30, నవంబర్ 2013, శనివారం

అక్షరాన్ని అమ్ముకుంటున్నానా...!!


ఆయుధంగా మలచుకున్నా
ఆశయాన్ని పంచుకున్నా
అనుబంధాన్ని పెంచుకున్నా....!!

మనసుతో మాటాడి చెప్పిన భావన
ఆకృతి సంతరించుకున్న స్పందన
చూసుకున్న ఆ క్షణం అనిపించిన నిజం....!!

ఓ అక్షర సత్యమా నాలో ఉన్న నిన్ను
దాచుకున్నా పదిలంగా... అందుకే నిన్ను
అమ్ముకోలేదు...నమ్ముకున్నాను అని...!!

బాధ్యతల ఒరవడిలో అమ్ముకున్నా నిన్ను
బంధమైన నిన్ను బాసటగా చేసుకున్నా
పెంచుకున్న చెలిమిని తెంచుకోలేకున్నా....!!

వృత్తిలో అమ్మకానికి ప్రవృత్తిలో ఇష్టానికి
మనసుకి మనిషికి మధ్య సంఘర్షణలో
తప్పని జీవిత పయనానికి వారధిగా చేసుకున్నా...!!

అమ్మలా క్షమించే హృదయ వైశాల్యం నీది
మన్నించమని మనస్పుర్తిగా వేడుకుంటూ
నమ్ముకున్న అక్షరాణికి వందనం...!!

ఓట్ల కోసం యాత్రలు...!!

జనాలు ప్రకృతి ప్రళయానికి, విలయానికి, విధ్వంసానికి గురైతే సానుభూతి పర్యటనలు, ఓదార్పు యాత్రలు కూడు
పెట్టవు...గుడ్డ నివ్వవు...పోయిన పంటను తెచ్చి ఇవ్వవు...ఎందుకీ పనికి రాని పాద యాత్రలు...ప్రచార సాధనంగా మార్చుకున్న ఈ పధకాలు ఎవరి కోసం..?? చేతనైతే సాయ చేయండి అంతే కాని ఓట్ల కోసం నోట్ల యాత్రలు వద్దు..!!సాయం చేసే మంచి మనసు మీకు ఉంటె మీకు ఉన్న సొమ్ములో కాస్తయినా ప్రజా ప్రయోజనాల కోసం వెచ్చించండి అంతే కాని నా హయాంలో  చేయలేదు...ఇది అసమర్ధ ప్రభుత్వం... చేతగాని నాయకులు అంటూ మాటలు  మాత్రాన ప్రజల కష్టాలు తీరతాయా...!! లేక మీ మాటలకు భయపడి ప్రభుత్వం కోట్లు గుమ్మరిస్తుందా సాయం కోసం...!! విపత్తులు వస్తు ఉంటాయి.. పోతూ ఉంటాయి...దానికి పాలనకు ముడి పెట్టి ఏం సాధించలేము...ఎన్ని మాటలు చెప్పారు ఒక్కరైనా విభజన ఆప గలుగుతున్నారా..!! మా చేతులు దాటి పోయిందని కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు ఎప్పుడో చేతులెత్తేసి అమ్మగారి వి'భజన' మంత్రాన్ని బలపరుస్తున్నారు...పాకేజిలంటూ జనాన్ని మభ్య పెడుతూ...!! నష్ట పోయింది ఇరు ప్రాంత ప్రజలు..అంతే కాని నాయకులు కాదు...!! ఆట మొదలు పట్టిన అమ్మగారు ఎలా ముగిస్తారో ఎదురు చూడటమే మనం చేయగలిగిన పని...!! కనీసం ఇప్పటికయినా నాయకులను నమ్మడం మాని మన పని మనం చేసుకు పోవడమే మనకు ముందున్న దారి...!! ప్రకృతి వైపరీత్యాలకు కనీస సాయాన్ని కూడా చేయని చేయలేని నాయకులను అందలాలు ఎక్కించకుండా ఇకనయినా మన ఓటుకు న్యాయం చేద్దాం..!!

ఆనంద కావ్యాలు....!!

మాటలు అక్కర్లేని పరిచయాలు 
మనసులు మౌనాలైన తరుణాలు 
దారులు వేరైన కలవని గమ్యాలు 
గతులు గల్లంతైన రహదారులు
తడబడిన అడుగులనడకలు
గతం దాచిన గురుతులు
చెలిమి చెప్పిన సంగతులు
తలపుల తలుపులు తెరచుకున్న క్షణాలు
జ్ఞాపకాలు మిగిలిన జీవితాలు
మరు జన్మ కోసం ఎదురు చూపులు
ఊహల వాకిళ్ళు తెరచుకున్న తలుపులు
ఎదురుచుపుల జన్మ జన్మాల అనుబంధాలు
కలసి జతగా మెదిలే మధుర వసంతాలు
అందమైన అనుభూతుల ఆనంద కావ్యాలు
చిగురించిన ఆశల మెరపుల అక్షర లక్షలు
అందించిన చేతుల ఆత్మీయతల అనురాగాలు
అన్ని కలసిన వదలిపోలేని బంధుత్వాలు
అన్ని రుచుల సమ్మేళనం అద్భుతమైన ఈ జీవితాలు...!!

27, నవంబర్ 2013, బుధవారం

కారం వ్యాధి...!!

చక్కెర వ్యాధిలా కారం వ్యాధి బాధితులు ఎవరైనా ఉన్నారా....!! అసలు ఈ కారం వ్యాధి గురించి ఎప్పుడైనా విన్నారా...!! కొత్తగా ఉంది కదూ వినడానికి...కాని నిజమేనండి ఇలాంటివ్యాది కూడా ఒకటి ఉంది....దానికి సాక్ష్యం నేనే...!! తమలపాకులో అదేనండి కిళ్ళి(పాన్) లో సున్నం ఎక్కువైతే నోరు ఎలా పోక్కిపోతుందో కారం తగిలితే నోరు అలా అవుతుంది...కారణం తెలియలేదు కాని గత కొన్ని సంవత్సరాలుగా ఈ కారం వ్యాధికి భాదితురాలిని..అలా అని తినడం మానేయలేదు లెండి చక్కగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటున్నా...అదే అండి ఉప్పుతో మాత్రమే కూరలు అన్న మాట...చూసారా ఒక్కోసారి రోగం కూడా మన మంచికే అన్నట్టు...ఎప్పుడో చెప్పినట్టు ఏది జరిగినా మన మంచికే అని ఈ ఋజువు కూడా బావుంది కదూ...!!

అమృతమూర్తి...!!

మువ్వలా ముడుచుకున్న ముగ్ధత్వం
గువ్వలా గూడు చెదిరి బిక్కుమంటోంది...!!
గుబులైన గుండె గొంతు మూగబోయింది
గునపాలై గుచ్చుతున్న చూపుల శరాలను తట్టుకోలేక..!!
మెత్తనైన సున్నితత్వం దారి మరచిపోయి
కఠిన పాషానమైన హృదయాల్లో కరిగి పోయింది...!!
చివ్వున ఉబికిన కన్నీటి చెలమ నిండుతూనే ఉంది
ఆగని రుధిరాన్ని నిలువరించే జాడ లేక...!!
మనసు దాటని మౌనం పెదవి విప్పలేక పోతోంది
కనిపించని గాయాలను చూపించే ధైర్యం లేక....!!
పురుటి నెప్పుల ప్రసవ వేదన వినిపిస్తూనే ఉంది
చూడలేని ఆ వేదన మోదానికి సాక్ష్యం ఎక్కడిది...??
కారణం నువ్వని తెలిసినా ఒప్పుకోలేని అహం నీది
మరో ఊపిరికి రూపానిచ్చే  క్రమంలో....
కష్టాన్ని ఇష్టంగా భరిస్తూ ప్రాణాన్ని ఫణంగా పెట్టే
అసమాన అమృతమూర్తి మాతృ మూర్తి ...!!

26, నవంబర్ 2013, మంగళవారం

మనసులో మనం... మనలో మనసు....!!

మనసొక మధుకలశం పగిలే వరకే అది నిత్య సుందరం....ఈ పాటలోని మాటలు, భావం ఎంత నిజం...!! కొన్ని పాటలు
వింటుంటే అనిపిస్తుంది...ఇంత బాగా ఎలా రాస్తారా అని...!! మన మనసు మనం ఏది దానికి ఇస్తే అది తీసుకుంటుంది... మనలోని తనలో దాచుకుంటుంది...పాపం మనం ఏది ఇచ్చినా వద్దు అనకుండా పుచ్చేసుకునేది మన మనసు ఒక్కటేనేమో ఈ ప్రపంచంలో...!! ఒక్కోసారి ఎదురు తిరిగినా మనం దాని నోరు నొక్కేసి మన ఇష్టం వచ్చ్సినట్టే దానిని ఉండమని చెప్పేస్తాం...వినక చస్తుందా మరి..!! మనం మన మనసుకు మాత్రమే నియంతలం కదా...!! అందుకే దాన్ని మాత్రమే మన మాట వినేటట్లు చేసుకుంటాం..ఒకవేళ అది వినక పోయినా మనం పట్టించుకోము...అచ్చు మనని మన వాళ్ళు పట్టించుకోనట్లే...-:).
మనసు నిజంగా మధుకలశమే..!! కాకపొతే దానిలో మనం కాని మన చుట్టూ మనం అల్లుకున్న లేదా పెంచుకున్న బంధాలు అనుబంధాలు వెదజల్లే పరిమళాల అనుభూతుల మీద ఆధారపడి ఆ సున్నితత్వం ఉంటుంది...నిన్ను నీకు చూపించే నీ మనసు అద్దంలో అన్ని నిజాలు స్పష్టంగా కనిపిస్తాయి...ఒప్పుకునే మంచి మనసే నీది కావాలి మరి..!! ఎవరికీ తెలిసినా తెలియక పోయినా నీ మనసుకు నువ్వేంటో తెలుసు...అది ఏం చెప్తుందో నీకు తెలుసు...!! అందుకే నిన్ను నీకు చూపించే నీ నిజమైన నేస్తాన్ని నిర్లక్ష్యం చేయక నీ మాటే నీది కాకుండా ఓసారి అది చెప్పేది కూడా వింటే పోయేదేం ఉంది.. మహా అయితే అది చెప్పే మంచి నీకు నచ్చుతుంది అంతే కదా...!! లేదా ఎలానూ దాన్ని నోరు మూసుకుని ఓ పక్కన పడి ఉండమని చెప్పే అధికారం ఉండనే ఉందాయే...!!
చూసారా...మనలోని మన మనసుతోనే మనం ఎన్ని ఆటలు ఆడుకుంటున్నామో...!! పగలని అద్దం లో కనిపించేది ఒక రూపమే...అదే ముక్కలైన అద్దంలో లెక్కకు రాని రూపాల్లానే...ముక్కలైన మనసు అద్దంలో లెక్కకు దొరకని ఆలోచనా సంద్రాలెన్నో..!! మెలి తిప్పే మనసు సుడిగుండాలెన్నో...!!  ఈనాటి మన అతుకుల అవసరపు బతుకుల్లానే మనసు ముక్కలు దాచేసుకుని ఓ రకంగా చెప్పాలంటే మనసనేది ఉందని మరిచి పోయి అవసరం కోసమో...భాద్యతల బంధాల కోసమో...సమాజంలో మనకంటూ ఓ గుర్తింపు కోసమో...బతికేస్తూ...నలుగురితో పాటు మనతో మనం కూడా నటించేస్తూ జీవిత నాటకాన్ని దిగ్విజంగా వెళ్ళదీసేస్తున్నాం...కాదంటారా...!! 

25, నవంబర్ 2013, సోమవారం

ఇష్టమైన ఇష్టం...!!

ప్రేమ ఒక యోగమో...!! భోగమో..!! నాకు తెలియదు కాని ఇష్టం మాత్రమే తెలిసిన మనసుకు ఇష్టపడటం ఒక్కటే తెలుసు...!! ఇష్టం ఇష్టమైనన్ని రకాలు .... ఇష్టాన్ని ఇష్టంగా ఇష్టపడి చూస్తే ఆ ఇష్టంలో అన్ని ప్రేమలు, ఇష్టాలు ఉంటాయి...!! ముందు మనని మనం ఇష్టపడగలిగితే తరువాత ఆ ఇష్టాన్ని అందరికి పంచగలుగుతాము.. పెంచుకోగలుగుతాము...!! నిన్ను నువ్వే ఇష్టపడలేనప్పుడు మరొకరిని ఎలా ఇష్టపడగలవు..?? ముందు మనలోని మనని మనం ఇష్టపడాలి...అప్పుడే అ ఇష్టం లోని ఇష్టం తెలుస్తుంది...!! నాకు నేను ఇష్టం అయినప్పుడు నాలోని లోపాలతో సహా నేను నాకు ఇష్టం అనే కదా...!!  మరి అలాంటప్పుడు ఎదుటివారిని కూడా అలానే ఇష్టపడాలి...ఒకరిని ఇష్టపడినప్పుడు వారిలోని తప్పొప్పులను రెంటిని ఇష్టపడినట్లే....అంతే కాని మనకు నచ్చని వాటిని వదిలేసినట్లు కాదు...!! లోపాలు, కోపాలు, అలకలు, ఆనందాలు, సర్దుబాట్లు, దిద్దుబాట్లు....ఇలా అన్ని కలిస్తేనే జీవితం సంపూర్ణం...లేకపొతే సగం చదివిన పుస్తకంలా అసంపూర్ణంగా ఉంటుంది...!! ఎవరికీ అక్కరలేని పుస్తకంలా ఓ మూలన పడి ఉంటుంది...!! మనతో మనం నిజాయితీగా ఉంటే అదే మనని అందరికి దగ్గర చేస్తుంది....నటిస్తే నాలుగు రోజులు తప్పుకోగలం... జీవితమంతా నటిస్తూ తప్పుకు తిరగలేము కదా...!! వాస్తవాలను వాస్తవంగా స్వీకరిస్తూ వాస్తవంలో బతకగలగాలి...!! తప్పులు అందరు చేస్తారు..కాని ఆ తప్పుని ఒప్పుకోగలిగే ధైర్యం మనలో ఎందరికుంది..?? ఇది తెలుసుకుంటే చాలు జీవితం సప్త వర్ణాల సాగర గీతమే అవుతుంది ప్రతి ఒక్కరికి...!!  

23, నవంబర్ 2013, శనివారం

పల్లె మనసు వాకిళ్ళు..!!

వేవేల వర్ణాలు ఊరించే వైనాలు
ఊహల్లో రూపాలు కన్నుల్లో దీపాలు
మనస్సుల్లో మౌనాలు మాటల్లో మొహాలు
రేయంతా రాగాలు చుక్కల్తో అచ్చట్లు
చూపుల్తో ముచ్చట్లు చేతుల్తో చప్పట్లు
కోపాల తాపాలు మమతానుబంధాలు
విడలేని పాశాలు చుట్టేసిన చుట్టరికాలు
కలబోసిన కలల కవ్వింతల వాకిళ్ళు
వరుసలు కలిపిన సరసపు సైయ్యాటలు
పక్కున నవ్విన పంచదార చిలకలు
పసిడి కాంతుల పండు వెన్నెలలు
మెత్తని తీరపు అలల ఇసుక తిన్నెలు
పచ్చని పట్టుపరుపుల పైరుల పలకరింపులు
మత్తెక్కించే గుభాళింపుల గంధాల మైమరపులు
ఆరుబయట అందాల రంగవల్లుల అల్లికలు 
ఛిరునవ్వుల తోరణాల చినుకుల అలంకారాలు
అన్ని కలిపి కనిపించిన అచ్చ తెనుగు లోగిళ్ళు
అపరంజి కావ్యాలు మా పల్లెల మనసుల వాకిళ్ళు..!!

21, నవంబర్ 2013, గురువారం

నాకు నేను చెప్పుకున్న కధ.....!!

విధి రాతకు ఎదురు నిలిచి మార్చుకున్న తలరాత వెక్కిరిస్తోంది...అప్పటి వరకు ఏ చీకు చింతా లేని జీవితం ఒక్కసారిగా మారిపోయింది....నా వాళ్ళెవరు నన్ను పట్టించుకోవడం లేదు అన్న మాటతో ఓ మోసగత్తెను నమ్మి తన కోసం జాలిపడి ముక్కు మొహం తెలియని పెద్దగా పరిచయం లేని ఓ అబద్దపు జీవికి జీవితాన్ని ఫణంగా పెడితే....చివరికి మిగిలింది మోసపోయిన జీవితంలో ఊసరవెల్లుల కోలుకోలేని దెబ్బలు, మనసు రోదన మనిషి వేదన...!!  ఏళ్ళు గడిచినా మారని మనస్తత్వం...దాని మాటున దాగిన నయ వంచన...!! ఎవరు నమ్మలేని నిజం ఇది..!!
పెళ్ళితో జీవితం మారిపోతుంది అని పెద్దలు అటు ఏడూ తరాలు ఇటు ఏడూ తరాలు చూసి చేసే వారంట ఒకప్పుడు..కనీసం ఇప్పుడు ఆ కుటుంబం గురించి కాస్త తెలుసుకుని చేసుకుంటే కొంతయినా రాతలు బావుంటాయేమో...అనిపిస్తుంది...పెరిగిన వాతావరణం, పరిస్థితులు, చుట్టూ ఉన్న స్నేహాలు...ఇలా అన్ని అల్లోచించాలి కాస్తయినా...చేతులు కాలాక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఏంటి అనుకుంటున్నారా...చాలా మందికి చేతుల కాలకుండా ఉండటానికే ఈ ప్రయత్నం...!!
పెళ్ళి  ముందు రోజు నుంచే ఎందుకో కాస్త భయం మొదలు అది అలా పెరుగుతూనే వచ్చింది ఇప్పటికి..అందరిలా అన్ని ఆలోచనలు ఉండి అందరిలానే ఉంటే నా జీవితం కూడా బావుండేదేమో...!! అసలు కోరికలు లేక పోవడం కూడా ఒక తప్పేనేమో...నా జీవితం ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకోని జీవితం ఇలానే ఉంటుందేమో...!! ఏ రోజు ఇది కావాలి అని అడగని, వాళ్ళింట్లో అది ఉంది మనకి లేదు...ఇలా ఏం అడగకుండా ప్రతి నెత్తుటి బొట్టు నీకు, నీ వాళ్ళకు ధార పోస్తే ఇన్నేళ్ళ ఈ జీవితానికి నువ్వు మిగిల్చింది...కన్నీళ్ళు కస్టాలు...పదిమందికి చెప్పే నీతులు మన జీవితానికి సరిపోవు...ముసుగు తీస్తే నువ్వేంటో అందరికి తెలుస్తుంది...నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పు ఇన్నేళ్ళలో ఒక్కటి మాకోసం చేసానని..!! ఏ బంధమూ నీకు అక్కరలేదు...నీ వాళ్ళకు అవసరం లేదు...మీకల్లా కావాల్సింది ధన సంబంధమే...దానికోసం ఎంతకైనా తెగిస్తారు...మీ అవసరం కోసం పెళ్ళాం పిల్లల్ని తాకట్టు పెట్టడానికి కూడా వెనుకాడరు...డబ్బు కోసం అమ్మానాన్నలనే విడదీయడానికి వెనుకాడని రక్త సంబంధాలు మీవి...ఆ బంధాలకు శత కోటి వందనాలు...!! ఎవరైనా మనకి సంతోషం లేక పోయినా పిల్లల ముఖాల్లో ఆనందాన్ని చూసి తరిద్దాం అనుకుంటారు...జనం దగ్గర నటించే నీకు పిల్లల ఆనందం ఎలా తెలుస్తుంది....?? నాకే కాదు వాళ్ళకు ఏ సంతోషాన్ని మిగల్చని నువ్వు...ఈ విలువ లేని వలువలు లేని జీవితం మాకు వద్దు..ఇకనైనా ఈ బతికినా నాలుగు రోజులు ప్రశాంతంగా బతకనివ్వు....నువ్వు మారవద్దు...నేను చేసిన తప్పుకి నా జీవితాన్ని దానిలోని ప్రతి చిన్న ఆనందాన్ని కోల్పోయాను...నమ్మిన నమ్మకానికి మీ బంధాలు అనుబంధాలు ఇచ్చిన బహుమతి చితి మీద కాలుతున్న నా మనసు కూడా గుర్తుగానే మిగుల్చుకుంటుంది..!! మోసపోయిన బతుకుని తలచుకుంటూ...!!

20, నవంబర్ 2013, బుధవారం

అలసిన ఓ జీవితం..!!

గల గలా సాగే జలపాతపు సరిగమలలో
నీ మాటల మంత్రాల మౌన తరంగాలలో  
హోయలొలికే వంపు సొంపుల నయగారాలలో
నీ నడకల నాట్య విన్యాసాలే ప్రతి కదలికలో 
పరుగుల ఉరకల ఎత్తు పల్లాల హడావిడిలో
అలుపు సొలుపు లేని ఆత్మ విశ్వాసంలో
వేవేల వర్ణాల వడ్డింపుల కూర్పులలో
అలా అలా సాగే అందమైన పయనంలో 
హాలహలాల కాలకూట అంతర్మధనంలో 
అందిన అమృత భాండం సాగర మధనంలో
చేజారిన జీవితాన్ని చూసుకుంటూ
ఆంతర్యంలో అంతరాన్ని అర్ధం చేసుకునే క్రమంలో
అలసిన ఓ జీవితం..!!

19, నవంబర్ 2013, మంగళవారం

ఎలా చెప్పి నమ్మించను...!!

నీకు నాకు మధ్య సాక్ష్యాలను ఎలా పిలువను....!!

అప్పుడెప్పుడో ఓ రాక వదలి వెళ్ళింది
అది నీ గురుతుగా నాకు చేరువగా
దాచుకున్నా....దాన్నెలా చూపించను...!!

సుక్కల్లే తోచి ఎన్నెల్లే కాచి
ఏడ దాగున్నావే...ఇన్ని ఏల సుక్కల్లో
యాడ నిన్ను ఎతికేది....ఎదలోని నిన్ను...!!

నన్ను నేను ఎప్పుడో పోగొట్టుకున్నా
అది తెలియక వెదుకుతూనే ఉన్నా ఇప్పటికి
నీ దగ్గరే ఉండిపోయానని తెలిపే సాక్ష్యం నా దగ్గర లేక...!!

ఏతమేసి తోడినా ఎండని ఏరు
పొగిలి పొగిలి ఏడ్చినా నిండని పొంత
ఎండిన నా మనసు... చెమ్మ లేని జీవాన్ని మిగిల్చిన కళ్ళు....!!

ఇవి చాలవా నీకు....ఇప్పటికైనా నమ్మవా...
నా జ్ఞాపకాలన్నీ నీతోనే ఉండిపోయాయని..నను వీడి వెళిపోయాయని
నీకు తెలిసిన ఈ అక్షరాలు నమ్మించడం లేదా...!!

సాక్ష్యాలుగా చూడటానికి..సమాధానాలుగా సరి పోవా...!! 

పుట్టినరోజు శుభాకాంక్షలు....!!

నాకు అత్యంత ఆప్తురాలు అతి తక్కువ కాలంలో అనుబంధమై పెనవేసుకున్న నా ప్రియ నెచ్చెలి షర్మిలకు హృదయపూర్వక  పుట్టినరోజు శుభాకాంక్షలు....
మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు షర్మిల మాకు సీనియర్...ఫైనల్ ఇయర్ వాళ్ళకి లెక్చరర్ గా వచ్చేది...మేము ఇండ్రస్టియల్ టూర్ కి వెళ్ళినప్పుడు పరిచయం..తనేమో టాపర్ .. నేనేమో ఏదో మామూలు చదువే...!! దూరంగా ఉందామన్నా దగ్గరైన ఆత్మీయత...!! నాలుగు రోజుల పరిచయంలోనే చాలా దగ్గరి అనుబంధంగా మారింది మా పరిచయం...తనది ఎంత అమాయకత్వం అంటే ఈ రోజు మల్లెమొగ్గలు మరుసటి రోజు సాయంత్రానికి కూడా పువ్వులే అనుకునేంత...!! చూడండి నేను చెప్పింది అబద్దమైతే పక్కన ఫోటోలో...!! కనిపిస్తోంది కదూ మీకు ఆ అమాయకత్వం....!!

18, నవంబర్ 2013, సోమవారం

నీ సాక్ష్యం కోసం...!!


మనసు మాటున దాచేసింది
చూడనివ్వని రోదన చిత్రాన్నికనిపించకుండా ...!!
చేసిన గాయపు గురుతులు
మాసిపోని మచ్చలుగా అలాగే మిగిలాయి...!!
కాలం వేసే మందు సరిపోలేదు
గతం గుచ్చిన పచ్చబొట్లకు వాస్తవంగా..!!
మాసిన గాయం జ్ఞాపకంగా మారి
తగులుతూనే గుర్తు చేస్తోంది తన ఉనికిని ...!!
ఏ బంధం నాది కాక పోయినా నాదేనంటూ
అల్లుకున్న అనుబంధాలు తెంచుకోలేని ఆచేతనావస్థ...!!
చేతనలోనికి రాని తనువు పడే తపన
చైతన్యమైన మదిని చిద్రం చేసి చంపేసిన ఘనత నీదే...!!
వీడి పోలేని ప్రాణం కొట్టుమిట్టాడుతూ
వదలలేని పాశాలను పెనవేసుకున్న మమకారం....!!
ఆశ నిరాశల్లో మునుగుతూ తేలుతూ
ఊపిరినిచ్చే ప్రాణవాయువు కోసం ఎదురు చూపుల నిట్టూర్పులు...!!
కాల్చేసిన చితిపై మంటలారినా ఆ గాలిలో
వేడి తగ్గని మనసు సెగల ఆవిరి తగులుతూనే ఉంది వెచ్చగా...!!
జీవితంలో జీవాన్ని మొత్తం పీల్చేసినా
ఇంకా జీవశ్చవం మిగిలే ఉంది నీ సాక్ష్యం కోసం...!!

16, నవంబర్ 2013, శనివారం

విజయం వెనుక...!!

అందరు చెప్తూ ఉంటారు ప్రతివిజయం వెనుక ఎవరో ఒకరు ఉంటారు అని...!! ఇది ఎంత వరకు నిజమంటారు...??
నాకు అనిపిస్తూ ఉంటుంది ప్రతి విజయం వెనుక ఓ పట్టుదల, ఓ కసి, ఓ ఆవేశం, ఓ రోషం .... ఉంటుందని...!! మనం అనుకోగానే అందేది కాదు కదా విజయం అంటే...!! అలా దొరికితే అది విజయం అనిపించుకోదేమో... ప్రతి గెలుపు వెనుక ఎంతో మానసిక ఒత్తిడి, ఎన్నిటినో కోల్పోయిన జీవితం, మరెన్నిటికో మనసుకు సర్ది చెప్పుకున్న క్షణాలు, ఓటమి అంచున నేర్చుకున్న పాఠాలు...ఇలా అన్ని కలిపితే ఓ గెలుపు...నా దృష్టిలో...!!
అంతా సవ్యంగా సాగితే అందరు సాధు జీవులే...అంతా తమ మహిమే అని పొంగిపోతూ తలలు ఆకాశానికి                ( రొమ్ములు విరుచుకుని వస్తాదుల్లా ప్రవర్తిస్తారు ) అంటించుకుంటారు ... అన్ని సరిగా ఉంటే ఎవరైనా మరొకరికి నీతులు చెప్తూ తమ మంచితనాన్ని చాటుకుంటారు...అదే కాస్త చిన్న కష్టం వచ్చినా అమ్మో... ఈ కస్టాలు పగ వాళ్లకి కూడా రాకూడదు...నేను కాబట్టి ఇంత కష్టాన్ని భరించ గలుగుతున్నా అని కొందరు...ఇంత పెద్ద కష్టం ఎవరికీ రాదు నాకే ఎందుకిలా...అని మరికొందరు...ఇలా విభిన్న ఆలోచనలతో ఉంటారు...చీకటి వెలుగు మన దైనందిన జీవితంలో ఉన్నట్టే కష్టం సుఖం కూడా మన వెన్నంటే ఉంటాయి.....ఇక్కడ నాకు మా హింది టీచర్ రత్నకుమారి గారు చెప్పిన ఓ మాట కష్టం లో ఉన్నప్పుడు  గుర్తు చేసుకుంటూ ఉంటాను...." చెడు జరిగింది అని బాధ పడతాము..కానీ ఆ చెడు వెనుక కూడా మనకు ఓ మంచి ఉంటుంది,,," అని..నిజంగా ఇది నిజమండి..!! అలానే మా పిన్ని చెప్పిన ఇంకోమాట కూడా...."  మనకు కష్టం తప్పనప్పుడు దేవుడు దాన్ని మనం తట్టుకోగలిగినప్పుడే పెడతాడు " ..  అని..ఇది నిజమే అనిపిస్తుంది నాకు...!! ఇంకో చక్కని మాట యండమూరి గారు చెప్పింది సమస్య జీవిత కాలం మన జీవిత కాలంతో పోల్చుకుంటే చాలా చిన్నది....అవును కదండీ ఒకే సమస్య మన జీవితమంతా వేధించదు కదా...బోలెడు సమస్యలు వస్తు పోతూ ఉంటాయి....అందుకే ప్రతి సమస్యకు క్రుంగి పోకుండా కాస్త ధైర్యాన్ని కూడగట్టుకుంటే ఏదో ఒక పరిష్కారం దొరకక పోదు...అందుకని విలువైన జీవితాన్ని సాధ్యమైనంత వరకు ఝటిలం చేసుకోకుండా ప్రశాంతంగా జీవించడానికి ప్రయత్నిస్తే చాలు...మన పుట్టుకకు ఓ అర్ధాన్ని చేకూర్చ గలిగితే అదే జీవిత పరమార్ధం అవుతుంది...అంతే కాని ప్రతి చిన్న కష్టానికి నిరాశతో జీవితాన్ని ముగించే ఆలోచన మన దరి చేరనివ్వకూడదు...!! మనం అనుకున్నది జరిగితేనే మనం గెలిచినట్లు కాదు...మన వ్యక్తిత్వంతో, మన ప్రవర్తనతో నలుగురి మనసులు గెలుచుకుంటే చాలు....అది ఓ గొప్ప గెలుపే...!!

15, నవంబర్ 2013, శుక్రవారం

మీలో నింపుకోండి...!!

నిన్న టి వి లో పుత్తడిబొమ్మ సీరియల్ చూస్తుంటే "కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని ఎవరికీ చెప్పలేనప్పుడు మనతో మనమే చెప్పుకుంటే బాధ కాస్త తీరుతుంది అని" .. నవ్వు  వచ్చింది నాకు  మొన్న నేను చెప్పుకుంది నీకంటూ ఎవరు మిగలని రోజు..!! లో అదేకదా అనిపించింది. నాలా ఆలోచించేవాళ్ళు కూడా కొందరు ఉంటారేమో అనిపించింది..నా చిన్నప్పటి నుంచి కోపం వచ్చినా, బాధ అనిపించినా అది అక్షరాల్లో పెట్టడం అలవాటై పోయి అదే వ్యాపకంగా కూడా అయ్యింది..ఏదైనా నాకు నేను చెప్పుకోవడమే అలవాటై పోయింది. కాకపొతే ఇప్పటికి మోసపోతూనే ఉన్నామే అని అనిపిస్తూ ఉంటుంది...అవును మరి ఎవరైనా మనం వాళ్ళని నమ్మితేనే కదా సులభంగా మోసం చేయగలరు...మోసం అనేది ఒక్క డబ్బులు అనే కాదు...మనసులను, మనుష్యులను, బంధాలను, అనుబంధాలను, ప్రేమలను, అభిమానాలను,స్నేహాలను....ఇలా మానవ బంధాలను అన్నింటిని మోసం అనే ముసుగులో మాయ చేయవచ్చు..మనలో జాలి అనేది ఉంటే ఇంటా బయటా మోసపోతూనే ఉంటాము...!! ప్రతి ఒక్కరు మంచివాళ్ళే అనుకుంటూ మనం మోసపోతూనే ఉంటాము ఎప్పటికి...కాస్తయినా కఠినంగా ఉండక పొతే...!! నేను అనుకుంటూ ఉంటాను ఈ మోసపోయే జాబితాలో అన్ని రకాలుగా ముందు ఉన్నది నా పేరేనేమో అని...!! కాకపొతే ఒక్కటే అనుకుంటాను నన్ను మోసం చేసిన వాళ్ళు కనీసం ఒక్కసారయినా నా బాధను అనుభవించక పోతారా...!! అని...అలా అనుకోవడం కన్నా ఏం చేయలేను కదా వాళ్ళను...!! కాకపొతే ఒక్కటి చెప్పగలను అందరిని సులువుగా మోసం చేయలేరు అని....మోసపూరిత మనసుతో నటిస్తే ఆ నటన పైవాడి ఖాతాలో జమ అవుతుంది..లెక్కలు వాడే తేలుస్తాడు ఎవరివయినా...!! మనస్సాక్షి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది...మన తప్పు ఒప్పులు మనకన్నా బాగా దానికి తెలుసు...దానిని నిద్ర పుచ్చకండి జోల పాడి..మనసు మాటలు వింటూ ఉండండి అప్పుడప్పుడు....!! మీకు తెలియని మీలొ మిమ్మల్ని మీకు చూపిస్తుంది...అద్దంలో ప్రతిబింబంలా....అప్పుడు నిజాన్ని ఒప్పుకోగలిగే గుండె ధైర్యాన్ని మీలో నింపుకోండి...!! అప్పుడు మన తప్పులను ఒప్పుకోగలిగే ఆత్మస్థైర్యం మెండుగా ఉండాలి....మనకు బావుందని అబద్దంలో బతకకుండా కష్టమైనా నిజంలో నిజాయితీగా గర్వంగా బతకగలిగితే ఎంత బావుంటుందో ఒక్కసారి ఊహించి చూడండి....నిజమే కదా ఆ ఊహే ఇంత బావుంటే అదే వాస్తవం అయితే ఇంకెంత బావుంటుంది చెప్పండి...!! 

13, నవంబర్ 2013, బుధవారం

నీ కంటూ ఎవరు మిగలని రోజు....!!

అర్ధం లేని సంఘర్షణలో లేక వ్యర్ధం అయిన ఆలోచనలో తెలియని అయోమయం....ఇలా ఎన్నాళ్ళు ఈ అంతం లేని అవసరాల నడుమ యంత్రంలా యాంత్రిక జీవితం...!! నువ్వు గెలిచిన నాడు అందరూ నీ చుట్టాలే...అదే ఓటమి చేరువలో నువ్వున్నప్పుడు పడిపోతున్నావని కూడా పట్టించుకోక పారిపోయిన అన్ని బంధాలు...నీకంటూ మిగలని ఏ చుట్టరికమూ...!! నీకంటూ నిన్ను కూడా మిగుల్చుకోలేని నువ్వు...!!
విజయానికి ఎల్లలు లేని ఆనందం హద్దుగా ఉంటే పతనం చుట్టూ పోగైన పరి పరి కారణాలు...నీ చేతగాని తనాన్ని ఎద్దేవా చేస్తూ నవ్వే లోకం...గెలుపు సింహాసనం మీద ఉన్నప్పుడు గుర్తుకు రాని నీ లోపాలు ఓటమి నీ చెంతనున్నప్పుడు ఆ లోపాలే నిను గుచ్చే శులాలు...శరాఘాతాలై కుళ్ళ బొడుస్తాయి జీవశ్చవమైయ్యే వరకు...!!
ప్రతి ఒక్కరు జీవితపు ఆటలో గెలవాలనే ఆడతారు...కాకపొతే నిజాయితీగా కొందరు...అడ్డ దారిలో మరికొందరు...!!
చేజారిన గెలుపు కోసం తపన, ఎప్పటికైనా అందుకోగలమన్న ధీమా చాలదు గెలుపు శిఖరాన్ని చేరుకోవడానికి... ఎన్నో అడ్డంకులు, అవమానాలు దాటుకుని నిరంతర ప్రయత్నమే సాధించబోయే విజయానికి సాక్ష్యంగా ఉండాలి... ఇంటా బయటా ప్రతికూలత ఉన్నా నిన్ను నువ్వు వదులుకోకు..నీ గమ్యం మార్చుకోకు..నీ అసలైన ఆస్థి ఆత్మ స్థైర్యాన్ని కోల్పోకు...నీకు నువ్వే తోడు నీకెవరులేకున్నా...!! నీకు నువ్వే నేస్తానివి...!! బంధాలు భాధ్యతల నడుమ నలిగినా సడలని సంకల్పం నీది కావాలి...నవ చైతన్యానికి నాంది కావాలి...మొదటి అడుగు నీదే కావాలి...నవ్విన నాప చేను పండును అని నిను చూసి పగలబడిన ఆ నలుగురికి సమాధానం చెప్పగలగాలి...!! మాటలు పడుతూనే ఉంటే అంటూనే ఉంటారు..ఒక్కసారి ఎదురు తిరిగి చూడు...తలలు వంచుతారు...!! ప్రతికూలత ప్రతి ఇంటా ప్రతి జీవితంలోను ఉంటుంది...అయినా అదే సమిధగా చేసుకుని వెలుగుల కాంతులు విరజిమ్మాలి...ఆ వెలుగు తాకిడికి అందరి కళ్ళు తట్టుకోలేక మూసుకు పోవాలి...శులాలు విసిరిన నోళ్ళు మూతబడాలి...రావాలి ఆ రోజు దిగంతాలను దాటుకుంటూ....!!

కాలుతున్న గాయాలకు...!!

ఉరుకుల పరుగుల ఉదయపు ఆరాటం
ఆగని కాలంతోసాగే అంతం లేని పయనం
భానుని తొలి పొద్దు మలి పొద్దు మద్యలో
జరిగే జీవిత చిత్రాలు విచిత్ర విధి రాతలు

నిరంతరం సాగే అంతర్మధన చెలగాటం
అర్ధంలేని ఆవేశాల విపరీత పరిణామం

రెప్పపాటు ఈ జీవితంలో లెక్కకు రాని
రెప్ప మూయలేని క్షణాలు అనునిత్యం

చాటు మాటు సంగతుల సమాహారాలు
బంధాల అనుబంధాల అవసరపు లెక్కలు
మరచిన బాధ్యతల నడుమ కూరుకుపోయిన
హక్కుల కోసం ఆరాటం చేసే ఆర్భాటం

మనిషి గమనాన్ని నిర్దేశించే మనసు
చంచల చపలత్వంలో కొట్టుకు పోతూ
ఎండమావుల తీరాల వెంబడి పరుగిడుతూ
కాలుతున్న గాయాలకు ఒయాసిస్సుల అండ కోసం...!!

11, నవంబర్ 2013, సోమవారం

ఆలోచించుకోండి....!!

మనం మంచివాళ్ళమై పోవడానికి మనతో ఉన్న, మన చుట్టూ ఉన్న వాళ్ళని చెడ్డ వాళ్ళుగా చిత్రీకరించనక్కర లేదు. మనం మనలా ఉంటే చాలు...మంచి అనిపించుకోవడానికి ఈ రోజు నటిస్తే సరిపోతుందా...!! రేపు, ఎల్లుండి...ఇలా ఎన్ని రోజులు నటన జీవితంగా బతికేద్దాం...!! కనీసం మనతో మనమయినా మనసు విప్పి మాటాడుకునేదెప్పుడు ...?? మనకు సంతోషాన్నిచ్చే అబద్దాన్ని స్వీకరించే సహృదయం...బాధను కలిగించే నిజాన్ని ఒప్పుకోవడానికి కూడా అలానే ఉండాలి. మనకు నచ్చిన మాటలు బావున్నాయని, మన తప్పులు ఎత్తి చూపే విమర్శలు బాలేదని అనుకోవడం మనని మనం మోసం చేసుకోవడమే...!! అందరు మనకు నచ్చినట్లే ఉండరు.. అలా అని మనం కూడా అందరికి నచ్చేటట్లు ఉండలేము...మనం మనలానే ఉంటూ ఎదుటి వారిని నొప్పించకుండా ఉంటే చాలు...మనసు లేని మనుష్యుల్లా కాకుండా పెద్ద మనసు లేకపోతె పోయే కనీసం ఉన్న చిన్న మనసునయినా దాయకుండా దానికి  నచ్చినట్లు మనలా ఉందాం...!!
ఇప్పుడు చూడండి అందరి మాటలను నమ్మిన ఆంధ్రులు విడి పోకుండా ఉంచగలరా ఆంధ్ర రాష్ట్రాన్ని..!! ఎవరిని  మోసం చేయడానికి ఈ బందులు, ఉద్యమాలు చేసారు...?? ఇప్పుడు విరమించుకుని చేతులెత్తేసి ప్యాకేజీల కోసం మొరలు ఎత్తి అర్రులు చాస్తున్నారు... బందుల కారణంగానే ఆర్ టి సి చార్జీలు పెంచామని వాళ్ళు చెప్తున్నారు...పంటలకు నష్టాలు వచ్చాయని కూరగాయల ధరలు ఆకాశంలో ఉన్నాయి..ఇక కనపడని కరంటుకు కట్టే బిల్లుల బరువు చెప్పనక్కరలేదు..చేతులెత్తేసిన  ఉద్యమ నాయకులు వీటిలో కనీసం ఒక్కదానికైనా సమాధానం చెప్పగలరా...!! ఎందుకు చేశారు ఉద్యమాలు...?? ఏం సాధించారు..?? జనాన్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని మోసం చేస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నారు..!!
పోరాట పఠిమ లేని ఏ ఉద్యమాలు ఏం ఒరగబెట్టవు అన్నది జనంలోని మనకు ఇప్పటికయినా అర్ధం అయితే చాలు...మార్పు అనేది మనలో రావాలి...మనతోనే మొదలు కావాలి...అవినీతి పేరుకు పోయింది, డబ్బు చుట్టూనే అందరు అని అనుకోకుండా మనం మారితే అదే ఓ గొప్ప మార్పుకి పునాది అవుతుంది..నాయకులు చెప్పే ఊక దంపుడు ఉపన్యాసాలు విని అవే నిజాలు అనుకోకండి...నిజాలు తెలిసినా మనకెందుకులే అని నిమ్మకు నీరెత్తినట్టు ఉండకుండా కాస్త చైతన్యం చూపండి...రేపు ఓట్ల కోసం మీ గడపకు వఛ్చిన నాయకులకు ఏం సమాధానం చెప్పాలో ఆలోచించుకోండి....!!

9, నవంబర్ 2013, శనివారం

ఆహ్వానించే మనసు కోసం...!!

అదేమిటి నిజం గతంగా మారి
జ్ఞాపకంగా మిగిలి పొయిందేమిటి....??
నిప్పుల కొలిమిలో వేసినా బూడిదగా మారకుండా
నిలువెత్తు సాక్ష్యంగా నిలబడే ఉందేమిటి...??
సింధూరపు రంగు పులుముకుని దరి చేరలేరెవ్వరని
నన్ను చూసి పగలబడి నవ్వుతోందా అన్నట్టుగా అనిపిస్తోందేమిటి...??
మండుతున్న మనసుకు అద్దం పడుతూ
వెలుగుతున్న కుంపటిలో కనిపిస్తున్న నుసి ఎక్కడిది...??
అబద్దాల జాడలు కనిపించకుండా పోయాయనడానికి
నిన్ను దహిస్తున్న ఈ జ్వాలల వేడిమి సరిపోవడంలేదా...??
హిమాగ్ని కాలుతోంది ఆరిపోకుండా కన్నీటికి కరగకుండా
ఆ మంటలు మనసులోని మాలిన్యాన్ని కాల్చే సమిధలుగా మారిపోయాయి...!!
అగ్ని ప్రక్షాళనతో పునీతమైన మది వాకిలి ఎదుట
నిజం నిర్భయంగా నిలబడి ఎదురు చూస్తోంది ఆహ్వానించే మనసు కోసం...!!

7, నవంబర్ 2013, గురువారం

నీ జ్ఞాపకం నాతో...!!

వెంటపడే జ్ఞాపకం
వేధించే జ్ఞాపకం
వెన్నాడే జ్ఞాపకం
మైమరపించే జ్ఞాపకం
మధువొలికించే జ్ఞాపకం
మాసిపోనిది జ్ఞాపకం
మధురమైనది జ్ఞాపకం
మనసు తడిమే జ్ఞాపకం
ఏకాంతానికి సహవాసం జ్ఞాపకం
దూరమైన దగ్గరతనానికి జ్ఞాపకం
చేరువ కాని చెలిమికి జ్ఞాపకం
చెంతన లేని సాన్నిహిత్యానికి జ్ఞాపకం
గతమైన జ్ఞాపకం
ఘనమైన జ్ఞాపకం
నీ జ్ఞాపకం నాతోనే...నీ జ్ఞాపకం...!!

6, నవంబర్ 2013, బుధవారం

వాసంత సమీరాలు...శిశిర వసంతాలు...!!

స్వేచ్చగా పయనించే నా ఆలోచనలకు
అడ్డుగా నువ్వే ఎందుకున్నావు..!!
నా ఆశల విహంగాలు అలుపు లేకుండా
నీ చుట్టూనే తిరుగుతున్నాయి తెలుస్తోందా...!!
నా ఏకాంతాన్ని కూడా నాకు లేకుండా
దూరం చేసి నీతోనే ఉంచేసుకున్నావు ఎందుకు....!!
అర్ధం కాని చిక్కుముడిలా చుట్టేస్తూ
గజిబిజిగా వెన్నాడే నీ సాన్నిహిత్యం మైమరపేంటో...!!
చీకటి రాతిరికి వెన్నెల చీరను చుక్కల అద్దకంతో
చుట్టిన ఆ నింగి పసిడి కాంతులు నీ కన్నుల్లో మెరుపులే....!!
మనసు తలపులు వాకిలి తెరచిన మధుర జ్ఞాపకాలు
వసి వాడని వాసంత సమీరాలు...శిశిర వసంతాలు...!!
మరు జన్మకు పదిలమైన మది నిక్షేపాలు
అనుబంధాల ఆనందపు పరమార్ధాలు ఈ జన్మకు...!!

4, నవంబర్ 2013, సోమవారం

సోదర సోదరీ బంధానికి ప్రత్యేకమైన రోజు ఈ రోజు...!!


సోదర సోదరీ బంధానికి  ప్రత్యేకమైన రోజు ఈ రోజు... దీపావళి మరుసటి రోజున భగినీ హస్తం అని పిలుస్తారు... ఈ రోజున ప్రతి సోదరుడు తన సోదరి ఇంటికి పిలవకుండానే వెళ్ళి పీట వాల్చుకుని కూర్చుని భోజనం చేస్తే చాలా మంచిదని చెప్తారు....ఆడపడుచుకి  తగిన విధంగా  పసుపు కుంకుమ ఇస్తే చాలా మంచిదట. కనుమరుగై పోతున్న బంధాలు అనుబంధాలు కలకాలం నిలిచి ఉండటానికి ఇలాంటి పద్దతులు చక్కగా దోహదపడుతున్నాయి మన సంస్కృతి సంప్రదాయాల్లో....నిజంగా ఇలాంటి మన ఆచారాలు, సంప్రదాయాలు మన పూర్వీకులు మనకు ఇచ్చిన వరం వెలకట్టలేని సంపద....ఇలాంటి ఆచారాలు సంప్రదాయాలు కనుమరుగై పోకుండా కలకాలం మన బంధాలను నిలబెట్టుకుంటూ మానవతా విలువలను కాపాడుకుందాం...మన పూర్వీకులు మనకుచ్చిన వెలకట్టలేని ఈ సంపదకు చేతులెత్తి మొక్కుతూ మన తరువాతి తరాలకు ఈ విలువల బంధాల ఆనందాన్ని పంచుదాం....!!

ఈ రోజు విశేషం హరిసేవ నుంచి సేకరించిన సమాచారం మీ అందరి కోసం ....
కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ అన్న పండుగను
జరుపుకుంటారు.

ఈనాడు యమధర్మరాజుని, చిత్రగుప్తుని పరివారంతో సహా పూజించి తల్లి యమునా
దేవి (నది)ని స్మరించి పూజించాలి.

సూర్యుని బిడ్డలైన యమునానది మరియు యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునమ్మకి
ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక, యమధర్మరాజుగారు
వేళతప్పక ధర్మం తప్పక పని చేసే వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె కోరిక
చాలానాళ్ళు తీరకుండా ఉంటుంది. అలా యమునమ్మ ఎదురుచూసి ఎదురుచూసి ఉండగా
యమధర్మరాజుగారు యమున ఇంటికి ఒకరోజు సకల పరివార సమేతంగా వచ్చారు ఆరోజు
కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆతల్లి చక్కగా ఆదరించి
పూజించి, చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించి ఆమే తన చేత్తో చక్కని వంట
చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో ఏదైనా
వరం కోరుకోమనగా. యమునమ్మ ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు చెల్లెలి
ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి,
అపమృత్యుదోషం అనేవి లేకుండా ఉండేటట్టు వరమియ్యమని కోరగా, యమధర్మరాజుగారు
ఆమె కోర్కెని విని ఆనందించి సోదరులు సోదరియొక్క సౌమాంగళ్యానికి ఎప్పుడూ
క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన
చేతివంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా
పుణ్యవతిగా, అఖండ దీర్ఘ సౌమాంగళ్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చారు.
అందువలనే ఈ తిథికి యమ ద్వితీయ అని పేరు వచ్చింది.  తరవాత యమునమ్మను
పరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి, చక్కని
షడ్రసోపేతమైన విందు చేసి సారె పెట్టి పంపాడు.

దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అనీ ఈశాన్య, ఉత్తర,
పశ్చిమ భారతంలో చేసుకునే పండుగ.

అందువలన అవకాశం లేనివారికెలాగూలేదు, ఉన్నవారందరూ ఈ పండుగను జరుపుకొని,
రక్త సంబంధాలనీ, ఆత్మ సంబంధాలనీ, కుటుంబ బాంధవ్యాలనీ పెంపొందించెదరు గాక.
తరవాత సోదరుడు తన సోదరిని పరివారంతో సహా తన ఇంటికి మరునాడు ఆహ్వానించి
అంతే ఆప్యాయంగా సోదరీమణులను ఆదరించి ఇతోధికంగా కానుకలిచ్చి గౌరవించి
పంపడం ఆచారం ఈ రోజును సోదరీ తృతీయ అని పిలుస్తారు.

(యమ ద్వితీయ కున్న ప్రచారం సోదరీ తృతీయకు లేదెందుకనో)
  హరిసేవ నుంచి సేకరించిన సమాచారం ... వారికి ధన్యవాదాలు  

2, నవంబర్ 2013, శనివారం

చిరు దివ్వెల....!!

చిరు దివ్వెల దీపాల దీపావళి
తేవాలి ప్రతి ఇంటా వెలుగుల సంతోషాన్ని
ఆనందపు వెలుగుల అంబరాన్ని తలపిస్తూ
సిరి చందనాల మహాలక్ష్మి
చిరు మువ్వల సవ్వడి వినిపించాలి
ప్రతి ముంగిలి లోపలా సంబరంగా
అమావాస్య చీకటిలో వెలుగుల వేకువల
పొద్దుల పంచ వన్నెల రంగులు
ప్రభాత కుసుమాలై శాంతి సౌఖ్యాలతో
సాగాలి ప్రతి జీవితం ....!!
అందరికి ఆనంద దీపావళి శుభ కామనలు ...!!


ఏంటో ఈ పలుకుబళ్ళ పరపతుల సంగతి....??

దేవుడి  దగ్గర వైద్యుని దగ్గర మన పరపతి ఉపయోగించడం ఎంత వరకు సమంజసం...??
దేవుడి గుడికి అందరమూ మన కోర్కెలు తీర్చినందుకో లేదా తీర్చమని అడగడానికో....లేదా కాస్త పుణ్యం పురుషార్ధం కోసమో వెళుతూ ఉంటాము సాధారణంగా...!! అక్కడ కూడా ప్రత్యేక దర్శనాలు...పూజలు అవి ఇవి అంటూ ఇప్పుడు దేవుడు కూడా అందని ద్రాక్షలా మారిపోయాడు అది వేరే సంగతి...గొప్ప వారికి దేవుడు వెంటనే దర్శనాలు ఇచ్చేస్తూ సామాన్యులకు సుదూరం గానే ఉంటూ వస్తున్నాడు...!!
ఇక వైద్యం కోసం వెళితే అక్కడా ఇలానే.....డి ఎస్ పి వచ్చారనో... ఏ ఎస్ పి వచ్చారనో వాళ్లకు రాస మర్యాదలు...ముందుగా వాళ్ళని చూసి వాళ్ళను అతి వినయంగా సాగనంపడం....
ఏంటో ఈ పలుకుబళ్ళ పరపతుల సంగతి....??...-:)


1, నవంబర్ 2013, శుక్రవారం

మనిద్దరమే మిగిలిపోయాం....!!

నాటకంలో చివరి అంకంలో మిగిలింది మనిద్దరమే
మనతో ఉన్న మన  జ్ఞాపకాలే...!!
నీకు తెలుసు నా జ్ఞాపకాల గదులన్నింటిలో 
నిండి పోయింది నువ్వే అని...!!
నీకు తెలిసినా ఎందుకో మరి ఆ నిజాన్ని
నిజమే అని ఒప్పుకోలేక పోతున్నావు ఇప్పటికి...!!
వద్దని విసిరి కొట్టావు వదలమంటే వదలనంటావు
దూరంగా పోవు అలా అని దగ్గరగాను రావు...!!
రంగుల వలయాలు చూపించిన రంగుటద్దాలు
తళుకు బెళుకుల పై పై మెరుగులు మాయల మోహాలు....!!
అర్ధం అయినా కానట్టు ఉంటూ అర్ధం కాకుండా ఉంటావు
నిన్ను నువ్వే మోసం చేసుకుంటూ నన్నూమాయ చేస్తున్నావు...!!
మన మధ్య మొదటి అంకం నుంచి చివరి అంకం వరకు
ఇలానే ఉన్నా....చివరికి మనిద్దరమే మిగిలిపోయాం....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner