30, ఏప్రిల్ 2020, గురువారం
అక్షరాలు..!!
అల్లరి చేసే వయసులో
ఆకతాయితనంగా మారాము చేస్తూ
బలవంతంగా నేర్చిన అఆలు
మెలికలు తిరిగే
ఒంపుల సొగసులు చేతికి చిక్కక
దెబ్బలు తిన్న వైనాలు
కూడబలుక్కుంటూ పలక మీద దిద్దిన
ఓనామాల జతలతో
గుణింతాలు నేర్చిన గుర్తులు
అమ్మ ఆవు ఇల్లు ఈగంటూ
పుస్తకాల్లో బొమ్మలు చూస్తూ
పదాల పదనిసలతో పాట్లు పసితనంలో
అక్కరకు రాని అనుబంధాలను మరువలేక
మనసు గాయాలకు లేపనాలద్దే
వైద్యమెరిగిన ధన్వంతరి
రక్త సంబంధాలకన్నా మిన్నగా
ప్రాణాధారమైన జీవనాడుల
ఉనికికి ఆలంబనీ అక్షరమాల
ఒంటరన్న భావన కలుగనీయక
ఆర్తిగా అక్కున చేర్చుకునే
అమృత హృదయమీ అక్షరాలమ్మది
బాధలో ఓదార్పునిస్తూ
గమనంలో గమ్యాన్ని సూచిస్తూ
ఓటమిలో గెలుపును పరిచయం చేసేదీ అక్షరాలే
నేనంటూ రేపు లేకున్నా
నన్ను నన్నుగా మిగిల్చేదీ
నాకంటూ మిగిలేదీ అక్షరధనమే
అక్షరాల అలికిడిలోనే
బతుకును వెదుక్కునే
ఆత్మానుబంధమీనాడు పెనవేసుకుందిలా...!!
వర్గము
కవితలు
సమర్థించు...తప్పేం లేదు....!!
పుట్టినప్పటి నుండి పలికే భాషే సరిగా రాదిప్పటికీ. మరో భాష లేదూ మన భాషలోకి అనువదించి సహజీవనాలు, కలిసి నడవడాలు సమర్థించుకోవడం, లేదా ఆ మాటలకు మన వత్తాసు తెల్పడంతో మన పనైపోదబ్బా. మనుషులన్నాక రోగాలు రాకుండా ఉంటాయా, వాటికి మందులు కనిపెట్టకుండా ఉంటారా.. ఇయ్యాల కాకపోతే రేపు కనుపెడతారు. కానబ్బాయ్ అప్పటి వరకు బతికుండాలంటే ఏం చేయాలంటా? ఇది సగటు సామాన్యుడి ప్రశ్న.
సీత చర్చికెళ్ళింది. రాముడు చర్చి బయటున్నాడు. ఇలాంటి రాతల్ని సమర్థించిన మహాత్ములకు సహజీవనం పెద్ద తప్పేం కాదు. రోగం వస్తుందని తెలిసి దాని కట్టడికి చర్యలు తీసుకోకుండా, అందరికి వస్తుంది, పోతుంది, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అంటుంటే, మీ తానతందాన భలే ఉంది..మెుత్తానికి ఈ సమర్థింపుల వెనుక మర్మమేమిటో? రోగ తీవ్రతను అర్థం చేసుకున్న మీ మేతావి వర్గానికి సాష్టాంగ ప్రణామాలు.
వ్యక్తిని సమర్థించు. తప్పు లేదు. అసమర్థతను వెనుకేసుకు వస్తే అది ఏమిటో మీకే తెలియాలి. ఉపదేశాలదేం ఉంది.. ఈవరనుండి బోలెడు చెప్పుకుంటాం. మనవేవన్నా పాటించాలా ఏంది? సరే మీ మాట మీదే కరోనాతో కలిసి బతికేద్దాం...ఏటంటారు...?
వర్గము
కబుర్లు
29, ఏప్రిల్ 2020, బుధవారం
ఏక్ తారలు..!!
1. కలతలతో పొడిబారిన మనసు_కన్నీళ్ళన్ని కనులకిచ్చేస్తూ..!!
2. సరిపెట్టుకోవాలనే లలాట లిఖితమిది_ఊరడింపులకు తలొగ్గని కాలంతో..!!
3. కదం తొక్కే అక్షరాలవి_కలమైనా కాలమైనా దాసోహమనాల్సిందే...!!
4. ఆ అక్షరాలు గరళాన్ని దాచేస్తాయంతే_గుంభనంగా నవ్వేస్తూ...!!
5. సారమెరిన కలమనుకుంటా_అగ్నిశిఖల వంటి అక్షరాలను చల్లబరుస్తూ...!!
6. చీకటంతా చెదిరిపోతుంది_వెన్నెల వచ్చి వాలుతుంటే..!!
7. కాలం విలువలు చెప్పాల్సిన సమాధానమిది_మారుతున్న బాంధవ్యాల అర్థాలను...!!
8. మమ అంటూ ముగించేసాం యాగాన్ని_ప్రాణాలతో చెలగాటమే ఇక..!!
9. బ్రతిమాలినా బామాలినా కాలమంతే_కదిలిపోతుంది తనకేమీ పట్టనట్టుగా..!!
10. అద్భుతమే అక్షరాలు_భవబంధాలను భావాల్లో చూపెడుతూ..!!
11. అనుకోని ప్రయాణమిది_తెలియని గమ్యానికై వెతుకుతూ...!!
12. చెలిమిని వీడలేనంటోంది మనసు_అహం అడ్డుగోడగా నిలిచినా...!!
13. సుమం సౌకుమార్యం మనమెరగాలి_ఆటుపోట్లకు అల్లాడకుండా చూసే బాధ్యతతో...!!
14. వేదనలన్నింటికీ ఊరటే_నినదించే నివేదన వినిపించినప్పుడు..!!
15. మాటల ఆప్యాయతలా లాక్కువస్తుంది_బాధలో ఓదార్పునిస్తూ...!!
16. భారం భావమౌతుంది_అక్షరాల్లో ఆత్మీయత దొరుకుతుంటే...!!
17. బంధం అక్షరాల్లో చేరింది_అందరిని అలరిస్తూ..!!
18. వాస్తవం వందనంగా ఉంది_అక్షరానుబంధానికి జేజేలంటూ...!!
19. హద్దు దాటనంత వరకు అన్నీ ముద్దే_అది అక్షరమైనా అహంకారమైనా...!!
20. అరుదుగా కనిపిస్తుంటాను_అవసరం నాదైనప్పుడు..!!
21. క్షణాలన్నీ అక్షరాలతోనే_నాతో నేనున్నప్పుడంతా..!!
22. నికరమైనదే అక్షరం_కాలాన్ని జ్ఞాపకంగా పదిలపరుస్తూ...!!
23. వెదుకుతూనే ఉంటాను_రాలిపడిన క్షణాల్లో జారిపోయావేమెానని..!!
24. మాయతనమే మరి_కనబడినా కనబడకున్నా గుర్తుండిపోతూ..!!
25. తత్వమేదైనా తమెాగుణముంటే చాలు_మనిషితనానికి ఆభరణమే..!!
26. అసలు రంగులు తెలిసిపోయాయి_అయినవారెవరో కానివారెవరో ఎరుకై..!!
27. నలుగురితో నడవక తప్పదు_నైజం తెలిసినా..!!
28. ఓటమికి విజయాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాయి_ఓరిమితో అక్షరాలు..!!
29. నా గెలుపులో నీ భాగమూ ఉంది_మంజువాణి మానసాక్షరాలుగా...!!
30. అమ్మతనం శిక్ష అనుభవిస్తోంది_దైవమిచ్చే తీర్పులకు..!!
వర్గము
ఏక్ తార
27, ఏప్రిల్ 2020, సోమవారం
మౌర్యకు...
మాట సున్నితం
మనసు నవనీతం
కాకపోతే
కాస్త కోపం
కాస్త చిరాకు
చూడటానికి
సుకుమారంగా ఉంటాడు
గొడవకు వెళ్ళాడంటే
హడలే
చురుకైన చిన్నోడు
తెగువకు మారుపేరు...
మౌర్యకు
పుట్టినరోజు శుభకామనలు
ప్రేమతో
ఇంట్లో అందరూ...
వర్గము
శుభాకాంక్షలు
25, ఏప్రిల్ 2020, శనివారం
భూతల స్వర్గమేనా...పార్ట్ 7..!!
థాంక్స్ గివింగ్ కి అన్నయ్యా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు వదిన అడిగింది జమ్ షో లో నువ్వేం కొనలేదా అని. నాకన్నీ పిచ్చి పూసలులా అనిపించాయి, నేనేం కొనలేదని చెప్పాను. అలాగే అనిపిస్తాయి, జాగ్రత్తగా చూసి తీసుకోవాలి, జమ్ షో లోనే తక్కువకి వస్తాయని చెప్పింది. ఇంతకి జమ్ షో లో ఏముంటాయంటే రకరకాలు పూసలు, ఆ పూసలతో చుట్టిన గొలుసులు, 10 కారట్, 18 కారట్ గోల్డ్ ఆర్నమెంట్స్(నగలు) ఉంటాయన్న మాట. పూసలంటే పచ్చలు, కెంపులు, ముత్యాలు, నీలం, పగడం ఇలా నవరత్నాలన్నింటితో పాటుగా, రకరకాలైన రంగురంగుల ముత్యాలు, నల్లపూసలు, గాజులు, రింగ్స్ ఇలా అన్ని రకాలు ఉంటాయి. మనకు తిరునాళ్ళలో కొట్లు ఉన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ కూడా మెాసాలు జరుగుతాయి. బేరాలు ఆడి, జాగ్రత్తగా చూసి తీసుకోవాలి.
అమెరికాలో థాంక్స్ గివింగ్ పండుగకు ఫ్రెండ్స్, చుట్టాలు అందరు కలిసి ఎవరో ఒకరింటిలో కలుస్తారు. తలా ఓ వంటకం చేసుకు వస్తారు వీలైనంత వరకు. టర్కీ అని పెద్ద కోడి, దీనిని ఓవెన్ లో బేక్ చేసి అది కట్ చేయడంతో పండగ మెుదలవుతుంది. మనకు సంక్రాంతి పండగలా అన్నమాట.
థాంక్స్ గివింగ్ తర్వాత మళ్ళీ గెస్ట్ హౌస్ కి వచ్చేసాను. హైదరాబాదు మహారాణి గారు నన్ను యుదేచ్ఛగా ఏలేసుకుంటున్నారు. నేనేం మాట్లాడకుండా నా పని నేను చేసుకుంటున్నా. శిరీష అప్పుడప్పుడు వచ్చి వెళుతోంది. తను వచ్చినప్పుడే నాకు కాస్తంత సంతోషం. నా ఫ్రెండ్స్ ఉమలు ఇద్దరు, సతీష్.. మేడంగారు దయతలచి ఫోన్ ఇచ్చినప్పుడు పలకరిస్తూనే ఉంటూ, నాకవసరమైన పని.. ఇంటికి ఫోన్ చేసే కాలింగ్ కార్డ్స్ పంపిస్తున్నారు.
ఓ రోజు ఎందుకో బాగా ఏడుపు వచ్చేసింది ఈవిడ టార్చర్ భరించలేక. వెంటనే అన్నయ్యకు ఫోన్ చేసి ఏడ్చేసాను. అమ్మాయ్ నేను వస్తున్నా, నువ్వు బాధపడకు అంటూ... వెంటనే అన్నయ్య వచ్చేసాడు. ఆ టైమ్ లో రాణిగారు బయటకు వెళ్ళారు. అంతకు ముందు కూడా పారాడైమ్ మార్కెటింగ్ వాళ్ళకి ఈవిడ సంగతి చెప్పాను, కాని వాళ్ళు పట్టించుకోలేదు. నేను వెళుతూ ఫోన్ చేసి నా దగ్గర కీస్ లేవు. నేను అన్నయ్యతో వెళిపోతున్నాను, మీరు రండి అని చెప్పాను. మేము బయలుదేరే వరకు కూడా ఈవిడ కాని, వాళ్ళు కాని రాలేదు. హాల్ లో ఓ పక్క అంతా గ్లాస్ లే ఉండి వాటికి బ్లైండ్స్ ఉండేవి. మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి, నేను ఈ గ్లాసెస్ ఓపెన్ వైపు నుండి వెళుతున్నాను. వచ్చి చూసుకోండి అని చెప్పి గ్లాసెస్ దగ్గరకు వేసి మేము బయలుదేరాము. అన్నయ్య మాట్లాడుతూ... అమ్మాయ్ నీకు అలవాటు అవుతుందని, నువ్వు ఉంటానన్నావని ఇక్కడ ఉంచాను. నాకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్తాను నీ జాబ్ గురించి. నువ్వు ఇంట్లోనే ఉండి ఇంటర్వూలు అటెండ్ అవ్వు అని చెప్పాడు. మళ్ళీ సుమీ రూమ్ లో నా పడక. చదువుకోవడం, ఈ మెయిల్స్ చూసుకోవడమే అప్పట్లో పని. నేను గెస్ట్ హౌస్ నుండి వచ్చిన మరుసటి రోజు పారాడైమ్ ఇన్ఫోటెక్ CEO శ్రీధర్ గారు ఫోన్ చేసి ఎందుకలా చెప్పకుండా వెళిపోయారంటే.. విషయం మెుత్తం ఆయనకు చెప్పాను. సరేనండి మీరు అక్కడి నుండే ప్రిపేర్ అవ్వండి, మార్కెటింగ్ చేస్తామని చెప్పారు.
నేను హైదరాబాదు హాస్టల్ లో ఉన్నప్పటి నా ఫ్రెండ్ వినీత న్యూజెర్సీ లో ఉండేవారు. నన్ను చూడటానికి తను, వాళ్ళాయన వచ్చారోరోజు. వీకెండ్ వస్తే వదిన వర్జీనియాలోని శివ విష్ణు టెంపుల్ లో ఫ్రీ సర్వీస్ చేసేవారు. అప్పుడప్పుడూ నన్ను తీసుకువెళుతుండేది. వీళ్ళే దోశలు, ఇడ్లీ ,ఇతర వంటలు చేసి అక్కడ గుడిలో ఇచ్చి ఆ వచ్చిన డబ్బులు దేవుడికి ఇచ్చేసేవారు. అలాగే ఎవరింట్లోనైనా పూజ ఉండే చక్కగా అందరు తలోచెయ్యి వేసి ఆ కార్యక్రమం జయప్రదం చేసేవారు. ఇంతలో నా ఇంజనీరింగ్ క్లాస్మేట్ రాజు ఫోన్ చేసి వేరే కంపెనీతో మాట్లాడాను, నువ్వు చికాగో వెళ్ళు, వాళ్ళు పీపుల్ సాఫ్ట్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లో ప్లేస్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేస్తారు మాట్లాడి చూడు అని చెప్పాడు.
వినయ్ గుమ్మడి గారు ఫోన్ చేసి వివరాలు చెప్పారు. మీ H1B కూడా మేము మా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాము, మీకేం ఇబ్బంది లేకుండా చూసుకుంటాము అని ట్రైనింగ్ క్లాసులు మెుదలవుతాయి. టికెట్ బుక్ చేస్తాము వచ్చేయండి అంటే సరేనని అన్నయ్యకు విషయం చెప్పాను. తర్వాత కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు ఇండియాలో చనిపోవడము, తను ఆ టైమ్ లో ఇండియా వెళ్ళలేక వర్జీనియాలోనే దశదినకర్మ చేయాలనుకోవడము జరిగిపోయింది. తెలిసిన ఫ్రెండ్స్ కి భోజనాలు ఏర్పాటు చేసాడు పదోరోజు. నాకు ఫోన్ చేసి 2 రోజులు వాళ్ళంట్లో ఉండమని, ఇద్దరూ అన్నయ్య వాళ్ళింటికి వచ్చి,అన్నయ్య పెంచిన పెద్ద కరివేపాకు మెుక్క నుండి కరివేపాకు తీసుకుని మళ్ళీ వాళ్ళింటికి నన్ను తీసుకువెళ్ళారు. కార్యక్రమం అయిపోయాక మరుసటి రోజు షాపింగ్ కి తీసుకువెళ్ళి, నువ్వు వెళ్ళేది చికాగో, బాగా చల్లగా ఉంటుందని 20 డాలర్లు పెట్టి కంఫర్టర్ ఎంత వద్దంటున్నా వినక కొనిపెట్టారు.
నా ప్రయాణం దగ్గర పడేసరికి అన్నయ్య వాళ్ళ పిల్లలు సుమి, కృష్ణ ఇంట్లోనే ఉన్నారు.
వాళ్ళు చీజ్ తో ఏదైనా చేసుకుంటే నాకా వాసన పడేది కాదు. ఏంటన్నయ్యా ఉప్పుచేప కాల్చిన వాసన అంటే అన్నయ్య నవ్వి, నీకు అలవాటు అవుతుందిలే అది చీజ్ వాసన అనేవాడు.
సుమి షాపింగ్ కి వెళుతుంటే అన్నయ్య నన్ను కూడా తీసుకువెళ్ళి, ఏం కావాలో కొనిపెట్టమని చెప్పాడు. సుమితో షాపింగ్ కి వెళ్ళి ఓ చిన్న మఫ్లర్, చేతులకు గ్లౌజస్ ఇంకా కొన్ని అన్నీ కలిపి ఓ 50 డాలర్ల షాపింగ్ చేసా. అంతకు ముందు అన్నయ్య కొన్ని షాప్ లు చూపించి ఇంటికి కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయని వివరాలు చెప్పాడు. వదిన కూడా బట్టల షాపింగ్ కి తీసుకువెళ్ళింది.
ఇక్కడ ఓ చిన్న సంఘటన చెప్పాలి. సుమితో షాపింగ్ కి వెళ్ళినప్పుడు ఎస్కలేటర్ ఎక్కాల్సి వచ్చింది. మనకేమెా అదంటే కాస్త భయమప్పుడు. అప్పుడప్పుడే కదా కాస్త అలవాటు పడుతున్నా. అతి జాగ్రత్తగా, భయంగా ఎక్కి దిగుతుంటే సుమి నవ్వేసింది. మనం చేసింది మన్మధుడు సినిమాలో బ్రహ్మానందం టైపులోనన్న మాట. ఈ సినిమా ఈ మధ్యనే వచ్చిందిలెండి. ఎస్కలేటర్ చూసినప్పుడల్లా ఇప్పటికి నవ్వుకుంటా అప్పటి నా భయాన్ని తల్చుకుని.
నా ప్రయాణం రోజు పిల్లలు ఇద్దరూ వచ్చి ఫ్లైట్ ఎక్కించారు. ఎలా అంటే పర్మిషన్ తీసుకుని ఫ్లైట్ గేట్ వరకు వచ్చి సెండాఫ్ చెప్పారు నవ్వుతూ. అలా అమెరికాలో మెుదటి విమాన ప్రయాణం చికాగోకి...
మళ్ళీ కలుద్దాం..
వర్గము
ప్రయాణం
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగ అన్వేషణ లో... అక్కడ ఎన్ని కష్టాలో ఉద్యోగం కోసం... జెమ్ షో అంటే ఏమిటి?
నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంంధ్రాప్రవాసి డాట్ కాం వారికి, రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగ అన్వేషణ లో... అక్కడ ఎన్ని కష్టాలో ఉద్యోగం కోసం... జెమ్ షో అంటే ఏమిటి?
ఆంద్ర ఆడపడుచు అమెరికాలో ఉద్యోగ అన్వేషణ లో... అక్కడ ఎన్ని కష్టాలో ఉద్యోగం కోసం... జెమ్ షో అంటే ఏమిటి?
24, ఏప్రిల్ 2020, శుక్రవారం
ఓ మాటినండి..!!
అయినదానికి కానిదానికి మనోభావాలు దెబ్బదినడం అన్న మాట బాగా వాడేసి పొద్దు పొద్దున్నే చరిత్రకెక్కేద్దాం అనుకుంటే చరిత్ర సంగతి దేవుడెరుగు మనం గల్లంతైపోడం ఖాయమబ్బా... జ్వరం వచ్చింది అంటాం..కాని జ్వరం వచ్చాడు అనం కదా...భాష, భవిత, భావం వగైరా చూడాలి కాని స్త్రీలింగమా, పుంలింగమా, నపుంసక లింగమా అంటూ చూస్తే...?
మతాలను అవహేళన చేసినప్పుడు, హత్యా రాజకీయాలు జరిగినప్పుడు, సామాజిక అన్యాయాలు జరిగినప్పుడు మాత్రం మనం స్పందించం...జంతువులను కూడా వచ్చింది, పోయింది అనే కదా వ్యవహరిస్తాం..అలా అని స్త్రీని జంతువుతో పోల్చినట్టా..! పనికిమాలిన రాజకీయాలు మాని పనికివచ్చే పని సూడండి అమ్మలు, అయ్యలు...ఓ తెగ సించేసుకుంటున్నారు..!!
వర్గము
కబుర్లు
20, ఏప్రిల్ 2020, సోమవారం
వెలుగుల వ్యవస్థకు నీరాజనం..!!
ఈనాడు మనందరం ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా, మన ఉనికిని కాపాడుకోవాలన్నా, ప్రతి ఒక్కరికి అవసరమైనది విద్యుత్...అదేనండి కరంట్. కరంట్ లేనిదే ఏ వ్యవస్థా నిరంతరాయంగా పని చేయలేదు. మన జీవితాల్లో చీకటిని చెరిపేస్తూ, విద్యుత్ అంతరాయాలు రాకుండా మన కోసం ప్రతిక్షణం శ్రమిస్తున్న విద్యుత్ వ్యవస్థ సిబ్బందికి అక్షర నీరాజనం...!!
వెలుగుల వ్యవస్థకు నీరాజనం..!!
కాలం విసిరిన రక్కసి
కరోనా విషపు కోరల్లో
అల్లకల్లోలమైన జన జీవితాలు
పరిశుభ్రత పాటించాలంటూ
టీకాల పరిశోధనలంటూ
పరుగులెత్తుతున్న ప్రమధగణాలు
రోగులకు సేవలందిచే వైద్యుల
పహారా కాసే రక్షకభటుల
పారిశుద్ధ్య శ్రామికుల సేవలు మరువలేనివి
ఇంటికే పరిమితమైన మన బతుకులకు
నిత్యావసరమైన వస్తువు
ప్రాణవాయువు విద్యుత్తని మరిచారా
విద్వత్తు విజయం సాధించాలన్నా
ఆసుపత్రుల్లో విధులు నిర్వహించాలన్నా
ఇంటింటి విద్యుత్ పరికరాలు పని చేయాలన్నా
గూడైనా, గోడైనా, రోడ్డయినా
మనిషి మనిషికి చీకటి వెలుగుల వారధిది
పేదా గొప్ప తేడా తెలియని కరంటిది
పిన్నలు పెద్దలు వాడే సెల్ ఫోన్లకు
పరిశోధకుల పరిశోధనల గెలుపుకు
ప్రపంచమంతా పాదాక్రాంతమీ విద్యుత్ వ్యవస్థకు
ప్రతి మనిషికి ప్రాణాధారమే
నిత్య దైనందిన కార్యక్రమాలకు నిరంతరాయంగా తమ సేవలనందించే విద్యుత్ సిబ్బందికివే సర్వజన నీరాజనాలు
మీరు లేనిదే మనిషి మనుగడ లేదు
ప్రపంచ మానవాళి కోసం ప్రతిక్షణమూ పని చేసే
మీ అవిశ్రాంత శ్రమకు మా శతకోటి వందనాలు...!!
ఇది రాయడానికి కారణమైన కృష్ణమెాహన్ గుఱ్ఱం గారికి కృతజ్ఞతలు.
వర్గము
కవితలు
18, ఏప్రిల్ 2020, శనివారం
భూతల స్వర్గమేనా...పార్ట్ 6...!!
కళ్యాణ్ వాళ్ళింట్లో ఆ రాత్రి భోజనాలయ్యాక మా కాలేజ్ కబుర్లు చెప్పుకుంటూ, ఆ మాటల్లోనే నా పెళ్ళి కబుర్లు చెప్తే, అంతా విని కళ్యాణ్ బాధ పడుతుంటే వాళ్ళావిడ వింతగా చూస్తుంటే...తనకేమీ తెలియదు, మేమందరం బాగా చూసుకునేవాళ్ళం, చాలా అమాయకురాలని కళ్యాణ్ చెప్పడం..ఇలా ఆ మాటా ఈ మాటా చెప్పుకున్నాం చాలాసేపు. మరుసటి రోజు జమ్ షో ఉందని చూద్దామని వెళ్ళాం. అక్కడికే ఫణి వాళ్ళు కూడా వచ్చారు. నేను ఏమీ కొనలేదు. నాకు షాపింగ్ చేయడం పెద్దగా ఇష్టం కూడా ఉండదు. అలా వీకెండ్ గడిచిపోయింది. నన్ను మళ్ళీ గెస్ట్ హౌస్ లో దించేసారు. మరో వారం మెుదలయ్యింది.
నాతోపాటు గెస్ట్ హౌస్ లో మరొక తెలుగావిడ ఉంది. హైదరాబాదు ఆమెది. తన ఫామిలి వేరే చోట ఉన్నారు. ఆవిడ అమెరికా వచ్చి చాలా రోజులయింది. ఆమెను మార్కెటింగ్ చేయడం మెుదలుపెట్టారు పారాడైమ్ కంపెనీ వాళ్ళు. ఫోన్ కాల్స్ వస్తూ ఉండేవి ఆమెకు, లేదా ఆమె ఫోన్ లో బిజీగా ఉండేది. నాకు ఫోన్, కంప్యూటర్ కూడా సరిగా ఇచ్చేది కాదు. ఆవిడ దయదలచి ఇస్తేనేనన్న మాట. ఆవిడ మంచి మాటకారి, గడసరి కూడానూ.
ఈలోపల మరొక కన్నడ ఫామిలీ పరమేశ్వరన్ వాళ్ళు ఇండియా నుండి వచ్చారు. కాస్త సందడిగానే ఉంది నాకు. పరమేశ్వరన్ వాళ్ళ ఫ్రెండ్ సీతారాం తన వైఫ్ శిరీషతో వీళ్ళని కలవడానికి వచ్చి నాకు కూడా బాగా దగ్గరైపోయారు. వీకెండ్ వాళ్ళింటికి మమ్మల్ని ముగ్గురిని భోజనానికి పిలిచారు. హైదరాబాదు ఆవిడ రాలేదు. అలా శిరీష నాకు బాగా దగ్గరైంది. తర్వాత పరమేశ్వరన్ కు జాబ్ వచ్చి వేరే చోటికి వెళిపోయారు. ఈవిడ నన్ను బాగా టార్చర్ పెడుతూనే ఉంది. సతీష్ ఫోన్ చేసినా మాట్లాడటానికి వీలయ్యేది కాదు. ఆమెకు సెల్ ఫోన్ ఉన్నా కూడా లాండ్ లైన్ ఇచ్చేది కాదు. అప్పట్లో కంప్యూటర్ లో ఇంటర్నెట్ కూడా లాండ్ లైన్ తోనే ఉండేది.
నరసరాజు అంకుల్ ఫోన్ చేసినప్పుడు డబ్బుల గురించి అడిగారు. ఉన్నాయి నా దగ్గర అంటే ఎంత తెచ్చుకున్నావన్నారు. చెప్తే వెంటనే అడ్రస్ తీసుకుని 1000 డాలర్స్ పంపించారు. ఇంతలో థాంక్స్ గివింగ్ వచ్చింది. నరసరాజు అంకుల్ ఫోన్ చేసి రాజగోపాలరావు వాళ్ళింటికి వెళుతున్నావా అంటే అన్నయ్య పండగ గురించి ఇంకా ఫోన్ చేయలేదని చెప్పాను. టికెట్ బుక్ చేస్తాను సెంట్ లూయీస్ రమ్మంటే, శిరీష ఫోన్ చేసి వాళ్ళింటికి రమ్మందని చెప్పాను. సరే నీ ఇష్టమన్నారు. నేను శిరీష వాళ్ళింటికి బయలుదేరుతుంటే అన్నయ్య ఫోన్ చేసాడు. అమ్మాయ్ నేను వస్తున్నాను ఇంటికి తీసుకువెళ్ళడానికి అని. నేను చెప్పాను, శిరీష వాళ్ళింటికి వెళుతున్నానని. నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన సీతారాంతో మాట్లాడి, వాళ్ళింటికి వచ్చి ఇంటికి తీసుకువెళ్ళాడు అన్నయ్య. టర్కీని చూడటం అప్పుడే. వదినని ఇదేంటని అడిగితే టర్కీ అని చెప్తూ, అమెరికన్స్ కు టైమ్ ఉండదు కదా అందుకే సంవత్సరంలో ఓ రోజు దేవుడికి థాంక్స్ చెప్పడానికి ఈ థాంక్స్ గివింగ్ ని కేటాయించారని చెప్పింది. అన్నయ్య వాళ్ళిల్లంతా ఫ్రెండ్స్ తో నిండిపోయింది. అందరు తలొక వంటా చేసుకుని వచ్చారు. సందడిగా థాంక్స్ గివింగ్ అమెరికాలో మెుదటి పండగ గడిచిపోయింది.
మళ్ళీ కలుద్దాం..
వర్గము
ప్రయాణం
16, ఏప్రిల్ 2020, గురువారం
చివరి మజిలీ...!!
మన వెంట వచ్చేవేమిటో
మనకంటూ మిగిలేదేమిటో
తెలుపుతుంది
తెంచుకున్న బంధాలను
తుంచుకున్న పాశాలను
గుర్తుజేస్తుంది
దాచుకున్న ఆస్తులను
దోచుకున్న మనసులను
లెక్కలేస్తుంది
గమనానికి
గమ్యానికి
తేడా చూపుతుంది
విజయమేదో
ఓటమేదో
అర్థమయ్యేలా చేస్తుంది
అయినవారెవరో
కానివారెవరో
నిరూపిస్తుంది
చివరికి
మనమేంటో మన చావు చెప్తుంది
మనం చూడలేని మన చివరి మజిలి ఇది...!!
వర్గము
కవితలు
13, ఏప్రిల్ 2020, సోమవారం
చివరకు మిగిలేది..!!
మృత కణమంటూ
విదిలించేస్తే
మరణ ఘంటికల నాదాన్ని
మారుమెాగిస్తూ
కరకు గుండెలను సైతం
గడగడలాడిస్తూ
అగ్రరాజ్యాల అహంకారాన్ని
అణగదొక్కుతూ
ఛాందసభావాలని
చులకన చేసిన ఆ నోటితోనే
నమస్కార నడవడి మంచిదంటూ
కాలం చేతిలో కీలుబొమ్మలమని
కాటికి పోయే కాయానికి
కాపలా కాయలేదు ధనమంటూ
చివరికి మిగేలేదేమిటో తెలియజెప్పెను...!!
వర్గము
కవితలు
11, ఏప్రిల్ 2020, శనివారం
భూతల స్వర్గమేనా...పార్ట్ 5...!!
అమ్మాయ్ ఎన్ని డబ్బులు తెచ్చుకున్నావని అడిగితే 200ల డాలర్లు తెచ్చుకున్నానన్నయ్యా అన్నాను. సరిపోతాయిలే అమ్మాయ్ అంటే సరిపోతాయన్నయ్యా అన్నాను. తర్వాత రెండు రోజులకి అన్నయ్య పారాడైమ్ కంపెనీ గెస్ట్ హౌస్ కి తీసుకు వెళుతూ దారిలో షాప్ కి తీసుకువెళ్ళి తినడానికి, వండుకోవడానికి కావాల్సిన సరుకులన్నీ కొనిపెట్టి గెస్ట్ హౌస్ లో దించి అమ్మాయ్ అమెరికాలో నీ కొత్త కాపురం మెుదలయ్యింది అని నవ్వుతూ...
అయ్యెా అన్నీ కొన్నాం కాని బియ్యం మర్చిపోయామన్నాడు. కంపెనీ అతను నాకు పేరు గుర్తు లేదు తనకి అన్నయ్య చెప్పాడు బియ్యం తెచ్చి ఇవ్వమని. వాళ్ళతో కూడా నా గురించి జాగ్రత్తలు చెప్పి, అవసరమైతే ఫోన్ చేయమని చెప్పి వెళ్ళాడు. రెండు రోజులలో మరొకామె వస్తారు గెస్ట్ హౌస్ కి, భయం లేదని చెప్పి, రేపు బియ్యం తెచ్చిస్తానని చెప్పి అతను వెళుతూ, తలుపు ఎవరు కొట్టినా వెంటనే తీయకండి, కీ హోల్ నుండి చూసి, విషయం అడిగి తీయండి. అయినా ఎవరైనా వచ్చేముందు మేము మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పి వెళిపోయాడు.
మెుదటిరోజు ఒంటరిగా అమెరికా జీవితం మెుదలయ్యింది. రూమ్ లో బెడ్ ఉంది పరుపుతో సహా. నేను తెచ్చుకున్న దుప్పటి, దిండు కవర్ వేసుకున్నా. ఏమీ తినబుద్ది కాలేదు. గెస్ట్ హౌస్ లో లాండ్ ఫోన్, డెస్క్ టాప్ కంప్యూటర్ ఉన్నాయి. రూమ్ లో పడుకున్నా. ఎందుకో చాలా భయం వేసింది. ఎటు నుండి ఎవరు వస్తారో అని. అస్సలు ఇక రాత్రంతా నిద్ర పోలేదు. మరుసటి రోజు నిన్నటి అతనే బాసుమతి బియ్యం బాగ్ తెచ్చిచ్చాడు. 20 డాలర్లు అన్నాడు. అలా నేను ఇండియా నుండి తీసుకువెళ్ళిన 200 డాలర్లలో 20 డాలర్లు మొదటి ఖర్చన్న మాట. గెస్ట్ హౌస్ లో రెండోరోజు నుండి హాల్లో సోఫాలో పడుకోవడం, గ్లాస్ కి ఉన్న బ్లైండ్స్ కొద్దిగా ఓపెన్ చేసి బయటకి చూడటంతోనే సరిపోయేది రాత్రంతా. పొద్దున్నే ఎండ చూడగానే భలే సంతోషం వేసేది. ఏదో ఎప్పుడో దూరమైన నేస్తం దొరికినట్లుగా. ఆ ఎండ చూసి బయటకి వెళ్ళాలనిపించేది. వెళితే చలి బాగా వేసి ఉండలేకపోయేదాన్ని. ఏదో వండుకోవడం, తినడం, చదువుకోవడం, మా కాలేజ్ మేట్స్, ఫ్రెండ్స్ ఫోన్లు చేయడంతో అలా కంపెనీ గెస్ట్ హౌస్ జీవితం గడుస్తోంది. ఈ లోపల ఒకావిడ గెస్ట్ హౌస్ కి వచ్చింది. హమ్మయ్య నాకు కంపెని దొరికింది అనుకున్నా. అంతలోనే వీకెండ్ వచ్చేసింది.
కాలేజ్ టైమ్ లో పెద్దగా మాట్లాడని సతీష్ రోజూ ఫోన్ చేస్తూ, నాకు హోమ్ సిక్ లేకుండా చేయడానికి చాలా ప్రయత్నించాడు. అమెరికాలో జాబ్స్ ఎలా ఉంటాయెా, ఎలా మాట్లాడాలో ఇలా అన్ని చెప్తుా ఉండేవాడు. నేనున్న బాల్టిమెార్ కి కాస్త దగ్గరలో ఉన్న కళ్యాణ్ కి ఫోన్ చేసి నన్ను వీకెండ్ వాళ్ళింటికి తీసుకువెళ్ళమని సతీష్ చెప్తే కళ్యాణ్, వాళ్ళావిడా వచ్చి వాళ్ళింటికి తీసుకువెళుతూ డ్రైవింగ్ కబుర్లు..బ్లైండ్ స్పాట్, లేన్స్ ఛేంజ్ అయ్యేటప్పుడు సిగ్నల్స్ వేయడము, స్పీడ్ లిమిట్స్ లాంటివి చెప్పాడు. టన్నెల్ లోపల నుండి వెళ్ళేటప్పుడు పైన నీళ్ళుంటాయి, నీళ్ళలోనుండి సొరంగం ఇది అని చెప్తుంటే భలే ఆశ్చర్యంగా ఆ వింతలను,లైటింగ్ లను చూడటం నావంతైంది. కళ్యాణ్ మాట్లాడుతూ చూసావా మంజూ ప్రపంచం చాలా చిన్నది, మనల్ని ఇలా కలిపింది. అదే ఇండియాలో ఉంటే కలిసేవాళ్ళం కాదేమెానంటూ..మన క్లాస్ మేట్స్ ఫణి ఇంకా కొందరు వర్జీనియాలోనే ఉన్నారని చెప్తూ, కాలేజ్ కబుర్లు చెప్పుకుంటూ ముగ్గురం కళ్యాణ్ వాళ్ళింటికి చేరాం.
మళ్ళీ కలుద్దాం..
వర్గము
ప్రయాణం
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా...
నా అమెరికా కబుర్లను ప్రచురిస్తున్న ఆంధ్రాప్రవాసి డాట్ కాం వారికి, రాజశేఖర్ చప్పిడి గారికి మన:పూర్వక ధన్యవాదాలు..
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా...
ఆంధ్ర ఆడపడుచు అమెరికాలో 200 డాలర్లతో వెళ్లి ఏమి చేసింది... ఒంటరిగా రూమ్ లో ఏమయ్యేదో... అంత కష్టమా...
10, ఏప్రిల్ 2020, శుక్రవారం
కాటేస్తున్న కాల రక్కసి...!!
కాల రక్కసి
కరోనా రూపంలో
కదం తొక్కుతోంది
చేజేతులా చేసుకుంటున్న
తప్పిదాలకిప్పుడు
మూల్యం చెల్లించుకుంటున్న సమయమిది
ప్రకృతి పరితాపానికి
సమస్త మానవాళికి
ఆ దైవం విధించిన శిక్ష ఇది
సనాతన ధర్మాల
అవహేళనకిదో రకమైన
తిరుగులేని సాక్ష్యమై నిలిచింది
ఒక్కరు పోయినా
పదిమంది బాగు కోరితే
ప్రపంచ ఉపద్రవం తప్పేది
జాత్యహంకారంతో
అభిజాతము మరచితే
మానవత్వం మంటగలిసింది
స్వీయ పరిరక్షణతో
కుటుంబ క్షేమం
సమాజ శ్రేయస్సుగా మారుతుంది
వైరస్ విలయ తాండవానికి
చరమగీతం పాడాలంటే
తప్పదు పరిశుభ్రత లేదు మరో మార్గం...!!
వర్గము
కవితలు
8, ఏప్రిల్ 2020, బుధవారం
నువ్వెళ్ళే దారుల్లో...!!
పసిపాపాయిగా నువ్వున్నప్పుడు
పారాడే నీకోసం అమ్మ చీర కుచ్చిళ్లు
నడకలు నేర్చిన నీ పాదాలు
కందకుండా నాన్న అరచేతులడ్డం
తడబడే అడుగులకు
తడబాటు తెలియకుండా రక్తబంధం ఆసరా
తప్పుటడుగుల ప్రాయానికి
నడవడి నేర్పిన పెద్దల సుద్దుల పహరా
నడివయసుకు నడయాడినప్పుడు
కన్నపేగు పాశాల ఎదుగుదల మురిపెం
అపరవయసుకు ఆనందం అసలుకన్నా వడ్డీ ముద్దంటూ
మళ్ళీ మనకందిన బాల్యపు జ్ఞాపకాలు
నువ్వెళ్ళే దారుల్లో వెనుదిరిగి చూసుకుంటే
పరిచిన పారిజాతాల పసితనం గుభాళింపు నీ చుట్టూ..!!
వర్గము
కవితలు
7, ఏప్రిల్ 2020, మంగళవారం
కన్నీళ్లకు విలువెంత...!!
అనంతమైన అంతర్మధనాన్ని
కొలవగల యంత్రాలను
ఏ యుగంలోనైనా కనిపెట్టగలమా
కనబడే గుండె పరిమాణం
చేసే చప్పుడు వినగలం కాని
మనసు మనోవ్యథను చూడగలమా
అమ్మతనానికి ఖరీదు కట్టగల
షరాబులున్నారని విన్నామా
ఈ విశ్వంలోనైన మరెక్కడైనా
ఆనందానికి నెలవీ కన్నీళ్లే
విషాదవీచికలకు సంకేతమివే
ఏ కన్నీళ్లకైనా విలువ కట్టగలమా ఎప్పటికైనా...!!
వర్గము
కవితలు
6, ఏప్రిల్ 2020, సోమవారం
బలుపు...!!
ఇలాంటి వారిని సమర్థించే మీడియాకు, పాత్రికేయులకు శతకోటి వందనాలు..
నేనుకున్నాను పేటియం బాచ్ మాత్రమే ఇలా మాట్లాడుతుందని.. అయినా చెట్టు ఒకటయితే విత్తు వేరే ఎలా ఉంటుంది. అన్నీ ఆ తానులో ముక్కలే అని మరిచాను..మన్నించాలి.
అయ్యవార్లకు ఏం మాట్లాడుతున్నారో తెలియడము లేదేంటి? కాస్త క్లారిటీ తెచ్చుకుని మీడియా ముందుకి రండి బాబూ. మీరు అధికారపక్షమిప్పుడు... ప్రతిపక్షంలో ఉన్నట్లు బిహేవ్ చేస్తున్నారేంటి? వచ్చిన ఆపదకు నివారణాచర్యలు మీరు చూడాలి..అందరు తలా కాస్త ఇచ్చారుగా.. అదే మీరు 40 ఏళ్ళ రాజకీయ అనుభవమని ఆడిపోసుకునే ఆయన కూడా ఇచ్చింది తీసుకున్నారుగా..ఎన్నికలు వాయిదా వేస్తే అడ్డమైన వాగుడు వాగిన మీరా కేంద్రం కన్నా ముందు లాక్ డౌన్ ప్రకటించింది? కనీసం కేంద్రం ఇచ్చింది కూడా మీదని చెప్పి బతికేస్తున్న మీకన్నా దిగజారుడు రాజకీయాలెవరూ చేయరు. మర్చిపోయినట్లున్నారు... ముక్కల పక్కన నుంచుని పదవి కోసం సంతకాలడిగింది. ఎవరికో కాదు కరోనాకి కూడా మీరంటే అసహ్యమనుకుంటా.. మీడియాలో మాట్లాడేటప్పుడు కాస్తయినా మనుషులుగా మారండి. ప్రతిపక్ష నేతలకు, సభ్యులకు కరోనా రావాలన్న మీ కోరిక ఎంత గొప్పదో మీడియా సాక్షిగా అందరు చూసారు. కనీసం పదవీబాధ్యతలు నిర్వహించక పోయినా పర్లేదండి... మీరు మవిషిజన్మ ఎత్తలేదేమెానన్న అనుమానం జనానికి వచ్చేటట్లు చేసుకోకండి దయచేసి...
వర్గము
కబుర్లు
నటించేద్దాం రండి..!!
నటిద్దాం రండి...!!
కొత్తగా నటించడానికి
ఏం మిగిలిందనిప్పుడు
అమ్మ బొజ్జలో ఉన్న
ఆ తొమ్మిది నెలలు తప్ప
రేపటి నుండి
నవ మాసాలకూ రంగులు పూస్తారేమెా
పుట్టిన బిడ్డకు పురిటినీళ్ళు పోసిన నాటి నుండే
జీవితంలో నటించడం నేర్పే ప్రయత్నమే
రెండు నాల్కల ధోరణితో
పైకెదిగే యత్నానికి పాదులు చేయడమే
మనసులేని మనుష్యులుగా
మనమూ బతికేద్దాం వ్యక్తిత్వం అనేది లేకుండా
నటన మనకు కొత్తేమీ కాదుగా
సర్ధుకుపోతున్నామన్న తేనేను పూసుకుంటున్నాంగా
ఊసరవెల్లి దాని ఉనికి కోసమైతే
మనకేమెా బతుకుదెరువదేనాయే
చివరాఖరికి నటనకు ఘటనకు మధ్యన
యధేచ్ఛగా నటించేద్దాం రండి...!!
వర్గము
కవితలు
5, ఏప్రిల్ 2020, ఆదివారం
నీకు నాకు మధ్య...!!
ఏం మిగిలిందని
నీకు నాకు మధ్యన
పంచుకున్న అనుబంధాలా
పెంచుకున్న బాంధవ్యాలేమయినానా
మన మధ్యన కాలం నడిచెళ్ళిపోతూ
వదిలేసిన ఆనవాళ్ళేమున్నాయని
చెప్పుకోవడానికయినా
దాచుకోవడానికయినా ఏమున్నాయని
జ్ఞాపకాలు విదిల్చిన క్షణాలలో
కొన్నయినా కన్నీళ్లుండని కలలున్నాయా
రాలిన నవుల్లో రాగాలను
నయగారాలతో మరిపించడానికి ఏ లేపనముందంటావ్
జీవితేచ్ఛ నశించిన జీవికి
ఇహపరాలకు తేడా ఏముందంటావ్
అన్నీ వెరసి
నీకు నాకు మధ్యన మిగిలింది శూన్యమే...!!
వర్గము
కవితలు
4, ఏప్రిల్ 2020, శనివారం
కన్నీళ్లను మింగిన నేల...!!
ఎన్ని దుఃఖాలను మెాస్తోందో
యుగాల తరబడి ఈ అవని
ఎందరి కడుపుకోతలను
భరిస్తోందో ఏళ్ళకేళ్ళుగా
గుండె గాయాల గుబుళ్ళను దిగమింగుతూ
కన్నీటి సంద్రాలను మెాయడం తనకలవాటే
బడబానలాలను దాచుకుంటూ
పచ్చని పచ్చిక తివాసీ పరుస్తుంది
అవమానాలందుకున్న అతివలను
అక్కున చేర్చుకునే అమ్మ
దాయాదుల పోరులో ధర్మానికై
రక్తాశ్రువులను భరించిన ఓరిమి తనది
కలియుగంలో కలత చెందిన
కలలకు రోదనాశ్రువులను తోడుగా నింపినది
ప్రకృతి విలయానికి పంచభూతాల సాక్షిగా
కన్నీళ్లను మింగిన నేల ఇది...!!
వర్గము
కవితలు
భూతల స్వస్వర్గమేనా..!! పార్ట్ 4
అమెరికాలో మెుదటిరోజు నిద్ర గురించి..అన్నయ్య వాళ్ళ అమ్మాయి సుమి రూమ్ లో పడుకున్నా. జట్ లాగ్ కదా నిద్ర రాలేదు. అదీనూ అంతా కొత్త కొత్తగా ఉంది. ఆలోచనలతో ఎప్పటికో నిద్ర పోయా. పొద్దున్నే నిద్ర లేచే సరికే వదిన వర్క్ కి వెళిపోయింది. అన్నయ్య కాఫీ కలిపిస్తూ ఎలా కలుపుకోవాలో చూపించాడు. మైక్రోవేవ్ ఎలా వాడాలో చూపించాడు. టిఫిన్ గురించి చెప్తూ సిరియల్స్ (cereals) ఎలా పాలల్లో కలుపుకుని తినాలో చెప్పాడు. తర్వాత సోషల్ సెక్యూరిటీ నంబర్ అప్లై చేయడానికి తీసుకువెళ్ళి, అక్కడే స్టేట్ ఐడికి కూడా అప్లై చేయించాడు. స్టేట్ ఐడి ఉంటే ప్రతిసారి పాస్ పోర్ట్ చూపించనక్కర్లేదు ఫోటో ఐడెంటిటి కోసం. నాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు కదా అందుకన్న మాట స్టేట్ ఐడి.
ఫోన్ ఇండియాకి ఎలా చేయాలో చెప్పాడు. అమ్మా వాళ్ళతో మాట్లాడించాడు. అమెరికాలో నా ఫ్రెండ్స్, కాలేజ్ మేట్స్ చాలామంది అప్పటికే ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళకి అందరికి అన్నయ్య వాళ్ళ ఇంటి నెంబరు పెట్టి ఈ మెయిల్ చేసాను. అలా అమెరికాలో కమ్యూనికేషన్ మెుదలైంది.
నేను అమెరికాకి వెళ్ళింది GIS కంపెనీ H1B తో. వాళ్ళు జాబ్ చూడాలంటే డబ్బులు అడిగారని నరసరాజు అంకుల్ జాబ్ మేం చూసుకుంటాం, H1B చేయండి చాలు అన్నారు. అందుకని వాళ్ళ అబ్బాయి పారాడైమ్ ఇన్ఫోటెక్ కంపెనీ శ్రీధర్ ని జాబ్ అడిగితే సరే చూస్తామన్నారు. నేను ఇండియా నుండి ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా VC++ నేర్చుకుని రండి అని చెప్పారు.
అన్నయ్య బాల్టిమెార్ లో ఉన్న పారాడైమ్ కంపెనీ ఆఫీస్ కి తీసుకువెళ్ళాడు. అప్పుడే ఓ క్లయింట్ వస్తే ఇంటర్వూ ఎరేంజ్ చేసారు. నేను రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళాలెండి అప్పటికే. దానిలో 6 నెలల ఎక్స్పీరియన్స్ పెట్టమన్నారు కూడా. క్లయింట్ అడిగితే ఫ్యూ డేస్ అయింది వచ్చి అని చెప్పాను. తను నవ్వి మరి 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ పెట్టావు కదా అంటే.. అలా పెట్టకపోతే మీరు ఇంటర్వూకి పిలవరు కదా అన్నా. క్లయింట్ నవ్వేసి గుడ్ లక్ చెప్పాడు. బయటికి వచ్చాక వీళ్ళని అడిగితే మీకు అలవాటు అవుతుందని ఇలా చేసామన్నారు. గెస్ట్ హౌస్ ఉంది కంపెనీది, మీరు వచ్చేయండి అన్నారు. 2 రోజులలో పంపిస్తాను చెప్పి అన్నయ్య ఇంటికి తీసుకువచ్చాడు.
మళ్ళీ కలుద్దాం...
వర్గము
ప్రయాణం
3, ఏప్రిల్ 2020, శుక్రవారం
నిశ్శబ్ద యుద్ధాల నీడలు...!!
నీడలెప్పుడూ సడి చేయవు
నిమ్మళంగానే అనుసరిస్తూ
వెన్నంటే ఉంటాయెప్పుడు
యుద్ధం అనివార్యమైనప్పుడు
నిరాయుధులమైనా పోరాడక తప్పని స్థితి
అది కాలం నేర్పే పాఠం
శబ్దమెప్పుడూ పలకరిస్తూనే ఉంటుంది
(మ)రణ భూమిలో సైతం విడువక
బంధాలను గుర్తెరగనీయక
ఒక్కసారిగా ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసి
కనిపించని కోరలతో
నిశ్శబ్దంగా కాటేస్తోంది కరోనా రక్కసి
చీకటిలో కనిపించని నీడ
మౌనంలో దాగిన నిశ్శబ్దం
జన జీవితాలపై పడిన నిశ్శబ్ద యుద్ధాల నీడలేనేమెా..!!
వర్గము
కవితలు
ద్విపదలు..!!
1. జ్ఞాపకాలలా పలకరిస్తుంటాయి
కాలాన్ని వెనక్కి మళ్ళించి వేయాలనుకుంటూ..!!
2. పలకరింపుని పరిచయం చేసింది
పిలుపు తెలియని మనసుకు...!!
3. కొత్తదనమైనా కలికిచిలుకే మరి
పసితనం వదలని ముగ్ధత్వమైనందుకేమెా..!!
4. పట్టుకుంది వదిలేయడానికి కాదు నేస్తం
మరుజన్మకైనా నీతోనే అని చెప్పడానికి...!!
5. నేనొక చివరిలేఖ రాయాలి
కాసిని జ్ఞాపకాలనిలా పంపవూ...!!
6. నీలో నేనేగా
జ్ఞాపకంగానో గాయంగానో..!!
7. ఓరిమిగా వేచి చూస్తుంది మనసు
కోల్పోయిన క్షణాలను జ్ఞాపకాల్లో దాయాలనుకుంటూ..!!
8. గురుతులు పదిలమేనంటూ ఏమారుస్తున్నావు
అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని..!!
9. వేళ కాని వేళ అడుగుతావేంటిలా
నా ఊపిరే నీతో ఉండిపోతే..!!
10. దాగేదెప్పుడూ నీవేగా
గురుతుగానో జ్ఞాపకంగానో...!!
11. మెాయలేని మౌనమిది
మాటలకు అలవాటు పడ్డ మనసుకు..!!
12. వియెాగం వరమౌతుంది మనసుకి
నీ జ్ఞాపకాలతో ఊసులాడుతూ..!!
13. స్పందించే మనసుంటేనే కదా
అక్షరం కదిలించడమైనా కరిగించడమైనా..!!
14. ఇహము పరమూ నీవేగా
విరహవేదనలు జ్ఞాపకాల పరమయ్యాయందుకే...!!
15. మరుపెలా సాధ్యమసలు
ఊహకందని జ్ఞాపకమై నువ్వు చేరితే..!!
16. మనసు మాటిన్నాను
అక్షరాల కదలికల్లో...!!
17. అక్షరాలు కొన్నే
భావాలు అనంతం..!!
18. చితి మంటలు ఆరనేలేదు
వెలుగులో చీకటికి తోడనుకుంటా...!!
19. సలహాలేమి ఇవ్వడం లేదు
మన మధ్యన సర్దుబాట్లెందుకని...!!
20. అందరి స్వామిభక్తి అలాంటిదే
నమ్మిన నమ్మకానికి తిరుగులేదంటూ..!!
21. అవమానాలను అందిపుచ్చుకుంటారు కొందరు
బంధాలను బాధ్యతలను వదులుకోలేక..!!
22. మనసు మేలిమి ముత్యమట
అక్షరాలందుకే స్వచ్ఛంగా పలకరిస్తున్నాయలా...!!
23. కొన్ని ముళ్ళంతే
గుచ్చిన గురుతులను వదిలెళ్ళి పోతాయలా...!!
24. కాలం ఆగలేదెందుకో
తనతో పరుగులు పెట్టలేక వెనుకబడ్డానన్న జాలి లేక..!!
25. నిశ్శబ్ధమే మేలంటున్నా
మౌనంలోనైనా నీతో మాట్లాడే వీలుంటుందేమెానని..!!
26. మనసునే మర్చిపోయా
నీవున్న క్షణాల్లో నే మిగిలిపోయి...!!
27. ఏకాగ్రత కుదరనీయడం లేదు
ధ్యానంలోనూ నీవే చేరికై...!!
28. మాటల్లో తేనె చినుకులు
చేతల్లో వెకిలి చేష్టలు..!!
29. నిజమెప్పుడూ అబద్ధమే
మనసుకు నచ్చనప్పుడు...!!
30. వ్యాపకమనుకున్నా ఇన్నాళ్ళు
వ్యసనమైపోయావని తెలియక...!!
వర్గము
ద్విపదలు
ద్విపదలు...!!
1. వద్దని వారిస్తావెందుకు
ఉండిపోతానని నేనంటుంటే..!!
2. ఏదో వెదుకులాట
గతజన్మ బంధాన్ని గుర్తు పట్టాలనేమెా...!!
3. అక్కరకు రానంటూ బెట్టు చేసింది
యుగాల నిరీక్షణ తనకర్థం కానట్టుగా...!!
4. వెదికినా దొరకని సాక్ష్యాలేనన్ని
మనసు రోదన తెలియనప్పుడు...!!
5. అక్షరాలకెప్పుడూ పండగే
మనసులోని భావాలనొంపడానికి...!!
6. మనసెప్పుడూ మౌనబుుషే
మాటలు మనిషికొదిలేస్తూ...!!
7. మనిషితనం సిగ్గుపడుతూనే ఉంటుందెప్పుడూ
నరునిలో తన ఉనికిని ప్రశ్నించుకుంటున్న ప్రతి క్షణం...!!
8. అంపకాల పంపకాలంతే
శుభానికి అశుభానికి మధ్యన ఎటూ తేలని లెక్కల్లా...!!
9. చినుకుల సందడి వినిపిస్తోంది
మెరుపుల వెలుగుల్లో కనిపిస్తూ...!!
10. కొన్ని పలకరింతలంతే
బంధాలను తలపిస్తూ...!!
11. పునఃసమీకరణ చేసుకోవడమంటే
నువ్వు మరుపు వశమైనట్లే కదా..!!
12. మాటలక్కర్లేదంది మనసు
తలపులకు తలుపులతో పని లేకుండా..!!
13. అనుబంధమెప్పుడూ అడ్డంకి కాదు
అర్థం చేసుకుని మెసలమంటుందంతే...!!
14. చిలకరించి పోయింది సిరా
పేర్చుకోవడమిక నీ వంతే..!!
15. మాగన్నుగా నిద్ర పడుతున్నప్పుడే అనుకున్నా
కలల చుట్టానికి ఆహ్వానం పలకడానికని...!!
16. మనిషినేమార్చడం సుళువే
మనసుని మాయ చేయడం కన్నా..!!
17. జ్ఞాపకాలే గురుతులు
గతాన్ని పలకరిస్తూ...!!
18. అలకలెలా తీర్చాలో
అలిగిన మనసుకు..!!
19. అలనాటి విఫల గాథలే
ఈనాటికీ అజరామర ప్రేమకావ్యాలుగా...!!
20. దీపం ఒంటరిదే
పంచే వెలుగు సమస్త విశ్వానికి..!!
21. గుండె గదుల్లో గురుతులు
గుప్పెడు అక్షరాల్లో గువ్వల్లా...!!
22. అక్షరం ఘర్షణ పడతూనే ఉంటుందెప్పుడూ
మనసుకు మాటకు సమన్వయం కుదర్చడంలో...!!
23. చిన్న మాటే
రాజ్యాలు కోల్పోయేంత...!!
24. మనసు వినబడుతుంది
మౌనం మాటల్లో...!!
25. తీరమేదైనా ఆనందమే
ఆస్వాదించే మనసుండాలంతే...!!
26. మనుష్యులను దూరం చేసుకోవడం కాదు
మనసులకు చేరువ కావడం తెలియాలంతే..!!
27. భగవంతుని లీలది
ఆటలో గెలుపోటములను మనకలవాటు చేయాలనుకుంటూ...!!
28. అనుభవాల దొంతర్లు
జీవితపు పుటలన్నీ...!!
29. మమతలను మరవడమెంత సేపూ
ఆత్మీయతను కూడా అంగడి సరుకులు అనుకునే రోజులివైతే.. .!!
30. కొన్ని కథలంతే
ఎప్పటికి సశేషాలుగానే...!!
వర్గము
ద్విపదలు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)