30, డిసెంబర్ 2019, సోమవారం

ఏ గూడే చిలుకా నీది...!!

ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులే పలుకు అన్నట్టుగా, ఎన్ని కమిటీలు వేసినా, ఎవరెంత గడ్డి పెట్టినా మూర్ఖుని మనసు రంజింపజేయలేరు. ప్రపంచమంతా హేళన చేస్తున్నా మాకు కనబడదు, వినబడదు. పక్క రాష్ట్రంలోని తన ఆస్థుల కోసం, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం శాయశక్తులా ప్రయత్నిస్తున్నందుకు వీరిని ప్రతి ఆంధ్రుడు గౌరవించాలి. మిమ్మల్ని డైరెక్ట్ గానే అంటున్నారు అక్కడి సదరు మంత్రివర్యులు. వారి అభివృద్ధికి మీరే కారణమని. రేపటి రోజున ఓ బిరుదు ఇచ్చి ఓ శాలువా కప్పి సత్కరిస్తారు వారికి చేసిన సాయానికి. యథా రాజా తథా ప్రజా అన్నట్టు మంత్రులకే నోరు అదుపులో లేనప్పుడు మీడియాకెలా ఉంటుందిలెండి. అమ్మా తమరంతా ఆ పెయిడ్ ఆర్టిస్టులు ఓట్లు వేస్తేనే గెలిచారని మర్చిపోతే రేపన్నది ఉందని వారు గుర్తుంచుకుంటారు. కాస్త డైవర్షన్స్ ఆపి పని చేయండి. ఇప్పటికే తమకు ఏదీ చాతకాదని తెలిసిపోయింది జనానికి. ఇక వేస్తున్న కుప్పిగంతులు ఆపి పని చూడండి.. అమరావతి కాకపోతే అండమాన్ రాజధాని చేసుకొండి.. లేదంటే బ్లాక్ మనీ వైట్ చేసుకున్న దీవులను చేసుకొండి...ఏదైనా మీ చేతిలో పనిగా. మాకు కొత్తగా జరిగే నష్టం ఏమీ లేదు. కానీ శుక్రవారం మర్చిపోకండి..ఏ పని చేసినా శుక్రవారం చేయండి. 😊


28, డిసెంబర్ 2019, శనివారం

ఏవి ఆనాటి విలువలు...!!

నేస్తం, 
          ఒకప్పుడు వార్తా పత్రికలన్నా, విలేఖరులన్నా, రచయితలన్నా చాలా గౌరవంగా ఉండేవారు ప్రజలు. నాయకుడెవరైనా, అధికార పక్షమేదైనా ప్రజల పక్షానా పత్రికలుండేవి. ఏవి ఆనాటి విలువలు? ఏవీ ఈనాటి వ్యక్తిత్వాలు? కాగడా సారీ టార్చిలైట్ ఓ కాదు కాదు సెల్ ఫోన్ లైట్ వేసి వెదికినా దొరకడం లేదిప్పుడు. పరస్పర దాడులు, వ్యక్తిగత దూషణలు పరిపాటైన ప్రజాస్వామ్యమిప్పుడు మనదని గర్వపడదాం. 
        అధికారానికి ప్రతిదీ అమ్ముడుబోతున్న వ్యవస్థ మనది. ఓ వార్తా పత్రిక నడవాలన్నా, ఓ మీడియా నిలబడాలన్నా రాజకీయ అండదండలు తప్పనిసరైన కాలమిది. అలా అని ప్రజల మనోభావాలను అవహేళన చేస్తే అది మీడియా కానివ్వండి, మరొకటి కానివ్వండి చూస్తూ ఊరుకోరన్నది మనం అర్థం చేసుకోవాలి. ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకునే రక్షక వ్యవస్థ కూడా ఇందుకు అతీతమేం కాదు. 
  రా....రాక్షసంగా
  జ.... జనానికి
  కీ..... కీడు చేసే
  యం...యంత్రాంగం.. కాదని చెప్పలేకపోతున్నామిప్పుడు. వ్యవస్థ లోపమెా, వ్యక్తులు లోపమెా కాలమే సమాధానం చెప్పాలి. 
           జర్నలిస్ట్ లపై దాడి హేయం, అమానవీయం అని కొందరు మీడియా అధినాయకులు గగ్గోలు పెట్టి పోలీసులకు ఫిర్యాదులిచ్చామంటున్నారు. మరి వారికి కనబడలేదా, వినబడలేదా.. మీ మీడియా ప్రతినిధులు ఓ మైకు, కెమేరా, ఓ ఛానల్, ఓ పేపర్ ఉందని...చావో, బతుకో తెలియని రైతు గోడుని ఎద్దేవా చేస్తూ, హేళనగా పిచ్చి గెంతులు గెంతుతూ, దిక్కుమాలిన పాటలు పాడినప్పుడు...ఏమ్మా ఏంటీ గొంతు చించుకుని, ఈ పిచ్చిగెంతులు అని అడగలేదెందుకు? అందరు అన్నీ చూస్తూనే ఉన్నారు. అమ్ముడుబోవడాలు, అమ్మకాలు, అద్దకాలు అన్నీ తెలుసు. ఇలాంటి మీడియాని సపోర్టు చేయడం, చేయకపోవడమన్న విజ్ఞత మీకే వదిలేస్తున్నారు ప్రజలు. 
           పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో, పెయిడ్ మీడియా ఎవరో, పేటియం బాచ్ ఎవరిదో తెలియని ఆంధ్రుడు లేడీరోజు. మాకు మీడియా అన్నా, జర్నలిస్ట్ లు అన్నా చాలా గౌరవం ఉంది. దయచేసి మీ నైతిక విలువలు దిగజార్చపకోవద్దని మా మనవి. అధికారానికి భయపడి నిజం రాయలేనప్పుడు, చూపించలేనప్పుడు ఊరుకోండి, అంతేకాని ప్రజలను కప్పులేని పట్టించవద్దు. కాలంనాడు మెుద్దు శీను హత్యను ఆత్మహత్యగా చూపించి జనాలు తిడుతుంటే హత్య అని మార్చిన వైనం ఎవరూ మర్చిపోలేదు. వ్యక్తిగత అభిమానం వేరు, జర్నలిజం వేరు అని మీకు తెలియజెప్పాల్సిన పని లేదని మా అభిప్రాయం. ఈ పోస్ట్ వ్యక్తిగతంగా తీసుకోవద్దని వ్యక్తిగత ట్రోలింగ్ చేయించే కొందరు జర్నలిస్ట్ సోదరులకు నా ప్రత్యేక వినతి. 

పదమూడు ముక్కలాట...!!

మూడు ముక్కలాట అంతగా కలిసి రాలేదు. పదమూడు ముక్కలాటైతే బాగా సేఫ్. అందులోనూ అసలే లక్కీ హాండ్ కూడానూ. పేకాటలో లక్ ముఖ్యమని తేల్చిన ఆంధ్రులను సంతృప్తి పరచడానికి పదమూడు ముక్కలాటే సరైన ఆట. అప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినవు. ఎలాగూ ఐదుగురు ఉపముఖ్యమంత్రులున్నారాయే. మరో ఎనిమిదిమందికి కూడ పదవులిచ్చి సంతృప్తి పర్చితే పోయేదేం లేదు. మన మీడియా, పక్క రాష్ట్రం,మన కులపోళ్ళు అందరూ శాటిస్ఫైడ్ కదా. లేదంటే మరి కొన్ని పదవులు సృష్టించేద్దాం. తిరోగమనంలో ముందంజలోనున్న మనకేంటి కొత్తగా వచ్చే నష్టం. వచ్చినవన్నీ వెనుకకు మరలిపోయాక కొత్తగా చేసేదేముంది అభివృద్ధి. నవరత్నాల పంట బాగా పండి మనమేదంటే అదే వేదమంటున్న భజనలు బాగా వినబడుతున్నాయిగా. మెుత్తానికి ఈ మూడు, పదమూడు ముక్కలాటతో రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కి లైన్ క్లియర్ చేసుకున్నట్టేనా.. అదెచ్చా...!! 

22, డిసెంబర్ 2019, ఆదివారం

ఏక్ తారలు..!!

1.   ఎప్పటి లెక్కలప్పుడే_చుట్టరికాల చిట్టాపద్దులు సరిచేయడానికి..!!

2.   ఎంతకీ తేలని లెక్కలవి_శూన్యం విలువ తెలుసుకోలేక..!!

3.   అక్షర నాట్యం ఆకట్టుకుంది_శూన్యంలోనూ పదాలు హొయలు పోతుంటే...!!

4.    అక్షర లాస్యం హాస్యమవుతోంది_అతిశయం అహమై చేరితే...!!

5.  మేలిమి ముత్యమంటి మనసది_స్వచ్ఛతను స్వాగతిస్తూ...!!

6.   అలికిడెరుగని అలజడిది_మానససంచారంలో బంధమై మెసలుతూ..!!

7.   ఆవాహన అవసరం లేదు_మన మనసులొకటని తెలిసాక..!!

8.   పరిమళమై వ్యాపిస్తావనుకున్నా_పరిచయమై చుట్టేస్తావనుకోలేదిలా..!!

9.   గగనానికి విరామమే లేదు_రేయిపగలు దాగుడుమూతల్లో...!!

10.   యుగాల నిరీక్షణ క్షణాల్లో మాయమైంది_నీ రాక అలికిడికి..!!

11.   పలకరిస్తూనే ఉన్నాయి జ్ఞాపకాలన్నీ_గుప్పెడు గుండెలో గువ్వల్లా ఒదిగినా...!!

12.   చిరుజల్లులై మురిపిస్తుంటాయి_కన్నీరైనా పన్నీరైనా...!!

13.   పలకరింతల విన్యాసాలు_మనసాక్షరాలు మౌనం వీడితే..!!

14.   మనసు ఆరాటమిది_మర్మాలను విప్పి చెప్పమని అక్షరాలనర్థిస్తూ...!!

15.   అపార్థమెప్పుడూ అంతే_క్షణాల్లో బంధాలను తల్లక్రిందులు చేసేస్తూ...!!

16.   కలానికెప్పుడూ సంశయమే_కాలాన్ని అక్షరాలకు అంకితమిస్తున్నా...!!

17.   అలక మబ్బులు తేలిపోయాయి_అసలైన ఆప్యాయత అందివచ్చాక...!!

18.   కన్నీరెంత కార్చినా నిరర్థకమే_కరగని మనసు నీకెదురైనప్పుడు...!!

19.   అహం అపోహకి చోటిచ్చింది_కాస్త ఆదమరచాననేమెా..!!

20.   మనిషి నైజమదే మరి_ఆధిపత్యపు అహంకారంతో నిండి..!!

21.    కాలంతో పోటిగా పరుగులెత్తుతూ మనం_శతాబ్దాలుగా వెనుకబడే..!!

22.   ఆయువు తీరిన వాళ్ళ కోసం_యముడంపిన పల్లకీ అది..!!

23.కాలమెప్పుడూ కతలు చెప్తూనేవుంటుంది_వినగలిగే మనసుండాలంతే...!!

24.  చరిత్రలో గుర్తింపు పొందుతూనే ఉన్నాయి_వెతలు వెలిసిన కతలుగా మారుతూ..!!

25.   రాలుతున్న నక్షత్రాలను ఏరుకుంటున్నా_నీ ఊసులు వినిపిస్తాయని...!!

26.   గుబులుగున్నాయి అక్షరాలు_కథకు ముగింపు తెలిసాక...!!

27.   వెలసిన బతుకుల వెతల నవ్వులవి_జీవం లేని వెలుగు పువ్వులై...!!

28.  నవ్వొక నయగారం_కలతనో కలవరింతనో దాచేస్తూ..!!

29.   అద్భుతం అక్షరానిది కాదు_నెచ్చెలి అందించిన నెయ్యానిది..!!

30.   ఆదమరుపే వరమయ్యింది_అనునయాలు అందని వేళ...!!

21, డిసెంబర్ 2019, శనివారం

ఏం దొరా...!!

మెుత్తం రిపోర్ట్ నువ్వు చెప్పమన్నట్టే చెప్పారా..! ఏమైనా కానీ అక్షరం పొల్లు పోకుండా చెప్పారు. నీ కుటిల రాజనీతికి హాట్సాఫ్. ఆంధ్రప్రదేశ్ కి ఇంత మంచి చేసిన నిన్ను ఆంధ్రుడు అన్నవాడెవడూ మర్చిపోడు. ఒకవేళ మర్చిపోయాడంటే వాడు ఆంధ్రుడే కాదు. సెంటిమెంట్లతో బానే గెలుపు సాధించావు. సర్వనాశనమెలాగు అయిపోయాం ఆరు నెలల్లో. ఇంక ఇప్పుడు కొత్తగా పోయేదేం లేదు. నువ్వేం చేసినా మాకు కొత్తగా వచ్చే నష్టం ఏం లేదు. చాలా సంతోషంగా ఉంది. నీ అపారమైన సేవలకు తగిన గుర్తింపు కాలం తప్పక ఇస్తుంది.

20, డిసెంబర్ 2019, శుక్రవారం

గుప్పెడు గుండె సవ్వడులు సమీక్ష..!!

            " ఓ గుప్పెడు గుండె సవ్వడే ఈ మనసాక్షరాలు...!! "

     " పగిలిన అద్దాన్ని కూడా అతికించే సాంకేతికతను అన్వేషిస్తున్న మనిషి.. పగిలిన తన గుండెను అతికించుకునే నైపుణ్యతను కనుగొనలేకపోతున్నాడెందుకో!? "
              ఈ మాటలు అక్షర సత్యం. గుప్పెడు గుండె సవ్వడులకు మల్లెతీగ సంపాదకులు కలిమిశ్రీ గారి ముందుమాటలో చివరి మాట ఇది. ఇరు మనసుల సవ్వడులు అందించిన మానసాక్షర భావాలివి. గుండె గాయాలను మాన్పుకోవడానికి, తనను తాను ఓదార్చుకోవడానికి అక్షరాన్ని ఊతంగా అందుకున్న రెండు గుండెల చప్పుడు, జంట కవిత్వమైన  ఈ " గుప్పెడు గుండె సవ్వడులు " మంజువాణి మనోభావాలు లో ఓ గుండె సవ్వడి సరస్వతీ మానసపుత్రిక ఎందరికో సుపరిచితురాలు, అలవోకగా అక్షరాలు వెదజల్లి, అందరి మనసులను ఆకట్టుకునే భావాల సంపద మెండుగా కలిగిన వాణి వెంకట్ గారిది వినండి.
         " నా కూతురుగా నిన్ను కాదు
            నీ తండ్రిగా నన్ను గుర్తించాలని " ఆరాటపడిన ఓ తండ్రి ప్రేమను, కూతురికి పంచిన ఆత్మీయతను, ఓటమికి వెరవని మనోధైర్యాన్ని, నడకను, నడతను నేర్పిన నాన్న దూరమైనా ఆయన నేర్పిన అక్షరాలే తనకు ఆసరా అంటూ
  " నిన్ను ప్రత్యేకంగా స్మరించడం కాదు నాన్నా
     నా కలం కదలికలన్నీ నీవు నడిపిస్తున్న దారులే..! !" అని చెప్పడంలో నాన్నంటే తనకు ఎంత ఆరాద్యమో తెలుస్తుంది నాన్న కవిత చదువుతుంటే. అమ్మ ఎంత రాసినా ఇంకా మిగిలున్న కావ్యమైతే నాన్న బాధ్యతల పర్వంలో తలమునకలౌతున్నా కూడా అక్షయపాత్రలా మమకారాన్ని పంచే ప్రేమలాలసుడు. చేతికందిన బిడ్డ దూరమైతే ఆ తల్లి వేదన వర్ణింప శక్యం కాదు.
   " పొత్తిళ్ళు ఖాళీ అయ్యాక
      కన్నీళ్ళ కొక్కానికి వేలాడుతూ
     వెక్కిరించే ఒడి
      ఓడిన ఛాయలకు
      జ్ఞాపకాల జాడలకు
      ఋజువుకు
      ఋణంగా మిగిలిపోయింది "  హృదయవిదారక వేదనకు అక్షర సాక్ష్యంగా ఊహకు ఊపిరాగాక కవిత నిలుస్తుంది.
సంఘర్షణల అవశేషాలను స్వప్నాల వేటలో వ్యామొహాలు వెదుకుతూ పోవడమే ఈ అనంత జీవనయాత్ర అంటూ తుదిలేని ఆశయం కవితలో జీవిత తత్వాన్ని బోధిస్తారు. బాధల భారాన్ని మోయలేక మనసు మౌనాక్షరాలను ప్రసవిస్తోందంటారు మౌనాక్షరాలు కవితలో. గాయాల జ్ఞాపకాల క్షణాలన్నీ తన అక్షరాల రాసుల అంతఃసంఘర్షణకు అలంకారాలే అంటారు అక్షరమై కవితలో. నవ మాసాల భారం బరువుగా మారిన ఖేదంలో బిడ్డ ఆయువు అర్దాయువు ఎలా అయ్యిందని ప్రశ్నిస్తూ విధి పరిహాసానికి విరుగుడుగా భావాలకి తన బాధలు చెప్పుకుంటూ అక్షరాలను ఆలింగనం చేసుకుంటున్నా అంటారు నిలదీసి అడగాలని వుంది కవితలో.
   " ఆగిపోదు కాలం సంఘర్షణతో చెలిమి చేసినా..
      భావమై ప్రకటించాక
     అక్షరమే వెలుగుతుంది విజేతగా.." అంటూ గాయం నేర్పిన విజయాన్ని గర్వంగా ప్రకటిస్తారు.
         తడి మనసులో తల్లడిల్లే దృశ్యాలను, రాలిపడే కన్నీళ్ళలో చిట్లిపోయిన పసి చిందులను తల్చుకుంటూ, కరిగిపోని జ్ఞాపకం స్పర్శకందనిదైనా స్మృతిలో పదిలమేనంటూ ఓటమి గుర్తుని, వేదనకు సాక్ష్యమూ అయిన పచ్చి గాయం మరో గమ్యం చేరే వరకు మనసుకు ఎదురుచూపేనంటారు. కాలానికి కన్నీళ్ళు అంకితమిచ్చినా ఆరిపోని గుండె తడిని మోసుకుంటూ అంతేలేని ఆశలతో అంతుచిక్కని జీవన పోరాటం చేయాల్సిందేనని అంతచ్ఛేతన కవితలో ఆర్ద్రంగా వినిపిస్తారు. మనసుగది దాల్చిన  మౌనంలో దాగిన బాధను, కంటి చెమ్మకు రూపాన్నిచ్చిన అక్షరాన్ని కన్నీళ్ళు గెలిచిన నమ్మకమంటారు. భావాల కౌగిలిలో బంధించుకున్న క్షణాలనన్నింటిని నిత్యమైన తన కన్నీటికి కారణమేనంటారు స్పర్శించే అక్షరాన్నై కవితలో. నిత్య నివేదనను నివేదిస్తారు రెప్ప మూయలేని దుఃఖపు రేయిలో, బాధ్యతల ఉలికిపాటు వేకువలో.  అక్షరాల సమక్షంలో ఆర్పుకుంటున్న ఘాటైన గాయాన్ని కూడా అక్షరాలకు అందమద్దడమేనంటారు. కెరటం వెదజల్లిన నీళ్ళలో తన కన్నీటిని కలిపేశాననుకుంటే , ఆ సంద్రపు పలకరింపు హోరు తన మనసులోనిదేనంటారు తీరంతో స్నేహం కవితలో. సమాధానం దొరకని ప్రశ్నలన్నీ భావాలుగా పేర్చుతూ అక్షరాలు నవ్వాయంటారు మరో కవితలో. గుండెనొదలని గాధలు, జ్ఞాపకం కార్చిన కన్నీళ్ళు, అక్షరాలొలికే అమ్మ ప్రేమతో, మౌనం పలికే భావాలెన్నో అంటూ అనిశ్చితం కవితలో చెప్తారు. తిమిరాలలో తడిసిపోయే తనకు కాంతి కావాలనిపిస్తుందంటారు ఓ కవితలో. మనసు ప్రశ్నల వర్షాన్ని ప్రశ్నగా సంధిస్తారు. కాయం మట్టి ఒడి చేరేదాకా భావాలు బాధనే పలకరిస్తాయంటారు. చీకటి ఆశ మౌన సంగీతాన్ని వినిపిస్తూనే ఉంటుంది తుది దుప్పటి కప్పుకునే వరకు అనడంలో ఎంత దుఃఖ ఘాడత ఉందో చీకటి ఆశ కవిత చదివితే తెలుస్తుంది. మౌనం తనతో సంభాషించడం మొదలెట్టాక బాధ భాష్యమై పులకరించిందంటారు నిశీధి భాష్యం కవితలో. మనసు రాగాన్ని ఆత్మ పయనంలో వినిపిస్తారు. వెలుతురు ఉనికిని వెదుకుతూ పయనిస్తున్నాయి నా అక్షరాలు ఏమిటిది అంటారు. ఎదలోని గాయపు ఆనవాళ్ళు మౌనపు మరకలుగా మిగిలిపోతుంటే, దుఃఖపు కుంభవృష్టి కురుస్తూనే ఉంది, అక్షరాలెన్ని కుప్పబోసినా అనడం ఒక్క వాణి గారికే చెల్లింది. గాయం గుచ్చుకుంటున్నా మౌనం మహాభాగ్యమైంది భావాల పల్లవితో అక్షర ప్రయాణం అంతిమం వరకు ఆగని కవిత్వమై ప్రకాశించాలని తన కోరికగా చెప్తారు. నిశ్శబ్దాన్ని నేనై, నా హృదయ నివేదనలన్నీ అక్షరాలలో అనంత మౌనాలై ప్రవహిస్తూ, భావాలలో ప్రకాశిస్తున్నాయని వేదనను కూడా అందంగా చెప్పడం వాణి గారి ప్రత్యేకత. శోకం శ్లోకమైనప్పుడు మౌన నివేదన తన మనసాక్షరాలంటారు మౌన నివేదన కవితలో. తన మనసు గాయానికి  అక్షరమైత్రి ఆత్మీయమైందంటారు. గత గాయపు గాలివానకు మనసు చెరపలేని దుఃఖమైతే, ఆరిపోయిన ఆశలు ఆనందశిఖరం చేరుకోవాలన్న తపనను ఒక ఆశగా చెప్తారు. తన అంతరంగ మధనాన్ని పదాలలో పదిలపరుస్తున్నానంటారు. పదిలంగా జ్ఞాపకాన్ని దాచుకుంటూ, అక్షరాల రెక్కల్లో స్వప్న చిత్రాలను కలగంటున్నానంటారు. కొన్ని కవితలలో గాయమై మిగిలిపోతున్నా, గుండె లోతును స్పర్శిస్తూ, అసంపూర్ణ చిత్రాన్ని అక్షరాల అనునయాలతో ఆత్మవిశ్వాసాలు అలంకరించుకుంటున్నానంటారు. నిర్వేదం నిండిన మదిలో నవ్వు కావాలన్న ఆశను, నిన్నల్లో మిగిలిన హాసాల మెరుపు స్మృతిగా కాకుండా తనతో రమ్మని బతిమాలడం, మరచిపోలేని గాయమైనా ఎలా చెప్పను అంటూ చెప్పిన తీరు ఎంత బావుందో. కన్నీటి గురుతులు, అంతులేని అంతర్మథనాలు చివరికి చేరని ఆలోచనలంటూ మన ఆలోచనలను తట్టి లేపుతారు. కడుపుకోత కంటతడి పెట్టిస్తుంటే " నన్ను నేను ఓడిపోతున్నా, ధరహాసమై దరిచేరవా " అన్నా,  విషాదాలు రోషంగా వెళిపోతే చిరునవ్వై మిగిలిపోతా అన్న ఆశను కలవరాల కలకలాన్ని వెలువరిస్తారు. అమ్మకు నలతగా ఉంటే బిడ్డగా తన మనసుని అమ్మతో అపుడు కవితలో ఇలా చెప్తారు.
  " నన్ను చూడగానే వెలిగిన చిరునవ్వు
     పారాడిన పసిపాపగా
     నా బిడ్డ బోసి నవ్వు కనిపించింది.."  ఈ పోలిక కన్నా గొప్ప పోలిక ప్రపంచమంతా దుర్భిణి వేసి వెదికినా కనిపించదు. నిజంగా వాగ్దేవి వర ప్రసాదినే వాణి గారు.
వేదనను కన్నీటి వర్షంలో మనసు ఒలికిన మౌన తడిగా చెప్పినా, చిగురించని చెట్టు, చిరునవ్వు మరచిన మనసు, చిగురై చిందించాలని ఆశ పడుతున్నానని, ఆత్మీయ మాధుర్యాన్ని కోరుకుంటున్నానని చెప్పడం చాలా ఆశావహ దృక్పధం.
             పెద్దగా కష్టపడకుండా తన అక్షరాలతో అందరిని ఆలోచింపజేసే వాణి వెంకట్ గారి గురించి
ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు భాషలో ఏ ప్రక్రియలోనైనా అందె వేసిన చేయి. తేలికైన పదాలతో, సున్నితమైన పదబంధాలతో పాఠకుల మనసులు తడి చేయడమే వాణి గారి కవిత్వంలోని గొప్పదనం. బాధను, కన్నీటి గాయాలను హృద్యంగా చెప్పడంలో నిష్ణాతులు. తేట తెనుగు పదాలతో, తన గుండె చప్పుడును అక్షరాలకు అందించి, అందరి మన్ననలను అందుకున్న వాణి గారికి హృదయపూర్వక అభినందనలతో....
 
   
         

మాటలు నీటి మీది రాతలు...!!

మాటలు నీటి మీది రాతలు...!!

ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానన్నారెవరో... ఓ ఇది మేనిఫెస్టోలో లేదు కదా.. అంటారా.. సరేనండి.. మెుత్తానికి రివర్స్ ముఖ్యమంత్రిగా, డైవర్షన్ ముఖ్యమంత్రిగా పేరు సంపాదించేసుకున్నారు...😊

మాటలకు చేతలకు చాలా తేడా ఉంటుందండి. ఓటు కోసం, మత ప్రచారం కోసం కాదు సార్ పని చేయాల్సింది. రాష్ట్రం కోసం పని చేయండి. చట్ట సభల్లో ఏం జరుగుతోందో అందరిని చూడనివ్వండి. చక్కని పదాలు మీ సభ్యుల నుండి నేర్చుకుంటారు. చరిత్ర కూడా బాగా తెలుసుకుంటారు.

ఆఁ.. రాష్ట్రం కోసం కష్టపడినోడికి ఏమిచ్చారు ఆంధ్రులంటారా..!!

అదీ నిజమేలెండి... 3 రాజధానులు కాకపోతే 33 రాజధానులు చేయండి. మీకడ్డేంటండి. భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న మీ కలను సాకారం చేసుకుని అదే భాషను లేకుండా చేయాలన్న మీ ప్రయత్నం ఎంత వరకు సమంజసమెా ఆలోచించండి. ఇంగ్లీష్ వచ్చినంత మాత్రాన రాష్ట్రం పురోగతిలో ప్రయాణించదండి.

ఓ రోజేమెా అక్రమ కట్టడాలంటారు. మరోరోజేమెా మద్యం అంటారు. ఇంకోరోజేమెా అమరావతే రాజధాని అని శాసనసభలో చెప్తారు. మళ్ళీ అదే సభలో 3 రాజధానులంటారు. తెలుగే తీసేస్తానంటారు. 21 రోజుల్లో న్యాయమంటారు. పరిపాలన పారదర్శకమంటారు. కేస్ పెట్టడానికి వెళితే ముప్పు తిప్పలు పెడతారు EASE అని చదవడం రాని పోలీసు పెద్దలు. మెుత్తానికి తిరిగి తిరిగి కేస్ పెడితే ఎఫ్ ఐ ఆర్ చెత్తబుట్టలో వేస్తారు. ఇదేనా అండి చట్టం, న్యాయం అందరికి సమానమంటే?

అభివృద్ధి గురించి అడిగినా, ఎన్నికల ముందు మీరు చేసిన, చెప్పిన వాగ్దానాల గురించి ఎవరైనా అడిగితే మేనిఫెస్టోలో చూడండి అంటారు. లేదంటే మీ పేటియం బాచ్ తో ట్రోల్ చేయిస్తారు. మీ అనుయాయులను ఎవరైనా ఏ చిన్న మాటన్నా కేస్ లు పెట్టి జైల్ లో పెట్టిస్తారు లేదంటే కొట్టడమెా, చంపించడమెా చేస్తారు. గత ప్రభుత్వం చేసిందంతా అవినీతేనంటారు.

మహిళలంటే అపారమైన గౌరవమంటారు. మాకు కనీస న్యాయం జరగడం లేదు. బిల్లులు, చట్టాలు చేసినంత త్వరగా వాటిని అమలు జరపండి. కనీసం పసిపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆపడానికి ప్రయత్నించండి. పార్టీలకు, కులమతాలకు అతీతంగా పనిచేస్తున్నామంటూ మత ప్రచారం ముమ్మరంగా చేసుకుంటున్నారు. రంగులేయడం కాదండి ప్రజల అవసరాలు గమనించండి.

మీ రైతు భరోసా, చేనేత కార్మికుల, ఆటోవాలాల, కాపుల, వృద్ధుల, నిరుద్యోగుల, చదువుల వగైరా భరోసాలు, చేయూతలను అందుకోవడానికి పంచాయితీ కార్యాలయాల చుట్టూ తిరగడమే సరిపోతోంది. మా బతుకులన్నీ ఆధార్ కార్డ్, బాంక్ అకౌంట్ లు కాపీలు తీయించి ఇవ్వడానికే సరిపోతున్నాయి తప్ప రూపాయి వచ్చిన పాపాన పోలేదు. 

ఆరు నెలలు గడిచినా రోజూ ఏదోక దుమారం లేపి జనాన్ని దారి మళ్ళించడం కాకుండా కాస్త పని చూడండి సార్. ఏదో సామాన్యులం మా గోడు వెళ్ళబోసుకున్నాం. మామీద మీ అధికారాన్ని ఉపయెాగించక కాస్త ఆలోచించండి సార్. 

18, డిసెంబర్ 2019, బుధవారం

వెలి వేయమంటున్నా...!!

అక్కరకు రాని అనుబంధాలను
వద్దనుకుంటున్నా

గతమే మరచిన మనుషులకు
జ్ఞాపకాలే లేవంటున్నా 

నాటకీయతే జీవితమనునే వాళ్ళను
నచ్చలేదంటున్నా

స్నేహం ముసుగేసుకున్న మెుసళ్ళను
చీదరించుకుంటున్నా

పిలుపుకు పలుకుకు తేడా తెలియని జీవాలకు
జీవించే అర్హత లేదంటున్నా

మంచిలో చెడు వెతికే నైజాలకు
సూక్తిసుధలు చెప్పే నైతికతెక్కడిదంటున్నా

వ్యక్తిత్వ హీనులకు
వ్యక్తిగతమే ఉండదంటున్నా

సమాధానం చెప్పలేని బతుకులకు
ప్రశ్నించే హక్కు ఎక్కడిదంటున్నా

బాధ్యత లేని బంధాలకు
కుటుంబమెందుకని వెలి వేయమంటున్నా...!! 

10, డిసెంబర్ 2019, మంగళవారం

గోదారి పలకరింపు సమీక్ష ..!!

         "   వెన్నెల గోదారి పరవళ్ళు ఈ గోదారి పలకరింపులు "
                   మన తెలుగు భాష గొప్పదనమంతా ఆయా ప్రాంతపు యాసలోనే ఉందని నమ్మే కొందరిలో నేనూ ఒకదాన్ని. మనముండే ప్రాంతపు భాషలోని యాసకు ఉన్న ఒంపుని పలకరింతల్లో చేర్చి స్వచంగా ఆత్మీయతను పంచే వారిలో గోదారి వారిది ఓ ప్రత్యేకత. కల్మషం లేని మనసులకు మారుపేరు గోదారి వారు. ఆ "గోదారి పలకరింత"లను పులకరింతలుగా చేసి అక్షరాలను ఆప్యాయంగా గుమ్మరించిన వర్మ కలిదిండి " గోదారి పలకరింపు " లను మనమూ మనసుతో విందాం.
     వర్మ చిన్నప్పటి డిమాండ్ ను, మన డిమాండ్ కూడా అదే అనుకోండి అప్పుడు. అదేనండి ఆవకాయ పచ్చడి కలిపేటప్పుడు స్కూలుకి సెలవు కావాలన్న డిమాండ్. ఆవకాయ ముద్దలోని అమ్మప్రేమ, ఆ కమ్మదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. తప్పకుండా ఆవకాయ, One Demand కవిత చదవాల్సిందే. గోదారి మొదటి పలకరింపుకి పులకించాల్సిందే. అందరి ఆవకాయ జ్ఞాపకాలు గుర్తుకు రావాల్సిందే. వరద గోదారి వినయాన్ని, ఒద్దికను చెప్తూ, ఆకాశంలోని వెన్నెల్లో చందమామను తన కొప్పులో ముడుచుకోవడాన్ని వర్ణిస్తూ, అలల హోరులో వేద నాదాన్ని వినిపించే తమ ఇంటి ఆడపడుచు, ఆకు పచ్చని నది గోదారంటారు ప్రేమగా. మిత్రుడు అరుణ్ సాగర్ కి నివాళిగా ఒక సన్నివేశము ఛాయాచిత్రమై ఘనీభభవించింది అంటూ ఆ గురుతులను పంచుకుంటారు.
" చూడు !
 నిన్ను తలుచుకోగానే
 మంచు కురిసిన తోట ఎలా నీరుగారిపోయిందో
ఇప్పటికీ మించి పోయింది లేదు "
నీ రాక కోసం ఎలా ఎదురుచూస్తున్నానో చూడమంటూ తన ఆరాధనలో ప్రేమను ఎంత అద్భుతంగా తెలిపారో చెప్పడానికి పై భావాలు చాలు.
" నిద్ర పట్టిన ప్రతి రాత్రీ ఒక మరణం
మెలుకువ వచ్చిన ప్రతి వేకువా ఒక జననం.." అంటూ ఎంత చక్కని భావాన్ని అందించారో జనన మరణం కవితలో.
రైతు గొప్పదనాన్ని బ్రతుకు బ్రతికించు రైతన్నా కవితలో చెప్తారు.
ఆయ్, అలాగేనండి, మరండీ...మాది గోదారండి.. ఈ పలుకులు వినని తెలుగువారు బహు అరుదు. ఆ మాటల్లోని అమాయకత్వం, స్వచ్ఛత తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి లేదు. యాండే మాది గోదారండి రావడం మర్చిపోకండే అంటూ గోదారి పలకరింపు ఓ ఆనందహేలగా వినబడుతుంది. ఆకుపచ్చ కలను అంతరాలు లేని అంతర్వాణిలో మట్టి జ్వరంలో వినిపిస్తారు వైతరిణి నదిని ఆసరా చేసుకుని. !?.,- గుర్తులను వివరిస్తారు ఈ కవితలో సరికొత్తగా. మానసిక పరిస్థితి బాగోని 13 ఏళ్ళ అమ్మాయి చేసిన నాట్యం చూసిన తరువాత అక్కడి దృశ్యాన్ని మన మనసులకు తాకేటట్టుగా, కళ్ళకు కట్టినట్టుగా రాసిన నవ్వుతూ...నవ్వునై కవిత అద్భుతం. ఈ కవిత చదివిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవకుండా ఉండలేరు అని ఘంటాపథంగా చెప్పగలను. activa కవిత యాక్టివ్ గా ఉంది. Feb 14th ఎర్ర గులాబి వర్ణన బావుంది. నదిలో నీళ్ళున్నప్పుడు నాదంటే నాదని కొట్టుకుంటాం. మరి నీళ్ళు లేనప్పుడు ఎవరిదని అడుగుతారు ఏ నది కవితలో. మొండి గోడల జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తెలంగాణా రాష్ట్ర ఖజానా నింపిన బొగ్గుని గుర్తు చేస్తారు బొగ్గు కవితలో. సహచరితో జీవన ప్రయాణాన్ని హృద్యంగా, పదిలంగా తన మనసాక్షరాలతో పొందుపరిచారు ప్రయాణం కవితలో. బంధం దూరమైన ఎడబాటుని తీరని కోరికగా చాలా బాగా రాశారు. వెంకట రమణా సంకట హరణా అంటూ ఎర్రిబాగుల వాణ్ణి, ఎరుకలేని వాణ్ణి ఏడిపించవద్దంటారు. ఐదునొక్కటి అంటూ చావుల వెనుక చేతలను చెప్తారు. ఓరిమిని ప్రశ్నించి, ఓటమిని గెలిపించడం వెనుక అంతరార్థాన్ని పరదేవతలో చెప్తారు. ఆరాత్రికి కవిత ఇద్దరి మధ్య దగ్గరితనాన్ని అందంగా చెప్తుంది. కొల్లేటి ప్రయాణపు అందాలను, మనోహర దృశ్యాలను వదులుకోలేనంటూ ప్రేమగా వర్ణిస్తారు. శేషాన్ని పరిపూర్ణం చేసుకోవడమెలాగో శేషం కవితలో చెప్తారు. సంక్రాతి సందడులను, సంబరాలను పెద్ద పండుగ కవితలో చెప్తారు.  రైతన్న మాఇంటి శివుడు అని కీర్తిస్తారు. సహజ మరణమే సహజ జీవనమంటారు. విరామాన్ని, వలస రైలుని తనదైన శైలిలో చెప్తారు. ఓ ఆలింగనాన్ని తడిసిన పేజీలు ఆరబెట్టి చిత్తు పుస్తకం కుట్టుకోవడమేనంటూ ఓ తాత్వికతని చెప్తారు. మొక్క మోడు కావడం వికృతి కాదు విపత్తులే నేటి ప్రాకృతం అంటారు ఇది మనిషి కాలం కవితలో. ఎవరు చెప్పని పంటబోదు గురించి ఆ.. పంటబోది కవితలో చెప్తారు. కవి మిత్రునికి నివాళిగా వెళ్ళిపోయావా మిత్రమా కవిత, ఇంతే సంగతులంటూ వందేళ్ళకు మారని చరిత్రను, నాణాలు, పెంకుటిల్లు, ఈసారి ఎవరో, కార్తీక పక్షం, మరమరాలుండ  కవితల్లో అప్పట్లో వాటిలో దాగిన జ్ఞాపకాలను చెప్పడం బావుంది. ఉదయాన్ని ఈ ఉదయం కవితలో వర్ణించారు. అతడెవరో అతడు కవిత చెప్తుంది. అబ్దుల్ కలాం గారి గురించి ప్రవక్త కవిత జనించింది. గోరింటాకు చెట్టు గురించి అద్భుతంగా చెప్పిన కవిత నక్షత్రాలు దూసిన ఆకాశం. వనం నిర్మితమయ్యే చోట మొక్కై పుట్టాలని ఆఖరి కోరిక కలవాడే కవి అంటూ కవికి కొత్త భాష్యాన్ని చెప్తారు. ఒక్క మాటా తూలని ఆమెకి అంటూ ప్రకృతిని గొప్పగా పొగుడుతారు. తలుపుచెక్క మనసుని మన మనసులు తాకేలా చెప్తారు. స్కూల్ బస్, ఆ బస్ లో పిల్లల గురించి పిల్లల కోడి కోరిక కవితలో భలే చెప్తారు. ఓ ప్రేమ కథ కవిత చదవగానే ఓ విషాద వీచిక మనల్నీ తాకుతుంది. సరికొత్తదైన ద్రాక్ష పళ్ళ కూర కవిత బావుంది. కొసరు గుర్తు చేసే కబుర్లు, వృద్ధాప్యం గురించి అబ్బులుకి తెలవకుండా కవిత, రెండక్షరాలుగా మిగిలిపోవాలన్న కోరికను, నదులను, సశేషాన్ని, దగా పడ్డ వృక్షాన్ని, వయసుకు తగట్టుగా కాకుండా మితిమీరిన అలంకరణ చేసుకున్న వారిని చూసి అమ్మను గుర్తు చేసుకున్న కవితగా ఐ లవ్యూ మమ్మీ, శృంగవృక్షం మురళి కి నివాళిగా మురళి కవిత, మంచి పనులు చేసే మంచి మనిషి వేటుకూరి వెంకట శివరామరాజు గారికి వనాన్ని నిర్మిస్తున్న వృక్షం కవిత, అంబులెన్స్ వాహనాన్ని చూసి దానిలోని వారు త్వరగా కోలుకోవాలని దేవుడికి దణ్ణం పెట్టుకోవాలని, పిల్లల మాట దేవుడు వింటాడని అమ్మ చెప్పిందని దండం కవితలో చెప్పడం చాలా చాలా బావుంది.
           తేలికైన పదాలతో, చక్కని వచనాన్ని కవితల్లో చొప్పించి, చదువరులను మెప్పింపజేసే కవిత్వం వర్మ కలిదిండి గారిది. గోదారి వారి అమాయకత్వంతో, ఆత్మీయంగా మనల్నిఈ పుస్తకంలోని ప్రతి కవిత ఆకట్టుకుంటుంది. జీవితపు ఆలోచనలను, భావావేశాలను హృద్యంగా సరళమైన శైలిలో రాశారు. ఈ అక్షర " గోదారి పలకరింపు "  కు హృదయపూర్వక అభినందనలు.
                  

7, డిసెంబర్ 2019, శనివారం

మాకు వద్దు..!!

      నేరస్థులను సంరక్షించే కోర్టులు, హక్కుల సంఘాలు మాకు వద్దు. మీ మానవతావాదం ఎందుకు నేరాలను అరికట్టలేకపోయింది ఇప్పటి వరకు..? ఏ మానవత్వం తిరిగి తీసుకురాగలదు చనిపోయిన వారి మాన ప్రాణాలను. మంచిని సమర్థించని మీ మానవతావాదం మాకొద్దు.
     పాశవికంగా జనారణ్యంలో సంచరించే మృగాలకు మద్దత్తు పలికే మానవత్వాన్ని వెలివేస్తున్నాం. తెలంగాణా పోలీసులు చేసింది సరైన న్యాయం. కాకపోతే మానవజాతి సిగ్గుపడే విధంగా హేయమైన, ఘోరమైన నేరాలు చేసిన, చేసే దోషులు ప్రతి ఒక్కరికి ఇదే శిక్ష అమలు కావాలి. మనిషికి రక్షణ కల్పించలేని చట్టాలు, న్యాయాలు మాకొద్దు.
      నేరస్థులకు రక్షణ ఇవ్వాలనే హక్కుల సంఘాలను, చట్టాలను వెలి వేస్తున్నాం. కనీసం ఒక బాధితురాలికైనా న్యాయం చేసిన తెలంగాణా పోలీసు వ్యవస్థకు మా హృదయపూర్వక అభినందనలు..

4, డిసెంబర్ 2019, బుధవారం

మరో మార్గం..!!

అగ్ని పునీతను
అడవికి పంపినా
కట్టుకున్న ఇల్లాలిని
జూదంలో ఓడిపోయినా
వెంట నడిచిన భార్యను
విపణి వీధిలో వేలమేసినా
పరాయి స్త్రీ మీద మనసైందంటే
మగని కోరిక తీర్చినా

పరదాల మాటున
పగిలిపోతున్న గుండెలెన్నో
వ్యథల కాష్ఠంలో
కాలిపోతున్న బతుకులెన్నో
బందాలు నడుమన
బావురుమంటున్న జీవితాలెన్నో
బాధ్యతల పర్వంలో
అలసిన ప్రాణాలెన్నో

ఏ యుగమైనా
ఏ పురాణమైనా
ఏ కతైనా
ఏ వెతైనా
ఏ వెలితైనా 
ఏ చరిత్రయినా చూసుకుంటే
ఏమున్నది గర్వకారణం..?

న్యాయానికి అన్యాయమే
మానానికి అవమానమే
డబ్బుకు దాసోహమే
అహానికి స్వాగతమే
అధికారానికి తలొగ్గడమే
అభిమానాన్ని కాలరాయడమే

కాలాలెన్ని మారినా
చట్టాలెన్ని చేసినా
మారని నైజం మనిషిది
లేనిది మానవత్వం
అందుకే...
చర్యకు ప్రతిచర్యే
సమాధానం..
లేదు మరో మార్గం..!!

1, డిసెంబర్ 2019, ఆదివారం

ఏక్ తారలు...!!

1.  ఉలికిపాటు అలవాటై పోయింది_భయం గుప్పిట్లోనున్న బతుకులకు..!!

2.   బాధ్యతలెన్ని పంచుకున్నాయెా_బరువుగా వాలిన ఆ కనురెప్పలు..!!

3.   కలతలన్నీ వెంటబడుతున్నాయి_ఎండమావులైన అనుబంధాల నడుమ..!!

4.   కన్నీళ్ళను మెాయడం అలవాటై పోయింది_వెతలు వెంబడిస్తూ ఉంటే..!!

5.  తిరిగిరాని క్షణాలెన్నో_మౌనం విప్పని మనసులో...!!

6.   మరలిపోని జ్ఞాపకాలవి_కాలాన్ని గుప్పెట్లో దాచేస్తూ...!!

7.   కన్నీళ్ళ అవసరమే లేదు_కష్టం ఇష్టమైనప్పుడు..!!

8.  తరలింపు సాగుతూనే ఉంది_అయినా మనసు ఖాళీ కావడం లేదేంటో...!!

9.   మరుగున పడిపోయింది_తరలింపులకు నలిగిపోయిన మనసుతనం...!!

10.   కాలం గాయాన్ని మాన్పుతోంది_మనసు మచ్చలే మాయం కావడంలేదెందుకో..!!

11.   కాలమూ మెాయలేనంటోంది_మనసు భారాలన్నీ తనపై మెాపుతుంటే..!!

12.   గెలుపు స్వరం వినాలనుకున్నా_ఓటమి వాదులాటలో...!!

13.   2.   మరణమెప్పుడూ మౌన సదృశమే_అంతిమాన్ని అర్థం కానీయకుండా...!! 13 Dec 19

14.    త్యాగానికర్థం ఇదేనేమెా_ఓటమిలో గెలుపుని ఆస్వాదించడం...!!

15.   యమపాశం మీదా ప్రేమే మరి_అనుబంధాలు స్వార్థపు నీడలో సేద దీరుతుంటే..!!

16.   ఎలా ఉన్నా ఆకాశం అందమైనదే_లోగుట్టు తెలియనంత వరకు..!!

17.   అనువదిస్తున్నా మనసుని_నీకు అర్థమయ్యే అక్షరాలతో...!!

18.   కనుల కొలనులో కన్నీటి తామరలు_మనసు శూన్యాన్ని మాయజేస్తూ...!!

19.   గాయాలను భరించేది మనసే_మనోవేదన మౌనానికి అప్పజెప్పినా...!!

20.    రాలిన కలలు_మౌనాక్షరాలుగా మదిని తాకుతూ..!!

21.    విజయపథాలే  అన్నీ_వేదనను నవ్వులుగా మార్చేస్తూ...!!

22.   ఓటమే గెలిపిస్తుంది_కథనాన్ని నడిపిస్తూ కాలాన్ని శాసిస్తూ..!!

23.   కథలు వినడమే మిగిలింది_కాలం కనికట్టు చేస్తుంటే..!!

24.    ఇక్కడో ఇంతి ఇక్కట్లు_మగాడి పైశాచికత్వానికి బలౌతూ...!!

25.   అక్షరాల అశ్రువులు నువ్విచ్చినవే_మనసు శూన్యాన్ని పరుస్తూ..!!

26.    కలలా కరిగిపోయినా సజీవమే_అక్షరాల్లో ఆత్మబంధువులా పలకరిస్తూ..!!

27.  వదలని స్పర్శ అది_విడువలేనంటూ ఉండిపోతూ...!!

28.   నడక తప్పని గమనమది_గమ్యం చేరాలని గుర్తు చేస్తూ..!!

29.   శేషం బుుణానుబంధమైంది_అనుబంధాల అవకతవకల లెక్కల్లో ..!!

30.  మమకారమందించింది_గుణకారాల గుణింతాల్లోనే..!!

మీరూ ఓ ఇటుక ఇవ్వగలరా...!!

" మంచి సమాజ నిర్మాణానికి శంకుస్థాపన చేసాము.. మీరు ఓ ఇటుక ఇవ్వగలరా " అని రోడ్ల రిపేర్ డాక్టర్  కాట్నం గంగాధర తిలక్ గారు ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు..
     అంతరించి పోతున్న మానవ విలువలను పునరుద్ధరించడానికి ఓ చక్కని మార్గం ఇది. మనమేం చేయనక్కర్లేదు. మన కళ్ళ ముందు జరిగిన మంచిని, లేదా మనకు తెలిసి మంచి పని చేసిన వారి గురించి  నలుగురికి తెలియజేయడమే. దీని వలన సమాజంలో ఉన్న మంచివారి గురించి అందరికి తెలుస్తుంది. మంచికి గుర్తింపు ఇచ్చి అది నలుగురికి తెలియజేయడమే ఈ ప్రయత్నం లక్ష్యం.
    ప్రతిఫలం ఆశించకుండా రోడ్ల గుంటలు పూడ్చడం, ప్లాస్టిక్ నిర్మూలన కోసం, పేద వారికి సాయం చేయడ కోసం, పాతబట్టలు సేకరించి ఆ బట్టలను ఓ పేద కుటుంబానికి ఇచ్చి, కుట్టు మిషన్ కూడా ఇచ్చి గుడ్డ సంచులు కుట్టించి కొన్ని కూరగాయల, పుట్టినరోజు పండ్ల దుకాణాలలో ఇస్తే కాస్తయినా ప్లాస్టిక్ నిర్మూలన జరుగుతుంది. దుకాణం వారిచ్చిన కూరగాయలు, పండ్లు ఆ పేద కుటుంబానికి ఇవ్వడం ద్వారా కాస్త సాయమందించినట్లు అవుతుంది. ఇవన్నీ గంగాధర తిలక్ గారు తాను చేస్తూ నలుగురితో చేయిస్తున్నారు.
      మరి మనమూ ఓ ఇటుకను మంచి సమాజ నిర్మాణానికి ఇవ్వలేమా...ఎందరో సమిధలుగా మారి మనకిచ్చిన ప్రజాస్వామ్యాన్ని మన తరువాతి తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను, మంచి నడవడిని కానుకగా ఇవ్వడానికి మీ వంతు ప్రయత్నంగా ఈరోజే మీకు తెలిసిన మంచివారిని, వారు చేసిన మంచిపనిని నలుగురికి పరిచయం చేయండి.

ఈ లింక్ చూడండి.

https://m.facebook.com/story.php?story_fbid=2342535609190175&id=100003012761013

30, నవంబర్ 2019, శనివారం

జగన్నాటకం...!!

చీకటి చుట్టంలా వచ్చి
పలకరించెళుతూ
కాసిని జ్ఞాపకాలు
వొంపేసింది

కలతల కన్నీళ్ళు
ఓదార్పునెదుకుతూ
దిగులు దుప్పటిలో
తచ్చాడుతున్నాయి

మౌనం ముసురుకున్న
ఏకాంతానికి మాటలద్దడానికి
మరో ప్రయత్నంగా
మనసు సమాయత్తమౌతోంది

పిలుపుల్లోని మమకారపు
మాధుర్యంలోని మాయకు లోనైన
బంధుత్వం హడావిడిగా
అనుబంధాలను అల్లుకుంటోంది

అద్దంలాంటి ఆంతర్యమని
అరమరికలు లేని ఆత్మీయతనుకుంటే
అది అవసరాల ముసుగేసుకున్న
అవకాశవాదమని తెలిసింది

రహస్యాలన్నీ బట్టబయలౌతున్నా
రాయబారాల నడుమ సాగుతున్న
రంగురాళ్ళ రంగస్థలమీ
సర్దుబాట్ల దిద్దుబాట్ల జీవిత జగన్నాటకం..!!

29, నవంబర్ 2019, శుక్రవారం

కోల్పోతున్న మనిషితనం...!!

నేస్తం,
         అనాది నుండి అహానిదే ఆధిపత్యం. అధికారం కట్టబెట్టిన ప్రజలకు నాయకులిచ్చే నజరానాలేమిటా అని ఒకింత ఆలోచన రేకెత్తించాల్సిన అవసరమేర్పడుతోంది ఈనాడు. భద్రత ఇవ్వాల్సిన రక్షక వ్యవస్థే మనకు అభద్రతా భావాన్ని పరిచయం చేస్తోంది. ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యవస్థ పాలకుల కోసం పని చేస్తోంది. న్యాయం కోసం  పోలీస్ స్టేషన్ కి నా వెళ్ళినా, కొత్తగా వచ్చిన సైబర్ క్రైమ్ కి వెళ్ళినా మనకు న్యాయం జరగదు. మన రక్షణ మనమే చూసుకోవాలి. పసిబిడ్డ నుండి పండు ముదుసలి వరకు వదలని కామాంధులకు మాత్రమే రక్షణ ఈ సమాజంలో. ధరించే వస్త్రధారణలో లోపాలంటారు మేధావులు కొందరు. పసిబిడ్డ ఏ రకమైన దుస్తులు ధరించిందని ఈ దుర్గతి? అమ్మను, బిడ్డను కూడా వదలని నికృష్టులను సమర్థిస్తున్న సమాజమిది. రాజకీయ నాయకులకు ఇవేమీ పట్టవు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళినా హేళనగా మాట్లాడి, అవమానించి పంపడం తప్ప చర్యలు తీసుకోలేని అసమర్థులు. లంచాలు మరిగిన  వ్యవస్థలో న్యాయం జరగదు. న్యాయం జరగాలంటే తప్పు చేసిన ఏ ఒక్కరినైనా వెంటనే శిక్షిస్తే, ఆ శిక్ష కూడా మరొకరు తప్పు చేయాలంటే భయపడేలా ఉంటే ఈ ఘోరాలు కాస్త తగ్గుతాయి. నాయకులు పదవి మీద మమకారాన్ని తగ్గించుకుని, ప్రజల కనీస బాగు కోసం ఆలోచించాలి. విజ్ఞులు రాజకీయ నాయకులు ఏది చేసినా సమర్ధించడం మానేసి సామాన్య జన జీవితాలు కాస్త భయం లేకుండా బతకడానికి ఏం చేయాలో అది చేయించండి. ఈ అకృత్యాలను ఆపండి మనుషులుగా మీలో మానవత్వం ఎక్కడైనా మిగిలుంటే...!!

ద్విపదలు...!!

1.  అలరించడం ఆత్మీయత లక్షణం
అక్షరాలకు అలవాటైన అల్లికై...!!

2.   మాలను ఏర్చికూర్చడంలోనే పనితనమంతా
అక్షర భావాలు  అల్లుకుపోతానంటుంటే..!!

3.   అక్షరాలనే అటుా ఇటూ మార్చుతున్నా
అర్థవంతమైన పదబంధాల అమరిక కోసం..!!

4.   ఆదరించిన అక్షరం
ఆదమరచిన ఆకాంక్షలకు అన్యాపదేశంగా దిశానిర్ధేశంజేస్తూ..!!

5.   గురుతుల్లో మిగిలిన జ్ఞాపకం
గుండెను తట్టి లేపిందిలా...!!

6.  గతమైనా..ఘనమైన జ్ఞాపకమది
గుప్పెడు గుండెకు ఆధారమై...!!

7.   సంతోష సాగరానికి ఆహ్వానించాను
కన్నీటి జలపాతాలకు సాంత్వననీయడానికి..!!

8.  వ్యసనమని వదిలేద్దామనుకున్నా
విడువ లేని వ్యాసంగమైనావని తెలియక...!!

9.   పరిచితులమే ఎప్పుడూ
మనసునొదలని అక్షర భావాల పలకరింతలతో...!!

10.   ముసుగులక్కర్లేని బంధమిది
అపరిమితంగా అల్లుకుంటూ...!!

11.   నా అక్షరాలు బ్రహ్మాస్త్రాలై కట్టిపడేస్తాయి
వాటికి అణుకువ, అహం తెలుసు..!!

12.  నిశ్శబ్దమెప్పుడూ చప్పుడు చేస్తూనే ఉంది

గురుతులుగా మిగిలిన నీ జ్ఞాపకాలతో...!!

13.    శిథిలాలలోనూ చిరపరిచితమే

చెదిరిన మనసులో స్థిరమైన జ్ఞాపకమై...!!

14.  అక్షరాలను ఆవహించింది

కనుమరుగైన బంధమైనా చేతిస్పర్శగా చేరువౌతూ..!!


15.    పక్కనే ఉన్నా చూడవెప్పుడూ

నీ చూపులెప్పుడూ సుదూరానే..!!

16.    నన్ను అనుసరిస్తావనుకున్నా

అనుకరిస్తావని తెలియక...!!

17.   వియెాగము విరహమూ చుట్టాలనుకుంటా

పర్యవసానం పరమార్థం తెలిసినా...!!

18.   గురుతుకు నువ్వో నెలవే

గుప్పెడు గుండెకు ఆలంబనగా..!!

19.   పదాల కూర్పు కుదరడంలేదు

అక్షరాలనెలా రాయాలో తెలియనందుకేమెా...!!

20.  అమ్మ పంచిన ఆత్మీయతే అది

అందుకే ఆ పిలుపుకంత కమ్మదనం..!!

21.   యుగాల నిరీక్షణ

క్షణాల్లో మాయమైపోతూ...!!

22.  కొన్ని మౌనాలంతే

మాటలు అక్కర్లేకుండా మనసుని పరిచేస్తూ..!!

23.   సమస్యలెప్పుడూ చుట్టాలే

చెప్పాచేయకుండా వచ్చేస్తూ..!!

24.   కొన్ని చీకట్లంతే

అదాటున ఆశల నక్షత్రాలను  లెక్కలేయమంటూ..!!

25.   అనంతం తానైతేనేమి

నాకు అందనప్పుడు...!!

26.   అన్ని అక్షరాలు అంతే

అలసటెరుగని అమ్మలా లాలిస్తూ...!!

27.   విశేషమేమి లేదు

విషయమే తానైనప్పుడు...!!

28.   అక్షరాల్లో చూపించేద్దామన్న ప్రయత్నమే

అకారంలేని మది సవ్వడిని...!!

29.  ప్రాణం పోస్తున్న అక్షరాలు

వెతలను వెన్నెలకు జారవేస్తూ...!!

30.  వెతకనక్కర్లేదంటున్నా నీకోసం

అక్షరాలను వెంబడిస్తున్నది నువ్వేనని తెలిసి..!!

26, నవంబర్ 2019, మంగళవారం

వివక్ష..!!

అనాది నుండి స్త్రీని ఆటలో వస్తువుగా వాడుకున్నారు తప్ప ఆట ఆడనివ్వలేదు. ఇప్పుడు ఆ ఆటే స్త్రీ ఆడుకుంటే తప్పేంటి అద్దెచ్చా..? అభివృద్ధిని ప్రోత్సహించడం మానేసి ఇలా కటకటాల పాలు చేయడం అన్యాయం కాదా. ఏదో హై లెవెల్ క్లబ్బులకెళ్ళి ఆడుకొనే స్తోమత లేని కారణముగా నలుగురు కలిసి ఆడుకుంటే ఇంత రాద్ధాంతం చేస్తారా..! అడిగేవారు లేరని ఇంత అన్యాయమా....మరీ క్రీడాస్పూర్తి లేకుండా పోయింది.. 😊

20, నవంబర్ 2019, బుధవారం

స్మార్ట్ జీవితం..!!

"  జీవితాన్ని తరచి చూపిన అనుభవాల పూపొద  "

        జన జీవితంలోని ఒడిదుడుకులను కథా వస్తువులుగా తీసుకుని డాక్టర్ లక్ష్మీ రాఘవ కథా సంపుటాలు వెలువరించారు. వాటిలోనిదే ఈ "స్మార్ట్ జీవితం " కథా సంపుటి. సమాజంలో మనిషి మనుగడ, మానవత్వపు విలువలు, సర్దుబాట్లు, దిద్దుబాట్ల గురించి తనదైన శైలిలో మనకందించిన మణిహారం "స్మార్ట్ జీవితం " లో ఏముందో చూద్దాం.
      కోరికేదైనా అది తీరితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇల్లు కట్టుకోవడం దగ్గర నుండి ఆ ఇంటి మీద ప్రేమ పెంచుకోవడం, అనుకోని కారణాలతో ఆ ఇంటికి దూరమైనా, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటూ మళ్ళీ అదే ఇంటికి చూడాలని రావడం, అనుభూతులు పంచుకోవడం..చదువుతుంటే కళ్ళ ముందు ఆ సంఘటనలన్నీ కనిపించిన అనుభూతి కోరిక కథలో. నవ్విన నాపచేనే పండుతుంది అన్నట్టు హేళన చేసిన సహోద్యోగులతోనే శబాష్ అనిపించుకోడానికి తన అవసరానికి ధైర్యాన్ని కూడగట్టుకున్న శాంతలాంటి ఎందరో తల్లుల మనోగతం ఈ అవసరం కథ. పల్లె జీవితాలకు మానసిక నిపుణులు అవసరము, సమస్యల పట్ల అవగాహన కల్పించడం వంటి విషయాలను ఝాన్సీ కథ ద్వారా చెప్పడం బావుంది. ఏ బంధము లేని మనుష్యులు ఎలా దగ్గరౌతారో, అయిన వారి నిరాదరణ, శరణాలయాల ముసుగులోని లొసుగులు చెప్పే కథ శరణాలయం. ఇద్దరి మధ్య పెళ్ళి జరగడానికి కావాల్సింది నమ్మకం కాని ఎంక్వయిరీ కాదని చెప్పే కథ ఎంక్వయిరీ. శుచి కథ ఎందరో బడుగు మహిళల బయటకు చెప్పుకోలేని సమస్య. ప్రభుత్వం ఆలోచించి పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపే కథ. అయినవారికి అవసరానికని ఇచ్చిన డబ్బులు వారి పతనానికి, వ్యసనాలకు కారణమైతే ఏర్పడే పరిస్థితి అపాత్రదానం కథలో తెలుస్తుంది. మనిషి నమ్మకాలను సొమ్ము చేసుకోవడమెలాగో బాబాల మాయల లీలలేమిటో తెలిపే కథ కలలు. ఈనాటి పిల్లల, తల్లిదండ్రుల ప్రవర్తన గురించి చక్కని విశ్లేషణతో కూడిన కథ నిఘా. సామాన్యులకు నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను చూస్తూ ఓ బాంక్ ఉద్యోగి పెద్దాయనకు చేసిన సాయమే చిదంబర రహస్యం కథ. తల్లి బిడ్డకు ఎందుకు దూరంగా ఉంటుందో, అత్తగారు అమ్మగా మారిన కారణం చెప్పిన అయిష్టం కథ. పాత తరం నవతరానికి ఇచ్చే సూచనలు, సలహాలతో పాటు జీవితాన్ని సద్వినియోగము చేసుకోవడమెలాగో చెప్పిన కథ నాన్న డైరీ. రాయలసీమలో అనావృష్టి మూలంగా పడే ఇబ్బందులకు వర్షం ఎక్కువైతే వచ్చే అతివృష్టి ఇక్కట్ల గొడవే కరువు సీమలో అతివృష్టి కథ. లోకం తీరు చెప్తూ చెప్పుడు మాటల గురించి జాగ్రత్త పడమని చెప్పే కథ లోకులు. బిడ్డలకు మలి వయసులో భారం రాకూడదని ఓ తల్లి తీసుకున్న నిర్ణయమే మారిన మజిలీ కథ. సమాజంలో లంచాల మెాసాలు చూపిస్తూ, దైవం పేరు చెప్పుకుంటూ భక్తితో బతకడమెలాగో చివరకు ఇదీ కథలో తెలుస్తుంది. పెంచిన అమ్మకు ప్రేమతో తన మనోగతాన్ని వివరిస్తూ తన విశ్వాసాన్ని చాటుకున్న జీవి చెప్పిన కథ అమ్మకు ప్రేమతో.టెక్నాలజీ మాయలో పడి కోల్పోతున్న కుటుంబ బంధాలను, మర్చిపోతున్న బాధ్యతలను గుర్తు చేసిన కథ స్మార్ట్ జీవితం. గత వైభవాన్ని తల్చుకుంటూ కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటూ తన చాతనైన పని చేయాలని సంకల్పించిన ఓ గొప్పింటి పేద కోడలి కథ గతం గతః. బాధితుడెప్పుడూ సామాన్యుడేనంటూ, మాటల్లోనే నీతులు. చేతలకు పనికిరాని నీతులు కూడు పెట్టవని చెప్తూ న్యాయనికి భయపడే మనుషుల మనస్తత్వాలను తెలిపే కథ నీతి. పల్లె నుండి పట్టణానికి చదువు కోసం వెళ్ళే ఆడపిల్లలకు బస్లలో ఎదురయ్యే అగచాట్లు, వెకిలి చూపులు ఎలా తప్పించుకోవాలో చెప్పిన కథ ఎలాంటి మార్పు. తిరుమల శ్రీవారి పుష్పయాగంలో పాలు పంచుకున్న పూల మనసు మాటలు వినిపించిన పుష్పయాగంలో పుష్పాల సందడి కథ. నాటి నుండి నేటి వరకు పెళ్ళిళ్ళ తీరు, అది సహజీవనాలుగా మారిన వైనం చూపిన కథ నాడు....నేడు. వద్దన్న నిక్కరు మళ్ళీ రావాలనడం వెనుక కథే నిక్కరు.
బాంక్ లో బోలెడు డబ్బులున్నా అవసరానికి అందుబాటులో లేని ఏటియం మెషిన్, అవసరం తీరే మార్గం చెప్పిన కథ ఆపద్బాంధవుడు. పెళ్ళి విషయంలో ఈ కాలపు పిల్లల ఆలోచనలను తెలిపే కథ సంబంధం.
     కొన్ని మన నమ్మకాలకు పిల్లల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని సందర్భాల కథే వెక్కిళ్ళు. పెద్దలకు కావాల్సింది పిల్లల సంతోషమే అని చెప్పిన కథ ఇదే. శరీరంలో మార్పులకు కారణం ధ్యానంలో మెట్లు ఎక్కడం కాదు, అనారోగ్య సూచన అని అమెరికాలో ధ్యానం కథలో తెలుస్తుంది. కార్యక్రమం ఏదైనా ఎవరి పని వారిదేనని, భక్తి నటిస్తూ చేసిన మెాసం తెలిపినకథ ఆహా! ఏమి భక్తి. నిర్మాల్యంలో అమూల్యం అంటూ దేవుని అలంకరణకు వినియెాగించిన పూలను తీసివేసేటప్పుడు వాటి మనోభావాలను మనకు వినిపిస్తారు. కాలం మారింది చాలా అంటూ అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన సంగతులను జ్ఞాపకాలుగా మన ముందుకు తెచ్చిన స్వగతంలో 70 ఏళ్ళ జీవితం కనిపిస్తుంది సంపూర్ణంగా.
        అనుభవాలను కదంబమాలగా పేర్చి కూర్చిన కథల పొత్తంలో ఎన్నో జీవితాల ఆటుపోట్లు, అతివల అంతరంగాలతో పాటుగా, పూల మనోగతాన్ని కూడా చేర్చడం చాలా బావుంది. విద్యాధికురాలు, ఉద్యోగ బాధ్యతలతో పాటుగా కుటుంబ బాధ్యతలను చాకచక్యంగా నెరవేరుస్తూ, ఎందుకు పనికిరాని వస్తువులతో అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తూ, అదే నేర్పు, ఓర్పుతో అతి సుళువైన శైలిలో, అలంకారాలు, ఆర్భాటాలు లేకుండా వర్ణనకు తావీయని కథలు రాయడంలోనూ చేయి తిరిగిన డాక్టర్ లక్ష్మీ రాఘవ మరిన్ని కథలను మనకందించాలని కోరుకుంటూ, చక్కని కథల పొత్తం " స్మార్ట్ జీవితం " కి హృదయపూర్వక అభినందనలు.

17, నవంబర్ 2019, ఆదివారం

బాల్యం..!!

అమ్మ ఒడిలోని పసిపాపాయి
చీర చెంగు చాటుకి చేరుతూ నాన్న చేయినందుకుని
మెుగ్గ తొడిగినదే బాల్యమంటే

అరమరికలెరుగనిది
ఆంతర్యాలను, అంతరాలను లెక్కజేయనిది
సహజమైన ప్రకృతి అందాలలో ఇదొకటి 

అక్షరాలతో ఆటలాడుతూ
అల్లరి కేరింతల ఆనందాలకు నెలవై
చిరు అలకల బుజ్జగింపులదీ చిన్నతనం

ముద్దు ముద్దు పలుకులు నేరుస్తూ
మమకారపు మాధుర్యాలను చవిచూపే
పాలుగారే పసిడితనమిది

అనుబంధాలను దగ్గర చేర్చే
ఆత్మీయ పిలుపులు పలకరించే
అనురాగ సమ్మిళితమైన లాలిపాటల కమ్మదనమిది

అందరిని మనం కావాలనుకుంటే
ఎప్పుడో ఒకప్పుడు మనకు
చేరువౌతారని చెప్పే కల్మషమెరుగని మనసులివి

మరలని కాలంలో
మరపురాని అనుభూతులనందించే
మలి వయసుకు మధుర జ్ఞాపకమీ పసితనం...!!

ఇప్పుడే తెలిసింది..!!

       ఆంధ్రప్రదేశ్ ఆంగ్లప్రదేశ్ గా మారబోయే క్రమంలో అంధప్రదేశ్ గా కూడా మారిపోయింది. కొందరు పెద్దలకు కూల్చివేతలు, నిర్మాణ నిలిపివేతలు కూడా అభివృద్ధిలో భాగంగా కనబడటమే. భాషా ప్రాతిపదికతన ఏర్పడిన రాష్ట్రానికి అధిపతిగా, ఆ భాష మనుగడనే లేకుండా చేయడంలో కూడా తప్పేం లేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేయడానికి ఇంగ్లీష్ లో రాసి తీసుకెళితే Ease చదవడం రాని, అర్థమే తెలియని సి ఐ లు ఉన్నందుకు, ప్రజల తలరాత ఇంగ్లీష్ తో మార్చేద్దామన్న ప్రయత్నం అభినందించదగ్గదే.
       మరి కొందరు ఈ తెలుగు భాష గురించి బాధ పడేవారందరూ వారి వారి పిల్లల్ని తెలుగు మాధ్యమంలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారా అని అడగడంలోనూ తప్పు అస్సల్లేదు..

" ఒక చిన్న ప్రశ్న..చిన్నపాటి జ్వరం వస్తే మనలో ఎంతమంది ప్రభుత్వాసుపత్రికి వెళుతున్నాం..? "

ఇంగ్లీష్ చదువు ఉద్యోగాల కోసమనంటే...అదీ పేదవారి పిల్లల కోసమని అనుకుంటే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే సమాధానం తెలియని ప్రభుత్వంలో ఉన్న మనకి, తిరోగమనాభివృద్ధి లో ముందున్న మనకి, ఈరోజేంటన్నదే ప్రశ్నార్ధకమైన మనకి అసలు ఏ సమస్యా లేకుండా చేస్తున్నందుకు,

అదేమని అడిగితే పేటియం బాచ్ తో ట్రోల్ చేయించడం... సాక్ష్యాలు, ఆధారాలన్నీ తీసుకుకెళితే తప్పక కేస్ ఫైల్ చేసి, ఎఫ్ ఆర్ కాపీ ఇచ్చి తర్వాత చెత్తబుట్టలో వేసిన రక్షణ అధికారులు, ఇంకేముంది మీరు ఎఫ్ ఐ ఆర్ ఫైల్ చేసి ఆ నంబర్ ఇవ్వండి...వీళ్ళను పట్టుకు వస్తామని అన్నీ చేసాక అడ్రస్ లేని సైబర్ క్రైమ్... ఇదండి పారదర్శకత...

నీతులు చెప్పవద్దు...మీరు చేయాలనుకున్నది చేస్తున్నారు... దానికి సాకులు చెప్పాల్సిన అవసరం లేదు..ఎవరేమన్నా మీ వర్గానికి మీరు న్యాయం చేసుకుంటున్నారంతే. దానికింత హడావిడి అవసరం లేదు..దిగ్విజయంగా మీ పని మీరు చేసుకోండి గౌరవంగా.. అడిగేవాడెవడు చెప్పండి..?

12, నవంబర్ 2019, మంగళవారం

అనంత యాస పుస్తక సమీక్ష..!!

      " అమ్మభాషను ఊపిరిగా మార్చిన మాండలీకమే అనంత యాస"          

             ఎవరికైనా పుట్టిన ఊరు మీద అభిమానం ఉండటం సహజం. పొట్ట చేతబట్టుకుని పరాయి దేశాల వెంట పడుతున్న నేటి రోజుల్లో మాతృభాష మీద అదీ తన ప్రాంత మాండలిక యాస, భాష మీద ఎనలేని మమకారం పెంచుకున్న అతి కొద్దిమందిలో రాయపాటి శివయ్య ఒకరు. తెలుగు సాహిత్యంలో కథ, కవిత్వం, వ్యాసాలు, లఘు రూప ప్రక్రియలు విరివిగా వస్తున్న తరుణంలో పుట్టిన గడ్డ మీద ప్రేమతో అమ్మకు సాటైన మాండలికాన్ని ఆత్మీయంగా హత్తుకుని నలుగురికి ఆ గొప్పదనాన్ని తెలియజేయాలని చాలా శ్రమ పడి పరిశోధన చేసి తమ ప్రాంతం చుట్టూ ఉన్న ఇతర ప్రాంతాల భాషల, యాసల ప్రభావాన్ని, తన ప్రాంతపు యాస ప్రత్యేకతను తెలియజేయడానికి " అనంత యాస " అనే భాషా పరిశోధనా గ్రంధాన్ని అందించిన రాయపాటి శివయ్యకు అభినందనలు. చదువుకునే రోజుల్లోనే ఈ పరిశోధనకు అంకురం పడిందని, కొందరు తన యాసను గేలిచేసినప్పటి బాధ నుండి జనించినదే ఈ కోరికని, అదే ఈరోజు ఈ పుస్తక ప్రేరణకు కారణమని చెప్తారు. చక్కని భాష నేర్చుకునే ప్రయత్నంలో ఎన్నో కొత్త పదాలు నేర్చుకున్నానని, అవే తన ఉపాధ్యాయ వృత్తిలో ఉపయోగ పడ్డాయని చెప్తారు.
          మానవుడు భావ వ్యక్తీకరణకు భాషను మాధ్యమంగా ఎంచుకున్నాడు. భాషకు మార్పు సహజం. మానవుడు నివసించే ఆ యా మరిసరాల భౌగోళిక పరిస్థితులు, విద్య, వైద్య, నాగరికత వగైరా ప్రభావాలనుబట్టి భాషలో యాసలు చోటు చేసుకోవడం, భాషలో మార్పులు, చేర్పులు రావడమన్నది సహజ పరిణామక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఒరిసా రాష్ట్రాల ప్రభావం ఉంది. ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు తెలుగునాడును వివిధ వృత్తి పరమైన పదకోశ పరిశోధన ఆధారంగా నాలుగు భాషా వ్యావహారిక మండలాలుగా విభజించారు. అవి
1. పూర్వ మండలం / కళింగ ప్రాంతం
2. మధ్య మండలం / కోస్తా ప్రాంతం
3. దక్షిణ మండలం / రాయలసీమ ప్రాంతం
4. ఉత్తర మండలం / తెలంగాణ ప్రాంతం.
ఈ విభజనలో రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఇక్కడి ప్రజల వాడుక భాషలోని పదాలను, మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా ఏర్పరచుకున్న మాండలిక పదాలను చూపే ప్రయత్నమే ఈ " అనంత యాస " పుస్తకం ముఖ్య ఉద్దేశ్యం. అనంతపురం భాషా మాండలీకంపై ఎక్కువగా కన్నడ భాషాయాస ప్రభావం ఉంటుంది. అలాగే తమిళ పదాలు, కడప, కర్నూలు భాషాయాసలు కూడా చోటుచేసుకుంటాయి. ఇక్కడి ప్రజలు  వాడే వస్తువులు, పదార్థాలు వివిధ ప్రాంతాల ప్రజలకు భిన్నంగా ఎలా ఉన్నాయో చెప్పడానికి ఇరవైఏడు భాగాలుగా విభజించి మనకు అందించారు.
మొదటగా ఏకాక్షర పదాల్లో ఆ, ఈ, ఉ, ఊ, ఏ ఇలా ఆ యా అక్షరాల వాడుకను, ఉదాహరణలను వివరించారు.
క్వా అంటే తీసుకో - ఇదిగో క్వా.
తర్వాత లాల, లాలి, ఆంతిను వంటి పిల్లల సంబంధ పదాలు, చుట్టంరాలు, పొద్దులు అవటం వంటి స్త్రీ పురుష సంబంధ పదాలు, అజ్జి, అవ్వ వంటి వరుసల బంధాల సంబంధ బాంధవ్యాలు, అంగి, ఒల్లి, కమ్మిడి వంటి వాడుక దుస్తుల పదాలు, కడిమి/కడెం, కమ్మలు, దావు(వడ్డాణం) లాంటి ఆభరణాల పేర్లు, కడత, సెయ్యి, దమ్ములు, దొక్క వంటి అవయవాల పదాల వాడుక పేర్లు కొన్ని. అరుగు, అసులు, కమాను, జలాట, గవాసి, వారపాకు, పడసాల వంటి ఇంటికి, ఇంటి పరిసర ప్రాంతాలకు సంబంధించిన పదాలు, దువ్వాన, ఇసర్రాయి, పీపీ ఇవి ఇంట్లో వాడే కొన్ని పరికరాల పేర్లు. అనకాగు, ఈలపీట, గిద్ది, గెంటి, పొంత, జోడ వగైరా వంట ఇంటి వాడుక పరికరాలు, ఉర్లగడ్డ, ఎర్ర గడ్డ, ఎల్లిపాయి, మిరక్కాయ వంటి కూరగాయల పేర్లు, అరటికాయ,ఎల్లూరుకాయ, కలంగరికాయ (పుచ్చకాయ) వంటి పండ్లు, కాయల పేర్లు, అవగిరి, ఉక్కిలి, కీరు, గోగాకు, బొరుగులు, మెతుకు, పుగ్యాలు మొదలగు వంటలు, వంట వదార్థాలు, కుసాలనూనె, చమురు వంటి నూనెల పేర్లు, దచ్చినం, తూరుపు, భానువారం, బేస్తువారం, అయ్యాలకాడ, పైటాల, రేత్రి ఇలా దిక్కులు, మూలాలు, వరాలు, సమయాల వాడుక పదాలు ఉదాహారణలతో చెప్పారు.
        కొన్ని కొలతలు, ప్రమాణాలు, వ్యవసాయ రంగం, కార్తెలు, వర్షాధారిత పదాలు, జంతువులు, సరీసృపాలు, వ్యక్తిత్వ పదాలు, ప్రశ్నార్థక పదాలు, అనుమతినిచ్చే పదాలు, తిట్లు, శాపనార్థాలు, సాధారణ వ్యవహారిక పదాలను సోదాహరణంగా ఎక్కడ ఎలా వాడతారో వివరించారు. 
       పరిశోధన భాష మీద చేయడం చాలా కష్టం. అందులోను మాండలికంపై చేయడమంటే కత్తి మీద సాము చేయడమే. భాషను సజీవంగా తరువాతి తరాలకు అందించాలంటే ఇలాంటి భాషా పరిశోధన గ్రంధాలు రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ప్రతి ప్రాంతపు యాస ఓ ప్రత్యేకతను భాషకు అందిస్తుంది. మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా మన భాషను, యాసను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదుందని మర్చిపోకూడదు. ఉపాధ్యాయునిగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ, తన ప్రాంతం మీద మక్కువను, అమితమైన ప్రేమను చూపించడానికి " అనంత యాస " భాషా పరిశోధనా పుస్తకాన్ని అందించిన రాయపాటి శివయ్య గారికి హృదయపూర్వక అభినందనలు.
     
     


                         
                         
   
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner