27, జులై 2020, సోమవారం

కాలం వెంబడి కలం...12

       మా బాలకృష్ణ, భాను, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి నేనో వరల్డ్ బాంక్ ని. నా మరో నిక్ నేమ్ అదే. మా జనాభా అందరికి ముసలి, మంజుబాయ్ ని. బాలుగాడికి ఓ లెక్చరర్ మీద కోపం వచ్చింది. లాబ్ ఫెయిల్ చేసాడని. ఆ కోపంలో వాడు బైక్ తో ఆ మెకానికల్ సర్ గురునాథ్ రెడ్డిని గుద్దేసాడు. మా అందరికి అప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నాకు మధ్యాహ్నం రెండింటికి ఎగ్జామ్ ఉంది. భాను అనుకుంటా మా హాస్టల్ కి వచ్చి బాలుకి బైక్ యాక్సిడెంట్ అయ్యింది. డబ్బులు కావాలన్నాడు. ఏ హాస్పిటల్ లో ఉన్నాడంటే, ఆ హాస్పిటల్ మా హాస్టల్ కి దగ్గరలోనే ఉందన్నాడు. వాడికి డబ్బులు ఇచ్చి, నేను వెళ్ళాను చూడటానికి. వెధవ కాలు విరగ్గొట్టుకున్నాడు. ఎలా జరిగిందిరా అంటే  అప్పుడు అసలు విషయం చెప్పాడు. ఏది చేసినా, నేను తిడతానని తెలిసినా నిజం చెప్పేసేవాడు. 
      ఆ టైమ్ లోనే మాకు డబ్బులకు బాగా ఇబ్బందిగా ఉండి బాలు వాళ్ళ అమ్మ వాళ్ళను అప్పుగా అడిగితే ఇస్తామని చెప్పారు. మా మామయ్య అప్పట్లో టివియస్ ఉండేదిలెండి. అది వేసుకు వెళితే, లేవని చెప్పారు. పెట్రోల్ కూడ డబ్బులిస్తారుగా కొట్టించుకుందామనుకున్నాడట మా మామయ్య. మీకు చెప్పనేలేదు కదూ మాది ఉమ్మడి కుటుంబం. అమ్మ మేనమామనే చేసుకుంది. అమ్మమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, నేను, మామయ్య మా ఇంట్లో. మా మామయ్య నాకన్నా ఆరు నెలలే పెద్దవాడు. అందుకే నేను మా నాన్నకు  ఒక్కదాన్నైనా ఎప్పుడూ ఒంటరితనం ఫీల్ కాలేదు. బాలుకి దెబ్బ తగిలిన మరుసటి రోజు పిన్ని వచ్చింది.నేను వెళ్ళాను వాడి రూమ్ కి. ఎలా ఉన్నాడోనని. మా ఇంట్లోవాళ్ళు పిన్నిని డబ్బులడిగిన సంగతి కాని, వీళ్ళు ఇవ్వని సంగతి కాని అప్పటికి నాకు తెలియదు. ఎందుకో పిన్ని సరిగా మాట్లాడలేదు. ఏదో ఇబ్బంది పడుతోంది అనుకున్నాను. తర్వాత అసలు సంగతి ఇంటికి వెళ్ళినప్పుడు తెలిసింది. ఈ విషయాలేవి బాలుగాడికి తెలియదు. నేనూ చెప్పలేదు. 
         నేను తరచూ ఇంటికి వెళిపోతూ ఉండేదాన్ని ఫస్ట్ ఇయర్ నుండి అంతే. కాలేజ్ కి వచ్చి ఓ పది, పదిహేను రోజులు అయ్యాక కాస్త బాలేదంటే చాలు, ఇంటికెళ్ళి చాలా రోజులయ్యిందిగా, వెళదాం పదా అని నన్ను అందరు ఆట పట్టించేవారు. బాలు, భాను మా హాస్టల్ కి నా దగ్గరికి వచ్చినప్పుడు నేనేం అనకపోతే..అక్కా పది రోజులయిపోయింది నీతో తిట్లు తిని, తిట్టేయ్ అని నవ్వేవారు. నేను తెచ్చే రొయ్యల పచ్చడి కోసం అందరు ఎదురుచూసేవారు. ఫస్ట్ ఇయర్ లో మరో తమ్ముడు రఘు వాళ్ళ అమ్మగారు నాకోసం సున్నుండలు పంపేవారు. అప్పటి ఆప్యాయతే ఇప్పటికి ఈ అక్క మీద చూపిస్తారు నా తమ్ముళ్ళు. 
      ఇల్లు, ఇంట్లోవాళ్ళను వదలి హాస్టల్ లో ఉండటం మెుదలయ్యింది ఇంజనీరింగ్ లోనే. నాకేమెా అంతా టైమ్ ప్రకారం సిస్టమాటిక్ గా ఉండాలి. నా వస్తువులన్నీ నాకు జాగ్రత్త. నేను ఎవరిది ఏదీ తీసుకునేదాన్ని కాదు. వారి ఎవరన్నా తీసుకున్నా, వాళ్ళు మళ్ళీ తెచ్చి ఇవ్వకపోయినా, నేనే వెళ్ళి అడిగి తెచ్చుకునేదాన్ని. రూమ్ కూడా నీట్ గా ఉండాలి. నా మిగతా రూమ్మేట్స్ నీలిమ, శారద, చంద్ర మేము నలుగురము నాలుగేళ్ళు కలిసే ఉన్నాము. కాకపోతే చంద్ర, శారద కజిన్స్. వాళ్ళకు నాలుగేళ్ళు ఆగకుండా అయిపోయాయి. నేను, నీలిమ నాలుగవ సంవత్సరం కలిసే చదివాము. ఇక నా లంగా ఓణిలు అన్నీ నీట్ గా సర్దుకునేదాన్ని. ఎవరికి నచ్చింది వారు షాప్ లలో మాచింగ్ చూసుకున్నట్టు చూసుకుని  తీసుకునేవారు అప్పుడప్పుడు సరదాగా. సబ్ జూనియర్స్ లో లత, నాగ మంజుల, గాయిత్రి వాళ్ళు పాటలు చాలా బాగా పాడేవారు. అప్పుడప్పుడూ ఇష్టమైన పాటలు పాడించుకునేదాన్ని. మా కజిన్ ఝాన్సీ కూడా నాకు సబ్ జూనియర్ గా మా కాలేజ్ లోనే. నన్ను కాస్త బానే విసిగించేది. అప్పుడప్పుడూ అన్నం కలిపి తినిపించమని లేదంటే తిననని నన్ను బ్లాక్ మెయిల్ చేసేది. నాకేమెా తినిపించడం ఇష్టం ఉండదు. ఆకలితో ఉంటుందని ఇష్టం లేకపోయినా తినిపించేదాన్ని. ఒక్కోసారి అడిగేది నిన్ను ఎంత విసిగించినా, నీకు కోపమే రాదా అని. అప్పట్లో చాలా శాంతమూర్తినన్నమాట. కాలేజ్ మెుత్తం మీద నన్ను బాగా ఏడిపించిన వ్యక్తి వెంకట్రావు. నా పేరుతో మరొకరి పేరు కలిపి పిలిస్తే మహాచెడ్డ కోపం నాకు. ఎందుకు మెుదలు పెట్టాడో తెలియదు ఫస్ట్ ఇయర్ లో కాస్త తక్కువ, సెకెండ్ ఇయర్ లో నుండి బాగా ఎక్కువగా ఏడిపించేవాడు. తను పిలవడమే కాకుండా బయట ఆటోవాళ్ళతో కూడా అరిపించి ఏడిపించేవాడు అంజు మంజు అని, ఆ అంజయ్య చౌదరితో నేను మాట్లాడింది చాలా తక్కువ. ఇలా పిలవడం మెుదలెట్టాక అస్సలు మాట్లాడనేలేదు. సెకెండ్ ఇయర్ లో ఓ టైమ్ లో ఈ గోల పడలేక చదువు మానేసి ఇంటికి వెళిపోదామన్నంత ఫ్రస్టేషన్ వచ్చేసింది. మళ్ళీ నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. వాళ్ళు అలా అరిచి ఏడిపిస్తే నేనెందుకు చదువు మానేయాలని. వాళ్ళు సరదాగా ఏడిపించినా కాస్త చిరాకేసేది. మా సీనియర్స్ రాధారమ ట్విన్స్. నోట్సులు అడిగితే నాకు ఇచ్చేవారు. రాసుకుని మళ్ళీ తిరిగి ఇచ్చేసేదాన్ని. టెక్స్ట్ బుక్స్ అన్నీ నాగభూషణం మామయ్య విజయవాడ సిద్ధార్థ కాలేజ్ లైబ్రరీ నుండి తీసుకుని ఇచ్చేవాడు. ఆయన అక్కడ లైబ్రేరియన్ గా చేసేవారు. నా ఎమ్ సెట్ కోచింగ్ కి విజయవాడ వచ్చినప్పుడు పరిచయం పక్కింట్లో. వాళ్ళ ఇంటి ఆడపిల్లలానే చూసుకునేవారు రాణి అక్క, మామయ్య. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నాకు వార పత్రికలు మాస పత్రికలు, నవలలే కాకుండా ఆస్ట్రాలజి, పామిస్ట్రీ,    
న్యూమరాలజీ, పుస్తకాలతో పాటు కలల ఫలితాల వంటి పుస్తకాలు కూడా చదవడం అలవాటయ్యింది.అడిగిన వారికి సరదాగా విశ్లేషించి చెప్పడం అలా అలవాటైపోయి మా రూమ్ ఎప్పుడూ నిండుగా ఉండేది జనాలతో. మా గొడవకు మా వార్డెన్ అప్పుడప్పుడూ రౌండ్స్ వేయించేది అర్ధరాత్రి. మేం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆవిడకే పనిష్మెంట్ ఇచ్చేవారం. నేనంటే మంచి అభిప్రాయమే ఉండేది కాని ఆవిడ రూమ్ ముందే మా రూమ్. అందరు మా రూమ్ లో చేరి అల్లరి చేసేవారు. అందుకే పనిష్మెంట్, రూమ్ లో ఉన్న అందరికీ. 
రకరకాల మనస్తత్వాల పరిచయంతో హాస్టల్ జీవితం చాలా నేర్పింది. హాస్టల్ లో ఉన్నన్నాళ్ళూ ఎవరూ నాతో గొడవ పడలేదు కూడా. కాస్త మా నీలిమనే అప్పుడప్పుడూ రూమ్ కి అందరు వస్తున్నారని కోపం తెచ్చుకునేది. అప్పుడప్పుడు రాత్రిపూట డిన్నర్ అయ్యాక కాస్త అన్నం రూమ్ కి తెచ్చుకుని, రెండింటికి లేపమని, ఆ టైమ్ లో పచ్చడి కలుపుని అన్నం తిని నిద్రపోయేది. భలే నవ్వుకునేవాళ్ళం. బి ఎల్ థెరీజా ఎలక్ట్రికల్ ఫోర్ వాల్యూమ్స్ బుక్ తల కింద పెట్టుకుని పడుకోవడం, ఎందుకలా అంటే కాస్తయినా బుర్రలోకి పోతుందిలే మంజూ అనేది. ఇలా బోలెడు కబుర్లు హాస్టల్ జీవితంలో. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.... 
 




ధన్యవాదాలు మధుసూదనం అన్నయ్యకు..

కవితాలయంలో తన అభిమానాన్నంతా అక్షరాల్లో ఒదిగిన మామిడి మధుసూదనం అన్నయ్యకు మనఃపూర్వక ధన్యవాదాలు..

అపర సరస్వతి, అక్షరాల అమ్మ, నా ఆత్మీయ సోదరి "శ్రీమతి మంజు యనమదల" గారి గురించి నాకు తోచిన నావైన పదాలలో..

ఆమె అంతుచిక్కని భావాల అలజడి, కనపడుతుంది ప్రతి అక్షరములో ఆ ఒరవడి..

ఏమీ తెలియనట్లుగా ఉంటుంది ఈ సామాన్యురాలు, అక్షరమే ఊపిరిగా చేసుకున్న అసమాన్యురాలు..

ఆమె అక్షరాల్లో నిండివుంటుంది అనంత భావవల్లరి, చేస్తాయి మనసంతా ఎంతో అల్లరి..

మనసు భాష తెలిసిన మనిషి, నిరంతరం అక్షరాలకు పెడుతుంది నగిషీ..

ఆమె పదాలు అక్షర నక్షత్రాలు, అందరి మనసులో నిలిచిపోయే వటపత్రాలు..

అద్భుత రచయిత్రని పొగిడారెందరో మహామహులు, అర్థవంతమైన భావాలే ఆమె కీర్తి కిరీటాలు..

ఎప్పటికీ వీడదు ఆమె  పదాలపై పట్టు, భావాలతో అందరిని చేస్తుంది కనికట్టు..

ఆమె పదాలు అప్పుడప్పుడు..
పరిమళిస్తాయి, పరిహసిస్తాయి,
పలకరించుతాయి, ప్రతిధ్వనిస్తాయి..

వాక్యం రసాత్మక కావ్యం అని విశ్వనాథుడు మంజుగారిని మనసులో పెట్టుకొని ఆన్నమాటమో..

నాకు తెలియనిది కొండంత, నాకు తెలిసిన ఆమె గురించి వ్రాసాను గోరంత..

చెల్లాయి మంజు యనమదల గారికి శుభాభినందనలతో..

         "కవిచక్ర" మధుసూదన్ మామిడి.

25, జులై 2020, శనివారం

గుర్తుంచుకో...!!

నేస్తం, 
    చట్టం మన ఇంటి చుట్టమని పొరబడినంత మాత్రానా ఏమి జరిగిపోదు. న్యాయమెప్పుడూ నీకందనంత దూరమేనని ఈపాటికి అర్థమయివుండాలే. నాలుగు మాయ మాటలకు నలుగురు మన వలలో పడిపోయినంత మాత్రాన ప్రపంచం ఏమి మన పాదాక్రాంతమై పోయినట్లు కాదు. విలువలు లేని వ్యక్తిత్వం మనకు గౌరవాన్ని తెచ్చి పెట్టదు. సూక్తిసుధలను వెల్లువెత్తించినంతనే మనకు ఎక్కడ్లేని పెద్దరికమూ రాదు. ఆచరణ శూన్యమైన మాటల చేతలతో ఎందుకూ కొరగాని జీవితాలు అయ్యే ప్రమాదం మనల్ని వెన్నంటే ఉంటుందని మర్చిపోకూడదు. ఓ మనిషిని మానసికంగా మన మాటలతో, చేతలతో హింసించి వారి చావుకు కారణమై, సాక్ష్యం లేదని సంబర పడిపోతే చాలదు. బంధాలను అవసరాలకు మాత్రమే మనవని అనుకుంటే, రేపటి రోజున మనకు అవసరమైన ఆ నలుగురు కూడా దొరకరు. డబ్బులు అవసరమే అందరికి కాని మన అవసరమే ఆ డబ్బు కాకూడదు. ఆ డబ్బులతో కొనలేనివి ఇంకా కొన్ని ఈ సువిశాల ప్రపంచంలో మిగిలే ఉన్నాయి. మనిషితనం కాస్తయినా మనం అలవరుచుకుంటే తరువాతి తరాలకు ఓ మంచి గతాన్ని పునాదిగా వేశామని తృప్తి పడదాం. కాదంటావా... నియంతలా నన్నంటుకోకు నా మా.. కాకి అన్నట్టుంటే ఆ పైవాడు మన లెక్కల బాకీలు వడ్డీతో సహా మనకందిస్తాడు. ఎందుకంటే మనందరి కన్నా గొప్ప లెక్కల మాస్టారాయన. గుర్తుంచుకో. 

22, జులై 2020, బుధవారం

భూతల స్వర్గమేనా..19

పార్ట్... 19
గోవర్ధన్ ఇండియా వెళుతున్నానంటే నా కొడుకుని చూసిరా అని చెప్పాను. ఓరోజు ఫోన్ చేసి అర్జంట్ గా ఫోన్ చేయమన్నాడు. వెంటనే ఫోన్ చేసా ఏమయ్యిందోనని. నీ కొడుకు నాలుగు మెట్ల మీద నుండి కాదు పడింది. మీ డాబా పోర్టికో పైనుండి దూకేసాడు. అమ్మావాళ్ళు చూపించారు ఎక్కడ నుండి దూకాడో. అది చూసాకా నాకు ఇప్పటికి వణుకు తగ్గలేదు అని చెప్పాడు. అప్పటికి వాడికి సరిగ్గా 2వ పుట్టినరోజు అయ్యి 2 నెలలు. విషయం తెలిసాక వెంటనే ఇండియా వెళిపోవాలనిపించింది. కాని అన్ని మనకనుకూలంగా ఉండవు కదా. ఈయనకు వీసా క్వరీ పడింది. నాకేమెా ఊపిరి సలపని పని. దానికి తోడు రామస్వామి గారు డ్రైవింగ్ నేర్చుకోమనడం. రోజూ నన్ను డ్రాప్ చేయాలి కదా అందుకు. అప్పుడప్పుడూ విక్రమ్ కాస్త నేర్పేవాడు ఇంటికి వచ్చేటప్పుడు.
మధు, సంధ్య అని ఓ ఫామిలి పరిచయం అయ్యారు.మధు రామస్వామి గారికి బేగిల్స్ అమ్మిన నార్త్ ఇండియన్ మరో షాప్ లో చేసేవాడు. సంధ్యను కూడా ఇండియన్ గ్రాసరిస్టోర్ లో పెడదామని రామస్వామి గారి ఆలోచన. అలా నాకు పరిచయమై బాగా దగ్గరయ్యారు. బాబీ, రీనా వాళ్ళు మాధవి అక్కకు చుట్టాలు. విజయ్ బాబీ రూమ్మేట్స్. బాబీ, విజయ్ కూడా రెస్టారెంట్ కి వచ్చేవాళ్ళు. రామస్వామి గారి ఇంట్లో బేస్మెంట్ లో కంప్యూటర్ ఉండేది. వీళ్ళకు తెలిసిన అబ్బాయి అక్కడ ఉండేవాడు. కొన్ని రోజులకు వాళ్ళ చెల్లి MS చేయడానికి వచ్చింది. కొన్ని రోజులుండి ఆ అమ్మాయి వెళిపోయింది. నేను మెయిల్స్ టైమ్ కుదిరినప్పుడు బేస్మెంట్ లో చూసుకునేదాన్ని. మాధవి అక్క కూతురు వందన నాలుగో, ఐదో చదువుతుండేది అప్పుడు. రకరకాల జడలు వేసుకుంటూ ఉండేది. కుక్కీస్ వెరైటీస్ చేస్తూ ఉండేది. అప్పుడప్పుడూ బేగిల్స్ షాప్ లో నాకూడా ఉండేది తన స్కూల్ అయ్యాక బోర్ కొడితే. మా ఆయన చుట్టాలు జలజ వదిన వాళ్ళాయన అమెరికన్ సిటిజన్. అన్నయ్య నన్ను కలవడానికి నా వర్క్ అయ్యే టైమ్ లో వచ్చేవారు. చాలా మంచివారు అన్నయ్య. నేను ఇండియా వెళదామనుకుంటున్నానని అన్నయ్యకు చెప్తే వెంటనే నాకు డబ్బులు అకౌంట్ లో వేసారు. జలం వదిన అప్పుడు ఇండియాలోనే ఉంది. 
నేను ఇండియా వెళతానని మాధవి అక్కకు కూడా చెప్పాను. అప్పటికి నేను అమెరికా వచ్చి సంవత్సరం నర్ర అయ్యింది. మౌర్య మూడో పుట్టినరోజుకి ఇండియా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా. పిల్లాడికి మాజిక్ స్లేట్, కొన్ని బొమ్మలు మాధవి అక్క కొనిపెట్టింది. నా క్లాస్మేట్ శేఖర్ బాబు ఉండేది చికాగోలోనే. అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడేవాడు. కాలేజ్ లో మేమిద్దరం ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. ఇండియా వెళుతున్నానంటే తను వచ్చి దీవాన్ స్ట్రీట్ కి తీసుకువెళ్ళాడు.అక్కడ ముత్యాలు, పచ్చలు తనకు తెలిసిన షాప్లో తీసుకున్నా. నా చిన్నప్పటి ఫ్రెండ్ రాధ తమ్ముడు రాము కూడా అమెరికా వచ్చాడు నా తర్వాత. పిట్స్ బర్గ్ లో ఉన్నప్పటి నుండి మాట్లాడేవాడు. మా సీనియర్ రాంకుమార్ కూడా నేను పిట్స్ బర్గ్ లో ఉన్నప్పుడు అమెరికా వచ్చారు. రవీంద్ర ప్రసాద్ గారు రాంకుమార్ ని ఎయిర్ పోర్ట్ లో పిక్ చేసుకుని అక్కడే నాతో మాట్లాడించారు. ఇంజనీరింగ్ కాలేజ్ లో మా సీనియర్లు వీళ్ళు. రవీంద్ర ప్రసాద్ గారు బాగా కేర్ తీసుకునే వారు కాలేజ్ లో. రాంకుమార్ నన్ను కలవడానికి చికాగో వచ్చివెళ్ళారు. బాబీ నాకు షాపింగ్ లో చాలా హెల్ప్ చేసాడు. పిల్లలకు చాక్లెట్స్, బట్టలు, గిఫ్ట్ బొమ్మలు, ఓ కామ్ కాడర్ మాత్రం తీసుకున్నాను. డబ్బులు కావాలని రామస్వామి గారిని అడిగితే అప్పటి వరకు ఏం లెక్కలు చూసారో నాకు తెలియదు. నేను ఇవ్వాల్సిన డబ్బులు మినాయించుకుని ఓ లక్ష ఇండియాలో తీసుకోమన్నారు. సరేనని ఇండియా బయలుదేరా. ఎయిర్ పోర్ట్ లో బాబీ దించాడు. దుబాయ్ మీదుగా మద్రాస్ వచ్చాను. రోజుకి 18, 20 గంటల పని చేసానేమెా ఫ్లైట్ లో ఒకటే నిద్ర. ఎయిర్ హోస్టెస్ నిద్ర లేపి తినడానికి ఇచ్చేది. మా మామయ్య, ప్రయాణం మావారు ఎయిర్ పోర్ట్ కి వచ్చారు. హోటల్ రూమ్ కి రాజగోపాల్, వాళ్ళ కాబోయే ఆవిడ, మా కిరణ్ చేసుకుందామనుకున్న అమ్మాయి వచ్చారు. మధ్యాహ్నం రెండింటికి పినాకినిలో విజయవాడ బయలుదేరాం. 

మళ్ళీ కలుద్దాం.. 



భూతల స్వర్గమేనా..18

పార్ట్.... 18
మెుదటిసారి చికాగోలో ఉన్నప్పుడు మా కిరణ్ ఫ్రెండ్ అశ్విన్ ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఎయిర్ పోర్ట్ లో వాడు అమెరికా  MS చేయడానికి వచ్చేటప్పుడు చాలా మంది ఏడవడం చూసి అక్క ఎలా వెళ్ళిందో అనుకున్నాడట. ఆ మాటే చెప్పి నీకు చాలా ధైర్యమక్కా అని అంటూ, అప్పుడప్పుడూ మాట్లాడుతుండేవాడు. అశ్విన్ కిరణ్ అమెరికాలో MS చేయడానికి హెల్ప్ చేసాడు ప్రాసెసింగ్, యూనివర్శిటీ సెలక్షన్ వగైరాలలో. నేను రామస్వామి గారి దగ్గరకు వచ్చేసరికి కిరణ్ కి ఓ సెమిస్టర్ అయ్యింది. హాలిడేస్ లో ఎక్కడో మెాటల్ లో క్లీనింగ్ జాబ్ లో చేరాడు. అమెరికాలో మన ఇండియన్ స్టూడెంట్స్ ఫ్రీ టైమ్ లో ఇలా జాబ్ లు చేసుకోవడం మామూలే. 
ఇక నా విషయానికి వస్తే..రామస్వామి గారు ఇండియన్ గ్రాసరిస్టోర్, చైనీస్ ఇండియన్ రెస్టారెంట్ కాకుండా బిగ్ ఆపిల్ బేగిల్స్ అని అమెరికన్ ఫుడ్ స్టోర్ ఓ నార్త్ ఇండియన్ దగ్గర కొన్నారు. దానిలో అంతకు ముందు వర్క్ చేసేవాళ్ళే ఉన్నారు. ప్రకాష్ అన్నాయన త్వరలో మానేస్తానన్నాడట. ఇండియన్ రెస్టారెంట్లో వెంకటేశ్వరరావు, శేషయ్య, విక్రమ్ అనే నార్త్ ఇండియన్ ఉండేవారు. బేగిల్స్ షాప్ పొద్దున 6 నుండి మధ్యాహ్నం 2 వరకు ఉండేది. నేను, నాతోపాటు వినోద్ అని తను ఇంజనీరింగ్ చేసి H1B వీసాతో వచ్చినవాడే. సాఫ్ట్ వేర్ జాబ్స్ రెసిషన్ లో ఈ జాబ్ చేయక తప్పలేదు తనకి కూడా. ఇలా చాలామంది ఈ విధమైన చాలా రకాల జాబ్స్ చేస్తున్నవాళ్ళే. వినోద్ వెంకటేశ్వరరావు తోడల్లుడు. ప్రకాష్, శేషయ్య, వెంకటేశ్వరరావు, శరత్ గారు వీళ్ళంతా ఫ్రెండ్స్. నాకసలు అమెరికన్ ఫుడ్ గురించి ఏమీ తెలియదు. ప్రకాష్ 6 నుండి 9 వరకు ఉండేవారనుకుంటా. ప్రకాష్ నాకు వర్క్ ఏం నేర్పించేవారు కాదు, నేను వినోద్ కి పోటి వస్తాననేమెా. కాష్ కౌంటర్ దగ్గర ఉండేదాన్ని. ప్రకాష్ నా మీద సెటైర్లు వేసేవారు. కాష్ కౌంటర్ దగ్గర వుంటే వర్క్ రాదని. నేర్పించనప్పుడు వస్తే, రాకపోతే నీకెందుకులే అని మనసులో అనుకుని ఊరుకునేదాన్ని. నాకేం రాదని మళ్ళీ అందరికి చెప్పేవాడు. మెక్సికన్ అమ్మాయి, వాళ్ళ అన్నయ్య మాతోపాటుగా వర్క్ చేసేవాళ్ళు. ఆ అమ్మాయి దగ్గర వర్క్ నేర్చుకునేదాన్ని. తను ప్రెగ్నెంట్ అప్పుడు. కొన్ని రోజులలో వర్క్ మానేస్తుంది. వాళ్ళ అన్నయ్య బేగిల్స్ చేసి, బేక్ చేసి మార్నింగ్ కొన్ని ఆర్డర్స్ ఇవ్వాల్సినవి ఇచ్చేసి వెళిపోతాడు. సిట్టింగ్, టేక్ అవుట్ ఆర్డర్స్ మిగతా వాళ్ళందం చూసుకోవాలి. 10,12 కాల బేగిల్స్, 7, 8 రకాల చీజ్ లు చేసి ఆర్డర్ ప్రకారం ఎవరికి కావాల్సింది వారికి ఇవ్వాలి. షాప్ క్లోజ్ చేసేటప్పుడు మిగిలిన బేగిల్స్ డస్ట్బిన్ లో పడేసి, షాప్ క్లీన్ చేసి, కౌంటర్ క్లోజ్ చేయాలి. ఇది బేగిల్స్ షాప్ లో పని. 
ఓ వారం అయ్యాక ప్రకాష్ మానేసాడు. వినోద్, నేను, మెక్సికన్ అమ్మాయి చూసుకునేవారం. వినోద్, నేను క్లోజింగ్ వరకు ఉండేవారం. కొన్ని రోజుల తర్వాత వాళ్ళిద్దరు కూడా లిమిటెడ్ అవర్స్ చేసి వెళిపోయేవారు. నాకు వర్క్ రాదని ప్రకాష్ చెప్పడంతో, రామస్వామి గారు పొద్దున్నే నన్ను షాప్ లో డ్రాప్ చేసి కాసేపు నేను కష్టమర్స్ తో ఎలా డీల్ చేస్తున్నానో చూసేవారు. మధ్యాహ్నం బేగిల్స్ లో వర్క్ అయ్యాక, భారత్ మేళా ఇండియన్ గ్రాసరిస్టోర్ లో సాయంత్రం వరకు ఉండేదాన్ని. తర్వాత సాయంత్రం చైనీస్ ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళేదాన్ని. ఇలా రోజు పొద్దున్నే 6 నుండి నైట్ 9 వరకు వీక్ డేస్ లో, వీకెండ్స్ 11, 12 వరకు వర్క్ ఉండేది. 
AMSOL కంపెనీ H1B పేపర్స్ వచ్చాయి. మా వారికి వీసా పేపర్స్ పంపాలంటే ఏం కావాలని AMSOL లో వీసా పేపర్స్ వర్క్ చూసే బాల ఇటికిరాలను అడిగితే మీ H1B వీసా పేపర్స్ తో కంపెనీ నుండి ఓ లెటర్ చాలండి, బాంక్ స్టేట్మెంట్స్, మీ పే చెక్స్, మారేజ్ సర్టిఫికేట్, పెళ్ళి ఫోటోలు కొన్ని పంపండి, సరిపోతాయి అన్నారు. రామస్వామి గారు ఎకౌంట్ లో డబ్బులు వేస్తే శరత్ గారు బాంక్ స్టేట్మెంట్ తీసుకోవడంలో హెల్ప్ చేసారు. మా పెళ్ళి సంతకాల  పెళ్ళిలా జరిగింది. ఆ ఫోటోలు, పేపర్స్ అన్నీ తీసుకుని మా వారు వీసా స్టాంపిగ్ కి వెళితే, ఎంగేజ్మెంట్ ఫోటోలు కాదు, పెళ్ళి ఫోటోలు తీసుకురండి అన్నారట. 

మళ్ళీ కలుద్దాం...


ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉన్నపుడు తన 2 సం// పిల్లవాడికి సీరియస్... అయినా రాలేని పరిస్థితి... 10 నెలల తరువాత ప్రయాణం

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..






ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉన్నపుడు తన 2 సం// పిల్లవాడికి సీరియస్... అయినా రాలేని పరిస్థితి... 10 నెలల తరువాత ప్రయాణం

కాలం వెంబడి కలం...11

      అనుకున్నట్టుగానే మా EC-II  శివారెడ్డి సర్ పుణ్యమా అని ఆ లాబ్ ఉండిపోవడంతో 4వ సంవత్సరానికి ప్రమెాషన్ ఆగిపోయింది. ఫీజ్ కట్టడానికి పట్టుకెళ్ళిన డబ్బులు తిరిగి తెచ్చేసాను. అప్పటి వరకు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాకు, ఆ డబ్బులతో రొయ్యపిల్ల చెరువులో వేయమని నాన్నకు ఇచ్చేసాను. అప్పటి నుండి అందరికి పోయినా రొయ్యల చెరువుల్లో మాకు బాగానే డబ్బులు వచ్చేవి. అంతకు ముందు కూడా రొయ్యల చెరువుల్లో నష్టం ఎప్పుడూ రాలేదు. 
         నాన్నని విజయనగరంలో ఫ్రెండ్ మెాసం చేయడంతో మా అమ్మమ్మ గారి ఊరు జయపురం వచ్చేసామని చెప్పాను కదా. తర్వాత నాన్న అంతకు ముందు చేసిన రొయ్యల వ్యాపారం మెుదలుబెట్టారు, రొయ్యల చెరువులు వేయడంతో పాటుగా. నా చదువు కోసం ఐదు ఎకరా చెరువులు అమ్మి నాకు డబ్బులు కట్టారు. వ్యాపారంలో డబ్బులు వాటా పెట్టడానికి లేక అమ్మ బంగారం 25 నవర్సలు మచిలీపట్నంలోని లీలా కోటేశ్వరరావు వద్ద పెట్టారు. నాన్నతో పాటు మరో ఇద్దరు కూడా ఉండేవారు.వాళ్ళ మాటలు ఏం విన్నాడో తెలియదు కాని లీలా కోటేశ్వరరావు మా అమ్మ బంగారం ఇవ్వలేదు. తర్వాత వైజాగ్ వాళ్ళకి రొయ్యలు వేసేవారు. ఆ దరిద్రుడు 3 లక్షలు ఎగ్గొట్టాడు. కాని మనల్ని సరుకు వేసినవారు ఊరుకోరు కదా. బయటివాళ్ళ కన్నా అయినవాళ్ళు అస్సలూరుకోరు. అర్ధరాత్రి ఇంటికి వచ్చి మీరు తినడం లేదా అని నానా మాటలు అడిగి వెళ్ళారు. కొందరైతే అంతకు ముందు వరకు బోలెడు ప్రేమ ఒలకబోసి, ఆ టైమ్ లో బయట కనబడినా, మనం పలకరించినా ముఖం తిప్పుకుని వెళిపోయారు. ఉన్న పొలం అమ్మేసి అప్పులన్నీ కట్టేసి మళ్ళీ ఉత్త మనుషులం మాత్రమే మా ఊరు నరశింహాపురం వెళిపోయాము. అయినవాళ్ళే అని ఒకరితో కలిసి మళ్ళీ చెరువులు వేస్తే కాస్త బానే వచ్చే సరికి ఆయనకు కడుపుబ్బరం పుట్టి, గొడవ పెట్టుకున్నాడు. మధ్యవర్తులుగా మా పెదనాన్న, మరొకాయన వెంకటేశ్వర్లు గారు ఉండి మాతో10,000లో 30,000లో సరిగా గుర్తు లేదు, ఆయనకు అప్పుగా ఇప్పించారు. నేనే అడిగానప్పుడు ఆయన ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అంటే మేమిస్తామని చెప్పారు. వెంకటేశ్వర్లు గారు చనిపోయారు, అప్పు కట్టాల్సినాయనా ఈమధ్యనే పోయారు.  అదేమని మనం అడిగితే మీరు గొడవ పడుతున్నారని అలా చెప్పామన్నారు. మధ్యవర్తిత్వాలు ఇలా ఉంటాయన్నమాట. 
         రక్త సంబంధీకులు కూడా అరలీటరు పాలు పోయడానికి, మీకు కావాల్సిన పాలు ఓ పూటే తీసుకోండి, మాకు పాలకేంద్రంలో గరిటెడు పాలు పోతాయి అన్నారు. మా చేతుల్లో పెరిగిన గేద దూడను విజయనగరం నుండి వచ్చేటప్పుడు మాతోపాటు లారీలో తీసుకువచ్చాము. మా నాన్న తీసుకున్న రెండువేలు ఇవ్వలేడేమెానని ఆ దూడను ఉంచేసుకున్నారు మా రక్త సంబంధీకులు. మన దగ్గర రూపాయి లేనప్పుడు అయినవాళ్ళెవరూ అక్కరకు రారన్న సత్యం మీకందరికి కూడా బోధపడాలనే ఇదంతా చెప్పాను. మా నాన్న చేతిలో రూపాయి లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో కూడా ఏనాడు నాకు పుస్తకాలు కొనివ్వడం మానలేదు. తర్వాత  స్టేడియంలో కూర్చుని క్రికెట్ మాచ్ లు చూసిన రోజులు ఉన్నాయి. అదే టైమ్ లో చింతామణి నాటకం కింద కూర్చుని చూసిన రోజులూ ఉన్నాయి. నేను నాన్నతో అనేదాన్ని. 
" నాన్నా ఇవన్నీ నాకు అంత సంతోషమివ్వలేదు కాని నువ్వు నీ దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా నాకు పుస్తకాలు కొనిపెట్టావు. అదే బోలెడు సంతోషాన్నిచ్చింది " . అని. 
ఇలాంటి కొన్ని అనుభూతులు చెప్పడానికి మాటలు కూడా చాలవు. 
         మా ఫైనలియర్ బాచ్ అందరు ఇండ్రస్టియల్ టూర్ వెళుతున్నారు రెండు బాచ్ లుగా. కొడైకెనాల్, ఊటి ఆవైపు ఒక బాచ్, హైదరాబాదు వైపు మరో బాచ్. నేను, ఫస్ట్ ఇయర్ నుండి నాతోపాటున్న తమిళ్ళమ్మాయి నా ఫ్రెండ్ ఉమారాణితో  హైదరాబాదు టూర్ కి అందరం బయలుదేరాం. అప్పటికే నేను ఖాళీగా ఉండటమెందుకని హైదరాబాదులో మా పిన్ని వాళ్ళింట్లో ఉండి లోటస్ 123, డాటాబేస్ కంప్యూటర్ ట్రైనింగ్ క్లాసులు నేర్చుకుంటున్నాను. హైదరాబాదు నుండి బళ్ళారి వెళ్ళి, మళ్ళీ బస్ లో హైదరాబాదు బయలుదేరాం అందరం. మా సీనియర్ షర్మిల యూనివర్శిటీ గోల్డ్ మెడలిస్ట్ ఫైనలియర్ కి లెక్చరర్ గా ఉన్నారప్పుడు. ఆవిడ, ఈరన్న సర్ మాతో టూర్ కి వచ్చారు. పొద్దు పొద్దున్నే ఆవిడ వెనుక సీట్ లోని నాకు గుడ్ మార్నింగ్ చెప్పారు. నేను ఓ నవ్వు నవ్వి గుడ్ మార్నింగ్ చెప్పాను. అసలు ఆవిడ నాతో మాట్లాడుతుందని ఊహించలేదు. హోటల్ లో రూమ్స్ తీసుకున్నారు. మా అమ్మాయిలకి రెండు రూమ్స్ ఇచ్చారు. మా పక్క రూమ్ షర్మిల మాడం, మరికొంత మంది అమ్మాయిలు, నేను, ఉమారాణి, యశు, అనూరాధ ఒక రూమ్. షర్మిలకు చీర కట్టుకోవడం రాక మా రూమ్ కి వచ్చింది పిన్ పెట్టమని. అలా నాకు బాగా క్లోజ్ అయిపోయింది నాలుగు రోజులలోనే. టూర్ అంతా బాగా ఎంజాయ్ చేసాము. హోటల్ లో టిఫిన్, భోజనాలప్పుడు ఎవరు ఎక్కువ సోంపు తెస్తే వారికి పార్టీ ఇస్తానని షర్మిల చెప్పారు. మెుత్తానికి నేనే ఎక్కువ సోంపు తెచ్చి చాకోబార్ ఐస్క్రీమ్, పైనాపిల్ జూస్ గెలిచాను. ఏం పార్టీ అన్నది షర్మిల ఛాయిస్ మరి. ఓరోజు సెకెండ్ షో సినిమాకి ప్లాన్ చేసారు. గాయం కాని, మేజర్ చంద్రకాంత్ కాని అన్నారు. నేను గాయం చూద్దామంటే అందరు సరేనన్నారు. కృష్ణకాంత్ వాళ్ళ బాచ్ ఈ టూర్ మెుత్తం ప్లాన్ చేసారు. చాలా బాగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూసారు. ఆ నాలుగు రోజులు నాగార్జున సాగర్, BHEL, ECIL, బిర్లామందిర్ ఇంకా ఏవో చూసాము. మధ్యలో అనురాధ రమ్మంటే అందరం వాళ్ళింటికి కూడా వెళ్ళాము. నాకు బొమ్మలు బాగా ఇష్టం. నాగార్జున సాగర్ మ్యూజియం బోట్ లో వెళ్ళి చూసి, వచ్చేటప్పుడు వైట్ సిమ్మెంట్ తో చేసిన బొమ్మలు కనబడితే చాలా బొమ్మలు కొన్నాను అందరికని. అప్పట్లో ఎక్కడికి వెళ్ళినా ఏదోకటి కొనడం నాకు అలవాటు. షర్మిలకు, ఈరన్న సర్ కి రామన్,  అంజయ్య చౌదరి వాళ్ళు పార్టీ ఇచ్చారు. రామన్ చుడీదార్ వేసుకుని షర్మిలకు కంపెనీ ఇవ్వడం కొసమెరుపన్నమాట. లాస్ట్ రోజు కృష్ణకాంత్ వాళ్ళు డిన్నర్ పార్టీ ఇచ్చారు అమ్మాయిలందరికి. అప్పటికే నా రాతల గురించి అందరికి తెలుసు. వరకట్నం మీద కవిత చెప్పమంటే నాకు చెప్పడం రాదు, రాయడం మాత్రమే వచ్చని చెప్పాను. అలా చాలా సరదాగా టూర్ గడిచింది. నేను అటునుండి అటే ఆ రాత్రికి అనురాధ వాళ్ళింట్లో ఉండి మరుసటి రోజు మా పిన్ని వాళ్ళింటికి వెళిపోయాను.  

వచ్చే వారం మరిన్ని కబుర్లతో....

19, జులై 2020, ఆదివారం

ఏం మిగిలిందని...!!

ఏం మిగిలిందని...!!

నీకు నాకు మధ్యన
మాటలేం మిగిలాయని

మౌనం నా బలహీనతై
మాట దాట వేయడం నీ అలవాటైంది

దశాబ్దాలుగా కలిసి నడుస్తున్న 
సమాంతర రేఖల అనుబంధం మనది

అయినా వెలికి తీయడానికి 
ఒక్క జ్ఞాపకమూ లేకపోవడమెంత వింతో

నీతో కలిసి నడిచిన గతమంతా తవ్వినా 
కనబడనే లేదు నా అస్తిత్వం 

చిరాకుల పరాకుల కూడికలు తీసివేతలు పోను
బాధ్యతల హెచ్చవేతల నడుమన క్షణాలు కొన్ని 

బరువుల బాగహారాలలోని గతజన్మ బుుణశేషం
ఇలా మన మధ్యన మిగిలిందేమెా..!! 




16, జులై 2020, గురువారం

ఆంద్ర ఆడపడుచు అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు... అక్కడ లైఫ్ అంటే అంత సులభం కాదు...

నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..



ఆంద్ర ఆడపడుచు అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగాలు... అక్కడ లైఫ్ అంటే అంత సులభం కాదు...

13, జులై 2020, సోమవారం

హృదయ ఘోష..!!

నేస్తం, 
        చాలా  రోజుల తర్వాత మాట్లాడుకుంటున్నాం కదూ...ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదోక సమస్య ఉండనే ఉంటుంది. సమస్యను ఎదుర్కొన లేక చావు పరిష్కారం అనుకుంటారు చాలామంది. కాని బలవంతంగా చనిపోవడానికి చాలా ధైర్యం కావాలి. దానిలో కొద్దిపాటి ధైర్యం చాలు దివ్యంగా మన బతుకు మనం బతికేయడానికి. 
        మెున్నీమధ్య ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిని లహరి వీడియెా ఈరోజు చూసాను. ఆ అమ్మాయి ఓ వెధవను ప్రేమించి, పెళ్ళి చేసుకున్న పాపానికి బలవంతంగా తనువు చాలించింది. ఆమె మాటలు వింటుంటే ఎందరి మనసుల్లోని ప్రశ్నలో కదా ఇవన్నీ అని అనిపించింది. మనకు తెలియకుండానే ప్రేమ ముసుగులో మెాసపోయే  అభాగ్యుల జీవితాలెన్నో. వెలికిరాని కన్నీటి కథలెన్నో.
           వాడు శారీరకంగా, మానసికంగా ఎంతగా హించించినా వాడి మీద ఆమె ప్రేమ చెక్కు చెదరలేదు. ఆమె మాత్రమే కన్నవారికి కన్నీటిని కానుకగా ఇచ్చి చనిపోయింది. ప్రేమ పేరుతో మంచివాడిగా నటించి, ఆమెను పూర్తిగా మానసికంగా చంపేసి, వీడు వేరే అమ్మాయిలతో విదేశాలు షికార్లు చేయడం, అదీ లహరి సొమ్ముతో ఎంజాయ్ చేయడం, రోజూ ఆమెను ఏదోక వంకతో గొడ్డును బాదినట్లు బాదడం, ప్రేమగా పెంచుకున్న కుక్క అడ్డం పడిన విశ్వాసం, ఇలా ఆ వీడియెాలో ఆమె హృదయ వేదన చూసాక చాలా బాధ అనిపించింది. 
           లహరి తన మనసు విప్పి చెప్పిన మాటలన్నీ ఎందరో సగటు మహిళల జీవితాలే కదా అనిపించింది. ప్రేమయినా, పెళ్ళయినా నమ్మకం మీద జరుగుతాయి. ఆ నమ్మకం మెాసపోయినప్పుడు ఇలాంటి ఆత్మహత్యలు కొన్ని జరుగుతాయి. నేరస్థులకు మాత్రం శిక్షలేం ఉండవు. దర్జాగా బయట కాలరెగరేసుకుని తిరుగుతారు. చట్టాలు, న్యాయాలు అన్నీ వారికనుకూలమే. ప్రపంచం ఎంత ముందుకెళ్ళినా మార్పు లేనిది సగటు మహిళ జీవితంలో మాత్రమే. లహరి లాంటి మహిళలెందరో సాక్ష్యాలు లేకుండానే జీవితాలు ముగిస్తున్నారు. 
          సమస్యతో పోరాడి గెలవాలి కాని సమస్యకు లొంగిపోకూడదన్న తెగింపు ప్రతి మనిషిలో రావాలి. ఎందుకోగాని లహరి మాటలు విన్నప్పుడు మనకు తెలిసిన మనసులో మాటలే తను చెప్పింది అన్నట్టుగా అనిపించింది. ఏముందిలే కాని ఈరోజు విన్నప్పుడు కాస్త బాధ పడతాం. రేపు నిద్ర లేచేసరికి ఈ సంఘటన ఆనవాళ్ళను మర్చిపోతాం. మరో విషయంతో మరో రోజు ప్రారంభం. ఇదే మన జీవితం. మన చేతకాని తనానికి బుుజువులుగా ఇలా ఎన్నో సంఘటనలు వింటూ, చూస్తూ...ఏది మనది కాదని దులిపేసుకుని బతికేద్దాం...ఏమంటారు? 
        
       

ఏక్ తారలు...!!

1.  పాతదనమెప్పుడూ కొత్తదనానికి నాందే_నిన్నా రేపుకు తేడా తెలుపుతూ...!!
2.  బుుజువు చూపలేని గాయాలవి_మనసునే వరిస్తూ..!!
3.   అనుబంధాలేం లేవు_బుుణ సంబంధాలు తప్ప..!!
4.  ఆత్మీయత ఆమడ దూరానే ఆగిపోయింది_బంధాల తూకానికి ఒగ్గలేక...!!
5.  భ్రమత తీరనిదే మరి_నిష్క్రమణం అనివార్యమని తెలిసినా..!!
6.   ఆశలకు ఆయువునివ్వడమే_కలవరపడే మనసుని సముదాయించమంటే..!!
7.  ఆవాహన చేసుకుంది అక్షరాన్నే _ఆత్మకు ఆనందాన్నీయడానికి..!!
8.   అక్షరానికి ఆటుపోట్లు తెలుసు_మనసుకు సాంత్వన అందిస్తుందందుకే...!!
9.    సేద దీర్చే అక్షరాల్లోనే_ఓదార్పులన్నీ...!!
10.    దాచిపెట్టుకుంది గతం_నావైన జ్ఞాపకాలనన్నింటినీ...!!
11.   బాధను భరించక తప్పదు_అక్షరానికి అమ్మతనం అద్దినందుకు..!!
12.  దగ్గరవడమే తనకు తెలిసిన ధర్మం_నమ్మిన నెయ్యంతో..!!
13.  ఆ'భరణమెందుకు అయినవారి మధ్యన_నెయ్యం నొచ్చుకుంటుందేమెా...!!
14.  మనసు వేగం అక్షరాలకెరుకే_ఏ కాలాన్నైనా తమలో కలిపేసుకుంటూ..!!
15.   రాయడమెలానో కలానికి ఎరుకే_అక్షరాలకు మనసు తెలిస్తే...!!
16.  లలాట లిఖితమది_బాధైనా ఏదైనా అక్షరంతో ఆత్మానందం పొందడమనేది..!!
17.  అక్షరాలు కొన్నే_అవి పంచే అనుభూతులే అనంతం..!!
18.   చేజారుతున్న కాలాన్ని ఒడిసిపట్టింది మనసు_అక్షరాలతో స్నేహం చేయమంటూ..!!
19.   అక్షరాలెప్పుడూ తేనెలే చిలకరిస్తాయి_మన ఆస్వాదనలోనే అంతరాలు...!!
20.   జీవన నాటకం నడుస్తూనే ఉంటుంది_కాలం కనికట్టులో..!!
21.   మలిపొద్దై మారాము చేస్తున్నా_వెన్నెలరేడు పలకరింపుల కోసం...!!
22.   శిల్పమై నిలిచింది మనసు తెలిసిన మౌనం_బాధకు భాష్యం తానౌతూ..!!
23.   చేరలేని తీరాలే కొన్ని_జవాబు దొరకని ప్రశ్నలతో..!!
24.  చేరువైన అనుబంధాలు చాలు_ప్రశ్నల పరంపరకు అడ్డకట్ట వేయడానికి..!!
25.  బతుకు పుస్తకమెప్పుడూ బరువే_బంధాలకు చుట్టుకున్న బాధ్యతలతో...!!
26.   అర్థం కాని ముడులే అన్ని_చిక్కులు విప్పే చాకచక్యం తెలియనప్పుడు...!!
27.  అక్షరమెప్పుడూ ఆర్తినే నింపుతుంది_అది తన సహజ స్వభావమనుకుంటా..!!
28.  చిరునవ్వు వెనుక విషాదాన్ని చూడు_మదిలో ఇంకిన కన్నీళ్ళెన్ని కనిపిస్తాయెా..!!
29.  లోకజ్ఞానం లేకే ఈ కన్నీళ్ళు_వేదనే వాయిద్యమైన మదిని సముదాయించలేక..!!
30.   మూగబోతున్నాయి అక్షరాలు_మది అడుగుజాడలను అనుసరించలేక...!!

కాలం వెంబడి కలం..10

      మాకు నెక్స్ట్ ఇయర్ కి ప్రమెాట్ కావడానికి మినిమం సబ్జెక్ట్స్ పాస్ కావాలన్న లెక్క ఉండేది. మా ఎచోడి భానుప్రసాద్ పుణ్యమా అని, ట్యూషన్లకు వెళ్ళినా లాబ్లు ఉంచేసేవారు. అలా నాకు ఓ సబ్జక్ థర్డ్ ఇయర్ కి వెళ్ళడానికి తగ్గింది. ప్రతి ఇయర్ మినిమం సబ్జక్ట్స్ పాస్ కావాలన్న లెక్క ఉండేది. గుల్బర్గా యూనివర్శిటీ వాళ్ళందరు COB కావాలని స్ట్రైక్ చేసి మెుత్తానికి సాధించారు. అలా మూడవ సంవత్సరం మెుదలయ్యింది. 
      అప్పటికే మెుదలయిన క్లాసులు, లాబ్లు చేసుకోవడంతో బాగా బిజీగా ఉండేది. మాకు EC-II  కి శివారెడ్డి , CTT కి శివప్రసాద్ సర్ లు కొత్తగా వచ్చేవారు. నాకు సెకెండ్ ఇయర్ లో కాస్త హెల్త్ ప్రోబ్లం వచ్చింది. మెడనొప్పి బాగా ఎక్కువగా ఉండటంతో OPD హాస్పిటల్ కి వెళ్ళి బోన్ స్పెషలిస్ట్ కి చూపించాను. ఎక్స్రే తీయించి, బోన్స్ మధ్యలో ఖాళీ వచ్చి నరం నొక్కుకుపోయిందని చెప్పి, ఓ పది రోజులు రోజూ ఇంజెక్షన్స్, మెడిసిన్స్ వాడారు. రోజూ ఇన్ఫ్రారెడ్ రేస్ తో కాపడం కూడా పెట్టేవారు. ఓరోజు డాక్టర్ కి కాన్ఫరెన్స్ ఉండి కాంపొండర్ని 8 నిమిషాలు పెట్టి తీసేయమంటే, మర్చిపోయి 20 నిమిషాలు ఉంచేసే సరికి లోపల చర్మం కాలిపోయింది. తర్వాత డాక్టర్ తిట్టారనుకోండి,అది వేరే సంగతి.. అప్పటి నుండి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో న్యూరాలజిస్ట్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గర కొన్ని రోజులు, తర్వాత హైదరాబాదు బాల పరమేశ్వరరావు గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని. అప్పుడప్పుడూ 2,3 నెలలకోసారి హైదరాబాదు వెళ్ళాల్సి వచ్చేది.
      లాబ్ పర్మిషన్ తీసుకోవడానికి శివప్రసాద్ సర్ కి లెటర్ రాసి ఇస్తే, ఏమైంది అని అడిగారు. ఇదంతా చెప్పడం ఇష్టం లేక తెలియదు సర్ అంటే మీకు తెలియకపోతే ఎలాగండి? మరి నేను పర్మిషన్ ఎలా ఇవ్వను అని నవ్వి పర్మిషన్ ఇచ్చారు. శివప్రసాద్ సర్ క్లాస్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అందరం. ఆయన క్లాస్ కి వచ్చినప్పుడు ముందు క్లాస్ వాళ్ళు బోర్డ్ క్లీన్ చేయకపోతే, ఈయన ఎక్కడ చిన్న ఖాళీ ఉంటే అక్కడో రెండు ముక్కలు అదీ అత్యవసరమైతేనే రాసేవారు. మేం బాగా నవ్వుకునేవాళ్ళం ఎంత బద్దకమెా ఈ సార్ కి అని. 
      శివారెడ్డి సర్ క్లాస్ లో బాగా గోల చేసేవాళ్ళు అందరు. ఆయన కొందరు అమ్మాయిలకు మాత్రమే ప్రత్యేకంగా చెప్పినట్లు అనిపించేది క్లాస్ వింటున్న అందరికి. అందుకే బాగా ఏడిపించేవాళ్ళు. ఆయన రివెంజ్ తీర్చుకోవడానికి క్లాస్ లో ఎగ్జామ్ పెట్టారు. ముందుగా అమ్మాయిల్లో నేను బ్లాంక్ పేపర్ ఇచ్చి బయటకు వచ్చేసాను. క్లాస్ అంతా గోల చేసారు EC-II లాబ్ ఫెయిల్ అని. తర్వాత చాలామంది బయటకు వచ్చేసారు. అందరివి పేర్లు నోట్ చేసుకున్నారు సర్. ఫైనల్ ఎగ్జామ్స్ లో EC-II లాబ్ లో నాకు హైపాస్ ఫిల్టర్ ప్రాక్టికల్ వచ్చింది. నాకు లాబ్ ఎగ్జామ్ ఎప్పుడూ ప్రోబ్లం కాదు. వెంటనే సర్క్యూట్ గీసి, ఫార్ములా రాసి సర్ కి చూపించా. సర్ ఓకే అంటే ప్రొసీడ్ అవ్వాలి. మా మీద కోపంగా ఉన్నారు కదా, రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో అన్నారు. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది కాదేమెానని మరో సర్క్యూట్ వేరేది గీసి చూపిస్తే, మీ ఇష్టం మీకేదనిపిస్తే అది చేయండి అన్నారు. అప్పుడు అనుకున్నా ఈయన లాబ్ ఫెయిల్ చేయడం ష్యూర్ అని. వైవా ఏదో అడిగి పంపేసారు. ఇదంతా అరగంట లోపలే జరిగిపోయింది. బయటకు వచ్చేసా కాని తర్వాత చాలా బాధనిపించింది. ఆరోజు రాత్రి వివరంగా తెలుగులో సర్ కి ఓ లెటర్ రాసి పోస్ట్ చేసాను. 2 రోజుల తర్వాత అది చేరినట్టు, ఆయన మరెవరితోనో చదివించుకున్నట్టు తెలిసింది. ఉమారాణి చెప్పింది. మంజు నీ లెటర్ చదివినట్లున్నారు. మెుహం చాలా చిన్నబోయింది. లాబ్ లో కూడా అందరికి బాగా హెల్ప్ చేసారు అని చెప్పింది. రాతలకు మనుషులు మారతారని చెప్పడానికి ఇదో సాక్ష్యం. తర్వాత ఆ లాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు దగ్గరకు వచ్చి మరీ అడిగినా నా పని నేను చేసుకుని వచ్చేసాను. 
       మూడో సంవత్సరం మధ్యలో ఓరోజు హంపి, తుంగభద్ర డామ్ పిక్నిక్ కి వెళ్ళాము. లోకలేట్స్ కి, మిగతావాళ్ళకి మధ్యలో కాస్త గొడవలు. మెుత్తానికి పిక్నిక్ కి బయలుదేరాం బస్లో. అప్పుడు కనిపించాడు మా శీనన్నయ్య. ఫస్ట్ ఇయర్ లో నాన్న పరిచయం చేసినప్పుడు చూడటం, మళ్ళీ ఇప్పుడు చూడటం. మధ్య లో బస్ ఆపి ఎవరో ఏదో అడిగితే, సమాధానం చెప్పి, డోర్ వేసేసారు. మేము వెనుకనే కూర్చున్నాం. అతను తాగినట్లున్నాడని భాస్కర్ తో అన్నాను. మాకు తెలియలేదు, నువ్వు భలే కనిపెట్టావుగా అని నవ్వారు.  మా కాలేజ్ వాళ్ళే వేరే బ్రాంచ్ వాళ్ళు కూడా వచ్చి పిక్నిక్ మధ్యలో కాస్త గొడవ చేసారనుకోండి. చాలా సరదాగా జరిగింది పిక్నిక్. బోలెడు ఫోటోలు కూడా దిగామండోయ్. 
      ఇక మేం సీనియర్స్ కి సెండాఫ్ పార్టీ ఇవ్వాలి కదా. మా క్లాస్ లో అప్పటికే గ్రూప్లు ఉన్నాయి. పిక్నిక్ అప్పుడు కాస్త తేడాలు వచ్చాయి. అందరిని కలుపుదామంటే కుదరలేదు. సీనియర్సేమెా అసలు మాకు సెండాఫ్ పార్టీ ఉందా లేదా అని లాబ్లలో సెటైర్లు మా మీద. మెుత్తానికి అమృత రెస్టారెంట్ లో సెండాఫ్ పార్టీ. బాగా జరిగింది. నేను రాసిన " బోటనీ పాఠముంది మేటనీ ఆట వుంది దేనికో ఓటు చెప్పరా " పాటకు పేరడీ పాటను  " ఏఎస్పి క్లాస్ వుంది ఏఎన్ఆర్ షో వుంది దేనికో ఓటు చెప్పరా "  వెంకటేశ్వర్లు టీమ్ పాడారు అప్పటికప్పుడు. రామన్ రాసి పాడిన ప్రేమి ఆషిక్ ఆవారా పాటకు పేరడీ పాట కెపాసిటర్ రెసిస్టెన్స్ చాలా బావుంది. సీనియర్ బాగా పాడిన క్షణ క్షణం లోని పాట " అమ్మాయి ముద్దు ఇవ్వందే " హైలెట్. పార్టీ చివర్లో కరంట్ పోయింది కాసేపు. అప్పుడు సీనియర్స్ నుండి వినబడిన మాట ముద్దు కాదు కదా కనీసం మాట కూడా లేదని. అది విని మేమందరం బాగా నవ్వుకున్నాం కూడా.  క్లాస్ లో కొందరు రాకుండానే సెండాఫ్ పార్టీ జరిగిపోయింది. 

వచ్చే వారం మరిన్ని కబుర్లతో...

        

11, జులై 2020, శనివారం

త్రిపదలు..!!

1.   పసితనమెంత మురిపెమెా
వానలో తడుస్తూ
కాలు జారి బురదలో పడినా..!!
2.  లెక్కలేసుకుంటూ బతికేయట్లా
మనసుకు మనీకి ముడి పెడుతూ
ఆస్వాదనకు అర్థం తెలియకుండా...!!
3.  ప్రతి క్షణము విలువైనదే
నిన్నటికి రేపటికి నడుమన
ఈరోజన్న జూదంలో...!!
4.  యుగాల నిరీక్షణను
మౌనం మాటాడుతుంటే
వినాలని ముచ్చట పడుతూ.. !!
5.  అరకొరగా మిగిలాయి
అనుబంధపు ఆనవాళ్ళు
చరిత్ర చెప్పలేని పాఠాలుగా...!!
6.   క్షణాలలా మరిపించేస్తున్నాయి
ముసిరిన జ్ఞాపకాల
ముచ్చట్ల నెమరువేతలతో...!!
7.   తడబాటు మనసుదని
అమాయక అక్షరాలకేం తెలుసు 
రాతెందుకు గజిబిజిగా ఉందో...!!
8.  కాలానికెంత తొందరో
క్షణాలనన్నింటిని తరుముతూ
గతాన్ని వదిలేస్తూ..!!
9.   నేను 
నీకు తెలియని
మనోగతం...!!
10.   నువ్వు 
నాకు అర్థమైన
అనుబంధం..!!
11.   లక్షణమే 
ఆభరణం అక్షరానికి
అమ్మ నేర్పినందుకేమెా...!!
12.  నిశ్శబ్ద శబ్దాలతో పనేముంది
ఏకాంతంతో సహవాసం మెుదలై
జ్ఞాపకాలు మనవైనప్పుడు...!!
13.   మలి పొద్దు 
ఆరుబయట వెన్నెల కబుర్లు 
మరలిపోని జ్ఞాపకాలే ఎప్పటికి..!!
14.  మనసు మురిసింది
చినుకుల్లో తడిసిన
బాల్యం మరోసారి తాకినట్లనిపించి..!!
15.   అనుసంధానం 
అవసరమా
మన మధ్యన...!!
16.  ఆత్మ బంధమని
అనిపించిన అనుభూతి
అక్షరంతో జత కలిసాక..!!
17.   గతజన్మ బంధాలు
మరుజన్మ పాశాలుగా
ఈ అక్షరాలే కావాలన్న దురాశ...!!
18.   గతం నుండి
తప్పించుకోవడం అలవాటే
కాలానికెప్పుడూ...!!
19.   జీవితమే నువ్వు
గతంగానో
జ్ఞాపకంగానో...!!
20.   మనంలోనే
నేను నువ్వు ఇమిడిపోయాం
ఈ విడదీయడాలెందుకటా...!!
21.   చావో ఆత్మీయం
బంధాలకు బాధ్యతలకు
విరామమిస్తూ...!!
22.   గుండె గుప్పెడే అయినా
సుళువుగా తనలో ఇమిడ్చేసుకుంది
ఓ జీవిత పుస్తకాన్ని ఆసాంతం...!!
23.   మాట పట్టింపు వచ్చినా
మరచిపోయే బంధమా అది
అనుక్షణం ఆసరానే ఇప్పటికి..ఎప్పటికి...!!
24.   అన్నిసార్లుా
మౌనం కూడదేమెా
మనసు తెలియాలంటే..!!
25.   కనుల నిండా జలపాతాలే
గుండె తడి మదికి చేరి
అక్షర తామరలు పరిచాయనుకుంటా..!!
26.  అమ్మదనమంతే
ఎన్నేళ్ళు పైబడినా ఎప్పటికీ తరిగిపోని
పసితనాన్ని జ్ఞాపకంగా మనకందిస్తూ..!!
27.  కాస్తే ఆత్మాభిమానమది
ఆత్మీయంగా పలకరించి చూడు
అనుబంధమై అల్లుకుపోతుందలా...!!
28.  గెలిచామన్న
అహంలో ఉన్నాం
ఆత్మీయతను దూరం చేసుకున్నామని తెలియక..!!
29.   శిలాక్షరాలే అన్నీ
జ్ఞాపకాల కాలం క్షణమైనా
మనసు సిరాతో లిఖించానని..!!
30.   జీవాత్మలోని
పరమాత్మే 
సర్వాంతర్యామి...!!

పంచరత్నాలు..!!

1.  మౌనం
అర్థమవదు
మనసు
మాట్లాడలేదు
తెలిసేదెలానో..!!

2.  చెలిమి
వీడదు
తరగదు
ఆత్మీయత
బుుణానుబంధం...!!

3.   వెదికిన
చిరునామా
దొరకని 
మానవత్వం
ఇప్పటికిదే...!!

4.  అబద్ధంలో
నిజం
వాస్తవంలో
కల
బావుంటుంది...!!

5.  రాయడం
కష్టం
కాపి
తేలిక
రచనలు..!!

10, జులై 2020, శుక్రవారం

కాలం వెంబడి కలం...9

       మాకు సెకెండ్ ఇయర్ లో ఫోట్రాన్ లాబ్ ఉండేది. ఎప్పుడో ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మా అంబా రమణ గారి పుణ్యమా అని ఓరోజు మా MPC బాచ్ అందరిని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్ళి కంప్యూటర్ చూపించారు. మనం తప్పు చేస్తే మెుమాటం లేకుండా తిట్టేస్తుంది మేడం అంటే మేడంతోపాటు అందరూ నవ్వేసారు. 1986 లో చూసిన కంప్యూటర్ మళ్ళీ 1990 లో చూసాను. కంప్యూటర్ లాబ్ కి వెళ్ళే మెుదటిరోజు బోలెడు ఎగ్జైట్మెంట్. లాబ్ బయట చెప్పులు వదిలేసి లోపలికి వెళ్ళడం, లోపల AC తో ఉన్న చిన్న పెట్టెలోనికి వెళ్ళినట్టనిపించింది. మాకు ముగ్గురికి కలిపి ఒక సిస్టమ్ ఇచ్చారు. నాతో ఉన్న వాళ్ళిద్దరు ఫస్ట్ ఇయర్ లో మెుదట మా నాన్న పరిచయం చేసిన అమ్మాయిలు శ్యామల, వాణిశ్రీ అన్నమాట. ఫ్లాపీ కొనుక్కోవడం, దానిని సిస్టమ్ లో ఇన్సర్ట్ చేయడం, ఫైల్ కి పేరు పెట్టుకోవడం సరదాగా అనిపించింది. నవ్య, కావ్య అని పెడదామంటే వాణిశ్రీ అలా వద్దు ఫైల్ పేరు మన ప్రోగ్రామ్ తెలిసేదిగా ఉండాలంది. సరే అని ఊరుకున్నా. ఫ్లో చార్ట్ గీయడం వరకు పర్లేదు, ఏంటో ప్రోగ్రామ్ రాయాలంటే లాజిక్ తెలియాలని అనడం అర్థం అయ్యేది కాదు అప్పట్లో. ఇన్ పుట్ ఇచ్చి, అవుట్ పుట్ రిజల్ట్ రావాలని, సిస్టమ్ కమాండ్ లు తెలుసుకోవడం ఇలా అప్పుడప్పుడూ అరుదుగా దొరికే కంప్యూటర్ తో ఆడుకోవడం భలే బావుండేది.ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫోట్రాన్ లాబ్ ఉంది మాకు. థియరీ ఎగ్జామ్స్ లో ECT ఎగ్జామ్ రోజు నేను మెయిన్ ఆన్సర్ షీట్ మెుత్తం నింపేసాను. ఎడిషనల్ తీసుకున్నాను. నా ముందు కూర్చున్న మెాహన్ వెనక్కి తిరిగి అన్ని రాశావా అంటే రాస్తున్నా అన్నాను. సరే నీ మెయిన్ షీట్ ఇవ్వు అన్నాడు. కాస్త భయం వేసింది. 
       చిన్నప్పుడు అడిగిన వాళ్ళకి ఆన్సర్లు చూపించడం, చెప్పడం, లేదా వాళ్ళ పేపర్ తీసుకుని రాసివ్వడం అలవాటు. అలా ఓసారి హింది పేపర్ మెుత్తం మా జూనియర్ కి రాసిచ్చేసాను. జాగ్రత్తగా ఓ 80 మార్కులకే రాసిచ్చాను. కాని మన రైటింగ్ హింది టీచర్ కి తెలుసు కదా, ఆ అమ్మాయికి అంత బాగా రాదని తెలుసు, ఎవరు రాసిచ్చారు చెప్పు అంటే, ఆ అమ్మాయి చెప్పకపోతే మంజు రాసిచ్చింది కదా నిజం చెప్పు అంటే ఆ పిల్ల స్వాతి భయంతో చెప్పేసింది. తర్వాత క్లాస్ లో తిట్లు, మా ఇంటికి వచ్చినప్పుడు అమ్మావాళ్ళకు నా మీద కంప్లయింట్స్, కోపంగా కాదులెండి ఇష్టంగానే చెప్పారు. కొత్తగా వచ్చిన తెలుగు టీచర్, ఆవిడ కొత్త లూనాతో డ్రైవింగ్ కూడా నాకు నేర్పారు. 
       మెాహన్ పేపర్ అడగ్గానే నాకు ఆ విషయం గుర్తు వచ్చింది. సరే ఏదైతే అది అవుతుందని మెయిన్ షీట్ మెాహన్ కి ఇచ్చాను. నేను ఎడిషనల్ రాసుకుంటున్నా. ఈలోపల స్వ్కాడ్ వచ్చారు. ఇక చూడాలి నా సంగతి. లోపల భయపడుతూనే పైకి రాసుకుంటున్నట్టు నటిస్తున్నా. నాకో ఎడ్వాంటేజ్ ఏంటంటే నా ఇనీషియల్ ప్రకారం లాస్ట్ నెంబర్స్ లో వస్తుంది. స్వ్కాడ్ మా వరకు రాకుండానే వెళిపోయారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. ట్విస్ట్ ఏంటో తెలుసా ఆ సబ్జెక్ట్ నాకు ఉండిపోయింది. మెాహన్ కి క్లియర్ అయ్యింది. ఫోట్రాన్ లాబ్ ప్రోగ్రామ్ రాయడం మాత్రమే అన్నారు. ఎగ్జిక్యూషన్ లేదన్నారు. ప్రిపేర్ కాలేదు. సరే వస్తే రాద్దాం లేదంటే వచ్చేద్దాం అనుకున్నా. ఏదో రాశాను మెుత్తానికి. వైవా కి ఎక్స్ట్రనల్ మేడం నాకు తెలిసినావిడ. ఫస్ట్ ఇయర్ లో నాకు మా క్లాస్ రూమ్ తెలియక ఈ మేడం ఉన్న స్టాఫ్ రూమ్ కి వచ్చి, ఆవిడనే అడిగాను. అప్పటినుండి ఆవిడకు నేను బాగా గుర్తు. వైవా బానే ఆన్సర్ చేసాను. 
       అన్నట్టు అసలు విషయం చెప్పడం మర్చిపోయానుగా. మేమూ సీనియర్స్ అయ్యాం కదా. నేనెవరిని రాగింగ్ చేయలేదండోయ్. కాకపోతే మా హాస్టల్ లో సరదాగా ఇంట్రడక్షన్ తీసుకున్నాం. పాపం కొత్తలో నేనంటే జూనియర్స్ (హాస్టల్ అమ్మాయిలు) భయపడేవారు. తర్వాత అనేవారు " నిన్ను చూసి ఎందుకు భయపడ్డామెా తెలియదు " అని. మరో విషయమేంటంటే మా పెద్ద అమ్మమ్మ మనుమడు బాలకృష్ణ నాకు జూనియర్. వాడితోపాటుగా విజయనగరంలో అప్పుడప్పుడూ మాతో ఆడుకున్న సురేంద్ర అంకుల్ కొడుకు భానుకృష్ణ కూడా. బాలకృష్ణని చిన్నప్పుడు చూసాను. మా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయ్యాక నాన్న, నేను ఇంటికి వచ్చేటప్పుడు ట్రైన్ లో మా సెక్షన్ శోభన్ బాబు వాళ్ళు అందరు ట్రైన్ లో బాగా గోల చేసారు. వీడు కూడా వాళ్ళతో ఉన్నాడు. క్లాస్ లో, లాబ్లలో అప్పుడప్పుడూ కనబడుతూ, నిదానంగా వుండే శోభన్ బాబు విశ్వరూపం చూసామన్న మాట. మా బాలు గాడు మేం ఎక్కిన బస్సే విజయవాడలో ఎక్కాడు. బస్ లో సిగిరెట్ కాల్చి పొగ వదిలితే నాకు చాలా కోపం వచ్చింది. తర్వాత కాసేపటికి మెాపిదేవిలో బస్ ఆగి బయలుదేరుతుంటే వీడు గబుక్కున దిగాడు. ఎవరబ్బా ఇక్కడ దిగేవాడు అని ఆరాగా చూసాను. తర్వాత మా పిన్ని చెప్పింది, వీడూ మా కాలేజ్ లోనే జాయిన్ అయ్యాడని. అప్పుడనుకున్నా ఆరోజు హడావిడిగా బస్ దిగింది వీడే అని. బాలు, భాను ఇద్దరు అలా మళ్ళీ కలిసారు.

వచ్చే వారం మరిన్ని కబుర్లతో.... 

9, జులై 2020, గురువారం

ఆంద్ర ఆడపడుచు అమెరికాకు వెళ్ళింది సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం... ఆర్ధిక మాన్యం తో చివరికి రెస్టారెంట్ లో ఫ్లోర్ , బాత్ రూమ్ క్లీనింగ్...



నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి,   రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..

ఆంద్ర ఆడపడుచు అమెరికాకు వెళ్ళింది సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం... ఆర్ధిక మాన్యం తో చివరికి రెస్టారెంట్ లో ఫ్లోర్ , బాత్ రూమ్ క్లీనింగ్...

భూతల స్వర్గమేనా..17

పార్ట్... 17
        పొద్దున్నే బస్ చికాగో మెయిన్ బస్ స్టేషన్ లో ఆగింది. నేను దిగాల్సింది అరోరా బస్టాండ్ లో. సెంట్రల్ స్టేషన్ లో బస్ క్లీనింగ్ కోసం ఆపారు. నేను కిందకి దిగి కాస్త అవతలగా కూర్చున్నాను. బయలుదేరేటప్పుడు ఎనౌన్స్ చేస్తారు కదా అని. నన్ను అరోరాలో రిసీవ్ చేసుకోవడానికి శరత్ గారు వస్తారని, ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఫోన్ చేసి ఇక్కడ బస్ ఆపారని చెప్పాను. తర్వాత చూస్తే బస్ లేదు. కంగారేసి ఎంక్వైరీలో అడిగితే బస్ వెళిపోయిందని చెప్పారు. నా లగేజ్ మెుత్తం బస్ లోనే ఉండిపోయింది. రెండు పెద్ద సూట్కేస్లు, ఒక చిన్న సూట్కేస్. దానిలోనే నా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. వెంటనే ఈ బస్ స్టేషన్ లో కంప్లయింట్ చేసాను. నా లగేజ్ అరోరా బస్ స్టేషన్ లో దింపమని  చెప్పాను. శరత్ గారికి, రామస్వామి గారికి ఫోన్ చేసి చెప్తే, కాబ్ వేసుకుని అరోరా బస్ స్టేషన్ కి వచ్చేయమన్నారు. 150 డాలర్లు దండగన్నమాట. ఏం చేస్తాం తప్పదు కదా మరి, మన అజాగ్రత్తకి మూల్యం చెల్లించాలి కదా. ఇంకా నయం బస్ వాళ్ళు నా లగేజ్ జాగ్రత్తగా దించి వెళ్ళారు. నేను బస్ స్టేషన్ కి వెళ్ళేసరికి లగేజ్ దించి బస్ అప్పుడే వెళిపోయింది. శరత్ గారు నన్ను లగేజ్ తో సహా వాళ్ళింటికి తీసుకువెళ్ళారు. శరత్ గారి వైఫ్ కవితక్క చక్కగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు రడీ అయ్యారు. నేను ఫ్రెష్ అయ్యి,  రడీ అయ్యాను. కవితక్క ఆరంజ్ జూస్ ఇచ్చింది. తాగేసి ముగ్గురం రామస్వామి గారిని కలవడానికి వారి చైనీస్ రెస్టారెంట్ హ్యూనాన్ ఇన్ కి బయలుదేరాం. 
           రెస్టారెంట్ మేనేజ్మెంట్, మెంటెనెస్స్ అంతా కవితక్క చూసుకునేది. రామస్వామి గారి వైఫ్ మాధవి గారు బయట జాబ్ చేసుకుంటూనే వీటిని కూడా చూసుకునేవారు. రామస్వామి గారు అప్పటికే భారత్ మేళా అని ఇండియన్ గ్రాసరిస్టోర్ కూడా తీసుకున్నారు. శరత్ గారు అక్కడ, ఇక్కడ కావాల్సిన సరుకులు, కూరగాయలు అన్ని తేవడం చూసుకునేవారు. ఆరోజంతా కవితక్క వెనుకే ఉంటూ తను చేసేదంతా చూస్తూ వున్నాను. ఆ నైట్ కి నన్ను నేపర్ విల్ లో రామస్వామి గారింటికి తీసుకువెళ్ళారు. చాలా  పెద్ద ఇల్లు. నా లగేజ్ కూడా వచ్చేసింది. వాషింగ్ మెషీన్ ఉన్న రూమ్ లో బెడ్ ఉంది. ఆ రూమ్ నాకు ఇచ్చారు. తర్వాత 4,5 రోజులనుకుంటా నన్ను రామస్వామి గారు పొద్దున్నే ఎనిమిదింటికంతా రెస్టారెంట్ కి తీసుకువెళ్ళేవారు. కవితక్క, శరత్ గారు కూడా ఆ టైమ్ కి వచ్చేసేవారు. కవితక్క నాకు అక్కడ చేయాల్సిన పనులు బాత్ రూమ్లు కడగడం, కూరగాయలు కోయడం, టేక్ అవుట్ల ఆర్డర్ తీసుకోవడం, ఇవ్వడం మెుదలైనవి నేర్పేది. లంచ్ బఫే ఉండేది. సాయంత్రం టేక్ అవుట్లు, డిన్నర్ ఉండేది. మరో పక్క ఇండియన్ ఫుడ్ టిఫిన్స్ , డిన్నర్ కూడా సాయంత్రం పూట మెుదలు పెట్టారు. వీకెండ్ బాగా బిజీగా ఉండేది. చైనీస్ కుక్ లు, తోలు వెయిటర్స్ కూడా ఉండేవారు. హోమె చైనీస్ వెయిటర్ సరదాగా మాట్లాడేది. చిన్న చిన్న చైనీస్ పదాలు కూడా అప్పుడప్పుడూ నేర్పేది. కొన్ని రోజుల తర్వాత జాబ్ మార్కెట్ అప్పటికే బాలేని కారణంగా మాధవి గారి జాబ్ కూడా కాంట్రాక్ అయిపోయింది. మా వారి ఫ్రెండ్ మాధవి గారి తమ్ముడు. 
         తర్వాత ఓ రోజు మాధవి గారు నేను రడీ అయ్యి రెస్టారెంట్ కి బయలుదేరుతుంటే నేను తీసుకువెళతానులే నిన్ను, మనిద్దరం కలిసి కాసేపాగి వెళదామంటే సరేనని ఆగాను. వీళ్ళకి ఓ పాప, బాబు. పాప అప్పుడు ఐదో, ఆరో చదువుతుండేదనుకుంటా. బాబు బయట ఉండేవాడు అండర్ గ్రాడ్యుయేషన్ అనుకుంటా. కాఫీ తాగుతూ ఆ కబురు, ఈ కబురు చెప్తూ నేనేం చేస్తున్నానో అన్నీ కనుక్కుంది. చాలా ప్రేమగా ఉండేది నాతో అప్పటి నుండి. నా గురించి బాగా కేర్ తీసుకునేది కూడా. అప్పుడప్పుడూ ఇండియన్ గ్రాసరిస్టోర్ కి కూడా తీసుకువెళ్ళే వారు శరత్ గారు. అక్కడ విజయ అని ఒకావిడ పని చేసేవారు. వాళ్ళాయన జాబ్. ఈవిడ ఇక్కడ పని చేసేవారు. నాకేమెా ఖాళీగా కూర్చోవడం రాదు. షాప్ నీటుగా లేదని క్లీనింగ్ మెుదలుపెట్టాను. నాకు వచ్చినట్టుగా అన్నీ సర్దేసాను. బాత్ రూమ్ కూడా నీట్ గా క్లీన్ చేసాను. కవితక్క నాకు రెస్టారెంట్ లో చెప్పిన పనే ఇక్కడా చేసి విజయతో అన్నానేమెా మనమే క్లీన్ చేయాలని. నాకు సరిగా గుర్తు లేదు. ఆవిడ మరి ఎవరికి ఏం చెప్పుకుందో నాకు తెలియదు. ఆరోజో, మరుసటి రోజో రామస్వామి గారు మీటింగ్ ఉందన్నారు. అందరు ఏదేదో మాట్లాడారు. చివరికి నాకర్థమైందేంటంటే నన్ను విజయకు సారి చెప్పమన్నారని. సారి చెప్పేసాను. కాని నా తప్పు లేకుండా సారి చెప్పడమంటే నాకు చచ్చిపోవడంతో సమానం. మాధవి అక్క తన కార్ లో ఇంటికి తీసుకువచ్చారు. తనకి నా సంగతి బాగా తెలుసు. నాతోపాటే రూమ్ కి వచ్చి బాధపడవద్దని చెప్పి సముదాయించింది. చాలా సేపు బాధనిపించింది. అప్పటినుండి కాస్త మనుషుల నైజాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేదాన్ని. నాకేమెా కాస్త ఆత్మాభిమానం ఎక్కువ. ఏదీ తొందరగా రాజీ పడలేను. ఈ విషయం నుండి బయటపడటానికి నాకు చాలా సమయమే పట్టింది. 

మళ్ళీ కలుద్దాం.. 

-

7, జులై 2020, మంగళవారం

రమ్య ద రోబో సమీక్ష...!!

రమ్య ద రోబో సమీక్ష...!! 
  మనసు ఆలోచనలకు ఆధునిక రెక్కల ఊహల ఊయల " రమ్య ద రోబో "
       బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదురాలైన డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ విశ్వపుత్రికగా తెలియని సాహితీకారులు లేరు. వీరు కవిత్వం రాయడంలోనూ, అనువాదం చేయడంలోనూ దిట్ట. తన రచనా వ్యాసంగంలో మరో ప్రక్రియ కథ చోటు చేసుకోవడం ముదావహం. అది తన చుట్టూ జరిగే సంఘటనలకు, తన మనసులో రేకెత్తిన సరికొత్త ఆలోచనలకు ఆధునికతను ఊహగా జోడించి, ఆ ఊహల చుట్టూ చక్కని కథనాన్ని నడిపించి, కథగా మలిచి " రమ్య ద రోబో " కథా సంపుటిగా మన ముందుకు తెచ్చారు. 
        ఆధునిక టెక్నాలజీ, అదీనూ ఓ రోబోట్ మన జీవితాల్లోకి వస్తే ఫలితాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయెా తెలిపే కథ రమ్య ద రోబో. రెక్కలకు దెబ్బ తగిలి ఎగరలేక నిస్సహాయంగా వున్న పక్షి, ప్రయాణం పిల్లలు పై చదువులు చదవాలన్న కోరికను పోల్చుతూ ఓ తల్లి తీసుకున్న నిర్ణయం కలల రెక్కలు కథ. మీటూ..అమ్మా అంటూ సమస్యను తెలివిగా పరిష్కరించుకుంటూ, చదువుకోవాలన్న కోరికను తీర్చుకున్న తెలివిగల పనిపిల్ల కథ ఇది. తానధిగమించిన సమస్య డిప్రెషన్ వల్ల పాడవబోయిన ఓ జీవితానికి చక్కని దారి చూపిన ఓ లెక్చరర్, స్టూడెంట్ కథే ఈ డిప్రెషన్. చక్కని సందేశాత్మక కథ. పెరిడోలియా అన్న మానసిక లక్షణాన్ని వివరిస్తూ, మంచి కలలు జీవితానికి చూపిన మంచి బాట గురించి తెలిపిన కథ రెక్కల కొండ. మన మనసే మన ఆలోచనలు అనే బుద్ధుని ప్రభోదాన్నెరిగి జీవితాన్ని ఆనందంగా గడపడమెలాగో తెలియజెప్పే కథ మనసును విను. పెంపుడు జంతువులపై మన ప్రేమ, వాటికి మన మీదున్న ఇష్టాన్ని తెలిపే కథ లైకా. 2035 లో జరగబోయే పరిణామాల గురించి మనుమడు ఊహించి చెప్తే, రాబోయే కాలంలో ఆధునిక పరిణామక్రమం గురించి అమ్మమ్మ తన చిన్నతనంలో చదివిన కథను మనమడికి చెప్పడం చాలా బావుంది. అమ్మమ్మ చేతి ముద్ద నుండి అమ్మ పిలుపుతో వాస్తవంలోకి వచ్చినట్టుగా, జ్ఞాపకాల గోడ కథలానే మనందరి జ్ఞాపకాలు కూడా మనల్ని పలకరిస్తాయి హాయిగా. ఆత్మహత్యలకు గల కారాణాలను సహేతుకంగా వివరిస్తూ, పరిష్కార మార్గాలను కూడా సూచించిన కథ జీవన వారధులు. పిల్లలకు అమ్మ చెప్పే కథల ఆధారంగా కలిగిన అంతరిక్ష యానం వంటి గొప్ప ఆలోచనలను నిజం చేసుకున్న కథ విశ్వం పిలిచింది. తరాల అంతరాయ ఆలోచనలకు అద్దం పట్టే కథ మైండ్ సెట్. 
      ఆధునిక ఆలోచనలు, జ్ఞాపకాలు, మనిషి మైండ్ సెట్, వైవాహిక జీవితాల్లో కొన్ని సమస్యలు, పిల్లల ఆలోచనలు, వాటికి పెద్దల సహకారం ఇలాంటి కథలన్నీ మనకు "రమ్య ద రోబో " లో కనిపిస్తాయి. ఎక్కువగా ఫ్యూచర్ టెక్నాలజీ గురించిన ఊహల కథలున్నాయి. భవిష్యత్తులో ఈ ఊహలే నిజం కావచ్చునేమెా. సులభ శైలిలో 12 కథల సంపుటిగా వెలువడిన "రమ్య ద రోబో " కు హృదయపూర్వక అభినందనలు. 




Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner