31, మే 2014, శనివారం

అర్ధం కాని నీ స్నేహంలో...!!

చేరువ కాను చెంతన ఉండను
దూరం కాను దగ్గరగా ఉండను
ప్రేమకు ఇష్టానికి మధ్యన ఉన్న
చిన్న మమత అర్ధం కాని నీ స్నేహాన్ని
వదలి పోలేను రాకుండా ఉండలేను
ఆత్మీయతను ఆస్వాదించినా
అనుబంధం పెనవేసుకోలేను
అనురాగాన్ని నెట్టేయలేను
అభిమానాన్ని వదులుకోలేను
అందుకేనేమో అనునిత్యం నిను
వెన్నాడే జ్ఞాపకంగా మిగిలిపోయాను...!!

30, మే 2014, శుక్రవారం

రాజధాని నిర్మాణానికి రాళ్లెత్తే కూలీలు ఎవరు....??

గెలిచామని పండుగలు  కాదు....  జనాలు ఇచ్చే విరాళాలు తీసుకోవడము కాదు... ఇప్పటి వరకు గెలవడానికి...
పదవుల కోసం ఆత్రాలు అన్ని మామూలే ఏ రాజకీయ పార్టీకైనా.... కనీసం ఇప్పటి నుంచి అయినా అందరికి అందుబాటులో ఉండే చోట మళ్ళి ఈ విభజన అన్న మాట రాకుండా ఎవరికీ నష్టం కలుగకుండా  పెద్దలు రాజకీయ విజ్ఞులు ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకుంటే గెలిపించిన ప్రజలు గుండెల్లో  కాలాలు దాచుకుంటారు... గెలిచే వరకు ఒకమాట గెలిచాక జనం తెలియనట్లుగా ఉంటే పరిస్థితి మారిపోతుంది.
చిన్న చిన్న మండలాల్లో గెలిచిన అధికారులు గ్రామాల అభివృద్దికి గ్రామ ప్రజలు చేసుకుంటుంటే అన్ని మీకు నేను  పెడతాను అన్న ఆ మనిషే అడ్డు పడుతుంటే ఇక పెద్ద పెద్ద నాయకుల సంగతి ఏమిటా అని ఓ పక్క కాస్త భయంగా ఉంటోంది.  పేరు కోసం చేయకండి జనం కోసం చేయండి వారి మదిలో చిరస్థాయిగా నిలిచిపొండి....  అవకాశాన్ని జారవిడుచుకోకండి ... పదవుల కోసం డబ్బుల కోసం చూడకుండా ఈ ఒక్కసారి జనం కోసం చేసి చూపించండి... !!

మాట ఇచ్చిన మలయమారుతానికి .... !!


అందని కడలి తీరం దగ్గరైనా
కలల ఓదార్పు కాస్త దూరం
కలత నిదుర కనులలో కనిపించని
స్పష్టత తెలియని మరో లోకంలో 
చూడలేని జాడలను చూసుకోవాలని
మనసు మౌనం మాటాడినా వినని
మది తరంగ తాకిడి తెలియని
అంతరంగ రహస్యం అందినా
ఆనందించడానికి తోడులేని
మనసు అద్దంలో నన్ను నేను చూసుకుంటూ
ఒంటరిలా అనిపించిన క్షణాలు ఎన్నో...
పంచుకోవడానికి పెంచుకున్న
మమకారాలు మనవి కావని తెలిసినా
ఆత్మీయత ఆలంబనగా అందుకుంటూ
మరు జన్మే వద్దనుకున్న క్షణాలను
వెనక్కి తీసుకుంటూ తోడుగా వస్తానని
మాట ఇచ్చిన మలయమారుతానికి ....
ఆ అనుబంధం కోసం మళ్ళి పుట్టాలని
ఉవ్విళ్ళూరుతూ ఎదురు చూడాలని ఉంది
కానీ...మళ్ళి మోసపోతే తట్టుకునే శక్తి
ఈ చిన్ని మనసుకు లేదని అర్ధం చేసుకో నేస్తం....!!

28, మే 2014, బుధవారం

జ్ఞాపకాల పుస్తకంలో.....!!

ఎప్పుడో 30 జూలై 93న నాకు అతి తక్కువ కాలంలో మాకు సీనియర్ ఇంజనీరింగ్ లో మూడు రోజుల పరిచయం లోనే అతి దగ్గరగా వచ్చిన నా ప్రియ నేస్తం నాకోసం ఆంగ్లంలో రాసిన కవితను వాళ్ళ అమ్మగారు తెలుగులో అనువదించి రాసిన ఆణి ముత్యం నాకు ... వారు లేరు కాని అంటి స్వహస్తాలతో రాసిన జ్ఞాపకాల పుస్తకంలో పదిలంగా ఈనాటికి ఉండిపోయింది నామదిలో కూడా.....
మలయ మారుతానికి మరోపేరు
నా ప్రియమైన మంజు,
గాలిలా వచ్చావు గల గలా నవ్వావు
మెరుపులా మెరసి నా నేయ్యాన్ని తాకావు
మేఘమై మారి నా మనస్సంత నిలిచావు
వానలా వచ్చి నా స్నేహమై కురిసావు
జలపాతంలా నాలో ఒక దూకు దూకావు
మరపురాని మనుష్యులలో మొదటిదానివి
నువ్వే... నువ్వే ... నువ్వే
                                 నీ శర్మిల

26, మే 2014, సోమవారం

యోగం..!!


మనిషిలోని మనసుతో మమేకం చెంది
ఆత్మలో అణువణువుతో  అంతః సంఘర్షణం 
బంధాలకు బాధ్యతలకు బాహ్య సంధానం
పంచుకోగలిగి పెంచుకుంటున్న మమతావేశాల
మోహ పాశాల మధ్యన నలుగుతూన్న భోగవిలాసాలు
అనుక్షణం అడ్డుపడుతూ వదలలేని ఆత్మీయతలు
నిరంతరం నిలువరించే ఈ అడ్డంకుల అడ్డుగోడలు
అధిగమించి నాది అన్న దేహాన్ని నేను అనే ఆత్మకు
అనుసంధానం చేయగలిగే ఆత్మయోగం అందుకోగలిగే
మనో అంతః కరణ జ్ఞానయోగం ఆత్మలో పరమాత్మను
దర్శించే సమాధి ష్టితి యోగ భోగాల సంయోగం...!!

ఈ తీర్పు ఎవరిది....??

కాలు కందనీయకుండా అడగకుండానే అన్ని ఇస్తూ ఇష్టాలు అభిమానాలు ఒకటిగా పెంచుకుని ఆత్మీయత పాలు
ఎక్కువగానే పంచుకున్న ఓ తండ్రి కూతురు మధ్యలో వచ్చిన ఓ కారణం...ఎవరికి వారికి తమదే సరి అయిన నిర్ణయంగా అనిపించి కూతురుని ఇంట్లో నుంచి బయటికి పంపేసిన ఆ తండ్రి తన ఇష్టానికి విలువ ఇచ్చి అలా చేశాను అని తృప్తి పడ్డాడు. అనుకోని పరిస్థితిలో జాలిపడి మోసపు ప్రేమకు ఇక్కడ అబ్బాయి ప్రేమ కాదండి ఓ మనిషి పై తనకంటూ ఎవరులేరని బాధపడుతుంటే అయ్యో అని తనకోసం జీవితాన్ని ముళ్ళ బాటలోనికి నెట్టుకున్న అమ్మాయికి రెండు రకాల భిన్న మనస్తత్వాలు ఉంటాయని తెలియచెప్పిన ఆ మహాతల్లికి వందనాలు.... ఎందుకంటే జీవితాన్ని చూపించింది కనుక...ఇటు బాద్యత పట్టించుకోని భర్త చెడ్డవాడు కాదు అలా అని మంచివాడు కాదు ... తన కోసం అందర్నీ అన్ని వదులుకుని వచ్చిన సంగతి తను ఎలా పెరిగింది తన మనస్తత్వం పూర్తిగా తెలిసినా తనకోసం ఏమి చేయని బయట జనం కోసం బతికే ఆ మనిషి ....  సరే ఇక అసలు విషయానికి వస్తే కొన్ని రోజులకు కోపాలు అవి మామూలే కదా పెరగడం తగ్గడం....కానీ ఈ సారి తండ్రి చేతిలో కూడా మోసపోయింది... అప్పటివరకు నాకు సమయం ఇవ్వు అన్ని నేను చూసుకుంటాను అని చెప్పిన ఆ తండ్రి రోజుల బిడ్డతో తన పాట్లు తనని పడమని చెప్పడం... ఏం చేయాలో తెలియని ఆ స్థితి ఎవరికీ రాకూడదు. తండ్రి వదలివేసినా పచ్చి బాలింతను వదలి వెళ్ళలేని తల్లి...!! ఏం చేయాలి ఆ పరిస్థితిలో వదలి తను కూడా వెళ్ళిపోవాలా భర్తను అనుసరించి... కన్న మమకారం కోసం బిడ్డకు తోడుగా ఉండాలా....!!
ఇక్కడ నాకు చిన్న అనుమానం రామాయణ కాలంలో రాముడు  అడవికి వెళ్ళే సమయంలో జరిగిన వాదోపవాదాలు భర్త ధర్మాన్ని భార్య పాటించాలి అని చెప్తారు... తల్లి తండ్రిలో ఎవరు గొప్ప అనే దానికి సమాధానం చెప్పగలరా...!!  తప్పు చేసినప్పుడు తల్లి అయినా తండ్రి అయినా సమ ధర్మం పాటించాలి అన్నది నా ఉద్దేశ్యం...సమస్యను తప్పుకు తిరిగే ఎవరైనా అది భార్య భర్త తల్లి తండ్రి బిడ్డలు....ఎవరైనా సరే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు అని పెద్దలు చెప్పినట్టుగా ఉండటం ఎంత వరకు న్యాయం.... మీరే చెప్పండి....!!

25, మే 2014, ఆదివారం

ఆ క్షణం ఎంత మధురం....!!

కోరికలు కొరవడిన చిత్తాలు కొత్త కోసం
పరుగులు తీయడం మనసుకు మారు
మాటలు చెప్పడం న్యాయమా...!!
వదలలేని వలపు తలపుల బంధాలు
వాయులీనాల తన్మయత్వంలో ఏదో
అదృశ్య అనురాగ వీచికలలో చిక్కుకుని
అష్ట రంధ్రాల మురళీరవంలో లీనమై
జీవితార్దాల పరమార్ధం కోసం అన్వేషిస్తూ
ఎక్కడెక్కడో వెదుకుతూ ఇంకా ఏదో
కావాలన్న మనసుకు అసలైన సంతోషాన్ని
మనలోనే దాచుకున్న వైనం తెలిసిన
ఆ ఆనందపు తీరమే అసలైన గమ్యమని
నిరూపణ అయిన ఆ క్షణం ఎంత మధురం....!!

24, మే 2014, శనివారం

మనకోసం మనం...!!

ఏమో మనసు అంతఃలోకాన్ని అడిగి చూశా
ఎక్కడైనా ఓ చిన్న అనుబంధం మిగిలిందేమో అని....
ఎక్కడా కనపడని భావాలను ఎక్కడనుంచి తేను...
కరడు కట్టిన రాతిలా మారిన ఈ రంగు రాళ్ళ మాయలో
స్వచ్చమైన స్పటికంలా మెరిసే ఆ వెలుగులు చిమ్మే
కాంతిని తట్టుకునే శక్తిని సాధించాలని దరిచేరలేని
శిదిలపు శిలలో చితికిపోయిన శకలాల శూలాలు
అనుక్షణం గుండెను చీల్చే జ్ఞాపకాలే కాని...
అందమైన శిల్పపు రూపు కనిపించదని తెలియక
ఎక్కడా దొరకక వెదికి వెదికి వేసారిన జీవితపు
ఆఖరి క్షణం వరకు ఎదురుచూపుల నిరాశల
నిట్టూర్పులే తప్ప మలయ సమీరపు జాడలే
దరిదాపుల తాకుతున్న గురుతులు అగుపించక
ఔనన్నా కాదన్నా నీతోనే బంధాన్ని పెనవేసుకున్న
నా ఊహల ఊసులు ఈ జన్మకు మరొకరికి సొంతం
కాలేవని నీకర్ధమయ్యే వేళకు ఈ శ్వాస ఆగిపోతుందేమో.....
ఓ జీవిత కాలపు నిరీక్షణకు సాక్ష్యంగా నీకు ఈ నా వేదన
తెలియక పోయినా దేనికోసమో ఆరాటపడుతూ
పరుగిడుతున్నఈ మమతల పోరాటం ఓ క్షణం
మనకోసం మనం అనుకుంటే ఎలా ఉంటుందో....!!

22, మే 2014, గురువారం

నాయకులెందరో....!!

ఇక ఎన్నికల ప్రహసనం ముగిసింది మరో ఐదు ఏళ్ళ వరకు....ఇక మిగిలింది గెలిచిన నాయకులకు పదవుల
హడావిడి  నేతలకు రాజధాని నిర్ణయాలు నుంచి డబ్బులు రాబట్టుకోవడం... కాస్త పెద్దవారు ఎక్కడి ఆస్థులు అక్కడ జాగ్రత్త చేసుకోవడానికి వారి వారి అవసరాలకు  వారినే పొగడడం... అంతే కాని గెలిపించిన జనాలను ఒక్కరు  ఉంచుకోరు...అదేమంటే ఓట్ల కోసం పిలవకుండా  వద్దకు వచ్చిన నేతలు ఇప్పుడు మనం వెళ్ళి మా ఊరు రండి అని పిలిస్తే వారికి సమయం కాస్తయినా మనకోసం ఉంటే అది కూడా వారికి ఉపయోగం అనుకుంటేనే వస్తారు...రాబోయే పదవుల కోసం ఆరాటమే తప్ప గెలిపించిన జనాలను గుర్తు ఉంచుకుని కాస్తయినా తమ గెలుపుకు కారణం అయిన ప్రజల కోసం ఏం చేద్దామా అని ఆలోచించే నాయకులు ఎవరు ఉన్నారు...??  ప్రధానమంత్రి ముఖ్య మంత్రి ఎవరు అవుతారో వారికి అభినందనలు అందిస్తూ బడా బాబులు...కేంద్ర మంత్రి పదవులు ఎలా పంచుకోవాలో రాష్ట్ర పదవులు నాకంటే నాకని ఆశలతో కనీసం గెలిపించిన జనాలకు కృతజ్ఞతలు చెప్పడం మర్చిపోయిన నాయకులెందరో....!! శాశ్వత మిత్రత్వము శాశ్వత శత్రుత్వం లేదని మరోసారి నిరూపించిన రాజకీయ నాయకులందరికీ.... తమ అవసరాల కోసం ఏదైనా చేయగల పెద్ద బాబులకు మరోసారి మా అందరి వందనాలు...!!
గెలిపించిన ప్రజలు నాయకుల తప్పును నిలదీసే రోజు మన ప్రజాస్వామ్యం ప్రజల చేతిలో ఉన్నట్లు...!! ఆ రోజులు చూసే అదృష్టం మనకు రావాలని నా కోరిక....!! గాంధీ గారు కలలు కన్న స్వాతంత్ర్యం ఎలానూ రాలేదు రాబోదు కూడాను...ప్రపంచం ఎంత ముందుకు వెళ్ళినా మనం మాత్రం అందరికి అన్ని చేస్తూ మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడి చందానే అన్నట్టు మార్పు కోసం ఆశగా  చూస్తూ ఇలానే మన జీవితాలను వెళ్ళదీద్దాం...రేపటి రోజున ఎవరో ఒకరు రాకపోతారా...మన జీవితాలు మారి అందలాలు మనం ఎక్కలేక పోతామా అన్న ఆశతో బతికేద్దాం...!!

21, మే 2014, బుధవారం

ఇష్టమైన జ్ఞాపకం చాలదూ.... !!

నిన్ను నువ్వే అడిగిచూడు
జ్ఞాపకాల పుటలను ఒక్కసారి
స్పృశించు మనసును తట్టి
మరచిపోయిన మరపు నీకు
కనిపిస్తుందేమో  చూద్దాం...!!
చల్లనయ్యతో సరాగాల మురిపాలు
చుక్కలతో సయ్యాటలాడిన
మసక చీకటి మాటున దాగిన
ముచ్చటైన ముచ్చట్ల గురుతులు
ఒక్కటైనా కానరాలేదా నీకు...!!
ఒద్దికగా పుస్తకాల పేజీల్లోకి తొంగి చూస్తూ
మది గుండెలో దాచిన ఆ ఒక్క
అమాయకమైన ఆత్మీయ
ఇష్టమైన జ్ఞాపకం చాలదూ....
నీలో నేను ఉన్నానని చెప్పడానికి....!!

19, మే 2014, సోమవారం

బావుండు అనిపిస్తోంది ఒక్కోసారి...!!

ఆత్మీయులు అనుకున్న ఆత్మ బంధువులు కలిస్తే ఆ సంతోషాన్ని చెప్పడానికి మాటలకి దొరకని అలౌకికానందం అనుభవించిన వారికే తెలుస్తుంది.... ఈ రోజుల్లో కూడా అలా అనిపించే అదృష్టం కొందరికి దక్కుతుంది...బంధాలు భాద్యతలు మనిషి అన్న ప్రతి  ఒక్కరికి ఉంటాయి....వాటిలోనే కష్టాలు సుఖాలు మనతో కలసి కాపురం చేస్తూ ఉంటాయి.. అన్నిటిని ఒకేలా అనుభవించే మనసు కొందరికే సొంతం....ఎదుటివాటి బాధను పంచుకుని కాస్త ఓదార్పును ఇవ్వగలిగే మానవత్వం ఎందరిలో ఉంటుంది...?? కన్నబిడ్డను పెంచలేక పురిటికందును అమ్ముకుంటున్న తల్లి మనసు గొప్పది అనుకోవాలో.... పదిమంది బిద్దలున్నా పదకొండో బిడ్డను ఇవ్వడానికి మనసు చంపుకోలేని తల్లి మనసు గురించి చెప్పాలో తెలియని ఆ రోజులకు ఈ రోజులకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని చూస్తూ ఉండిపోవాలో తెలియని అయోమయంలో ఉన్న అటు ఇటు కాని మధ్య తరంలో ఉన్నందుకు నిందించుకోవాలో తెలియని ఈ పరిస్థితి మరే తరానికి రాకుడదని....ప్రేమలు అభిమానాలు ఎక్కువగా పెంచేసుకుని పాత బంధాలను వదలలేక కొత్త అనుబంధాల కోసం వెళ్ళలేక ఉండిపోయిన ఈ మధ్యతరం గురించి ఆలోచించే వారు కొద్దిమంది ఉంటే బావుండు అనిపిస్తోంది ఒక్కోసారి...!!
పాత తరం అందిచిన అనుబంధాలను కొత్త తరానికి అర్ధం అయ్యేలా చెప్పడానికి తపన పడుతున్నా ఎన్నో తెలివితేటలు ఏదైనా సాధించగలమన్న నమ్మకం ఉన్న ఈనాటి యువత ఈ ఆప్యాయతలకు దూరమై పోతూ ప్రగతి పధంలో మేధస్సులో ముందుకు దూసుకుపోతూ అందని ఆకాశాన్ని దానిలోని వింతలను విశేషాలను చేదిస్తున్నామన్న అతి సంతోషంలో అసలైన ఆత్మీయతను అనుబంధాలను కోల్పోతున్న సంగతినే మర్చిపోతూ పబ్బులు పార్టీలు తెలిసి తెలియని ఈ అంతర్జాలపు ముసుగులో సమయాన్ని జీవితాలను కోల్పోతున్నా.... అదే అసలైన ఆనందమని భ్రమలో బతికేస్తున్న కొందరు....అసలైన మేధస్సుకు అర్ధాలను చెప్పే మరికొందరు...చూస్తూ మనం...!! బావుంది కదూ....!!

18, మే 2014, ఆదివారం

గతజన్మ అనుబంధమేమో....!!

వ్యధలోని కలలా కనిపించే కల్పనో
నిజమనిపించే నిప్పు కణికలా కాల్చే
నిప్పుల కుంపటి లాంటి సత్యమో
ఒప్పుకోలేని ఈ చీకటి వెలుగుల
సయ్యాటల నడుమన సాగుతున్న
పోరుబాట గెలుపోటముల మధ్య
దోబూచులాడుతూ దాగుండి పోతూ
వదలలేని వాకిళ్ళను మూసివేయలేక
మదిని మనసులోనే నిదురపుచ్చలేక
ఎటు పడని పాదాల అడుగుల ముద్రలు
పడిన చోట చెరుపలేక తల్లడిల్లే తనువు
తనలోనే ఇముడ్చుకున్న కలల నిజాల
జీవితాన్ని తీపి చేదు కలయికలుగా
స్వీకరించే తేనే మధురాల కమ్మదనం
అదీ ఓ అస్వాదనగా గతజన్మ అనుబంధమేమో....!!

17, మే 2014, శనివారం

చిన్ననాటి చెలిమి.....!!

నేను నాకే తెలియని ఆ వయసులో 
ఎవరికీ చెప్పకూడదని దాచుకుంటే 
అనుకోకుండా దూరంగా వెళిపోయిన
కనిపించని నీ కోసం కాస్త కాస్త వెదికితే
చిరునామా చిక్కినా చేరలేని అంతరాన్ని
ఆంతర్యంలో వదులుకోలేక దగ్గరగా రాలేక
చేరువలో ఉన్నా చేరలేని అంతర్మధనాన్ని
అడ్డుకుంటూ కాలానికి దాసోహమై మదిని
మధనాన్ని మధుర కలశాలుగా మార్చుకునే
అంతరంగపు ఆలోచనా ప్రవాహానికి అడ్డుకట్టలు
వేయాలన్న తాపత్రయం నిలువరించలేని నేను
నీ కోసం ఎదురు చూసిన క్షణాలు లెక్కలు
వేయలేని చుక్కల ఆకాశాన్ని తలపించినా..... 
మార్చుకున్న మనసును జోకొడుతూ
ఆనాటి అమాయకత్వంఅలానే ఇప్పటికి
ఎప్పటికి నిజమేనని చెప్పాలనిపించినా
చిన్ననాటి చెలిమి చెప్పకనే తెలియాలని
నా జ్ఞాపకాల పుటల్లో నీ కోసం  నే దాచుకున్న
ఆ కల్మషమెరుగని భావజాలాలు నిజమని
చెప్పాలని ఉండి చెప్పినా నీ సన్నని చిరునవ్వుతో
మన స్నేహాన్ని చిరకాలం నిలిపిన నీకు అభివందనం...!!

16, మే 2014, శుక్రవారం

మంచి పని....!!

అందరు మరచిపోయిన ఒక విషయం ఈ ఎన్నికల గెలుపుఓటముల  సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది...ఆంధ్రప్రదేశ్ కి ఆఖరి ముఖ్య మంత్రిగా కిరణ్ కుమార్ గారు క్లిష్ట పరిస్థితుల్లో వచ్చి ఒక దారికి తెచ్చి ఏమి చేయలేని పరిస్థితిలో ఆఖరిలో రాజీనామా చేసినా...  పార్టి పెట్టినా....  మనం నమ్మలేని పరిస్థితులు కల్పించిన కొందరు సామాజికవాదులు రాజకీయ నాయకుల  మీద అసహ్యం కలిగేటట్లు చేశారు...  కాకపొతే కిరణ్ కుమార్ ఒక మంచిపని చేశారు అది నాకు ఒకరు చెప్తేనే తెలిసింది గుర్తు చేసిన తిలక్ గారికి ధన్యవాదాలు ఇంతకీ ఆ మంచి పని ఏమిటో మీకు అర్ధం అయ్యిందా... అదేనండి బొత్స సత్యన్నారాయణ గారిని చివరి ముఖ్య మంత్రిగా మనకు అందించకుండా చేశారు...చదువుకున్న యువత కూడా ఓ రకంగా సరిగా ఆలోచించ లేదనే అనిపిస్తోంది. ధనం మూలం మిదం జగత్ అని నిరూపించారు ఉద్యోగులు కూడా డబ్బులు తీసుకున్న ఈ రోజులు చూస్తూ మన ప్రజాస్వామ్యం ఎంత దిగజారిపోయిందో అని బాధ పడతూ ప్రజా తీర్పు కోసం నాయకులతో పాటు మనము ఎదురు చూస్తున్నాము...చూద్దాం గెలిచిన పార్టీలు నాయకులు తమ తమ మాటలను ఎంత వరకు నిలబెట్టుకుంటారో....!!

14, మే 2014, బుధవారం

గమ్యానికి చిరునామా....!!

మనిషి గమ్యం మనసు నిర్డేశిస్తుందా....!! మనిషి పుట్టుకలో తెలియని రహస్యం ఎక్కడ దాగుందో తెలిసిన మహానుభావులు సృష్టికి ఆద్యంతాలను మన మనసు మనకు నిర్దేశించిన మొదటి చివరి గమ్యాన్ని తెలుసుకోవడంలో కృతకృత్యులౌతారు....మానవ జన్మలోనే మనకు ఎన్నో బంధాలు అనుబంధాలు అరవైనాలుగు కళలు...అరిషడ్వర్గాలు ఇలా ఎన్నో మనకు మన గమ్యం తెలియనీయకుండా అడ్డుపడుతూ ఉంటాయి... మనని మనం తెలుసుకోవడానికి మనతో మనం కాసేపు గడపడానికి సమయమే లేకుండా చేస్తూ గమ్యం తెలియని బాటసారిలా ఎంతో మంది మనతోనే ప్రయాణిస్తూ ఉన్నారు.... వారిలో నేను ఒక ప్రయాణికురాలినే...!!
ఆత్మ సాక్షాత్కారమే మనని మనం తెలుసుకునే పయనంలో చివరి మజిలి అనుకుంటే మరి మనతోపాటుగా పెనవేసుకున్న ఈ అన్ని మోహావేశాలను వదలగలిగే అవకాశం చాలా కొద్ది మందికే దక్కుతుంది.....!! మనకున్న బాధ్యతలను వదలి పోవడానికి అంగీకరించని మనసు వాటితో పాటుగా ప్రయాణిస్తూ మన చివరి మజిలి వరకు వదలి పోలేదు...మన కోసం కాకుండా మన అనుకున్న వారి కోసం పెంచుకునే ఈ అనుబంధాలు అంత తొందరగా తెంచుకోలేము.... అలా చేయగలిగితే మనము చరిత్రలో చెప్పుకోవడానికి మిగిలి పోతాము...కాని మన బాధ్యతలను వదలి  వారి లెక్కల్లో ఉండటం ఎంత వరకు సమంజసం...!! భగవంతుడు నీకు నిర్దేశించిన బాధ్యతలను పూర్తిచేస్తూ నిన్ను నీవు తెలుసుకుంటూ నీ మనసు చెప్పిన గమ్యం వైపు వైపు నీ పయనం సాగిస్తే...!!
 ఇది ఎవరిని కించపరచడానికి రాయలేదు నాకు అనిపించిన భావాలకు నాకు తెలియని గమ్యానికి నా బాధ్యతలను వదలలేని నా మనస్సాక్షిని... అసలు జీవితానికి గమ్యం ఏంటి అంటూ ఓ అత్మీయుని కోసం రాశాను...   దొరకలేదని నాకు తెలుసు... తెలిసిన పెద్దలు ఎవరైనా చెప్తారేమో అని.... నన్ను నా భావాలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా మనఃపూర్వక నమస్సులు....ఇది నా బ్లాగులో ఏడు వందల పోస్ట్ లు పూర్తి  చేసుకుని ఏడువందల ఒకటోది...-:) 

13, మే 2014, మంగళవారం

చెంతను లేని స్వాంతన....!!

మాయలో అమాయకత్వమో
ఏది తెలియని మదిలో ఆరాటమో
ఇష్టమైన కష్టమైన ఆత్మీయత కోసమో
క్షణాలు నిమిషాలు గంటలే కాక రోజులను
మరచి నెలల సంవత్సరాల ఎదురు చూపులు
యుగాలను తలపించే ఆ బంధాన్ని
జన్మ జన్మల అనుబంధం కోసం
ఆశను పెంచుకున్నా తీరని కోరికల
విహంగాల రెక్కలు అందని ఆకాశం కోసం
ఎగురుతూ అలసి పోతుంటే చూడలేని
మరో ప్రాణం అందించే ఓదార్పు అందుకున్నా
ఆ చెలిమి చేయి మరపించే చెంతను చేరని 
స్వాంతనను అందించే అదృష్టం అమోఘమే...!!

12, మే 2014, సోమవారం

ఆ క్షణాలు అతి మధురం....!!

తెలిసీతెలియని వయసులో 
మదిలోని అనుభూతులు
ఆ భావాల భావనల సమ్మిళితాలు
కల్మషంలేని ఎంతో ఇష్టమైన
చెప్పనలవి కాని మౌనమైన మది
దాటిరాని పదిలమైన మనసులోని
కల్మషంలేని ఆ అనుబంధం
అలా ఉండిపోతే చిరకాలం...!!
కాలం మారితే మనసు మార్పు సహజంగా
మరో ఇష్టాన్ని కోరుకుంటే అది మరో రూపంలో
చేరినా మనసు మాయాజాలంలో పడిన
తలపుల వలపులు మారుతూ....
మనిషిలో మార్పు మనసు ఇష్టాల కూర్పు
వేరుగా మారుతూ చిన్ననాటి బంధాన్ని
చేరువగా చూసినా గుర్తుపట్టలేని చెలిమి
దగ్గరైనా దూరంగా ఉంటూ అభిమానాన్ని
ఆసరాగా చేసుకుని జీవితంలో ఓ చక్కని
జ్ఞాపకాన్ని గురుతుగా దాచుకుంటూ
అనుభవించే ఆ క్షణాలు అతి మధురం....!!

ఆత్మీయ శుభాకాంక్షలు..... !!
నరసాపురం పదమూడవ వార్డ్ కౌన్సిలర్ గా తెలుగుదేశం తరపున గెలిచిన నాకు అత్యంత ఆప్తురాలు సన్నిహితురాలు నా మాటను మన్నించిన నా ప్రియ నేస్తం జ్యోతికి....  కారణమైన జ్యోతి వాళ్ళ మామయ్య తనతో జంటగా తోడు నీడ బంధం అయిన ఆయనకు జ్యోతి  కారణమైన ప్రతి ఒక్కరికి నా అభినందనల ఆత్మీయ శుభాకాంక్షలు..... మరిన్ని విజయపధాలు ఇద్దరు కలసి సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.....

ఓ శిధిల శిలగానే మిగిలి పోవాలో....!!

తరాలు మారుతున్నాయి అంతరాలు పెరుగుతున్నాయి .... అనుబంధాలు అభిమానాలు దూరమౌతున్నాయి...
అయినా మనకు ఇలానే బావుందని ఆనందపడుతూ అసలు సంతోషాన్ని కోల్పోతున్నాము... జీవితం చాలా చిన్నది కాని దానిలో ఎన్నో ఇమిడి ఉన్నాయి మనం ఒకసారి మనని  తరచి చూసుకుంటే ఎన్ని కోల్పోతున్నామో తెలుస్తుంది... జీవితం అన్న తరువాత  ఒక్కరికి కష్టాలు సుఖాలు ఇష్టాలు కోపాలు తాపాలు ఇలా ఎన్నో ఎదురౌతు ఉంటాయి... అన్ని రుచుల సమ్మేళనమే దేవుడు మనకు ఇచ్చిన ఈ అద్భుతమైన జీవితం... విధాత శిల్పాన్ని చెక్కి మన తలరాతను మన  జన్మ ఖర్మ బట్టో లేదా ఆయనకు ఆ సమయంలో ఎలా అనిపిస్తుందో అది మన నుదుటిన రాసి అమ్మ కడుపులోకి పంపుతాడు...అలా మలచిన ఎన్నో అందమైన శిల్పాలతో ఈ ప్రపంచం నిండి పోయింది... కాకపోతే  జన్మకు కొన్ని మిగతా ఏ శిల్పాలకు ఇవ్వని అందమైన అనుబంధాలను తెలివితేటలను అందించాడు...కొన్ని బంధాలు దూరమైనా మనతోనే ఉండిపోయిన అనుభూతి ఎప్పటికి మిగిలిపోతుంది... అది ఏ బంధమైనా కావచ్చు...దేవుడు ఇన్ని అనుబంధాలను ఆప్యాయతలను మనకు కానుకగా ఇస్తే ఓ చిన్న మాటతో ఎన్నో అనుబంధాలను దూరం చేసుకుంటున్న ఈ తరాల అహాన్ని తప్పు పట్టాలో లేక వారి తెలివితేటలకు నా అన్న బంధాన్ని మాత్రమే  ఉంచుకుంటూ మన అన్న పదమే మర్చిపోతున్నందుకు బాధ పడాలో తెలియని స్థితి అటు పాత  కాకుండా ఇటు కొత్త తరము కాకుండా మధ్యలో ఉండి నలిగి పోతున్న ఎన్నో జీవితాలు చూస్తూ ఉరుకోవాలో... మనది మనకే అర్ధం కాని ఈ శిధిలమౌతున్న మానవ బంధాల శిధిలాలలో మనము ఓ శిధిల శిలల వ్యధల కధలు గానే మిగిలి పోవాలో....!!  ఈ తరాల అంతరాలుఅహాలు నశించి ఓ అందమైన అద్భుత ప్రపంచం చూడగలిగితే...!!

11, మే 2014, ఆదివారం

ప్రతి తల్లికి వందనం ...!!

 అమ్మ మనసున్న ప్రతి ఒక్క అమ్మకు ఈ ఒక్క రోజేకాదు ప్రతిరోజూ మనస్పూర్తిగా అభినందనల శుభాకాంక్షలు.....

కొడుడు  కోసం అమ్మ గుండెను అడిగితే ఆనందంగా ఇచ్చిన ఆ తల్లి మనసు ఆ కొడుకుకి ఎదురు దెబ్బ తగిలి  పడిపోతే బాబు దెబ్బ తగిలిందా బాబు అని అడిగిన ఆ తల్లి మనసు.... మరిది వేశ్య కోసం ముక్కుపుడకను అడిగితే మనసు అందించిన వేమన శతకం...తండ్రి ఆజ్ఞ పాటించి తల్లిని చంపి మరల పునర్జన్మ నిచ్చిన పరశురాముడు మనకు బోధించిన మానవ జన్మ అది మాతృజన్మ రహస్యం.... ఇలాంటి మన భాతర దేశానికి కూడా ఒకరోజేనా అమ్మల రోజు .... అన్ని బంధాలు అనుభవించడానికి మన జీవితంలో ప్రతి క్షణం అంకితం ఎప్పుడు.... మనసున్న ప్రతి తల్లికి  వందనం

9, మే 2014, శుక్రవారం

రేయిని కప్పిన.....!!

చిమ్మ చీకటిలో నిన్ను చూస్తున్నా
నీ నీలి నీడల జ్ఞాపకాలు వదలక
నను వెంటాడుతూనే ఉన్నాయి పదే పదే...
వేధించిన వాదనల వేదన వేడిగా అనిపించినా
ఆ మరుక్షణమే మరపించే మమతకు
దాసోహమై వదలలేక...వీడి పోలేక...
ఎటు పోలేని బంధానికి గురుతుగా
వెన్నెల్లో ఆడుకునే అందమైన అక్షరాలుగా
కనిపించకుండా చీకటిలో చేరువగా అనిపించే
నీ సాన్నిహిత్యం సన్నితంగా లేకపోయినా
నా మనసు నాకే కనిపించే ఈ మాయాజాలం
రాతిరి తెరల రెప్పల మాటుగా అగుపిస్తూ
రేయిని కప్పిన వెన్నెల దుప్పటిలో
అందమైన ఆకృతులుగా అనిపిస్తున్న
మదిలో మమేకమైన మధుర సంతకాలుగా
నీ గురుతుల గమ్మత్తులు కనిపిస్తూనే ఉన్నాయి...!!

సమాధానం చెప్పాలా...!!

అనుభవాన్ని కోరుకుంటే....
అనుబంధాన్ని కావాలనుకుంటే...
ఆప్యాయతను అందుకోవాలనుకుంటే...
అనుభూతిని ఆస్వాదించాలంటే....  
ప్రేమను పంచుకోవాలంటే ఆ బంధానికి
మనసుతో మౌనానికి భావాన్ని పలికించే
మాటల అక్షరాల అర్ధాలు చెప్పే తలపుల
తలుపులు తీసే అనంత ఊహల ఈ విశ్వంలో
నీకేమని చెప్పాలో తెలియని నా మదిలో లేని
తెలియని  భాష్యాల భావానికి అమరికగా
దేనికి అందని మధుర బంధం ఒకటే అని
అదే కల్మషమెరుగని స్నేహమనే సౌరభాల
మలయమారుతాల తాకిడి గుభాళింపని
అన్నిటికి ఒకటే సమాధానం చెప్పాలా...!!

8, మే 2014, గురువారం

అందని ఆకాశం అందితే...!!

 అందని ఆకాశం ఆర్ణవమైతే
అంబరాన్ని అంటుకోవాలన్న ఆశల ఊహలు
ఆరాట పడుతూ ఎగురుతుంటే
చుక్కల మెరుపుల చక్కదనం కవ్విస్తుంటే
వేల వర్ణాల మేఘాల పానుపు మురిపిస్తుంటే
చల్లని జాబిల్లి చెంతకు చేరాలని కోరికతో ఉంటే
అరుణ రుధిరాన్ని మండించే మంటల సూరీడు
రావద్దని భయపెడుతుంటే...ఆకాశంలో తేలుతున్నప్పుడు
మేఘాల్లో పయనించే మనసు ఆ నీలి వర్ణాలకు
దాసోహమై అందుకోవాలన్న ఆశల రెక్కలు ...
చేరుకోవాలన్న తపనతో విజ్ఞాన మేధావుల కృషితో
ఈనాడు అంబరాన్ని తాకిన ఆనందం ...
మాటలు దొరకని మధుర క్షణాలే..!!

5, మే 2014, సోమవారం

మానవ బంధాలు.....!!

మానవ బంధాలు అన్ని ఎక్కువగా ఆర్ధిక సంబంధాలుగానే ఉంటున్నాయి ఈ రోజుల్లో... ఇది అందరం ఒప్పుకోవాల్సిన నిజమే...!! సంతోషాన్ని పంచుకోవడానికి చాలా మంది ఉంటారు ఆర్ధికంగా మనం బలంగా ఉంటే...!! అదే విషాదాన్ని కాని బాధను కాని పంచుకోవడానికి చాలా కొద్ది మనసులే మనకు దగ్గరగా వస్తాయి అది కూడా మనం ఆర్ధికంగా బాగా వెనుకపడి ఉంటే...!! వాళ్ళ అవసరం కోసం అయిన వాళ్ళను కూడా మోసం చేయడానికి వెనుకాడని అనుబంధాలు చూస్తూ కూడా ఏమి చేయలేని పరిస్థితి ఈనాడు మనకు ఎదురుగానే ఉంది. శిలలుగా చితికి శిధిలమౌతున్న అనుబంధాలను చూస్తూ....జరుగుతున్న నిజానికి చెప్పుకుంటున్న అబద్దపు సమాధానాలు వింటూ కూడా నిజం చెప్పడానికి వెనుకాడే పరిస్థితి.....తల్లి బిడ్డల అక్కా చెల్లెళ్ళ అన్నాదమ్ముల అమ్మా నాన్నల ప్రేమల్లోనే అంతరాలు కనిపిస్తుంటే ఇక మిగిలిన ఏ ప్రేమల్లోని అనుబంధాలు అనురాగాలు నమ్మాలి...?? భార్యాభర్తల అనుబంధంలో అటు ఇటు ఉంటూనే ఉంటాయి....కాని మన అనుకున్న ఆత్మీయతలో మోసాన్ని తట్టుకోవడం ఎంత మందికి సాధ్యం అవుతుంది...?? స్థిత ప్రజ్ఞత అందరికి ఉండదు.. అది సాధించడానికి అందరికి సాధ్యము కాదు...ఆర్ధిక అనుబంధాలు ఆ పై పై ప్రేమలు ఎప్పుడో ఒకసారి బయట పడక తప్పవు...ధనం మూలం మిదం జగత్ అని నమ్మిన వారికి తాము చేసే ప్రతి పని మంచిగానే కనిపిస్తూ ఎదుటివారిని చెడ్డవారిని చేసి ఇతరులకు చూపించడం అలవాటుగానే కాకుండా అదే ఆనవాయితీగా మారిపోతే రేపంటు ఒకరోజు ప్రతి ఒక్కరికి వస్తుంది అని గుర్తు చేసుకుంటే....కనీసం నీ బంధాలయినా కొన్ని నీతో ఉండి పోతాయి లేదా.. పెద్దలు చెప్పిన మాట ఒకటి " తాతకు పెట్టిన ముంత తల వైపునే మనకి ఉంటుంది".... డబ్బుతో కొన్నే కొనగలం...అన్ని కొనగలిగేది ఈ ప్రపంచంలో నాకు తెలిసి మంచి మనసు ఒక్కటే...!! నా ఈ మాటల్లో ఎవరినైనా బాధ పెట్టి ఉంటే మనస్పూర్తిగా క్షమించండి....!!

4, మే 2014, ఆదివారం

మనసున్న నిజ నేస్తాలు...!!

కలగా మిగిలిన కధలో వ్యధ శిలపై
నిలిచిన మనసు రోదన వినిపించినా.....
పక్క పక్కనే ఉండి చూడలేని నేస్తాలు
కష్టమైనా సుఖమైనా కలిసి పంచుకునే
కలవని సమాంతర మాధ్యమాలు
ఓ కంట కన్నీరు ఓ కంట పన్నీరు
కురిపించలేని ఒకే ఒక కలవని జంట
ఎప్పటికి ఒకరిని ఒకరు చూసుకోలేని
అన్నిటిని ఒకేలా ఆస్వాదించే ఆ నేస్తాలు
మనతోనే ఎప్పటికి ఉన్నా గుర్తుపట్టలేని
మన మది తలుపులు ఒక్కసారి తీయగలిగితే
మూసినా తెరచినా మనసుని పరిచే
స్నేహానికి అర్ధం పరమార్ధం తెలుసుకోగల
మమతానురాగాల మానవత్వం పరిమళించే
ఆత్మీయతకు చిరునామా మన దగ్గరే ఉందని
తెలిపే నయనాలు స్నేహ సౌరభాలకు ఆనవాలుగా
మనతోనే మిగిలిపోయిన మనసున్న నిజ నేస్తాలు...!!

1, మే 2014, గురువారం

అందించే అద్భుతాలు....!!పెదవుల పదాలు పదిలంగా దాచితే
మనసు మౌనాన్ని మాటాడిస్తే తెలిసే
ఆ భాషలో ఎన్నెన్ని భావాల సిరుల
ఝరుల రాగాల మాలికల తల్పాలు
పిలుపుల కమ్మదనాల చక్కదనాలు
వరుసల వలపుల విరుపుల అందాలు
మమకారపు నుడికారాల మాణిక్యాలు
బంధాల అనుబంధాల ఆటల అల్లికలు
ఈ పెదవుల పదవుల పువ్వుల నవ్వుల
సరిగమల సరాగాలు అందించే అద్భుతాలు....!!

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner