26, ఫిబ్రవరి 2017, ఆదివారం

ఏక్ తారలు...!!

1. అక్రమమూ సక్రమమైంది_అదేమని అడిగిన మనసు గొంతు నులిమేసి...!!
2. అక్షరం అంకితమైంది_సాహిత్యానికి రాహిత్యానికి నడుమ చెలిమిని చూస్తూ...!!
3. మరణానికి ముందో అరక్షణమైనా చాలు_గెలవాలన్న తపన తోడయ్యింది...!!
4. మూసిన రెప్పల మాటున దాగున్నాయి...గతాన్ని మరలనివ్వని ఙ్ఞాపకాలు...!!
5.  నిశ్శబ్దం అక్షరీకృతమైంది_రేచుక్కల వెలుగుల తోడుగా...!!
6. కొడిగట్టిన దీపం అబద్దం_నిజం నిజాయితీ ముందు..!!

23, ఫిబ్రవరి 2017, గురువారం

ఎందుకు తెలుసుకోలేక పోతున్నామో...!!

రాహిత్యానికి సన్నిహితం సాహిత్యం. సాహిత్యానికి చుట్టమైంది అక్షరం. రాహిత్యంలో కొట్టుమిట్టాడే మదిని సేద దీర్చేవి
అక్షర భావాలు. అలుపెరగని అక్షరాలు ఆయుధాలుగా మారాలన్నా, అలసిన మనసులకు ఆలంబన కావాలన్నా ఒక వారధి (మాధ్యమం) అవసరం. అది ఆవేదన చెందే మనసులకు ఊరట ఇస్తుంది అనే ఆశతో చాలామంది ఈ మాధ్యమాల ద్వారా తమ వేదన, బాధ చెప్పుకుంటూ ఉంటారు. కొందరేమో వ్యాపారాల కోసం అది వస్తువుల వ్యాపారం కానియ్యండి, మనుష్యుల మనసులతో కానియ్యండి ఇలా వారి వారి మాటల చాతుర్యంతో కథలల్లేస్తూ మగవారైతే ఆడవారి సానుభూతి, ఆడవారైతే మగవారి సానుభూతి బకెట్ల కొద్దీ పొందేస్తూ అతి మంచివారిలా నటించేస్తూ ఉంటారు. రాయడానికి, బొమ్మలు పెట్టడానికి మనకో మాధ్యమం దొరికిందని సంబర పడిపోతూ నీతులు అదే పనిగా వల్లే వేస్తూ చరిత్ర(హీనులమని తెలిసినా)కారుల్లా ఫీల్ అయిపోతూ ఉంటాం. నీతి, న్యాయం అందరికి ఒకటే అని తెలుకోలేం. ఓపిక, డబ్బు ఉందని కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తే రేపటి రోజున " తాతకు పెట్టిన ముంత తల వైపునే ఉంటుంది" అని ఎందుకు తెలుసుకోలేక పోతున్నామో...!!

22, ఫిబ్రవరి 2017, బుధవారం

నగ్నత్వం...!!

నట్టింట నలుగురు నడయాడుతున్నా
నాకంటూ ఎవరూలేరని పదే పదే
గుర్తు చేస్తున్న ఎడారి బతుకు
ఏకాకితనాన్ని ఎత్తి చూపిస్తుంటే
ఒప్పుకోలేని నపుంసకత్వం
హింసత్వంలో అనుభవించే
పైశాచికానందాన్ని ఆస్వాదిస్తూ
ఆత్మీయంగా  దగ్గరవుతున్న
అనుబంధాన్ని అల్లరిపాలు చేసి
మనిషికే కాదు మనసు విలువకు
సమాధి కట్టి జీవశ్చవాన్ని మిగిల్చి
అమ్మదనపు నగ్నత్వాన్ని నడిబజారులో
నిలబెడుతున్న విటుల విశృంఖల
విరాట పర్వాలకు తెర పడేదెన్నడో..!!

21, ఫిబ్రవరి 2017, మంగళవారం

వెలితి పడుతున్న బంధం...!!

వెలితి పడుతున్న బంధం
వెతలు పడుతు వెక్కి పడుతోంది
ఆత్మీయతా రాగాన్ని ఆలపిస్తున్నా
కరువౌతున్న మమకారాన్ని తలపోస్తూ
జ్ఞాపకాల నీలి నీడల్లో తడుముతున్న
సౌకుమార్యాన్ని కాలరాస్తున్న
మృగతృష్ణకు పరాకాష్ఠగా మిగిలిన
పరిణయానికి ప్రత్యామ్నాయాలను
అడ్డుకోవాలన్న ఆత్రాన్ని
అణగద్రొక్కుతున్న మానవత్వాన్ని
మనసులేని మానవ పిశాచాలకు
అంకితమిచ్చినందుకు సిగ్గుపడుతూ
కళ్ళెదుట నిలిచిన విచ్చలవిడితనాన్ని
సహించలేని నిజాల గొంతును
నులమాలన్న దురహంకారం
రంకెలు వేస్తుంటే
పట్టపగలే నాలుగు గోడల నడుమ
వలువలు విడిచిన విలువలు
వరద గోదారై పారుతుంటే
సభ్య సమాజం చూస్తుండగానే
న్యాయం గొంతు నొక్కుతున్న
అధములు నడయాడుతున్న సెలవులను
భారంగా మోస్తూ ఎదురుచూస్తోంది
ఆది అంతాలకు ఆద్యమైన
అమ్మదనాన్ని, ఆడతనాన్ని
ఎరగా వేసి సృష్టి ధర్మాన్ని
నవ్వులపాలు చేస్తున్న నీచ జాతిని
నిరోధించే ఆయుధం  కోసం....!!

17, ఫిబ్రవరి 2017, శుక్రవారం

ఎవరికైనా ఒకటే శిక్ష...అదేంటి...?

నేస్తం,
        ఈ సభ్య సమాజం ఎటువైపు పోతోందో తెలియడం లేదు. అంతర్జాలం, ముఖ పుస్తకాలు, వాట్స్ అప్ లు వగైరా వగైరా వచ్చాక కుటుంబ విలువలు ఎంతగాదిగజారి పోతున్నాయో చూస్తుంటే చాలా బాధగా ఉంది. విశృంఖలత్వం, విచ్చలవిడితనం ఒక్క మగవాళ్ళలోనే కాదు ఎంతో మంది ఆడవాళ్ళలో కూడా ఉన్నారు. మొగుడు ఉన్న వాళ్ళు, లేనివాళ్ళు , పెళ్ళాలు ఉన్నవాళ్ళు కూడా ఒకటి కాదు ఇద్దరు కాదు ఆడది ఐతే చాలు అన్నట్టుగా ఉన్నారు. ఆ వెధవలు సరే మరి ఈ మహాతల్లులకు ఏమైందో కాపురాలు కూలుస్తున్నారు. డబ్బుల కోసం ఇంత దిగజారుడుతనం అవసరమా ఈ ముం.. లకు. పగలు చూస్తే పగలే కలలోకి వస్తారు. అమ్మాయిలతో స్నేహం అంటూ వాళ్ళ ఆయనలతో రాసలీలలు. వీళ్లకన్నా వేశ్య చాలా ఉన్నతమైంది నా దృష్టిలో. ఈ నా కొ.. లకు అది ఆడది ఐతే చాలు పెళ్ళాం కాకుండా. వాళ్ళ వయసు కూడా మర్చిపోతారు. రేపోమాపో కాటికి పోతున్నా. మరి అలాంటప్పుడు పెళ్ళాం ఛస్తే రెండో పెళ్ళి ఎందుకో వీళ్ళకి. నచ్చిన ఆడదానితో తిడగవచ్చు కదా. ఇంకో ఆడదాని ఉసురు పోసుకోవడం ఎందుకు..?
    సొమ్ము,  పదవి ఉంటే సరిపోదు. మనిషిగా పుట్టినందుకు కనీస విలువలు ఉండాలి ఎవరికైనా. బరితెగించడం, బజారు బుద్దులు నాలుగు రోజులు దాయగలుగుతారు. పేర్లతో, సాక్ష్యాలతో బయటపెట్టడానికి ఓ క్షణం చాలు. కానీ ఇలాంటి వాళ్లకు ఆ చిన్న శిక్ష సరిపోదు. నాకు ఈ ముఖపుస్తకంలో ఎంతో మంది మంచి హితులున్నారు. అందరికి నా విన్నపం ఒక్కటే ఎవరి కొంపో కదా కాలుతుంది మనదాకా వచ్చినప్పుడు చూసుకుందాం అనుకోకుండా ఇలాంటి వారికి ఎలా బుద్ది చెప్పాలో చెప్పండి. ఆడ మగ తేడా లేదు ఎవరికైనా ఒకటే శిక్ష...అదేంటి...?
నా నుంచి ఇలాంటి పోస్ట్ ఇదే ఆఖరుది కావాలని కోరుకుంటున్నాను. ఈసారి రాయడమంటూ జరిగితే పేర్లు సాక్ష్యాలు కనిపిస్తాయి.  

12, ఫిబ్రవరి 2017, ఆదివారం

మహిళా సాధికారత...!!

మహిళా సాధికారత అంటూ ఓ మూడు రోజులు సదస్సులు నిర్వహించి నలుగురితో నాలుగు మాటలు చెప్పించేస్తే
మార్పు వచ్చేస్తుందా...? అసలు సాధికారత అనేది ఎంత వరకు పనికి వస్తుంది మహిళకు న్యాయం జరగడానికి. హక్కులు, బాధ్యతలు చట్టాలతోను, సంస్కరణలతోను సాధ్యమయ్యేవి కాదు.  ప్రతి ఇంటి నుంచి మొదలు కావాలి.  గొప్ప గొప్ప పదవులలోను, పేరున్న వాళ్లతోను ఉపన్యాసాలు చెప్పించి మహిళలు అన్నింటా ముందు ఉన్నారు ఈ రోజుల్లో అంటే మనకు మహిళా సాధికారత వచ్చినట్లేనా. మాలాంటి సామాన్య మహిళలను కదిలిస్తే బయటకు వస్తాయి అసలు నిజాలు.
అనాది నుంచి మనువు కూడా మహిళలకు అన్యాయమే చేసాడు. పురాణాలు, ఇతిహాసాలు ఇలా ఏది తీసుకున్నా అమ్మాయి ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అనే కనిపిస్తుంది కానీ మొగవాడు ఎలా ఉండాలి, ఏం చేయాలి అన్నది మాత్రం చెప్పలేదు.  మంచి చెడు అనేవి నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి. ఆడయినా మగయినా నీతి, న్యాయం ఒకటే. బాధ్యతలు, బరువులు, బంధాలు కూడా సమానంగానే ఉంటాయి. మనం చూస్తున్న ఎన్నో వాస్తవ జీవితాల్లో మగాడు పెళ్ళాం పిల్లల్ని వదిలేసి పోవడం చూస్తున్నాము కానీ ఆడది మొగుడు, పిల్లల్ని వదలి వెళ్లిన సంఘటనలు అరుదుగా ఉంటున్నాయి. వీడు పదిమందితో తిరుగుతాడు కానీ పెళ్ళాం పక్కన అమ్మాయితో చనువుగా మాట్లాడినా సహించలేదు. నూటికి తొంభైమంది ఇలానే ఉంటే ఇక మహిళా సాధికారతకు చోటెక్కడ..?
ఓ చిన్న ఉదాహరణలు రెండు చెప్తాను... ఉద్యోగం చేసి సంపాదించినా రూపాయి దాచుకోవడం చేతకాక పుస్తకం ఆవిష్కరణ చేయాలీ అంటే నావల్ల కాదు అని చేతులెత్తేసి, సినీ రాజకీయ నాయకుల కోసం క్వింటాళ్ల కొద్దీ పువ్వులకే బోలెడు ఖర్చు పెట్టారు. మరొకరేమో ఇంట్లో ఏమి పట్టించుకోరు కానీ బయట వనితలతో షాపులు పెట్టిస్తారు, వాళ్లకు అండగా అన్ని చక్కబెడుతూ ఇంట్లో పెళ్ళాం అడిగితే చేతులు ఎత్తుతారు. పిల్లలకు పుట్టినప్పటి నుంచి ఓ గుడ్డ ముక్క కొనని వెధవ పెళ్ళాం ఆస్థి లో వాటా కోసం గోతికాడ నక్కలా ఎదురుచూపులు. అందరు పెద్ద మనుష్యులే మరి. ఇలా చెప్పుకుంటూ పొతే సవాలక్ష సమస్యలు. ఇవి మనం చట్టాల్లో మార్పులు చేస్తేనో, రాజ్యఆంగాన్ని తిరగరాస్తేనో, గుర్తు వచ్చినప్పుడెప్పుడో ఒకసారి నిద్రలేచి సమస్యల మీద నా పోరాటం అంటేనో తీరిపోవు.
మార్పు ప్రతి ఇంటి నుంచి రావాలి. మగవాడి ఆలోచనా దృక్పధం మారాలి. నేను అమెరికాలో ఉద్యోగం చేసినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోలేదు కానీ ఇండియా వచ్చాక నాలుగేళ్ళు హైదరాబాద్లో చేసినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు చూసాను. అమ్మాయిలూ అబ్బాయిలు అని కాదు కానీ ఎవరికి వారు తమ లాభం కోసం ఎదుటివారిని ఏం చేయడానికైనా వెనుకాడని స్వార్ధం చూసాను. రాజకీయాలు అంటే ఎలా ఉంటాయో కళ్లారా చూసాను. పేర్లు వద్దులెండి.. అందరికి నా ధన్యవాదాలు.
అన్ని అనువుగా ఉండి విజయాలు సాధించిన వారి గురించి, వారి మాటల గురించి కాదు, ప్రతికూల పరిస్థితులను దాటి ఓటమికి ఎదురు నిలిచిన వారి జీవితాల గురించి చెప్పండి. వారితో నాలుగు మాటలు చెప్పించండి. అందరికి స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఒక్కసారి సామాన్యుల జీవితాలను కదిలించండి, మాకు సాధికారత వద్దు మేముగా బతికే అవకాశం ఇవ్వండి అని ఎన్ని గొంతులు ఎలుగెత్తుతాయో మీకే తెలుస్తుంది. కుల మత ప్రాంతీయ రాజకీయ వివక్షకు తావులేకుండా నేతిబీరకాయలో నెయ్యిని చూడాలనుకోకుండా ఒక పని చేసినా నిజాయితీగా చేస్తే సామాన్య మహిళ కాస్తయినా ఊపిరి పీల్చుకుంటుంది.


9, ఫిబ్రవరి 2017, గురువారం

చివరకు మిగిలేది ఏమిటి....!!

నేస్తం,
         మన లోపాలకు పరోపకారం అనే అందమైన ముసుగు వేసుకుని నలుగురిలో పెద్ద మనుష్యులుగా చెలామణి అయిపోతూ, మన తప్పులు ఎక్కడ ఎత్తి చూపుతారో అని ముందే ఎదుటి వాళ్ళలో లోపాలు లేక పోయినా / చిన్న చితకా ఉన్నా మన అసలు నైజాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళను బలహీనుల్ని చేయడానికి మనం చేయని ప్రయత్నం ఉండటం లేదు. ఏదో ముక్కు ముఖం తెలియని వాళ్ళను అన్నా అర్ధం ఉంటుందేమో. పెళ్ళాం అంటే నీ అవసరాలు తీర్చి, నీ కోపతాపాలను భరించి నీకంటూ ఓ బతుకు ఇచ్చేది. దాన్ని నిర్లక్ష్యం చేసిన ఎవడు చరిత్రలో బాగుపడిన దాఖలాలు లేవు. నీ పక్కనే ఉన్నా నోరారా పెళ్ళాన్ని పలకరించే మనసు ఉండదు కానీ ఈ ముఖ పుస్తకం, ఫోన్ల పుణ్యమా అని పలకరించడానికి సమయమే చాలనంత మంది భామలు ఈరోజుల్లో. అందుకేనేమో మన వివాహ వ్యవస్థ కూడా బీటలు వారింది. బంధాన్ని తెంచుకోవడానికి ఓ సెకను సరిపోతుంది. కానీ కలిసి కలకాలం జీవితాన్ని పంచుకుందామని చెప్పి ప్రతి క్షణం ముసుగులో బతికే బంధానికి అర్ధం ఏమిటో పెద్దలే చెప్పాలి. మనం కళ్ళు మూసుకున్నామని సమాజం చూడకుండా ఉండదు. ఇల్లాలు మౌనంగా భరిస్తుంది అంటే తనకు నీ వేషాలు, మోసాలు ఏమి తెలియవని కాదు. నలుగురిలో నీ విలువ దిగజారకుడని సహిస్తుంది. నువ్వు ఆ ఓర్పునే పరిహసిస్తే దానికి పర్యవసానం ఒక్కసారి రామాయణం గుర్తుకు తెచ్చుకుంటే  సరిపోతుంది. సీతాదేవి భూదేవితో వెళ్లిపోయే ముందు చెప్పిన మాటలు చాలు.
  పేరు కోసమో, జనం కోసమో మనం బతకాలి అనుకుంటే పర్యవసానం ఏంటి అనే దానికి రామాయణమే సాక్ష్యం. ఇప్పుడు నీ చుట్టూ తిరిగే నలుగురు కాలం నాడు నీతో లేరేందుకు అని ఒక్కసారి ప్రశ్నించుకో. పెళ్ళాం పదిమందికి భోజనాలు పెట్టాలి అంటే చేతులెత్తేసే పెద్ద మనుష్యులు గొప్ప కోసం బోలెడు ఆర్భాటాలు చేసి ఓ దండ వేయించుకుంటారు. ఎందరున్నా ఏకాకిగా బతికేస్తూ అదే చాలా ఘనమైన జీవితం అనుకుంటారు. రామాయణంలో రాముడు చాలా గొప్పవాడు. కానీ రాముడి జీవితం ఏంటి అనేది చూస్తే అసలు బంధాలు అంటే ఏమిటి..? వాటిని నలుగురి కోసం నిర్లక్ష్యం చేస్తే పర్యవసానం ఏమిటి..?  చివరకు మిగిలేది ఏమిటి అనేది తెలుస్తుంది.

సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు...నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది...!!

ఏక్ తారలు....!!

1. కలలలో నేనుండి పోయా ...కాలం నీతో వెళ్ళిందని తెలియక...!!
2. అనురాగానికి అర్ధం నీవని తెలిసిందేమో .... మమకారంతో అల్లుకున్నాయి అక్షరాలు...!!
3. వెలుగురేఖల ఆనవాళ్ళు ... అలుపెరుగని ఈ అక్షరాలు...!!
4. కలలలో నేనుండి పోయా ...కాలం నీతో వెళ్ళిందని తెలియక...!! 
5. అక్షరానికి ఆయువు పోసింది ..అవ్యాజమైన నీ ప్రేమ ...!! 
6. మరణానికి సైతం భయమే ...పడతి పట్టుదల అంటే ..!!
7. నిన్ను మరిచే క్షణాలే లేవు నా దగ్గర_కన్నీటికి తావెక్కడ...!!
8. ముక్కల్లో లెక్కలే తేలడం లేదు_ఎద నిండా నీ రూపమే నిండి...!!
9. హరివిల్లు తోడైంది_మన చెలిమి జలతారు పరదాకు...!!
10. రాలిన క్షణాలన్నీ పదిలం_స్నేహ పరిమళాలు నిత్య నూతనమై విలసిల్లుతూ...!!
  

3, ఫిబ్రవరి 2017, శుక్రవారం

ఓదార్పు ఎక్కడ...!!

చీకటి చట్రానికి చిక్కిన
వెలుగుపూలు అక్కడక్కడా
మిణుక్కుమంటూ
అణగారిన ఆశలను తట్టి లేపుతూ
గుట్టలు గుట్టలుగా చేరిన
బాదరబందీల బందిఖానాలో
జమ చేసిన గతపు ఘట్టాలలో
అక్కడక్కడా తచ్చాడే
జ్ఞాపకాలు వెన్నాడుతూ
ఓటమి అంచులను తాకిన
బతుకు పుస్తకానికి ఓదార్పునిస్తూ
పతనమై పోతున్న విలువలు 
పరకాయ ప్రవేశంలో పరిణితిని
సాధిస్తున్న మానవ సంబంధాల
వెంపర్లాటల వాస్తవ కథనాల
పరిధుల నిర్వచనాల దృక్పధాలు
మార్చడానికి ప్రయాస పడుతూ
అనుబంధాల కోసం పాకులాడుతూ
సాగుతున్న ఎన్నో ఒంటరి అడుగులకు
ఓదార్పు ఎక్కడ...!!
Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner