28, ఏప్రిల్ 2019, ఆదివారం

ఏ'కాంతా'క్షరాలు కి నా మాటలు...!!

                                             నా మాటలు...!!
                      ఐదారేళ్ళ వయసులో అక్షరాలను నేర్చుకున్నా, తర్వాత  చదవడం, రాయడం మొదలైనా, వాటిని పదాలుగా కూర్చడం మొదలైంది కూడా ఆ వయసులోనే.. అక్షరాలతో అనుబంధం దాదాపుగా ఏడెనిమిది ఏళ్ళ వయసు నుండి బాగా బలపడింది. అలా మొదలైన మా అనుబంధం ఇప్పటికి విడదీయలేనిదిగానే ఉండిపోయింది. నాలుగు పదుల నా పుస్తకాల సహచర్యం చదవడంతోనే ముగియకుండా నేను నా రాతలను పుస్తకాలు వేస్తూ, అచ్చులో చూసుకునే భాగ్యం కల్పిస్తున్న నా ఆత్మీయులకు ఎప్పటికి ఋణపడే ఉంటాను.
                 నా మనోభావాలను కవితలుగా, వ్యాసాలుగా ఐదు పుస్తకాలుగా మీ ముందుంచాను. ఇప్పుడు మరో ప్రక్రియగా "ఏకాంతాక్షరాలు" గా 28 అక్షరాల్లో రెండు వాక్యాలను కలుపుతూ చిరు కవితలుగా ఏక్ తారలను మీ ముందుంచుతున్నాను. సహృదయంతో ఆదరించి సద్విమర్శలు అందించండి.

                                      కృతజ్ఞతలు...!!
      ముందుగా ఈ పుస్తకం రావడానికి కారణమైన నా నెచ్చెలి అను కోనేరుకు మనఃపూర్వక కృతజ్ఞతలు. "నువ్వు రాస్తూ ఉండు మేము వేయిస్తాం నీ పుస్తకాలు" అంటూ ఏళ్ళు గడుస్తున్నా చెక్కు చెదరని అభిమానంతో నా వెన్నంటి ఉంటూ, ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో నన్ను నా రాతలను, నా తెలుగును సరదాగా ఆటపట్టిస్తూ, నా యాసను, భాషను అనుకరిస్తూ అభిమానించి నా రాతలు అచ్చులో పుస్తకాలుగా రావడానికి తమ సహకారాన్ని అందిస్తున్న నా నేస్తాలు నీరజ, శోభ, అనిత, మమతలకు నా ప్రత్యేక ధన్యవాదాలు.  అడిగిన వెంటనే కాదనకుండా ముందు మాటలు రాసి నా అక్షరాలపై అభిమానపు జల్లులు
చిలకరించిన పెద్దలు, పూజ్యులు సాగర్ శ్రీరామ కవచం గారికి, గుడిసేవ విష్ణుప్రసాద్ గారికి, జగద్ధాత్రి గారికి, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారికి, ఇందు రమణ గారికి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు. ముఖ పుస్తకములో ఏక్ తార గ్రూప్ ఫౌండర్, నా ఏక్ తారలను సరిదిద్ది బాగా రాయమని ప్రోత్సహించిన పద్మా శ్రీరాం గారికి  హృదయపూర్వక కృతజ్ఞలు. ఆరు రుచులకు తగినట్టుగా అక్షర రసాస్వాదనందించిన నా ఆత్మీయులు వాణి వెంకట్ గారికి, లక్ష్మి రాఘవ గారికి, వేంకటరమణ వెలపర్తి గారికి, మాధవరావు మోకా గారికి, యామినీదేవి కోడెకి, సత్యా  స్వాతికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
           నా రాతలు మొదటగా పుస్తక ముద్రణలో రావడానికి కారణం కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారు.  తన పనుల్లో హడావిడిగా ఉండి కూడా ఈ పుస్తకానికి అడిగి మరీ ముందు మాటలు రాసిన కొండ్రెడ్డి అంకుల్ కి నా మనఃపూర్వక ధన్యవాదాలు.
      ఏక్ తారలు రాసింది నేనే అయినా ఇలా షడ్రుచుల సంగమంగా మీ ముందుకు రావడానికి కారణమై, తన అభిప్రాయాన్ని అక్షరాల్లో అందించిన సునీల్ కుమార్ నన్నపనేని గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆరు రుచులకు తగిన చక్కని చిత్రాలను, ముఖ చిత్రాన్ని వెదికి అందించిన  సోమ శేఖర్ గారికి, గూగులమ్మకు మనఃపూర్వక ధన్యవాదాలు.
     నా ఐదు పుస్తకాలతోపాటు ఆరో పుస్తకమైన  "ఏకాంతాక్షరాలు" ని అందంగా తీర్చిదిద్దడంతోపాటుగా తమ అమూల్యమైన అభిప్రాయాన్ని అందించిన మల్లెతీగ పబ్లికేషన్స్ కలిమిశ్రీ గారికి, వారి సతీమణి రాజేశ్వరి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖపుస్తకంలోనూ, బ్లాగు లోకంలోనూ నిరంతరం నా రాతల్ని అభిమానిస్తూ, నన్ను ప్రోత్సహిస్తున్న వేలాదిమంది సాహితీ మిత్రులకు నా వినమ్రపూర్వక నమస్సులు.
           
                                                    అక్షరాంకితం...!!
                   బంధాలు, అనుబంధాలు రాతలకు, మాటలకు పరిమితమై పోతున్న ఈ రోజుల్లో నాలుగేళ్ళ స్నేహాన్ని మరువక, మూడు పదుల తర్వాత కూడా ఆ ఆప్యాయతనలాగే పదిలంగా నాకందించిన నా ప్రియ నెచ్చెలి, తన  అర్ధభాగము, తెలుగు సాహిత్యాభిమాని అయిన  " శ్రీనివాస్ సిరిగిన " కు ఈ "ఏకాంతాక్షరాలు" అంకితం. 

25, ఏప్రిల్ 2019, గురువారం

ఏక్ తారలు...!!

1.   ఆశ్రిత పక్షపాతే అక్షరమెప్పుడూ_ఓదార్పు తన ఇంటిపేరంటూ...!!

2.   అక్షరానుబంధం ఆసరా ఇస్తూనే ఉంటుందెప్పుడూ_మనసును పంచుకోవడానికి...!!

3.  టెక్నాలజీ పనితనమిది_చావు పుట్టుకల మాయాదర్పణాన్ని క్షణాల్లో చూపుతూ...!!

4.  అనుబంధం అపహాస్యమైంది_నటనల విశ్వరూపాలను చూస్తూ...!!

5.   మనసు లోగిలి నిండా నీ ఆనవాళ్ళే_వీడని బంధపు జ్ఞాపకాలై మెసలుతూ..!!

6.   కలతై కరుగుతున్న గతం_వెంటాడే వర్తమానాన్ని గుర్తుచేస్తూ...!!

7.  పదాల పరుగు పాతదే_నీ ఊహలతో చేరినందుకే ఇలా కొత్తగా...!!

8.   నిన్ను వెంబడిస్తూనే ఉంది మనసు_గతజన్మ మౌనాలను వెంటేసుకుని...!!

9.   మనసుదెప్పుడూ గెలుపే_నమ్మకానికి అపనమ్మకానికి మధ్యన నలుగుతున్నా..!!

10.   కన్నీరింకని కనులకు చెప్తున్నా_మది లాలింపులో మార్దవంకమ్మని...!!

11.   వెన్నెలకే వర్ణాలన్నీ_మచ్చలేని మనసుకు చీకటి రంగు పులిమేస్తూ....!!

12.  ఒక పుస్తకాన్ని తెరిచి చూసా_మనసాక్షరాలే ప్రతి కాగితంలోనూ....!!

13.   భావ పరిమళాలనెన్ని పంచాయెా_అనుభూతులను ఆవిష్కరిస్తూ...!!

14.   వీడ్కోలెరుగని కలయికే మనది_వేవేల వర్ణాలకు రూపాన్నిస్తూ...!!

15.    బంధానికి భాష్యమక్కరలేదు_అక్కున చేర్చుకునే మనసే దాని ఊపిరి...!!

16.   బదులెలా చెప్పను_ఆనవాళ్ళే ప్రశార్థకమౌతుంటే..!!

17.   చెదరని అభిమానమది_నకిలీల నకళ్ళు బయటబెడుతూ...!!

18.   అంతరాయాలను అధిగమించడమే_పదాల ఆసరాతో నిలదొక్కుకుంటూ...!!

19.   చూపులు చురుకే_నీ జాడ తెలియక చిరునవ్వులే వెలవెలబోతూ...!!

20.   తప్పుకోనంటున్నాయి ఆత్మీయతలు_తడిగుండెకు తోడుగా నిలుస్తూ...!!

21.   సాక్ష్యాలు చెల్లని నోట్లైనాయి_నటిస్తున్న బంధాల నటనల ముందు...!!

22.  కలల సాగరమే జీవితం_అలల ఆటుపోట్లకు తలొగ్గుతూ...!!

23.  మనసంతా ఖాళీనే_పూరించే పూరణలు కరువై..!!

24.    కొన్ని జ్ఞాపకాలంతే_మెురాయిస్తూనే ఉంటాయి వదలిపోలేమంటూ....!!

25.   కొన్ని మనసులంతే_గాయాల బారినుండి బయట పడలేక నలుగుతూ...!!

26.   కూడికలు తీసివేతలు_తప్పనిదే ఈ జీవితం....!!

27.   నువ్వు చేసిన గాయమెుక్కటి చాలు_జన్మజన్మలకు వెంటాడుతూ..!!

28.   మరో నామజపమెలా చేస్తాయి మరి_అక్షరాలను అల్లుకుంది నువ్వయితే..!!

29.    వింతలెప్పుడూ విచిత్రాలే_కాలం కదలికలను సచిత్రాలుగా మలచలేక...!!

30.   కాలమెప్పుడూ ప్రశ్నార్థకమే_శబ్దానికి నిశ్శబ్ధానికి మధ్యన...!!

22, ఏప్రిల్ 2019, సోమవారం

ఏమిటో ఇది..!!

ప్రాణమే
పలకరింతగా చేరిన
నీవైన జీవితమిది

మరణమే లేని
మనసుకు తెలిసిన
మౌనమిది

కాలమే చూడలేని
ఎదలో మెదిలిన
కలల ప్రపంచమిది

పరిచయమే
ప్రణయమై పరిమళించిన
అనుబంంధమిది

గాయమే
గేయమైన అక్షరాలకు
ఊతమైన నెయ్యమిది

గతమే
జ్ఞాపకమై నిలిచిపోయే
ఘనమైన వాస్తవ చరిత ఇదే...!!

17, ఏప్రిల్ 2019, బుధవారం

వేదనగా మారినప్పుడు..!!

తరాలు తరిగిపోతున్నాయి
విలువలు వెలవెలబోతున్నా 
అంతరాలను నిలువరించలేక 
నిస్సహాయతను మోసుకుంటూ 

బంధాలు భారమైపోతున్నాయి
అనుబంధాలకు కొత్త అర్ధాలు చెప్తూ 
సహజీవనాలకై వేగిరపడుతూ 
మూన్నాళ్ళ ముచ్చటే మురిపెమనుకుంటూ 

బాధ్యతలు బంధనాలౌతున్నాయి
కన్నపేగు కదిలిస్తున్నా 
కన్నప్రేమ వారిస్తున్నా 
కాదంటూ.. కాసుల కోసం అమ్ముడుబోతూ 

బతుకులు భయపెడుతున్నాయి 
ముసుగుల మనస్తత్వాలు బయటపడి 
నీలినీడల్లో నిజాలు దాగుండిపోయి 
వాస్తవమో వద్దనలేని వేదనగా మారినప్పుడు..!! 

14, ఏప్రిల్ 2019, ఆదివారం

ఏటంటావు...!!

నేస్తం,
          పురస్కారాలిస్తున్నారు, సన్మానాలు చేస్తున్నారు..ఎందుకంటావ్..? రాత బాగుండంటావా లేక కులం చూసంటావా లేక పరాయి మతాన్ని హేళన చేసినందుకంటావా లేదంటే విలువలు వదిలేసి అక్షరాలతో విశృంఖలంగా నగ్న ప్రదర్శన చేయిస్తున్నందుకంటావా...లేదంటే మరొకందుకంటావా..మనకయితే మన విద్వత్తు, ప్రతిభను చూసి కట్టబెట్టినట్టు. మరొకరికయితే ఏమెా ఎందుకో. అవహేళన చేయడం, కించపరచడమే మనకున్న సంస్కారమని నలుగురు గుర్తిస్తున్నారిప్పుడిప్పుడే. జర జాగ్రత్త..😊

4, ఏప్రిల్ 2019, గురువారం

మానసిక రోగులు...!!

చాలామంది మానసిక రోగులకన్నా నా మానసికారోగ్యం చాలా చాలా బావుంది...నా గురించి కులమత, సాహిత్య, దీర్ఘకాలిక అనుమానపు  మానసిక రోగులు ఆందోళన చెందనవసరం లేదు... శారీరక రుగ్మతలకన్నా మానసికరోగం చాలా ప్రమాదకరం....!!

2, ఏప్రిల్ 2019, మంగళవారం

దేవులాట....!!

ఎక్కడెక్కడో రాలిపోయిన
చుక్కల లెక్కల కోసం
వెదుకులాట మెుదలైనట్టుందిగా

పేగుబంధాన్ని తెంపుకున్న
బిడ్డలకు అనుబంధాన్ని
మర్చిపోవడమెా లెక్క కాదనుకుంటా

అమ్మ విసిరిపారేయని
పసితనం మనదైనప్పుడు
ఆ తల్లి బాల్యాన్ని అసహ్యించుకోగలమా

ఆస్థులు పంచలేదని
ఆప్యాయతానురాగాలను
నడి బజారులో నగ్నంగా వదిలేయడమేనా

అంతిమం క్షణాల
పోరాటపు ఆరాటాన్ని
ప్రేక్షకపాత్రలోనుండి చూడటం సబబేనా

ఆదరించి అక్కున చేర్చుకునే
సహృదయం మనకివ్వని
దేవునిదే ఈ నేరమనుకుంటా..!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner