప్రముఖ రచయిత్రి మంజు యణమదల గారి జీవిత &సాహిత్య విశేషాలతో..

కవుల మనసులను..ఊహలను..
సమాజానికి ఉపయోగపడే రచనలను..
మీముందుంచే "సాహిత్య ప్రపంచం"  మన A2Z4U TV లో..
ప్రతీ వారం మీకోసం..

రచయిత్రి మంజు యణమదల ఇంటర్వ్యూ కోసం లింక్ పై క్లిక్ చేయండి👇
https://youtu.be/nMPEktsEVmE

మరిన్ని మంచి UPDATES చూడటానికి ..
SUBSCRIBE చేసి LIKE చేసి SHARE చేయండి

అమ్మ, అక్క అని పిలుస్తూనే మన గురించి అసభ్యంగా మాట్లాడే మనుషులున్న సమాజం మనది. అలాంటి సమాజంలో నలుగురికి మంచి చేయాలన్న తపనతో వయసుకు చిన్నవాడైనా..ఎన్నో సమాజహితమైన కార్యక్రమాలు తన లివ్ అండ్ లెట్ లైవ్ ఫౌండేషన్ ద్వారా చేస్తూ, you tubeలో కూడా a2z4uఅనే ఓ ఛానల్ ఏర్పాటు చేసి మట్టిలో మరుగున పడిన ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేస్తున్న బిడ్డ రాము పడకంటి. మాట్లాడటం రాదన్నా నా మీద ప్రేమతో, అభిమానంతో ఈ అమ్మను ఇలా అందరికి పరిచయం చేసిన రాముకి నా ఆశీస్సులు...

కాలం వెంబడి కలం...3

          7వ తరగతి నుండి ఊరూ మారింది, స్కూలూ మారింది. బయటంతా కొత్త యాస, కొత్త మనుషులు. అది మరేటో కాదులెండి కృష్ణాజిల్లా నుండి విజయనగరం జిల్లాకి మారామన్న మాట. గవర్నమెంట్ హైస్కూల్ మా ఊరు పినవేమలికి రెండు మైళ్ళ దూరంలో జొన్నవలస అనే ఊరిలో ఉండేది. మా ఊరిలో చదువుకున్న వారు కాని, చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నవారు కాని చాలా తక్కువ. ఇక స్కూల్ లో అంతా చాలా కొత్త వాతావరణం. ఆడపిల్లలు చదివేవారు చాలా తక్కువ. మాటలు అసలు అర్థం అయ్యేవే కాదు. వాళ్ళంతా నా యాసను, భాషను ఎగతాళి చేస్తే, నేనూ వాళ్ళందరిని ఆట పట్టించేదాన్ని. త్వరలోనే అందరికి ఇష్టురాలిగా మారిపోయాను కూడా. చిన్న తెలుగు మాస్టారు, హింది టీచర్ గారు చాలా బాగా చెప్పేవారు. 8వ తరగతి నుండి లెక్కల మాస్టారు, పెద్ద తెలుగు మాస్టారు, మిగతా అన్ని సబ్జక్ట్స్ కి వేరే మాస్టర్లు వచ్చేవారు. 10వ తరగతిలో హెడ్ మాస్టారు ఇంగ్లీష్ చెప్పేవారు. స్కూల్ మెుత్తానికి మన సంగతి అదేనండి నా పుస్తకాల పిచ్చి సంగతి మాస్టర్లతో సహా అందరికి మనం ఆ స్కూల్ కి వెళ్ళిన వెంటనే తెలిసిపోయింది. బానే చదువుతాను కదా, అందుకని ఎవరు ఏమనేవారు కాదు నన్ను. మా హింది టీచర్ గారు ఆంధ్రజ్యోతి నేను తెప్పిస్తాను, మీరు ఆంధ్రభూమి తెప్పించండి అని అంటే, అలా పుస్తకాలు పంచుకున్నామన్న మాట. మా హింది టీచర్ గారు చదువు ఒక్కటే కాకుండా లోకజ్ఞానం గల చాలా విషయాలు కూడా చెప్పేవారు. మా చిన్న తెలుగు మాస్టారి వైఫ్ నాకు డిటెక్టివ్ పుస్తకాలు కూడ ఇచ్చేవారు. అలా నా పుస్తక పఠనం నిరంతరాయంగా సాగిపోతూనే ఉంది జిల్లాలు మారినా. 
        మనకేమెా స్నేహితులంటే బాగా ఇష్టమాయే. అవనిగడ్డ శిశువిద్యామందిరం నేస్తాలకు ఉత్తరాలు రాయడంతో నా రాతలు మెుదలయ్యాయి. ఈ రాతలకు మెుదటి అడుగు ఉత్తరాలతోనే పడింది. అప్పట్లో మనకు ఉత్తరాలే కదా సంబంధ బాంధవ్యాల మధ్య దగ్గరతనాన్ని పెంచింది...ఇప్పటిలా ప్రపంచం అరచేతిలో కనిపించేది కాదు కదా. చదువుతో పాటుగా పాటలు, ఆటలు, అల్లరితో బాల్యం హాయిగా గడిచిపోయింది. 10వ తరగతి శలవల్లో నా ఫ్రెండ్ దేవికి రాసే ఉత్తరాల్లో కవితలు రాయడం అలవాటైంది. అవి కవితలో కాదో కూడా తెలియదు. అనిపించిన భావాన్ని అలా అక్షరాల్లో పెట్టడం తెలిసిందంతే. మళ్ళీ ఇంటరు రెండేళ్ళు ఏమి రాయలేదు. పుస్తకాల వ్యాపకం మాత్రం పోలేదు. అప్పటికే యద్దనపూడి, యండమూరి, కొమ్మునాపల్లి, చందుసోంబాబు, మల్లిక్, మధుబాబు, కొమ్మూరి,వడ్డెర చండీదాస్ హిమజ్వాల, మాదిరెడ్డి, రావినూతల సువర్ణాకన్నన్, బలభద్రపాత్రుని రమణి, బొమ్మదేవర నాగకుమారి ఇలా అందరివి చదివేయడం, స్వాతి మాసపత్రికలో మాలతిచందూర్ గారి పాత కెరటాలు చదవడం బావుండేది.  సూర్యదేవర రామమెాహనరావు, చల్లా సుభ్రమణ్యం వీళ్ళిద్దరు నవలలు, సీరియల్స్ బాగా పరిశోధన చేసి రాసేవారు. అప్పట్లో అశ్వ భారతం, మెాడల్ బాగా పేరున్న నవలలు. ఇక అప్పట్లో యండమూరి గారి వెన్నెల్లో ఆడపిల్ల చదవని వారు లేరనే చెప్పవచ్చు. నాకు మాత్రం ఆనందోబ్రహ్మ బాగా నచ్చిన పుస్తకం. తర్వాత రమేశ్చంద్ర మహర్షి ఫోర్త్ డైమెన్షన్ కూడా బావుంటుంది. 

మరిన్ని కబుర్లతో వచ్చే వారం.. 

24, మే 2020, ఆదివారం

రత్నారెడ్డి యేరువ...!!

    అక్షరాల్లో రాలిన " జ్ఞాపకాల గవ్వలు "

            న్యాయవాద వృత్తిలో ఉండి, తెలుగు సాహిత్యంలో నేను సైతం అంటూ చక్కని భావ కవిత్వాన్ని రాస్తున్నవారిలో యేరువ రాజ రత్నారెడ్డి ఒకరు. కవిత్వమే కాకుండా షార్ట్ ఫిలిమ్స్ కి కథలు, మాటలు కూడ రాస్తున్నారు. జ్ఞాపకాల గవ్వలు పేరుతో ఈయన కవితలు ముఖపుస్తకంలో అందరికి సుపరిచితమే. గోదావరి వంటి పలు పత్రికలలో కవితలు ప్రచురితమయ్యాయి. 
       రత్నారెడ్డి గారు వెలువరించిన " జ్ఞాపకాల గవ్వలు " తొలి కవితాసంపుటిలో అమ్మ, నాన్న, పండుటాకు, ఇరానీ కేఫ్, బస్ స్టాప్, ప్రేమ, ప్రయాణంలో అనుభవాన్ని ఓ చక్కని భావంతో వచనంలో చెప్పడం, ప్రేయసిపై అనురాగాన్ని అందంగా వ్యక్తీకరించడం, కవిత్వం తెలియదంటూనే చక్కని భావుకత్వాన్ని ఈ కవితాసంపుటి నిండా పొందుపరిచారు. చూసిన ప్రతి చిన్న విషయాన్ని, అలానే ప్రతి ఆనందపు అనుభూతిని తన కవితలలో అందరికి పంచారు. విరహాన్ని, వేదనను సున్నితంగా స్పృశించారు. ఈ కవితాసంపుటి చదువుతుంటే మన జీవితంలో నిత్యం మనకు తారసపడే ఎన్నో అనుభవాలే కవితలుగా మనకు దర్శనమిస్తాయి.

ఆఖరి అక్షరం కవితలో...  
" నా ప్రతి రాతకి మొదటి అక్షరం నీవే,
మరి చివరి అక్షరం కూడా నీవే....." అంటూ స్ఫూర్తి ప్రధాతను స్మరించారు. 

నేస్తానికి తన మనసును నివేదిస్తూ విసిరేసిన జ్ఞాపకాల గవ్వలనిలా ఏరుకున్నారు..
 
" కొన్ని నిశ్శబ్దాలంతే
కావాలనుకున్నప్పుడు శబ్దించవు,
కలలతోనే మాట్లాడుతాయవి 
కన్నుల భాష అర్థం కాక.." ఎంత చక్కని భావుకత ఇది. 
 మరో కవితలో ప్రేమలోని ఆరాధనను ఎంత ఆర్ద్రతతో చెప్పారో మీరే చూడండి. 
" అది ఆఖరి క్షణమైనా సరే,
ఆపి చెప్పాలని వుంది,
గుండె విప్పాలని వుంది,
గురుతులన్నీ విడమరిచి చూపాలని వుంది.." ఆ అవకాశం ఇమ్మని, ఆఖరి అడుగు కలిసి వేద్దామని  వేడుకోవడంలోని విరహ యాతన అద్భుతంగా ఉంది. 

ప్రేమలోనే కాదు దేవుని వేడుకోవడంలో కూడ దిట్టనే అని తన అక్షరాల మాయతో ఆ భగవంతునికి విన్నవించే ప్రయత్నం చేసారు. 

"  నేనన్న రూపమే,నాదన్న ఈ జీవిత సర్వమే 
నీదని ఆలస్యంగా గుర్తించాను,
నీవేమిచ్చావని అడగను ఇకనుంచీ,
నీకేమిచ్చానో అనుకుంటూ జీవిస్తాను.." తాత్విక చింతన కనిపిస్తుంది ఈ కవితలో. 

కొన్ని నిదురలేని రాత్రులలో తన అనుభవాలు జ్ఞప్తికి వచ్చి భావాలుగా మారి కవిత్వపు అక్షర సుమాలుగా విరిసి ఆ పరిమళాలు ఆజన్మాంతమూ వెంటాడుతాయని చెప్తారు.  అక్షరాలను పేర్చుకుంటూ, మాట వినని గుండె చప్పుళ్లలో ప్రేయసిని వెదకడం కొత్తగా లేదూ.  ఇలాంటి భావ కవితలతో పాటు మరెన్నో సామాజిక అంశాలను కూడా వస్తువులుగా తీసుకుని చక్కని, చిక్కని కవితలతో పలువురి ప్రశంసలతో పాటు, చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు రత్నారెడ్డి యేరువ. తన కవితల్లో ఎక్కువగా జ్ఞాపకాల గుభాళింపులే కనబడతాయి. వీరి కవిత్వంలో కొన్నిచోట్ల అక్షరాలు అలిగినట్లు, భావాలు బుంగమూతి పెట్టి, ఆ ఉక్రోషమంతా మనకు తారసపడుతుంది. మనసులోని భావాలను అక్షరీకరించడంలో నిజాయితీ కనబడుతుంది. సన్మానాలు, గుర్తింపులు తన కవిత్వానికి అక్కరలేదంటూ, ముఖపుస్తకమే తన భావాలకు వేదికంటారు. వద్దని వారించినా పురస్కారాలు, సన్మానాలు ఎన్ని లభించాయెా మీరే చూడండి. 
   వీరికి లభించిన పురస్కారాలు, సన్మానాలు బోలెడు. 
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ  వారి ప్రతిష్టాత్మక సంకలనం "తొలిపొద్దు" లో చోటు,వివిధ సావనీర్లలో ముద్రితమైన రచనలు,
జైనీ ఇంటర్నేషనల్ వారిచే "సినీవాలి" పురస్కార ప్రధానం,
గజల్ లోగిలి, సుచిత్ర ఫౌండేషన్ వారి పురస్కార ప్రధానం,
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలుగు మహాసభల్లో నగదు బహుమతితో పాటు పురస్కార ప్రధానం, క్రియేటివ్ ప్లానెట్ ముంబే వారిచే కొనకంచి స్మారక పురస్కారం ,
గిడుగు రామమూర్తి ఫౌండేషన్ వారిచి "గిడుగు" పురస్కార ప్రధానం..

తెలుగు సాహితీ ప్రస్థానంలో మరిన్ని  కవితా సంపుటాలు వెలువరించాలని కోరుకుంటూ ...  హృదయపూర్వక అభినందనలు. 
మంజు యనమదల
విజయవాడ 

23, మే 2020, శనివారం

భూతల స్వర్గమేనా...11

పార్ట్ 11

        మెుత్తానికి కాలే దంపతులతో కలిసి కొత్త ఇంటికి వచ్చాను. మా ప్రాజెక్ట్ లో పనిచేసే వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. మాది డబల్ బెడ్ రూమ్. ఓ రూమ్ నాది. ఇక మెుదలయ్యాయి పాట్లు. నాకేమెా పొద్దున్నే లేచే అలవాటు. ఆఫీస్ కి రడీ అయ్యి కాఫీ నేను పెట్టుకుంటూ వారిద్దరికి కూడా పెట్టిచ్చేదాన్ని. ఎందుకో తెలియదు కాని కాలే శ్రీనివాసరావు గారికి నేను ఏం చేసినా నచ్చేది కాదు. పేర్లు పెడుతూనే ఉండేవారు. అలా మెుత్తానికి నాకు కాఫీ పెట్టడం రాదని తేల్చేసారు. ఆవిడ పేరు నాకు గుర్తు లేదు కాని ఏ మాటకామటే... ఆవిడ ఏం మాట్లాడేది కాదు. నేను పట్టించుకోనట్టే ఉండటానికి ట్రై చేయడం మెుదలెట్టా. మధ్యాహ్నం లంచ్ ఆవిడే ప్రిపేర్ చేసేవారు. సాయంత్రం వచ్చాక మెుత్తం అంట్లు నా పనన్న మాట. నైట్ కూడా అన్ని  క్లీన్ చేసేసి పడుకునేదాన్ని.                    
        నాకేమెా VC++థియరీ నాలెడ్జ్ మాత్రమే ఉందాయే. కైలాష్ పుణ్యమా అని తన ఫ్రెండ్ కాలే VC++ లో వర్క్ చేయడం, తన ఫోన్ నెంబరిచ్చి హెల్ప్ చేస్తాడని చెప్పాడు. కాలే చాలా మంచబ్బాయ్. రోజూ నా డౌట్స్ అన్నీ సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక ఫోన్ చేసి అడగడం, తను క్లియర్ చేయడం ఇలా ఓ 15,20 రోజులు బాగా కష్టపడ్డాను. తర్వాత బాగా ఈజీ అయిపోయింది వర్క్. ఆ టైమ్ లోనే నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ యశోద నాకు VC++ పుస్తకం ఆన్ లైన్ లో కొని పంపించింది.  నాకు అప్పటికి ఇంకా ఫోన్ లేదు. ఈ దంపతులు ఇంటికి లాండ్ లైన్ పెట్టించారు. అప్పట్లో ఇంటర్నెట్ కూడా లాండ్ లైన్ తోనే కనక్ట్ చేసుకునే వాళ్ళం. వాళ్ళకు డెస్క్ టాప్ కంప్యూటర్ కూడా ఉంది. లాండ్ లైన్ ఫోన్ ఈ స్టేట్ వరకే ఫ్రీ కాల్స్. వేరే స్టేట్స్ కి చేయాలంటే కాలింగ్ కార్డ్స్ వాడుకోవాలి. నాకు నరసరాజు అంకుల్ ఓ 1 800 నంబర్ ఇచ్చారు. ఇండియాకి చేసుకోవడానికి. నేనది ఈ ప్రాజెక్ట్ లో డౌట్స్ కోసం కూడా వాడేసాను తెలియక. పాపం అంకుల్ కి ఎక్కువ బిల్ వచ్చి, ఫోన్ చేసి అడిగితే ఇలా వాడానని చెప్పాను. ఇక్కడ ఫోన్ చేయడానికి వేరే కాలింగ్ కార్డ్స్ ఉంటాయని చెప్పారు. అప్పుడు ఇంకో శ్రీనివాస్ సంధ్య వాళ్ళతో  Cost Co కి గ్రోసరీస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ కాలింగ్ కార్డ్స్ కూడా కొనుక్కున్నా. నేను ఇంటికి చేయడానికి కూడా 10 డాలర్ల కాలింగ్ కార్డ్ కొంటే 12 నిమిషాలు వచ్చేది మెుదట్లో. తర్వాత తర్వాత 24 మినిట్స్ వచ్చేవి. నరసరాజు అంకుల్, గోపాలరావు అన్నయ్య ఫోన్ చేస్తూనే ఉండేవారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా. మా పెద్దమ్మ చెల్లెలి కొడుకు ప్రసాద్ అన్నయ్య కూడా నేను అమెరికా వచ్చినప్పటి నుండి మాట్లాడుతునే ఉండేవాడు. అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి చూసివెళ్ళాడు కూడా. 
        ఇక మా రూమేట్స్ నాతో బాగా ఆడుకునే వారు. వాళ్ళ ప్రెషర్కుక్కర్ లో నేను ఏదో పెడితే సేఫ్టీ వాల్వ్ పోయింది. దానికి అది నన్నే కొనిమ్మన్నారు.నా ఇంజనీరింగ్ ఫ్రెండ్ శోభ కాలిఫోర్నియాలో ఉండేది. తనకి ఫోన్ చేసినప్పుడు ఈ సేఫ్టీ వాల్వ్ గురించి ఎక్కడ దొరుకుతుందని అడిగితే, నా దగ్గర ఉంది, నేను పంపిస్తాను అని నా అడ్రస్ తీసుకుని సేఫ్టీ వాల్వ్ పంపించింది. ఇలా రోజూ ఏదోక దానికి ఆయన  నన్ను సాధించడం, ఆవిడేమెా ఏమీ మాట్లాడకపోవడం, అలా నడుస్తోంది. నాకేమెా ఎంత అడ్జస్ట్ అవుదామన్నా వీలుకాకుండా ఉంది. ఆవిడకు ఆవిడ మీద చాలా నమ్మకం తను బాగా తెలివైనదాన్నని. నేను ఎందుకు పనికిరాని దానినని. జాబ్ కూడా ఆవిడకు రావాల్సింది, ఏదో నా లక్ బావుండి నాకు వచ్చిందని. ఆఫీసులో కూడా ఈయన అందరిని ఏదోకటి అనడంతో మా చుట్టుపక్కల వాళ్ళందరు కాస్త దూరంగానే ఉండేవారు. నాతో బావుండేవారు. అది కూడ వీళ్ళకి నామీద కోపం పెరగడానికో కారణమైయుండవచ్చు. 
          ఓ వీకెండ్ సంధ్యా  శ్రీనివాస్ వాళ్ళు " లేక్ తాహు " చూడటానికి వెళుతూ నన్ను రమ్మన్నారు. వాళ్ళకు  వన్ ఇయర్ పాప. పేరు సహన. నాకు బాగా అలవాటైపోయింది. తన స్పెషాలిటి ఏంటంటే అమ్మాయి దగ్గరకస్సలు వెళ్ళదట. కాని నా దగ్గరకు బాగా వచ్చేది. నాకు మా మౌర్యని వదిలి వచ్చానేమెా, తనతో ఎక్కువ ఆడుకునేదాన్ని. "లేక్ తాహు  "  వెళుతున్నానని నరసరాజు అంకుల్ కి చెప్తే బావుంటుంది,ట్రెక్కింగ్ అది ఉంటుంది చూడు అని చెప్పారు. శ్రీను వాళ్ళ కార్ లో వాళ్ళు ముగ్గురు, నేను బయలుదేరాం. మాటల్లో శ్రీను మంజూ నువ్వు వచ్చి 6 నెలలు కాకుండానే ఇవన్నీ చూసేస్తున్నావు, నేను వచ్చిన 4,5 ఏళ్ళకు కాని చూసే అవకాశం రాలేనని నవ్వాడు. బాగా స్నో ఉన్న చోట ఫోటోలు దిగుతూ, కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం బాగా జరిగింది. అలా లేక్ తాహు వెళ్ళే దారిలో కొండలు,లోయలు, టన్నెల్ కూడా ఆ లాంగ్ డ్రైవ్ లో చూసేసాను.

మళ్ళీ కలుద్దాం..

       

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం అనుభవాలు... అప్పట్లో టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ లు రేట్లు ఎలా ఉండేవో తెలిస్తే...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం అనుభవాలు... అప్పట్లో టెలిఫోన్ మరియు ఇంటర్నెట్ లు రేట్లు ఎలా ఉండేవో తెలిస్తే...

21, మే 2020, గురువారం

చీకటి కల..!!

కలలెప్పుడూ 
చీకటిలోనే వస్తాయెందుకో

వెలుతురెప్పుడూ
రేయిని దాచేస్తుందెందుకో

జ్ఞాపకాలెప్పుడూ
గతంలోనే ఉంటాయెందుకో

మనసెప్పుడూ 
మనిషిలో మిగలదెందుకో

కళ్ళెప్పుడూ
మెలకువకల కనలేవెందుకో

గతెప్పుడూ
గమనంపై ఆధారపడుతుందెందుకో

ప్రశ్నకెప్పుడూ
సమాధానం దొరకదెందుకో

జీవితమెప్పుడూ
విధి చేతుల్లోనే తారాడుతుందెందుకో

నేనెప్పటికీ
నాకు తెలియనందుకేనేమెా ఇవన్నీ..!! 

20, మే 2020, బుధవారం

బతకాలన్న ఆశ...!!

ఊహించని విపత్తు
మృత్యువు రూపంలో 
వికటాట్టహాసంతో
కరాళనృత్యం చేస్తూ
కనుల ముందే కదలాడుతుంటే
బతకాలన్న ఆశతో 
ప్రాణాలనరచేతిలో పెట్టుకుని
అనుబంధాలను వెదుకులాడుతూ
భయం గుప్పిట్లో బంధీగా మారినా
కన్నెర్రజేసిన ప్రకృతి సహకరించకున్నా
కకావికలమై నలుదెసలు 
పరుగులు పెడుతున్న జీవకోటిని
రక్షించే నాధుడే భక్షకుడైన వేళ
వారి మెురనాలకించే ఆపద్భాంధవుడెవ్వరు? వేసారిన వలస బతుకులు...!!

కన్నవారిని 
పురిటిగడ్డను వదలి
కూలి కోసం 
కూటి కోసమీ వలస బతుకులు

ఆకలయినా
దాహమయినా ఓర్చుకుంటూ
కాసుల కోసం
చెమట చుక్కలనమ్ముకునే శ్రమజీవులు

మమకారమయినా
మాలిన్యమైనా మనసుకంటక
పరుల కోసం
ప్రాణాలనొడ్డే పారిశుద్ధ్య కార్మికులు

ప్రకృతి విలయాలకు
చెట్టుకొకరై పుట్టకొకరైపోయినా
అయినవారిని చేరలేక
ఆకలిదప్పులతో అలమటించే అన్నార్తులెందరో

కలోగంజో కలిసి తాగుదామంటూ
కాలినడకననైనా కష్టనష్టాలకోర్చి
సొంతగూటికి చేరాలనుకునే
సాయమందని బడుగుజీవులెందరో

కాలరక్కసి కరోనా రూపంలో 
కాటు వేయాలంటు కోరలు చాస్తుంటే
చావయినా బతుకయినా 
పేగు తెంచుకున్న గడ్డ మీదేనంటూ పయనమయ్యారిప్పుడు...!! 19, మే 2020, మంగళవారం

నీ పాదం..!!

ఒకప్పుడు
వీనులవిందైన 
మువ్వల సవ్వడితో
రాగానికనుగుణంగా నాట్యమాడే
లయ తప్పని జంట పాదాలవి

మరిప్పుడు 
భిన్న సంఘర్షణలతో
బంధనాలకు లోబడి
తనువు మనసు విడివడి
ఒంటరైన జంట పాదాలివి 

కలిసి నడవక తప్పని
కాలానికి చేరువైన జీవితాన్ని
కాదనలేని మెామాటంతో
బాధ్యతలకు, భావావేశానికి నడుమ
సమన్వయం లోపించకుండా నడయాడుతున్న 
కన్నీటి పన్నీటి కనువిందిది..!! 

వాణి గారు చిత్రానికి రాసిన కవిత చదివి, 
ఈ చిత్రానికి నాకూ రాయాలనిపించిన భావాలివి.. 
థాంక్యూ వాణి గారు... 

 


18, మే 2020, సోమవారం

కాలం వెంబడి కలం.. 2

         పుస్తకాలు చదవడం అన్న అలవాటు నాతో పాటుగా పెరుగుతూనే వచ్చింది. దానికి మరో కారణం నేను చదువుకున్న స్కూల్ కూడా. శ్రీ గద్దే వేంకట సత్యన్నారాయణ శిశు విద్యామందిరం, అవనిగడ్డ. మా స్కూల్ లో మాకు మెుదటి నుండి కూడా చదువు ఒక్కటే కాకుండా, పద్యాలు, పాటలు, ఆటలు ఇలా అన్నీ నేర్పించేవారు. మీరు నమ్మలేరేమెా కాని 1977, 78 ఆ టైమ్ లో శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం 3వ తరగతిలోనే నేర్పించారు. రోజూ ప్రార్థన అయ్యాక, ఓ సంస్కృత శ్లోకం చెప్పి దానికి తెలుగు అర్థం కూడా చెప్పాలి. (3వ తరగతి నుండి 6వ తరగతి వరకు నేను నా ఫ్రెండ్ ప్రార్థన చెప్పేవారము.) ఆరోజు వార్తలు కూడ చదివించేవారు. ఇక సాయంత్రం హనుమాన్ చాలీసా, భగవద్గీత చదివించేవారు. రోజూ వ్యాయామం, ఆసనాలు, సూర్య నమస్కారాలు చేయించేవారు. మాది గురుకుల పాఠశాల అప్పట్లో. ఆర్ ఎస్ ఎస్ భావాలు బాగా ఉండేవి. నేను ఆ స్కూల్ లో 2వ తరగతి నుండి 6వ తరగతి వరకు చదివాను. విలువలు, మంచి నడవడి, చదువు నేర్పిన దేవాలయమది. 

            అమ్మమ్మ మా దగ్గర ఉండి చదివించేది. అమ్మ వాళ్ళు మా ఊరిలో ఉండేవారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే అమ్మమ్మ నన్ను కోప్పడినా, ఏమైనా అన్నా వెంటనే పుస్తకంలో రాసేదాన్నట. నాకు గుర్తు లేదది. మా పక్కన ఉండే అక్కవాళ్ళు చెప్పేవారు. అన్ని రాసి అమ్మ వచ్చినప్పుడు చెప్పేదాన్నట. బహుశా ఇలా రాయడం కూడా అప్పటి అలవాటేనేమెా మరి. నాకు తెలిసి 6వ తరగతిలో మా స్నేహితుల మధ్యన గొడవలు జరిగినప్పుడు వెంటనే అది కథలా రాసి మా పిన్నికి చూపించడం, తను మీ విషయాన్నే కథగా రాశావా అనడం నాకిప్పటికి గుర్తే.
            2వ తరగతిలో రాధాకృష్ణ సీరియల్ తో మెుదలైన నా పుస్తక పఠనం అంచెలంచెలుగా చందమామ, బాలమిత్ర, బాలజ్యోతి వగైరాలతో ఆగకుండా, దినదిన ప్రవర్ధమానమై ఆంధ్రభూమిలో తులసిదళం, తులసి, ప్రార్థన, కాష్మోరా అంటూ బాగా విస్తరించింది. నేను ఈ పుస్తకాల పురుగునే అని నాకు చదువు రాదనుకోకండి... మా క్లాస్ లో సెకెండ్ నేనేనండి. టీచర్స్ అందరికి నా పుస్తకాల పిచ్చి తెలుసు. డిబేట్లలో కూడా ముందు ఉండేదాన్ని అప్పట్లో. ఇప్పుడు మాటలు రావులెండి... 😊

మరిన్ని కబుర్లతో  వచ్చే వారం... 

16, మే 2020, శనివారం

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం... సబ్జెక్టు ఉంది కాని ప్రాక్టికల్ లేదు... ఉదోగం లో ఎలా నెట్టుకు వచ్చిందో...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో మొదటి ఉద్యోగం... సబ్జెక్టు ఉంది కాని ప్రాక్టికల్ లేదు... ఉదోగం లో ఎలా నెట్టుకు వచ్చిందో...

భూతల స్వర్గమేనా..!! 10

        రెనో లో ఫ్లైట్ దిగి, ఎయిర్ పోర్ట్ లో నుండే అబ్బు శ్రీనివాస్ కి కాల్ చేసాను. ఎలా రావాలని. కాబ్ మాట్లాడుకుని రమ్మని చెప్పారు. సరేనని ఎయిర్ పోర్ట్ బయటికి వచ్చి కాబ్ లో కార్సన్ సిటి బయలుదేరాను. నవేడా స్టేట్ కాపిటల్ కార్సన్ సిటీ. అమెరికాలో స్టేట్ కాపిటల్స్ ఎక్కువగా చిన్న చిన్న ఊర్లే ఉంటాయి. కార్సన్ సిటి మెుత్తం ఎటునుండి ఎటు తిరిగినా 2, 3 మైళ్ళ కన్నా ఎక్కువ ఉండదు. అబ్బు ఉండే మెాటల్ దగ్గరకి వెళ్ళేసరికి అబ్బు, సంపత్ ఇద్దరు సంపత్ జీప్ వేసుకుని వచ్చారు. లగేజ్ అబ్బు రూమ్ లో పెట్టి ఆఫీస్ కి వెళ్ళాము ముగ్గురము.  లోపలికి వెళ్ళాక వీళ్ళు నేను వచ్చానని చెప్పగానే, కాసేపటికి మైక్ వచ్చి లోపలికి తీసుకువెళ్ళి, డ్రింక్ ఏమైనా  కావాలా అని అడిగితే వాటర్ కావాలన్నాను. బాటిల్ తెచ్చి ఇచ్చాడు. మానేజర్ ఈరోజు రాలేదు రేపు వస్తాడు, మీకు వర్క్ ఎలాట్ చేస్తాడని చెప్పి, నాకు మిగతావాళ్ళ దగ్గర సిస్టమ్, సీట్ చూపించాడు. వాళ్ళందరు వర్క్ చేసుకుంటునే నాతో మాట్లాడం, అలా లంచ్ టైమ్ వచ్చేసింది. 
          అబ్బు, సంపత్ రోజూ సంపత్ ఇంట్లోనే లంచ్ చేస్తారు. మరో శ్రీనివాస్, శ్యామ్ వాళ్ళిళ్ళకి వెళతారు. సంపత్ రోజూ అబ్బూని ఆఫీస్ కి తీసుకురావడం, సాయంత్రం దింపడం చేస్తాడు. నన్ను కూడా సంపత్ వాళ్ళింటికే భోజనానికి తీసుకువెళ్ళారు. భోంచేసాక ఓ కోక్ టిన్ ఇస్తే అలవాటు లేదన్నా. పర్లేదు తాగమంటే నా హాండ్ బాగ్ లో వేసుకున్నా. మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాం. సాయంత్రం అబ్బు రూమ్ కి వచ్చాం. వంట నేను చేస్తానని చేసాను. పాపం ఒక్కడే ఉండే అలవాటు కదా... ఎంప్లాయర్ మాట కాదనలేక నేను నాలుగు రోజులు ఉండటానికి ఒప్పుకున్నాడు కాస్త ఇబ్బందిగా. నేను నా కంఫర్టర్ వేసుకుని కింద పడుకున్నా. మెాటల్ లో బెడ్, టీ వి, వంట పాత్రలు కొన్ని ఇస్తారు. చిన్న డైనింగ్ టేబుల్ సెట్ కూడా ఇస్తారు కొన్ని చోట్ల. 
    మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్ళాక, ప్రాజెక్ట్ మానేజర్ క్రిష్ వస్తే, తనతో మాట్లాడటం, టెన్షన్ పడకుండా, ఫ్రీగా వర్క్ చేసుకో, విల్ సపోర్ట్ యు.. అని వర్క్ ఎలాట్ చేసారు. VC++ లో బిడ్ బార్ ని డిజైన్ చేసి పేజ్ లింక్ లు Vb లో చేసిన వాటికి ఇమ్మని చెప్పారు. మనం ఈ ప్రాజెక్ట్ కి వచ్చింది  VC++లో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగానన్నమాట. మనకేం రాదని చెప్పలేము. ఇక మన కష్టాలు మెుదలు. మనకా  VC++ చదివిన నాలెడ్జే కాని ప్రాక్టికల్ గా లేదాయే. సరే ఆరోజు అసలు ఏం చేయాలో, ఏమిటో అన్ని చూసుకుంటూ నోట్సు రాసుకున్నా. సాయంత్రం రూమ్ కి వచ్చాక పుస్తకాలు ముందేసుకుని రేపు చేయాల్సిన వాటి గురించి చూసుకుంటున్నా. అబ్బు అడిగాడు...వెంకట్ మీరు బాగా ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పాడంటే, నేను కాదని నా పరిస్థితి ఇదని చెప్పా.  మానేజర్ క్రిష్ చాలా మంచోడు, కంగారు పడకుండా మెల్లగా చేసుకోండని అబ్బు చెప్పాడు. అలాగే ఆ వీక్ గడిచింది. వీకెండ్ కొత్తగా మా ఆఫీస్ లో చేరే కాలే శ్రీనివాసరావు దంపతులు అబ్బు రూమ్ కి వచ్చారు. వాళ్ళు ఇల్లు చూసుకుంటున్నారు. నన్ను వాళ్ళతో షేర్ చేసుకోమన్నారు. నాకేమెా అంతా కొత్త కదా.. పోన్లే కాస్త ఖర్చు తగ్గుతుంది, కార్ తో కూడా పని ఉండదు, కాలే శ్రీనివాసరావు గారు తీసుకువెళతారులే, లేదంటే అదే అపార్ట్మెంట్స్ లో మరో శ్రీను, శ్యామ్ కూడా ఉంటున్నారు. ట్రాన్స్పోర్ట్ కి ప్రోబ్లం ఉండదులే అనుకున్నా. అబ్బు హెల్ప్ తో బాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, డబ్బులు దానిలో వేశాను. బాంక్ మనీ మెషిన్ లో డబ్బులు, చెక్ ఎలా డిపాజిట్ చేయాలో కూడా అబ్బునే చూపించాడు. వీకెండ్ అబ్బు రూమ్ లో కాలిఫోర్నియాలోని వాళ్ళ అన్నయ్య  దగ్గర నుండి తెచ్చుకున్న తెలుగు సినిమాలు చూడటంతో గడిచిపోయింది. నేను నా పెళ్ళైన తర్వాత చూడని సినిమాలన్నీ అమెరికా వెళ్ళాక చూసేసానన్నమాట. 

మళ్ళీ కలుద్దాం.. 

 

15, మే 2020, శుక్రవారం

పేరు వెనుక కథాకమామీషు..!!

రెండు మూడు రోజుల క్రిందట అనుకుంటా నాకిష్టమైన మా  పెదనాన్న ఫోన్ చేసి ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ ఇంకేమైనా పుస్తకాలు వేస్తున్నావా అమ్మా అన్నారు. లేదు పెదనాన్నా ఈమధ్య ఓ పుస్తకం వేశానుగా, అది మీకు చేరలేదనపకుంటా అని, నా పుస్తకాలు ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయన్నారు. అక్క దగ్గరకు వస్తూ నీ పుస్తకం ఒకటి తెచ్చుకున్నా, ఇంకా చదవలేదు అని అంటూ కొత్త పుస్తకం పేరడిగితే అక్షర స(వి)న్యాసం అని చెప్పగానే... 
     నీకు తెలుసా భగవద్గీతలోని ఆఖరి అధ్యాయం మెాక్ష సన్యాస యెాగం. అందరు మెాక్షం కోసం భగవంతుని ప్రార్థిస్తారు.అక్షరుడు అంటే భగవంతుడు, క్షరము లేని వాడు. అక్షర సన్యాసం అంటే భగవంతుని సన్యసించడం, అంటే నీకు నువ్వే అన్నమాట. ఏ కోరికలు లేకపోవడము అని చాలా వివరణ ఇచ్చారు. నాకు ఈ వివరణ అంతా తెలియదు కాని అక్షర స(వి)న్యాసం పేరు మాత్రం ఎందుకో బాగా నచ్చింది. అక్షరాలకు ఏ భవబంధాలు ఉండవు, అప్పుడే పుట్టిన పాపాయంత స్వచ్ఛమైనవి, ఏ కల్మషము లేనివి నా అక్షరాలని ఆ పేరు పెట్టాను. భగవద్గీత అంటే మా పెదనాన్నకు చాలా చాలా ఇష్టం. నాకు ఇదంతా తెలియదు పెదనాన్న కాని ఆ పేరు మీద ఇష్టంతో ఇందుకు పెట్టానని  చెప్పాను. 
ఇదండి నా పుస్తకం " అక్షర స(వి)న్యాసం " వెనుక, ముందు కథ.

13, మే 2020, బుధవారం

ఏంటో పాపం...!!

నేస్తం,

  మనం మన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే వెసులుబాటున్నప్పుడు, అదే అవకాశం మిగతావారికి కూడా ఉంటుందని ఎందుకు ఆలోచించలేకపోతున్నాం. కళ్ళున్నా చూడలేని చదువుకున్న మూర్ఖులు ఎందరితోనో మనం కలిసి సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఒకరంటారు ప్రతిపక్షం సరైన బాధ్యత తీసుకోవడం లేదని. మరొకరంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీస బాధ్యతగా అసెంబ్లీకి రాని వాడికి అధికారం కట్టబెట్టిన జనాన్ని ఏమనాలని. విషవాయువుతో ప్రాణాలు కోల్పోయిన జీవాలకు కోట్లు వెదజల్లుతామంటున్నారు కాని దానికి కారణమైన వారిపై కనీస చర్యలు తీసుకోలేదు. ఎదురు బాధితులు మీద కేసులు పెట్టడం, కరంటు బిల్లులు ఇస్తున్న షాక్ నభూతో నభవిష్యతి.
మీకు వ్యక్తి నచ్చితే గుడి కట్టి పూజ చేసుకోండి,తప్పులేదు. కాని రాష్ట్రం ఏ స్థితి నుండి ఏ స్థాయికి పడిందో లేదా ఎగసిపడిందో, ఈ సంవత్సరం నుండి జరిగిన అభివృద్ధిపై కాస్త ఓ పోస్ట్ రాద్దురూ. మేమూ చూసి సంతోషంతో కడుపు నింపుకుంటాం. అంటే మీ దృష్టి కోణంలో పురోగతి ఏమిటో వివరించమని మనవి. పాలన చేయాల్సింది, రాష్ట్ర అభివృద్ధిని గాడిలో పెట్టాల్సింది (మీ దృష్టి లో ఇంతకు ముందు ఏమి అభివృద్ధి జరగలేదు కదా) పాలకపక్షమని మరిచిపోతే ఎలాగండి? కుల వివక్షతో ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయని పాలనని మీకనిపించక పోవడం దురదృష్టం. పారదర్శకులమని చెప్పుకుంటే చాలదు. పార్టీలకు కొమ్ము కాయమని చెప్పుకుంటే సరిపోదు. ఎవరికి వారు అందరు గురువింద గింజలే మరి. మనం ఒకటి అంటే ఎదుటివారు వంద అనగలరు..పడే వాడికి తెలుస్తుంది ఆ బాధ. ఒడ్డున ఉండి సవాలక్ష చెప్తాం మనదేం పోయిందని. గౌరవం మనకంటూ మనం ఇచ్చేటట్లు ఎదుటివారి ప్రవర్తన ఉండాలి. పదవి, అధికారానికి విలువ ఇవ్వాలంటే  వాటికి వన్నె తెచ్చే వ్యక్తిత్వం వారికుండాలి. అంతేకాని అడుక్కుంటేనో, భయపెడితేనో గౌరవం ఇవ్వరు.. జర గుర్తుంచుకోండి సారూ... 😊

11, మే 2020, సోమవారం

కాలం వెంబడి కలం...!! 1

#బాటసారులందరికీ నమస్కారం.

#తెలుగు #సాహితీరంగంలో #మంజు యనమదల గారిని ఎలాంటి సందేహమూ 

లేకుండా ఓ #ధృవతారగా పేర్కొనవచ్చు...

#బాటసారులలో రచనాసక్తిని పెంపొందించటానికి, తమ అక్షర సంపదను 

మెరుగుపరుచుకోవడానికి...

#ఓ అక్షరం రాయాలనే ఆకాంక్ష ఉండీ రాయలేని వారిలో ఆత్మవిశ్వాసం 

నింపడానికి...

#ప్రతి గొప్పపనీ ఓ సాధారణ అడుగుతో మొదలై కాలంతో పాటు ఎదుగుతుందని

తెలుసుకోవడానికి వీరి జీవిత విశేషాలు ఉపకరిస్తాయనే ఆకాంక్షతో

మీకందరికీ పరిచయం చేస్తున్నాము.

#మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ.... నేటి నుండీ నూతన శీర్షిక

#కాలం వెంబడి కాలం  ప్రారంభ కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతూ....

#మంజు యనమదల గారికి సవినయంగా హృదయపూర్వక #కృతజ్ఞతలు మరియు 

#శుభాకాంక్షలు అందజేస్తూ....

టీం....కవితాలయం.

************************************************************

#కాలం వెంబడి కలం#
                          
      #కవితాలయం సాహిత్య - సామాజిక సేవా సంస్థ నుండి పవన్ మెసెంజర్ లో నెంబరడిగి, తర్వాత రోజు ఫోన్ చేసి విజయవాడలో కవితాలయం ద్వితీయవార్షికోత్సవ కార్యక్రమం ఉంది మీరు తప్పక రావాలని పిలిచారు. తర్వాత లింగుట్ల వెంకటేశ్వర్లు గారు, అంజు గుంటూరు, సింహాగారు కూడా మాట్లాడి తప్పక రావాలని కోరారు. ఇంతమంది పిలుస్తున్నారు కాసేపు వెళ్ళివద్దామనుకున్నాను. అతిథిగా రాను కాని ప్రేక్షకురాలిగా వస్తానని చెప్పాను. కార్యక్రమం రోజు పతీ సమేతంగా సంధ్య వచ్చి నన్ను కార్యక్రమాకి తీసుకువెళ్ళింది. అక్కడ సభను చూసాక చాలా సంతోషం వేసింది. నా మతిమరుపుతో నేను మర్చిపోయినా అందరు చక్కగా పలకరించారు. కార్యక్రమం చాలా బాగా జరిగింది. ఆలశ్యంగా వచ్చినా కత్తిమండ ప్రతాప్ గారి ఉపన్యాసం సభికులను ఆద్యంతమూ ఆకట్టుకుంది. ఇలా నా ముఖపుస్తక పరిచయం కాస్తా ముఖ పరిచయంగా కవితాలయానికి పరిచయమైంది. కాదంటున్నా గౌరవ సలహాదారుగా గౌరవించి, వారం వారం కాస్త నా అనుభవాలను కవితాలయానికి కూడా పంచమని పవన్ చెప్పాడు అనడం కన్నా ఒప్పించాడనడం సబబుగా ఉంటుంది. సాహిత్యం గురించి నాకు ఏమి తెలియదని చెప్పినా వినని మెుండివాడు పవన్.
         కాలం వెంబడి నా కలం ఎలా పయనించిందో చెప్పడానికి ముందు పుస్తకాలతో నా స్నేహం ఎలా మెుదలైందో చెప్పాలి. ఏదో చిన్నప్పటి నుండి అమ్మ చెప్పిన కథలు వినడం, కథలు అమ్మతో చదివించుకుని సంతోషపడిన పసితనం నాది. పుస్తకాలు చదవడం చాలా చిన్నతనం నుండే అలవాటైంది. 2వ తరగతి నుండే ఆంధ్రజ్యోతిలో  రాధాకృష్ణ సీరియల్ చదివేదాన్ని. ఆ పుస్తకం, ఈ పుస్తకం అని తేడా లేకుండా ఏదైనా చదివేసేదాన్ని. పీపుల్స్ ఎన్ కౌంటర్ తో పాటు బాలమిత్ర, చందమామ, బొమ్మరిల్లు, బాబు బొమ్మల పుస్తకాలు ఇలా ఏది కనబడితే అది కొని చదివేసేదాన్ని. ఇవి చాలక మళ్ళీ స్కూల్ అవగానే కాసేపు పార్క్ లో ఆడుకుని, ఎదురుగా ఉన్న లైబ్రరీ లో పుస్తకాలు చదివేదాన్ని. అన్నం తింటూ, నడుస్తూ కూడా పుస్తకాలు చదువుతూనే ఉండేదాన్ని. మరి పుస్తకాలంటే అంతిష్టం ఎందుకో నాకూ తెలియదు ఇప్పటికీ. ఆ అలవాటే ఇలా మీ అందరిని ఆప్తులుగా నాకు పరిచయం చేసింది. ఇది అక్షర అనుబంధం. ఇందరు ఆత్మీయులనిచ్చిన ఈ అక్షరానికెప్పుడూ బుుణపడి ఉంటాను. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ.... #మంజు #యనమదల అండి. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.....

9, మే 2020, శనివారం

భూతల స్వర్గమేనా..!! పార్ట్ 9

పార్ట్ 9...!!
       న్యూ ఇయర్ పార్టీ బాగానే జరిగింది. మనకేమెా అమెరికన్ ఫుడ్ ఏదీ తెలియదు. పేర్లు కూడా తెలియవాయే. పీజా పేరు తెలుసంతే. నాతో ఉండే పిల్లలు ఎవరో ఒకరు ఆర్డర్ చేసేవారు. కైలాష్ ఓసారి చికాగోలోని దీవాన్ స్ట్రీట్ కి తీసుకువెళ్ళాడు వీకెండ్. మరో చార్మినార్ చౌరస్తాలా ఉంటుంది, పాన్ ఉమ్ములు, గుట్టలు గుట్టలుగా జనాలు, పార్కింగ్ చేయడానికి కూడా ఖాళీ దొరకనంత బిజీగా ఉంది దీవాన్ స్ట్రీట్. దోశలు వేయడానికి మినప్పిండి(ఉరద్ ఫ్లోర్)అక్కడే మెుదట చూడటం. 4 కప్పులు బియ్యం పిండికి 1 కప్పు మినప్పిండి అంట. తర్వాత అలానే కలిపి దోశలు వేసి చూపించాడు కైలాష్. కావాల్సిన గ్రోసరీస్ కొనుక్కుని సాయంత్రానికి గెస్ట్ హౌస్ కి వచ్చేసాము. కైలాష్ కి ప్రాజెక్ట్ అయిపోయి గెస్ట్ హౌస్ కి వచ్చాడు. ఒరాకిల్ ఫైనాన్షియల్ ట్రైనింగ్ కోసం. అది ఇంజనీరింగ్ లో మా సీనియర్ తిరుమలరెడ్డి చెప్పారు. కైలాష్ నా గురించి చెప్తే వచ్చి కలిసి మాట్లాడి, మా సీనియర్ అక్కా వాళ్ళ వివరాలు, ఫోన్ నెంబర్లు చెప్పి వెళ్ళారు. అలా మా సీనియర్స్ కొందరు కూడా టచ్ లోకి వచ్చారన్న మాట కైలాష్ పుణ్యమా అని.
         కైలాష్, ఇంకా కొంతమంది పిల్లలతో గెస్ట్ హౌస్ సందడిగానే ఉండేది. ఈలోపల నా పుట్టినరోజు వచ్చేసింది. అందరు కలిసి కేక్ తీసుకువచ్చి నాకు సర్ప్రయిజ్ ఇచ్చారు ఆ రాత్రి 12 గంటలకి. మరుసటిరోజు బాబ్ కూడా కాల్ చేసి విష్ చేసారు. వినయ్ గారు, నా ఫ్రెండ్స్ అందరు విష్ చేసారు. అన్నయ్య వాళ్ళింట్లో ఉన్నప్పుడు కూడా  5 నిమిషాలయినా రోజూ లేదంటే రోజు విడిచి రోజయినా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడేదాన్ని. పాపం అన్నయ్యకు నా మూలంగా ఫోన్ బిల్ ఎక్కువే వచ్చి ఉంటుంది. అయినా ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు. చికాగో వచ్చాక నరసరాజు అంకుల్ ముందు ఓ నెంబర్ ఇచ్చారు ఇండియాకి కాల్ చేసుకో అని. ఉమలు ఇద్దరు, సతీష్ కూడా కాలింగ్ కార్డ్స్ ఇచ్చారు. రోజూ ఇంటికి ఏదొక టైమ్ లో ఫోన్ మాట్లాడుతునే ఉండేదాన్ని. సంవత్సరంనర్ర కొడుకుని వదిలి దేశం కాని దేశం ఒంటరిగా వచ్చాను కదా. ఫోన్ లో మాట్లాడుతూ బెంగ తీర్చుకోవడమే. 
         ట్రైనింగ్ అయ్యాకా అమ్మాయిలందరు వెళిపోయారు. వాళ్ళంతా H4 డిపెండెంట్ వీసా మీద ఉన్నవాళ్లు. H1B కి డిపెండెంట్ ను H4 వీసాగా పరిగణిస్తారు. వీళ్ళు H4 వీసాతో జాబ్ చేయకూడదు. H1B గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా డిపెండెంట్ వీసా మీద వచ్చిన చాలామంది MS లో జాయిన్ అవుతారు. అమెరికాలో ఉండటానికి వీసా స్టేటస్ చాలా ముఖ్యం. అమ్మాయిలు వెళ్ళిన కొన్ని రోజులకే కైలాష్ కూడా వెళిపోయాడు. ఒక ఫామిలి గెస్ట్ హౌస్ కి వచ్చారు. వాళ్ళు వచ్చిన రెండు మూడు రోజులలోనే నాకు VC++ లో ప్రాజెక్ట్ ఉందని బాబ్, వినయ్ గారు చెప్పారు. జనవరి చివరిలో నాకు జాబ్ కార్సన్ సిటిలో వచ్చింది. కైలాష్ కి, నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పాను. ఇంటికేమెా రోజూ చేస్తూనే ఉన్నా. కార్సన్ సిటికి బయలుదేరే ముందురోజు షన్ముఖ్ మా గెస్ట్ హౌస్ కి కాస్త వాకబుల్ డిస్టెన్స్ లో వాల్ మార్ట్  అనుకుంటా సరిగా గుర్తు లేదు షాప్ కి తీసుకువెళ్ళి కావాల్సినవి చెప్తే కొనుక్కున్నాను. మౌత్ ఫ్రెషనర్, సోప్స్, డియడరెంట్స్ లాంటివన్న మాట. ఎయిర్ టికెట్ కంపెనీ వాళ్ళు బుక్ చేసారు. నా చేతికి 400ల డాలర్లు కూడా ఇచ్చారు. మరుసటిరోజు చికాగో డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ కి కాబ్ బుక్ చేసుకున్నా. కార్సన్ సిటిలో బాబ్ వాళ్ళ బాబాయి వెంకట్ అని ఆయన కంపెనీ వాళ్ళు నలుగురు నేను పని చేయాల్సిన ప్రాజెక్ట్ లోనే ఉన్నారు. వాళ్ళలో ఒకతని ఫోన్ నెంబర్, అడ్రస్ ఇచ్చారు. తన దగ్గరకి వెళ్ళి కలవమని. సాయంత్రం నా ఫ్లైట్. ఆరోజు ఉదయం నుండి జ్వరంతో ఉన్నా. నాతో గెస్ట్ హౌస్ లో ఉన్నామె ముందురోజు తను ప్రాజెక్ట్ నుండి ఎందుకు త్వరగా బయటకు వచ్చేసిందో, తన బాధల గాథలు చెప్పింది. మానేజర్ పార్టీకి రమ్మని పిలిచారు, వెళ్ళలేదని, అందుకే జాబ్ నుండి తీసేసారని చెప్పింది. విని ఊరుకున్నా. జ్వరంతో ఏమీ తినలేదని నూడిల్స్ చేసింది. నాకసలు పడవవి. కొద్దిగా తిని నా సూట్కేస్లు రెండు, హాండ్ లగేజ్, హాండ్ బాగ్తో కార్సన్ సిటికి వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ కి కాబ్ లో బయలుదేరా. దారిలో బాగా వామిటింగ్ అయ్యింది. వర్షం కూడా మెుదలయ్యింది. అలాగే ఎయిర్ పోర్ట్ కి వెళ్ళి లగేజ్ చెక్ ఇన్ చేసి, బోర్డింగ్ పాస్ తీసుకుని గేట్ దగ్గరకి వెళ్ళాను. ఫ్లైట్ లేట్ అన్నారు. వెదర్ బాలేదని వేరే రూట్లో పంపించారు. కెనడాలోని  ఓంటారియెా మీదుగా వెళ్ళాలి. ఓంటారియెాలో ఫ్లైట్ మారాలి. మా ఫ్లైట్ ఓంటారియెా వెళ్ళేసరికి కనక్టివ్ ఫ్లైట్ మిస్ అయ్యింది. రేపు మార్నింగ్ వరకు ఫ్లైట్స్ లేవన్నారు. వాళ్ళే ఓ రూమ్ ఇచ్చారు. నాకేమెా బాగా ఆకలి వేస్తోంది. రిసెప్షన్ కి కాల్ చేస్తే, రూమ్ బాయ్ ని పంపారు. మనకేమెా తినడానికి ఏం చెప్పాలో తెలియదు. బాయ్ ని అడిగా.. ఫుడ్ 20 డాలర్ల వరకు వాళ్ళే ఇస్తారట. సరేనని మనకి తెలిసిన ఒక్క పేరు పీజా చెప్పి ఓన్లీ వెజిటేరియన్ అని చెప్పా. ఓ పెద్ద పీజా తెచ్చిచ్చాడు. ఒకేవొక్క పీస్ తినేసరికి ఆకలి తీరిపోయింది. కార్సన్ సిటిలో కంపెనీవాళ్ళిచ్చిన నంబర్ కి కాల్ చేసి పరిస్థితి చెప్పాను. ఉమకి కాల్ చేసి చెప్పా పలానా చోట ఉన్నాను అని. అది నవ్వి నువ్వే నయం వీసా లేకుండా కెనడా వెళ్ళావంది. అది చెప్పే వరకు నాకు నేనున్నది కెనడా అని తెలియదులెండి. భయంభయంగా హోటల్ రూమ్లో ఆ రాత్రి గడిచింది. పొద్దున్నే 8 కి రెనో కి ఫ్లైట్ ఉందని చెప్పారుగా. మరో విమానంలో కార్సన్ సిటికి వెళ్ళడానికి రెనో బయలుదేరాను. 


మళ్ళీ కలుద్దాం... 

ఆంద్ర ఆడపడుచు కొత్త ఉద్యోగ లో చేరడం కోసం మరో సిటీకి ప్రయాణం... ఫ్లైట్ డిలే తో 3 కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్... మూడు ఎయిర్ పోర్టులలో నిరీక్షణలో ఏమి జరిగిందంటే...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..

ఆంద్ర ఆడపడుచు కొత్త ఉద్యోగ లో చేరడం కోసం మరో సిటీకి ప్రయాణం... ఫ్లైట్ డిలే తో 3 కనెక్టింగ్ ఫ్లైట్లు మిస్... మూడు ఎయిర్ పోర్టులలో నిరీక్షణలో ఏమి జరిగిందంటే...

4, మే 2020, సోమవారం

ఆవకాయ..!!

ఎన్ని కాలాలను
వెనక్కి తీసుకెళుతుందో

బోలెడు తీపి జ్ఞాపకాలను
కారంగా గుర్తు చేస్తుంటుంది ప్రతిఏడూ

రకరకాల మామిడికాయలతో
ఇంపైన రుచులనదింస్తూనే ఉంటుంది

తరాలు మారుతున్నా
తరగని రుచితో వేసవిలో పసందైన విందు

వైశాఖపు పెళ్ళిళ్లలో
అగ్ర తాంబూలమీ రుచిదే

చిన్ననాటి గోరుముద్దలకు
ఏమాత్రం తీసిపోనిదీ పచ్చడిముద్ద

చూడగానే పిన్నలకు పెద్దలకు 
లాలాజలమూరించే ఘాటైన ఎర్ర బంగారం

బిడ్డ  పుట్టుకతో కన్నీళ్ళను కూడా ఆస్వాదించే
అమ్మంత ఇష్టమైనది ఇంటిల్లపాదికీ

వాసత్వపు చేతిరుచుల అద్భుత ఔషధం 
అమ్మమ్మ చేతి ఆవకాయ అమ్మ నుండి మనకు..!!


3, మే 2020, ఆదివారం

వేసారిన వలస బతుకులు...!! మమకారమయినా మాలిన్యమైనా మనసుకంటక ప్రాణాలనొడ్డే జీవులు

వేసారిన వలస బతుకులు...!! మమకారమయినా మాలిన్యమైనా మనసుకంటక ప్రాణాలనొడ్డే జీవులు

2, మే 2020, శనివారం

ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం కోసం కొత్త కోర్సుల ట్రైనింగ్... అమెరికా ఇంగ్లిషు యాస కోసం కిటుకులు...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగం కోసం కొత్త కోర్సుల ట్రైనింగ్... అమెరికా ఇంగ్లిషు యాస కోసం కిటుకులు...

భూతల స్వర్గమేనా..8

పార్ట్ 8...!!

        అన్నయ్య నాకు అమెరికన్ యాక్సెంట్ అర్థం కావడానికి టి వి చూడమని చెప్తూ, జీరోని ఓ(O) అంటారని, Z ని జీ అంటారని, పదంలో సెకెండ్ లెటర్ని సాగదీస్తారని ఇలా కొన్ని చిట్కాలు చెప్పాడు. అన్నయ్య ఇంకో మాట కూడా చెప్పాడు. అమెరికాలో కాలేజ్ ని స్కూల్ అంటారని కూడా. నాకు అమెరికాలో ఇళ్ళు చూస్తే భలే ఆశ్చర్యం వేసేది. గోడలకు రాళ్ళ(ఇటుకలు) కన్నా ఎక్కువ అద్దాలు ఉండేవి. నాకు ఓ పేద్ద అనుమానం వచ్చి వదినని అడిగాను. వదినా దొంగలకు గోడలు పగలగొట్టడం కన్నా గ్లాసులు పగలగొట్టడం తేలిక కదా అని. వదిన నవ్వి ఇక్కడ గ్లాసెస్ పగలగొడితే చాలా పెద్ద క్రైమ్ అని చెప్పింది. అప్పుడు కాస్త ఊపిరి పీల్చుకున్నా. అలా నా యక్ష ప్రశ్నలతో అందరిని కాస్త విసిగిస్తూ ఉండేదాన్ని. 
        బెల్ ఎయిర్ లో అన్నయ్యా వాళ్ళింట్లో ఉన్నప్పుడు స్నో కొద్దిగా పడితేనే అదో వింతలా చూసిన నేను..చికాగోలో ఫ్లైట్ దిగిన రోజు 6 అడుగుల స్నో బయటంతా. విపరీతమైన చలి. డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ నుండి అరోరా HNC Solutions కంపెని గెస్ట్ హౌస్ కి రావడానికి కాబ్ మాట్లాడుకుని నా లగేజ్ వేసుకుని బయలుదేరాను. పాపం కాబ్ డ్రైవర్ చాలా మంచోడు. అడ్రస్ కనుక్కుని మరీ నన్ను సేఫ్ గా చేర్చడమే కాకుండా నా లగేజ్ రెండు పెద్ద సూట్కేస్ లు కూడా తెచ్చి గుమ్మం ముందు అదేలెండి తలుపు ముందు పెట్టి వెళ్ళాడు. మీటర్ ఛార్జ్ ఎంతయ్యిందో గుర్తులేదిప్పుడు. ఓ 140 డాలర్లు అయ్యిందనుకుంటా. కాలింగ్ బెల్ కొట్టగానే వినయ్ గారి వైఫ్ తలుపు తీసారు. లగేజ్ పైన రూమ్ లో పెట్టాను. వినయ్ గారు ఆఫీస్ నుండి వచ్చి కాసేపు మాట్లాడారు. అప్పుడు వాళ్ళకు నెలల బాబు సత్య కూడా ఉన్నాడు. వినయ్ గారి ఫ్రెండ్ బ్రహ్మయ్య కూడా పరిచయమయ్యారు. నేనున్న గెస్ట్ హౌస్ కి కాస్త దగ్గరలోనే మరొక గెస్ట్ హౌస్ లో కొందరు అబ్బాయిలున్నారు. మా అందరికి పీపుల్ సాఫ్ట్ క్లాసులు మెుదలయ్యాయి. నాతో కలిపి ఐదుగురు అనుకుంటా మా బాచ్. నేను ఒక్కదాన్నే అమ్మాయిని. కొత్తది నేర్చుకోవడం బానే ఉంది. మాలో మూర్తికి ముందే పీపుల్ సాఫ్ట్ వచ్చు. మాతోపాటుగా మరి కొందరికి ఒరాకిల్ ఫైనాన్షియల్, జావా లాంటి కోర్సులు కూడా నేర్పించారు. ఆ టైమ్ లోనే ఒకబ్బాయి ఈ కంపెనీ నుండి వేరే కంపెనీకి మారిపోయాడు. అదో పెద్ద గొడవ అప్పుడు. నేను వినయ్ గారి కుటుంబంతో కలిసి భోజనం చేసేదాన్ని. ఆవిడ పేరు కూడా మంజునే. ఆవిడే వంట చేసేవారు ఎక్కువగా. ఓ రోజు పారాడైమ్ కంపెనీ అతను ఫోన్ చేసి ఇన్ హౌస్ ప్రాజెక్ట్ ఉంది వచ్చేయండి అన్నాడు. నాకు మాట్లాడటం రాదని వాళ్ళు వేసుకున్న జోక్స్ నాకు బాగా గుర్తున్నాయి. నేను అంతలా బాధ పడటానికి కారణం వీళ్ళు కూడా. అందుకే రానని ఖచ్చితంగా చెప్పేసాను. వినయ్ గారు ఎవరు ఫోన్ అని అడిగితే విషయం చెప్పాను. బాబ్ కి ఇష్టం ఉండవు ఇలాంటి విషయాలు, వాళ్ళతో చెప్పేయండి ఫోన్ చేయవద్దని అని అంటే చెప్పేసానండి అని చెప్పాను. 
           HNC Solutions కంపెనీ CEO రఘుబాబు పోతిని. బాబ్ అన్న పేరుతో అమెరికాలో చలామణి అవుతున్నారన్నమాట. ఓ నార్త్ ఇండియన్ ఆమె, ఈయన కలిసి ఉంటున్నారని సూచాయగా అందరికి తెలుసు. ఆమె కూడా కంపెనీ వ్యవహారాలన్ని చూస్తుండేది. మాతో కాస్త కలివిడిగా మాట్లాడేది. బాబ్ సీరియస్ గా ఉండేవాడు. నా పర్సనల్ విషయాలు అడిగితే సూర్యవంశం టైప్ స్టోరి, కాకపోతే నేను కలక్టర్ ని కాదు అని చెప్తే నవ్వేసి, అంతకన్నా ఎక్కువే అంది. అన్నట్టు ఆమెకు తెలుగు రాదండోయ్. మనకా ఇంగ్లీష్ అంతంత మాత్రమేనాయే. అయినా కమ్యూనికేషన్ కి ఏం ప్రోబ్లం ఉండేది కాదు. మహానటి సినిమాలో సావిత్రి అన్నట్టు భాషదేం ఉంది..భావం ముఖ్యమన్నట్టుగా. 
           వేరే కోర్సుల కోసం మిగతావారు కూడా రావడంతో వినయ్ గారు వేరే ఇంటికి మారాలనుకున్నారు. కైలాష్, షన్ముఖ్ ఇంకా 4,5 అమ్మాయిలు గెస్ట్ హౌస్ కి వచ్చారు. పగలంతా ట్రైనింగ్ క్లాసులతో సరిపోయేది. వచ్చాక తిండి, చదువుకోవడం, నిద్ర టైమ్ కుదిరినప్పుడు ఇంటికి ఫోన్ చేయడం, క్షేమ సమాచారాల కబుర్లతో కాలం జరిగిపోతోంది. చికాగో వచ్చినప్పటి నుండి కళ్యాణ్ వాళ్ళు కొనిచ్చిన కంఫర్టర్ నాలో ఒక భాగమైపోయింది మళ్ళీ నేను అమెరికా వదిలి వచ్చేవరకూ. 
          మేము ఆఫీస్ కి వెళ్ళే దారిలోనే అరోరా వేంకటేశ్వరస్వామి గుడి ఉండేది. శుక్ర, శని, ఆదివారాల్లో కుదిరినప్పుడు టెంపుల్ కి వెళ్ళి, అక్కడ విష్ణు సహస్ర నామావళిలో మేమూ పాల్గొంటూ
ఉండేవారం. చాలా ప్రశాంతంగా ఉండేది అక్కడి వాతావరణం. అమెరికాలో మెుదటి న్యూ ఇయర్ పార్టీ జరిగింది. వినయ్ గారు పొద్దున్నే కూర్చోబెట్టి మంచిమాటలు చెప్పి, భవిష్యత్తు మీద నమ్మకాన్ని కలిగించారు. తర్వాత వాళ్ళు ఇల్లు మారిపోయారు. 

మళ్ళీ కలుద్దాం.. 
             
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner