30, జూన్ 2014, సోమవారం

మళ్ళి తిరిగొచ్చేనా...!!

మేఘాన్ని వదలిన చినుకు
పుడమిని తాకే సంబరంలో 
చినుకు చినుకులో సంతోషం
ధరిత్రిని దర్శించిన ఆ స్పర్శలో
పులకరించిన మదిని తడిమిందో
పలవరింత ఓమారు మరచి పోని
మరో అంతరంగం....!!
ఏడు రంగుల ఏకాంతం ఆ హరివిల్లు
చిన్ననాటి చినుకుల సహవాసం
చెలమ నీటి స్నానాలు మట్టితో
పుట్టించిన ఆకారాలు వేసుకున్న
మరకలు అమ్మ తిట్టిన తిట్లు
కాగితపు పడవల ఆనందాలు
అవే జీవితపు ఆనవాళ్ళని
తెలియని ఆ అమాయకత్వం
మళ్ళి తిరిగొచ్చేనా...!!
కాలం కరిగిపోయింది
మళ్ళి  రాలేనంటు... 
బాల్యం వెళ్ళిపోయింది
తల్చుకుంటూ ఉండమంటూ...
చదువుల పోరాటాల ఆరాటం
అనంత తీరాల ఆవలి పయనం
జీవితార్ధాలను  వెదికే క్రమంలో
సరి కొత్త కోణాల రంగుల వలయం...!!
తలచుకుంటే తీపి జ్ఞాపకం
వదలి వేస్తె ఒంటరి ప్రయాణం
ఆస్వాదిస్తే అనుభూతుల మయం
అన్ని రుచుల సమ్మేళనం
అనుభవాల వడపోతల చివరి అంకం
అందుకే ప్రతి క్షణం మనదే...!!

28, జూన్ 2014, శనివారం

ప్రాణం పరితపిస్తోంది....!!

మాటలే రాని నాకు మౌనం
తోడుగా ఉంటే కాదని చెప్పి
అక్షరాల చెలిమిని అందంగా
అమర్చి నాకందించిన నువ్వు...!!
భావాల ఆటల బంధాల జతలో
చేరిన నీ నా జ్ఞాపకాల సాన్నిహిత్యం
మరుగున పడిన మరో మనసుని
మళ్ళి నిదుర లేపుతుందేమో...!!
అలవాటు పడిన జీవితం కొత్తగా కనిపిస్తూ
నన్ను నాకే సరి కొత్తగా చూపిస్తూ మౌనాల
 అర్ధాల  భాష్యాలు వినిపిస్తూ చూపించే
 సరి కొత్త కావ్యమే రూపు దాల్చినదేమో...!!
పక్కనే నువ్వున్నా పలుకులే లేని
కధల సంగతి చెప్పాలని ఉన్నా
మాటలే మరచిన నాకు మూగతనాన్ని
కానుకగా ఇచ్చిన సంగతి నువ్వు మరచినట్లుంది....!!
అయినా ఎక్కడో ఓ చిన్న ఆశ
నీతో మాటల సంద్రాలు అలలై
నా కలల వాకిళ్ళ నుండి నిజాలుగా
నిన్ను చేరాలని చూస్తూ ప్రాణం పరితపిస్తోంది....!!

26, జూన్ 2014, గురువారం

జీవితానికి అర్ధాలు వెదుకుతూ....!!

ప్రేమ రాహిత్యమా అనురాగ సన్నిహితమా
బంధంలో లేని అనుబంధం కోసం ఆత్రంగా
చూసే అభిమానంలో వెదికిన వదనం
చిన్నబోయింది నీ అలికిడి సద్దు లేక
సాన్నిహిత్యానికి సన్నిహితంగా రాలేని
సదరు హృదయాన్ని అడిగిన ఆశల సవ్వడి
వినిపించినా వినలేని మనసుకు అలవడిన
మౌనంలో మూగతనాన్ని అలుసుగా అనుకుని
అందని దూరానికి పోవాలన్న యత్నానికి
లొంగక అడ్డుగా వస్తున్న బంధుత్వాలు
బాధ్యతల బావుటాలు ఎగురవేస్తూ
అందకుండా ఆకాశానికి పోతూ ఉంటే
వాటిని అందుకునే ప్రయత్నంలో
జీవితానికి అర్ధాలు వెదుకుతూ నేను  ఇలా.....!!

నిజం కాని స్వప్నంలో.....!!

నిన్ను విడిచినా నన్ను వీడిపోని
నీ జ్ఞాపకాల కుసుమాల మాలలు
ప్రతి క్షణం నను వేధిస్తూనే ఉన్నాయి
నువ్వెందుకు వదలి పోయావో తెలియక
మరచి పోవాలని అనుకున్న ప్రతిసారీ
మరీ మరీ తలపుల్లో తారాడుతున్నావు
వలపు సంకెళ్ళు వేసి బంధించి వదిలావు
నీ ప్రేమ మత్తుని మరువలేకున్నా ఎందుకో...!!
నీకు తెలిసినా నాకు దూరంగా నువ్వెళ్ళినా
నీ మధుర గురుతుల మమతలు మరచి పోలేని
ఈ జీవితానికి మళ్ళి నీ రాక...
ఎంత బావుంది కదూ ఇలా అనుకోవడం
నిజం కాని స్వప్నంలో అనుక్షణం నీకోసం
ఎదురుచూస్తూనే గడిపేస్తున్నా రాని నీ కోసం...!!

25, జూన్ 2014, బుధవారం

నీ చెలిమి కోసం......!!

మంచుపూల గంధాలు ముసిరిన చీకట్లు
వేకువ పొద్దుని అడ్డుకోలేని రాతిరి అందాలు
తోలి ఝాము సోయగాలు చూసి చూడనట్లు
చూసే చీకటి చీరలో దాగిన తారల వెలుగులు
మరుగున పడిన ముచ్చట్ల జ్ఞాపకాలు తిరిగి
వచ్చిన ఆ క్షణాలు మరువ తరమా...!!
చెలిమి చేసిన తీపి గాయాలు దాచిన
మదిని అడిగిన చెప్పిన మౌన భాష్యాలు
వినగలిగిన మనసుకి అంతులేని అద్భుత
ఆనందపు తీరాన్ని తాకిన స్మృతి కలశాలు
మరు జన్మకు దాచుకునే మధుర సంతకాలు...!!
పగిలిన శకలాలు గుచ్చిన గాయాలు గుర్తుచేస్తున్నా
ముక్కలైన మనసు అద్దాన్ని పోగు చేసి కూర్చినా
కనిపించి కనిపించని తిమిరపు నక్షత్రాల వెలుగులో
రాలేని కన్నీటి సంద్రాల నడుమ దాగిన ఆ భాష్పపు
భాషను అందుకోగలిగే నీ చెలిమి కోసం......!!

24, జూన్ 2014, మంగళవారం

ఎదురుచూపుల నిరీక్షణ....!!

చీకటిలో చిరు దీపపు వెలుగు
చూపించు వేల తారల జిలుగులు
మనసులో నిలచిన చివురంత ఆశ
జీవితపు చివరి అంచుల వరకు
ఆనందాన్ని అందుకోవాలన్న ఆరాటం
మనసు మౌన అలజడిని మార్చుతూ
పయనాన్ని గమనాన్ని గమకాలుగా
జగాన గెలవాలన్న కొండంత కోరిక
నచ్చిన నెచ్చెలి మెచ్చుకోవాలన్న తపన
గుండెల్లో నింపుకున్న అలుపు ఆరాటాన్ని
అందని ఆకాశాన్ని హద్దుగా చేసుకుని
మబ్బులు కమ్మిన మేఘపు వెలుగును
కటిక చీకటిని చీల్చుకుని వచ్చే తుషారాన్ని
తమకంగా తడిమే ఆ మలయసమీరపు
తడిని తాకిన పులకరించిన తనువులోని
మనసు మకరందం అందుకున్న ఆర్తిలోని
అనుబంధపు పోరాటం గెలుపు కోసం
నిరంతరం సమస్యల చిరునవ్వులతో
చెలిమిని పంచుకుంటూ సాగే
సరిగమల సంగతుల సాహిత్య విన్యాసాల
అటు ఇటు ఎటు పడిపోకుండా
క్రమ పద్దతిలో సాగే నృత్య తరంగాల
జీవిత నాటక చదరంగంలో పావులమై
విజయం కోసం నిచ్చెనల ఆసరాతో
ఎదగాలన్న కొండంత ఆశను
నింపుకుని ఎదురుచూపుల నిరీక్షణ....!!

21, జూన్ 2014, శనివారం

కారుమబ్బులు కమ్మినా......!!

ప్రతి చీకటి మేఘానికి స్వతహాగా 
వెండి వెలుగులు అంచులుగా
అద్దిన ఆ సృష్టికర్త....
రేయి పగలు ఒకదానికొకటి
ముడిపడిన చీకటి వెలుగుల
అందాలు చూడమని....
రాతిరి పరదాలు దాటుకుని
కాంతులు చిమ్మే పున్నమి వెన్నెల
పొద్దు పొడుపులో ఉషోదయాన్ని
సందెవేళ సింధూరపు వర్ణాన్ని అందించి
అందని జాబిలి మండే సూరీడు రెండు
మనకు దగ్గర కావని తెలిసినా
కారుమేఘాల చాటున దాగిన
మెరుపుల కాంతిని అడ్డుకోలేని
అసహాయత నేర్పిస్తుంది
అందమైన జీవిత సారాన్ని
అదే కష్ట నష్టాల సమతౌల్యాన్ని
ఆనంద విషాదాల విన్యాసాన్ని
చిక్కని చీకటి అంచుగా చేసుకున్న
వెండి వెలుగుల అంచుల ఆహార్యాన్ని
విజయ సోపానాలకు దారులుగా
గెలుపు బావుటా ఎగురవేయడానికి
ఒంటరి పయనానికి ఆసరాగా....!!
(Every dark cloud has its own silver lining)
ఈ మాటలకు అర్ధాన్ని ఎంత వరకు చెప్పగలిగానో పక్కని చిత్రాన్ని చూసి మీరే చెప్పాలి

20, జూన్ 2014, శుక్రవారం

ఈ అహం ఎలా ఆపేది....??

చెప్పక చెప్పిన గురుతుల గువ్వలు
దాగిన మదిని అడిగి చూడు
జ్ఞాపకాల పూదోటలో రాలిన పువ్వుల
నవ్వులు దోసిళ్ళలో దాచుకున్నా
మేఘాలు రాల్చిన మంచు బిందువులను
హరిత పత్రాలు ముద్దిడిన అందాలు 
కొమ్మల మాటున రాగాలు రాని కోయిలమ్మకు
జల జలా రాలిన పూల రెక్కల సవ్వడిలో
వినిపించిన సరిగమలెన్నో ఆ అలికిడిలో
వాలుతున్న పొద్దులో వర్ణాల అందం
క్షణికమైనా చాలు చూసి తరించే మదికి
చిరునవ్వు చాటుగా దాచిన కధల సాక్షిగా
మిగిలిన మౌన సంద్రాన్ని మాటల ప్రవాహంగా
పరుగులు పెట్టించాలన్న తపనను
అడ్డుకుంటున్న ఈ అహం ఎలా ఆపేది....??

19, జూన్ 2014, గురువారం

కోరికెందుకో నీకు...??

ఎందరికో నచ్చిన ఈ స్వరం
నీకెందుకు వికటంగా అనిపిస్తూ
ఎప్పుడూ జాలువారే చిరునవ్వును
తుంచేయాలని అంత ఆత్రంగా చూస్తావు...??
'సు'స్వరాల సంగతుల వినికిడిలో
పుట్టిన చిట్టి పొట్టి పలుకులను
అపస్వరాల అంపశయ్యలపై
పరుండజేయాలన్న కోరికెందుకో నీకు...??
ప్రతిసారి ఎదురు చూస్తూనే గడిపేస్తున్నా
కొన్ని క్షణాల సంతోషాన్ని నాలో కాకపోయినా
నీ నా అనుకున్న బంధాలలో అయినా
కనిపిస్తుందేమో చూద్దామని చిన్న ఆశ
అది అడియాశే అని నిరూపిస్తూ నిరంతరం
నిన్ను నువ్వు నిరూపించుకుంటున్నావు
మనసు ముక్కలు అతికించినా
అక్కడక్కడా కోస్తూ గుచ్చుకుంటూనే
పగిలిన గాయాల్లో కారిన రుధిరాన్ని
ఎండిన మరకలుగా అలానే ఉంచేసాయి
ఎంత తుడిచినా పోనంటూ గేలి చేస్తున్నాయి
అటూ ఇటూ ఎటూ పోలేని ఈ ప్రాణం
నిస్సహాయంగా తనతో ముడి పడిన
మరికొన్ని జీవాల కోసం జీవశ్చవమై
చూస్తూనే ఉంది ఆశను చంపుకోలేక....!!

18, జూన్ 2014, బుధవారం

వివరాలు తెలుపండి...!!

చనిపోయాక శరీరాన్ని తగలబెట్టడం పూడ్చడం ఇలా కొన్ని మన సంప్రదాయాలు మనతో పాటుగా వస్తున్నాయి...చనిపోయాక శరీరాన్ని దానిలో పనికి వచ్చే భాగాలను ఎవరికైనా ఇచ్చేసి మిగతా దానిలో నేను పడుతున్న ఇబ్బందులకు కారణాలు కనుక్కోగలిగితే మరొకరు ఆ ఇబ్బందితో బాధ పడరు కదా...!! ఇక్కడ దానం చేయడం అనడం కూడా నాకు ఇష్టం లేదు...కొన్ని అంతు చిక్కని వ్యాధులకు మందులు కనిపెట్టడానికి ఇచ్చేయాలని ఉంది....డబ్బులకు అమ్ముడు పోకుండా మంచి రిసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉందో మీకెవరికైనా తెలిస్తే చెప్పరూ....!! ఎప్పుడో  ఒక సారి ఎలాగు చనిపోతాం...చనిపోయాక కూడా ఇలా ఉపయోగపడాలని నా కోరిక...!! అమెరికాలో అయితే మంచి మంచి రిసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి...మన దేశంలో ఎక్కడ ఉన్నాయో వివరాలు తెలుపండి...!!

16, జూన్ 2014, సోమవారం

అనుబంధాలకు వారధులు కండి....!!

ఏవిటోనండి మనం ఎన్నో అనుకుంటూ ఉంటాము కాని కొన్నే జరుగుతాయి కొందరికి...అస్సలు ఏది జరగదు మరి కొందరికి..కొందరికేమో అన్ని అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగి పోతాయి...!! పిల్లలని కనగలం కాని వారి రాతను రాసే అదృష్టం మనకు ఆ విధాత ఇవ్వలేదు...అమ్మాయి అయినా అబ్బాయి అయినా మన పద్దతిలో మనం పెరిగిన వాతావరణానికి అనుగుణంగా పెంచాలి అనుకుంటాము... అలానే మన ఇంటికి వచ్చే కోడలయినా అల్లుడయినా మనలో ఒకరిగా కలసి పోవాలని కోరుకోవడం అత్యాశ కాదు కానీ చాలా తక్కువ మందికి ఆ కోరిక తీరుతుంది అదీ ఈ రోజుల్లో నేను అన్న బంధం ఒక్కటే ఎక్కువగా రాజ్యం ఏలుతోంది....పెద్దవాళ్ళు అది ఎవరైనా అమ్మా నాన్న అయినా అత్తా మామ అయినా వారు మనను ఎలా చూసినా మనం వారిని మనవాళ్ళుగా అనుకుంటే చాలా పెద్ద ప్రాణాలు తెరిపిన పడతాయి.... అది మనం అమెరికాలో ఉన్నా అండమాన్  ఉన్నా ఎప్పటి నుంచో పెనవేసుకున్న ఆ బంధాలను దూరం చేయాలనుకోవడం చాలా పొరపాటు...రేపు మన బిడ్డలు మనకు దూరంగా ఉంటే....ఒక్కసారి ఆ పరిస్థితి ఊహించుకుంటే...మరి అన్ని అనుబంధాలు అలానే కదండీ...దూరంగా ఉన్న బిడ్డలతో మాట్లాడాలని చూడాలని పెద్దలకు కోరిక ఉండటంలో తప్పు లేదు కదా.... చదువుకున్న ఆధునికతను సంతరించుకున్న ఈనాటి మహిళలూ.... మహరాణులు మీ స్వార్ధం కోసం భర్తలను బిడ్డలను అడ్డు పెట్టుకోకండి..అందరూ అని కాదు చాలా మంది ఒంటరి జీవితాలకు తమ వారికి మాత్రమే ప్రాధాన్యతను ఇస్తూ ఎన్నో అందమైన బంధాలను దూరంగా నెడుతూ ఎందరి గుండె చప్పుడులను గుట్టుచప్పుడులుగా మారుస్తూ చెప్పలేని కధల వ్యధలను మీ ఆస్తులుగా చేసుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి....డబ్బు అవసరమే కాని అదే జీవితంగా మార్చుకుంటున్నారు... ఎన్నో ఆప్యాయతలను కోల్పోతున్నారు... మిమ్మల్ని మీరు తరచి చూసుకోండి చాలు....అందమైన ఈ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ అందరి అపురూప ఆనందాల అనుబంధాలకు వారధులు కండి....జగమంత కుటుంబం మనది అనుకోక పోయినా మిధునంలా మిగిలి పోనివ్వకండి.....!!

15, జూన్ 2014, ఆదివారం

మళ్ళి మళ్ళి రాని.....!!

చూశారా అప్పుడే ఎర్ర బస్ ఎక్కి ఓనామాలు రాని భాషతో కుస్తీలు పట్టి వచ్చి రాని ఆంగ్లాన్ని చదవడం రాయడం మొదలు పెట్టి పాతిక ఏళ్ళు అయ్యాయని మా సన్నిహిత మిత్రులు చాలా రోజుల తరువాత కాదు కాదు సంవత్సరాల తరువాత అందరు మాట్లాడితే భలే సంతోషం వేసింది... అర్ధం కాలేదా.... అదే అండి అప్పటి వరకు తెలుగులో చదివి కన్నడ దేశంలో ఇంగ్లీష్ లో ఇంజనీరింగ్ ప్రస్థానం మొదలు పెట్టి పాతిక వసంతాలు (1989-1990) అయ్యింది...ఏమి తెలియని నాకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిన ఈ 25 ఏళ్ళ జీవితంలో ఆ రోజులు ఎప్పటికి మరపురావు....నన్ను బాగా చూసుకున్న అలానే ఏడిపించిన సరదాకే లెండి....ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు....ఈ పల్లెటూరి అమ్మాయి ఎయిర్ బస్ ఎక్కి అమెరికా వెళ్ళడానికి అక్కడ అమెరికాలో కూడా ఎంతో బాగా అభిమానంగా పలకరించి ఆప్యాయతను పంచిన....కొన్ని చేదు  అనుభవాలు మిగిల్చిన ప్రతి ఒక్కరికి నమస్సులు... మొత్తానికి జీవితాన్ని మొత్తంగా చూసిన ఈ 25 ఏళ్ళ కాలంలో ఆ ఇంజనీరింగ్ నాలుగు ఏళ్ళు నా ప్రతి సంతోషానికి ఆనవాళ్ళే...సివిల్ ప్రాక్టికల్స్ లో జామకాయలు కొనుక్కుని సర్ తో తిట్లు తిన్నా... ఎలక్ట్రికల్ లాబ్ లో మెయిన్ వేయమంటే పక్కనే ఉండి కూడా వేయకుండా.....తరువాత పక్కనే ఉన్నావుగా ఎందుకు వేయలేదు అంటే మా అమ్మకు నేను ఒక్కదాన్నే అని చెప్తే కాసేపటికి కాని వాళ్లకు  అర్ధం కాలేదు...కార్పెంటరి ఫిట్టింగ్ లాబ్ లో అష్ట కష్టాలు....మొదటి పరీక్ష రోజు నేను మూడు గంటలు ఇంగ్లీష్ లో రాయగలనా అని అనుకున్న క్షణాలు....రెండో సంవత్సరంలో మొదట్లోనే సార్లకు నా ప్రమేయం లేకుండా తెప్పించిన కోపాలు చెప్పిన క్షమాపణలు తరువాత వాళ్ళే మంచి ఆత్మీయిలు అనుకోండి  వేరే సంగతి....ఇక లాబ్ లలో ఏది ముట్టుకోకుండా చక్కగా రీడింగ్స్ వేసుకుని ముందుగా పెట్టించుకున్న సంతకాలు... కన్నడ వాళ్ళు కూడా ఎంతో బాగా మాట్లాడేవాళ్ళు.... అదేంటో కాని ఎప్పుడు లాబ్ లలో ఒక్కదాన్నే అమ్మాయిని ఉండేదాన్ని మిగిలిన అందరు అబ్బాయిలే .... రేకుల షేడ్ మా క్లాసు రూములు కనీసం అప్పటిలో ఫాన్ లు కూడా ఉండేవి కాదు వాటి కోసం చేసిన బంద్.... ఇక మూడో సంవత్సరంలో సరిగా రాని సర్ లు వచ్చినా చెప్పని వారు... వెళ్ళిన సరదా విహార యాత్ర హంపి...మా సీనియర్స్ కి ఇచ్చిన వీడ్కోలు పార్టీ.. అనుకోకుండా కొన్ని కొన్ని అపార్ధాలు మొత్తానికి అలా అలా గడచి ఆఖరి సంవత్సరంలో వెళ్ళిన టూరు చేసిన అల్లరి లాబ్ లో సార్ అడిగే ప్రశ్నలు సమాధానం చెప్పకుండా పుస్తకం అడ్డు పెట్టుకుని నవ్వుతుంటే నవ్వుతారేంటండి చెప్పండి అని ప్రోగ్రాములు రాయించిన 3 వ సంవత్సరం లోని బద్దకిస్టు సర్...చూసిన సినిమాలు....ఇలా ఎన్నో అన్నింటికన్నా ముఖ్యంగా రాయించుకున్న ఆటోగ్రాఫ్ లు... ఎవరు లేరని మొదలు పెట్టి చెప్పిన సెమినార్ నిండిన రూము వణికిన చేతులు నవ్వేసిన నేను.... తరువాత మామూలే విడి పోవడాలు వీడ్కోలులు రాసుకున్న ఉత్తరాలు చెప్పుకున్న పుట్టినరోజు శుభాకాంక్షలు.... ఇంటి నుంచి తెచ్చిన పంచుకున్న తాయిలాలు ... ఇలా ఎన్నో ఎన్నెన్నో అనుభూతుల ఆనందాల అందాలు అనుభవించిన ఆ రోజులు మళ్ళి మళ్ళి రాని మధురానుభూతులు.....!!

ఈ పయనం ఎక్కడికో....!!

నడిపించిన నాన్న పెంచిన ఆ క్షణాలు
నే వదలివేసిన అక్షరాల అనుభవాలు
అన్ని కలిపిన జీవిత నిత్య సత్యాలు
మలచిన మౌన సంతకాల సాక్ష్యాలు
సు'దూర'మైన ఆవలి తీరం చేరాలని
లోనికి లాగే సుడిగుండాలను తట్టుకుంటూ
తరలి పోతున్నా ఏదో ఒక పెనుగాలి హోరు
చుట్టుకుంటూ ఎప్పుడు వెంటపడుతూనే
పెను తుఫానుల మధ్యన నలుగుతూ
గమ్యం తెలిసినా చేరలేని చెంత లేని
తెలిసి తెలియని ఈ పయనం ఎక్కడికో....!!
అమ్మా నాన్నలకు ఒక రోజంటూ కేటాయించి మన బాధ్యతను సరిపెట్టుకుంటున్న అందరికి .... సరిపుచ్చుకుంటున్న అమృతమూర్తులు నాన్నలకు శుభాకాంక్షలు

14, జూన్ 2014, శనివారం

ఏమి చేయలేక......!!

వెతల సొదలు రణగొణ ధ్వనులుగా
కలయో కలత నిదురో తెలియని
ఇన్నేళ్ళ సాంగత్య సహవాసంలో
దగ్గర కాలేని దూరం దగ్గరగానే ఉంటూ
తప్పెవరిదో తెలియని అయోమయంలో
రోజులు గడచి పోతూనే ఉన్నాయి..... 
మన మధ్యన సాన్నిహిత్యాన్ని పెంచలేక
బంధాన్ని తుంచలేక అలానే సాగిపోతూ
అతి సాధారణంగా అందరికి అగుపిస్తూ
అనుబంధపు తెరల అడ్డుగోడలు గట్టిపడుతు
ఎవరిని ఎవరం మోసం చేస్తున్నామో తెలిసినా
ఏమి చేయలేక కాలం సాగిపోతోంది నీకేం పట్టని
ఆత్మీయత దాని కోసం వెంపర్లాడే ఈ పిచ్చి
మదిని దాటని మధువు కోసం ఎదురుచూసే
నన్ను చూసి ఏమి చేయలేక నవ్వుకుంటూ
అందరి కధలను మోస్తున్నట్టే మన కతను
బరువుగా అనిపించినా తప్పని భారాన్ని
భరిస్తూ ఎప్పటిలానే సాగిపోతోంది మాములుగా....!!

9, జూన్ 2014, సోమవారం

అమ్మాయిలోని అమ్మను మరచిన.....!!

అర్ధ నారీశ్వర తత్వంలోని అర్ధంలో
అర్ధ భాగాన్ని అర్ధం చేసుకున్నామన్న
అహంలో ఈనాటి తరం అమ్మాయిలు
నేను నా అన్న బంధాలను మాత్రమే
అదీ ఆర్ధిక అనుబంధాలుగా చేసుకుని
అసలు అనుబంధపు ఆనందానికి
సుదూరంగా వెళిపొతున్నామని
తెలియని మత్తులో ఆధునికత
మాయలో మునిగి తేలుతూ
ఆప్యాయతలకు అర్ధం వ్యర్ధమని
ఆర్ధిక సంబదాల అనుబంధం ఆసరాగా
మనము ఒకింటి అమ్మాయిలమని
మరచిపోయి అనురాగాలను కాలదన్నుకునే
ఈనాటి ఎందరో నాతులు నేతులలో
తేలుతున్నామని భ్రమలో అర్ధభాగాన్నే
కాలదన్నుతూ విద్య నేర్పిన వివేకానికి
వన్నెను చీకటి పరదాలుగా చేస్తూ
ఎందరో ఆత్మానుబందాలను బాధిస్తూ
అనంత దూరం చేస్తూ అమ్మాయిలోని
అమ్మను మరచిన అగత్యం విజ్ఞతనే
సవాలుచేస్తూ పక పకా నవ్వుతోంది......!!

8, జూన్ 2014, ఆదివారం

ఏకాంతంలో నాకు నేనుగా....!!

నమ్మక తప్పని నిజమైనా
శోధన తప్పని వేదననైనా
బతకక తప్పని జీవితమైనా
ఒంటరి పయనం తప్పని దారైనా
అన్ని ఉన్నా ఏది నాది కాకున్నా
ఎందరున్నా ఎవరు లేకున్నా
విధి రాతకు ఎదురీదాలన్నా
మది సంగతి మరపుకు రాకున్నా
మనసు గతి మార్చుకోలేకున్నా
మంచు శిలగా మారాలనుకున్నా
కఠిన శిలగా కరకు రాతిగా కనిపించినా
మండుతున్న అగ్ని కణమైనా
చల్లారే సమయం కోసం ఎదురు చూసే
క్షణాల ఆరాటాల ఈ రాలిపోతున్న
రాతి కణం ఎక్కడో రాలి పోతున్నదన్న
నిజాల అంతరంగం చల్లారే సమయం
ఈ జన్మకు లేదని తెలిసినా తప్పని

బంధాల మధ్యన నలుగుతున్న
మధ్య తరగతి మనసుని మార్చలేకున్నా
తెంచుకోలేని మమతలను తుంచుకోలేకున్నా
అందుకేనేమో ఇలా మిగిలిపోయాను
ఎందుకో నా ఈ ఎదురుచూపుల

ఏకాంతంలో నాకు నేనుగా ఇష్టంగా....!!

7, జూన్ 2014, శనివారం

నా మది సవ్వడి....!!

ఎందరున్నా ఎవరులేని ఏకాంతానికి
అతిధిగా వచ్చిన నువ్వెవరు....??
ముక్కలైన మనసు అద్దంలో కనిపించే
ఎన్నో ప్రతిబింబాల గురుతుల గమనాలు
వెంబడిస్తూనే ఉన్నాయి పారిపోదామన్న
నా ప్రయత్నానికి అడ్డు తగులుతూ...
గుచ్చుకున్న గాయాలను మాన్పడానికి
చేస్తున్న ప్రతి యత్నము బెడిసికొడుతూనే
మళ్ళి మళ్ళి ఏడిపిస్తోంది నన్ను వెక్కిరిస్తూ....
అలా అయిన ప్రతి సారి నాలో ఏదో తెగింపు
గెలవాలన్న ఆరాటం నాకు ధైర్యానిస్తూ...
జారుతున్న ప్రతి కన్నీటి బొట్టుని కదిలిస్తే
చెప్పే కధల కావ్యాలను వినిపించడానికి
నీతో పంచుకోవడానికి నా స్వార్ధం కోసం
అనుకోని అతిధిగా ఆహ్వానించినా....
స్వీకరించిన నాలోని నీకు నా మది సవ్వడి
పదే పదే వినిపించనక్కరలేదేమో కదా....!!

5, జూన్ 2014, గురువారం

పుట్టినరోజు శుభాకాంక్షలతో......!!

  అన్ని ఆరులతో కలసి ఆదివారం అమ్మమ్మకు తాతయ్యలకు సాంబశివుని వరంగా పుట్టిన సామ్రాజ్యం
నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మాకంటూ అన్ని నువ్వే అయినా అమ్మను నేను అయినా అమ్మకు అర్ధాన్ని చెప్పలేని నేను మాతోపాటు మా  పిల్లల్లు అందరు రేపటి నీ అరవై వసంతంలోనికి అడుగుపెట్టే యాభై తొమ్మిదో పుట్టినరోజు బాగా చేయాలని అనుకున్నా కుదరని ఈసారి ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలతో సరిపెడుతున్నాము.....
                                        మా అందరి ప్రేమ నీకే అమ్మా.....
                                            ఇంట్లో అందరూ

4, జూన్ 2014, బుధవారం

సాగర సంగమం....!!

కెరటాలకు ఆరాటం తీరం చేరాలని
కలలకు ఉబలాటం నిను చూడాలని
కనులకు నయనానందం నీ దర్శనం 
ఎగసిపడే అలల తాకిడికి మనసు చేసే
మమతల సందడి నిను చూసిన తరుణాన
స్వచ్చమైన తీరపు తిమిరాన్ని నా మది
అంతరగంగా నీకు చూపాలని తపనపడే
ఉవ్వెత్తున ఎగసిపడే తరంగాల తాకిడే తీరపు ఒడ్డున
ఈ కల్లోల సంద్రాన్ని కాస్త లోపలికి చూడరాదు....
ప్రశాంతంగా హాయిగా కనిపించాలని ప్రయత్నిస్తూ
అప్పుడప్పుడు ఉప్పెనలా తన్నుకు వచ్చే ఆవేశాన్ని
అధిగమించాలని పడి లేచే అలల పోరాటాన్ని అనుసరిస్తూ
జీవిత తీరపు ఒడ్డుని స్వచ్చంగా ఉంచాలని
సాగర సంగమపు కలయికను అందంగా చూపాలని
అస్తమించే భానుని వదులుతూ చంద్రోదయపు
వెన్నెలలో పరవశిస్తూ ఆర్తిగా ఆదరించే
నీ పిలుపు వినిపించే తరుణం కోసం
రేయి పగలు ఎదురుచూసే ఈ పిచ్చి
అనుబంధం నీకు ఈ జన్మకు అర్ధం కాదేమో....!!

2, జూన్ 2014, సోమవారం

ఆ హాలాహల అమృతం ముందు...!!

అనుక్షణం జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం
ఎందుకోమత్తుగా గమ్మత్తుగా మధుపానం
సేవించిన ఆనందం కన్నా ఇంత బావుంటే
అందరూ నీ వెంట పడతారెందుకో చూడాలని
ఒక్కసారి ప్రయత్నిద్దామని అనుకున్నా కానీ.....
చేదుగా ఉండే ఆ అనుభూతిలో తీయదనం
ఎలా ఉంటుందోనని ఆ చేదు నిజంలో ఏముందోనని
తాగితే మరచిపోయే నిజాలను తెలుసుకుందామని
అనుకుంటూ మనసుని పున్నమి వెన్నెలలా
పరచే ఆ మద్యపు నిషాలో.....
మరచిపోలేని మనసు సంఘర్షణ ఎదురుగా
ఆవిష్కరించిన అనుభవాలను తరచి చూసిన
ఎన్నో మానసిక మౌనాల మది తలపుల తలుపులు
తెరచే మధు పాత్రకు దేవదానవులే దాసులు కాగా
సామాన్యులం మనం ఎంత ఆ హాలాహల అమృతం ముందు...!!
( ఆలీ గారు మీ అంత బాగా రాయలేక పోయినా ప్రయత్నించాను .... నా మీద ఉన్న నమ్మకానికి కృతజ్ఞతలు )

1, జూన్ 2014, ఆదివారం

అతి మామూలు మనిషిని....!!

నేను రాసిన యోగం కవిత గురించి మా పెదనాన్న గారు అన్న ఒక్క మాట చాలు ఈ జీవితానికి అనిపించింది...
ఆయనను గమ్యం...యోగం గురించి అడిగాను అంతకు ముందే రెండు రాశాను నావి సరి అయినవో కాదో తెలుసుకోవడానికి మా పాపత్తను నాన్నను అడిగాను నాకు పూర్తిగా నచ్చిన సమాధానం దొరకలేదు... నాకు అనిపించిన భావాలను రాశాను రెండు కవితలుగా... గమ్యం గురించి పెదనాన్న చదివి చాలా లోతైన అర్ధాన్ని నా కవిత నుంచి చెప్పారు.... నాకే ఆశ్చర్యం వేసింది.... వృత్తి పరంగా ఆయన మంచి పేరున్న వైద్యులు మా ఊరు చుట్టుపక్కల యనమదల రాధాకృష్ణ గారు అంటే తెలియని వారు ఉండరు... ఆరోగ్య కారణాల వల్ల వైద్యం  ఇప్పుడు మానివేసి ... హోమియో వైద్యం చేస్తూ ఉన్నారు...ఇక నా రాతల విషయానికి వస్తే యోగం గురించి అప్పుడు చూపించలేదు పోటికి  కదా అని. పోటిలో తీసుకోవద్దని చెప్పాను కాని చూపించలేదు... తరువాత ఫోన్ చేసి చదివి వినిపించాను ఆయన నోటినుంచి అభినందనలు అన్న మాట నిజంగా నాకు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో చెప్పాలంటే నా గమ్యాన్ని చేరినంత ..... అదే పరమానందం అన్న ఆత్మ తృప్తి. పెదనాన్నను అందరిని అడిగేటప్పటికే నాకు అనిపించిన భావాలు రాసేసాను... మనలో ఎవరికీ లేదు గురువులు కూడా ఇంత వివరంగా చెప్పలేరు నీకు ఎలా వచ్చింది అని అడిగారు. నావి రెండు కవితలు రెండు కబుర్లు మాత్రమే చదివారు... వాటిలోనే తెలిసిపోతోంది నువ్వేమిటో అప్పుడప్పుడు చదివి వినిపిస్తూ ఉండు తల్లీ అని చెప్పారు.... మొన్న సోమవారం పాడుతా తీయగా చూడలేదు ఈ రోజు చూశాను... వచ్చిన అతిధి బాలు గారి పక్కన కూర్చుని ఎంత ఆనందం పొందారో ఆ అనుభూతిని నేను మా పెదనాన్న మాటల్లో అనుభవించాను.... నాకు కూడా చాలా కోరిక ఎప్పటికైనా పాడుతా తీయగాలో బాలు గారి పక్కన కూర్చోవాలని... ఆ కోరిక నాకు తీరుతుందో లేదో తెలియదు కానీ ఆ ఆనందాన్ని నా మనసు అనుభవించింది ఈ రోజు.... ఈ సంఘటన జరిగి  నాలుగు ఐదు రోజులు అయినా అతిధి చెప్పిన మాటల్లో అనుభూతిని నేను అలానే ఆస్వాదించాను అని అనిపించి ఇలా మీతో పంచుకుంటున్నాను అంతేకాని ఏదో పెద్ద కవిని కాదు... మనసుకు ఏది అనిపిస్తే అది ఇలా అక్షరాల్లో పెడుతూ సంతోషపడే అతి మామూలు మనిషిని....!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner