13, ఆగస్టు 2022, శనివారం

​చిటారు కొమ్మన..!!

మ(త)న పదంలోనే

పరిమితం బాంధవ్యం


మదిలోని భావాలకు

రూపం తెలియదని నటన


పాశాలకు బద్దులమంటూనే

లచ్చిందేవికి మాత్రమే ఆహ్వానమంటారు


వినబడని స్వరాలు

లోపల గుసగులాడుతూనే వుంటాయి 


కనబడని నుదుటిరాతను

చదివేసామన్న అహంకారం మ(త)నది


ఊరవతల ఊడల మర్రిచెట్టుకి వ్రేళాడుతున్న

గతపు ఊయలలో నిద్దరోదామన్న యత్నం


చిటారు కొమ్మన మిఠాయి పొట్లానికి 

ప్రయత్నం మంచిదే


ఏదోక రోజున చేతలలో చిక్కుబడతారు

కాలం వేసే గాలానికి..!!

11, ఆగస్టు 2022, గురువారం

స్వాతంత్ర్యమా నీవెక్కడా..!!

ఇలలో కలలో

కనిపించని స్వేచ్ఛావాయువును

స్వతంత్రమందామా!


వ్యక్తులుగా మనలేని

భవితకు పునాది వేస్తున్న

అధికారానికి స్వతంత్రమెుచ్చిందందామా!


భరతమాతను వివస్త్రను చేస్తూ

స్త్రీని అధఃపాతాళానికి తొక్కేస్తున్న

కాముకులకు స్వతంత్రమిచ్చామందామా!


కొలువు నెలవులకు వెంపర్లాడే 

సామాన్యుని బతుకుని దుర్భరం చేస్తున్న

ఓటుకు స్వతంత్రం కల్పించామందామా!


నిత్యావసరాలను ఆకాశమందుంచుతున్న

పన్నుల పంగనామాలకు సంతసిస్తూ

మాటల మాయల స్వతంత్రానికి స్వాగతమందామా!


ఆర్థికాభివృద్ధి మనదని గర్వపడుతూ

ప్రగతి పథంలో మన పయనమెటో తెలియని స్థితిలో 

మనల్ని వుంచిన స్వతంత్రానికి వందనమందామా!


ఏదేమైనా 

ఎదురులేని బెదురులేని ఎక్కడి గొంగళి అక్కడే వున్న

ఏడునర్ర దశాబ్దాల మన స్వాతంత్ర్యానికి శుభాకాంక్షలు…!!

1, ఆగస్టు 2022, సోమవారం

జీవన మంజూష ఆగస్టు 2022

నేస్తం,

         రుచులు పలురకాలు అన్నట్టుగా మన సమాజంలో మనిషి నడవడి కూడా అలాగే తయారైంది. బాధ్యతలు, బంధాలు అంటూ కొందరు పాకులాడుతుంటే, మరికొందరేమో తమ స్వార్థం తాము చూసుకుంటూ ఎందరున్నా ఎవరు లేని ఏకాకుల్లా బతికేస్తున్నారు. ఈనాటి సమాజంలో మనిషి నైతిక విలువలు మరిచిపోయాడనం కన్నా మనిషితనం నుండి దిగజారి పోయాడనటమే సబబు. వింత పోకడల ప్రపంచంలో మనిషో విచిత్రజీవిగా మారిపోతున్నాడు ఆధునికత ముసుగులో.

          పిల్లలకు ఇంగ్లీషు చదువులు నేర్పిస్తున్నామని గొప్పలు పోతున్నాం కాని మనం కోల్పోతున్న ఆత్మీయపు స్పర్శను గుర్తెరగలేకున్నాం. అరచేతిలో ప్రపంచాన్ని మన వారసులకు అందిస్తున్నామన్న భ్రమలో పడి వారి ప్రపంచం నుండి మనల్ని తరిమేస్తున్నారన్న సత్యాన్ని మర్చిపోతున్నాం. డబ్బుతో కొనగలిగిన చదువులను పిల్లలకు సునాయాసంగా అందించేస్తూ, వారిని అసలైన విద్యకు దూరం చేస్తున్నామని మర్చిపోతున్నాం. పిల్లలకు ఆస్తులు కూడబెట్టాలని నానాగడ్డి మనం తింటూ కోట్లకొలది సొమ్ము వెనకేయడం కాదు మనం చేయాల్సింది. నేను నా అన్న గిరిలోనుండి మనమన్న బంధాలకు దగ్గర చేయడం. అదే వారికి మనమిచ్చే విలువైన ఆస్తి.

             ఉత్తమమైన మానవజన్మకు సార్థకతను సమకూర్చడం మనిషిగా మన కర్తవ్యం. కాని అది మరచి నేడు నేను మాత్రమే బావుండాలన్న సంకుచితత్వం పెరిగిపోయింది. రక్త సంబంధాల నడుమననే అంతరాలు ఏర్పడిపోయాయి. నటించే నైజాలు వారి నటనకు మెరుగులు దిద్దుకుంటూ యదేచ్ఛగా మన చుట్టూనే సంచరిస్తున్నారు. ఒకప్పుడు ఇల్లు చిన్నదైనా ఇరుకనిపించని జీవితాల్లో, నేడు విశాలమైన భవనాల్లో ఎందరున్నా ఒంటరితనమే తారాడుతోంది. మనందరికి ఇవన్నీ తెలిసినా మనకెందుకు అని సరిపెట్టుకుంటూ సర్దుకుపోతూ బతికేద్దాం..ఏమంటారు?


తెలుసుకో..!!

బాధనో

బాధ్యతనో పంచుకోకుండా


అరుపులు

ఆవేశాలతో నానాహంగామా చేస్తూ


ముసుగులు

మాయల మోసాలలో బతికేస్తూ


ఘర్షణలకు

సంఘర్షణలకు నిత్యం తెరదీస్తూ


చిరునవ్వుల

సంతసాలకు చితిని పేరుస్తూ


బంధాలంటే

జూదక్రీడలా భావిస్తూ


అనుబంధాలను

ట్రంప్ కార్డ్ లా వాడేస్తూంటే


పేకమేడలు

కూలిపోతాయన్న సత్యం తెలుసుకో..!!


28, జులై 2022, గురువారం

రెక్కలు..!!

​1.  మనిషైనా

మనసైనా

కష్టానికి 

సుఖానికి ఒకటే


ప్రశ్న, సమాధానం

కాలమే..!!

2.   గాయం చేసేది

మనిషే

మాయం చేసే నేర్పు

కాలానిది


తీరుతెన్నుల ఫలితం

మనసుదే..!!

3.  ఉధృతిని భరించేది

సముద్రం

అలజడిని అనుభవించేది

మనసు


సారూప్యం

కొన్నింటిది..!!

4.   దూరం పెంచడం

సుళువే

దగ్గర చేయడమే

కష్టం


మాటకున్న

విలువ..!!

5.  నటించడం

మనకలవాటు

ఆడుకోవడం

పైవాడికి తెలుసు


రేపనేది ఉంటుంది

ఎవరికైనా..!!

6.  బంధుత్వం

దగ్గరదే

బాంధవ్యమే

బహు దూరం


ఈనాటి

అనుబంధాల్లో..!!

7.   అణుమాత్రమే

అభిమానం

నిలువెల్లా

అహంకారమే


సమన్వయమే

ప్రేమపాశం..!!

8.  నీతో

నువ్వు

నీలో

నవ్వు


నెయ్యానికి

నేస్తం..!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner